Pages

Sunday 29 June 2014

విసుగునంతా `ఉఫ్!` అని ఊది పారేస్తాయి

బహుళ అంతస్థుల భవనాలు, మేడలు, గుడిసెలు, షాపులు, ఎత్తైన విగ్రహాలు, కరెంటు స్థంభాలు, అక్కడక్కడా చెట్లు... నగరాల్లో ఇవన్నీ రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కోచోట అస్తవ్యస్తంగా చిక్కులు పడిపోయినట్టున్న కరెంటు వైర్లు, హోర్డింగులు, అడ్డదిడ్డంగా కట్టిన బిల్డింగులు, ఫ్లెక్స్ బ్యానర్లు చూస్తున్న కళ్ళకి విసుగు పుట్టిస్తాయి. వాయు కాలుష్యం, నీటికాలుష్యం లాగా ఇది దృశ్య కాలుష్యం. 

బైకులోనో, కారులోనో వేగంగా పోతూ ఉంటామా.. ఈ దృశ్య కాలుష్యాన్ని చూసి నగరజీవితమంటేనే విసుగుపుట్టేస్తుంది. కానీ అంతలోనే అకస్మాత్తుగా ఏ ఆలయ గోపురాలో, మసీదు గుమ్మటాలో, మీనార్లో కనిపించి మన విసుగునంతా `ఉఫ్!` అని ఊది పారేస్తాయి. సరిగ్గా ఆ సమయానికి మనదగ్గర కెమేరా ఉందనుకోండి, ఆగ గలిగిన వెసలుబాటు ఉంటే ఓ స్నేప్‌ని `స్నిప్` మనిపించి ముందుకు పోవడమే.   

అలా మనసుకి నచ్చిన ఫోటోలు తీసి, అవకాశం ఉన్నంత మేర  మీతో పంచుకొంటూ ఉంటాను. కావాలంటే చూడండి నా బ్లాగ్‌నిండా గుళ్ళు, గోపురాలు.. వగైరా ఎన్నో కనిపిస్తాయి. అవన్నీ చూసి మీరంతా నేనేదో పేద్ద భక్తుడిని అనుకొనే ప్రమాదం కూడా లేకపోలేదు. 

అసలు విషయం వదిలి పెట్టేసి ఎక్కడికో వచ్చేశాను చూశారా? అప్పుడెప్పుడో వైజాగ్ వెళ్ళినప్పుడు మురళీ నగర్ ఏరియాలో అలా పోతూ, పోతూ అందంగా కనిపించిన ఈ మసీదుని కెమేరాలో బంధించాను. రేపటి నుంచి ముస్లిం సోదరుల ఉపవాసమాసం రంజాన్ మొదలవుతుంది కదా? అందుకే అందరికీ రంజాన్ ముబారక్ చెపుతూ ఈ చాయాచిత్రం. 
© Dantuluri Kishore Varma 

Saturday 28 June 2014

చిల్లంగి

తొలి తిరుపతి అని పిలిచే వేంకటేశ్వరస్వామి గుడికి ఎలా వెళ్ళాలో దారి తెలియదు. `పలానా కిర్లంపూడి దాటిన తరువాత దివిలికి దగ్గరగా ఉంటుంది. చాలా పురాతనమైన గుడి. ఎవరిని అడిగినా దారి చూపిస్తారు,` అని చెప్పారు ఎవరో.  కిర్లంపూడి ఊరు తగిలిన దగ్గరనుంచి అక్కడక్కడా జనాలని `వెంకన్నబాబు గుడికి దారెటు?` అని అడుగుతూ, వాళ్ళు చూపించిన వైపుకి పోయాం. కొంతసేపటికి రంగులు వెయ్యని పాతగా కనిపిస్తున్న ఓ గుడిని చేరుకొన్నాం. నిజానికి అది మేం వెతుకుతున్న తొలితిరుపతి కాదని తెలియదు. తూర్పుగోదావరిజిల్లా కిర్లంపూడి మండలంలో చిల్లంగి అనే ఊరు.  దేవాలయం ప్రశాంతంగా ఉంది. గుడిమీద బొమ్మలు కళాత్మకంగా, నాజూకుగా ఉన్నాయి. గుడిప్రక్కనే ఉన్న ఇంటిలోనుంచి పూజారిగారు వచ్చి, గర్భగుడి తలుపులు తీశారు. మంచి దర్శనం అయ్యింది. ఇక్కడి నుంచి వివరం తెలుసుకొని తొలి తిరుపతికి కూడా వెళ్ళామనుకోండి(ఆ పోస్టు ఇదిగో ఇక్కడ చదవండి)

చిల్లంగి గుడి ఫోటోలు చూడండి.




