Pages

Tuesday 24 September 2013

ఆ విప్లవజ్యోతి ఇంకా స్ఫూర్తిని నింపుతూనే ఉంది.

04.07.1897 - 07.05.1924
ఇరవై ఏడేళ్ళంటే ముక్కుపచ్చలారని వయసు. చదువు పూర్తిచేసుకొని, అప్పుడప్పుడే వ్యాపారమో, ఉద్యోగమో మరేదైనా సంపాదనామార్గమో ఎంచుకొని విజయాల బాటన నడక మొదలుపెట్టే వయసు. అల్లూరి సీతారామరాజు ఆ సరికే ఒక మహాసామ్రాజ్యాన్ని గడగడలాడించగల ఉద్యమాన్ని నడిపి, దేశవ్యాప్తంగా ఒక స్వాతంత్ర్య స్పూర్తిని నింపి, నిష్క్రమించాడు. 

ఈ నేల మనదిరా, ఈ గాలి మనదిరా అని స్వేశ్చగా అటవీసంపదను వాడుకొంటూ, చెట్లునరికి పోడువ్యవసాయం చేసుకొంటూ, వనసంపదని సంతల్లో బియ్యానికీ, వంటసరుకులకీ వస్తుమార్పిడి చేసుకొంటూ, పండుగలకీ పబ్బాలకీ ఇంకోలా చెప్పుకొంటే అసలు ఏ ప్రత్యేక సందర్భం లేకపోయినా ఈతకల్లునీ, తాటికల్లునీ సేవిస్తూ ఆనందంగా గడిపేస్తున్న మన్యం జనాలు బ్రిటీషువాళ్ళ అటవీ రిజర్వు చట్టాలు, అబ్కారీ చట్టాల వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. చేతులూ కాళ్ళూ కట్టేసినట్టయ్యాయి. అప్పుడు సీతారామరాజు వాళ్ళ జీవితాల్లో వెలుగునింపే మెరుపులా, తెల్లవాళ్ళ పాలిట పిడుగులా వచ్చాడు. 

1907లో, అంటే అప్పటికి సీతారామరాజుకి పదేళ్ళు ఉంటాయేమో - బిపిన్ చంద్రపాల్ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాడు. ఎందరో వాటికి ఉత్తేజితులయ్యారు. వారిలో మనహీరో ఒకడు. తరువాత ఒక పుష్కరకాలానికి గాంధీజీ సహాయనిరాకరణోధ్యమం వల్ల కొత్త ఆలోచనలకి త్వరగా స్పందించే వయసులో ఉన్న యువకుడు సీతారామరాజు తెల్లవాళ్ళను ఎదిరించాలని నిర్ణయించుకొన్నాడు. గాంధీజీలా అహింసామార్గంలో కాదు. హింసామార్గంలో.

మన్యప్రాంతానికివెళ్ళి అక్కడివాళ్ళకి స్వాతత్ర్యంయొక్క ప్రాముఖ్యతని నూరిపోసి, దళాన్ని కూడగట్టుకొన్నాడు. కాకపోతే పాతకాలపు విల్లంబులులాంటి ఆయుదాలు తెల్లవాళ్ళ తుపాకీ గుళ్ళముందు దిగదుడుపే! కాబట్టి, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి అక్కడ ఉన్న తుపాకీలనీ, మందుగుండు సామాగ్రినీ స్వాధీనం చేసుకోవడానికి చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి మొదలైన పోలీస్‌స్టేషన్ల మీద మెరుపుదాడి చేసి సఫలమయ్యాడు. ప్రభుత్వానికి వెన్నులో ఒణుకుపుట్టించాడు. ఈ చిచ్చరపిడుగుని ఎదుర్కోవడానికి ఆధునిక పరికరాలనీ, ఆయుదాలనీ, ప్రక్కరాష్ట్రాలనుంచి ప్రత్యేక పోలీసు బలగాలనీ రప్పించ వలసి వచ్చింది. 

1922 నుంచి 1924 వరకూ కేవలం రెండు సంవత్సరాలే అయినా, ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా చేశాడు.  

రాజుని నమ్ముకొన్న మన్యంప్రజలకి వేదింపులు మొదలయ్యాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అల్లూరి సీతారామరాజు లొంగేవాడుకాదు. కానీ, ఆశ్రితజన పీడన ఆతనికి వేదన అయ్యింది. అందుకే, తనకు తానుగా లొంగిపోయాడు. ఈ నిప్పుని వొడిలో పెట్టుకొంటే సామ్రాజ్యాన్నే కాల్చి మసిచేస్తుందని భావించారేమో! లొంగిపోయిన వీరుడ్ని అదుపులోకి తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. 

