Pages

Tuesday 30 April 2013

అదే నవ్వు!

సందుమొదటిలో షేర్ ఆటో ఆగింది. కుమార్ దిగేడు. ఎండ సిమ్మెంట్‌రోడ్డుమీదపడి క్రిందనుంచికూడా వేడి వచ్చేస్తుంది. అక్కడికి ఇరవైమీటర్లదూరంలో ఆ వీధి అంతటికీ ఒకే ఒక గానుగచెట్టు, దానికి ఆనుకొని కుమార్ ఇల్లు. గానుగచెట్టు ఎడారిలో ఒయాసిస్సులా ఉంది.  దానినీడ విశాలంగా పరచుకొని ఉంది. చెట్టుమీద పక్షులు కునుకుతీస్తున్నట్టు చప్పుడు చెయ్యకుండా కూర్చున్నాయి. ఒకే ఒక కాకి మాత్రం అరుస్తుంది. ఓ కొబ్బరికాయల సైకిల్ చెట్టు మొదలుకి జారవేసి ఉంది. చెట్టుక్రింద నీడపట్టున నలుగురైదుగురు చేరారు. కుమార్ ఇంటి గేటునుంచి రోడ్డుకి కలిసే ఏటవాలు చప్టా పూర్తిగా నీడలో ఉండడంతో ఓ ముసలోడు తలక్రింద తుండుగుడ్డ పెట్టుకొని పడుకొని ఉన్నాడు. ప్రతిమధ్యాహ్నం వాడు అక్కడే సేదతీరుతుంటాడు.

కుమార్ ఆటో దిగడం చూసిన కొబ్బరికాయల సైకిలు వాడు ఒక్క ఉదుటున లేచాడు. `ఒరేయ్,ఓనర్రా!. చెట్టునీడేమయినా ఈడి తాతగారి సొత్తా? సైకిలు ఇక్కడ పెడితే, రోజుకి రెండు బొండాలు ఇయ్యాలట. ఈడెంకమ్మా...` అంటూ సైకిల్ తీసాడు, `....ఆడేం తిట్టినా నీకు చీమకుట్టినట్టుండదురా ముసలి నాయాలా. నువ్వు ఇక్కడే పడేడు. నేంపోతున్నా,` అనేసి - ముచ్చిక గిల్లి అంటించిన సిసింద్రీలా సర్ర్..మని అక్కడినుంచి పారిపోయాడు. మిగిలిన వాళ్ళు కూడా దాగుడు మూతలాటలో కుర్రాళ్ళలా `ఎక్కడి దొంగలక్కడే గప్ చిప్,` అన్నట్టు మాయమైపోయారు. ముసలోడు మిగిలి పోయాడు.  

తనరాక కలిగించిన అలజడిని కుమార్ స్పష్టంగా చూశాడు. `ఆ మాత్రం భయం ఉండాలి,` అనుకొన్నాడు. సెల్ఫ్ ఇంపార్టెన్స్‌తో చాతీ పొంగింది. కానీ చొక్కా బొత్తాల్ని తెంపేసేలా తన్నుకు వస్తున బొజ్జ ముందు, పొంగిన చాతీ ఏమీ కనిపించలేదు. బ్యాగ్ బరువుకేమో ఎడమభుజం లాగుతుంటే దాన్ని కుడివైపుకి మార్చుకొని ఇంటివైపు పెద్ద పెద్ద అంగలతో నడిచాడు.  

ముసలోడు అటెన్‌షన్‌లోకి వచ్చేశాడు. తలక్రింద పెట్టుకొన్న తుండుగుడ్డ చంకలోకి వెళ్ళిపోయింది. గేటు మూలలోకి నక్కిపోయి కూర్చున్నాడు. 

`ఎన్నిసార్లు చెప్పినా బుద్దిరాదురా నీకు? ఎండదెబ్బకి నువ్వు గేటు ముందు చస్తే నాకు అదొక తలనెప్పి. పోరా ఇక్కడి నుంచి. మళ్ళీ కనిపించావంటే కాళ్ళు విరగ్గొడతాను,` అన్నాడు. ముసలోడు ఏమీ సమాదానం చెప్పలేదు. పళ్ళ చిగుళ్ళు  కనిపించేలా నవ్వాడంతే! సరిగ్గా ఆ సమయంలో కుమార్ బీ.పీ ఎవరైనా కొలవడానికి ప్రయత్నిస్తే - పైలెవెల్ బద్దల గొట్టుకొని పాదరసం ఫౌంటెన్లా చిమ్మేసి ఉండేది! ఉగ్రంగా పళ్ళుకొరుక్కొన్ని, విసురుగా గేటు తీశాడు. గుండెల్లో కలుక్కు మంది.  

ఆ సమయంలో ఇంటిలో ఎవరూ ఉండరు. కుమార్ పెళ్ళం అక్కడికి ఒక కిలో మీటరు దూరంలో ఉన్న మీ-సేవ ఆఫీసులో కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తుంది. పిల్లలు స్కూలు, స్టడీ అవర్లు పూర్తిచేసుకొని సాయంత్రం ఎప్పుడో ఇల్లు చేరతారు. గేటు మూసి, మెయిన్‌డోర్ తాళంతీసుకొని లోపలికి వెళ్ళి, తలుపు మూశాడు. నుదురు చెమటతో తడిసిపోయింది. నోరు పిడచ కట్టుకు పోతుంది. మంచినీళ్ళు తాగితే సుఖంగా ఉంటుందేమో! అడుగులో అడుగు వేసుకొంటూ ఫ్రిడ్జ్ వైపు నడిచాడు. డోర్ తీస్తుండగా ఉప్పెనలా గుండెల్లోకి నొప్పి తన్నుకు వచ్చింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. చెయ్యిజారి బాటిల్స్ నేలమీద పడి `బళ్ళు` మని బ్రద్దలయ్యాయి. కుమార్ కుప్ప కూలిపోయాడు.

*  *  *

ఇరవై రోజుల తరువాత ఆ ఇంటిముందు ఓ టాక్సీ ఆగింది. వెనుక డోర్‌లోంచి పెళ్ళాం సహాయంతో కుమార్ దిగేడు. లుంగీలో ఉన్నాడు. చేతికి సెలైన్లు ఎక్కించిన చోట ఇంకా ప్లాస్టర్లు అలాగే ఉన్నాయి. కొబ్బరికాయలు వాడు ఎక్కడికీ పారిపోలేదు,  నుంచుని చూస్తున్నాడు. ముసలోడు ఎప్పటిలాగే  కూర్చుని ఉన్నాడు. కుమార్ కారులోంచి దిగడం చూసి పళ్ళ చిగుళ్ళు కనిపించేలా నవ్వాడు. హార్టాపరేషన్ చేయించుకొని అప్పుడే హాస్పిటల్‌నుంచి డిస్చార్జ్ అయిఉన్నాడుకనుక సరిపోయింది కానీ, లేకపోతే వచ్చిన కోపానికి ముసలోడిని అక్కడే గొంతుపిసికి చంపేసును. తలుపుమూసేముందు కసిగా  `పోరా ముసలిపీనుగా,` అన్నాడు.

