Pages

Showing posts with label భగవధ్గీత. Show all posts
Showing posts with label భగవధ్గీత. Show all posts

Tuesday, 1 September 2015

ధర్మం - అధర్మం

`ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి` అని భద్రాచల రామదాసు ఆర్తిగా అమ్మచేత సిఫారసు చేయిస్తే లక్ష్మణ సమేతుడై మారువేషంలో వచ్చి, నవాబుకి రామదాసు బాకీపడిన సొమ్ములు చెల్లించి, చక్కగా మాయమైపోయాడు శ్రీరామచంద్రుడు. ఎంత కరుణతో కష్టాలు తీర్చమని కోరుకొన్నా - అదృశ్యంగా ఉండి భక్తుని కోరికని తీర్చాడుకానీ, రామదాసుకి మాత్రం ఒక్కక్షణమైనా దర్శన భాగ్యం కలిగించినట్టు లేదు దేవదేవుడు! తాళ్ళపాక అన్నమాచార్యుడు వేలకొలదీ సంకీర్తనలతో వేంకటేశ్వరస్వామిని అర్చిస్తే, ఆయనకి ఎప్పుడో జీవితచరమాంకంలో దైవసాన్నిధ్యం లభించింది. ఇక, సంకీర్తనాచార్యుల కాలానికన్నా చాలా వెనక్కి - అంటే పురాణకాలానికి వెళితే విశ్వామిత్రుడో, మరో మహర్షో ఏళ్ళకొద్దీ తప్పస్సులు చేసి.. శివుడో, విష్ణుమూర్తో ఒక లిప్తకాలంపాటు ప్రత్యక్షమైతే - వరాలు పొంది, సంతృప్తి పడినట్టు గాధలు ఉన్నాయి. దీనినిబట్టి అర్థమయ్యేది ఏమిటంటే - `కరుణతోటో, భక్తితోటో, ధృఢసంకల్పంతోటో దేవుడిని శాశ్వతంగా మనతోపాటూ ఉంచుకోలేము` అని. ఈ మార్గాలు అవలంభించిన భక్తులకి ఆయన అదృశ్యంగా ఉండి కరుణించడమో, కనిపించి వరాలివ్వడమో చేస్తాడు కానీ - అవతారం ఎత్తి వాళ్ళతోపాటూ జీవించడు. రాముడిగానో, కృష్ణుడిగానో దేవుడు మరో అవతారంలో భూమిమీదకి రావాలంటే సమిష్టిగా అందరూ అవలంభించవలసిన మార్గం ఒకటి ఉంది.... అదే, అధర్మం! 

మీరు సరిగ్గానే చదివారు. పైన చెప్పిన మార్గం `ధర్మం` కాదు. అధర్మమే! ఈ విశ్వంలో ఏ మార్గానికీ లేని శక్తి అధర్మమార్గానికి ఉంది. మనిషిని మనిషి మోసం చేస్తున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, ప్రాణంతీస్తున్నప్పుడు; అక్రమసంబంధాలు, దొంగతనాలు, మానభంగాలు, హత్యలు, లంచాలు, కల్తీలు, అక్రమవ్యాపారాలు, ఉగ్రవాదం, దురలవాట్లు భరించలేనంత ఎక్కువగా పెరిగిపోయినప్పుడు - `ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే!` అని ధర్మాన్ని పున:ప్రతిష్ట చెయ్యడానికి ఓ అవతారంగా దేవుడు పుడతాడట. కష్టాలు కలిగాయని ఏడిస్తే, భక్తితో చేతులు జోడించి మ్రొక్కితే ఉపేక్షించవచ్చునేమో కానీ, అధర్మంతో వికటాట్టహాసం చేస్తే చూస్తూ ఊరుకోలేడట దేవుడు. అందుకే అధర్మానికున్న శక్తి మరి దేనికీ లేదని చెప్పడం. ప్రస్తుతం  జనాలు శాశ్వత దైవదర్శనం కోసం బాగానే ప్రయత్నిస్తున్నట్టున్నారు కదూ? 

