Pages

Showing posts with label హ్యూమన్స్ అరౌండ్ అజ్. Show all posts
Showing posts with label హ్యూమన్స్ అరౌండ్ అజ్. Show all posts

Tuesday, 3 December 2019

కోతల సమయం

జిల్లాలో వరి పండించే రైతులకు ప్రస్తుతం తొలకరి పంట చేతికివచ్చే కాలం. కోతలు పూర్తైపోయాయి. కొన్ని చోట్ల చేలు పనలమీద ఉన్నాయి - అంటే కోసిన వరిమొక్కలని కంకులతోపాటూ చెమ్మ లాగడానికి మడి లోనే మూడు నాలుగు రోజులు ఆరబెడతారు. పనమీద ఉన్న సమయంలో దురదృష్టవశాత్తూ వర్షం కానీ వస్తే రైతు సీజన్ అంతా పడిన కష్టం నీటి పాలైనట్టే.     
వ్యవసాయ పనులకి రోజు కూలి ఈ సంవత్సరం వెయ్యి దాటిందట. దాంతో రైతులు 'వ్యవసాయం ఏమీ కిట్టుబాటు అవడం లేదు' అని గగ్గోలు పెడుతున్నారు. కోతల యంత్రాలు వచ్చిన తరువాత పనిలో వేగం పెరిగింది. ఒకటి రెండు గంటల్లోనే ఒక ఎకరం కోత పూర్తయిపోతుంది. పైగా కూలీలతో చేయించు కొన్న దాని కన్నా తక్కువ ఖర్చు. కాబట్టి పెద్ద కమతాల వాళ్ళు యంత్రాలతో పని కానిచ్చేస్తున్నారు. ఒకటి రెండు ఎకరాలు ఉన్న సన్నకారు రైతులు మాత్రం పాత పద్ధతులే కొనసాగిస్తున్నారు.  
పనలు ఆరిన తరువాత కళ్ళం దగ్గరకి చేరవేసి, నూర్పుళ్ళు చేస్తారు.  కొన్నిచోట్ల ఏటవాలు బల్ల మీద మోది దాన్యపు గింజల్ని వేరు చేసే పద్ధతి ఉంది. కానీ - గోదావరి జిల్లాల్లో మాత్రం కుప్పనూర్పుళ్ళే.  పనలని కళ్ళంలో పరచి రెండెడ్ల బండితో కానీ, ట్రాక్టరుతో కానీ తొక్కిస్తారు. దీనికంటే సులువైన ఏర్పాటు ఇంకొకటి ఉంది - పనల్ని ట్రాఫిక్ బాగా ఉన్న తారురోడ్డు మీదో, సిమెంటురోడ్డు మీదో పారెయ్యడమే. పైసా ఆయిల్ ఖర్చు కానీ, ట్రాక్టరు కిరాయి కానీ లేకుండా పని కానిచ్చేయొచ్చు. వాహనదారులు ఎంత ఇబ్బంది పడినా నష్టం ఏమీ లేదు! 

ఈ పని పూర్తయిన తరువాత దాన్యం - దూగర, పొట్టుతో ఉంటుంది. వాటిని వేరు చెయ్యడానికి ఎగరబోస్తారు. దాన్యాన్ని చేటలలోకి ఎత్తి, గాలి వాలు చూసుకొని, ఎత్తునుంచి చేట ప్రక్కఅంచు మీదుగా జాలువారుస్తారు. ఇలా చెయ్యడం వల్ల గాలికి పొట్టూ, దూగరా దూరంగా ఎగిరిపోయి, దాన్యం నేరుగా క్రింద గుట్ట పడుతుంది.  

తరువాత దాన్యాన్ని కొన్నిరోజులు ఆరబెట్టుకొని, కొలిచి గోనె సంచుల్లోకి నింపి, ట్రాక్టరు మీదో, బండి మీదో ఇంటికి లేదా మిల్లుకి పంపేస్తారు. నూర్చిన తరువాత మిగిలిన వరి గడ్డిని మేటు వేసి, సంవత్సరం పొడవునా పసువులకి గ్రాసంగా వాడతారు. 





వ్యవసాయం ప్రధాన వ్యాపకంగా ఉండే కుటుంబాలలో పుట్టి, పెరిగిన కారణంగా నలభై సంవత్సరాల వయసు దాటిన చాలామందికి ఈ విషయాలు అన్నీ బాగా తెలిసినవే. కానీ తరువాత క్రమంగా చదువులకోసం, ఉద్యోగాలకోసం పట్టణాలకీ, విదేశాలకీ వెళ్ళిపోయిన కుటుంబాలలో పిల్లలకి ఇల్లూ, బడీ తప్ప మరోప్రపంచం లేకుండా పోయింది. 'మనం తినే బియ్యం ఏ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు?' అని అడుగుతున్న తరం తయారయింది. వాళ్ళు కుతూహలం కొద్దీ తెలుసుకోవాలి అనుకొంటే ఏమైనా ఉపయోగ పడుతుందేమో అని ఈ టపా వ్రాస్తున్నాను.   


                   

Monday, 16 May 2016

మావిడి రసాల తీపి కబుర్లు

కాకినాడనుంచి పిఠాపురం వెళ్ళేదారిలో తిమ్మాపురం దాటిన తరువాత కుడిచేతివైపు రోడ్డుప్రక్కగా పే..ద్ద చెరువు ఉంటుంది. దానిని పండూరు చెరువు అంటారు. ఆ వెంటనే పండూరు ఊరిలోకి దారి. అలా లోపలికి వెళ్ళిపోతే ఊరి మొదటిలో రోడ్డుకి రెండువైపులా మావిడితాండ్ర తయారీ కేంద్రాలు కనిపిస్తాయి. విశాలమైన మైదానం లాంటి చోటుల్లో నేలకి రెండు మూడు అడుగుల ఎత్తులో సిమ్మెంటు స్థంబాల మీద మంచెల్లా కట్టి ఉంటాయి. వాటిమీద మావిడితాండ్ర చాపలు పరచి ఉంటాయి.  తీపి మావిడి పండ్ల వాసన ఆ ప్రాంతం అంతా వ్యాపించి ఉంటుంది. ఎండ నిప్పులు చెరుగుతూ ఉంటుంది. మావిడి తాండ్ర చాపల పైన పనివాళ్ళు మావిడి గుజ్జుని పొరలుగా పూస్తూ ఉంటారు.      
మావిడి తాండ్రని తయారీ విధానం ఏమిటో తెలుసుకోవాలని ఉందా?

ఇక్కడ తాండ్ర తయారీకి కలెక్టర్ రకం మావిడి కాయలను ఉపయోగిస్తున్నారు. పళ్ళని శుబ్రంగా కడిగి, గుజ్జు తీసే యంత్రంలో వేస్తారు. టెంకా, తొక్కా బయటకు పడిపోయి, గుజ్జు ఒక పెద్ద పాత్రలోనికి వచ్చేస్తుంది. ఈ మావిడి గుజ్జుకి చక్కెరా, బెల్లం తగినంత మోతాదులో కలుపుతారు. తీపి సరిపోయిందని నిర్ణయించుకొన్నాకా, మావిడి పళ్ళ గుజ్జుని తాటి చాపలమీద పరచి మంచెల మీద ఎండబెడతారు. ఒకరోజు పూర్తిగా ఎండలో ఉండేసరికి మావిడి గుజ్జు ఉల్లిపొర మందమైన పొరలా తయారవుతుంది. వరుసగా నెలరోజులపాటు పొరమీద పొర వేసుకొంటూ వెళతారు. 

