Pages

Showing posts with label ఈ తూరుపు... ఆ పశ్చిమం. Show all posts
Showing posts with label ఈ తూరుపు... ఆ పశ్చిమం. Show all posts

Sunday, 6 March 2022

అమృతం కురిసిన రాత్రి

బ్లాగ్‌లో సంవత్సరానికి ఒక టపా కూడా పడడం లేదు. పని ఒత్తిడి, అశ్రద్ధ, బద్దకం.. అన్నీ అలా కలిసివచ్చేస్తున్నాయి. ఎప్పుడైనా పాత పోస్టులు చూసుకొని ఆనందపడిపోయి, అంతలోనే అలా ఇప్పుడు రాయడం లేదని బాధపడిపోయి... ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ... హుహ్! అన్నట్టు ఆమధ్య ఎప్పుడో రాసిన దేవరకొండ బాలగంగాధర్ తిలక్‌గారి 'అమృతం కురిసిన రాత్రి' కవితాసంపుటిపై నా చిరు స్పందనకి, వీడియో రూపం ఇచ్చి యూట్యూబ్‌లో పెట్టాను. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మీ స్పందన తెలియజేస్తే సంతోషం. 

- Dantuluri Kishore Varma

Monday, 2 March 2020

ద స్కూల్ అమాంగ్ పైన్స్

బడికి వెళ్ళడం అంటే - చాలామందికి ఇంటి ముందో, రోడ్డు జంక్షన్‌లోనో వాహనం ఎక్కి పాఠశాల ముందు దిగడం, కొద్ది మందికి ఓ అరకిలోమీటరో, కిలోమీటరో నడిచి వెళ్ళడం. అలా వెళ్ళగలిగిన వాళ్ళు అందరూ అదృష్టవంతులు. రస్కిన్‌బాండ్ రాసిన 'ద స్కూల్ అమాంగ్ ద పైన్స్' అనే కథలో మాత్రం ఇట్లాంటి అదృష్టవంతులైన విద్యార్థులు మనకు కనిపించరు.  

కోలీ అనే చిన్న ఊరిలో ఐదవ తరగతి దాకా చదువుకొన్న బీనాని, అక్కడికి ఐదారు మైళ్ళ దూరంలో ఉన్న నౌటీ అనే ఊరిలో హైస్కూల్లో వేశారు. ఆమెకి తోడుగా ఉంటాడని ఆమె తమ్ముడు సోనూని కూడా చేర్చారు. అంతకు ముందునుంచే నౌటీ స్కూల్‌లో చదువుతున్న బీనా వయసే ఉన్న వాళ్ళ ఊరి కుర్రాడు ప్రకాష్ వాళ్ళతో పాటూ బడికి నడచి వెళుతుండగా కథ ప్రారంభమౌతుంది.


ఉత్తరాఖండ్‌లో ఉన్న చిన్న చిన్న ఊళ్ళు ఇవి. ఊరికి ముప్పై నలభై గడపలు ఉంటాయి. ఓ చిన్న కిరాణా కొట్టు ఉండొచ్చు. ప్రజలు ప్రధానంగా వ్యవసాయం చేసుకొంటారు. పిల్లలు పొలం పనుల్లో, ఇంటిపనుల్లో పెద్దవాళ్ళకి సహాయం చేసి,  వాగునుంచి మంచినీళ్ళు తెచ్చి, పశువులకి గడ్డి కోసి, వేసి, బడికి మైళ్ళకొద్దీ నడచి పోయి చదువుకొంటారు. ఎన్నో కాలిబాటలు కొండల ప్రక్కనుంచి, పొలాల మధ్యనుంచి, అడవుల గుండా, వాగుల్లోకి దిగి-ఎక్కి వైకుంఠపాళీ ఆటలో పాముల్లా మెలితిరిగి పోతుంటాయి.  దారిలో అడవి జంతువులు, పాములు ఎదురు పడొచ్చు, కొండచరియలు విరిగి పడతాయి,  వాగులు పొంగుతాయి, వాగు దాటినప్పుడు జలగలు పట్టుకొంటాయి, కుంభవృష్ఠి వర్షాలు కురుస్తాయి.  బడికి వెళ్ళి రావడం అంటే పెద్ద సాహసం చెయ్యడమే.


ఇప్పుడు మళ్ళీ కథలోకి వద్దాం. పిల్లలు  ఎత్తైన పైన్ చెట్ల మధ్యన ఉన్న బడి దగ్గరకి వచ్చేసరికి అంతా హడావుడిగా ఉంది. మాథ్స్ టీచర్ మణి కనిపించడంలేదు. గత కొంతకాలంగా ఊరిలో కుక్కల్నీ, మేకల్నీ చంపి తీసుకుపోతున్న చిరుత ఈ సారి మణిసార్‌ని తీసుకుపోయి ఉంటుందని అంతా అనుకొంటున్నారు. కాని అదృష్టవశాత్తూ అలా జరగలేదు. ఏదో పనిమీద వెళ్ళిన మతిమరుపు మణి మాష్టారు అడవిలో దారి తప్పిపోయి మధ్యాహ్నానికల్లా క్షేమంగా తిరిగి వచ్చేశాడు .



బీనా తరగతిని కొత్తగా అపాయింట్ అయిన మిస్ తానియా రమోలా అనే టీచరుకి ఇచ్చారు. ఆమె పైతరగతి విద్యార్థులకంటే కొంచెం పెద్దదానిలా ఉంది. టీచర్ అందమైన చేతులు చూసి 'ఈమె ఎప్పుడూ పొలం పని చేసి ఉండదు, ఆవులకి పాలు పితికి ఉండదు' అనుకొంటుంది బీనా. సాధారణంగా పిల్లలు తమని టీచర్‌తో పోల్చి చూసుకొంటారు కదా?  

సాయంత్రం పిల్లలు ముగ్గురూ బడినుంచి ఇంటికి వెళుతుండగా ఎదురు వచ్చిన పాలవాడు - ఉదయం వాగు దగ్గర చిరుతని చూశాననీ, తొందరగా ఇంటికి వెళ్ళిపొమ్మనీ - వాళ్ళని హెచ్చరించాడు.  అడవులు నరికేయడం వల్ల, కార్చిచ్చుల వల్ల, ఆనకట్టలు లాంటివి నిర్మిస్తూ ఉండడం వల్ల అడవిలో జంతువులు జనావాసాల్లోకి వచ్చేస్తూ ఉంటాయి.


రోజులు గడుస్తున్నాయి. ముళ్ళ పందులు మణిసార్ పెరటిలో బంగాళాదుంపల పంటని రోజూ రాత్రి వచ్చి తినేసి పోతున్నాయి.  రాత్రంతా కాపలా కూర్చొని, ముళ్ళపందుల అలికిడి అయినప్పుడల్లా టార్చ్‌లైటూ, దుడ్డుకర్రా పట్టుకొని తోటలోకి వెళ్ళేసరికి ఒక్క పందీ కనిపించడం లేదు. ఇలాగే కనుక కొనసాగితే ఒక్క దుంపా మిగలదని మణి మాష్టారు దిగులు పడి కూర్చోవడంతో, హెడ్‌మాస్టర్ అనుమతి తీసుకొని పిల్లలంతా మాష్టారి తోటచుట్టూ చిన్న కందకం తవ్వి, దగ్గరలో ఉన్న వాగునుంచి నీటిని అందులోకి మళ్ళించారు.  'ముళ్ళపందులకి నీళ్ళంటే పడదని' ప్రకాష్ చెప్పిన మాట నిజమయ్యింది. పందులు మళ్ళీ మాష్టారి పెరడులోకి రావడం మానేసాయి.

మార్చ్ - ఏప్రిల్ నెలలు వచ్చేసరికి కొండవాలులు అన్నీ రకరకాలు రంగురంగుల అందమైన పువ్వులతో నిండిపోయాయి. క్రమంగా పగళ్ళూ, రాత్రులూ వేడేక్కాయి. జూన్ మాసం ప్రవేశించడంతో కొండలు బూడిద కొట్టుకుపోయినట్టు బొగులెత్తిపోయాయి. అడవిలో కార్చిచ్చు రగులుకొని స్కూల్ చుట్టుప్రక్కలంతా వ్యాపించడంతో మూడురోజులపాటు ఎవరూ బడికి పోలేకపోయారు.

జూన్ చివరికల్లా ఋతుపవనాలు ప్రవేశించాయి. పెద్దపెద్ద చినుకులతో వచ్చిన తొలకరి వాన అద్భుతమైన మట్టివాసనను వెదజల్లింది. ప్రకృతికి ప్రాణం వచ్చినట్టయ్యింది. పక్షులు, పంటలు, కొండలు, చెట్లు, ఆకులు... ఆన్నీ కొత్తశొభను సంతరించుకొన్నాయి. పిల్లలు పెద్దవాళ్ళకి చిక్కుళ్ళు, జొన్నలు, దోస పంటలు నాటుకోవడంలో సహాయం చేస్తున్నారు. వర్షాలవల్ల కొండల్లో నీటిదారలు జలపాతాల్లా మారిపోయాయి. చీలమండలోతు వాగులు మోకాటి లోతయ్యాయి. కప్పల బెకబెకలు మొదలయ్యయి. హిమాలయాల దిగువ ప్రాంతంలో వర్షాకాలం మూడునెలలు ఉంటుంది. మేఘాలతో, వర్షంతో, మంచుతో తడిసి ముద్దవుతుంది.

ఒకసారి సమీపంలో నిర్మాణంలో ఉన్న, దేశంలోనే అతి పెద్దదైన తెహ్రీ డ్యాం చూపించడానికి విద్యార్థులని తీసుకొని వెళతారు. డ్యాం కట్టడం వల్ల కలిగే లాభనష్టాల గురించి, పర్యావరణానికి జరిగే హాని గురించి ఉపాద్యాయుల మధ్య వాదన జరుగుతుంది.


ఓ రోజు కొండచరియలు విరిగి పెద్ద చప్పుడుతో దొర్లుకొంటూ, అడ్డుగా ఉన్న వృక్షాలని, పొదలని నుజ్జు నుజ్జు చేసుకొంటూ వాళ్ళ కాలిబాటకి అడ్డంగా పడిపోవడంతో నిశ్చేష్ఠులైపోతారు. బడికి వెళ్ళే దారి మూసుకుపోయింది. ప్రకాష్  కొండతిరిగి వచ్చే కొత్త  దారిని కనిపెట్టడంతో బడికి ఎక్కువ రోజులు మానెయ్యవలసిన అవసరం తప్పింది. ఈ దారి చల్లగా ఉంది. కానీ, ఒక మైలు దూరం ఎక్కువ. వాళ్ళకు తెలియని విషయం ఏమిటంటే - చిరుత సంచరించే ప్రాంతానికి ఈ బాట మరీ దగ్గరగా ఉంది.

ఓ రోజు    ప్రకాష్, బీనా, సోనూ స్కూలుకి వెళుతున్నారు. వాళ్ళ కంటే ముందు గెంతులేస్తూ పోతున్న ప్రకాష్ పెంపుడు కుక్క, తోక ముడుచుకొని వెనక్కి పరిగెత్తి వచ్చేసింది. కాలిబాటకి అడ్దంగా చిరుతపులి వాళ్ళను చూసి ఆగిపోయింది.  చిరుత బలిష్టంగా ఉంది. గుర్రు మనే శబ్దం దాని గొంతులోనుంచి వెలువడింది. మీదకి గెంతడానికి తయారుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ముగ్గురికీ భయంతో కాళ్ళు కదలడంలేదు, మాట పెగలడంలేదు, గుండె భయంకరంగా కొట్టుకొంటుంది. కొన్ని సెకండ్ల కాలం వాళ్ళ కళ్ళలోకి సూటిగా చూసింది. పిల్లలకి లానే అది కూడా మనుష్యులకి ఎదురుపడడం అనే సందర్భం ఊహించి ఉండకపోవచ్చు.   కొన్ని క్షణాలు... తన దారిలో నిశ్సబ్ధంగా నడిచి పోయి, పైన్ వృక్షాలతో నిండిన అడవిలోకి  వెళ్ళిపోయింది.

పాటలుపాడుకొంటూ, కబుర్లు చెప్పుకొంటూ, ప్రకాష్ వేణువు ఊదుతుంటే వింటూ... రోజూ బడికి పోయి వస్తున్నారు. ఒక రోజు ఒక లేడి అరుపు విని వేటకోసం అటువైపు చిరుత పరుగు తీస్తుండగా, పిల్లలు బడికి వెళుతున్న అలికిడి అయ్యింది. చిరుత ఆగింది. వాళ్ళు దాటిన తరువాత తన వేటని కొనసాగించింది.   మ్యాన్ ఈటర్లు కాని పులులు సాధారణంగా మనుష్యులకు హాని చెయ్యవట. వాటి ప్రధానమైన వేట జింకల్లాంటి అడవి జంతువులే.

కొన్నిరోజుల తరువాత ప్రక్కకొండ శిఖరాన రెండు పిల్లలతో పాటూ ఉన్న చిరుతను చూసారు. కానీ అది వాళ్ళనేమీ పట్టించుకొన్నట్టు లేదు. 'మనం ఉన్నట్టు దానికి తెలుసు. హాని చెయ్యమని కూడా తెలుసు,' అంటాడు ప్రకాష్. 'డ్యాం కట్టేసినా మనుష్యులూ, జంతువులూ కలసి జీవించడానికి కావలసినంత ప్రదేశం ఇంకా మిగిలే ఉంటుంది' అంటాడు.

కొన్ని రోజులకి ల్యాండ్ స్లైడ్ మట్టినీ, కొండచరియల్నీ తొలగించి మార్గాన్ని పునరుద్ధరించారు. పిల్లలు ఇప్పుడు పాత దారిలోనే బడికి పోతున్నారు.      

                                *      *       *

ఇలాంటి కథలు చదవడంవల్ల భారతదేశపు భౌగోళిక వైవిద్యం గురించీ, ప్రజల జీవన విధానాల గురించీ తెలుస్తుంది. బడికి వెళ్ళి రావడం అనే అలసటను వదిలించుకోవడానికంటూ స్మార్ట్ ఫోన్లు, టీవీలతో కాలక్షేపం చేసే యువతకి - తల్లితండ్రులకి సహాయం చేసి, మైళ్ళ దూరం ప్రమాదాల మార్గంలో బడికి పోయి వచ్చే పిల్లలు దేశానికి ఆ చివర ఉన్నారని తెలిస్తే కొంత సహానుభూతి చెందుతారేమో! తమ దృక్పదంలో మెరుగైన మార్పు తెచ్చుకొంటారేమో. సాహిత్యం మనుష్యులకి చేసే మేలు అదే కదా?

                               *      *       *


(ఈ కథ రస్కిన్ బాండ్ రాసిన 'గ్రేట్ స్టోరీస్ ఫర్ చిల్డ్రెన్' అనే సంకలనంలో ఉంది. రూపా పబ్లికేషన్స్ వాళ్ళు వేశారు. ఆన్‌లైన్ బుక్‌సెల్లర్స్ దగ్గర దొరకవచ్చు. లేదంటే      ఎనీబుక్స్ అనే ఆప్‌లో ప్రయత్నించండి.)