నవ్వుతున్న ముసలోడిని చూసి ఒళ్ళుమండిపోయింది కొబ్బరికాయల వాడికి. `ఇసయం ఇంకా ఆ బాబుకి తెలిసుండదు. చప్పుడువిని నువ్వెల్లి సూడకపోతే ఆ పొట్టోడి పని ఏటయ్యేది ఆయాల?`  అన్నాడు. ` చల్లగా పడుకొన్న ఒక్కడంటే ఒక్కడు బయటకి రాలేదు. ఎండలో చెప్పుల్లేకుండా పరుగెత్తుకెల్లి ఆళ్ళావిడ్ని తోలుకు రాకపోతే ఆడూ, నిన్ను తిట్టడానికి ఆడినోరూ ఉండేయి కాదు. ఆయమ్మ చెపితే నిన్ను పిలిచి బువ్వెడతాడేమోరా!` అన్నాడు.  

ముసిలోడు పళ్ళ చిగుళ్ళు కనిపించేలా నవ్వాడు.
© Dantuluri Kishore Varma

Monday 29 April 2013

వంకరగా పెరిగిన చెట్లు

ఇంగ్లీషులో ఏబ్‌స్టినెన్స్(abstinence) అనే ఒక పదం ఉంది. అంటే మధ్యపానం, మత్తుమందులు, దూమపానం, అక్రమ మరియు వివాహేతర సెక్స్ సంబంధాల వంటివాటినుంచి దూరంగా ఉండడం. `ఎందుకు దూరంగా ఉండాలి?` అంటే....మనం రోజు చూస్తున్న నేరాల్లో సగంపైగా వాటికి కారణం ఇవే. 

సంపాదించిన దానిలో తొంభైశాతం వ్యసనాలకి ఖర్చుపెట్టేసి, కుటుంభాన్ని పస్తులు పడుకోబెట్టే ప్రబుద్ధులు ఎందరో. ఎందుకిలా చేస్తున్నావని అడిగితే గృహహింస మొదలౌతుంది. మందుబాబుల పని ఇలా ఉంటే పొగరాయుళ్ళు వాతావరణాన్ని కలుషితం చేస్తూ, తమ ఊపిరితిత్తుల్ని పొగగొట్టాల్లాగ మసిబార్చుకొని వందేళ్ళ జీవితాన్ని నలభై, ఏభైలకే ముగిస్తున్నారు. ఇవి పర్పస్‌లెస్ డెత్స్!  కామాందుల విషయానికి వస్తే `కామాతురాణాం న భయం! న లజ్జ!!`   అన్నట్టు   విచక్షణ మరచి పశువుల్లా సమాజం మీద తెగబడుతున్నారు.

`తప్పు! అలా చెయ్యకూడదు,` అని సుద్దులు చెప్పడం చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు ఉంటుంది. ఎవరూ వినరు. ఒకసారి మందురాయుళ్ళు కొంతమందికి ఎవర్షన్ థెరపీ చేస్తూ ఒక ప్రయోగం చేసి చూపించారు. రెండు గాజు గ్లాసులని వాళ్ళముందు ఉంచి ఒకదానిలో మంచినీరు, రెండవదానిలో సారాయినీ పోశారు. అప్పుడు రెండు కీటకాలని తీసుకొని వచ్చి ఒక్కో గ్లాసులో ఒక్కోదాన్ని వేశారు. మంచినీళ్ళ గ్లాసులో ఉన్నది అంచువరకూ ఈదుకొని వచ్చి, పైకి ఎక్కేస్తుంది. మందు గ్లాసులో ఉన్నది మాత్రం కొంచం సేపు ప్రయత్నించి మునిగి పోతుంది. ఇది ఆల్కహాల్ ప్రభావాన్ని చక్కగా వివరించే అద్భుతమైన ప్రయోగం. `దీన్ని బట్టి మీకు ఏమి అర్థమైంది?` అని అడిగిన డాక్టర్లకి షాకిచ్చే సమాదానం చెప్పి మందుబాబులు `మేం మారమంటే మారం!` అనే దృక్పదాన్ని స్పష్టంగా వ్యక్తీకరించారు. ఇంతకీ వాళ్ళిచ్చిన సమాదానం ఏమిటంటే - `ఆల్కహాల్ సేవిస్తే కడుపులో క్రిములు చస్తాయి. కాబట్టి ఆల్కహాల్ ఆరోగ్యానికి చాలా మంచిది ,` అని. ఈ జోకు చాలా మంది వినే ఉంటారు.  అయినప్పటికీ దీనిని ఇక్కడ ఉదహరించడానికి కారణం కరుడు గట్టిన వ్యసనపరులు అంత త్వరగా మారరు అని చెప్పడానికే. 

మారే అవకాశం లేదని కాదు. కానీ, ఒక వ్యసనం మానడానికి బలమైన కారణం ఉండాలి. చాసో అని పిలవబడే చాగంటి సోమయాజులు గారు రాసిన కథ `ఎందుకు పారేస్తాను నాన్నా?` అనేది ఈ విషయాన్నేచెపుతుంది. కృష్ణుడనే కుర్రాడు, చదువంటే చాలా ఇష్టం వాడికి. కానీ, కుటుంభానికి ఫీజు కట్టగలిగిన స్థోమత లేదు. బడి మానిపిస్తానంటాడు తండ్రి. ఒకరోజు కొట్టుకి వెళ్ళి చుట్టలు తెమ్మని, కృష్ణుడి చేతికి డబ్బులు ఇస్తాడు. దారిలో, బడిని చూసి ఆగిపోతాడు కుర్రాడు, అక్కడే కూర్చుండిపోతాడు. ఎంతకీ ఇంటికి రాని కొడుకుని వెతుక్కొంటూ వచ్చిన తండ్రిని వెక్కి వెక్కి ఏడుస్తూ బడిలో వెయ్యమని బ్రతిమాలతాడు. ఏ మనసు మాత్రం కరుగకుండా ఉంటుంది? `సరే, రేపు వద్దాం,` అంటాడు తండ్రి.  `కాదు ఇప్పుడే. కనీసం పుస్తకమైనా కొనిపెట్టు, రేపు పంపుతావని నమ్ముతాను,` అంటాడు కుర్రాడు. దానికైనా డబ్బులుండాలి కదా? నిజానికి తండ్రి చుట్టలు మానేస్తే అది కొడుకు చదువుకి సరిపోతుంది. `అయితే సరే, ఇందాక చుట్టలు తెమ్మని ఇచ్చిన డబ్బులు ఉన్నాయా, పారేశావా?` అని అడుగుతాడు, వాటితో ఇంగ్లీషు పుస్తకం కొనాలని నిస్చయించుకొంటూ.  

ఇతిహాసాల్లో, పురాణాల్లో, ఆధునిక సాహిత్యంలో ఈ వ్యసనాల గురించి అన్నో కనువుప్పు కలిగించే కథలు కనిపిస్తాయి. రాముడ్ని కోరుకొన్న సుర్పణక ముక్కూ, చెవులూ కోల్పోతే; పరస్త్రీని వాంచించి ప్రాణాలే కోల్పోయాడు రావణాసురుడు. అహల్య రాయయితే, ఆమెని పొందిన ఇంద్రుడు శాపగ్రస్తుడై వొళ్ళాంతా తన కామపూరిత వికారపు ఆలోచనలు తెలియజేసే కళ్ళను పొందాడు. చాలా కాలం క్రితం ప్రఖ్యాత కార్టూనిస్ట్ జయదేవ్  దూమపానం మీద ఒక కార్టూన్ గీస్తే అంతర్జాతీయ స్థాయిలో బహుమతి గెలుచుకొంది అది. సిగరెట్ నుంచి వెలువడుతున్న పొగ ఒక సర్పంలా వెనుకనుంచి పొగ పీలుస్తున్న వాడిని కబళించడానికి వస్తుంటుంది. ఎన్నో ఏళ్ళక్రితం చూసినా మనసులో ముద్రపడిపోవడానికి కారణం చెప్పినవిధానమే. పదిపేజీల్లొ రాసినా చెప్పలేనిదాన్ని కొన్నిగీతల్లొ చూపించారు. వ్యసనాలవల్ల జరిగే అనర్ధాలని ఇటువంటి వాటి సహాయంతో  పిల్లలకి చెప్పాలి.

