Pages

Monday 26 March 2018

శ్రీరామ జననం


గంగానదికి ఉత్తర దిక్కున, సరయూ నదీ తీరాన కోసలదేశమనే గొప్ప రాజ్యం ఉండేది. కోసలదేశపు రాజధాని అయోధ్య. అయోధ్య అంటే యుద్ధము ద్వారా జయింప వీలుకానిది  అని  అర్థం. పేరుకు తగినట్టుగా పన్నేండు యోజనాల వెడల్పు, మూడు యోజనాల పొడవు కలిగిన అయోధ్యా నగరం సుందరమైన రాజ భవనాలు, విశాలమైన రహదారులు, ఎత్తైన కోటగోడలు, వాటికి వెలుపల లోతైన కందకాలతో శత్రుదుర్భేద్యమైనది. మనువు అనే సూర్యవంశపు చక్రవర్తి దీనిని నిర్మించాడు. 

మనువు వంశంలోని ఇక్ష్వాకుడు అనే మరొక చక్రవర్తి పేరు మీద వీరి వంశం ఇక్ష్వాకువంశంగా ప్రశిద్ధి పొందింది. దశరథుడు ఇక్ష్వాకుల రాజులలో అగ్రగణ్యుడు. ఈయన దేవతల పక్షాన యుద్ధం చేసి ఎంతో ఖ్యాతిని గడించాడు.

ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనే ఎనిమిదిమంది సమర్థులైన మంత్రులు, రాజక్షేమాన్ని కోరే వసిష్ఠుడు, వామదేవుడు, కాశ్యపుడు, గౌతముడు, జాబాలి, సుయజ్ఞుడు అనే ఋషిపుంగవులు, ధార్మిక కార్యక్రమాలని నిబద్దతతో నిర్వర్తించే బ్రాహ్మణోత్తములు, యుద్ధతంత్రంలో ఆరితేరిన సేనా నాయకులు, లెక్కకు మిక్కిలిగా అప్రమత్తత కలిగిన గూడచారులు, అసంఖ్యాకమైన గొప్ప సైన్యంతో దశరథుడు ధర్మపరాయణుడై, సత్యవాక్పాలనాపరుడై ఐశ్వర్యంలో కుబేరుడేమో, రాజ్యపాలనలో ఇంద్రుడేమో అనిపించేవాడు. ప్రజలకు భారం కాని విధంగా పన్నులు ఉండేవి. నేరాల సంఖ్య తక్కువ. నేరస్తులకు తగిన శిక్షలు ఉండేవి. దశరధుడి పాలనలో ప్రజలు ధర్మబద్ధులై ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో, సుఖసంతోషాలతో జీవించేవారు.

ఋతుధర్మాలను అనుసరించి ఎండలు మెండుగా కాస్తున్నాయి. వర్షాలు చక్కగా కురుస్తున్నాయి. పాడిపంటలు సమృద్ధిగా ఉన్నాయి.

కానీ...

దశరధుడికి చాలా కాలం వరకూ సంతానం కలుగలేదు.

ఒకనాడు మహారాజు ముఖ్యులనందరినీ సమావేశపరిచాడు. వారిని ఉద్దేశించి ఆయన ఇలా అంటున్నాడు... 'సంతాన సాఫల్యత కోసం అశ్వమేధయాగాన్ని చేయాలని సంకల్పించాం. కాబట్టి ఋత్విక్కులను సంప్రదించి యాగాన్ని చేసే విధానాన్ని కూలంకుషంగా తెలుసుకోండి. పురోహితులకు ముహూర్తాలను నిర్ణయించమని మా మాటగా చెప్పండి. సరయూ నదీ తీరాన యాగ శాలలు నిర్మించడానికి ఏర్పాట్లు చెయ్యండి. ఆహ్వానితుల జాబితాలను తయారు చెయ్యండి. యాగానికి తరలి వచ్చే అతిదులకు వసతి, భోజన ఏర్పాట్లు ఘనంగా ఉండేలా ప్రణాళికలను సిద్ధం చెయ్యండి.     వారిని అలరించడానికి నృత్య, గాన కార్యక్రమాలను ఏర్పాటు చెయ్యండి. యాగశాలను సర్వాంగసుందరంగా నిర్మించడానికి రాజ్యంలో ఉన్న గొప్పశిల్పులని నియమించండి. కళాకారులకు సత్కారాలు, బ్రాహ్మణులకు దాన ధర్మాలు, ప్రజలకు అన్ని సౌకర్యాలు... జరిగేలా పర్యవేక్షణ బాధ్యతలు సమర్ధులకు అప్పగించండి.'  

