Pages

Saturday 15 December 2012

ఆ ఐదు లక్షణాలూ... దుర్గాబాయి

ఉన్న దారిలో నడిచేవాళ్ళు బాటసారులౌతారు, దారిని ఏర్పాటుచేసుకొంటూ ముందుకు సాగేవాళ్ళు మార్గదర్శులౌతారు. వందసంవత్సరాలక్రితం మన సమాజంలో మహిళలకి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. బాల్యవివాహాలు, అవిద్య, వివక్షలు అధిగమించి జాతీయస్థాయిలో స్వాతంత్ర్య సమరయోధురాలిగా, సంఘసేవకురాలిగా, సంస్కర్తగా, విద్యావేత్తగా, పార్లమెంటేరియన్‌గా కీలక భూమికను పోషించడం దుర్గాబాయి(1909-1981) లాంటి  ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే సాధ్యమౌతుంది. ఈ ప్రత్యేకత ఆమెకు కలగడానికి కారణం ఆమె వ్యక్తిత్వం.  లక్ష్య నిర్ధేశం, పట్టుదల, నాయకత్వ ప్రతిభ, సృజనాత్మకత, సేవానిరతి అనే ఐదు లక్షణాలూ దుర్గాబాయిలో కనిపిస్తాయి.  అవే ఆమెకి భారతదేశ చరిత్ర పుటల్లొ ఒక శాశ్వత స్థానాన్ని సమకూర్చి పెట్టాయి.
దుర్గాబాయి రాజమండ్రీలో జన్మించింది. తండ్రి బెన్నూరి రామారావు, తల్లి కృష్ణవేణి. రాజమండ్రీ అమ్మమ్మగారి ఊరు. తండ్రిది కాకినాడ కోర్టులో ఉద్యోగం. విక్టోరియా టైప్ ఇన్స్టిట్యూట్‌కూడా నిర్వహించేవారు. దుర్గా బాయికి వెంకట దుర్గా నారాయణరావు అనే ఒక సోదరుడు ఉన్నాడు. ఎనిమిదేళ్ళ వయసులోనే అమలాపురానికి చెందిన గుమ్మడిదల సుబ్బారావు అనే ఆయనతో ఆమె వివాహం జరిగింది. కుటుంభ జీవితం కంటే సంఘసేవకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చే దుర్గాబాయితో, సుబ్బారావుగారికి సరిపడక ఇరవైరెండేళ్ళ వైవాహిక జీవతం తరువాత వాళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది. తరువాత చాలా కాలానికి స్వాతంత్ర్యానంతరం ఆమె జాతీయ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషిస్తుండగా జవహర్లాల్ నెహ్రూ మంత్రిమండలిలో ఆర్ధికశాఖ నిర్వహిస్తున్న చింతామణి దేశ్‌ముఖ్ తో 1953లో మనసులుకలిసిన వివాహం జరిగింది. అప్పటినుంచే ఆమె దుర్గాబాయిదేశ్‌ముఖ్‌గా వ్యవహరించబడ్డారు. ఇది క్లుప్తంగా ఆమె వ్యక్తిగత జీవితం.  

ధైర్యం, నిజాయితీ, సంఘసేవ బీజాలు తండ్రి నుంచి సంక్రమిస్తే, గాంధీగారి ప్రభావం దుర్గాబాయిమీద చిన్నప్పటినుంచీ ఉంది. ఆయనని దగ్గరనుంచి చూడాలని, మాట్లాడాలనీ ఎంతో మంది భారతీయులల్లాగే ఆమే కోరుకొన్నారు. 1921వ సంవత్సరంలో రాజమండ్రీలో గాంధీగారి సభ జరిగింది. అప్పుడు పన్నెండెళ్ళ దుర్గాబాయి అక్కడ ప్రజలనుంచి కాంగ్రెస్ నిధిని వసూలు చేసి, తనచేతిగాజులని కూడా కలిపి గాంధీగారికి అప్పగించడం జరిగింది.  1923లో కాంగ్రెస్ మహాసభలు కాకినాడలో జరిగినప్పుడు ఎంతో మంది మహిళా కార్యకర్తలకి హిందీ మాట్లాడడంలో తర్పీదునిచ్చి తానుకూడా పాల్గొనడానికి తయారయితే, ఆమె అప్పటికి మేజరు కాని కారణంగా కేవలం వేరొకరికి సహాయకురాలిగా సభలకు హాజరయింది. కానీ ఆశ నిరాశ అయ్యేలా గాంధీగారు ఆ సభలకు హాజరు కాలేదు. ఈ సభల సమయంలోనే ఒక తమాషా సంఘటన జరిగింది. సభలతో పాటూ ఖాదీ ప్రదర్శన ఏర్పాటుచేశారు. ప్రవేశ ద్వారం దగ్గర టిక్కెట్లు చించి, సందర్శకులని లోనికి అనుమతించే బాధ్యత దుర్గా బాయికి అప్పగించారు. జవహర్లాల్ నెహ్రూ లోనికి వస్తున్నప్పుడు టిక్కెట్టు లేనిదే అనుమతించేది లేదని ఆయనను అడ్డగించిందట. అప్పుడు వెనుకనున్న కొండావెంకటప్పయ్య గారు, నెహ్రూ గారికి టిక్కెట్టు కొనిపెట్టారట. ఈ సందర్భంలో దుర్గాబాయి కర్తవ్య నిర్వాహణను నెహ్రూ చాలా మెచ్చుకొన్నారట.

