Pages

Tuesday 15 January 2013

పాలకుండలో నీళ్ళు

రాజుగారింటిలో పెద్ద ఫంక్షన్ ఉందని ఊరివాళ్ళనందరినీ తలొక చెంబుడూ పాలు తీసుకు వచ్చి కోట గుమ్మం దగ్గర పెట్టిన పెద్ద గంగాళంలో పొయ్యమన్నారు. ఉదయం నుంచీ మధ్యాహ్నం వరకూ ప్రతీ ఇంటినుంచీ ఒక్కొక్కరు చొప్పున క్యూలో వచ్చి చెంబులలోంచి గంగాళంలోనికి  వొంచుతున్నారు. లెక్క పెట్టుకొంటున్న బటులు పద్దులు రాసుకొంటున్నారు. వోటింగ్ పూర్తయిన తరువాత కౌంటింగ్ చేసినట్టు, పాలు కొలవడానికి వచ్చి గంగాళంలోకి తొంగిచూసిన రాజుగారి వంటవాళ్ళకి మతులు పోయాయి. అన్నీ ఇన్‌వాలిడ్ వోట్లలాగ, పాత్ర నిండా నీళ్ళే! ఈ కథ మనమంతా చదువుకొన్నదే. ప్రతీ ఒక్కడూ `ఇంతమంది పోసిన పాలల్లో నేను పోసినవి నీళ్ళని ఎవరు కనిపెట్టగలరులే?` అని అతితెలివి ప్రదర్శించాడని తెలిసిన వాస్తవం. 

సోషల్ నెట్‌వర్కింగ్ వచ్చినతరువాత ఇలాంటి కథలు పునరావృత్తమౌతున్నాయి. ప్రతీ మనిషికీ హీరో(యిన్) వర్షిప్ కావాలి. దానిని పొందడానికి దగ్గరదారి - కొన్ని ఫోటోలనీ, స్టేటస్ అప్‌డేట్లనీ షేర్ చెయ్యడం. అవి ఎలా ఉండాలంటే, `ఐ కేర్ ఫర్ ద సొసైటీ` అనే సామాజిక స్పృహ ఉన్నవి అవ్వాలి. లేదా, `పలానా వ్యక్తి కష్టంలో ఉన్నాడు. మీరు సహాయం చెయ్యండి` అని ఉండాలి. వాటిని చూసి స్పందించి సహాయం చేసే నిజమైన నిశ్సబ్ధ వితరణశీలురు ఎప్పుడూ ఉంటారు. కానీ, వాళ్ళ సంఖ్య భహుస్వల్పం.    

ఒకాయనకి ఆమధ్యన మంచి ఆలోచన వచ్చింది. మారుమూల పల్లెల్లో ప్రభుత్వ బడుల్లో చదువు కొంటున్న నిరుపేద పిల్లలకి పుస్తకాలు, పలకలు లాంటివి కొనిపెడితే బాగుంటుందని ఎక్కువమంది ఉన్న చాలా  గ్రూపుల్లో తన ఆలోచనని వ్యక్తం చేశాడు. ధనరూప సహాయం అడిగాడు. `భేష్` అన్నారు, భుజంతట్టారు. సై అన్న వాళ్ళందరూ తలొక వందరూపాయలు లేదా ఇవ్వగలిగి నంత, ఎంతకొంచమైనా సరే ఇచ్చి ఉంటే ఇంకొక వందమంది పిల్లలకి ఈ సహాయం అంది ఉండేదని కార్యక్రమం చేసినాయన వాపోయాడు. మొత్తం మీద ఇచ్చినవాళ్ళు నలుగురో, ఐదుగురో! 

`మీరు రక్తదానం చేస్తారా?` అని ఒక పెద్ద మనిషిని అడిగితే, `నీళ్ళ దానం కూడా చెయ్యను. ఎందుకు చెయ్యాలి?` అని ఎదురు ప్రశ్నించాడట. `ఎవరు ఏమనుకొంటే నాకేం, నేను అనుకొన్నది చెపుతాను,` అనే తెగువయినా ఉండాలి, లేదా మాట్లాడక ఊరుకోవాలి. ప్రగల్భాలు  కాకుండా ఇంకేమి చెయ్యగలం అనేది ముఖ్యమైన విషయం. సహాయం కావాలని అడిగే ప్రతీ అభ్యర్ధనకీ స్పందించాలని ఏమీలేదు. కానీ, అది నిజమైనదయితే, మనం చెయ్యగలిగితే కొంచం వెసలుబాటు చేసుకొని, కొంచం సర్ధుబాటు చేసుకొని ఒక చిరు సహాయాన్ని అందిస్తే బాగుంటుంది.  

`నేను చెప్పిన మాట వల్ల ఎవరో వొకరు స్పందిస్తారులే,` అనుకొంటే రాజుగారి పాలకుండలో నీళ్ళలాగ ఫలితం సున్నా అవుతుంది. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే - సహాయం చెయ్యడం ఉత్తమం, చెయ్యనని చెప్పడం లేదా చేసే అవకాశం లేక  ఊరుకోవడం మధ్యమం, చెయ్యగలిగి, ప్రగల్బాలతో సరిపెట్టడం అధమం. అలాగని నిజానిజాలు తెలుసుకోకుండా ప్రతీ అభ్యర్ధనకీ ప్రతిస్పందించవద్దు. అన్నింటిలో లాగానే ఇటువంటి సేవాకార్యక్రమాలలో కూడా మోసపూరితమైనవి ఉండవచ్చు. అపాత్రదానం నిరర్ధకం.   

ఈ టపాలో నానార్థాలు లేవు. చెయ్యగలిగి ఉన్నప్పుడు సహాయం చెయ్యమనే.
© Dantuluri Kishore Varma 

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!