Sunday, 11 February 2018

నవ్యాంధ్ర పుస్తక సంబరాలు

కాకినాడ ఆనందభారతి గ్రౌండ్స్‌లో నిన్నటి(10.02.2018) నుంచి నవ్యాంధ్ర పుస్తక సంబరాలు (బుక్ ఫెస్టివల్) మొదలయ్యాయి. ఈ నెల 18వ తేదీ వరకూ కొనసాగుతాయి. మద్యాహ్నం 2నుంచి రాత్రి 9 వరకూ సందర్శించవచ్చు. స్టాల్స్ చాలా ఉన్నాయి. మంచి మంచి పుస్తకాలూ ఉన్నాయి. సరైన ప్రచారం లేకో ఏమిటో తెలియదు కానీ సందర్శకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ తరహా  ఫెస్టివల్ కాకినాడలో నిర్వహించడం ఇది 3వ సారి.   ఇటువంటి వాటిని ఆదరిస్తే, ప్రతీ సంవత్సరం విజయవాడలోలాగ మనకి కూడా బుక్‌ఫెస్టివల్ వస్తుంది. అలా జరిగితే బుక్‌లవర్స్‌కి నిజంగా పండగే.

Thursday, 1 February 2018

చంద్రగిరి కోట

తిరుపతి పట్టణానికి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగ్రిగి వెళ్ళేసరికి సాయంత్రం ఐదున్నర అయిపోయింది. రాతితో కట్టిన కోటగోడలు, ప్రవేశద్వార మండపాలు, రహదారికి కొంచెం ఎడంగా ఉన్న పురాతన దేవాలయాల గోపురాలు చూసుకొంటు రాజమహల్ దగ్గరకి చేరుకొన్నాం.  అప్పటికే సందర్శకులని అనుమతించే సమయం దాటిపోవడంతో గేట్లు మూసేస్తున్నారు. `చాలాదూరంనుంచి వచ్చామని, అనుమతించమని కోరడంతో,` ఏమనుకొన్నారో, `తొందరగా చూసి వచ్చేయండి` అని గేట్లు తెరిచారు. కృతజ్ఞతలు చెప్పి లోనికి వెళ్ళాం.ఎప్పుడో పదకొండవ శతాబ్ధంలో నిర్మించిన కోట. శత్రుదుర్భేద్యంగా ఉండడం కోసం కొండవాలులో కట్టారు. అర్థచంద్రాకారపు కొండ కోటకు మూడువైపులా పెట్టని గోడలా ఉంది. రాజమహల్, రాణీమహల్, వాటి నడుమ ఉద్యానవనం, చిన్న నీటి కొలను, రాణీమహల్‌కి సమీపంలో దిగుడు మెట్లున్న మంచినీటి బావి... కొండమీదనుంచు వస్తున్న చల్లని సాయంత్రపు గాలి ఆహ్లాదంగా ఉంది. 

రాజమహలులో కవితాగోష్టులు, యుద్దతంత్రాలు, రహస్యమంతనాలు, మంత్రిమండలి సమావేశాలు జరిగేవేమో. రాణీమహల్ గవాక్షాలనుంచి యువరాణులు బయటకు చూస్తూ ఏమి పాటలు పాడుకొనేవారో, చెలికత్తెలతో కలిసి మహలులో చప్టాలమీద ఏమి ఆటలు ఆడుకొనేవారో, వేటకు వెళ్ళిన రాజుగారు చీకట్లు ముసురుకొంటున్న సాయంత్రం - రాత్రిగా మారుతున్నా రాకపోతే మహారాణులు దిగుళ్ళను ఎవరితో పంచుకొనేవారో!  

సాళువ నరసింహరాయలు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడట. శ్రీకృష్ణదేవరాయలు కొంతకాలం ఈ కోటలో ఉన్నాడని చెపుతారు. తన ఇద్దరు భార్యలలో ఒకరైన చిన్నమదేవిని చంద్రగిరిలోనే కలిశాడట. విజయనగర రాజులు పెనుగొండను రాజదానిగా చేసుకొని పరిపాలిస్తున్న కాలంలో, గోల్కొండ నవాబుల దండయాత్ర కారణంగా విజయనగర రాజదానిని పెనుగొండ నుంచి చంద్రగిరికి మార్చారట. తరువాత చంద్రగిరి మైసూర్ పాలకుల ఆధీనంలో కూడా ఉంది.   

