Pages

Tuesday 25 February 2014

దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారి ప్రసంగం 1954

కాకినాడలో సరస్వతి గాన సభ స్వర్ణోత్సవాల సంధర్భంగా దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారు ప్రసంగించారు. ఆ రికార్డు ఆకాశవాణి వారు ప్రసారం చేశారు. అప్పటికి దేవులపల్లి వారికి 57 ఏళ్ళు ఉండి ఉంటాయి. ఈ గాన సభ 1903లో ఏర్పాటు అయినట్లుగా, 1929లో ఆంధ్రపత్రికలో వచ్చిన గాన సభ కార్యక్రమాల వివరాల ద్వారా అనిపిస్తోంది. మూగబోక ముందు శాస్త్రి గారి స్వరం ఎంత మధురంగా ఉందో ఆస్వాదించండి. 
-సౌజన్యం పి.వి.రమణగారు, శోభనాచల బ్లాగ్.



Dantuluri Kishore Varma

Monday 24 February 2014

పరీక్షల్లో విజయం ఎలా?

పదవతరగతి, ఇంటర్‌మీడియట్ పబ్లిక్ పరీక్షలు దగ్గరపడుతున్నాయి. విద్యార్థులలో పరీక్షల వొత్తిడి రోజురోజుకీ పెరుగుతుంది. తల్లితండ్రులూ, ఉపాద్యాయులూ తమమీద పెట్టుకొన్న అంచనాలను అందుకోగలమో, లేదో అనే ఆందోళణ పిల్లలకి ఉంటుంది. చదివింది మరచిపోవడం, చదవాలనుకొన్నది చదవలేకపోవడం, అన్నం సయించక, నిద్రపట్టక ఇబ్బందిపడడం లాంటి స్ట్రెస్ లక్షణాలు కనిపిస్తుంటాయి. వాళ్ళకి ధైర్యం చెప్పడం పెద్దవాళ్ళ బాధ్యత. వాళ్ళమీద వాళ్ళకి నమ్మకం కలిగేలా తల్లితండ్రులు, ఉపాద్యాయులూ మంచిమాటలు చెప్పాలి. పరీక్షలు కేవలం నెలరోజులు ఉన్న నేపద్యంలో విద్యార్థులు చక్కని టైంటేబుల్ రూపొందించుకొని, అమలుజరపాలి. వొత్తిడిని తగ్గించుకొనే విధానాలు అవలంభించాలి. ఈ క్రింద సూచించిన విధంగా చదివితే చక్కని ఫలితాలు పొందవచ్చు.

1. ముందరి సంవత్సరాల పరీక్షాపేపర్లు పరిశీలించి ఏఏ చాప్టర్లకి ఎన్ని మార్కులు కేటాయించ బడ్డాయో తెలుసుకోవాలి. స్వయంగా పరిశీలించలేని పక్షంలో టీచర్ల సహాయం పొందవచ్చు. ఈ విధంగా చెయ్యడంవల్ల ఏ విషయాలు ఎక్కువ ముఖ్యమైనవో తెలుస్తుంది. 

2. ఇప్పుడు ప్రతీసబ్జెక్ట్‌లోనూ చాప్టరలకి కలర్‌కోడింగ్ చేసుకోవాలి. పూర్తిగా చదివేసిన వాటికి ఆకుపచ్చ, అసంపూర్తిగా చదివిన వాటికి పసుపు, అస్సలు చదవని వాటికి ఎరుపు రంగు మార్కింగ్ చేసుకోవాలి. పైన వొకటవ పాయింట్‌లో చెప్పిన అత్యంత ముఖ్యమైన చాప్టర్లు ఎరుపు రంగులోకానీ, పసుపురంగులోకానీ ఉంటే  వాటికి సమయాన్ని కేటాయించుకొని సంపూర్ణంగా చదవాలి. ఇక్కడ బట్టిపట్టే విధానం అవలంభించకూడదు. అర్థంచేసుకొని, పాయింట్లవారీగా గుర్తుపెట్టుకోవాలి. మైండ్‌మ్యాపింగ్, నెమోనిక్స్ లాంటి పద్దతులద్వారా జ్ఞాపకం ఉంచుకోవాలి. చిన్న, చిన్న సందేహాలు ఉంటే వెంటనే నివృత్తిచేసుకోవాలి. ఇంతకుముందే పూర్తిగా చదివేసిన చాప్టర్లకి ఆకుపచ్చరంగు కలర్ కోడింగ్ ఇచ్చుకొన్నారు కదా? వాటికి కూడా ప్రతీరోజూ కొద్ది సమయం కేటాయించి రివిజన్ చేసుకోవాలి. 

3. చాప్టర్ వారీ ప్రశ్నాపత్రాలు, పూర్తిసిలబస్ మీద పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి. మీ ప్రిపరేషన్ పూర్తయిన తరువాత వాటిని ఆన్సర్ చెయ్యాలి. నిపుణులచేత దిద్దించుకోవాలి. చేసిన తప్పులని పరిశీలించి వాటిని సరిదిద్దుకోవాలి. దానికోసం  మరికొంత సమయాన్ని కేటాయించవచ్చు. 

4. చదవడం ఎంత ముఖ్యమో, ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఫాస్ట్‌ఫుడ్స్ తినవద్దు. సమయానికి భోజనం చేస్తూ, మధ్యలో ఎప్పుడైనా పళ్ళు తినవచ్చు. ఎక్కువగా నీళ్ళు తాగడం చాలా మంచిది. రోజుకి కనీసం ఏడు లేదా ఎనిమిది గంటల నిద్ర అవసరం.  

5. మనప్రయత్నం ఎంత నిబద్దతతో చేస్తున్నాం అనేది ప్రధానం.  ఫలితం గురించి ఆలోచించడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. అనుకొన్న మార్కులు వస్తాయా, లేదా అనే ఆందోళన కలుగుతూ ఉంటే పుస్తకాలు ప్రక్కనపెట్టి నాలుగు, ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. పరీక్షల తరువాత మీ స్నేహితులతో గడపబోయే సమయం గురించి ఆలోచించుకోండి. 

6. ఏకధాటిగా గంటల కొద్దీ చదవవద్దు. ప్రతీ గంటకీ, లేదా రెండుగంటలకి ఒకసారి చిన్న బ్రేక్ తీసుకోండి. గదిలో ఉండకుండా ఆరుబయటకు వెళ్ళండి. కొంతదూరం నడక కూడా మంచిదే. అవకాశం ఉంటే స్నేహితులతో కలిసి చదవండి. చదివిన విషయాలగురించి చర్చించుకొంటే ఇంకా ఎక్కువగా గుర్తుండే చాన్స్ ఉంటుంది. 

