Pages

Showing posts with label జ్ఞాపకాల దారుల్లో... Show all posts
Showing posts with label జ్ఞాపకాల దారుల్లో... Show all posts

Sunday, 16 November 2014

మిగిలిన కథలు..

దియేటరు దాటి కొంచం ముందుకు వెళ్ళగానే అప్పుడే చేసిన నేతి సున్నుండల వాసన వచ్చేది. "తాచుపాము ఉన్నచోట ఇలాంటి వాసన వస్తుంది," అని బండి వాడు చెప్పేవాడు. ఊరు నిద్రపోతుండగా రెండు సరిహద్దులకీ మధ్య ఉన్న కంకర గోతులు అనే ప్రదేశంలో ఉండే మర్రి చెట్టు దాటుకొని మావూరు తిరిగి వెళ్ళాలి. ఆ మర్రిచెట్టుమీద దెయ్యాలు ఉంటాయని చెప్పుకొనేవారు....

ఒక్కసారి రాసింది పదిసార్లు చదివినదానితో సమానం అంటారు. అలాగే ఒక్కసారి వివరించి చెబితే పదిసార్లు రాసినదానితో సమానం అన్న సత్యం నాకు ఇక్కడే తెలిసింది. ఒక డిబేట్ కోసం తయారయినప్పుడు విషయం మనకి మాత్రమే అర్ధమైతే సరిపోదు, దానిని ఎదుటి వాళ్ళు మెచ్చేలా చెప్పాలి - దీనినే  డ్రైవింగ్ ద పాయింట్ హోం అంటారు.

ముఖ్యంగా బ్యాటింగ్ మీదే కాన్సెంట్రేషన్ అంతా. ఎందుకంటే,  బౌలింగ్ అంత ఏమీ నేర్చుకోవలసిన విషయం కాదని గొప్ప నమ్మకం. ఫేస్ అంటే ఎంతవీలయితే అంత దూరం నుంచి పరిగెత్తుకొని వచ్చి వెయ్యడం. నీరసంవచ్చి దూరంపరిగెత్తలేనప్పుడు వేసిది స్పిన్- As simple as that!


ఒక్కో రోజు గోదావరి గట్టుమీద కూర్చుని బ్రిడ్జ్‌మీదనుంచి పోతున్న రైళ్ళని, వెలుగుతున్న విద్యుత్ లైట్లని, లంగరువేసి ఉన్న పడవల్నీ, ఊగుతున్న మర్రి చెట్టు ఆకుల్నీ, ఒడ్డుని తాకుతున్న అలల్నీ చూస్తూఉంటే గంటలు  నిమిషాలు అయ్యేవి.  మంచుకురుస్తున్నప్పుడు రోడ్డు వెంబడి నడవడం, ఎండ మండిపోతున్నప్పుడు చెట్టునీడల్లో సైకిలు మీద పెట్టి చీరికలుగా కోసి అమ్ముతున్న పుచ్చకాయ ముక్కలో, బొప్పాయి ముక్కలో తినడం, స్కూటర్‌మీద కొవ్వూరు వెళుతున్నప్పుడు గోదావరి బ్రిడ్జ్ దాటడం, పేపరుమిల్లు వైపు వెళ్ళే దారిలో పాతపుస్తకాల షాపు, దామెర్ల రామారావు ఆర్టు గేలరీ, లాలా చెరువు దగ్గర దాబాలో రోటి - దాల్ కాంబినేషన్.... రాజమండ్రీ అంటే పంచేద్రియాలూ ప్లస్ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతాయి.

పొయ్యిముందు కూర్చొన్న మనిషి చేస్తున్న పనిని చూస్తుంటే కుతూహలం పెరిగిపోయింది. దగ్గరకు వెళ్ళి నేను కూడా చేస్తానన్నాను.  `నువ్వు చెయ్యలేవు కానీ, కావాలంటే ఇది తిను,` అని కుండమీద అప్పుడే తీసిన రేకుని చేతిలో పెట్టారు. పలుచటి ఉల్లిపొరలా ఉంది. రుచి అమోఘం! అదిగో సరిగ్గా అప్పుడే ఆపదార్థంతో ప్రేమలో పడిపోయాను - ఇప్పటికీ హింకా.. తేరుకోలేదు.

ఎవరో పై కండువాగా వేసుకొనే తెల్ల తువ్వాలు చుట్టబెట్టి ధర్మయ్యకోసం బహుమానం తెచ్చారు. `ఇదిగోరా ధర్మయ్యా వొండించుకో, మంచి చేపలు,` అని మూటని వాడి చేతిలో పెట్టారు. ఏరకం చేపలో తెలుసుకోక పోతే వాడికి మనసు మనసులో ఉండదు. వెంటనే మూట ముడి విప్పాడు. లోపలినుంచి `బుస్` మంది. ఇంకేముంది, దాన్ని అక్కడే పారేసి పరుగో, పరుగు! 

ఇవన్నీ జ్ఞాపకాల తునకలు. మొదటినుంచీ ఈ బ్లాగ్‌లో రాసుకొంటూ వచ్చినవి. పూర్తి కథలు చదవాలనుకొంటే లింక్‌లు క్లిక్ చెయ్యండి. 

Dantuluri Kishore Varma

Friday, 14 November 2014

ఎంత ఎదిగినా మనలో చిన్నప్పటి మనం అలాగే ఉంటాం!

నిశ్చల తటాకంలో ప్రతిబింబించేలాంటి ముచ్చటైన జ్ఞాపకాలు 
జీవనదిలో అలల్లా తరంగితమయ్యే ఆహ్లాదకర జ్ఞాపకాలు
సముద్రంలో కెరటాల్లా విరిగిపడే ఉద్వేగపు జ్ఞాపకాలు
జలపాతంలో ఉరికురికిదూకే ధారల్లాంటి ఉన్మత్త జ్ఞాపకాలు... 
మీకున్నాయా?
నాకున్న కొన్ని జ్ఞాపకాలు, మీ జ్ఞాపకాల్లాంటివే అయ్యి వుండవచ్చు!  

  

 చిన్నప్పటి తీపిజ్ఞాపకాలు 
మన మదిలో మాటి మాటికీ మెదులుతూనే ఉంటాయి.
అవంటే మనందరికీ చెప్పలేనంత ఇష్టం
`నా చిన్నప్పుడేం జరిగిందో తెలుసా?` అని ఎవరైన చెప్పడం మొదలుపెడితే
చెవులప్పగించి వినని వాళ్ళు అరుదుగా ఉంటారు. 
`నాకూ ఇలాగే జరిగింది సుమా!` అని ఆశ్చర్యపోవడం కూడా సహజమే.
చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ రోజు వాళ్ళ, వాళ్ళ చిన్ననాటి ఫోటోలు 
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో పెట్టి చాలా మంది మురిసి పోయారు.
కొంతమంది ప్రత్యేకంగా వీడియోలు తీసి అప్‌లోడ్ చేశారు. 
ఎంత ఎదిగినా మనలో చిన్నప్పటి మనం  అలాగే ఉంటాం!