సమావేశం ముగిసింది. సభాసదులందరూ నిష్క్రమించారు. సుమంత్రుడు మాత్రం ఉండిపోయాడు. మహారాజుకి ఒక ముఖ్యవిషయం చెప్పవలసి ఉంది. చాలా కాలం క్రితం సుమంత్రుడు - సనత్కుమారుడనే ఒక మహర్షి తన శిష్యులతో చెప్పిన మాటలు విన్నాడు. దశరధుడనే మహారాజు పుత్రుల కోసం అశ్వమేధయాగం చేస్తాడని... ఆయనకి పుత్రులు జన్మిస్తారనీ... అయితే ఆ యాగంతోపాటు పుత్రకామేష్టి యాగం కూడా జరుగవలసి ఉన్నదనీ, యాగాలకు ఆధ్వర్యుడిగా ఋష్యశృంగుడు తప్పనిసరిగా ఉండాలని ఆయన చెపుతుండగా సుమంత్రుడు విన్నాడు.

దశరధుడికి చాలా సంతోషం కలిగింది. ఋష్యశృంగుడి గొప్పతనమేమిటో, ఆయన ఎవరో తనకు చెప్పమని సుమంత్రుడిని అడిగాడు.

*     *     *

పూర్వం విభాండకమహర్షి అనే గొప్ప తపస్వి  ఉండేవాడు. ఒకనాడు ఆయన సరోవరంలో స్నానం చేస్తూ ఉండగా వీర్యపు చుక్క ఒకటి జారిపడింది. దానిని ఒక జింక సేవించడంతో, దాని గర్భంనుంచి శిరస్సు పైన  కొమ్ముతో ఒక బాలుడు జన్మించాడు. ఆయనే ఋష్యశృంగుడు.

విభాండకమహర్షి కుమారుడిని ఆశ్రమం, అడవి తప్ప మరో ప్రపంచం తెలియకుండా పెంచాడు. అతనికి వేదాధ్యయనం చెయ్యడం, యజ్ఞయాగాదులలో పాల్గొనడం, కందమూలాలు భుజించడం తప్ప మరేమీ తెలియదు. స్త్రీలను ఎప్పుడూ చూడలేదు కనుక స్త్రీ, పురుష భేదం తెలియదు.

ఇది ఇలా ఉండగా అక్కడికి సమీపంలో ఉన్న అంగరాజ్యంలో చాలాకాలంగా వర్షాలు కురియక మహాక్షామం సంభవించింది. 'ఋష్యశృంగుడిని రాజ్యానికి తీసుకొనివస్తే వర్షాలు కురుస్తాయి' అని మహారాజు రోమపాదుడికి  విజ్ఞులు చెప్పారు.  కానీ, విషయసుఖాలు ఏమీ తెలియని ఋష్యశృంగుడిని రాజ్యానికి రప్పించడం ఎలా? ముఖ్యమైన వాళ్ళందరూ సమావేశమయ్యారు. రాజ్యంలో ఉన్న అపార సౌందర్యవంతులైన వేశ్యలను నియమించి ఈ కార్యాన్ని నిర్వర్తించాలని నిశ్చయించారు.

విభాండకమహర్షి ఆశ్రమంలో లేని సమయం చూసి, రోమపాదుడిచే పంపబడిన వేశ్యలు అందంగా అలంకారాలు చేసుకొని, ఆశ్రమ సమీపంలో నృత్యగానాలు చేస్తూ, తమ హొయలతో ఋష్యశృంగుడిని ఆకర్షించారు. అతని అహ్వానం మీద ఆశ్రమానికి వెళ్ళి, కందమూలాలతో ఇచ్చిన ఆతిధ్యం స్వీకరించారు. తరువాత రోజు ఆయన కూడా తమ ఆశ్రమానికి రావాలని ఆహ్వానించారు. ఆశ్రమానికి అనే నెపంతో ఋష్యశృంగుడిని సరాసరి అంగరాజ్యానికి తీసుకొని వచ్చారు. ఆ మహానుభావుడు రాజ్యంలో అడుగు పెట్టగానే కుంభవృష్ఠి కురిసింది.  రోమపాదుడు ఎంతో సంతోషించి, తన కుమార్తె శాంతను ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేసి, వాళ్ళని అంగరాజ్యంలోనే ఉంచుకొన్నాడు.

