Pages

Thursday 28 February 2013

సాంప్రదాయాలని గౌరవించాలి కదా?

ఓ ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. అన్నదమ్ములకంటే కూడా స్నేహితులుగా కలిసిమెలిసి ఉండే రకం వాళ్ళు. చదువులు పూర్తయిన తరువాత వేరే, వేరే రాష్ట్రాలలో ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఒకరిని ఒకరు బాగా మిస్సవుతున్నారు. ఈ ఊళ్ళో ఉన్న ఆయనకి కొంచం మందు సరదా ఉంది. రోజూ సాయంత్రం బారుకెళ్ళి మూడు పెగ్గులు ఒకేసారి ఆర్డరిచ్చి, చక్కగా చీర్స్ చెప్పేసుకొని మూడూ గొంతులో పోసేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. `ఏమండీ, మూడు ఒకేసారి ఏమిటి?` అని ఎవరయినా కుతూహలం కొద్దీ అడిగితే, `దూరంగా ఉన్న ఇద్దరు సోదరులతో కలసి పుచ్చుకోవడం కుదరదు కనుక, వాళ్ళ బదులు కూడా నేనే లాగించేస్తున్నా. ఇదిగో ఈ పెగ్గు మా అన్నయ్యది, ఇది మా తమ్ముడిది, ఈ మూడోది నాది,` అని చెప్పేవాడు. రోజూ చూసేవాళ్ళకి అది అలవాటయిపోయింది. కొన్నిరోజులు అలా గడిచిన తరువాత ఒకసారి ఆ పెద్దమనిషి పది రోజులు పాటు బారుకి రావడం మానేసాడు.

తిరిగి వస్తూనే కొంచం నీరసంగా కనిపించాడు. గెడ్డం మాసిపోయి ఉంది. రెండు పెగ్గులకే ఆర్డరిచ్చాడు. చూస్తున్నవాళ్ళకి గుండె పట్టేసినట్టు అయ్యింది. ఉత్సాహంగా చీర్స్ చెప్పుకొనే ఆయన కళ్ళల్లో ఆరోజు ఎందుకో విషాదం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏమయ్యి ఉంటుందో సులభంగానే ఊహించగలిగారు. నెమ్మదిగా లేచి అతని దగ్గరకి వెళ్ళారు. భుజం మీద ఓదార్పుగా చేతులు వేసి, `బాధపడకండి, మీ సోదరుడికి అకస్మాత్తుగా అలా అవ్వడం చాలా విచారించవలసిన విషయం,` అని ముక్త కంఠంతో సంతాపాన్ని తెలియజేసారు.

వింటున్నాయన ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు, `భలే మనుషులండీ మీరు. మావాళ్ళ కేమీ అవ్వలేదు. కష్టమంతా నాదే! ఇప్పుడే ఫోనులో మాట్లాడి వస్తున్నాను. ప్రొద్దుట, మద్యాహ్నం, సాయంత్రం సుబ్బరంగా లాగించారట. నేనే ఉపవాసం ఈ రోజు. సాంప్రదాయాలని గౌరవించాలి కదా? అందుకే నాది మానేసి, వాళ్ళ మటుకే రెండు తెప్పించుకొన్నాను,` అన్నాడు తాపీగా.  

(ఎవరో చెప్పారు దీనిని. కొంచం కథనం జోడించి సరదాకి ఇలా...)

 © Dantuluri Kishore Varma 

Wednesday 27 February 2013

సక్సెస్ సూత్రాలు

ఈ రోజు వేస్తున్న మొదటి అడుగు విజయాల బాటన పడాలంటే, జీవితంలో చేపట్టబోయే ప్రతీపనికీ ఈ విజయం స్పూర్తి అందించాలంటే కీలకమైన సక్సెస్ సూత్రాలు ఎనిమిదీ ఏమిటో తెలుసుకోవాలి. జ్ఞాపకం పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందని వీటిని ఇంగ్లీష్ అక్షరాలు మొదటి ఎనిమిదింటిలోనూ(A-H) క్రోడీకరించి ఇవ్వడం జరుగుతుంది.
వెనుక నుంచి ముందుకు వద్దాం. 

మొట్టమొదటిది నిజాయితీ(Honesty). మన మాటల్లో, చేతల్లో నిజాయితీ మనల్ని నమ్మదగే వ్యక్తులుగా చేస్తుంది. వ్యక్తిగతమైన, వ్యాపారాత్మకమైన సంబంధాలు కేవలం నమ్మదగిన వ్యక్తులతోనే కదా ఎవరైనా నెరిపేది? ఎక్కువ మందితో నెట్‌వర్కింగ్ విజయానికి దగ్గర దారి అని వ్యక్తిత్వ వికాశ నిపుణులు ముక్త కంఠంతో చెపుతారు.

మనం ఈ రోజు ఇలా ఉన్నాం అంటే దానికి కారణం మనం ఒక్కరమే కాదు. తల్లితండ్రులు జన్మనిచ్చి, జీవితంలో మొదటి పాఠాలు నేర్పిస్తే, గురువులు విజ్ఞానాన్ని అందిస్తారు. స్నేహితులు సంఘంలో స్నేహపాత్రంగా మెలగడానికి అవసరమైన సోషల్ స్కిల్స్‌ని వృద్ది చేసుకోవడానికి సహాయపడతారు. ఇంకా ఇరుగుపొరుగువాళ్ళు, బందువులు, పరిచయస్తులు, మనకి దూరంగా ఉన్నా వారి వారి రచనలతో, సినిమాలతో సృజనాత్మకమైన పనులతో ప్రభావితం చేసే వాళ్ళు అందరూ మనల్ని ఇప్పటి మనంగా తయారుచేసిన శిల్పులు. కాబట్టి `నేను` అనే అహాన్ని వదిలిపెట్టి  `అందరువల్లా నేను`  అనే  భావాన్ని(Gratefulness/Gratitude) అలవరచుకోవాలి. 

చీకటి ఉండడం వల్లే వెలుగు యొక్క అవసరం తెలుస్తుంది. కష్టాల వల్ల సుఖాల యొక్క సౌఖ్యం అర్థమౌతుంది. అలాగే అపజయాలని(Failure) ఎదుర్కొన్నప్పుడు, విజయం సాధించాలన్న కాంక్ష రెట్టింపవుతుంది. ఏ అపజయం చివరిది కాదు - తరువాత అందుకోబోయే విజయానికి మొదటి మెట్టు. కాబట్టి ఫెయిల్యూర్‌కి, సక్సెస్‌లో ప్రాధాన భూమిక ఉంది.      

సంవత్సరం కష్టపడి చదివితే ఒక క్లాస్ పూర్తవుతుంది. ఏడాది పాటు చదవడం కాలినడక లాంటిదయితే, ఫలితం గమ్యస్థానం. `ర్యాంక్ చూసుకొని ఆనందపడదాం,` అని ప్రతీరోజూ తప్పని సరి కార్యక్రమంలా నిరుత్సాహంతో చదివితే సమయాన్ని ప్రయాణంలోనే పాడుచేసుకొన్నట్టే. ఏ పని అయినా, దానిలో ఆసక్తి, ఉత్సాహం(Enthusiasm) పెంచుకొని కొనసాగిస్తే ప్రతీఅడుగునీ ఆస్వాదిస్తూ ముందుకి సాగవచ్చు. 

ఉత్తములు, మధ్యము, అధములు అని మనుష్యులని మూడ రకాలుగా విభజిస్తే - ఏ పనైనా అస్సలు ప్రారంభించని వాళ్ళు అధములు, మధ్యలో విడిచి పెట్టే వాళ్ళు మధ్యములు, నిబద్దతతో కొనసాగించి విజయం సాధించే వాళ్ళు ఉత్తములు. విజేతలని సామాన్యుల నుంచి వేరు చేసే ముఖ్యమైన లక్షణం నిబద్దత  (Dedication and determination).

ఏదో సినిమాలో హీరోకి అందరిలాగా ఉద్యోగం చెయ్యడం ఇష్టం ఉండదు. రొటీన్‌గా చేసే దానిలో కిక్ ఉండదని, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి చెప్పి మరీ దొంగతనాలు చేస్తుంటాడు. ప్రతీ రోజూ ఒక చాలెంజ్ కావాలి. చాలెంజ్ కోసం, కిక్ కోసం దొంగతనాలు చెయ్యమని కాదు కానీ; జీవిత ప్రయాణంలో ఎదురయ్యే అవరోదాలని చూసి అధైర్య పడకుండా, వాటిని సవాళ్ళు(Challenge)గా తీసుకొని అధిగమించాలి.   

బూమరాంగ్(Boomerang) అనే మాటని వినే ఉంటారు. ఇంగ్లీష్ అక్షరం వి ఆకారంలో ఉండే చెక్క. దీనిని ఆయుదంగా వాడతారు. గురి చూసి విసిరితే లక్ష్యాన్ని కొట్టి వెనుకకి తిరిగి వస్తుంది. ఇతరుల గురించి మన మాటలు, చేతలూ కూడా బూమరాంగ్ లాంటివే. మంచి మాట్లాడి, మంచి చేస్తే అదే తిరిగి వస్తుంది. చెడు అయితే చెడునే పొందుతాం. ఎవరో అంటారు - Treat others the way you would like them to treat you  అని. అందుకే బూమరాంగ్‌ని జ్ఞాపకం ఉంచుకొని ఇతరుల పట్ల మన ప్రవర్తనని మెరుగు పరచుకోవాలి.

అన్ని దినుసులూ చక్కగా వేసి వండిన కూరలో చిటికెడు ఉప్పు వెయ్యకపోతే ఎలా ఉంటుందో, విజయానికి కావలసిన లక్షణాలు, అవకాశాలూ అన్నీ ఉన్నా సరైన దృక్పదం లేకపోతే శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. దృక్పదం అంటే మన దృష్టి కోణం. ఒకే బాల్కనీ నుంచి ఒకరు బురదని చూసి పరిసరాలని తిట్టుకొంటే, ఇంకొకరు ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలని చూడవచ్చు. మనం ఉండే చోటుని మార్చలేనప్పుడు, రెండవ విధానమే అభిలషణీయం కదా? దీనినే ఆటిట్యూడ్(Attitude) అంటారు. ఆటిట్యూడ్‌కి ఒక ప్రత్యేకత ఉంది. ఇంగ్లీష్ అక్షరాలలో మొదటిది A, 20వది T .. అలా ఈ పదంలో అన్ని అక్షరాలకీ వాటి క్రమంలో విలువలు ఇస్తూ పోతే(1+20+20+9+20+21+4+5) వాటన్నింటి మొత్తం 100 కి సమానం అవుతుంది.  మనకి సరైన దృక్పదం ఉంటే 100 శాతం విజయం సాధించినట్టే.    