*     *     *

పోలీసులది ప్రజల్ని రక్షించవలసిన ధర్మం
ప్రభుత్వానిది జనరంజకంగా పరిపాలించవలసిన ధర్మం
మీడియాది వార్తలు అందించడంతో పాటూ, జరిగిన సంఘటనలను విశ్లేషించి ప్రజల అభిప్రాయాలకి దిశానిర్దేశం చెయ్యవలసిన ధర్మం 
తల్లితండ్రులదీ, ఉపాద్యాయులదీ పిల్లలకు మంచీ, చెడు మధ్య వ్యత్యాసాన్ని చెప్పి వాళ్ళని ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దవలసిన ధర్మం.. 
వివిధ వృత్తుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఉన్న ప్రజలది న్యాయబద్దంగా సంపాదించుకొని కుటుంబాలని పోషించుకోవలసిన ధర్మం..  

కానీ,  చాలామంది వాళ్ళ ధర్మాలని సక్రమంగా నెరవేరుస్తున్నట్టు లేదు. అసహాయులమీద అత్యాచారాలు చెయ్యడానికి వావీ, వరసా, వయసు, సాంఘిక హోదా.. ఏవీ అడ్డు కావడం లేదు.  స్కూలుకి వెళ్ళి చదువుకోవలసిన వయసులో ఉండే అమాయకమైన పిల్లలు నేరాలవైపు ఆకర్షించబడుతున్నారు. భారతంలో దృతరాష్ట్రుడిలాంటి తల్లితండ్రులకి పిల్లలు తప్పుడు మార్గంలో వెళుతున్నా, మంచివైపు అడుగులు వేయించగలిగినంత తీరుబడి లేదు.

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సువ:
మామకా: పాణ్డవాశ్చైవా కిమకుర్వత సంజయ.

అని కురుక్షేత్ర మహాసంగ్రామం మొదలవబోతుండగా అన్నీ చూసి చెప్పగల మీడియాలాంటి సంజయుడ్ని దృతరాష్ట్రుడు మావాళ్ళైన కౌరవులూ, పాండవులూ ఏమి చేస్తున్నారని అడుగుతాడు. దాయాదుల రాజ్యాన్ని అధర్మంగా తన కుమారులు స్వంతం చేసుకొన్నారనీ, అలా చేసుకొనే క్రమంలో ఎన్నో దుష్టకార్యాలు చేశారనీ దృతరాష్ట్రుడికి తెలుసు. అయినా అధర్మాన్ని ఖండించకుండా `నా వాళ్ళు` అనే పక్షపాతాన్ని చూపించాడు.   

సుమారు ఏడువందల శ్లోకాల్లో యుద్దం జరగడానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీతని దృతరాష్ట్రుడికి చెప్పాడు సంజయుడు. చెప్పి, తన మాట ఒకటి కూడా చిట్టచివర కలిపాడు    

యత్ర యోగేశ్వర: కృష్ణో యత్ర పార్థో ధనుర్థర:
తత్ర శ్రీర్విజయో భూతిర్థృవా నీతిర్మతిర్మమ.    
   
యోగీశ్వరుడిలాంటి కృష్ణుడు, ధనుస్సును చేపట్టిన అర్జునుడూ ఎక్కడ ఉంటారో అక్కడ సంపద, విజయం, నీతీ ఉంటాయని దీని భావం.  

భగవ్బద్గీతలోని మొట్టమొదటి, చిట్టచివరి శ్లోకాలనుంచి సమాజం నేర్చుకోవలసినది ఎంతో ఉంది. విజయానికి, ఆనందానికి అక్రమమార్గాలు సరిఅయినవి కావనీ, పరాయి సొమ్ము ఆశించడం అధర్మమని, మంచీ చెడుల విచక్షణ, కర్తవ్యనిష్టా ఉండాలనీ పిల్లలకి చెప్పవలసిన బాధ్యత తల్లితండ్రులకీ, గురువులకీ ఉంది.  ప్రజలకి చెప్పవలసిన బాధ్యత మీడియాకి ఉంది. ధర్మాన్ని ఆచరించవలసిన బాధ్యత మనందరికీ ఉంది.

       © Dantuluri Kishore Varma 

Tuesday, 27 January 2015

అతను భగవధ్గీతను చదివుంటే...

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సువ:
మామకా: పాణ్డవాశ్చైవా కిమకుర్వత సంజయ.

