Saturday, 29 September 2012

అనంత పద్మనాభ స్వామి

వారం రోజుల క్రితం ద్వారపూడి దేవాలయాలను చూడటానికి వెళ్ళాను. కాకినాడకి 32 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రీ వైపు వెళ్ళే కెనాల్ రోడ్డు ప్రక్కన ద్వారపూడి ఉంది. ఇక్కడ ఒకే ప్రాంగణంలో సుమారు పది పెద్ద దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి శ్రీ అనంతపద్మనాభ స్వామిది. నిజానికి ఇది ఒక ప్రత్యేకమైన గుడికాదు. శిరిడీ సాయిబాబా ఆలయంలో సాయినాధుని విగ్రహానికి వెనుకవైపు ఒక గర్భ గుడిలాంటి చాంబర్లో పవళించి ఉన్న మూర్తి. సుమారు రెండు సంవత్సరాలకు ముందు కుడా ఒకసారి ఇక్కడికి వెళ్ళాను. అప్పుడు ఈ పద్మనాభుడిని చూసిన జ్ఞాపకం లేదు. దానికి కారణం అప్పడు దీనిని నేను దర్శించి ఉండకపోవచ్చు, లేదా అనంతపద్మనాభుడు అంటే ఎవరో సరి అయిన అవగాహన లేక చూసిన విషయం నాకు గుర్తుండలేదో!
ద్వారపూడి  అనంతపద్మనాభుడు
ప్రస్తుత పోస్టు యొక్క ఉద్దేశ్యం ద్వారపూడి దేవాలయాల గురించి తెలియజేయడం కాదు - ఈ గుడిలో ఉన్న అద్బుతమైన అనంతపద్మనాభుని విగ్రహం ఈ పోస్టు వ్రాయడానికి ఒక ప్రేరణ మాత్రమే.
* * *
గత సంవత్సరం తిరువనంతపురం ఆలయంలో నేల మాళిగలలోనుంచి బయటపడిన బంగారు నాణాలు, నగలు, విగ్రహాలు, వజ్రవైఢూర్యాలు మొదలనవాటి విలువ లక్ష కోట్ల రూపాయలని  (వాటి ప్రాచీన విలువని -antique value- మదింపు చేస్తే దీనికి పదిరెట్లు ఉంటుందని అంచనా) ప్రపంచవ్యాప్తంగా మీడియాలో వార్తలు రావడంతో మన అందరి దృష్ఠీ ఈ పురాతన దేవాలయం మీదకి మళ్ళింది. ఇప్పుడు ప్రపంచంలో ది రిచ్చెస్ట్ గాడ్ ఈయనే. వంద అడుగుల ఎత్తయిన గోపురం, 18 అడుగుల పొడవైన పవళించి ఉన్న స్వామి విగ్రహం, 108 పవిత్ర విష్ణు నివాసాలలో ఇది ఒకటి అనే ప్రఖ్యాతి...అన్నీ కలిపి ఎవరికయినా ఒక్కసారి తిరువనంతపురం అనంతపద్మనాభుడిని దర్శించుకోవాలనే కోరికని కలిగిస్తాయి.
క్షీరసాగరం అనబడే పాల సముద్రంలో అనంతుడు అనే శేషతల్పంపై యోగనిద్రలో శయనించి ఉండే విష్ణువే అనంత పద్మనాభుడు. వేంకటేశ్వర స్వామికి చాలా దేవాలయాలు ఉన్నా, తిరుమలకి గొప్ప ప్రత్యేకత ఉన్నట్లే; అనంతపద్మనాభ స్వామికి కూడా,  కేరళలో తిరువనంతపురంలోది ప్రసిద్ద దేవాలయం.

ఈ దేవాలయం 1000 సంవత్సరాల పూర్వం కట్టబడిందట. తరువాత 18వ శతాబ్దంలో ట్రావెంకోర్ చేర రాజ వంశానికి చెందిన మార్తాండ వర్మ తనను తాను పద్మనాభ దాసునిగా ప్రకటించుకొని, ఈ దేవాలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. అప్పటినుంచీ ఇప్పటి వరకూ అతని వంశంవారే దేవాలయ బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది.

