Pages

Sunday 27 April 2014

పద్నాలుగున్నర లక్షల వ్యూస్!

దిమ్మతిరిగిపోయింది లాంటి టైటిల్ పెట్టొచ్చో లేదో తెలియదు కానీ, నిజంగా జరిగింది అదే! చాలామందికి ఉన్నట్టే నాకు కూడా ఒక గూగుల్‌ప్లస్ ప్రొఫైల్ (link) ఉంది. బ్లాగ్‌లో రాసిన ప్రతీ పోస్ట్‌ని అక్కడ షేర్ చెయ్యడం మినహా ఈ సోషల్  నెట్‌వర్క్‌ని నేను ఉపయోగించడం తక్కువ. అహా.. అయిష్టం కాదండి, ఎలా ఉపయోగించాలో పూర్తిగా అవగాహన లేదు. ఇప్పుడే ఒక అశ్చర్యకరమైన విషయం నా కంటపడింది. ఒకరి గూగుల్ ప్లస్ ప్రొఫైల్ చూస్తుంటే - వారికి ఉన్న ఫాలోవర్స్, ప్రొఫైల్ వ్యూస్ మీద నా దృష్టి పడింది. ఇప్పటి వరకూ వాటిని నేను పెద్దగా గమనించలేదు. అది చూశాకా, `నాకు ఎన్ని ప్రొఫైల్ వ్యూస్ ఉండి ఉంటాయ్?` అనిపించి, ఓ లుక్కేసేసరికి నిజంగానే దిమ్మతిరిగిపోయింది - 14,39,200! ఏదో పొరపాటు జరిగి ఉంటుందనిపించింది. మార్క్ జుకెంబెర్గ్‌కి ఎన్ని వ్యూస్ ఉన్నాయో పరిశీలిస్తే 16,39,500 ఉన్నాయి. ఆయన ఫాలోవర్సేమో ఆరున్నర లక్షలమంది. నా ఫాలోవర్స్ మాత్రం 29 మంది. లక్షల్లో, ఆ మాటకొస్తే కోట్లలో కూడా వ్యూస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉండవచ్చు... కానీ,  కొంచెం ఎక్జైటింగ్‌గా ఉంది! `తూచ్! అన్నిలేవు,` అని గూగుల్‌వాడు రేపెప్పుడైనా వాటిని వెనక్కి తీసేసుకొంటాడేమో అని భయంగా కూడా ఉంది!


© Dantuluri Kishore Varma

Saturday 26 April 2014

ఆనందం అంటే....

ప్రొద్దున్నే పొగలుకక్కే కాఫీని సిప్ చెయ్యడం...
రాత్రి డాబా మీద కూర్చొని చందమామని చూడడం...
గాలిలో తేలి వచ్చే పూల వాసనలని   ఆస్వాదించడం...
వేసవికాలం సాయంత్రం చల్లని నీళ్ళతో స్నానం చెయ్యడం...

ఇంకా...

ఇదిగో ఇలాంటి పాటని వింటూ ఉండిపోవడం...(Click this link to watch the song)


చల్లని వెన్నెలలో. చల్లని వెన్నెలలో… ఓ...
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
అందమే నాలో లీనమాయెనే ఆనందమే నా గానమాయెనే
చల్లని వెన్నెలలో
తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి తేలి ఆడెనే ముద్దులలో
తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి తేలి ఆడెనే ముద్దులలో
గాలి పెదవులే మెల్లగ సోకిన …గాలి పెదవులే మెల్లగ సోకిన
పూలు నవ్వెనే నిద్దురలో …ఓ.. చల్లని వెన్నెలలో…
చక్కని కన్నె సమీపములో … అందమే నాలో లీనమాయెనే
ఆనందమే నా గానమాయెనే …. చల్లని వెన్నెలలో
కళకళలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో ఓ…
కళకళలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో
కలకాలము నీ కమ్మని రూపము .. కలకాలము నీ కమ్మని రూపము
కలవరించునలే నా మదిలో … ఓ.. చల్లని వెన్నెలలో ..
చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయెనే
ఆనందమే నా గానమాయెనే చల్లని వెన్నెలలో

© Dantuluri Kishore Varma

Thursday 24 April 2014

పూతరేకులు

ఒకరోజు సాయంత్రం బడినుంచి ఇంటికివచ్చేసరికి పెరటిలో కనిపించిన హంగామా చూసి హాశ్చర్యపోయేశాను! మూడురాళ్ళ పెద్ద పొయ్యి, దానిమిద బోర్లించిన మట్టికుండ, కుండక్రింద పొయ్యిలో కణకణమని మండుతున్న పుల్లలు. ఏవో పిండివంటలు తయారవుతున్నాయని తెలుస్తుంది కానీ, అవేమిటో తెలియలేదు. పొయ్యిముందు కూర్చొన్న మనిషి చేస్తున్న పనిని చూస్తుంటే కుతూహలం పెరిగిపోయింది. దగ్గరకు వెళ్ళి నేను కూడా చేస్తానన్నాను. అప్పటికి నేను చాలా బచ్చాని కదా, అందుకే `నువ్వు చెయ్యలేవు కానీ, కావాలంటే ఇది తిను,` అని కుండమీద అప్పుడే తీసిన రేకుని చేతిలో పెట్టారు. పలుచటి ఉల్లిపొరలా ఉంది. రుచి అమోఘం! అదిగో సరిగ్గా అప్పుడే ఆపదార్థంతో ప్రేమలో పడిపోయాను - ఇప్పటికీ హింకా.. తేరుకోలేదు. సరే ఆ సంగతి అలా ప్రక్కన పెట్టండి. పూతరేకు రుచిలో పడిపోయి అక్కడ ఏమి జరుగుతుందో గమనించడం మరచిపోతామా ఏమిటీ!? 

పెద్దగంగాళాలో పలుచగా కలిపిన పిండినీళ్ళు ఉన్నాయి. వాటిలో తెల్లని చతురశ్రాకారపు గుడ్డని ఓ వైపు రెండుకొనలు పట్టుకొని ముంచి,  పిండినీళ్ళు కారుతూ ఉండగానే పొయ్యిమీద బోర్లించిన వేడి కుండమీద వేసి `సర్రు` మని లాగడమే.  అలా చేసీ, చెయ్యడంతోటే పూతరేకు అలా... వచ్చేసేది. దానిని జాగ్రత్తగా తీసి ఓ ప్రక్కన పెట్టేయడమే. అప్పుడు మళ్ళీ కుండమీద కొంచెం నూనె రాసి ఇంకొక రేకుని తీయ్యడం.  You see,  it looked sooo... easy to follow suit,  but too difficult to do. 