© Dantuluri Kishore Varma 

Saturday 21 June 2014

డెడ్‌లైన్స్ ఎందుకు?

అనుకోకుండా ఒక్కోసారి అవకాశాలు అలా కలిసివచ్చేస్తూ ఉంటాయి. వాటిని కాదని తోసిపుచ్చలేం, అవునని అందిపుచ్చుకోలేం. నేషనల్ హైవే ప్రక్కన నాలుగు గంటల నిరీక్షణ ఎంత ఫిలాసఫీని తీసుకొచ్చేసిందో చూడండి. ఉదయం ఎనిమిది గంటలకి ఎండలో వేడి సుర్రుమనిపించకముందే కారు ఇంజను హీటెక్కిపోయింది. ఈ రోజు ప్రయాణం ఉందని తెలిసి నిన్నరాత్రి తనని అద్దంలా మెరిసిపోయేలా తుడిచాననే కృతజ్ఞత కూడా లేకుండా ఈ కారు టక్కున ఆగిపోయింది. ఫోన్‌చేసి  పిలిచిన మెకానిక్ అరవై కిలోమీటర్ల దూరం నుంచి రావడానికి మిట్టమిడసరం అయ్యింది. ర((య్, ర((య్ మని దూసుకుపోతున్న కార్లు, లారీలు; హార్స్ పవర్ సరిపోకపోయినా వాటితో పోటీపడి ముందుకు వెళ్ళిపోవాలనుకొంటున్న ఆత్రపు ఆటోలు; నిండు గర్భిణిల్లా ఆర్టీసీ బస్సులు; నత్త నడకల సైకిళ్ళు; ఎక్కడికీ వెళ్ళకుండా నిశ్చలంగా నేషనల్ హైవే, నేనూ సహవాసం చేశాం. 
పదవుతూ ఉండగా ఒక నడివయసు వ్యక్తి బొబ్బాయ కాయలు బుట్టలో పెట్టుకొని, సైకిల్ వెనుక కారియర్కి కట్టి తీసుకొని వచ్చాడు. చెట్టుక్రింద చిన్న నీడలో పిండిసంచి పరచి, దానిమీద కాయలని పేర్చాడు. ఒక ముగ్గిన కాయ తీసుకొని తొక్క చెక్కి, చీరికలు చేసి, ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లో వేసి సైకిల్ హ్యాండిల్కి తగిలించాడు. వేగంగాపోయే వాహనాలు తప్ప పెద్దగా మనుష్యసంచారం లేని ఈ ప్రదేశంలో బొప్పాయి చీరికలు అమ్మే అదృష్టం ఈతనికి ఉంటుందా అనే సందేహం కలుగుతుంది. రెండవ కాయ చెక్కుతున్నాడు. `అది కూడా తగిలిస్తాడా?` అనుకొంటూ ఉన్నాను. చెక్కడం పూర్తయ్యింది. ఎవరో వచ్చి మొదటి సంచితో తగిలించిన చీరికలని కొనుక్కొని పోయారు. దాని ప్లేస్‌లో రెండవ సంచి తగిలించాడు. ఒకే వేగంతో ఆ వ్యక్తి అలా తన పనిని చేస్తూనే పోయాడు. రెండు గంటల సమయంలో ఎప్పుడూ ఒకేసారి రెండు సంచులు సైకిల్ హ్యాండిల్‌కి తగిలించి లేవు. ఆ వ్యక్తి కాయలను చెక్కకుండా ఎప్పుడూ లేడు.    