అత్యంత ప్రాచీన కాలం నుంచీ ఈ దేవుడి ప్రస్తావన పురాణాలలో ఉంది. కేరళ రాష్ట్రంలో విల్వమంగలత్తు స్వామియార్ (ఈయననే దివాకర ముని అనికూడా అంటారు) విష్ణుమూర్తి దర్శనం గురించి ప్రార్ధిస్తుండగా, ఆయన ఒక అల్లరి బాలుడి రూపంలో అక్కడికి వస్తాడట. పూజలో ఉంచిన సాలగ్రామ శిలని తీసుకొని నోటిలో పెట్టుకోవడంతో విల్వమంగలుడికి కోపం వచ్చి ఆ బాలుడిని పట్టుకోవడానికి అతని వెంటపడతాడు. కొంతదూరం పోయిన తరువాత ఆబాలుడు ఒక వృక్షంలోనికి చొచ్చుకొనిపోవడం కనిపిస్తుంది. అప్పుడు ఆ వృక్షం క్రిందపడి శేషసయనంగా మారుతుంది. విష్ణువు అత్యంత పొడవైన మూర్తిగా దానిమీద దర్శనం ఇస్తాడు. అంత పొడవైన రూపాన్ని ఒకేసారి చూడగలగడం అసాద్యమౌతుందని విల్వమంగలుడు ప్రార్ధించగా, భగవంతుడు తన పొడవుని తగ్గించుకొంటాడట. అప్పుడు కొన్నిచెట్లు అడ్డు రాగా వాటి వెనుకనుంచి విల్వమంగలుడు, విష్ణుమూర్తిని మూడు భాగాలుగా చూస్తాడు. ఇప్పటికీ తిరువనంతపురం దేవాలయంలో మనం అనంత పద్మనాభుడిని ఆవిధంగానే మూడు ద్వారాలద్వారా మూడుభాగాలుగా దర్శించుకోగలం. విల్వమంగలుత్తు స్వామియార్ నిర్దేశించిన ప్రకారంగానే సాంప్రదాయబద్దంగా ఇప్పటికీ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు.
Tiruvanamtapuram temple 
ఆ విషయాలు ప్రక్కనపెడితే, అసలు ఈ దేవాలయ నేల మాళిగలలో నికి లక్ష కోట్ల రూపాయల సంపద ఎలా వచ్చింది?