Dantuluri Kishore Varma

Monday, 16 June 2014

ఒక్కో పాటా ఒక్కో జ్ఞాపకం

దేవుడు ఒకపాత్రలో అమృతాన్నీ, మరొక పాత్రలో తేనెని నింపి గాయకుల కంఠాల్లో మొదటిదాన్ని, శ్రోతల చెవుల్లో రెండవదాన్నీ పోస్తాడేమో!  పూర్వజన్మ సుకృతం లేక గాయకులం కాలేక పోయాం అనే బాధ ఉన్నా, ఏదో అదృష్టం ఉండి వాళ్ళు పాడిన పాటల్ని విని ఆనందించ గలుగుతున్నాం అనే తృప్తి  ఉంది. నా చిన్నప్పుడు  బాలసుబ్రహ్మణ్యం పాడిన లింగాష్టకం `బ్రహ్మ మురారి సురార్చిత లింగం..` అని దూరంగా ఉన్న శివాలయంలోనుంచి వినిపిస్తుంటే ఏ ఆటల్లో ఉన్నా చెవులు మాత్రం ఆ గానామృతానికి ఫిదా అయిపోయి ఉండేవి. ఘంటశాల పాడిన `నమో వేంకటేశా, నమో తిరుమలేశా..` పాట మా వూరు టూరింగ్ టాకీస్‌లో ఆట మొదలవడానికి ముందూ, అయిపోయిన తరువాతా తప్పని సరిగా వేసేవారు. ఈ పాట ఇప్పుడు మళ్ళీ వింటున్నా మసక చీకట్లో సినిమా హాల్లో రేకు కుర్చీల మధ్యనుంచి బయటకు రావడం, హాలులో పరుచుకొన్న చుట్టా, సిగరెట్, బీడీ పొగలూ కూడా జ్ఞాపకానికి వస్తాయి. ఘంటశాలో, ఎస్పీబినో గురించి `ఎంతబాగా పాడుతున్నారో!` అనే మెచ్చుకోలు మాటలు అనుకోగలిగినంత స్పృహ అప్పుడు లేదు. కానీ, నచ్చేపాటలకు చెవులు అప్పగించెయ్యడం నాకు ఊహ తెలిసిన దగ్గరనుంచీ ఉంది. ఓ పాట ఎందుకు నచ్చేదో తెలియకుండానే మనసులో హత్తుకుపోయేది.  

నాకు ఊహతెలిసే సరికే మా యింటిలో ఒక రేడియో, ఒక గ్రాంఫోనూ ఉండేవి. అప్పట్లో మూగమనసులు సినిమాలో ముద్దబంతి పువ్వులో పాట, అనురాగ దేవత సినిమాలో చూసుకో పదిలంగా అనే పాట తెగ నచ్చేశాయి.  గ్రాంఫోన్‌లో మా పెదనన్న గారి అబ్బాయిలు ఎల్పీలు తెచ్చి ప్లే చేసేవారు. డబ్బై, ఎనభై దశకాల్లో వచ్చిన సినిమా పాటలు చెవులు హోరెత్తిపోయేదాకా వినేశాం.

తరువాత మా పెద్దన్నయ్య సోనీస్టీరియో కొన్నాడు. ఆడియో కేసెట్ల శకం మొదలయ్యింది. మంచిదో, చెడ్డదో తెలియ కుండానే రిలీజయిన ప్రతీ ఆడియో కేసెట్టూ మా యింటిలో ఉండేది. మళ్ళీ వాటిల్లో నచ్చిన పాటలు ఎంచుకొని నైంటీ, సిక్స్టీ కేసెట్లలో రికార్డింగ్ చేయించుకొనే వాళ్ళం. నాకు కొంచెం సంపాదన మొదలై, సొంత మ్యూజిక్ సిస్టం కొనుక్కొన్న తరువాత కేసెట్లకి, రికార్డింగులకి ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టానో లెక్క లేదు.  అప్పుడు కొన్న ఆడియో కేసెట్లు అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి అటక మీదకి ఎక్కించాం. నిన్న, మొన్నటి వరకూ అవి అలాగే ఉండేవి. తరువాత వాటిమీద బ్రాంతి వదిలి పెట్టేసి, బయట పారేశాను.    

విశ్వనాధ్ సినిమాల్లో పాటలు, బాలసుబ్రహ్మణ్యం పాత పాటలు, ఇళయరాజా, ఏ.ఆర్.రెహమాన్, జానకి, వేటూరి, ఆత్రేయ, సిరివెన్నెల, మణిరత్నం... పాటల కలెక్షన్లు..ఒక్కో పాటా ఒక్కో జ్ఞాపకం.  

ఈ రోజు రాగా.కాం వాళ్ళ సైట్‌లో తెలుగు పాటల వింటుంటే ఆ సంగతులన్నీ జ్ఞప్తికి వచ్చాయి. 

ఈ సైట్‌లో వెతికి వెతికి పాటలు వింటూ జ్ఞాపకాల అలల మీద అలా.. అలా... దాని ఫలితమే ఈ టపా!.   

© Dantuluri Kishore Varma 

Monday, 12 May 2014

పరుగులు తియ్యాలి గిత్తలు ఉరకలు వేయాలి

మైసూరులో సారవంతమైన భూములు విస్తారంగా ఉన్నాయి. కానీ, సాగుచెయ్యడానికి జనాలే తక్కువ. అందువల్ల ఆ భూములన్నీ పచ్చికమైదానాల కింద మిగిలిపోయాయి. ఇది ఎప్పటిమాటో. ఉత్తరాదినుంచి పశువులను తోలుకొని చాలా మంది ఈ పచ్చిక మైదానాల వైపు వచ్చేశారు. క్రమంగా బాగా బలసిన మేలుజాతి గిత్తలు, ఆవులకి మైసూరు ప్రసిద్ది చెందింది. ఒకజత మైసురు ఎడ్లు ఉంటే గొప్ప స్టేటస్ సింబల్‌గా భావించేవారు. వాటికోసం సుదూర ప్రాంతాలనుంచి కూడా ప్రజలు మైసూరు పశువుల సంతకు వెళ్ళేవారు. నలభై, యాభై ఏళ్ళ క్రితం మావూరునుంచి అప్పల్రాజుగారూ మరో నలుగురూ కలిసి మైసూరు వెళ్ళడానికి రైలు బండి ఎక్కారు. వెళ్ళడానికి, కొనడానికి ఎన్నిరోజులు పట్టిందో తెలియదు కానీ ఓ అరడజను జతల ఎడ్లను కొని గూడ్స్ వేగన్లో ఎక్కించి, వాటితో పాటూ వెళ్ళినవాళ్ళు కూడా ఎక్కేసి, రాజమండ్రీలో దిగారు. అక్కడనుంచి జగ్గంపేటవరకూ తోలించారు. అక్కడ ఒక మజిలీ. తరువాత జగ్గంపేటనుంచి ప్రత్తిపాడు దగ్గర ఉన్న మా వూరు రాచపల్లి వరకూ తోలుకొని రప్పించారు.   మా జత మైసూరు ఎడ్లను వదిలేసి మిగిలినవి ఎవరివి వాళ్ళు తీసుకొని పోయారు. 