Images used here are for illustrative purpose only.

Dantuluri Kishore Varma

Friday, 23 August 2019

రావిశాస్త్రి కథ వర్షం


రావిశాస్త్రిగా పాఠకులకు సుపరిచితుడైన ప్రముఖ తెలుగు రచయిత శ్రీ రాచకొండ విశ్వనాథశాస్త్రి గారు (1922 - 1993) వ్రాసిన 'వర్షం' కథ గురించి ఓ నాలుగు మాటలు...

కథయొక్క ఇతివృత్తాన్ని ఎంచుకోవడం దగ్గరనుంచి, రచనా శిల్పం వరకూ రచయిత పరిణితి స్పష్టంగా ఈ కథలో కనిపిస్తుంది. ప్రధానపాత్ర పురుషోత్తం, అతని వయసులో సగం కూడా లేని టీకొట్టు కుర్రాడి దృక్పదాలలో వ్యత్యాసం వర్షం నేపధ్యంలో చూపించడం చాలా గొప్పగా ఉంది.

ముఖ్యమైన పనిమీద కలకత్తా వెళ్ళాల్సిన పాతికేళ్ళ పురుషోత్తంని మేనమామ  పెళ్ళిచూపులకి అడవిపాలెం పంపించాడు.  పెళ్ళిచూపుల కార్యక్రమం ముగించుకొని, రెండెడ్ల బండి ఎక్కి రోడ్డు జంక్షన్‌కి వచ్చాడో లేదో   వర్షం మొదలైంది. పురుషోత్తం రైలు అందుకొని సరాసరి కలకత్తాకి పోవాలి.  బస్సు పట్టుకొని రైల్వే స్టేషన్కి పోవలసినవాడు  జంక్షన్ దగ్గర ఉన్న కమ్మలపాక - టీ దుకాణంలోకి దూరిపోయాడు.  రైలు రావడానికి రెండు గంటలు కూడా సమయంలేదు. బస్సు వచ్చే అవకాశం లేదు. పాక బందీఖానాలా ఐపోయింది. ఇనుప ఊచలు దిగ్గొడుతున్నట్టుగా వర్షధారలు చుట్టూ దిగుతున్నాయి. కలకత్తా వెళ్ళాల్సిన పని ఎంత ముఖ్యమైనదైనా ధైర్యం చేసి స్టేషన్ వరకూ నడిచి పోలేడు.   ఒంటరిగా పోతే ప్రమాదమనీ, వర్షంలో తడిస్తే న్యుమోనియా రావచ్చనీ... ఇంకా అలాంటి చాలా భయాలమధ్య పెరిగిన అర్భకుడు పురుషోత్తం.  ఆత్మవిశ్వాసం ఏమాత్రం లేనివాడు.

మరోవైపు టీ దుకాణం నడిపే తాత, పన్నెండేళ్ళ వయసుకూడా లేని  మనవడిని వర్షం మొదలవడానికి ముందే బొగ్గులకోసం రెండుమైళ్ళ దూరంలో ఉన్న రైలుగేటు దగ్గరకి పంపించాడు. వాడు కుర్రోడికోసం  ఆందోళన పడాలి. కానీ,  పురుషోత్తంతో  'కుర్రోడే కానీ శండశాసమ్ముండాకొడుకులే. వొరసవేనన్న మాటేటి, దిమదిమలాడుతూ ఏనుగులు దిగేసినా నెక్కసెయ్డు'  అంటున్నాడు ధీమాగా.

టీ పాక దగ్గర గంటకు పైగా కూర్చున్నాడు పురుషోత్తం. ఏళ్ళూ ఊళ్ళూ ఏకమయ్యేటట్టు కురుస్తుంది వర్షం. రోడ్డంతా నీటితో ఏటికాలవలా ఉంది. సరిగ్గా అప్పుడు కనిపించాడు దూరంనుంచి రేసుకుక్కలా పాకవైపు వసున్న కుర్రోడు. నీటిమీద బోటులా, చెట్లను చీల్చుకొని బాటవేసుకొంటూ.. పరుగెత్తి, పరుగెత్తి పాకలోకి విరుచుకు పడ్డాడు.

అరనిమిషంలో జుట్టునుంచి నీటిని నొక్కేసి, బట్టలనుంచి నీటిని పిండేసి ఆ పాకలో పొడిగా గెంతులు వేసేడు. వర్షంలో దారిలో చస్తే ఏమిచేస్తావురా? అని అడిగిన తాతకి వర్షాన్ని 'సంపిడిసిపెడతా' అని చెప్పిన కుర్రోడి నిర్భయత్వానికి పురుషోత్తం పాకలో పాతుకుపోయినట్టు నిశ్చలుడైపోయాడు.

కుర్రాడిలో ఉన్నది, తనలో లేనిది ఏమిటో అర్ధమయ్యింది. అప్పటికే మసక చీకటి పడుతుంది. పురుషోత్తం తిన్నగా సూటిగా, ఈదురుగాలికెదురుగా, వర్షాన్ని సరుకుచెయ్యకుండా చకచకా ముందుకి పోయాడు. 'సెబాసా' అనుకొన్నాడు తాత.

2018లో విశాలాంధ్రా పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు తెచ్చిన శత వసంతాల తెలుగు కథ అనే సంకలనంలో రావిశాస్త్రి గారి ఈ కథని చేర్చారు.

Wednesday, 13 January 2016

ఆముక్తమాల్యద

శ్రీకృష్ణదేవరాయల్ని సాహితీ సమరాంగణ సార్వభౌముడు అంటారు. క్రీస్తుశకం పదిహేను - పదహారు శతాబ్ధాల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినప్పుడు రాజ్యవిస్తరణ కోసం ఒక ప్రక్క దండయాత్రలు చేస్తూనే మరొక ప్రక్క తీర్థయాత్రలు కూడా చేసేవాడట. వెంట పట్టపురాణి తిరుమలదేవి, చిన్నరాణి చిన్నమదేవి ఉండేవారు. అష్టదిగ్గజకవులు కూడా వెంట వెళ్ళవలసిందే. తాను సహజంగానే కవి కనుక, మిగిలిన కవులు కూర్చిన కృతులను ఆస్వాదించడం, చక్కనైన సాహితీ చర్చలు నెరపడం, తాను స్వయంగా వ్రాసిన కావ్యాలను వారికి వినిపించడం చేసేవాడు. అందుకే ఆయనని కవిరాజు, రాజకవి అని అంటారు. శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతంలో మదాలస చరిత్ర, సత్యవధూప్రీణనము, సకలకథాసార సంగ్రహము, జ్ఞాన చింతామణి, రసమంజరి అనే కావ్యాలు రాశాడట. కానీ దురదృష్టవశాత్తూ అవేవి ఇప్పుడు లభ్యం అవడంలేదు. తెలుగులో రచించిన ఆముక్తమాల్యద మాత్రం సాహిత్య ప్రియుల్ని ఇప్పటికీ అలరిస్తుంది.   పద్యాలను చదివి, కావ్యమాధుర్యాలని పూర్తిగా ఆస్వాదించలేని వాళ్ళకోసం వాటిని వచన రూపంలో ముద్రిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదని వచనరూపంలోనే చదివాను.  జయంతి పబ్లికేషన్స్ విజయవాడ వాళ్ళు చాలా కాలం క్రితం ప్రచురించిన పుస్తకం అది.

ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాకుళంలో ఉన్న ఆంధ్రమహా విష్ణువుని దర్శించిన తరువాత, ఆయన మహారాజుకి కలలో కనిపించి ఆముక్తమాల్యదని తెలుగులో వ్రాయమని ఆదేశించాడట. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ప్రాచీన వైష్ణవ గురుచరిత్ర నుంచి గోదాదేవి వృత్తాంతాన్నీ; విష్ణుపురాణం, వరహాపురాణం మొదలైనవాటినుంచి కొందరు విష్ణు భక్తుల కథల్నీ కలిపి ఆముక్త మాల్యదని రచించాడు. మూల కథలకు మార్పులూ చేర్పులూ చేసి, అద్భుతమైన వర్ణనలను జోడించి ఈ ప్రబంధకావ్యాన్ని అనన్యసామాన్యంగా రచించాడు. ఈ కావ్యరచనకి నాలుగు సంవత్సరాల సమయం పట్టిందట.

శ్రీ విలుబుత్తూరు అనే నగరంలో విష్ణుచిత్తుడనే బ్రాహ్మణుడికి తులసివనంలో దొరికిన గోదాదేవి, విష్ణువునే ప్రేమిస్తూ పెరిగి పెద్దదయి శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాదుడిని వివాహం చేసుకోవడం ఆముక్తమాల్యదలో ప్రధామైన కథ.  విష్ణుచిత్తుడు ప్రతీరోజూ సువాసనలు ఇచ్చే తులసిదళాలలో మాలలు కట్టి దేవాలయంలోని మన్ననారు స్వామికి సమర్పిస్తూ ఉంటాడు. కానీ, మాలలు కట్టిన తరువాత, దేవుడికి అలంకరించడానికి ముందే గోదాదేవి తండ్రికి తెలియకుండా వాటిని తన తలలో ధరించి, బావి నీటిలో తన ప్రతిబింబం చూసుకొని ముచ్చటపడిపోయి, తులసి మాలల్ని యదాస్థానంలో ఉంచేది. ధరించిన పూలని దేవుడికి ఇచ్చేది కనుక ఆమె ఆముక్తమాల్యద అయ్యింది.

మధురాపురాన్ని పరిపాలించే మహారాజు మత్స్యద్వజుడు ఓ రాత్రిపూట పరివారాన్ని వెంటబెట్టుకొని తన వేశ్యఐన భోగిని వద్దకు వెళుతూ ఉండగా, మధురాపురంలో కొండమీద ఉన్న దేవుడికి జరిగే తెప్పతిరునాళ్ళ ఉత్సవం చూడడానికి వచ్చిన ఒక బ్రాహ్మణుడు ఊరిలోనే బసచేసి, తనకు ఆతిద్యం ఇచ్చిన గృహస్తుకి చెపుతున్న సూక్తులు ఆయన(మహారాజు) చెవిన పడ్డాయి. `వర్షాకాలంలో లభ్యమవని వాటిని అంతకు ముందు ఎనిమిది నెలలపాటూ సేకరించుకొని నిలువచేసుకోవాలనీ.. అలాగే, రాత్రి అవసరాలకు పగలు, వృద్దాప్యంలో అవసరాలకు యవ్వనంలో, పరలోకంలో సౌక్యాలకు ఈ లోకంలో సమీకరించుకోవాలని` ఆ మాటల అర్థం. ఆ మాటలు విన్నవెంటనే రాజుకి మోక్షం పొందాలన్న చింత మొదలయ్యింది. మోక్షాన్ని ప్రసాదించే దేవుడు ఎవరో చెప్పినవాళ్ళకి పెద్ద బహుమానం ఇస్తానని ప్రకటించాడు. ఎంతోమంది విజ్ఞులు రాజ సభకు వచ్చి రకరకాల దేవుళ్ళ గురించి చెప్పారు - కానీ అవేవీ రాజుని సంతృప్తిపరచలేకపోయాయి. చివరకి శ్రీ విలుబుత్తూరులో మన్ననారుస్వామి విష్ణుచిత్తునితో స్వయంగా మాట్లాడి - మధురాపురం వెళ్ళి మత్స్యద్వజుడినికి విష్ణువు గొప్పతనాన్ని చెప్పి, ఆతనిని వైష్ణవుడిగా మార్చమని ఆజ్ఞాపిస్తాడు. విష్ణుచిత్తుడు పెద్ద పండితుడు కాకపోయినా, రాజ సభకు వెళ్ళి, తర్కంలో అందరినీ ఓడించి, విష్ణువే ఆదిదేవుడని చాందోగ్యోపనిషత్తునీ, శ్రుతులనీ ఉదహరిస్తూ నిరూపిస్తాడు. ఆ సందర్భంలోనే ఖాండిక్య, కేశిధ్వజుల కథని చెపుతాడు.  

విష్ణుచిత్తుడు మధురాపుర రాజు మత్స్యద్వజుడికి ఏవిధంగా విష్ణుమూర్తి గొప్పతనాన్ని తెలియజేశాడో, అదేవిధంగా యామునాచార్యుడు అనే ఒక బ్రాహ్మణుడు మత్స్యద్వజుని పూర్వికుడైన మరొక పాండ్యరాజుని వైష్ణవునిగా మారుస్తాడు. ఈ యామునాచార్యుని కథని స్వయంగా విష్ణుమూర్తే, లక్ష్మీదేవికి చెప్పినట్టుగా శ్రీకృష్ణదేవరాయలు కవితా కల్పన చేశాడు.  

శ్రీరంగనాధుని మీద పిచ్చి ప్రేమతో, విరహంతో రోజురోజుకీ చిక్కిశల్యమౌతున్న కూతురి అవస్థచూసి, విష్ణుచిత్తుడు మన్ననారుస్వామికి మొరపెట్టుకొంటాడు. `మాకు పూలను మాలగా గుచ్చి నీకు సమర్పించడమే తెలుసు, ఆమె వాటిని పక్కగా చేసుకొని పడుకొంటుంది. మేము నీ పాదతీర్థాన్ని పుచ్చుకొని దాహంతీర్చుకొంటాం, ఆమె ఆనీటిని వొళ్ళంతా పూసుకొంటుంది. మేము యోగాభ్యాసం చేస్తూ నిన్ను స్మరిస్తాము, ఆమె మరీబారంగా - దీర్ఘంగా ఊపిరితీసి వొదులుతుంది. ఈ అతి తపస్సు ఏమిటో నువ్వే తెలుసుకొని మాకు చెప్పాలని` కోరతాడు. అప్పుడు మన్ననారుస్వామి  భక్తునితో మాట్లాడుతూ మాలదాసరి అనే ఒక విష్ణుభక్తుని కథను చెపుతాడు. నిరంతరం విష్ణు సంకీర్తన చేసే మాలదాసరి తాను పాడిన ఒక కీర్తనలో చివరిచరణం ద్వారా వచ్చే పుణ్యాన్ని ఒక రాక్షసుడికి దారబోయడంద్వారా అతనికి శాపవిమోచనం కలిగిస్తాడు. `ఈ కథలు తెలిసిన భూదేవి నాలో చేరాలనే కోరికతో నీ కూతురిగా పెరుగుతూ, నన్నే ప్రేమించి విరహతాపం పొందుతుంది. అదే ఆమె చేసే తపస్సు` అంటాడు. 