*     *     *

దశరధుడు అంగరాజ్యం వెళ్ళాడు. రోమపాదుని అతిధిగా కొన్నిరోజులు ఉన్న తరవాత, ఆతని కుమార్తె శాంతను, జామాత ఋష్యశృంగునీ తనతో పాటు అయోధ్యకు పంపమని కోరాడు. రోమపాదుని అంగీకారంతో వారు అయోధ్యా నగరం చేరిన పిదప దశరధుడు విషయాన్ని ఋష్యశృంగునికి వివరించి, ఆతనిని అశ్వమేధయాగానికీ, పుత్రకామేష్టికి ఋత్విక్కుగా ఉండమని అభ్యర్థించాడు. ఋష్యశృంగుడు సంతోషంగా అంగీకరించాడు. శాస్త్రాలలో నిర్ణయించిన ప్రకారం యాగ క్రతువులు నభూతో...నభవిష్యతీ అన్న చందంగా జరుగుతూ ఉన్నాయి. యాగం అంటే ఒక్కరోజులో పూర్తి అయ్యేది కాదు - చైత్రమాసంతో మొదలై, ఆరు ఋతువులూ చూసి, మరుసటి చైత్రం వరకూ కొనసాగింది. వచ్చిన వాళ్ళందరికీ షడ్రుచులతో కూడిన భోజన ఏర్పాట్లు చేశారు, సత్కారాలు చేశారు, నూతన వస్త్రాలను బహూకరించారు. సంతుష్టులై.. అందరూ దశరధుని అభీష్టం నెరవేరాలని దీవించారు.

*     *     *       

ఒకవైపు యాగం జరుగుతూ ఉండగా దేవతలందరూ బ్రహ్మదేవుని దగ్గర సమావేశం అయ్యారు. బ్రహ్మనుంచి - రావణాసురుడు తనకు దేవ, దానవ, యక్ష, గాంధర్వ... తదితరులచే మరణం కలుగకుండా ఉండాలని వరం పొందాడు. కానీ, మానవులమీద ఉన్న చులకన భావం వల్ల వారిని చేర్చలేదు. బ్రహ్మ ద్వారా వరాలు పొందిన రావణాసురుడి ఆగడాలు శృతిమించి పోతున్నాయి.ఆతనిని నిలువరించే ఉపాయం చెప్పమని వారు బ్రహ్మని వేడుకొన్నారు. `విష్ణుభగవానుడే రావణుని సంహరించగల సమర్ధుడు` అని బ్రహ్మ సూచించిన పిమ్మట, దేవతలందరూ విష్ణువుని `ఈ ఆపదనుంచి కాపాడు` అని ప్రార్థించారు. విష్ణుభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. `రావణాసురుడిని నిర్మూలించే కారణం కోసం, పుత్రకామేష్టి యాగం చేస్తున్న దశరధుని ఇంట నలుగురు కుమారులుగా జన్మిస్తాను` అని వారికి మాట ఇచ్చాడు.         

రామ రావణ సంగ్రామంలో రాముడికి సహాయం చెయ్యడానికి దేవతలు అందరూ తమతమ అంశలచే - అప్సర, గంధర్వ స్త్రీలద్వారా వానర సేనను సృజించమని బ్రహ్మ ఆదేశించాడు. బ్రహ్మ ఆవులించినప్పుడు ఆయన ముఖం నుంచి జాంబవంతుడు జన్మించాడు. ఆతను వానర సేనలకు అండగా ఉంటాడని తెలియజేశాడు. ఇంద్రుడి అంశచే వాలి, సూర్యుడి వలన సుగ్రీవుడు, వాయుదేవుని వలన హనుమంతుడు... తదితర వీరులు జన్మించారు.  బ్రహ్మ ఆదేశానుసారమే - విష్ణుభగవానుడు రాముడిగా అవతరించడానికి ముందే వానరులంతా జన్మించి ఆయన సేవకై ఈ భూమండలం మీద వేచి ఉన్నారు.   

