Pages

Monday 24 November 2014

గిఫ్ట్‌వోచరు కథ

గిఫ్ట్ వోచర్లు కావలసినన్ని కష్టాలు పెట్టగలవని నాకు మొన్నటిదాకా తెలియలేదు. 

సంవత్సరం క్రితం ఇండిబ్లాగర్ వాడు పెట్టిన బ్లాగింగ్ పోటీలో నేను రాసిన ఓ టపాకి వెయ్యిరూపాయల గిఫ్ట్ వోచరు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆ డబ్బులతో కావలసినవన్నీ కొనుక్కొని పండగ చేసుకొమ్మని సెలవిచ్చాడు. కొనుక్కోవడానికి వాడిచ్చిన కోడ్, పిన్ నెంబరూ ఇన్‌బాక్స్‌లోనే ఉన్నాయి కనుక `ఇప్పుడే తొందరేముందిలే ఇంకా ఏడాది సమయం ఉంది కదా?` అనుకొన్నాను. తీరా చూస్తే వోచరు ఎక్స్‌పయరీ డేటు అయిపోతుంది అనగా అకస్మాత్తుగా ఈ విషయం జ్ఞాపక వచ్చింది. పిల్లలు ఇద్దరికీ ఓ గేమూ, ఇల్లాలికి ఓ క్రోకరీ ఐటమూ ఎంచుకొని `బై నౌ` ని నొక్కితే, `యూ కెనాట్ బై ఫ్రం మల్టిపుల్ సెల్లర్స్` అనే మెసేజ్ ముఖంమీద కొట్టింది. `ఫ్లిప్‌కార్ట్ అంటే  రకరకాల సెల్లర్లు వస్తువులు అమ్మే ఎక్జిబిషన్ లాంటిది అని జ్ఞానోదయం కలిగించుకొని మరో దండయాత్ర మొదలు పెట్టాను. 

ఈసారి డెలివరీ చార్జెస్‌తో కలిపి వెయ్యిదాటని ఒకే ఒక వస్తువుని ఎంచుకొని `బై నౌ` అన్నాను. `డబల్యుఎస్ రిటైల్ వాడు అమ్మే వస్తువులు తప్ప ఈ వోచరుతో మరేమీ కొనుక్కో లేవు,` అని మెసేజ్ కొట్టాడు.  పట్టువదలని విక్రమార్కుడిలా చెట్టెక్కిన బేతాళుడిని దించడానికి మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టా. `మనదేముంది ఇంకా మూడవ సారే కదా? గజనీ పదిహేడు సార్లు దండెత్తలేదా మనదేశం మీద?` అని నన్ను నేనే వోదార్చుకొని డబల్యూఎస్ రిటైల్‌వాడు అమ్మే వస్తువులు ఏమున్నాయో వెతకడం మొదలు పెట్టాను. వచ్చిన ఫలితాలు చూసి మతిపోయింది. అవి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఒక్కొక్కటీ ఏడు నుంచి తొమ్మిది వందలు ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్ కవర్లు! వాటి క్రింద `ఇవి తప్ప ఇంకేమీ లేవు. నచ్చితే కొనుక్కో, లేదంటే నీ దిక్కున్న చోట చెప్పుకో,` అని కొట్టినట్టు చెప్పే `నో మోర్ రిజల్ట్స్ టు షో,` కనిపించింది. `గుర్రం లేనోడికి, నాడాతో పనేమిటిరా పింజారీ వెధవా!` అని తిట్టుకొని; `ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే తెలిస్తే ఈ కవర్లకి సరిపోయే స్మార్ట్‌ఫోను కొనుక్కొని  తయారుగా ఉందును కదా!` అని ఆక్రోశించాను.    

`ఈ కష్టం నాకేనా? లేదంటే ఇంకొందరు బాధితులు ఉన్నారా?` అని ఇండిబ్లాగర్‌లో చుస్తే నావి రెండు వోచర్లు పోయాయని ఒకరు, నావి పదిహేనువందలు హుష్‌కాకి అని ఇంకొకరు...కుయ్యో మొర్రో మంటూ చాలా మంది తగిలారు. `కొంచెం తుత్తిగా ఉంది,` అనుకొని ఆరోజుకి ప్రయత్నం విరమించాను.

తరువాత కొంచెం ఖాళీ చూసుకొని ఫ్లిప్‌కార్ట్‌లో ఒక్కో వస్తువూ వెతుకుతూ పోతుంటే, డబల్యూఎస్ రిటైల్ వాడు పెన్‌డ్రైవ్‌లు కూడా అమ్ముతాడని తెలిసింది. `ఫోన్‌కవర్ల కంటే ఇవే కొంచెం నయం,` అనుకొని అవసరం ఉన్నా, లేకపోయినా గిఫ్ట్‌వోచర్‌ని నిరుపయోగం చెయ్యడం ఇష్టం లేక ఓ రెండు 16జిబీ పెన్‌డ్రైవ్‌లు పంపమని ఆర్డరేశా. ఇంకొంచెం సేపు వెతికితే డబల్యూఎస్ రిటైల్ వాడు అమ్మే చేతన్‌భగత్ రాసిన హాఫ్‌గాల్‌ఫ్రెండ్, ప్రీతీ షెనాయ్ రాసిన లైఫ్ ఈస్ వాట్ యూ మేక్ ఇట్ పుస్తకాలు కూడా దొరికాయి. ఇచ్చింది కండీషనల్ వోచర్ అన్న సంగతి తెలియదు. వెతుక్కోవడం కొంచెం ఇబ్బందే కానీ, వస్తువులన్నీ బాగానే ఉన్నాయి. కొన్న వస్తువులని కూడా జాగ్రత్తగానే పంపించాడు. గిఫ్ట్‌వోచరు కథ అలా ముగిసింది.  

వెతుక్కొనే ఓపికలేక వోచరు డబ్బుపోగొట్టుకొన్న వాళ్ళు ఇంకా ఇండిబ్లాగర్‌లో, గూగుల్‌లో గొంతుచించుకొంటూనే ఉన్నారు. 

© Dantuluri Kishore Varma

2 comments:

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!