Attitude
Boomerang behaviour
Challenges
Determination and dedication
Enthusiasm
Failure
Gratefulness
Honesty 

- ఈ ఎనిమిదీ కలిస్తే విజయం.

(ఈ టపా చదివిన తరువాత మీకు ఒక సందేహం రావచ్చు. కేవలం ఎనిమిది అక్షరాలలోనే ఎందుకు ఈ సూత్రాలని ఇరికించారు అని. మా స్కూల్ ప్రారంభించి నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఈ సంవత్సరం మొట్టమొదటి బ్యాచ్ పదవతరగతి పబ్లిక్ ఎక్జాంస్‌కి వెళుతుంది. ఈ రోజు వాళ్ళకి ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. బ్యాచ్‌లో ఎనిమిది మంది ఉన్నారు. ఎనిమిది మంది మిత్రుల్లాగ ఈ ఎనిమిది అంశాలని గుర్తుపెట్టుకోమని చెపుతూ వాళ్ళకి శుభాశీస్సులు అందించడం జరిగింది. అదండీ విషయం. మీరు కూడా వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేయండి).

© Dantuluri Kishore Varma 

Saturday 23 February 2013

పాండవుల మెట్ట

కాకినాడకి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దాపురంలో పాండవుల మెట్ట ఉంది. మెట్ట అంటే ఒక చిన్నికొండ. పాండవులు మాయా జ్యూదంలో ఓడిన తరువాత, అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఈ కొండమీద కొన్నిరోజులు ఉన్నారని చెపుతారు. 
కొండపైకి సుమారు వంద మెట్లు ఉన్నాయి. వాహనాలమీద వెళ్ళేవారు కొంత ఎత్త్తు వరకూ కొండపైకి వేసిన కంకర రోడ్డు ద్వారా వెళ్ళ వచ్చు. అక్కడినుంచి కేవలం ఇరవై, ముప్పై మెట్లు ఎక్కి పైకి చేరుకోవచ్చు. 

కొండమీద ప్రధానమైన ఆకర్షణ సహజంగా ఏర్పడ్డ గుహ. ఇక్కడినుంచి రాజమండ్రీ గోదావరి నది వరకూ సొరంగ మార్గం ఉందని చెపుతారు. రోజూ పాండవులు ఈ మార్గంద్వారానే నదీ స్నానానికి వెళ్ళేవారట! అన్నట్టు, పెద్దాపురం నుంచి రాజమండ్రీ 45కిలోమీటర్ల దూరంలో ఉంది. గుహనిండా గబ్బిలాల వాసన. కొన్ని అడుగులు దాటి ముందుకు పోలేం ఇప్పుడు మనం.   
1952లో నిర్మించిన సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. ఆలయ ప్రాంగణంలో దీనితోపాటు శివాలయం, విష్ణాలయం, చంద్రాలయం లాంటి మరికొన్ని ఉపదేవాలయాలు ఉన్నయి. 
దేవాలయానికి వెనుకవైపు ఒక రాయి పైన భీముని పాదాలు, గధ ముద్రలు ఉన్నాయి.
పాండవులమెట్ట మీదనుంచు క్రిందికి చూస్తే అందమైన ప్రకృతి దృశ్యాలు, కొండదారులు, బొమ్మల్లా కదిలిపోయే సమీపంలో రోడ్డుమీద మనుష్యులు, వాహనాలు, కనువిందు చేస్తాయి.

© Dantuluri Kishore Varma

Saturday 16 February 2013

కాకినాడ బీచ్‌ - Picturesque beach of our little town

మనగ్రహమ్మీద 
మొత్తమంతా నీరే ఉండేది. 
క్రమంగా ఆ నీటిని వెనక్కి తోస్తూ 
నేల ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకోవడం మొదలైంది. 
జనావాసాలు ప్రారంభమయ్యాయి. 
వెనక్కి తోయబడిన సముద్రం... 
తిరిగి తనచోటుని  దక్కించుకోవడానికి ఉగ్రంగా ఉరుకులెత్తుకొని వచ్చి విరిగి పడుతుంది. 
నిరంతరంగా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తుంది. 
దానికి అలుపులేదు, విశ్రాంతీలేదు. 
తొడలు చరుస్తుంది, గుండెలుబాదుకొంటుంది. 
ఎప్పటికైనా విజయం సాధిస్తుందా? 
*     *     *
కాకినాడ సముద్రం ఎలా ఉంటుందో చెప్పాలా? పట్టణ ప్రజలు సాధారణంగ వీకెండ్స్‌లో గడిపే సముద్రపు ఒడ్డున ఆ కొంతముక్కనే బీచ్‌గా భావిస్తే, నిరాశే మిగులుతుంది. అదిదాటి తీరం పట్టుకొని కొంచం ముందుకు వెళితే మనసు చెదిరే అందాన్ని ఆస్వాదించవచ్చు. ఆకాశం, సముద్రం కలిసే క్షితిజరేఖవద్ద ద్వీపంలాంటి హోప్ ఐలేండ్, నిలిచి ఉన్న షిప్పులు. నీలి సముద్రం మీదనుంచి అలుపెరుగకుండా తెల్లని నురుగులు నింపుకొని దొర్లుకొంటూ వస్తున్న కెరటాలు. సముద్రం నుంచి నేల వైపు చూస్తే గుబురుగా పెరిగిన సర్వీతోట, లైట్ హౌస్. కిలో మీటర్ల కొద్దీ వ్యాపించినట్టు కనిపిస్తున్న తీరం, ముఖ్యంగా కెరటాలు వచ్చి తాకుతున్న తడి ఇసుక, దానిమీద లంగరువేసి ఉన్న నావలు. తనివి తీరని అందాల్ని మాటల్లో వర్ణించాలంటే, ఎవరి గురించో చెప్పలేనుకానీ, నాకు మాత్రం సాధ్యంకాదు. కళ్ళు చెదిరే బీచ్ అందాల్ని అనిల్ తన ఏడు నిమిషాల షార్ట్ ఫిలింలో అద్భుతంగా బంధించాడు. కాకినాడ బీచ్ అందాల్ని మీరుకూడా చూసి ఆనందించండి.

A beach is a beach anywhere on this earth.  But I can say, ours is the most beautiful one. The utmost beauty  may not lie in the panorama of the coastal line, but in the beholders` eyes.  Especially when the person is someone like me, who is passionately attached to his/her native place.  We, people of our town usually go to the beach during week ends. Since the town does not lie on the very edge  of the beach, we need to travel around five to six kilometers to get there.

Though the coast line from north to south appears to be stretching from horizon to horizon, people picnic at an area hardly extending to one kilometer.   All kinds of thing are littered around, making the beach literally a kind of dustbin. When you attempt to swim in the beach, you might be tickled by flotsam like polythene bags, twigs, bottle caps, disposable plates, glasses and thrown away plastic water bottles.  Disgusting! you might feel. But, wait!  I think this kind of situation can be seen at any picnic spot to where the people frequent. Now, I would like to show you the other side of the coin.

Want to explore  things? We need to walk a little from all these mundane things.  Farther away from this there is a sea of change. We will be surprised to notice clean beach, foamy rolling waves constantly kissing the wet sand. At the far end where the skyline touches the sea, there is a small island, which we call hope island. It is a natural boon to the people here. Kakinada is shielded from violent cyclones and tsunamis by this small island. Cargo ships are seen anchored in the sea along side this island, as ours is one of the important port cities in the country. Looking from the beach onto the land, one can distinctly notice towering Vakalapudi  light house.   It is flanked on both sides by thick  plantations.  Fishermen`s boats are scattered and anchored on sand dunes.

boat

Experiencing the cool breeze from the sea, stroll along the coast line as far as you can. As you step forward thousands of small crabs scurry away and quickly disappear into their  small holes in the sand. Fisher men are often found working unmindful of the picnickers.

One look at all this is enough to appreciate the beauty. Recently, one of my buddies has made a short film taking the beach as background. It is about an unsuccessful love story.  Let us not bother about the story of the film, but I would like you to watch it to appreciate the scenic beauty of our beach. He used  a  still camera with shooting option in it to capture the nature`s charm. It scarcely  took him six hours to shoot and two more days to edit and get it ready. The duration of the video is seven minutes. I am certain you won`t feel bad for having spent your valuable time,  after watching it.

© Dantuluri Kishore Varma 

Thursday 14 February 2013

అమ్మ బొమ్మ

నెమోనిక్స్(mnemonics) అనే శాస్త్రం గురించి వినే ఉంటారు. ఏదయినా విషయాన్ని జ్ఞాపకంపెట్టుకోవడానికి ఉపయోగించే గుర్తులకి సంబందించినది. కొంచం సులభంగా చెప్పాలంటే ఇంద్రదనస్సులోని ఏడురంగులనీ అదే వరసలో గుర్తించుకోవడానికి VIBGYOR అనే మాట ఉపయోగిస్తున్నాం కదా? తొమ్మిది గ్రహాల పేర్లనీ గుర్తు పెట్టుకోవడానికి ఒకాయన చాల సులభమైన పద్దతి కనిపెట్టాడు. My Very Easy Method; Just Set Up Nine Planets అని. ఈ వాఖ్యంలో ప్రతీ మాట యొక్క మొదటి అక్షరం ఒక్కో గ్రహాన్ని సూచిస్తుంది - Mercury, Venus, Earth,  Mars, Jupiter, Saturn, Uranus, Neptune, Pluto అని. 