తాండ్ర తయారీకి కణకణ మండే ఎండల కాలమే అనుకూలమైనది. నెలరోజులపాటు తాండ్రని పొరలు పొరలుగా పోసి ఎండబెట్టిన తరువాత, చాపల మీదనుంచి వేరుచేసి కేజీ, అరకేజీ ముక్కలుగా కోసి, ప్యాక్ ఛేసి సుమారు కేజీ తొంభై రూపాయల రిటెయిల్ ధర(హోల్‌సేల్‌గా అయితే ఇంకా తక్కువ ఉంటుంది) చొప్పున వర్తకులకి అమ్మేస్తారు. కొంత తాండ్ర వేరే దూర ప్రాంతాలకి ఎగుమతి ఐతే, మరికొంత లోకల్ మార్కెట్‌లో అమ్ముడుపోతుంది.  

మావిడి తాండ్ర గురించి చిన్న మాటా, మంతీ ఇక్కడ చూడండి.
మూడు నెలల విరామం తరువాత మళ్ళీ ఈ రోజే బ్లాగ్ ముఖం చూస్తున్నాను. ఇలా మావిడి రసాల తీపి కబుర్లు మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. 

© Dantuluri Kishore Varma

Sunday, 24 January 2016

Deadlines

It was indeed unfair on the part of my car to breakdown suddenly on the highway. I was going to my native village to invite my relatives for a family function that was going to be held soon. The previous night itself I had wiped it clean and got it ready for the journey. It took me an hour or so to do it.  `This wretched car does not seem to have any gratitude!` I said to myself. I had a hundred tasks to finish before sunset. `Being stuck there in the most unwelcome situation how will I be able to finish off all of them!`

It was still 8 o'clock in the morning.  Lorries and fast cars were buzzing past me. Autos, though their horse power was not half as much as that of the fast cars, were making vain efforts to overtake them. Now and then some over crowded public transport buses were lumbering along. Bikers and cyclists were also on the move. Everyone seemed to be going somewhere. No village or habitation seemed to be nearby. The highway, my car and I were immobile. How pity being in such situation was!

I had to somehow set my car moving. I made a phone call to my mechanic whose workshop was some sixty kilometres away from the place. It might take him at least two hours to find me on the road side. 

At around nine o'clock a middle aged papaya seller arrived there by his bicycle. He spread an empty rice bag under a tree nearby and put ripe papayas on it. He then took out a fruit and started peeling it with a sharp knife at a slow pace. I doubted if he would have a chance to sell at least one fruit in such a place. He cut the fruit in long slices and put them in a carry bag and hung it on the handlebar of the bicycle.  Then he took up one more fruit to repeat with it also what he had done with the previous one. I found to my surprise that before he finished with the second one, a cyclist came from somewhere and bought the first bag of papaya slices.  

The man continued with his work at a regular pace and there were never two bags hung on the handlebar at any time! A biker or a cyclist always came and found only a bag waiting for him. I asked him how it was possible. He showed his hands towards the sky as if saying it was God's magic. Being aware of law of probability I reasoned with myself that this fruit seller who had been having his makeshift shop there for a long time must have known the frequency of highway users at that place and regulated his speed of peeling to match the demand. This was a simple rule. If there had been much traffic, he would have kept more papaya slices ready. 

Fortunately the mechanic arrived and took away the car to the city. I borrowed his bike and resumed my journey towards my destination. Though I was already three hours behind my schedule, I could finish all my tasks before evening as had been planned. How was it possible!? I don`t show my hands towards the sky as was done by the fruit seller. I know, you know and everyone knows that it is volume of work and urgency that decide the speed of an individual. 

I realized that day the reason behind setting deadlines for the employees in corporate companies. It was a fantastico revelation for me.

This blog post is inspired by the blogging marathon hosted on IndiBlogger for the launch of the #Fantastico Zica from Tata Motors. You can  apply for a test drive of the hatchback Zica today.

© Dantuluri Kishore Varma

Saturday, 29 November 2014

తాటి పీచు

తాటి పీచుని రోడ్ల మీదే ఎండ బెట్టేస్తారు. రోజుల తరబడి అది అలా ఎండుతూనే ఉంటుంది. వాహనాలు పీచుమీదుగా పోతూ ఉంటాయి. మనుషులు తొక్కుతూ నడుస్తూ ఉంటారు. సాయంత్రం ఎండతగ్గుతూ ఉండగా పీచుని ఎండబెట్టిన కూలీలు తిరిగి దానిని చక్కగా వొజ్జుపెట్టి, చిన్న చిన్న కట్టలుగా కట్టేస్తారు. వాళ్ళు అలా చేస్తూ ఉండగా తాటి పీచులో ప్రతీ ఈనూ ఒకే పొడవులో ఉండడం గమనిస్తాం. వారంలో ఒక శుక్రవారమో, మరొక రోజో వ్యాన్‌మీద కొనుబడివాళ్ళు వస్తారు. కట్టల్ని బరువు తూచుకొని, డబ్బు చెల్లించి తీసుకొని వెళతారు. జగన్నాధపురంలో మా ఇంటికి ఎదురుగా ఈ వ్యవహారం క్రమం తప్పకుండా జరిగేది. జరిగేది అని ఎందుకు అంటున్నానంటే - ప్రస్తుతం పీచు గొడౌన్ మా ప్రాంతం నుంచి మరొక చోటుకి మార్చేశారు. ఓ రోజు పని చేయిస్తున్న మేస్త్రిని `ఏమిటి ఈ తాటిపీచు సంగతి?` అంటూ చిన్న చిట్‌చాటింగ్ మొదలు పెట్టాను. ఆర్డర్ వొచ్చిన దానిని బట్టి పీచు పొడవులు కత్తిరిస్తారని, లాభసాటి వ్యాపారం అని చెప్పాడు. `కొన్న వాళ్ళు దీనిని ఏమితయారు చెయ్యడానికి ఉపయోగిస్తారో తెలుసా?` అంటే, తెలియదన్నాడు.  నిజానికి తాటిపీచుతో బ్రష్‌లు, చీపుర్లు లాంటివి తయారు చేస్తారట. దీని గురించి కొంత గూగుల్ సెర్చ్ చేస్తే ఒక ముంబాయి ట్రేడర్ యొక్క వెబ్‌సైట్‌లో కొచ్చిన్ తాటిపీచుతో పాటూ, ప్రఖ్యాతి చెందిన కాకినాడ రకం కూడా అమ్ముతామని ప్రముఖంగా ప్రస్తావించాడు. ఇన్నిరోజులూ పెద్దగా పట్టించుకోలేదు కానీ మన ఇంటి ముందు తయారయ్యే దానికి ఇంత  పేరు ఉందా! 




© Dantuluri Kishore Varma

Monday, 14 July 2014

వ్యవసాయ కూలీలు

అదృష్టం బాగుండి వర్షలు చక్కగా కురిస్తే రైతులు ఆనందంగా దమ్ములు చేసుకొంటారు. ఈ సంవత్సరం అరకొరవానలు భూమిని పూర్తిగా తడపడమేలేదు. కరెంట్ కోతలు ఉండకూడదని, సకాల వర్షాలు సమృద్దిగా కురవాలని జనాలు కోరుకొంటున్నారు. వర్షం కురిస్తే దానితోపాటూ విద్యుత్ బోర్లతో పొలాలకు నీటిని పెట్టుకొని దమ్ములు చేసుకొంటారు. శంకవరం మండలానికి వెళ్ళినప్పుడు  వ్యవసాయ కూలీలు పొలాల్లో దమ్ములు చేసుకొంటూ, ఆకుమడుల్ని ఊడుపులు చేస్తూ ఇదిగో ఇలా కనిపించారు.   




© Dantuluri Kishore Varma 

Saturday, 21 June 2014

డెడ్‌లైన్స్ ఎందుకు?

