Pages

Sunday 10 March 2013

సమాన(వ)త్వం

వివేకానందుని గురించి, భారతదేశం గురించి తెలుగులో చక్కని  ఉపన్యాసం.

*   *   *
ప్రతీ మతమూ గొప్పదే. సాగరగర్భంలో రత్నాల్లా గొప్పవిషయాలు ప్రతీ మతంలోనూ ఉన్నాయి. ఒక విత్తనాన్ని నాటినప్పుడు భూసారాన్నీ, నీటిని, గాలినీ, సూర్యరశ్మిని గ్రహించి మొక్కగా ఎలా ఎదుగుతుందో - అదే విధంగా ఒక వ్యక్తి కూడా విజ్ఞానాన్ని అన్ని తావులనుంచీ సముపార్జించి వ్యక్తిత్వ నిర్మాణం చేసుకోవాలని స్వామీ వివేకానంద చెపుతాడు.  మతం విషయంలో ఈ విధమైన దృక్పదాన్ని అలవాటు చేసుకొంటే వైషమ్యాలకి తావే ఉండదు.

చికాగో సర్వమత మహాసభల్లో చేసిన చివరి రెండు ఉపన్యాసాలలో, మెచ్చుతునకల్లాంటి ఎన్నో విషయాలని వివేకానందుడు ప్రస్తావిస్తాడు. వాటిని చదువుతున్నప్పుడు మతం అనేది తక్షణ అవసరం కాదనిపిస్తుంది. దానికన్నా అత్యంత ఆవశ్యకమైన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఆకలి, పేదరికం, నిరుద్యోగం, నిరాదరణ మొదలైనవి.

అమెరికాలో సర్వ సౌఖ్యాలతో బ్రతుకుతున్న ప్రజలని చూసి, మనదేశవాసుల  జీవనవిధానాన్ని వారితో పోల్చుకొని,  అన్నార్తుల దైన్యమైన దుస్థితిని తలచుకొని ఒకరాత్రంతా విలపిస్తూ గడుపుతాడట స్వామీ వివేకానంద. అందుకేనేమో, మాదేశంలో మతం కావలసినంత ఉంది. ఆకలితో అలమటిస్తున్నవాడికి కావలసింది ఆహారం కానీ, మతం ఎంతమాత్రం కాదంటాడు. మతాలకతీతంగా అన్నిచోట్లా ప్రజలు అనుభవిస్తున్న బాధలే ఇవి. కానీ వీటిమిద పోరాటాలకి జనసమీకరణ జరగదు. మతం రెచ్చగొట్టినంతగా జనాల్ని మరేదీ రెచ్చగొట్టలేదనుకొంటాను.

మణిరత్నం తీసిన సినిమా బొంబాయి, కుష్వంత్‌సింగ్ రాసిన పుస్తకం ట్రైన్ టు పాకిస్థాన్ జ్ఞాపకానికి వచ్చాయి.

కుష్వంత్‌సింగ్ పుస్తకంలో దేశవిభజన సమయంలో మతకలహాల గురించి రాస్తాడు. భూబాగాన్ని మతం ప్రాతిపధికగా `అదిమీది, ఇదిమాది,` అని వేరుచేసుకొని ట్రైన్‌లలో ప్రక్కదేశపు మతంవాళ్ళు సరిహద్దు దాటుతున్నప్పుడు నరమేదం చేసి శవాల కుప్పల్లాగ పంపిస్తారు. అటునుంచి ఇటు, ఇటు నుంచి అటూ వెళుతూ ఎన్ని వేలమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారో డాక్యుమెంట్ చేసి చూపిస్తాడు.  చరిత్రను త్రవ్వితే ఇటువంటి సంఘటనలు అన్నో కనిపిస్తాయి.

మణిరత్నం `బొంబాయి` సినిమాలో - ఇరుమతాలవాళ్ళూ ఆస్తినష్ఠం, ప్రాణనష్టం కలుగజేసుకొంటున్నప్పుడు, విచక్షణా రహితంగా చంపుకొంటున్నప్పుడు; కుటుంబంనుంచి  తప్పిపోయి, కర్ఫ్యూ విధించిన వీధుల్లో దిక్కుతోచక తిరుగుతున్న ఒకకుర్రాడు, ఒక హిజ్రా పంచన చేరతాడు. `హిందువా, ముస్లిమా అని అడుగుతున్నారు. హిందువంటే ఏమిటీ, ముస్లిమంటే ఏమిటి?` అంటాడు. అప్పుడు హిజ్రా చెప్పిన సమాధానం గొప్పగా ఉంటుంది - `మతం అంటే దేవుడ్ని చేరడానికి ఒకదారి. హిందువు ఒకదారి, ముస్లిం ఒకదారి. రెండూ దేవుడి కాడికే పోతాయి,` అని.

మతం ఒక జీవనవిధానం. ఏ మతమూ చెడ్డది కాదు. సాంప్రదాయాల్లో, ఆచారవ్యవహారాల్లో, అలవాట్లలో, నమ్మకాలలో వ్యత్యాసముండవచ్చు. కానీ, ఆకలితో ఉన్నవాడికి అన్నంపెట్టమని, బాధలలో ఉన్నవాడ్ని ఓదార్చమని, ఎవరికీ హానిచెయ్యవద్దని ప్రతీ మతమూ చెపుతుంది. అదే మానవత్వం. దీనిని మరచిపోయినవాడు ఏ మతానికీ చెందనట్టే!
© Dantuluri Kishore Varma 

2 comments:

  1. మనకి ఇస్ఠం లేకున్న,వున్నా ఈ ప్రపంచం లోని లౌకిక నీతి ఒక్కటే...బలవంతుడిదే ఈ భూమి...బలహీనుడు చెప్పే శాంతి వచనాలు విలువలేనివే..!మనకి చేతకాకపోఅతే మరొకరు ఈ ఫ్రపంచాన్ని తమ చేతుల్లోకి తీసుకొంటారు.దీనిలో అసూయడదగినది ఏమీ లేదు.. మనం బలశాలురము కావడానికి దారులు వెదకాలి..దాన్ని చేతల్లో అమలుపరచాలి.బానిసలకి సహజ గుణమైన అకారణమైన అసూయ మన నరనరాల్లో చేరి జాతి శక్తియుక్తులని నాశనం చేస్తోంది. ఏ లక్ష్యమూ లేని జీవితం వుంటే యేమిటి ..లేకపోతే యేమిటి.... ఈ శరీరం ఇప్పుడే పోనీ లేదా నూరేళ్ళ తరవాత పోని...కానీ..యేదో ఒక లక్ష్య సాధనలోనే పోనీ..ఇప్పుడు దేశానికి క్షాత్రశక్తి యే ఆదర్శం కావాలి.ఇదే నా జీవిత సందేశం..!మీకు ధనం కావాలా..దానికొరకు పరిశ్రమించండి..శక్తి కావాలా..పరిశ్రమించండి... ప్రతిదీ సాధ్యమేనని..పని...పని..పని..లోనే ముందుకు వెళ్ళండి....."అంటూ ఉత్సాహ పరచిన ఆ వివేకానంద మహర్షి కి జయము...! ఈ వాణిని అందించిన మీకు అభినందనలు.

    ReplyDelete
  2. ధన్యవాదాలు మూర్తిగారు.

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!