ఒక కుర్రోడికి గణితంలో రెండు చిక్కులు వచ్చాయి. మొదటిది, అందరికి లాగానే ఆల్జీబ్రా గుండె గాబరా. రెండవది, అర్థమెటిక్ స్పెల్లింగే రావడం లేదు సరిగ్గా. `వందసార్లు ఇంపోజిషన్ ఇచ్చాను అయినా  మధ్యలో ఐ ఒదిలేసి చస్తావేరా బడుద్దాయ్,` అని లెక్కల మాష్టారు తెగ తిడుతుంటే బిక్కమొహం వేస్తున్నాడు. చుట్టం చూపుగా వచ్చిన మావయ్య ఒక కిటుకు చెప్పాడు A Rat In The House May Eat The Ice Cream అని. బుర్రలో బల్బు వెలిగింది. వాఖ్యాన్ని నాలుగు సార్లు చదువుకొని క్విక్ ఫిక్స్ లాగ మెదడులో అంతికించేసుకోవచ్చు. `మరి ఆల్జీబ్రా అంటే భయం పోయేదెలా? దానికి ఇంకా సులువైన మార్గం చెప్పు,` అన్నాడు. `ఓ దానికేం భాగ్యం. తప్పనిసరిగా. ఆల్జీబ్రానే కాదు, జీవితంలో దేన్ని సాధించడానికైనా, ఒకే ఒక సులభమైన మంత్రం ఉంది. అది రోజూ ఆచరిస్తుంటే కొండయినా కదలి రావలసిందే,` అన్నాడు. `చెప్పు, చెప్పు తొందరగా,` అంటున్నాడు. నేర్చుకోవాలనే ఉత్సాహాం ఒక బీజంలా మనసులో నాటుకొంది. సరైన దిశా నిర్దేశం చేస్తే అది ఒక మహా వృక్షంలా ఎదుగుతుంది. పెదవులమీద ధరహాసం  మెరుస్తూ ఉండగా మావయ్య చెప్పాడు, `Practice makes a man perfect - ఇదే ఆ మంత్రం. అన్నీ చిట్కాలతో సాధించడం కుదరదు. కష్టపడి పనిచేసినప్పుడే ఫలితం ఉంటుంది. రోజూ అభ్యాసం చెయ్యి. భయం దూరంగా పారిపోతుంది. విజయం చేతులు చాచి నీ వైపు పరిగెత్తుకొని వస్తుంది.`

భాషకి లిపిని ఏర్పాటు చేసే వరకూ సంక్లిష్టమైన శ్లోకాల రూపంలో ఉన్న మన విజ్ఞాన సంపదని ఔపోసన పట్టి, మౌఖికంగా తరతరాలకూ అందించిన మహా పురుషులకి కూడా అభ్యాసంతో పాటూ, ఇటువంటి జ్ఞాపకం పెట్టుకొనే చిట్కాలు కూడా ఉండేఉంటాయి. పండితులు గుర్తుపెట్టుకొనే విధం ఒకలా ఉంటే, పామరులది మరొక పద్ధతి. క్లిష్టత లేని లలితమైన పదాలతో పాటలుగా అందిస్తే, బొమ్మల్లో చూపిస్తే మరుపన్నదే రాదు. జానపదుల బుర్రల్లో రామయణ, భారతాలు ఈ రకంగానే శాశ్వతంగా నిలిచిపోతాయి.

ఎవరైనా ఎప్పటికప్పుడు నేర్చుకోక తప్పదు. పెరిగే విజ్ఞానం తోపాటూ, విజయావకాశాలు మెరుగవుతూ ఉంటాయి. చదవడం, వినడం, చూడడంద్వారా అర్థంచేసుకొన్న విషయాలని మెదడులో నిక్షిప్తం చేసుకోవడానికి ధారణ, జ్ఞాపకశక్తి చిహ్నాలూ ఉపయోగించుకోవాలి. అవసరమైనవాటిని సరైన సమయంలో వ్యక్తీకరించగలగడం చాలా ప్రధానమైన విజయ సూత్రం. అందుకే భాషమీద పట్టు సాధించాలి. దీనినే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నాం. చదువుకోసమే చదువు కాదు. మంచి, చెడు విచక్షణ ఉండాలి. హంస పాలనీ నీళ్ళనీ వేరుచెయ్య గలిగినట్టు చెడునుంచి మంచిని వేరుచేసుకొని పొందడానికి ఆధ్యాత్మిక కోణం కావాలి. అడవి ద్వారా ప్రయాణిస్తున్న బాటసారి, దారిలో కనిపించిన పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలిని చూసి పరవశించి పోతే, సమయం గడచిపోయి చీకటిలో దిక్కుతోచక కష్టపడవలసి వస్తుంది. అలాగే, ఆకర్షణలకి దాసోహం అంటే బ్రతుకులో అజ్ఞానాంధకారం మిగులుతుంది.   

- ఈ పేరా చదువుతుంటే లెక్చరు విన్నట్టుగా, బోరుకొట్టింది కదా? కానీ సక్సెస్ కావాలంటే ఇవన్నీ ఇంగ్రేడియంట్స్. వీటిని గుర్తుపెట్టుకోవాలి. కష్టం అంటారా? అయితే మీకోసం ఒక అమ్మ బొమ్మ ఇస్తున్నాను. కళ్ళతో చూసి, మనసులో నిలుపుకోండి. 
1. నలుపు అజ్ఞానానికి చిహ్నం. తెలుపు అంటే జ్ఞానం. అందుకే తెల్లటి వస్త్రాలు ధరించి ఉంది. 

2. కాళ్ళదగ్గర హంసలు, వెనుక నెమలి ఉన్నాయి. ఆకర్షణల్లో పడకుండా, విచక్షణతో మెలగమని అర్థం. 

3. అమ్మకు నాలుగు చేతులు ఉన్నాయి. రెండు చేతుల్లో వీణ- కళలకు గుర్తు. ఒకచేతిలో పుస్తకం, ఇంకొక దానిలో జపమాల - విలువలు లేని విద్య, ఆధ్యాత్మిక కోణం లేని చదువు నిరర్థకం. 

4. ఆమె పేరు వాగ్దేవి - వాక్కును ప్రసాదించేది అని. సరస్వతి అని మరొక పేరు ఉంది. సరస్వతి అంటే ప్రవహించేది అని. వాక్కుని ప్రవహించేలా చేసే శక్తి ఆమెకు ఉంది. గాడెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ కమ్యూనికేషన్.

మన పెద్దవాళ్ళు విజయానికి కావలసిన మూలకాలేమిటో పట్టిక తయారు చేసి ఇవ్వకుండా, అమ్మ బొమ్మలో మలచి ఒక నెమోనిక్ లాగ మనకి ఇచ్చారు. రోజూ నమస్కారం చేసుకొంటూ, వాగ్దేవిని మనసులో నిలుపుకొంటే, మనం చెయ్యాల్సినది ఏమిటో అవగతమౌతుంది.

శ్రీ పంచమి శుభాకాంక్షలు.
© Dantuluri Kishore Varma 

Wednesday 13 February 2013

న్యూస్ పేపర్లో మనకాకినాడలో బ్లాగ్ నుంచి ఆర్టికల్

My article about Koringa forest appeared in Surya News Paper.  The original article was written in this blog.

Dantuluri Kishore Varma

చేపలు దొరకాల, జేబులు నిండాల

హైలెస్సా, హైలెస్సా అని పాట పాడుతుంటే వినేవాళ్ళకి పిల్ల కెరటాల మీద చల్లగా వెళుతున్న పడవ ఊపు అనుభూతి కొస్తుంది. ఒడ్డునుండి ఆస్వాదిస్తే అది ఆహ్లాదం కలిగించే జానపదం, కనిపించని ఒడ్డుని, దూరంగా ఉన్న ఇంటిని, ఎంతకీ గడవని కాలాన్ని అనుభవిస్తూ పాడుకొంటే అది జీవన పధం.
హైలెస్సా అని పాడే మత్యకారుల పాటల్లో  విరహం అంతర్లీనంగా ఉంటుందని ఎవరో అంటారు. ఎన్నిరోజులయ్యిందో ప్రియురాలినో, ఇల్లాలినో విడిచి వచ్చి! తనకు తెలిసున్న నావ, తెరచాప, తెడ్డు, సముద్రం, ఆకాశం అనే నాలుగయిదు మాటలూ ఉపయోగించి బాధనంతా వెళ్ళబొసుకొంటారు. జంట పడవలుగా సాగాల్సిన జీవితం పొట్ట కూటి కోసం ఒంటి పడవలా అయిపోయింది. ముసలితల్లి ఎలా ఉందో అని బెంగ, చిన్ని కూతురిని చూడాలనే తహతహ. పొద్దెప్పుడు పోతుందో? వల ఎప్పుడు బరువెక్కుతుందో?? 
ఇంటికి దూరంగా ఉన్నప్పుడు కలిగే విషాదాన్ని హకిల్ బరీ ఫిన్ నవలలో ఒక సన్నివేశం ద్వారా మార్క్ ట్వెయిన్ మనసు పిండేలా చూపిస్తాడు. హక్, జిం ఇద్దరూ లాంచీలో నదిమీద వెళుతూ ఉంటారు. అప్పుడు, జింకి తన కూతురు జ్ఞాపకం వస్తుంది. ఒకరోజు జిం ఇంటిదగ్గర ఉన్నప్పుడు ఏదో పుస్తకం చదువుకొంటూ ఉంటాడు. కూతురు దగ్గరకి వస్తుంది. ఏదో పని పురమాయిస్తాడు. ఆమె కదలకుండా, నవ్వుతూ తండ్రి వైపు చూస్తూ నిలబడి ఉంటుంది. తన మాటని లక్ష్య పెట్ట లేదని కోపంతో ఆ అమ్మాయి చెంప మీద కొడతాడు. అప్పుడే గాలికి వెనుక ఉన్న తలుపు పెద్ద చప్పుడుతో మూసుకొంటుంది. కానీ,ఆమె ఏమీ గమనించదు. జింకి కూతురి వినికిడి శక్తి మీద అనుమానం వస్తుంది. చెక్ చేస్తాడు. అతని సందేహం నిజమే ఆమెకి ఏమీ వినిపించడం లేదు. కొన్నిరోజులకి ముందు వచ్చిన తీవ్రమైన జ్వరం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని తెలుసుకొంటాడు. క్షణికావేశంలో చిన్నిపిల్ల అని కూడా చూడకుండా కొట్టినందుకు, ఆమెని గుండెలకి హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తాడు. లాంచీ మీద తన సహచరుడు హక్ కి ఈ సందర్భాన్ని చెపుతూ కన్నీరు మున్నీరవుతాడు. చదువుతున్న మనకి కూడా గుండె బరువెక్కుతుంది. 
ఎండ, మంచు, చలి, వర్షం ఏమయినా పడవ వేటకి వెళ్ళవలసిందే. కడలి ఎప్పుడూ గంగమ్మ తల్లే! కానీ, నడి సముద్రంలో ఉన్నప్పుడు చెప్పకుండా వచ్చే తుఫాను, ఉప్పెనలు బ్రతుకు నావను ఏ ఒడ్డుకు చేరుస్తాయో! ఈదురుగాలులు, చిరుజల్లులు తుఫాను హెచ్చరికల్ని చేస్తుంటే సాయంత్రానికి తిరిగి రావలసిన నావలకోసం ఇంటిల్లిపాదీ గుండెలు అరచేత పట్టుకొని ఎంతగా ఎదురు చూస్తారో!  
అలాగని అప్పుడప్పుడూ వచ్చే కష్టాలని భయపడి బంగారం లాంటి మత్యసంపదని ఒదిలి పెట్టుకొంటారా? ఎప్పటికీ కాదు! వలనిండి, వొడ్డుమీదకి చేరిస్తే పంటపండినట్టే. 
రకరకాల చేపలు. వాటిని అన్నింటిని ముందుగా వేరు చేసుకోవాలి. అప్పుడప్పుడు అరుదుగా లభించే రకాలు దొరికాయంటే ఎగబడి కొనుక్కొని వెళ్ళే జనాలు మార్కెట్‌లో ఎప్పుడూ ఉంటారు. రూపాయలతో జేబు నిండవలసిందే. 
కాకినాడలో సముద్ర తీరం ఉన్నందువల్ల, బీచ్‌కి వెళ్ళినప్పుడు కనిపించే మత్యకార జీవన విధానం ఫొటోలలో బంధించి మనకాకినాడలో బ్లాగ్ మిత్రులకోసం ఇలా అందిస్తున్నాను.

