Monday, 30 September 2013

ఏడిపించడం సరదా

టక్..టక్..టక్ మని చప్పుడు వినిపించిన వెంటనే ఇంటిలో ఏ మూలన ఉన్నా, ఏ ఆటలు ఆడుకొంటున్నా వేంటనే పెద్దవాళ్ళదగ్గరకి పరిగెత్తుకెళ్ళి, పది పైసలు తెచ్చుకొంటే చల్లని ఐసు కొనుక్కోవచ్చు. ఇరవై పైసలకైతే రెండు ఐసులు కలిపి గుండచేసి, ఐసుపుల్ల మధ్యలో పెట్టి, మైకా కాగితంతో గట్టిగా నొక్కితే, పుల్లకి గుచ్చిన బంతిలా తయారయ్యే ఐసు వచ్చేది. పీల్చి, పీల్చి తింటే తియ్యతియ్యని, చల్లచల్లని రసం గొంతుదిగడం... అహా!  

ఇప్పటికే మీకు అర్దమయ్యి ఉంటుంది. ఈ టకటకల చప్పుడు ఐసు బండి వాడు చేసేది. ఒక్కరోజు వాడు అమ్మే ఐసుకి టెంప్ట్ అయ్యామా, ఇక అంతే! ప్రతీరోజూ అదే టైముకి మన ఇంటిముందు మనం చెవులు మూసుకొన్నా వినిపించేలా చప్పుడు చేస్తాడు. `పాలాయిస్` అని కూడా అరుస్తాడు. అలా అంటే నోరూరుతుంది కదా మరి? ఎలా ఆగగలం? పెద్దవాళ్ళ దగ్గరకి వెళ్ళి డబ్బులు అడుగుతాం. `నిన్నే కదా తిన్నావ్. రోజూ తింటే జలుబుచేస్తుంది,` అని నిర్దాక్షిణ్యంగా మన అప్పీల్‌ని తిరస్కరిస్తారు. మనమీద జాలిచూపించే హ్యూమన్‌రైట్స్ కమీషన్‌కి - అంటే అత్తలో, తాతాలో, బామ్మలో అన్న మాట - మొరపెట్టుకొంటాం. చాలా సార్లు పని జరుగుతుంది. ఒక్కోసారి ఇలాంటి వ్యవహారాల్లో కలగజేసుకొని పిల్లల్ని చెడగొట్టవద్దని వాళ్ళకి వార్నింగ్‌వస్తే, ఇక మన పనిజరగదన్న మాట. అప్పుడు మనం ఘాట్టిగా పేచీ పెట్టాలి. అయితే పని అవుతుంది, లేకపోతే వీపు పగులుతుంది. 

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, పిల్లల్ని ఏడిపించడానికి పుట్టిన దుర్మార్గుడు ఐసుబండివాడు. మన చిన్నప్పుడు ఏదో అయిపోయిందిలే, ఏనీళ్ళతో చేశారో తెలియని ఐసులు తిన్నాం! మనపిల్లలకి అలాంటివి ఇప్పుడు పెద్దగా అందుబాటులో ఉండటం లేదు అని ఆనంద పడే లోగా....బయటనుంచి పాం..పాం అని బూరా చప్పుడు వినిపిస్తుంది. పిల్లలు టెన్ రూపీస్ కోసం చేతులు చాపుకొని పరిగెత్తుకొని వస్తారు. పాం,పాంలు ఆలా))లా))లా.. వినిపిస్తూనే వుంటాయి. కంపెనీ ఐస్‌కేండీ బండి వాడు వెయిటింగ్! 
     
     
 © Dantuluri Kishore Varma 

బండెనక బండికట్టీ...

పొలాలనుంచి ధాన్యాన్ని గాదె దగ్గరకి చేర్చడానికి ఎడ్లబళ్ళను విరివిగా వాడేవారు. ట్రాక్టర్లూ, లారీలూ వచ్చిన తరువాత ఎడ్లబండి స్థానాన్ని చాలామటుకు అవి ఆక్రమించినా, ఇప్పటికీ పల్లెల్లో ఎడ్లబళ్ళు కనిపిస్తున్నాయి. 

వ్యవసాయ ఉత్పత్తులే కాకుండా మిగిలిన సరుకుల రవాణాకి కూడా వీటిని వాడేవారు. ముఖ్యంగా కాకినాడనుంచి పల్లెటూర్లకి సరుకులు తీసుకెళ్ళడానికి ఇవే ఆధారం. స్వాతంత్ర్యానికి ముందు కాకినాడలో రెండువందలకి పైగా ఒంటెద్దు బళ్ళు ఉండేవట. బండివాళ్ళూ, సరుకులు ఎక్కించీ దింపే కార్మికులూ వందలకొద్దీ ఉండేవారట. వీళ్ళందరికీ కలిపి ఒక సంఘంవుండేది - ఒంటెద్దుబండి కార్మిక సంఘం అని. కాకినాడలో మొట్టమొదటి కార్మిక సంఘం అదే. క్రమంగా ఒంటెద్దుబళ్ళ స్థానంలో జోడెద్దుబళ్ళు వచ్చాయి. 

ఇంకా బళ్ళు ఉన్నాయి. లారీలు, ట్రాక్టర్లనుంచి పోటీని తట్టుకొని తమ అస్థిత్వాన్ని నిలుపుకొంటున్నాయి. గోల్డ్ మార్కెట్ సెంటర్ నుంచి దేవాలయం వీధికి వెళ్ళే దారిలో మీరు లోడింగ్, అన్‌లోడింగ్ చేసుకొంటున్న బళ్ళని చూడవచ్చు.  

© Dantuluri Kishore Varma 

Friday, 27 September 2013

అహ్మద్ ఆలీకి ఈ సీతారాముల గుడికి సంబంధం ఏమిటి?

కాకినాడ మెయిన్ రోడ్‌లో టౌన్‌హాలుకి ఎదురుగా ఉన్న శ్రీ సీతారామస్వామి దేవాలయం పంతొమ్మిదో శతాబ్ధం నాటిది. ఈ గుడిని నిర్మించడానికి ముందు ఈ ప్రదేశం కాయగూరల పాదులతో నిండి ఉండేదట. ఒకసారి ఆ భూమి యజమాని పాదులు పెట్టడానికి దున్నుతూ ఉండాగా సీతారాముల విగ్రహాలు దొరికాయి. చిన్న పాకలో వాటిని నిలిపి ఆ తరువాత క్రమంగా దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. 

ఈ దేవాలయంలో ఉన్న ఇంకొక విశేషం ఏమిటంటే శ్రీరామ పరివారపు ఉత్సవ విగ్రహాలు అన్నీ ఉన్నాయి. సాధారణంగా సీతారామలక్ష్మణులు, ఆంజనేయుడూ మాత్రమే ఉంటాయి. కానీ, భరతశతృగ్నులు, విభీషణుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు మొదలైన విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ విశేషం గురించి చెపుతూ వంశపారంపర్య అర్చకుడు ఇచ్చిన సమాచారం ఏమిటంటే - గుడిని నిర్మించే సమయంలో కాకినాడ సముద్రతీరంలో ఒక ఓడ ఒడ్డుకు చేరిపోయిందనీ, దానిలో దేవాలయానికి సంబంధించిన అర్చన సామాగ్రి సమస్తం ఒక భోషాణంలో ఉందని గుడిని నిర్మించినాయన స్వప్నంలో శ్రీరాముడు కనిపించి చెప్పాడట. వెళ్ళిచూస్తే నిజమే! పెట్టెలో ప్రస్తుతం గుడిలో ఉన్న శ్రీరామ పరవారం యొక్క విగ్రహాలు, పూజా సామాగ్రీ, గంటతో సహా లభించాయట. 

అప్పుడెప్పుడో స్వాతంత్ర్యం సంగ్రామానికి సంబంధించిన పుస్తకం ఒకటి చదువుతుంటే, ఈ గుడిని గురించి ప్రస్థావన కనిపించింది. 1923లో కాకినాడలో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. అప్పటి కాంగ్రెస్ అద్యక్షులు మౌలానా అహ్మద్ ఆలీ వాటిలో పాల్గొనడానికి కాకినాడ వచ్చారు. నగరంలో ఊరేగింపు జరుగుతుండగా, ఈ గుడిని దాటి వెళ్ళేటప్పుడు పూజారులు ఆలీకి హారతీ, ప్రసాదం ఇచ్చారు. ఆయన స్వీకరించారు. ఇది అప్పట్లో మతసామరస్యానికి గొప్ప తార్కాణమని పేర్కొన్నారు.  

అదండీ అహ్మద్ ఆలీకి ఈ సీతారాముల గుడికి ఉన్న సంబంధం.
© Dantuluri Kishore Varma 

Thursday, 26 September 2013

కాళీయమర్దనం

బాల కృష్ణుడు నివశిస్తున్న బృందావనానికి సమీపంలో కాళింది అనే ప్రదేశం ఉంది. అది చాలా సుందరమైన వనం. అక్కడ ఒక మడుగు కూడా ఉంది. పైకి ఎంతో నిర్మలంగా ఉండే ఈ మడుగులో జలం అంతా విషపూరితం. దానికి కారణం కాళీయుడు అనే ఐదు తలల మహా సర్పం అందులో నివశిస్తూ ఉండడమే.