ఆముక్తమాల్యదలో ఉపకథల్ని ప్రథాన కథలో అనుసంధానించడం, కథని నడిపే తీరు అమోఘం. కావ్యం విష్ణు భక్తుల కథల సమహారం కనుక, దేవదేవుని వర్ణనలు కూడా ఆద్యంతమూ ఉంటాయి. వీటికి తోడు భక్తి, వేదాంత చర్చలు, తత్వబోధలు ఉంటాయి.  ఖాండిక్యుడు, కేశిధ్వజుడు అనే అన్నదమ్ముల మధ్య సంవాదంలో భగవధ్గీత సారాన్ని, ముఖ్యంగా జ్ఞానయోగాన్ని సరళంగా చెప్పిన విధానం బాగుంటుంది. అలాగే యామునా చార్యుడనే రాజు తన కుమారుడికి రాజ్యపట్టాభిషేకం చేసి, రాజనీతి బోదిస్తాడు. ఆ రాజనీతి ఇప్పటికీ ఆచరణయొగ్యంగానే ఉందని అనిపిస్తుంది. ప్రతీ వ్యక్తీ యామునాచార్యుడి రాజనీతిసూత్రాలని ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకొంటే మంచి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవచ్చు.  
  
నగరాల్ని, నగరాల్లో ఉండే ఉద్యానవనాల్ని, కోటల్ని, కొలనుల్ని, నగర స్త్రీలనీ, పువ్వులను సేకరించి మాలలు కట్టి అమ్మే పుష్పలావికల్నీ, పువ్వులు కొనడానికి వచ్చే వ్యక్తులతో వాళ్ళు జరిపే సరస చమత్కార సంభాషణల్నీ, వేశ్యలనీ చక్కగా వర్ణిస్తాడు కవి. ముఖ్యంగా ఋతువుల వర్ణన అమోఘం. గ్రీష్మ, వర్ష, శరత్, వసంత ఋతువుల్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. వర్ణనల్ని చదువుతూ ఉపమానాల వెల్లువలో ఆనందంగా కొట్టుకొనిపొతాం. పనుల వొత్తిడిలో పడి ప్రకృతిలో వచ్చే మార్పుల్ని గమనించడం మానేసాం. వర్షాన్ని, వెన్నెలని,  సూరోదయాల్ని, మంచుని, చలిని, గ్రీష్మంలో వచ్చే మావిడిపళ్ళ మాధుర్యాల్ని, పూచే పువ్వుల్ని, వీచే గాలుల్ని, పక్షుల కూతల్ని మనసుపెట్టి ఆస్వాదించం. కానీ, ఈ కావ్యం చదివితే ఆ స్పృహ కొంచెమైనా తిరిగి వస్తుందేమో!  

ఆముక్తమాల్యద గురించి ఒక్కమాటలో చెప్పాలంటే భక్తి, శృంగారం, భావుకత్వం, వ్యవహారదక్షత, విజ్ఞానం, ఆనందం... ఆన్నీ ఉన్నాయి ఈ పుస్తకంలో.

శ్రీకృష్ణుని కోసం గోపికలు చేసినటువంటి వ్రతాన్ని గోదాదేవి కూడా ముప్పైరోజులు ఆచరించి శ్రీరంగనాధుడిని పొందింది. శ్రీరంగనాధుడు ఆమెను స్వీకరించిన రోజే `భోగి` - అందుకే ఈ రోజు ప్రత్యేకంగా ఆముక్తమాల్యద గురించి ఈ వ్యాసం.

© Dantuluri Kishore Varma

Sunday, 26 April 2015

ప్రకృతిముందు మనిషి ఎంత చిన్నవాడు!

పెర్ల్‌బక్ రాసిన ది బిగ్ వేవ్ కథకి 17.04.2015 నాటి గోతెలుగు వారపత్రికలో పరిచయం రాశాను. (కథా పరిచయాన్ని ఇక్కడ చదవండి.) ప్రకృతి వైపరీత్యాల నేపద్యంగా జననమరణాల రహస్యాలనీ, తాత్వికతని రంగరించి  చిన్నపిల్లలకి కూడా అర్థమయ్యే విధంగా పెర్ల్‌బక్ చెప్పిన కథ ఇది.  

కథలో... 
ఒకరోజు ఆకాశం మేఘావృతమైంది, కొండ వెనుక దూరంగా అగ్నిపర్వతంలోనుంచి నిప్పురవ్వలు ఎగసి పడ్డాయి, భూమి కంపించింది. భూమీ, సముద్రం కలసి భూమిలోపలి అగ్నితో పోరాడుతున్నాయి. ఏ నిమిషాన్నయినా అగ్నిపర్వతం బ్రద్దలవ్వొచ్చు, భూకంపం సంభవించ వచ్చు, సునామీ రావచ్చు....
ఇంటి మిద్దెమీద నుంచొని వాళ్ళు చూస్తూ ఉండగానే ప్రమాదం ముంచుకొచ్చింది. సముద్రపు అడుగున ఎక్కడో భూమి రెండుగా చీలింది. చల్లని నీరు అఘాతంలోనికి, మరుగుతున్న రాళ్ళమీదకి దూకింది. ఫలితంగా పెల్లుబికిన ఆవిరి సముద్ర జలాలని అల్లకల్లోలం చేసింది. ఆకాశం అంత ఎత్తున పెద్ద కెరటం లేచి వొడ్డుమీద విరిగి పడింది. తిరిగి వెళ్ళే టప్పుడు గ్రామంలో ఉన్న ఇళ్ళన్నింటిని తనలో కలిపేసుకొంది...
`... మనిషన్నాకా వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. ప్రమాదాలవల్లో, ముసలితనంవల్లో, వ్యాదులవల్లో మరణం తప్పదు అనే నిజాన్ని అంగీకరించాలి. జీవితాన్ని ఆనందంగా జీవించు. మృత్యువుకి భయపడకు...`  సముద్రపు ఒడ్డున నిటారుగా ఉన్న కొండవాలులో వ్యవసాయం చేసుకొని, పండించిన కాయగూరల్ని మత్యకారులకి అమ్ముకొని జీవించే ఒక రైతు తన కొడుకు కీనోకి చెప్పిన సత్యాలు ఇవి.  
*     *     * 

నేపాల్‌లో ఖాట్మండూ నిన్నటి(25.04.2015) భూకంపానికి అతాకుతలమయ్యింది. కథలో సునామీ గ్రామంలోవాళ్ళనందరినీ సముద్ర గర్భంలో కలిపేసుకొనప్పుడు జియా అనే కుర్రవాడు పడిన వేదన నేపాల్లో బ్రతికి బయటపడిన పౌరుల్లో కనిపించింది. ప్రకృతిముందు మనిషి ఎంత చిన్నవాడు!


© Dantuluri Kishore Varma

Tuesday, 14 April 2015

బ్రోకెన్ నెస్ట్

రవీంద్రనాథ్ ఠాగోర్ రాసిన బ్రోకెన్ నెస్ట్ నవల చదివారా? ఈ నవల ఆధారంగా సత్యజిత్ రే బెంగాలీలో తీసిన చారులత సినిమా చూశారా? బెంగాలీ సినిమా మనకేం అర్థమౌతుంది అనుకొంటున్నారా? నవల చదివిన తరువాత చారులత సినమా చూస్తే చాలా బాగా అర్థం చేసుకోవచ్చు. నవల గురించి గోతెలుగు వెబ్ వారపత్రికలో ఈ వారం వచ్చిన బ్రోకెన్ నెస్ట్ నవలా పరిచయం చదవండి. లింక్ ఇదిగో ఇక్కడ ఇస్తున్నాను. బెంగాలీ సినిమా యూట్యూబ్ లింక్ ఇదిగో ఇక్కడ.




బ్రోకెన్ నెస్ట్ నవల చిన్నదైనప్పటికీ పాత్రల మానసిక సంఘర్షణ, మనస్తత్వాల విశ్లేషణ, సన్నివేశాల కల్పన అత్యద్భుతంగా ఉంటాయి.  నవలకీ, సినిమాకీ మధ్య కథ విషయంలో కొన్ని వ్యత్యాసాలున్నాయి. కానీ బ్రోకెన్ నెస్ట్ నవల తప్పనిసరిగా ఎలా చదవవలసినదో, చారులత సినిమా కూడా తప్పనిసరిగా అలానే చూడవలసినదే.  

© Dantuluri Kishore Varma

Friday, 3 April 2015

తిరిగి వచ్చారో.. రాలేదో?

`మగవాళ్ళు సాహసకృత్యాలు చెయ్యాలి,
ఆడవాళ్ళు అందుకు బహుమానంగా వాళ్ళకు తమ మనసు ఇవ్వాలి,`
అంది గ్లాడిస్ తనకు ప్రపోజ్ చేసిన మలోన్ అనే కుర్రాడితో. 

సాహసం చెయ్యడానికి మరో ముగ్గురితో కలిసి వెళ్ళాడు..
వాళ్ళు ముగ్గురూ..
ప్రొఫెసర్ చాలెంజర్, ప్రొఫెసర్ సుమర్లీ, లార్డ్ జాన్ రాక్స్‌టన్ 
జురాసిక్ ప్రపంచానికి...
మాపెల్ వైట్ అనే చిత్రకారుడు చనిపోవడానికి ముందు 
కురుపురి ఉంటుందని భావించే దిక్కునుంచే వస్తాడు. 
అటువైపే లాస్ట్ వాల్డ్ ఉండవచ్చు!
చాలా ప్రయాసల కోర్చి లాస్ట్‌వాల్డ్ ప్రాంతానికి చేరుకొన్నారు. 
దక్షిణ అమెరికా రెయిన్ ఫారెస్ట్‌లో 
ప్రపంచానికి తెలియని వింతలు ఎన్నో ఉన్నాయి. 
వాటిలో లాస్ట్‌వాల్డ్  ఒకటి. 
టెరడాక్టిలస్ అనే పక్షులని
ఆకులు అలమలూ తినే ఇగ్వాండన్ అనే జంతువుని, స్టెగోసారస్‌ని..
ఇంకా చాలా జురాసిక్ జంతువులని వాళ్ళు చూస్తారు.

భయంకరమైన రక్తపిపాసులు లాంటి
నరవానర జాతి చేతిలో పడి చావు వరకూ వెళ్ళి... 
తిరిగి వచ్చారో.. రాలేదో?
మలోన్..గ్లాడిస్‌ల ప్రేమ ఏమయ్యిందో?
పై బొమ్మలు లాస్ట్‌వాల్డ్ నవల స్ట్రాండ్ మేగజైన్‌లో సీరియల్‌గా వస్తున్నప్పటివి.


Friday, 27 March 2015

ద టన్నెల్

టన్నెల్స్ ద్వారా వేసిన పట్టాల మీద పాసింజర్ రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు
దారిలో చూపుతిప్పికోనివ్వని ప్రకృతి సోయగాల ఆస్వాదనలో తలమునకలైనప్పుడు  
కిటికీలోనుంచి వచ్చే చల్లగాలి... 
పట్టాలమీద రైలు చక్రాలు చేసే లయాత్మక సవ్వడి 
ఎప్పుడో చదివిన రస్కిన్‌బాండ్ కథ `ది టన్నెల్` ని గుర్తుకుతెస్తే 
కనిపించే దృశ్యం నిజమో.. 
ఊహల్లోనుంచి రూపం సంతరించుకొన్న అద్భుతమో తెలియక తికమక పడతాం. 

గోతెలుగు వెబ్ వారపత్రికలో నేను ఈ వారం రాసిన ద టన్నెల్ వ్యాసం చదవండి. 

మీ అభిప్రాయాలు తెలియజేస్తే సంతోషిస్తాను.  



ఫోటోలు విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే దారిలో తీసినవి.

© Dantuluri Kishore Varma

Sunday, 22 March 2015

మరో రెండు..

గోతెలుగు వారపత్రికలో నేను రాసిన మరొక రెండు ఆర్టికల్స్ వచ్చాయి. సాకీ గా సుప్రసిద్దుడైన హెచ్.హెచ్.మన్రో(1870-1916) రాసిన కథ `ది హౌండ్స్ ఆఫ్ ఫేట్` ని 13.03.2015 తేదీనాటి పత్రికలో, బంకించంద్ర చటర్జీ రాసిన ఆనందమఠం నవలని 20.03.2015 సంచికలోనూ పరిచయం చేశాను. ఆసక్తి ఉంటే చదువుతారని ఇక్కడ లింక్‌లు ఇస్తున్నాను. వాటిని చదివి మీ అభిప్రాయాలను తెలియజేస్తే సంతోషిస్తాను. 

వందేమాతరం!` అనే నినాదం వినిపించగానే వొళ్ళు గగుర్పాటు చెందుతుంది. అణువణువూ రోమాంచితమౌతుంది. చూసేది సినిమా అయినా, చదివేది నవల అయినా ఆంగ్లేయుడి బూటు కాలు మట్టిలో పొర్లుతున్న స్వాతంత్ర సమర యోధుడి పక్కటెముకల మీద బలంగా తాకినప్పుడు - అతను బాధతో `అమ్మా!` అని ఆక్రోశించడానికి బదులు ఆనందంతో `వందే మాతరం!` అని నినదిస్తే... చొక్కా గుండీలను విప్పి గుండెను తెల్ల పోలీసులకి చూపిస్తూ `కాల్చరా, కాల్చూ!` అని ఘర్జించి, తుపాకీ గుండె హృదయంలో దిగబడిన క్షణంలో కథానాయకుడు `వందేమాతరం!` అంటే... పెడరెక్కలు విరిచి కట్టి, నలుగురూ చూస్తూ ఉండగా ఉరికంభం మీదకి ఎక్కించినప్పుడు మరొక యువకుడు ఉరితాడుని ముద్దు పెట్టుకొని `వందేమాతరం!` అని సింహనాదం చేస్తే... ఆశ్చర్యపోతాం. వందేమాతర నినాదం వాళ్ళకి ఇచ్చిన స్థైర్యానికి అబ్బురపడతాం. బంకించంద్ర చటర్జీ మనసులో పుట్టిన వందేమాతర గీతం అనే ఆలోచనా విత్తనం జనాల హృదయక్షేత్రంలో పడి మహావృక్షమయ్యింది. ఒకదేశాన్ని స్వేచ్చవైపుకి నడిపించింది.వందేమాతర గీతాన్ని బంకించంద్ర చటర్జీ నేరుగా రాయలేదు. 1882లో రాసిన తన నవల ఆనందమఠంలో ఇది అంతర్భాగంగా వస్తుంది. ఆనందమఠం నవలకి నేపద్యం 1771వ సంవత్సరంలో బెంగాల్‌లో సంభవించిన మహా కరువు, సన్యాసుల తిరుగుబాటు.

