Pages

Thursday 31 December 2015

అందరూ ఎలా ఉన్నారు?

మరికొన్ని గంటల్లో పాత సంవత్సరం కాలగర్భంలో కలిసిపోతుంది
గతంలో జరిగిన మంచి సంఘటనలు మధుర జ్ఞాపకాలు అవుతాయి.
అపజయాలు భవిష్యత్తులో నిర్మించబోయే విజయసౌధాలకి పునాదులౌతాయి. 

కొత్త ప్రణాళికలు వ్రాసుకోవడానికి ఆలోచననలకి పదునుపెట్టుకోండి 
విజయాలబాటలో తరువాత మజిలీని చేరడానికి శక్తిని సమాయత్తం చేసుకోండి 
`రేపటిమనం`, `ఈరోజుమనం` కంటే మరింత బాగుండాలని కోరుకోండి 

అదిగదిగో 2016 వస్తున్న అడుగుల చప్పుడు వినిపిస్తుంది... 

తలుపు తీసే ముందు ఆత్మీయ పలకరింపుల దరహాసాల్ని ముఖానికి పులుముకోండి
చేయిసాచి శుభాకాంక్షల్ని అందిస్తే పోయిందేముంది డూడ్స్?
మహా అయితే మరింతమందికి మిత్రులమౌతాం! 

అందరికీ నూతనసంవత్సర శుభాకాంక్షలు

 © Dantuluri Kishore Varma

Thursday 22 October 2015

ఈ రోజు వినాయకుడు బిజీ!

విజయదశమి మంచి కార్యక్రమాలను ప్రారంభించడానికి అనువైన రోజు. ఓ వైపు అమరావతిలో నూతనరాజధాని నిర్మాణానికి శంకుస్థాపనా కార్యక్రమం ఘనంగా జరుగుతుంటే మరోవైపు ఊరూరా, వాడవాడలా కొత్త వ్యాపార సంస్థల ప్రారంభాలు ఆర్భాటంగా చేస్తున్నారు. పాతషాపుల వాళ్ళు కొత్త స్కీములతో దసరా - దీపావళి సంబరాలు మొదలు పెట్టేసి హల్‌చల్ చేస్తున్నారు. జనాలు టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్‌లు, రిఫ్రిజిరేటర్లు, కార్లు, బైకులు కొనుక్కోవడానికి షోరూంల బయట అమ్మవారి దేవాలయం దగ్గర దర్శనం కోసం క్యూలైన్‌లో నుంచొన్నంత భక్తిగా తమవంతు కోసం పడిగాపులు పడుతున్నారు.  అమ్మవార్ల దేవాలయాలన్నీ భక్తులతో కిటికిటలాడుతుంటే మిగిలిన దేవుళ్ళ, దేవతల ఆలయాలన్నీ సామాన్యమైన సందడితో ఉన్నాయి. కానీ.... ఈ చిన్న గుడి - విఘ్నేశ్వరుడిది - కాకినాడ మెయిన్‌రోడ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎదురుగా ఉన్నది అమ్మవారి గుడి అంత, ఈ రోజే ఓపెన్ చేసిన కొత్త షోరూమంత సందడిగా ఉంది. గుడికి ఎదురుగా అప్పుడే షోరూంనుంచి బయటకు తెచ్చిన ఓ డజను బైకులు వరుసగా నిలబెట్టి ఉన్నాయి. చుట్టూ గిఫ్ట్ రిబ్బన్లు చుట్టిన ఒకట్రెండు కొత్తకార్లు కూడా ఏ సైకిలు వాడు వచ్చి గీత పెట్టేస్తాడో అన్న ఆందోళనతో ట్రాఫిక్ మధ్యలోనుంచి ఈ గుడివైపే మందగమనంతో కదులుతున్నాయి. మెయిన్‌రోడ్‌లో విఘ్ననాయకుడి బ్లెస్సింగ్స్ అవసరం మరి దేనికైనా!   
© Dantuluri Kishore Varma

Tuesday 6 October 2015

దేవుడికి బహుమతి

గాలికి తలలూపే గరిక పోచలు
పిచ్చి గడ్డిలో పూచే పూల సొగసులు
కురిసే చినుకులో అందం
తడిసిన మట్టి తెచ్చే మధురమైన సువాసనలు
జలజల మని పారే నదీమ తల్లులు
విరిగి పడే కెరటాలతో సందడి చేసే సముద్రుడు
అల్లనల్లన సాగే మేఘమాలికలు
కురిసే మంచులో తన్మయత్వం
చలిలో ఆనందం
ఉదయపు ఏటవాలు సూర్యకిరణాలలో నులివెచ్చని హాయి
భయపెట్టే ఉరుములు
అబ్బురపరిచే ఇంద్రదనుస్సు..

అన్నట్టు... ప్రకృతి అంటే దేవుడా?
సకల చరాచర ప్రపంచానికీ దేవుడి ప్రేమని అందించే మాధ్యమమా? 

ప్రకృతి అందించే ఫలాలను, ఆనందాలను అందుకొనే చేయీ, మనసూ మనవై నప్పుడు... ఇచ్చే చేయి ఎవరిది?

టాగోర్ రాసిన గీతాంజలికి చలం చేసిన అనువాదం చదివారా? 

కవి ఈశ్వరుడ్ని అడుగుతాడు, `నేనే లేకపోతే నీ ప్రేమ ఏమవుతుంది?` అని. నా హృదయాన్ని వలలో బంధించు కొనేందుకు సౌందర్యంతో అలంకరించుకొన్నావు` అంటాడు. 
మరొక చోట భహుశా ఈశ్వరుడి దృక్పదాన్ని ఎరుక పరచడానికి పిల్లలకి బహుమతులిచ్చి ఆనందించే తండ్రి హృదయాన్ని ఆవిష్కరిస్తాడు. కవి చెప్పిన ఈ మాటలు చూడండి-

నీకు రంగురంగుల బొమ్మలు తెచ్చి ఇచ్చినప్పుడు నాకు అర్థమౌతుంది నా పాపా, 
మేఘాలపైనా నీటిపైనా ఇన్ని రంగులు ఎందుకు నాట్యమాడతాయో. 
ఎన్నో చిన్నెలతో పువ్వులు ఎందుకు చిత్రితమౌతాయో... 