అప్పటికింకా పూతరేకులకి ఆత్రేయపురం ప్రశిద్ది అని తెలియదు. అసలు ఆ ఊరి పేరే వినలేదు. పూతరేకులంటే ఇంటిలో తయారు చేసేవే. ఇప్పటిలా అమ్మకానికి కూడా వచ్చేవికాదు. బాగా అనుభవమున్న ఎవరినో ఒప్పించి సంవత్సరానికి ఒకటి, రెండు సార్లు పూతరేకులు తీయించేవారు.

రేకులు విడిగా తినడానికి బాగానే ఉంటాయికానీ చుట్టలుగా చుడితే మరింత బాగుంటాయి. వాటిని ఎలా చేసేవారో తెలుసా? రెండు రేకులని తడిగుడ్డలో వేసి నొక్కి, వాటి బిరుసు తగ్గిన తరువాత కాసిన వేడి నెయ్యి వేసి, పంచదార పొడి జల్లి, మడత పెట్టి పూతచుట్టలు చుట్టేవారు. అసలు రుచి అంటే పంచదార చుట్టలది కాదు. బెల్లం చుట్టలది! ఎప్పుడైనా తిన్నారంటే... కమ్మని నేతి వాసన, తియ్యటి రుచి... అబ్బా... నా మాటనమ్మండి... మీరు వాటిని జన్మలో మరచిపోలేరు!

ఈ టపా రాయడం వెనుక ఉద్దేశ్యం మీ నోరూరించడం కాదండోయ్. ఒకవేళ.. బై ఎనీ చాన్స్... ఇప్పటివరకూ బెల్లం పూచుట్ట రుచి చూసి ఉండకపోతే... ఆలశ్యం చెయ్యకుండా.. ఆ పనిలో ఉంటారని. ఏమంటారు!?     

© Dantuluri Kishore Varma

పనసకాయలే దిక్కు మహాప్రభో!

ప్రపంచ జనాభా రోజు రోజుకీ పెరుగుతుంది. ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి పంటలు పండించే భూమి విస్తీర్ణం మాత్రం పెరిగే అవకాశంలేదు. కాబట్టి క్రమేపీ ఆహార కొరత ఏర్పడడం తప్పనిసరి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు మారుతున్న వాతావరణ పరిస్థితులవల్ల వేడిగాలుల తీవ్రత పెరిగి, వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, కరువు కాటకాలు సంభవించవచ్చునట. ఇప్పటికే ప్రజల ప్రధాన ఆహారంగా ఉన్న గోదుమలు, జొన్నలు, వరి లాంటివాటి ఉత్పత్తి తగ్గిందని, రాబోయే దశాబ్ధంలో ఆహారంకోసం దేశాలమధ్య యుద్దాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ది గార్డియన్ పత్రిక దీనిగురించి నిన్న ఒక వార్తను ప్రచురించింది.

ఒక సమస్య ఉంది అంటే దానికి పరిష్కారంకోసం ఆలోచిస్తారుకదా? ప్రత్యామ్నాయ పంటలు, ఆహార వనరుల గురించి ప్రపంచబ్యాంక్ వాళ్ళు చెపుతూ మన పనసచెట్లని చూపించారు.  

కష్టపడకుండా పనసతోటల్ని పెంచవచ్చు. చీడపీడల గొడవ ఉండదు. నీరుకూడా ఎక్కువగా అవసరంలేదు. పనసచెట్టు గుత్తులు గుత్తులుగా ఎన్నో కాయలని కాస్తుంది. చిన్న కాయ కనీసం ఐదారుకేజీలు బరువు తూగుతుంది. పెద్దకాయలయితే సునాయాసంగా ముప్పై, నలభై కేజీలవరకూ తూగుతాయి. పనసకాయలో పీచుని, తొనలని, గింజలని ఆహారంగా ఉపయోగించుకోవచ్చు.

పెళ్ళిళ్ళకీ, ఫంక్షన్లకీ పనసపొట్టుకూర, పనసకాయముక్కల బిర్యానీ చేసుకొంటాం. పనసతొనలు తింటాం, ఎప్పుడైనా పనసపిక్కల కూర వొండుకొంటాం; కాల్చుకొని తిన్నా చాలా బాగుంటాయి. ఈ అవసరాలన్నింటికీ ఉపయోగిస్తున్నా పనసకి మనదేశంలో పెద్దగా మార్కెట్ లేదు. కానీ, రాను రానూ పనసపంటకి విశేషమైన ప్రాధాన్యత వస్తుందని అంటున్నారు.  శ్రీలంక, వియత్నం లాంటి దేశాలలో నూడుల్స్, ఐస్క్రీం మొదలైన ఉత్పత్తులు పనసకాయలతో తయారవుతాయి. చపాతీలు చేసుకోవడానికి పనసపిండిని కూడా తయారు చేస్తారు. మనదేశం కూడా ఈ విధానాలని అవలంభించాలని అంటున్నారు.
Google images
గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా రొయ్యల చెరువులు కనిపిస్తున్నట్టు, భవిష్యత్తులో `పనసకాయలే దిక్కు మహాప్రభో!` అనిపించేలా పనస తోటలు కూడా విరివిగా కనిపిస్తాయేమో!

© Dantuluri Kishore Varma

Wednesday 23 April 2014

హ్యాట్స్ ఆఫ్ టు ద బార్డ్!

ఇంగ్లీష్ భాషతో కొంత పరిచయం ఉన్నవాళ్ళు ఓ పదిమాటలు ఆ భాషలో మాట్లాడితే అందులో మూడో, నాలుగో జాతీయాలుగా స్థిరపడిపోయిన షేక్‌స్పియర్ మాటలే ఉంటాయి. చిత్రమేమిటంటే అవి మాట్లాడిన వాడికే ఆ విషయం తెలియదు. మాయాబజారు సినిమాలో ఎస్.వీ.రంగారావుతో `ఎవరూ పుట్టించకపోతే కొత్తమాటలు ఎలా పుడతాయి,` అని చెప్పించినట్టు; ఆగ్లంలో ఉన్న మాటల్ని అటుతిప్పి ఇటుతిప్పి మొత్తమ్మీద 1700 కొత్త పదాల్ని షేక్‌స్పియరే సృష్టించాడట. ఒక భాషకి అంత సేవ చేసిన మరొక వ్యక్తి ఆ మహారచయితకి ముందూ, ఆ తరువాత ఇప్పటివరకూ కూడా ఎవరూ లేరు! బార్డ్(షేక్‌స్పియర్ని అలా పిలుస్తారు) పుట్టి నాలుగువందల యాభై సంవత్సరాలు గడిచిపోయినా ఆశ్చర్యపోతూ, అబ్బురపడుతూ, పాత్రల్లో మమేకమైపోయి దుఖ:పడుతూ, నవ్వుకొంటూ, ఊహాలోకాల్లో విహరిస్తూ... ఇప్పటికీ ఆయన రాసిన నాటకాలని చదువుకొంటున్నామంటే - కాలం ఒక మనిషి ముందు చిన్నబోయినట్టే కదూ! బార్డ్ రాసిన 37 నాటకాల్లో రెండో, మూడో తప్పించి మిగిలినవన్నీ అంతకు ముందు జనాలకి తెలిసున్న కథలే - కానీ కథనం, పాత్రల నడత(క్యారెక్టరైజేషన్), భావ వ్యక్తీకరణ, శైలి చాలా గొప్పవి.  ప్రేమనో, విరహాన్నీ, కష్టాన్నో ఎంతబాగా వ్యక్తీకరిస్తాడో! ఆ వాఖ్యాలని నమిలి మింగేసి పూర్తిగా సొంతం చేసుకోవాలనిపిస్తుంది. కానీ, అది ఎరికైనా సాధ్యమా? చారిత్రక నవలలు, సుఖాంతాలు, దుఖాంతాలు, జానపదకథలు, ఫెయిరీటేల్స్... ఇన్ని రకాలుగా రచనా వైశిష్ఠ్యాన్ని ప్రదర్శించాడు కనుకే  ప్రపంచం మెచ్చిన మహాకవి అయ్యాడు. ఏప్రిల్ 23 ఆయన జయంతి అని అంటారు (ఖచ్చితంగా నిర్ధారింపబడలేదు). వర్దంతి కూడా ఏప్రిల్ ఇరవైమూడే.