నవలలో కథాకాలం నాటికి బెంగాల్ బ్రిటీష్ వాళ్ళ పాలనలో లేదు. నవాబే పరిపాలిస్తున్నాడు. జనాల నుంచి పన్నులు వసూలు చేసే హక్కు మాత్రం ఆంగ్లేయులది. ఆంగ్లేయులకి ప్రజల యోగక్షేమాలు చూడవలసిన బాధ్యత లేదు, కేవలం పన్నులు వసూలు చేసుకొనే అధికారం తప్ప. వానలు కురియక కరువు వచ్చినా రైతులనుంచి ఆంగ్లేయులకి రావలసిన పన్నులు మాత్రం తగ్గడానికి వీలు లేదు అని భావించారు వాళ్ళు. అందుకే కరువు వచ్చిన సంవత్సరమే పన్నులని అమాంతం పెంచేశారు. వాటిని కట్టడానికి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆకలితో అలమటించిపోతున్నారు. అడుక్కొందామన్నా దానం చేసే వాడు లేడు.

అక్కడక్కడా కొద్దిగా పండిన పంటల్ని రాజుగారు తమ సైన్యం కోసం కొనేశారు. ధనికులు, పేదవాళ్ళు అనే తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరినీ ఆహార కొరత తీవ్రంగా పీడిస్తుంది. పశుగ్రాసం కూడా లభ్యం అవడం లేదు. క్రమంగా ఆకలి చావులు మొదలయ్యాయి. తిండిగింజల కోసం భార్యల్నీ, పిల్లల్నీ అమ్ముకొంటు న్నారు.   వాళ్ళను కూడా ఎవరూ కొనుక్కొనేందుకు ముందుకు రాకపోవడంతో జనాలు ఏజంతువుని పడితే దానిని తినడానికి తయార వుతున్నారు. అవకాశం దొరికితే తోటి మనుషుల్ని కూడా వదిలేలా లేరు.  వ్యాధులు ప్రభలాయి.  ఊళ్ళల్లో చనిపోయిన వాళ్ళు పోగా మిగిలిన వాళ్ళు వలస పోతున్నారు. కానీ ఎక్కడి కెళ్ళినా పరిస్థితిలో మార్పులేదు. పదచిహ్న గ్రామంలో మహేంద్రసింహుడు గొప్ప ధనవంతుల్లో ఒకడు. అతని భార్య కళ్యాణి. వాళ్ళకో చిన్న పాప ఉంది. కరువుకారణంగా బందువులు, సేవకులూ చెల్లాచెదురయ్యారు. వాళ్ళ బంగళాలో ఉన్న ఆహార నిల్వలు కూడా అడుగంటుకు పోయాయి. ఇంకా ఊరిలోనే ఉండడం వల్ల ఉపయోగం కనిపించడం లేదు. అందుకే ముర్షీదాబాదో, కాసింబజారో, కలకత్తానో పోదామని నిర్ణయించుకొన్నారు. అలా వెళ్ళడానికి కూడా ప్రయాణ సదుపాయాలేమీ లేవు. ఊళ్ళు, అడవులు దాటి నడచి పోవలసిందే.  భార్యాభర్తలు నడచి, నడచి చీకటిపడే వేళకి ప్రక్క ఊరికి వెళతారు. ఆ ఊరుకూడా నిర్మానుష్యంగా ఉంది. వాళ్ళకి ఆకలితో శోషవచ్చేలా ఉంది. భార్యాపిల్లల్ని ఓ ఇంటిదగ్గర ఉంచి మహేంద్రసింహుడు పాలకోసం ముందుకు పోయాడు. అదే అదనుగా కొందరు దొంగలు విరుచుకు పడి కళ్యాణినీ, చిన్న పాపనీ ఎత్తుకొని అడవిలోనికి పారిపోయారు. ఈలోగా బ్రిటీష్ అధికారులు ప్రజలనుంచి పన్నులరూపంలో వసూలు చేసిన ధనాన్ని బండిమీద వేసుకొని సిపాయిల రక్షణతో కలకత్తాకు తీసుకొని పోతున్నారు .  భార్యా, పిల్లల కోసం వెతుకుతున్న మహేంద్రసింహుడు రక్షణకోసం వెంట తెచ్చుకొన్న తుపాకీ చేతితో పట్టుకొని వాళ్ళ కంట పడ్డాడు. అతనిని దొంగగా భావించి, బంధించి వెంట తీసుకొని పోతున్నారు.

దొంగలు కళ్యాణిని తీసుకొని వెళ్ళిన అడవిలో ఒక పురాతనమైన మఠం ఉంది. మఠం ఉందని బయటి ప్రపంచానికి తెలియనంత మరుగులో ఉంది అది. అక్కడ దేశసేవకోసం కుటుంబాలని పరిత్యజించిన సన్యాసులు ఉంటారు. దేశమాతని దేవీ స్వరూపంగా కొలుస్తారు వాళ్ళు. సన్యాసుల పేర్లు సత్యానందుడు, భవానందుడు, జీవానందుడు, ధీరానందుడు, జ్ఞానానందుడు... ఇలా ఉంటాయి. మఠంలో ఆనందులు ఉంటారు కనుకే అది ఆనందమఠం అయ్యిందేమో! కళ్యాణి ఎలాగో దొంగలనుంచి తప్పించుకొని అడవిలో పరుగెత్తడం మొదలు పెట్టింది. అదృష్టవశాత్తు ఓ ఆనందుడి కంటడింది. అతను ఆమెని రక్షించి మఠానికి చేర్చాడు. మరో వైపు మహేంద్రుడిని బందించి తీసుకొని వెళుతున్న సీపాయిలమీద కొందరు సన్యాసులు దాడి చేసి మహేంద్రుడిని విడిపించి, ధనాన్ని కొల్లగొట్టుకొని తీసుకొని పోయారు. మహేంద్రుడిని మఠం వైపు నడిపించి తీసుకొని వెళుతూ భవానందుడు వందేమాతరం అని పాడడం మొదలు పెడతాడు. నవలలో వందేమాతర గీతం మొదటిసారి అగుపిస్తుంది. ఎంతో ప్రేరణ కలుగజేసే గొప్పతనం ఆ పాటలో ఉంది. ఒక్కసారి విన్న మీదట మహేంద్రుడు కూడా గీతాలాపనలో తన స్వరాన్ని కూడా కలుపుతాడు. పాడుతూ ఉండగా అప్రయత్నంగా కనులవెంట జలజలమని కన్నీరు ధారాపాతంగా కారుతుంది.

ఆనందుల కారణంగా మహేంద్రుడు, కళ్యాణీ తిరిగి కలుసుకో గలిగారు. మహేంద్రుడికి దేశసేవలో భాగం పంచుకొందామని ఆలోచన కలిగింది. కానీ అందుకోసం భార్యా పిల్లల్ని పరిత్యజించాలి. చాలా డోలాయమానంలో పడ్డాడు. వాళ్ళను పదచిహ్న గ్రామంలో తన ఇంటిలో విడిచిపెట్టి, నమ్మకమైన సేవకులని నియమించి తిరిగి అడవిలోనికి వచ్చి ఉద్యమంలో జేరాలని అనుకొంటున్నాడు. కళ్యాణికి ఆతని ఆలోచన అర్థమయ్యింది. ఆమెకి భర్తను విడిచి ఉండడం ఇష్టంలేదు, అలాగని ఆతని అభీష్టానికి అడ్డం కాదలచుకోలేదు. అందుకే విషాన్ని మింగింది. అప్పుడే వాళ్ళ బిడ్డ కూడా ప్రమాదవశాత్తూ ఒక విషపు మాత్రను నోటిలో వేసుకొంది. ఇద్దరూ స్పృహ తప్పిపోయారు. మహేంద్రుడు వాళ్ళు మరణించారని భావించాడు. విలపిస్తున్నాడు. సత్యానందుడు అటువెళుతూ మహేంద్రుడిని చూశాడు. అతనిని వోదారుస్తూ, సంకీర్తన చేస్తూ చెంతనే కూర్చున్నాడు.  అంతలో ఒక సిపాయిల దళం అడవిలోనికి వచ్చింది. సన్యాసులంటే వాళ్ళ దృష్టిలో విప్లవకారులు. అందుకే సత్యానందుడినీ, అతనితో పాటూ ఉన్న మహేంద్రుడిని నిర్బందించారు. సత్యానందుడు సంకీర్తనని కొనసాగిస్తున్నాడు. అతను పాడే కీర్తనలోనే ఒక సందేశం ఇమిడి ఉంది-

`ధీరసమీరే తటినీతీరే
వసతివనే పరనారీ!
మా కురు ధనుర్థర రమన విలంబన
మతి విధురా సుకుమారీ!`

నదిచెంతనే ఒక నారీమణి స్పృహతప్పి పడి ఉంది చూసుకోమని తోటివారికి సంకేతం ఇస్తున్నాడు. సైనికులకు మాత్రం అది ఒక పాట మాత్రమే!  మహేంద్రుడిని, సత్యానందుడినీ కారాగారంలో నిర్భందించారు. సమీపంలో ఉన్న కొందరు సన్యాసులు సత్యానందుని సంకీర్తన విన్నారు. మహేంద్రుడి బార్యనీ, పిల్లనీ వాళ్ళు విడివిడిగా కనుగొని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.  మరునాడు తెల్లవారేసరికి ఆనందమఠపు సభ్యులందరూ ఏకమై కారాగారం పైన దాడిచేసి ఖైదీలనిద్దరినీ విడిపించారు.

*     *     *

నవల తరువాతి భాగంలో శాంతి కథ వస్తుంది. ఆనందమఠంలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న జీవానందుడి భార్య ఈమె. ఉద్యమం కోసం భార్యని వదిలేసి జీవానందుడు వెళ్ళిపోయాడు. భర్త లక్ష్యానికి అడ్డుతగలకుండా ఉండేందుకు ప్రాణత్యాగం చెయ్యాలనే ఆలోచనలుగల కళ్యాణిలాంటి మహిళ కాదు శాంతి. యుద్ద విద్యలు నేర్చుకొంది. మగవాడిలా వేషం వేసుకొని నేరుగా ఆనందమఠానికి పోయింది. అక్కడే సన్యాసం స్వీకరించి జీవానందుని చెంత చేరిపోయింది. తరువాత సన్యాసులకు ఆంగ్లేయులతో యుద్దం జరిగినప్పుడు చురుకైన పాత్ర పోషించింది.  

*     *     *

కరువు కాలం గడిచింది. వానలు పడ్డాయి. కాని అప్పటికే చాలా మంది ప్రజలు చనిపోయారు. రుపాయికి ఆరణాల వంతు జనాభా కరువు కారణంగా నశించిపోయిందని రచయిత చెపుతాడు. ఇళ్ళల్లో నివశించడానికి, పొలాలు సాగు చెయ్యడానికి సరిపడినంత మంది జనాలు లేక పొలాలు, ఊళ్ళు అడవులుగా మారిపోతున్నాయి. సన్యాసుల ప్రాభవం బాగా పెరిగింది. ఎందరో ఉద్యమంలో చేరుతున్నారు. అంతలో  గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ కేప్టెన్ దాంసన్ అనే అతడిని సన్యాసుల ఉద్యమాన్ని అణచడానికి నియమించాడు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి పదివేలమంది సన్యాసులు అడవిలో చేరారు.  ఆంగ్లేయ సైనికుల మీద మరునాడు దాడి చెయ్యాలని సన్నాహాలు చేసుకొంటున్నారు. హటాత్తుగా దాంసన్ వారిని ఆన్నివైపులనుంచీ చుట్టుముట్టాడు. మరపిరంగులు, తుపాకులు నిర్దాక్షిణ్యంగా గర్జించాయి. భీకర యుద్దం జరిగింది. ఎందరో సన్యాసులు మరణించారు. కానీ చివరికి విజయం సన్యాసులనే వరించింది.  

సన్యాసులు ఉత్సవాలు చేసుకొంటున్నారు. మహేంద్రుడు పదచిహ్న గ్రామానికి వెళ్ళిపోయాడు. తన భవంతిని కోటగా మార్చాడు. యుద్ద సామాగ్రిని సేకరించి, తయారు చేసి మహేంద్రుడి ఇంటిలోనే ఉంచుతున్నారు. కళ్యాణి బ్రతికి ఉందని మహేంద్రుడికి తెలిసింది. శాంతి చేసిన సహాయం వల్ల కళ్యాణి మహేంద్రుడిని కలుసుకోగలిగింది. సన్యాసులకి ఆంగ్లేయులతో మరో పోరాటం జరిగింది. ఈ సారీ విజయం వందేమాతర నినాదంతో ముందుకు ఉరికిన సన్యాసులదే.

*     *     *

ఆనందమఠం నవలని భారతదేశ చారిత్రక నవలలల్లో అత్యంత ప్రధానమైనదని విమర్శకులు భావిస్తారు. బంకించంద్ర చటర్జీ ఈ నవలని బెంగాలీ్‌లో రాశారు. తరువాత ఇతర భాషలలోనికి అనువదించబడింది. ఈ నవలలో ఉపయోగించిన వందేమాతరం  గీతాన్ని 1896 కాంగ్రెస్ మహాసభల సందర్భంగా రవీంద్రనాథ్ టాగోర్ ఆలపించారట. తరువాత వందేమాతరం ఎంతో ప్రఖ్యాతి చెందింది. స్వాతంత్ర్య సంగ్రామంలో జాతీయవాద నినాదంగా వాడబడింది.  స్వాతంత్ర్యానంతరం భారత జాతీయగేయంగా ప్రభుత్వం వందేమాతరాన్ని స్వీకరించింది. ఆనందమఠం నవల ఆధారంగా విజయవంతమైన హిందీ సినిమా నిర్మించారు. సినిమాలో లతా మంగేష్కర్ పాడిన గీతం ఎంతో బాగుంటుంది. తరువాత చాలా కాలానికి మొన్న మొన్న ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించి పాడిన వందేమాతరం ఎంతగా ప్రజాధరణ పొందిందో మనందరికీ తెలిసిందే కదా?

వందేమాతరం!

© Dantuluri Kishore Varma

Friday, 6 March 2015

ఈ తూరుపూ.. ఆ పశ్చిమం

గోతెలుగు వెబ్ వార పత్రికలో నా శీర్షిక `ఈ తూరుపూ.. ఆ పశ్చిమం` ఈ రోజు నుంచి ప్రారంభమయ్యింది. చదివి మీ అభిప్రాయాలనీ, సూచనలని తెలియజేయాలని కోరుకొంటున్నాను. ఫేస్‌బుక్ ఫ్రొ్‌ఫైల్ ఉపయోగించి మీ విలువైన మాటల్ని నేరుగా గో్‌తెలుగు ఆర్టికల్ దగ్గరే పోస్ట్ చేసే అవకాశం ఉంది. ధన్యవాదాలు. శీర్షిక విజయవంతంగా కొనసాగడానికి మీ ఆశీశ్సులు కోరుకొంటూ..   