నిన్ను చిందులు తొక్కించేదుకు నేను పాడినప్పుడు నాకు సరిగా తెలుస్తుంది. 
ఆకుల్లో సంగీతం ఎందుకుందో. 
చెవివొగ్గి వినే భూ హృదయానికి తమ కంఠరవాల్ని అలలు ఎందుకు వినిపిస్తాయో, 

ఆశకొన్న నీచేతులకి మిఠాయి తెచ్చి ఇచ్చినప్పుడు తెలుస్తుంది. 
పుష్పపాత్రలో తేనె ఎందుకు దాక్కొని ఉంటుందో. 
మధురరసం పళ్ళల్లో రహస్యంగా ఎందుకు దాక్కొని ఉందో. 
నిన్ను చిరునవ్వు నవ్వించాలని నీ ముఖాన్ని నేను ముద్దు పెట్టుకొన్నప్పుడు 
కన్నా, నాకు నిశ్చయంగా తెలుస్తుంది. 
ఉదయ కాంతిలో ఆకాశం నించి దొర్లి ప్రవహించే ఆనంద మేమిటో. 
ఎండాకాలపు గాలి నా వొంటికి తెచ్చే సౌఖ్యమేమిటో... 

తండ్రి ఇచ్చే బహుమతి ఆనందంగా తీసుకొనే పిల్లవాడిలాగే ప్రకృతి ఇచ్చే ఫలాలనూ, ఆనందాలనూ కృతజ్ఞతతో తీసుకోవడమే మనిషి దేవుడికి తిరిగి ఇచ్చే బహుమతి. 

© Dantuluri Kishore Varma

Sunday 4 October 2015

చెక్కల వంతెన

కాకినాడకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరింగ అభయారణ్యంలో చెక్కల వంతెన ఫోటోలు. ఈ మడ అడవుల గురించి మరిన్ని వివరాలు కావాలంటే ఈ క్రింది పోస్టులు చదవండి. 


బై ద వే! వంతెనల గురించి మంచి కొటేషన్లు ఉన్నాయి, మీకు తెలుసా?
The darkest night is often the bridge to the brightest tomorrow.
గాడాందకారపు రాత్రి వెలుగులు చిమ్మే ఉదయానికి వంతెన లాంటిది
Love is the bridge between you and everything.
ప్రేమ అంటే నీకు మిగతా ప్రపంచానికీ మధ్య ఉన్న వంతెన.
We build too many walls and not enough bridges.
 అవసరానికి మించి అడ్డుగోడలు పెట్టుకొంటున్నాం, దూరాన్ని తగ్గించే వారథులు నిర్మించుకోవడం లేదు. 
Discipline is the bridge between goals and accomplishments.
క్రమశిక్షణ అంటే ఏర్పరచుకొన్న లక్ష్యాలకి, వాటిని నెరవేర్చుకోవడానికి మధ్య వంతెన. 
The wisdom of bridges comes from the fact that they know the both sides.
 ఇరువైపులా ఆలోచించి నిజానిజాలు గ్రహించడం విజ్ఞత. 
Our minds have become impenetrable jungle of thoughts and 
sometimes we need to clear a path in order to see.
ఆలోచనలతో అడవిలా చిక్కబడిపోయిన మెదడులో కొంచెం దారి ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉంది. 
అప్పుడే సరిగా చూడగలం. 
 Don`t fall in love. Fall off the bridge. It hurts less.
కావాలంటే వంతెన పైనుంచి క్రిందపడు అంతే కానీ ప్రేమలో మాత్రం పడకు. ఎందుకంటే, మొదటిదే తక్కువ బాధపెడుతుంది. 
Until you cross the bridge of insecurities you can`t begin to explore your possibilities 
భయాల వంతెనలు దాటక పోతే అవకాశాలు అందిపుచ్చుకోలేవు. 
Life is a bridge.Cross over it, but, build no house on it.
జీవితం ఒక వంతెన దానిని దాటాలి కానీ దానిమీదే ఇల్లుకట్టుకొని ఉండిపోవాలని ఆశపడకూడదు. 
ఈ బ్లాగ్ పోస్ట్ కూడా ఒక వంతెనే!
© Dantuluri Kishore Varma

Saturday 3 October 2015

కోరింగ అడవి అందాలు

దేశంలో ఉన్న మూడవ అతిపెద్ద మడ అడవి మనకాకినాడకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్రతీరపు చిత్తడి నేలల్లో పెరిగే మడ అడవుల లోనికి వెళ్ళి చూడడం చాలా కష్టం. కానీ కోరింగలో ముఖద్వారాన్ని ఏర్పాటు చేసి, అప్రోచ్ రోడ్డు వేసి, అడవి మధ్యనుంచి ఒక కిలోమీటరు దూరం చెక్కలవంతెన నిర్మించి కష్టాన్ని ఇష్టంగా మార్చారు. వాచ్‌టవర్ పైనుంచి అడవి అందాలు వీక్షించవచ్చు. బ్యాక్ వాటర్స్‌లో సముద్రం కలిసే చోటువరకూ బోటు షికార్ చెయ్యవచ్చు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిర్మించిన పురాతన లైట్‌హౌస్ చూసి రావడానికి ప్యాకేజ్ టూర్   ఉంది. 