`యుద్ధం చెయ్యడానికి సన్నద్దులైన పాండవులూ, కౌరవులూ కురుక్షేత్రంలో ఏమిచేశారు?` అని దృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు. భగవద్గీతలోని అర్జున విషాదయోగంలో మొట్టమొదటి శ్లోకం ఇది. సంజయుడు కురుక్షేత్ర మహాసంగ్రామానికి వ్యాఖ్యాత. చూసినది చూసినట్టు దృతరాష్ట్రునికి విన్నవిస్తున్నాడు. ఇరుపక్షాల సైన్యాలూ రణరంగంలో మోహరించి ఉన్నాయి. దుర్యోధనుడు తమ పక్షం వారు, ఎదుటి పక్షపు వీరులతో సమవుజ్జీలుగా ఉన్నారని సేనానాయకుడైన ద్రోణాచార్యుడితో చెపుతాడు. అప్పుడు భీష్మాదులు బిగ్గరగా శంఖారావాలు చేసి యుద్దానికి తయారుగా ఉన్నామని సన్నద్ధత  వ్యక్తం చేస్తారు. 

పాండవ పక్షం నుంచి అర్జనుని రధసారధి శ్రీకృష్ణుడు పాంచజన్యాన్నీ, అర్జునుడు దేవదత్తాన్నీ, ధర్మరాజు అనంతవిజయాన్నీ, భీముడు పౌండ్రాన్నీ, నకులుడు సుఘోషాన్నీ, సహదేవుడు మణిపుష్పకాన్నీ పూరిస్తారు. ఇవన్ని వాళ్ళ వాళ్ళ శంఖాల పేర్లు. ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. అప్పుడు  కృష్ణుడితో అర్జునుడు- 

సేనయోరుభయోర్మధ్యే రధం స్థాపయ మేzచ్యుత.

అంటూ తన రధాన్ని ఇరుపక్షాలమధ్యా నిలుపమని చెపుతాడు. ఇరువైపులా ఉన్న వీరులను చూస్తాడు. వారిలో గురువులు, తాతలు, తండ్రులు,  కొడుకులు, అన్నదమ్ములు, మనుమలు, మేనమామలు, స్నేహితులు ఉన్నారు. `వీరితోనా నేను యుద్ధం చెయ్యబోతున్నది!` అనే తలంపు అర్జునుడ్ని ఒక్క క్షణంలో నిర్వీర్యుడిని చేసింది. స్వజనులను చంపి ఎవరైనా సాధించేది ఏముంటుంది?    


నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా.  

వైరాగ్యం ఆ మహావీరుడ్ని ఆవహించింది. `రాజ్యంతోనూ, అది సమకూర్చే సుఖాలతోనూ మనకేమిటి అవసరం? అవేవీ నాకు అక్కర్లెద్దు,` అంటున్నాడు అర్జునుడు.  స్వజనాపేక్ష చేత అర్జునుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యాడు. ఈ లోపం `నా అయుదాల్ని విడిచిపెడుతున్నాను. ఈ యుద్దరంగంలో కౌరవులు నన్ను సంహరించినా కూడా మంచిదే,` అనేంతవరకూ అర్జునుడ్ని తీసుకొని వెళ్ళింది. తన నిర్ణయాన్ని సమర్ధించుకోవడానికి కౌరవులను చంపడంవల్ల పాపం కలుగుతుందని, నరకానికి పోతామని, వంశం నాశనం అవుతుందని.. ఎన్నో సాకులు చెపుతాడు.  కొండను తవ్వి వజ్రాన్ని వెలికితీసినట్టు, అపోహలను తొలగించి అర్జునుడిలో వజ్రసంకల్పాన్ని శ్రీకృష్ణుడు కల్పించకపోతే పాండవ మధ్యముడు కోరుకొన్నట్టే దుర్యోధనాదులు విజయాన్నీ, రాజ్యాన్ని పొంది వుండేవారు.