© Dantuluri Kishore Varma

Monday 21 April 2014

పులివేట

`ది హిందూ పేపర్ వాళ్ళు ప్రతీరోజూ అర్థశతాబ్ధం క్రితం నాటి వాళ్ళ పేపర్లనుంచి ఫ్రం ద ఆర్కైవ్స్ అనే శీర్షికతో విశేషాలని ఇస్తూ ఉంటారు. దానిలో ఈ రోజు ఒక నమ్మలేని నిజం లాంటి విషయం చదివాను,` చమన్ అన్నాడు.

`ఏమిటని అడక్కపోయినా చెపుతావు కదా? చెప్పేయి,` అన్నాడు దీపక్.

ఇంటి డాబామీద కూర్చొని ఉన్నారు ఇద్దరూ. కరెంటు లేదేమో అంతా కటిక చీకటిగా ఉంది. ఆకాశంలో చందమామ కాదుకదా, కనీసం నక్షత్రాలు కూడా కనిపించడంలేదు.

చమన్ మొదలు పెట్టాడు, `గుజరాత్‌లో ఒక చిన్న పల్లెటూరు. దానికి దగ్గరలో అడవి ఉంది. ఒక పశువుల కాపరి మేతకోసం ఆవుల్ని అక్కడికి తీసుకొని వెళ్ళాడట. పులి వచ్చింది. దానినుంచి పశువుల్నీ, తననీ కూడా రక్షించుకోవాలి. చేతిలో ఉన్న కర్రతో పులిని అదిలించడానికి ప్రయత్నించాడు. అప్పటికే ఆవులు దూరంగా పరిగెత్తాయి. పులి కొంచెం బెదిరింది కానీ, ఆ చిన్న కర్ర తనని ఏమీ చెయ్యలేదని తెలిసిన తరువాత దాడి మొదలు పెట్టింది.`

`వెర్రివాడిలా ఉన్నాడు. తనసంగతి చూసుకొని ఏ చెట్టో ఎక్కేసి ఉంటే, పులి ఓ ఆవుని చంపి ఉండేది. తాను బ్రతికి పోయేవాడు,` దీపక్ అన్నాడు.

`అలాచేస్తే నమ్మకానికి ద్రోహం చేసినట్టే!` 

`ఏడిశావులే... నమ్మకమట, నమ్మకం! మన రాజకీయ నాయకుల్ని చూడు ఒక పార్టీ మానిఫెస్టోతో ఓట్లు అడుక్కొని, గెలిచి, తరువాత పార్టీ పిరాయించడంలేదూ? అది నమ్మక ద్రోహంకాదా?  ప్రాణం కంటే గొప్పదా నమ్మకం? పాపం తమ యజమాని పులికి బలయిపోతున్నాడని ఆవులేమన్న ఫీలయిపోయి కన్నీళ్ళు కారుస్తాయా? ` 

`నిజంగా అలాగే జరిగిందిరా దీపక్! కన్నీళ్ళు పెట్టుకోలేదు కానీ, దూరంగా పారిపోయినవి అన్నీ ఒకజట్టుగా కలిసివచ్చి పులిమీద ఎదురుదాడి చేసి, దానిని చంపేశాయి. తమ కాపరిని కాపాడుకొన్నాయి.`

`భలేగా ఉందిరా చమన్ నీ కథలాంటి నిజం. ఈ మధ్య ఏ విషయం విన్నా దానిమీద రాజకీయాలు ఓవర్‌లేప్ అయిపోతున్నాయి.  ఆవులు ప్రజలు, పులి ప్రజాస్వామ్యాన్ని కబళించడానికి వచ్చే స్వార్థరాజకీయం, పశువులకాపరి ప్రజాస్వామ్యం అన్నమాట. ప్రజలసహకారం లేకపోతే ప్రజాస్వామ్యం బ్రతికి బట్టకడుతుందా?  ఓటుతో అరా(జ)చకీయుల్ని మట్టి కరిపించవచ్చు కదా?`

చప్పున కరెంట్ వచ్చింది. దానితో పాటు వెలుగూనూ. పద క్రిందకి పోదాం అనుకొని ఇద్దరూ మెట్లవైపు నడిచారు.

© Dantuluri Kishore Varma

Saturday 19 April 2014

తిరుమల నంబి

పదకొండవ శతాబ్ధంలో తిరుమలలో తిరుమల నంబి అనే శ్రీనివాసుని భక్తుడు ఉండేవాడట. ప్రతీరోజూ తిరుమల దేవాలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపనాశం నుంచి నీరు తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేకం చేసేవాడు. ఒకరోజు యదావిధిగా అభిషేకజలాన్ని ఒక కుండలో పట్టుకొని తీసుకొని వస్తుంటే విల్లంబులు ధరించిన ఒక వ్యక్తి తిరుమల నంబిని దాహానికి నీళ్ళు ఇమ్మని కోరతాడు. కానీ, తిరుమల నంబి అందుకు తిరస్కరించి ముందుకు వెళుతూ ఉండగా ఆ వ్యక్తి బాణంకొసతో కుండకి రంద్రంచేసి, కారుతున్న ధారకు దోసిటపట్టి దాహం తీర్చుకొంటాడు. ఆ తరువాత ఒక శరసంధానం చేసి అదే ప్రదేశంలో భూమిలోనుంచి పైకి నీటిని రప్పిస్తాడు. ఆ నీటి ఊటనే ఆకాశ గంగ అంటారు. అలా చేసిన వ్యక్తి సాక్షాత్తూ శ్రీనివసుడేనట.