వీధిచావిట్లో పందిరి గుంజ ప్రక్కనున్న గుబురు పుల్లమావిడిచెట్టు క్రింద  మైసూరు ఎడ్లను కట్టేస్తే, పచ్చగడ్డిని తాపీగా నెమరువేస్తూ రాజసంగా కూర్చొన్న వాటిని చూడడానికి ఊరిజనాలు తండోపతండాలుగా వచ్చారు. సూదిగా మెలితిరిగి ఉన్న కొమ్ముల దగ్గరనుంచి, కాలి గిట్టలవరకూ అణువణువునూ పరిశీలిస్తూ `మేలుజాతి ఎడ్లు` అని కితాబునిచ్చారు. చూసే వాళ్ళకి ఆనందం, వినేవాళ్ళకి పరమానందం!

ప్రయాణ బడలిక తీరిన తరువాత అలంకార పర్వం మొదలయ్యింది. గిత్తలకి కొత్తనాడాలు వేయించారు, కొమ్ముల్ని చెక్కించారు. కొమ్ముల్ని చెక్కడానికి నిపుణులు ఉండేవాళ్ళు. చెక్కకి చిత్రీ పట్టినట్టు చిన్న ఉలి తీసుకొని కొమ్ములమీద పై పొరని తొలగించేవారు. తరువాత ఎలిబూడిదని (అంటే కాలిన పిడకల నుంచి వచ్చినది) తీసుకొని వాటికి రుద్దే వారు. కొమ్ముల్ని రుద్దగా, రుద్దగా అవి ఏనుగు దంతాల్లా మెరిసేవి. అప్పుడు పాలిష్ పెట్టాలి. ఈ పనులన్ని చకచకా జరిగాయి. తళ తళా మెరుస్తున్న కొమ్ముల చివర ప్రత్యేకంగా తయారుచేయించిన ఇత్తడి తొడుగులు బిగింపించారు, వాటి కుదుళ్ళకి మువ్వలు కట్టారు. గిత్తలకి ముకుతాళ్ళు వేశారు, మెడలో గంటలు కట్టారు.     

ఈ పనులు ఓ వైపు జరుగుతుండగానే మోటబండి చక్రాలను, కాడినీ విప్పేశారు. చక్రాల చూట్టూ ఉన్న అరిగిపోయిన ఇనుప రింగుల్ని(ఇప్పుడు మన కార్లకి ఉండే టైర్లు ఎలాంటివో, అప్పటి బళ్లకు అవి అలాగ) తొలగించి కొత్తవి వేశారు. బండికి క్రింద తారు పూయించారు, పైన రంగులు వేయించారు. ఇరుసుకి క్రీజు పట్టించి, జనపనార చుట్టబెట్టి చక్రాలు బిగించారు, శీలలు తగిలించారు. కాడికూడా వేసేసరికి మరామత్తులు ముగిసి బండి తయారయ్యింది.

అలంకరించడం, బండికి కట్టితోలడం మాట అటుంచి వాటి తిండీ, సంరక్షణ ఖర్చుతో కూడుకొన్న పని.  ఉలవలు ఉడికించి, దానిలో తవుడు కలిపి దానా తయారు చెయ్యాలి. పచ్చగడ్డి, జనుమూ కోసుకొని వచ్చి ముక్కలుగా కత్తిరించి వాటికి వెయ్యాలి. బండి కట్టి సవారీకి రడీ చెయ్యాలి. తిరిగి వచ్చిన తరువాత బండివిప్పి, ఎడ్లను శుబ్రంగా తోమి మాలిష్ చెయ్యాలి. వాటిని కడిగి స్నానం చెయ్యించాలి. ఈ పనులన్నీ చెయ్యడానికి ఒక మనిషి నిరంతరం వాటిని కనిపెట్టుకొని వుండేవాడు.

కొత్త బండికి మైసూరు గిత్తల్ని కట్టి వాటి నుదుళ్ళకీ, బండికీ పసుపురాసి, కుంకుమ బొట్లు పెట్టి, కొబ్బరికాయ కొడితే ప్రయాణం మొదలయ్యింది. గేటు దాటి బండి పొలం వైపు పరుగులు పెట్టింది. ప్రతీరోజూ పొలానికి, అప్పుడప్పుడూ పట్నానికి.... అక్కడి నుంచి ఇంటికి.....  దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మల్లీశ్వరి సినిమాకి రాసినట్టు...

ఓ ఓ ఓ.. హేయ్... 
పరుగులు తియ్యాలి 
గిత్తలు ఉరకలు వేయాలి
హేయ్... బిరబిర చరచర పరుగున పరుగున
ఊరు చేరాలి మన ఊరు చేరాలి... ఓ...
హోరుగాలి కారుమబ్బులు
ముసిరేలోగా మూగేలోగా
ఊరు చేరాలి మన ఊరు చేరాలి
గలగల గలగల కొమ్ముల గజ్జెలు
ఘణఘణ ఘణఘణ మెళ్లో గంటలు
ఆ... గలగల గలగల 
కొమ్ముల గజ్జెలు
ఘణఘణ ఘణఘణ 
మెళ్లో గంటలు
వాగులు దాటి 
వంకలు దాటి
ఊరు చేరాలి 
మన ఊరు చేరాలి...