ఒకసారి చిన్ని కృష్ణుడు తన మిత్రబృందంతో కలసి కాళింది వనానికి విహారానికి వెళతాడు. అందరూ ఎంతోసేపు ఉత్సాహంగా పరుగులు పెట్టి ఆడుకొంటారు, శ్రీకృష్ణుని వేణుగానామృతంలో తడిసి ముద్దవుతారు. ఆటపాటల్లో అలసిపోయిన బాలకులు కొందరు దప్పిక తీర్చుకోవడానికి కాళింది మడుగు దగ్గరకి వెళ్ళి, నీరు తాగుతారు. ఇంకేముంది, కాలకూట విషంలాంటి ఆ నీరు గొంతు దిగడమే ఆలశ్యం వాళ్ళందరూ అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తారు. 

శ్రీకృష్ణుని తక్షణ కర్తవ్యం మరణించిన స్నేహితులని బ్రతికించడం, మరి ఇంకెవరికీ ఇలాంటి మరణం లేకుండా నివారించడం. భగవంతుడైన అతనికి ఇవి అసాధ్యమైన పనులు కాదు. ఆతని ఒక చల్లని చూపుతో బాలకలందరూ ఘాడనిద్రలోనుంచి  మేల్కొన్నట్టు లేచి కూర్చున్నారు. ఇక రెండవది కాళీయుని తుదముట్టించడం!

మడుగులోకి లంఘించి దూకాడు. నీటిని అల్లకల్లోలం చేశాడు. కాళీయుని వెతికి పట్టుకొన్నాడు. తోకని గుప్పిటలో బిగించి, కోపంతో బుసకొడుతున్న మహా సర్పం పడగలమీదకి ఎక్కి బలమైన తాపులతో మర్దనం చేశాడు. పిడుగు పాటుల్లాగ ఐదు తలలమీదా పడుతున్న దెబ్బలని భరించలేక, శ్రీకృష్ణుని శరణువేడి, మడుగు విడిచి పోతానని మాట ఇచ్చి, దయనీయంగా వేడుకొని, ప్రాణాలు దక్కించుకొని కాళీయుడు అక్కడినుంచి పారిపోతాడు. 

భాగవతంలో కాళీయమర్దనం అనేది ఒక వీరోచిత ఘట్టం.
   

© Dantuluri Kishore Varma

Wednesday, 25 September 2013

రాజా పార్క్‌లో ఓ సాయంకాలం

రోజంతా వేసవి కాలమేమో అనిపించేలా అగ్గిలా ఉంది.

సాయంత్రం అయ్యేకొద్దీ చల్లగాలి తిరిగింది.

రాజా పార్క్ అన్ని వయసుల జనాలతో కళకళ లాడిపోతుంది.

ఈవెనింగ్ వాకర్స్ ప్రపంచంతో సంబంధం లేనట్టు ట్రేక్ మీద నడిచేస్తున్నారు. 

స్లైడ్లమీద, సీ-సాల మీద, స్వింగులమీద పిల్లలు కోలాహలంగా ఆడుకొంటున్నారు. 

స్కేటింగ్ రింక్‌లో చక్రాల స్కేట్లు కట్టుకొని, నీక్యాప్స్, హెల్మెట్లు ధరించిన పిల్లలూ వేగంగా చకెర్లు కొడుతుంటే రింక్ చుట్టు నుంచొని చాలా మంది చూసున్నారు.

కుళాయి చెరువు చుట్టూ బెంచీలమీద, పచ్చగడ్డిమీద, చెట్ల నీడల్లో, పొదల వెనకాల చాలా మంది జంటలుగా కూర్చొని సినిమాలగురించో, రాజకీయాల గురించో, ప్రేమలూ పెళ్ళీళ్ళ గురించో, ఆటలు, చదువులు, వ్యాపారం, కష్టాలు, బాధలు, రోగాలు, మందులు, వైద్యాలు, తీయ్యబోయె షార్ట్‌ఫిలింలు.. ఏమిటో తెలియదు కానీ చాలా చాలా మాట్లాడేసుకొంటున్నారు.

మెడిటేషన్ నేర్పించే ధ్యానమందిరం దగ్గర ఎవరూ లేరు.

కేవీఆర్ లైబ్రరీ లోనుంచి ట్యూబ్‌లైట్ల కాంతి బయటకు కనిపిస్తుంది. లోపల కొంతమంది చదువుకొంటున్నారు. 

రకరకాల తినుబండారాలు అమ్మే హాకర్స్ అన్నిచోట్లా ఉన్నారు.

కుళాయి చెరువులో టూసీటర్, ఫోర్‌సీటర్ పెడల్ బోట్లు, ఎక్కువమంది వెళ్ళడానికి వీలుగాఉన్న లాంచీ జనాలని తిప్పుతున్నాయి. మనిషికి ఇరవైరూపాయల టిక్కెట్టు. 

ఆకాశం బంగారు రంగును పులుముకొంటుంది. 

లాహిరి లాహిరి లాహిరిలో... అని పాడుకొంటూ కొంచం సేపు బోటు షికారు చేద్దామా? 

© Dantuluri Kishore Varma 

Tuesday, 24 September 2013

ఆ విప్లవజ్యోతి ఇంకా స్ఫూర్తిని నింపుతూనే ఉంది.

04.07.1897 - 07.05.1924
ఇరవై ఏడేళ్ళంటే ముక్కుపచ్చలారని వయసు. చదువు పూర్తిచేసుకొని, అప్పుడప్పుడే వ్యాపారమో, ఉద్యోగమో మరేదైనా సంపాదనామార్గమో ఎంచుకొని విజయాల బాటన నడక మొదలుపెట్టే వయసు. అల్లూరి సీతారామరాజు ఆ సరికే ఒక మహాసామ్రాజ్యాన్ని గడగడలాడించగల ఉద్యమాన్ని నడిపి, దేశవ్యాప్తంగా ఒక స్వాతంత్ర్య స్పూర్తిని నింపి, నిష్క్రమించాడు. 

ఈ నేల మనదిరా, ఈ గాలి మనదిరా అని స్వేశ్చగా అటవీసంపదను వాడుకొంటూ, చెట్లునరికి పోడువ్యవసాయం చేసుకొంటూ, వనసంపదని సంతల్లో బియ్యానికీ, వంటసరుకులకీ వస్తుమార్పిడి చేసుకొంటూ, పండుగలకీ పబ్బాలకీ ఇంకోలా చెప్పుకొంటే అసలు ఏ ప్రత్యేక సందర్భం లేకపోయినా ఈతకల్లునీ, తాటికల్లునీ సేవిస్తూ ఆనందంగా గడిపేస్తున్న మన్యం జనాలు బ్రిటీషువాళ్ళ అటవీ రిజర్వు చట్టాలు, అబ్కారీ చట్టాల వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. చేతులూ కాళ్ళూ కట్టేసినట్టయ్యాయి. అప్పుడు సీతారామరాజు వాళ్ళ జీవితాల్లో వెలుగునింపే మెరుపులా, తెల్లవాళ్ళ పాలిట పిడుగులా వచ్చాడు. 

1907లో, అంటే అప్పటికి సీతారామరాజుకి పదేళ్ళు ఉంటాయేమో - బిపిన్ చంద్రపాల్ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాడు. ఎందరో వాటికి ఉత్తేజితులయ్యారు. వారిలో మనహీరో ఒకడు. తరువాత ఒక పుష్కరకాలానికి గాంధీజీ సహాయనిరాకరణోధ్యమం వల్ల కొత్త ఆలోచనలకి త్వరగా స్పందించే వయసులో ఉన్న యువకుడు సీతారామరాజు తెల్లవాళ్ళను ఎదిరించాలని నిర్ణయించుకొన్నాడు. గాంధీజీలా అహింసామార్గంలో కాదు. హింసామార్గంలో.

మన్యప్రాంతానికివెళ్ళి అక్కడివాళ్ళకి స్వాతత్ర్యంయొక్క ప్రాముఖ్యతని నూరిపోసి, దళాన్ని కూడగట్టుకొన్నాడు. కాకపోతే పాతకాలపు విల్లంబులులాంటి ఆయుదాలు తెల్లవాళ్ళ తుపాకీ గుళ్ళముందు దిగదుడుపే! కాబట్టి, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి అక్కడ ఉన్న తుపాకీలనీ, మందుగుండు సామాగ్రినీ స్వాధీనం చేసుకోవడానికి చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి మొదలైన పోలీస్‌స్టేషన్ల మీద మెరుపుదాడి చేసి సఫలమయ్యాడు. ప్రభుత్వానికి వెన్నులో ఒణుకుపుట్టించాడు. ఈ చిచ్చరపిడుగుని ఎదుర్కోవడానికి ఆధునిక పరికరాలనీ, ఆయుదాలనీ, ప్రక్కరాష్ట్రాలనుంచి ప్రత్యేక పోలీసు బలగాలనీ రప్పించ వలసి వచ్చింది. 