సమాజంలో దేవదాసీల జీవితం చాలా దుర్భరంగా ఉండేది. కాకినాడలో గాంధీగారి సభను వాళ్ళకోసం ఏర్పాటుచేసి, వాళ్ళ జీవితంలో కొంత మార్పు తీసుకురావాలని దుర్గాబాయి భావించారు. అప్పుడు(1929) కాంగ్రెస్ విరాళాల సేకరణకోసం గాంధీగారు  ఆంధ్రదేశంలో పర్యటిస్తున్నారు. దుర్గాబాయి సూచనను పాటించి, సభను ఏర్పాటు చెయ్యాలంటే 5000 రూపాయలు విరాళం సేకరించాలని స్థానిక నాయకులు ఒక చిక్కుముడిని వేస్తారు. ఆ రోజుల్లో ఐదువేలంటే తక్కువ మొత్తం కాదు. కానీ ఎన్నో వ్యయ ప్రయాశలకోర్చి, నిధిని కూడబెట్టి సమావేశం ఏర్పాటు చేసుకొన్నారు. స్వాగతోపన్యాసం చక్కని హిందీలో చేసిన దుర్గాబాయి భాషా కౌశలం గమనించి గాంధీగారు తన ప్రసంగాన్ని తెలుగులో అనువదించే అవకాశం కొండా వెంకటప్పయ్య స్థానంలో, దుర్గాబాయికి కలుగజేసారు. అక్కడి నుంచి ఆమెని తన కారులోనే కాకినాడ టౌన్‌హాలుకి తీసుకొని వెళ్ళి అక్కడి ఉపన్యాసానికి కూడా అనువాధకురాలిగా చేసారు. తరువాత ఆంధ్రదేశమంతా ఆమే, ఆయన ఉపన్యాసాలని తెలుగులోనికి అనువదించారు.

1930లో ఉప్పుసత్యాగ్రహం జరిగినప్పుడు తన భర్త సుబ్బారావు అనారోగ్యకారణంగా మద్రాసులో ఉన్న దుర్గాబాయి, ఊరుకాని ఊరులో కార్యకర్తలని పోగుచేసి సత్యాగ్రహ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. అప్పుడు మొదటిసారి అరెస్టయ్యారు. తరువాత రెండుసంవత్సరాలకి మళ్ళీ అరెస్టవడం జరిగింది. ఈ దఫా అనారోగ్యం కారణంగా విశ్రాంతి అవసర పడటంతో తన దృష్టిని చదువుమీదకి మళ్ళించారు.  బెనారస్‌లో మెట్రిక్యులేషన్ చేసి, బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఇంటర్‌మీడియట్, విశాఖపట్నం ఆంధ్రాయూనివర్సిటి నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ, మద్రాసులో లా ఏకబిగిన పూర్తిచేశారు.