నేషనల్ కరికులం ఫ్రేంవర్క్‌(NCF)లో చదువుతోపాటూ నేర్చవలసిన విలువల చిట్టాను తయారుచేశారు. వ్యక్తిగత విలువలు, కుటుంభ విలువలు, సామాజిక విలువలు, జాతీయ విలువలుగా వాటిని విభజించి ప్రచురించారు. ఈ వ్యాసం మొదటిలో చెప్పిన ఏబ్‌స్టినెన్స్ కూడా వీటిలో ఒకటి.  పాఠశాలల్లో మోరల్ ఎడ్యుకేషన్‌ని తప్పనిసరి చెయ్యాలి. తల్లి తండ్రుల కొంత సమయాన్ని మంచి విషయాలు చెపుతూ పిల్లలతో గడపాలి. అప్పుడే జాతి యావత్తూ సిగ్గుతో తలవంచుకొనేలాంటి అత్యాచారాలు జరిగే సంభావ్యత తగ్గుతుంది. వంకరగా పెరిగిన చెట్టుని సరిచెయ్యడం కష్టం! కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే నిటారుగా పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యావేత్తలు, ప్రభుత్వం దీనిని పూర్తిగా సమర్ధిస్తున్నా - ఆచరణలో పెడుతున్న వాళ్ళు ఎంతమంది?

© Dantuluri Kishore Varma 

ఇప్పటికైనా ఉద్యోగం వెత్తుక్కోరా బాబూ!

చీర్స్!

సిక్సర్ బార్ కార్నర్ టేబుల్ దగ్గర డిం లైటింగ్‌లో మూడు లిక్కర్ గ్లాసులు `టింగ్` మని చప్పుడు చేశాయి. 

`సంవత్సరం అయ్యిందిరా మనం ముగ్గురం కలిసి,` అన్నాడు వరుణ్, `ఈ రోజు బిల్లు మాత్రం నాదే. కాదంటే ఒప్పుకొనేది లేదు. మీరిద్దరూ నా గెస్టులు ఈ రోజు.` 

`ఫ్రీడం దొబ్బింది ఈ ఏడాదిగా. ఫైనల్ ఇయర్ అయ్యిందో లేదో కొంపలుమునిగినట్టు ప్లేస్‌మెంట్ వచ్చిపడింది మా ఇద్దరికీ. నువ్వు అదృష్టవంతుడివిరా బాబూ. ఫ్రీ బర్డ్‌లాగ తిరుగుతున్నావు,` అన్నాడు వరుణ్‌ని ఉద్దేశించి ప్రిన్స్‌రాంబాబు . ఫేస్‌బుక్‌లో వాడి పేరు అదే. అందరూ అలాగే పిలవడానికి అలవాటు పడ్డారు.

`వీడి అన్నను మెచ్చుకోవాలిరా అసలు. చిన్న ఉద్యోగం చేస్తూ వీడిని బీటెక్  చదివించడమే కాకుండా, ఇప్పటికి కూడా పోకెట్ మనీ ఇస్తున్నాడు చూడు అందుకు,` డార్లింగ్ ప్రసాదు అన్నాడు.

గ్లాసులో ఎర్రగా మెరుస్తున్న ద్రవంకేసి రెప్పవెయ్యకుండా చూస్తున్నాడు వరుణ్. గిల్టీ ఫీలింగ్ లాంటిది కలుగుతుంది డార్లింగ్ ప్రసాద్ మాటలకి. `ఇంకేంటిరా సంగతులు,` అన్నాడు. టాపిక్ డైవర్ట్ అయ్యింది. కాలేజీ రోజుల్లోకి దొర్లుకొంటూ వెళ్ళిపోయారు. చికెన్ మంచూరియా నంజుకొంటూ తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకొన్నారు. పుర్తయ్యే సరికి రాత్రి పదకొండు అయ్యింది. 

విడిపోయే ముందు ప్రసాదూ, రాంబాబు మరీ మరీ చెప్పారు వరుణ్‌కి చెన్నై వచ్చేస్తే వాళ్ళ రూంలోనే ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చెయ్య వచ్చని. `అలాగే,` నని ఇంటిదారి పట్టాడు. వీధిలైటు వెలుగులో ఏడు పోర్షన్ల ఇంటిలో వాళ్ళుండే మధ్య పోర్షన్ నాచుపట్టిన పురాతన సమాధిలా ఉంది. పేంట్ జేబులోనుంచి జండుబాం డబ్బా తీసీ, కొంత బాంని నుదుటికి, మెడ వెనుకా రాసుకొన్నాడు. అలా చేస్తే, మందు వాసన వదినకి తెలియకుండా ఉంటుంది. వెళ్ళి తలుపు కొట్టాడు.  

వదిన తలుపు తీసింది. `మళ్ళీ తలనొప్పా? భోజనం చేస్తావా?` అంది. ఆమె కళ్ళు ఏడ్చి నట్టు ఎర్రబడి ఉన్నాయి. `ఆకలి లేదు వదినా. పడుకొంటాను,` అన్నాడు. `రేపు ఉదయం నేనూ, మీ అన్నయ్యా చిన్నూ స్కూలుకి వెళ్ళాలి. టెర్మ్ ఫీజు కట్టడానికి చివరిరోజు. మేము తిరిగి వచ్చేలోగా నువ్వు బయటకు వెళితే ఇంటి తాళం పక్క పోర్షన్‌లో ఇచ్చి వెళ్ళు,` అంది. అలాగే అని తల ఊపాడు. సాయంత్రం బార్‌కి వెళ్ళే ముందు హేంగర్‌కి తగిలించిన అన్నయ్య షర్ట్ జేబులో ఐదొందల కాగితాలు కనిపించాయి. స్కూల్ ఫీజు కట్టడంకోసం వదిన వంటిమీద ఉన్న చిట్ట చివరి బంగారం పిసరు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు. `నేను ఒక నోటు తీసిన సంగతి వీళ్ళకు తెలిసి ఉంటుందా!?` అనుకొంటూ ఉండగా నిద్ర పట్టేసింది.  