1922 నుంచి 1924 వరకూ కేవలం రెండు సంవత్సరాలే అయినా, ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా చేశాడు.  

రాజుని నమ్ముకొన్న మన్యంప్రజలకి వేదింపులు మొదలయ్యాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అల్లూరి సీతారామరాజు లొంగేవాడుకాదు. కానీ, ఆశ్రితజన పీడన ఆతనికి వేదన అయ్యింది. అందుకే, తనకు తానుగా లొంగిపోయాడు. ఈ నిప్పుని వొడిలో పెట్టుకొంటే సామ్రాజ్యాన్నే కాల్చి మసిచేస్తుందని భావించారేమో! లొంగిపోయిన వీరుడ్ని అదుపులోకి తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. 

కానీ ఆ విప్లవజ్యోతి ఇంకా స్పూర్తిని నింపుతూనే ఉంది.
© Dantuluri Kishore Varma 

Sunday, 22 September 2013

పూదండ ఇంటర్వ్యూ

పూదండ తెలుగు బ్లాగుల ఆగ్రిగేటర్లో నా ఇంటర్వ్యూ ప్రచురించిన పూదండ నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.  


మీకోసం ఈ ఫోటో
ఇదే:
1. తెలుగు బ్లాగు ప్రపంచం లోకి ఎప్పుడు అడుగు పెట్టారు?దానికి గల ప్రేరణలు ఏమిటి..?

గతసంవత్సరం(2012) జూలైలో `మనకాకినాడలో...` బ్లాగ్ రాయడం మొదలుపెట్టాను. నిజానికి అంతకుముందు నేనొక కంప్యూటల్ ఇల్లిటరేట్‌ని. రెండు సంవత్సరాల క్రితం సిస్టం తీసుకొన్నతరువాత క్రమంగా వాడడంలో మెళుకువలు అలవాటు అయ్యాయి. ఇక బ్లాగ్ విషయానికి వస్తే, చిన్నప్పటినుంచీ రాయాలని నాకున్న ఇష్టమే ప్రారంభించడానికి పెద్ద ప్రేరణ. ఒక టపా ప్రచురించిన తరువాత వచ్చే ప్రతిస్పందన ఇంకా, ఇంకా రాయాలనే కోరికను పెంచుతుంది.

2.బ్లాగు టపాలు రాయడం లో మీ అనుభవాలు వివరించండి.

బ్లాగ్ రాయడం నేర్చుకోవడం అనే ప్రోసెస్‌లో ది బెస్ట్ పార్ట్ అనుకొంటాను. చాలా తక్కువమందికి తెలిసిన అద్భుతమైన విషయం గురించి రాస్తే ఎవరికీ నచ్చకపోవచ్చు. అతిసాధారణమైన రోజువారీ విషయాలగురించి రాస్తే ఎంతో మంది చదవవచ్చు. అలాగే ఎంతో ఆలోచించి రాసినదానికంటే, ఎ మొమెంట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ తో రాసింది గొప్ప టపా అవుతుంది. మనకి ఏది నచ్చుతుంది అనేదానికంటే పాఠకులకు నచ్చేది ఏమిటనేది ప్రధానం. 

`నెమోనిక్స్ సిన్స్ టైం ఇమ్మెమోరియల్` అనే టపాని నా ఇంగ్లీష్ బ్లాగ్‌లో చదివి `ఫణిబాబు మ్యూజింగ్స్` బ్లాగర్ ఫణిబాబుగారు పూనా నుంచి ఫోన్లో ప్రశంసించడం జరిగింది. అలాగే ఇంకొన్ని సందర్భాలలో విదేశాల్లో ఉన్న మనతెలుగువాళ్ళు కూడా ఫోన్‌చేసి బ్లాగ్‌ని మెచ్చుకోవడం ఆనందం కలిగించింది. బ్లాగ్ చదివి ఫేస్‌బుక్‌లో మిత్రులు అయినవారు ఉన్నారు. బ్లాగర్ గా మారి ఉండకపోతే, కాకినాడలాంటి చిన్న పట్టణంలో ఉండే నాలాంటి వాడిని పట్టించుకోవలసిన అవసరం ఎవరికి ఉంటుంది?
రిటైరయ్యి లండన్లో కొడుకుదగ్గర ఉంటున్న మా మాష్టారు ఒకసారి కలిసినప్పుడు, "నీ బ్లాగ్ ప్రతీరోజూ చదువుతాను. చాలా బాగుంది," అని చెప్పడం నాకు గొప్ప ఎచీవ్‌మెంట్ లాంటిది.     

3.మీ టపాల లో సృజనాత్మకత,విషయ పరిశీలన బాగా ఉంటాయి.దానికి మీరు చేసే కృషి ఎలాంటిది..?

చదవడం పాసివ్ ఆక్టివిటీ. చదువుతూ ఉండగా మన ఆలోచనలు ఎక్కడెక్కడో విహరిస్తూ ఉండవచ్చు. మనం ఉన్న పరిసరాల్లోనుంచి మాయమైపోయి, రచయిత సృష్టించిన ప్రపంచంలో సంచరిస్తాం. రాయడం అలాకాదు. రాయబోయే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని దానిని పాఠకులు మెచ్చగల టపాగా మలచాలి. దానికోసం విస్తృతంగా చదవాలి. వివేకానంద గురించి రాసిన టపాలకోసం ఆయన పుస్తకాల్లో ఆయా భాగాల్ని ఎన్నేసి సార్లు చదివానో లెక్కలేదు.

టపాని వ్యాసంలా రాస్తే తక్కువమంది చదువుతారు. ఉదాహరణకి గౌతమీ ఎక్స్‌ప్రెస్‌ని ప్రారంభించి 25 సంవత్సరాలు అయిన సందర్భంలో దానిగురించి `ఓ అందమైన అమ్మాయి ఆత్మకథ` అని పేరు పెట్టి, నిజంగానే అమ్మాయికథ అనిపించేలా రాయడంతో  అత్యధికంగా చదివారు.  
కథలురాసే విషయంలో కూడా ఈ జాగ్రత్త తీసుకొంటాను. సాధారణంగా ట్విస్ట్‌ని చివర ఉండేలా ప్రయత్నిస్తాను. పాఠకులు ఏఏ అంశాల్ని ఇష్టంగా చదువుతారు అనే అంశాన్ని నిరంతరం పరిశీలిస్తూ ఉంటాను.      

4.మీకు బాగా నచ్చిన కొన్ని బ్లాగుల గురించి చెప్పగలరా..?

కాపీ - పేస్ట్ తరహా బ్లాగులు మినహాయించి నాదృష్టికి వచ్చిన మంచి బ్లాగులన్నీ చదువుతాను. ప్రత్యేకించి పేర్లు చెప్పను కానీ తెలుగులో నా అభిమాన బ్లాగర్లు చాలా మంది ఉన్నారు.

5.ఇంకా మీ ఇతర హాబీలు ఏమిటి?

పుస్తకాలు చదువుతాను. ఎప్పుడైనా చక్కటిప్రదేశాలకి వెళ్ళి చూసి వస్తాను. ఫేస్‌బుక్లో దగ్గరదగ్గరగా పదివేలమంది ఉన్న `మనకాకినాడ` అనే గ్రూపుని నిర్వహిస్తాను.

6.మీ జీవితం లో మరిచిపోలేని సంఘటనలు గురించి మాతో ఏమైనా పంచుకోగలరా..?
చాలా మంచి సంఘటనలు, కొన్ని చెడ్డవీ ఉన్నాయి. మీరు అడిగిన వెంటనే చప్పున ఏవి గుర్తుకు రాలేదు. కాబట్టి, మరచిపోలేని సంఘటనలంటే ప్రత్యేకించి వేటిగురించీ చెప్పలేను.

7.బ్లాగరులకు మీ రిచ్చే సందేశం లేదా సలహా ఏమైనా ఉన్నదా..?

సందేశాలిచ్చేటంత పెద్దవాడ్ని కాలేదు. నన్ను ఇలా పరిచయం చెయ్యాలనుకొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ హ్యాపీ బ్లాగింగి! 
© Dantuluri Kishore Varma 

అటు ఊళ్ళు, ఇటు ఊళ్ళు...

అటు ఊళ్ళు, ఇటు ఊళ్ళు
మధ్యలో పారుతున్న కాలువ పరవళ్ళు
ఇటునుంచి అటు వెళ్ళాలంటే
బల్లకట్టు ఉండాలి
లేదా దూరంగా ఉన్న వంతెన దాటి
అటువైపు రోడ్డులో  అంతదూరమూ వెనక్కి తిరిగిరావాలి
ఇలాంటికాలువ మాఊళ్ళో ఉండేది...(ఇప్పుడూ ఉంది)
మరి మీఊళ్ళో?   
 

