Pages

Thursday 31 January 2013

కాలం కమ్మగా సాగే పాట.

ఇరవై సంవత్సరాల క్రితం-

డిగ్రీ చివరి సంవత్సరం, చిట్టచివరి రోజు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది.

మూడేళ్ళు కలిసి తిరిగిన స్నేహితుల్ని ఆ తరువాతి రోజు నుంచి కలవలేం అనే బాధ గుండెల్లో గుచ్చేస్తుండగా ఆటోగ్రాఫ్ బుక్కులు పట్టుకొని కాలేజీకి వెళ్ళాం. పార్కింగ్ దగ్గర పెద్ద చప్టా, కాలేజ్ వెనుక నేలబారుగా కొమ్మలున్న మావిడి చెట్టు,  కేంటీన్, మిగిలిన ఫేవరెట్ హేంగౌట్స్, మనతో కలిసి క్లాసుకి బంక్ కొట్టి కేరింతలు కొట్టిన స్నేహితులు -  అన్నీ అలాగే ఉన్నాయి. మనసులోనే ఉత్సాహం లేదు.  

`మావా, ఆటోగ్రాఫ్ రా,` అంటే; `ఏడిశావులే, కాలేజీ వదిలేసినా ఊళ్ళోనే ఉంటాం కదరా?` అన్న బక్క దాసు తరువాత రైల్వేలో ఉద్యోగంవచ్చి, ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా ఎడ్రస్ తెలియకుండా పోయాడు.

`ఏరా అమ్మాయికి మేటరు చెప్పావా?` అంటే; మేం సత్తిబాబు అని పిలిచే సతీష్ మొహం చిన్నబుచ్చుకొన్నాడు. `పెళ్ళి కుదిరిందట. ఎగ్జాంస్ అన్నా రాస్తుందో, లేదో అనుమానమే! చీ ఎదవ జీవితం, టైమంతా మన మొహమాటంతోనే గడిచిపోయింది,` అని బోరుమని ఏడ్చేసిన సత్తిబాబుకి ఆతరువాత మేనమామ కూతురితో పెళ్ళయ్యి, ఇద్దరు పిల్లలు. ఇప్పుడు కాలేజీలో చదువుతున్నారు. 

`జీవితమంటే మెట్ల వరస. వాటిని జారుడు మెట్లుగా కాకుండా, విజయ సోపానాలుగా మార్చుకోవాలని కోరుకొంటున్నా`నని రాసిన లెక్చరర్ పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వీడియో సీను, ఇంకా కొంతమంది కష్టపడి అందరి ఫోన్ నెంబర్లూ సంపాదించి గెట్ టుగేదర్ ఏర్పాటు చేస్తే మళ్ళీ ఈ మధ్యనే కలిశాం. టైం మెషీన్‌లో వెనక్కి వెళ్ళిపోయినట్టు వెనక బెంచీలవాళ్ళు వెనక్కి చేరిపోయి గోల. బుద్ది మంతులు అప్పటిలాగానే ముందువరసలో కూర్చుని ఉపన్యాసాలన్నీ వినేశారు.  `ఆయమ్మాయి వొచ్చిందేమో!` అని ఆశగా వెతుక్కొన్నాడు పాపం సత్తిబాబు.

`మీ బ్యాచ్ మాకు బాగా గుర్తుండి పోయిందయ్యా,` అని అప్పటి మా లెక్చరర్లు అంటే చెట్టెక్కినంత ఆనందపడిపోయాం. అసలు గుర్తుండిపోవడానికి అల్లరి తప్పించి ఇంకేమి చేశామని! గురువులు అన్ని బ్యాచ్‌లతోనూ అలాగే అంటారేమో!

`ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇక్కడే కలిశాము` అని స్టూడెంట్ నెంబర్ వన్ లో పాటేస్తే చూసిన జనాలకి ఎప్పటివో జ్ఞాపకాలన్నీ మనసులో దూరేసి గుండెల్ని బరువెక్కించేశాయి. `హ్యాపీడేస్` అని శేఖర్ కమ్ముల సినిమాలో మెలోడీ మనసుని మెలిపెట్టేస్తే ఇప్పటి ఇంజనీరింగ్ జనరేషన్ అదే స్థాయిలో జ్ఞాపకాల్లో మునిగి మత్తెక్కి పోయింది. జనరేషన్ ఏదయినా స్నేహబంధంలో మార్పురాలేదు.

మొన్నఇంజనీరింగ్ కాలేజీలో E.C.E(B) నాలుగవసంవత్సరం చదువుతున్న వెంకటేష్ `ఫేర్‌వెల్ టైం వచ్చేసింది సార్. మా బ్యాచ్ వాళ్ళం ఎప్పటికీ మరచిపోలేని విధంగా ఏమయినా చెయ్యాలి,` అన్నాడు.

`ఆటోగ్రాఫ్‌లు రాసుకొని జాగ్రత్త  చేసుకొంటారా?` అన్నాను.

`అవీ, టీ షర్ట్‌ల మీద సంతకాలు, చేతిముద్రలు జాగ్రత్త పెట్టుకోవడం, ఫోటోలు అలాగే ఉన్నాయి. ఫేర్వెల్ వీడియో తీసుకొని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసుకొంటున్నారు ఇప్పుడంతా. నేను చాలా వీడియోలు చూశాను. కానీ అన్నీ  ఒక్కలాగే అనిపిస్తున్నాయి. మేం ప్రత్యేకంగా ఉండేలా స్పెషల్ ఎఫెక్ట్స్ కలిపి ప్లాన్ చేసుకొంటున్నాం,` అన్నాడు.

`స్పెషల్ ఎఫెక్ట్స్ వల్ల గుర్తుండిపోతుందా?` అంటే అతను చక్కటి వివరణ ఇచ్చాడు. `కొత్తదనం మీద ఆసక్తితో ఈ వీడియోని డౌన్‌లోడ్ చేసుకొని అట్టేపెట్టుకొంటారుకదా!  జ్ఞాపకం యొక్క విలువ తెలిసేసరికి, పుస్తకంలో దాచుకొన్న నెమలిపించంలా వీడియో బద్రంగా ఉంటుంది.`

ఫోన్లు, ఫేస్ బుక్కులు లేని రోజుల్లో ఎడ్రస్ లేకుండా మాయమై పోయిన దాసులాంటి ఫ్రెండ్స్‌ని మళ్ళీ కలవాలంటే సాధ్యం అవ్వచ్చు, కాకపోవచ్చు. సాంకేతికత పెరిగింది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకొంటున్నాం. మారుతున్న కాలంతో పాటూ, అభిరుచులు మారుతున్నాయి. కాలం మారినా స్నేహబంధం మారలేదు. జ్ఞాపకాలు దాచుకొనే మాధ్యమాలు వేరయినా ఆప్యాయతల పరిమళాలు ఆగిపోలేదు.

కాలం కమ్మగా సాగే పాట.
© Dantuluri Kishore Varma 

Sunday 27 January 2013

గమ్యం

ఇంగ్లీష్ కవి రాబర్ట్ ఫ్రాస్ట్ ద రోడ్ నాట్ టేకెన్ అనే కవితలో అడవిలో రెండు మార్గాలుగా విడిపోయిన కూడలి దగ్గర నిలుచుని ఏ మార్గం ఎంచుకోవాలో తెలియని సందిగ్ధంలో పడతాడు. రెండూ ఒక్కలానే ఉంటాయి. ఆఖరికి మనుష్యుల పాదాలక్రింద ఆకులు ఎక్కువగా నలగని మార్గాన్ని ఎంచుకొంటాడు. ఒక్కసారి అడుగుముందుకు వేసిన తరువాత ప్రయాణంలో వెనుకకి మరలే అవకాశమే లేదు. భవిష్యత్తులో తన ప్రయాణం గురించి ఏమి చెపుతాడు అతను? తక్కువమంది నడచిన దారిలో వెళ్ళాను, అందుకే ఇలా అయ్యింది అంటాడా? విజయమైనా, అపజయమైనా మనం ఎంచుకొనే మార్గంలోనే ఉంటుందని ఎంత చక్కగా చెపుతాడు! జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ప్రతీ సందర్భంలోనూ ఈ కవితను గుర్తుచేసుకొంటే ఎంత బాగుంటుంది!  
 స్టాపింగ్ బై ఊడ్స్ ఆనే స్నోయీ ఈవినింగ్ అనే మరో కవితలో -

"The woods are lovely, dark, and deep,
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep."  

గమ్యం వైపు సాగిపోతున్నప్పుడు దారిలో కనిపించే ఆకర్షణలకి లోనయితే నెరవేర్చవలసిన భాధ్యతలు మిగిలిపోతాయని అర్థవంతంగా చెపుతాడు.  

అంతర్లీనంగా వీటిలో రోడ్డుమీద ప్రయాణం జీవితానికి అన్వయించబడుతుంది.

`శిఖరమదిరోహించాకా విజయాన్ని వేడుక చేసుకొందాం,` అనుకొంటే, అప్పటివరకూ నడిచే ప్రయాణమంతా ఎంత భారంగా ఉంటుంది. అందుకే, వేసే ప్రతీ అడుగునీ ఆనందించడం నేర్చుకోవాలంటారు వ్యక్తిత్వ వికాస రచయితలు. దీన్నే రెండు ముక్కల్లో సిరివెన్నెల సీతా రామ శాస్త్రిగారు అంటారు- 

ఎంతవరకు ఎందుకొరకు వింతపరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు - అని  

అలలన్నీ కలిసి సముద్రమయినప్పుడు అలే సముద్రం, సముద్రమే అల. అలాగే మనిషే ప్రపంచం, ప్రపంచమే మనిషి. ఈ నిజం తెలుసుకొంటే మనం ప్రయాణంలో కలుసుకొన్న మనుషులందరిలో మనల్ని మనం చూసుకోవచ్చు. మనమంటే ఏమిటో తెలుసుకోవచ్చు. కవి చిన్ని మాటల్లో జీవితానికి అర్థం వివరించాడు.