డార్లింగ్ ప్రసాదునీ, ప్రిన్స్‌రాంబాబునీ సర్కార్కి ఎక్కించి వచ్చే సరికి సాయంత్రం అవుతుంది. ఆఫీసుకి శెలవు పెట్టినట్టున్నాడు, అన్నయ్య ఇంటిలోనే ఉన్నాడు. వరుణ్ ఇంటికి వచ్చిన విషయం గమనించలేదు. లోపలి గదిలోనుంచి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. అన్నయ్య అంటున్నాడు, `అప్పుడప్పుడూ ఆపదలో ఉన్నవాళ్ళకి బ్లడ్  డొనేట్ చెయ్యడమే కానీ, ఎప్పుడూ డబ్బు తీసుకొన్నది లేదు. ఈ రోజు అడిగి మరీ అయిదు వందలు తీసుకోవలసి వచ్చింది,` అని.
© Dantuluri Kishore Varma

Sunday 28 April 2013

రాజా పార్క్

రాజా పార్కుని మొదటిలో కుళాయి చెరువు అని పిలిచేవారు. నగరానికి నీటి అవసరాలని తీర్చే అతిపెద్ద చెరువు ఇది. విశాలంగా ఉన్న గట్టు మీద, చెరువు ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో వ్యవసాయ ఫల పుష్ప ప్రదర్శన అని పిలవబడే ఎగ్జిబిషన్‌నీ ప్రతీసంవత్సరం నిర్వహించేవారు. ఇప్పుడు ఈ ఖాళీ స్థలాన్ని వేరుచేసి, చెరువు ప్రాంతాన్ని మాత్రం రాజా పార్క్(వివేకానందా పార్క్) గా అభివృద్ది చేశారు. చుట్టూ ఉన్న గట్టుని వాకింగ్‌ట్రాక్ గా మార్చి, నీటికి అభిముఖంగా బెంచీలు ఏర్పాటు చేశారు. బోటు షికారు ఉంది. పచ్చని చెట్లు, సమృద్దిగా ఉండే నీరు, ఆహ్లాదకరమైన వాతావరణం, పెద్ద లైబ్రరీ, పిల్లలకి అడుకోవడానికి అనువైన స్థలం, స్కేటింగ్ రింక్, అక్కడక్కడా మహానుభావుల విగ్రహాలు మొదలైన వాటితో కాకినాడ వాసులకి ఇష్టమైన ప్రదేశంగా తీర్చిదిద్దారు. ఈ ఫొటోలు చూసి ఆనందించండి.    




















© Dantuluri Kishore Varma

Sunday 21 April 2013

ఎ ట్రెయిన్ టు పాకిస్థాన్

రెండవ ప్రపంచ యుద్దం, అమెరికా అంతర్యుద్ధం, ఫ్రెంచ్ విప్లవం లాంటి చారిత్రకమైన సంఘటనలని ఆధారంగా చేసుకొని చాలా నవలలు వచ్చాయి. మనదేశంలో కూడా అటువంటి దురదృష్ఠకరమైన సంఘటనలు జరిగినా వాటి నేపద్యంగా రాసిన నవలలుకానీ, కథలు కానీ ఎక్కువగా కనిపించవు. పేపర్లలో, పత్రికల్లో వార్తలుగా, వార్తాకథనాలుగా వాస్తవాలను రాయడం వేరు, వాటిని సామాన్యుల దృష్ఠి కోణంనుంచి ఆవిష్కరించడం వేరు. ఉదాహరణకి 1947 దేశవిభజన సమయంలో జరిగిన అల్లర్లలో సుమారు పదిలక్షల మంది చంపబడ్డారట, ఒకకోటిమంది వాళ్ళ, వాళ్ళ ప్రదేశాలనుంచి వెళ్ళగొట్ట బడ్డారట. దీనిని ఇలాగే చెపితే `అయ్యో!` అనుకొని ఒక గంటలో మరచిపోతాం. కానీ, మానోమజ్రా అనే ఒక ఊరిని సృష్ఠించి, అక్కడ  ప్రజల బ్రతుకుల్లో దేశవిభజన ఏ రకమైన కల్లోలం కలిగించిందో కొన్ని కల్పిత పాత్రల చుట్టూ కథ అల్లి, ఆ కల్లోల పరిస్థితుల్ని పాఠకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తాడు రచయిత కుష్వంత్‌సింగ్ 1956లో రాసిన తన నవల ఎ ట్రెయిన్ టు పాకిస్థాన్‌తో. 

మానో మజ్రా పంజాబ్‌లో సట్లెజ్ నది వొడ్డున, పాకిస్థాన్ సరిహద్దు ప్రక్కనే ఉంటుంది. సట్లెజ్ నదిమీద ఒకరైల్వే బ్రిడ్జ్, ఊరిలో రైల్వే స్టేషన్ ఉంటాయి. రెండు వర్గాల ప్రజలు ఉంటారు. సిక్కులు, ముస్లింలు. వీళ్ళుకాక ఒకే ఒక హిందూ కుటుంభం ఉంటుంది - వడ్డీ వ్యాపారి లాలా రాం లాల్‌ది. జుగ్గత్‌సింగ్ అనే బందిపోటు దోపిడీలు, హత్యలు చేస్తూ, జైలుకి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఇతనికి నూరాన్ అనబడే ముస్లిం యువతితో ప్రేమాయణం ఉంటుంది. కథా గమనంలో ఇంకా కొంతమంది వ్యక్తులు వస్తారు. కుష్వంత్ సింగ్ ఈ పాత్రల రోజువారి వ్యాపకాలని నిశితంగా వర్ణిస్తూ, వాటికి నిజమైన వ్యక్తుల్లాంటి విస్వశనీయత కలుగ జేస్తాడు. కథలో లీనమైపోతాం. సంఘటనలన్నీ నిజంగా జరుగుతున్నట్టు ఉంటాయి.                  

ఒకరాత్రి జుగ్గత్ సింగ్, నూరాన్‌లు ఊరిబయట పొలాల్లోకి రహస్యంగా కలుసుకోవడానికి వెళతారు. అదే సమయంలో ఒకబందిపోట్ల ముఠా ఊరిలో ప్రవేశించి రాంలాల్ ని హత్యచేసి డబ్బులు లూటీ చేసి పోతారు. ఇక్బాల్ అనే యూరోప్‌లో చదువుకొన్న సిక్కు యువకుడు సంఘసంస్కరణాభిలాషతో హత్యజరిగిన తరువాతరోజు మానో మజ్రాకి వస్తాడు. అనుమానం జుగ్గత్ సింగ్ మీద, ఇక్బాల్ మీదా వస్తుంది. ఇద్దరినీ అరెస్ట్ చేసి లాకప్‌లో పెడతారు.  నిజానికి వీళ్ళిద్దరికీ, రాంలాల్ హత్యకీ సంబంధంలేదు.

దేశవిభజన సమయం అది - పరాయి మతాల మీద అకారణ ద్వేషంతో హత్యలు, మానభంగాలు, లూటీలు లాంటి అకృత్యాలు జరుగుతున్నాయి. తరతరాలుగా ఒక ప్రాంతంలోనే ఉన్నా హిందువులు, సిక్కులు సరిహద్దు ఇవతలకి వస్తే; ముస్లింలు అటువైపు వెళ్ళాలి. వాళ్ళని ట్రెయిన్లలో సరిహద్దులు దాటిస్తారు. కొంపా, గోడూ వదిలి పరాయి ప్రాంతానికి పారిపోతున్న అసహాయుల్ని సరిహద్దు దాటడానికి ముందే మతమౌడ్యం తలకెక్కిన పిచ్చివాళ్ళు ఊచకోత కోస్తున్నారు.  మానోమజ్రా ప్రజలకు మాత్రం రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి.

ఒకరాత్రి పీనుగుల ట్రెయిన్ ఊరి స్టేషన్‌కి చేరుకొంటుంది.  కొన్ని రోజుల తేడాతో మరొకటి. తరువాత  జరిగిన కొన్ని సంఘటనల నేపధ్యంలో మానోమజ్రాలో ముస్లింప్రజలని రెఫ్యూజీ క్యాంపుకి తరలిస్తారు. మరునాడు వాళ్ళందరినీ సరిహద్దు దాటించాలి.  ముష్కరులు కొందరు ట్రెయిన్లో వెళ్ళబోయే వాళ్ళని ఊచకోత కోయాలని పధకం పన్నుతారు.  ఈ కుట్ర గురించి ఊరిలో మిగిలిన వాళ్ళకి, పోలీసులకి తెలుసు. కానీ ఎలా నిలువరించడం? తక్కువ సంఖ్యలో ఉన్న పోలీసులవల్ల కాదు. మరి ఎవరు ఆపగలరు -  జుగ్గత్‌సింగ్? ఇక్బాల్?? వాళ్ళిద్దరినీ విడిచిపెడతారు.