`భోజనం తెచ్చుకొన్నావా? సాయంత్రం వరకూ ఇక్కడే ఉండి కాయలు అమ్ముతావా?` అని అడిగాను. మద్యాహ్నం మూడుగంటల వరకూ ఉంటానన్నాడు. మిగిలిన కాయల్ని మరునాడు అమ్ముకొంటాడట. `ఎవరో ముందుగానే నిర్ణయించినట్టు సరిగ్గా కాయ తరువాత కాయ ఎలా అమ్ముడుపోతుంది?` అన్నాను. `అంతా దేవుడి దయ,` అన్నట్టు ఆకాశం కేసి చెయ్యిచూపించాడు. 

అతను చెప్పలేదు కానీ ఆ ప్రదేశంలో గంటకి మూడు, నాలుగు కాయలు అమ్మగలిగినంత సంభావ్యత ఉంటుందని రోజూ వ్యాపారం చేస్తున్న అతనికి తెలుసు. కాబట్టి తన వేగాన్ని నియంత్రించుకొని పావుగంటకి ఒక్కొక్క కాయ చొప్పున చెక్కుతున్నాడు. ఒకవేళ ఆ వ్యక్తి కొంచెం  జనాలు ఎక్కువగా నడిచే ప్రదేశంలో తన వ్యాపారాన్ని చేస్తూ ఉంటే గంటకి ఎనిమిదో, పదో కాయలు ఆమ్మి ఉండేవాడు. అప్పుడు తప్పని సరిగా వేగం పెంచాలి. అయిదారునిమిషాలకి ఒక్కో బొప్పాయికాయిని చెక్కాలి.   

`మద్యాహ్నం మూడు తరువాత కాయలకోసం ఎవరైనా వస్తే, నువ్వు లేకపోతే ఎలాగా?` అన్నాను. ఎవరూ రారన్నాడు. `ఎందుకని,` అడిగితే చిరునవ్వు నవ్వి ఊరుకొన్నాడు. బహుశా కారణం తనకు తెలియదేమో!

నిజానికి ఎవరూ, ఏమీ అమ్మని చోట ఎవరైనా ఏమి కొనుక్కోవడానికి ఆగుతారూ?

*     *     *

ఈ రోజు ఎన్నో పనులు పూర్తిచెయ్యాలని ఊరికి బయలు దేరాను. చాలా వ్యవహారాలున్నాయి. తొందరగా మొదలు పెట్టకపోతే అన్నింటినీ పూర్తిచెయ్యలేను. రోడ్డువార నిరీక్షణవల్ల అవన్నీ ఏమయిపోతాయి? నాలుగు గంటల ఆలస్యం అయినా  అనుకొన్న పనులన్నీ సాయంత్రానికి పూర్తయిపోయాయి! `ఎలా?` అంటే బొప్పాయి కాయలమ్మే వ్యక్తిలా నేను ఆకాశం కేసి చెయ్యి చూపించను. ఎందుకంటే అతని ద్వారానే ఈ రోజు నాకొక విషయం బోధపడింది. అందుబాటులో ఉన్న సమయమే పనులయొక్క వేగాన్ని నిర్ణయిస్తుందని. 

కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులకి డెడ్‌లైన్స్ అందుకే ఇస్తారేమో! 
 © Dantuluri Kishore Varma 

Wednesday 18 June 2014

నాతో దేవాలయం వీధిలో నడచి వస్తే...

