Saturday, 30 March 2013

మనసు రాజమందిరం ఐపోతుంది

రిఫ్రిజిరేటర్ అనే మాట ఎవ్వరికీ తెలియని రోజులవి. పల్లపు వీధివాళ్ళు నలుగురైదుగురు కలిసి ఐస్ ఫేక్టరీ పెట్టారు. ఫేక్టరీ అంటే అదేదో చాలా పెద్దదేమీ కాదు. గోలీ సోడాలూ, డ్రింకులూ చల్లబరచడానికి ఐసు దిమ్మలూ; ఊరూరూ సైకిలుమీద తిరిగి అమ్ముకొనే  పుల్లైసు బండివాళ్ళకి సరఫరా కోసం పాలైసు, ఆరెంజ్ ఐసు, కోలా ఐసు, మేంగో ఐసు లాంటివి తయారు చేసే ఒక చిన్న గదిలాంటి షాపు. ఈ ఫేక్టరీ పెట్టడంతో ఊరికి చాలా అభివృద్ది వచ్చినట్టైపోయింది. `మా వూళ్ళో ఐసు ఫేక్టరీ పెట్టారు తెలుసా!` లాంటి గర్వంతో కూడిన మాటలు కూడా కొంతమంది చెప్పుకొనేవారు.  చుట్టుప్రక్కల నాలుగైదు గ్రామాలకి ఇదొక్కటే మరి. ఎండలు మండిపోతున్న సమయంలో ఇది అందుబాటులో ఉండడం ఒక రకంగా అదృష్టమే! మిట్టమిడసరం పెద్దవాళ్ళు అందరూ పడుకొన్న తరువాత పదిపైసలు చేతిలో పట్టుకొని ఒక్క పరుగు తీస్తే, ఎండ నెత్తిమీద `సుర్రు`మనిపించే లోగా ఐసు ఫేక్టరీ దగ్గరకు చేరిపోయే వాళ్ళం. పుల్ల ఐసు చల్లదనం, రుచీ మధురం.

మావిడిపళ్ళు సమృద్దిగా ఉండేవేమో, `చక్కగా నాలుగు పళ్ళు తీసుకొని తినండిరా,` అని పెద్దవాళ్ళు మొత్తుకొనేవారు. తిని,తిని మొహంమొత్తి ఉన్న పిల్లలకి అవి అప్రియమైన మాటల్లా ఉండేవి. బాగా ముగ్గిన పాపారాజు గోవా పళ్ళ నుంచి రసం పిండి పెద్ద పెద్ద గాజు సీసాలలోకి నింపి, ఐసు ఫేక్టరీకి ఉదయాన్నే పంపేవారు. మద్యాహ్నం ఐసులుకోసం వెళ్ళినప్పుడు వాటిని జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకొని ఇంటిల్లపాదీ లోటా గ్లాసుల్లో నింపుకొని, ఒక్కో గుటకా మ్రింగుతుంటే........ ఆహా! 

కొన్ని జ్ఞాపకాలు ఎన్నేళ్ళయినా అలా నిలిచిపోతాయి. 

సాయంత్రం పూట పొలానికి వెళ్ళిపోతే పాలికాపుని అప్పటికప్పుడు చెట్టెక్కించి ముంజికాయలు దింపించేవారు. ఒక్కో గెలనుంచీ కాయలు నరికి, ముంజులు కనిపించే వరకూ ముచ్చిక కోసి ఇస్తే - బొటన వేలు గుచ్చి తియ్యని రసాన్నీ, ముంజునీ అస్వాదిస్తూ తింటుంటే....

రోడ్డు ప్రక్కన బండిమీద జాడీలో పెరుగు, పంచదార, ఐసు వేసి కవ్వంతో చిలికి, గ్లాసులో వేసి, పైన స్పూనుతో కొంచం మీగడ వేసి అందించిన లస్సీ గొంతుక దిగుతుంటే....

పుచ్చకాయ ముక్కలు, బొప్పాయి చీరికలు, కొబ్బరి బొండంలో చల్లని నీళ్ళు........
వేపచెట్ల చల్లని నీడ, గోదావరి మీదనుంచి వచ్చే గాలి తెమ్మెర, ఆరుబయట వెన్నెట్లో మడతమంచం మీద వెల్లకిలా పడుకొన్నప్పుడు కనిపించే చలువబంతి లాంటి చందమామ....

అన్నింటి కంటే ముఖ్యంగా శెలవులు, కజిన్స్‌తో ఆటలు, బోది కాలువల్లో, పంపుషేడ్డుల దగ్గర స్నానాలు....

వేసవి అంటే ఉక్కబోత, కరెంట్ కట్, కణకణ మండే ఎండలే కాదు. వాటితో పాటూ పైవన్నీ తీసుకొని వచ్చే అమృతకాలం. ఇవన్నీ గుర్తుకు వస్తే ఎప్పుడైనా సరే మనసు రాజమందిరం అయిపోదూ?