© Dantuluri Kishore Varma 

Saturday, 21 September 2013

ఆదిపరాశక్తి

సృష్ఠికి మూలం తల్లి. ఈ భావననే దేవతగా కొలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో పల్లెపల్లెకీ దేవతలు ఉంటారు. వీరిని గ్రామదేవతలు అంటారు. సత్తెమ్మతల్లి, నూకాలమ్మతల్లి, గంగమ్మతల్లి, మరిడమతల్లి.. అని గ్రామగ్రామానికీ ఒక్కో పేరుతో వ్యవహరించినా, ఆదిపరాశక్తి ఒక్కటే! గ్రామదేవత శతృవులనుంచి, దుష్టశక్తులనుంచి, రోగాలనుంచి రక్షిస్తుందనీ; చెడ్డవాళ్ళను శిక్షిస్తుందనీ గ్రామస్తులు నమ్ముతారు. ప్రతిసంవత్సరం గ్రామదేవత పేరుమీద జాతరలు చేస్తారు. రోడ్ల ప్రక్కన ఒక చెట్టుకిందో, చిన్న గుడిలోనో నిలిపిన దేవతని ఆ రోడ్డు వెంట వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా వాహనాలు నిలిపి, దణ్ణం పెట్టుకొని ప్రయాణం సక్రమంగా జరగాలని కోరుకొంటారు. 

ఈ ఫోటోలో ఉన్న గుడి ఏ ఊరిలోదో ఖచ్చితంగా చెప్పలేనుగానీ - కాకినాడనుంచి రాజమండ్రీ వెళ్ళే కెనాల్ రోడ్డులో ద్వారపూడికీ, కడియానికి  మధ్యలో (కేశవరం) ఉంటుంది. 
 

© Dantuluri Kishore Varma 

వెదురుతో ఎదురొచ్చారు వీళ్ళు!

ఒకసారి బ్యానర్లు కట్టించడానికి వెదురు బద్దలు కావలసి వచ్చాయి. వెదురు బుట్టలు, నిచ్చెనలూ తయారు చేసేవాళ్ళ దగ్గరకి వెళితే పది అడుగులుకూడాలేని చిన్న గెడకి రెండువందల రూపాయలు అడిగాడు. ఏజన్సీ ప్రాంతంలో వెదురు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుంది. కానీ, మిగిలినచోట్ల  ఒక్క గెడ కొనాలంటే రేట్లకి కళ్ళు తిరుగుతాయి. కేవలం గెడలే కాదు వెదురు బొమ్మలు, ఫర్నీచర్.. దీనితో చేసిన ఏదయినా మహా రేటే, వెదురు బొంగుల్లో మషాళాతో కలిపి కూరి మంటమీద కాల్చి తయారు చేసే బొంగులో చికెన్ కూడా! 

ఎత్తయిన మిద్దెలమీదకి ఎక్కడానికి నిచ్చెనలు వెదురుతోనే ఎందుకు తయారు చేస్తారో తెలుసా? మొత్తమ్మీద వంద అడుగుల ఎత్తువరకూ కూడా వెదురు ఎదుగుతుంది. పొడవుగా, దృఢంగా ఉండే బొంగులు ఉంటాయి. ఇది  ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదిగే మొక్కల్లో ఒకటి. అనుకూలమైన వాతావరణం, నేల ఉంటే ఒక్కరోజులో 100 సెంటీమీటర్లు పెరుగుతుంది.  
  
బై ద వే... పొడవైన గెడల్ని సైకిళ్ళకి కట్టుకొని ఎలా నడిపించుకొని వెళుతున్నారో చూడండి.  వెదురుతో ఎదురొచ్చారు వీళ్ళు. ఆంధ్రాశబరిమలై వెళుతున్నప్పుడు తీసిన ఫోటోలు ఇవి.

© Dantuluri Kishore Varma 

Thursday, 19 September 2013

కెన్ యూ డిఫైన్ ఫ్రెండ్షిప్?

ఫ్రెండ్‌షిప్ అంటే-
క్యాంటీన్లలో కూర్చొని
లవ్ ఇంటరెస్టుల గురించి
లవ్ ఫెయిల్యూర్ల గురించి
గంటలకొద్దీ కబుర్లు చెప్పుకోవడమా?
ఒక్కడి దగ్గరే డబ్బులుటే
మిగిలిన అందరూకలిసి లాగేసుకొని
ట్రీట్ చేసేసుకొని
ఏడుపొక్కటే తక్కువైన ఫ్రెండునిచూసి
ఆనందంగా ఆటపట్టించడమా?
కష్టమొస్తే నేనున్నాను
అని గోడలా నిలబడి
కాన్‌ఫిడెన్స్ ఇవ్వడమా?
తప్పుదారిలో పోతుంటే
చెయ్యిపట్టుకొని మంచిదారిలోకి
నడిపించడమా?
కలిసి సినిమాలు
పరీక్షలముందు కంబైండ్‌స్టడీలూనా?
కెన్ యూ డిఫైన్ ఫ్రెండ్షిప్?

© Dantuluri Kishore Varma

Wednesday, 18 September 2013

పిట్టలా, మజాకా?

పిట్టలని పరిశీలించే శాస్త్రాన్ని ఏమంటారో తెలుసా?
బీటుకొట్టడం, సైటుకొట్టడం, కలరింగెయ్యడం.. ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. అయినా మీకు కొత్తగా చెప్పాలా ఏమిటి?
అదికాదురా బుర్రతక్కువ వెధవా. పిట్టలంటే పక్షులు.
ఓ అవా? కోడీ, కాకీ, గుడ్లగూబా, కొంగా, రాబందూ...
ఒరే ఒరే ఆపరా బాబూ. ఇవే కాకుండా ఇంకా అందమైన పక్షులు కూడా ఉంటాయి. రామచిలకా, నెమలీ, పావురం, కోయిలా...
నల్లగా ఉండే కోయిలకూడా అందమైనదేనా, గురూగారు?
అన్వేషణ సినిమాలో భానుప్రియ చూడు.. పక్షి కూతలు రికార్డుచేసే సరంజామా అంతా పట్టుకొని, తనుకూడా పక్షిలా కూస్తూ, పాడుకొంటూ అడవులవెంట వెళుతుందికదా? చూడటానికే కాదురా, వినడానికి కూడా అందమైన పక్షులు ఉంటాయి.
ఓ అర్ధమైందండి. అందంగా ఉన్న అమ్మాయిలు హీరోయిన్లయిపోతే, గొంతుబాగున్నవాళ్ళు ప్లేబ్యాక్ సింగర్లయినట్టు. 
అబ్బా నీకు చాలా జనరల్ నాలెడ్జ్ ఉందిరా!
మరేమిటనుకొన్నారు మనమంటే?
అదిసరేకానీ నేనడిగిన ప్రశ్నకి సమాధానం తెలుసా? 
పిట్టల శాస్త్రం...పిట్టల శాస్త్రం...హూం...చిన్న క్లూ...ప్లీజ్!
సలీం ఆలీ అని ఒకాయన పక్షుల గురించి జీవితమంతా పరిశోధనచేసి చాలా పుస్తకాలు రాశాడు. ఈయన్ని బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు.
పాస్...
పాసేంటిరా, పాస్?
తెలియదండీ బాబో!
ఆర్నితోలజీ. 
ఆర్నీ, ఇదా! ఇది తెలియకపోవడం ఏమిటి గురువుగారు? నాలిక చివర ఆడింది కానీ, బయటకు రాలేదు. ఇంకొంచెం సమయం ఇస్తే ఖచ్చితంగా సరయిన సమాధానం చెప్పేవాడ్నండీ! సర్లెండి, దాన్ని అలా ఉంచండి. మీకు పక్షులగురించి బాగా తెలిసినట్టే ఉంది. మొన్న కోరుకొండ వెళ్ళినప్పుడు అక్కడేదో పిట్ట కనిపిస్తే ఓ ఫోటో పీకాను. చూశారా నేనుకూడా ఆర్నితోలజిస్టునే! ఈ పిట్టపేరేమిటో ఖచ్చితంగా చెప్పాలి మీరు(ఎవరైనా సరే). అదీ సంగతి!
ఈ పిట్ట పేరేమిటి?
© Dantuluri Kishore Varma 

Tuesday, 17 September 2013

సాయంకాలపు సూర్యుడు

నీరు
నీటివెనుక ఆకాశం
వీచే గాలి 
కెరటం విరిగిపడే హోరు
మీద పడే నీటితుంపరలు
తిరిగి వెళుతూ పాదాలక్రిందనుంచి ఇసుకను తీసుకొనివెళ్ళిపోయే కెరటం.. 
అన్నీ బాగుంటాయి - సముద్రం పోటుమీద ఉన్నప్పుడు. 
కానీ, నీరంతా వెనక్కి వెళ్ళిపోతే -   
కంటిచూపుకి విసుగుకలిగించే బురద కనిపిస్తుంది...
...చెలమల్లో నిలిచివున్న నీటిలో సాయంకాలపు సూర్యుడు తన ముఖం చూసుకొనేవరకూ! 
కాకినాడ బీచ్ దగ్గర తీసిన ఫోటో.  
© Dantuluri Kishore Varma

Monday, 16 September 2013

రామచంద్రపురం కోటని చూశారా?

కాకినాడకి ముప్పై కిలోమీటర్లదూరంలో ఉన్న రామచంద్రపురం కోటని చూశారా?