 ఏ రోడ్డు చూసినా ఎందుకో ఈ మాటలన్నీ జ్ఞాపకమొస్తాయి. మరి మీకు?

Here is the song:

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు

గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు

ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా

తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా



కనపడేవెన్నెన్ని కెరటాలు

కలగలిపి సముద్రమంటారు

అడగరేం ఒక్కొక్క అల పేరు

మనకిలా ఎదురైన ప్రతివారు

మనిషనే సంద్రాన కెరటాలు

పలకరే మనిషీ అంటే ఎవరూ

సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది

చుట్టు అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది

నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా

మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా

తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా



మనసులో నీవైన భావాలే

బయట కనిపిస్తాయి దృశ్యాలై

నీడలు నిజాల సాక్ష్యాలే

శత్రువులు నీలోని లోపాలే

స్నేహితులు నీకున్న ఇష్టాలే

ఋతువులు నీ భావ చిత్రాలే

ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం

మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం

పుట్టుక చావు రెండే రెండూ నీకవి సొంతం కావు పోనీ

జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానియ్యి



                                                                                                                     © Dantuluri Kishore Varma 

Saturday 26 January 2013

నాగులకొండ లొద్ది జలపాతం

ఆంధ్రా శబరిమలై గురించి ముందు టపాలో రాయడం జరిగింది. అక్కడికి రమారమి 10 కిలోమీటర్ల దూరంలో నాగులకొండ లొద్ది జలపాతం ఉంది. ఎక్కడా దారి చూపించే వే బోర్డులు కనిపించవు. దీనిని ధార అంటున్నారు. `ధార కి దారి ఎలా?` అని మీరు  అడుగుతూ ముందుకు పోవలసిందే. `ఎంతదూరం?` అని ఎవరినైనా అడిగితే `ఎనిమిది కిలోమీటర్లు` అని ఒకరు చెప్పవచ్చు. ఇంకొంత దూరం వెళ్ళినతరువాత మరొక వ్యక్తిని అదే ప్రశ్న అడిగారనుకోండి, అతను 10 కిలో మీటర్లు అంటే ఆశ్చర్యపోవద్దు. మాకు ఇలా దారి పొడవునా అయ్యింది. `తప్పుదారిలో వెళుతున్నామేమో!` అనే అనుమానం వస్తుంది. అసలు జలపాతం ఉందో, లేదో అనే సందేహంతో వెనుతిరిగి వెళ్ళిపోవాలనే ఆలోచన కూడా చెసే అవకాశం ఉంది. సెల్‌ఫోన్ సిగ్నల్ ఉండదు. ఎక్కడయినా వాహనం ఇబ్బంది పెడితే మెకానిక్ దొరికే అవకాశం కూడా ఉండకపోవచ్చు.అప్పుడు మీకు ఒక మోస్తరు పల్లెటూరు కనిపిస్తుంది. దానిపేరు వేళంగి. మీరు సరయిన దారిలోనే వెళుతున్నట్టు లెక్క. అలాగే ముందుకు వెళ్ళండి.

ధార మల్లాపురం అనే గ్రామానికి సమీపంలో లొద్ది  జలపాతం ఉంది. జలపాతం దగ్గరవరకూ కార్లు వెళ్ళవు. బైకులు అయితే వెళ్ళే అవకాశం ఉంది. గ్రామంలోనుంచి కొండదారిలోనికి తిరిగిన తరువాత, ఏటవాలుగా ఎత్తు ఎక్కే మార్గంలో వీలయినంత దూరం వెళ్ళి అక్కడ కారుని నిలుపుకొన్నాం. వెంట తీసుకొని వెళ్ళిన లంచ్ బాస్కెట్లు తలొకటీ పట్టుకొని సుమారు ఒక అర కిలోమీటరు ఎత్తు ఎక్కిన తరువాత, ముందుగా జలపాతం చేసే శబ్ధం వినిపించింది, ఆ తరువాత జలపాతం కనిపించింది. కార్లలో, వేన్లలో, బైకులమీద కొంతమంది వచ్చి ఉన్నారు. ఒకే  ధారగా జలపాతం పడుతుంది. ఒక మండపం లాంటి గుడిలో పెద్ద రాతి శివలింగం, ఒక పందిరిలో మరొక చిన్న శివలింగం - దానికి ఎదురుగా నంది. దీనిని ధార మల్లిఖార్జునుని క్షేత్రం అని అంటున్నారు. శివరాత్రికి భక్తులు వచ్చి, ఈ జలపాతం క్రింద స్నానాలు చేస్తారట. 

జలపాతం వీడియోలు చూడండి:

జలపాతం పడే ప్రాంతం నుంచి కొండదిగువకి నీటిని సిమెంట్ డ్రెయిన్లు కట్టి వ్యవసాయ భూమికి మళ్ళిస్తున్నారు. వాలులో కట్టిన మడులలో వరి చేలు. దమ్ముచేసుకొని, నాట్లు వేసుకొంటున్నారు. మడులన్ని పుష్కలంగా నీరు పెట్టి ఉన్నాయి.మీరు కష్టపడి వచ్చిన అలసట అంతా మరచిపోయేటంత మనోహర దృశ్యం ఆవిష్కృతమౌతుంది ఇక్కడ . దూరంగా మడుల్లో వాలిన వందల కొద్దీ తెల్లకొంగలు పండగ రోజు ఆవుపేడతో అలికిన నేల మీద రంగవల్లులు వెయ్యడానికి పెట్టిన ముగ్గుపిండి చుక్కల్లాగ ఉంటాయి. వాతావరణంలో చల్లదనం వల్ల అంతటా కమ్ముకొన్నట్టు ఉన్న పలుచటి నీలి మంచు తెర.

సాయంత్రం మూడు, నాలుగు గంటల తరువాత ఇక్కడ ఉండడం అంత ఆహ్లాదంగా ఉండదు. పిక్నిక్‌కి వెళితే ఆ సమయానికే పూర్తి అయ్యేలా ప్లేన్ చేసుకోండి. కాకినాడకి పూర్తిగా ఎనభై కిలోమీటర్లు కూడా లేని ఈ ప్రాంతం గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ప్రదేశం గురించి ప్రచారం లేకపోవడమే దానికి కారణం.  ఈ టపా మీకు నచ్చుతుందని అనుకొంటున్నాను.
© Dantuluri Kishore Varma 

ఆంధ్రా శబరిమలై

అయిదవ నెంబరు జాతీయ రహదారిమీద ఉన్న కత్తిపూడి గ్రామం నుంచి శంఖవరం 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడినుంచి సిద్దివారిపాలెం అనే ఊరు పదికిలోమీటర్లు. ఈ ఊరిలోనే ఆంధ్రా శబరిమలై అని నామకరణం చేసి 2011లో ఒక దేవాలయాన్ని నిర్మించారు. జనావాసాలకి దూరంగా కొండల్లో నిర్మించడం వల్ల, అక్కడంతా అడవి ప్రదేశంలా అనిపిస్తూ మిగిలిన దేవాలయాల దర్శనంకంటే కొంచం ప్రత్యేకంగా ఉందని కొందరు మిత్రులు చెప్పడం వల్ల అక్కడికి బయలుదేరి వెళ్ళాం.
శంఖవరం ఊరు దాటిన తరువాత ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి సిద్దివారిపాలెంలో కొండల మధ్యనుంచి మట్టిరోడ్డు మీద కొంతదూరం వెళితే,  ఎత్తయిన ప్రదేశంలో దేవాలయం కనిపిస్తుంది.
కొండవాగులమీద నిర్మించిన వంతెనలు, పచ్చి వెదురుగడలని సైకిళ్ళకి కట్టుకొని నడిపించుకొని వెళ్ళే మనుషులు, అప్పుడప్పుడూ వెళుతున్న వాహనాలు, పొలాల్లో పనిచేసుకొంటున్న కూలీలు, దూరంగా కొండవాలులో కట్టుకొన్న గుడిసెలు (వీటిని చూసి మనం `ఆ కొండపైన కూడా పాకలు కట్టుకొని ఉంటారా!` అని ఆశ్చర్య పోతాం), రోజంతా పలుచటి పొరలాగా కమ్ముకొని ఉండే మంచు - అన్నింటినీ చూసుకొంటూ గుడికి చేరుకొన్నాం. గుడికి కొంచం ముందర ఒక వాగుమీద ఇరుకైన వంతెన ఉంది. బస్సులవంటి బరువైన వాహనాలు వంతెన దాటించ వద్దని, వంతెన బలహీనంగా ఉందని హెచ్చరిక రాసిఉంది. మాది తేలికైన కారే కనుక ఆలయం సమీపం వరకూ తీసుకొని పోయాం. ప్రస్తుతం అసౌకర్యాలున్నా మన్నించమని, వచ్చే మూడేళ్ళలో రోడ్లు, కాటేజీలు, వంతెనల నిర్మాణం జరుగుతుందని ఒక బోర్డు పెట్టారు.