అనుకోకుండా ఒక్కోసారి అవకాశాలు అలా కలిసివచ్చేస్తూ ఉంటాయి. వాటిని కాదని తోసిపుచ్చలేం, అవునని అందిపుచ్చుకోలేం. నేషనల్ హైవే ప్రక్కన నాలుగు గంటల నిరీక్షణ ఎంత ఫిలాసఫీని తీసుకొచ్చేసిందో చూడండి. ఉదయం ఎనిమిది గంటలకి ఎండలో వేడి సుర్రుమనిపించకముందే కారు ఇంజను హీటెక్కిపోయింది. ఈ రోజు ప్రయాణం ఉందని తెలిసి నిన్నరాత్రి తనని అద్దంలా మెరిసిపోయేలా తుడిచాననే కృతజ్ఞత కూడా లేకుండా ఈ కారు టక్కున ఆగిపోయింది. ఫోన్‌చేసి  పిలిచిన మెకానిక్ అరవై కిలోమీటర్ల దూరం నుంచి రావడానికి మిట్టమిడసరం అయ్యింది. ర((య్, ర((య్ మని దూసుకుపోతున్న కార్లు, లారీలు; హార్స్ పవర్ సరిపోకపోయినా వాటితో పోటీపడి ముందుకు వెళ్ళిపోవాలనుకొంటున్న ఆత్రపు ఆటోలు; నిండు గర్భిణిల్లా ఆర్టీసీ బస్సులు; నత్త నడకల సైకిళ్ళు; ఎక్కడికీ వెళ్ళకుండా నిశ్చలంగా నేషనల్ హైవే, నేనూ సహవాసం చేశాం. 
పదవుతూ ఉండగా ఒక నడివయసు వ్యక్తి బొబ్బాయ కాయలు బుట్టలో పెట్టుకొని, సైకిల్ వెనుక కారియర్కి కట్టి తీసుకొని వచ్చాడు. చెట్టుక్రింద చిన్న నీడలో పిండిసంచి పరచి, దానిమీద కాయలని పేర్చాడు. ఒక ముగ్గిన కాయ తీసుకొని తొక్క చెక్కి, చీరికలు చేసి, ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లో వేసి సైకిల్ హ్యాండిల్కి తగిలించాడు. వేగంగాపోయే వాహనాలు తప్ప పెద్దగా మనుష్యసంచారం లేని ఈ ప్రదేశంలో బొప్పాయి చీరికలు అమ్మే అదృష్టం ఈతనికి ఉంటుందా అనే సందేహం కలుగుతుంది. రెండవ కాయ చెక్కుతున్నాడు. `అది కూడా తగిలిస్తాడా?` అనుకొంటూ ఉన్నాను. చెక్కడం పూర్తయ్యింది. ఎవరో వచ్చి మొదటి సంచితో తగిలించిన చీరికలని కొనుక్కొని పోయారు. దాని ప్లేస్‌లో రెండవ సంచి తగిలించాడు. ఒకే వేగంతో ఆ వ్యక్తి అలా తన పనిని చేస్తూనే పోయాడు. రెండు గంటల సమయంలో ఎప్పుడూ ఒకేసారి రెండు సంచులు సైకిల్ హ్యాండిల్‌కి తగిలించి లేవు. ఆ వ్యక్తి కాయలను చెక్కకుండా ఎప్పుడూ లేడు.    

`భోజనం తెచ్చుకొన్నావా? సాయంత్రం వరకూ ఇక్కడే ఉండి కాయలు అమ్ముతావా?` అని అడిగాను. మద్యాహ్నం మూడుగంటల వరకూ ఉంటానన్నాడు. మిగిలిన కాయల్ని మరునాడు అమ్ముకొంటాడట. `ఎవరో ముందుగానే నిర్ణయించినట్టు సరిగ్గా కాయ తరువాత కాయ ఎలా అమ్ముడుపోతుంది?` అన్నాను. `అంతా దేవుడి దయ,` అన్నట్టు ఆకాశం కేసి చెయ్యిచూపించాడు. 

అతను చెప్పలేదు కానీ ఆ ప్రదేశంలో గంటకి మూడు, నాలుగు కాయలు అమ్మగలిగినంత సంభావ్యత ఉంటుందని రోజూ వ్యాపారం చేస్తున్న అతనికి తెలుసు. కాబట్టి తన వేగాన్ని నియంత్రించుకొని పావుగంటకి ఒక్కొక్క కాయ చొప్పున చెక్కుతున్నాడు. ఒకవేళ ఆ వ్యక్తి కొంచెం  జనాలు ఎక్కువగా నడిచే ప్రదేశంలో తన వ్యాపారాన్ని చేస్తూ ఉంటే గంటకి ఎనిమిదో, పదో కాయలు ఆమ్మి ఉండేవాడు. అప్పుడు తప్పని సరిగా వేగం పెంచాలి. అయిదారునిమిషాలకి ఒక్కో బొప్పాయికాయిని చెక్కాలి.   

`మద్యాహ్నం మూడు తరువాత కాయలకోసం ఎవరైనా వస్తే, నువ్వు లేకపోతే ఎలాగా?` అన్నాను. ఎవరూ రారన్నాడు. `ఎందుకని,` అడిగితే చిరునవ్వు నవ్వి ఊరుకొన్నాడు. బహుశా కారణం తనకు తెలియదేమో!

నిజానికి ఎవరూ, ఏమీ అమ్మని చోట ఎవరైనా ఏమి కొనుక్కోవడానికి ఆగుతారూ?

*     *     *

ఈ రోజు ఎన్నో పనులు పూర్తిచెయ్యాలని ఊరికి బయలు దేరాను. చాలా వ్యవహారాలున్నాయి. తొందరగా మొదలు పెట్టకపోతే అన్నింటినీ పూర్తిచెయ్యలేను. రోడ్డువార నిరీక్షణవల్ల అవన్నీ ఏమయిపోతాయి? నాలుగు గంటల ఆలస్యం అయినా  అనుకొన్న పనులన్నీ సాయంత్రానికి పూర్తయిపోయాయి! `ఎలా?` అంటే బొప్పాయి కాయలమ్మే వ్యక్తిలా నేను ఆకాశం కేసి చెయ్యి చూపించను. ఎందుకంటే అతని ద్వారానే ఈ రోజు నాకొక విషయం బోధపడింది. అందుబాటులో ఉన్న సమయమే పనులయొక్క వేగాన్ని నిర్ణయిస్తుందని. 

కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులకి డెడ్‌లైన్స్ అందుకే ఇస్తారేమో! 
 © Dantuluri Kishore Varma 

Thursday, 17 April 2014

ఉప్పాడ జందాని చీరలు

కాకినాడ నుంచి ఉప్పాడకి బీచ్‌రోడ్ ద్వారా వెళితే వాకలపూడి లైట్ హౌస్‌కి పది కిలోమీటర్లదూరంలో ఉంటుంది. పిఠాపురం మీదుగా కూడా వెళ్ళవచ్చు. పిఠాపురం నుంచి  పది కిలోమీటర్లే ఉంటుంది.  జందానీ చీరలకి ఈ ఊరు ప్రశిద్ది చెందింది. వీటికి భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్ -  జి.ఐ)  కూడా ఉంది. ఒక ప్రాంతం పేరుతో ప్రఖ్యాతి పొందిన ఉత్పత్తులకి జి.ఐ ఇస్తారు. అప్పుడు వాటిని మరొక ప్రాంతంలో ఉత్పత్తి చెయ్యకూడదు.