7. సినిమాలగురించి, ఫేస్‌బుక్ గురించి, క్రికెట్‌మ్యాచ్‌ల గురించి బెంగపెట్టుకోవద్దు. తాత్కాలికంగా వాటికి టాటా చెప్పేయండి.   

కేవలం పదవతరగతి, ఇంటర్‌మీడియట్లకే కాదు ఏ పరీక్షలకైనా ఆందోళనని ప్రక్కకినెట్టి, ఇలా తయారయితే విజయం మీదే!
© Dantuluri Kishore Varma

స్ట్రీట్ వెండర్

ఉదయం ఏడుగంటల సమయంలో ఆకుకూరలవాడు సైకిలు మీద వస్తాడు. తాజా తోటకూరో, పాలకూరో మరొకటో ఇచ్చి వెళతాడు. మధ్యాహ్నం బటానీలు, మొరమొరాలు అమ్మే సైకిలువాడు. ఇలా ఇంటింటికీ తిరిగి అమ్మే హాకర్లు, రోడ్డు కూడళ్ళలో, రోడ్డుకి ఇరువైపులా నాలుగుచక్రాల బళ్ళమీద రకరకాల వస్తువులు అమ్మే వెండర్లు ప్రతీఊళ్ళోనూ ఉంటారు. పళ్ళు, కాయగూరలు, బొమ్మలు, బనీన్లు, ఫ్యాన్సీవస్తువులు, స్వీట్లు, పిడతక్రిందపప్పు, బజ్జీలు, పావుబాజీ, పానీపూరీ లాంటి చిరుతిళ్ళు అమ్మే వాళ్ళు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ కోటిమంది వరకూ ఉన్నారట. వీళ్ళంతా స్వయం ఉపాది పొందుతున్నవాళ్ళు. 
Pic Credits: Raghu Varma
మెయిన్‌రోడ్డు మంచి రద్దీగా ఉన్నసమయంలో, రోడ్డువార సైకిళ్ళమీద, బళ్ళమీద సరుకులు అమ్మేవాళ్ళలో అకస్మాత్తుగా అలజడి వస్తుంది. తమసరుకులతో సహా పరుగులు పెడతారు. ఈ అలజడికి కారణమైన మునిసిపాలిటీ అధికారులో, పోలీసువాళ్ళో వీళ్ళను దొరకబుచ్చుకొన్నారంటే అంతే సంగతులు. పదో, పరకో గుంజుకోవడమో, సరుకులూ స్వాధీనంచేసుకోవడమో, చక్రాల్లో గాలితీసెయ్యడమో, మరొకటో జరుగుతుంది. ఒక్కదెబ్బకి లాభం గూబల్లోకి వస్తుంది. 

రాజ్యసభలో తెలంగాణా బిల్లుకి ఆమోద ముద్ర వెయ్యడానికి రెండురోజుల ముందు(19.02.2014) స్ట్రీట్ వెండార్ల బిల్లు కూడా పాసయ్యింది. వీధుల్లో అమ్ముకొనేవాళ్ళకి లైసెన్సులు ఇచ్చి, సరుకులుపెట్టి అమ్ముకోవడానికి ప్రత్యేకమైన జోన్లని కేటాయిస్తారట. 

అధికారుల భయంలేకుండా అమ్ముకోవడానికి వాళ్ళకీ, కేటాయించిన జోన్లలోనే అమ్ముకొంటారు కనుక ట్రాఫిక్‌కి అంతరాయం కలగకుండా నగరవాసులకీ బాగానే ఉంటుందనుకొంటాను.   

© Dantuluri Kishore Varma

Saturday 22 February 2014

హైలెస్సో, హైలెస్సా

Photo : The Hindu 
నాలుగైదురోజుల క్రితం హిందూ న్యూస్‌పేపర్లో ట్యూనా ఫిష్‌ని మోసుకొని పోతున్న ఒకమత్యకారుడి ఫోటోని వేశారు. దానితోపాటూ ట్యూనా చేపలు తక్కువగా పడుతున్న కారణంగా మత్యకారులు ఆందోళన చెందుతున్నారని న్యూస్‌కూడా రాశారు. తడి ఇసుకమీద నడిచిపోతున్న పాదాలు, వొడ్డును తాకుతున్న కెరటాలు, బ్యాక్‌గ్రౌండ్‌లో మబ్బులు పట్టిన నీలి ఆకాశం.. ఫోటో చూస్తుంటే తెలియకుండానే హైలెస్సో, హైలెస్సా అనే పాట చెవుల్లోవినిపిస్తుంది. 
*     *     *
కాకినాడలో మత్యకారుల సంఖ్యఎక్కువ. మాస్కూల్ విద్యార్థుల తల్లితండ్రుల్లో కూడా కొంతమంది బోటు యజమానులు ఉన్నారు. వాళ్ళపిల్లల చదువు విషయంలో మమ్మల్ని కలవడానికి స్కూలుకి వచ్చినప్పుడు వాళ్ళ సాధకబాధకాలు కూడా ప్రస్తావనకి వస్తుంటాయి.  అటువంటి ఒక సందర్భంలో ఫిషింగ్‌హాలిడే గురించి కొంత సంభాషణ జరిగింది. జగన్నాథపురం వంతెనదగ్గర, కాకినాడ సముద్రతీరంలోనూ మరపడవలని దూరంనూంచి చూడటమే కానీ, వాళ్ళు చేసే పనిగురించి పెద్దగా తెలియదు. కనుక ఎవరైనా చెపితే వినడానికి ఆసక్తికరంగా ఉంటుంది.  హిందూ న్యూస్‌పేపర్లో మొన్న చూసిన ఫోటో - చెవుల్లో వినిపించిన హైలెస్సో పాటతో పాటూ, ఈ సమాచారాన్ని కూడా జ్ఞాపకానికి తెచ్చింది. ఆ సంగతులని మీతో పంచుకోవడానికి ఈ టపా.