ఇప్పుడు భగవధ్గీతను విడిచిపెట్టి కొంచెం పశ్చిమంగా వెళ్ళి షేక్స్పియర్ రాసిన విషాదాంత నాటకం హేంలెట్‌లో ఏమయ్యిందో చూద్దాం. హేంలెట్ డెన్‌మార్క్ యువరాజు. అతని పినతండ్రి క్లాడియస్ హేంలెట్ తండ్రిని  చంపి రాజు అవుతాడు. అంతేకాకుండా వదినగారిని పెళ్ళాడి తన రాణిని చేసుకొంటాడు. ఓ వెన్నెల రాత్రి చంపబడిన రాజు ఆత్మ తన కొడుకు హేంలెట్‌కి కనిపించి జరిగిన కుట్రగురించి చెపుతుంది. ప్రతీకారం తీర్చుకోమని కోరుతుంది. `ఆత్మ చెప్పిన విషయం నిజమా, కాదా?` అనే సందేహంలో పడతాడు హేంలెట్. ఒక నాటక బృందాన్ని పిలిచి తన తండ్రిని చంపిన కుట్రని పోలిన సన్నివేశంతో ఓ నాటకాన్ని రాజమహల్లో వేయిస్తాడు. నాటకాన్ని చూస్తూ కళవెళ పడిన పినతండ్రి క్లాడియస్‌ని గమనించిన హేంలెట్‌కి తండ్రి ఆత్మ చెప్పిన విషయం నిజమే అని నిర్ధారణ అవుతుంది. క్లాడియస్ తత్తరపాటులో ఉన్నాడు. ఆ క్షణంలోనే హేంలెట్ అతనిని సంహరించాలి. అలాగే చేసి ఉండాలని విమర్శకులు ఇప్పటికీ నొక్కి వొక్కాణిస్తున్నారు. అర్జునుడిలో స్వజనాపేక్షలాగ హేంలెట్‌లో ఇండెసిసివ్‌నెస్(ఏదైనా పని చెయ్యడమా, మానడమా అనే ఊగిసలాట) అనే లోపం ఉంది. అయితే దురదృష్టవశాత్తూ కృష్ణుడిలాంటి కౌన్సిలర్ అతనికి లేక చివరికి తాను చంపబడడమే కాకుండా, తనవాళ్ళందరూ దుర్మరణం పొందడానికి కారణం అవుతాడు. 

ఉదయం మేల్కొన్న దగ్గరనుంచీ, రాత్రి నిద్రపోయేవరకూ ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ప్రతీపనికీ రెండు ఆప్షన్‌లు ఉంటాయి - చెయ్యడం, చెయ్యకపోవడం అనేవి.  చిన్న పనులని ప్రక్కన పెడితే ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో చెయ్యవలసిన పనిని చెయ్యక పోవడం వల్ల, చెయ్యకూడని పని చెయ్యడం వల్లా అపారమైన నష్టం కలిగే అవకాశం ఉంది. సభావేదికమీద మన అభిప్రాయాలని చెప్పవలసి వచ్చినప్పుడు తప్పు మాట్లాడితే జనాలు నవ్వుతారని వెనకడుగు వేస్తాం; నష్టం వస్తుందేమో అనే సందేహంతో మంచి వ్యాపారంలో పెట్టుబడి పెట్టకుండా ఊరుకొంటాం; పోటీని చూసి భయపడి పరీక్షల్లో పూర్తి సామర్ద్యాన్ని ప్రదర్శించలేకపోతాం; సమయం, డబ్బూ అందుబాటులో ఉన్నా సినిమాలు, స్నేహితులూ లాంటి ఆకర్షణల్లో పడి ఉద్యోగానికి అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటి నైపుణ్యాలని మెరుగు పరచుకోవడానికి బద్దకిస్తాం. చూశారా మన లోపాలు విజయావకాశాలని ఎలా దెబ్బతీస్తున్నాయో!  

హేంలెట్ భగవధ్గీతను చదివుంటే ఏమయ్యేది? ఈ షేక్స్పియర్ నాటకం సుఖాంతమయ్యేదా? నిజానికి ఎక్కడో భారతదేశంలో పుట్టిన గీతని డెన్మార్క్ యువరాజు చదివే అవకాశం లేనేలేదు కాబట్టి ఈ ఊహని కొంచంసేపు ప్రక్కన పెట్టి మనదగ్గరకి వద్దాం. `మోహంలో పడకుండా సరైన సమయంలో సరైన పని చెయ్యి,` అని భోధించిన గీత మనకేమైనా ఉపయోగపడుతుందంటారా? 

© Dantuluri Kishore Varma

Sunday, 25 May 2014

ఎవరైనా పనిచెయ్యక తప్పదు!

కథానాయకుడి ధీరోదాత్తత, కథానాయిక సౌశీల్యం, కథలో చూపించిన ఆప్యాయతలు, మానవసంబంధాలు, త్యాగం, లక్ష్యాన్ని చేరుకోవడానికి పోరాటం... మొదలైన పాజిటివ్ ఎలిమెంట్స్ మనకు బాగా నచ్చుతాయి. అవి ఉన్న కథలని మళ్ళీ, మళ్ళీ చదువుతాం; సినిమాలని చూస్తాం. 