జందానీ అనే మాట పారశీక భాషనుంచి వచ్చిందట. జాం అంటే పువ్వులనీ, దానీ అంటే వాటిని ఉంచే గుత్తి అని అర్థం. పువ్వులు, లతలతో కంటికి ఇంపుగా, మనసుకి హాయి కలిగించేలాఉండే నేతపనికి ఈ పేరు పెట్టారు. బెంగాల్‌లో ఈ నేత ఒక వెలుగు వెలిగిందట. తరువాత బ్రిటీష్ పాలనలో, విదేశీ బట్టల వెల్లువలో కొట్టుకు పోయింది. ఇప్పుడు అది ఉప్పాడ పేరుమీదుగా దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది.   

చీరలో పట్టునేతతో పాటూ కూర్చే బుటా - పైన ఎలా ఉంటుందో, వెనుకకు తిప్పినా అలానే ఉంటుంది. జందానీ నేత ప్రత్యేకత అదే.  ఇతర పట్టుచీరల నేతలో ఈ నైపుణ్యం కనిపించదు కనుకే ఈ చీరలకి అంత డిమాండ్ ఉంటుందని నేతకార్మికులు వివరించి చెప్పారు. ఒక్కొక్క మగ్గం దగ్గర ఇద్దరు చొప్పున పనిచేస్తూ ఎంతో సహనంతో, నేర్పుతో ఒక్కో దారపు పోగునూ కూర్చుతున్నారు. వాళ్ళకి అభిముఖంగా గోడమీద తగిలించుకొన్న నమూనా డిజైన్‌ను చూస్తూ మగ్గం మీద చీరను నేస్తున్నారు. ఓ పోగు తప్పుగా వెళ్ళినా చీర మొత్తం నాశనం అయినట్టే. ఒక్కచీర తయారు చెయ్యడానికి ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేస్తే నెలరోజులు పడుతుందట.


మరి అంత కష్టపడితే వాళ్ళకి వచ్చే ప్రతిఫలం? తక్కువలో తక్కువ ఆరు వేల నుంచి, యాభై వేల వరకూ ఒక్కో చీరకూ లభిస్తుంది. ప్రత్యేక ఆర్డర్లు ఉంటే లక్షా యాభైవేల చీరవరకూ కూడా తయారు చేస్తారట. రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు, సినిమా ప్రరిశ్రమలో ప్రముఖులు.. ఇంకా బాగా డబ్బున్నవాళ్ళు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి జందానీ చీరలు ధరించడం స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. అందుకే వీటికి ఈ మధ్యకాలలో మరింత గిరాకీ పెరిగింది.  
నేతపని వాళ్ళకి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడిందని ఒకాయన చెప్పాడు. పిల్లలకి కూడా ఈ నైపుణ్యాన్ని నేర్పి, కొంతమంది పనివాళ్ళను పెట్టుకొని ఒక మగ్గం ఉండే వాళ్ళు క్రమంగా రెండు, మూడు మగ్గాలను ఏర్పాటు చేసుకొంటున్నారు. మార్కెటింగ్ చెయ్యగలిగిన వాళ్ళు సొంత షాపులు పెట్టుకోవడం, లేదంటే నేసిన చీరలని షాపులకి వెయ్యడం జరుగుతుంది. ఉప్పాడకు ప్రక్కన ఉన్న యు.కొత్తపల్లిలో రెండు చిన్న వీధుల్లో కనీసం ముప్పై షాపులు ఉన్నాయి.  
పట్టుని కర్ణాటక నుంచి తెచ్చుకొంటారట. ఇది ముడి పట్టు. ఒక్కో పట్టుపోగూ గుర్రపు వెంట్రుక మందంలో ఉంటుందట. దానిని ప్రోసెసింగ్‌కి గొల్లప్రోలో, పిఠాపురమో పంపిస్తారు. అక్కడే పట్టుకి కావలసిన రంగులు వేయిస్తారు. రంగు దారాలని తిరిగి తెచ్చుకొని మగ్గంపైకి ఎక్కిస్తారు. ఒక్కో డిజైన్‌కి ఒకటి రెండు చీరల కంటే ఎక్కువ తయారు కావు. తయారయిన చీర వెంటనే షాపుకి వెళ్ళిపోతుంది. తొందరగానే అమ్ముడు పోతుంది.  


© Dantuluri Kishore Varma 

Monday, 14 April 2014

కెన్ ఐ హెల్ప్ యూ?

ఇక్ష్వాకులకాలం నాటి బండి నాది. మా ఎల్.ఐ.సీ ఏజంటు ఎదురుపడినప్పుడల్లా అంటూనే ఉంటాడు, `బండి మార్చరా?` అని. నవ్వడం తప్ప నేను ఏ సమాధానమూ చెప్పనని అతనికీ తెలుసు. అప్పుడప్పుడూ సంభాషణని కొనసాగిస్తూ స్వగతంలో చెప్పుకొన్నట్టు `అచ్చొచ్చిన బండి అయివుంటుంది లెండి,` అంటాడు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే ఈ రోజు సాయంత్రం చిన్నమార్కెట్ దగ్గర అది చెప్పాపెట్టకుండా ఆగిపోయింది. స్టార్ట్ చెయ్యడానికి కొంత ప్రయత్నం చేసినతరువాత పెట్రోల్ ఓవర్ అయ్యిందని అర్థమయ్యింది. కిక్ స్టార్ట్ చేసి, చేసి విసుగుపుట్టింది కానీ ఇంజన్ స్టార్ట్ కాలేదు. మెకానిక్‌షెడ్లు తెరిచి ఉండే సమయం కూడాకాదు. అరకిలోమీటరు దూరంలో ఉన్న ఇంటివైపు నడిపించడం మొదలు పెట్టాను. వొళ్ళంతా చెమటతో తడిచి ముద్దయ్యింది. నడిచి, నడిచి ఇంటికి చాలా సమీపానికి వచ్చేసరికి ఒకాయన హీరో హోండా బైకు మీద నన్ను దాటుకొని వెళ్ళాడు. కొంచెం ముందుకు వెళ్ళి, బైకుని వెనక్కి తిప్పాడు. నా దగ్గరకు వచ్చి `బైకు తీసుకొని వెళ్ళండి. మీ బండి నాకు ఇవ్వండి,` అన్నాడు. అతని ముఖం ఎప్పుడో చూశాను. వెంటనే పేరు జ్ఞాపకం రావడంలేదు. `పరవాలేదండి, ఈ ప్రక్కవీధిలోనే ఇల్లు, థాంక్యూ,` అన్నాను. `మీరు పెట్రోలు తెచ్చుకొనే వరకూ వెయిట్ చేస్తాను, నా బండిలో ఖాళీ సీసా ఉంది. వెళ్ళి వచ్చేయండి ఇబ్బంది ఏమీలేదు,` అన్నాడు. పెట్రోల్ అయిపోయి ఉంటుందని అనుకొన్నట్టున్నాడని అనిపించి విషయం చెప్పాను. తను స్టార్ట్‌చేసి పెడతానన్నాడు. సహాయం చేస్తానని మొహమాటానికి అనడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మరీ మరీ కృతజ్ఞతలు చెప్పాను.  ఇంటికి వెళ్ళిన తరువాత జ్ఞాపకం వచ్చింది అతను ఎవరో - చాలా కాలం క్రితం ఒక సాఫ్ట్‌వేర్‌ని అమ్మడానికి మా స్కూల్‌కి వచ్చాడు. నెగోషియేషన్స్ జరుగుతూ ఉండగానే అతను కంపెనీ మారాడని తెలిసింది. అందువల్ల తరువాత మేము కొన్న సాఫ్ట్‌వేర్ అతని సేల్స్ టార్గెట్‌లో పడలేదు - అది వేరే విషయం. కానీ అతని ఆటిట్యూడ్,  చెయ్యాలనుకొన్న సహాయం  ఫీల్‌గుడ్  థింగ్స్!    
© Dantuluri Kishore Varma

Sunday, 16 March 2014

ఇట్ హేపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా!