ప్రస్తుతం రాజమహల్‌లో ఆర్క్యలాజికల్ మ్యూజియం ఉంది. మేము వెళ్ళినరోజు శుక్రవారం కావడంతో మ్యూజియంకు శలవు. కానీ సాయంత్రం ఆరున్నర గంటలనుంచి, ఏడుగంటల పదిహేను నిమిషాల వరకూ - ముప్పావుగంట సేపు ప్రదర్శించే మ్యూజిక్ అండ్ లైట్ షో ఉంది. ఈ షో చూడడానికి పెద్దలకు టిక్కెట్టు అరవై రూపాయలు. పిల్లలకు నలభై ఐదు.  `నేను చంద్రగిరి కోట అంతరాత్మను...` అని మొదలు పెట్టిన గంభీరమైన స్వరం చంద్రగిరి చరిత్రను చక్కటి రూపకంలా వివరించి చెపుతుంది. ఈ షో చూసినవాళ్ళకి నిస్సందేహంగా  మంచి అనుభూతికి కలిగిస్తుంది.  

ఎవరైనా తిరుపతి వెళ్ళినప్పుడు ఒకపూట కేటాయించగలిగితే చంద్రగిరి కోటను చూడవచ్చు.

 © Dantuluri Kishore Varma   

Thursday, 4 January 2018

వాల్మీకి

ఆదికావ్యం రామాయణాన్ని రచించిన వాల్మీకిమహర్షి  అసలు పేరు అగ్నిశర్మ. అతని తండ్రి సుమతి, తల్లి కౌశికి.  కుటుంబ పోషణ కోసం వేదపఠనాన్ని, పౌరోహిత్యాన్ని కాకుండా దారిదోపిడీని వృత్తిగా ఎంచుకొన్నాడు అగ్నిశర్మ. అడవిలో ఆశ్రమం నిర్మించుకొని కుటుంబంతో సహా జీవిస్తున్నాడు. 

ఒకరోజు సప్త ఋషులయిన వశిస్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, అత్రి, జమదగ్ని, భరద్వాజుడు, కశ్యపుడూ తీర్థయాత్రలకు వెళుతూ అగ్నిశర్మ ఆశ్రమ సమీపంలో ఉన్న అడవిదారిగుండా ప్రయాణం చేస్తున్నారు. అగ్నిశర్మ వారిని అటకాయించాడు. వారివద్ద ఉన్న వస్తువులు, ఆహారపదార్థాలు ఇవ్వమని బెదిరించాడు. అప్పుడు అత్రి మహాముని, `నాయనా మనుష్యులని హింసించి, చంపి ఆర్జించే సంపదవల్ల పాపం కలుగుతుంది. ఇదంతా ఎవరికోసం చేస్తున్నావు?` అని ప్రశ్నించాడు. `తల్లితండ్రుల కోసం, భార్యాపిల్లల కోసం,` అని సమాధానం చెప్పాడు అగ్నిశర్మ.   `అలా అయితే, నీ సంపాదనలో భాగం పంచుకొంటున్న వాళ్ళు- నీ పాపాలలో కూడా భాగం పంచుకొంటారేమో తెలుసుకొని రా,` అన్నాడు అత్రి.

సప్తఋషులని అక్కడే వేచి ఉండమని చెప్పి, ఇంటికి వెళ్ళాడు అగ్నిశర్మ. తల్లిని, తండ్రిని, భార్యని `నా పాపంలో భాగం పంచుకొంటారా?` అని అడిగాడు. `సక్రమంగానో, అక్రమంగానో సంపాదించి కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత ఒక గృహస్తుగా  నీకు ఉంది. ఆ కర్తవ్య నిర్వాహణలో సంభవించే పాపపుణ్యాలు పూర్తిగా నీవే తప్ప, మావి కాదు` అని వాళ్ళు చెప్పారు.  

ఈ సమాదానంతో  అగ్నిశర్మ ఎంతో దిగులు చెందాడు. సప్తఋషుల దగ్గరకు తిరిగివెళ్ళి జరిగిన విషయం చెప్పాడు. తనకు మార్గనిర్దేశం చెయ్యమని వేడుకొన్నాడు. అప్పుడు అత్రి మహర్షి అగ్నిశర్మకి శివ పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి,  ధ్యానం చెయ్యమని చెప్పాడు. 

అగ్నిశర్మ ధ్యానం చేస్తూ ప్రపంచాన్ని మరచిపోయాడు. ఆకలి, దప్పికలు లేవు. బాహ్యస్మృతిలేదు. రోజులు, మాసాలు, ఏళ్ళు గడిచాయి. అగ్నిశర్మ శరీరం చుట్టూ పుట్టలు మొలిచాయి. పదమూడు సంవత్సరాల తరువాత తీర్థయాత్రల నుంచి తిరిగి ఆదే మార్గంలో వస్తున్న మహర్షులు పుట్టలో ఉండి ధ్యానం చేస్తున్న అతనిని గమనించి, బయటకు పిలిచారు. పుట్టను సంస్కృతంలో వాల్మీకం అంటారు. వాల్మీకం నుంచి బయటకు వచ్చాడు కనుక అగ్నిశర్మ అప్పటినుంచీ వాల్మీకి అయ్యాడు. 