వాటిని మనలో పెంపొందించుకోవడానికి ఏమీ చెయ్యం!  

`పలానా వ్యక్తి ప్రధానమంత్రి అయిపోయాడు,` అని అనుకొంటాం. ప్రత్యర్థులని ఎదుర్కోవడానికి ప్రణాళికలు రచించాలి, వాటిని పగడ్బందీగా అమలుపరచాలి, రాత్రనకా పగలనకా దేశం ఆమూలనుంచి, ఈ మూలకు ప్రయాణాలు చెయ్యాలి, సభలలో జనరంజకంగా మాట్లాడాలి, మిత్రుల సంఖ్యను పెంచుకోవాలి. వీటన్నింటినీ ప్రభావవంతంగా చెయ్యడానికి ఆరోగ్యాన్ని చక్కగా ఉండేలా చూసుకోవాలి. విజయం సులభంగా లభించదు. బద్ధకాన్ని దరిచేరనివ్వకుండా కష్టించి పనిచెయ్యాలి. అలాగే ఒక ఆఫీసులో మేనేజరైనా, ప్రోజెక్ట్ లీడరయినా, గుమస్తా అయినా, నౌకరైనా, వ్యాపారస్తుడైనా, గృహిణైనా, రోజుకూలీ చేసుకొనే సామాన్యుడైనా, విద్యార్థిఐనా, ఆఖరికి సన్యాసిఐనా తన కర్తవ్యాన్ని నిర్వహించవలసిందే.

పైన ఉదహరించిన కర్తవ్యనిర్వాహణ విలువలని అతిక్రమించకుండా చేస్తే మనమే ధీరోదాత్తులమౌతాం. స్వామీవివేకానంద ఒక కథ చెపుతాడు. యువసన్యాసి గురించి  ఇంకా ఒక పక్షుల జంట గురించి. సన్యాసి మహా అందగాడు. ఒకరాజకుమారి అతనిని వివాహం చేసుకోవలసిందని కోరుతుంది. మహారాజు అలా చేసిన పక్షంలో అర్థరాజ్యం ఇస్తానంటాడు. కానీ, సన్యాసి వాటిని తిరస్కరించి అడవిలోనికి వెళ్ళిపోతాడు. తపస్సుచేసుకొని మోక్షం పొందాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందుకు సాగాడు. ప్రలోభాలకి లొంగలేదు.  అతను సర్వసంఘ పరిత్యాగం అనే విలువకు కట్టుబడి గొప్పవాడయ్యాడు. రాజకుమారీ, మరికొందరూ అతనిని అనుసరిస్తూ వెంటబడి వెళతారు. అడవిలో ప్రవేశించేసరికి చీకటిపడుతుంది. ఒకచెట్టుక్రింద ఆరాత్రికి బసచేస్తారు. చలినుంచి, క్రూరమృగాలనుంచి కాపాడుకోవడంకోసం చిన్నమంట వేసుకొని కూర్చుంటారు. నడచి వచ్చారేమో ఆకలి అవుతూ ఉంటుంది. చెట్టుమీద ఉన్న పక్షుల జంటకి ఆవిషయం తెలుస్తుంది. అతిదులకి ఆకలితీర్చే మార్గం కనిపించదు. తామే వాళ్ళకి ఆహరం అవడంకోసం  మంటలో పడి ఆత్మత్యాగం చేస్తాయి. గృహస్తు ధర్మాన్ని నిర్వర్తించాయి కనుక అవీ గొప్పవే. సన్యాసి నిష్కపటమైన నిబద్ధత, పక్షుల త్యాగం అనేవి విలువలు. చేసినపనులలో విలువలు కలిసి ఉన్నాయి కనుక అవి మనకు తప్పనిసరిగా నచ్చుతాయి. 

మనలో ప్రతీ ఒక్కరికీ మన ధర్మాలు ఏమిటో తెలుసు.  విలువలకు కట్టుబడి వాటిని ఆచరించడమే కర్మయోగం!  

© Dantuluri Kishore Varma 

Sunday, 24 November 2013

భక్తియోగమా వ్యక్తిత్వ వికాసమా?