© Dantuluri Kishore Varma 

Wednesday, 20 March 2013

ఎంత కష్టం! - ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

రెండుసంవత్సరాల క్రితం మా ఇంటి లివింగ్‌రూంకి ఉన్న వెంటిలేటర్లో రెండు పిచ్చుకలు గూడు పెట్టుకొన్నాయి. ఎక్కడికో ఎగిరి వెళ్ళడం - కొంచెంసేపు తరువాత  పీచు, పుల్ల ముక్కలు, తాళ్ళు లాంటివి ముక్కున కరచుకొని రావడం - గూడు కట్టుకోవడానికి చాలా శ్రమించాయి. కొన్నిరోజులకి గూటిలోనుంచి వచ్చే అల్లరి పెరిగి పోయింది. రెండు కిచకిచలకి బదులు ఎన్నో పిచ్చిక గొంతులు కలిపి కోరస్ పాడేవి. నాలుగో, అయిదో పిల్లలు, తల్లిపిచ్చుక, తండ్రి పిచ్చుక కలిపి రణగొణ ధ్వని చేసేవి. రాత్రీ, పగలు అనే భేదం లేదు. అలా కొంతకాలం గడిచిన తరువాత గూడు ఖాళీ అయిపోయింది. పిల్లలు ఎగరగలిగే వయసు వచ్చి ఎక్కడికో ఎగిరిపోయి ఉంటాయి. ఖాళీ గూడు అలాగే ఉండిపోయింది. తరువాతి సీజన్‌కి కూడా మళ్ళీ అలాగే జరిగింది. మేం ఆ ఇల్లు మారి వేరే చోటుకి రావడంతో ఇప్పుడు మాకు పిచ్చుకలు ఎక్కడా కనిపించడం లేదు.  
రెండు మూడు దశాబ్ధాల క్రితం వరకూ విరివిగా కనిపించే పిచ్చుకలు, ఇప్పుడు చాలా అరుదయిపోయాయి.  అంతర్ధానమైపోతున్న పిచ్చుకల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమౌతుంది. గతసంవత్సరం దీనిని ఢిల్లీ స్టేట్ బర్డ్‌గా ప్రకటించారు. భారత తపాలా శాఖ కూడా పోస్టల్ స్టేంప్‌ని విడుదల చేసింది. మార్చ్ 20 ని  ప్రపంచ పిచ్చుకల దినోత్సవం - వాల్డ్ స్పారో డేగా జరుపుకొంటున్నారు. 
బుల్లి పిచ్చుకకి పెద్ద కష్టం వచ్చిపడింది. కర్ణుడి చావుకి వంద కారణాలన్నట్టు, పిచ్చుకల ప్రస్థుత దుస్థితికి కూడా చాలా మానవ తప్పిదాలు ఉన్నాయి. ప్రకృతికి హాని చేసే ప్రతీ పనీ జీవసమతుల్యాన్ని దెబ్బతీసే అంశంగా పరిణమిస్తుందని పర్యావరణవేత్తలు చెపుతూనే ఉన్నారు. సెల్‌టవర్లు, విరివిగా వాడుతున్న పురుగుమందులు, వాతావరణ కాలుష్యం, పెరుగుతున్న కాంక్రీట్ నిర్మాణాలు, తరిగి పోతున్న వనసంపద లాంటివన్నీ పిచ్చుక అస్థిత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. 

నేచర్ ఫరెవర్ సొసైటీ వాళ్ళు పిచ్చుకల సంరక్షణకోసం కొన్ని సూచనలు చేస్తున్నారు:

- పిచ్చుకల నివాసంకోసం పెట్టెలను ఏర్పాటు చెయ్యడం
- ఒక పాత్రలో నీటిని పక్షులకి అందుబాటులో ఉంచడం, దాన్ని ప్రతీరోజూ మార్చడం
- ఆహారాన్ని అందుబాటులో ఉంచడం
- మొక్కల్ని పెంచడం
- గార్దెన్లలో పురుగులు, కీటకాలు అభివృద్ది అయ్యేలా పెంటను(మేన్యూర్) జల్లడం.

త్వరలోనే మళ్ళీ పిచ్చుకల కిచకిచలు విరివిగా వినే అదృష్టం కలగాలని ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సాక్షిగా కోరుకొందాం.
Photo : The Hindu
© Dantuluri Kishore Varma 

Tuesday, 19 March 2013

ఇల్లాజికల్ లాజిక్

పెంపుడు జంతువుల మీద చాలా ప్రేమ పెంచుకొంటాం. మనల్ని గుర్తుపడతాయని, మన సూచనల్ని పాటిస్తాయని, మనం కనిపించినపుడు చెప్పలేనంత సంతోషాన్ని వాటికి చేతనైనంత మేర వ్యక్తీకరిస్తాయని.  మనుష్యులని ప్రభావితం చెయ్యగల లక్షణాన్ని కుక్కలనుంచి నేర్చుచుకోవాలని డేల్ కార్నగీ అంటాడు. యజమాని బయటకు వెళ్ళి, తిరిగి వస్తున్నప్పుడు ఎదురెళ్ళి తోకఊపుతూ, గెంతుతూ, వీలయితే ముందరి రెండు కాళ్ళనీ పైన వేసి ఆనందంగా స్వాగతం చెప్పే టామీ మీద ప్రేమలేని వ్యక్తి ఎవరుంటారు? నా చిన్నప్పుడు మా యింటిలో ఒక గిత్త ఉండేది. దానికి మా పెదనాన్నగారు త్యాగరాజు అని పేరు పెట్టారు. ఉదయం, మధ్యాహ్నం టీ తాగుతున్నప్పుడు, `త్యాగరాజూ...`అని పిలిచి ఒక పాత్రలో దానికి కూడా టీ వేసి ఇచ్చేవారు. టీ అంటే దానికి ప్రాణం. పరుగులు పెట్టి వచ్చేసేది. 

ఈ రోజే ఈనాడు పేపర్లో న్యూస్ ఐటం ఒకటి చూశాను. గుడిలోనికి వెళ్ళబోతున్న త్రాచుపాముని చూసి అక్కడి పెంపుడుకుక్క అడ్డుకొందట. వాటి మధ్య కొంతసేపు భీకర పోరాటం జరిగింది. చివరికి కుక్క పాముని చంపి విజయం సాధించిందట. కానీ ఏమి లాభం? పాము కాట్లకి అది కూడా కొన్ని క్షణాలలో ప్రాణాలు విడిచింది. విశ్వాస పాత్రతకి పెట్టింది పేరయిన పెంపుడు జంతువులమీద మమకారం ఉండడం తార్కికమైన విషయమే. కానీ, ఉపయోగిస్తున్న వాహనాల మీద ఎటాచ్‌మెంటు ఎందుకుండాలండీ అసలు!?   

1994లో ఒక బజాజ్ కబ్ స్కూటర్ కొనుక్కొన్నాను. కాకినాడలో, అమలాపురంలో, రాజమండ్రీలో, విశాఖపట్టణంలో  ఉద్యోగరీత్యా తిరుగుతున్నప్పుడు చాలా దూరప్రాంతాలు వెళ్ళవలసి వచ్చేది. సాయంత్రం ఐదు, ఆరు గంటలకి వైజాగ్‌లో బయలుదేరితే సగం రాత్రికి కాకినాడ చేరుకొనేవాడిని. ఒక్కో సారి మార్గమధ్యంలో ప్యాచీలు పడడం, చెడిపోవడం జరిగేది. కానీ, మెకానిక్ షెడ్ చాలా దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే! రిజర్వులోకి వచ్చిందని తెలుసుకోకుండా పెట్రోలు కొట్టించడం అశ్రద్ద చేసినప్పుడు, ఆగిపోవడం కూడా బంకుకి నాలుగడుగుల దూరంలోనే జరిగేది. నా కబ్ నన్నెప్పుడు పట్టుమని పది అడుగులు నడిపించలేదు.  ఒకసారి డిసెంబర్ 31 రాత్రి ఫ్యామిలీ నలుగురం బండిమీద వస్తున్నాం. బైకుమీద త్రిబుల్స్‌గా వెనుకనుంచి వేగంగా వచ్చి మమ్మల్ని డీకొట్టారు. కుడిచేతివైపు నేలకి గుద్దుకొన్నాం. కాళ్ళూ, చేతులూ విరగడమో, గాయాలవడమో కావాలి. కానీ, అదృష్ఠవశాత్తూ అందరం క్షేమంగా ఉన్నాం.