*     *     *   
పుత్రకామేష్ఠి యాగం పూర్తి అవుతూ ఉండగా, యజ్ఞకుండం నుంచి తేజోవంతమైన ఓ మహా పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో ఓ బంగారు కలశం ఉంది. దాని పైన వెండి మూత కప్పి ఉంది. దశరదుడి ఆ మహా పురుషునికి భక్తిపూర్వకంగా ప్రణామాలు అర్పించాడు. `దశరధా నీ యాగం ఫలించింది. ఈ పాత్రలో దేవతలచే చేయబడిన పాయసం ఉంది. దీనిని నీ రాణుల చేత సేవింపచెయ్యి. నీకు పుత్ర సంతానం కలుగుతుంది.` అని చెప్పి ఆయన పాయస కలశాన్ని మహారాజుకి అందజేశాడు.

దశరధుడు పాయసంలో సగభాగాన్ని (1/2) కౌశల్యకు ఇచ్చాడు. మిగిలిన దానిలో సగాన్ని (1/4) సుమిత్రకి ఇచ్చాడు, చివరకు మిగిలిన పావు వంతులో సగభాగాన్ని(1/8) కైకకు, మిగిలిన మరో భాగాన్ని(1/8) మళ్ళీ సుమిత్రకు ఇచ్చాడు. అనతికాలంలోనే ముగ్గురూ గర్భవతులు అయ్యారు.

చైత్రమాసంలో నవమిరోజు కర్కాటక లగ్నం పునర్వసు నక్షత్రంలో కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. దశమిరోజు పుష్యమీ నక్షత్రంలో కైకేయికి భరతుడు; ఆశ్లేష నక్షత్రంలో సుమిత్రకి కవలలు - లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు.   

దశరధుని కుమారులకి నామకరణం వశిష్టుని చేతులమీదుగా జరిగింది. కౌశల్యా తనయునికి - అందరినీ ఆనందింపచేసే సుగుణములు కలవాడు కనుక రాముడు అని; కైకేయి తనయునికి రాజ్యభారాన్ని భరిస్తాడు కనుక భరతుడని; సుమిత్రా తనయులలో సర్వ శుభలక్షణాలూ ఉన్న వాడికి లక్ష్మణుడని, శత్రువులని సంహరించే వాడికి శత్రుఘ్నుడని పేర్లు పెట్టారు.   

శ్రీరామ నవమినాడు సర్వకాలాల్లోనూ మానవులందరికీ ఆదర్శప్రాయమైన శ్రీరాముని కథకి అంకురార్పణ జరిగింది. 

© Dantuluri Kishore Varma

Saturday 3 March 2018

బంగారుశిఖరాల బహుబ్రహ్మమయము...

భావములోనా - బాహ్యమునందును
గోవింద గోవిందయని - కొలవవో మనసా...
హరి యవతారములే - అఖిలదేవతలు
హరిలోనివే బ్రహ్మాండంబులు...
హరి నామములే - అన్ని మంత్రములు
హరి హరి హరి హరి యనవో మనసా...
విష్ణువు మహిమలే - విహిత కర్మములు
విష్ణుని పొగడెడి - వేదంబులు...
విష్ణుడొక్కడే - విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని - వెదకవో మనసా...
అచ్యుతుడితడే - ఆదియునంతయము
అచ్యుతుడే - యసురాంతకుడు... 
అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీదనిదే 
అచ్యుత యచ్యుత శరణనవో మనసా...
అదివో అల్లదివో హరివాసము
పదివేలుశేషుల పదగలమయము...
అదె వేంకటాచల మఖిలవున్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము...
అదివో నిత్యనివాస మఖిలమునులకు
న దె చూడు డ దె మొక్కు డానందమయము...
చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము...
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారుశిఖరాల బహుబ్రహ్మమయము...
కైవల్యపదము వేంకటనగ మదివో
శ్రీవేంకటపతికి సిరులైనది...
భావింప సకల సంపదరూప మదివో
పావనములకెల్ల పావనమయము.
(Photos taken in Tirupati and Tirumala. Text: Annamayya Keerthanas) 

                                    © Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!