భగవధ్గీత భక్తియోగంలో భక్తునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో చెప్పబడ్డాయి. పదమూడవ శ్లోకంనుంచి పంతొమ్మిదవ శ్లోకంవరకూ దండలో గుచ్చిన పువ్వుల్లాగ ఈ గుణాలనన్నింటినీ కూర్చడం జరిగింది. ప్రతీ లక్షణమూ ఒక పొడి మాటగా ఉంటుంది తప్పించి, దానికి సంబంధించిన వివరణ ఉండదు. కాబట్టే అరబిందోఘోష్, బాలగంగాధర్ తిలక్, స్వామీ వివేకానంద, మహత్మాగాంధీ, ఎడ్విన్ ఆర్నాల్డ్, విద్యాప్రకాశానందగిరి స్వామి లాంటి ఎందరో తమతమ దృక్కోణాలనుంచి అర్థంచేసుకొని భగవధ్గీతకి వివరణ రాశారు. సంస్కృతం అర్థంచేసుకోలేని నాలాంటి వారికి ఇవి చక్కగా మార్గనిర్దేశం చేస్తాయి.
మళ్ళీ గీతలో ఈ అధ్యాయంలో చెప్పిన భక్తుని లక్షణాల దగ్గరకి వస్తే - వాటిని నాలుగు వర్గాలుగా విభజించ వచ్చు అనిపించింది.

1. ప్రకృతితో, మనచుట్టూ ఉన్న జీవజాలంతో ఎలా ఉండాలి?
2. సమాజంలో మిగిలిన వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలి?
3. సమర్ధత కలిగిఉండటానికి కావలసిన లక్షణాలుఏమిటి?
4. జరిగే సంఘటనలకి మనం ఎలా ప్రతిస్పందించాలి, లేదా వాటిని ఎలా స్వీకరించాలి? (దీనినే దృక్పదం అనవచ్చు).

1. ప్రకృతితో, మనచుట్టూ ఉన్న జీవజాలంతో ఎలా ఉండాలి? :

1. ఏ ప్రాణి మీదా, ప్రకృతిమీదా ద్వేషం ఉండకూడదు. విచక్షణా రహితంగా వాటికి హానికలిగించకూడదు. 
2. కరుణ కలిగి ఉండాలి.

2. సమాజంలో మిగిలిన వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలి? :

1. అందరితో స్నేహపాత్రులుగా ఉండాలి.
2. ఓర్పు కలిగి ఉండాలి.
3. ఇతరులను భయపెట్టకూడదు, వారి గురించి భయపడ కూడదు. 
4. ఎవరినీ ద్వేషించకూడదు.
5. అహంకారం ఉండకూడదు.
6. నిస్పక్షపాతంగా ఉండాలి. 

3. సమర్ధత కలిగిఉండటానికి కావలసిన లక్షణాలుఏమిటి? :

1. మనోనిగ్రహం ఉండాలి.
2. దృఢనిశ్చయం కలిగి ఉండాలి.
3. కర్తవ్యాన్ని నిర్వహించగల సామర్ద్యం కలిగి ఉండాలి.
4. సుచీ, శుభ్రం ఉండాలి
5. నిర్ణయానికి కట్టుబడి ఉండాలి.
6. ప్రతీదానికీ ఆందోళన పడకూడదు.

4. మనదృక్పదం ఎలా ఉండాలి? : 

మిగిలిన లక్షణాలనన్నింటినీ ఒక చిట్టాగా ఇవ్వడంలేదు. కానీ వాటి సారాంశం ఏమిటంటే - సుఖం ఉన్నప్పుడు పొంగిపోవడం, కష్టం కలిగినప్పుడు కృంగిపోవడం ఉండకూడదు. దొరికిన దానితో సంతుష్టి పడాలి. దేనిమీదా మమకారం ఉండకూడదు. హర్షము, క్రోదము, భయము ఉండకూడదు. ఇంకొకరకంగా చెప్పాలంటే స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి.  కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్యం, అప్పులు ఎన్ని ఉన్నా నల్లమబ్బు చుట్టూ వెండి అంచు ఉన్నట్టు ఆనందాలు ఉంటాయి. వాటిని ఆనందిస్తాం, వాటికోసమే బ్రతుకుతాం. కానీ రాత్రి వచ్చిందని కృంగిపోకుండాఉంటే, మళ్ళీ వెలుతురు వస్తుంది కదా? ఈ రకమైన దృక్పదాన్ని అలవాటు చేసుకోమనే గీత చెపుతుంది.