తరువాత కొంతకాలానికి దూపాడ ఎడ్లని మరొక జతని కొన్నారు. అవి పొట్టిగా ఉండేవి. వాటికోసం ఒక గుర్రబ్బండిని కొని, మరామత్తులు చేయ్యించారు. కాడిని వేయించి, బండిలోపల కుషన్లు కుట్టింపించారు. చక్రాల చుట్టూ ఇనుప రింగుకి బదులుగా రబ్బరు టైరు వేయించారు.  సవారీ బండి తయారయ్యింది. సినిమాలకి, పిక్‌నిక్‌లకి ఈ బండిమీదే ప్రయాణం.    
.... పరుగులు తియ్యాలి 
గిత్తలు ఉరకలు వేయాలి

ఆ... అవిగో అవిగో...
నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు
అవిగో అవిగో... అవిగో అవిగో

ఆ... పచ్చని తోటల విచ్చిన పూవులు
ఊగే గాలుల తూగే తీగలు... అవిగో...
కొమ్మల మోగే కోయిల జంటలు
ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు
అవిగో అవిగో... అవిగో అవిగో...

అర్థ శతాబ్ధం క్రితంవరకూ జీవనవిధానం మెల్లగా సాగే నదిలా ఉండేది. పెరిగిన సాంకేతికత, అభివృద్ది సాక్షిగ ఉప్పెనలా మార్పులు ఒక్కసారిగా ముంచెత్తుకొని  వచ్చాయి.  చదువులు, వుద్యోగాలు, పట్నవాసాలు, విదేశాలకు వలసలు..... కొన్ని విషయాలను జ్ఞాపకాలుగా మిగిల్చేశాయి. 
© Dantuluri Kishore Varma

Monday, 5 May 2014

ధర్మయ్యగాడి కోటు

నూనెరాసి నున్నగా దువ్విన పలుచని జుట్టు, నల్లగా నిగనిగ మని మెరుస్తున్న మెలిపెట్టిన మీసం, దరిదాపు మోకాళ్ళ వరకూ వచ్చేసిన కోటు, దానిమీద ఉత్తరీయం, కోటుఅడుగునుంచి మొకాళ్ళ దిగువవరకూ తెల్లపంచతో, కిర్రుచెప్పులు చప్పుడు చేసుకొంటూ మిగిలినవాళ్ళకంటే ఒక అడుగు ముందే చేరుకొన్నాడు పెళ్ళివాళ్ళ ఇంటికి ధర్మయ్య.  అసలుదివాణాలు వెనకాల బండిలో వస్తున్నారని ఏమితెలుసు పాపం అక్కడ ఉన్నవాళ్ళకి? ధర్మయ్యనే దివాణం అనుకొని, నడచి వచ్చినందుకు కొంచెం ఆశ్చర్యపోతూనే,`రండి, రండి దయచెయ్యండి,` అనేశారు. భుజమ్మీద ఉన్న కండువాతీసి చప్టామీదఉన్న దుమ్ముని దులుపుకొని చతికిలబడ్డాడు. కుర్చీలు ఉండగా అక్కడ ఎందుకు కూర్చున్నాడో తెలియక మళ్ళీ ఆశ్చర్యపోయారు! జట్కాబండి వచ్చి ఆగాకా, దానిలోనుంచి దిగిన దివాణం `వాడు మా చుట్టల ధర్మయ్య` అన్న విషయం చెప్పినతరువాత కానీ పెళ్ళివాళ్ళకి అసలు సంగతి అవగతమవ్వలేదు. అప్పటివరకూ ఎవరు ఎన్ని విధాల పలకరించడానికి ప్రయత్నించినా మీసం మెలేసుకొంటూ ఉండిపోయాడు కానీ నోరు విప్పలేదు, నేను పలానా అని చెప్పలేదు.     

ఎవరైనా వొదులుగా ఉన్న చొక్కానిగానీ, పొడవుగా ఉన్న కోటుకానీ వేసుకొన్నప్పుడు `ధర్మయ్యగాడి కోటులా ఉంది,` అనడం ఒక జాతీయంలా మా కుటుంబాలలో స్థిరపడిపోయింది. నేనుగానీ, నాకంటే ఓ పదిహేను, ఇరవై సంవత్సరాల పెద్దవాళ్ళలో ఎవరూగానీ ధర్మయ్యని చూడలేదు. కానీ - నాన్నగారు, పెదనాన్నలు, చిన్నాన్నలు.. ఇంకా మేనత్తల ద్వారా ధర్మయ్య కథలు చాలా విన్నాం.  

ఒకరోజు మిట్టమిడసరం సమయంలో వీధిచప్టామీద పొర్లుతూ, కడుపునొప్పని పెడబొబ్బలు పెడుతున్నాడట. నాలుగు ఇళ్ళనుంచీ జనాలు పరిగెత్తుకొని వచ్చారు. బాన కడుపు మీద చేతులతో రాసుకొంటూ తెగ అవస్థ పడుతుంటే, ఎవరో వామ్ము తెచ్చి నోటిలో పోశారు. ఓ అరగంటకి మనిషి స్థిమిత పడ్డాడు. అసలు జరిగిన విషయం ఏమిటంటే తాతయ్యగారి అయిదుగురి కొడుకులవీ ఇళ్ళన్నీ ఒకే వీధిలో ఉంటాయి. ఉదయం లేచిన వెంటనే ధర్మయ్య చేసే పని ఇంటింటికీ వెళ్ళి ఎవరింట్లో ఏమి కూరో బోగట్టా తెలుసుకోవడం. ఎక్కడ మంచి కూర ఉంటే ఆపూట అక్కడే వాడి భోజనం. సత్తింరాజుగారింటిలోనో, జగ్గరాజుగారింటిలోనో, వెంకటేసులురాజుగారింటిలోనో ఎవరికీ సరిగా జ్ఞాపకం లేదు కానీ, ఆరోజు చుట్టాలొస్తారని కబురందడంతో కోడిగుడ్లు కూర వండడం మొదలుపెట్టారు. పెద్దచావిట్లో పందిరికింద చుట్టలు చుడుతూ ఉండాల్సినవాడు ఆ పూట కమ్మటి కోడిగుడ్లకూర వాసన ఆస్వాదిస్తూ వాళ్ళ అరుగు మీద కూర్చొండిపోయాడు. రావలసిన చుట్టాలు రాలేదు. `వొండినియ్యి పడేసుకొంటారేంటండి, ఇలాగేసేయ్యండి,` అని ఒక్కొటీ వేయించుకొని అరడజను గుడ్లూ తినేసే సరికి, అవి అరక్క వీధి అరుగు మీద పొర్లుగింతలు పెట్టాల్సి వచ్చింది. `పొట్టకెంత పడుతుందో తెలుసుకోకుండా తినేశావంటే చచ్చి ఊరుకొంటావ్ వెధవకానా,` అని ఎవరో తిడితే, `చచ్చిపోతామని భయపడి తినడం మానేస్తే, ఇంక బ్రతకడం ఎందుకండీ,` అన్నాడట.  

