Pages

Monday 2 December 2013

ప్రభాసుడి కథ

ప్రలోభాలకి లోనవడం, పరుల సొమ్ముని ఆశించడం, తప్పుచెయ్యమని ప్రేరేపించే వాళ్ళ మాటలు వినడం వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయి. మహాభారతంలో ప్రభాసుడి కథ దీనిగురించే చెపుతుంది. ఒకసారి ప్రభాసుడు తనభార్యతో, అతని ఏడుగురు సోదరులు(అష్టవసువులు అని పిలవబడే దేవతలు) వారి భార్యలతో కలిసి భూలోకానికి వనవిహారం కోసం వస్తాడు. 

పరిసరాలు బాగున్నాయి, ప్రకృతి బాగుంది. అది వశిష్టమహాముని ఆశ్రమం ఉన్న ప్రదేశం. వశిస్టుడికి నందిని అనే ఆవు ఉంది. గొప్ప మహిమాన్వితమైన గోవు అది. దాని పాలు తాగడంవల్ల అమరత్వం కలుగుతుందని చెపుతారు. అష్టవసువులు, వారి భార్యలు వనవిహారం చేస్తున్న ప్రదేశానికి దగ్గరలో తన దూడతో కలిసి పచ్చిక బయళ్ళలో మేస్తూ తిరుగుతున్న గోమాతని ప్రభాసుని భార్య చూసింది. ఆమెకి అది ఎంతో నచ్చడంతో, వెంటనే భర్తని ఆ గోవుని తీసుకొని రావలసిందిగా కోరుతుంది.  

వాళ్ళు దేవతలు. అమరత్వం కలిగిఉన్నవాళ్ళు. వారికి వశిస్టుని ఆవుతో పని ఏమిటి? అదే ప్రభాసుడు భార్యతో చెపుతాడు. ఆమె వినదు. ఆవుని పట్టుకొంటాడు. సోదరులు సహాయం చేస్తారు. అందరూ కలిసి దానిని వెంట తీసుకొని పోతారు.

వశిస్టునికి విషయంతెలిసి వాళ్ళని మనుష్యులుగా జన్మించమని శపిస్తాడు. ఆష్టవసువులు క్షమించమని కాళ్ళమీద పడతారు. శాపం ఇచ్చినతరువాత వెనక్కి తీసుకోగలిగేది కాదు. కొంత వరకూ ప్రభావాన్ని తగ్గించవచ్చు. వాళ్ళు మనుష్యులుగా జన్మించిన తరువాత కేవలం కొద్ది సమయం మాత్రమే బ్రతికి ఉండేలాగ, తరువాత ఆ జన్మవిమోచనం కలిగే విధంగా చేస్తాడు. అది కేవలం ఏడుగురు వసువులకి మాత్రమే. ఎనిమిదవ వాడయిన ప్రభాసుడు గోవుని అపహరించాడు కనుక అతను పూర్తి జీవితకాలం మనుష్యుడిగా జీవించవలసిందే!  

*     *     *  

అష్టవసువులు తమకు జన్మనివ్వవలసినదని గంగను ప్రార్ధిస్తారు. ఆమె అంగీకరిస్తుంది. మానవరూపం ధరించి శంతనుడికి ఎదురుపడుతుంది. గంగ అపురూపసౌందర్యవతి. శంతను మహారాజు ఆమె అద్భుత సౌందర్యానికి ముగ్ధుడౌతాడు. తనను వివాహం చేసుకోవలసినదని కోరతాడు. ఆమెకు ఇష్టమే. కానీ, ఒక షరతు ఉంది. ఆమె వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు. ఆమె ఏమిచేసినా ఎందుకు అని ప్రశ్నించకూడదు. అలా జరిగిన మరుక్షణం శంతనుడిని విడిచి వెళ్ళిపోతుంది. ప్రేమావేశంలో చిక్కుకున్న వాడు ఏ షరతుకైనా అంగీకరిస్తాడు కదా? 

గంగకు శంతను మహారాజు ద్వారా ఏడుగురు కుమారులు జన్మిస్తారు. ఒక్కొక్కరూ పుట్టినవెంటనే గంగ వాడిని తీసుకొని వెళ్ళి నదిలో పారవేస్తూ ఉంటుంది. శంతనుడికి ఈ వ్యవహారం బాధాకరంగా ఉన్నా చేసిన వాగ్ధానం వల్ల ఏమీ అనలేకపోతాడు. చివరికి ఎనిమిదవ కుమారుడు జన్మించిన తరువాత అతనిని కూడా యదావిధిగా గంగ నదిదగ్గరకు తీసుకొని వెళుతూ ఉండగా, ఆమెని వారిస్తాడు.

`తల్లిగా ఏ ఆడదీ చెయ్యకూడని పనిని నువ్వు ఇంత నిర్ధయగా ఎలా చేస్తున్నావని?` ప్రశ్నించిన భర్తకి అష్టవసువులు శాప వృత్తాంతం చెపుతుంది. వాళ్ళ ఎనిమిదవ సంతానాన్ని తనకూడా తీసుకొని వెళుతుంది. సకల యుద్ద కళలూ, వేదవేదాంగాలూ నేర్పించి యుక్తవయస్కుడు అయ్యేసరికి తిరిగి తండ్రిదగ్గరకి పంపిస్తుంది. అతడే దేవవ్రతుడు అని పిలువబడే భీష్ముడు. వశిస్టుడి శాపం కారణంగా మనిషిగా జన్మించిన ఎనిమిదవ వసువు ప్రభాసుడు. 

© Dantuluri Kishore Varma 

4 comments:

  1. భీష్ముని గూర్చిన వివరాలలో ఈ కథా వస్తుంది. తెలిసినదే అయినా మీ శైలిలో చదవటానికి బాగుంది.
    ఇలాంటి విషయాలు రాస్తూ ఉండండి. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. అనగనగా స్టోరీస్ అనే లేబుల్తో కొన్ని కథలు రాస్తున్నాను. మన సంస్కృతి గురించి, చరిత్ర గురించి, వివిధదేశాలలో ఆసక్తికరమైన సాహిత్యానికి సంబంధించిన విషయాలు.. ఇంకా చాలా, చాలా కలిపి పిల్లలకోసం ఊహలప్రపంచానికి నిచ్చెనలు కడదామని ప్రయత్నం. ఏమో ఎంతవరకూ సాగుతుందో! ఎంతమందికి చేరుతుందో! ధన్యవాదాలు.

      Delete
  2. "ప్రలోభాలకి లోనవడం, పరుల సొమ్ముని ఆశించడం, తప్పుచెయ్యమని ప్రేరేపించే వాళ్ళ మాటలు వినడం వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయి."

    కాని ఇక్కడ నాకు అనిపించింది ప్రభాసుడు మాత్రం తన భార్యపై ప్రేమ తోనే బలయ్యాడు. దీనికి బలవ్వడం తప్పితే, తప్పించుకోవడం దేవతలకు కూడ సాధ్యం కాదని అర్ధమవుతోంది. ఇది తప్పయితే తెలియచేయండి..

    ReplyDelete
    Replies
    1. మొదటి రెండూ ప్రభాసుడి భార్య తప్పులు. మూడవది ప్రభాసుడిది.

      మీరన్నదీ నిజమే. రాముడుకూడా భార్యకోరిందని బంగారులేడి వెనుక పరుగు పెట్టలేదా?

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!