Pages

Sunday 15 December 2019

కెన్ యూ డిఫైన్ ఫ్రెండ్షిప్?

ఎనిమిదో తరగతి వరకూ మా వూరి బడిలో చదివించేసి, తొమ్మిదికి వచ్చేసరికి కాకినాడ జగన్నాథపురంలో పెద్ద స్కూలు - ఎం.ఎస్.ఎన్ చారిటీస్‌లో చేర్పించే సరికి పిల్లకాలువలోనుంచి సముద్రంలో పడినట్టు అయిపోయింది. ఇది ఎప్పుడో 1983 నాటి సంగతి. 'ఏ' సెక్షన్లో సుమారు అరవై డబ్బై మందిలో నేనొకడిని. ఈ సెక్షన్ కాక ఆ తరగతికి మరో మూడు సెక్షన్లు ఉండేవి. నాలుగు సెక్షన్లలోనూ ఉన్న రెండువందల పై చిలుకు మందలో తొంబై శాతం మంది ఒకటో తరగతి నుంచీ జిగినీ దోస్తులు. బాగా చదివే వాళ్ళు,  చదవని వాళ్ళు, అల్లరోళ్ళు,  క్రికెట్ బ్యాచ్ వాళ్ళు, ఎన్.సి.సి వాళ్ళు, పలానా మాష్టారి ట్యూషన్‌వాళ్ళు... అంటూ రకరకాల బ్యాచ్‌లు ఉండేవి.  

కొత్తగా చేరిన కుర్రోళ్ళకి ఏ బ్యాచ్‌కి చెందినవాళ్ళమో తెలిసేసరికి అయోమయంలో కొన్ని నెలలు గడిచి పోయాయి. మెల్లమెల్లగా జతగాళ్ళు కుదిరారు. తూరంగి నుంచి నడుచుకొంటూ బయలుదేరి, గరువులకి అడ్డుపడి, ఆంధ్రా పోలిటెక్నిక్ వెనుక గోడ పగులులోంచి జొరబడి, సైకిల్‌స్టాండ్ గోడ ఎక్కి, చారిటీస్‌లోకి దూకేసరికి స్కూల్‌కి వెళ్ళడం అనే ప్రక్రియ పూర్తయ్యేది. చదివో, చదవకో రోజులు గడచిపోయాయి. 

85లో టెంత్ పూర్తయ్యాకా రాతిమీద పగలగొట్టిన కుండ పెంకుల్లా కుర్రాళ్ళంతా ఎక్కడెక్కడికో చెదిరిపోయారు. ముప్పై సంవత్సరాలు గడిచి పోయాయి. 2015లో ఎదో ఒక బుర్రలోకి మళ్ళీ అందరం కలిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. అసలు ఎక్కడెక్కడి వాళ్ళవో వివరాలు సేకరించడం సాధ్యమేనా!? కలవడం కుదురుతుందా?   

కొన్ని గట్టి పిండాలు రాత్రనక పగలనకా కష్టపడ్డాయి. 2015లో రీ యూనియన్ జరిగింది. 2017లో రెండవసారి, 2019లో - ఈ రోజు మూడవసారి మిత్రుల సమ్మేళణం జరిగింది. 
ఖమ్మం, బెంగలూరు, హైదరాబాద్, విశాఖపట్నాలనుంచి, ఇంకా దూరంనుంచి చాలామంది మిత్రులు రెక్కలు కట్టుకొని వచ్చారు. మాట్లాడ గలిగినవాళ్ళు చిన్నప్పటి జ్ఞాపకాలు పంచుకొంటే, మిగిలినవాళ్ళు చప్పట్లతో జ్ఞాపకాల పరిమళాలని ఆస్వాదించారు. భుజాలమీద చేతులు వేసుకొని 'ఒరేయ్' అని ఆత్మీయంగా పలుకరించుకొన్నారు. నా మిత్రులు ఇంతమంది ఉన్నారన్న సంతోషం ప్రతీ ఒక్కరి ముఖంలోనూ కనిపించింది. ఆ సంతోషం ముందు దూరబారాలు, వ్యయప్రయాసలు పెద్ద లెక్కలోనివి కాదు కదా?  