సముద్రంలోకి చేపలవేటకి వెళ్ళే మరపడవలు మనతీరప్రాంతంలో సుమారు రెండువేలు ఉంటాయి. వాటిలో 700 కాకినాడవైతే, 600 విశాఖపట్టణానివి. మిగిలినవి కృష్ణపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడలరేవులవి. సముద్రంలోనికి వేటకు వెళ్ళేముందు డీజిల్ కొట్టించుకొని, పట్టుబడిన చేపలూ రెయ్యలూ నిల్వచెయ్యడానికి ఐసు నింపుకొని, సముద్రంలో ఉండే పదిరోజులో, పదిహేనురోజులో తినడానికి బియ్యం, కాయగూరలు, నీళ్ళు ఇంకా చాలా వేసుకొని పడవసిబ్బంది అంతా బయలుదేరతారు. ఒక్కసారి పట్టుబడికి వెళితే సుమారు లక్షన్నర వరకూ ఖర్చు అవుతుందట. ఈ ఖర్చులు భర్తీ అయ్యి లాభం రావాలంటే పెద్దమొత్తంలో రొయ్యలూ, చేపలూ దొరకాలి.   

అదృష్టం బాగుంటే పెట్టినదానికి రెట్టింపు, రెండురెట్లూ కూడా వస్తుందట. బాగాలేకుంటే లక్షో, ఎంతో ఎగిరిపోతుంది. వేటకి వెళ్ళినతరువాత ఏ తుఫాను వచ్చే సూచనలో ఉండి వెనక్కి రావలసి ఉంటే మొత్తం పెట్టుబడి పోయినట్టే. పట్టుబడి సరిగా ఉండని సందర్భాలు కూడా తరచూ ఉంటాయి. దానికి కారణం విపరీతంగా మత్యసంపదను ఉపయోగించుకొంటూ ఉండడమే. అందుకే ప్రతీసంవత్సరం చేపపిల్లలు తయారయ్యే సమయంలో (సుమారు ఏప్రిల్ 15 నుంచి మే 31వరకూ) 47రోజులు ఫిషింగ్‌హాలిడేని కేంద్రప్రభుత్వం అమలుపరుస్తుంది. దీనివల్ల మత్యసంపద మళ్ళీ వృద్దిచెందుతుంది.  జూన్ ఒకటినుంచి కేజీలకొద్దీ రొయ్యలూ, టన్నులకొద్దీ చేపలు దొరకడం మొదలౌతుంది... హైలెస్సో, హైలెస్సా...

శుభసంకల్పం సినిమా నుంచి హైలెస్సో పాట చూడండి సరదా, సరదాగా.  

© Dantuluri Kishore Varma

Friday 21 February 2014

పలుకరించక ఎంతకోల్పోతున్నామో!

ఆగ్రాలో తాజ్‌మహల్ని, హైదరాబాద్‌లో బిర్లామందిర్‌ని, బెంగులూరులో లాల్‌బాగ్‌ని చూసి ఆనందపడతాం. టూరుకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ముఖ్యమైన ప్రదేశాల వివరాలను తెలుసుకొని, తిరిగివచ్చి, అంతా చూశామని సంతృప్తిచెందుతాం. నిజానికి మనంచూసేది అంతాకాదు - కొంతమాత్రమే! మిగిలినది కూడా చూడాలంటే అక్కడ ఉన్న జనాలని చూడాలి, వాళ్ళరోజువారీ కార్యక్రమాలని గమనించాలి, వాళ్ళతో మాట కలపాలి. బస్టాపుల్లో, ఆటోల్లో, టీదుకాణందగ్గర, మార్కెట్‌లో... స్థానికులు ఊరిగురించి సమాచారం ఇవ్వడానికి నిజంగా ఉత్సాహం చూపిస్తారు. `బాబూ, ఇక్కడ మంచి భోజనం హోటల్ ఏది?` అని అడిగితే ట్రావెల్ బ్రోషర్లలో కనిపించే రెస్టారెంట్లకంటే మెరుగైనవాటిని చూపిస్తారు. కొంతకాలంగా లండన్లో, బోస్టన్లో, ఇంకా మరికొన్ని ప్రదేశాలలో సిటీవాక్స్ అనే టూర్లు నిర్వహిస్తున్నారు. సందర్శకులవెంట గైడ్లు వస్తారు. కెమేరాలు తీసుకొని వెళ్ళి, నడుస్తూ, ఆగుతూ, జనాలతో మాట్లాడుతూ, హిస్టరీ పుస్తకాలలో దొరకని విశేషాలని అర్థం చేసుకొంటూ, ఫొటోలుతీసుకొంటూ ముందుకు సాగడమే. వీటికి వస్తున్న ఆదరణని గమనించి బెంగులూరు లాంటి చోట్లలోకూడా నడుస్తూ నగరాన్ని చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

ఊరికెళ్ళినప్పుడు జనాలతో మాట్లాడడం మాట అలావుంచితే, మన సొంతవూరిలోనే అటువంటి పని చెయ్యడం మానేసి చాలాకాలం అయ్యింది. చింతపండుకోసమో, సగ్గుబియ్యంకోసమో కిరాణాకొట్టుకి వెళ్ళం. కాయగూరలకోసం మార్కెట్‌కో, రైతుబజారుకో కూడా వెళ్ళం. మనల్ని చూడగానే ముఖమంతా నవ్వుపులుముకొని పలకరించే కొట్టువాడినీ, కాయగూరలమ్మినీ కోల్పోయాం. మాల్స్‌కి వెళ్ళి ట్రాలీల్లో సరుకులు వేసుకొని, లైన్లో నుంచొని, బిల్లు చెల్లించి వచ్చేస్తాం. ఇక ఆటోవాడినో, రిక్షావాడినో(link) మాట్లాడించడానికి మనఊళ్ళో మనబండి దిగి వాడి బండి ఎక్కే అవసరమే రాదుకదా! బయట మల్టీప్లెక్స్‌లు, ఇంటిలోకి టీవీలు, చేతిలోకి సోషల్‌నెట్‌వర్క్‌లు వచ్చిన తరువాత వర్చువల్ ప్రపంచం విశాలమైపోయి, వాస్తవప్రపంచం కుంచించుకుపోయింది.    

అప్పుడెప్పుడో కష్టేఫలే శర్మగారు(link) ఈ విషయంగురించి ఒక చక్కని మాట అన్నారు `మనకి పక్కవారిని పలకరించడానికే సమయం లేదండి, పోగేతతో,(link)` అని. నిజమేకదా, పలుకరించక ఎంతకోల్పోతున్నామో!

© Dantuluri Kishore Varma

Thursday 20 February 2014

బాల్‌పెన్నులతో ఏ దేవుడికి పూజ చేస్తారో తెలుసా?