పద్నాలుగు, పదిహేను శతాబ్ధాలకాలంలో యూరోపియన్ దేశాలు, మన దేశంతొ సుగందద్రవ్యాల వ్యాపారం చేసేటప్పుడు, మలాబార్ తీరంలో ఉన్న ఈ ప్రాంతానికి అనంతంగా సంపద వచ్చిచేరిందని చెబుతారు. దానితో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విజయనగరరాజులు, చేరరాజులు, పురప్రముఖులు, సాధారణ ప్రజలు.ఇబ్బిడి ముబ్బిడిగా పద్మనాభుడికి కానుకలు సమర్పించి ఉండవచ్చు. తరువాతి కాలంలో డచ్చివారినుంచి, బ్రిటిష్ వారినుంచి, పొరుగు రాజయిన టిప్పు సుల్తాన్ నుంచి ఈ రాజ్యానికి ముప్పుపొంచి ఉండడంతో 18 శతాబ్ధంలో ఈ గుడిని పునర్నిర్మించినప్పుడు సంపదనంతా నేలమాళిగలలో బద్రపరిచారు. అదే ఇప్పుడు బయటపడిన బంగారు గని.
ట్రావెంకోర్ వంశీయుల రాజభవనం. ఫోటో సోర్స్: ద హిందూ న్యూస్ పేపర్
ప్రస్తుత మహారాజా ఆఫ్ ట్రావెంకోర్: Thirunal Marthanda Varma
ప్రపంచం అంతా లక్షల కోట్ల సంపద గురించి అబ్బురపడుతుంటే, ఈ గుడి యొక్క అనువంశిక ధర్మకర్త, ప్రస్తుత రాజు తిరుణాల్ మార్తాండ వర్మ, తాను కేవలం ఆ స్వామికి దాసుడిని మాత్రమే అనీ, ఆ సంపద అంతా కేవలం దేవుడికే చెందుతుందని చెబుతారు. ఇంత సంపద దేవాలయ నేళమాలిగల్లో ఉందని వాటిని తెరవక ముందే వీళ్ళకి తెలుసు. దేవాలయం నుంచి  వెళ్ళేటప్పుడు కాలికి అంటుకొన్న ఇసుకరేణువులనికూడా శుబ్రంచేసుకొని అడుగు బయటకు వేస్తారట. దేవుడికి చెందిన ఇసుకరేణువు కూడా తీసుకోరాదనే నియమమే దీనికి కారణం. ఆయన మాటలలో దేవుడి పట్ల అచంచల విశ్వాసం కనిపిస్తుంది. 90 సంవత్సరాల వయసులో ప్రతిరోజూ దేవాలయానికి వెళతారు. ఏదయినా కారణంతో ఒకరోజు వెళ్ళలేక పోతే అది ఒక శిక్షగా భావించి, 166 రూపాయల 35 పైసలు పెనాల్టీగా దేవాలయానికి చెల్లిస్తారు. ఇది ఒక సాంప్రదాయం. ఈ రాజ వంశంలో మాత్రుస్వామ్య వ్యవస్థ నడుస్తుందట; ఈయన తరువాత మేనగోడలు వారసురాలిగా రాణీ అవుతుంది. రాజ్యాంగ పరంగా మిగిలిన పౌరులు లాంటి వాళ్ళే అయినా, ప్రజలు మాత్రం ఈయనని మహారాజు లానే వ్యవహరిస్తారట. కొంతకాలం క్రితం ద హిందూస్తాన్ టైంస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్తాండ్ వర్మ ఈ విశేషాలు చెప్పారు. ధనం కోసం, అధికారం కోసం గడ్డి కరుస్తున్న నాయకులున్న ప్రస్తుత సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఉండడం ముదావహం.

-అందుకే ఈ పోస్టు.

కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి అనంతసంపద గురించిన వీడియోలు ఇక్కడ చూడండి.

1. Seven Wonders of India: Sri Anantha Padmanabha Swamy:

2. తిరుమల వేకటేశ్వరుని కంటే అనంతపద్మనాభుడే ధనవంతుడయిన దేవుడు:
6. దేవాలయ చరిత్ర ఫార్ట్ -3:
© Dantuluri Kishore Varma