ఈ సమ్మేళనాన్ని చక్కగా నిర్వహించిన మిత్రులందరికీ అభినందనలు.
ఫ్రెండ్‌షిప్ అంటే-
క్యాంటీన్లలో కూర్చొని
లవ్ ఇంటరెస్టుల గురించి
లవ్ ఫెయిల్యూర్ల గురించి
గంటలకొద్దీ కబుర్లు చెప్పుకోవడమా?
ఒక్కడి దగ్గరే డబ్బులుటే
మిగిలిన అందరూకలిసి లాగేసుకొని
ట్రీట్ చేసేసుకొని
ఏడుపొక్కటే తక్కువైన ఫ్రెండునిచూసి
ఆనందంగా ఆటపట్టించడమా?
కష్టమొస్తే నేనున్నాను
అని గోడలా నిలబడి
కాన్‌ఫిడెన్స్ ఇవ్వడమా?
తప్పుదారిలో పోతుంటే
చెయ్యిపట్టుకొని మంచిదారిలోకి
నడిపించడమా?
కలిసి సినిమాలు
పరీక్షలముందు కంబైండ్‌స్టడీలూనా?
కెన్ యూ డిఫైన్ ఫ్రెండ్షిప్?

Tuesday 3 December 2019

కోతల సమయం

జిల్లాలో వరి పండించే రైతులకు ప్రస్తుతం తొలకరి పంట చేతికివచ్చే కాలం. కోతలు పూర్తైపోయాయి. కొన్ని చోట్ల చేలు పనలమీద ఉన్నాయి - అంటే కోసిన వరిమొక్కలని కంకులతోపాటూ చెమ్మ లాగడానికి మడి లోనే మూడు నాలుగు రోజులు ఆరబెడతారు. పనమీద ఉన్న సమయంలో దురదృష్టవశాత్తూ వర్షం కానీ వస్తే రైతు సీజన్ అంతా పడిన కష్టం నీటి పాలైనట్టే.     
వ్యవసాయ పనులకి రోజు కూలి ఈ సంవత్సరం వెయ్యి దాటిందట. దాంతో రైతులు 'వ్యవసాయం ఏమీ కిట్టుబాటు అవడం లేదు' అని గగ్గోలు పెడుతున్నారు. కోతల యంత్రాలు వచ్చిన తరువాత పనిలో వేగం పెరిగింది. ఒకటి రెండు గంటల్లోనే ఒక ఎకరం కోత పూర్తయిపోతుంది. పైగా కూలీలతో చేయించు కొన్న దాని కన్నా తక్కువ ఖర్చు. కాబట్టి పెద్ద కమతాల వాళ్ళు యంత్రాలతో పని కానిచ్చేస్తున్నారు. ఒకటి రెండు ఎకరాలు ఉన్న సన్నకారు రైతులు మాత్రం పాత పద్ధతులే కొనసాగిస్తున్నారు.  
పనలు ఆరిన తరువాత కళ్ళం దగ్గరకి చేరవేసి, నూర్పుళ్ళు చేస్తారు.  కొన్నిచోట్ల ఏటవాలు బల్ల మీద మోది దాన్యపు గింజల్ని వేరు చేసే పద్ధతి ఉంది. కానీ - గోదావరి జిల్లాల్లో మాత్రం కుప్పనూర్పుళ్ళే.  పనలని కళ్ళంలో పరచి రెండెడ్ల బండితో కానీ, ట్రాక్టరుతో కానీ తొక్కిస్తారు. దీనికంటే సులువైన ఏర్పాటు ఇంకొకటి ఉంది - పనల్ని ట్రాఫిక్ బాగా ఉన్న తారురోడ్డు మీదో, సిమెంటురోడ్డు మీదో పారెయ్యడమే. పైసా ఆయిల్ ఖర్చు కానీ, ట్రాక్టరు కిరాయి కానీ లేకుండా పని కానిచ్చేయొచ్చు. వాహనదారులు ఎంత ఇబ్బంది పడినా నష్టం ఏమీ లేదు! 