© Dantuluri Kishore Varma 

Tuesday 12 February 2013

సుబ్రహ్మణ్యేశ్వరుడు

తారకాసురుడు అనే రాక్షసుడు గురించి వినే ఉంటారు కదా అందరూ? శివుడి కోసం తపస్సుచేసి, ఆత్మలింగం కావాలని వరంకోరుకొన్నాడు. ఈ వరప్రభావంవల్ల అత్యంత శక్తివంతుడై దేవతలని కూడా ఇబ్బందులు పెట్టడంతో, వరం ఇచ్చిన శివుడి అంశ వల్ల జన్మించిన పుత్రుడివల్లే అది సాధ్యమౌతుందని భావించి, కుమార సంభవానికి పధకరచన చేస్తారు దేవతలు. 

దక్షయజ్ఞం, సతీదేవి మరణం తరువాత తపస్సు చేసుకొంటున్న శివునికి, పర్వతరాజు హిమవంతుని కుమార్తె పార్వతిపై ప్రేమ పుట్టించడానికి మన్మధుని ప్రయోగిస్తారు. పూల బాణాలు వేసి మంచి చేద్దామనుకొంటే, శివుని కోపాగ్నికి మన్మధుడు ఆహుతి అయ్యాడు. కానీ, తరువాత పరమేశ్వరుడు పార్వతిని పరిగ్రహిస్తాడు. 

తారకాసురుని సంహరించే కారణంకోసం  జన్మించిన కుమార స్వామినే సుబ్రహ్మణ్యేశ్వరుడు అని కూడా అంటారు. ఈతనే తారకాసురుడి మెడలోఉన్న ఆత్మలింగాన్ని ఐదు ముక్కలుగా చేదించి, అతనిని వదించిన వాడు. ఈ ఆత్మలింగం యొక్క ఐదు భాగాలే పంచారామ క్షేత్రాలలో ప్రతిష్ఠించ బడినవి అంటారు. ప్రత్యేకించి సామర్లకోటలో ఉన్న కుమార భీమేశ్వరస్వామి దేవాలయం యొక్క శివలింగాన్ని కుమార స్వామే స్వయంగా ప్రతిష్ఠించాడట. అందుకే ఈ ఆలయానికి కూడా ఆయన పేరే ఉంటుంది. 

ఈ తారకాసురుడి కథ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, కొన్నిరోజులక్రితం కత్తిపూడినుంచి శంఖవరం మీదుగా వెళుతుంటే, శంఖవరం ఊరిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కనిపించింది. నెమలి వాహనం, రాతితో మలచిన విగ్రహాలూ అవీ చాలా బాగున్నాయి.  
దారిలో వెళుతూ చూడవలసిన దేవాలయమే కానీ, ప్రత్యేకంగా వెళ్ళవలసినంత ప్రముఖమైనది కాదు. కానీ, శివాలయంలో శివలింగానికి అభిముఖంగా నందిని ఉంచినట్టు, కుమారస్వామి గుడిలో నెమలి వాహనం నాకు కొంచం ప్రత్యేకంగా అనిపించడం కారణంగా మీతో ఈ విశేషాన్ని పంచుకొంటున్నాను. 

 

© Dantuluri Kishore Varma

Sunday 10 February 2013

ఈ అమావాస్య ప్రత్యేకత ఇదే - చొల్లంగి అమావాస్య

ప్రతీ సంవత్సరం పుష్యమాసం చివరిరోజైన అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు. కాకినాడలో జగన్నాధపురం వంతెన నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చొల్లంగిలో వందేళ్ళ క్రితం నిర్మింపబడిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వరస్వామి వారి దేవాలయం ఉంది.  చారిటిస్ విద్యా సంస్థలని నెలకొల్పిన మల్లాడి సత్యలింగ నాయకరు ఈ గుడిని కట్టించారు. సమీపంలోనే గోదావరీ నది యొక్క ఏడుపాయల్లో ఒకటైన తుల్యబాగ సముద్రంలో కలుస్తుంది. చొల్లంగి అమావాస్యరోజు ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే చాలా మంచిదని భావించడంవల్ల, వివిధ ప్రదేశాలనుంచి భక్తులు వేల సంఖ్యలో  వస్తారు. 
`ప్రత్యేకంగా ఈ రోజే, ఇక్కడే ఎందుకు?` అనే ప్రశ్నకి సమాదానంగా ఒక పురాణ గాథనీ, ఒక భౌగోళిక అంశాన్నీ అనుసంధానంచేసి ఈ విశేషాన్ని చెపుతారు.  

దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడుగురు కుమార్తెలనీ (వీళ్ళవే 27 నక్షత్రాల పేర్లు) చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. చంద్రుడికి రోహిణీ(కొన్ని చోట్ల రేవతి అని చెపుతారు) అంటే మహా ప్రేమ. అందువల్ల ఆమె తోనే ఉంటూ, మిగిలిన భార్యలని నిర్లక్ష్యం చేస్తాడు. కుమార్తెల పిర్యాదు మేరకు ఎన్నోసార్లు అల్లుడికి నచ్చచెప్పాలని ప్రయత్నించినా తన ధోరణి మార్చుకోక పోవడంతో కోపించి అల్లుడిని క్షయవ్యాధికి గురికావాలని శపిస్తాడు.  శాప విమోచనం కలిగించగల శక్తి శివుడికి మాత్రమే ఉన్నదని గ్రహించి, అతనికోసం తపస్సు చేస్తాడు చంద్రుడు. అప్పుడు పుష్యమాసం చివరి రోజయిన అమావాస్యనాడు శివుడు ప్రత్యక్షమౌతాడు. అదండీ, ఈ రోజు ప్రత్యేకత.  తరువాత చంద్రుడి క్షయవ్యాది ఏమైందో తెలుసుకోవాలంటే కథలో ఇంకొంచం ముందుకు వెళ్ళాలి. శివుడు, `ధక్షుని శాపం పూర్తిగా తొలగించలేను కానీ, కొంత ఉపశమింప చేయగలను,` అంటాడు. దాని వలన చంద్రునికి నెలలో సగం రోజులు క్షయం, మిగిలిన సగం రోజులు తిరిగి వృద్ది ఉంటాయి. అవే రెండు పక్షాలు.
ప్రదేశం గురించా? అదే చెప్పబోతున్నాను.  ఇక్కడ ఉన్నది తుల్యబాగ పాయ అనుకొన్నాం కదా. అది అమావాస్య రోజే సముద్రంలో కలిసిందట. సాగర సంగమం జరిగిన రోజూ, ప్రాంతం అన్నమాట. అమావాస్య  మరునాటి నుంచీ సప్త సాగర యాత్ర మొదలౌతుంది. ఏడు పాయలూ కలిసే చోట్లు కోరంగి, చొల్లంగి, తీర్థాలమొండి, రామేశ్వరం, బ్రహ్మసమాఖ్యం, మాసంగితిప్ప, అంతర్వేది. చొల్లంగి తీర్థంలో అప్పన్న ఎద్దుల్ని ఊరేగిస్తారు. దీనికి కారణం ఏమిటంటే, ఇదే రోజు పరమశివుడు నందీశ్వరుడికి మోక్షం ప్రసాదించాడట. గరగ నృత్యాలు ఉంటాయి. 

శ్రీ సంగమేశ్వరస్వామి వారి దేవాలయంలో శ్రీ రామ చంద్రుడు, హనుమంతుల గుడులు కూడా ఉన్నాయి. కారణం తెలుసుకోవాలంటే త్రేతాయుగానికి వెళ్ళాలి. అరణ్యవాస సమయంలో బంగారు లేడి ఉదంతం తెలుసుకదా? ఆ లేడి సీతా దేవికి కనిపించిన ప్రాంతం బద్రాచలం అంటారు. అక్కడినుంచి దానిని రాముడు చాలా దూరం తరుముకొంటూ వచ్చి బాణంతో కొడితే మారీచుడి మొండెం తూరంగిలో, తల కోరంగిలో పడ్డాయి. రాముడి బాణం రెండింటికీ మధ్య చొల్లంగిలో పడింది. 
చొల్లంగి కాకినాడ నుంచి యానం వెళ్ళే దారిలో ఉంది. దేవాలయం, స్నాన ఘట్టాలు చొల్లంగిలో ఉన్నా ప్రధానమైన తీర్థం ఎం.ఎస్.ఎన్. చారిటీస్ దగ్గరనుంచి, జగన్నాధపురం వంతెన వరకూ జరుగుతుంది. వందలకొద్దీ కొట్లు రోడ్డుకి ఇరువైపులా పెట్టేస్తారు. అది, ఇది అని కాకుండా రకరకాల వస్తువులు అమ్ముతారు. తీర్థాల సంగతి ప్రత్యేకంగా చెప్పేదేముంది, మనమందరం చిన్నప్పుడు చూసి ఉన్నవాళ్ళమే కదా! ఈ రోజు వాహనాలను  దారి మళ్ళించి జి.వేమవరం జామికాయల తూము నుంచి పెనుగుదురు వంతెన, అన్నమ్మ ఘాటీ మీదుగా పంపుతారు.  