Tuesday, 25 September 2012

కడియం నర్సరీలు

పూలమొక్కలు; లాండ్ స్కేప్ డిజైనింగ్ కోసం ఉద్యానవనాలలో ఉపయోగించే ఆర్నమెంటల్స్ అనబడే మొక్కలు; పార్కుల్లో, బంగళాల్లో, ఫాక్టరీలలో, స్టార్ హోటళ్ళలో రహదారికి ఇరువైపులా ఒకే సరళరేఖలో పెంచే ఎవెన్యూ ప్లాంట్స్; ఆకారంలో కొబ్బరి మొక్కలను పోలి ఉండే పాం(palm) జాతి మొక్కలు; మన డ్రాయింగ్ రూములలో పెంచుకొనే ఇండోర్ ప్లాంట్స్; అలంకరణ మొక్కలు; ఎప్పుడూ పచ్చదనంతో ఉండి వేగంగా పెరిగే  ఫికస్ జాతి మొక్కలు; పండ్లమొక్కలు; బోనసాయి వృక్షాలు; విదేశాలలో మాత్రమే కనిపించే అరుదైన పూల రకాలని  దేశీయ వాతావరణ పరిస్థితులలో కూడా పెరిగేలా సంకర పరచిన మొక్కలు...అన్నీ దొరికేవి మన తూర్పుగోదావరిజిల్లా కడియపులంక మరియూ పరిసర ప్రాంతాలలో మాత్రమే!   
కాకినాడనుంచి 45 కిలోమీటర్లదూరంలో కడియపులంక ఉంది. పేరుకి కడియం నర్సరీలు అని వ్యవహరిస్తున్నా, కేవలం కడియంలోనే కాకుండా ఆ పరిసరాలలో ఉన్న వెంకయ్యమ్మపేట, పొట్టిలంక, కడియపుసావారం, వీరవరం, దామిరెడ్డిపల్లి, వేమగిరి మొదలైన ఊళ్ళల్లో వేలకొలదీ ఎకరాలలో వందలకోద్దీ నర్సరీలు ఉన్నాయి. సారవంతమైన భూమి, గోదావరికి దగ్గరగా ఉండడంవల్ల పుష్కలమైన నీటిపారుదల వ్యవస్థ కడియం పరిసర ప్రాంతాలని పూలసజ్జగా మార్చింది. ఇటువంటి భౌగోళిక పరిస్థితులు చాలా చోట్ల ఉన్నా, ఇక్కడి నర్సరీ నిర్వాహకులు ఈ ప్రాంతానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ని తీసుకు రాగలిగారు. ఇది కేవలం రైతులకో లేక కేవలం వ్యాపారవేత్తలకో సాధ్యం కాదు. వీళ్ళు వ్యాపారరైతులు, రైతువ్యాపారస్తులు.
తక్కువఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి సాధించడం, కొత్త వెరైటీలని ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకొని అభివృద్ది పరచడం, పనివాళ్ళ సంక్షేమం, వినియోగదారుల సంతృప్తి, మార్కెటింగ్ మొదలైన అంశాలు ప్రధానమైనవని పల్లా వెంకన్న నర్సరీ యజమానులలో ఒకరైన శ్రీ సత్యన్నారయణ మూర్తి నాతో అన్నారు. నేను నర్సరీని సందర్శిస్తున్న సమయంలో చెన్నై నుంచి వచ్చిన ఒక కస్టమర్ పెద్ద ఎత్తున మొక్కలని కొంటున్నారు.    నాణ్యమైన మొక్కల ఉత్పత్తిలో దేశంలోనే ఈ నర్సరీలకి మంచి పేరు ఉందట. ఈ మధ్య ఒమన్, జోర్డాన్, మస్కట్ దేశాలకికూడా పూల, పండ్ల మొక్కలని ఎగుమతిచేశారు.
ఒక చల్లని సాయంత్రాన్ని కడియం నర్సరీలలో గడిపితే ఒక మరపురాని జ్ఞాపకం మనసులో పదిలమౌతుంది.

© Dantuluri Kishore Varma

Friday, 7 September 2012

పాదగయ - పిఠాపురం

కాకినాడకి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో అన్నవరం వెళ్ళే దారిలో 214 హైవే ప్రక్కన ప్రాచీనమైన పాదగయ క్షేత్రం ఉంది. పిఠాపురం చిన్న పట్టణమైనా, పౌరాణికంగా, చారిత్రకంగా నేపద్యం ఉన్న పురాతనమైన ప్రదేశం. దీని విశిష్టత ఏమిటంటే - ఇది త్రిగయక్షేత్రాలలో మూడవది, అష్టాదశ శక్తిపీఠాలలో పదవది,  శ్రీదత్త అవతారాలలో ఒకటయిన శ్రీపాద శ్రీవల్లభ యొక్క జన్మస్థానము. 
పాదగయ, కుక్కుటేశ్వరస్వామి: కుక్కుటము అంటే కోడిపుంజు. గయాసురుడనే ఒక రాక్షసుడిని సంహరించడానికి ఈశ్వరుడు కోడి రూపం ధరించాడని ఈ స్థలపురాణం తెలియజేస్తుంది. నిజానికి రాక్షసులు  కౄరులై ఉంటారు. కానీ, గయాసురుడు భాగవతోత్తముడు. విష్ణువునిగురించి తపస్సు చేసి పరమ పవిత్రమైన దేహం కావాలని కోరుకొంటాడు. ఇతను చేసిన పుణ్యకార్యాలవల్ల ఇంద్రపదవి లభిస్తుంది. కానీ పదవీత్యుడైన ఇంద్రుడు త్రిమూర్తులని ప్రసన్నంచేసుకొని తనపదవిని తనకు ఇప్పించమని కోరతాడు.