కోనసీమలోని అయినవిల్లి వరసిద్ది వినాయకుడి గుడిలో నిన్న స్వామికి లక్ష కలాల అభిషేకం జరిగింది. ప్రతీ సంవత్సరం మాఘబహుళచవితి నాడు బాల్‌పాయింట్ పెన్నులతో పూజచెయ్యడం ఆనవాయితీ అట. తరువాత వాటిని భక్తులకి పంచిపెడతారు. చుట్టుప్రక్కల అన్నిగ్రామాలనుంచీ విద్యార్థులు వచ్చి వాటిని అపురూపంగా తీసుకొని వెళతారు. దూరప్రాంతాలనుంచి కూడా ప్రయివేట్ స్కూళ్ళు బస్సుల్లో విద్యార్థులని అయినవిల్లికి పంపడం జరుగుతుంది. పరీక్షల సమయమేమో విఘ్ననాయకుడికి పూజచేసిన కలాలు అందుకొంటే పరీక్షలు చకచకా రాసేసి ర్యాంకులు కొట్టేయవచ్చు అని జనాల ప్రగాఢ నమ్మకం.
© Dantuluri Kishore Varma

Thursday 13 February 2014

ధిరన ధిరననన...

భరతనాట్యానికి మూలాలు క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్ధంలో భరతముని రాసిన నాట్యశాస్త్రం అనే గ్రంధంలో ఉన్నాయని చెపుతారు. భరతముని పేరుమీదే ఈ నాట్యానికి భరతనాట్యమనే పేరు వచ్చింది. ఈ నాట్యకళకి ప్రధానమైనవి భావము, రాగము, తాళము కనుక - ఆ మూడింటినుంచీ మొదటి అక్షరాలను తీసుకొని `భరత` నాట్యామని వ్యవహరిస్తున్నారని కూడా చెపుతారు. 

తమిళనాడులో తంజావూరు దేవాలయాల్లో దేవదాసీలు భరతనాట్యాన్ని అభినయించేవారు. అందుకే ఈ నాట్యానికి పాటలు, కర్ణాటక సంగీతపు కూర్పు  భక్తి ప్రాతిపదికగా ఉంటాయి. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సాగరసంగమం సినిమాలో ఈ పాట చూడండి. వేటూరి సుందరరామ్మూర్తిగారు రాసిన పంక్తుల్లో పరమశివుడియొక్క, కైలాసంయొక్క స్తుతిని కూడా గమనించండి.
భరతనాట్యంలో నాలుగు అంగాలు ఉన్నాయి. మొదటిది శరీరంద్వారా ప్రదర్శించే అభినయం - దినినే ఆంగికం అంటారు. రెండవది అభినయిస్తూ నోటితో ఉచ్చరించే మాటలు, పాడేపాటలు- దీనిని వాచికం అంటారు. మూడవది ఆహార్యం - అంటే బట్టలు, ఆభరణాలు, ముఖానికి చేసుకొనే అలంకారం మొదలైనవి అన్నీ కలిపినది. నాలుగవది సాత్వికం - ముఖంలో చూపించే హవబావాలు. ఆంగికాన్ని, వాచికాన్ని, ఆహార్యాన్ని, సాత్వికాన్ని సమపాళ్ళలో రంగరించినప్పుడు మాత్రమే ఉత్తమ ప్రదర్శన సాధ్యం అవుతుంది. ఇక్కడి పాటలో భావములో, భంగిమలో, గానములో, గమకములో అని చెప్పించినది పైన చెప్పిన నాలుగు అంగాల గురించే. బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడిన పాట, కమల్‌హాసన్, జయప్రధ అభినయించిన తీరు, ఇళయరాజా సంగీతం ఒక చక్కటి కాంబినేషన్. విశ్వనాధుడు అభినందనీయుడు.   


వాగర్ధావివ సంప్రుతౌ వాగర్ధ ప్రతిపత్తయే
జగతహ్పితరం వందే పార్వతీపరమేశ్వరం
వందే పార్వతీప రమేశ్వరం

నాదవినోదము నాట్యవిలాసము
పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము
సలుపు పరమ పదము
భావములో ఆ ఆ ఆ
భంగిమలో ఆ ఆ ఆ
గానములో ఆ ఆ ఆ
గమకములో ఆ ఆ ఆ
భావములో భంగిమలో
గానములో గమకములో
ఆంగికమౌ తపమీ గతి సేయగ
నాదవినోదము నాట్యవిలాసము
పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము
సలుపు పరమ పదము
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ని మదనిని మదనిసని
రిసనిదని మదద గమమ రిగస

కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం
కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం
నవరస నటనం గనిసనిసనిసా
జతియుత గమనం గనిసనిసనిసా
నవరస నటనం జతియుత గమనం
సితగిరి చరణం సురనది పయనం
భరతమైన నాట్యం ఆ ఆ
బ్రతుకు నిత్య నృత్యం ఆ ఆ
భరతమైన నాట్యం ఆ ఆ
బ్రతుకు నిత్య నృత్యం ఆ ఆ
తపముని కిరణం తామస హరణం
తపముని కిరణం తామస హరణం
శివుని నయన త్రయలాశ్యం
ధిరన ధిరనన తకిట తకిటతధిమి
ధిరన ధిరనన నాట్యం
ధిరన ధిరనన తకిట తకిటతధిమి
ధిరన ధిరనన లాశ్యం
నమక చమక సహజం
నటప్రక్రుతి పాదజం
నర్తనమే శివకవచం
నటరాజ పాద సుమరజం
ధిరనన ధిరనన
ధిరనన ధిరనన
ధిర ధిర ధిర ధిర

నాదవినోదము నాట్యవిలాసము
పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము
సలుపు పరమ పదము
© Dantuluri Kishore Varma

