Pages

Wednesday 24 October 2012

ఉత్తర శబరి - రాజమండ్రీ అయ్యప్ప దేవాలయం

రాజమండ్రీ రైలు పట్టాలకీ, గోదావరి నదికీ మధ్యలో గౌతమి ఘాట్ మీద పూర్తిగా రాతితో నిర్మించిన అయ్యప్ప దేవాలయం ఉంది.  దీనిని ఉత్తర శబరి అని పిలుస్తున్నారు.

దీని నిర్మాణం గతసంవత్సరం మార్చిలో పూర్తయ్యింది. సుమారు అయిదున్నర ఏళ్ళ పాటు కట్టడపు ప్రతీ స్థాయిలోనూ ఎంతో నిబద్దతను కనబరుస్తూ పని పూర్తిచెయ్యడం జరిగింది. గుంటూరు జిల్లా కోటప్ప కొండ మైన్స్ నుంచి తీసుకొని వచ్చిన రాతితో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. పావన పదునెట్టాంబడి అని పిలువబడే పద్దెనిమిది మెట్లను మలచడానికి 60 టన్నుల బరువైన ఏకశిలను ఉపయోగించారు. 

120 కేజీల బరువు గల అయ్యప్ప పంచలోహ విగ్రహాన్ని చాలా అందంగా తయారుచేసారు. దీనికి కావలసిన బంగారాన్ని, భక్తులు ఒక్కొక్కరూ ఒక్కో గ్రాము చొప్పున సమకూర్చారు.  శ్రీ శారదా పీఠాధిపతి బ్రహ్మశ్రీ స్వరూపానంద స్వామి వారు విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 


శ్రీ ధర్మశాస్త ఆధ్యాత్మిక ఆలయ కమిటి ద్వారా దేవాలయ నిర్వాహణ జరుగుతుంది.

ఈ విశేషాలన్నింటినీ దేవాలయ నిర్మాణ కార్యక్రమాలలో మొదటి నుంచీ పాలు పంచుకొంటున్న శ్రీచలపతి గురుస్వామి గారు ఎంతో ఓపికగా తెలియజేసారు. పైన కనిపించే మణికంఠుడి విగ్రహం ఫోటో కూడా ఆయనే ఇవ్వడం జరిగింది. మరొక్క సారి ఈ బ్లాగు ముఖంగా ఆయనకి ధన్యవాదాలు.


కేరళ `హట్` తరహా మందిరం, మూలవిరాట్, ద్వజస్తంభం, పదునెనిమిది మెట్లు, మందిర ముఖద్వారం.. మొదలైన వాటిలో ఇది శబరిమల అయ్యప్ప దేవాలయానికి చాలా దగ్గర పోలికలు కలిగి ఉంది.  మొదటి అంతస్తులో దేవాలయం, వెనుక గోదావరి. నది మీద నుంచి వచ్చే చల్లనిగాలి ఆహ్లాదకరంగా ఉంది. ఏసుదాసు ఆలపించిన అయ్యప్ప పాటలని సౌండ్ బాక్సుల్లో నుంచి మంద్రంగా వినిపిస్తున్నారు. 




గ్రౌండ్ ఫ్లోరులో విశాలమైన హాలు. మణికంఠుడి కథను చెప్పే పద్దెనిమిది సన్నివేశాలని విగ్రహాలద్వారా తెలియజేస్తూ ఈ హాలులో అద్దాలు బిగించిన షెల్ఫుల్లో ఉంచారు. జీవకళ ఉట్టి పడే బొమ్మలు, రంగుల మిశ్రమం, అమరిక అన్ని బాగున్నాయి. కానీ, షెల్ఫుల్లోపల బొమ్మలమీద చెమ్మ, బూజులు, ఫంగస్ ఏర్పడి పాడవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఆలయకమిటి ఈ విషయం మీద దృష్ఠి పెడితే మరింత బాగుంటుంది.



స్వామియే శరణం అయ్యప్ప!


© Dantuluri Kishore Varma

2 comments:

  1. మొన్న మే నెలలో రాజమండ్రి వెళ్ళినపుడు చూసాము...చాలా బాగా కట్టారు...
    అక్కడున్న ఇస్కాన్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది...
    @శ్రీ

    ReplyDelete
  2. నా బ్లాగుకి మీకు స్వాగతం శ్రీగారు. ఈ ట్రిప్పులో ఇస్కాన్ కూడా చూశానండి. దానిగురించికూడా ఒక టపా తొందరలోనే రాస్తాను. మీ స్పందనకి ధన్యవాదాలు. ఇలాగే ఇకముందు కూడా తెలియజేస్తూఉంటే సంతోషిస్తాను.

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!