ఇప్పటికీ అదే బండిని వాడుతున్నాను. కండీషన్లో ఉంది, మంచి మైలేజ్ ఇస్తుంది. చూసిన పరిచయస్తులు అడుగుతుంటారు, `ఇంకా ఇదే వాడుతున్నారా! బండి మార్చేయవచ్చు కదా?` అని. దాన్ని అమ్మితే బాధ కలుగుతుంది. మరి అలాంటప్పుడు ఎందుకు మార్చాలి.  ఆ మధ్యన తెలిసున్నాయన తనకారు అమ్మేస్తున్నారని తెలిసి, కొన్నాను. నాకు కారుని అప్పజెపుతున్నప్పుడు, ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. `సర్వీసింగ్ చేయించండి, ఇంజనాయిల్, బ్రేకాయిల్, కూలెంట్లు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి, కారుని ఎండలో వదిలేయవద్దు, రాత్రుళ్ళు కవర్ కప్పండి...,` అని అప్పగింతలు పెట్టారు. చాలా కాలం వాడిన కారుని ఇంకొకరికి ఇచ్చెయ్యడం ఎంత బాధాకరమో ఆయన్ని చూస్తే తెలిసింది. `ప్రాణం లేని వస్తువులకి కూడా సెంటిమెంట్లు ఆపాదిస్తారా? అవేమయినా మనల్ని అర్ధం చేసుకొంటాయా, ఏమిటి? నాన్సెన్స్!` అంటారా? మీ ఇష్టం అలాగే అనుకోండి. ఇది ఇల్లాజికల్ లాజిక్!

© Dantuluri Kishore Varma 

Monday, 11 March 2013

రాజమండ్రీ

రాజమండ్రీలో కోటిపల్లి బస్టాండు దాటిన తరువాత రైల్వేస్టేషన్‌కి వెళ్ళే దారిలో ఎడమవైపు సందులో పాత ఇల్లు ఒకటి ఉండేది. ఆ ఇంటి డాబామీద  ఒక చిన్నగది. ఏ ఫైవ్‌స్టార్ హోటల్ రూంకీ లేని ప్రత్యేకత దానికి ఉండేది. సాయంత్రం అయ్యేసరికి చల్లగా వీచే గోదావరి గాలి, రాత్రి అయ్యేసరికి చంద్రుడు ఉండే రోజుల్లో అయితే పుచ్చపువ్వులాంటి వెన్నెల, లేని రోజుల్లో అయితే చిరుగులు పడిన నల్ల దుప్పటిలా ఆకాశమంతా నక్షత్రాల గుంపులు. ఆ గది ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, దానిలో కొంతకాలం నేను ఉన్నాను. మీరు అడగవచ్చు, `నువ్వు గాంధీవా? ఐన్‌స్టీనువా?? నువ్వుంటే ప్రత్యేకమైనది అయిపోవడానికి?` అని. మీగురించి కాదండీ, నాకు స్పెషల్ అని. 

నా రూమ్మేట్, మా కంపెనీలోనే పనిచేసే నా వయసు కుర్రోడే. అతనికి ఒక టేప్‌రికార్డర్ ఉండేది.  సోనీ సిక్స్‌టీ కేసెట్‌లో పన్నెండు నుంచి పద్నాలుగు పాటలు పట్టేవి. ఓ శెలవురోజు కేసెట్ రికార్డింగ్ సెంటరు దగ్గర ఓపికగా కూర్చుని అక్కడ ఉన్న లిస్టుల్లో వెతికి, వెతికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాత పాటలు అన్నీ ఒక కేసెట్లో చేయించాను. ఏ దివిలో విరిసిన పారిజాతమో, అభినవతారవో, మల్లెపువ్వు వాడిపోగ, నేనొక ప్రేమ పిపాసిని, మధుమాసవేళలో, అలివేణీ ఆణిముత్యమా, కలువకు చంద్రుడు ఎంతో దూరం, మామా చందమామ, మందారం ముద్దమందారం, పూచే పూలలోన, ఇదేపాట ప్రతీచోట... లాంటి పాటలన్నీ ఒకచోట చేర్చి నేను చెప్పిన డాబామీద కూర్చుని వింటే ఎలా ఉంటుందో ఊహించండి. బాలు గళానికి ఫిదా అయిపోయాం.
 సాయంత్రం ఆఫీసునుంచి వచ్చిన తరువాత పాటలు వింటూ కూర్చుంటే సమయం తెలిసేది కాదు. కడుపులో నకనకలాడుతుండగా కంగారుగా శ్రీనివాసు మెస్‌కి పరుగు పెట్టేవాళ్ళం. చామదుంపల పులుసుపెట్టి వండిన కూర అద్భుతంగా ఉండేది. నచ్చని కూర ఉంటే ఆమ్లెట్  వేసేవాడు. ఒక్కోసారి మేం వెళ్ళేసరికి అంతా అయిపోయేది. ఈసురో మంటూ శ్యామలా థియేటర్ వరకూ నడక - జెకే టిఫిన్ సెంటర్లో సాంబార్ ఇడ్లీ కోసం.
పలచబడిపోతున్న ట్రాఫిక్ చూసుకొంటూ కొన్నిసార్లు కోటగుమ్మంవరకూ పోయేవాళ్ళం. వేరే ఊళ్ళనుంచి షాపింగ్‌కి వచ్చినవాళ్ళు, రాజమండ్రీ వాస్తవ్యులు, రోడ్డుమీద సరుకులు పెట్టి అమ్మే వర్తకులు.. ఇరుకురోడ్లు ఎప్పుడో కానీ ఖాళీగా కనిపించవు. మణికంఠా పుస్తకాల షాపులో ఇంగ్లీష్ నావల్స్ దొరికేవి. ఆర్కే నారాయణ్ రాసిన పుస్తకాలు అరవై రూపాయలకి ఒకటి లభించేది. అదృష్ఠం బాగుండి షాపు తెరిచి ఉంటే ఓ వారానికి సరిపడే నావల్ దొరికినట్టే. అక్కడి నుంచి ఇంకొంచం ముందుకి వెళితే రాజమండ్రీకే ప్రత్యేకం సేమియా, రోజ్‌మిల్క్, కోవా అమ్మే షాపు ఉండేది. గ్లాసులో ఐసువేసి, పలుచగా ఉన్న కోవా నింపి పైన పొడవైన గ్లాస్ బాటిల్లోనుంచి కలర్ సిరప్ వొంపి, ఒక ప్లాస్టిక్ స్పూన్ గుచ్చి ఇస్తే - గుంపులు, గుంపులుగా నుంచుని జనాలు ఆరుచిని ఆస్వాదిస్తుంటే చూసే ఎవరికైనా నోరూరడం తద్యం. 
ఒక్కో రోజు గోదావరి గట్టుమీద కూర్చుని బ్రిడ్జ్‌మీదనుంచి పోతున్న రైళ్ళని, వెలుగుతున్న విద్యుత్ లైట్లని, లంగరువేసి ఉన్న పడవల్నీ, ఊగుతున్న మర్రి చెట్టు ఆకుల్నీ, ఒడ్డుని తాకుతున్న అలల్నీ చూస్తూ నిమిషాలు గంటలు అయ్యేవి.
మంచుకురుస్తున్నప్పుడు రోడ్డు వెంబడి నడవడం, ఎండ మండిపోతున్నప్పుడు చెట్టునీడల్లో సైకిలు మీద పెట్టి చీరికలుగా కోసి అమ్ముతున్న పుచ్చకాయ ముక్కలో, బొప్పాయి ముక్కలో తినడం, స్కూటర్‌మీద కొవ్వూరు వెళుతున్నప్పుడు గోదావరి బ్రిడ్జ్ దాటడం, పేపరుమిల్లు వైపు వెళ్ళే దారిలో పాతపుస్తకాల షాపు, దామెర్ల రామారావు ఆర్టు గేలరీ, లాలా చెరువు దగ్గర దాబాలో రోటి, దాల్ కాంబినేషన్.... రాజమండ్రీ అంటే పంచేద్రియాలూ ప్లస్ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతాయి.