Wednesday 12 February 2014

క్వీన్‌ బీ

తేనెలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయని చెపుతారు. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. తాగితే మధురంగా ఉంటుంది. ఉదయాన్నే తేనెని నిమ్మరసంతో కలుపుకొని తాగితే వొళ్ళుతగ్గుతుంది. తులసి ఆకుల రసంతో కలిపి తీసుకొంటే జలుబు, దగ్గు తగ్గుతాయి. పాలతో కలిపి సేవిస్తే బరువు పెరుగుతుంది. దెబ్బలు తగిలిన మచ్చలమీద తేనెని రాస్తే మచ్చలు క్రమంగా చర్మపు రంగులో కలిసి పోతాయి... ఇటువంటి ఎన్నో రకాల చిట్కాలు పెద్దలు చెపుతూ ఉంటారు, ఆయుర్వేద పత్రికల్లో లేదా టీవీల్లో కనిపిస్తాయి. కాబట్టే అందరం దీనిని కొని వాడుతుంటాం. కానీ శ్వచ్చమైన తేనెలో ఎన్ని సుగుణాలు ఉన్నాయో, కల్తీ తేనెలో అన్ని అనారోగ్యాన్ని కలిగించే పదార్థాలు ఉంటాయి. మా చిన్నప్పుడు కోయవాళ్ళు చెట్టునుంచి కొట్టిన తేనెపట్టుల్ని స్టీలు కేరేజీల్లో పెట్టి, సరాసరి తీసుకొని వచ్చేవారు. తేనె లభ్యత ప్రధానంగా అలానే ఉండేది. క్రమంగా వినియోగం పెరిగింది, ఉత్పత్తి తగ్గింది. తేనె తెచ్చేవాళ్ళకి తెలివి తేటలు పెరగడంతో పంచదార పానకాన్ని తేనెలో కలిపి తేనెపట్టులకి పట్టించి ఊళ్ళమీద అమ్మడం మొదలు పెట్టారు. ఒకసారి వాళ్ళదగ్గర కొని మోసపోయాం. కొన్న కొన్నిరోజులకే పంచదార పెచ్చులు పైన పొరలాగ ఏర్పడ్డాయి. పూర్తి సీసాడు తేనెని(?) బయట పారవెయ్యవలసి వచ్చింది. అప్పటినుంచీ బ్రాండెడ్ తేనెని వాడడం మొదలు పెట్టాం. దానిలో కూడా కొంత కల్తీ ఉండవచ్చునేమో చెప్పలేం! 
అరకులోయలో తేనె ఉత్పత్తి చేసే ప్రదేశాన్ని చూశాను. కొంచెం స్టడీ చేస్తే ఎపీకల్చర్ గురించి ఎన్నో విషయాలు తెలిశాయి. తేనెటీగలు తేనెని సేకరించే, నిలువచేసే విధానం చాలా ఆసక్తి కలిగించేలా ఉంటుంది. ప్రతీ పట్టుకీ ఒకటే రాణీ ఈగ ఉంటుందట. రెండవది ఉండడానికి అవకాశంలేదు. ఎందుకంటే అలా ఉన్నసందర్భంలో ఒకటి రెండవదానిని చంపేస్తుంది. ఒకటో, రెండో మగ ఈగలు ఉంటాయి. వాటితో పాటూ కొన్ని వేలల్లో శ్రామిక ఈగలు ఉంటాయి. ఈ శ్రామిక ఈగలు అన్నీ ఆడవే. రాణీ ఈగ గుడ్లని పెట్టడానికి మైనంతో గదులను నిర్మించడం, పువ్వులనుంచి తేనెని సేకరించి తెచ్చి వాటికి తినిపించడం, తేనెపట్టుకి కాపలా కాయడం మొదలైన పనులన్నీ శ్రామిక ఈగలే చేస్తాయి. మగఈగలని డ్రోన్‌లు అంటారు. వాటి పని కేవలం రాణీ ఈగతో కలియడం మాత్రమే. కానీ కర్తవ్య నిర్వాహణ చేసిన మరుక్షణమే అవి మరణిస్తాయి. రాణీ ఈగ గుడ్లుపెడుతుంది. రాణీ ఈగ విడుదలచేసే ఒకరకమైన ఎంజైమువల్ల శ్రామికి ఈగల్లో ఏవీకూడా సంతానోత్పత్తికి పనికి రాకుండా అవుతాయి. క్వీన్‌బీ మహా నిరంకుశురాలు, కదూ?     

మనకు ఒక అనుమానం రావచ్చు క్వీన్‌బీ ఎలా తయారవుతుంది అని. ఇంతకు ముందు రాణీ ఈగ గుడ్లు పెడుతుందని అనుకొన్నాంకదా? అవి అన్నీ మకరందాన్ని తాగి శ్రామిక ఈగలుగా ఎదుగుతాయి. కానీ ఎప్పుడైనా పట్టులోని క్వీన్‌బీ ముసలిది అయినా, మరణించినా శ్రామిక ఈగలు ఒకటి రెండు రాణీ ఈగల్ని తయారు చేస్తాయి. పువ్వులనుంచి సేకరించిన మకరందాన్ని కాకుండా అవి స్రవించే రాయల్ జెల్లీ అనే ఒకరకమైన ఎంజైముని ఒకటి రెండు గదుల్లో ఉన్న లార్వాకి అందించడం వల్ల, ఆ లార్వే రాణీ ఈగలుగా ఎదుగుతాయి. 

ఈ విధానం అంతా చూస్తుంటే మన ప్రజాస్వామ్యం గుర్తుకువస్తుంది. ప్రజలందరూ రాత్రనక, పగలనక బ్రతకడానికి కష్టపడి పనిచేసుకొంటూ..రూపాయి, రూపాయి కూడబెట్టుకొని ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తూ.. తమని పరిపాలించడానికి ఒకదొరగారినో, దొరసానినో ఓట్లేసి అందలం ఎక్కిస్తే.. ఏమవుతుంది? మంచితేనె కోసం ఆశపడితే, కల్తీతేనే దొరుకుతుంది. ప్రజాస్వామ్యఫలాలు స్వార్థపరుల చేతుల్లో పడి విషతుల్యంగా మారుతున్నాయి.

మనదేశం ఒక పెద్ద తేనెపట్టులా తయారయ్యింది!
© Dantuluri Kishore Varma

Sunday 9 February 2014

కొండవార

కొండవార సారవంతమైన భూములు. ఏరు నిరంతరం పారుతూ ఉంటుందేమో భూగర్భజలాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతీ కమతానికీ ఒక్కో బోరు ఉన్నట్టుంది. అన్నికాలాల్లోనూ నీరు సమృద్దిగా లభిస్తుండడంవల్ల అరటి, కొబ్బరి, చెరకు, వరి, పొగాకు, పామాయిలు, మొక్కజొన్న  లాంటి రకరకాల పంటలు పండిస్తున్నారు. 
ఎక్కడా అంటారా? 