ధర్మయ్య మా వూరికి ఎప్పుడు వచ్చాడో, ఎవరు తీసుకొని వచ్చారో తెలియదు. ఎక్కడో జగ్గంపేటలో ఓ కూతురు ఉండేదట. అప్పుడప్పుడు చూసి రావడం, మిగిలిన రోజులన్నీ మా లోగిళ్ళలోనే ఉండడం. వాడి ప్రధానమైన వ్యాపకం మేలురకం పుగాకుని ఎంచుకొని, ఈనెలుతీసి, కొడవలిలా వొంపుతిరిగి ఉన్న కత్తి వెనుక అంచుతో పొగాకుని కోసి, నీటుగా చుట్టలు చుట్టడం; తుపాకీలో వేసుకొనే పొడవు బుల్లెట్లతో పాటు వచ్చే మిలట్రీ పెట్టెలు అని ఉండేవి. కాళీ అయిన ఆ పెట్టెల్లో చుట్టిన చుట్టలన్నీ చక్కాగా సర్దేయడం; సాయంత్రం పెరుమాళ్ళ స్తంభం దగ్గర సంత ఉంటే వెళ్ళి ఎవరికి ఏది కావలిస్తే అది పట్టుకు రావడం. ఎవరైనా చేప తెమ్మన్నారంటే ఎగిరి గంతేసేవాడట. చేపల పులుసంటే పంచప్రాణాలు. `బేగా వొండండి, అంత ఆలిసం ఏమిటి,`అని కాలు కాలిన పిల్లిలా పదిసార్లు అటూ ఇటూ తిరిగేవాడట.  ధర్మయ్యకి దెయ్యం అంటే భయంలేదు. దొంగోళ్ళన్నా భయంలేదు. కానీ, పాము మాట చెపితే పై ప్రాణాలు పైనే ఎగిరి పోయేవి. చీకట్లో నడవాలంటే కిర్రుచెప్పులు లేకుండా అడుగు ముందుకు వేసేవాడుకాదు.  

ఎవరో పై కండువాగా వేసుకొనే తెల్ల తువ్వాలు చుట్టబెట్టి ధర్మయ్యకోసం బహుమానం తెచ్చారు. `ఇదిగోరా ధర్మయ్యా వొండించుకో, మంచి చేపలు,` అని మూటని వాడి చేతిలో పెట్టారు. ఏరకం చేపలో తెలుసుకోక పోతే వాడికి మనసు మనసులో ఉండదు. వెంటనే మూట ముడి విప్పాడు. లోపలినుంచి `బుస్` మంది. ఇంకేముంది, దాన్ని అక్కడే పారేసి పరుగో, పరుగు! మూటలో చుట్టబెట్టి తెచ్చిన బుడతపాము బెదిరిపోయి వాడి వెనకాలే పరిగెట్టడంతో  భరతనాట్యం అయిపోయింది అక్కడ.    

చుట్టల ధర్మయ్య ఎప్పుడుపుట్టాడో తెలియనట్టే, ఎప్పుడు పోయాడో కూడా ఎవరికి తెలియదు. వాడికథలు మాత్రం ఉన్నాయి.  ఆ  కబుర్లు ఎవరైనా చెపుతుంటే సన్నివేశాలన్నీ సినిమాలోలా కళ్ళముందు కదులుతాయి. 

© Dantuluri Kishore Varma

Thursday, 24 April 2014

పూతరేకులు

ఒకరోజు సాయంత్రం బడినుంచి ఇంటికివచ్చేసరికి పెరటిలో కనిపించిన హంగామా చూసి హాశ్చర్యపోయేశాను! మూడురాళ్ళ పెద్ద పొయ్యి, దానిమిద బోర్లించిన మట్టికుండ, కుండక్రింద పొయ్యిలో కణకణమని మండుతున్న పుల్లలు. ఏవో పిండివంటలు తయారవుతున్నాయని తెలుస్తుంది కానీ, అవేమిటో తెలియలేదు. పొయ్యిముందు కూర్చొన్న మనిషి చేస్తున్న పనిని చూస్తుంటే కుతూహలం పెరిగిపోయింది. దగ్గరకు వెళ్ళి నేను కూడా చేస్తానన్నాను. అప్పటికి నేను చాలా బచ్చాని కదా, అందుకే `నువ్వు చెయ్యలేవు కానీ, కావాలంటే ఇది తిను,` అని కుండమీద అప్పుడే తీసిన రేకుని చేతిలో పెట్టారు. పలుచటి ఉల్లిపొరలా ఉంది. రుచి అమోఘం! అదిగో సరిగ్గా అప్పుడే ఆపదార్థంతో ప్రేమలో పడిపోయాను - ఇప్పటికీ హింకా.. తేరుకోలేదు. సరే ఆ సంగతి అలా ప్రక్కన పెట్టండి. పూతరేకు రుచిలో పడిపోయి అక్కడ ఏమి జరుగుతుందో గమనించడం మరచిపోతామా ఏమిటీ!? 

పెద్దగంగాళాలో పలుచగా కలిపిన పిండినీళ్ళు ఉన్నాయి. వాటిలో తెల్లని చతురశ్రాకారపు గుడ్డని ఓ వైపు రెండుకొనలు పట్టుకొని ముంచి,  పిండినీళ్ళు కారుతూ ఉండగానే పొయ్యిమీద బోర్లించిన వేడి కుండమీద వేసి `సర్రు` మని లాగడమే.  అలా చేసీ, చెయ్యడంతోటే పూతరేకు అలా... వచ్చేసేది. దానిని జాగ్రత్తగా తీసి ఓ ప్రక్కన పెట్టేయడమే. అప్పుడు మళ్ళీ కుండమీద కొంచెం నూనె రాసి ఇంకొక రేకుని తీయ్యడం.  You see,  it looked sooo... easy to follow suit,  but too difficult to do. 

అప్పటికింకా పూతరేకులకి ఆత్రేయపురం ప్రశిద్ది అని తెలియదు. అసలు ఆ ఊరి పేరే వినలేదు. పూతరేకులంటే ఇంటిలో తయారు చేసేవే. ఇప్పటిలా అమ్మకానికి కూడా వచ్చేవికాదు. బాగా అనుభవమున్న ఎవరినో ఒప్పించి సంవత్సరానికి ఒకటి, రెండు సార్లు పూతరేకులు తీయించేవారు.