శబరిమలైలో లాగ కాకుండా ఇక్కడ మహిళలకు కూడా ప్రవేశం ఉంది. నిర్మాణ శైలి కేరళలోని గుడిని పోలి ఉంది. ప్రతీ  అయ్యప్ప గుడిలో లాగే పద్దెనిమిది మెట్లు ఉన్నాయి. చిన్ని అయ్యప్ప మూలవిరాట్టు బాగుంది.

మాల ధారణ చేసిన స్వాములు ఇరుముడులు సమర్పించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారని, మకరసంక్రాంతి రోజున జ్యోతిదర్శనం ఏర్పాట్లు కూడా చేశామని నిర్వాహకులు చెప్పారు. ఈ ఊరికి సుమారు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో అంకంపాలెం అనే గ్రామంలో అసలైన శబరిమలై క్షేత్రంలో లాగానే ఉప ఆలయాలు నిర్మించారట. సమయం సరిపోక మేం అక్కడికి వెళ్ళలేదు.

రాజమండ్రీ నుంచి కానీ, కాకినాడనుంచికానీ ఇక్కడకి వెళ్ళాలంటే కత్తిపూడి దగ్గర శంఖవరం మీదుగా వెళ్ళే బస్సులు లేదా ఆటోలు  అందుకొని వెళ్ళవచ్చు. బస్సులు అంత తరచుగా ఉన్నట్టు లేవు.

యూట్యూబ్ స్లైడ్‌షో చూడండి.
ఉత్తర శబరి అని రాజమండ్రీ ఇస్కాన్ సమీపంలో గోదావరి గట్టుమీద కూడా ఒక అయ్యప్ప దేవాలయం ఉంది. మీకు ఆసక్తి ఉంటే ఇక్కడ చూడండి.  

కాకినాడనుంచి, రాజమండ్రీ వెళ్ళే కెనాల్ రోడ్డులో ఉన్న ద్వారపూడిలో  అయ్యప్ప దేవాలయం ఇక్కడ చూడండి.

© Dantuluri Kishore Varma

Thursday 24 January 2013

సూపు

వరుసగా శెలవులు వచ్చాయి. అద్భుతమైన సీనిక్ ప్రదేశాలు నాలుగైదు ఉన్నాయని ఈ మధ్య అక్కడికి వెళ్ళి వచ్చిన మిత్రులు చెప్పారు. పక్షుల కిలకిలా రావాలు, జలపాతాలు, పచ్చని పరిసరాలు... అబ్బో చాలా బాగున్నాయని ఊరించారు. చూడాలికదా మరి? రేపు వెళుతున్నా. బాగుంటే ఆ విశేషాలు మీతో షేర్ చేసుకొంటా.  భోజనానికి ముందు ఎపిటైజర్ అనబడే ఆకలి పెంచే సూపు తాగినట్టు, అసలు  పోస్టుకి ముందు కొసరు పోస్టు ఇది.   
© Dantuluri Kishore Varma 

Wednesday 23 January 2013

మన గోదావరి జిల్లా - భిన్నత్వంలో ఏకత్వం

మన తూర్పుగోదావరి, జిల్లా పరంగా ఒక్కటే కానీ, భూభౌతిక ప్రత్యేకతల దృష్ట్యా భిన్నమైన ప్రాంతాలుగా ఉంది. ప్రజల వృత్తులు, జీవన విధానం, సంస్కృతీ సాంప్రదాయాలు, మాట్లాడే భాషలో వ్యత్యాసాలు (మాండలీకాలు అనలేము కానీ, ఒకే మాండలీకంలో వివిధ ఛాయలు) మొదలైన వాటివల్ల ఇక్కడ ఒకవిధమైన భిన్నత్వంలో ఏకత్వం ఉందని చెప్పవచ్చు. 
పైన భూభౌతిక ప్రత్యేకతలు అని చెప్పడం జరిగింది. అవి ఏమిటంటే - సముద్ర తీర ప్రాంతం; సారవంతమైన భూమి, నీటిపారుదల ఉండి సమృద్దిగా పంటలు పండే కోనసీమ ప్రాంతం; వర్షాధారం మీద ఆధార పడి ఉండే మెట్ట ప్రాంతం; అడవులు, వాటిని చేర్చి ఉండే ఏజన్సీ ప్రాంతాలు. 
ఈ నాలుగు చోట్లా భిన్నమైన జీవనశైలి, సంస్కృతీ మనకు కనిపిస్తాయి. చేపలు పట్టుకొని జీవించే మత్యకారులు, అటవీ సంపదమీద ఆధారపడి జీవించే ప్రజలు, నదీపరివాహిక ప్రాంతంలో జీవించే వ్యవసాయదారులు, సరైన పంటలు పండని మెట్టప్రాంతంలో వారు - ఒకే జిల్లాలో ఎన్ని వైవిధ్యభరితమైన జీవన విధానాలో చూడండి. 
గంగమ్మ తల్లిని ఒకచోట సేవించుకొంటే, వనదేవతలని మరొకచోట కొలుచుకొంటారు. పురాణాల్లో కనిపించే దేవతలు, దేవుళ్ళ ఆలయాలు ఇంకొక ప్రాంతంలో విరివిగా కనిపిస్తాయి.
ఇక్కడ ఉన్న చిత్రాలలో పైన చేసిన పరిశీలనలని చూడవచ్చు. జిల్లాలో ఒకచోట నుంచి మరొక చోటకి వెళ్ళి నప్పుడు ఈ వ్యత్యాసాలని దృష్టిలో ఉంచుకొని పరిసరాలనీ, ప్రజలనీ గమనిస్తే ట్రిప్‌ని మరింత బాగా ఆనందించగలం. ఒప్పుకొంటారా?
(ఫోటోలు డి.ఆర్.డి.ఏ వాళ్ళు ఇచ్చినవి. ప్రోజెక్ట్ డైరెక్టర్ శ్రీ మధుకర్ బాబు గారికి కృతజ్ఞతలు. మేప్ మేప్స్ ఆఫ్ ఇండియా వారిది.) 
*     *     *

తూర్పుగోదావరి జిల్లా వివరాలు 

విస్తీర్ణం: 10,807 చదరపు కిలోమీటర్లు
జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారం 51,51,549 మంది. 
జనసాంద్రత: చదరపుకిలోమీటరుకి 480 మంది.
అక్షరాస్యత: 71 శాతం
మండలాలు: 60
గ్రామాలు: 1400
మునిసిపల్ కార్పొరేషన్లు: 02(రాజమండ్రీ, కాకినాడ) 
మునిసిపాలిటీలు: 09 
ఎసెంబ్లీ నియోజకవర్గాలు: 19
  1. కాకినాడ అర్బన్
  2. కాకినాడ రూరల్
  3. పిఠాపురం
  4. పెద్దాపురం
  5. జగ్గంపేట
  6. ప్రత్తిపాడు
  7. తుని
  8. అమలాపురం
  9. కొత్తపేట
  10. పి.గన్నవరం
  11. రాజోలు
  12. ముమ్మిడివరం
  13. రామచంద్రపురం
  14. మండపేట
  15. రాజమండ్రీ అర్బన్
  16. రాజమండ్రీ రూరల్
  17. అనపర్తి
  18. రాజానగరం
  19. రంపచోడవరం

లోక్‌సభ నియోజకవర్గాలు: 03

  1. కాకినాడ
  2. రాజమండ్రీ
  3. అమలాపురం

© Dantuluri Kishore Varma 

షకలక బేబీ

మా అమ్మాయిలిద్దరికీ ఆక్వేరియంలో చేపలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. కొనుక్కొందామని అడగటంతో, ఆక్వేరిస్ట్ దగ్గరకు వెళ్ళి ఒక ఫిష్ బౌల్, రెండు రకాల చేపలు, బౌల్‌కి అడుగున వెయ్యడానికి రంగురంగుల రాళ్ళు, అక్వాటిక్ ప్లాంట్స్ లా కనిపించే కృత్రిమ మొక్కలు, నీటిని సర్క్యులేట్ చేస్తూ బుడగలు రావడానికి గాలిని పంపేచిన్న మోటర్, దానికి ఒక సన్నటి గొట్టం,  చేపలకి వెయ్యడానికి గుళికల్లా ఉండే ఆహారం.. అన్నీ కొని ఇంటికి తీసుకొని వెళ్ళి ఆక్వేరియం ఏర్పాటు చేసుకొన్నాం. 

ఆక్వేరియం స్వచ్చమైన నీటితో చాలా అందంగా ఉంటుందికానీ, చేపలకి మేత వేస్తుంటే నీరు మడ్డిగా అయి, తరచూ మార్చకపోతే అసహ్యంగా తయారవుతుంది. కనీసం ప్రతీ వారం శుబ్రం చేస్తూ, చేపలు బౌల్‌లో ఆనందంగా తిరగడం అస్వాదిస్తూ ఉండగా ఒకరోజు ఉదయానికి గోల్డ్ ఫిష్ రెండూ చనిపోయి, పైకి తేలిపోయి కనిపించాయి. తరువాత ఇంకొకటి కూడా చచ్చిపోయింది. మిగిలిన ఒక్క గప్పీ రకం చేపనీ స్కూలుకి వెళ్ళేటప్పుడు, వచ్చినతరువాత `హాయ్, హెలో, ఓయ్ నిన్నే,` అని పలకరించుకొంటూ ఆనందపడిపోతున్నారు పిల్లలు. 