జమ్మిచెట్టు సెంటర్ దగ్గర పెద్ద వాటర్ టాంక్ ఉన్న మునిసిపల్ పార్క్ వెనుక రోడ్డులో రంగులరాట్నాలు, జెయింట్‌వీల్స్, మేజిక్ షో స్టాళ్ళు తీర్థానికి నాలుగు రోజుల ముందే ఏర్పాటు చేసి, తీర్థం తరువాత నాలుగయిదు రోజులు ఉంచేస్తారు. కర్జూరం, జీళ్ళు, వేరుశనగ అచ్చులు అమ్మే స్టాళ్ళు జనాలతో కిటకిట లాడతాయి. తాజా జీడి పాకాన్ని మేకుకు వేసి బంగారం రంగులోకి వచ్చేవరకూ లాగడం చూడడానికి బాగుంటుంది. పట్టిన పట్టు విడవకుండా విసిగించే వ్యక్తిని పోల్చడానికి, జీడిపాకంలా సాగుతున్నాడనే నానుడి ఇది చూసే వచ్చి వుంటుంది.  
మొత్తం మీద చొల్లంగి తీర్థం హడావుడి రెండు, మూడు రోజులు ఉంటుంది. రాత్రి పదకొండు, పన్నెండు గంటలవరకూ ఇసుకవేస్తే రాలనంతమంది జనాలు షాపింగ్ చేస్తూ ఆనందిస్తారు.అన్నట్టు చొల్లంగి అమావాస్య ఈ రోజే (Feb 10, 2013).

© Dantuluri Kishore Varma 

Friday 8 February 2013

ఉన్నదేంటి, లేనిదేంటి?

`నాకూ తియ్యండి సార్,` అన్నాడు ఆ అబ్బాయి. కాకినాడకి ఓ యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెటూరు అది. కొండప్రదేశం. మేం పిక్నిక్‌కి వెళుతూ, రోడ్డువార నీరుపెట్టిన పొలాల్లో దుక్కిదున్నుకొంటూ, నాట్లు వేసుకొంటున్న మనుష్యులని ఫోటోలు తీయ్యడానికి ఆగినప్పుడు  ఓ పదేళ్ళ కుర్రాడు మావెనుకనుంచి వచ్చి అడిగిన సందర్భం ఇది. అతనికి ఫొటో తీస్తే, `నన్ను చూడనియ్యండి,` అన్నాడు. డిజిటల్ కెమేరాలో తీసిన ఫొటోని చుపిస్తే చాలా అనందపడిపోయాడు. ఇంకొక అయిదు నిమిషాల తరువాత ఒక చిన్న పిల్లని తీసుకువచ్చి, `మా చెల్లికి కూడా ఫొటో తియ్యండి,` అన్నాడు. ఆ అమ్మాయి సిగ్గుపడిపోయి మొహం చేతుల్లో దాచేసుకొంది. సెల్ ఫోన్లలో ఇన్‌బిల్ట్ కెమేరాలు వచ్చిన తరువాత ఫోటో తియ్యడం, తీయించుకోవడం పెద్ద విశేషాలు కాదు. కానీ ఈ ప్రదేశంలో సెల్ సిగ్నల్ రాదుకనుక ఈ సాంకేతికత వాళ్ళకి అందుబాటులో లేదు. ఇది ఏజన్సీ ప్రాంతం ఏమీ కాదు. జిల్లా కేంద్రానికి చాలా దగ్గరలోనే ఇలాంటి పల్లెలు ఇంకా ఉన్నాయి. కొన్ని చోట్ల ఊళ్ళకి విద్యుత్ సరఫరా లేదు. సరయిన రోడ్లు లేవు.
మార్గమధ్యంలో మేం వెళ్ళవలసిన ప్రదేశానికి దారి తెలుసుకోవడానికి ఒక గొర్రెల కాపరిని ఆపాం. అతని చేతిలో మద్యాహ్న భోజనానికి ముంత ఉంది, ఇంకొక చేతిలో మేకలని అదిలించడానికి కర్ర. ఉదయం చల్దన్నం తిని మేకలని కొండమీదకి మేపడానికి తీసుకొని వెళతాడట. ఏ చెట్టుక్రిందో కూర్చుని మద్యాహ్న భోజనం తినేసి సాయంత్రం వరకూ కాపలా కాస్తూ, పొద్దు పోయే లోపే ఇంటి దారి పడతాడట. `సాయంత్రం టీ.వీ. చూస్తావా?` అంటే. `మాకు కరెంటు లేదు కదా! తినేసి, తొంగోడమే!` అన్నాడు. లేదనే బాధ అతని మాటల్లో ఏమీ కనిపించలేదు.

అమరావతి కథల్లో సత్యం శంకరమంచి రాసిన `ఒకరోజు వెళ్ళిపోయింది` అనే కథ జ్ఞాపకం వచ్చింది. పిచ్చయ్య పరుగెత్తే ప్రవాహం అడుగు తెలియకుండా ఈదుకెళ్ళే చేపపిల్లలా, తొణకని సరస్సులో కదలని అలలా , కాలానికి తెలియకుండా, కాలంతో కలిసిపోయి బ్రతుకుతాడు. ఉదయాన్నే కృష్ణా నదికి స్నానానికి వెళ్ళింది మొదలు, సాయంత్రం నిద్రలోకి జారుకొనేవరకూ మార్పులేని ఒకేరకమైన జీవితాన్ని ప్రతీరోజూ, మరణించేవరకూ గడుపుతాడు - పూర్తి సంతృప్తితో. కథ చివరిలో రచయిత `ఇది చాలదా?` అని ప్రశ్నిస్తాడు. `చాలడంలేదు చాలామందికి,` అని కూడా నొక్కి వక్కాణిస్తాడు. 

పూర్వకాలంలో రాజకుమారులు దేశాటన పూర్తిచేస్తేనే కానీ పట్టాభిషేక అర్హత సంపాదించలేకపోవడం గురించి కథల్లో చదువుకొన్నాం. రాజధానినుంచి పల్లెసీమల్లోకి వెళ్ళి ప్రజల స్థితిగతుల గురించి తెలుసుకోవడం గురించి ఈ దేశాటనలు.   అలాగే, ఇంగ్లాండ్లో చదువు పూర్తయిన తరువాత గ్రాండ్ టూర్ అని ఒకటి ఉండేదట. పెద్ద పట్టణాలను కొన్ని నెలల పాటు సందర్శించి రావాలి.  ఇవన్నీ చదువులో ఒక భాగమే.

స్వామీ వివేకానంద ఒక ఉపన్యాసంలో `మనుష్యుల మధ్య తారతమ్యాలు ఎందుకు వస్తాయి?` అనే విషయం గురించి చెపుతూ నూతిలో కప్ప కథని ఉదహరిస్తాడు. ఒక నూతిలో కప్ప తానున్నదే ప్రపంచం అనుకొంటూ ఉంటుంది. ఒకరోజు ఎక్కడినుంచో ప్రమాదవశాత్తు ఒకసముద్రంలో ఉండే కప్ప వచ్చి నూతిలో పడుతుంది. `నువ్వు ఎక్కడినుంచి వచ్చావు?` అని అడిగి, సముద్రం నుంచి అని తెలుసుకొని, `మీ సముద్రం మా నుయ్యి అంత పెద్దగా ఉంటుందా?` అని అతిశయంతో నుయ్యి ఆ చివరి నుంచి, ఈ చివరికి గెంతుతుంది. ఆమాటలకి ఆశ్చర్యపోవడం సముద్రపు కప్ప వంతు అవుతుంది.

ఇక్కడ పల్లె నూతి లాంటిది, పట్టణం సముద్రం లాంటిది అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. మనపరిదిని దాటి ప్రజలని,    వాళ్ళ జీవన విధానాల్నీ తెలుసుకోకపోతే ఏదయినా నూతి లాంటిదే. పల్లెల సౌందర్యాన్ని చూడకపోతే, అక్కడి మనుష్యుల ప్రశాంతమైన జీవనవిధానాన్ని తెలుసుకోకపోతే  చదువుకి పరిపూర్ణతలేదు. అలాగే జరుగుతున్న అభివృద్ది గురించి తెలుసుకోకుంటే  ఆలోచనా పరిధి కుంచించుకుపోయినట్టే.

ఒక వ్యక్తిత్వ వికాశ ఉపన్యాసంలో ఒక ఉదాహరణ చెప్పారు. ఊరపంది దృష్టి ఎప్పుడు చెత్తమీదే ఉంటుందట. పుట్టింది మొదలు తనకు తినడానికి పనికి వచ్చే పదార్థాలకోసం పెంటకుప్పల వెంట, రోడ్డు ప్రక్కల, డ్రయనేజీల్లో వెతుకుతూ ఉంటుంది. అది బాగా బలిసిన తరువాత కసాయి దాన్ని పట్టుకొని కాళ్ళు కర్రకి కట్టేసి తల్లక్రిందులుగా వ్రేలాడదీసి తీసుకొని పోతాడు. అప్పుడు మొట్ట మొదటిసారి దానికి ఆకాశం కనిపిస్తుందట. `ప్రపంచం ఇంత ఉందా!` అని అచ్చెరువొందుతుందట. కానీ ఏం లాభం అప్పటికే జరగాల్సిన కాలయాపన జరిగిపోతుంది.

పట్టణాలలో యాంత్రికమైన జీవన విధానానికి అలవాటు పడిపోయి, అసంతృప్తితో బ్రతుకులు వెళ్ళదీస్తున్న జనం, వాళ్ళ వాళ్ళ చట్రాల్ని విడిచిపెట్టి  ప్రపంచంలోకి వెళితే, వాళ్ళకి నిజంగా ఉన్నదేంటో, లేనిదేంటో తెలుస్తుంది. జీవించడం యొక్క నిజమైన విలువ అవగతమౌతుంది.
© Dantuluri Kishore Varma

Thursday 7 February 2013

స్వామీ వివేకానంద

`ఎక్కడెక్కడో పుట్టిన నదులన్నీ అంతిమంగా సముద్రాన్ని చేరినట్టు, రకరకాల మార్గాలని అనుసరించే మానవులందరూ నన్నేచేరతారు.  ఉద్దేశ్యాలు  ఏమయినా దారులన్నీ నాలో కలుస్తాయి,` అని భగవధ్గీతలో శ్లోకాలని ఉదహరిస్తూ సెప్టెంబర్ 11, 1893లో చికాగోలో వాల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో స్వామీ వివేకానంద చేసిన ఉపన్యాసం ఆలోచనలని రేకెత్తించేదిగా ఉంటుంది.   