నల్లమడ, తెల్లమడ, విల్వమడ, ఉప్పుపొన్న, ఊరుడు, కళింగ, గుగ్గిలం, గంగరావి లాంటి ఎన్నో రకాల చెట్లు మడ అడవుల్లో పెరుగుతాయి. కానీ విచిత్రం ఏమిటంటే ఉప్పునీటిలో పెరిగే వీటికి నిజానికి ఉప్పు అవసరం ఏమాత్రం లేదు. మంచినీటిలో ఈ రకాల చెట్లు నిక్షేపంగా పెరుగుతాయట. సముద్రానికి, తీరానికి మధ్యలో ఉండే చిత్తడిలో పెరుగుతూ లవణ జలాల్లో తక్కువగా లభ్యమయ్యే ఆక్సిజన్‌ని పొందడానికి మడ వృక్షాలు రకరకాల విధానాలు అవలంభిస్తాయి. ఈ చెట్లవేళ్ళు భూమిలోనుంచి బయటకి పొడుచుకొని వస్తాయి. వాటిద్వారా గాలిలో ఉండే ప్రాణవాయువుని తీసుకొంటాయి. సముద్రపునీటిలో ఉండే ఉప్పుని శోషించకుండా ఉండడానికి ఈ చెట్లవేళ్ళల్లో చిక్కాల వంటి అమరిక ఉంటుందట. ప్రకృతిసిద్దంగా ఎన్నీ జాగ్రత్తలు తీసుకొన్నా కొంత ఉప్పు లోపలికి పోతుంది. దానిని బయటకు పంపించే ఏర్పాట్లు ఆకులు చేస్తాయి. కొన్ని చెట్ల ఆకులమీద పేరుకొన్న ఉప్పురాళ్ళను కూడా చూడవచ్చు. 


మడ వృక్షాల వేళ్ళ జిగిబిగి అల్లికల మధ్యలో చిన్న చిన్న చేపలు, సముద్ర ప్రాణులూ నిశ్చింతగా ఉంటాయి. వేటాడి తినే పెద్ద ప్రాణుల బెడద వాటికి ఉండదు. రాలే ఆకులు, బెరడు వాటికి సరిపడినంత ఆహారాన్ని సమకూర్చి పెడతాయి.  


సముద్రతీర ప్రాంతాలకి మడ అడవుల ఉపయోగం చాలా ఉంది. తీవ్రమైన తుఫాను గాలుల నుంచి ఇవి రక్షణ కల్పిస్తాయి. సునామీలు వచ్చినప్పుడు బఫర్ జోన్‌గా ఉపయోగ పడతాయి. ఇసుక కొట్టుకొని పోకుండా కాపాడతాయి. పక్షులకి, సముద్ర జంతువులకి ఉత్పత్తి కేంద్రాలుగా ఉంటాయి. పడవలు తయారు చేసుకోవడానికి మడ వృక్షాల కలప బాగా పనికి వస్తుంది. 
సందర్శించిన వాళ్ళ అదృష్టం బాగుంటే వలస పక్షుల్ని, రకరకాల జంతువుల్నీ చూడవచ్చు. బాగుండకపోతే కోతులూ, కొంగలు లాంటి సాధారణమైన ప్రాణుల్నే చూసి ఆనందించాలి. జీవవైవిధ్యం మాట అటుంచితే సమీపంలో ఉండే కాలేజీలనుంచి వలస వచ్చే ప్రేమ పక్షుల బెడద మాత్రం ఈ చెక్కల వంతెనకి చాలా ఉంది.  వద్దనుకొన్నా మీరు వాటిని చూడవచ్చు!
చెక్కల వంతెన అందమైన ఫోటోలు ఇంకొన్ని ఉన్నాయి. చూడాలనుకొంటే మళ్ళీ రేపు  ఇటు ఒక లుక్కెయ్యండి.
*     *     *
మూడు సంవత్సరాలక్రితం మడ అడవుల గురించి ఒక టపా రాస్తే ఓ ఆసామి నాకు చెప్పా పెట్టకుండా ఎత్తుకెళ్ళిపోయి చక్కగా పేపర్లో వేసేసుకొన్నాడు. `ఇదెక్కడి గొడవయ్యా మహానుభావా?` అంటే - `ఆన్లైన్ ఎడిషన్లో మీదేనని వేస్తాంలెండి` అని కంటితుడుపు కబుర్లు చెప్పాడు. బ్లాగ్ టపాలు రాసుకోవడం ఒక ఎత్తయితే - వాటిని ఎవరు లేపేసి సొంతపేరుతో ప్రచురించేసుకొంటున్నారో చూసుకోవడం ఇంకొక ఎత్తై పోయింది! 

© Dantuluri Kishore Varma

Tuesday 1 September 2015

ధర్మం - అధర్మం

`ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి` అని భద్రాచల రామదాసు ఆర్తిగా అమ్మచేత సిఫారసు చేయిస్తే లక్ష్మణ సమేతుడై మారువేషంలో వచ్చి, నవాబుకి రామదాసు బాకీపడిన సొమ్ములు చెల్లించి, చక్కగా మాయమైపోయాడు శ్రీరామచంద్రుడు. ఎంత కరుణతో కష్టాలు తీర్చమని కోరుకొన్నా - అదృశ్యంగా ఉండి భక్తుని కోరికని తీర్చాడుకానీ, రామదాసుకి మాత్రం ఒక్కక్షణమైనా దర్శన భాగ్యం కలిగించినట్టు లేదు దేవదేవుడు! తాళ్ళపాక అన్నమాచార్యుడు వేలకొలదీ సంకీర్తనలతో వేంకటేశ్వరస్వామిని అర్చిస్తే, ఆయనకి ఎప్పుడో జీవితచరమాంకంలో దైవసాన్నిధ్యం లభించింది. ఇక, సంకీర్తనాచార్యుల కాలానికన్నా చాలా వెనక్కి - అంటే పురాణకాలానికి వెళితే విశ్వామిత్రుడో, మరో మహర్షో ఏళ్ళకొద్దీ తప్పస్సులు చేసి.. శివుడో, విష్ణుమూర్తో ఒక లిప్తకాలంపాటు ప్రత్యక్షమైతే - వరాలు పొంది, సంతృప్తి పడినట్టు గాధలు ఉన్నాయి. దీనినిబట్టి అర్థమయ్యేది ఏమిటంటే - `కరుణతోటో, భక్తితోటో, ధృఢసంకల్పంతోటో దేవుడిని శాశ్వతంగా మనతోపాటూ ఉంచుకోలేము` అని. ఈ మార్గాలు అవలంభించిన భక్తులకి ఆయన అదృశ్యంగా ఉండి కరుణించడమో, కనిపించి వరాలివ్వడమో చేస్తాడు కానీ - అవతారం ఎత్తి వాళ్ళతోపాటూ జీవించడు. రాముడిగానో, కృష్ణుడిగానో దేవుడు మరో అవతారంలో భూమిమీదకి రావాలంటే సమిష్టిగా అందరూ అవలంభించవలసిన మార్గం ఒకటి ఉంది.... అదే, అధర్మం! 