ముష్కరుల పధకంలో భాగంగా  ట్రెయిన్ ఎత్తుకంటే ఒక అడుగు పైన బ్రిడ్జ్‌కి అడ్డంగా ఒక బలమైన తాడు కడతారు. దీనివల్ల పైన కూర్చుని ప్రయాణించే జనాలు క్రింద పడి మరణిస్తే, ఈ అయోమయంలో లోపల ఉన్నవాళ్ళని గన్నులతో కాల్చి చంపవచ్చనేది ప్లాన్. ఆయుదాలు పట్టుకొని తిరిగే వాళ్ళకి మంచి మాటలు చెప్పి మార్చుదామనుకొంటే, చెప్పిన వాడే ముందు బలవ్వాలి. కాబట్టి, ఇక్బాల్ నిస్సహాయంగా ఉండిపోతాడు. తాగి, తాగి నిద్రపోతాడు. కానీ, కథమొదటినుంచీ బద్మాష్‌గా ముద్రవెయ్యబడ్డ జుగ్గత్‌సింగ్ పరిస్థితి వేరు. వాడి ప్రియురాలు అదే ట్రెయిన్లో వెళుతుంది. ఆమెని కాపాడుకోవాలి. ఆమెతో పాటూ మిగిలిన అందర్నీ.

కథ చివరికి చేరుకొంటుంది. పట్టాల ప్రక్కన ఆయుదాలతో పొంచి ఉన్న వ్యక్తులు, రైలు వస్తుందని సూచించే  సిగ్నల్ పడిన తరువాత  బ్రిడ్జ్‌కి అడ్డంగా కట్టిన తాడుమీద ఒక ఆకారాన్ని గమనిస్తారు. ఏమిజరుగుతుందో తెలిసేలోగానే ట్రెయిన్ సమీపిస్తుంది. తాడుమీద వ్యక్తి దాన్ని తెంపడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడ్ని కాలుస్తారు. పట్టువదలడు. మళ్ళీ మళ్ళీ  బుల్లెట్ల వర్షం కురుస్తుంది. చివరి క్షణంలో తాడుతెగిపోతుంది. జుగ్గత్‌సింగ్ పట్టాలపైన పడతాడు. ట్రెయిన్  సురక్షితంగా వెళ్ళిపోతుంది.

కథలో పాత్రలమధ్య అనుబంధం, సహజీవనం ఒక మానవీయకోణాన్ని ఆవిష్కరిస్తాయి. జరుగుతున్న అల్లర్లని, నిస్సహాయంగా బలవుతున్న సామాన్యుడి దృష్టికోణంనుంచి అవగాహన చేయ్యడం సాహిత్యంయొక్క ప్రధానమైన ప్రయోజనం. రచయిత రక్తపాతాన్ని ఎక్కడా గ్లోరిఫై చెయ్యడు, మతపక్షపాతం చూపడు. కేవలం పాత్రలే కథని నడిపిస్తాయి. అందుకే, ఈ నవల కుష్వంత్‌సింగ్ యొక్క మేగ్నం ఓపస్ అయ్యింది. క్లాసిక్స్‌లో ఒకటిగా పరిగణించ బడుతుంది. నూట యాభైఏడు పేజీల చిన్ని నవల. దీనిగురించి రెండుముక్కల్లో చెప్పాలంటే - మనసులో ముద్రవేస్తుంది.
© Dantuluri Kishore Varma 

Friday 19 April 2013

ఉత్సాహం లేని చదువు, ఏకాగ్రత లేని పని, లక్ష్యం లేని ప్రయాణం ఏ ఫలితాన్నీ ఇవ్వవు.

ఒకసారి ముప్పై అయిదు భాగాలుగా ఉన్న ఎన్సైక్లోపీడియా బ్రిటానికాని తెప్పించుకొని వివేకానంద చదువుకొంటున్నాడట. ఆ బరువైన పుస్తకాలని చూసి ఒకాయన, `వీటిని చదివి అర్థంచేసుకోవాలంటే ఒక జీవితకాలం సరిపోదేమో!` అని వ్యాఖ్యానించాడట. కొత్తపుస్తకాలు చదివితే కొత్త ఆలోచనా ద్వారాలు తెరుచుకొంటాయనే అవగాహన లేని వాళ్ళకి, చదవడం మీద ఆసక్తి ఉండదు. అప్పుడు, ఆ వ్యక్తి అన్నట్టు ఒక జీవితకాలం దేనికీ సరిపోదు. కానీ, వివేకానంద ఇలా అంటాడు, `నేను ఇప్పటికే పది పుస్తకాలు పూర్తిగా చదివేశాను, కావాలంటే పరీక్షించుకో,` అని. ఆ పది పుస్తకాలనుంచీ అక్కడక్కడా కొన్ని ప్రశ్నలు అడిగితే ఎటువంటి తడబాటూ లేకుండా జవాబులు చెపుతాడు. అంత తక్కువసమయంలో చదివి, చక్కగా గుర్తుపెట్టుకోవడానికి కారణం కొత్తవిషయాలు నేర్చుకోవాలన్న అతని ఉత్సాహమే. 

సరాసరి భూమిమీద ప్రసరించే సూర్యకిరణాలు ఒకస్థాయిలో వేడిని కలిగిస్తాయి. కానీ వాటినే ఒక భూతద్దం ద్వారా ప్రసరింపచేస్తే, ఎండుటాకుల్ని, కాగితాల్ని కాల్చగలుగుతాయి. ఇది కేంద్రీకృతం చెయ్యడంద్వారా ఎన్నో రెట్లు పెరిగిన శక్తి. ఇది చదువుకి, మనం చేసే అన్నిపనులకి కూడా  వర్తిస్తుంది. ఏదయినా ఏకాగ్రతతో చేస్తే ఫలిస్తుంది. వివేకానంద అమెరికాలో ఉన్నప్పుడు ఒకరోజు ఓ కొలను ఒడ్డున వ్యాహ్యాళికి వెళుతుంటే కొందరు వ్యక్తులు షూటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. కొన్ని గుడ్డు పెంకుల్ని తాడుతో కట్టి ప్రవాహం మధ్యలో వదులుతారు. చిన్ని చిన్ని కెరటాల మీద అవి తేలుతూ ఉంటాయి. వాటిని తమదగ్గర ఉన్న ఎయిర్‌గన్‌లతో కాలుస్తూ ఉంటారు. కానీ, ఒక్కరికీ సరిగా గురి కుదరదు. అప్పుడు వివేకానంద తాను ప్రయత్నిస్తానని వాళ్ళ దగ్గర గన్ తీసుకొని ఏకాగ్రతతో పన్నెండుసార్లు కాలుస్తాడు. ప్రతీసారీ ఒక్కొక్క పెంకుచొప్పున పన్నెండు పెంకులూ పగులుతాయి. అతను తుపాకీ పట్టుకోవడం జీవితంలో మొట్టమొదటిసారి అని తెలుసుకొని వాళ్ళు ఆశ్చర్య పోతారు.  ఇది ఏకాగ్రతవల్ల వచ్చిన మంచి ఫలితమే.
  