ప్రపంచానికి సహనం, సౌభ్రాతృత్వం  గురించి చెప్పిన దేశం మనదని సోదాహరణంగా చెప్పినప్పుడు గర్వంగా అనిపిస్తుంది. మనుషులు పరస్పర వైరుద్యాలతో, మత మౌడ్యంతో రక్తపాతాన్ని సృష్టించుకోకుండా ఉండి ఉంటే మానవ నాగరికత ఇంకా ముందుకు వెళ్ళిఉండేదని చారిత్రక తప్పిదాలని ఎత్తి చూపిస్తాడు.   

దారులు వేరైనా ఒకే గమ్యం కోసం ప్రయాణిస్తున్న మనుష్యుల మధ్య వైరుధ్య భావనలకి అప్పటి సభలు చరమగీతం కావాలని అభిలషిస్తాడు. 

విశాల దృక్పదంతో చూస్తే వివేకానందుని మాటల్లో సత్యం, విచక్షణ అవగతమౌతాయి. 
1995లో ఒక స్నేహితుడు రాజమండ్రీ వెళుతుంటే అతని చేతికి నూటడబ్బై అయిదు రూపాయలు ఇచ్చి రామకృష్ణా మఠం నుంచి `ది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామీ వివేకానంద` అనే ఎనిమిది వాల్యూముల సెట్‌ని తెప్పించుకొన్నాను. అప్పుడప్పుడూ ఒక్కో పుస్తకం తీసుకొని ఒకటో, రెండో చాప్టర్లు చదవడం, ఆ పుస్తకాన్ని ప్రక్కన పెట్టడం అనే ప్రక్రియ జరుగుతూ ఉంది. అక్కడక్కడా కొంచెం, కొంచెంగా చదవడం తప్పించి పూర్తి చెయ్యలేక పోయాను.  

ఆన్ లైన్‌లో ఉన్న స్వామీ వివేకానంద కంప్లీట్ వర్క్స్ యొక్క లింక్ ఇదిగో.

ఎప్పటినుంచో నాకు అర్థమైన స్వామీవివేకానంద భోదనల గురించి వ్రాయాలని అనుకొంటూ ఉన్నాను. నెలకి ఒకటో రెండో పోస్టులు ఆరకంగా రాయాలని ఒక ప్రణాళిక చేసుకొంటే చదవాలనే నిబద్ధత కలుగుతుంది. అది ఒక ఉపయోగం. చదవడం కోసం చదవడం కాదు కనుక, దాని గురించి రాయాలనే బాధ్యత ఉంటుంది కాబట్టి ఒక అధ్యాయనంలాగ జరుగుతుంది. దీనివల్ల నాకున్న చాలా సందేహాలలో కొన్నింటికి సమాదానం దొరకవచ్చు. నేను చెయ్యాలనుకొనేది ఆయన రచనలకి, గీతమీద వ్యాఖ్యానాలకీ అనువాదాలు కాదు. ఒక రివ్యూ లాంటి నా స్పందన మాత్రమే. 

నా బ్లాగ్‌ని చదివేవారిలో పెద్దవారు, విజ్ఞులు ఉన్నారు. ఎప్పుడయినా వారి విజ్ఞాన సంపద నాకు ఉపయోగ పడుతుందని వారు భావిస్తే, వ్యాఖ్యల రూపంలో అందిస్తారని అనుకొంటున్నాను. 
© Dantuluri Kishore Varma 

Wednesday 6 February 2013

ప్రేమలేఖ రాశా...

సహబ్లాగర్, మిత్రుడు శ్రీనివాస్ గారు నిర్వహిస్తున్న `మనసంతా నువ్వే` అనే ఫేస్ బుక్ గ్రూపులో ప్రేమలేఖల పోటీ పెట్టారు. 
చాలామంది రాశారు. నేనుకూడా ఇదిగో ఇలా...

ఓయ్, 

ఏంటి ఇలా మొదలు పెట్టానని అదిరి పడకు. ప్రేమ మాటలు అన్ని చోట్లా ఒకేలా ఉంటాయని విసుక్కొంటావుగా, అందుకే నా స్టయిల్లో ఇలా వచ్చాను. 

వర్షం
వెన్నెల
సంగీతం
మంచి పుస్తకాలు
ప్రేమించడం
నన్ను ప్రేమించే నా వాళ్ళని సంతోషంగా ఉంచడం

ఇంకా...
ఇలాంటి కొన్ని విషయాలు నాకు ఇష్టం. కొన్నిరోజులకి పూర్వం, నువ్వు పరిచయం కాకముందు ఓ వెన్నెల రాత్రి మైదానంలో అలా నడుస్తున్నప్పుడు, చల్లగాలి మెల్లగా వీస్తున్నప్పుడు, చెవిలో వినిపిస్తున్న కమ్మని సంగీతం, చేతిలో పుస్తకం ఓ చిరుదిగులుని మనసులో విడిచి పెట్టేవి.తొలకరి జల్లులు కురుస్తున్నప్పుడు, తడిసిన మట్టి వాసన మత్తెక్కిస్తున్నప్పుడు అలాగే అనిపించేది. మనసుకి కలిగే ప్రతీ ఫీలింగుకీ ఒక పేరు పెట్టుకోలేం కానీ, ఎప్పుడో ఓ రోజు అదేమిటో కచ్చితంగా తెలుసుకోగలుగుతాం. `ఇప్పటికయినా తెలిసిందా?` అంటున్నావా? ఆవిషయం చెప్పడానికీ, నీ మీద పిర్యాదు చెయ్యడానికీ ఈ ఉత్తరం!

నీతో మాట్లాడి పూర్తిగా అరగంటైనా కాలేదు. మళ్ళీ మాట్లాడాలనే కోరిక ఈ లేఖని రాయిస్తుంది. ఒకసారి నువ్వు నవ్వినప్పటి జ్ఞాపకం మువ్వల పట్టీల శబ్ధంలా నా గుండెల్లో `ఘల్లు` మంటే, ఇంకోసారి నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పటి తీపి గుర్తు గుండెల్లో వెలిగించిన చుచ్చుబుడ్డి కాంతి కళ్ళల్లో మెరిసినట్టు నా మొహం నాకే ముద్దొస్తుంది.  అంతలోనే నువ్వు నా ప్రక్కన లేవన్న స్పృహ నిస్పృహ కలిగిస్తుంది. చూశావా ఇదీ దిగులే!

`నీ ఫీలింగేమిటో అర్థమయ్యిందా?` అని నువ్వు అడిగిన ప్రశ్నకి సమాదానం ఇదే. అప్పుడెప్పుడో నువ్వు పరిచయం కాకముందు నాకు కలిగిన దిగులు పేరు ప్రేమ! `ఎవరి మీద!?` అంటావా? నీ మీదే. అలా ఆశ్చర్య పోవద్దు. `నేనెవరో తెలియదట, కానీ అప్పటికే నామీద ప్రేమట!` అని కోపం చూపించకు.

వెన్నలా, వర్షం అని ఈ ఉత్తరం మొదట్లో నేను చెప్పిన మాటలన్నీ ఒక జిగ్సా పజిల్లో ముక్కల్లాంటివి. వాటన్నింటినీ నాకిచ్చి, అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించుకోమని అంటే, ఎన్నిసార్లు మార్చి మార్చి పేర్చినా ఒక ముక్క తగ్గేది. అసంపూర్తి చిత్రం ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వదుకదా? అప్పుడు నాకు తెలియకుండా నీకోసం వెతుక్కొనే నా తపనే, నా దిగులు.  అది ఖచ్చితంగా నీ మీద ప్రేమే! 

బీచ్ దగ్గరకి వెళ్ళి నిశ్సబ్ధంగా కూర్చుంటానా, దూరంగా సముద్రంలో మునుగుతున్న డాల్ఫిన్ నోస్, అలల మీదనుంచి వచ్చే చల్ల గాలి, ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలు, పెద్ద శబ్ధంతో ఒడ్డుమీద విరిగి పడుతున్న కెరటాలు నిన్ను మళ్ళీ జ్ఞాపకం చేస్తాయి. చూశావా మళ్ళీ నా భావాలని సరిగా చెప్పలేకపోతున్నాను! అసలు నిన్నెప్పుడైనా మరచి పోతే కదా, మళ్ళీ, మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి? 

తొందరగా వచ్చెయ్యకూడదా, నాకు ఈ ప్రేమలేఖలు రాసుకొనే ఇబ్బంది తప్పుతుంది. నువ్వు దూరంగా ఉంటే నీ గురించి వందల ఆలోచనలు మనసులో ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి. నీకు రాద్దామని మొదలుపెడతానా, ఒక్కసారిగా అన్నీ ముందుకు తోసుకొని వచ్చి `నన్ను రాయి` అంటే `నన్ను రాయి` అని ఉత్తరాన్ని మార్కెట్‌ప్లేస్ చేసేస్తాయి. 

 `ఏమొహో చిగురుటదరముల- యెడనెడ కస్తూరి నిండెను. భామిని విభునకు రాసిన పత్రిక కాదుకదా...?` అని అన్నమయ్య ఆశ్చర్య పోతాడు. వేంకట నాధునికి అదరాలమీద అలిమేలు మంగ తన పెదవులతో ప్రేమలేఖలు రాస్తే, కస్తూరి రాసినట్టు ఎర్రబడిపోయాయట. నా ఉద్దేశ్యంలో ఇలాంటివే అత్యుత్తమమైన లేఖలు. నువ్వు కూడా నాకోసం అలాంటి లేఖలు రాయడానికి ప్రయత్నించవచ్చు కదా?

రవీంద్రనాథ్ ఠాగోర్ ఏమంటాడో తెలుసా?
" I would ask for more, if I had the sky with all its stars, and the world with all its endless riches. But I would be content with the smallest corner of the earth if only you were mine."

విశ్వకవి చెప్పినట్టు ప్రపంచంలో ఏ మూలయినా, చిన్న జాగా ఉన్నా నీ సాహచర్యంతో ఆనందంగా జీవించచ్చు. అందుకే నీకోసం ఎదురు చూస్తూ......