మీరు సరిగ్గానే చదివారు. పైన చెప్పిన మార్గం `ధర్మం` కాదు. అధర్మమే! ఈ విశ్వంలో ఏ మార్గానికీ లేని శక్తి అధర్మమార్గానికి ఉంది. మనిషిని మనిషి మోసం చేస్తున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, ప్రాణంతీస్తున్నప్పుడు; అక్రమసంబంధాలు, దొంగతనాలు, మానభంగాలు, హత్యలు, లంచాలు, కల్తీలు, అక్రమవ్యాపారాలు, ఉగ్రవాదం, దురలవాట్లు భరించలేనంత ఎక్కువగా పెరిగిపోయినప్పుడు - `ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే!` అని ధర్మాన్ని పున:ప్రతిష్ట చెయ్యడానికి ఓ అవతారంగా దేవుడు పుడతాడట. కష్టాలు కలిగాయని ఏడిస్తే, భక్తితో చేతులు జోడించి మ్రొక్కితే ఉపేక్షించవచ్చునేమో కానీ, అధర్మంతో వికటాట్టహాసం చేస్తే చూస్తూ ఊరుకోలేడట దేవుడు. అందుకే అధర్మానికున్న శక్తి మరి దేనికీ లేదని చెప్పడం. ప్రస్తుతం  జనాలు శాశ్వత దైవదర్శనం కోసం బాగానే ప్రయత్నిస్తున్నట్టున్నారు కదూ? 

*     *     *

పోలీసులది ప్రజల్ని రక్షించవలసిన ధర్మం
ప్రభుత్వానిది జనరంజకంగా పరిపాలించవలసిన ధర్మం
మీడియాది వార్తలు అందించడంతో పాటూ, జరిగిన సంఘటనలను విశ్లేషించి ప్రజల అభిప్రాయాలకి దిశానిర్దేశం చెయ్యవలసిన ధర్మం 
తల్లితండ్రులదీ, ఉపాద్యాయులదీ పిల్లలకు మంచీ, చెడు మధ్య వ్యత్యాసాన్ని చెప్పి వాళ్ళని ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దవలసిన ధర్మం.. 
వివిధ వృత్తుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఉన్న ప్రజలది న్యాయబద్దంగా సంపాదించుకొని కుటుంబాలని పోషించుకోవలసిన ధర్మం..  

కానీ,  చాలామంది వాళ్ళ ధర్మాలని సక్రమంగా నెరవేరుస్తున్నట్టు లేదు. అసహాయులమీద అత్యాచారాలు చెయ్యడానికి వావీ, వరసా, వయసు, సాంఘిక హోదా.. ఏవీ అడ్డు కావడం లేదు.  స్కూలుకి వెళ్ళి చదువుకోవలసిన వయసులో ఉండే అమాయకమైన పిల్లలు నేరాలవైపు ఆకర్షించబడుతున్నారు. భారతంలో దృతరాష్ట్రుడిలాంటి తల్లితండ్రులకి పిల్లలు తప్పుడు మార్గంలో వెళుతున్నా, మంచివైపు అడుగులు వేయించగలిగినంత తీరుబడి లేదు.

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సువ:
మామకా: పాణ్డవాశ్చైవా కిమకుర్వత సంజయ.

అని కురుక్షేత్ర మహాసంగ్రామం మొదలవబోతుండగా అన్నీ చూసి చెప్పగల మీడియాలాంటి సంజయుడ్ని దృతరాష్ట్రుడు మావాళ్ళైన కౌరవులూ, పాండవులూ ఏమి చేస్తున్నారని అడుగుతాడు. దాయాదుల రాజ్యాన్ని అధర్మంగా తన కుమారులు స్వంతం చేసుకొన్నారనీ, అలా చేసుకొనే క్రమంలో ఎన్నో దుష్టకార్యాలు చేశారనీ దృతరాష్ట్రుడికి తెలుసు. అయినా అధర్మాన్ని ఖండించకుండా `నా వాళ్ళు` అనే పక్షపాతాన్ని చూపించాడు.   

సుమారు ఏడువందల శ్లోకాల్లో యుద్దం జరగడానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీతని దృతరాష్ట్రుడికి చెప్పాడు సంజయుడు. చెప్పి, తన మాట ఒకటి కూడా చిట్టచివర కలిపాడు    

యత్ర యోగేశ్వర: కృష్ణో యత్ర పార్థో ధనుర్థర:
తత్ర శ్రీర్విజయో భూతిర్థృవా నీతిర్మతిర్మమ.    
   
యోగీశ్వరుడిలాంటి కృష్ణుడు, ధనుస్సును చేపట్టిన అర్జునుడూ ఎక్కడ ఉంటారో అక్కడ సంపద, విజయం, నీతీ ఉంటాయని దీని భావం.  

భగవ్బద్గీతలోని మొట్టమొదటి, చిట్టచివరి శ్లోకాలనుంచి సమాజం నేర్చుకోవలసినది ఎంతో ఉంది. విజయానికి, ఆనందానికి అక్రమమార్గాలు సరిఅయినవి కావనీ, పరాయి సొమ్ము ఆశించడం అధర్మమని, మంచీ చెడుల విచక్షణ, కర్తవ్యనిష్టా ఉండాలనీ పిల్లలకి చెప్పవలసిన బాధ్యత తల్లితండ్రులకీ, గురువులకీ ఉంది.  ప్రజలకి చెప్పవలసిన బాధ్యత మీడియాకి ఉంది. ధర్మాన్ని ఆచరించవలసిన బాధ్యత మనందరికీ ఉంది.

       © Dantuluri Kishore Varma 

Saturday 1 August 2015

అందర్నీ చల్లగా చూడు తల్లీ!


