Sunday, 28 July 2013

సంగీత తరంగం రియాజ్!

సొమ్మొకడిదీ సోకొకడిది సినిమాలో ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా... అనే పాట ఒకటి ఉంటుంది. కరాచీకి చెందిన ఉస్మాన్ రియాజ్‌ని చూస్తే ఆ పాటే గుర్తుకు వస్తుంది. ఆ కుర్రోడికి పూర్తిగా ఇరవై మూడేళ్ళు కూడా ఉండవేమో! కానీ, రకరకాల సంగీత వాయిద్యాలమీద అద్భుతమైన సంగీతాన్ని వాయించగలడు. వాటన్నింటినీ కలిపి సొంత ఆర్కెష్‌ట్రైజేషన్ చెయ్యగలడు - ఏదో ఆషామాషీ సంగీతంకాదు, ప్రంపంచం అంతా మెచ్చుకోగలిగే లాంటిది. 

పదహారేళ్ళకే అంతర్జాతీయ క్రికెట్‌లో కాలుమోపిన మన సచిన్ లేడా? విశ్వనాథన్ ఆనంద్ లేడా? మ్యూజికల్ లెజండ్ రెహ్‌మాన్ లేడా? అలాగే ఉస్మాన్ రియాజ్ కూడా అని అనుకోవచ్చు. కానీ, వాళ్ళకీ ఇతనికీ ఒక తేడా ఉంది. రియాజ్ పియానో ఒక్కటి తప్పించి, మిగిలిన వన్నీ - గిటార్, సారంగీ, మాండొలిన్, హార్మోనికా లాంటి వాయిద్యాలని వాయించడం ఇంటర్నెట్‌లో యూట్యూబ్ వీడియోలని చూసి నేర్చుకొన్నాడు. వాయిద్యాలు ఏమీ లేకుండా కేవలం శరీర బాగాలని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలనీ ఉపయోగించి వినసొంపైన శబ్ధాలని వెలువరించే నైపుణ్యాన్ని కూడా! 

సంగీతం, నాట్యం లాంటి రంగాల్లో ప్రశిద్దులైన కళాకారుల ఇంటిలో పుట్టడంతో సహజంగానే సంగీతమ్మీద ఆసక్తి కలిగిందట. దానిని గమనించిన రియాజ్ తండ్రి, రియాజ్‌కి ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడే ఒక పియానో టీచర్ చేత పాఠాలు చెప్పించాడు. తరువాత అంతా ఇంటర్నెట్టే గురువు!  

యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌వాళ్ళ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా అమెరికా వెళ్ళి కార్యక్రమాలు చేశాడు. తనకు నైపుణ్యం ఉన్న అన్ని సంగీత ధ్వనుల్నీ కలిపి తనుతియ్యబోయే సినిమాలో ఒక బిట్ చేశాడు.  కొత్త ఆలోచనల్ని టాక్స్ ద్వారా జనాల్లోకి తీసుకువెళుతున్న టెడ్ఎక్స్ గురించి మీరు వినే ఉంటారు - అందులో టెడ్‌ఫెలో గా ఉన్నాడు.

అతను ఇచ్చిన ఉపన్యాసం టెడ్ఎక్స్‌లో చూసినప్పుడు నాకు ఎందుకో మైఖేల్‌జాక్సన్ గుర్తుకు వచ్చాడు. రియాజ్ పాడకపోవచ్చు. కానీ, అతని నాజుకు శరీరం, డ్రెస్సింగ్ స్టైల్, గిటారు తీగలమీద కదులుతున్న వేళ్ళు అలాంటి పోలికని కనిపించేలా చేశాయి. అంతర్జాతీయంగా సంచలనాలు సృష్టించగలడు అనిపిస్తుంది. కత్తిని సర్జన్ ఒకలాగా, నేరస్తుడు మరొకలాగా ఉపయోగించుకొన్నట్టు ఇంటర్నెట్‌ని రెండురకాలుగా ఉపయోగిస్తున్నాం. రియాజ్ ఉస్మాన్‌ది మొదటి తరహా! 

Franklin Templeton Investments partnered the TEDxGateway Mumbai in December 2012. 
© Dantuluri Kishore Varma 
Mana Kakinada 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...