త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో అయోధ్య నుంచి నడిచివస్తూ భద్రాచలం వద్ద పంచవటి నిర్మించుకోవడానికి ముందు రెండుచోట్ల మజిలీ చేశాడట! ఆయన మజిలీ చేసిన ప్రాంతాలు తర్వాత కాలంలో జనావాసంగా మారాయి. మొదటి మజిలీ ప్రస్తుత హైదరాబాద్‌ సమీపంలో ఉండగా, రెండో మజిలీ తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు సమీపంలో ఉంది. ఈ రెండు ప్రాంతాలూ రామచంద్రుడు మజిలీ చేసిన పురాలుగా రామచంద్రపురం పేరుతో ప్రసిద్ధికెక్కాయి.కాకర్లపూడి వంశానికి చెందిన కోట యిక్కడి ప్రధాన ఆకర్షణ. ఈకోటలో మురారి మొదలైన అనేక సినిమాలను చిత్రీకరించారు (Information Wikipedia. Photo own).  

© Dantuluri Kishore Varma 

Sunday, 15 September 2013

రైల్వే ట్రేక్‌కి కనుచూపుమేరలో...

రైల్వే ట్రేక్‌కి కనుచూపుమేరలో... 
కాకినాడకి దగ్గరలో రేపూరు అనే ఊరిలో 116 అడుగుల ఎత్తైన సాయిబాబా విగ్రహం, నాలుగంతస్తుల భవనం మీద కూర్చొని ఉన్న భంగిమలో నిర్మించారు. ప్రపంచంలోనే ఎత్తైన సాయిబాబా విగ్రహం ఇదే అని చెపుతున్నారు. విగ్రహం వెయ్యిటన్నులకంటే ఎక్కువ బరువు ఉంటుంది. నిర్మాణానికి సుమారు పుష్కరకాలం పట్టిందట, మూడుకోట్లవరకూ ఖర్చు అయ్యిందట. 

కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్‌లో, కొవ్వాడ స్టేషన్‌కి సమీపంలో రేపూరు సాయిబాబా ఇలా దర్శనమిస్తాడు. తాడిచెట్ల తలల కంటే పైన సాయిబాబా కూర్చున్న పీఠం కనిపిస్తుంది. ఆ అందమైన దృశ్యం మీకోసం.

© Dantuluri Kishore Varma 

స్నేక్ చార్మర్

పాములను ఆడించడం ప్రాచీనమైన వృత్తి. ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ కనిపించే పాములు ఆడించే వాళ్ళు ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. కొంతకాలం క్రితం ఎవరింటిలో అయినా పాముకనిపించిందంటే వెంటనే వీళ్ళకి కబురు పెట్టేవారు. 

వీళ్ళు నాగస్వరం ఊదితే పాములు పడగ ఎత్తి ఆడతాయి. నిజానికి పాములకి చెవులుండవు, కానీ ఎలా ఆడతాయి అనేది ప్రశ్న. ఈ బూరాని తమకి ఆపద కలిగించగల వస్తువువుగా భావించి స్వయంరక్షణ చర్యగా పడగ ఆడిస్తాయని అంటారు. ద్రాక్షారామ గుడిముందు పాములని ఆడిస్తున్న ఈ వ్యక్తిని మీ ముందుకు ఇలా తీసుకొని వచ్చాను.

© Dantuluri Kishore Varma 

Saturday, 14 September 2013

సుభాష్ చంద్రబోస్

యానం ఫెర్రీ రోడ్డులో సుభాష్ చంద్రబోస్ విగ్రహం
సుభాష్ చంద్రబోస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్(ICS) పాసయినా ఉద్యోగంలో చేరకుండా కాంగ్రెస్‌లో చేరాడు. రెండుసార్లు కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. కానీ, గాంధీజీతో విభేదాలవల్ల పార్టీని విడిచిపెట్టి తన స్వంతంగా స్వాతంత్ర్యం కోసం పోరాడవలసి వచ్చింది. 

రెండవ ప్రపంచ యుద్దం మొదలైనప్పుడు బ్రిటీష్ ప్రభుత్వం మీద స్వాతంత్ర్యంకోసం ఒత్తిడి చెయ్యడానికి అదే సరయిన సమయంగా భావించాడు. ఆ సమయంలోనే, 1940లో, ఆయనని జైల్లో పెట్టారు. నాలుగు నెలలు జైలు శిక్ష అనుభవించిన తరువాత అక్కడినుంచి తప్పించుకొనే ఉద్దేశ్యంతో ఆమరణ నిరాహార ధీక్ష మొదలుపెట్టాడు.  

ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది. ఆయన జైల్లో మరణించడం జరిగితే దేశం అగ్నిగుండంగా మారడం తద్యం. కాబట్టి, ఆయనని అక్కడినుంచి విడుదలచేసి గృహనిర్బందంలో ఉంచారు.

ఇంటి చుట్టూ కాపలాగా ఉన్న పోలీసుల కన్నుగప్పి తప్పించుకొని జర్మనీకి పారిపోయాడు. అక్కడినుంచి జపాన్‌కి. ఇండియన్ నేషనల్ ఆర్మీని(INA) స్థాపించి `నేతాజీ` అయ్యాడు. కానీ, భారతదేశానికి స్వాతంత్ర్యం రాకమునుపే ఒక విమాన ప్రమాదంలో మరణించాడు. (దీనికి సంబంధించి కొంత వివాదం ఉంది. కొంతమంది ఈ మరణం పూర్తిగా నమ్మదగింది కాదని అంటారు.)

A couple of quotes from Subhash Chandra Bose:

"The individual must die so that the nation may live. Today I must die so that India may live and may win freedom and glory."

"Give me blood and I promise you freedom."
© Dantuluri Kishore Varma 

Friday, 13 September 2013

హాంటెడ్ స్ట్రీట్! దెయ్యాలకథ Part II

మొదటి భాగం ఇక్కడ చదవండి

1. హాంటెడ్ స్ట్రీట్! దెయ్యాలకథ Part I

తేజా చెప్పిన కథ

`ప్రమీలా నగర్ మూడవవీధికి వెళ్ళాలి,` అన్నాను.
`దెయ్యాల కొంపలుండే వీధా?` అన్నాడు ఆటో డ్రైవర్.
`దెయ్యాల...కొంపలా...!? ఏమో తెలియదు. ఇదిగో ఎడ్రస్,` అని ఆఫీస్ చిరునామా ఉన్న కాగితం చూపించాను.

ఆటో ప్రమీలానగర్ వీధిలోకి తిరుగుతూ ఉండగా పాడుపడిన ఇల్లు కనబడింది. అది దాటిన వెంటనే నిర్మానుష్యంగా ఉన్న పెద్ద డాబా, గేటుకి తుప్పుపట్టిన తాళంకప్ప వేసి ఉంది. `చీకటి పడ్డాకా ఈ వీధిలో తిరగ బాకండి,` అన్నాడు ఆటో డ్రైవర్. వీధిలో ఉన్న మూడవ ఇంటిముందు ఆటో ఆగింది. ఓర్ అండ్ మాస్ట్(Oar and Mast) షిప్పింగ్ కంపెనీ అని రాసి ఉన్న బోర్డ్ చూస్తూ క్రిందకి దిగాను. ఆఫీస్ ఉన్న బిల్డింగ్ తరువాత ఇంకొక ఇల్లు మాత్రమే ఉంది. వీధిఅంతా నిర్మానుష్యంగా ఉంది.

బట్టల బ్యాగ్, బెడ్డింగ్, టేబుల్ ఫ్యాన్లు క్రిందికి దించుకొని; ఫేర్ చెల్లించిన తరువాత ఆటో వెళ్ళిపోయింది. చప్పుడువిని ఓ ఇరవై ఏళ్ళ కుర్రాడు - అటెండర్ అనుకొంటాను-  బయటికి వచ్చాడు. నా లగేజ్‌ని చేతుల్లోకి తీసుకొంటూ, `మా తేజా సారు, కొత్తగా వచ్చారు,` అన్నాడు. పక్క ఇంటి గేటు దగ్గర గుబురుగా పెరిగిన బోగన్‌విల్లా నీడలో నుంచొని ఉన్న మనిషిని అప్పుడు చూశాను. ముప్పైఅయిదేళ్ళు ఉంటాయేమో! `చాలా` ఆకర్షణీయంగా ఉంది. మాకుర్రాళ్ళ భాషలో చెప్పాలంటే  కత్తిలా ఉంది.

`పక్కింటి రేఖా ఆంటీ సార్. వాళ్ళాయన దుబాయిలో ఉంటాడట. వాళ్ళ అమ్మా, నాన్న, ఇద్దరు పిల్లలతో ఉంటుంది. చాలా మంచావిడ. మీలాంటి స్మార్ట్‌గా ఉన్నవాళ్ళయితే ఏ `హెల్ప్` కావాలన్నా చేస్తుందట.` అన్నాడు ఆఫీసులోకి దారితీస్తూ. హెల్ప్‌ని వొత్తిపలికాడు. కొంటెగా కన్నుకూడా గీటాడు.