ఎన్నికల సమయమేమో చాలా చోట్ల పోలీసువాళ్ళు బైకులనీ, కార్లనీ ఆపి సోదాలు చేస్తున్నారు. ప్రతీరోజూ న్యూస్‌పేపర్లలో వార్తలు చూస్తున్నాం కదా - కార్లలో అక్రమంగా తరలిస్తున్న లక్షల రూపాయలు స్వాధీనం చేసుకొంటున్నారు అని? రహదారులమీద ఈ సోదాలు అందుకే! ఆ విషయం జ్ఞాపకం ఉంది. కనుక, కారులో ఉండవలసిన సీబుక్, ఇన్స్యూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్‌లు లాంటివి ఉన్నాయో, లేదో చెక్ చేసుకొని బయలుదేరాం. సామర్లకోటదగ్గర కారుని ఆపారు. డిక్కీ ఓపెన్ చేయించి, చూసి పంపించారు. తిరుగు ప్రయాణంలో మరో చోట ఆపారు. `ఇంతకు ముదే అయ్యింది,` అన్నాం. నవ్వి, వెళ్ళండన్నట్టు చెయ్యి ఊపాడు పోలీసాయన. ఎండ మండిపోతుంది. రోడ్డుమీద ప్రయాణం చేస్తుంటే ఎడారిలో వెళుతున్నట్టు ఉంది. అక్కడక్కడా చెట్లక్రింద చెరుకురసం బళ్ళు, పుచ్చకాయలు, కొబ్బరి బొండాలు ఒయాసిస్సుల్లా ఉన్నాయి. నోరు పిడచగట్టుకుపోతుంటే పుచ్చకాయల బడ్డీ దగ్గర ఆగాం. మేం ఆగుతూ ఉండగా పుచ్చకాయ ముక్కలు తినేసి, మూతి తుడుచుకొన్న ఒకతను బైకు స్టార్ట్ చేసి, తన కుటుంబాన్ని ఉద్దేశించి `ఎక్కండి,` అన్నాడు. భార్య వెనుక ఎక్కింది. ఒక కుర్రాడు వాళ్ళిద్దరి మధ్యా సెట్ అయ్యాడు. ఇంకో ఇద్దరు పిల్లలు పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చున్నారు. బైకు ముందుకు ఉరికింది. మేం అవాక్కయ్యం! అలా ప్రయాణం చెయ్యడానికి వాళ్ళకు ఉన్న కారణాలు ఉంటాయి. కానీ, అడుగడుగునా పోలీసులు ఆపుతుంటే, ఆ చెక్‌పోస్ట్‌లని దాటుకొని వీళ్ళు ఎలా వెళతారు అనేది చిక్కుప్రశ్న. `ఇట్ హేపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా!` అనే కేప్షన్లతో చాలా ఫోటోలు చూశాను నేను. ఆ కేటగిరీలోనికి భహుశా ఈ ఫోటో కూడా  చేర్చవచ్చేమో!  
© Dantuluri Kishore Varma 

Thursday, 13 March 2014

చిరంజీవికి ఫోటో

సాయంత్రం చాలామంది జనాలు ఇంటికి వెళ్ళే సమయం తొమ్మిదిన్నర దాటిన తరువాత. నైన్ టు ఫైవ్ ఆఫీస్ గోయర్స్ గురించి కాదు చెప్పేది. చిల్లర వ్యాపారస్తులు, ప్రయివేట్ ఉద్యోగస్తులు, గుమస్తాలు, మెకానిక్కులు, ఇంకా చాలామంది గురించి. పని ముగించుకొని ఇంటికి వెళుతూ దారిలోనే అవసరం అయిన సరుకులు కొనుక్కొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ప్రత్యేకంగా వాటికోసం సమయం కేటాయించుకొనే వెసలుబాటు ఉండదు వాళ్ళకి. కాకినాడలో పెద్దమార్కెట్టు, జగన్నాథపురంలో చిన్నమార్కెట్టు, ఇంకా రకరకాల ఏరియాల్లో ఆయా ఏరియా మర్కెట్లు, బస్‌కాంప్లెక్స్ దగ్గర రైతుబజారు, గాంధీనగరంలో మరొక రైతు బజారూ ఉన్నా మెయిన్‌రోడ్డులో కాయగూరల బళ్ళదగ్గర జనాలు ఎగబడి కొనుక్కోవడానికి కారణం నేను పైన చెప్పినదే. షాపింగ్ చేసుకొని, ఫస్ట్‌షో సినిమాలు చూసి ఇంటికి తిరిగి వెళ్ళే వాళ్ళు కూడా నాలుగు రకాలు ఇక్కడే కొనుక్కొని వెళతారు. 
ఈ రోజు సాయంత్రం రైతు బజారులో కాయగూరలు కొనుక్కొని వెళుతూ తాజా కొత్తిమీరకోసం మెయిన్‌రోడ్డులో కాయగూరల బళ్ళదగ్గర అగినప్పుడు జేబులో ఉన్న నికాన్ కెమేరా బయటకు తీశాను. స్ట్రీట్ ఫొటోగ్రఫీ! ఒక స్నేప్ లాగిన తరువాత దగ్గరలో ఉన్న కాయగూరల బండి వ్యక్తి గమనించాడు. `కెమేరా పనిచేస్తుందో, లేదో చూస్తున్నార్రా!` అన్నాడు ప్రక్కవాడితో. `కాదు, ఫొటో తీశాను,` అన్నాను. `అయితే వాడికి తియ్యండి. బాగా పడతాడు చిరంజీవి,` అని ప్రక్క వాడిని చూపించాడు. `నీకూ తీస్తానులే,` అని ఇద్దరికీ చెరొకటీ తీశాను. అవి ఇవే. 


 © Dantuluri Kishore Varma 

Monday, 24 February 2014

స్ట్రీట్ వెండర్

ఉదయం ఏడుగంటల సమయంలో ఆకుకూరలవాడు సైకిలు మీద వస్తాడు. తాజా తోటకూరో, పాలకూరో మరొకటో ఇచ్చి వెళతాడు. మధ్యాహ్నం బటానీలు, మొరమొరాలు అమ్మే సైకిలువాడు. ఇలా ఇంటింటికీ తిరిగి అమ్మే హాకర్లు, రోడ్డు కూడళ్ళలో, రోడ్డుకి ఇరువైపులా నాలుగుచక్రాల బళ్ళమీద రకరకాల వస్తువులు అమ్మే వెండర్లు ప్రతీఊళ్ళోనూ ఉంటారు. పళ్ళు, కాయగూరలు, బొమ్మలు, బనీన్లు, ఫ్యాన్సీవస్తువులు, స్వీట్లు, పిడతక్రిందపప్పు, బజ్జీలు, పావుబాజీ, పానీపూరీ లాంటి చిరుతిళ్ళు అమ్మే వాళ్ళు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ కోటిమంది వరకూ ఉన్నారట. వీళ్ళంతా స్వయం ఉపాది పొందుతున్నవాళ్ళు. 
Pic Credits: Raghu Varma
మెయిన్‌రోడ్డు మంచి రద్దీగా ఉన్నసమయంలో, రోడ్డువార సైకిళ్ళమీద, బళ్ళమీద సరుకులు అమ్మేవాళ్ళలో అకస్మాత్తుగా అలజడి వస్తుంది. తమసరుకులతో సహా పరుగులు పెడతారు. ఈ అలజడికి కారణమైన మునిసిపాలిటీ అధికారులో, పోలీసువాళ్ళో వీళ్ళను దొరకబుచ్చుకొన్నారంటే అంతే సంగతులు. పదో, పరకో గుంజుకోవడమో, సరుకులూ స్వాధీనంచేసుకోవడమో, చక్రాల్లో గాలితీసెయ్యడమో, మరొకటో జరుగుతుంది. ఒక్కదెబ్బకి లాభం గూబల్లోకి వస్తుంది. 