తిరుమల స్వామివారి ఆలయంలో ఇప్పటికీ అభిషేకాది కైంకర్యాలు నిర్వహించేది తిరుమల నంబి వంశస్తులేనట. తిరుమల నంబి దక్షిణమాడవీధిలో నివాశం ఉండేవాడట. అందుకే ఇప్పుడు అక్కడ ఆయన పేరుమీద ఒక గుడి ఉంది.

© Dantuluri Kishore Varma 

Thursday 17 April 2014

ఉప్పాడ జందాని చీరలు

కాకినాడ నుంచి ఉప్పాడకి బీచ్‌రోడ్ ద్వారా వెళితే వాకలపూడి లైట్ హౌస్‌కి పది కిలోమీటర్లదూరంలో ఉంటుంది. పిఠాపురం మీదుగా కూడా వెళ్ళవచ్చు. పిఠాపురం నుంచి  పది కిలోమీటర్లే ఉంటుంది.  జందానీ చీరలకి ఈ ఊరు ప్రశిద్ది చెందింది. వీటికి భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్ -  జి.ఐ)  కూడా ఉంది. ఒక ప్రాంతం పేరుతో ప్రఖ్యాతి పొందిన ఉత్పత్తులకి జి.ఐ ఇస్తారు. అప్పుడు వాటిని మరొక ప్రాంతంలో ఉత్పత్తి చెయ్యకూడదు.

జందానీ అనే మాట పారశీక భాషనుంచి వచ్చిందట. జాం అంటే పువ్వులనీ, దానీ అంటే వాటిని ఉంచే గుత్తి అని అర్థం. పువ్వులు, లతలతో కంటికి ఇంపుగా, మనసుకి హాయి కలిగించేలాఉండే నేతపనికి ఈ పేరు పెట్టారు. బెంగాల్‌లో ఈ నేత ఒక వెలుగు వెలిగిందట. తరువాత బ్రిటీష్ పాలనలో, విదేశీ బట్టల వెల్లువలో కొట్టుకు పోయింది. ఇప్పుడు అది ఉప్పాడ పేరుమీదుగా దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది.   

చీరలో పట్టునేతతో పాటూ కూర్చే బుటా - పైన ఎలా ఉంటుందో, వెనుకకు తిప్పినా అలానే ఉంటుంది. జందానీ నేత ప్రత్యేకత అదే.  ఇతర పట్టుచీరల నేతలో ఈ నైపుణ్యం కనిపించదు కనుకే ఈ చీరలకి అంత డిమాండ్ ఉంటుందని నేతకార్మికులు వివరించి చెప్పారు. ఒక్కొక్క మగ్గం దగ్గర ఇద్దరు చొప్పున పనిచేస్తూ ఎంతో సహనంతో, నేర్పుతో ఒక్కో దారపు పోగునూ కూర్చుతున్నారు. వాళ్ళకి అభిముఖంగా గోడమీద తగిలించుకొన్న నమూనా డిజైన్‌ను చూస్తూ మగ్గం మీద చీరను నేస్తున్నారు. ఓ పోగు తప్పుగా వెళ్ళినా చీర మొత్తం నాశనం అయినట్టే. ఒక్కచీర తయారు చెయ్యడానికి ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేస్తే నెలరోజులు పడుతుందట.


మరి అంత కష్టపడితే వాళ్ళకి వచ్చే ప్రతిఫలం? తక్కువలో తక్కువ ఆరు వేల నుంచి, యాభై వేల వరకూ ఒక్కో చీరకూ లభిస్తుంది. ప్రత్యేక ఆర్డర్లు ఉంటే లక్షా యాభైవేల చీరవరకూ కూడా తయారు చేస్తారట. రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు, సినిమా ప్రరిశ్రమలో ప్రముఖులు.. ఇంకా బాగా డబ్బున్నవాళ్ళు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి జందానీ చీరలు ధరించడం స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. అందుకే వీటికి ఈ మధ్యకాలలో మరింత గిరాకీ పెరిగింది.  
నేతపని వాళ్ళకి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడిందని ఒకాయన చెప్పాడు. పిల్లలకి కూడా ఈ నైపుణ్యాన్ని నేర్పి, కొంతమంది పనివాళ్ళను పెట్టుకొని ఒక మగ్గం ఉండే వాళ్ళు క్రమంగా రెండు, మూడు మగ్గాలను ఏర్పాటు చేసుకొంటున్నారు. మార్కెటింగ్ చెయ్యగలిగిన వాళ్ళు సొంత షాపులు పెట్టుకోవడం, లేదంటే నేసిన చీరలని షాపులకి వెయ్యడం జరుగుతుంది. ఉప్పాడకు ప్రక్కన ఉన్న యు.కొత్తపల్లిలో రెండు చిన్న వీధుల్లో కనీసం ముప్పై షాపులు ఉన్నాయి.  
పట్టుని కర్ణాటక నుంచి తెచ్చుకొంటారట. ఇది ముడి పట్టు. ఒక్కో పట్టుపోగూ గుర్రపు వెంట్రుక మందంలో ఉంటుందట. దానిని ప్రోసెసింగ్‌కి గొల్లప్రోలో, పిఠాపురమో పంపిస్తారు. అక్కడే పట్టుకి కావలసిన రంగులు వేయిస్తారు. రంగు దారాలని తిరిగి తెచ్చుకొని మగ్గంపైకి ఎక్కిస్తారు. ఒక్కో డిజైన్‌కి ఒకటి రెండు చీరల కంటే ఎక్కువ తయారు కావు. తయారయిన చీర వెంటనే షాపుకి వెళ్ళిపోతుంది. తొందరగానే అమ్ముడు పోతుంది.  


© Dantuluri Kishore Varma 

Monday 14 April 2014

కెన్ ఐ హెల్ప్ యూ?