*     *     *   

ఆఫీసులో మామూలు రోజుల్లో పెద్దగా పని ఉండదు. ఎప్పుడైనా వెసల్(షిప్) వచ్చినప్పుడు మూడు, నాలుగు రోజులు రాత్రీ పగలూ తేడా లేకుండా పనిచెయ్యాలి. మళ్ళీ ఏ పదిహేనురోజులకోకానీ ఇంకొక వెసల్ రాదు. ఉండేది ముగ్గురమే నేనూ, ఎకౌంటెంట్, అటెండర్.

ప్రయివేటు కంపెనీ కనుక పెద్దగా జీతాలు ఉండవు. ఏదయినా హోటల్లో ఉండి రూం వెతుక్కోవాలంటే, జేబుకి చిల్లుపడుతుంది. కాబట్టి, తక్షణ కర్తవ్యం ఇళ్ళవేట. అ(దుర)దృష్టవశాత్తూ ఆఫీసు పక్కపోర్షన్ ఖాళీగాఉంది. అకౌంటెంట్ దగ్గర ఇళ్ళబ్రోకర్ షణ్ముగం నెంబరు తీసుకొని కాల్ చేశాను.

సింగిల్ బెడ్రూం పోర్షన్ విత్ అటాచ్డ్ బాత్రూం. అద్దెతక్కువ. `తన్నితే బూరెలబుట్టలో పడటం అంటే ఇదేనండి. ప్రక్కనే మంచి హెల్పింగ్ నేచరున్న ఆంటీగారు కూడా ఉన్నారు,` అన్నాడు షణ్ముగం అడ్వాన్స్ తీసుకొంటూ.

సామాన్లు ఇంటిలో పెట్టించాను. సాయంత్రం ఆరు అవుతుండగా, ఆఫీసు మూసెయ్యడానికి తయారవుతున్నాం. అప్పుడువచ్చింది రేఖా ఆంటీ సరాసరి నా టేబుల్ దగ్గరకి. ఆమె నడచి వస్తుంటే కదులుతున్న నడుము ఒంపుల్లో చిక్కుకొన్న నా చూపులు, గతుకులరోడ్డులో ప్రయాణించినట్టు ఎగిరెగిరి పడ్డాయి.

`కొత్తగా వచ్చారట? మా పక్కింటిలోనే దిగడం సంతోషం. ఏదయినా కావాలంటే మొహమాటపడకుండా అడగండి. సాయంత్రం భోజనం పంపిస్తాను,` అంది. మాటల్లో శ్లేష కావాలని పలికించినట్టే ఉంది.

`లేదండి. ఓ మూడురోజులు పనిమీద బయటి ఊరు వెళ్ళాలి. ఇప్పుడే బయలుదేరుతున్నాను. చాలా థాంక్స్!` అన్నాను.

`ఇప్పుడే జేరారు, అప్పుడే క్యాంపా?` అని మతులుపోయేలా ఓ చిరునవ్వు నవ్వి, వెళ్ళిపోయింది.
 *     *     *

అనుకొన్నపని ఒకరోజు ముందే పూర్తయిపోయింది. ఊరిలో ట్రెయిన్ దిగేసరికి రాత్రి పది అవుతుంది. రన్నింగ్ ఆటోలో ప్రమీలా నగర్ జంక్షన్‌ దగ్గర దిగి, ఇంటివైపు నడవడం మొదలుపెట్టాను. చిన్నగా గాలి వీస్తుంది. `చీకటి పడ్డాకా ఈ వీధిలో తిరగ బాకండి,` అన్న ఆటో డ్రైవర్ మాటలు సడన్‌గా జ్ఞాపకం వచ్చాయి. వెన్నులోనుంచి వొణుకు వొళ్ళంతా పాకింది. నుదుటిమీద చెమట్లు పడుతున్నాయి. గాలివేగం పెరిగింది. మావీధిలోకి మలుపు తిరుగుతుండగా పాడుబడిన ఇంటిలో కిటికీల్లోనుంచి గుబురుగా పెరిగి బయటకి వచ్చిన మొక్కలు గాలికి కదులుతుంటే ప్రేతాత్మలు చేతులుచాచి ఆహ్వానిస్తున్నట్టు ఉన్నాయి. సరిగ్గా అప్పుడే `టప్`మని కరెంట్ పోయింది. వీధిలైటు ఆరిపోయింది. గేటు తీసుకొని లోపలికి వెళ్ళాను.  

అంతరాత్మ ఘోషించడం గురించి పుస్తకాల్లో చదవడమే గానీ ఎప్పుడూ స్వయంగా నాకు అనుభవమవ్వలేదు. కానీ, తాళాల గుత్తి తీసి నా పోర్షన్‌వైపు వెళుతుండగా, `వద్దు, వద్దు` అని బలంగా అనిపిస్తుంది. ఇంటిలో కటిక చీకటి. ఎక్కడ ఏముందో తెలియదు. నిజంగా ఇది దెయ్యాలవీధి అయివుంటే! తాళాలు తియ్యడం విరమించుకొన్నాను. లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోవడం కంటే కరెంటు వచ్చేవరకూ డాబా మీద గడపడం మచిది.   

అసలు నేను అక్కడినుంచి పారిపోయి ఉండవలసింది. స్టుపిడ్‌లాగ డాబామీదకి వెళ్ళాను. నల్లగా నాచుపట్టిన మెట్లు, పడుకొన్న మృగంలాగ ఉన్న ఓవర్‌హెడ్ టేంక్. వాటర్‌టేంక్ నీళ్ళల్లో చెత్త పడకుండా రేకుతో చేసిన ఫ్రేం ఒకవైపు మేకులు ఊడిపోయి గాలికి పెద్దగా శబ్దం చేస్తూ కొట్టుకొంటుంది. ఎవరైనా మనుష్యులు కనిపిస్తే బాగుండును. రేఖా ఆంటీ ఇంటివైపు నడిచాను. వెనక్కి, కుమారస్వామి ఇంటివైపు తిరగాలంటే భయం వేస్తుంది. పెళ్ళయిన సంవత్సరంలోనే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన అతని కూతురూ, అల్లుడూ గురించి తెలుసు. ఆ సంగతి ఇంతకుముందే అటెండర్ చెప్పాడు. రేఖా ఆంటీ ఇంటిలో ఎలాంటి అలికిడీ లేదు. అప్పుడే, పెద్దగా ఈదురుగాలి వచ్చింది. రెండు పెద్ద పెద్ద వర్షపు చినుకులు మీద పడ్డాయి. గాలితో పాటూ ఎవరో గుసగుసగా మాట్లాడుతున్న చప్పుడు. మెడమీద వెంట్రుకలు నిక్కబొడుచుకొంటుండగా గిరుక్కుమని వెనుకకి తిరిగాను....
నేను చూసిన దృశ్యాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. కుమారస్వామి డాబామీద రెండు ఆకారాలు గాలిలో తేలుతున్నాట్టు వేగంగా మెట్లవైపు వెళ్ళడం నా కళ్ళతో చూశాను.....

*     *     *
శేషగిరి చెప్పిన కథ

దెయ్యాలకొంపట! అసలు నాలాంటివాడికి కావలసింది అదే. నా నలభై అయిదేళ్ళ జీవితంలో దెయ్యాల్లాంటి మనుష్యులని చాలా మందిని చూశాను. మనం భయపడితే అలాంటివాళ్ళకి కానీ, అసలు ఉన్నాయో లేవో తెలియని ఆత్మలకి కాదు. పైపెచ్చు నేను చేసే వ్యాపారానికి షణ్ముగం చెప్పిన ఇల్లు లాంటిదే కరెక్ట్. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలో బోలెడు హడావుడి ఉంటుంది.  చాలా మంది ఫ్రెండ్స్ వస్తారు. డబ్బుకట్టలు చేతులుమారతాయి. ఈ వ్యవహారాలన్ని పబ్లిక్‌లో పెట్టుకోగలమా? అందుకే, వెంటనే ఇళ్ళబ్రోకర్ షణ్ముగం చూపించిన కుమారస్వామి ఇంటిలో దిగిపోయాను. సాయంత్రం నాలుగు పెగ్గులేసి, హోటల్నుంచి తెచ్చుకొన్న చికెన్ బిర్యానీ తిని పడుకొంటే హాయిగా నిద్రపట్టింది. నిజంచెప్పద్దూ, ఈ మధ్యకాలంలో నేను అంత ప్రశాంతంగా నిద్రపోయిందిలేదు.

ఉదయం పేపరు చదువుకొంటుంటే ఆవిడ వచ్చింది. కోరికలు కూరిన మిఠాయి పొట్లంలా ఉంది. పేరు రేఖ అట. 

`ఈ ఇంటిలో ఒంటరిగా ఉండటానికి భయం వెయ్యదా?` అంది. 

`మీరు తోడువస్తారా?` అన్నాను. ఒక్కక్కళ్ళని చుస్తే వెంటనే ప్రొసీడయిపోవాలనిపిస్తుంది. 

`ఇరుగుపొరుగు వాళ్ళం, ఆమాత్రం సాయం చేసుకోలేమా?` అంటూ పక్కుమని నవ్వింది. అలా నవ్వడం కావాలని పైటకొంగు జార్చడానికి ఒక అవకాశం అని నాకు తెలుసు. చప్పున ముందుకు వొంగి ఆమె చెయ్యి పట్టుకొన్నాను. 