భారతదేశపు ధార్మికత, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, అహింస, వేదాలు, హిమాలయాలు.. ప్రపంచాన్ని మనవైపుకు ఆకర్షిస్తూ ఉంటాయి. బహుశా వస్తువైవిధ్యం కోసం, కథాశిల్పం కోసం మనం పశ్చిమదేశాల సాహిత్యం చదవాలని కోరుకొంటాం.  దేశం ఏదైనా ప్రతీ మనిషిలోనూ భావోద్వేగాలు ఉంటాయి. ప్రేమలో ఉద్వేగం, విరహంలో బాధ, బాధలో కన్నీళ్ళు, ఇతరుల కష్టాలకు `అయ్యో!` అనుకోవడం, అన్యాయం జరిగినప్పుడు కట్టలు తెంచుకొనే కోపం, ఏమీ చెయ్యలేనప్పుడు కలిగే నిస్పృహ, విజయం వచ్చినప్పుడు వెల్లువెత్తే ఉత్సాహం కథ కథలోనూ అనుభూతి చెందవచ్చు. ఈ మధ్యనే నోబుల్ శాంతి పురస్కారం అందుకొన్న మలాలా యూసఫ్‌జాయ్ ఆత్మ కథ `అయాం మలాలా` చదివితే పాకిస్థాన్లో తాలిబన్ల దుశ్చర్యలు తెలుస్తాయి. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో జర్మన్ నియంత హిట్లర్ నేత్రుత్వంలో హోలోకాస్ట్ పేరుతో ఆరుకోట్లమంది యూదులని ఊచకోత కోసారు. ఆ నేపద్యంలో అన్నే ఫ్రాంక్ అనే ఓ పద్నాలుగేళ్ళ పిల్ల నాజీ సైనికులకు దొరకకుండా అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు రాసుకొన్న డైరీ ఓ చీకటి అధ్యాయానికి ప్రత్యక్ష సాక్షి. దేశ విభజన సమయంలో సరిహద్దు దాటుతూ ఉండగా హిందూ, ముస్లింలు పరస్పరం జరుపుకొన్న నరమేదం కుష్వంత్‌సింగ్`ఏ ట్రెయిన్ టు పాకిస్తాన్` లో చదవవచ్చు.

గాన్ విత్ ద విండ్ అనే నవలలో రచయిత్రి మార్గరెట్ మిశ్చెల్ యాష్లే అనే పాత్రతో మెచ్చుతునక లాంటి ఒక మాట చెప్పిస్తుంది. `చదువుకోవడానికి పుస్తకాలు ఉంటే ప్రపంచంలో ఏమూలయినా నాకు యూరోప్‌తో సమానం,` అని. కాళిదాసు రాసిన మేఘసందేశమో, షేక్స్పియర్ రాసిన రోమియో అండ్ జూలియట్టో, శరత్‌బాబు రాసిన దేవదాసో, టాగోర్ కథలో, ఆర్.కే. నారాయణ్ చిన్న పిల్లవాడి ప్రపంచం స్వామీ అండ్ ఫ్రెండ్సో  జేన్ ఆస్టిన్ ప్రైడ్ అండ్ ప్రెజుడీసో.. ఆఖరికి హారీ పోటర్ నవలలో చదువుతుంటే మనం ప్రపంచంలో ఏ మూల ఉన్న అది మనకు ఇష్టమైన ప్రదేశంగానే అనిపిస్తుంది! 

ఓ మంచి పుస్తకం ఓ కొత్త జీవితానుభవాన్ని మోసుకొచ్చి పరిచయం చేస్తుంది. `వందపుస్తకాల్ని చదువు, వంద జీవితాలను నువ్వు జీవించినట్టే,` అంటారు విజ్ఞులు. కళ్ళు తెరిచి చూపుని అక్షరాల వెంట పరిగెత్తిస్తుంటే కలల తివాచీ మీద కొత్త లోకాల్ని చుట్టిరావచ్చు.  ఒక్కోసారి  చదువుతూ ఉండగా మనసులోనో, మెదడులోనో కొత్త కిటికీలు తెరుచుకొంటాయి. ధగద్ధగాయమానమైన వెలుగులు కలల తివాచీని భూమిమీదకి దించుతాయి, వాస్తవాలని ఎరుక పరుస్తాయి.

వందో.. మరెన్నో.. పుస్తకాలను చదవడం ఓకే! అయితే, `ఏ వందపుస్తకాలని చదవాలి?` అనే ప్రశ్న వస్తే వేటిని ఎంచుకొంటాం? ఎన్నెన్నో సంస్కృతులు, నేపధ్యాలు, అలవాట్లు,  కష్టాలు, అనుభూతులు, పోరాటాలు, ప్రేమలు, విరహాలు, ఆశించడాలు, భంగపడడాలు.. ఈ తూర్పునుంచి ఆ పశ్చిమంవరకూ ఉన్న సాహిత్యంలో కోకొల్లలు. కనిపించిన పుస్తకమల్లా చదువుకొంటూ వెళ్ళడం అంటే, వజ్రాల గనిలో కనిపించిన రాయినల్లా ఏరుకొంటూ వెళ్ళి నట్టు. ప్రతీ రాయీ వజ్రం కాదు. అందుకే హెన్రీ డేవిడ్ థోరూ అంటాడు `అత్యుత్తమ పుస్తకాలనే ముందు చదువు, లేదంటే వాటిని చదివే అవకాశం నీకు ఎప్పటికీ రాకపోవచ్చు,` అని.

ఓ కథో, నవలో బాగా నచ్చినప్పుడు దాని గురించి నలుగురికీ చెప్పాలనిపిస్తుంది. వజ్రం దొరికితే దాచుకోకుండా ఉండలేం; వజ్రంలాంటి విలువైన విషయాలను చదివితే పంచుకోకుండా ఉండలేం! నేను చదివిన వాటిలో మీతో పంచుకోకుండా ఉండలేని మంచి కథలు, నవలలు గురించి `ఈ తూరుపు.. ఆ పశ్చిమం..` శీర్షికలో వారం వారం రాస్తాను. ఆదరిస్తారని ఆశిస్తూ...               -దంతులూరి కిషోర్ వర్మ.

© Dantuluri Kishore Varma

Thursday, 22 January 2015

ఎ పాసేజ్ టు ఇండియా

పంతొమ్మిదివందల ఇరవై నాలుగులో ప్రచురితమైన ఎ పాసేజ్ టు ఇండియాని ఆంగ్లభాషలో వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటిగా ఇప్పటికీ పరిగణిస్తారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం జరుగుతున్న కాలం నాటి కథ. కానీ ఇందులో చరిత్ర లేదు. జాతుల మధ్య విరోధాన్ని ఓ సంఘర్షణ నేపద్యంలో రచయిత చక్కగా ఆవిష్కరించాడు. ఒకవైపు ఆంగ్లేయులు, మరొకవైపు భారతీయులు - మళ్ళీ భారతీయుల్లోనే వివిధ మతాల వాళ్ళు, కులాల వాళ్ళు పాత్రలుగా అద్భుతమైన విశ్లేషణ చేశాడు. రచయిత ఆంగ్లేయుడైనప్పటికీ వలసపాలన మీద ఏహ్యత ప్రస్పుటంగా తెలుస్తుంది. పాత్రల మానసిక విశ్లేషణ, దృక్కోణం అబ్బుర పరుస్తాయి. నవలలో తాత్విక చింతన కూడా బాగా ఉంటుందని చెపుతారు. అయితే ఆ దృష్టితో ఈ నవలని నేను పరిశీలించలేకపోయాను. మరొక సారి మళ్ళీ చదివినప్పుడు ఆ విషయాలు అర్థమౌతాయేమో!

కథ చంద్రపూర్ అనే ప్రాంతంలో జరుగుతుంది. బీహార్లో పాట్నా దగ్గర ఉన్న బంకీపూర్ అనే ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని  రచయిత ఎడ్వార్డ్ మోర్గాన్ ఫోస్టర్ (E.M. Forster) సృష్టించిన చిన్న పట్టణం ఇది.  చంద్రాపూర్ గంగానది వొడ్డున ఉంటుంది. అయినప్పటికీ జనాలు నదిలో దిగి స్నానం చెయ్యడానికి ఒక్క స్నానఘట్టం కూడా ఉండదు. వొడ్డు పొడవునా నదిని కప్పేస్తూ నిర్మించిన ఇరుకు బజార్లు, అవి వేసే చెత్త... చెదారం... నదిని అపవిత్రంగా మార్చేశాయి. చంద్రపూర్‌లో విశాలమైన రోడ్లు లేవు, అందమైన దేవాలయాలు లేవు.. చూడవలసిన ప్రదేశాలని చెప్పుకోవడానికి ఏమీ లేవు - ఊరికి సమీపంలోని మరాబార్ గుహలు తప్ప. (బరాబర్ గుహలకి రచయిత ఇచ్చిన పేరు మరాబార్ అని అంటారు). ఊరి బజార్లలో, భారతీయుల ఇళ్ళల్లో సౌందర్యం అనేది వెతికినా కనపడదు. కానీ నదికి సమాంతరంగా వేసిన రైల్వే లైనుకి అవతల కొంచెం ఎత్తుమీద ఉన్న ఆంగ్లేయుల నివాస ప్రాంతం - సివిల్ స్టేషన్ తీర్చిదిద్దినట్టు ఉన్న వీధులతో, అందమైన భవనాలతో గొప్పగా ఉంటుంది. ఒకే ఊరిలో ఉన్న రెండు భిన్న ప్రపంచాలు ఇవి. ఈ రెండు ప్రాంతాల్లోనూ వరుసగా ఆంగ్లేయులంటే మండిపడే భారతీయులూ,  భారతీయులని హీనంగా చూసే ఆంగ్లేయులు ఉంటారు.  పరిపాలించే జాతికి చెందిన ఆంగ్లేయులుకీ, పరిపాలింపబడుతున్న భారతీయులకీ మధ్య స్నేహం సాధ్యమేనా అనే అంశం నవల ప్రారంభంలోనే చర్చకు వస్తుంది. ఇంగ్లండ్‌లో అయితే సాధ్యమే కానీ భారతదేశంలో మాత్రం కాదని హమీదుల్లా అనే పాత్రచేత రచయిత చెప్పిస్తాడు. క్లుప్తంగా చెప్పాలంటే నవల యొక్క కధాంశం అదే.

నవలలో కథానాయకుడు డాక్టర్ అజీజ్ ఒక ముస్లిం ఫిజీషియన్. చంద్రపూర్ మెజిస్ట్రేట్ రోనీ హీస్లోప్ అనే వ్యక్తి తన తల్లి మిసెస్ మూర్‌ని ఇంగ్లండ్ నుంచి తనకోసం కాబోయే భార్యని తీసుకు రమ్మని కోరడంతో అడెలా క్వెస్టెడ్ అనే అమ్మాయిని వెంట బెట్టుకొని మిసెస్ మూర్ భారతదేశానికి వస్తుంది. వీళ్ళు కాక నవలలో ఇంకా ముఖ్యమైన కొంతమంది ఎవరో చూద్దాం.  సైరిల్ ఫీల్డింగ్ గవర్నమెంట్ కాలేజికి హెడ్‌మాస్టర్. డాక్టర్ అజీజ్‌కి కథాక్రమంలో స్నేహితుడు ఔతాడు; చంద్రపూర్ సిటీ కలెక్టర్ మిష్టర్ టర్టన్, అతని భార్య మిసెస్ టర్టన్; బ్రిటిష్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మిష్టర్ మెక్‌బ్రైడ్; మేజర్ కేలెండర్ అనే హెడ్ డాక్టర్ - ఈయన అజీజ్‌కి పై అధికారి; నారాయణ్ గాడ్‌బోల్ ఒక బ్రాహ్మణ ప్రొఫెసర్; అమృత్‌రావ్, మొహమద్ ఆలీ - ఇండియన్ లాయర్లు. చంద్రాపూర్ సమీపంలోని మరాబార్ గుహలు ఒక పాత్రలాగే కథలో ముఖ్యమైన సంఘర్షణని ప్రవేశ పెట్టడంలో కీలకమైన భూమికను పోషిస్తాయి.

నవల ప్రారంభంలో స్నేహితులతో కలిసి డిన్నర్ పార్టీలో అజీజ్ ఆనందిస్తూ ఉంటాడు. చంద్రపూర్‌లోని ఆంగ్లేయ అధికారుల గురించి, వాళ్ళ భార్యల గురించి ప్రస్థావన వస్తుంది. మధ్యభారత దేశంలో ఒక కాలువ తవ్వుతున్న ప్రోజెక్ట్ విషయమై కలెక్టర్ టర్టెన్ భార్యకి ఒక రాజుగారు బంగారంతో చేసిన కుట్టుమిషన్‌ని లంచం పెడతాడు. కాలువ వాళ్ళ రాష్ట్రం గుండా పోయేలా ఏర్పాటు చెయ్యమని ఆయన విజ్ఞప్తి. పాపం ఆ విజ్ఞప్తిని టర్టన్ నెరవేర్చలేదు. దీనిగురించి అజీజ్ తన స్నేహితులతో అంటాడు, `మన నల్లవాళ్ళం పిచ్చోళ్ళలా లంచం తీసుకొన్న పని పూర్తిచేసి చట్టానికి దొరుకుతాం. కానీ తెల్ల వాళ్ళు మహా తెలివైన వాళ్ళు. ఏ పని కోసం లంచం పట్టారో, దానిని చెయ్యరు కాబట్టి చట్టానికి దొరికే అవకాశమే ఉండదు,` అని. అప్పుడే తన పై అధికారి మేజర్ కేలెండర్ దగ్గరనుండి పిలుపు వస్తుంది. తన అధికారాన్ని చూపించడానికి కావాలనే పిలిచి చక్కని సాయంత్రాన్ని పాడుచేస్తాడని అజీజ్ కేలెండర్‌ని తిట్టుకొంటాడు. ఇదే సమయానికి యూరోపియన్ క్లబ్బులో పార్టీ జరుగుతూ ఉంటుంది. నర్సుగా పనిచేసిన ఓ దొరసాని భారతీయులని చూస్తే తనకి వొంటిమీద తేళ్ళూ, జెర్రులూ పాకినట్టు ఉంటుందని అంటుంది. స్థానిక రోగుల విషయంలో అత్యంత దయగల పని ఏమిటంటే - వాళ్ళ చావు వాళ్ళని చావనివ్వడమే అని కూడా నొక్కి వొక్కాణిస్తుంది.  తెల్లవాళ్ళకి భారతీయులంటే చులకన భావం, భారతీయులకి ఆంగ్లేయులంటే కోపంతో కూడిని ఏహ్యత నవలలో కనిపిస్తుంది. పైకి స్నేహపాత్రంగా కనిపిస్తూ ఉన్నా హిందూ, ముస్లింల మధ్య వైరుధ్యాలు ఉంటాయి. కుల ప్రాతిపధికగా మనుష్యులని తక్కువగా చూడడం ఉంది. భారతీయ సమాజంలో ఉండే సంక్లిష్టతని ఒక ఆంగ్లేయుడైనప్పటికీ రచయిత చక్కగా పట్టుకోగలిగాడు.