ఇక్ష్వాకులకాలం నాటి బండి నాది. మా ఎల్.ఐ.సీ ఏజంటు ఎదురుపడినప్పుడల్లా అంటూనే ఉంటాడు, `బండి మార్చరా?` అని. నవ్వడం తప్ప నేను ఏ సమాధానమూ చెప్పనని అతనికీ తెలుసు. అప్పుడప్పుడూ సంభాషణని కొనసాగిస్తూ స్వగతంలో చెప్పుకొన్నట్టు `అచ్చొచ్చిన బండి అయివుంటుంది లెండి,` అంటాడు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే ఈ రోజు సాయంత్రం చిన్నమార్కెట్ దగ్గర అది చెప్పాపెట్టకుండా ఆగిపోయింది. స్టార్ట్ చెయ్యడానికి కొంత ప్రయత్నం చేసినతరువాత పెట్రోల్ ఓవర్ అయ్యిందని అర్థమయ్యింది. కిక్ స్టార్ట్ చేసి, చేసి విసుగుపుట్టింది కానీ ఇంజన్ స్టార్ట్ కాలేదు. మెకానిక్‌షెడ్లు తెరిచి ఉండే సమయం కూడాకాదు. అరకిలోమీటరు దూరంలో ఉన్న ఇంటివైపు నడిపించడం మొదలు పెట్టాను. వొళ్ళంతా చెమటతో తడిచి ముద్దయ్యింది. నడిచి, నడిచి ఇంటికి చాలా సమీపానికి వచ్చేసరికి ఒకాయన హీరో హోండా బైకు మీద నన్ను దాటుకొని వెళ్ళాడు. కొంచెం ముందుకు వెళ్ళి, బైకుని వెనక్కి తిప్పాడు. నా దగ్గరకు వచ్చి `బైకు తీసుకొని వెళ్ళండి. మీ బండి నాకు ఇవ్వండి,` అన్నాడు. అతని ముఖం ఎప్పుడో చూశాను. వెంటనే పేరు జ్ఞాపకం రావడంలేదు. `పరవాలేదండి, ఈ ప్రక్కవీధిలోనే ఇల్లు, థాంక్యూ,` అన్నాను. `మీరు పెట్రోలు తెచ్చుకొనే వరకూ వెయిట్ చేస్తాను, నా బండిలో ఖాళీ సీసా ఉంది. వెళ్ళి వచ్చేయండి ఇబ్బంది ఏమీలేదు,` అన్నాడు. పెట్రోల్ అయిపోయి ఉంటుందని అనుకొన్నట్టున్నాడని అనిపించి విషయం చెప్పాను. తను స్టార్ట్‌చేసి పెడతానన్నాడు. సహాయం చేస్తానని మొహమాటానికి అనడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మరీ మరీ కృతజ్ఞతలు చెప్పాను.  ఇంటికి వెళ్ళిన తరువాత జ్ఞాపకం వచ్చింది అతను ఎవరో - చాలా కాలం క్రితం ఒక సాఫ్ట్‌వేర్‌ని అమ్మడానికి మా స్కూల్‌కి వచ్చాడు. నెగోషియేషన్స్ జరుగుతూ ఉండగానే అతను కంపెనీ మారాడని తెలిసింది. అందువల్ల తరువాత మేము కొన్న సాఫ్ట్‌వేర్ అతని సేల్స్ టార్గెట్‌లో పడలేదు - అది వేరే విషయం. కానీ అతని ఆటిట్యూడ్,  చెయ్యాలనుకొన్న సహాయం  ఫీల్‌గుడ్  థింగ్స్!    
© Dantuluri Kishore Varma

Sunday 13 April 2014

షాపింగ్ @ తిరుమల

తిరుమల లాంటి ప్రదేశాలకి వెళ్ళినప్పుడు, తిరిగివస్తూ స్నేహితులకి, బందువులకి, సహోద్యోగులకి ఏవయినా సావనీర్స్ లాంటివి తీసుకొని వెళ్ళడం తప్పని సరి. ప్రసాదంతో పాటూ ఓ వేంకటేశ్వరుడి కీ చెయినో, ఫోటోనో, భక్తిపాటల సీడీనో, కనీసం కాశీతాడో ఇవ్వడం రివాజు. అవి కొనడానికి షాపులవెంట పడవలసిందే.  గుండు చేయించుకొన్నవాళ్ళు టోపీలకోసం, వాళ్ళకి తోడువెళ్ళిన ఆడవాళ్ళు గాజులకోసం, చెంపపిన్నులకోసం, పిల్లలు బొమ్మల కోసం, ఉంగరాలకోసం షాపింగ్‌స్ప్రీ మొదలు పెడతారు. అదో సరదా!   







© Dantuluri Kishore Varma 

Friday 11 April 2014

బీచ్‌ రోడ్డు

కాకినాడనుంచి ఉప్పాడ వెళ్ళడానికి రెండు దారులున్నాయి. ఒకటి పిఠాపురం మీదుగా వెళితే, రెండవది వాకలపూడి లైట్‌హౌస్ ప్రక్కనుంచి సముద్రానికి ఆనుకొని వెళ్ళే బీచ్‌రోడ్డు. ఈ రెండవది విశాఖపట్నం నుంచి బీమిలీ వెళ్ళే రోడ్డుని తలపిస్తుంది. ఎగసిపడే అలలు, తీరం వెంబడే ఎగిరే నీటి పక్షులు, చల్లని సముద్రపుగాలి, బీచ్ ఇసుకమీద లంగరు వేసి ఉన్న నాటుపడవలు, అక్కడక్కడా నీచువాసన, వలలు భుజానవేసుకొని రోడ్డువెంబడి నడచిపోయే మత్యకారులు.. ఓ పదికిలోమీటర్ల దూరం ఇట్టే జరిగిపోతుంది. సముద్రపు అలలు రోడ్డుని కోసేయ్యకుండా రివెట్‌మెంట్ వేశారు. కానీ, ప్రతీ వర్షాకాలంలోనూ అది కొట్టుకొని పోతుంది. ఒక్కోసారి ఉప్పాడ ఇరుకు వంతెన మూడింట రెండు వంతులు కోతకు గురవుతుంది. మిగిలిన సన్న దారిలో ముంబై మెరైన్‌డ్రైవ్‌లో కెరటాలు విరుచుకుపడి, నీటి తుంపర్లు మీదపడుతున్నప్పటిలా సముద్రం హడావుడి చేస్తుంటే బితుకు, బితుకు మని ప్రయాణీంచడమే! ఈ ఫోటోలు చూడండి. ఇంకొక్క తమాషా చెప్పనా? రోడ్డుకి ఓ వైపు సముద్రం, రెండవ వైపు వరి చేలు!




© Dantuluri Kishore Varma 

Wednesday 9 April 2014

తారారరీ ఓ..

అందమైన అనుభవం. 1979లో వచ్చిన బాలచందర్ సినిమా. అందులో కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళూ పాట. వందసార్లు ఏకబిగిన విన్నా బోరుకొట్టదు. చిన్న చిన్న మాటల్లో ఆచార్య ఆత్రేయ స్పిరిట్ ఆఫ్ యూత్ ని చక్కగా కేప్చర్ చేశారు. దానికి తోడు బాలూ గానం, ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతం. నాదస్వరంలాంటి ఏదో లయ ఉంది సంగీతంలో. అందుకే చిత్రీకరణలో చూపించిన ప్రేక్షకుల్లాగా మనంకూడా ఒక ట్రాన్స్‌లో ఉన్నట్టు తలలాడించుకొంటూ ఈ పాట హోరులో కొట్టుకొని పోతాం. గిటార్‌ని, సాక్సోఫోన్‌ని, డ్రమ్స్‌ని ఎంత బాగా వాడారో చూడండి. కమల్‌హాసన్ డ్యాన్స్ - దాన్ని డ్యాన్స్ అనేకంటే ఆడ్రెనలిన్ రష్(adrenaline rush) అనొచ్చునేమో!   జయప్రద సూపర్ క్యూట్!  
  