© Dantuluri Kishore Varma 

Sunday, 10 March 2013

సమాన(వ)త్వం

వివేకానందుని గురించి, భారతదేశం గురించి తెలుగులో చక్కని  ఉపన్యాసం.

*   *   *
ప్రతీ మతమూ గొప్పదే. సాగరగర్భంలో రత్నాల్లా గొప్పవిషయాలు ప్రతీ మతంలోనూ ఉన్నాయి. ఒక విత్తనాన్ని నాటినప్పుడు భూసారాన్నీ, నీటిని, గాలినీ, సూర్యరశ్మిని గ్రహించి మొక్కగా ఎలా ఎదుగుతుందో - అదే విధంగా ఒక వ్యక్తి కూడా విజ్ఞానాన్ని అన్ని తావులనుంచీ సముపార్జించి వ్యక్తిత్వ నిర్మాణం చేసుకోవాలని స్వామీ వివేకానంద చెపుతాడు.  మతం విషయంలో ఈ విధమైన దృక్పదాన్ని అలవాటు చేసుకొంటే వైషమ్యాలకి తావే ఉండదు.

చికాగో సర్వమత మహాసభల్లో చేసిన చివరి రెండు ఉపన్యాసాలలో, మెచ్చుతునకల్లాంటి ఎన్నో విషయాలని వివేకానందుడు ప్రస్తావిస్తాడు. వాటిని చదువుతున్నప్పుడు మతం అనేది తక్షణ అవసరం కాదనిపిస్తుంది. దానికన్నా అత్యంత ఆవశ్యకమైన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఆకలి, పేదరికం, నిరుద్యోగం, నిరాదరణ మొదలైనవి.

అమెరికాలో సర్వ సౌఖ్యాలతో బ్రతుకుతున్న ప్రజలని చూసి, మనదేశవాసుల  జీవనవిధానాన్ని వారితో పోల్చుకొని,  అన్నార్తుల దైన్యమైన దుస్థితిని తలచుకొని ఒకరాత్రంతా విలపిస్తూ గడుపుతాడట స్వామీ వివేకానంద. అందుకేనేమో, మాదేశంలో మతం కావలసినంత ఉంది. ఆకలితో అలమటిస్తున్నవాడికి కావలసింది ఆహారం కానీ, మతం ఎంతమాత్రం కాదంటాడు. మతాలకతీతంగా అన్నిచోట్లా ప్రజలు అనుభవిస్తున్న బాధలే ఇవి. కానీ వీటిమిద పోరాటాలకి జనసమీకరణ జరగదు. మతం రెచ్చగొట్టినంతగా జనాల్ని మరేదీ రెచ్చగొట్టలేదనుకొంటాను.

మణిరత్నం తీసిన సినిమా బొంబాయి, కుష్వంత్‌సింగ్ రాసిన పుస్తకం ట్రైన్ టు పాకిస్థాన్ జ్ఞాపకానికి వచ్చాయి.

కుష్వంత్‌సింగ్ పుస్తకంలో దేశవిభజన సమయంలో మతకలహాల గురించి రాస్తాడు. భూబాగాన్ని మతం ప్రాతిపధికగా `అదిమీది, ఇదిమాది,` అని వేరుచేసుకొని ట్రైన్‌లలో ప్రక్కదేశపు మతంవాళ్ళు సరిహద్దు దాటుతున్నప్పుడు నరమేదం చేసి శవాల కుప్పల్లాగ పంపిస్తారు. అటునుంచి ఇటు, ఇటు నుంచి అటూ వెళుతూ ఎన్ని వేలమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారో డాక్యుమెంట్ చేసి చూపిస్తాడు.  చరిత్రను త్రవ్వితే ఇటువంటి సంఘటనలు అన్నో కనిపిస్తాయి.

మణిరత్నం `బొంబాయి` సినిమాలో - ఇరుమతాలవాళ్ళూ ఆస్తినష్ఠం, ప్రాణనష్టం కలుగజేసుకొంటున్నప్పుడు, విచక్షణా రహితంగా చంపుకొంటున్నప్పుడు; కుటుంబంనుంచి  తప్పిపోయి, కర్ఫ్యూ విధించిన వీధుల్లో దిక్కుతోచక తిరుగుతున్న ఒకకుర్రాడు, ఒక హిజ్రా పంచన చేరతాడు. `హిందువా, ముస్లిమా అని అడుగుతున్నారు. హిందువంటే ఏమిటీ, ముస్లిమంటే ఏమిటి?` అంటాడు. అప్పుడు హిజ్రా చెప్పిన సమాధానం గొప్పగా ఉంటుంది - `మతం అంటే దేవుడ్ని చేరడానికి ఒకదారి. హిందువు ఒకదారి, ముస్లిం ఒకదారి. రెండూ దేవుడి కాడికే పోతాయి,` అని.