పెద్దాపురం మరిడమ్మ తల్లి ఆ ఊరి గ్రామదేవత. ప్రతీ సంవత్సరం జ్యేష్ట బహుళ అమావాస్య నుంచి ఆషాడమాసం చివరి వరకూ పెద్దాపురంలో మరిడమ్మ సంబరం చాలా కోలాహలంగా జరుగుతుంది. ప్రతీరోజూ తీర్థం ఉంటుంది. వీధి సంబరాలు, గరగ నృత్యాలు, డప్పుల దరువులు, అమ్మవారి ఊరేగింపులు, జానపద కళారూపాల ప్రదర్శనలతో ఊరంతా మారుమ్రోగిపోతుంది. ఇక గురువారాలు, ఆదివారాలు అయితే జనసముద్రమే వీధుల్లో కదులుతున్నట్టు ఉంటుంది. జనాలు ఎక్కడెక్కడినుంచో ముందురోజు రాత్రే వచ్చేస్తారు. జాగరాలు చేసి, సంబరాలు చూసి మరిడమ్మ తల్లి గుడిముందు దర్శనం క్యూలో నుంచుండిపోతారు. తీర్థంలో కొట్లు, హోటళ్ళు ఇరవైనాలుగు గంటలూ తెరిచే ఉంచుతారు.  
`మీరు చెప్పేది బాగానే ఉంది. కానీ, ఫోటోల్లో ఎక్కడా ఆ సందడే కనిపించడం లేదేమిటి?` అనే కదా మీ సందేహం? నేను గుడికి వెళ్ళింది బుధవారం రోజు. గుడికి చేరుకొనేసరికి మధ్యాహ్నం ఐపోయింది. ముప్పైరూపాయల ప్రత్యేకదర్శనం టిక్కెట్టు తీసుకొని సరాసరి అమ్మవారి పాదాలను తాకి నమస్కారం చేసుకొని, బైటకు వస్తూ అక్కడే ఉన్న ఆలయ ధర్మకర్త(అనుకొంటా) అనుమతితో అమ్మవారి ఫోటో తీసాను. `ఈ గుడి ఎప్పుడు కట్టారు?` అని అడిగితే ఆయన తనకు ఖచ్చితమైన సంవత్సరం తెలియదని, గుడి కట్టినతరువాత తనది తొమ్మిదో తరం అని అన్నారు. 1949లోనే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోనికి వెళ్ళిందని చెప్పారు. 
`జనం తక్కువగా ఉండడానికి కారణం ఏమిటి?` అని అంగళ్ళ దగ్గర ఆరాతీస్తే.. ఈ ఏడాది అధిక ఆషాడమాసం. ఏ ఆషాడంలో సంబరాలు చేస్తారో తెలియక ముందరి నెలలోనే చాలా మంది వచ్చేశారట. పైపెచ్చు మొన్నే పుష్కరాలు అయ్యాయేమో పనిలోపని జనాలు మరిడమ్మతల్లి దర్శనాలు కూడా కానిచ్చేసేరట. ఇప్పుడు నిజ ఆషాడమాసం వచ్చినా సందడి తగ్గిందని తీర్థంలో పుస్తకాల కొట్టు యజమాని `గొల్లు` మన్నాడు.      
కలర్ సోడాలు, ఖర్జూరాలు, జీళ్ళు.. కొనేవాళ్ళ కోసం ఎదురుచూస్తున్నాయి. 
`రేపు గురువారం కదా, జనాలు కుమ్మేత్తారండి,`  అంటున్నాడు సామాన్లకొట్టులో వ్యక్తి. 

ఈ ఆలయం కాకినాడనుంచి పెద్దాపురం మీదుగా రాజమండ్రీ వెళ్ళే దారిలో.. రహదారి ప్రక్కనే ఉంటుంది. రోడ్డుకి ఒకవైపు గుడి ఉంటే, అవతలివైపు మానోజీ చెరువు ఉంటుంది. ఎప్పుడైనా ఈ దారిలో వెళుతుంటే `అందర్నీ చల్లగా చూడు తల్లీ!` అని మరిడమ్మకి ఒక నమస్కారం చేసుకోవడం మరచిపోకండేం! 

© Dantuluri Kishore Varma

Saturday 25 July 2015

ఓ మహా సందడి సద్దుమణిగింది!

`పుష్కరాలు అయిపోతున్నాయి అంటే బెంగగా ఉంది. రేపటినుంచి ఈ సందడి అంతా ఉండదు కదా?` అంటున్నాడు ఒకాయన. ఆయన నోరు తెరిచి మనసులో మాట బైట పెట్టాడు కానీ, టీవీలో గోదావరి హారతి కార్యక్రమం లైవ్‌లో ప్రసారమౌతుండగా చూస్తున్న చాలా మందికి కలిగిన అభిప్రాయం కూడా అదే. నదీ స్నానాలు, పుణ్యక్షేత్రాల సందర్శనం ఈ దఫా జరిగినంత కోలాహలంగా ముందు ఎప్పుడూ జరగలేదని చెప్పుకొంటున్నారు. (మొదటిరోజు రాజమండ్రీ తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగి ఉండకపోతే ఎంత బాగుండును!) జనాలు దూరభారాల్ని లెక్కపెట్టకుండా రాజమండ్రీకో, కొవ్వూరుకో, కోటిపల్లికో, మరో రేవుకో వచ్చి గోదావరిలో మునకలు వేశారు. సామాన్యుల దగ్గరనుంచి సెలబ్రిటీల వరకూ పుష్కరాల యూఫోరియా ఊపి, ఊపి వదిలిపెట్టింది. `గతంలో ఏదో ఒకసారి ములిగితే సంతృప్తిగా అనిపించేది. ఇప్పుడయితే ఎన్నిరేవుల్లో మునిగినా తనివితీరటంలేదు,` అని రచ్చబండ దగ్గర ఒక పెద్దాయన చెపుతుంటే చుట్టూ కూర్చొన్న వాళ్ళు `అవునని` తలలూపుతున్నారు. టీవీల ద్వారా ప్రచారం బాగా జరిగడంవల్లో, ప్రజల్లో అధ్యాత్మికత ఎక్కువయ్యిందో తెలియదు కానీ ప్రతీ రేవులో మునిగిన వాళ్ళ లెక్కలు లక్షల్లో తేలడం, ఒక్కోచోట అయితే కోట్లలో కూడా హాజరు ఉండడం ఈ మహా పుష్కరాల ప్రత్యేకత. 