ఒక ఆదివారం రోజు ఈ చేపకి ఏదయినా పేరుంటే బాగుంటుందని, `బావజ్జీ(అంటే నాన్న, డాడి అని) పేరుచెప్పండి,` అన్నారు. అప్పుడే టీవీలో `షకలక బేబీ...` పాట వస్తుంది. `మన గప్పీ ఫిష్ పేరు షకలక బేబీ,` అన్నాను. 

షకలక బేబీ చాలా రోజులు గుడ్ మాణీంగులు, హాయ్‌లు, గుడ్‌నైట్‌లు చెప్పించుకొంది. తరువాత ఏమైందో తెలియదు ఓ రోజు ప్రొద్దున్నే ఆక్వేరియం లోనుంచి బయటకు జంప్‌చేసి ఫ్లోర్ మీద పడి కొట్టుకొంటుంది. చూసిన వెంటనే దాన్ని జాగ్రత్తగా తీసి బౌల్ లో వేసాం. సాయంత్రం వరకూ బాగుంది. తరువాత చనిపోయి, పైకి తేలిపోయింది.   

పేరుకూడా పెట్టి చాలా అటాచ్‌మెంటు పెంచుకొన్నారేమో, పిల్లలు చాలా బాధపడ్డారు. నిజానికి పెద్దవాళ్ళం కూడా అప్సెట్ అయ్యాం. జంతువులని పెంచుకోవడం మనందరికీ అలవాటే, కానీ ఇలాంటి సందర్భాలలో మనసు చాలా బాధపడుతుంది. ఇంకెప్పుడూ ఆక్వేరియం జోలికి వెళ్ళలేదు. చాలా రోజులు ఖాళీ బౌల్ అటకమీద ఉండేది, తరువాత ఎవరికో ఇచ్చేసాం.
© Dantuluri Kishore Varma 

Monday 21 January 2013

మన ఊరి ఘంటసాల

కాకినాడ త్రిపురసుందరి గుడి దగ్గర ఏర్పాటు చేసిన ఘంటసాల విగ్రహం
1945 నుంచి 1975 వరకూ మూడుదశాబ్ధాలు తన గాంధర్వగానంతో సంగీతాభిమానులని ఉర్రూతలూగించిన శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గాత్రం తెలుగు ప్రజలకి దేవుడు కరుణించి, ప్రసాదించిన అపురూప వరం. శాస్త్రీయ సంగీత ఛాయలనుంచి, లలితసంగీతంలోకి తెలుగు సినిమాపాట పరిణామంచెందుతున్న క్రమంలో వేలకొద్దీ పాటలు, పద్యాలూ పాడి, వందకుపైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించిన గొప్పకళాకారుడు ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన గాయకుడిగా వుంటూ చాలా భక్తి పాటలని పాడుతూ, మరొక వైపు లలిత సంగీతంలో ప్రయివేట్ ఆల్బంస్ చేసి, జానపదాలుపాడి, వీటన్నింటికీ శిఖరాయమానంగా భగవద్గీతకి సంగీతం సమకూర్చి, పాడిన ఘంటసాల ఒక సంగీత మేరుపర్వతం.  అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు, మరెందరో నటులకి వారి, వారి విజయాలలో ఘంటసాల పాత్ర చాలా విశేషమైనదని వివిధసంధర్భాలలో అందరూ చెప్పినవారే. ఆయన కంఠంలో పలికిన భక్తి, విచారం, వేదన, విరక్తి, ప్రేమ, చిలిపితం, శృంగారం, అల్లరి, గడుసుదనం మరొకరికి అనుకరణ సాధ్యంకాదు. అలాంటి మధురగాయకుడిని గౌరవించడానికి ఏమిచేసినా తక్కువే. కాకినాడవాసుల అభిమానం ప్రస్పుటించే విధంగా జీవకళ ఉట్టిపడేలాంటి ఘంటసాల విగ్రిహాన్ని బాలా త్రిపురసుందరి గుడికి సమీపంలో జూన్ 2012లో ఏర్పాటుచేశారు. అది ఇదే.

*     *     *

దశాబ్ధాలు గడుస్తున్నా ఆణిముత్యాల్లాంటి పాటలను విని అనందిస్తున్నాం. రియాలిటీషోలలో, ఫంక్షన్లలో, సాంస్కృతిక కార్యక్రమాలలో  స్టేజ్‌ల మీద ఔత్సాహిక గాయకులు పాడుతుంటే చప్పట్లు చరుస్తూ ప్రోత్సహిస్తున్నాం. అచ్చు బాలసుబ్రహ్మణ్యంలాగ, ఘంటసాలలాగా పాడుతున్నారని మెచ్చుకొంటున్నాం. వారు అసలుగాయకుల గొప్పతనాన్ని మనకి మళ్ళీ, మళ్ళీ జ్ఞాపకంచేసి `ఆహ` అనిపిస్తున్న కళా వారదులు. అటువంటి వారిలో మనకాకినాడ జూనియర్ ఘంటసాలగా ప్రఖ్యాతి పొందిన పి.వి.రమణ ఒకరు. శ్రీ రమణపాడిన శివశంకరి పాట ఇక్కడ వినండి:



© Dantuluri Kishore Varma

Sunday 20 January 2013

మీరు వేటాడే పులా, పరుగెత్తే జింకా?

అడవిలో ఒక పులి ఉంది. అది నడచి వస్తుంటే ఏ జంతువైన ప్రాణ భయంతో పరుగు పెట్టవలసిందే. 





ఎంత పులి అయినా పరుగు పెట్టి వేటాడక పోతే ఆరోజుకి ఆహారం ఉండదు. 

ఎవరో చెప్పారు.....


ఈ జనారణ్యంలో మనమందరం వేటాడే పులి కోవలోకో, పరుగెత్తే జింకల కోవలోకో వస్తామని.

మనం  ఎవరయినా తెల్లవారినదగ్గరనుంచీ, పొద్దుపోయే వరకూ పరిగెత్తవలసిందే. 

(ఏమోటికాన్స్ ఉపయోగించిన టపాలు మినహా నేను ఇటువంటి ఏనిమేటేడ్ పోస్టులు  ఎక్కడా చూడలేదు. పెద్దగా మేటర్ లేకపోయినా, కొంచం కొత్తగా ఉంటుందని ఈ టపా పెడుతున్నాను. మీకు నచ్చుతుందని అనుకొంటున్నాను.) 
© Dantuluri Kishore Varma 

Saturday 19 January 2013

ఏముంటుందో తెలుసు, అయినా వెళతాం.

బేతాళుడిని భుజమ్మీద వేసుకొని, ఒకచేతితో దూసిన కత్తి పట్టుకొని, అలసట తెలియకుండా కథ వింటూ చెట్ల మధ్యలోనుంచి వెళుతున్న విక్రమార్కుడు. రెండు వైపులా చెట్టుతొర్రల్లా ఏర్పాటుచేసిన ఇన్ అండ్ అవుట్ ద్వారాలు. ఈ ఎంట్రన్స్ సెట్టుకి ఐదు లక్షలు అయ్యిందట. పదిరూపాయల టిక్కెట్టు కొని లోపలికి వెళితే ఏముంటుందో అందరికీ తెలుసు. ఇది మా వూరికి పెద్ద తీర్థం. 37 సంవత్సరాలనుంచి, పెద్దగా మార్పు లేకుండా అవేస్టాల్స్ పెడుతున్నా, కాకినాడలో సరదాగా కుటుంబంతో  గడపడానికి కావలసిన  ప్రదేశాలు ఎక్కువగా లేవుకనుక, ప్రతీసారీ సినిమాకే పోలేకా ఎగ్జిబిషన్‌కి దారితీస్తారు మా నగరవాసులు.  

బెడ్‌షీట్లు, రెడీమేడ్ బట్టలు, వంటసామాన్లు, నావల్ట్లీస్, పిల్లలకి బొమ్మలు, మేజిక్ సామాన్లు, కీచైన్లు లాంటి స్టాల్స్ అన్నీ ఉన్నాయి. షూటింగ్, త్రోయింగ్ రింగ్, బాల్ విసిరి పేర్చిన గ్లాసుల్ని పడగోట్టడం లాంటి గేంస్, త్రీడీ కళ్ళజోళ్ళు ఇచ్చి చూపించే స్పెషల్ షోలు ఉన్నాయి.  
పాప్‌కార్న్, పీచుమిఠాయి, అప్పడాలు, గోబీ మంచూరియా, మిరపకాయి బజ్జీ, చాట్...ఎగ్జిబిషన్‌కి వచ్చిన తొంభైశాతం మంది వీటిల్లో ఏదో వొకటి తినకుండా బయటకి వెళ్ళరు. 

