Pages

Thursday 17 April 2014

ఉప్పాడ జందాని చీరలు

కాకినాడ నుంచి ఉప్పాడకి బీచ్‌రోడ్ ద్వారా వెళితే వాకలపూడి లైట్ హౌస్‌కి పది కిలోమీటర్లదూరంలో ఉంటుంది. పిఠాపురం మీదుగా కూడా వెళ్ళవచ్చు. పిఠాపురం నుంచి  పది కిలోమీటర్లే ఉంటుంది.  జందానీ చీరలకి ఈ ఊరు ప్రశిద్ది చెందింది. వీటికి భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్ -  జి.ఐ)  కూడా ఉంది. ఒక ప్రాంతం పేరుతో ప్రఖ్యాతి పొందిన ఉత్పత్తులకి జి.ఐ ఇస్తారు. అప్పుడు వాటిని మరొక ప్రాంతంలో ఉత్పత్తి చెయ్యకూడదు.

జందానీ అనే మాట పారశీక భాషనుంచి వచ్చిందట. జాం అంటే పువ్వులనీ, దానీ అంటే వాటిని ఉంచే గుత్తి అని అర్థం. పువ్వులు, లతలతో కంటికి ఇంపుగా, మనసుకి హాయి కలిగించేలాఉండే నేతపనికి ఈ పేరు పెట్టారు. బెంగాల్‌లో ఈ నేత ఒక వెలుగు వెలిగిందట. తరువాత బ్రిటీష్ పాలనలో, విదేశీ బట్టల వెల్లువలో కొట్టుకు పోయింది. ఇప్పుడు అది ఉప్పాడ పేరుమీదుగా దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది.   

చీరలో పట్టునేతతో పాటూ కూర్చే బుటా - పైన ఎలా ఉంటుందో, వెనుకకు తిప్పినా అలానే ఉంటుంది. జందానీ నేత ప్రత్యేకత అదే.  ఇతర పట్టుచీరల నేతలో ఈ నైపుణ్యం కనిపించదు కనుకే ఈ చీరలకి అంత డిమాండ్ ఉంటుందని నేతకార్మికులు వివరించి చెప్పారు. ఒక్కొక్క మగ్గం దగ్గర ఇద్దరు చొప్పున పనిచేస్తూ ఎంతో సహనంతో, నేర్పుతో ఒక్కో దారపు పోగునూ కూర్చుతున్నారు. వాళ్ళకి అభిముఖంగా గోడమీద తగిలించుకొన్న నమూనా డిజైన్‌ను చూస్తూ మగ్గం మీద చీరను నేస్తున్నారు. ఓ పోగు తప్పుగా వెళ్ళినా చీర మొత్తం నాశనం అయినట్టే. ఒక్కచీర తయారు చెయ్యడానికి ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేస్తే నెలరోజులు పడుతుందట.


మరి అంత కష్టపడితే వాళ్ళకి వచ్చే ప్రతిఫలం? తక్కువలో తక్కువ ఆరు వేల నుంచి, యాభై వేల వరకూ ఒక్కో చీరకూ లభిస్తుంది. ప్రత్యేక ఆర్డర్లు ఉంటే లక్షా యాభైవేల చీరవరకూ కూడా తయారు చేస్తారట. రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు, సినిమా ప్రరిశ్రమలో ప్రముఖులు.. ఇంకా బాగా డబ్బున్నవాళ్ళు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి జందానీ చీరలు ధరించడం స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. అందుకే వీటికి ఈ మధ్యకాలలో మరింత గిరాకీ పెరిగింది.  
నేతపని వాళ్ళకి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడిందని ఒకాయన చెప్పాడు. పిల్లలకి కూడా ఈ నైపుణ్యాన్ని నేర్పి, కొంతమంది పనివాళ్ళను పెట్టుకొని ఒక మగ్గం ఉండే వాళ్ళు క్రమంగా రెండు, మూడు మగ్గాలను ఏర్పాటు చేసుకొంటున్నారు. మార్కెటింగ్ చెయ్యగలిగిన వాళ్ళు సొంత షాపులు పెట్టుకోవడం, లేదంటే నేసిన చీరలని షాపులకి వెయ్యడం జరుగుతుంది. ఉప్పాడకు ప్రక్కన ఉన్న యు.కొత్తపల్లిలో రెండు చిన్న వీధుల్లో కనీసం ముప్పై షాపులు ఉన్నాయి.  
పట్టుని కర్ణాటక నుంచి తెచ్చుకొంటారట. ఇది ముడి పట్టు. ఒక్కో పట్టుపోగూ గుర్రపు వెంట్రుక మందంలో ఉంటుందట. దానిని ప్రోసెసింగ్‌కి గొల్లప్రోలో, పిఠాపురమో పంపిస్తారు. అక్కడే పట్టుకి కావలసిన రంగులు వేయిస్తారు. రంగు దారాలని తిరిగి తెచ్చుకొని మగ్గంపైకి ఎక్కిస్తారు. ఒక్కో డిజైన్‌కి ఒకటి రెండు చీరల కంటే ఎక్కువ తయారు కావు. తయారయిన చీర వెంటనే షాపుకి వెళ్ళిపోతుంది. తొందరగానే అమ్ముడు పోతుంది.  


© Dantuluri Kishore Varma 

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!