దేవాలయం వీధిలో నడిపిస్తూ తీసుకొని పోయి అక్కడక్కడా కొన్ని విశేషాలని చూపిద్దాం అనుకోంటున్నాను. నాతో పాటూ నడుస్తారా? అయితే పదండి. మొట్టమొదటిగా ఓం నమశివాయ: అనుకొని పెద్ద శివాలయాన్ని చూడండి. తిలక్ వీధికి ఎదురుగా ఉంటుంది ఇది. తిలక్ వీధి గురించి తెలుసా మీకు? శేట్‌ల షాపులు ఉంటాయి ఈ వీధిలో. రెడీమేడ్ బట్టలు, పెర్‌ఫ్యూంలు, సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్ముతారు. `నచ్చితే తీసుకో, ధరమాత్రం తగ్గించేది లేదు,` అని వాళ్ళు చెపితే  చచ్చినట్టు కొనుక్కోవలసిందే. మరొక చోటుకు వెళ్ళి కొనుక్కొందాం అంటే, మరెక్కడా దొరకవు అలాంటి వస్తువులే! 
చూశారా, మాటల్లో పడి ఆంజనేయస్వామి ఆలయం దాటేశాం. అయినా మరేమీ పరవాలేదులెండి గుడికి వెనుక నుంచయినా ఒక స్నాప్ లాగుదాం.  
ఫుడ్ ఎసెన్స్, ఐస్క్రీం పౌడర్, టేస్టింగ్‌సాల్ట్, ఫుడ్‌ప్రిజర్వేటివ్స్ లాంటివి అమ్మే బాదం వాళ్ళ షాపులు దేవాలయం వీధిలోనే ఉన్నాయి.  వీధిలో ఈమధ్యన వరుసగా జ్యుయలరీ షాపులు ఓపెన్ చేశారు. అన్నట్టు గీతా మందిరం కూడా ఇక్కడే ఉంది. అవన్నీ దాటిన తరువాత వేణుగోపాలస్వామి గుడి, టీటీడీ కళ్యాణ మండపం ఉన్నాయి. వాటి సంగతి మరొక సారి చెపుతాను కానీ, ఇదిగో ఇలా చూడండి బాలాజీ చెరువుకు వచ్చేశాం.   
సామర్లకోట వైపు నుంచి వచ్చే బస్సులు, ఆటోలు ఇక్కడ ఆగుతాయి. కాకినాడ మెయిన్‌రోడ్డుకి వెళ్ళాలంటే ఇక్కడే దిగాలి. భానుగుడి జంక్షన్ లాగే బాలాజీ చెరువు కూడా ముఖ్యమైన జంక్షన్. ఇక్కడి నుంచి మిమ్మల్ని ఎడమచేతి వైపుకు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ వైపుకు కాకుండా, కుడి చేతివైపుకి తీసుకొని వెళతాను. ప్రైవేట్ నర్సింగ్‌హోంలు, ఫైరాఫీసు, పెట్రోలు బంకులూ దాటి పిండాల చెరువు దగ్గరకి వచ్చాం. ఇదిగో ఈ మధ్యనే నిలబెట్టిన ఘంటశాల వెంకటేశ్వర రావు గారి విగ్రహం. 
పిండాల చెరువు ఎప్పుడూ గుర్రపు డెక్కతో నిండి ఉండేది. దాన్ని తొలగించి చుట్టు ఫెన్సింగ్ కట్టి, మధ్యలో ధ్యానముద్రలో ఉన్న పరమేశ్వరుడ్ని పెట్టేసరికి ఈ ప్రాంతానికే ప్రత్యేకమైన అందం వచ్చింది. వెనుక త్రిపురసుందరి గుడి ఉంది. అమ్మవారికి పూలతో చేసే అలంకారం చూసి తీరవలసిందే.
పిండాల చెరువుకి ప్రక్కనే శ్రీరామచంద్రమూర్తి వారి గుడి ఉంది. 
నడచి, నడచి ఆయాసం వస్తుందా? అదిగో బాపూజీ ఆ వయసులో కూడా ఎంత వేగంగా నడచి వెళుతున్నారో చూడండి. రాజా పార్కులో విగ్రహం ఇది.
నూకాలమ్మ గుడి. ప్రతీ సంవత్సరం జాతర భలేగా జరుగుతుంది. మనఊళ్ళో మరొక ముఖ్య కూడలి. ఇంకొకసారి దీనిగురించి చెప్పుకొందాం. ఈ ట్రాఫిక్ లైట్ దగ్గర నుండి కుడి చేతి వైపుకి తిరిగి కొంచెం ముందుకు వెళదాం. టూటౌన్ జంక్షన్ వస్తుంది. ఇక్కడి నుంచి ఎడమకు తిరిగితే ఓవర్ బ్రిడ్జ్, కుడికి తిరిగితే మెయిన్‌రోడ్. 
బ్రిడ్జ్ ఎక్కుతూ ప్రక్కనే ఉన్న విష్ణాలయాన్ని కూడా చూసేయండి. 
ఇదేనండి ఓవర్బ్రిడ్జ్. దాటితే భానుగుడి జంక్షన్‌కి వెళతాం. దానిగురించి నిన్న చెప్పాను కదా? అయినా ముందుకి వెళదామా! వద్దులెండి. వెనక్కే వెళ్ళిపోదాం. ఏమంటారు?