*     *     * 

ఆ తరువాత వాల్మీకి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్ళాడు. ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేసుకొని, పరమేశ్వరుడ్ని ఆరాదించాడు. చిత్రకూట పర్వతం మీద కొన్నిరోజులు ఉండి, అటుపిమ్మట తమసానది తీరంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని, శిష్యులతో సహా అక్కడ నివశిస్తున్నాడు. 

ఆ సమయంలోనే ఆయనకు ఒక సందేహం వచ్చింది. `ఇదీ లోపం అని వేలుపెట్టి చూపించడానికి అవకాశం లేని, సకల సద్గుణాలూ కలిగిన మహాపురుషుడు ఎవరైనా ఈ భూమండలం మీద ఉండి ఉంటారా?` అని. అటువంటి వ్యక్తి ప్రియమైన రూపం కలిగినవాడై ఉండాలి. ముఖంలో మంచి తేజస్సు వుండాలి. బలం, ధైర్యం, పరాక్రమం కలిగి ఉండాలి. సకలవిద్యలలోనూ పారంగతుడై ఉండాలి. సమర్దుడై ఉండాలి, దృడసంకల్పం కలిగినవాడై ఉండాలి. ధర్మాధర్మాలు తెలిసి ఉండాలి. సకలప్రాణుల హితం కోరుకోవాలి. ఎవరైనా తనకు చేసిన మేలు మరచిపోకూడదు - అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా అసత్యం పలుకని వాడై ఉండాలి. మంచి చరిత్ర కలిగిన వాడై ఉండాలి... ఉండవలసిన సుగుణాలు ఇవి. మరి అతనికి ఉండకూడని దుర్గుణాలు ఏమిటి? అసూయ ఉండకూడదు. క్రోదాన్ని జయించిన వాడై ఉండాలి - అలాగని అసలు కోపమే ఉండకూడదని కాదు. ఏదైనా సహేతుకమైన కారణం చేత అతనికి కోపం కనుక వస్తే దేవతలు కూడా భయపడే విధంగా ఉండాలి.  

ఏవైనా ఒకటి రెండు మంచి గుణాలు ఉన్న వ్యక్తి తారసపడితేనే ప్రశంసాపూర్వకమైన ఆనందంతో తబ్బిబ్బైపోతాం. ఆలాంటిది, వాల్మీకి యోచించిన పదహారు సుగుణాలూ రాసిపోసుకొన్న పురుషోత్తముడు గురించి తెలుసుకొంటే ఆశ్చర్యం, ఆనందం, గౌరవం, భక్తి... అన్నీ కలగలిసి పారవశ్యం కలూగకుండా ఉంటుందా !? 

ఒకరోజు నారదమహర్షి, వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన సందర్భంలో, వాల్మీకి తన సందేహాన్ని ఆయన వద్ద వ్యక్తం చేశాడు. వాల్మీకి అడిగిన ప్రశ్న ఇదే...

"కో న్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ 
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత: 
చారిత్రేణ చ కో యుక్త: సర్వభూతేషు కో హిత: 
విద్వాన్ క: కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన: 
ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో..అనసూయక: 
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సమ్యుగే 

అప్పుడు నారద మహర్షి - ఇక్ష్వాకు వంశంలో జన్మించిన శ్రీరాముడికి ఆ పదహారు సుగుణాలూ ఉన్నాయని చెపుతూ, రాముడి కథని వందశ్లోకాలలో సంక్షేప రామాయణంగా వినిపించాడు. 

రామాయణం ప్రతీ సన్నివేశంలో రాముడి శౌశీల్యం ఉదాత్తంగా అభివ్యక్తమౌతుంటుంది. దానిని వాల్మీకి చెప్పిన సుగుణాల కోణంలో పరిశీలిస్తే రాముడు ఎంత గొప్ప కథానాయకుడో తెలుస్తుంది. నిజానికి వాల్మీకి అడిగిన ప్రశ్నని పటంకట్టించి ప్రతీ పాఠశాలలో, ప్రతీ కార్యాలయంలో, మనుష్యులు తిరిగే ప్రతీ చోటా తగిలిస్తే... దాని అర్థాన్ని వివరిస్తే ప్రపంచంలో ఏ వ్యక్తిత్వవికాస పుస్తకమూ చేయలేని మంచి, అది మనకు చేస్తుంది. 
*     *     *