పిల్లలకోసం మెర్రి గో రౌండ్, టోయ్ ట్రెయిన్; పెద్దవాళ్ళకోసం స్వింగింగ్ బోట్, బ్రేక్ డేన్స్, జైంట్ వీల్ మొదలైన జాలీ రెయిడ్స్ ఉన్నాయి. ఒంటె స్వారీ ఉంది. 
చివరిలో స్టేజీ మీద సాంస్కృతిక కార్యక్రమాలు - సంగీత విభావరుల లాంటివి జరుగు తున్నాయి. ఈ సారి అనంతపద్మనాభుని గుడి సెట్ ప్రత్యేకత. దాని గురించి ఇది వరకే ఒక టపా పెట్టాను. ఇక్కడ చూడండి.  
ఇక్కడ ఉన్నా, మరి ఎక్కడ ఉన్నా మా వూరి వాళ్ళకి వ్యవసాయ, ఫల, పుష్ప ప్రదర్శన(ఎగ్జిబిషన్) అంటే ఒక సెంటిమెంటల్ ఎటాచ్ మెంట్ ఉంటుంది. ఇష్టంతో కూడుకొన్న జ్ఞాపకాలు ఉంటాయి. ఎప్పుడో చాలా కాలం క్రిందట చూసి, ఇప్పుడు ఊరికి దూరంగా ఉండి చూడలేకపోతున్న అందరి గురించీ ఈ ఫోటోలు ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నాను. ఊరు ఏదయినా చాలా చోట్ల ఇలాంటి ఎగ్జిబిషన్లు జరుగుతాయి కనుక `కాకినాడ` అనే టాగ్‌ని కొంచంసేపు మరిచిపోయి, చిన్నప్పటి తీపిజ్ఞాపకాలని నెమరువేసుకోవచ్చు.

   © Dantuluri Kishore Varma 

Friday 18 January 2013

ఓ వీరాభిమాని కట్టిన ఎన్‌టీ్ఆర్ గుడి

స్నేహితుడు విజయకృష్ణ కాకర్ల ఫోన్‌చేసి, సర్పవరం దగ్గర గంగరాజునగర్ నాలుగవ వీధిలో ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి రమ్మని పిలిచారు. ఈ రోజు తారకరామారావు గారి 17వ వర్ధంతి. తనకు తెలిసి రామారావుకి ఉన్న అభిమానుల్లో ఒక వ్యక్తిని పరిచయంచేస్తానని ఈ ఆహ్వానం యొక్క సారాంశం.
చంద్రమౌళి
ఆయనపేరు పుచ్చకాయల చంద్రమౌళి. ఓఎన్‌జీసీ లో అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్‌గా ఉద్యోగం. ఇష్టం, అభిమానం, భక్తీ అన్నీ నటరత్న నందమూరి తారకరామారావు మీదే. రామారావు నటించిన సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో నటవిశ్వరూపాన్ని చూసి కురుక్షేత్ర సంగ్రామం సమయంలో కృష్ణుని విశ్వరూప సందర్శన భాగ్యాన్ని పొందిన అర్జునుడిలా ఆనందపడిపోతూ ఆస్వాధించడం, ఆ మహానటుని డైలాగులు వింటూ మురళీగానాన్ని విన్న బృందావన వాసిలా తన్మయత్వం చెందడం ఈయన అభిరుచులు.  

వీధిమొదటిలో రెండూ బై రెండు సైజులో ఎన్‌టీఆర్ బొమ్మలతో `నటరత్న కళామందిర్` పేరుతో దారిచూపించే బోర్డు కనిపించింది. చంద్రమౌళి గారి సొంత ఇల్లు తారకరామా నిలయం లో మొదటి రండు అంతస్తులూ స్వంతంగా వాడుకోవడానికి. ఇంటిలో ప్రతీ గదికీ రామారావు నటించిన సినిమాపేర్లు బడిపంతులు, గుడిగంటలు వగైరా ఉన్నాయి. రెండవ అంతస్తులో కట్టిన పెద్ద హాలు తన అభిమాన నటుడి కోసం. ఈ హాలు పేరే నటరత్న కళామందిరం.

హాలు ఎన్‌టీ్ఆర్ గుడిలా ఉంది. పాతకాలం వీడియో షాపుల్లోలాగ వాల్‌రేక్‌లో రామారావు నటించిన సినిమా డీవీడీలు, ఎదురుగా కప్‌బోర్డ్‌లో వందలకొద్దీ ఆడియో కేసెట్లు, ఎన్‌టీ్ఆర్ గురించి వచ్చిన పుస్తకాలు, కృష్ణుడు, దుర్యోధనుడు లాంటి పాత్రలలో ఉన్న నిలువెత్తు పోస్టర్లు, నాలుగు వైపులా గోడలమీద అతికించిన సుమారు 700 పాత్రలలో ఉన్న నటసార్వభౌమ చిత్రాలు, రామారావు చిత్రాలను ప్రదర్శించడానికి హోందియేటర్, మ్యూజిక్ సిస్టం లతో కళాత్మకంగా ఏర్పాటు చేసారు. 
ఈ సినిమాలకి పనిచేసిన సాంకేతిక నిపుణుల వివరాలు, పాటలు, ఆయా చిత్రాల నిర్మాణ విశేషాలను చంద్రమౌళికి కరతలామలకం. టాక్సి రాముడు, టైగర్ రాముడు, రాముని మించిన రాముడు లాంటి సినిమాల గురించి చాలామందికి తెలుసుకానీ, రామారావు నటించిన శృంగారరాముడు అనే అంతగా ప్రజాధరణ పొందని సినిమా డిస్కు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి పల్లెటూరిపిల్ల సినిమా డీవీడి కోసం నందమూరి బాలకృష్ణ అడిగి తీసుకొన్నారట. ఆడియో పాటల సేకరణకూడా ఇక్కడ ఉంది. చాలా అరుదైన పాటలు ఈయన దగ్గర ఉన్నాయి. ఘంటసాల తనయుడు రత్నకుమార్ కళామందిర్ చూసి, ఇక్కడ ఉన్న ఘంటసాల పాటల కలెక్షన్ గురించి ప్రశంసల జల్లు కురిపించారు. ఒకే హీరో నటించిన ఎక్కువ సినిమా ఒరిజినల్ డీ.వీ.డీ ల సేకరణలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు గుర్తించి రికార్డుని చంద్రమౌళి పేరుమీద నమోదు చేశారు.

ఇంటరెస్టింగ్ హాబీ. కదూ?

© Dantuluri Kishore Varma

Thursday 17 January 2013

అనంతపద్మనాభస్వామి @ ద ఎగ్జిబిషన్

కాకినాడ కుళాయిచెరువు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన 37వ వ్యవసాయ, ఫల, పుష్ప ప్రదర్శన(ఎగ్జిబిషన్)లో ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణ అనంతపద్మనాభస్వామి దేవాలయ సెట్. ఇరవై ఐదు లక్షల వ్యయంతో ఈ సెట్టు నిర్మాణం జరిగిందని చెబుతున్నారు. ఒకచోటనుంచి మరొకచోటుకి తరలించగల సౌలభ్యం ఉన్న కారణంగా దీనిని ఇంతకుముందు యలమంచిలి లో ప్రదర్శించారట. ఇక్కడి ఎగ్జిబిషన్ ముగిసిన తరువాత కాకినాడనుంచి దీనిని విశాఖపట్టణానికి తీసుకొనివెళతారు.

ఆలయ ఆకారం తిరువనంతపురాన్ని పోలిలేదుకానీ, లోపలి అనంతపద్మనాభుని విగ్రహం మాత్రం చాలా పోలికలు కలిగిఉండి, బాగుంది. పద్దెనిమిది అడుగుల పొడవుతో, బంగారురంగు పూతతో మనోహరంగా మలిచారు. 
తిరువనంతపురం దేవాలయ నేలమాళిగలలోనుంచి బయటపడిన లక్షలకోట్ల సంపద వల్ల ఈ దేవాలయ ప్రశస్థి  దేశదేశాలూ పాకిపోయింది. ఈ విషయాన్ని దృష్ఠిలో ఉంచుకొని నేల మాళిగలోని తెరిచిన  గదులనుకూడా ఇక్కడ ఏర్పాటుచేశారు. మచ్చుకి రెండు గదులకి తీసిన ఫొటోలని ఇక్కడ ఇస్తున్నాను చూడండి. 

అత్యంత రహస్యమైన చివరిగది నాగబందంతో మూసి ఉంచారని, దానిని తెరవాలంటే గరుడమంత్రం తెలిసిన మహా సాధు పండితులు కావాలని, కానీ అటువంటివాళ్ళు ఇప్పుడు లేరని.. రకరకాలుగా కథనాలు ప్రచారమయ్యాయి. ఈ క్రమంలో నాగబందం అనేదానికి చాలా క్రేజ్ వచ్చింది. అదీకాక నాగవల్లి సినిమాలో చూపించిన మూసిన గదితలుపులు, వాటిమీద పెద్ద సర్పాకారపు బందనం! నాగబందాన్ని కూడా మనం ఎగ్జిబిషన్లో చూడవచ్చు. 

సెట్టు బాగుంది కదా?

మీరు తిరువనంతపురం అనంతపద్మనాభుని గురించి తెలుసుకోవాలనుకొంటే, ఈ బ్లాగ్‌లో ఇంతకు ముందు రాసిన ఈ టపా చదవండి.