ఈ లక్షణాలు కలిగి ఉన్నవాడు నాకు ప్రియమైన వాడు అని భగవంతుడు చెపుతాడు. అంటే, మంచి భక్తుడైన వాడు  ఆదర్శవంతమైన వ్యక్తిగా ఉంటాడు. భక్తి అనేది ఆధ్యాత్మికమైన విషయం. దీనికి లౌకికమైన విషయాలకీ మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. నాస్తికుడైన వాడు కూడా మంచి వ్యక్తిగానే ఉండాలని కోరుకోవచ్చు. అప్పుడు భగవధ్గీతని ఒక పెర్సనాలిటీ డెవలప్‌మెంట్ బుక్‌లా స్వీకరించవచ్చు.  చిత్రమైన విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా మిలియన్లకొద్దీ కాపీలు అమ్ముడుపోయే పాపులర్ సెల్ఫ్‌హెల్ప్ బుక్స్ అన్నీ కూడా వీటిలో ఎదో ఒక లక్షణం మీద, లేకపోతే కొన్ని వాటిమీద కలిపి, వాటిని ఎలా పెంపొందించుకోవాలో నేర్పించేవే. ఉదాహరణకి హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇంఫ్లూయన్స్ పీపుల్, హౌ టూ స్టాప్ వర్రీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్, యువర్ ఎర్రోనియస్ జోన్స్, యూ కెన్ విన్, విజయానికి ఐదు మెట్లు మొదలైనవి.

గీతను చదివి మునీశ్వరుడిలా మారిపోవలసిన పనిలేదు. కానీ, దానిని దారిని చూపించే ఒక దీపంలా ఉపయోగించుకొని చెడుని వదిలించుకొని, మంచిని పెంపొందించుకోవాలి. ప్రభావవంతమైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించాలి. అదే భక్తి!
© Dantuluri Kishore Varma 

Tuesday, 20 August 2013

కర్మయోగా!

కర్మ అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదటిది పని. మనంచేసే ప్రతీపనీ కర్మే. రెండవది, మనం చెసే పనులవల్ల సంప్రాప్తించే ఫలితం. ఏదయినా అనుకోనిది జరిగినపుడు, చెడు సంభవించినప్పుడు నుదుటిమీద బొటనవేలితో అడ్డంగా గీసుకొని, `అంతా మనకర్మ!` అనుకోవడం చూస్తూ ఉంటాం. ఇదివరలో మనం చేసిన పనుల యొక్క ఫలితంగా అలా జరిగిందని దీని అర్థం.

ఏదయినా ఒక సంఘటనో, చర్యో జరిగినప్పుడు దానికి ప్రతిస్పందిస్తూ మనం నవ్వడమో, ఏడవడమో, ఆ చర్యకి కారణం అయినవాళ్ళని తిట్టడమో, ప్రశంసించడమో చేస్తాం. ఈ ప్రతిస్పందనలన్ని మనవ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చూపిస్తాయి. అప్పుడెప్పుడో ఒకహీరో, ఒకకమేడియన్ బోటులో షికారుకి వెళ్ళారు. నది మధ్యలోకి వెళ్ళాక మెరక వేసిన ఇసుకకి గుద్దుకొని, బోటుకి అడుగు భాగంలో ఒక పగులు ఏర్పడింది. విపరీతంగా నీళ్ళు బోటులోనికి రావడం ప్రారంభించాయి. ఇక కొన్ని క్షణాల్లో బోటు మునిగిపోబోతుండగా వీరోచితమైన పాత్రలుచేసే హీరో బోరుమని ఏడిస్తే, కమేడియన్ మాత్రం నిబ్బరంగా ఉన్నాడట. వేరే బోటువాళ్ళు పరిస్థితిని గమనించి వాళ్ళిద్దరినీ రక్షించారు. కానీ, హీరోగారి ధీరత్వం మాత్రం బట్టబయలయ్యింది. 

