Pages

Tuesday 10 December 2013

అబద్దాలకోరు!

వాడి పేరు జానో, పీటరో ఏదో ఉంది. నాకు సరిగ్గా గుర్తులేదు. చిన్నప్పుడు వాడి బామ్మ అనేది `ఒరేయ్, సైనికుడివి అవ్వరా బాగుంటుంది. వాళ్ళు కావలసినంత పెడతారు. నీ తిండిపోతు వ్యవహారానికి సరిపోతుంది` అని. వాళ్ళ తాత అనేవాడు, `ఒరేయ్ సైనికుడివి అవ్వరా భలేగా ఉంటుంది. మందు చవకగా దొరుకుతుందట,` అని. వాడు బామ్మ మాట విన్నాడు, తాతమాట విన్నాడు. కానీ వాడి తెలివితేటలకి సైన్యంలో ఏ ఉద్యోగమూ సరిపోలేదు. కాబట్టి వంటవాడిగానే జేరవలసి వచ్చింది.

ఒకసారి పెద్ద యుద్దం వచ్చింది. అటువాళ్ళు, ఇటువాళ్ళనీ; ఇటువాళ్ళు, అటువాళ్ళనీ కాల్చుకొంటున్నారు. బుల్లెట్లు తగిలి చనిపోయిన వాళ్ళు పోతున్నారు. కాళ్ళూ చేతులూ పోగొట్టుకొన్నవాళ్ళు క్రిందపడి కొట్టుకొంటున్నారు. వంటవాడు గుళ్ళు తగలని చాటు ప్రదేశంలో ఉన్నాడు. తుపాకీ గుళ్ళు దూసుకొని పోతున్నాయి. పిరంగి గుళ్ళు పెద్దగా చప్పుళ్ళు చేస్తూ విద్వంసం సృష్ఠిస్తున్నాయి. వంటవాడికి దగ్గరలో పోరాడుతున్న ఒక సైనికుడికి ఎదుటి పక్షం నుంచి ఒక గుండు వచ్చి కాలిపిక్కలో దిగబడిపోయింది. ఒక ఆర్తనాదం చేశాడు. 

వంటవాడు ప్రాణాలకు తెగించి వాడిదగ్గరకి పరిగెత్తుకొని వచ్చాడు. `ఏమయ్యింది?` అన్నాడు.క్షతగాత్రుడు బాధగా మూలుగుతూ, `ఓరేయ్, నాకాలు పోయిందిరా! నన్ను ఆచాటుకు తీసుకొని వెళ్ళు,` అన్నాడు. వంటవాడు, సైనికుడిని భుజమ్మీద ఎక్కించుకొని సుమారు వందగజాల దూరంలో ఉన్న బంకర్ దగ్గరకి మోసుకొని పోతున్నాడు. బాధని వోర్చుకోలేక మూలుగుతున్న సైనికుడు ఆ బాధని మరచిపోవడానికి వంటవాడు వంకాయ మసాలా పెట్టిన కూరని ఎలా వొండాలో చెపుతున్నాడు. 

వంటవాడు చెపుతున్నాడు, సైనికుడు వింటున్నాడు, ఎదుటి పక్షంనుంచి తుపాకీ గుళ్ళు వాళ్ళ తలల ప్రక్కగా దూసుకొని పోతున్నాయి. సైనికుడు వింటున్నాడు, వంటవాడు చెపుతున్నాడు. అప్పుడు జరిగింది ఒక జరగ కూడని విషయం. ఓ పిరంగి గుండు సైనికుడి తలని తీసుకొని పోయింది. అది జరిగిన విషయం వంకాయ మసాలా కూరలో ములిగిపోయిన వంటవాడికి తెలియనేలేదు. సైనికుడి మొండాన్ని మోసుకుపోతున్నాడు. 

వాళ్ళ కమాండర్ చూశాడు. `ఒరేయ్ బుర్ర తక్కువ వెధవా, ఆ తలలేని మొండాన్ని ఎక్కడికి తీసుకొని పోతున్నావు?` అన్నాడు.  `తలకాదు సార్, వీడికి కాలు పోయింది,` అన్నాడు. `నీమొహం, వాడికి పోయింది తలే. కావాలంటే చూడు,` అన్నాడు కమాండర్. అప్పుడు చూశాడు వంటవాడు, తనభుజమ్మీద ఉన్న మొండాన్ని. కోపంగా నేలమీద పడేశాడు. `నాకు వీడు స్వయంగా చెప్పాడు సర్, కాలే పోయిందని. అబద్దాలకోరు,` అన్నాడు.

(ఒకజోక్ ఆధారంగా రాసినది) 
© Dantuluri Kishore Varma 

8 comments:

  1. హాస్యం బాగుంది కానీ సైనికుని గూర్చే బాదనిపించింది.
    వర్మగారు అన్ని మసాలాలూ వండగలరు :-)) (కవిత్వమ్లో)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మెరాజ్‌గారు.

      Delete
  2. Replies
    1. ధన్యవాదాలు రాజాచంద్రగారు.

      Delete
  3. మీరు బాగా వ్రాసారు. పూర్తిస్థాయి కథలు వ్రాయండి.

    ReplyDelete
    Replies
    1. ఓ డజను కథల వరకూ రాశాను శ్యామలీయంగారు. పైన `కథలు కబుర్లు` అనే పేజ్‌లో వాటి ఇండెక్స్ ఇచ్చాను. మీ కామెంట్ చూసి ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.

      Delete
  4. bagundi kani navvu tho paatu badha kuda kaligindi

    ReplyDelete
    Replies
    1. నిజమే, సందర్భం బాధాకరమైనదైనా, వంటవాడి అజ్ఞానం నవ్వుతెప్పిస్తుంది.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!