కాకినాడనుంచి పిఠాపురం మీదుగా వెళుతూ కత్తిపూడి దగ్గర నేషనల్ హైవే ఎక్కి, అన్నవరం గుడిని చూసుకొంటూ, హైవేని చేర్చిన ప్రసాదం కౌంటర్లో సత్యన్నారాయణ మూర్తికి చేతులుజోడించి, ప్రసాదం పొట్లం కొనుక్కొని తిని, మళ్ళీ ప్రయాణం కొనసాగించండి. కొంచెం సేపటికి తుని చేరతారు. అక్కడినుంచి `కొలిమేరు వెళ్ళే దారి ఏది?` అంటే ఎవరైనా చెపుతారు అక్కడ. ఆ దారిలో ఐదారు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఊరు చేరతారు. ఊరు ప్రధానం కాదు. దారిలో దృశ్యాలు ప్రధానం. మీరు ఆ వూరు వెళ్ళినా, వెళ్ళకపోయినా పరవాలేదు. కానీ, ఇక్కడ చూపించిన ఫోటోల్లో ఉన్న సీనరీలులాంటివి ఎక్కడ కనిపించినా కళ్ళప్పగించి చుస్తూ ఉండిపోండి.


మన జిల్లాలో ఉన్నంత భౌగోళీక వైవిధ్యం మరొక చోట ఉండదేమో అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా అందమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. వాల్డెన్ అనే పుస్తకం రాసిన హెన్రీ డేవిడ్ థోరూ  చెప్పినట్టు మనం ఎక్కడ చూస్తున్నాం అనేది ముఖ్యంకాదు, ఏమి చూస్తున్నాం అనేదే ముఖ్యం. 

ఒక కజిన్ పెళ్ళి సందర్భంగా ఈ ఊరికి వెళ్ళాను. అప్పుడు తీసిన ఫోటోలు ఇవి. 
© Dantuluri Kishore Varma

Friday 7 February 2014

గుండె ఝల్లుమంది...

రాంగోపాల్‌వర్మ రాత్రి సినిమాలో నిర్మానుష్యమైన ఊరిలో రేవతినీ దించేసినట్టు నన్ను ఒక్కడిని దించేసి బస్సువెళ్ళిపోయింది. ఐస్క్రీం బండివాడు ఒక్కడే ఉన్నాడు. `బాబూ, ఇదేనా దారి?` అన్నాను.`ఆ.... వెళ్ళండి,` అన్నాడు.
ఎర్రమట్టి దిబ్బలు ఎన్నివేల లేదా లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయో తెలియదుకానీ, వాటి ఏర్పాటు ఒక భౌగోళిక అద్భుతం. పూర్వం సముద్రమట్టం ఇంకా పైకి ఉండేదని, ఎగసిపడే కెరటాలవల్ల మట్టి కొట్టుకొని పోయి నెర్రల్లాగ అయివుండవచ్చని కొందరు అంటారు. మరొక అభిప్రాయం ప్రకారం బొర్రాగుహల్లో పుట్టిన గోస్తనీ నది ప్రవాహమార్గం ఇదేనని అంటారు. విశాఖపట్నం నుంచి, భీమిలి వెళ్ళేదారిలో సముద్రంలో కలిసేది. తరువాత ఈ నది తన ప్రవాహ మార్గం మార్చుకొని ఉండవచ్చునట. ఏది ఏమయినా ఇంత విస్తీర్ణంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు లాంటి ప్రదేశం భారతదేశపు తూర్పుతీరంలో మరొకటి లేదని జియాలజిస్టులు చెపుతారు.
నేను ఉద్యోగరీత్యా వైజాగ్‌లో ఒకసంవత్సరం ఉన్నప్పుడు, ప్రతీనెలా భీమిలి వెళ్ళవలసి ఉన్నప్పుడూ కూడా ఒక్కసారీ ఎర్రమట్టిదిబ్బలని చూడకపోవడం క్షమించరాని విషయం! ఆ ఫీలింగుని పోగొట్టుకోవడానికి మొన్న అరకు ట్రిప్ వేసిన సందర్బంలో ఒక్కపూట సమయం దొరకడంతో బస్‌కాంప్లెక్స్ దగ్గర భీమిలీ బస్ పట్టుకొని, ఓ గంట ప్రయాణం చేసి, ఎర్రమట్టిదిబ్బలదగ్గర దిగాను. అప్పటికి సాయంత్రం నాలుగు అవుతుంది. సముద్రానికి అభిముఖంగా రోడ్డుకి అవతల ఇసుక పుంతలాంటి మార్గం ఉంది.
అడుగువేస్తే కాళ్ళు ఇసుకలో కూరుకొనిపోతున్నాయి. కొంచెం దూరం వెళ్ళినతరువాత పుంతమార్గానికి అటూ, ఇటూ ఎత్తైన దిబ్బలు, వాటిమీద గుబురుగా అడవిలా పెరిగిన చెట్లు. మార్గం రెండుగా విడిపోయింది. `ఎడమవైపుకా, కుడివైపుకా?` అనుకొని ఓ వైపుకి వెళ్ళాను. మరికొంతదూరం నడక. దారులోనుంచి, దారి. రెండు, రెండుగా చీలిపోతున్న మార్గం. నేను తప్ప మరొక నరమానవుడు కనిపించడంలేదు. పిట్టల అరుపులు కూడా లేవు. దూరంనుంచి వినిపిస్తున్న ట్రాఫిక్ హోరుకూడా వినిపించడం మానేసింది. ఇంకా వెళితే సెల్‌సిగ్నల్ కూడా పోతుంది, లాబిరింత్‌లో ప్రవేశించినట్టు, దారితప్పిపోతే డైరెక్షన్ చెప్పడానికి కూడా ఎవరూ ఉండని ప్రదేశం. శీతాకాలమేమో ఐదు గంటలకే చీకట్లు ముసురుకొంటున్నాయి. ఇంకాస్తముందుకు వెళ్ళినా కనిపించే దృశ్యం అదే. కాబట్టి వెనక్కితిరిగాను. నిజంచెప్పొద్దూ, గుండెఝల్లుమంది...

నేను నడచి వచ్చిన మార్గంలో, అంతకు రెండునిమిషాలముందు లేరు - కానీ, ఇప్పుడు ఉన్నారు - ఇద్దరు వ్యక్తులు  ఇసుకలో కూర్చొని కబుర్లుచెప్పుకొంటూ, నడచి వచ్చినందుకు ఆయాసపడుతూ, అలసట తీర్చుకొంటూ.... వాళ్ళని అక్కడ ఊహించలేదు. అందుకే,  రిలీఫ్‌గా ఫీలవ్వడానికి బదులు షాకయ్యాను. నేను ఒక్కడినే కాదన్నమాట, ఇంకా కొంతమంది టూరిస్టులు కూడా ఈ ప్రదేశానికి వస్తూ ఉంటారు! వాళ్ళను దాటుకొని, రోడ్డు చేరుకొని, బస్సుపట్టుకొని, ఇంటికి చేరాను.
© Dantuluri Kishore Varma

Thursday 6 February 2014

సాధనమున పనులు సమకూరు ధరలోన.