కార్లలో, టూరిస్టు బస్సుల్లో, ఆర్టీసీలో, బైకులమీద ఎక్కడేక్కడి నుంచో జనాలు వచ్చారు. రోడ్డుప్రక్కన భోజనాలు వండుకోవడం, స్మార్ట్‌ఫోన్లతో సెల్ఫీలు తీసుకోవడం బాగా కనిపించాయి. మైళ్ళకొద్దీ ట్రాఫిక్ జాంలు, అక్కడక్కడా రోడ్డుప్రమాదాలు జరిగాయి. దానాలు ఇవ్వడంకోసం యాత్రికులు డబ్బులు ఇబ్బిడిముబ్బిడిగా ఖర్చుపెట్టారు. చాలా షాపుల్లో వ్యాపారం పెరిగింది. ఈ పన్నెండు రోజులూ పురోహితులు ఫుల్లు బిజీ. పుణ్యక్షేత్రాల ఆదాయాలు బాగా పెరిగాయి.  

`గోదావరి నదీ జలాల్ని తాకి పునీతులవుదామని దూరతీరాల్నుంచి వస్తే అథిది దేవో భవ అన్న మాటకి అర్థం తెలిసింది. దాహమంటే గోదావరి వాసులు మజ్జిగతో గొంతుతడిపారు. ఆకలి అనకపోయినా అమ్మకంటే ఎక్కువగా కొసరి కొసరి తినిపించారు. నీ బిడ్డలకు అదంతా నువ్వునేర్పిన సంస్కారమే అయివుంటుందా?`  అని ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఒకాయన స్టేటస్ అప్డేట్ పెట్టాడు.  యాత్రికులకి మంచినీళ్ళూ, మందులూ సరఫరా చెయ్యడం, అవకాశం ఉన్నవాళ్ళు అన్నసంతర్పణలు చెయ్యడం, సేవా దళాలుగా ఏర్పడి వృద్దులకీ, పిల్లలకీ, వికలాంగులకీ గోదావరి రేవులదగ్గర చేయూత నివ్వడం... హృద్యమైన చిత్రాన్ని ఇంద్రదనుస్సులాగ ఆవిష్కరించిన సందర్భం ఇది. ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు `మనుష్యుల్లో మంచితనం ఇంత ఉందా!` అని ముచ్చటపడతాం. 

ఆగండాగండి! అంతా మంచే కాదు పుష్కరాల సందర్భంగా చెడునూ చూశాం! ముసలి తల్లితండ్రుల్ని వెంటబెట్టుకొని వచ్చి, జనసందోహం మధ్యలో వదిలించుకొని, చడీచప్పుడూ లేకుండా ఊరిబస్సు ఎక్కేసిన స్వార్థపరుల కథలుకూడా న్యూస్‌పేపర్లలో చదివి నివ్వెరపడ్డాం, కదూ?   

వేతనాల పెంపు కోసం సమ్మెబాట పట్టిన పారిశుద్ద కార్మికులతో ప్రభుత్వ మంతనాలు సఫలీకృతం అయ్యాయట. వాళ్ళు రేపటినుంచి యాత్రికులు వదిలిపెట్టిన చెత్తను తొలగిస్తారు. జనసామాన్యం మునిగి, మునిగి వదిలించుకొన్న వంటిమురికిని గోదావరి మాత కూడా సాగరుడిలో కలిపేస్తుంది. కానీ పుష్కరుడి మాట ఏమిటి? మనసుల్లో మురికిని కడిగే సామర్ధ్యం పుష్కరుడికి ఉండి ఉంటుందా?  అదే జరిగితే ఎంత బాగుండును! 

ఏదేమైనా గోదావరి పుష్కరాలు నేటితో ముగిసాయి. ఓ మహా సందడి సద్దుమణిగింది. 

© Dantuluri Kishore Varma  


Monday 13 July 2015

గోదావరి మహాపుష్కరం 2015

మహారాష్ట్రాలోని నాసిక్‌కి సమీపంలో త్రయంబకేశ్వరం నుంచి ప్రయాణం మొదలు పెట్టిన గోదావరి 1465 కిలోమీటర్లదూరం ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దారిలో భూముల్ని సస్యశ్యామలం చేస్తుంది, మనసుల్ని పులకరింపజేస్తుంది, ప్రజల్లో భక్తి భావనలని నింపి అధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతుంది. మహారాష్ట్రాలో, తెలంగాణాలో, ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి ప్రవహించే మార్గంలో ఎన్నో అందమైన పల్లెటూళ్ళు ఉన్నాయి, పట్టణాలూ, నగరాలూ ఉన్నాయి, ప్రశిద్ద దేవాలయాలు ఉన్నాయి. కొండకోనల నడుమ ప్రవహిస్తూ గోదావరి నది ఎన్నెన్నో ఒయ్యారాలు పోతుంది. ప్రకృతి శోయగాలతో పరిసరాలను మనోజ్ఞంగా మారుస్తుంది. అందుకే అడవి బాపిరాజుగారు... 

ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి
కొండల్లో ఉరికింది
కోనల్లో నిండింది
ఆకాశ గంగతో
హస్తాలు కలిపింది
ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి

అడవి చెట్లని
జడలోన తురిమింది
ఊళ్ళ దండలు గుచ్చి
మెళ్ళోన దాల్చింది
ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి

వడులలో గర్వాన
నడలలో సుడులలో
పరవళ్ళు తొక్కుతూ
ప్రవహించి వచ్చింది
ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి

శంఖాలు పూరించి
కిన్నెర్లు మీటించి
శంకరాభరణ రా
గాలాప కంఠియై
ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి

నరమానవుని పనులు
శిరమొగ్గి వణీకాయి
కరమెత్తి దీవించి
కడలికే నడిచింది
ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి

... అంటారు

గోదావరి ప్రాంతంలో నివశించే ప్రజలకి ఈ నదీమతల్లితో ఎంత ఆత్మీయత ఉంటుందంటే... అంటే.. దాని గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే,  పన్నెండేళ్ళకు ఒక్కసారి వచ్చే గోదావరి మహా పుష్కరాలు రేపటి నుంచి మొదలవుతున్నాయి.
ఎక్కడ చూసినా సందడే సందడి. పుష్కర స్నానం యొక్క ఫలితం గురించి, ఈ సమయంలో చెయ్యవలసిన దానాల గురించి పత్రికల్లో, టీవీ చానళ్ళలో విరివిగా ప్రచారం జరిగిందేమో షాపుల దగ్గర దానాలుగా ఇవ్వడానికి కావలసిన వస్తువులు కొనడం కోసం జనాలు ఎగబడుతున్నారు. `గోదానం చెయ్యడం చాలా మంచిదట. మా అమ్మాయి చేస్తానంటే ఆవును కొనడానికి సంతకి వెళ్ళాను. ఒక్కటంటే ఒక్క ఆవు అమ్మకానికి రాలేదు,` అంటున్నాడు ఒకాయన. ఆవుల్ని సంతవరకూ రానివ్వకుండా దొరికిన దగ్గర దొరికినట్టుగా సరాసరి కొనేస్తున్నారట!     

రాజమండ్రీలో పుష్కరఘాట్‌లు నిర్మించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. గోదావరి వొడ్డున ఉన్న పట్టణాలలో, పల్లెటూర్లలో కూడా నదీ స్నానాలకు ఏర్పాట్లు చేశారు. యానంలో చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పుష్కరుడికి స్వాగతం పలికారు. రాష్ట్రాలు, జిల్లాలు దాటి ఎక్కడెక్కడి నుంచో జనాలు పుష్కర స్నానం కోసం గోదావరి వైపుకు ప్రయాణం మొదలు పెట్టారు. పవిత్ర స్నానాలు చేసి, వెళ్తూ వెళ్తూ కూడా గోదావరి జలాల్ని తీసుకొని వెళ్ళి తమ ప్రాంతంలో కాలువల్లో, చెరువుల్లో కలుపుతారట. అలా చేస్తే పంటలు బాగా పండుతాయని విశ్వాసం. స్వయంగా వెళ్ళి గోదావరి నదిలో స్నానం చెయ్యలేని వాళ్ళకోసం తపాలా శాఖవారు గాడ్‌జల్ పేరుతో ఇరవై రూపాయలకే పుష్కర గోదావరి జలాల్ని అందుబాటులోనికి తెస్తున్నారు.  పుష్కరాలు జరిగే 12 రోజులూ విద్యాసంస్థలకి శెలవులు ఇవ్వాలని విద్యాశాఖామాత్యులు ఉత్తర్వులు ఇచ్చారని ఇప్పుడే ఎవరో అంటున్నారు. కానీ, ఎవ్వరూ ఇంకా శెలవులు ప్రకటించినట్టుగా సమాచారం లేదు.  

శెలవులు ఉన్నా లేకపోయినా పుష్కరస్నానానికి చలో! 

© Dantuluri Kishore Varma  
     

Friday 15 May 2015

నోరూరించే మాయాబజార్!

ఈమధ్యకాలంలో బాగా కళ్యాణ మండపాలు, హైటెక్ ఫంక్షన్ హాళ్ళూ వచ్చేశాయి కానీ - వేళ్ళమీద లెక్కబెట్ట గలిగినన్ని ఏళ్ళ క్రితం పచ్చటి తాటాకు పందిళ్ళలో లేదంటే కనీసం షామియానాల క్రింద చాలా మంది పెళ్ళిళ్ళు చేసేసుకొనేవారు. అక్కడక్కడా మైకులు కూడా ఉండేవి. పెళ్ళి పందిరి దగ్గర నుంచి `వివాహ భోజనంబు..` పాట వస్తుందంటే భోజనాలు జరుగుతున్నాయని అర్థం. మాదవపెద్ది సత్యం గంభీరమైన స్వరం గారెలు, బూరెలు, జిలేబీలు అని పాడుతుంటే రైలు పెట్టెల్లాగ పలహారం పళ్ళాలన్నీ వరుసలోవెళ్ళి ఎస్.వీ.రంగారావు ముందు అమరిపోయి, లడ్డూలు వాటంతట అవే ఎగిరెళ్ళి అతని నోట్లో పడిపోవడం చప్పున గుర్తుకు వచ్చేసి, `భళీరే! వవ్హారే!!` అనేసుకొంటూ జనాలు భోజనాలకు తయారయిపోవడం చూసిన జ్ఞాపకం ఉందా మీకు? ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే మాయాబజార్ సినిమా మన మనసుల్లో రాగిరేకు మీద చెక్కిన తెలుగు అక్షరంలా అచ్చుబడిపోయింది. సినిమాలో ప్రతీ మాటా, పాటా, బొమ్మా ఎవేవో స్పందనలని కలిగిస్తాయి. అదిగో... సరిగ్గా ఆదే పాయింట్‌ని పట్టుకొని ఒక పచ్చళ్ళ షాపాయన ఎస్.వీ.ఆర్ ని తన ఉత్పత్తులకి బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టేసుకొన్నాడు. `ఈ బొమ్మ చూసిన తరువాత నోరూరిపోయి కొనుక్కోకుండా ఉంటారా!` అనేమో ఉద్దేశ్యం.   
      