`ఆ..ఆ.. ఖంగారు పడకండి. సాయం కావలసింది సాయంత్రానికి కదా? కేరేజీ తీసుకొని వస్తాను,` అని వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయింది. 
*     *     *  
మబ్బుపట్టింది. వర్షం వచ్చేలా ఉంది. చిన్న ఈదురుగాలి మొదలైంది. రాత్రి తొమ్మిది ఐనా రేఖ రాలేదు. చాలా అసహనంగా ఉంది. అసలు వస్తుందా?    

క్షణాలు గంటల్లా అనిపిస్తుండగా మెల్లగా తెరుచుకొన్న తలుపులోనుంచి ముందు మల్లెపూల పరిమళం ముక్కును తాకింది. తరువాత వంగపువ్వురంగు జార్జెట్ చీరలో అప్సరసలా ఆమె నడిచి వచ్చింది.

నా కళ్ళల్లో మెరుపు చూసిందేమో! `ముందు భోజనం తరువాతే ఏమైనా,` అంది. 

రాత్రి పది అవుతుందేమో! బయట ఈదురుగాలి వీస్తున్న చప్పుడు వినిపిస్తుంది. `టప్` మని కరెంట్ పోయింది. ఇల్లాంతా చీకటిమయం అయిపోయింది.`ఇప్పుడెలా? క్యాండిల్స్ కానీ, టార్చ్ కానీ లేవు,` అన్నాను. 

`డాబా మీదకి వెళదాం,` అంది.

`వర్షం!`

`పరవాలేదు, వర్షంలో చాలా బాగుంటుంది.`

`ఆరుబయట.. ఎవరూ చూడరా?`

`ఎవరున్నారు చూడడానికి? పక్కింటిలో మొన్న దిగిన తేజా రావడంతోనే క్యాంపుకి వెళ్ళాడు. ఇంకా రాలేదు. వచ్చేటప్పుడే చూశాను. తలుపు తాళం వేసి ఉంది.  

`అయితే పద,` అన్నాను. మనంచేసే పని గుట్టుచప్పుడు కాకుండా ఉండాలనేది నా పోలసీ. మాంసం తింటున్నామని దుమ్ములు మెడలో వేసుకోం కదా?   

మబ్బులు పట్టి చాలా మసకగా ఉంది ఆకాశం. ఎప్పుడైనా వర్షం రావచ్చు. గాలి ఉదృతంగా వీస్తుంది. పక్క ఇంటి డాబా మీద వాటర్‌ట్యాంకుది అనుకొంటాను రేకు పెద్ద చప్పుడుతో `టక టక` మని కొట్టుకొంటుంది. 

పైమెట్టుమీద వుండగా చూశాను, ప్రక్క డాబామీద కట్రాయిలా నిలుచున్నా ఆకారాన్ని. మొహం అటుతిప్పి ఉందో, ఇటుతిప్పి ఉందో తెలియడం లేదు. గుండెఝల్లు మంది. ఎప్పుడూ లేనిది వొంటినిండా రోమాలు నిక్కబొడుచుకొన్నాయి. 

`ఎవరు?` అన్నాను ఆమెతో గుసగుసగా. అప్పటికే ఆమెముఖం తెల్లగా పాలిపోయి ఉంది. ఏమో తెలియదు అన్నట్టు రేఖ చేతితో సౌ్oజ్ఞ చేస్తుండగా ఆ ఆకారం గిర్రుమని వెనక్కి తిరిగింది. ఒక్కక్షణం కూడా ఆలశ్యం చెయ్యలేదు. చెయ్యీచెయ్యీ పట్టుకొని మూడేసిమెట్లు ఒక్కో అంగలో దిగుతూ పరుగెట్టాం. నిజ్జం! నా కళ్ళతో దెయ్యాన్ని చూడడం అదే మొదటిసారి! 
*     *     *

అయ్యా అదండీ సంగతి. ఇంతకీ నేనెవరో గుర్తుపట్టారా? ఈ కథ మొదలు పెట్టిన ఇంటిబ్రోకర్ షణ్ముగాన్నండయ్యా! తేజా చెప్పిన కథ విన్న తరువాత నాకు నోటమాట రాలేదు. కానీ, శేషగిరి వచ్చి తనకథని చెప్పిన తరువాత జరిగిన విషయం క్లియర్‌గా అర్దమయ్యింది. డాబా మీద వాళ్ళు చూసింది తేజానేనని చెప్పాను. కానీ, తేజాకి మాత్రం అతను చూసింది ఎవరినో నేను చెప్పలేదు.  తన సీక్రెట్ ఎవరికీ చెప్పడానికి వీల్లేదని శేషగిరీ వార్నింగ్ ఇచ్చాడు. తేజా ఆ రోజే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. 

The End
© Dantuluri Kishore Varma 

Thursday, 12 September 2013

హాంటెడ్ స్ట్రీట్! దెయ్యాలకథ Part I

దెయ్యాలు ఉన్నాయా!?

ఉన్నాయో, లేదో చెప్పాడానికి ముందు, మీకొక రెండు కథలు చెప్పాలి - ఇద్దరు చెప్పిన కథలు. కథలు అంటే కథలు కాదు. వాళ్ళు కళ్ళారా చూసిన నిజాలు. 

ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ? నా పేరు షణ్ముగం. నా చిన్నప్పుడే తమిళనాడునుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాం. మా నాన్నకి బేకరీ ఉండేది. మూతబడిపోయింది. ఎందుకంటే - ప్రతీ వ్యాపారంలోలాగే పోటీ. రొట్టెలు చెయ్యడంలో, కౌంటర్లో కూర్చొని డబ్బులు లెక్కబెట్టడంలో మా నాన్నకి సహాయంచేస్తూ గడిపేశాను. బడికి వెళ్ళడానికి అవకాశం దొరకలేదు. మా బేకరీ మూతబడడంతో, ఉద్యోగం వెతుక్కోవలసిన అవసరం పడింది. కానీ, పొట్టకోస్తే అక్షరం ముక్కరాని నాలాంటి వాడికి ఎవరు పనిస్తారు? 

రియల్ ఎస్టేట్ వ్యాపారం నా దృష్టిని ఆకర్షించింది. మధ్యవర్తిగా ఉండి సైట్లు అమ్మిపెడితే కమీషన్ వస్తుంది. కానీ, దీనిలో ఉన్న చిక్కేమిటంటే చాలాకాలానికి గానీ ఒకసైటు  అమ్మలేం. అందుకే దీనికి అనుబంధంగా అద్దెఇళ్ళ బ్రోకర్‌గా కూడా ఉండడం మొదలు పెట్టాను. ఇళ్ళ యజమాని దగ్గరనుంచీ, అద్దెకి వచ్చేవాళ్ళ దగ్గరనుంఛీ ఒక్కోనెల అద్దెని కమీషన్‌గా లాగొచ్చు - చాలా లాభసాటి వ్యవహారం. ఏమైనా లొసుగులున్న ఇళ్ళు అద్దెకు ఇప్పిస్తే ఓనర్నుంచి రెండు, మూడు నెలల అద్దె కమీషన్‌గా వస్తుంది. అలాంటీ డీల్ ఒక్కటి చేస్తే చాలు, జేబులు నిండిపోతాయి.  
ప్రమీలానగర్ మూడవ వీధిలో నాలుగంటే నాలుగే ఇళ్ళు ఉంటాయి. మెయిన్‌రోడ్‌నుంచి ప్రమీలానగర్లోనికి తిరిగి రెండువందలమీటర్లు ముందుకు వెళితే రోడ్డు చివరికి వస్తాం. అక్కడినుంచి ఎడమవైపుకి మలుపుతిరిగితే మూడవవీధి. జనాలుపెద్దగా తిరిగే వీధికాదు. నేను చెప్పిన ఇళ్ళు ఇక్కడే ఉన్నాయి. వాటికి ఎదురుగా పోరంబోకు స్థలం ఉంటుంది. దానికి చేర్చి కెమికల్ ఫేక్టరీగోడ. తలుపులూ, ద్వారబందాలు తీసేసిన కప్పులేని పాడుపడిన ఇల్లు మొదటిది. దానితరువాత స్టీలు బార్జీల వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించిన కుమారస్వామి మేడ. ముగ్గురికొడుకులకి పెద్ద పెద్ద బంగళాలు కట్టి ఇచ్చేసి, కూతురి కోసం ఈ ఇల్లు కట్టాడు. మేనల్లుడికి ఇచ్చిపెళ్ళిచేసి అందులో కాపరానికి ఉంచాడు. దురదృష్టవశాత్తూ పెళ్ళయిన సంవత్సరంలోనే కుమారస్వామి కూతురూ, అల్లుడూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆతరువాత ఆ ఇల్లు ఖాళీగా ఉండిపోయింది. మీకుతెలియంది ఏముంది? ఇలాంటి ఇళ్ళగురించి చాలా కథలు వింటుంటాం కదా? కానీ నేను అలాంటివి పట్టించుకొనే రకంకాదు. పైపెచ్చు, దీనిని అద్దెకు ఇప్పిస్తే పెద్ద ఎత్తున కమీషన్ ముడుతుంది నాకు.  కుమారస్వామి ఇంటి ప్రక్కన బ్యాంకులో పనిచేసే సాంబయ్యగారి రెండుపోర్షన్ల ఇల్లు. ఒకపోర్షన్లో ఓర్ అండ్ మాస్ట్  షిప్పింగ్ కంపెనీవాళ్ళ ఆఫీసు ఉంటుంది. ఇంకొకభాగం ఈమధ్యనే ఖాళీ అయ్యింది.  
ఆ రోజు పొద్దున్న అద్దెఇళ్ళ కోసం నాకు రెండు కాల్స్ వచ్చాయి. చేసినవాళ్ళలో ఒకడు శేషగిరి, రెండవవాడు తేజ. ప్రమీలా వీధిలో ఉన్న రెండు ఖాళీ ఇళ్ళనీ వాళ్ళిద్దరికీ ఇప్పించాను. కొన్నిరోజులతరువాత వాళ్ళిద్దరూ విడివిడిగా నాకు చెప్పిన కథలు, వాళ్ళమాటల్లోనే మీకు తిరిగి చెపుతాను.