మతం ఒక జీవనవిధానం. ఏ మతమూ చెడ్డది కాదు. సాంప్రదాయాల్లో, ఆచారవ్యవహారాల్లో, అలవాట్లలో, నమ్మకాలలో వ్యత్యాసముండవచ్చు. కానీ, ఆకలితో ఉన్నవాడికి అన్నంపెట్టమని, బాధలలో ఉన్నవాడ్ని ఓదార్చమని, ఎవరికీ హానిచెయ్యవద్దని ప్రతీ మతమూ చెపుతుంది. అదే మానవత్వం. దీనిని మరచిపోయినవాడు ఏ మతానికీ చెందనట్టే!
© Dantuluri Kishore Varma 

హిందూ మతంగురించి చదివిన పత్రం

హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకి పరిచయం చెయ్యగల సువర్ణ అవకాశాన్ని వివేకానందుడు సాధించుకొన్నాడు. ఇంకొకవిధంగా చెప్పాలంటే, వివేకానందుని వల్ల విశిష్టమైన వైధిక మతంగురించి ప్రపంచానికి పరిచయం ఏర్పడగల అవకాశం చికాగోలో విశ్వమత మహాసభలవల్ల ఏర్పడింది. ప్రపంచం నలుమూలల నుంచీ సుమారు ఆరువేల మంది వివిధ మతాల ప్రతినిధులు హాజరయిన సందర్భంలో ఆరు ప్రసంగాలు చేసాడు. అందులో హిందూ మతంగురించి చదివిన పత్రం అత్యంత ప్రధానమైంది.
వేదాల సారంగా ఉద్భవించిన హిందూ మతం సముద్రమంత పెద్దది. ఇందులో ముఖ్యమైన భావనలని క్లుప్తీకరించి, అతి తక్కువ సమయంలో మనమతం గురించి అస్సలు ఏమీ తెలియని విదేశీయులకి తార్కికంగా విశదీకరించాలి. ఇది ఒకరకంగా కత్తిమీద సాములాంటిది. ఈ ప్రక్రియను వివేకానందుడు అవిలీలగా సాధించాడు.  వేదాలు, సృష్ఠి, భగవంతుడు, ఆత్మ, పునర్జన్మ, కర్మ, భక్తి, మోక్షం, విగ్రహారాధన లాంటి విషయాలను  వివరిస్తాడు.

వేదాల గురించి ప్రస్తావన తరుచూ వింటూనే ఉంటాం. వీటిని ఎవరు రాసారు? ఎప్పుడు? వివేకానందుడు ఏమంటాడంటే, వేదాలకు ఆది, అంతమూ లేవని. ఆది, అంతమూ లేని గ్రంధాలుంటాయా? నిస్సందేహంగా ఉండవు. అసలు వేదాలు గ్రంధాలు కాదు. వివిధ వ్యక్తులచే (వీరినే ఋషులు అనవచ్చు) అప్పుడప్పుడూ కనుగొనబడిన ఆద్యాత్మిక విషయాల సమాహారమే ఈ వేదాలు. వీటికి అంతం లేక పోవచ్చు, ప్రారంభం లేకపోవడం ఏమిటి అనే అనుమానం మనకు వస్తుంది. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు మొదలుపెట్టి ఉండవచ్చుకదా? గురుత్వాకర్షణ శక్తి అనేది ఉందని మనకు తెలియక ముందు కూడా ఉన్నట్లే, ఈ ఆధ్యాత్మిక సత్యాలు కూడా ఎల్లప్పుడూ ఉన్నాయి. అయితే, అవి ఉన్నాయన్న స్పృహ మనకి ఉండకపోవచ్చు.

 సైన్స్‌కి, ఆద్యాత్మికతకీ సమ్యమనం కుదరదు. కానీ, వివేకానందుని తార్కిక వాదన సైన్స్‌ని వేదాలలో తెలియజేసిన విషయాలని ప్రభావవంతంగా వ్యక్తీకరించడానికి ఉపయోగపడే మాధ్యమంగా తెలియజేస్తుంది. ఉదాహరణకి సృష్టికి ఆది, అంతమూ లేవు అంటారు. సైన్స్ పరంగా దీనిని చెప్పాలంటే - విశ్వంలో ఉన్న మొత్తం శక్తి పరిమాణంలో ఎప్పుడూ మార్పు ఉండదు. ఒకవేళ సృష్టి ఎప్పుడో ఒకప్పుడు మొదలై ఉండి ఉంటుంది అనుకొంటే, అంతకు ముందు ఈ విశ్వ శక్తి అంతా ఎక్కడ ఉండి ఉంటుంది? పరమాత్మలోనా? అప్పుడు, సృష్టి మొదలై ఈ శక్తి పరమాత్మనుంచి విశ్వం లోనికి ప్రవహించి ఉంటుంది కదా? అంటే రూపం మారింది అన్న మాట. మార్పు చెందేది ఏదయినా నశించక తప్పదు అని సైన్స్ చెపుతుంది. అప్పుడు, పరమాత్మకి కూడా నాశనం ఉంటుందా? నాశనం అయ్యేదాన్ని పరమాత్మ అని ఎలా అంటాం!?  కాబట్టి, సృష్టికి ఆది, అంతం లేవనే విషయం సైన్స్ పరంగా ఋజువైనట్టే కదా?

`తరచుగా చెయ్యడం వల్ల అలవాట్లు ఏర్పడతాయి అని నిరూపించబడిన విషయం. అప్పుడే పుట్టిన బిడ్డ సహజంగా స్పందిచి చేసే కొన్ని పనులు ఏ అలవాటు వల్ల సంక్రమించి ఉంటాయి?,` అని వివేకానందుడు అడుగుతాడు. జన్యుపరంగా తల్లితండ్రులపోలికలు బిడ్డలకు వచ్చినట్లే, గతజన్మ అలవాట్లు జన్మతహా సంప్రాప్తిస్తాయని అంటాడు. ధ్యానంవలన ముందుజన్మల వివరాలను తెలుసుకోగలమని అంటాడు.