రేకులు విడిగా తినడానికి బాగానే ఉంటాయికానీ చుట్టలుగా చుడితే మరింత బాగుంటాయి. వాటిని ఎలా చేసేవారో తెలుసా? రెండు రేకులని తడిగుడ్డలో వేసి నొక్కి, వాటి బిరుసు తగ్గిన తరువాత కాసిన వేడి నెయ్యి వేసి, పంచదార పొడి జల్లి, మడత పెట్టి పూతచుట్టలు చుట్టేవారు. అసలు రుచి అంటే పంచదార చుట్టలది కాదు. బెల్లం చుట్టలది! ఎప్పుడైనా తిన్నారంటే... కమ్మని నేతి వాసన, తియ్యటి రుచి... అబ్బా... నా మాటనమ్మండి... మీరు వాటిని జన్మలో మరచిపోలేరు!

ఈ టపా రాయడం వెనుక ఉద్దేశ్యం మీ నోరూరించడం కాదండోయ్. ఒకవేళ.. బై ఎనీ చాన్స్... ఇప్పటివరకూ బెల్లం పూచుట్ట రుచి చూసి ఉండకపోతే... ఆలశ్యం చెయ్యకుండా.. ఆ పనిలో ఉంటారని. ఏమంటారు!?     

© Dantuluri Kishore Varma

Sunday, 13 October 2013

సినిమా వీధి

హంస పాలనీ, నీళ్ళనీ విడగొట్టగలిగినట్టు వీళ్ళు భక్తినీ, రక్తినీ విడగొట్టారు. ఎలాగా అంటారా? టౌన్‌లో మెయిన్ రోడ్‌కి సమాంతరంగా అటుఒకటి, ఇటుఒకటీ రోడ్లు ఉంటాయి. ఒకదానిలో ఈచివరినుంచి, ఆచివరివరకూ ఎన్నో దేవాలయాలు ఉంటాయి. అందుకే దాన్ని దేవాలయం వీధి అంటాం. ఇక రక్తి విషయానికి వస్తే - దానికి కూడా ఒక ప్రత్యేకమైన రోడ్డు వుంది. ఇంతకు ముందు చెప్పాను కదా రెండుసమాంతరమైన రోడ్ల గురించి? ఆ రెండవదే జనాలకి వినోదం కలిగించేది. పేరు సినిమా వీధి. ఒకటి, రెండు సినిమా హాళ్ళు మినహా మిగిలినవన్నీ ఇదే వీధిలో ఉండేవి. అప్పటికప్పుడు అనుకొని సినిమాకి బయలుదేరినా, వరసగా థియేటర్లన్నీ ఒక్కొక్కటీ చూసుకొంటూ వెళితే, ఎక్కడో ఒకచోట టిక్కెట్లు దొరికేవి. 

జగన్నాధపురం వంతెన దాటి కుడివైపుకి తిరిగి కొంచెం ముందుకి వెళితే ఎడమచేతివైపు వచ్చే పెద్దరోడ్డు సినిమా వీధి. విశాలమైన స్థలంలో కట్టిన పెద్ద హాలు స్వప్నా థియేటర్. ఇప్పుడు దాన్ని మూసేశారు కానీ, ముప్పై ఏళ్ళక్రితం టౌన్‌లో ఉండే రెండు, మూడు మంచివాటిల్లో ఇదొకటి. 1983లో సాగరసంగమం విడుదలయ్యింది. స్వప్నా థియేటర్‌లోనే చూశాను. బాల్కనీ టిక్కెట్టు నాలుగు రూపాయల యాభై పైసలు. ఇంటర్‌వెల్లో అమ్మే సాఫ్టీ ఐస్‌క్రీం చాలా బాగుండేది. ఎప్పుడు వెళ్ళినా తప్పనిసరిగా కొనుక్కోవలసిందే.   

సినిమా పేరు చెపితే ఎవరికైనా ఎన్నెన్నో జ్ఞాపకాలు ఉంటాయి. సత్యగౌరీ హాలులోకి ఎప్పుడూ ఇంగ్లీష్ సినిమాలు వచ్చేవి. చూడటానికి పాతరైస్‌మిల్లుని రీమోడల్ చేసినట్టు ఉంటుందికానీ సౌండ్ సిస్టం మాత్రం మరెక్కడాలేని లేటెస్ట్‌ది వీళ్ళు పెట్టేవారు. ఏ.సీ. హాలు కాకపోయినా సౌండ్‌క్వాలిటీ గురించే ఇక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ బ్లాక్‌లో టిక్కెట్లు దొరికే ప్రసక్తే లేదు. కౌంటర్ దగ్గర `మనిషికి ఒక్క టిక్కెట్టు మాత్రమే` అని బోర్డ్ పెట్టేవారు. చాలా కాలం నుంచి ఇక్కడికి వెళ్ళలేదు కానీ, ఇప్పటికి కూడా పరిస్తితి అలాగే ఉన్నట్టుంది. బ్రేక్‌లో అమ్మే పూరీ కూర చాలా బాగుంటుందని చెపుతారు(నేను తినలేదండి, ఎప్పుడూ...ప్చ్!). చార్లీ చాప్లిన్ సినిమాలు సిటీ లైట్స్, మోడ్రన్ టైంస్, ది కిడ్ లాంటివి వరుసగా వచ్చేవి. లారెల్ అండ్ హార్డీ, జేంస్‌బాండ్, జపనీస్ షావోలిన్ తరహా మార్షల్ ఆర్ట్స్ సినిమాలు చాలా ఇక్కడ చూసాను. 

సందర్భం వచ్చింది కనుక ఇంటర్‌వెల్‌లో మేతగురించి ఇంకొక్కవిషయం చెప్పాలి. అన్ని సినిమా హాళ్ళలోనూ తప్పనిసరిగా ఉల్లిపొకోడీ, ఉల్లిసమోసాలు అమ్మేవారు. వాటి వాసన అమోఘం. చేతినిండా ఆయిల్ అంటుకొన్నా, పెద్ద వాళ్ళు తినొద్దని తిట్టినా- కొనమని అడగకుండా, తినకుండా ఉండలేకపోయేవాళ్ళం.  

విజయా, పేలెస్, క్రౌన్, మెజస్టిక్, వేంకటేశ్వరా, కల్పనా లాంటి సినిమాహాళ్ళు మూతపడ్డాయి. అయినప్పటికీ ఒకటిరెండు జంక్షన్లని మాత్రం మెజస్టిక్ వీధి అనీ, కల్పనా సెంటర్ అనీ ఇప్పటికీ పిలుచుకొంటున్నాం. పేలెస్, పద్మనాభా వాళ్ళు చాలా మటుకు పెద్దలకు మాత్రమే తరహా సినిమాలు ఆడించేవారు. కాలేజిలో చదువుకొన్నప్పుడు మా క్లాస్ మేట్ ఒకడు, హాస్టల్‌లో ఉండేవాడు. కాకినాడలో ఏ ప్రాంతమూ సరిగ్గా తెలీదు వాడికి ఒక్క దారి తప్ప - పేలెస్ థియేటర్‌నుంచి హాస్టల్‌కి వెళ్ళేది. అందరం ఆటపట్టించేవాళ్ళం వాడిని `ఎప్పుడైనా దారి తప్పిపోతే, పేలెస్‌కి ఎలా వెళ్ళాలో అడుగు, అక్కడినుంచి నీకు ఎలాగూ తెలుసు కదా,` అని.
  