© Dantuluri Kishore Varma

Tuesday 5 February 2013

పర్ణశాల

బ్రతుకు పరుగు పందెం అయిపోయింది. సంతోషం ఎండమావిలా అనిపిస్తుంది. జీవన విధానం సాంకేతికత, సౌఖ్యాల సాక్షిగా రోజురోజుకీ మారిపోతుంది. ఫ్యాన్‌కి బదులుగా ఏసీ కావాలిప్పుడు. సైకిళ్ళ స్థానే బైకులు; వాటిని తోసిరాజని కార్లూ. బజ్జీల  స్థానాన్ని బర్గర్లు ఆక్రమించి చాలా రోజులయ్యింది. మల్టీ ఫ్లెక్స్‌లు, మల్టీ క్వీజీన్ రెస్టారెంట్లు రాజ్యమేలుతున్నాయి. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు ప్రతీ ఒక్కరికీ కావలసిందే. వీటన్నింటికీ తోడు ఖరీదైన విద్యా, వైద్యం, రోజు రోజుకీ పెరుగుతున్న ధరలు. సంపాదనకీ, ఖర్చుకీ పొంతన ఉండటం లేదు. ఎంత సంపాదించినా ఇంకా, ఇంకా కావాలి. సోమవారం వస్తుందంటే మళ్ళీ పనిలోకి వెళ్ళాలన్న బెంగ, ఒకటవ తారీకు వస్తుందంటే కొరత బడ్జెట్ చూడాలని ఆందోళన. పులి మీద స్వారీలా కొనసాగించవలసిందే. అలుపు తీర్చుకోవడానికి ఆగామా, ఆ పులే మనల్ని కబళించేస్తుంది. అందుకే ఆపలేని పరుగు, పరుగు, పరుగు..........ఛీ! వీటన్నింటినీ వదిలేసి ఏ అడవిలోనో పర్ణశాలలాంటి ఇంటిలో, ప్రకృతికి దగ్గరగా ప్రశాంతం గా జీవిస్తే ఎంత బాగుంటుంది. ఈ చింతలు, వంతలు, దిగుళ్ళు, తెగుళ్ళు...అన్నింటికీ దూ...రంగా నిశ్చింతగా బ్రతకితే! నిద్ర ముంచుకొని వస్తుంది. ఆలోచనలు చేతన కోల్పోయి, సుషుప్తిలోకి జారిపోతున్నాయి.  
*  *  *
నులివెచ్చని సూర్యకిరణాలు ముఖాన్ని తాకుతున్నాయి, పక్షుల కూజితాలు సుప్రబాతం పాడినట్టు వినిపిస్తున్నాయి. బయటనుంచి ఎవరో కట్టెలు కొడుతున్న శభ్ధం వినిపిస్తుంది. ఓరగా వేసిన తలుపు తెరుచుకొని బయటకి వచ్చి చూశాడు. అప్పుడు తెలిసింది తానున్నది ఒక పూరి గుడిసెలో అని. గుడిసె చుట్టూ కొంతమేర పొదలు నరికి శుభ్రం చేసి ఉంది. అది దాటిన తరువాత  అన్ని వైపులా ఏపుగా పెరిగిన కంచెలు, పచ్చ గడ్డి, అకాశం వరకూ ఎదిగిన రకరకాల వృక్షాలు, వాటి వెనుక నుంచి పైకి వస్తున్న సూర్యుడు. మంచు పరదాల్లోంచి మచ్చల జీబ్రా చర్మంలా నేలంతా పరచుకొన్న సూర్య రస్మి. దూరంగా మైదానం మలుపు తిరిగి కొండ ఎక్కుతున్నట్టున్న ప్రాంతంలో ఒక కోయ పిల్ల కట్టెలు కొడుతుంది. 

అరికాళ్ళక్రింద ఎండిన ఆకులూ, పుల్లలూ నలుగుతూ ఉండగా ఆ పిల్ల దగ్గరకి నడచి వెళ్ళాడు. పలకరింపుగా నవ్వింది. `కాఫీ, టీలుండవు ఇక్కడ. అడవిలోకి పోయి ఏమైనా తెస్తే వండి పెడతాను,` అంది. ఆమె అందించిన గొడ్డలి, తవ్వుగొల అందుకొని అడవిలోకి నడిచాడు.  

కాలకృత్యాలు తీర్చుకోవాలి ముందు. ఎక్కడినుంచో నీరు పారుతున్న చప్పుడు వినిపిస్తుంది. చాలా దూరం నడిచాడు. చివరికి ఒకచోట కొండవాగు కనిపించింది. స్నానం చేసి తిరిగి వస్తుంటే ఒకచోట గతరాత్రి అడవి పందులు నేల తవ్వి తిరగేసిన ప్రదేశం కనిపించింది. అక్కడక్కడా సగం కొరికి వదిలేసిన దుంపలు కనిపిస్తున్నాయి. అక్కడ ఇంకా చాలా ఉండవచ్చు. తరువాత ముదర వెదురు గడల కణుపులు నరికి వెదురు బియ్యం సేకరించాలి. ఇద్దరికి సరిపడా దుంపలు, బియ్యం, కొన్ని చింతకాయలూ పోగుచేసే సరికి  సూర్యుడు నడినెత్తిమీదకి వచ్చాడు.

దూర దూరంగా ఎక్కడెక్కడినుంచో పొగ సుడులు తిరుగుతూ ఆకాశం వైపు వెళుతుంది. ఈ అడవిలో ఇంకా ఇళ్ళు ఉన్నాయన్న మాట! కడుపులో ఆకలి నకనలాడుతుంది. నిన్న రాత్రి ఫేస్ బుక్కులో పెట్టిన స్టేటస్ అప్డేట్ కి ఏమయినా లైకులూ, కామెంట్లూ వచ్చాయో, లేదో!

వెదురు బియ్యం అన్నం, ఉడకబెట్టిన దుంపలు, నంజుకి చింతకాయలు. ఆవురావురు మంటూ తిన్నాడు. ఆకలి రుచి ఎరగదంటే ఇదేనేమో!

`మీ గూడెంలో జనాలు కలుసుకోరా?` అన్నాడు. `సంత రోజుల్లో, ఏదయినా జాతర అయినప్పుడు,` అంది కోయ పిల్ల.

`మరి కాలక్షేపం?`

`పని ఉంటది కదా? అదే పొద్దు పోయేదాకా,` అంది.

చెట్ల క్రింద ఉడతలు పరుగులు పెడుతున్నాయ్. సుర్యుడు పశ్చిమంవైపు కొండల వెనక్కి జారుకొంటున్నాడు. పక్షులు గుంపులుగా ఎక్కడినుంచో, ఎక్కడికో ఎగిరిపోతున్నాయి. పొదల్లోంచి కప్పలు, కీచురాళ్ళు చప్పుళ్ళు మొదలయ్యాయి. చెట్ల బెరడు నుంచి తీసిన మైనంలో ముంచిన ఒక గుడ్డని కర్రకి చుట్ట బెట్టి, కాగడా వెలిగించింది. చుట్టూ కొండలు  చీకటిలో పెద్ద పెద్ద గొరిల్లాల్లాగ ఉన్నాయి.

`ఇక్కడ ఏదీ బాగా లేదు. అనవసరంగా ఈ అడవిలోకి వచ్చి పడ్డాను,` అనుకొన్నాడు.
 
`ఇక్కడే పడుకోవాల,` అంది గుడిసలో కటిక నేలను చూపించి. లోనికి అడుగు పెడుతూ ఉండగా కాలిమీద మంట పుట్టింది. ఏదో  పాకిన చప్పుడు. `అబ్బా!` అన్నాడు బాధతో.

కాగడా వెలుతురులో కాలిమీద సూదితో పొడిచినట్టు రెండు రక్తపు గుర్తులు కనిపిస్తున్నాయి. కోయపిల్లకి అవి ఏమిటో బాగా తెలిసినట్టే ఉంది.`నాగుపాము,` అంది.

భయం జరజరమని వెన్నుపూసలోనుంచి మెదడువరకూ పాకింది. `ఇప్పుడెలా?` అన్నాడు ఆందోళనగా. తొందరగా గుడిస బయటకి పరుగుపెట్టి, ఏవో ఆకులు తెచ్చి, పాము కరిచిన చోట రసం పిండింది.

`ఇది పాము విషానికి విరుగుడా?` అన్నాడు. ఆందోళనతో గొంతు పిడచకట్టుకు పోతుంది.

`తెలియదు దొరా. ఇది ఏస్తే బతకొచ్చు అంటారు. పాములు కరిచి, జొరాలొచ్చి పాణాలమీదకి వస్తే ఏవేవో పసర్లు ఏస్తాం. బతికితే గొప్ప, లేదంటే రాత,` నుదిటిమీద బొటన వేలితో అడ్డంగా రాసుకొంటూ చెప్పింది. 

`మరి వైద్యుడు!?`

`వైద్యుడెవరూ ఉండరు దొరా ఇక్కడ. కానీ, ఆ పై కొండమీద గుహలో ఒక సాములోరు ఉంటారు. మంత్రాలేస్తారు,` అంది.

పాముకాటు ఎంత ప్రమాదమో అతనికి తెలుసు. బ్రతకాలంటే ఉన్న ఏ అవకాశాన్ని వదులు కోకూడదు. కాగడా అందుకొని, `పద, దారి చూపించు,` అన్నాడు.

పరుగు, పరుగు, పరుగు.... ఆయాసం వస్తుంది, గొంతు ఎండిపోతుంది. ప్రాణంకోసం పరుగు ప్రపంచం చివరిదాకా పరుగెత్తినట్టు ఉంది. కొండగుహ కాంతి పుంజాలతో వెలిగిపోతూ ఉంది. తెల్లని గడ్డం, పండు ముసలి శరీరం, తలవెనుక కాంతి చక్రం - మునీశ్వరుడు తపోముద్రలో కూర్చుని ఉన్నాడు. వొగుర్పుల శభ్ధానికి కళ్ళుతెరిచి `వచ్చావా?` అన్నాడు. 

సమయం మించి పోతుంది. ఒక్క క్షణం కూడా వృదా పరచడానికి లేదని అతనికి తెలుసు. `నన్ను బ్రతికించండి,` అన్నాడు ముకుళించిన హస్తాలతో.

`ఎందుకూ?` స్వామి నుంచి సూటి ప్రశ్న. అతను నివ్వెర పోయాడు. `స్వామీ బ్రతడం ఎందుకా? సర్వజ్ఞానులు మీరా ఇలా అడిగేది!?` అన్నాడు.  

మునీశ్వరుడి కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. `ఇంకాస్త సౌకర్యంగా బ్రతకడానికి అడవులనుంచి గ్రామాల్లోకి, అక్కడినుంచి పట్టణాల్లోకీ వెళుతున్నాం. సాంఘిక జీవనంకోసం కోలనీల్లో, అపార్ట్‌మెంట్లలో నివశిస్తున్నాం, ఎక్కువ సుఖం కావాలంటే ఎక్కువసంపాదన కావాలి. అందుకే రోజుకి ఎనిమిది గంటలకి బదులుగా పద్నాలుగు గంటలు పని చేస్తున్నాం. విద్య, వైద్యం లేకుండా మనకి రోజు గడవదు. జీవన ప్రమాణం, ఆరోగ్యం, సాంఘికజీవనం, విజ్ఞానం, సౌకర్య వంతమైన జీవితం.. వీటికొసమే పట్ణవాశం. కానీ, ఏ రోజూ మనం బ్రతుకుతున్న జీవితం గురించి తృప్తిలేదు. దూరపుకొండలు నునుపు అన్నట్టు మన ఆలోచనలు ఎప్పుడూ పర్ణశాలల చుట్టూ తిరుగుతుంటాయి. పనిలో, బాధ్యతల్లో ఆనందం ఉందని తెలుసుకోలేనివాడు ఎక్కడా ఆనందంగా ఉండలేడు. పో, ఇక్కడినుంచి,` అని అతని గుండెలమీద తన్నాడు.    