మిసెస్ మూర్‌కి డాక్టర్ అజీజ్‌తో యాదృశ్చికంగా పరిచయం ఏర్పడుతుంది. క్లబ్‌లో జరుగుతున్న పార్టీనుంచి, ఉక్కబోత నుంచి బయటపడి వెన్నెల రాత్రిలో మిసెస్ మూర్ దగ్గరలో ఉన్న మసీదులోకి వెళుతుంది. అప్పటికే అక్కడ ఉన్న అజీజ్ ఆమెని చూస్తాడు. `ఇటువంటి పవిత్రమైన ప్రదేశానికి చెప్పులతో వచ్చారా?` అని కోపంగా ఆమెని ప్రశ్నిస్తాడు. కానీ, చెప్పులు బయటే విడిచి పెట్టి వచ్చానని మిసెస్ మూర్ చెపుతుంది. తన తొందరపాటుకు నొచ్చుకొంటాడు. వారిద్దరి మధ్యా కొంత స్నేహపూర్వక సంభాషణ జరుగుతుంది. తరువాత కొన్నిరోజులకి ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాష్టర్ ఫీల్డింగ్ మిసెస్ మూర్‌ని, అడెలా క్వెస్టెడ్‌నీ తన ఇంటికి ఆహ్వానిస్తాడు. అప్పుడు మూర్ అజీజ్‌ని కూడా టీకి పిలవమని ఫీల్డింగ్‌ని కోరుతుంది. డాక్టర్ అజీజ్‌నే ఎందుకు..అంటే... ఇంగ్లీష్ ఆడవాళ్ళిద్దరికీ భారతీయులతో స్నేహంచేసి భారతదేశం గురించి తెలుసుకోవాలనే ఆలోచన ఉంది  - మిసెస్ మూర్ అంతకు కొంతకాలం ముందు డాక్టర్ అజీజ్‌తో యాదృచ్చికంగా మాట్లాడిన సందర్బాన్ని పురస్కరించుకొని అతనిని కూడా ఈ పార్టీకి పిలవమని ఫీల్డింగ్‌ని కోరింది.  ఈ సందర్భంగా అజీజ్‌కి ఫీల్డింగ్‌తో స్నేహం మొదలౌతుంది. అజీజ్ మాటల మధ్యలో వాళ్ళని మరాబార్ గుహల దగ్గరకి పిక్‌నిక్‌కి తీసుకొని వెళతానని వాగ్ధానం చేస్తాడు.

అజీజ్ పిక్‌నిక్‌కి ఏర్పాట్లు చేస్తాడు. మరాబార్ గుహల దగ్గరకి వెళ్ళేవాళ్ళలో మిసెస్ మూర్, అడెల క్వెస్టెడ్, ఫీల్డింగ్ ఆంగ్లేయులు. ప్రొఫెసర్ గాడ్‌బోల్ హిందూ, మిగిలిన వాళ్ళు ముస్లింలు. ఒక్కొక్కరిదీ ఒక్కో సంస్కృతి. వీళ్ళకి భోజన ఏర్పాట్లు చెయ్యడం అజీజ్‌కి కొంత ఆందోళణని కలిగిస్తుంది. తెల్లవాళ్ళకోసం స్పూన్‌లు, నైఫ్‌లు లాంటి కట్లెరీని మొహమ్మద్ ఆలీ నుంచి అరువు తీసుకొని వస్తాడు. వాళ్ళకి బహుశా మందు పుచ్చుకొనే అలవాటు ఉండవచ్చు. ప్రొఫెసర్ గాడ్‌బోల్‌కి కొన్నింటి విషయంలో పట్టింపులు ఉన్నాయి, కొన్నింటిని పెద్దగా పట్టించుకోడు. టీ, స్వీట్లు లాంటివి ఎవరు చేసినా తింటాడు. అన్నం, కూరలూ మాత్రం బ్రాహ్మణుడే  వొండాలి. మాంసం తినడు. కనీసం కేకులని కూడా రుచి చూడడు - వాటిలో గుడ్లు కలుస్తాయి కనుక. గొడ్డు మాంసం ఎవరు తిన్నా సహించడు. కానీ అతని ఉద్దేశ్యంలో తాను తప్ప మరెవరైనా మేక మాంసం కానీ, పంది మాంసం కానీ తినవచ్చు. ఇక అజీజ్ విషయానికి వస్తే జనాలు పంది మాసం తినడం విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి. నవలలో ఆసాంతమూ ఇటువంటి క్రాస్-కల్చరల్ విషయాల విశ్లేషణ  ఉంటుంది.

మరాబార్ గుహలు అన్నీ ఒకేలాగ ఉంటాయి. ఐదు అడుగుల ఎత్తు ఉన్న సొరంగం సుమారు ఎనిమిది అడుగుల లోపలికి ఉంటుంది. సొరంగం చివర ఇరవై అడుగుల వ్యాసంతో వర్తులాకారపు గుహ ఉంటుంది. మొదటి గుహ ఎలా ఉంటుందో, నాలుగోది, పద్నాలుగోదీ, ఇరవైనాలుగోది... ప్రతీ గుహా అలాగే ఉంటుంది. రాతిమీద చెక్కుబడికానీ, గుహల దగ్గర పట్టిన తేనె పట్లు కానీ, గబ్బిలాలు కానీ.. అన్నీ ప్రతీ గుహదగ్గరా ఒకేలా ఉంటాయి. ఎవరైనా వాటిని చూసి వచ్చిన తరువాత నచ్చాయా, లేదా అని చెప్పడం కష్టం. అద్భుతం అని వర్ణించడం అసాద్యం. విసుగు పుట్టించే ఒకేరకమైన గుహలు ఎవరికైనా ఉత్సాహాన్ని ఇస్తాయా? మరాబార్ గుహల యొక్క ఇంకొక విచిత్రం ఏమిటంటే - ప్రతిధ్వని. గుహల్లో ఏ చప్పుడు చేసినా, అది గోడల్ని తాకి `భౌం!` అనే పెద్ద శబ్ధంగా మారి, మళ్ళీ మళ్ళీ తరంగితమౌతుంది. ఇటువంటి ప్రతిధ్వనికే మిసెస్ మూర్‌కి మూర్చ వచ్చినంత పనై, మొదటి గుహని సందర్శించిన తరువాత మిగిలిన వాటికి వెళ్ళడానికి నిరాకరిస్తుంది. ఒక స్థానిక గైడ్ సాయంతో కేవలం అజీజ్, క్వెస్టెడ్‌లు మిగిలిన గుహలని చూడడానికి వెళతారు.   మార్గ మధ్యంలో క్వెస్టెడ్ అజిజ్‌ని `మీకు పెళ్ళయ్యిందా?` అని అడుగుతుంది.  అజీజ్ `అవునని` చెపుతాడు. క్వెస్టెడ్‌కి ముసల్మాన్‌లలో ఉండే భహుభార్యత్వం గురించి తెలుసు. ఆ దృష్టితోనే `ఎంతమందిని చేసుకొన్నారు?` అని అడుగుతుంది. నిజానికి అజీజ్‌కి ఒకేసారి పెళ్ళవుతుంది. వాళ్ళకి ఇద్దరు బిడ్డలు కలిగిన తరువాత భార్య మరణిస్తుంది. ఆమె అంటే ప్రేమతో మరొక వివాహానికి మొగ్గుచూపడు. ఈ నేపద్యంలో క్వెస్టెడ్ అడిగిన ప్రశ్న అతనిని కొంచెం నొచ్చుకొనేలా చేస్తుంది.  తను నొచ్చుకొన్న విషయాన్ని క్వెస్టెడ్ దగ్గర వ్యక్తం చెయ్యకుండా, ఆమెనుంచి కొంతదూరం వెళ్ళి ఓ సిగరెట్ కాలుస్తూ సాధారణ స్థితికి రావడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలోనే క్వెస్టెడ్ గైడ్‌ని కూడా విడిచిపెట్టి ఓ గుహలోనికి వెళ్ళిపోతుంది. ఏ గుహలోనికి వెళ్ళిందో గైడ్‌కూడా సరిగా గమనించడు. ఆమెని వొంటరిగా  విడిచిపెట్టినందుకు అజీజ్ కోపంగా గైడ్‌ని కొట్టడంతో, వాడు అక్కడినుంచి పారిపోతాడు. అజీజ్ ఆమెని పిలుస్తూ ఎన్ని గుహలు వెతికినా ఉపయోగం ఉండదు.  ఇంతలో కొండదిగువన మోటార్‌కార్ శబ్ధం వినిపిస్తుంది. క్వెస్టెడ్ కారులో వెళ్ళిపోవడం అతను కొండ పైనుంచి గమనిస్తాడు. పిక్నిక్ నుంచి మిగిలినవాళ్ళు అందరూ రైలులో చంద్రపూర్ తిరిగి రావడంతోనే క్వెస్టెడ్ పైన అత్యాచార ప్రయత్నం చేశాడనే అభియోగంతో అజీజ్‌ని పోలీసులు నిర్భందిస్తారు.

అజీజ్ తప్పుచేసి ఉండడని ఫీల్డింగ్ బలంగా నమ్ముతాడు. ఆంగ్లేయుల్లో అతనొక్కడే అజీజ్ పక్షం. అజీజ్ తరపున కోర్టులో వాదించడానికి హమీదుల్లాతో పాటూ అమృతరావ్ అనే హిందూ వకీల్‌ని కూడా ఏర్పాటు చేసుకొంటారు. తీర్పుచెప్పబోయే జడ్జ్ - దాస్ అనే భారతీయుడు. అజీజ్ కేసు కోర్టుకి వస్తుంది. జనాలతో కిక్కిరిసిన కోర్ట్ హాలులో వాదోపవాదాలు జరుగుతాయి. అజీజ్ నిరపరాధి అని సాక్ష్యం చెప్పగలిగిన సాక్షి మిసెస్ మూర్ కూడా అందుబాటులో లేదు. ఆమెని అప్పటికే ఇంగ్లండ్ పంపించివేస్తారు. కోర్టు కేసు జరుగుతున్న సమయంలోనే మిసెస్ మూర్ ఇంగ్లాండ్ వెళుతూ, షిప్‌లోనే చనిపోతుంది. చిట్టచివరికి అడెలా క్వెస్టెడ్‌ని ఆమె కేసుని రిజిస్టర్ చేసిన మిష్టర్ మెక్‌బ్రైడ్ ప్రశ్నిస్తూ సంఘటన జరిగిన గుహలోనికి ఆమె వెంట అజీజ్ కూడా వెళ్ళాడా అని అడుగుతాడు. జరిగిన విషయాలన్నీ ఆమె స్మృతిపదంలో కదులుతూ ఉంటాయి - ఆమె ఒక్కొక్కటీ జ్ఞాపకం చేసుకొంటుంది. అడేలాకీ తాను గుహలోనికి వెళ్ళడం కనిపిస్తూ ఉంది. `వెనుకే అజీజ్ వచ్చాడా?` అని మెక్‌బ్రైడ్ అడుగుతున్నాడు. అజీజ్ వెనుకనే రావడం గురించిన జ్ఞాపకం కోసం వెతుక్కొంటుంది - కానీ, అజీజ్ సంఘటనా స్థలంలో ఎక్కడా ఉన్నట్టు ఆమెకి జ్ఞాపకం రావడం లేదు! కొంత సమయం తీసుకొని తాను పొరపాటు పడ్డాననీ, అజీజ్ తన వెంట గుహలోనికి రాలేదని చెపుతుంది.  కేసు దూది పింజలా తేలిపోయింది. జడ్జ్ అజీజ్ నిరపరాధి అని తీర్పుచెప్పాడు. చివరినిమిషంలో అంతా తల్లక్రిందులు చేసిన అడేలాని విడిచి పెట్టి ఆంగ్లేయులందరూ వెళ్ళిపోతారు. తప్పని సరి పరిస్థితుల్లో ఫీల్డింగ్ ఆమెని తన ఇంటికి తీసుకొని వెళతాడు.

అజీజ్‌కి అడెలా క్వెస్టెడ్ అంటే కోపం. హమీదుల్లా లాంటి స్నేహితుల చెప్పుడు మాటలు విని ఫీల్డింగ్‌కి అడెలా క్వెస్టెడ్‌తో సంబంధం ఉందని అనుమానిస్తాడు అజీజ్. అడెలా మంచితనం గురించి ఫీల్డింగ్ చెప్పడానికి ప్రయత్నించినా వినడు. అడెలా ఇంగ్లాండ్ వెళ్ళిపోతుంది. తరువాత కొంతకాలానికి ఫీల్డింగ్ కూడా దేశం విడిచి వెళ్ళిపోతాడు. అజీజ్ చంద్రపూర్‌కి చాలా దూరంలో ఉన్న మౌ అనే హిందూ రాజ్యానికి వెళ్ళి, రాజుగారికి వ్యక్తిగత వైద్యుడిగా ఉంటాడు. అజీజ్‌కి ఈ ఉద్యోగం గాడ్‌బోల్ వల్ల వస్తుంది. నవల చివరి భాగంలో ఫీల్డింగ్ మళ్ళీ భారతదేశానికి - మౌ ప్రాంతానికి పాఠశాలల తణికీ అధికారి హోదాలో వస్తాడు. అజీజ్, ఫీల్డింగ్‌లు కలుస్తారు. ఫీల్డింగ్ పెళ్ళిచేసుకొన్నాడని తెలుస్తుంది. క్వెస్టెడ్‌నే అయి వుంటుందని అజీజ్ అనుకొంటాడు. కానీ, అది నిజం కాదు. ఫీల్డింగ్ పెళ్ళి చేసుకొన్న వ్యక్తి మిసెస్ మూర్ కూతురు స్టెల్లా - చంద్రాపోర్ మెజిస్ట్రేట్ రోనీ హీస్లాప్‌కి సవతి సోదరి. అజీజ్ సంతోషిస్తాడు. మిత్రుల మధ్య అపోహలు అన్నీ తొలిగి పోయాయి. `ఇప్పుడు మనం మళ్ళీ స్నేహితులుగా ఉండవచ్చు కదా?` అని ఫీల్డింగ్ అజీజ్ ని అడుగుతాడు. కానీ నింగీ, నేలా `ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు,` అన్నట్టు అనిపిస్తాయి.
బరాబర్ గుహలు
 ఈ.ఎం.ఫోస్టర్ (1879 - 1970) లండన్లో జన్మించాడు. పన్నెండు సంవత్సరాల వయసులోనే కేంబ్రిడ్జ్ నుంచి వచ్చే ది ఇండిపెండెంట్ రివ్యూ అనే న్యూస్‌పేపర్‌కి ఆర్టికల్స్ రాయడం మొదలు పెట్టాడు. క్రమంగా చిన్న కథలు, ఆ తరువాత నవలలు రాశాడు. వేర్ ఏంజల్స్ ఫియర్ టు ట్రెడ్, ది లాంగెస్ట్ జర్నీ, ఏ రూం విత్ ఎ వ్యూ, హోవార్డ్స్ ఎండ్ లాంటి నవలలు రాసినా ది పాసేజ్ టు ఇండియానే ఫోస్టర్ యొక్క అత్యుత్తమమైన నవల. ఈ నవల తరువాత ఫోస్టర్ మరి ఏ నవలా రాయలేదు. భారతీయుల దృక్పదాన్ని తన పుస్తకంలో అంత బాగా రాయడానికి కారణం ఫోస్టర్ రెండుసార్లు భారతదేశానికి రావడమే. పాట్నా దగ్గర ఉన్న బరాబర్ గుహలని కూడా సందర్శించాడట. అందుకే వాటిని మరాబార్ గుహలుగా నవలలో చూపించాడు. తనది కాని జాతి గురించి, వలస పాలనలో వాళ్ళు పడే సంఘర్షణ గురించి భారతీయుల పక్షం వహిస్తూ రాయడం గొప్ప విషయం!