© Dantuluri Kishore Varma 

Tuesday 17 June 2014

భానుగుడి జంక్షన్

కాకినాడలో భానుగుడి జంక్షన్ అత్యంత ముఖ్యమైన కూడలి. పిఠాపురం నుంచి వస్తూంటే ఏ.డీ.బీ రోడ్డు, ఏ.పీ.ఎస్.పీ, సర్పవరం, బోటుక్లబ్బు, నాగమల్లితోట జంక్షన్, జే.ఎన్.టీ.యూ దాటుకొని భానుగుడి జంక్షన్‌ని చేరుకొంటాం. మరొకవైపునుంచి కరణంగారి జంక్షన్ మీదుగా జే.పీ.టీ దాటి మిలట్రీ రోడ్డు నుంచి భానుగుడికి వస్తాం. ఈ కూడలికి కలిసే మరొక రోడ్డు టూటౌన్ నుంచి ఓవర్ బ్రిడ్జ్ దాటి ఆనంద్ దియేటర్ మీదుగా వచ్చేది. ఇవేకాక అటు శ్రీరాం నగర్ రోడ్డు, ఇటు బస్‌కాంప్లెక్స్ రోడ్డు.. ఆన్నీ ఇక్కడే కలుస్తాయి. 

సినిమాలకోసం వచ్చే వాళ్ళకి ఆనంద్, అంజనీ, గీత్, సంగీత్, పద్మప్రియ, శ్రీప్రియ థియేటర్లు ఇక్కడ ఉన్నాయి. ఉల్లి సమోసా తిని, చాయ్ తాగి, ఫ్రెండ్‌తో కొంత సేపు బాతాకానీ కొట్టాలంటే చార్మినార్ టీ సెంటరు; అధ్యాత్మికం అయితే అయ్యప్పగుడి, భానుగుడి, సూర్యనారాయణస్వామి గుడి ఉన్నాయి. యూత్ సెంటరు, హేంగ్ ఎరౌండ్ ప్లేస్ అయితే సుబద్రా ఆర్కేడ్ ఉంది. ఇంకా పళ్ళ డాక్టర్లు, కళ్ళ డాక్టర్లు, వాళ్ళ వాళ్ళ మందుల షాపులు, లాబొరేటరీలు, కోటయ్య కాజాల కొట్టు, జోళ్ళ షాపులు, కళ్ళజోళ్ళ షాపులు, మహేంద్రా స్వీట్ స్టాలు... అబ్బో ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. 

జ్ఞాపకాలని పోగేసుకోవడం కోసం, పోగొట్టుకొన్న జ్ఞాపకాలని ఏరుకోవడం కోసం కూడా ఇక్కడికి వస్తారు కొంతమంది. మీరు కాకినాడ వాళ్ళయితే, లేదా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఉండుంటే ఈ టపా చదువుతుండగా ఎప్పటివో మధుర స్మృతులు మీ మదిని మీటుతుండవచ్చు.  వాటిని మాతో పంచుకొంటే సంతోషిస్తాం. మీతోనే ఉంచుకొంటానంటే మరీ సంతోషం. 

హోప్ యూ హావ్ ఎంజాయ్డ్ రీడింగ్ దిస్ పోస్ట్!