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు.. వెర్రెక్కీ వున్నోళ్ళు..
కళ్ళాలే లేనోళ్ళు..కవ్వించే సోగ్గాళ్ళు!!
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు.. వెర్రెక్కీ వున్నోళ్ళు..
కళ్ళాలే లేనోళ్ళు..కవ్వించే సోగ్గాళ్ళు!!
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు.. ఆవేశం ఉన్నవాళ్ళు
తారారరీ ఓ..
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు.. వెర్రెక్కీ వున్నోళ్ళు..
కళ్ళాలే లేనోళ్ళు..కవ్వించే సోగ్గాళ్ళు!!
గతమును పూడ్చేది వీళ్ళు.. అ చరితను మార్చేది వీళ్ళు..
వీళ్ళెనోయ్ నేటి మొనగాళ్ళూ..
చెలిమికెపుడు జతగాళ్ళు.. చెడుకు ఎప్పుడూ పగవాళ్ళు..
వీళ్ళ వయసు నూరేళ్ళు.. నూరేళ్ళకు కుర్రాళ్ళూ!!

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు.. ఆవేశం ఉన్నవాళ్ళు
తారారరీ ఓ..
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు.. వెర్రెక్కీ వున్నోళ్ళు..
కళ్ళాలే లేనోళ్ళు..కవ్వించే సోగ్గాళ్ళు!!
తళతళ మెరిసేటి కళ్ళు.. హో నిగనిగలాడేటి ఒళ్ళు..
విరిసే చిరునవ్వు జల్లు..హ ఎదలో నాటెలు ముల్లు..
తీయాలోయ్ దాన్ని చెలి వేళ్ళూ!!
నిదురరాని పొదరిల్లు..బ్రహ్మచారి పడకిల్లు
మూసివున్న వాకిళ్ళు..తెరిచినపుడే తిరునాళ్ళూ!!
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు.. ఆవేశం ఉన్నవాళ్ళు
తారారరీ ఓ..
నీతులు చెప్పే ముసలాళ్ళు.. నిన్న మొన్నటి కుర్రాళ్ళు..
హొ..దులుపెయ్ ఆనాటి బూజులు.. మనవే ముందున్న రోజులు..
తెంచేసెయ్ పాత సంకెళ్ళూ!!
మనుషులే మన నేస్తాలు.. కమాన్ క్లాప్ .. మనసులే మన కోవెల్లు ఎవ్రీ బడి
హ హు హ హు..
మనుషులే మన నేస్తాలు..మనసులే మన కోవెల్లు
మనకు మనమే దేవుళ్ళు.. మార్చి రాయి శాస్త్రాలూ!!

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు.. ఆవేశం ఉన్నవాళ్ళు
తారారరీ ఓ..
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు.. వెర్రెక్కీ వున్నోళ్ళు..
కళ్ళాలే లేనోళ్ళు..కవ్వించే సోగ్గాళ్ళు!!
కమాన్ ఎవ్రీ బడి జాయిన్ టుగెదర్ హొ.. హు.. హొ.. హు..

© Dantuluri Kishore Varma

Monday 7 April 2014

సీతారామకళ్యాణం

విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణా బాధ్యతని స్వీకరించి రామలక్ష్మణులు మహర్షివెంట అడవులకు వెళ్ళారు. తాటకిని, మారీచ సుభాహుల్ని వదించి కర్తవ్య నిర్వాహణని పూర్తిచేశారు. అటుపిమ్మట మిథిలా నగరానికి పయనం. మిథిల జనకుని రాజధాని. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మయోగి గురించి చెపుతూ జనకుడిని ఉదహరిస్తాడు. అటువంటి జనకుడు ఒకసారి యాగం నిర్వహించ తలపెట్టి భూమిని త్రవ్వుచూ ఉండగా అయోనిజ సీత లభిస్తుంది. రామలక్ష్మణులు మిథిలా నగరానికి వచ్చే సమయానికి ఆమె యవ్వనవతి. ఆమెకు భర్తగా రాగల వ్యక్తి సామాన్యుడు అయి ఉండడానికి వీలులేదు. అందుకే ఎప్పుడో దక్షయజ్ఞం తరువాత శివుడు జనకుని పూర్వీకులకు అప్పజెప్పిన శివధనస్సుని ఎక్కుపెట్టగలిగిన ధీరుడే ఆమె చేయి అందుకోగలిగిన అర్హత గలిగిన వాడు అని జనకుడు భావించి ఉన్నాడు.    

ఆ దనుస్సుని సోదరులు చూడగోరారు. జనకుని ఆజ్ఞని అందుకొన్న సేవకులు ఎనిమిది చక్రాలు కలిగిన శివదనుస్సును ఉంచిన పేటికని తీసుకొని వచ్చారు. అప్పుడు ఒక గొప్ప ఘట్టానికి తెరలేచింది. రఘురాముడు శివధనుర్భంగం చేశాడు. అది ఒక అపురూప సన్నివేశం.  ముళ్ళపూడి వెంకటరమణ గారు సీతా కళ్యాణం అనే కథలో నీలిమేఘశ్యాముడ్ని లక్మణుడి దృష్టికోణంలోనుంచి ఆవిష్కరించారు.

విల్లును చేపట్టబోవడంలో సొగసు
నిలబెట్టి..
దక్షిణ పాదంగుష్ఠానికి దన్నుపెట్టి వంచి..
తృటిలో అల్లెతాడు ఎక్కించడంలో వొడుపు, సౌలభ్యం
బాణం ఆరోపించడంలో మెలుకువ
నారిని ఆకర్ణాంతం లాగబోవడంలో చూపిన అంగవిన్యాసం 
సమ్మోహనకరంగా తోచాయి. 
అవలీలామానుష విగ్రహుడుగా గోచరించాడు.
Raja Ravi Varma`s Painting
దశరదమహారాజుకి వర్తమానం పంపారు. వార్తాహరులు వెళ్ళడానికి మూడురోజులు, అటునుంచి ఆయన బందుమిత్ర, సపరివార సమేతంగా కానుకలతో, మందీ మార్బలంతో తరలిరావడానికి మరో మూడురోజులు, మధ్యలో ఏర్పాట్లు చూసుకోవడానికి ఒక రోజు. రాముడు విల్లు విరిచిన తరువాత ఏడురోజుల నిరీక్షణ సీతకి.. రాముడుకికూడా! ఆ సుదీర్గమైన సమయంలో ఆమె ఏమిచేసిందో మళ్ళీ ముళ్ళపూడి రమణగారి మాటల్లో..

చెలులూ, చెల్లెళ్ళూ కూడా జానకికి ముప్పొద్దులా రామకథలే చెప్పారు. 
చెప్పిన కొద్దీ ఊరేవి; ఊరిన కొద్దీ ఊరించేవి!