© Dantuluri Kishore Varma

Wednesday 16 January 2013

కోనసీమ ప్రభలతీర్థాలు

కోనసీమలో సంక్రాంతి తరువాతి రోజయిన కనుమనాడు వందల సంవత్సరాలుగా అప్రతిహతంగా ప్రభలతీర్థాలు జరుగుతున్నాయి. ప్రభలు అంటే దేవుని వాహనాలు. కొత్తవెదురుతో శివలింగాకారంలో కట్టి, రంగురంగుల దుస్తులు, నెమలిపించాలు, పువ్వులు, కాగితం జండాలు అలంకరించి శివుడిని ఆశీనుడిని చేయ్యడానికి ఆసనం ఏర్పాటుచేసి పల్లకీలా తయారుచేస్తారు. ఈ ప్రభలని సాక్షాత్తు వీరభద్రునిగా భావిస్తారు. వివిధ ఊళ్ళల్లో ఉన్న శివాలయాలనుంచి ప్రభలను భుజాలమీద మోసుకొంటూ `అ్‌హోం భొహోం భోం...` అంటూ, వెంటవచ్చిన జనాలు `శరభ, శరభ అశ్సరభ శరభ....` అని జయజయధ్వానాలు చేస్తుండగా   ఊరేగింపుగా తీర్థస్తలికి తీసుకొనివెళతారు. గరగనృత్యాలు, డప్పువాద్యాలు, సన్నాయిమేళాలు, విచిత్రవేషాలు, బాణాసంచా కాల్పులతో ఊరేగింపు ముందుకు వెళుతుంది. అందంగా తయారయిన ఎడ్లబళ్ళమీద కోనసీమవాసులు కదిలి వస్తారు. వందకు మించిన గ్రామాలలో ప్రభల తీర్థం జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాలనుంచి, విదేశాలనుంచి పల్లెల్లో ఉన్న బందువుల ఇళ్ళకి వచ్చి ఈ ఉత్సవాలను చూడటానికి ప్రజలు తహతహలాడతారు. 

అంబాజీపేట మండలం మొసలపల్లి దగ్గర 11గ్రామాలకి పొలిమేరగా ఉన్న జగ్గన్నతోట అనే ఏడెకరాల కొబ్బరితోటలో ఏకాదశ(11 మంది) రుద్రుల సంగమంగా జరిగేతీర్థం కోనసీమలో మిగిలిని అన్ని చోట్లా జరిగేదానికంటే కూడా విశేషమైంది. దేశం మొత్తం మీద పదకొండు మంది రుద్రులు కొలువుతీరే ఒకేఒక ఉత్సవం జగ్గన్నతోటలోనే జరుగుతుంది. 17వ శతాబ్ధంలో ఈ సాంప్రదాయం మొదలైందని చెపుతారు. విఠల జగన్నాధుడనే శివభక్తుడు ఉండేవాడట. ఆయన ఏక సంతాగ్రాహి. ప్రస్తుతం జగ్గన్నతోట అని పిలవబడుతున్న ప్రదేశంలో శివజపం చేసుకొంటూ ఉండేవాడు. పెద్దాపురం సంస్థానంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం, నిజాం ఆదీనంలోనిది. అందువల్ల శివధ్యానానికి అడ్డుచెబుతారు. విఠల జగన్నాధుడు సరాసరి నవాబుతోనే మాట్లాడే ఉద్దేశ్యంతో హైదరాబాదు వెళతాడు. అక్కడ నవాబుని కలవడానికి ముందే ఓ ఇద్దరు ముస్లిం వ్యక్తుల ఘర్షణ పడుతుండగా చూస్తాడు. ఆ తగాదా నవాబు దగ్గరకి వెళుతుంది. జగన్నాధపండితుడు  ఒక్కడే సాక్షిగా ఉండడంవల్ల అతనిని కూడా పిలుచుకువెళతారు. ఉర్దూ భాషలో జరిగిన గొడవని యదాతదంగా చెప్పడంతో నవాబు ఆశ్చర్యపోతాడు. అతను ఏకసంతాగ్రాహి అని తెలుసుకొని, మరికొంత పరీక్షించదలచి, కొరాను నుంచి కొంతభాగం చదివి వినిపించి తిరిగి చెప్పమంటాడు. అక్షరం పొల్లుపోకుండా విఠల జగన్నాధుడు దాన్ని తిరిగి చెప్పడంతో సంతోషించి, జపానికి అనుమతినిచ్చి, దానితోపాటు ఎనిమిది పుట్ల(64 ఎకరాలు) స్థలము ఇచ్చి సగౌరవంగా పంపిస్తాడు. ఆ ప్రాంతంలోనిదే జగ్గన్నతోట. ఆ శివభక్త పండితుని కోరికమీద ఏకాదశ రుద్రులు లోకకళ్యాణార్ధం ఈ ప్రదేశంలో సమావేశమవ్వడం మొదలుపెట్టారని పురాణం చెబుతుంది.

ఏకాదశ రుద్రులు వీళ్ళే:
1. గంగలకుర్రు - చెన్నమల్లేశ్వరస్వామి
2. గంగలకుర్రు అగ్రహారం - వీరేశ్వరస్వామి
3. వ్యాఘ్రేస్వరం - వ్యాఘ్రేశ్వరస్వామి
4. మొసలపల్లి - మధుమాసాంత భోగేశ్వరస్వామి
5. పెదపూడి - మేనకేశ్వరస్వామి
6. ఇరుసుమండ - ఆనందరామేశ్వరస్వామి
7. ముక్కామల - రాఘవేశ్వరస్వామి
8. వక్కలంక - కాశీవిశ్వేశ్వరస్వామి
9. పుల్లేటికుర్రు - అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి
10. పాలగుమ్మి - చెన్న మల్లేశ్వరస్వామి
11. నేదునూరు - చెన్న మల్లేశ్వరస్వామి 


గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం ప్రభలు జగ్గన్నతోటకి చేరుకొనే క్రమం చాలా ఉద్వేగభరితంగా, విలక్షణంగా ఉంటుంది. ఈ ప్రాంతాలకీ, తీర్థస్థలికీ మధ్య కౌసిక్ డ్రెయిన్ (కాలువ) మీద వంతెన ఉన్నా, రోడ్డుమీదుగా వంతెన దాటించి తీసుకొని రారు! అందుకు బదులుగా వరిచేలు తొక్కుకొంటూ, కాలువదాటించి తీసుకొని వస్తారు. కాలువ ఇరు గట్లమీదా, వంతెనమీదా వేలకొలదీ జనాలు వీక్షిస్తూ ఉండగా బజంత్రీలతో, బాణాసంచా కాల్పులతో మెడలోతు కాలువలోనుంచి ప్రభలు తడవకుండా చేతులమీద పైకి ఎత్తి మోస్తూ నలభై, యాభై మంది భక్తులు నీటిని అతలాకుతలంగా చేస్తూ అవతలి ఒడ్డుకి చేరుస్తారు. ఇది వర్ణనాతీతమైన అపురూప దృశ్యం. (ఇంతకంటే మంచి క్వాలిటీ ఫోటో ప్రస్తుతానికి ఇవ్వలేకపోతున్నందుకు క్షమించాలి)

జగ్గన్నతోట తరువాత అంత పెద్ద ఎత్తున అంబాజీపేట, కొత్తపేటలలో(ఇక్కడ సంక్రాంతి రోజు జరుపుతారు) కూడా ప్రభలతీర్థం జరుగుతుంది. సుమారు వంద ప్రాంతాలలో వీటిని నిర్వహిస్తారు కనుక కోనసీమ ఆచివరినుంచి, ఈ చివరివరకూ ప్రజలందరికీ పెద్దపండుగంటే ప్రభల తీర్థమే! తీర్థం పూర్తయిన తరువాత అర్ధరాత్రినుంచి, తెల్లవారినవరకూ బాణాసంచా కాలుస్తారు. తరువాత ప్రభలు వెనుదిరిగి తమతమ గ్రామాలకు చేరుకొంటాయి.

© Dantuluri Kishore Varma

Tuesday 15 January 2013

పాలకుండలో నీళ్ళు

రాజుగారింటిలో పెద్ద ఫంక్షన్ ఉందని ఊరివాళ్ళనందరినీ తలొక చెంబుడూ పాలు తీసుకు వచ్చి కోట గుమ్మం దగ్గర పెట్టిన పెద్ద గంగాళంలో పొయ్యమన్నారు. ఉదయం నుంచీ మధ్యాహ్నం వరకూ ప్రతీ ఇంటినుంచీ ఒక్కొక్కరు చొప్పున క్యూలో వచ్చి చెంబులలోంచి గంగాళంలోనికి  వొంచుతున్నారు. లెక్క పెట్టుకొంటున్న బటులు పద్దులు రాసుకొంటున్నారు. వోటింగ్ పూర్తయిన తరువాత కౌంటింగ్ చేసినట్టు, పాలు కొలవడానికి వచ్చి గంగాళంలోకి తొంగిచూసిన రాజుగారి వంటవాళ్ళకి మతులు పోయాయి. అన్నీ ఇన్‌వాలిడ్ వోట్లలాగ, పాత్ర నిండా నీళ్ళే! ఈ కథ మనమంతా చదువుకొన్నదే. ప్రతీ ఒక్కడూ `ఇంతమంది పోసిన పాలల్లో నేను పోసినవి నీళ్ళని ఎవరు కనిపెట్టగలరులే?` అని అతితెలివి ప్రదర్శించాడని తెలిసిన వాస్తవం. 

సోషల్ నెట్‌వర్కింగ్ వచ్చినతరువాత ఇలాంటి కథలు పునరావృత్తమౌతున్నాయి. ప్రతీ మనిషికీ హీరో(యిన్) వర్షిప్ కావాలి. దానిని పొందడానికి దగ్గరదారి - కొన్ని ఫోటోలనీ, స్టేటస్ అప్‌డేట్లనీ షేర్ చెయ్యడం. అవి ఎలా ఉండాలంటే, `ఐ కేర్ ఫర్ ద సొసైటీ` అనే సామాజిక స్పృహ ఉన్నవి అవ్వాలి. లేదా, `పలానా వ్యక్తి కష్టంలో ఉన్నాడు. మీరు సహాయం చెయ్యండి` అని ఉండాలి. వాటిని చూసి స్పందించి సహాయం చేసే నిజమైన నిశ్సబ్ధ వితరణశీలురు ఎప్పుడూ ఉంటారు. కానీ, వాళ్ళ సంఖ్య భహుస్వల్పం.    