రామాయణం - రాముడి కథ, ఆయన నడచిన దారి, నారద మహర్షి నుంచి విన్న రామాయణంలో సన్నివేశాలు వాల్మీకి మనసులో నిరంతరాయంగా మెదులుతున్నాయి. సంధ్యావందనం చేయడానికి శిష్యునితో కలసి తమసానది వైపుకి వాల్మీకి మహర్షి వెళుతూ ఉండగా ఒక చెట్టుకొమ్మమీద జతకట్టి ఉన్న రెండు క్రౌంచపక్షులు ఆయన కంట పడ్డాయి. అంతలో ఎక్కడినుంచో ఒక బోయవాడు గురిచూసి కొట్టిన బాణం సూటిగా వచ్చి మగపక్షి గుండెల్లో దిగబడింది. అది విలవిలలాడుతూ నేలకూలిన వైనం, ఆడపక్షి ఆక్రోశం వాల్మీకి మనసుని కలిచివేశాయి. వెంటనే ఆయన కోపంగా `కామమోహంతో పరవశించి ఉన్న క్రౌంచ పక్షులలో ఒకదానిని సంహరించావు కనుక నీవుకూడా త్వరలోనే మరణిస్తావు` అని ఒక శ్లోక రూపాన బోయవాడిని శపించాడు. ఆవిధంగా శపించినందుకు ప్రశ్చాత్తాప పడినా, శ్లోకంలోని చందస్సు, లయ వాల్మీకికి సంబ్రమాశ్చర్యాలను కలిగించాయి. ఆ శ్లోకాన్నే మననం చేసుకొంటూ ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.

రామాయణ మహాకావ్యం ఆవిష్కృతమవ్వడానికి సమయం ఆసన్నమయ్యింది. వాల్మీకి ఎదుట బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆజ్ఞ మేరకే తనకి సరస్వతీ కటాక్షం కలిగి, శాపం స్లోకం రూపంలో అభివ్యక్తమైందని వాల్మీకికి తెలుస్తుంది. బ్రహ్మ అనుగ్రహం వల్ల వాల్మీకికి జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది తెలుసుకొనే దివ్యదృష్టీ, రామాయణ పాత్రల మనసుల్లో మెదిలే ఆలోచనలు కూడా చదవగలిగే శక్తి వచ్చాయి. ఈ భూమండలంమీద పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణం నిలిచి ఉంటుందని చెప్పి, బ్రహ్మ అంతర్దానం అయ్యడు.

బోయవాడిని శపించిన శ్లోకం యొక్క చందస్సులోనే వాల్మీకి రామాయణాన్ని రచించాడు. నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణాన్ని విస్తరించి బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్దకాండ అనే ఆరు కాండలుగా, ఇరవై నాలుగు వేల శ్లోకాలతో  ఆదికావ్యంగా వాల్మీకి మహర్షి రచించాడు. తరువాత జరిగిన కథని ఉత్తరకాండగా ఆ ఆరుకాండలకీ జతచేశాడు. పరమ పవిత్రమైన గాయత్రీమంత్రంలోని ఇరవైనాలుగు అక్షరాలలో ఒక్కొక్కదానినీ వెయ్యి శ్లోకాలుగా విస్తరించి రామయణ కావ్యాన్నీ రచించడం జరిగిందని చెపుతారు. ఆవిధంగా గ్రంధస్థం చేసిన రామాయణ మహాకావ్యాన్ని గానంచేసే పద్ధతిని అప్పటికే వాల్మీకి ఆశ్రమంలో పెరుగుతున్న సీతారాముల కుమారులు కుశలవులకు నేర్పించాడు.

శివుడిని ధ్యానించి అగ్నిశర్మ వాల్మీకి అయ్యాడు. బ్రహ్మ అనుగ్రహంతో సరస్వతీ కటాక్షాన్ని పొంది శ్రీమహావిష్ణువు యొక్క అవతారమైన రాముడి కథని శ్రీమద్రామాయణంగా రచించాడు. త్రిమూర్తుల అనుగ్రహం వల్ల రామాయణం అజరామర కావ్యంగా ఈ భూమండలంమీద నిలచిపోయింది.   విలువలు పతనం ఐపోతున్న ఈ రోజుల్లో, ప్రతీ ఒక్కరూ రామాయణాన్ని చదవడం అత్యంత ఆవశ్యకం. ఆదర్శవంతమైన రాముడి వ్యక్తిత్వం - మంచీచెడూ, ధర్మాధర్మ విచక్షణని ప్రతీఒక్కరిలోనూ కలిగించగలదు.
Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!