© Dantuluri Kishore Varma

Monday 16 June 2014

ఒక్కో పాటా ఒక్కో జ్ఞాపకం

దేవుడు ఒకపాత్రలో అమృతాన్నీ, మరొక పాత్రలో తేనెని నింపి గాయకుల కంఠాల్లో మొదటిదాన్ని, శ్రోతల చెవుల్లో రెండవదాన్నీ పోస్తాడేమో!  పూర్వజన్మ సుకృతం లేక గాయకులం కాలేక పోయాం అనే బాధ ఉన్నా, ఏదో అదృష్టం ఉండి వాళ్ళు పాడిన పాటల్ని విని ఆనందించ గలుగుతున్నాం అనే తృప్తి  ఉంది. నా చిన్నప్పుడు  బాలసుబ్రహ్మణ్యం పాడిన లింగాష్టకం `బ్రహ్మ మురారి సురార్చిత లింగం..` అని దూరంగా ఉన్న శివాలయంలోనుంచి వినిపిస్తుంటే ఏ ఆటల్లో ఉన్నా చెవులు మాత్రం ఆ గానామృతానికి ఫిదా అయిపోయి ఉండేవి. ఘంటశాల పాడిన `నమో వేంకటేశా, నమో తిరుమలేశా..` పాట మా వూరు టూరింగ్ టాకీస్‌లో ఆట మొదలవడానికి ముందూ, అయిపోయిన తరువాతా తప్పని సరిగా వేసేవారు. ఈ పాట ఇప్పుడు మళ్ళీ వింటున్నా మసక చీకట్లో సినిమా హాల్లో రేకు కుర్చీల మధ్యనుంచి బయటకు రావడం, హాలులో పరుచుకొన్న చుట్టా, సిగరెట్, బీడీ పొగలూ కూడా జ్ఞాపకానికి వస్తాయి. ఘంటశాలో, ఎస్పీబినో గురించి `ఎంతబాగా పాడుతున్నారో!` అనే మెచ్చుకోలు మాటలు అనుకోగలిగినంత స్పృహ అప్పుడు లేదు. కానీ, నచ్చేపాటలకు చెవులు అప్పగించెయ్యడం నాకు ఊహ తెలిసిన దగ్గరనుంచీ ఉంది. ఓ పాట ఎందుకు నచ్చేదో తెలియకుండానే మనసులో హత్తుకుపోయేది.  

నాకు ఊహతెలిసే సరికే మా యింటిలో ఒక రేడియో, ఒక గ్రాంఫోనూ ఉండేవి. అప్పట్లో మూగమనసులు సినిమాలో ముద్దబంతి పువ్వులో పాట, అనురాగ దేవత సినిమాలో చూసుకో పదిలంగా అనే పాట తెగ నచ్చేశాయి.  గ్రాంఫోన్‌లో మా పెదనన్న గారి అబ్బాయిలు ఎల్పీలు తెచ్చి ప్లే చేసేవారు. డబ్బై, ఎనభై దశకాల్లో వచ్చిన సినిమా పాటలు చెవులు హోరెత్తిపోయేదాకా వినేశాం.

తరువాత మా పెద్దన్నయ్య సోనీస్టీరియో కొన్నాడు. ఆడియో కేసెట్ల శకం మొదలయ్యింది. మంచిదో, చెడ్డదో తెలియ కుండానే రిలీజయిన ప్రతీ ఆడియో కేసెట్టూ మా యింటిలో ఉండేది. మళ్ళీ వాటిల్లో నచ్చిన పాటలు ఎంచుకొని నైంటీ, సిక్స్టీ కేసెట్లలో రికార్డింగ్ చేయించుకొనే వాళ్ళం. నాకు కొంచెం సంపాదన మొదలై, సొంత మ్యూజిక్ సిస్టం కొనుక్కొన్న తరువాత కేసెట్లకి, రికార్డింగులకి ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టానో లెక్క లేదు.  అప్పుడు కొన్న ఆడియో కేసెట్లు అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి అటక మీదకి ఎక్కించాం. నిన్న, మొన్నటి వరకూ అవి అలాగే ఉండేవి. తరువాత వాటిమీద బ్రాంతి వదిలి పెట్టేసి, బయట పారేశాను.    

విశ్వనాధ్ సినిమాల్లో పాటలు, బాలసుబ్రహ్మణ్యం పాత పాటలు, ఇళయరాజా, ఏ.ఆర్.రెహమాన్, జానకి, వేటూరి, ఆత్రేయ, సిరివెన్నెల, మణిరత్నం... పాటల కలెక్షన్లు..ఒక్కో పాటా ఒక్కో జ్ఞాపకం.  

ఈ రోజు రాగా.కాం వాళ్ళ సైట్‌లో తెలుగు పాటల వింటుంటే ఆ సంగతులన్నీ జ్ఞప్తికి వచ్చాయి. 