రాజ్యసభలో తెలంగాణా బిల్లుకి ఆమోద ముద్ర వెయ్యడానికి రెండురోజుల ముందు(19.02.2014) స్ట్రీట్ వెండార్ల బిల్లు కూడా పాసయ్యింది. వీధుల్లో అమ్ముకొనేవాళ్ళకి లైసెన్సులు ఇచ్చి, సరుకులుపెట్టి అమ్ముకోవడానికి ప్రత్యేకమైన జోన్లని కేటాయిస్తారట. 

అధికారుల భయంలేకుండా అమ్ముకోవడానికి వాళ్ళకీ, కేటాయించిన జోన్లలోనే అమ్ముకొంటారు కనుక ట్రాఫిక్‌కి అంతరాయం కలగకుండా నగరవాసులకీ బాగానే ఉంటుందనుకొంటాను.   

© Dantuluri Kishore Varma

Saturday, 22 February 2014

హైలెస్సో, హైలెస్సా

Photo : The Hindu 
నాలుగైదురోజుల క్రితం హిందూ న్యూస్‌పేపర్లో ట్యూనా ఫిష్‌ని మోసుకొని పోతున్న ఒకమత్యకారుడి ఫోటోని వేశారు. దానితోపాటూ ట్యూనా చేపలు తక్కువగా పడుతున్న కారణంగా మత్యకారులు ఆందోళన చెందుతున్నారని న్యూస్‌కూడా రాశారు. తడి ఇసుకమీద నడిచిపోతున్న పాదాలు, వొడ్డును తాకుతున్న కెరటాలు, బ్యాక్‌గ్రౌండ్‌లో మబ్బులు పట్టిన నీలి ఆకాశం.. ఫోటో చూస్తుంటే తెలియకుండానే హైలెస్సో, హైలెస్సా అనే పాట చెవుల్లోవినిపిస్తుంది. 
*     *     *
కాకినాడలో మత్యకారుల సంఖ్యఎక్కువ. మాస్కూల్ విద్యార్థుల తల్లితండ్రుల్లో కూడా కొంతమంది బోటు యజమానులు ఉన్నారు. వాళ్ళపిల్లల చదువు విషయంలో మమ్మల్ని కలవడానికి స్కూలుకి వచ్చినప్పుడు వాళ్ళ సాధకబాధకాలు కూడా ప్రస్తావనకి వస్తుంటాయి.  అటువంటి ఒక సందర్భంలో ఫిషింగ్‌హాలిడే గురించి కొంత సంభాషణ జరిగింది. జగన్నాథపురం వంతెనదగ్గర, కాకినాడ సముద్రతీరంలోనూ మరపడవలని దూరంనూంచి చూడటమే కానీ, వాళ్ళు చేసే పనిగురించి పెద్దగా తెలియదు. కనుక ఎవరైనా చెపితే వినడానికి ఆసక్తికరంగా ఉంటుంది.  హిందూ న్యూస్‌పేపర్లో మొన్న చూసిన ఫోటో - చెవుల్లో వినిపించిన హైలెస్సో పాటతో పాటూ, ఈ సమాచారాన్ని కూడా జ్ఞాపకానికి తెచ్చింది. ఆ సంగతులని మీతో పంచుకోవడానికి ఈ టపా.

సముద్రంలోకి చేపలవేటకి వెళ్ళే మరపడవలు మనతీరప్రాంతంలో సుమారు రెండువేలు ఉంటాయి. వాటిలో 700 కాకినాడవైతే, 600 విశాఖపట్టణానివి. మిగిలినవి కృష్ణపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడలరేవులవి. సముద్రంలోనికి వేటకు వెళ్ళేముందు డీజిల్ కొట్టించుకొని, పట్టుబడిన చేపలూ రెయ్యలూ నిల్వచెయ్యడానికి ఐసు నింపుకొని, సముద్రంలో ఉండే పదిరోజులో, పదిహేనురోజులో తినడానికి బియ్యం, కాయగూరలు, నీళ్ళు ఇంకా చాలా వేసుకొని పడవసిబ్బంది అంతా బయలుదేరతారు. ఒక్కసారి పట్టుబడికి వెళితే సుమారు లక్షన్నర వరకూ ఖర్చు అవుతుందట. ఈ ఖర్చులు భర్తీ అయ్యి లాభం రావాలంటే పెద్దమొత్తంలో రొయ్యలూ, చేపలూ దొరకాలి.   

అదృష్టం బాగుంటే పెట్టినదానికి రెట్టింపు, రెండురెట్లూ కూడా వస్తుందట. బాగాలేకుంటే లక్షో, ఎంతో ఎగిరిపోతుంది. వేటకి వెళ్ళినతరువాత ఏ తుఫాను వచ్చే సూచనలో ఉండి వెనక్కి రావలసి ఉంటే మొత్తం పెట్టుబడి పోయినట్టే. పట్టుబడి సరిగా ఉండని సందర్భాలు కూడా తరచూ ఉంటాయి. దానికి కారణం విపరీతంగా మత్యసంపదను ఉపయోగించుకొంటూ ఉండడమే. అందుకే ప్రతీసంవత్సరం చేపపిల్లలు తయారయ్యే సమయంలో (సుమారు ఏప్రిల్ 15 నుంచి మే 31వరకూ) 47రోజులు ఫిషింగ్‌హాలిడేని కేంద్రప్రభుత్వం అమలుపరుస్తుంది. దీనివల్ల మత్యసంపద మళ్ళీ వృద్దిచెందుతుంది.  జూన్ ఒకటినుంచి కేజీలకొద్దీ రొయ్యలూ, టన్నులకొద్దీ చేపలు దొరకడం మొదలౌతుంది... హైలెస్సో, హైలెస్సా...

శుభసంకల్పం సినిమా నుంచి హైలెస్సో పాట చూడండి సరదా, సరదాగా.  

© Dantuluri Kishore Varma

Saturday, 25 January 2014

రిక్షా పుల్లర్

ఊరు ఏవైపు నుంచి ఏవైపుకు కొలిచినా ఐదారు కిలోమీటర్లు దాటని కాకినాడ, రాజమండ్రీ, అమలాపురం లాంటి పట్టణాలకి రిక్షా ఒకప్పటి ముఖచిత్రం. మధ్యతరగతి కుటుంబాలు సినిమాకి వెళ్ళాలన్నా, బీచ్‌కి వెళ్ళాలన్నా, హాస్పిటల్‌కి వెళ్ళాలన్నా రిక్షానే ప్రధాన వాహనం. పాతికేళ్ళక్రితం వెతికిచూసినా ఒక్క ఆటో కూడా కనిపించేదికాదు. వాటిని చూడాలంటే వైజాగో, విజయవాడో, హైదరాబాదో వెళ్ళినప్పుడే కుదిరేది. 

సద్గుణరావు, అప్పారావు అని ఇద్దరు రిక్షాపుల్లర్లు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే వెంటనే సైకిలుమీద వెళ్ళి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకర్ని పిలుచుకొని వచ్చేస్తే అయిదునిమిషాలలో రిక్షా ఇంటిముందు ఉండేది. బేరం అవసరం లేదు. వెళ్ళి వచ్చినతరువాత డబ్బులు చేతిలో పెట్టడమే. స్కూలుకి పిల్లల్ని దించే రిక్షాలయితే ఎగుడు దిగుడయినా, ఎదురు గాలయినా, జోరువానయినా రిక్షాసవారీ ముందుకు సాగేది. పిక్కల్లో బలం ఉన్నంతవరకూ రిక్షా తొక్కేవారు. తెలుగు సినిమాలలో కూడా హీరో కష్టపడి నిజాయితీగా సంపాదించాలంటే రిక్షా తొక్కవలసిందే. 