ఆరోగ్యం, రూపం, సంపద, గుణగణాలు మొదలైన వాటిల్లో వ్యత్యాసాలతో మనుష్యులు ఎందుకు జన్మిస్తున్నారూ అంటే, వారి వారి ముందు జన్మల కర్మల వల్ల ఏర్పడిన దృక్పదం (టెండెన్సీ)వల్ల, దాన్ని వ్యక్తీకరించడానికి అనుకూలమైన రూపంలో జన్మ సంప్రాప్తిస్తుందట.

ఆధ్యాత్మికమూ శాస్త్రమే. ఫిజిక్స్, కెమిస్ట్రీల్లాగ దీనికి కూడా విశ్వసనీయత ఉంది. దీని యొక్క లక్ష్యం పరమాత్మని తెలుసుకోవడం. మూలకాలకన్నింటికీ ములమైన పదార్ద్థాన్ని కనుగొంటే రసాయనశాస్త్రం, శక్తులకన్నింటికీ మూలమైన ఏకశక్తిని కనుగొంటే భౌతికశాస్తం ఏరకంగా వాటి వాటి లక్ష్యలు పూర్తవుతాయో, ఆత్మలన్ని చేరగల పరమాత్మని కనుగొన్నప్పుడు ఈ శాస్త్రం యొక్క లక్ష్యసాధన పూర్తవుతుంది.

ఏ మతం వల్ల ఇది సాధ్యమౌతుంది? అసలు, మతాలు అంటే, వివిధ రంగులు గల అద్దాలనుంచి వెలువడే ఒకే కాంతి. ఇవి అన్ని రకరకాల మార్గాలు మాత్రమే. భగవంతుని తెలుసుకొనే విధానాలు కూడా రకరకాలుగా ఉంటాయి. విగ్రహారాధన మొదలు ధ్యానం, తపస్సు, మొదలైనవి. ఒక స్థాయి దాటి వచ్చిన తరువాత దానిని హీనంగా చూడకూడదు అంటాడు. వృద్దాప్యంలోకి వచ్చినతరువాత బాల్యాన్ని, యవ్వనాన్ని ఎలా తప్పిదాలు అని భావించకూడదో విగ్రహారాధనని పై స్థాయికి వెళ్ళిన తరువాత తక్కువగా భావించవలదు అంటాడు.

వివేకానందుడు చదివిన ఈ పాఠంలో కోట్‌చేసి చెప్పవలసిన ఆణిముత్యాలు అన్నో ఉన్నాయి.

ఈ టపా రాయడానికి ఓ పదిహేను, ఇరవై పేజీల ఆయన ఉపన్యాసాన్ని చాలా సార్లు చదవ వలసి వచ్చింది. చదివిన ప్రతీసారీ కొత్త విషయాలు అవగతమౌతున్నాయి. ఆయన ఉపన్యాసాలకి సమీక్ష రాయాలనుకోవడమే ఒక పెద్ద సాహసం. పొరపాట్లు ఉంటే మన్నించాలని విజ్ఞులైన పాఠకులకి మరొక్కసారి తెలియజేసుకొంటూ....

పిడిఎఫ్ రూపంలో ఆయన  చికాగో ఉపన్యాసాలన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
*   *   *
1893 వ సంవత్సరంలో చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత మహాసభలలో స్వామీ వివేకానంద పాల్గొన్నప్పటి ఫోటో. ఎడమనుండి కుడికి వరుసగా నరసింహాచార్య, లక్ష్మీనారాయన్, స్వామీ వివేకానంద, ధర్మపాల, వి.ఏ.గాంధీ. 
అరుదైన స్వామీ వివేకానంద ఫోటో

© Dantuluri Kishore Varma 

సమాగమం - మహాశివరాత్రి

దక్షప్రజాపతి కుమార్తె సతీదేవి పరమేశ్వరుని భార్య. ఒకసారి దక్షుడు యజ్ఞం చేస్తూ  ఈశ్వరుడికి ఆహ్వానం పంపడు. సతీదేవి తండ్రి చేస్తున్న యాగమే కనుక ఆహ్వానం లేకపోయినా వాత్సల్యంతో అక్కడికి వెళ్ళి అవమానింప బడుతుంది. అవమానభారంతో ఆమె అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. కోపోద్రిక్తుడైన శివుడు తనగణాలతో ఆ ప్రదేశాన్ని సర్వనాశనం చేసి సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకొని విరక్తుడై తిరుగుతాడు.ఈ విధమయిన వైరాగ్యం మంచిదికాదు కనుక, విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. అప్పుడు ఆ ఖండికలు 108 చోట్ల పడతాయి. వాటిలో ముఖ్యమైన 18 భాగాలు పడిన ప్రదేశాలని అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. శివుడు తపస్సుకోసం హిమాలయాలకు వెళ్ళిపోతాడు.  
సతిదేవి తిరిగి పార్వతిగా జన్మిస్తుంది. ఆమెకు బహుశా జన్మతహా తెలిసున్న విషయమేమిటంటే, శివుడినుంచి తాను విడదీయబడిన భాగమని. ప్రాణేశ్వరుడిని తిరిగిచేరుకోవడమే జీవిత పరమార్థం.
తారకేశ్వరుడనే రాక్షసుడిని సంహరించే లోక కళ్యాణ కారణం శివపార్వతుల వివాహంతో ముడిపడి ఉంది. వాళ్ళకి జన్మించే పుత్రుడే ఆ కార్యాన్ని పూర్తిచెయ్యగలడు. ధ్యానంతో సమాధిస్థితికి చేరుకొని ఉన్న శివుడిని మేల్కొలిపి పార్వతితో సమాగమం చేయ్యగల చమత్కారం మన్మధుని బాణాలకే ఉంది. అందుకే, దేవతలందరూ అతనికి ఈ బాధ్యత అప్పగిస్తారు. ధ్యానముద్రలో ఉన్న పరమేశ్వరుని ముందు పార్వతి నాట్యం చేస్తుంటుంది, కామదేవుడు తన పుష్ప బాణాలు సంధిస్తాడు. శివుడికి తపోభంగం అవుతుంది. అతని ఆగ్రహజ్వాలలకి మన్మదుడు దహింపబడతాడు. కానీ మన్మద బాణాల ప్రభావంతో శివపార్వతులు ఏకమౌతారు.
మహాశివరాత్రి శివుడి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, రకరకాల కారణాలు చెపుతారు. అమృతమధనం సమయంలో శివుడు ఆలాహలాన్ని మింగి లోకాలను రక్షించిన రోజు అని, భగీరథుని కోరికమీద గంగ అవతరించి శివుని సిగలోనికి అవనతం అయిన రోజు అని, ఇంకా శివపార్వతుల సంగమ సమయమని చెపుతారు. ఈ టపాలో ఉపయోగించిన ఫోటోలు ద్వారపూడి గుడిలో శిల్పాలకి తీసినవి. ఇది గుడిలో బొమ్మలు చెప్పిన కథ.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన లింగాష్టకం వినండి:
 మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
© Dantuluri Kishore Varma 