కానీ ఆ విప్లవజ్యోతి ఇంకా స్పూర్తిని నింపుతూనే ఉంది.
© Dantuluri Kishore Varma 

9 comments:

  1. http://bhadradriexpress.blogspot.in/2012/07/blog-post_05.html


    Varma garu, I have given a link above for you,please read it..!

    ReplyDelete
  2. కిషోర్ గారు, అద్భుతంగా రాశారు. అల్లూరి సాహసోపేత సాయుధ పోరాట గాథలు వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఫలానా పోలీసు స్టేషన్ మీద ఫలానా సమయానికి దాడి చేస్తానని చెప్పి మరీ అటాక్ చేసి, విజయవంతంగా ఆయుధాల్ని స్వాధీనం చేసుకోవడం భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలోనే అద్భుతమైన, అపూర్వమైన, అపురూపమైన విషయం. అలాంటి సమరయోధుణ్ని ఎన్నిసార్లు తలచుకున్నా తనివితీరదు.

    ReplyDelete
    Replies
    1. నాగరాజ్ గారు మీ ప్రశంస చాలా ఆనందాన్నిచ్చింది. ధన్యవాదాలు.

      Delete
  3. బ్రిటీష్ వారి పోకడలు కొన్ని విషయాల్లో మన సమాజానికి వ్యతిరిక్తంగా అనిపిస్తాయి.ఎందుకో గాని..శతృవు అయినప్పటికి ఒక మనిషి యొక్క మేధస్సుని వాళ్ళు గౌరవిస్తారు.అదీ అద్భుతమైన ఒక ఒరిజినాలిటీ ఉన్న వ్యక్తి అయితే మరీనూ..దానికి అనేక సాదృశ్యాలు చూపవచ్చును.అలీపూర్ కుట్ర కేసులో అరవిందుని చంపగలిగే అవకాశం ఉన్నప్పటికి ఒక ఒప్పందం ప్రకారం ఫ్రెంచ్ వారి భూభాగమైన పాండిచ్చేరి లో ఉండనిచ్చారు.దాని వల్ల అరవిందుని నుంచి గొప్ప ఆధ్యాత్మిక ధారలని మనం పొందగలిగాము.

    అలాగే నేతాజీ ని కూడా ఎక్కడో ప్రవాసం ఉనికి తెలియకుండా ఉంచి ఉండవచ్చును.బహుశా సహజ మరణమే పొందిఉండవచ్చును.తెర వెనుక ఒప్పందాలు,వ్యూహాలు వారికి వెన్నతో పెట్టిన విద్య.మేధస్సు గల వారిని హేతుపూర్వకమైన వాదనలతోనూ వారు సరిపుచ్చగలరు.

    అల్లూరి యొక్క నిజమైన ఫోటో ని సత్యనారాయణపురం అనే గ్రామంలో పాఠశాలలో నేను చూశాను.బాలానంద స్వామి ఫోటో కూడా కొంత దగ్గరగా అనిపించింది.ఆయన గురించి ఒక టప రాస్తాను.

    ReplyDelete
    Replies
    1. మీ కామెంట్, మీరిచ్చిన లింక్ చదివినప్పుడు అల్లూరి సీతారామరాజు గురించి ప్రపంచానికి తెలియని ఇంకా చాలా విషయాలు ఉండవచ్చు అనిపిస్తుంది. మీ పోస్ట్‌కోసం ఎదురుచూస్తూ...

      Delete
  4. మనుష్యులు నీచాతి నీచమైన స్థితి లో ఉన్న ఈ రోజున... సీత రామరాజు ని గుర్తు చేసిన మీ పోస్ట్..ఎంతో దైర్యాన్ని నింపింది....మరింత మంది జాతి రత్నాలను పరిచయం చేసి..కొంత మందికైనా మన చరిత్రను గుర్తు చేయండి..

    ReplyDelete
    Replies
    1. ఇలాంటి వెన్నుతట్టి ప్రోత్సహించే కామెంట్ తప్పనిసరిగా మరిన్ని పోస్టులు రాయిస్తుంది. ధన్యవాదాలు kvsv గారూ.

      Delete
  5. అల్లూరి జీవితం గురించి మరికొంచెం సమాచారాన్ని అంతర్లోచనలో పొందుపరిచాను
    http://antharlochana.blogspot.in/2014/06/blog-post_6534.html?utm_source=BP_recent

    ReplyDelete
    Replies
    1. ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించి ఫోటోలతో సహా ప్రచురించడం, దానికి మీ విశ్లేషణ కూడా జోడించడంతో ఆర్టికల్‌కు ఆథెంటిసిటీ వచ్చింది. మీ కృషి అభినందనీయం. మీ టపా లింక్ ఇక్కడ ఇచ్చినందుకు ధన్యవాదాలు శ్రీనివాస్‌గారు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!