1938లో మహిళలకు స్వయంఉపాది కల్పించే ఉద్దేశ్యంతో మద్రాసులో ఆంద్రమహిళాసభను ప్రారంభించారు. విరాళాలతో, ప్రభుత్వ సహకారంతో అది దినదిన ప్రవర్ధమానమైంది. 1958లో హైదరాబాదులో కూడా ఆంద్రమహిళాసభను మొదలుపెట్టారు. వయోజనవిద్య అందించే ఉద్దేశ్యంతో 1971లొ హైదరాబాదులో సాక్షరతా మిషన్‌ను ఆంధ్రమహిళా సభకు అనుబంధంగా ప్రారంభించారు. మహిళలకు, విధ్యా, ఉపాది, వైద్యం, వయోజనులకు విద్య మొదలైన విషయాలలో గొప్ప సేవచేసారు. స్వాతంత్ర్యం వచ్చినతరువాత రాజ్యాంగ నిర్మాణ కమిటీలో, ప్లానింగ్ కమిటీలో సభ్యురాలిగా విశేషమైన సేవలు అందించారు. విదేశాలలో భారతదేశ ప్రతినిధిగా ప్రసంగించారు. నెహ్రూ లిటరసీ అవార్డు, పద్మవిభూషణ్ వంటి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు పొందారు.

ప్రాధమిక విద్యకూడా సరిగా లేని ఒక సాధారణ అమ్మాయి, ఎన్నో సాంఘిక అవరోదాలని దాటి పట్టుదలతో ఈ స్థాయిని చేరడం గర్వకారణం. విచ్చిన్నమైన వైవాహిక జీవితం, దుర్భరమైన కారాగారవాసం, జైలు నుంచి విడుదలైన తరువాత అనారోగ్యం, 1948 ఎన్నికలలో రాజమండ్రీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి అపజయం వంటి అవరోదాలకి కృంగిపోకుండా దేశం గర్వించదగ్గ మహిళామణిగా, ఐరన్‌లేడీగా స్పూర్తివంతమైన జీవితం గడిపి 1981లో పరమపదించారు.

ఆమె వ్యక్తిత్వంలో లక్ష్య నిర్ధేశం, పట్టుదల, నాయకత్వ ప్రతిభ, సృజనాత్మకత, సేవానిరతి అనే ఐదు లక్షణాలూ గుర్తించి మనలో పెంపొందించుకొనే ప్రయత్నం చేస్తే ఈ టపా యొక్క ఉద్దేశ్యం నెరవేరినట్టే.

© Dantuluri Kishore Varma 

8 comments:

  1. చక్కగా క్లుప్తం గా వ్రాసారండి .

    ReplyDelete
  2. మీ అప్రీసియేషన్‌కు ధన్యవాదాలు శ్రావ్యగారు.

    ReplyDelete
  3. మీరు వ్రాసిన ఈ వ్యాసంద్వారా నాకు ఒక అద్భుతమైన విశేషం తెలిసింది.--"ఎనిమిదేళ్ళ వయసులోనే అమలాపురానికి చెందిన గుమ్మడిదల సుబ్బారావు అనే ఆయనతో ఆమె వివాహం జరిగింది"-- నేను చదువుకునే రోజుల్లో, శ్రీ గుమ్మిడిదల సుబ్బారావు గారిని, అమలాపురంలో చాలా పర్యాయాలు చూసేవాడిని,కలిసేవాడిని కూడా. మా నాన్నగారికి కూడా ఎంతో పరిచయం ఉన్న వ్యక్తి. అప్పుడు తెలిసిందికాదు ఆయనకి శ్రీమతి దుర్గాబాయిగారితో ఉన్న సంబంధం. కానీ ఇప్పుడు మీ వ్యాసంద్వారా తెలిసికోడం చాలా బాగా ఉంది. నాకు ఇప్పటికీ ఆయన రూపం గుర్తే. పెద్దపెద్ద మీసాలతో, పంచ లాల్చీ లోనే కనిపించేవారు. "గోష్టి" అనే ఇంగ్లీషు పత్రిక ప్రచురించేవారు.ఆయన కుమార్తె, శ్రీమతి ఝాన్సీ లక్ష్మి గారు, మా ఎస్.కె.బి.ఆర్. కాలేజీలో పనిచేసేవారు. ఏదిఏమైనా, ఆ విశేషాలు తెలిశాయి. Thanks for a wonderful article.

    ReplyDelete
  4. అవునండి, సుబ్బారావుగారుకూడా గోష్ఠి అనే సంస్థద్వారా చాలా సమాజసేవా కార్యక్రమాలు చేసేవారట.

    ReplyDelete
  5. I Came to know two new things about her,through this article...!! Try to compile all your write-ups ...which will be an exciting feast for the readers like us..keep it up sir...!!

    ReplyDelete
  6. Thanks a lot Murthy garu for your affectionate suggestion.

    ReplyDelete
  7. శర్మగారూ, థాంక్స్!

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!