రిక్షాలో వెళ్ళి కాన్వెంటులో చదువుకొన్న కుర్రాడు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి కారులో అదేవూరికి తిరిగి వస్తే ఇప్పటికీ పిల్లల్ని స్కూలుకి దింపుతున్న అప్పారావుని చూసి ఆశ్చర్యపోవడమే!

సైకిలురిక్షాలు ఇంకా ఉన్నాయా అని అబ్బురపడొద్దు. ఇంకా ఉన్నాయి! కానీ మార్కెట్‌కి అమ్మకానికి కాయగూరలు తీసుకొని వెళ్ళేవాళ్ళూ, అక్కడక్కడా స్కూలుకి వెళ్ళే పిల్లలూ తప్ప వీటిమీద తిరిగే జనాలే అరుదైపోయారు. సెకండ్‌షో చూసి తిరిగి వచ్చేటప్పుడు రిక్షా గూడు వెన్నక్కి వేసేసి, పైన వెన్నెల్ని, తగులుతున్న చల్లగాలినీ అస్వాదిస్తూ, సినిమా కబుర్లు చెప్పుకొంటూ, నవ్వుకుంటూ తుళ్ళుకొంటూ వెళ్ళే పడుచుజంటల పూలరిక్షాలు - బైకులకి బలయిపోయాయి.

ఎక్కడినుంచి, ఎక్కడికైనా పదిరూపాయల షేర్ ఆటోని పట్టుకొని వెళ్ళిపోతున్నారు. బస్‌స్టాపుల ప్రక్కన `యాభై రిక్షాలు నిలిపు స్థలం` అనే బోర్డులు ఎక్కడా కనిపించడం లేదు. సాగు తున్న ఆటోలు తప్పించి.   

ఇప్పుడు రిక్షా పుల్లర్ ఒక ఎండేజర్డ్ స్పీషీస్ - అంతరించి పోతున్న జాతి.
     
© Dantuluri Kishore Varma 

Friday, 24 January 2014

పడవఇళ్ళ కబుర్లు

ఇది చొల్లంగి కాలువ. కాకినాడకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. గోదావరి నది యొక్క ఏడుపాయల్లో ఒకటైన తుల్యబాగ ఇక్కడినుంచి సముద్రంలో కలుస్తుంది. చొల్లంగి అమావాస్యరోజు ఇక్కడ స్నానాలు చెయ్యడం చాలా పుణ్యంగా భావిస్తారు భక్తులు. దీని నిజమైన ప్రత్యేకత ఏమిటంటే - కాకినాడనుంచి యానం వైపు వెళూతున్నప్పుడు ఈ ప్రదేశాన్ని ముక్కు మూసుకోకుండా ఎవ్వరూ దాటలేరు. ఒకవేళ అలా దాటారూ అంటే వాళ్ళు అక్కడి వాళ్ళయినా అయివుండాలి లేదంటే ఆ మార్గం గుండా రోజూ ప్రయాణీంచేవాళ్ళయినా అయివుండాలి. దానికి కారణం ఎండబెట్టిన చేపలు, రొయ్యల వాసన. ప్రొద్దుటనుంచి సాయంత్రం వరకూ రోడ్డుప్రక్కన రెండువైపులా వీటిని ఎండబెడతారు. ఒకకిలోమీటరు దూరం వరకూ ఈ ఎండబెట్టుడు కార్యక్రమం ఉంటుంది. ఇది కోళ్ళ మేతకోసం వాడతారని అంటారు.  

నాటు పడవలమీద కుటుంబాలు, కుటుంబాలు ఉంటాయి. ఇంటి(పడవ)పెద్ద పడవకి ఒక కొనమీద కూర్చొని వల చిక్కు తీసుకొంటూ ఉంటాడు. రెండవకొనమీద అతని భార్య వంటచేస్తూవుంటుంది. పిల్లలు అక్కడే ఆడుకొంటూ ఉంటారు. చుట్టూనీరు! పొరపాటున అందులో పడతారేమో అని భయంవేస్తూ ఉంటుంది చూసేవాళ్ళకి. పడవే వాళ్ళ ఇల్లు. తిండి, పని, నిద్ర, ఆట అన్నీ దానిమీదే. కొంతకాలం క్రితం ప్రభుత్వంవాళ్ళు పడవలమీద పిల్లలకి చదువు చెప్పడానికి స్కూల్ఆన్‌బోట్ అనే బడిని పెట్టారు. ఈ పడవఇళ్ళ సమీపంలో నీటి మీదతేలుతూ చాలా కలర్‌ఫుల్‌గా ఉండేది. కాలువ గట్టుమీద చిన్న హట్‌లాంటి సిమ్మెంట్ నిర్మాణం కూడా చేశారు. పడవబడి అనో, మరేదో రాసి ఉండేది దాని మీద. కొంతకాలం నడిచింది. తరువాత ఆగిపోయినట్టుంది. ఇంకా....  చెప్పడానికి ఏమీలేదు. అంతే!


© Dantuluri Kishore Varma

Wednesday, 8 January 2014

బావి దగ్గర..

బోర్లు, కుళాయిలు లేని రోజుల్లో ఊరంతటికీ ఒక్కటే మంచినీళ్ళ బావి ఉండేది. ప్రతీఇంటినుంచీ తప్పేళాలో, బిందులో, కుండలో, రాగిబిందులతో ఉన్న నీటి కావిళ్ళతోనో జనాలు అక్కడికే వెళ్ళేవారు. రాతి ప్రదేశాల్లో ఎంతో లోతుగా తవ్వితే గానీ నీరు పడేది కాదుకనుక, బావులన్నీ పాతాళమంతలోతు ఉండేవి. గిలక సహాయం లేకుండా నీరు తోడడం అసాధ్యం. గిలకపైనుంచి కొబ్బరితాడుకి కట్టిన చేదతో నీళ్ళు తోడేవారు. రెండుచేదలు తోడితే బిందె నిండిపోయేది. తోడుతున్నవాళ్ళు, తమవంతుకోసం ఎదురు చూసేవాళ్ళు, అమ్మలవెనుక చిన్ని చిన్ని గిన్నెలు, చెంబులు పట్టుకొని నిలబడి ఉండే బుడతలు, మొగవాళ్ళు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు, పడుచువాళ్ళు అందరికీ ప్రతీరోజూ సమావేశ స్థలం అదే. ఊళ్ళో విశేషాలు ఇప్పటి సోషల్ నెట్‌వర్కింగ్‌లో కంటే వేగంగా ఒకరినుంచి ఒకరికి చేరిపోయేవి. అప్పుడప్పుడు ప్రేమకథలు కూడా ఇక్కడే మొదలయ్యేవి. అందుకే `బావి దగ్గర..` అనే మాటకి చాలా ఆకర్షణ ఉంది. ఎప్పుడో దామెర్ల రామారావుగారు (Link) కూడా `అట్ ద వెల్` అనే పేరుతో ఒక పెయింటింగ్‌ వేశారు. `అలాగ ఉండేది, ఇలాగ ఉండేది..` అని చెపుతున్నాను కనుక ఇలాంటి పరిస్థితులు ఇప్పుడులేవేమో అనుకోవద్దు. ఇప్పటికీ ఊరికంతటికీ కలిపి ఒకే మంచినీళ్ళ బావి ఉన్న ఊళ్ళు చాలా ఉన్నాయి. అలాంటి బాగిదగ్గ తీసిందే పై ఫోటో!