డెడ్‌లైన్స్ అంటే అందరికీ విసుగే. కానీ, ఎంతవరకూ పరిగెట్టాల్లో తెలియకపోతే ఒక ఎథ్లెట్, ఏ తేదీ వరకూ చదవాలో తెలియకపోతే ఓ విద్యార్థి, ఏ ప్రాంతం వరకూ వెళ్ళాలో తెలియకపోతే ఓ ప్రయాణీకుడు ఎంత అయోమయ పడతారు! ఒకసారి ఫ్రాన్స్‌లో ప్రసంగించమని హిందూ సన్యాసిని ఆహ్వానిస్తారు. ఆహ్వానం అందిన దగ్గరనుంచీ, ప్రసంగ తేదీ మధ్యలో లభించిన పదిహేనురోజుల సమయంలో ఫ్రెంచ్‌భాషని నిఘంటువు నుంచి నేర్చుకొని ఆ భాషలోనే ఉపన్యసిస్తాడు. పక్షం రోజుల సమయాన్ని ఒక డెడ్ లైన్‌గా ఏర్పాటుచేసుకొని, తనకి తాను చేసుకొన్న సవాల్‌ని అధిగమించడం స్పూర్తిదాయకమైన సందర్భం.

 ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే......

ఉత్సాహం లేని చదువు
ఏకాగ్రత లేని పని
లక్ష్యం లేని ప్రయాణం
ఏ ఫలితాన్నీ ఇవ్వవు.
© Dantuluri Kishore Varma 

Thursday 18 April 2013

ఏ యూనివర్సిటీలోనూ నేర్పనివి

తండ్రి మాటకు ఎదురు చెప్పని వినయం

రాక్షసులని దునుమాడిన శౌర్యం

కష్టాలు ఎదురైనప్పుదు మొక్కవోని ధైర్యం

సైన్యాన్ని నడిపినప్పుడు ప్రదర్శించిన

నాయకత్వలక్షణాలు

మాటతప్పని నైజం...

ఏ యూనివర్సిటీలోనూ ఈ సాఫ్ట్ స్కిల్స్ నేర్పరు, 

కానీ.... 

ప్రతీ వ్యక్తికీ కావలసిన విలువలు ఇవే!

శ్రీరామనవమి శుభాకాంక్షలు.


 © Dantuluri Kishore Varma 

Sunday 14 April 2013

వివేకానందా రాక్ మెమోరియల్‌

వివేకానందుడు కాశీ నుంచి కన్యాకుమారి వరకూ దేశాటన చేశాడు. ప్రజల స్థితిగతులు అభిలషణీయంగా లేవు. పేదరికం, అవిద్య, మూఢవిశ్వాసాలు, అనారోగ్యం వాళ్ళని పట్టి పీడిస్తున్నాయి. అన్నింటికీ మించి పరాయి పాలకుల క్రింద వెయ్యిసంవత్సరాలుగా బానిసత్వం. నాగరికతలో, శాస్త్రవిజ్ఞానంలో, వైద్యంలో, గణితంలో, విద్యలో ప్రపంచ ప్రజలకు ఒకప్పుడు మార్గనిర్దేశం చేసిన భరతఖండానికా ఈ దుస్థితి! నీచంగా చూడబడుతున్న ప్రజలకి ఆత్మగౌరవం ఇవ్వగల మార్గం ఏది? వాళ్ళలో ఉన్న శక్తిని జాగృతం  కావించడానికి ఏమిచెయ్యాలి?

భారతదేశపు ధక్షిణపు కొన నుంచి సముద్రంలోకి ఏభై మీటర్ల దూరంలో హిందూమహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతాలు కలిసే చోట ఒక చిన్న ద్వీపంలాంటి శిల ఉంది. వేగంగా వచ్చి కొడుతున్న అలల ధాటికి నిబ్బరంగా నిలబడి ఉంది. వివేకానందుని మస్తిష్కంలో కూడా ఆలోచనలు ఉవ్వెత్తున విరిగి పడుతున్నాయి.

ద్యానంలో వాటికి సమాదానాలు కనుగొనాలనుకొన్నాడేమో! సముద్రం మధ్యలో నిశ్చలమైన శిల దగ్గరకి చేరుకోవాలనుకొన్నాడు. పడవకోసం ఆగలేదు. కల్లోల సముద్రంలో ఈదుకొంటు వెళ్ళి, అక్కడే మూడురోజులపాటు నిద్రాహారాలు లేకుండా తపస్సు చేసుకొన్నాడట.

ఈ సంఘటన తరువాతే, చికాగో సర్వమత సభల్లో భారతీయ ఆద్యాత్మిక వాణిని వినిపించి మనదేశ కీర్తి పతాకను ఎగురవేశాడు. బుద్దుడికి భోది వృక్షం ఎలాగో, వివేకానందునికి కన్యాకుమారి వద్ద ఈ శిల అలాగ.

తరువాత చాలా కాలానికి 1970లలో దీనిని వివేకానందా రాక్ మెమోరియల్‌గా అభివృద్దిచేశారు. ఇక్కడ రెండు నిర్మాణాలు ఉన్నాయి ఒకటి వివేకానంద మండపం, రెండవది దేవత కన్యాకుమారి యొక్క శ్రీపాద మండపం.
ఈ రెండు నిముషాల వీడియో చూడండి.  


© Dantuluri Kishore Varma 

Friday 12 April 2013

కాబట్టే ఈ మధ్య అందరి దృష్ఠీ కాకినాడ మీద పడింది

కాకినాడలో స్టార్ హోటళ్ళు, రిటెయిల్ మార్ట్‌లు, మల్టిఫ్లెక్స్‌లు, కార్ల షోరూంలు, జ్యూయలరీ షాపులు, షాపింగ్ మాల్స్, బట్టల షాపులు వరసగా పెట్టుకొంటూ వస్తున్నారు. ఎవరి నోటివెంటవిన్నా పట్టణం వేగంగా అభివృద్ధిచెందుతుందని చెపుతున్నారు. ఇంత అకస్మాత్తుగా ఎందుకు? 
రాజదానిలో పాతికవేలు జీతమొచ్చినా చాలీ, చాలని సంపాదనలా ఉంటుంది. అదే కాకినాడలో ఓ పదివేలు తెచ్చుకొన్నా జీవన వ్యయం తక్కువ కనుక రాజాలా బ్రతికేయవచ్చు. మధ్యతరగతి ప్రజలదగ్గర కొనుగోలు శక్తి ఉంటుంది. ప్రజలకి నిలకడగా ఉండే ఆదాయ వనరులు ఉండాలి. అంటే మంచి జీతం వచ్చే ఉద్యోగమో, బాగా పండే పొలమో, సమృద్దిగా వడ్డీని అందిస్తున్న బ్యాంక్ డిపాజిట్టో, చక్కగా నడుస్తున్న వ్యాపారమో, వృత్తో అన్నమాట. ఏదో ఒక వ్యాపకం చేసుకొని సంపాదించుకొనే వాళ్ళే తప్ప, ఖాళీగా బలాదూరు తిరిగే జనం అరుదు. అలాగని మిగిలినచోట్ల లాగ నిరుద్యోగం, పేదరికం ఇక్కడ లేవని కాదు.