ఈ పని పూర్తయిన తరువాత దాన్యం - దూగర, పొట్టుతో ఉంటుంది. వాటిని వేరు చెయ్యడానికి ఎగరబోస్తారు. దాన్యాన్ని చేటలలోకి ఎత్తి, గాలి వాలు చూసుకొని, ఎత్తునుంచి చేట ప్రక్కఅంచు మీదుగా జాలువారుస్తారు. ఇలా చెయ్యడం వల్ల గాలికి పొట్టూ, దూగరా దూరంగా ఎగిరిపోయి, దాన్యం నేరుగా క్రింద గుట్ట పడుతుంది.  

తరువాత దాన్యాన్ని కొన్నిరోజులు ఆరబెట్టుకొని, కొలిచి గోనె సంచుల్లోకి నింపి, ట్రాక్టరు మీదో, బండి మీదో ఇంటికి లేదా మిల్లుకి పంపేస్తారు. నూర్చిన తరువాత మిగిలిన వరి గడ్డిని మేటు వేసి, సంవత్సరం పొడవునా పసువులకి గ్రాసంగా వాడతారు. 





వ్యవసాయం ప్రధాన వ్యాపకంగా ఉండే కుటుంబాలలో పుట్టి, పెరిగిన కారణంగా నలభై సంవత్సరాల వయసు దాటిన చాలామందికి ఈ విషయాలు అన్నీ బాగా తెలిసినవే. కానీ తరువాత క్రమంగా చదువులకోసం, ఉద్యోగాలకోసం పట్టణాలకీ, విదేశాలకీ వెళ్ళిపోయిన కుటుంబాలలో పిల్లలకి ఇల్లూ, బడీ తప్ప మరోప్రపంచం లేకుండా పోయింది. 'మనం తినే బియ్యం ఏ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు?' అని అడుగుతున్న తరం తయారయింది. వాళ్ళు కుతూహలం కొద్దీ తెలుసుకోవాలి అనుకొంటే ఏమైనా ఉపయోగ పడుతుందేమో అని ఈ టపా వ్రాస్తున్నాను.   


                   

Sunday 1 December 2019

సౌందర్యపిపాస

నలుగురూ వెళ్ళే దారిలో గడ్డివామూ, దానిని ఆనుకొని ఓ గుడిసే.. గడ్డివాము పైనుంచి తాటాకు కప్పు మీదకు ప్రాకిన బూడిద గుమ్మడి పాదూ.. పాదుకి పూసిన పసుపు పువ్వూ.. అది అందంగా తలవూపుతూ, నవ్వుతూ ఉంటుంది. నలుగురితో పాటూ మనమూ ఆ దారివెంట పోతూ ఉంటాం. చదువో, ఉద్యోగమో, ఆరోగ్యమో, ప్రేమ వ్యవహారమో, వ్యాపారంలో నష్టమో, గొడవలో, ఇంకా ఏవైనా సమస్యలో అందరిలాగే ఒకటో, ఎన్నో మనకీ ఉండవచ్చు. కానీ పువ్వుని చూసి తిరిగి నవ్విన వాడికి సమస్యల బరువు సగం తగ్గుతుందట.   

చుట్టూ ఉన్న చెట్టూ - కొండా, వాగూ - వంకా,  పిట్టా - పువ్వూ, మంచూ - ఎండా, అస్తమిస్తున్న సూర్యుడు - విరబూసిన వెన్నెల, కురుస్తున్న వర్షం - తడూస్తున్న ప్రపంచం.. అన్నీ అందమైన వైనా, వాటిని అస్వాదించగల సౌందర్యపిపాస అందరిలోనూ ఉండదా?

చైనాలో ఒక సామెత ఉందట 'నీ దగ్గర రెండు రొట్టెలు ఉంటే ఒక రొట్టె అమ్మి ఒక పువ్వుని కొనుక్కో' అని. మనిషి ఆనందంగా ఉండడానికి కడుపు నిండడం ఎంత అవసరమో, మనసు నిండడం కూడా అంతే అవసరం. కాకపోతే రొట్టెల సంపాదనలో పడిపోయి మనసు ఆకలి తీర్చుకోవడం మరచిపోతున్నాం అంతే.
  
బైదవ్.. ఇవన్నీ నేను కొనుక్కొచ్చినవి కావు, సెల్ కెమేరాతో తీసుకొచ్చినవి.  హేవ్ ఎ హేపియర్ డే!  

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!