దేవీ శ్రీదేవి, చాణుక్య చంద్రగుప్తా మాత్రమే ట్విన్‌థియేటర్లు. కొత్తసినిమాలు వచ్చేవి. సినిమా వీధిలో చాణుక్య చంద్రగుప్త దాటిన తరువాత మరేమీ లేవు. ఓవర్ బ్రిడ్జ్ దాటిన తరువాత ఆనంద్, పద్మప్రియా ఉండేవి. వాటికి వెళ్ళాలంటే ఊరిచివరకు వెళ్ళినట్టే. 

ఆనంద్‌కి ఎదురుగా ఖాళీ స్థలం ఉండేది. అక్కడ ఎవరో సైకిల్ స్టాండ్ పెట్టారు. సినిమాకి వచ్చిన వాళ్ళు థియేటర్‌లో పార్క్ చెయ్యడం మానేసి, బయటివాళ్ళు ఎవరో నిర్వహిస్తున్న ఈ స్టాండ్లో  చేసేవారు. దానితో, ఆనంద్‌స్టాండ్‌లో పార్క్ చేస్తే కౌంటర్ దగ్గరకి వెళ్ళక్కర్లేకుండానే టిక్కేట్లు ఇచ్చేవారు. కొత్తసినిమా వచ్చినప్పుడు బండి ఇక్కడ పార్క్ చెయ్యగలిగితే టిక్కెట్ రిజర్వ్‌చేసుకొన్నట్టే. ఒక్కోసారి సైకిళ్ళు లేనివాళ్ళు అద్దె సైకిల్ షాపునుంచి తీసుకొని స్టాండ్‌లో పార్క్‌చేసి టిక్కేట్లు సంపాదించేవారు. 

ఆనంద్‌కి ప్రక్కనే వాళ్ళదే గీత్‌సంగీత్, అంజనీ, కరణంగారి జంక్షన్ దగ్గర వీర్‌కమల్, తూరంగిలో సూర్యామహల్, వంతెనదగ్గర చంద్రికా, మెయిన్‌రోడ్లో తిరుమలా, మెజస్టిక్ దగ్గర మయూరీ, పద్మప్రియాకి చేర్చి శ్రీప్రియా లాంటి హాళ్ళు క్రమంగా వెలిశాయి. కొన్ని మల్టీప్లెక్స్‌లు గా రూపాంతరం చెందాయి.

ఈ బ్లాగ్ చదువుతున్నవాళ్ళలో ఎంతోమంది సొంతవూరికి చాలా దూరంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. నాస్టాల్జిక్‌గా దీనికి కనెక్ట్ అవడానికి, మధురస్మృతులని మళ్ళీ జ్ఞాపకం చేసుకోడనికీ ఈ టపా! చదువుతున్న మీరు కాకినాడ వాళ్ళు కాకపోయినా థియేటర్ల, ప్రాంతాల పేర్లు తప్పించి మీవూరి సినిమాహాళ్ళ చరిత్రకూడా ఇలాగే ఉండవచ్చు! 

మీ సినిమా కబుర్లని, జ్ఞాపకాలనీ కామెంట్లుగా పంచుకొంటే సంతోషిస్తాను.
© Dantuluri Kishore Varma 

Monday, 30 September 2013

పుల్ల ఐసు

టక్..టక్..టక్ మని చప్పుడు వినిపించిన వెంటనే ఇంటిలో ఏ మూలన ఉన్నా, ఏ ఆటలు ఆడుకొంటున్నా వేంటనే పెద్దవాళ్ళదగ్గరకి పరిగెత్తుకెళ్ళి, పది పైసలు తెచ్చుకొంటే చల్లని ఐసు కొనుక్కోవచ్చు. ఇరవై పైసలకైతే రెండు ఐసులు కలిపి గుండచేసి, ఐసుపుల్ల మధ్యలో పెట్టి, మైకా కాగితంతో గట్టిగా నొక్కితే, పుల్లకి గుచ్చిన బంతిలా తయారయ్యే ఐసు వచ్చేది. పీల్చి, పీల్చి తింటే తియ్యతియ్యని, చల్లచల్లని రసం గొంతుదిగడం... అహా!  

ఇప్పటికే మీకు అర్దమయ్యి ఉంటుంది. ఈ టకటకల చప్పుడు ఐసు బండి వాడు చేసేది. ఒక్కరోజు వాడు అమ్మే ఐసుకి టెంప్ట్ అయ్యామా, ఇక అంతే! ప్రతీరోజూ అదే టైముకి మన ఇంటిముందు మనం చెవులు మూసుకొన్నా వినిపించేలా చప్పుడు చేస్తాడు. `పాలాయిస్` అని కూడా అరుస్తాడు. అలా అంటే నోరూరుతుంది కదా మరి? ఎలా ఆగగలం? పెద్దవాళ్ళ దగ్గరకి వెళ్ళి డబ్బులు అడుగుతాం. `నిన్నే కదా తిన్నావ్. రోజూ తింటే జలుబుచేస్తుంది,` అని నిర్దాక్షిణ్యంగా మన అప్పీల్‌ని తిరస్కరిస్తారు. మనమీద జాలిచూపించే హ్యూమన్‌రైట్స్ కమీషన్‌కి - అంటే అత్తలో, తాతాలో, బామ్మలో అన్న మాట - మొరపెట్టుకొంటాం. చాలా సార్లు పని జరుగుతుంది. ఒక్కోసారి ఇలాంటి వ్యవహారాల్లో కలగజేసుకొని పిల్లల్ని చెడగొట్టవద్దని వాళ్ళకి వార్నింగ్‌వస్తే, ఇక మన పనిజరగదన్న మాట. అప్పుడు మనం ఘాట్టిగా పేచీ పెట్టాలి. అయితే పని అవుతుంది, లేకపోతే వీపు పగులుతుంది. 