త్రిమూర్తులు బ్రాహ్మణ వేషాలలో గయాసురుడి దగ్గరకు వెళ్ళి, ఒక విశేషమైన యజ్ఞం చేస్తున్నామని, అందుకోసం గయాసురుని పవిత్రదేహం ఏడురోజులపాటు కావాలని అడుగుతారు. గయాసురుడు అంగీకరిస్తాడు. ఒప్పందం ఏమిటంటే, యజ్ఞం పూర్తికాకుండా పీఠంగా ఉన్న శరీరం కదలకూడదు.  

గయాసురుడు తనదేహాన్ని యజ్ఞపీఠంగా చేసి  శిరస్సు బీహారు గయలో(శిరోగయ), నాభి ఒరిస్సా జాజిపూర్లో(నాభిగయ), పాదాలు ఆంద్రప్రదేశ్ పిఠపురంలో(పాదగయ) ఉండేటంత పెద్దగా శరీరాన్ని పెంచుతాడు. విష్ణువు తలభాగంలో, బ్రహ్మ నాభి దగ్గర, ఈశ్వరుడు పాదముల దగ్గర ఉండి యజ్ఞంచెయ్యడం ప్రారంభించారు. గయాసురుడు కేవలం కోడి కూతనుమాత్రమే వింటూ శరీరం కదలకుండా ఆరురోజులు ఉంటాడు. కానీ, అతనిని సంహరించే ఉద్దేశ్యంతోనె ఇది అంతా జరుగుతుందికనుక  విష్ణుమూర్తి ఆలోచన అనుసరించి శివుడు ఏడవరోజు రాకుండానే కోడి వేషము ధరించి కూతవేస్తాడు. గడువు ముగిసిందని భావించిన గయాసురుడు దేహాన్ని కదిలించడంతో వదించబడతాడు. 
ఇక్కడి స్వామి కుక్కుట లింగేస్వరస్వామి ఆయన దేవేరి శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారు. ఈమెని ఈ క్షేత్రంలో శ్రీఆదిశంకరాచార్యలవారు ప్రతిష్ఠించారట. 
పురుహూతికా అమ్మవారు - పదవ శక్తిపీఠం: దక్షప్రజాపతి కుమార్తె సతీదేవి పరమేశ్వరుని భార్య. ఒకసారి దక్షుడు యజ్ఞం చేస్తూ  ఈశ్వరుడికి ఆహ్వానం పంపడు. సతీదేవి తండ్రి చేస్తున్న యాగమే కనుక ఆహ్వానం లేకపోయినా వాత్సల్యంతో అక్కడికి వెళ్ళి అవమానింపబడుతుంది. అవమానభారంతో ఆమె అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. కోపోద్రిక్తుడైన శివుడు తనగణాలతో ఆ ప్రదేశాన్ని సర్వనాశనం చేసి సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకొని విరక్తుడై తిరుగుతాడు. 
ఏకశిలానంది
ఈ విధమయిన వైరాగ్యం మంచిదికాదు కనుక, విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. అప్పుడు ఆ ఖండికలు 108 చోట్ల పడతాయి. వాటిలో ముఖ్యమైన 18 భాగాలు పడిన ప్రదేశాలని అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. వాటిలో పిఠాపురం ఒకటి.  తుంటి భాగం పడిన ప్రదేశం కనుక ఇది పురుహూతికా అయ్యింది. మిగిలిన పదిహేడు శక్తిపీఠాలలో ఉన్న అమ్మవారి నమూనా ప్రతిమలను మనం ఈ మందిరంలో చూడవచ్చు.
శ్రీదత్త అవతారాలలో ఒకటయిన శ్రీపాద శ్రీవల్లభ యొక్క జన్మస్థానము. విగ్రహమూర్తి స్వరూపంలో ఉన్న ఒకేఒక దత్తక్షేత్రమిదేనట. శ్రీగురుచరిత్ర అనే గ్రంధంలో ఈ జన్మ వృత్తాంతం వివరంగా ఉంది.
వ్యాస మహర్షి ఈ ప్రదేశాన్ని సందర్శించి, వ్రాసిన స్కాందమహాపురాణమునందు భీమఖండం లో 36 శ్లోకాలలో పిఠాపురం గురించి వర్ణించి చెప్పాడు.ఈ భీమఖండమునే మహాకవి శ్రీనాధుడు భీమేశ్వర పురాణంగా తెలుగులో రచించడం జరిగింది. అంతే కాకుండా - ఆంధ్ర శాతవాహనులు,వెళనాటి చోళుల వంటి రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లు శాశనాలవల్ల తెలుస్తుంది.