ఒకాయనకి ఆమధ్యన మంచి ఆలోచన వచ్చింది. మారుమూల పల్లెల్లో ప్రభుత్వ బడుల్లో చదువు కొంటున్న నిరుపేద పిల్లలకి పుస్తకాలు, పలకలు లాంటివి కొనిపెడితే బాగుంటుందని ఎక్కువమంది ఉన్న చాలా  గ్రూపుల్లో తన ఆలోచనని వ్యక్తం చేశాడు. ధనరూప సహాయం అడిగాడు. `భేష్` అన్నారు, భుజంతట్టారు. సై అన్న వాళ్ళందరూ తలొక వందరూపాయలు లేదా ఇవ్వగలిగి నంత, ఎంతకొంచమైనా సరే ఇచ్చి ఉంటే ఇంకొక వందమంది పిల్లలకి ఈ సహాయం అంది ఉండేదని కార్యక్రమం చేసినాయన వాపోయాడు. మొత్తం మీద ఇచ్చినవాళ్ళు నలుగురో, ఐదుగురో! 

`మీరు రక్తదానం చేస్తారా?` అని ఒక పెద్ద మనిషిని అడిగితే, `నీళ్ళ దానం కూడా చెయ్యను. ఎందుకు చెయ్యాలి?` అని ఎదురు ప్రశ్నించాడట. `ఎవరు ఏమనుకొంటే నాకేం, నేను అనుకొన్నది చెపుతాను,` అనే తెగువయినా ఉండాలి, లేదా మాట్లాడక ఊరుకోవాలి. ప్రగల్భాలు  కాకుండా ఇంకేమి చెయ్యగలం అనేది ముఖ్యమైన విషయం. సహాయం కావాలని అడిగే ప్రతీ అభ్యర్ధనకీ స్పందించాలని ఏమీలేదు. కానీ, అది నిజమైనదయితే, మనం చెయ్యగలిగితే కొంచం వెసలుబాటు చేసుకొని, కొంచం సర్ధుబాటు చేసుకొని ఒక చిరు సహాయాన్ని అందిస్తే బాగుంటుంది.  

`నేను చెప్పిన మాట వల్ల ఎవరో వొకరు స్పందిస్తారులే,` అనుకొంటే రాజుగారి పాలకుండలో నీళ్ళలాగ ఫలితం సున్నా అవుతుంది. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే - సహాయం చెయ్యడం ఉత్తమం, చెయ్యనని చెప్పడం లేదా చేసే అవకాశం లేక  ఊరుకోవడం మధ్యమం, చెయ్యగలిగి, ప్రగల్బాలతో సరిపెట్టడం అధమం. అలాగని నిజానిజాలు తెలుసుకోకుండా ప్రతీ అభ్యర్ధనకీ ప్రతిస్పందించవద్దు. అన్నింటిలో లాగానే ఇటువంటి సేవాకార్యక్రమాలలో కూడా మోసపూరితమైనవి ఉండవచ్చు. అపాత్రదానం నిరర్ధకం.   

ఈ టపాలో నానార్థాలు లేవు. చెయ్యగలిగి ఉన్నప్పుడు సహాయం చెయ్యమనే.
© Dantuluri Kishore Varma 

Monday 14 January 2013

ది ఎండ్ ఆఫ్ ద బిగినింగ్!

కాకినాడ బీచ్‌లో మూడురోజులు జరిగిన సాగర సంబరాలు 13వ తారీకున ముగిశాయి. సుమారు నాలుగు లక్షల మంది ఫెస్టివల్ కి వచ్చారని అంచనా. చివరిరోజే లక్షన్నర మంది వచ్చారు. బీచ్ వద్ద వన్ వే విధించి, వెళ్ళే వాహనాలని నేమాం, పండూరు మీదుగా పంపించినా, సాయంత్రం అయ్యేసరికి సూర్యారావు పేటలో ఉప్పుటేరుమీద ఉన్న ఇరుకు వంతెనమీద ట్రాఫిక్ జాం ఏర్పడింది. సాయంత్రం 5 గంటలనుంచీ ఇదే పరిస్థితి ఉంది. నాలుగయిదు గంటల పాటు సందర్శకులకి భయంకరమైన ట్రాఫిక్ సమస్య ఉక్కిరి బిక్కిరి చేసింది. వచ్చే సంవత్సరం నుంచి ఈ సంబరాలు ప్రతీ ఏడూ జరుగుతాయని, వచ్చే ఏడాది ఇప్పటిలా మూడురోజులు కాకుండా, వారంరోజులపాటు ఉంటాయని సభలకు వచ్చిన రాజకీయ ప్రముఖులు చెప్పారు. అంతే కాకుండా కాకినాడ బీచ్ పార్క్, శిల్పారామాలు అభివృద్ది చేస్తారని, బీచ్ రోడ్డు విస్తరణ జరిగి నాలుగు లైన్ల  ఏర్పాటుకు కృషి జరుగుతుందని చెప్పడం అందరినీ ఆనంద పరచింది. జిల్లా వాసులంతా బీచ్ ఫెస్టివల్‌ని చాలా మెచ్చుకోవడం కనిపించింది. ఇంతకాలానికి సినిమా కాకుండా మరొక వినోద కాలక్షేపం ఈ కార్యక్రమం వల్ల అందుబాటులోకి రావడం సంతోషకరమైన విషయంగా అందరూ ఒకే మాటగా చెపుతున్నారు. పర్యాటక పటంలో కాకినాడకు సముచిత స్థానం లభించబోవడం చాలా ఆనందపడవలసిన సంగతి.


ఆసక్తి ఉంటే సాగర సంబరాల గురించి రాసిన ముందరి పోస్టులు ఇక్కడ చదవండి:
1. సాగర సంబరాలు
2. పోటెత్తిన సంబరాలు 
3. శిల్పారామం 
4. ఓరిగామి, ఇకెబన, ముకిమోనో


© Dantuluri Kishore Varma

Sunday 13 January 2013

ఓరిగామి, ఇకెబన, ముకిమోనో

ఓరిగామి, ఇకెబన, ముకిమోనో అనే మూడు రకాలైన కళల గురించి ఈరోజు టపాయిద్దామని (కంగారు పడకండి. టపాయించడమంటే టపా రాయడమనే! - మాయా బజారు సినిమాలో చెప్పినట్టు, అసలు ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి) ఇలా మొదలుపెట్టాను. `టపాయించడం మాట సరే ఆ మూడు కళలు ఏమిటి?` అంటారా? కమింగ్!

కాగితాన్ని రకరకాలుగా మడతలుపెట్టి కళారూపాలుగా మలచడాన్ని ఓరిగామీ అంటారు. వర్షం వచ్చినప్పుడు చేసే కాగితంపడవలు, కాలేజీలో లెక్చరర్ని ఆటపట్టించాలనుకొన్నప్పుడు తయారుచేసి విసిరే రాకెట్లూ ఓరిగామీ లోకే వస్తాయి. మాచిన్నప్పుడయితే కాగితాన్ని ఒక పద్దతిలో మడతపెట్టి, పాత్రలాచేసి, దానిలో నీరుపోస్తే ఒక్క చుక్క కూడా క్రిందకి వొలికేది కాదు. హంసలు, బాతులు లాంటివి కూడా కొంతమంది తయారు చేసేవారు. జపాన్ భాషలో `కామి` అంటే కాగితం అట. `ఒరి` అంటే మడతపెట్టడం. అందుకే దీన్ని ఒరిగామి అని పిలుస్తారు. `అసలు జపాన్ మాటని ఎందుకు ఉపయోగించాలి?` అంటే, దానికీ ఒక కారణం ఉంది. ఆరేడు వందల ఏళ్ళ క్రితమే జపానులో కాగితంతో రకరకాల రూపాలు చేసినట్టు చారిత్రక, సాహిత్యపరమైన సాక్ష్యాలు ఉన్నాయట. అందుకే జపాన్ పదాన్నే వ్యవహరిస్తున్నారు. అసందర్భపు ప్రలాపంలాగ ఇక్కడ ఈ గోల ఎందుకని సందేహ పడుతున్నారు కదూ?  సందర్భం ఉంది. ఇదిగో ముందు ఈ ఫోటో చూడండి.  