© Dantuluri Kishore Varma

Tuesday, 7 January 2014

అరకులోయలో సంతరోజు


సంతరోజు తెల్లవారుజామునే మంచుపొరలు విడవకముందే, సూరీడు తన బాణాల్లాంటి కిరణాలని ఎక్కుపెట్టకముందే తట్టలు, బుట్టలు, సంచులు, సంచుల్లో కూరగాయలు, కావిళ్ళు, వాటిల్లో రకరకాల వస్తువులు, అరటిగెలలు, గుమ్మిడికాయలు, పట్టుతేనెనింపిన సిసాలు, జంగిడాల్లో బజ్జీలూ, పుణుకులు, మసాల దినుసులు, కొయ్యబొమ్మలు, తప్పేళాలు, గిన్నెలు, చెక్కపెట్టెలు, కంబళ్ళు, స్వెట్టర్లు, బట్టలు... అవీ, ఇవీ అని కాకుండా అమ్మడానికి పనికివొచ్చే సరుకులన్నీ వెంటబెట్టుకొని కూడలిలో సంతజరిగే ప్రదేశానికి బయలుదేరతారు అరకులోయ చుట్టుప్రక్కల ప్రదేశాల్లోని ప్రజలు. 


`నెత్తిమూటల నెత్తుకోవాలి!
కొత్తమడతలు దీసి కట్టాలి!
అడవి దారుల యెంట నడవాలి!
బరువు మారుసుకొంట పక్కున నవ్వాలి!`

అని ఎంకిపాటలో నండూరి సుబ్బారావుగారు అన్నట్టు అచ్చికబుచ్చికలు ఆడుకొంటూ మొగుడుపెళ్ళాలు సరుకులని తలకెత్తుకొని సంతదారి పడతారేమో! 


ఈ సంతలో వ్యవసాయ, అటవీ ఉత్పత్తులు చవకగా దొరకవచ్చు కానీ, అన్నీ చవకే అని అనుకోకూడదు.  తేనెలాంటి వాటిలో స్వచ్చతని నిర్ధారించడం ఎవరికీ సాధ్యంకాదు. దానిలో ఎన్ని పాళ్ళు తేనె, ఎన్నిపాళ్ళు పంచదార పానకం ఉంటుందో దేవుడికే తెలియాలి. ఫోటో తీసినప్పుడు కలర్‌ఫుల్‌గా పడే బజ్జీలు, బెల్లపచ్చుల్లో ఫుడ్‌కలర్ బాగా కలిసి ఉండవచ్చు. కార్లమీద వెళ్ళేవాళ్ళు తేనె, మసాలా దినుసులు లాంటివాటిని మంచి రేటుకే కొని పట్టుకొని వెళితే, స్థానికులు తినుబండారాలని బాగా కొనుక్కోవడం కనిపిస్తుంది. ఏది ఏమయినా సంతరోజు అంటే సంతోషకరమైన రోజే.

  

సంత ఒక సూపర్‌మార్కెట్ అక్కడ! తమ సరుకులని అమ్ముకొని, కావలసినవి కొనుక్కొని ఇళ్ళదారి పడతారు. మళ్ళీ వచ్చే వారం సంతవరకూ అడవి తప్ప మరొక ప్రపంచం కనిపించదు వాళ్ళకి. 
ఇంకొక కలర్‌ఫుల్ పోస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. 
© Dantuluri Kishore Varma

Saturday, 4 January 2014

మధురమీ పానకం

అప్పుడైనా రొట్టెని పానకంలో ముంచుకొని తిన్నారా? తినిఉంటే ఆ రుచిని మీరు తప్పనిసరిగా `అమోఘం!` అని అనాల్సిందే. `ఇంతకీ, ఏ రొట్టి?` అని అడిగితే, `ఏ రొట్టయినా..` అని సమాధానం చెప్తాను. `ఏ పానకం?` అని అడిగితే మాత్రం `చెరుకుపానకం,` అనే చెప్తాను. చెరుకు పండే ప్రాంతాల్లో బెల్లం తయారీ కోసం క్రషర్స్‌ని ఏర్పాటు చేస్తారు. పల్లెప్రజల నోళ్ళల్లోనాని రూపుమారిపోయిన మాటల్లో క్రషర్ ఒకటి. వాళ్ళు దానిని కస్సర్ అని పలుకుతారు. మనం రోడ్డువార, జ్యూస్ సెంటర్లలో చెరుకురసం తీసే మెషీన్లని చూస్తాం కదా? అటువంటివే క్రషర్లంటే. ఈ క్రషర్స్ దగ్గర బెల్లంతో పాటూ, రొట్టెల్లో నంజుకోవడానికి ఉపయోగపడే పానకం కూడా లభ్యమౌతుంది.  ఓ పదిరోజుల క్రితం కాకినాడకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి వెళ్ళాను. సామర్లకోటకి నేషనల్ హైవే ఐదు మీద ఉన్న ప్రత్తిపాడుకి మధ్యలోచెరుకు విస్తారంగా పండే భూములు, వాటిని చేర్చి  బెల్లం తయారీ కేంద్రాలు ఉన్నాయి.
చెరుకు తోటల్లోనుంచి చెరుకుని కోసుకొని వచ్చిన తరువాత, క్రషర్ ద్వారా రసం తీస్తారు. దానిని బెల్లం వండడానికి ఉపయోగించే ఇనుప పెనంలోకి పంపి, క్రింద మంట పెడుతూ, పెద్ద చట్రం గరిటతో కోవా కలిపినట్టు కలుపుతారు. ఇక్కడ పొయ్యిలో మంటపెట్టడానికి ఉపయోగించే వంటచెరుకు రసం తీసేసిన చెరుకుపిప్పే! బాగా ఎండబెట్టి వంటచెరకుగా వాడతారు. రసం మరుగుతూ, చిక్కబడుతున్నప్పుడు తియ్యటి వాసన భలేగా ఉంటుంది. నోరూరిపోతుంది. రసంలోని వ్యర్థపదార్థాలు, పిప్పి మొదలైనవి తెట్టిలా తేలిపోతాయి. (అలా వ్యర్థాలు వేరుచేయడానికి కొన్ని రసాయనాలని కలుపుతారు). వాటిని గరిటతోతీసి వేరుచేసేస్తారు. క్రమంగా పానకం బంగారు రంగులోనికి మారుతుంది. పాకం తీగలుగా సాగుతుందనిపించే సమయానికి మౌల్డ్‌లోకి వొంపి, ఆరబెడతారు. బెల్లం ఆరి, గట్టి బడుతుంది. అప్పుడు మౌల్డ్‌లలోనుంచి బయటకు తీసి ప్యాక్‌చేసి, అట్టపెట్టెల్లో సర్ధి, మార్కెట్‌కి పంపుతారు.






మనం చెరుకు పానకం గురించి మొదలుపెట్టి బెల్లం తయారీ దాకా వచ్చేశాం. కొంచెం వెనక్కు వెళ్ళి పానకం తెచ్చుకొందాం! తెట్టు తీసేసిన తరువాత, తీగపాకం రావడానికి ముందు పాకాన్ని డబ్బాల్లోకి తీసి చల్లారనిస్తారు. తరువాత సీసాల్లో నింపి అమ్ముతారు. ఇలా తయారుచేసిన బెల్లం పాకానికి ఇంచుమించు తేనెకు ఉన్నన్ని పోషక విలువలు ఉంటాయని చెపుతారు.

హైవేల్లో ప్రయాణిస్తున్నప్పుడు, చెరుకుతోటలు కనిపించిన ప్రదేశాల్లో  కొంచెం జాగ్రత్తగా గమనిస్తే బెల్లం తయారీ కేంద్రాలు కనిపిస్తాయి. అటువంటప్పుడు తప్పనిసరిగా వెళ్ళిచూడండి. తయారుచేసే విధానం బాగుంటుంది. ముఖ్యంగా తీపి వాసన!
© Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!