Monday, 3 September 2012

సేవే మార్గం - సంకురాత్రి చంద్రశేఖర్

ఒకసారి ఒక మహిళ దు:ఖిస్తూ గౌతమ బుధ్ధుడి దగ్గరకి వచ్చి, మరణించిన తన కొడుకుని బ్రతికించమని వేడుకొందట.అప్పుడు బుద్దుడు ఆమెని ఆవూరిలో మరణం సంభవించని ఏదైనా ఇంటినుంచి ఒక గుప్పెడు నువ్వులు తీసుకొనివస్తే ఆ కుర్రవాడిని బ్రతికిస్తానని వాగ్దానం చేస్తాడు. ఆమె రోజంతా ఇంటింటికీ తిరిగి సాయంత్రానికి ఒట్టి చేతులతో తిరిగివస్తుంది. మరణంలేని ఇల్లులేదు. పునరపి జననం, పునరపి మరణం అంటారు- పుట్టినవారు గిట్టక తప్పదు; ఆప్తులకి విషాదమూ తప్పదు.  

కానీ, జ్ఞాపకాల స్పూర్తినుంచి సామ్రాజ్యాలు నిర్మించగలగడం కేవలం డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ లాంటి అరుదైన స్థిత ప్రజ్ఞులకిమాత్రమే సాధ్యం అవుతుంది. ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఎస్.సి. జుయాలజీ పూర్తిచేసి, కెనడాలో పి.హెచ్.డి.చేసి, అక్కడే శాస్త్రవేత్తగా పనిచేస్తున్న చంద్రశేఖర్ గారు కాకినాడ అమ్మాయి  మంజరిని వివాహం చేసుకొన్నారు. వారికి ఇద్దరు సంతానం - శ్రీకిరణ్, శారద. జీవితం కమ్మగా సాగే పాటే కానీ...