నాకు ఇష్టమైన నవలల్లో ఇది వొకటి. అందుకే ఈ బ్లాగ్‌లో ఈ టపా. నవల సినిమాగా వచ్చింది. ఇక్కడ చూడవచ్చు.

© Dantuluri Kishore Varma 

Saturday, 10 January 2015

మనుష్యులు రాని చోటుకోసం

అలస్కాకి పశ్చిమంగా బేరింగ్ సముద్రంలో సెయింట్ పాల్స్ అనే చిన్నద్వీపం ఉంది. ప్రతీసంవత్సరం జూన్, జూలై మాసాల్లో ఈ ద్వీపంలో ఉన్న నొవస్తోష్నా అనే బీచ్‌కి లక్షలకొద్దీ సీల్ చేపలు వస్తాయి. ఇక్కడికి సమీపంలో ఉన్న చిన్న కొండను ఎక్కి బీచ్ వైపు చూస్తే సముద్రపు కెరటాల మీద లుకలుకమని అసంఖ్యాకమైన సీల్‌చేపలు వొడ్డువైపు ఈదుకొంటూ రావడం కనిపిస్తుంది. ఇక తీరం మీద అయితే కనుచూపు మేర వరకూ లక్షల కొద్దీ సీళ్ళు దెబ్బలాడుకొంటూ, ఆటలాడుకొంటూ, విశ్రాంతి తీసుకొంటూ, కెరటాల హోరుని దాటి రణగొణ ధ్వని చేస్తూ కనిపిస్తాయి. నొవస్తోష్నా సముద్రతీరానికి వచ్చి, పిల్లల్ని పెట్టి అటు ఇటూగా అక్టోబర్ నాటి కల్లా సీలు చేపలన్నీ తిరిగి వెళ్ళిపోతాయి. 

చాలా సంవత్సరాల క్రితం సీక్యాచ్ అనే పదిహేను సంవత్సరాల మగ సీల్ ఎప్పటిలాగే ఇక్కడికి వస్తుంది. పదిహేను సంవత్సరాలంటే సీళ్ళ జీవనప్రమాణం ప్రకారం చాలా ఎక్కువ. సీక్యాచ్‌కి మెడమీద జూలు పెరిగి ఉంటుంది, కుక్కలకుండే పదునైన పళ్ళలాగ వొంపుతిరిగిన రెండు కోరలు ఉంటాయి, వెనుక కాళ్ళమీద నీటారుగా నిలబడిందంటే సుమారు నాలుగడుగుల ఎత్తు ఉంటుంది, మూడువందల కేజీల పైనే బరువు ఉంటుంది! ఆ సీజన్ అంతా కెరటాలకి సమీపంలో ఒక రాతి మీద ఉండడానికి చోటుకోసం మిగిలిన సీళ్ళతో సీక్యాచ్ భయంకరంగా పోరాడుతుంది. పోరాటాల ఫలితంగా వొళ్ళంతా రక్తసిక్తమైనా తన చోటుని ఎట్టకేలకు దక్కించుకొంటుంది. ఒక నెల ఆలస్యంగా సీక్యాచ్‌తో జతకట్టే మట్కా అనే ఆడ సీల్ నొవస్తోష్నాకి చేరుకొంది. వాటికి పుట్టిన సీల్‌చేపే కోటిక్. కోటిక్ మిగిలిన అన్ని సీల్స్ లాంటిది కాదు. దీని రంగు తెలుపు. దానిలో ప్రత్యేకత ఏముంది అని సీల్స్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు. కానీ సీక్యాచ్ ఉద్దేశ్యం ప్రకారం ప్రపంచంలో అప్పటివరకూ తెల్ల సీల్ అనేది లేనే లేదు. 
ఓ బుజ్జి కుక్క పిల్ల లాగ తల్లి కూడా బుడి బుడి అడుగులు వేసుకొంటూ నడవడం, తల్లి తెచ్చిన ఆహారం తినడం, మిగిలిన సీలు పిల్లలతో అలసిపోయేటంత వరకూ ఒడ్డుమీద ఆడుకోవడం, ఆ తరువాత నిద్రపోవడం. ఇదే పని కోటిక్‌కి. సీళ్ళు సముద్ర జంతువులు కనుక వాటికి చేపల్లాగ పుట్టకతోనే ఈత వచ్చేస్తుందని అనుకొంటాం. కానీ బుజ్జి పాపలకి ఎలా ఈత రాదో, బుజ్జి సీల్స్‌కి కూడా అలాగే ఈత రాదు. వాటికి భుజాలూ, బుర్రా బరువుగా ఉంటాయి. నీటిలోకి వెళ్ళడంతోనే బుర్ర ములిగి పోతుంది. కానీ ఈత కొట్టడం నేర్చుకొనే వరకూ సీలు చేపలు స్థిమితంగా ఉండలేవు!   `ఆరువారల వయసు వరకూ నీటి దగ్గరకు వెళ్ళకు మునిగి పోతావు. వేడి గాలులు, రాకాసి సొరచేపలు హాని చేస్తాయి జాగ్రత్తగా చూసుకో,` అని తల్లి వైట్‌సీల్‌కి చెపుతుంది. 

అక్టోబర్ వచ్చింది. కోటిక్ తల్లితో పాటూ సెయింట్ పాల్స్ ద్వీపాన్ని వదిలిపెట్టి సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఓ ఆరు మాసాల పాటు ఈదడం, వెల్లకిలా కెరటాల మీద తేలుతూ విశ్రాంతి తీసుకోవడం, డాల్ఫిన్లలాగ నీటిలోనుంచి నాలుగైదు అడుగుల ఎత్తువరకూ గెంతగలగడం, ఆహారం సంపాదించుకోవడం, శత్రువులనుంచి కాపాడుకోవడం, ప్రమాదాలకి దూరంగా ఉండడం, సముద్రపు నీటి ఉష్ణోగ్రతను బట్టి వాతావరణాన్ని తెలుసుకోవడం.. ఇలా ఎన్నో విషయాలు నేర్చుకొంటుంది. ఆ తరువాత సంవత్సరం సెయింట్ పాల్స్ ద్వీపానికి వచ్చేటప్పటికి కోటిక్ ఒక చక్కనైన సీల్.

ప్రమాదాలు సముద్రంలోనే కాదు, వొడ్డుమీద కూడా ఉంటాయి. ఓ రోజు సీల్‌చేపలను వేటాడే మూఠా నొవస్తోష్నా సముద్రతీరానికి వస్తారు. స్వేశ్చగా ఆడుకొంటున్న ఒకటి రెండు సంవత్సరాల వయసు సీళ్లల్లో ఓ వంద వాటిని ఎంచుకొని, గొర్రెలమందను తోలుకొని పోయినట్టు తీసుకొని పోతారు. మిగిలిన సీళ్ళు చూస్తాయి. కానీ వాటి ఆట వాటిదే. ఎక్కడికి తీసుకెళుతున్నారన్న ధ్యాస వాటికి లేదు.  ఇలా ఎందుకు జరుగుతుందని కోటిక్ సహచరులని అడుగుతుంది. కొన్నింటిని ప్రతీరోజూ ముఠా మనుషులు తీసుకొని పోవడం పరిపాటే అని చెపుతాయి. అంతకు మించి వాటికీ ఏమీ తెలియదు. కోటిక్ వాళ్ళను వెంబడిస్తూ వెళ్ళి ఒక భయంకరమైన దృశ్యాన్ని చూస్తుంది. ఒక అరమైలు దూరం సీల్స్‌ని అలా నడిపించుకొని పోయిన దుండుగులు దుడ్డుకర్రలతో వాటి నెత్తులమీద మోది, చర్మాలు వొలిచి తీసుకొని పోతారు. 

ఈ మారణకాండని చూసిన వైట్‌సీల్‌కి అప్పుడే ఒక లక్ష్యం ఏర్పడుతుంది. మనుష్యులు రాని ఏదైనా సురక్షితమైన తీరానికి తన సహచరులనందరినీ తీసుకొని పోవాలని నిర్ణయించుకొంటుంది. తరువాత నాలుగు సంవత్సరాల పాటు పసిఫిక్ సముద్రంలో ఉత్తరంనుంచి దక్షిణం వరకూ అటువంటి తీరంకోసం వెతుకుతూ జల్లెడ పడుతుంది. సముద్ర జంతువులు ఎన్నింటీనో అడుగుతుంది. వెళ్ళిన ప్రతీచోటా చంపబడ్డ సీళ్ళ ఎముకలు లేదా మనుష్యుల ఉన్న ఆనవాళ్ళూ కనిపిస్తూ ఉంటాయి. తిరిగి తిరిగి అలసి పోయి, నిరుత్సాహంతో తిరుగు దారి పడుతుంది. సరిగ్గా అప్పుడే పచ్చ పచ్చగా చెట్లూ చేమలతో ఉన్న ఓ చిన్న దీవిమీద పండు ముసలి సీల్ ఒకటి కోటిక్ గాధ అంతా విని, మరొక్క సారి ప్రయత్నించమని ఉత్సాహ పరుస్తుంది. ముసలి సీల్ చిన్నప్పుడు తమ జాతిని కాపాడటానికి ఒక తెల్ల సీల్ వస్తుందని ఎవరో చెపుతారు. ఆ సీల్ కోటిక్కేనా!? 

ఒకసారి సముద్రపు పక్షి ఒకటి `సీ కౌ` అనే అసహ్యంగా కనిపించే జంతువుకి కోటిక్ వెతికే ప్రదేశం తెలుస్తుందని చెపుతుంది. కోటిక్ చిట్టచివరికి సీ కౌలని వెతికి పట్టుకొంటుంది. వాటిని వెంబండించి వెళుతుంది. సముద్రంలో కొన్ని వేల అడుగుల దూరం వరకూ మునిగి ఉన్న శిల, దాని నుంచి ఓ సొరంగం, ఆ సొరంగం నుంచి దూరి ఉపరితలం మీదకి వెళితే అక్కడ బలమైన కోటగోడ మధ్యలో ఉన్నట్టు విశాలమైన తీరం! మానవ మాత్రుడెవరూ వెళ్ళలేని దుర్భేద్యమైన ప్రదేశం - కోటిక్ కంట పడుతుంది. దాని అన్వేషణ ఫలించింది! 

కోటిక్ ఆనందంతో నొవస్తోష్నా తీరానికి తిరిగి వెళుతుంది. తనవాళ్ళనందరినీ వెంటరమ్మని, వాటిని శత్రువులు లేని చోటుకి తీసుకొని వెళతానని చెపుతుంది. నొవస్తోష్నాలో సీల్‌చేపల దృక్పదం వేరు. తీరంలో ఉండడానికి చిన్న చోటుకోసం వందల కొద్దీ ఇతర సీల్స్ తో పోరాడమే వాటి పని. గత నాలుగు సంవత్సరాలలో కోటిక్ ఏనాడు ఆ పని చెయ్యలేదు. దేశ దిమ్మరిలాగ ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది. ఇప్పుడు జాతిని ఉద్దరించే మాటలు చెపుతున్నందుకు హేళన చేస్తాయి. `నాకు పోరాడటం రాక కాదు. దమ్ముంటే నాతో తలపడండి. వోడితే నా వెంట రావలసి ఉంటుంది,` అని శవాల్ విసురుతుంది. అనడమే కాదు, తన తెల్లటి చర్మం ఎర్రగా రక్తసిక్తం అయ్యే వరకూ బలిష్టమైన సీళ్ళతో భీకరంగా పోరాడి లొంగదీసుకొంటుంది. పోరాటంలో తనకి తోడు తండ్రి కూడా కలుస్తాడు. ఇద్దరూ వోడించిన వేలకొద్దీ సీళ్ళను తమవెంట కొత్త ప్రదేశానికి తీసుకొని పోతారు. తరువాత సంవత్సరంనుంచి మిగిలిని సీళ్ళు కూడా విషయం తెలుసుకొని క్రమంగా కోటిక్ సామ్రాజ్యానికి తరలిపోతూ ఉంటాయి. అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. 

రుడ్‌యార్డ్ కిప్లింగ్ రాసిన జంగిల్‌బుక్‌లో ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. ఆసక్తి ఉంటే అసలు కథని ఇక్కడ చదవండి. ఏనిమేటేడ్ ఫిలింస్ కూడా వచ్చాయి. ఇక్కడ చూడవచ్చు.  

© Dantuluri Kishore Varma

Monday, 1 December 2014

మళ్ళీ చెప్పిన ప్రేమకథ

వన్ నైట్ ఎట్ ద కాల్‌సెంటర్, టూ స్టేట్స్, త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్, రివల్యూషన్ 2020, ఫైవ్ పాయింట్ సంవన్... చేతన్ భగత్ నుంచి వరుస నెంబర్లు వస్తున్నాయి.. తరువాత నావల్ ఆరవ నెంబర్‌తో వస్తుందేమో అనుకొంటే అర నెంబర్ వచ్చింది. అదే హాఫ్ గాల్‌ఫ్రెండ్. బీహారీ కుర్రాడు మాధవ్ ఝా, ఢిల్లీ అమ్మాయి రియాల మధ్య ప్రేమకథ. 1970లో ఎరిక్ సేగల్ రాసిన లవ్‌స్టోరి నవల ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మిలియన్ కాపీలు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు చేతన్ భగత్ రాసిన హాఫ్ గాల్‌ఫ్రెండ్ నాలుగింట మూడొంతులు లవ్‌స్టోరీనే పోలి ఉన్నట్టు అనిపించింది. లవ్‌స్టోరీకి - హాఫ్ గాల్‌ఫ్రెండ్‌కి మధ్య నాకు అనిపించిన పోలికలు..