© Dantuluri Kishore Varma

Saturday 9 May 2015

పల్లెటూళ్ళో.. అనగనగా ఓ రోజు

ఇంటిచుట్టూ చిక్కటి తోట
ఇంటిముందు కొత్తగా వేసిన సిమ్మెంటు రోడ్డు
ఇంటివెనుక పంటకాలువ
నీళల్లో ముఖాలు చూసుకొని మురిసిపోతున్న కొబ్బరిచెట్లు 
కాలువ అవతల అల్లంత దూరంలో అగ్రహారం


ఉషోదయపు వేళ పలుచటి నీరెండలో
గెంతులేసి, ఎగిరెగిరి దూకి, అల్లరి చేసిన 
ఆరురోజుల వయసు ఆవుదూడ 
అలసిపోయిందేమో... కొంతసేపు సేదతీరుతూ
తల్లి ఉన్నవైపు సాలోచనగా చూస్తోంది. 


`గోవు మహాలక్ష్మి. అది ఉన్న ఇంట సిరుల పంటే!` అంటారు చాగంటి వారు. 
తినడానికి అప్పుడే కోసుకొచ్చిన లేత పచ్చగడ్డి
సాయంత్రం బొగ్గుల దాలిలో ఉడకబెట్టిన ఉలవలు
ప్రేమగా వెన్ను నిమిరే యజమాని చెయ్యి
తాగడానికి బావిలోనుంచి చేది పోసిన చల్లని మంచి నీళ్ళు
సేదతీరే చెట్టునీడా... ఉంటే,  గోలక్ష్మి ఇదిగో... ఇలా ఉంటుంది. 


పల్లెటూరి ప్రశాంతతకి అందాన్ని అద్దేది 
చుట్టు గుడిశా, గడ్డిమోపా?
ఇటుక ముక్కలు పేర్చి కట్టిన గోడలో..
దానికి వారగా పెరిగిన పిచ్చి గడ్డిలో..
జామ చెట్ల పింది పూతల్లో...
అందం నేనున్నానని హొయలు పోతుంది కదూ?   


ఎక్కడెక్కడ తిరిగినా ఇంట్లోకి వచ్చేముందు
బావి దగ్గర ఆగి తాడుకట్టిన చేదని బావిలోకి వేగంగా వదిలి
రెండు బారలతో నీటిని చేదుకొని 
ముఖం, కాళ్ళూ చేతులూ శుబ్రం చేసుకొనిగానీ 
రైతు ఇంటిలోకి అడుగు పెట్టడు.
ఇక్కడ ఇనుప బకెట్ కనిపిస్తుంది కానీ, 
తాటి ఆకుతో పెద్ద దొన్నెలా తయారు చేసుకొని ఉపయోగించే చేదని చూసిన జ్ఞాపకం మీకుందా?    


వేసవి ప్రతాపం చూపిస్తుంది.
ముంజుకాయలు తింటూనో, 
కొబ్బరిబొండంలో తియ్యటినీళ్ళో తాగుతూనో
తెరలు తెరలుగా వచ్చే పైరగాలిని అస్వాదిస్తూ 
ఒక్కరోజు అలా...లా... గడిపేస్తే బాగుంటుంది కదూ?  

 © Dantuluri Kishore Varma

Sunday 26 April 2015

ప్రకృతిముందు మనిషి ఎంత చిన్నవాడు!

పెర్ల్‌బక్ రాసిన ది బిగ్ వేవ్ కథకి 17.04.2015 నాటి గోతెలుగు వారపత్రికలో పరిచయం రాశాను. (కథా పరిచయాన్ని ఇక్కడ చదవండి.) ప్రకృతి వైపరీత్యాల నేపద్యంగా జననమరణాల రహస్యాలనీ, తాత్వికతని రంగరించి  చిన్నపిల్లలకి కూడా అర్థమయ్యే విధంగా పెర్ల్‌బక్ చెప్పిన కథ ఇది.  

కథలో... 
ఒకరోజు ఆకాశం మేఘావృతమైంది, కొండ వెనుక దూరంగా అగ్నిపర్వతంలోనుంచి నిప్పురవ్వలు ఎగసి పడ్డాయి, భూమి కంపించింది. భూమీ, సముద్రం కలసి భూమిలోపలి అగ్నితో పోరాడుతున్నాయి. ఏ నిమిషాన్నయినా అగ్నిపర్వతం బ్రద్దలవ్వొచ్చు, భూకంపం సంభవించ వచ్చు, సునామీ రావచ్చు....
ఇంటి మిద్దెమీద నుంచొని వాళ్ళు చూస్తూ ఉండగానే ప్రమాదం ముంచుకొచ్చింది. సముద్రపు అడుగున ఎక్కడో భూమి రెండుగా చీలింది. చల్లని నీరు అఘాతంలోనికి, మరుగుతున్న రాళ్ళమీదకి దూకింది. ఫలితంగా పెల్లుబికిన ఆవిరి సముద్ర జలాలని అల్లకల్లోలం చేసింది. ఆకాశం అంత ఎత్తున పెద్ద కెరటం లేచి వొడ్డుమీద విరిగి పడింది. తిరిగి వెళ్ళే టప్పుడు గ్రామంలో ఉన్న ఇళ్ళన్నింటిని తనలో కలిపేసుకొంది...
`... మనిషన్నాకా వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. ప్రమాదాలవల్లో, ముసలితనంవల్లో, వ్యాదులవల్లో మరణం తప్పదు అనే నిజాన్ని అంగీకరించాలి. జీవితాన్ని ఆనందంగా జీవించు. మృత్యువుకి భయపడకు...`  సముద్రపు ఒడ్డున నిటారుగా ఉన్న కొండవాలులో వ్యవసాయం చేసుకొని, పండించిన కాయగూరల్ని మత్యకారులకి అమ్ముకొని జీవించే ఒక రైతు తన కొడుకు కీనోకి చెప్పిన సత్యాలు ఇవి.  
*     *     * 

నేపాల్‌లో ఖాట్మండూ నిన్నటి(25.04.2015) భూకంపానికి అతాకుతలమయ్యింది. కథలో సునామీ గ్రామంలోవాళ్ళనందరినీ సముద్ర గర్భంలో కలిపేసుకొనప్పుడు జియా అనే కుర్రవాడు పడిన వేదన నేపాల్లో బ్రతికి బయటపడిన పౌరుల్లో కనిపించింది. ప్రకృతిముందు మనిషి ఎంత చిన్నవాడు!


© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!