పని అయిపోయిన తరువాత ప్రజలకి ఖాళీ సమయం బాగా ఉండాలి. బయటకు వెళ్ళి చక్కగా తిరిగి రావడానికి అనుకూలంగా ఉండే, జనసమ్మర్ధం లేని రోడ్లు ఉండాలి. ఎలాగంటే, ఉదాహరణకి కాకినాడ ఏ చివరినుంచి, ఏ చివరికైనా బైకు మీదా ఓ ఇరవై నిమిషాలలో వెళ్ళిపోవచ్చు - లేదంటే ఓ అరగంట. పెద్దగా ట్రాఫిక్ జాంలు కూడా ఉండవు. దానికి తోడు మెయిన్‌రోడ్ విస్తరణ కూడా జరిగింది. సినిమా హాళ్ళు, బీచ్ లాంటి ఒకటి రెండు ప్లేసెస్ తప్పించి పెద్దగా రిక్రియేషన్‌కి అవకాశం ఉండకూడదు. ఈ కారణాలన్నీ సరయిన పాళ్ళలో ఇక్కడ ఉన్నాయి. అప్పుడు ప్రజలందరూ, ఊళ్ళో షాపుల్లో ఏదమ్మితే అది ఎగబడి కొంటారు. షాపింగే వాళ్ళకి పెద్ద వినోదం అవుతుంది. ఊళ్ళో ఎక్కడయినా రాజస్తానీ ఏగ్జిబిషనో, హ్యాండీ క్రాఫ్ట్స్ బజారో, హోంఅప్లియన్సెస్ ఎక్స్ఫోనో, ఫ్యాక్టరీ వాళ్ళ డైరెక్ట్ సేల్ ఆఫర్లో...అదీ, ఇదీ అని కాదు ఏది పెట్టినా తీర్థానికి వెళ్ళినట్టు వెళ్ళిపోయి నిర్వాహకుల ఆనందానికి అవధులు లేకుండా చేస్తారు. `ఓరి నాయనో, వారంరోజులపాటు ప్రదర్శన నిర్వహిస్తేనే ఇంత లాభాన్ని అందించారంటే, మనం షాపే పెట్టేసుకొంటే సంవత్సరం తిరిగేసరికి వచ్చినలాభాలతో ఊళ్ళో సగం కొనేసుకోవచ్చు!` అన్న ఆశ మొదలవుతుంది. 

ఇవే కాకుండా- 

కాకినాడ చుట్టుపట్ల ఉన్న చమురు నిక్షేపాలు. ప్రస్తుతం ఉన్నవి కాకుండా సమీప భవిష్యత్తులో మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా కాకినాడనుంచి, విశాఖపట్టణం వరకూ ఏర్పాటు చేస్తారని అనుకొంటున్న కోస్టల్ బెల్ట్. ఒక్కసారి అది కనుక కార్యరూపం దాల్చిందంటే, పట్టణం యొక్క ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం కాకినాడ, రాజమండ్రీల మధ్య ఉన్న వేలకొలదీ ఎకరాల భూమి.  నీటి వనరులు లభ్యత, రవాణా వ్యవస్థా, స్థలసేకరణ అవకాశం కలిగిన ఈ ప్రాంతాన్ని ఏ రకంగానయినా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది.  

మౌలికి సౌకర్యాలు వేగంగా ఫలవంతమౌతున్నాయి. కాకినాడా, రాజమండ్రీ కెనాల్ రోడ్డు నాలుగు రోడ్లగా విస్తరించడానికి పచ్చ జండా ఊపారని ఈ మధ్యనే పేపర్లో వార్త వచ్చింది. 

వీటన్నింటితో పాటూ కాకినాడని పర్యాటకంగా అభివృద్ది చేసే సూచనలు కనిపిస్తున్నాయి. బీచ్ ఫెస్టివల్ని అత్యంత వైభవంగా నిర్వహించడం, శిల్పారామం, బీచ్ పార్కుల్ని నెలకొల్పడానికి  సన్నాహాలు ప్రారంభించడం, రేపూరులో అత్యంత ఎత్తైన సాయి బాబా విగ్రహం ఏర్పాటు మొదలైనవి కాకినాడని టూరిస్ట్స్ డెస్టినేషన్‌గా మారుస్తాయి. 

ఇన్నిరకాల శుభసుచనలు కనిపిస్తూ ఉన్నా - హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణం లాంటి సిటీలతో పోల్చుకొంటే రియల్ ఎస్టేట్ రేట్లు చాలా చవకగా కనిపిస్తాయి. ముంబాయినుంచో, హైదరాబాదు నుంచో వచ్చి తమ వ్యాపార సంస్థకి ఒక బ్రాంచ్ పెడదామనుకొనే బడా పారిశ్రామిక వేత్తలకి ఇక్కడి భూమి రేట్లు ఆఫ్ట్రాల్ గా అనిపించడం వింతకాదు. 

కాబట్టే ఈ మధ్య అందరి దృష్ఠీ కాకినాడ మీద పడింది.
© Dantuluri Kishore Varma 

Thursday 11 April 2013

సౌత్ఇండియా టూర్

ఫణిబాబు గారు రాసే మ్యూజింగ్స్ బ్లాగులో నీలగిరీ రైల్వేస్ డాక్యుమెంటరి లింకు ఇచ్చి, నన్ను ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకొని వెళ్ళిపోయారు. నేను చేసిన ఒక పొరపాటు జ్ఞాపకం వచ్చి ఉగాది పచ్చడి తిన్నట్లు మనసంతా తియ్య తియ్యగా, చేదు చేదుగా అయిపోయింది.

డిగ్రీ ఎగ్జాంస్ పూర్తయిన వెంటనే  శ్రీనివాసరెడ్డి అనే  ఒక ఫ్రెండ్‌తో కలిసి సౌత్ఇండియా టూరుకి బయలుదేరాను. మద్రాసు(చెన్నై), బెంగుళూర్, మైసూర్, ఊటీలు తిరిగి రావడం ఇటినరరీ. అప్పట్లో మల్లాది వెంకటకృష్ణమూర్తి యూరోప్, అమెరికాలు తిరిగి వచ్చి ట్రావెలాగ్‌లు రాశారు. అవిచదివేసి, చూసిన ప్రదేశాలకి సంబంధించిన విశేషాలని తెలుసుకుని నోట్‌చేసుకొని ఉంచుకొనే వాడిని. అలాంటి ట్రావెలాగ్‌లు రాసేద్దామన్న సరదా కూడా ఉండేది :).

బెంగుళూరులో కజిన్ శ్రీను ఫ్రెండ్స్‌తో కలిసి రూంతీసుకొని ఉంటూ, టెక్నికల్ కోర్స్ చదువుకొంటున్నాడు. వెళ్ళే దారిలో మద్రాస్ చూసుకొని, బెంగుళూరు చేరిపోతే, అక్కడి నుంచి అతను గైడ్ చేస్తాడు. అనుకొన్నట్టుగానే ఒకటి, రెండు రోజుల్లో లాల్‌బాగ్, కబ్బన్‌పార్క్, విధాన్‌సౌదా, హైకోర్ట్, ఎంజీ రోడ్ మొదలైన చూడవలసిని ప్రదేశాలన్నీ తిప్పేశారు.

బెంగుళూరు:
విధానసౌద అంటే కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ. దీనికి ఎదురుగా రోడ్డుకి అవతల ఎర్రని ఇటుకలతో నిర్మించిన హైకోర్టు ఉంటుంది. 


