Pages

Tuesday 1 January 2013

చావు లేదట!

జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ
తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితు మర్హసి.

పుట్టినవానికి చావుతప్పదు, మరణించిన వానికి మరల పుట్టుట తప్పదు, తప్పని సరియగు ఈ విషయమును గురించి చింతించవలసిన పనిలేదు - భగవధ్గీత  

`మరణమంటే అన్ని అలానే ఉంటాయి, మనమే ఉండం. మనం లేకుండా ప్రపంచం అంతా ఉంటే మనకి ఏం ఫన్ ఉంటుంది. అందుకే మనం నిరంతరం ఉండాలి.` అనాదిగా ప్రతీ తరంలోనూ, ప్రతీ మనిషికీ ఉండే కోరిక ఇదే. పురాణకాలంలో దేవతలు అమృతంతాగి చిరాయువులైతే, రాక్షసులు తపస్సుచేసి చావులేకుండా ఉండే వరం కోరుకొన్నారు. మరి మనిషి సంగతి ఏమిటి? రష్యాలో ఒక పెద్దమనిషికి ఈ ఆలోచనే వచ్చింది. అనుకొన్నదే తడవుగా ఒక ప్రోజెక్టుని ప్రారంభించాడు. మరొక పదిసంవత్సరాలలోనే చావులేని పరిస్థితిని కల్పించగలమని చెబుతున్నాడు. ఈ మృత్యుంజయ పదకానికి `అవతార్ ప్రోజెక్ట్` అని నామకరణం చేశారు. నిర్ధేశించుకొన్న లక్ష్యం రెండు స్థాయిల్లో పూర్తవుతుందట. మొదటిది, శిదిలమైపోయే మనిషి శరీరంలో మెదడుని మాత్రం మానవాకృతినిపోలిన రోబోలోకు మార్చి ఆమెదడుకున్న జ్ఞాపకాలతో, తెలివితో, ఆలోచనలతో దానిని పనిచేయించడం. రెండవ స్థాయిలో మానవ మెదడుకి సంబంధించిన వీటన్నింటినీ ఒక చిప్ మీదకి డౌన్‌లోడ్ చేసి దాన్ని రోబోలో అమర్చడం. అప్పటికి చావులేని మనిషి(?) సృష్ఠి పూర్తవుతుంది. 2045 కల్లా లక్ష్యం చేరుకోగలమని అంటున్నారు. వినడానికి అసంబద్దంగా, అసాధ్యమైన విషయంగా అనిపించినా, ఈ ప్రోజెక్టుకి దలైలామా  ఆశీర్వాదం ఉందట. రష్యా విద్యా, వైజ్ఞానిక శాఖ మద్దతూ ఉందట. సాధ్యాసాధ్యాలు ప్రక్కనపెడితే, ఈ ప్రోజెక్టే కనుక విజయవంతమైతే భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఆసక్తి కరమైన అంశం.
పోటీ పరీక్షలలో కొన్ని `ఇఫ్` తరహా ఇమాజినరీ వ్యాసాలు ఇచ్చేవారు - `ఒకవేళ సముద్రమంతా సిరా అయి, ఆకాశమంతా కాగితం అయితే ఎలావుంటుంది?` లాంటివి. ఇచ్చిన విషయాన్ని ఆలోచించి, మన ఊహని జోడించి సమాదానం రాయాలి. వ్యాసం రాసినంత మాత్రాన మనం దాన్ని నమ్ముతున్నట్టుకాదు. అదే తరహాలో `ప్రోజెక్ట్ అవతార్` గురించి ఆలోచిస్తే నాకుకొన్ని విషయాలు స్పూరించాయి.

1. మెదడు, దానిలో ఆలోచనా మాత్రమే ప్రధానంకాదు. మనస్సు, ఇంద్రియాలు, ఆర్ధిక, అద్యాత్మిక, సామాజిక పరమైన అంశాలూ కూడా ముఖ్యమైనవే.  

2 .అవతార్‌లో ఆలోచనమాత్రమే ఉండి ఆనంద, విషాదాలు; మంచి, చెడు విచక్షణ ఉండవు. సృజనాత్మకత అనే మాటకి అర్థంలేకుండా పోతుంది. ఒక కథచెప్పి, సినిమా చూపించి ఒక అవతార్‌ని నవ్వించలేం, ఏడ్పించలేం. చావు భయం ఉండదుకనుక దేవుడు, మతం అనే మాటలకి విలువలేకుండా పోతుంది. పండుగలూ, జాతరలు లాంటి దైవభక్తి(భయం) చుట్టూ అల్లుకొని పెరిగిన సాంప్రదాయం, సంస్కృతి అంతా నాశనమైపోతుంది. 