తొంభైఐదుసంవత్సరాలకి పైగా జీవించిన అన్నమయ్య ముప్పైఆరువేల సంకీర్తనలని రచించాడు. రోజుకి ఒకటి చొప్పున రాసి, పాడినా  తొంభైఐదు ఏళ్ళలో అన్ని కీర్తనలని కూర్చడం అసాధ్యం. అసాధ్యమైనది సుసాధ్యం చేశాడు కనుక ఆయన వంశంలోనే ఆ గొప్పతనం ఉండిఉంటుంది అనుకోవచ్చు. కానీ అన్నమయ్య తండ్రికానీ, తాతగారుకానీ సంకీర్తనా చార్యలు అనే దాకలాలు ఏమీలేవు. పండితుల వంశం అయి ఉండవచ్చు. కానీ పాండిత్యాన్ని వేంకటనాధునిపై భక్తితో రంగరించి వీనులవిందైన సంగీతాన్ని సృష్టించడం అన్నమయ్యకే సాధ్యమయ్యింది.


వేమన చెప్పినట్టు - 

అనగ ననగ రాగ మతిశ యిల్లుచునుండు
దినగ దినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ!

పాడగా, పాడగా తెలియకుండానే ఇన్ని వేల సంకీర్తనలు పోగుపడి ఉంటాయి. ఇక్కడ నేను చెప్పాలనుకొన్న విషయం ఏమిటంటే ఏదయినా సాధించాలనుకొన్నప్పుడు చేస్తూ పోవడమొక్కటే ప్రధానమైన అంశం అని. యూరోప్‌లో విలియం టర్నర్ అనే గొప్ప వాటర్‌కలర్ పెయింటర్ ఉండేవాడు. డబ్బై అయిదేళ్ళు జీవించి 19,000 పెయింటింగులని వదిలి వెళ్ళాడు. ఆయన ఒకసారి తన స్నేహితుడికి ఉత్తరం రాస్తూ `నా ఒకే ఒక్క విజయరహస్యం పరిశ్రమ` అని రాశాడట. డాక్టర్ థామస్ మన్రో అనే ఆయన యువకుడైన టర్నర్‌ని ఉద్యోగంలో పెట్టుకొంటాడు. చెయ్యవలసిన పని కోజన్స్ అనే పెయింటర్ సగం, సగం వేసి వదిలేసిన వాటిని నకళ్ళు చేసి పూర్తిచెయ్యడం. రోజూ ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకూ పనిచేసేవాడట. మూడో, నాలుగో చిత్రాలు పూర్తయ్యేవి. వెయ్యగా, వెయ్యగా నైపుణ్యం  పెరిగింది. వేగం అలవాటయ్యింది. క్రమంగా బ్రష్ రంగులో ముంచి కాగితమ్మీద అద్దితే అదే గొప్ప కళాఖండమయ్యింది.

చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఎన్నో నైపుణ్యాలని ఒంటబట్టించుకోవలసి ఉంటుంది. ఇంగ్లీషులో చక్కగా మాట్లాడటం రాకపోతే ఉద్యోగం దొరకక పోవచ్చు. సహోద్యోగులతో కలిసి ఒకటీముగా పనిచెయ్యకపోతే ఉద్యోగమే పోవచ్చు, పోటీని అర్థంచేసుకొని కొత్త మార్కెటింగ్ స్ట్రేటజీస్‌ని ఉపయోగించకపోతే వ్యాపారాన్ని మూసుకోవలసి రావచ్చు. మరి, నైపుణ్యాలు ఎలా మెరుగు పరచుకోవాలి అంటే - మళ్ళీ వేమనగారిని అడగవలసిందే - సాధనమున పనులు సమకూరు ధరలోన.  
© Dantuluri Kishore Varma

Monday 3 February 2014

హ్యాపీ బర్త్‌డే బుజ్జులూ...

డాడీ కొడుతున్నారని భయంలేదు. పైగా తిరగబడుతుంది బడుద్దాయి. మా చిన్నమ్మాయి వర్షిత. ఈ రోజు తన పదవ పుట్టినరోజు. హ్యాపీ బర్త్‌డే బుజ్జులూ...

 

