Pages

Saturday 26 November 2016

చూద్దాం ఏమి జరుగుతుందో.....

పెద్దాయన ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకొని పెద్దనొట్లు రద్దు చేసిపారేయ్యడంతో...  ఆర్థికవ్యవస్థ ముందుకుపోతుందో, వెనక్కి పోతుందో తెలియని అయోమయ స్థితిలో పడిపోయాం.

`ఈ రోజుల్లో వందనోటుకి విలువెక్కడుంది..` అనుకొనేవాళ్ళని ఈ చిన్నినోటే తెల్లవారే సరికి తనకోసం క్యూల్లో నిలబెట్టించుకొంది.

కాలం చెల్లిన నోట్లు నిశ్సబ్ధంగా నిష్క్రమిస్తుంటే, కొత్తగా వచ్చిన రెండువేల నోట్లు `దమ్ముంటే మమ్మల్ని మార్చుకో చూద్దాం!` అంటున్నాయి. ఆచి తూచి ఖర్చుపెట్టడం అలవాటు తప్పిపోయిన వాళ్ళకి తప్పనిసరి పొదుపు తీరని తలనొప్పిలా తయారయ్యింది.

క్యూలో నుంచున్నా `ఈ కష్టానిదేముంది.. పరవాలేదులే` అనేవాళ్ళచేత `ఇదే పెద్ద కష్టం` అని నమ్మించాలని ప్రయత్నిస్తూ.. `ఇక్కడ డబ్బున్న వాడు ఒక్కడూ లేడు చూడు. వాళ్ళు ఎప్పుడో మార్చేసుకొన్నారు.` అంటున్నారు. మార్చుకొంటున్న వాడిది కష్టం... మార్చుకోలేకపోతున్న వాడిది మరీ పెద్ద కష్టం!

విపక్షం ఉక్రోషపడిపోతుంది. `చెత్తకుండీల్లో దొర్లుతున్న డబ్బు, అగ్నికి ఆహుతి అవుతున్న డబ్బు, నదుల్లో, డ్రయినేజీల్లో మునుగుతున్న డబ్బు, తనికీల్లో దొరుకుతున్న డబ్బు... ఓ లెక్కలోది కాదు. అసలు మొత్తాలన్నీ బంగారంలోకి, భూముల్లోకి, కంపెనీ పెట్టుబడుల్లోకి ఎప్పుడో వెళ్ళిపోయినియ్యి` అనికూడా  అంటుంది.
   
బ్లాక్ మనీ, అనెకౌంటెడ్ మనీ, లీగల్ మనీ, ఇల్లీగల్ మనీ... డబ్బుల్లో ఎన్నిరకాలో! కొత్త డబ్బుది ఏ రంగైనా, ఏ రూపామైనా.. ఇక ముందు చలామణీలో ఉండబోయేది తక్కువే. ప్రజల కొనుగోలు శక్తి సన్నిగిల్లుతుంది. వ్యాపారాలు నష్టాల్లో పడతాయి, రియల్ ఎస్టేట్ ధరలు నేలకి దిగి వస్తాయి, ఉద్యోగాలు ఊడిపోతాయి, జీడీపి తగ్గుతుంది, ఆర్థికమాధ్యం రావచ్చు,... ఇంకా ఇలాంటి చిట్టా చాలా ఉంది.

నాణానికి రెండోవైపు చూస్తే, డిమోనిటైజేషన్ వల్ల ఖజానాకు రాజమార్గంలో తిరిగి వస్తుందని భావిస్తున్న లక్షల కోట్ల రూపాయలతో దేశాన్ని రామరాజ్యంగా మార్చవచ్చట!

ఏదేమయినప్పటికీ...ఆట మంచి రసపట్టులో ఉంది. ప్రపంచం అంతా ఆసక్తిగా మనవైపే చూస్తుంది.గెలుస్తామో, ఓడిపోతామో... చూద్దాం ఏమి జరుగుతుందో.....  

© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!