సీతాదేవి చెల్లెలు ఊర్మిళ ఆమెని లక్ష్మణుడికి ఇచ్చి పరిణయంచేస్తే బాగుంటుందని భావించారు. అలాగే జనకుని సోదరుడు కుశధ్వజునికి ఇద్దరు కుమార్తెలు - మాండవి, శ్రుతకీర్తి. వాళ్ళిద్దరినీ భరత శతృగ్నులకి ఖాయం చేశారు. నాలుగు జంటలూ ఒకే ముహూర్తానికి ఒక్కటయ్యాయి.  

ఆవిధంగా ఉత్తరఫల్గుణీ నక్షత్రంలో  సీతారామకళ్యాణం అంగరంగ వైభోగంగా జరిగింది.   

రేపు శ్రీరామనవమి. రామాలయాల్లో సీతారాముల కళ్యాణం జరుపుతారు. చూసి తరించండి. 

© Dantuluri Kishore Varma

Saturday 5 April 2014

అక్కడికి వెళ్ళే ముందు ఈ దర్శనం తప్పక చేసుకోవాలి!

తిరుమలను శ్రీ ఆదివరహా క్షేత్రం అని పిలుస్తారని మీకు తెలుసా? నిజానికి ఈ కొండ వరహాస్వామిది. విస్ణుమూర్తిమీద అలిగి లక్ష్మీదేవి భూలోకంలో ఆకాశరాజు కుమార్తెగా అవతరించింది. ఆమెను పరిణయం చేసుకోవడానికి శ్రీనివాసుడు దివినుంచి భువికి దిగివచ్చాడు.  వరహాస్వామి క్షేత్రమైన కొండమీద తాను ఉండడానికి కొంత జాగా కావాలని కోరతాడు. ఆతని విన్నపాన్ని మన్నించిన వరహాస్వామి వందఅడుగుల స్థలాన్ని అప్పుగా ఇస్తాడు. దానికి ప్రతిఫలంగా వెంకన్నను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ముందుగా తననే దర్శనం చేసుకోవాలని, మొదటి పూజా, నైవేద్యం తనకే రావాలని నిబంధన విదిస్తాడు. ఇప్పటికీ ఈ ఆచారమే కొనసాగుతుంది. కాబట్టి తిరుమల కొండపైకి వెళ్ళిన భక్తులు మొదటిగా వరహాస్వామినే దర్శించుకొని తీరాలి.   
అంతగా ప్రచారం లేదు కనుకు ఎక్కువమంది భక్తులకి ఈ విషయంగురించి తెలియదు. 

కాబట్టి ఈ సారి తిరుమల వెళ్ళినప్పుడు మీరు ఏమిచేస్తారంటే....

శ్రీవారి దేవాలయానికి ఉత్తరం వైపు ఉన్న పుష్కరిణి వొడ్డున వరహాస్వామి గుడి ఉంది. పుష్కరిణిలో నీటిని యంత్రాలద్వారా నిరంతరం శుబ్రపరుస్తూ ఉన్నారు. చల్లని కొలను నీటిలో స్నానం చెయ్యండి. ప్రక్కనే స్నానపుగదులు, దుస్తులు మార్చుకొనే గదులూ ఉన్నాయి. అక్కడ పొడిబట్టలలోకి మారి, వరహాస్వామి ఆలయం వైపు నడవండి. మీకు చక్కని దర్శనం లభిస్తుంది. ఇలా చేసిన తరువాతే మీరు వేంకటేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్ళాలని చెపుతారు. 
© Dantuluri Kishore Varma

Thursday 3 April 2014

సూర్యుడు వీడ్కోలు చెపుతుంటే...

ప్రతీరోజూ 
ఓ అందమైన సూర్యోదయం, 
అంతకన్నా అందమైన సూర్యాస్తమయమూ ఉంటాయి. 
ఎవరో అంటారు- 
అస్తమించే సూర్యుడిని, ఉదయించే చంద్రుడిని గమనిస్తూ ఉంటే 
సృష్ఠికర్త మీద గౌరవం మరింత పెరుగుతుందని.   
అపార్ట్‌మెంట్ల నడుమ 
చెట్లవెనుక 
కొండలమధ్య 
గోదావరిమీద పడవల తెరచాటుగా 
వరిచేలదగ్గర... 
సూర్యుడు వీడ్కోలు చెపుతుంటే
ఆగి, చూడకుండా ఉండలేం!
అబ్బురపడకుండా ముందుకు కదలలేం!
తిరుమల కొండల్లో చెట్లవెనుక అస్తమిస్తున్న సూర్యుడు
© Dantuluri Kishore Varma

Tuesday 1 April 2014

శ్రీవారి ఏనుగు

తిరుమలలో శ్రీవారి సేవలో తరించే ఏనుగులు ఓ అరడజను దాకా ఉన్నాయట. ప్రతీఉదయం భోగ శ్రీనివాసుడికి జరిగే జలాభిషేకంలో కొన్ని గజరాజులు పాల్గొంటే, సాయంత్రం మలయప్పస్వామి ఊరేగింపులో కొన్ని పాలుపంచుకొంటాయి. ఉత్సవాల్లో, సంబరాల్లో, ప్రత్యేక అతిధులకి స్వాగతం చెప్పడంలో శ్రీవారి ఏనుగులు తప్పనిసరిగా ఉంటాయి. ఈ సేవలు అవీ లేనప్పుడు ఏనుగులని బయటకు తీసుకొని వస్తారో లేదో తెలియదు కానీ మొన్న ఉదయం  వరహాస్వామి గుడికి సమీపంలో భక్తులు ఇచ్చే కానుకలు స్వీకరిస్తూ, వారి శిరస్సులమీద తొండం ఉంచి ఆశీర్వదిస్తూ ఓ ఏనుగు ఇలా కనిపించింది. మావటివాడికీ, గజరాజుకీ ఏదో సంభాషణ జరుగుతుంది. అతను చెప్పినట్టూ చేస్తుంది. 
కొందరు భయం, భయంగా కొంచెం భక్తిగా ఆశీర్వాదం తీసుకొంటున్నారు. ఒక్కోక్కరయితే తొండం శిరస్సుమీద ఉంచినప్పుడు ఒక రకమైన జలదరింపుకు లోనవుతున్నారు. 
భయంలేదులేమ్మా వచ్చి ఆశీస్సులు అందుకో అన్నట్టు ఉంది కదు!
`హమ్మయ్య ఈ రోజుకి ఈ కార్యక్రమం ముగిసింది. ఇక వెళ్ళి చెరుకు గడలూ అవీ తిందాం,` అనుకొంటుందేమో!