1985లో కెనడా నుంచి ఇండియా వస్తున్న ఎయిర్ ఇండియా విమానం కనిష్క ఖలిస్తాన్ తీవ్రవాదుల విద్రోహచర్య కారణంగా అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయింది. దానిలో ప్రయాణిస్తున్న 329 మంది ప్రయాణికుల్లో దురదృష్టవశాత్తూ శ్రీమతి మంజరీ, శ్రీకిరణ్ మరియూ శారదా కూడాఉన్నారు. అఖాతంలాంటి విషాదం. విధి కుట్రచేసి తనని ఈ ప్రపంచంలో ఒంటరిని చేసిందేమో! 
'పేదరికంలేని, ఆరోగ్యవంతమైన విద్యావంతుల సమాజం ఉంటే ఎంతబాగుంటుంది!' అనే శ్రీమతి మంజరి కల నిజంచేయడానికి మంజరి సంకురాత్రి మెమోరియల్ ఫౌండేషన్ స్థాపించి ఒక నిస్వార్ధ సేవా సామ్రాజ్యాన్ని కాకినాడకి దగ్గరలో అచ్చంపేటలో నిర్వహిస్తున్నారు డాక్టర్ చంద్రశేఖర్. కుమారుడు శ్రీకిరణ్ జనావళి కంటి కిరణంకావాలి; కుమార్తె శారద చిట్టి చెళ్ళెళ్ళ, చిన్ని తమ్ముళ్ళ నాలుకల మీద బీజాక్షరం కావాలి. అందుకే - అత్యాధునికమైన శ్రీకిరణ్ కంటి ఆసుపత్రీ, నిబద్దత అడుగడుగునా కనిపించే చదువులమ్మ బడి శారదావిద్యాలయమూ.  
శ్రీ కిరణ్ కంటి హాస్పిటల్ ద్వారా 1,53,000 కంటి ఆపరేషన్లు చేశారు. వీటిలో సుమారు తొంబై శాతం ఉచితం. గ్రామీణప్రాంతాలలో, పట్టణాలలో తమవద్దకు రాలేని అభాగ్యులకు `ఔట్ రీచ్` కార్యక్రమం ద్వారా కంటి వైద్య శిబిరాలు నిర్వహించి, శస్త్రచికిత్స అవసరం అయినవారిని గుర్తించి, ఫౌండేషన్ బస్సులలో హాస్పిటల్కి తరలించి, ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నరు. మందులు, కళ్ళజోళ్ళు కూడా ఉచితం. అత్యుత్తమమైన డాక్టర్లు, ఆధునికమైన పరికరాలు, పరిశుబ్రమైన చక్కటి గదులు, సేవాభావం అణువణువునా నింపుకొన్న సిబ్బంది.
 తూర్పుగోదావరిలో ఇప్పటివరకు నిర్వహించిన ఐ క్యాంపులు
ఇక శారదా విద్యాలయం విషయానికి వస్తే; దీనిని 1992లో ప్రారంభించారు. చదువు`కొన`లేని నిరుపేదలకి ఉచితవిద్య అందించడమే లక్ష్యం. యూనీఫాం, బుక్స్, ట్రాన్సుపోర్ట్ సౌకర్యాలు కలుగజేసి ఆశ్రమంలాంటి పరిసరాలలో విద్యాబుద్దులు నేర్పిస్తున్నారు.
సాయంత్రం నాలుగు గంటలసమయంలో కూడా పరిశుబ్రమైన స్కూల్ డ్రేస్సులో మెడిటేషన్ చేస్తూనో, డ్రిల్ చేస్తూనో, క్రాఫ్ట్ క్లాసులో చక్కనిబొమ్మ తయారుచేస్తూనో, ముత్యాల్లాంటి చేతివ్రాతతో నోట్ బుక్కులో ఏదో వ్రాస్తూనో విద్యార్దులు చక్కటి క్రమశిక్షణకి మారుపేరుగా కనిపిస్తారు.క్లాసురూంకి పది నుంచి పదిహేనుకి మించని విద్యార్ధులు. లైబ్రరీ, సైన్సు లేబ్, కంప్యూటర్ లేబ్, క్రాఫ్ట్ రూం, ఫైన్ ఆర్ట్ రూం, ప్లే గ్రౌండ్. ఇక్కడి చదువు ఒక యోగం.శారదా విద్యాలయంలో పదవతరగతి పూర్తిచేసుకొన్న తరువాత విద్యార్ధులు ఒకేషనల్ ట్రయినింగ్ కూడా పొందవచ్చు.
"సార్ (డాక్టర్ చంద్ర) ప్రతిరోజూ ఒకక్లాస్ చెబుతారు. హేండ్ రైటింగ్ నేర్పించేటప్పుడు తనే స్వయంగా విద్యార్ధుల పుస్తకాలలో గీతలు గీస్తారు. మేము చేస్తామన్నా ఆయన ఒప్పుకోరు," అని ఒక టీచర ఆయన గురించి చెబుతున్నప్పుడు లీడర్ అంటే ఏమిటో మనకి అర్ధం అవుతుంది.  

ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆపన్నులను ఆదుకోవడానికి స్పందన అనే సేవాకార్యక్రమం కూడా సంకురాత్రీ ఫౌండేషన్ నిర్వహిస్తుంది.విశ్వవ్యాప్తమైన ప్రేమ, నిస్వార్దమైన సేవలకు మారుపేరు డాక్టర్ చంద్రశేఖర్. రిలయన్స్ రియల్ హీరోస్ ఆఫ్ ఇండియా లాంటి అవార్డులెన్నో ఆయనని వెతుక్కోంటూ వచ్చాయి.
సంకురాత్రీ ఫౌండేషన్ ద్వారా అన్నో మంచి పనులు జరుగుతున్నాయి. వాలంటిరుగా మనమూ వాటిలో పాలుపంచుకోవచ్చు; డొనేషన్ల రుపంలో `నేనుసైతం` అని ఆపన్నులకు అభయహస్తం అందించవచ్చు. లేదా సేవే శాశ్వత సత్యం అని మార్గనిర్దేశం చేస్తున్న మహానీయులనుంచి స్పూర్తి పొందవచ్చు. 
 డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ గారితో నేను. 
 © Dantuluri Kishore Varma
Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!