Saturday, 9 March 2013

మారేడుమిల్లి

తూర్పుగోదావరి జిల్లా మొత్తం విస్తీర్ణంలో ముప్పై శాతానికి పైగా అడవులు ఉన్నాయి. రంపచోడవరం, దేవీపట్నం, మారేడుమిల్లి మొదలైన ప్రాంతాల్లో ఈ అడవుల్లో ఎక్కువ భాగం విస్తరించి ఉన్నాయి. దీన్ని ఏజన్సీ ప్రాంతం అంటారు. కాకినాడనుంచి వందకిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది.
కాంక్రీట్ జంగిల్‌లోంచి తప్పించుకొని, వనవిహారం చెయ్యడానికి ఓ రెండు మూడు గంటల ప్రయాణం పెద్ద ప్రయాశ కాకూడదు. అందుకే పిల్లలు చిన్నవాళ్ళయినా వీలు చూసుకొని బయలుదేరాం. ఇది ఓ పది సంవత్సరాల క్రిందటి మాట. రంపచోడవరంలో ఓ అంకుల్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంటులో పనిచేస్తూ ఉండేవారు. వాళ్ళని విజిట్ చెయ్యవలసిని ఆబ్లిగేషన్ కూడా ఉండడంతో, వాళ్ళింటి దగ్గర రెండురోజులు స్టే చేసి, చుట్టుప్రక్కల ప్రదేశాలు చూడాలని నిర్ణయించుకొన్నాం.  డిజిటల్ కెమేరాల హవా మొదలవ్వలేదు కనుక ఒక నాలుగు కలర్ ఫిలిం రీళ్ళు కొనుక్కొని, ఒక చిన్న కెమేరా వెంటపెట్టుకొని వెళ్ళాం. ఈ పోస్టులో కనిపించే ఫొటోలన్నీ అప్పుడు తీసినవే. క్లారిటి అంత బాగా ఉండదు. కొండదారుల్లో, జలపాతాలదగ్గర వాలు రోడ్లలో బాగుంటుందని ఒక మహీంద్రా జీప్ మాట్లాడుకొన్నాం. అదృష్టవశాత్తూ జీప్ డ్రైవర్ అదే ప్రాంతానికి చెందిన ట్రైబల్ అవడంతో  గైడ్‌లా కూడా ఉపయోగపడ్డాడు. అతను చెప్పిన విషయాలలో ముఖ్యమైంది తూర్పు గోదావరి ఏజన్సీలో పుట్టిన కొమ్ముడోళ్ళు అనే సాంస్కృతిక నృత్యం గురించి. ఎద్దు కొమ్ములు, నెమలి ఈ కలతో చేసిన టోపీ ధరించి, పెద్ద డోలు మెడలో వేసుకొని దరువు వేస్తూ, నృత్యం చేస్తారు.  మహిళలు చేయీ, చేయీ పెనవేసి అర్థ చంద్రాకారంలో ఏర్పడి లయబద్దాంగా కాళ్ళు ముందుకీ, వెనుకకీ కదిలిస్తూ, పాటపాడుతూ నృత్యం చేస్తారు. 

ముఖ్యమైన ప్రదేశం మారేడుమిల్లి. సముద్రమట్టానికి 2000 అడుగుల ఎత్తులో ఉంటుంది. దట్టమైన అడవులు, చల్లని వాతావరణంతో, కాఫీతోటలు, తోటల్లో ఎత్తైన వృక్షాల మొదళ్ళనుంచు పైదాకా ఎగబ్రాకిన మిరియాల పాదులతో మనోహరంగా ఉంటుంది. దీనిని ఆంధ్రా ఊటీ అని కూడా పిలుస్తారు. 


కొండల నడుమనుంచి, అడవిలో పాములా మెలికలు తిరుగుతూ గలగల శబ్ధాలతో ఉదృతంగా ప్రవహించే ఏరు, పాములేరు. తూర్పు కనుమలలో ఎక్కడో పుట్టి, ప్రకృతి ప్రేమికులకు మనోల్లాసం కలిగిస్తూ, జంతు, వృక్ష జాలాలకి నీటి అవసరాల తీరుస్తూ తూర్పుగోదావరి, ఖమ్మం జిల్లాల సరిహద్దులో గోదావరిలో కలుస్తున్న పాములేరు పిక్నిక్ స్పాట్‌గా చాలా ప్రాధాన్యత సంతరించుకొంది.  జలపాతాలు సమీపంలో సేదతీరడం, అడవిదారుల్లో నడక, రోడ్డు వారగా కాఫీతోటల్లో నిర్వహిస్తున్న కెఫ్టేరియాలో కాఫీ చప్పరిస్తూ పచ్చదనాన్ని అస్వాదించడం, అడుగడుగునా కనిపించే మన్యప్రజల ముఖకవళికలని గమనించడం, ఎత్తైన వందల సంవత్సరాల వయసుకలిగిన చెట్ల నడుమనుంచి ఏటవాలుగా నేలపైన వాలుతున్న సూర్యకిరణాలని ఆహ్లాదించడం, గోల్డెన్ బ్యాంబూ అనే బంగారు పసుపు వర్ణపు వెదురు మొక్కలనిగురించి ఎవరినైనా అడిగి తెలుసుకొని ఆసక్తిగా వినడం, పక్షుల కూతలు వింటూ, ఉడతల చేష్టలు గమనిస్తూ పరిసరాలను మరచిపోవడం... ఈ ట్రిప్‌లో చేయగలిగిన పనులెన్నో!
దేవీ పట్నంలో పాపికొండలను ఒరుసుకొంటూ ప్రవహిస్తున్న గోదావరి, వచ్చి పోతున్న లాంచీలు, గోదావరి గట్టుమీద కొండ, దానిపైకి మెట్లదారి, దేవాలయము, కొండమీదనుంచి కనిపించే పొలాలు, పచ్చ పచ్చని దృశ్యాలు....

