Pages

Showing posts with label వెండితెర. Show all posts
Showing posts with label వెండితెర. Show all posts

Saturday, 20 August 2022

సీతారామం

ఈ మధ్య కాలంలో(పది - పదిహేనేళ్ళ నుంచి) సినిమాలు చూసే ఆసక్తి బాగా తగ్గిపోయింది. వారానికి మూడు, నాలుగు సినిమాలు చూసే నేను ఈ దశాబ్ద కాలంలో మొత్తం అరడజను కూడా చూడలేదంటే సినిమా మాధ్యమం నాకు ఎంత బోర్ కొట్టేసిందో అర్ధం చేసుకోవచ్చు. కానీ, ఇప్పుడిప్పుడే మళ్ళీ మనసు అటువైపుకు లాగుతుంది. మూస ఫార్ములా ఒదిలిపెట్టి, మంచి కంటెంట్ వైపు తెలుగు సినిమా అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తుంది. 

కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సినిమా అనగానే 'రోజా'లా ఉండొచ్చేమో అని ఆశ కలిగింది. 'యుద్ధంతో రాసిన ప్రేమ కథ ' అనే ట్యాగ్ లైన్, ఉత్తరాల కాలంనాటి పిరియాడిక్ స్టోరీ, రివ్యూస్... ఇవన్నీ నన్ను థియేటర్‌కి నడిపించిన  కారణాలు.

ఎక్కడా లూజ్ ఎండ్స్ లేకుండా చక్కగా రాసుకొన్న కథ చాలా బాగుంది. రాముడు రాసిన ఉత్తరం సీతకు చేర్చే క్రమంలో రశ్మిక ఫ్లాస్‌బ్యాక్‌లలో తెలుసుకొనే స్ర్కీన్‌ప్లే 'మహానటి ' ని జ్ఞాపకం చేస్తుంది. ఇంకా హీరోయిన్ రాసే ఉత్తరాలు యండమూరి 'వెన్నెల్లో ఆడపిల్ల ' నవలని, కొన్ని సన్నివేశాలు వెంకటేష్ మల్లీశ్వరిని, ఒక్కొక్కచోట రోజాని.. గుర్తు చేస్తాయి. అయినా ఈ సినిమాని తప్పుపట్టలేం! 

ఇంటర్వెల్‌కి ముందు హీరోయిన్ ఎవరో రివీల్ చెయ్యడం, పోస్ట్‌మ్యాన్ లాగ ఉత్తరం పట్టుకొని తిరుగుతున్న రశ్మిక్‌కి మెయిన్ క్యారెక్టర్‌కి ఉన్న సంబంధాన్ని ప్రి క్లైమాక్స్‌లో ఎస్టాబ్లిష్ చెయ్యడం చాలా బాగుంది.

ప్రతీ ఫ్రేం నీట్‌గా ఉంది. ఫొటోగ్రఫీ,  కంపోజింగ్,  లొకేషన్, కస్ట్యూంస్, నటీనటులు.. అన్నీ కలిసి బ్యూటిఫుల్ ఔట్‌పుట్ వచ్చింది. బ్యాగ్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు ఎప్పుడు వచ్చి, వెళ్ళాయో తెలియలేదు. 

సీతారాముల్ని కలిపితే కథ అర్థవంతం అయ్యుండేది. ముగింపు కొంచం మార్చడం వల్ల సినిమాకి ఇంకా ప్లస్ అయ్యుండేదేమో!

మంచి నవల చదివిన అనుభూతి కలిగింది. సీతారామం చూడవలసిన మంచి సినిమా.

Wednesday, 7 November 2012

నేడే చూడండి!