3. ఆకలి, సంభోగవాంచ లాంటి శారీరకావసరాలు ఉండవుకనుక, ప్రేమ, పెళ్ళి, సంసారం, పిల్లలు అనేవి గతించిపోతాయి. కొత్త జనాభా పెరగదు. ప్రేమ, విరహం, సరసం, శృంగారం, ఆకలి, బాధలు, కష్టాలు మొదలైన విషయాల మీద ఎవరూ కవితలు, కథలు రాయరు. డబ్బు సంపాదన అవసరంలేదు. కాబట్టి ఎవరూ ఎక్కడా పనిచెయ్యరు. ఆక్సిజన్ అక్కర్లెద్దుకనుక మొక్కలు పెంచరు. ఓజోన్ పొర పాడయిపోయినా సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను తట్టుకొని నిలబడగలిగే పదార్ధంతో శరీరాలను(?) నిర్మించుకొంటారు. 

4. ఎవరూ ఎక్కడా పనిచెయ్యరు కనుక ఒకచోటు నుంచి, మరొకచోటుకి ప్రయాణించే అవసరం ఉండదు. యాంత్రిక శరీరాలు సౌఖ్యాలు కోరుకోవు కనుక ఫ్యాన్‌లు, ఏ.సీ.లూ ఉండవు. వాహనాలు, ఫ్యాక్టరీలు ఉండవు. కాలుష్యం అస్సలుండదు.    

5. పార్కులో, బీచ్చులో, అందమైన ప్రదేశాలో చూడాలని కోరుకోరు. మనస్సే లేనప్పుడు, ఆనందించాలనే కోరికెందుకుంటుంది?

6. రేప్‌లు, డబ్బుకోసం మర్డర్లు జరగవు. ఒకరిని మెచ్చుకోరు, ఎవరినుంచీ మెచ్చుకోలు ఆశించరు. ఏమయినా చెయ్యాలనే ఇచ్చ ఉండదు. ఎవరి ఇంక్యుబేటర్లు వాళ్ళు ఏర్పాటుచేసుకొని అందులోనే ఉంటారు. ప్రపంచం అంతా నిర్మానుష్యంగా ఉంటుంది.

ఎప్పుడో ఒకరోజు - 

ఒక పెద్ద విస్పోటనం జరిగి భూమి బ్రద్దలైనప్పుడు అవతార్లన్ని తునాతునకలై సృష్ఠి(?) అంతమౌతుంది. మరో మానవ యుగం ప్రారంభమౌతుంది. 

చావు ఉండబోదని ఆనంద పడవద్దు, ఇలా జరుగుతుందని భయపడవద్దు. ఇది సరదాకి రాసిందే. మీకు ఏమయినా ఇన్సైట్ ఉంటే ఇక్కడ సరదాగా పంచుకోండి. ఈ టపా రాయడానికి నాకు ప్రేరణ నిచ్చిన వ్యాసం కావాలంటే ఈ లింక్‌లో చదవండి. 


© Dantuluri Kishore Varma 

4 comments:

  1. వద్దండి, చిరంజీవత్వం, నన్ను గుర్తు పెట్టుకునే నావాళ్ళుండే దేశం కావాలి, నాకు మరణం కావాలి.

    ReplyDelete
  2. నిజమే శర్మగారు. అంతగా కావాలనుకొంటే అధనంగా మరొక పదేళ్ళో, ఇరవ్య్యేళ్ళో ఆరోగ్యంగా బ్రతకాలని కోరుకొంటే తప్పులేదుకానీ, భూమి ఉన్నంతకాలం ఉండిపోదామంటే పై ఊహలోలాగ అనర్ధమే మిగులుతుంది.

    ReplyDelete
  3. అసలు ఒక్క జన్మతోనే విరక్తి కలుగుతోంది, రకరకాల కారణాలవల్ల.నాకు అప్పుడప్పుడూ అనిపిస్తూంది..మనిషికి వచ్చే ప్రతి ఆలోచన వెనుకా విశ్వశక్తి కి తనదైన ప్రణాళిక ఒకటి ఏదో వుంటుంది. స్వామి వివేకానంద 'Rajayoga' వ్యాఖ్యానం లో ఒక చోట అంటారు..ఇక్కడ మనం ఎన్నోసార్లు పుట్టాము..ఎన్నోసార్లు ఇలాగే కలుసుకున్నాము...!

    ReplyDelete
  4. తెలుగులో బాగా రాస్తున్నారు మూర్తిగారూ. చావు లేకపోవడం వల్ల అనర్థాలే ఎక్కువగా ఉంటాయని నేను కూడా భావించడంవల్లే ఈ టపా వచ్చిందండి.

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!