రామన్న పాలెం దగ్గర వైరుతో కట్టిన రోప్ బ్రిడ్జ్

ఇంకా పురాతన మందిరాలు, గైడు ద్వారా తెలుసుకొనే అడవితల్లి విశేషాలు, ప్రయాణంలో పదనిసలు....
ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసే బ్యాంబూ చికెన్ గురించి చాలా దూరప్రదేశాలనుంచి కూడా వస్తున్నారు. మారేడుమిల్లిలో ఒక కొండమీద హిల్‌వ్యూ గెస్ట్‌హౌస్‌ని నిర్మించారు. అక్కడ నుంచి మొత్తం గ్రామం అంతా కనిపిస్తుందని, గెస్ట్‌హౌస్‌లో విడిది చేస్తే చాలా బాగుంటుందని గైడ్ చెప్పాడు. కానీ, అక్కడికి వెళ్ళి చూడలేక పోయాం. కారణం, సమయాభావం. టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు, అటవీశాఖ వాళ్ళూ కొన్ని పార్కులు, వన సంరక్షణా ప్రదేశాలు అభివృద్ది చేస్తూ ఉన్నారు.

మధన కుంజ్, నందన వనం, వాలీసుగ్రీవ వనం, కార్తీక వనం లాంటి వనాలని, జంగిల్ స్టార్ లాంటి కేంప్ సైట్లని ఒక రెండు సంవత్సరాలక్రితం మళ్ళీ ఇక్కడికి వెళ్ళినప్పుడు చూసాం.

జ్ఞాపకాలని అన్నింటినీ వర్ణించడం సాధ్యంకాదు. కాబట్టి ఫోటోలే చూపించడం జరిగింది. ఇవి బ్లాగ్ కోసం తీసినవి కాదు కనుక వీటిల్లో మేమందరం ఉన్నాం.
© Dantuluri Kishore Varma 

Sunday, 3 March 2013

పాలు నలుపా

బావా, కొత్త టపాకి `పాలు నలుపా` అని పేరు పెట్టావా? అంటే నల్లని పాల గురించి రాయబోతున్నావా?
కాదు, నా బ్లాగుని ఇప్పటివరకూ చూసినవాళ్ళ సంఖ్య ఇరవై ఎనిమిదివేల రెండువందల ఎనభై రెండు మంది. దాని గురించి రాస్తున్నాను.
దానికీ, దీనికీ ఏమయినా సంబంధం ఉందా? నువ్వు చెప్పేది ఏమీ అర్థం కావడం లేదు. మళయాళంలా ఉంది.
మళయాళం లాగ ఉండాలనే కదా ఈ టపా మొదలు పెట్టి రాస్తున్నది?
వికటకవిలా తికమక చేసేస్తున్నావు. మీ వూరు తెనాలా? రామలింగడు మీకేమయినా బంధువా?
లేదు అమ్మడూ, ఆయన సమకాలీనుడు నంది తిమ్మన గారు రాసిన ఓ పద్యం గురించి ఒక మహానుభావుడు చెప్పారు. దానితో జ్ఞాన కిటికి తెరుచుకొని ఇలా... అయ్యింది. అసలు ఇలాంటి ఒకటపా ఈ సంవత్సరం జనవరి ముప్పై ఒకటిన రాద్దామనుకొన్నాను. కానీ, అప్పుడేదో మీ అదృష్ఠం బాగుండిపోయి తప్పిపోయింది. మళ్ళీ ఇదిగో ఇన్నిరోజులకి సమయం, సందర్భం కలసి వచ్చాయి.
మా అదృష్ఠం గురించి మాట్లాడుతున్నావంటే నీ పైత్యంతో మా బుర్రలు తినబోతున్నావా? 
ఈడెన్ గార్డెన్లో ఈవ్‌కి హయ్ చెప్పే ఉద్దేశ్యంతో ఆడం ఒక పలుకు పలికి నప్పుడు, `నసపెడుతున్నాడని,` ఈవ్ నీకులానే భావించి ఉంటే కథ మనవరకూ వచ్చి ఉండేది కాదు. ఏమంటావ్?
అసలు ఏమన్నాడో చెప్పకుండా, నన్ను `ఏమంటావు?` అంటే, నేనేమంటాను?
`Madam, I`m Adam,` అన్నాడు.
కృష్ణ కృష్ణా! 
`నందనందనం,` అనుకో బాగుంటుంది. 
ఏం!? 
అది అంతేలే. ఇంతకీ, నీకు ఈ టపా టైటిలు ఏమిటో అర్థమైందా?
`నల్లని వన్నీ నీళ్ళు, తెల్లని వన్నీ పాలు,` అంటారు. నీది కొంచం తిక్క వ్యవహారం కనుక తిరగేసి చెప్పినట్టున్నావు!
నిజమే సుమీ ఎలా కనిపెట్టావు?
కనిపెట్టానా! వెటకారం చేస్తున్నావా?
కావాలంటే తిరగేసి చదువుకో.
దేన్నీ!?
ముందు టైటిల్‌ని, తరువాత మిగిలిన వాటిని. 
టైటిల్!?  పా-లు-న-లు-పా ~  పా-లు-న-లు-పా. హే, నిజమే, ఎటు చదివినా ఒకేలా ఉంది. అయితే పాలిండ్రోం గురించి రాస్తున్నావన్న మాట! Malayalam, వికటకవి, కిటికి, Madam, I`m Adam, నందనందనం... భలే! భలే!! మరి ఈ నంది తిమ్మన గారు ఎందుకు వచ్చారు ఇందులోకి?
ఆయన అనులోమవిలోమ ఖండం అని ఒకటి రాశారట. అందులో కొన్ని పద్యాలు ముందునుంచి చదివినా, వెనుకనుంచి చదివినా ఒకేలా ఉంటాయట.
`సమయం, సందర్భం కలిసి వచ్చి ఇప్పుడు రాస్తున్నాను,` అన్నావు? ఏమి కలిసి వచ్చింది? 
31.1.13 న రాద్దామను కొన్నాను. ఎందుకంటే అదీ ఎటునుంచి ఎటు చదివినా ఒకేలా వచ్చే నంబరు కనుక. నువ్వు తరువాత అడిగే సందేహం కూడా ఏమిటో తెలుసు కనుక, నీకు అడిగే శ్రమలేకుండా నేనే సమాధానం చెపుతున్నాను. ఇదిగో ఈ ఫోటో చూడు.

© Dantuluri Kishore Varma 
Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!