ఒక రిక్షాకి మూడువైపులా  చతురశ్రాకారపు అట్టలు కట్టి, వాటిమీద కొత్తగా హాలుకి వచ్చిన సినిమా వాల్ పోస్టర్లు అంటించి మైకులో "నేడే చూడండి - నాగేశ్వరరావు, సావిత్రీ నటించిన కనీ వినీ ఎరుగని కుటుంబ కథా చిత్రం......," అని ఊరంతా తిప్పి చెవుల్లో తుప్పు వదల గోట్టేసేసరికి, రిక్షా వెనుక కుర్రళ్ళు గోల, గోల గా పరుగెత్తేవాళ్ళు. సంక్షిప్తంగా సినిమా కథ కొంత ముద్రించి, `....అప్పుడేమయ్యిందో వెండితెరమీద చూడండి,`  అని అచ్చువేసిన పాంప్లెట్లు అంది పుచ్చుకొని, ఇంటికి పట్టుకెళ్ళిపోతే (ఇటువంటి రిక్షా ప్రచారం ఇప్పటి తరానికి పరిచయంచెయ్యడానికి ఆమధ్య విడుదలయిన బాపూ సినిమా శ్రీరామరాజ్యం కోసం కొన్నిచోట్ల చేస్తే జనాలు ఆసక్తిగా చూసారని ది హిందూ పేపర్లో వేసారు); సాయంత్రం ఆటకి వెళ్ళడానికి పెద్దవాళ్ళు గుర్రబ్బండిని కబురు పంపేవారు.

అలాగని వచ్చిన ప్రతీ సినిమాకీ చెక్కేసేవాళ్ళనికాదు. ఏక్టర్లు నచ్చినవాళ్ళు అయ్యి ఉండాలి, సినిమా బాగుందని ఆనోటా ఈ నోటా విని ఉండాలి. అప్పుడే  పక్కఊళ్ళో ఉన్న సినిమా హాలుకి ప్రయాణ సన్నాహాలు చేసుకోవడం. ఈ గుర్రబ్బండి సవారీ కుర్రవాళ్ళకోసం కాదు. ఇంటిలో ఆడవాళ్ళ కోసం. వాళ్ళు బండి ఎక్కిన తరువాత ఒకటో, రెండో సీట్లు ఖాళీ ఉంటే పిల్లల్లో అదృష్ఠవంతులకో, లేదా బాగా పెచీ పెట్టగలిగిన కళ ఉన్నవాళ్ళకో అవి దక్కేవి.  

సాయంత్రం ఆరుగంటలు అవకుండానే భోజనం చేసేసి తాతగారు నిద్రపోయిన తరువాత, గుర్రబ్బండి వెనుక గుమ్మం దగ్గరకి వచ్చేది. సినిమా విషయం ఏ మాత్రం ఆయనకి తెలిసినా అక్షింతలు పడిపోయేవి. అందుకే రహస్యం.  అప్పటి గుర్రబ్బండి అంటే, ఇప్పటి లగ్జరీ కారు అన్నమాట. లోపల సీట్లు కూడా కూర్చోవడానికి మహా అనుకూలంగా ఉండేవి. చల్లని పచ్చగడ్డి ఒక అర అడుగు మందాన పరచి దానిమీద ముతక బరకం వేస్తే ఎంత గతుకుల రోడ్డులో నడిపించినా నొప్పి తెలిసేదికాదు. లోపల కూర్చున్న ప్రయాణీకులు బయటకు కనిపించకుండా ముందూ, వెనుకా తెరలు కట్టేవారు. ఎప్పుడయినా బండినడిపేవాడి ప్రక్కన కూర్చుంటే సవారీ భలే ఉండేది. వాడి చేతిలో  ఒక అడుగున్నర పొడవైన అతి సన్నని వెదురు గడకి కట్టిన చెర్నోకొలా ఉండేది . దీనికి రెండు ఉపయోగాలుండేవి - గుర్రాన్ని నడపడం, ఎవరైనా అడ్డువచ్చినప్పుడు కర్రని వెనక్కి త్రిప్పి తిరుగు తున్న బండి చక్రపు ఆకుల(స్పోక్స్)కి తగిలేలా ఉంచడం. అప్పుడు వచ్చే టృ)))))) అనే చప్పుడుకి `అహా....హె్‌య్ హె్‌య్`  అని అదిలింపు కలిపితే స్వారీ మేఘాలలో తేలుతున్నట్టు ఉండేది. 

మావూరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకే ఒక హాలులో వేసే సినిమాలు  అప్పటికే విడుదలయ్యి ఐదో పదో ఏళ్ళు పూర్తయ్యి, రాష్ట్రమంతా తిరిగి, కాళ్ళు నెప్పులు పెట్టెసి, చతికిలబడే సమయానికి  ఆఖరి మజిలీగా వచ్చేవి. లవకుశ, మాయాబజార్, గుండమ్మకథ, ప్రేమనగర్, భక్తకన్నప్ప, సుమంగళీ, బడిపంతులు, కార్తీకదీపం, అమరదీపం, చుట్టాల్లున్నారుజాగ్రత్త, ఇంటింటి రామాయణం, ప్రేమాభిషేకం, బుర్రిపాలెం బుల్లోడు, పదహారేళ్ళ వయసు, దేవత..... నేను ఇక్కడే చూసినట్టు గుర్తు. పేరు భాస్కర్ థియెటర్ అయినా దానిని టూరింగ్ టాకీస్ అని పిలిచేవారు. కుర్చి, బెంచీ, నేల అని మూడు క్లాసులు ఉండేవి. ఫోల్డ్ చెయ్యడానికి అనువుగా ఉండే గోడ్రేజ్ కంపెనీ ఇనుప కుర్చీలు వేసిన  క్లాసుకి వెళ్ళేవాళ్ళకి అమ్మా, నాన్నా మధ్యన కూర్చుని సినిమా చూసే అదృష్టం లేదు. ఈ క్లాసుని నిలువుగా రెండుభాగాలు చేసి, మధ్యన తెర కట్టేవారు - ఒకవైపు మగవాళ్ళకి, మరో వైపు ఆడవాళ్ళకి. 

మసక లైట్ల కాంతిలో, ఘంటశాల పాడిన `నమో వెంకటేశా, నమో తిరుమలేశా.....' అనే పాట వస్తూ ఉండగా లోపలికి వెళ్ళి; చుట్టా, సిగరెట్టు, బీడీ పొగలు మధ్య చిత్రరాజాన్ని అస్వాదించి, మళ్ళీ అదే ఘంటశాల పాట నేపధ్యంలో బయటకు వచ్చేయ్యడమే. హాలు బయట విస్తరాకులతో కోను ఆకారంలో చిన్ని చిన్ని పొట్లాలు కట్టి, పావలాకి ఒకటి చొప్పున అమ్మే కరకజ్జం తప్పని సరిగా కొనుక్కొని బండికోసం ఎదురు చూసేవాళ్ళం. దియేటరు దాటి కొంచం ముందుకు వెళ్ళగానే అప్పుడే చేసిన నేతి సున్నుండల వాసన వచ్చేది. "తాచుపాము ఉన్నచోట ఇలాంటి వాసన వస్తుంది," అని బండి వాడు చెప్పేవాడు. ఊరు నిద్రపోతుండగా రెండు సరిహద్దులకీ మధ్య ఉన్న కంకర గోతులు అనే ప్రదేశంలో ఉండే మర్రి చెట్టు దాటుకొని మావూరు తిరిగి వెళ్ళాలి. ఆ మర్రిచెట్టుమీద దెయ్యాలు ఉంటాయని చెప్పుకొనేవారు. అక్కడి వరకూ సినిమాకబుర్లు చెప్పుకొంటూ ఖుషీ, ఖుషీగా వచ్చేసినా...ఆ ప్రదేశాన్ని సమీపించే సరికి పెద్దవాళ్ళు ఒక్కసారి నోటిమీద వెలు పెట్టి, నిశ్శభ్దంగా ఉండమని సూచిస్తూ `హ్హుష్!' అనేవారు. చీకట్లో కీచురాళ్ళ అరుపులు, నల్ల కంకర రోడ్డు మీద గుర్రపు డెక్కల టక టకలు, తిరిగే బండిచక్రాల చప్పుళ్ళతో గుండే చేసే లబ్‌డబ్‌లు కలిసి వాద్య సంగీతం అదిరిపోయేది. చిరుచెమటమీద చల్లటిగాలి తగిలేసరికి మర్రిచెట్టు దాటి వచ్చేసినట్టు లెక్క.  

చిన్నప్పటి సినిమా అంటే తెరమీద బొమ్మ, ఘంటశాల `నమో వెంకటేశా` పాట, కరకజ్జం రుచి, సున్నుండల వాసన, దెయ్యల మర్రిచెట్టు దాటాక వొంటికి చల్లగా తగిలే గాలి.... ఆ జ్ఞాపకానికి పంచేంద్రియాలూ స్పందిస్తాయి.

© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!