ఈ సైట్‌లో వెతికి వెతికి పాటలు వింటూ జ్ఞాపకాల అలల మీద అలా.. అలా... దాని ఫలితమే ఈ టపా!.   

© Dantuluri Kishore Varma 

Friday 13 June 2014

జారిపడే చినుకుల కోసం...

పగళ్ళు నిప్పుల కొలిమిలో ఉన్నట్టు ఉంటుంది. రోజంతా కాలిన ఇంటి పైకప్పులు, గోడలు ఆవిర్లు కక్కుతూ రాత్రుళ్ళని ఓవెన్లలా మారుస్తున్నాయి. సముద్రతీర ప్రాంతమేమో గాలిలో తేమవల్ల వొంటికి పట్టిన చెమటలు ఆరడం లేదు. రక్తపిశాచి చెల్లెలు లాగ కరెంటుకోత మాటిమాటికీ సహనాన్ని చప్పరించేస్తుంది. ఆకాశంలో నల్ల మబ్బులు ఎప్పుడు కనిపిస్తాయో, పన్నీటి చిలకరింపులాంటి తొలకరి జల్లులు ఎప్పుడు జనాలని సేదతీరుస్తాయో తెలియకుండా ఉంది. `ఇంకేముంది నైరుతీ ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి,` అంటున్నారు; `అవిగో కేరళలో ప్రవేశించాయి - ఆఘమేఘాలమీద మనకీ వచ్చేస్తాయి,` అని ఊరిస్తున్నారు.  రాకుండా అడ్డుపడడానికి ఎల్నినో కాచుకొని ఉందా?

పసిఫిక్ మహాసముద్రంలో నీళ్ళు వేడెక్కాయట. కెరటాలు ఎప్పటికంటే ఉదృతంగా ఎగసిపడుతున్నాయట. వేడిగాలులు పశ్చిమంగా ప్రయాణించి ఖండాలనన్నింటినీ చుట్టబెట్టేస్తాయి. ఎల్నినో! నాలుగైదు సంవత్సరాలకి ఒక్కోసారి పసిఫిక్ సముద్రంలో ఎల్నినో ఎందువల్ల ఏర్పడుతుందో శాస్త్రవేత్తలకి కూడా పూర్తిగా తెలియదట. ప్రపంచం భయంతో వొణుకుతుంది. అమెరికాలాంటి ఒక్కో చోట ఎల్నినో కుంభవృష్టి వర్షాల్ని కురిసేలా చేయ్యవచ్చు. వరదలు రావచ్చు. మనదేశంలో దీని ప్రభావం వల్ల ఋతుపవనాల ప్రయాణం మందగిస్తుంది. కురవడానికి ఆకారం పొందుతున్న మేఘాలు ఆవిరైపోతాయి. వర్షాభావం దేశాన్ని కరువుకోరల్లోకి నెట్టేస్తుంది. భయపెట్టడం కాదు కానీ ఆర్థికవేత్తలు, నిపుణులు చెప్పేమాటలు వింటుంటే రాబోయేవి గడ్డురోజులు అనిపిస్తుంది. పంటలు తగ్గుతాయి, నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతాయి, నీటికొరత ఎక్కువవుతుంది, దేశ ఆర్థికవ్యవస్థ తిరోగమనంలో పడుతుంది. 

జారిపడే చినుకులకోసం ఆశగా ఎదురుచూస్తున్న మనకోసం ఎవరైనా అమృతవర్షిణి రాగంలో పాటలుపాడి వర్షాలు కురిపిస్తే బాగుణ్ణు!
© Dantuluri Kishore Varma 

Wednesday 4 June 2014

వాహ్వా, ఏమి ఐడియా!

మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా కురియన్‌తో ఇందిరాగాంధీ ఒక మాట అన్నారట. `మా ఫాంలో ఆవు పాలు అమ్మితే చాలా తక్కువ ధర, అవే ఢిల్లీలో కొందామంటే మూడురెట్లు ఎక్కువ. ఎందుకు?` అని. ఇప్పటికీ పరిస్థితి మారలేదు. పైపెచ్చు మరింత అధ్వాన్నంగా తయారయ్యింది. పాలే కాదు, వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా అలానే ఉన్నాయి. ధరలలో ఈ తేడా ఎవరి జేబుల్లోనికి వెళుతుంది? పండించిన వ్యవసాయదారుడు అమ్ముదామంటే అడివి,  మధ్యతరగతి వాడు కాయగూరల కొందామని మార్కెట్టుకి వెళితే కొరివి.  రైతు దగ్గర కొని మార్కెట్‌లో అమ్మే మధ్యదళారీలు బాగుపడుతున్నారు.   

వినియోగదారులు తోటల దగ్గరకి వెళ్ళి నేరుగా రైతుల దగ్గరనుంచి కావలసిన కాయగూరలు కొనుక్కోవాలి. లేదంటే రైతులే వాళ్ళ పంటని వినియోగదారుల దగ్గరకి తీసుకొని రావాలి. అప్పుడు ఈ రెండువర్గాల వాళ్ళూ లాభపడతారు. కానీ అలా జరిగే అవకాశం ఉందా? 

కాకినాడ నుంచి పిఠాపురం మీదుగా కత్తిపూడి వెళ్ళే దారిలో గొల్లప్రోలు దాటిన తరువాత ఎడమచేతి వైపు తాటిపర్తి వెళ్ళే రోడ్డు తగులుతుంది. అది ధర్మవరం దగ్గర ఐదవనంబరు జాతీయ రహదారిని కలుస్తుంది. ఈ మార్గంలో రోడ్డుకి ఇరువైపులా సారవంతమైన భూముల్లో చాలా మంది రకరకాల కాయగూరలని పండిస్తున్నారు. కాకినాడ నుంచి మా స్వంత ఊరు రాచపల్లికి ఈ మార్గంలోనే వెళుతుంటాం అప్పుడప్పుడూ. ఊరినుంచి తిరిగి వచ్చేటప్పుడు రోడ్డుకి ప్రక్కన గోనెపట్టాలు పరిచి వాటిపైన తాజా కాయగూరలని పేర్చి అమ్ముతూ కనిపిస్తూ ఉంటారు రైతులు. టొమాటాలు, బెండకాయలు, గోంగూర లాంటివి నవనవలాడుతూ ఉంటాయి. ధరలు భహు తక్కువ. రైతు బజారులో పాతికరూపాయలు అమ్మే బీరకాయలు ఇక్కడ పదిరూపాయలకే దొరుకుతూ ఉంటే ఆశ్చర్యపోతాం. పల్లెలకి దూరంగా ఉండి ఎంత నష్టపోతున్నామో తెలిసి వస్తుంది. కానీ ఏం చేస్తాం? ప్రతీరోజూ ఇంత దూరం వచ్చి కొనుక్కోలేం కదా?  

ఈ రోజు న్యూస్‌పేపర్లలో అంతగా ప్రాముఖ్యత లేని మూలలో ఒక చిన్న వార్త ప్రచురితమైంది. పై ఊళ్ళల్లో కాయగూరల రైతులు హార్టీకల్చర్ డిపార్ట్‌మెంటు నుంచి కొంత సబ్సిడీ తీసుకొని ఓ ఐదు లక్షల విలువైన వేన్ కొనుగోలు చేసుకొన్నారు. దానికి గ్రీన్‌వేన్ అని నామకరణం చేశారు. వాళ్ళ పొలాల్లో పండిన కాయగూరలని వేన్‌లో వేసుకొని దగ్గరలో ఉన్న పిఠాపురానికీ, గొల్లప్రోలుకీ తీసుకొని పోతున్నారు. క్రమంగా కొంచం పెద్ద పట్టణాలకి కూడా విస్తరిస్తారు. మార్కెట్ ధరల కంటే తక్కువకి తాజా కాయగూరలు గ్రీన్ వేన్‌లో వచ్చి ఇంటి ముందు నిలబడితే కొనుక్కోకుండా ఉంటామా? మనకి లాభమే కదా? అమ్మే రైతులకీ లాభమే. 

వాహ్వా, ఏమి ఐడియా! 
Photo: The Hindu
© Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!