Sunday 2 February 2014

సుభద్రా ఆర్కేడ్

కాలేజీకి వెళ్ళివస్తూ భానుగుడి జంక్షన్ దగ్గర మంగీలాల్ స్వీట్‌షాపులో టీ తాగేవాళ్ళం. అప్పుడే వేసిన మిరపకాయ బజ్జీలో, సమోసాలో, పాకంలో మునిగి తేలుతున్న గులాబ్ జామూన్లో, జిలేబీనో తిని పదినిమిషాలు వాటి పనిపట్టడానికి, ఓ ఇరవై ముప్పైనిమిషాలు కబుర్లు చెప్పుకోవడానికి వెచ్చించి ఇంటిదారి పట్టేవాళ్ళం. ఇది ఒక పాతిక సంవత్సరాల క్రితం మాట. ఫేవరెట్ హ్యాంగ్ ఔట్ ప్లేసెస్‌లో ఇది ఒకటి. ఇలాంటివి ఇంకా అక్కడక్కడా ఉండేవి - జగన్నాథపురంలో ఉడిపీ హోటల్, గాంధీనగర్లో అయ్యరుహోటల్, సినిమారోడ్డులో వీనస్ హోటల్ లాంటివి. వీటిదగ్గర ఫ్రెండ్స్ వచ్చి తినేది తక్కువ, కబుర్లు చెప్పుకొనేది ఎక్కువ. ఎవరికి అనిపించిందో తెలియదు కానీ వీళ్ళందరినీ ఒకే చత్రం క్రిందకి తీసుకొని వచ్చి ఏకచత్రాదిపత్యపు హ్యాంగ్ అరౌండ్ ప్లేసుని ఏర్పాటుచెయ్యాలని - సుభద్రా ఆర్కేడ్‌ని కట్టి పడేశారు.  
అనుకోవడానికి ఎది ఒక షాపింగ్ సెంటరే కానీ, ప్రతీరోజూ ఇక్కడికి వచ్చి వెళ్ళేటంతమంది జనాలు, కాకినాడలో మరే ప్రదేశానికీ వెళ్ళరేమో అనిపిస్తుంది. ఇంటర్నెట్ సెంటర్లు, గాడ్జెట్ షాపులు, గిఫ్ట్ ఆర్టికల్స్, ఫ్లోరిస్టులు, ఐస్క్రీం షాపులు, బుక్‌షాపులు.. అన్నింటికీ మించి పార్కింగ్ ప్లేస్. కాలేజ్ బ్యాగ్‌లు బుజాలకి తగిలించుకొని అక్కడక్కడా నుంచొని, పార్క్ చేసిన బైకులమీద వాలిపోయి, అటూ ఇటూ నడుస్తూ, ఐస్క్రీం చప్పరిస్తూ... వాళ్ళు చెప్పుకొనే కబుర్లు... కాలేజీ విషయాల దగ్గరనుంచి - కెరీర్ ఆప్షన్స్ వరకూ, ప్రేమకహానీల దగ్గరనుంచి - ఫెయిల్యూర్ స్టోరీల వరకూ, ఫ్యాషన్ల దగ్గరనుంచి - ఫంక్షన్ల వరకూ, సమాజ సేవ దగ్గరనుంచి - సోషల్ నెట్వర్క్ వరకూ... ఎన్నో. కాలేజీ వయసు దాటినవాళ్ళు అయితే బడ్జెట్లు, బాధ్యతలు, సినిమాలు, రాజకీయాలు, పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, వ్యాపార లాభ నష్టాలు... మాటల ప్రవాహం సాగిపోతూ ఉంటుంది. 
మొన్న ఎవరో కుర్రాడు సిస్టం రిపెయిర్ చెయ్యబడును అని పాంప్లెట్ సుభద్రా ఆర్కేడ్ వెనుకవైపు గోడమీద అంటిస్తే, పార్క్ చేసిన బైకుని బయటకు తీస్తూ అది చూసి, ఫోన్‌చేసి పిలిపించి నా సిస్టంని బాగు చేయించుకొన్నాను. రకరకాల వ్యాపారాలు, సేవలకి సంబంధించిన అటువంటి పాంప్లెట్‌లు అక్కడక్కడా అంటించి ఉంటాయి. హ్యాంగ్ అరౌండ్ ప్లేస్ ని లాభదాయకంగా ఉపయోగించుకోవడం - చక్కని ఉపాయం కదా?   
© Dantuluri Kishore Varma

Saturday 1 February 2014

సంకోచించకుండా తాగండి!

వేసవి మెల్లగా ప్రవేశిస్తుంది. ఎండలో తిరగడం, దాహం తీర్చుకోవడానికి కూల్‌డ్రింకులు తాగడం మొదలైపోతుంది. వాటివల్ల దాహం తీరినట్టు అనిపించినా, కొన్ని క్షణాల్లోనే నోరు ఎండిపోతుంది. కూల్‌డ్రింకులు ఆరోగ్యానికి కూడా మంచివి కాదు అని చెపుతున్నారు. కాబట్టి ఫ్రూట్ జ్యూస్‌లు, చెరుకురసం, కొబ్బరినీళ్ళు లాంటివి త్రాగడం ఉత్తమం. చెరుకురసం తాగే టప్పుడు అందులో వేసే ఐసు ఏనీళ్ళతో తయారుచేసి ఉంటారో ఆలోచించుకోవాలి. సాధ్యమైనంతవరకూ ఐసులేని చెరుకురసం త్రాగడం మంచిది. ఫ్రూట్ జ్యూస్‌ల విషయంలో కూడా డిటో. వీటన్నింటిలోనూ ఉత్తమమైనది కొబ్బరిబొండాం. శరీరానికి వెంటనే శక్తిని అందించే ఎలక్ట్రోలైట్లు కొబ్బరినీళ్ళల్లో ఉంటాయట. కొబ్బరినీళ్ళు రక్తపోటుని అదుపుచేసి, గుండెకు మేలు చేస్తాయి. పేషంట్లకి కూడా వీటిని ఇవ్వడానికి కారణం శరీరానికి శక్తినిచ్చి, ఆరోగ్యానికి మేలు చేస్తాయి కనుకనే. అదృష్టం ఏమిటంటే మనదేశంలో విరివిగా కొబ్బరి దిగుబడి వచ్చే నాలుగు రాష్ట్రాలలో మన రాష్ట్రం ఒకటి. మొత్తం దేశ కొబ్బరి ఉత్పత్తిలో 92శాతం కేరళ, తమిళ్‌నాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ల నుంచే వస్తుంది. దాహం వేస్తే వెంటనే జ్ఞాపకం రావలసింది కొబ్బరిబోండమే. కొబ్బరి బొండాలకి జై!   

© Dantuluri Kishore Varma

అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే

కార్లు, బైకులు, ఆటోలతో సహా రోడ్డుమీదవెళ్ళే సమస్త వాహనాలలో తొంబైశాతం అక్కడ ఆగుతాయి. రోడ్డువార చెట్టు, చెట్టుక్రింద ఒక దేవత ఫోటోనో, విగ్రహమో పసుపూ, కుంకాలు అద్ది ఉంటుంది. ప్రయాణంలో ఏ ఇబ్బందులూ కలగకుండా ఉండాలని ప్రార్ధించుకొని, కుంకుమ బొట్లు ముఖాలకీ, వాహనాలకీ పెట్టుకొని, పళ్ళెంలో దక్షిణ వేసి ముందుకు సాగుతారు జనాలు. రోజులు పెరిగే కొలదీ భక్తుల రద్దీతో పాటూ, గుడికూడా పెరుగుతుంది. అక్కడ ఆగి వెళ్ళకపోతే ఏదో కీడు జరుగుతుందని భావించడం వల్లకూడా చాలా మంది వాహనాలను నిలుపుతారు. ఏది ఏమయినా నగరంలోనుంచి బయటకు వెళ్ళే ప్రతీ ప్రధానమార్గంలో ఒక్కో దేవత రాకపోకలని పర్యవేక్షిస్తుంది. ఉదాహరణకి కాకినాడనుంచి సామర్లకోట వెళుతుంటే ముత్యాలమ్మతల్లి, గొల్లపాలెం వైపు ధనమ్మతల్లి, యానాం దారిలో  తలుపులమ్మతల్లి మొదలైనవి... అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనే విశ్వాసాన్ని కలిగిస్తూ... 

© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!