ఉదాత్తమైన వ్యక్తిత్వం నిర్మించుకోవడం మనచేతుల్లోనే ఉంది. ఒక్కోసారి ఏవో చర్యలకి ప్రతిచర్యలుగా కాకుండా మనకు మనమే కర్మలు చేస్తుంటాం. ధనంకోసమో, కీర్తికోసమో, అధికారంకోసమో, ముక్తికోసమో, ఇదివరలో మనం చేసిన తప్పుని సరిద్దికొనే ఉద్దేశ్యంతో ప్రాయశ్చిత్తంగానో ఈ పనులు చేస్తాం. ఇవన్నీ ఫలితాలని ఆశించి చేసే పనులు. ఏ ఫలితం ఆశించకుండా కర్మలను ఆచరించడం ఉత్తమమైన పద్దతి కానీ అలా చెయ్యడం చాలా కష్టమని విజ్ఞులు అంటారు. వీటికి పూర్తి వ్యతిరేకంగా అధమమైన చర్యలు కొన్ని ఉంటాయి. కొంతమంది రాజకీయనాయకులని, ప్రభుత్యోద్యోగులని, వ్యాపారస్తులని చుస్తూ ఉంటే అధమమైన కర్మలు అంటే ఏమిటో తెలుస్తుంది. ప్రజాధన్నాన్ని వాళ్ళ తాతగారిసొమ్ములా వేల కోట్లలో మింగేస్తూ, నిర్లజ్జగా తిరిగేస్తూ ఉంటారు కొందరు నాయకులు. ప్రజలు చెల్లించిన పన్నులని పెద్ద, పెద్ద పే పేకెట్లగా జీతాలు అందుకొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఏపనీచేయ్యితడవకుండా చెయ్యరు. ప్రతీ చిన్నదానికీ లంచం కావలసిందే. ఇక మోసపూరిత వ్యాపారులు ఎక్కువలాభాలకోసం ప్రతీదీ కల్తీ చెయ్యగలరు. రోగులు వాడే మందులు, పసిపిల్లలకు పట్టే పాలపొడి, వంటల్లో వాడే నూనె... అదీ, ఇదీ లేదు.

తత్వశాస్త్రం గురించి మాట్లాడుకొంటున్నప్పుడు కొన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఉదాహరణకి ఇటువంటి కర్మల గురించిన చర్చలో `ఆత్మ శాశ్వతమైనది, కర్మల యొక్క ఫలితాలను తనతో తీసుకొని వెళుతుంది` అనే విషయాల మీద నమ్మకం ఉంచాలి. స్వామీ వివేకానంద అంటాడు, `ముందుజన్మల కర్మల ఫలితంగా మనకు కలిగిన అర్హత వల్లే మనం ఏదయినా పొందగలం,` అని. దీనికి ఒక చక్కని ఉదాహరణకూడా చెపుతాడు. మూర్ఖుడు ఒక లైబ్రరిలో ఉన్న పుస్తకాలన్నింటినీ ఇంటికి తెచ్చుకోవచ్చు కానీ, `ఎన్ని చదువుతాడు?` అనేది అతని మునుపటి కర్మలద్వారా పొందిన అర్హతపైన ఆధారపడి ఉంటుంది అని. అలాగే ధనం కూడా. కొన్ని వేల కోట్లు అక్రమంగా గడించినవాళ్ళు అనుభవించగలిగేది ఎంత?
మునుపటి కర్మలవల్ల పొందిన అర్హత కారణంగా ఇప్పుడు ఇలా ఉన్నాం. కాబట్టి, ఇప్పటి పనుల ఫలితంగా భవిష్యత్తులో మనకి మంచిఅర్హత లభించాలంటే ఏమిచెయ్యాలి? దీనికి సమాదానం నిష్కామ కర్మ అని చెపుతారు. పైన చెప్పుకొన్నట్టు పలితం ఆశించకుండా చేసే పని ఉత్తమమైనది, దుర్లభమైనది. జీతం తీసుకొకుండా, ప్రమోషన్ ఆశించకుండా ఉద్యోగం చేస్తాను; లాభం లేకుండా వ్యాపారం చేస్తాను అంటే ఎవరికీ కుదరదు.  కాబట్టి మధ్యేమార్గంగా కనీసం ఎవరినీ మోసం చెయ్యకుండా వ్యాపారం, లంచాలు తీసుకోకుండా ఉద్యోగం, ప్రక్కవాడికి గోతులుతియ్యకుండా పని, ప్రజాదనాన్ని కబళించకుండా పరిపాలనా చేస్తే కర్మల ఫలితంగా వచ్చే అర్హతలని పెంచుకోవచ్చు!

ఆత్మమీద, కర్మఫలితాలమీదా ఏమాత్రం నమ్మకం లేకపోయినా కూడా, ఇలా చెయ్యడంవల్ల ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవచ్చు. తలయెత్తుకొని జీవించవచ్చు.
© Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!