ఇరవై సంవత్సరాలకీ, ఇప్పటికీ బెంగుళూరు చాలా మారిపోయిందని చెపుతున్నారు. కాలుష్యం, జనాభా పెరుగుదల లాంటి కారణాల వల్ల వాతావరణం వేడెక్కిపోవడం, రోడ్లమీద రద్దీ విపరీతంగా పెరగడం జరిగింది. అప్పుడు పీక్ అవర్లో, ప్రధానమైన రోడ్డు మధ్యలో నిలుచుని ఫోటో తీసుకొనే వెసలుబాటు ఉండేది! 


లాల్ బాగ్ గార్డెన్స్‌ని డిల్లీలో మొగల్ గార్డెన్స్‌లా మొదట హైదర్ఆలీ తయారు చేయించాలని మొదలు పెట్టించినా, అతని కొడుకు టిప్పుసుల్తాన్ పూర్తిచేయించగలిగాడు. ఇక్కడి లాన్-క్లాక్ ఇండియాలో మొట్ట మొదటిది. ప్రతిష్టాత్మకమైన గ్లాస్ హౌస్ లండన్లో క్రిస్టల్ హౌస్ ఆకారంలో నిర్మించారు. ప్రతీ సంవత్సరం చాలా గొప్పగా ఫ్లవర్ షో జరుగుతుంది ఇక్కడ.




మైసూర్:
మైసూర్, ఊటీ తిప్పి తీసుకు రావడానికి ట్రావెల్స్ వాళ్ళ లగ్జరీ బస్సులు ఉన్నాయి. ఉదయం బయలు దేరి మైసూర్ వెళ్ళే దారిలో ముఖ్యమైన విశేషాలు చూపించి, సాయంత్రానికల్లా మైసూరులో మహారాజా పాలెస్, బృందావన్ గార్డెన్స్,  చాముండీ హిల్  మొదలైనవి త్రిప్పి మంచి హోటల్‌లో నైట్ స్టే ఇస్తాడు. ఆ మరునాడు ఉదయాన్నే ఊటీ తీసుకొని వెళ్ళి సాయంత్రం వరకూ టీ ప్లాంటేషన్స్, బొటానికల్ గార్డెన్స్, బోట్ క్లబ్, దొడ్డబెట్టా పీక్ లాంటి ప్రదేశాలన్నీ చూపించి ఓవర్ నైట్ జర్నీ బేక్ టూ బెంగులూరు. ఇప్పటి పైసల్లో చూసుకొంటే ఈ పేకేజ్ టూర్ టిక్కెట్ నమ్మలేనంత తక్కువ - ఒక్కొక్కళ్ళకీ కేవలం నాలుగు వందల ఏభై రూపాయలు! పేకేజ్ టూర్స్ లో ఉన్న ఇబ్బంది ఏమిటంటే, ప్రతీ ప్రదేశంలోనూ పదినిమిషాలో, పావుగంటో, అరగంటో టైం ఇస్తాడు. ఆ సమయంలోపులో చూసి వచ్చేయ్యాలి. ఆ ప్లేస్ ఎంత బాగున్నా, ఆస్వాదించడానికి వీలుండదు.


రాజా రవివర్మ, రాజా రాజ వర్మ గీసిన అందమైన పెయింటింగ్స్  మైసూర్‌పేలెస్‌లోపల గోడల మీద కనిపిస్తాయి. దర్బారుహాళ్ళు, సింహాసనాలు, వెండితో తయారుచేసిన సింహద్వారాలు, మైసూర్‌పాలకుల తైలవర్ణ చిత్రాలు.. ఇంకా చాలా చూడవలసినవి ఉన్నాయి ఇక్కడ. మైసూర్ మహారాజా చామరాజేంద్ర వడియార్ వివేకానందుని చికాగో పర్యటనని స్పాన్సర్ చేశాడట. ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు పుస్తకాలలో చదివితే సరిగా అర్థం కాని చరిత్రలో విషయాలు బాగా అవగతమౌతాయి.


మహిషాసుర మర్ధిని పేరునుంచే మైసూర్ అనేది వచ్చిందని చెపుతారు. మహిషాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రదేశానికి చెందినవాడు. వాడిని సంహరించిన చాముండేశ్వరి మైసూర్ పాలకుల ఆరాద్యదేవత. ప్రతీ దసరాకీ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. మైసూరుకి దగ్గరలో చాముండీ హిల్ అనే చిన్న కొండ ఉంది. దానిపైన పెద్ద నంది, మహిషాసురుడి విగ్రహం, చాముండేశ్వరీ దేవి గుడీ ఉన్నాయి.


టూర్‌గైడ్ కొండమీదనుంచి చాలా ఇంటరెస్టింగ్ ప్లేసెస్ చూపిస్తాడు. లలిత్‌మహల్ పేలెస్, రేస్‌కోర్స్, మహారాజా పేలెస్ అంటూ. టూర్ పేకేజ్‌లో వాటన్నింటినీ దగ్గరనుంచి చూపించే పాయింట్ లేదు. ఇంకా మైసూర్‌లో సెయింట్ ఫిలోమినా చర్చ్, బృందావన్ గార్డెన్స్ చూపించారు.
బృందావన్ గార్డెన్స్‌కి తీసుకొని వెళ్ళేటప్పటికి పూర్తిగా చీకటి పడిపోయింది. మ్యూజికల్ ఫౌంటెన్స్ ప్రత్యేక ఆకర్షణగా చూశాంకానీ, ఫోటోలు ఏవీ బాగా రాలేదు. రాత్రి బస ఏర్పాటుచేసింది టుర్ ఆపరేటర్ స్వంత హోటల్ అయివుంటుంది. లేకపోతే, ఇరవై సంవత్సరాల క్రితమైనా ఆ డబ్బులకి ఆ స్థాయి అకామిడేషన్ ఇవ్వడం అసాద్యం. మర్నాడు ఉదయమే ఊటీకి బయలు దేరాం. బస్సుదగ్గరకి తెచ్చి గంధపుచెక్కలతో చేసిన ఏనుగు బొమ్మలు(పెన్ స్టేండ్స్) అమ్మారు. ఒక్కొక్కటీ ఐదు రూపాయలు! రెండు కొని ఒకటి నాదగ్గర ఉంచుకొన్నాను. అది ఇప్పటికీ ఉంది. రెండవది ఎవరికి ఇచ్చానో గుర్తులేదు. 

ఊటీ:



ఊటీ బోట్‌క్లబ్ దగ్గర ఉండగా పెద్దగా వర్షం కురిసింది. దీని ప్రభావం వల్ల దొడ్డబెట్టా పీక్ ప్రోగ్రాంలోనుంచి కట్ అయిపోయింది. ఈ టపా మొదటిలో నేను చేశానని చెప్పిన పొరపాటు ఏమిటంటే, ఊటీకి ట్రెయిన్లో వెళ్ళకపోవడం. అప్పుడూ, ఇప్పుడూ కూడా `అయ్యో` అనిపించేది అదే. ఊరిలో చూడవలసిన ప్రదేశాలమాట ఎలా ఉన్నా, రైలు ప్రయాణంలో ఆస్వాదించగల ప్రకృతిసోయగాలు ఎన్నో. మరొకసారి తప్పని సరిగా ఆ జర్నీ చెయ్యాలి. ఎప్పటికి వీలవుతుందో. 

మద్రాస్(చెన్నై):
ట్రిప్ ముగిసింది. తిరిగి వచ్చేటప్పుడు మద్రాస్ గోల్డెన్ బీచ్‌లో తిరిగి షూటింగ్ స్పాట్స్ చూశాం. అప్పట్లో తెలుగు సినిమాలు చాలా వాటిల్లో ఈ స్పాట్స్ అన్నీ కనిపించేవి.








© Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!