ఆ కుదుపుకి మెలుకువ వచ్చింది. నోరు పిడచ కట్టుకుపోయి ఉంది. నుదిటి మీద పట్టిన చెమట చంపలమీదుగా కారి, తలగడను తడిపేస్తుంది. చీకటిలో వాల్ క్లాక్ చేస్తున్న చప్పుడు భయంకరంగా వినిపిస్తుంది. లేచి వెళ్ళి మంచినీళ్ళు తాగి వచ్చి పడుకొన్నాడు. మళ్ళీ ప్రొద్దున్నే తొందరగా లేవాలి. ఆఫీసులో చాలా పని ఉంది.

 © Dantuluri Kishore Varma 

Saturday 2 February 2013

కాఫీ, టీ... కాదేదోయ్ బ్లాగ్ టపాకనర్హం!

తెల్లవారేసరికి కాఫీయో, టీనో గొంతుదిగకపోతే రోజు మొదలవని జనాలు ఇంటింటికీ ఉంటారు. ఓం ప్రధమంగా ప్రత్యూషవేళ తాజా సువాసనల కాఫీ ఓ కప్పు లాగించేస్తే, ఆ తరువాత రోజంతా అరారగా తేనీరు సేవనంతో గడిపేయవచ్చు. షెర్లాక్ హోంస్‌కీ, మనబాపూగారికీ నోటిలో పైపు; శ్రీ శ్రీ గారికి వెలుగుతున్న సిగరెట్టు, విన్‌స్టన్ చర్చిల్‌కి నోరుపట్టనంత సిగారు, దేవదాసుకి మందుగ్లాసు ఎలాగో కొంతమందికి పొగలుకక్కుతున్న టీ గ్లాసు అలా ఓ సింబలు. సౌకర్యంగా ఉండటానికి వీళ్ళని టీ రాయిళ్ళు, కాఫీ రాయుళ్ళు అని పిలుచుకోవచ్చు. 

`కాఫీలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. అది ఒంటికి అంత మంచిది కాదు. కాబట్టి ఎక్కువ తాగకండి,` అని చెబుతుంటారు. `టీలో ఐరన్ ఉంటుంది. యంత్రాల మీద తేయాకుని గుండగా కొట్టే దశలో ఇనుపచక్రాల రాపిడి వల్ల పొడిలో కలిసే ఇనుపరజను కొంతశాతం దాటి ఉంటే ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్ల వచ్చు,` అని కూడా అంటారు. `వేడివేడిగా టీ, కాఫీలని పుచ్చుకోవడం వల్ల గొంతు కేన్సర్ రావచ్చు,` అని డాక్టరు గారు చెప్పిన మర్నాడే న్యూస్ పేపర్లోనో, టీవీ చానల్ లోనో, పత్రికల్లోనో `ఇవి తాగితే ఉల్లాసమే, ఉల్లాసం,` అని ఆకాశానికి ఎత్తేస్తారు. స్థిత ప్రజ్ఞత అనే మాటకి సరయినా అర్థం చెప్పే స్టయిల్లో తేనీటి కప్పు చేత బూని, చిద్విలాసంగా కాఫీ, టీ సంబంధిత మంచీ, చెడ్డ కబుర్లన్ని చెప్పేసుకోనే టీరాయుళ్ళు `ఔరా!` అనిపిస్తారు. చాక్లెట్ల లాగానే టీని కూడా మంచిదో, చెడ్డదో ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. చెడ్డదే అని తిరుగు లేకుండా చెప్పే పరిస్థితి లేదు కనుక టీ రాయుళ్ళకి బహుశా ఈ ధీమా.

ఒకసారి పుస్తక ప్రచురణకర్తల ఆహ్వానం మీద అమెరికా వెళ్ళిన ఆర్కే నారాయణ్, ఒక రెస్టారెంట్‌లో కాఫీకి ఆర్డర్ చేసినప్పుడు, `వైట్ ఆర్ బ్లాక్?` అని అడగడంతో చిర్రెత్తుకొస్తుంది. వైట్ గానో, బ్లాక్ గానో ఉంటే దాన్ని అసలు కాఫీ అనే పిలవకూడదు అంటాడు. కాఫీ గింజల్ని దోరగా వేయించుకొని, గుండచేయించుకొని, ఫిల్టర్లో వేసుకొని, కషాయం దిగాకా సరైన పాళల్లో పాలు కలుపుకొని, చేదు వదిలీ వదలకుండా పంచదార కలుపుకొని పొగలుకక్కుకొంటూ తాగే కాఫీయే అసలైంది అని ఉపన్యాసం పీకుతాడు.  ఇలాంటి కాఫీ ప్రియులు చాలా మంది ఉంటారు. కాకినాడ మెయిన్ రోడ్డులో మసీదు మీదుగా వెళుతున్నప్పుడు కమ్మని కాఫీ పరిమళం ముక్కు పుటాల్ని తాకుతుంది. అక్కడ ఒక కాఫీ పొడులమ్మే షాపు ఉంది లెండి! మనకి వెంటనే కాఫీ తాగెయ్యాలనే బలమైన కోరిక కలుగుతుంది. జనాల ఈ ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకొనే శేఖర్ కమ్ముల మంచి కాఫీ లాంటి సినిమా తీస్తే విరగబడి చూశాం. ఈ విశేషణాన్ని సూపర్ అనే మాటకి పర్యాయ పదంగా వాడితే మనం ఏ మాత్రం తికమక పడకుండా అర్థం చేసుకొన్నాం. కాఫీ మహత్యం అది!    

అల్లం టీ, మసాలా టీ, ధం టీ, బాదం టీ, చాక్లేట్ టీ, లెమన్ టీ, ఇరానీ టీ, ఆయుర్వేదం టీ అని రకరకాలు టీలని ఎప్పటి కప్పుడు రుచిచూస్తూ ఆనందిస్తున్నాం. చార్మినార్ టీ సెంటరు, వినాయకా కెఫే, కోకిలా టిఫిన్స్, మహీంద్రా స్వీట్స్ లాంటి ప్రదేశాల్లో జనాలు నిరంతరం కబుర్లు చెప్పుకొంటూ, టీలు చప్పరించడం కనిపిస్తుంటుంది. `టీ కొట్టు పెట్టుకొని, కరువు లేకుండా బ్రతికేయవచ్చు,` అంటాడు మా స్నేహితుడు ఈ పరిస్థితి చూసి. అతని కాలిక్యులేషన్ చూడండి ఎలా ఉందో - ఉదయం ఏడు నుంచి పది వరకూ, మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి ఏడు వరకూ ఎప్పుడు చూసినా కనీసం రెండువందలమంది ఈ పెద్ద టీ స్టాళ్ళ దగ్గర కనిపిస్తారు. ఒక కప్పు తాగడానికి సుమారు పదినిమిషాలు సమయం పడితే, ఒక్కో షాపు దగ్గరా ప్రతీ పదినిమిషాలకీ రెండువంద కప్పులు తాగుతున్నట్టు. గంటకి పన్నెండు వందలు. రోజులో ఎక్కువ జనసమ్మర్ధం ఉన్న ఆరు, ఏడు గంటల సమయాన్ని తీసుకొంటే మొత్తమ్మీద రోజులో ఎంతలేదనుకొన్నా ఎనిమిది వేల కప్పులు. కప్పుకి అన్ని ఖర్చులూ పోను రూపాయ మిగలదా? - ఇదండీ ఆయన గారి లెక్క. `ఇలాంటి వారి వల్లే కొట్లకి దిష్టి యంత్రాలు కట్టుకొంటారు,` అంటారా? అదీ నిజమే. ఆ ముచ్చట అలా ఉంచండి. ఇంతకీ మీకు లెక్క తేలిందా, లేదా?  

ఇక్కడ ఇంకొక చమత్కారమైన విషయం ఉంది. `టీ రేటంతా?` అంటే అది ఒక్కో సందర్భంలో ఒక్కోలా ఉంటుందని చెప్పాలి. `టిప్పు`కి తెలుగు మాట `టీకి డబ్బులు`. టీ అంటే ఇంగ్లీసు కదా? తెలుగు మాటంటావా? అని నన్ను కొట్టడానికి రావద్దు. మన తెలుగోళ్ళమందరం తేడా లేకుండా వాడేస్తున్నాం కనుక దాన్ని అలా చెప్పానంతే. ఇక టిప్పు దగ్గరకి వస్తే - మీ రెప్పుడయినా ఫ్రిజ్జో, సోఫాసెట్టో, మరోటో కొనుక్కొన్నారనుకోండి, దాన్ని ట్రాన్స్‌పోర్ట్ ఆటోలోకి ఎక్కించిన షాపులో అసిస్టెంటు టీకి డబ్బులడుతాడన్నమాట. ఇది టిప్పు. మీరు టీ ఖరీదు ఐదు రూపాయలు తీసి చేతిలో పెడితే, మీకు టిప్పుల సాంప్రదాయం తెలియదని అర్థం. `యాభై,` అంటాడు వాడు. ఏదయినా అయ్యగారి ఆఫీసులో మీ ఫైలుని పక్కటేబులు దగ్గరకి కష్టపడి తీసుకొని వెళ్ళిన ఆఫీసు బోయ్‌కి టీ కిచ్చే డబ్బుల మొత్తం అయిదో, ఏభయ్యో కాకుండా మరోటేదో ఉంటుంది. ట్రాఫిక్ లైటు దగ్గర బండో, కారో ఆపినప్పుడు టికి డబ్బులని ఎవడైనా జోలె చూపిస్తే మీరు రూపాయే వెయ్యచ్చు! 
అదండీ సంగతీ. టీ, కాఫీల గురించి ఇంకా చాలా సంగతులున్నాయి కానీ, ప్రస్తుతానికి ఓ కప్పు టీ తాగి రిలాక్సవుదాం. ఏమంటారు?
© Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!