  • యూనివర్సిటీ ప్రేమకథ
  • అబ్బాయి రాయల్ బ్యాక్‌గ్రౌండ్
  • అబ్బాయి స్పోర్ట్స్ మ్యాన్, అమ్మాయికి మ్యూజిక్ ఇష్టం
  • లవ్‌స్టోరీలో కథానాయిక అనుకోని జబ్బుతో అర్థాంతరంగా చనిపోతుంది. ఆ కథ విషాదాంతం. హాఫ్ గాల్‌ఫ్రెండ్‌లో కూడా రియా కేన్సర్‌తో చనిపోబోతున్నట్టు హీరోను నమ్మించి న్యూయార్క్ వెళ్ళిపోతుంది. ఇక్కడినుంచి మాధవ్ తన ప్రియురాలికోసం వెతుకులాట ప్రారంభిస్తాడు. సా..గి, సా..గి కథ సుఖాంతం అవుతుంది.
  • లవ్‌స్టోరీలో రచయిత కథానాయిక చనిపోయిందని చెపుతూ కథ మొదలు పెడతాడు. హాఫ్ గాల్‌ఫ్రెండ్‌లో కూడా అంతే!
కథని రెండు ముక్కల్లో తెలుసుకోవాలంటే నవల బ్యాక్‌కవర్ చూస్తే సరిపోతుంది.  

పాట్నాలో గోల్‌ఘర్
చేతన్ భగత్ కథ చెప్పే విధానం. వడిగా చదివించ గలిగిన శిల్పం ఎప్పట్లాగే బాగున్నాయి. . గ్రామీణ ప్రాంత యువత మాతృభాషా మాధ్యమంలో చదువుకొని, కాలేజీలకి వచ్చిన తరువాత ఇంగ్లీష్‌లో పట్టు సంపాదించాలనుకొనే తపన మాధవ్ ఇంగ్లీష్ నేర్చుకోనే క్రమంలో కనిపిస్తుంది. అలాగే, మాధవ్ రియాలు పాట్నా వీధుల్లో తిరుగుతూ పాట్నాను పరిచయం చేస్తారు. బీహార్ స్పెషల్ లిట్టీ-చొఖా తింటారు.  తయారు చేసే విధానం చదువుతుంటే నోరూరింది :). యూట్యూబ్‌లో రెసిపీ దొరికింది. ఎప్పుడైనా తయారు చేసుకొని తినాలి! పాట్నాలో గాంధీ మైదానం ఎదురుగా ఉన్న గోల్ ఘర్‌కి వెళతారు. కరువు సంభవించిన కాలంకోసం ఆహార నిల్వలు చెయ్యడానికి బ్రిటీష్ వాళ్ళు కట్టిన గోళాకారపు ధాన్యాగారం ఇది. 1786లో కట్టిన ఈ నిర్మాణం దగ్గర ఎక్కడ చూసినా కిళ్ళీ ఉమ్ములు, లవ్‌గుర్తుల్లో చెక్కిన జంటల పేర్లూ కనిపిస్తాయి. ఒక రెండువాఖ్యాల్లో చేతన్ భగత్ భారత దేశాన్ని పట్టి చూపించాడు. బీహార్లోనే కాదు దేశంలో ఎక్కడ చూసినా ఈ రకమైన రాతలు, పరిసరాలని అపరిశుభ్రంగా మార్చడం కనిపిస్తాయి. నిట్టూర్చడం తప్ప ఏమీచెయ్యలేం. 

నిజానికి ఈ నవలని కొని చదవాలనే ఉద్దేశ్యం నాకు లేదు. కానీ, మొన్న ఒకరోజు గిఫ్ట్ వోచరు కథ అనే టపా రాశాను చూడండి. ఆ కారణం చేత కొనవలసి వచ్చింది. పరిస్థితి అసుంటిది.. ఏటి సేత్తాం!


© Dantuluri Kishore Varma

Wednesday, 26 November 2014

క్యూట్ కార్టూన్ కేరెక్టర్స్


డెనిస్ ద మేనస్

డెనీస్ ఓ ఐదున్నర సంవత్సరాల కుర్రాడు. మహా అల్లరి పనులు చేస్తూ ఉంటాడు. వీడికి తోడు రఫ్ అనే కుక్క ఒకటి. డెనీస్ తండ్రి హెన్రీ మిచ్చెల్, తల్లి అలైస్ మిచ్చెల్.

అలైస్ నాన్న - అంటే డెనిస్‌కి తాత జాన్సన్ సంవత్సరానికి ఒకటి, రెండుసార్లు వాళ్ళింటికి వచ్చిపోతుంటాడు. తాతల సంగతి తెలియనిది ఏముంది? మనవలతో కలిసి వాళ్ళకి మరింత అల్లరి నేర్పగలరు. జాన్సన్ తక్కువేమీకాదు. మనవడికి అల్లరి నేర్పి వెళ్ళిపోతే పొరుగింటిలో ఉండే రిటైరయిన  జార్జ్ విల్సన్, అతనిభార్య మార్తా విల్సన్‌లు డెనిస్ చిలిపి పనులకి బలవుతూ ఉంటారు. 

ఈ అమెరికా అల్లరి బుడుగుకి కొంతమంది స్నేహితులు కూడా ఉన్నారు. మార్గరెట్ వేడ్ అనే పిల్లకి డెనిస్ అంటే ఇష్టం. వాడి ఆరాధకురాలు అని చెప్పవచ్చు!  ఈమె కాక ఇంకా గిన గిలోటి అనే పిల్ల, జో మెక్‌డోనాల్డ్ అనే చిన్న కుర్రోడు కూడా ఉంటారు.  ఈ కేరెక్టర్ల అన్నింటితో పరిచయం అవ్వాలంటే డెనిస్ కార్టూన్లని చూడడం ఒక్కటే మార్గం. ఈ ఫేస్‌బుక్ పేజీలో చదవండి.  డెనిస్ ద మేనస్ ఫేస్‌బుక్ పేజీ

హాంక్ కెచ్చెం అనే అమెరికన్ కార్టూనిస్ట్ డెనిస్ ద మేనస్ కార్టూన్ స్ట్రిప్‌ని 1951లో గీయడం ప్రారంభించాడు. ఒకేసమయంలో ఇది ఎన్నో న్యూస్ పేపర్లలో రావడం మొదలైంది. పాఠకులకి డెనిస్ తెగ నచ్చేశాడు. వాడి అల్లరి పనులకి, అమాయకంగా అడికే ప్రశ్నలకి జనాలు పడీ, పడీ నవ్వుకొన్నారు. 1959లో టీవీ సీరియల్‌గా కూడా వచ్చి విజయవంతం అయ్యింది. ఆశ్చర్యం ఏమిటంటే ఈ కార్టూన్ స్ట్రిప్ ఇప్పటికీ కొనసాగుతుంది. మనదేశంలో డక్కన్ క్రానికల్ లాంటి పేపర్లలో కూడా వస్తుంది. డెనిస్ సృష్ఠికర్త హాంక్ కెచ్చెం చనిపోయినా అతని శిష్యులు, కొడుకూ దీనిని కొనసాగిస్తున్నారు.

టెలివిజన్ సీరీస్‌లో మచ్చుకి ఈ ఎపిసోడ్ చూడండి.

1993లో వచ్చిన సినిమా కూడా బాగుంటుంది. ఈ లింక్‌లో చూడండి:  సినిమా

పీనట్స్
చార్లెస్  షుల్జ్ (Charles Schulz) అనే ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు అమెరికాలో. మీకు అంత తొందరగా ఆయన పేరు జ్ఞాపకానికి రాకపోతే `పీనట్స్` కార్టూన్ స్ట్రిప్ గీసినాయన అంటే తెలుస్తుందేమో! ప్రింట్ సిండికేషన్ అనే సంస్థలు ఉంటాయి. వాళ్ళ పని ఏమిటంటే ఎడిటోరియల్ కాలమ్‌స్‌ని, కామిక్ స్ట్రిప్స్‌ని, ఆర్టికల్స్‌ని ఆయా రచయితల దగ్గరనుంచీ, కార్టూనిస్టుల దగ్గరనుంచీ తీసుకొని వాటిని పునర్ముద్రించుకొనే హక్కుల్ని చాలా న్యూస్‌పేపర్ల వాళ్ళకి ఇవ్వడం. పత్రికలకి కార్టూన్లు వేసే షుల్జ్ 1950లో లిల్ చాంప్స్ అనే తన కామిక్ స్ట్రిప్‌ని మార్కెట్ చెయ్యడానికి ఇలాంటి ఒక సిండికేట్‌తో ఒప్పందం కుదుర్చుకొన్నాడు. వాళ్ళు లిల్ చాంప్స్ అనే పేరు తీసివేసి పీనట్స్ అనే పేరుని ఖరారు చేశారు. ఈ మార్పు షుల్జ్ కి అస్సలు నచ్చలేదట. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ పీనట్స్‌కి విపరీతమైన జనాధరణ లభించడం మొదలయ్యింది.  మొత్తం 75 దేశాల్లో ఉన్న 21 భాషల్లో వెలువడుతున్న 2,600 న్యూస్ పేపర్లలో పీనట్స్ కార్టూన్లు అచ్చయ్యాయి. 50 సంవత్సరాల పాటు నిరంతరాయంగా గీసి 2000వ సంవత్సరంలో మరణించే నాటికి షుల్జ్ సుమారు 18,000 పీనట్స్ స్ట్రిప్స్‌ని గీశాడట. ఇన్ని గీసిన షుల్జ్ ఉపయోగించిన  ఆర్ట్ మెటీరియల్ ఏమిటో తెలుసునా? కేవలం ఇండియన్ ఇంక్, అదిపోసి గీయడానికి పాళీ పెన్నులూ ఆర్ట్ పేపరూ! సృజనాత్మకతే పెట్టుబడి.  పీనట్స్‌లో ఉండే పాత్రలు - చార్లీ బ్రౌన్ అనే కుర్రవాడు, స్నూపీ అనే కుక్క, ఉడ్‌స్టాక్ అనే చిన్న పక్షి, చాలామంది పిల్ల కాయలు.. పెద్దవాళ్ళకు ఈ ప్రపంచంలో చోటులేదు.  
పీనట్స్‌లో ముద్దొచ్చే చిన్న పాత్ర చార్లీ బ్రౌన్. ఈ కుర్రాడికి ఏపనీ సరిగ్గా చెయ్యడం రాదు. పుట్‌బాల్‌ని తన్నలేడు, గాలిపటాన్ని ఎగరెయ్యలేడు, మనసులో ఉన్న ఇష్టాన్ని నచ్చిన పిల్లకి చెప్పలేడు.. కానీ ఓడిపోయాననే నిరుత్సాహంతో తన పనిని మాత్రం ఎప్పుడూ చెయ్యకుండా ఆపలేదు. అందుకే కోట్లాది మంది అభిమానాన్ని సొంతంచేసుకొన్నాడు చార్లీ బ్రౌన్. మరొక ప్రక్క ఈ పాత్రను సృష్టించిన చార్లెస్ షుల్జ్ అమోఘమైన విజయం సాధించాననే ఆనందంతో కొనసాగించడం మానలేదు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతీ రోజూ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 4 గంటలవరకూ ఆలోచించుకొంటూ, గీసుకొంటూ ఉండేవాడట షుల్జ్.  చాలామంది కళాకారుల్లా `కళ కావలసినంత ఉంది, కాణీకి ఠికాణా లేదు` అనే పరిస్థితి ఈయనకి ఎదురుకాలేదు. సంవత్సరానికి ముప్పై నుంచి నలభై మిలియన్ డాలర్లు సంపాదించేవాడు. మన పద్ధతిలో చెప్పాలంటే మూడు నుంచి నాలుగు కోట్ల డాలర్లు. ప్రపంచంలో బహుశా ఏ కార్టూనిస్టూ ఇంత పెద్దమొత్తంలో సంపాదించి ఉండడని అంటారు.  ఈ రోజు షుల్జ్ పుట్టిన రోజు.

పీనట్స్ వెబ్‌సైట్ ఇక్కడ చూడండి. చాలా వీడియోలు ఇక్కడ చూడండి.


విన్నీ-ద-ఫూ
విన్నీ-ద-ఫూ గురించి విన్నారా ఎప్పుడయినా? లేకపోతే ఈ బొమ్మ చూస్తే మీకు వెంటనే తెలిసిపోతుంది విన్నీ ద ఫూ ఎవరో. దానిగురించి ఒక మంచి కథ చెపుతాను వినండి. కథ అంటే కథ కాదు కానీ, నిజ్జంగా జరిగిందే. 

క్రిస్టొఫర్ రాబిన్స్ అని ఒక కుర్రవాడు ఉండే వాడు లండన్లో. వాళ్ళ నాన్న ఏ.ఏ.మిల్నే పెద్ద కథా రచయిత. మిల్నే రాసిన విన్నీ-ద-ఫూ కథలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. వాటిలో ముఖ్యమైన పాత్రలు - క్రిస్టొఫర్ రాబిన్స్, విన్నీ అనే పేరుగల ఒక ఎలుగుబంటి, ఈయోర్ అనే గాడిద, రూ అనే కంగారూ పిల్ల, ఒక పులీ... మొదలైనవి ఉన్నాయి. మిల్నే కొడుకు పేరు క్రిస్టొఫర్ రాబిన్స్ అని ముందే చెప్పుకొన్నాం కదా? వాడే ముఖ్య పాత్ర..  క్రిస్టొఫర్ ఆడుకొనే బొమ్మల పేర్లనే కథల్లో కొన్ని పాత్రలకి పెట్టాడు.

మొదటి ప్రపంచ యుద్దం జరుగుతున్న రోజుల్లో ఒక సైనికాధికారి కెనడా నుంచి ఇంగ్లాండ్ వస్తూ మార్గ మధ్యలో ఒక నల్ల ఎలుగు బంటిని కొంటాడు. దాన్ని తన రెజిమెంటులో పెంచుకొంటూ ఉంటాడు. అది అక్కడ చాలా పాపులర్ అవుతుంది. దాని పేరు విన్నీ. తరువాత కొన్నిరోజులకి విన్నీని లండన్ జూకి అప్పగిస్తాడు. ఒకసారి క్రిస్టొఫర్ రాబిన్స్ జూలో దాన్ని చూసి, ముచ్చటపడి, తనదగ్గర ఉన్న టెడ్డీబేర్‌కి ఆ పేరు పెట్టుకొంటాడు.

మరి ఫూ అని ఎందుకు కలిపారు? అంటే, దానికి ఇంకొక కారణం ఉంది. ఒకసారి లండన్ జూలో ఉన్న విన్నీకి చాలా నీరసం చేసిందట. చేతులు కర్రల్లాగ బిర్ర బిగుసుకుపోయాయి. అలా వారం రోజులు ఉంది. ఆ సమయంలో దాని ముక్కు మీద ఏమయినా వాలితే `ఫూ(((` అని ఊదుకొనేదట. అందుకే ఆ శబ్ధాన్ని కూడా కలిపి విన్నీ-ద-ఫూ చేసారు.
మొట్టమొదటి విన్నీ-ద-ఫూ కథలు 1926లో రాయబడ్డాయి. తరువాత వాల్డిస్నీ వాళ్ళు ఈ పాత్రల్ని ఆధారంగా చేసుకొని  మంచి, మంచి యానిమేటేడ్ సినిమాలు తీసారు. మీరు ఎప్పుడయినా వాటిని చూసే ఉండవచ్చు. చాలా బాగుంటాయి కదా?
© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!