బుద్ధిజం ఇండియాలో పుట్టి, చైనాకి వెళ్ళి అక్కడినుంచి జపానుకి కూడా పయనించింది. చైనా వాళ్ళకి ప్రకృతి ఆరాధన కొంచం ఎక్కువ. వాళ్ళ చిత్రలేఖనం, కవితలూ అవీ చూస్తే ఈ విషయం మనకి అర్థం అవుతుంది. బౌద్ధ మతంలో మరణించిన వారి ఆత్మలకు గౌరవ ప్రధంగా పూజాపీఠింమీద పువ్వులను అలంకరించే పద్దతి ఉందట. చైనావాళ్ళ ప్రకృతి ప్రేమ కలిసి, క్రమంగా ఇది ఒక కళగా రూపాంతరం చెందింది. క్రీస్తు శకం ఏడవ శతాభ్దంలో జపానులోని క్యోటో నగరంలో, ఇకెనోబో అనే ఒక సరస్సు ప్రక్కన ఉన్న దేవాలయ పూజారిగారు ఒకాయనకి ఈ పువ్వులు పేర్చడంలో చాలా అద్భుతమైన నైపుణ్యం ఉండేదట. ఆ చుట్టుప్రక్కల ఉండే మిగిలిన దేవాలయాల వాళ్ళు కూడా ఆయన దగ్గరకి వచ్చి, ఈ కళని నేర్చుకొంటూ, క్రమంగా సిద్దహస్థులు అవుతారు. ఇకెనోబో సరస్సు దగ్గర ప్రదేశంలో ఈ కళ వేళ్ళూనుకొంది కనుక ఆ మాటని కొంచం తారుమారు చేసి, పువ్వులు పేర్చే పద్దతిని ఇకెబన అని వ్యవహరించడం మొదలైందట.  ఇకెబనాలో కేవలం పువ్వులే కాకుండా, ఆకులని, కాండాల్నీ కూడా ఉపయోగించి అందమైన ఏర్పాటు చేస్తారు. స్టార్ హోటళ్ళ లాంజ్‌ల్లో, షాపుల విండోల్లో, ఇళ్ళ డ్రాయింగ్ రూముల్లో, సభావేధికల దగ్గరా మనకు కనిపించే పూల అమరిక ఇకెబనాలో ఒక భాగమే. మనిషిని యాంత్రిక జీవితపు వొత్తడులనుంచి కొంచెం మళ్ళించి, ప్రకృతి అందాలతో సేదతీర్చడమే ఈ కళ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.  ఇంకా చాలా ఫొటోలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

వంటకాలని గార్నిష్ చేసి వడ్డించడం మనవాళ్ళకి అలవాటే. తినేదాన్ని చక్కగా  అమర్చుకొంటే, కంటికి ఇంపుగా ఉంటుంది. నోరూరి, ఆకలి పెరుగుతుంది కూడా! గార్నిష్ చెయ్యడంలో పదార్ధాలమీద అవీ, ఇవీ చల్లడమే కాకుండా, కాయగూరలని అందంగా చెక్కి అమరుస్తారు. దీన్నే వెజిటబుల్ కార్వింగ్ అంటాం. ఇదికూడా చాలా వందల సంవత్సరాలక్రితం జపాన్‌లో ప్రారంభమైందట. అందుకే ముకిమోనో అనే జపాన్ పేరుతో వెజిటబుల్ కార్వింగ్‌ని వ్యవహరిస్తారు. ఇక్కడ ఇచ్చిన ఫోటో ఒక్కసారి చూడండి. ఇంకా చాలా వాటికోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి.

కాకినాడలో ఈ రోజుతో ముగిసిన సాగర సంబరాల్లో, బీచ్ దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో వీటిని ప్రదర్శించారు. జపాన్ పేర్లతో వాటిని వ్యవహరించలేదు కానీ, వాళ్ళు చేసినవి ఇవి మూడింటినే.

© Dantuluri Kishore Varma

Saturday 12 January 2013

శిల్పారామం

కాకినాడ బీచ్ రోడ్డులో శిల్పారామం పార్క్ ఈ రోజు  ప్రారంభించారు. సుమారు ఒక పాతిక శిల్పాలవరకూ ఏర్పాటు చేశారు. ఈ రకమైన శిల్ప కళా పరిచయం కాకినాడ వాసులకి బహుశా మొట్ట మొదటిది. శిల్పాలలో నాజూకుతనం, చెక్కడంలో శిల్పుల అనుభవం కనిపిస్తున్నాయి. అన్నింటిలో ఒకటి చాలా ప్రత్యేకంగా ఉంది. దానిని ఆబ్స్‌ట్రాక్ట్ స్కల్‌ప్చర్  అనచ్చునేమో! ధీర్ఘచతురశ్రాకారంలో ఉన్న ఒక రాతిమీద మూడు కోణాల నుంచీ ప్రక్క భుజాలమీదకు సూర్యుడు, చంద్రుడు, ఒక వృక్షం చెక్కి; నాలుగవ కోణం అలా వదిలి పెట్టారు.  బేస్‌లో కెరటాలు, జలచరాలు; చెట్టుకి పైన ఎగురుతున్న పక్షులు. రాతి పైన ఆకాశం వైపు చూస్తున్న వ్యక్తి ముఖం. ఈ శిల్పాన్ని చూస్తుంటే రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఎవరయినా ఈ థీం యొక్క తాత్పర్యం చెబితే బాగుండును. మీకు తెలిస్తే చెప్పరా, ప్లీజ్?


శిల్పారామం ఫోటోలు ఫ్లికర్ ఫోటో స్ట్రీం ద్వారా  మనకాకినాడ అభిమానులకోసం ఇక్కడ ఇస్తున్నాను.

© Dantuluri Kishore Varma

Friday 11 January 2013

పోటెత్తిన సంబరాలు

కాకినాడ సూర్యారావు పేట బీచ్‌లో సరదాల సందడి మొదలైంది. బీచ్ ఫెస్టివల్‌ కు వేలల్లో జనాలు తరలివచ్చారు. ముందు అనుకొన్నట్టుగానే ముఖ్యమంత్రి, ఇతరమంత్రులు, ప్రజా ప్రతినిధులు పెద్దసంఖ్యలో వచ్చి సాగర సంబరాలని ప్రారంభించారు. పట్టణం ఎక్కడికక్కడ నిర్మించిన స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలు, గోడలమీద చిత్రకారులతో గీయించిన తూర్పుగోదావరి జిల్లా సంస్కృతీ, జీవనవిధానం, జీవవైవిధ్యం మొదలైన విశేషాలను తెలియజేసే అందమైన చిత్రాలు, ఓవర్ బ్రిడ్జీలమీద ఇరువైపులా ఏర్పాటు చేసిన మొక్కలతో పండుగ శోభతో కళకళ లాడింది.
బైకుల్లో, కారుల్లో, ఆటోల్లో వచ్చిన ప్రజలు వాకలపూడి లైట్ హౌస్‌కు దగ్గరలో వాహనాలని పార్క్ చేసుకొని సుమారు ఒకకిలోమీటరు దూరంలో ఉన్న ఫెస్టివల్ దగ్గరకి నడచి వెళ్ళారు. స్వాగత ద్వారం దాటిన వెంటనే ఇరువైపులా నర్సరీ స్టాల్స్ ఏర్పాటు చేసారు. నర్సరీ వాళ్ళు పెట్టిన స్టాల్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎదురుగా అన్నవరం సత్యదేవుని నమూనా దేవాలయం. దానికి సమీపంలోనే తుర్పుగోదావరిజిల్లా ప్రముఖ దేవాలయాల స్టాల్ ఏర్పాటుచేసి ప్రసాదాలు అమ్ముతున్నారు.
ఉత్తరంవైపు పెద్ద సభాస్థలిని నిర్మించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కూర్చుని వీక్షించడానికి అనువుగా కుర్చీలు వేసారు. ఉదయం నుంచి సాయంత్రంవరకూ విద్యార్ధుల కార్యక్రమాలూ, సాయంత్రం నుంచి ప్రఖ్యాత కళాకారుల సంగీత, వినోద కార్యక్రమాలు ఉంటాయి.
సంబరాలు జరుగుతున్న బీచ్ ఏరియా అంతా విద్యుత్ లైట్లు ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఫ్లడ్‌లైట్లకి దగ్గరగా ఇసుకలో ప్రఖ్యాత సైకత శిల్పి పట్నాయక్ చేసిన సేవ్ ద సీ శిల్పం, కాకినాడ వాటర్‌వర్క్స్ లో పనిచేస్తున్న సానా వెంకట రమణ చేసిన సేవ్ విమెన్ ఇసుక శిల్పాలు చాలా బాగున్నాయి. 
ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి. చాట్, బిర్యానీ, బొంగులో చికెన్, స్వగృహా ఫుడ్స్ మొదలన స్టాల్స్ ధక్షిణం వైపు వరుసగా ఏర్పాటు చేశారు. T.కొట్టాం బొమ్మల స్టాల్, పశు సంవర్ధక శాక స్టాల్, తోలుబొమ్మల స్టాల్స్ బాగున్నాయి.    చూడటానికి సాధారణంగా కనిపించే ఒక చిన్న తోలుబొమ్మ ధర ఆరువందల రూపాయలట!
గంగిరెద్దులవాళ్ళు, రకరకాల వేషదారులు, జానపద కళాకారులు, బీచ్ ప్రాంతం అంతా తిరుగుతూ సందడి చేస్తున్నారు. 
శాశ్వత ప్రాతిపదికన 30, 40 ఎకరాల స్థలంలో బీచ్ పార్క్ నిర్మిస్తాం అని ముఖ్యమంత్రి ప్రకటించడం అందరికీ నచ్చిన విషయం. ఇక ముందు కాకినాడ సాగరతీరానికి పర్యాటక హంగులు జతకూడడం జిల్లా వాసులందరికీ సంతోషకరమైన వార్త. ఇప్పటి వరకూ మనవూరి సాగరతీరం సరయిన సౌకర్యాలులేక నామమాత్రపు ఆకర్షణగా మిగిలిపోయింది. ఇప్పటి నుంచి విశాఖ సాగరతీరంలా ఇది కూడా ముఖ్యమైన పర్యాటక ప్రాంతం అవుతుందని ఆశిద్దాం . మీరు నిన్న ఈ సంబరాలకి వెళ్ళి ఉండక పోతే, ఈ రోజో, రేపో ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్ళగలిగేటంత దగ్గరలో లేకపోతే కనీసం వచ్చే సంవత్సరానికయినా సందర్శించే వీలు చేసుకోండి. 

© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!