© Dantuluri Kishore Varma

ఆల్కెమిస్ట్

పౌల్లో కొయెల్లో రాసిన ఆల్కెమిస్ట్ నవలని చదవాలని చాలా కాలంగా అనుకొంటూ ఉన్నా ఈ మధ్యవరకూ కుదరలేదు. ఈ పుస్తకంగురించి చాలా విని ఉండడంవల్ల ఆసక్తి పెరిగింది. 1988లో పోర్చుగీస్‌లో రాసిన చిన్న పుస్తకం ఏకంగా 56 భాషల్లోకి అనువదింపబడి రికార్డ్ సృష్టించింది. ఈ కారణం వల్ల పౌల్లో కొయెల్లో పేరు గిన్నీస్ బుక్కులో కెక్కింది. ఇది ఎప్పటి మాటో. కానీ, ఇప్పుడు చెప్పడానికి కారణం నేను ఈ మధ్యనే దానిని చదివి ఉండడం. అసలు ఏం జరిగిందంటే, విజయవాడ బుక్‌ఫెస్టివల్ సొసైటీ వాళ్ళు ఈ మార్చిలో ఓ వారం రోజులపాటు కాకినాడలో మొట్టమొదటిసారిగా బుక్‌ఫెస్టివల్ నిర్వహించడంతో నేను రెక్కలు కట్టుకొని అక్కడ వాలిపోయాను. ఆల్కెమిస్ట్ దొరికింది. 

ఇంతకీ అల్కెమిస్ట్ అంటే ఏమిటో చెప్పలేదు కదూ... సత్తులోహాలని కూడా బంగారంగా మార్చగలిగిని విద్య తెలిసున్నవాడు. పరుశవేది అంటారు. కథ చిన్నది. సాంటియాగో అనే గొర్రెలుకాసుకొనే కుర్రవాడు కలలో కనిపించిన నిధికోసం ఈజిప్ట్‌లో పిరమిడ్ల వరకూ ప్రయాణం చెయ్యడం.  ఇలాంటి కథలు చిన్నప్పుడు చందమామలో బోలెడన్ని చదివాం. విఠలాచార్య సినిమాల్లోకూడా చూశాం. రాకుమారుడికి పేదరాసిపెద్దమ్మ దారిచెప్పడం, ఋషి ఆయుధాలు ఇవ్వడం, దారిలో కనిపించే రాకుమారితో ప్రేమ, ఎడారిదొంగలతో పోరాటాలు, ప్రకృతిశక్తుల్ని తర్కంతో మెప్పించి పని సాధించుకోవడం... ఇలాంటివన్నీ ఈ కథలో కూడా ఉన్నాయి. 

విఠలాచార్యకి, పౌల్లో కొయెల్లోకీ తేడా ఏమిటంటే ఈ రచయిత వ్యక్తిత్వ వికాసాన్నీ, తాత్వికతనీ బాగా దట్టించాడు. కథనంలో వేగం జెట్‌స్పీడులా ఉంటుంది. ఇంగ్లీషులోనికి తర్జమా చెయ్యబడిన నవల చదువుతున్నా, అది ఇంగ్లీషుదో, 1990ల్లో యండమూరి రాసిన పాపులర్ తెలుగు నవలో తెలియనంతగా లీనమైపోతాం. 

పేజీ, పేజీకీ ఉదహరించవలసిన ఆణిముత్యాల్లాంటి మాటలు ఉంటాయి. 

`యువకులకి లక్ష్యం స్పష్టంగా ఉంటుంది. ఏదయినా సాధించగలం అనే నమ్మకం కూడా ఉంటుంది. కానీ, కాలం గడిచే కొద్దీ వాళ్ళని ఏదో మాయ కమ్మేస్తుంది. లక్ష్యాన్ని చేరుకోలేమని నిరాశ ఆవహిస్తుంది.`

`నేనూ అందరిలాంటి వాడినే. నాచూట్టూ ఏమిజరగాలని కోరుకొంటానో దానినే దృష్టిలో ఉంచుకొని (సంఘటనలనీ, మనుష్యులనీ) చూస్తానుకానీ, నిజంగా ఏమిజరుగుతుందో దానిని చూడలేను.` 

`అదృష్టం మనవైపు ఉన్నప్పుడు, దానికి మనవంతు సహకారం పూర్తిగా అందించాలి. దానినే ప్రిన్సిపల్ ఆఫ్ ఫేవరబిలిటీ లేదా బిగినర్స్ లక్ అంటారు.`

`నేను దేనినీ మార్చాలనుకోవడంలేదు. ఎందుకంటే మార్పుని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియదు. నేను ఎప్పుడూ ఉండేలా ఉండడానికే అలవాటు పడిపోయాను.`

`నిర్లక్ష్యం చేయబడిన ప్రతీ దీవెనా శాపంగా మారుతుంది.`

`నువ్వు ఒకటి కావాలని మనస్పూర్తిగా కోరుకొంటే ప్రపంచం మొత్తం దాన్ని నీకు అందించడానికి ప్రయత్నిస్తుంది(కాన్స్పైర్స్).`  - ఇక్కడ కాన్స్‌పైర్ అంటే కుట్ర చెయ్యడం. కానీ ఒక పోజిటివ్ అర్థం వచ్చేలా ఉపయోగించడంతో వాక్యానికే గొప్ప అందం వచ్చింది.   

తెలుగులోకి అనువాదం చేశానుకనుక పైవాక్యాలు అలా ఉన్నాయికానీ, ఇంగ్లీష్‌లో చాలా బాగున్నాయి. 

రెండవ భాగంలోనికి వచ్చేసరికి కొంచెం అయోమయం మొదలౌతుంది. విశ్వాత్మ, ప్రపంచపు భాష (మనుష్యులది కాదు), శుభశకునాలని గుర్తించి అనుసరించడం.. లాంటి ఆధ్యాత్మిక విషయాలని రాస్తాడు రచయిత. కానీ, అవి ఏమిటో వివరణ ఉండదు. కథానాయకుడు సామాన్యుడే కానీ అతనికి పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి. ప్రత్యేకమైన శిక్షణ లేకుండానే, తనకి కూడా తెలియకుండానే గాలితో, సూర్యుడితో, విశ్వాత్మతో మాట్లాడ గలుగుతాడు. అలా చెయ్యడానికి అతనికి ఉన్న అర్హతలేమిటో తెలియదు.

చివరికి పరుశవేదిని తెలుసుకొంటాడు, నిధిని సొంతంచేసుకొంటాడు, మనసుదోచుకొన్న ఫాతిమాని కలుసుకోవడానికి బయలుదేరతాడు.

అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి పట్టుదలగా ప్రయత్నించడం, అననుకూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడం, అదృష్టం కలిసి వచ్చినప్పుడు దానికి మనకు సాధ్యమైనంత సహకారం అందించడం.. లాంటి విషయాలని చక్కగా చెప్పాడు రచయిత.

అనుకొన్నంత గొప్ప నవల ఏమీకాదు కానీ, చెడ్డ పుస్తకం కూడా కాదు. అన్ని భాషల్లోని అనువదించబడడం, మిలియన్ల కొద్దీ కాపీలు అమ్ముడుపోవడం మొదలైనవాటికి రచయితయొక్క బిగినర్స్ లక్ కూడా కొంత కారణం అయివుండవచ్చు.
© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!