తరువాతి భాగం లింకు ఈ క్రింద ఉంది చూడండి:

Tuesday, 10 September 2013

ఏమివ్వాలి?

సన్నిహితులకి ఎలాంటి బహుమతులు ఇవ్వాలనేది ఎవరైనా నాకు చెబితే బాగుణ్ణు. పుట్టినరోజో, పెళ్ళిరోజో, గృహప్రవేశమో, పెళ్ళో, మరింకేదయినా శుభకార్యమో జరిగినప్పుడు వాళ్ళకి ఏమివ్వాలి? `ప్రేమా, అభిమానం, హృదయపూర్వక శుభాకాంక్షలు ఇస్తే చాలవా, అవి ఎంతటి వెలకట్టలేని విషయాలు?` అని క్లాసు పీక్కండి. `నువ్వంటే నాకు చాలా ఇష్టంరా కన్నా,` అని తల్లి, పిల్లోడిని ముద్దుచేస్తే దానికంటే మించింది లేదు. కానీ, దానితో పాటు ఒక చాక్లేట్ ఇస్తే ఆ కుర్రోడికి అమ్మప్రేమ ఇంకా బాగా అర్థమౌతుంది.

చాక్లేట్లకే ఆనంద పడిపోయే చిన్నవయసు పిల్లలకి గిఫ్ట్‌లు ఇవ్వడం చాలా సులభం. ఇక్కడ సులభం అనే మాట బహుమతికి ఖర్చు పెట్టే డబ్బులకి సంబంధించినది కాదు. తీసుకొనేవాళ్ళ కళ్ళల్లో కనిపించే మెరుపుకి సంబంధించింది. వయసుపెరిగే కొలదీ పిల్లలమీద ప్రపంచం చూపించే ఆకర్షణల ప్రభావం పెరుగుతుంది. విష్‌లిష్ట్‌లో చెప్పలేనన్ని వస్తువులు ఉంటాయి. రోజురోజుకీ ఇష్టాలు మారతాయి. పాత వస్తువులు పోయి, లిస్టులోనికి కొత్తవి వచ్చి చేరతాయి. వాళ్ళకి ఏమికావాలో తెలుసుకోలేం, వాళ్ళు చెప్పలేరు. చెప్పినా చాలామటుకు అందుబాటులో ఉండకపోవచ్చు. మనం ఎంతో ఉపయోగకరమైనదని భావించి ఏదో బహుమతి వాళ్ళకిస్తే, తీసుకొన్నవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్‌కీ చేరుకోలేక నిరుత్సాహం కలిగించవచ్చు. అప్పుడు, కళ్ళల్లో మెరుపులుండవు. ఫోర్డ్ కార్ల కంపెనీ అధినేత హెన్రీ ఫోర్డ్‌కి వాళ్ళనాన్న ఒక సైకిల్ కొనిపెట్టాడట. అదిచూసి ఫోర్డ్‌కి చాలా అనందం అయిపోయింది. పిల్లోడి కళ్ళల్లో మెరుపు చూసి తండ్రికి పరమానందం అయ్యింది. ఇచ్చినవాళ్ళకీ, పుచ్చుకొన్నవాళ్ళకీ తృప్తి కలిగించేదే అసలైన బహుమతి. ఒకాయన అంటాడు, `నువ్వు ఏమిటనేది దేవుడు నీకిచ్చిన బహుమతి, నువ్వు ఏమి అవుతావు అనేది నువ్వు దేవుడికి ఇచ్చే బహుమతి,` అని  అలాంటివి జీవితకాలంలో కొన్నిసార్లే ఇవ్వగలమేమో, లేదా తీసుకోగలమేమో!

ఫాధర్స్‌డేకి, టీచర్స్‌డేకి, పుట్టిన రోజుకి, పెళ్ళిరోజుకి... ఇలా ప్రతీ ముఖ్యమైన సందర్భంలోనూ మా చిన్న అమ్మాయి సుమిత్ర వర్షిత రఫ్‌నోట్‌బుక్ లోనుంచి చింపిన కాగితమ్మీద పెన్సిల్‌తోనో, పెన్‌తోనో, వాటర్‌కలర్స్‌తోనో తనకి నచ్చిన బొమ్మ గీసి, శుభాకాంక్షలతోపాటూ `ఐ లవ్ యూ డాడీ` అని రాసి ఇస్తుంది. ఇల్లు, కొండలు, చోటాభీం, ఫిష్, కార్.. ఇలా బొమ్మ ఏదయినా కావచ్చు, కాగితం అంచులు సరిగా ఉండక పోవచ్చు, రాసిన శుభాకాంక్షల్లో తప్పులుండవచ్చు.. కానీ, నా ఉద్దేశంలో అవన్నీ చాలా విలువైనవి. మనం తిరిగి ఇవ్వగలిగినవి ఏదయినా ఉందీ అంటే అది ఇచ్చినవాటిని సరిగ్గా తీసుకోవడమే! కళ్ళల్లో మెరుపులు దాచుకోకూడదు.

రేపు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ రోజు సరైన బహుమతికోసం వెతకడం మొదలు పెడతాం. లేదా ఒక్కోసారి అదేరోజు ఊరిమీద పడతాం. ఆలోచించే అంత సమయం దొరకదు. ఏదికొందామన్నా తృప్తి ఉండదు. సరిగ్గా అప్పుడు అనిపిస్తుంది, `ఎలాంటి బహుమతులు ఇవ్వాలనేది ఎవరైనా నాకు చెబితే బాగుణ్ణు` అని.

రేపు మా పెద్ద అమ్మాయి శ్రావ్యపూర్ణిమ బర్త్‌డే. ఊరంతా తిరిగాం మంచి గిఫ్ట్‌కోసం. ఇంటికి తిరిగి వచ్చాకా, `అమ్మా, బావజ్జీ(డాడీ) ఏమి కొన్నారు?` అని ఆతృతగా అడిగింది. `మంచివేమీ దొరకలేదు. హెయిర్ బ్యాండ్స్, నెయిల్ ఆర్ట్, చాకోలేట్స్.. లాంటివి అడిగావుకదా? ఇవిగో తెచ్చాం. కేకు ఆర్డర్ చేశాం. వాటితో సరిపెట్టుకో. సరేనా?` అన్నాం. మొహం చిన్నబోయింది. అంతలోనే సర్దుకొంది. `చాలా బాగున్నాయి,` అంది.  రెండుచేతులకీ హెన్నా డిజైన్స్ పెట్టించుకొని మా అమ్మాయిలు నిద్రకి ఉపక్రమించిన తరువాత  కారు డిక్కీలో వదిలేసిన గిఫ్ట్‌ప్యాక్ చేసి ఉన్న బాక్స్‌ని ఇంటిలోకి తీసుకొనివచ్చి పెట్టాం. బహుమతి చూసి శ్రావ్య ఏమంటుందో!

ఎవరో అంటారు, `గిఫ్ట్‌బాక్స్‌లో ఏముందో నాకుతెలియదు. కానీ అదంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఓపెన్ చెయ్యని వాటిల్లో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది,` అని.

© Dantuluri Kishore Varma 

Sunday, 8 September 2013

గోదావరి ఒడ్డున...

యానం గోదావరి ఒడ్డున, 
చల్లని గాలికి...
 ప్రపంచాన్ని మరచిపోయి..
 సంగీతసాధన చేస్తున్న..
 బుజ్జివినాయకుడు 
- మీకోసం.... 


*     *     *
గుండ్రం, గుండ్రం ఓ బుజ్జి బొజ్జ రమ్మని పిలిచింది
తమాషఅయినా ఓ చిన్ని తొండం హాయ్, హాయ్, హాయంది
మొత్తంగా చూపునిలిపి
చిత్రంగా చేయికలిపి
గణేషుగారికి దండం పెడదామా! 


పిల్లలకి, పెద్దలకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
© Dantuluri Kishore Varma 
Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!