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, పిల్లల్ని ఏడిపించడానికి పుట్టిన దుర్మార్గుడు ఐసుబండివాడు. మన చిన్నప్పుడు ఏదో అయిపోయిందిలే, ఏనీళ్ళతో చేశారో తెలియని ఐసులు తిన్నాం! మనపిల్లలకి అలాంటివి ఇప్పుడు పెద్దగా అందుబాటులో ఉండటం లేదు అని ఆనంద పడే లోగా....బయటనుంచి పాం..పాం అని బూరా చప్పుడు వినిపిస్తుంది. పిల్లలు టెన్ రూపీస్ కోసం చేతులు చాపుకొని పరిగెత్తుకొని వస్తారు. పాం,పాంలు ఆలా))లా))లా.. వినిపిస్తూనే వుంటాయి. కంపెనీ ఐస్‌కేండీ బండి వాడు వెయిటింగ్! 
     
     
 © Dantuluri Kishore Varma 

Friday, 30 August 2013

మీరెప్పుడైనా లాంచీ మీద గోదావరి దాటారా?

కోనసీమ ప్రాంతం మూడువైపుల గోదావరితో, ఒకవైపు సముద్రంతో ఉంటుంది. తూర్పుగోదావరిజిల్లాలో మిగిలిన ప్రాంతంతో రోడ్డుద్వారా అనుసంధానం కావడానికి గోదావరి నదిమీద వంతెనలు ఉండాలి. ఒకటి రావుల పాలెం దగ్గర ఉంది. రెండవది యానం నుంచి, ఎదుర్లంకకి గోదావరిమీద 1.80కిలోమీటర్ల పొడవైన వంతెన. ఈ వంతెన  జిల్లాకేంద్రమైన కాకినాడనుంచి, కోనసీమలో అమలాపురానికి 70 కిలోమీటర్ల వరకూ దూరాన్ని తగ్గించింది.

12వ, 13వ లోక్‌సభ స్పీకర్‌గా సేవలు అందించిన జి.ఎం.సీ బాలయోగి ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి చాలా పాటుపడ్డారు. కానీ, నిర్మాణం పూర్తికాకుండానే హెలీకాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. నూటపదికోట్లవ్యయంతో, కేవలం 33 నెలల సమయంలో నవయుగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళచే 2002లో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తిచెయ్యబడింది. బాలయోగి కృషికి గుర్తింపుగా దీనికి జి.ఎం.సీ బాలయోగి వారధి అని నామకరణం చేశారు.

బాలయోగి వారధి నిర్మించడానికి ముందు కాకినాడనుంచి, అమలాపురం వెళ్ళాలంటే రెండు మార్గాలుండేవి. ఒకటి రోడ్డుమార్గం ద్వారా రావులపాలెం వంతెన మీదనుంచి. రెండవది యానంవరకూ రోడ్డుద్వారా వెళ్ళి, అక్కడినుంచి గోదావరి అవతల ఉన్న ఎదుర్లంకకి లాంచీ లేదా పంటు మీది ప్రయాణం చేసి, ఎదుర్లంక నుంచి మళ్ళి రోడ్డు మార్గం ద్వారా అమలాపురం వెళ్ళడం. ఈ రెండవ ప్రయాణ మార్గంలో కేవలం బైకులు, కార్లూ వరకే లాంచీ ద్వారా నదిదాటగలవు కానీ లారీలు, బస్సులవంటి పెద్దవాహనాలకి ఆ అవకాశం లేదు.

(P.S: "కాకినాడనుంచి, అమలాపురం వెళ్ళాలంటే రెండు మార్గాలుండేవి."  ఇంకో మార్గం కూడా ఉండేది. కాకినాడనుండి దక్షారామం మీదుగా కోటిపల్లి, అక్కడ గోదావరి పడవలోనూ లేక వరదల టైములో లాంచీ లమీదా దాటి, ముక్తేశ్వరమూ, అక్కడనుంచి అమలాపురం -ఫణిబాబుగారూ మీ సవరణకి ధన్యవాదాలు.) 
యానం రేవు 
గోదావరికి వరదనీరు వచ్చిన సమయంలో నది దాటడం చాలా కష్టం అయ్యేది. కోనసీమనుంచి కొబ్బరి, అరటి, వరిలాంటి వ్యవసాయ ఉత్పత్తులు; చెరువుల్లో పండించే రొయ్యలు, చేపలు లాంటి మత్యసంపద; పారిశ్రామిక ఉత్పత్తులు, భవన నిర్మాణానికి కావలసిన మెటీరియల్ మొదలైనవి కేంద్రపాలిత ప్రాంతమైన యానానికి కానీ, జిల్లా కేంద్రమైన కాకినాడకి కానీ; లేదా ఇటునుంచి కోనసీమకి కానీ తరలించాలంటే లారీలమీద చుట్టూతిరిగి వెళ్ళవలసిన పరిస్థితి.
ఎదుర్లంక గోదావరి గట్టు. కొబ్బరి మొక్కలమధ్య కనిపిస్తున్నది దుర్గా దేవి గుడి.
కాకపోతే, లాంచీ మీద ప్రయాణం మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉండేది. బైకులు, కార్లు, మనుషులతో కిక్కిరిసిపోయి; ఒక్కొక్కసారి మేకలు, గేదెలు, కోళ్ళు లాంటి సహప్రయాణీకులతో; అందరూచేసే రణగొణధ్వనితో, లాంచి ఇంజను శబ్ధం కలసిపోయి డు..డు..డు..మని వెళుతుంటే, వీటన్నింటినీ మరచిపోయేలా చేసే చల్లని గోదావరి గాలి. అభివృద్ది, సౌకర్యం లాంటివి ఎన్ని కల్పించినా ఈ బ్రిడ్జి లాంచీ అనే వాస్తవాన్ని మింగేసి, జ్ఞాపకాన్ని మాత్రం మిగిల్చింది.
 బై ద వే, మీరెప్పుడైనా లాంచీ మీద గోదావరి దాటారా?    
© Dantuluri Kishore Varma 

Tuesday, 30 July 2013

First showers, fresh flowers and many more!

A hundred sweet memories wisp in front of my eyes like traces of smoke emanate from a bunch of lighted incense sticks as I think of the smells from my childhood. Which thread should I hold first to go back and begin the story?
Well, let me begin from the beginning. My mother is an expert in cooking. In our childhood we subscribed to a popular weekly, in which a column devoted to food recipes was her favourite. She used to cut  out the articles and paste them in a separate book. Every now and then she would try experimenting on one of those recipes. She must have cooked like that a hundred things but the memory of only a particular one still remains fresh in my mind. It was halwa made of papaya. While she was preparing it with grated papaya fruit, sugar, fresh ghee, cardamom and cashew nuts an irresistible sweet smell would come out and we could not control ourselves until it was made. Sniffing appreciatively and drooling we used to go to her with stretched hands. Smiling, she would put it little by little in our tiny palms and we quickly blew it ufff....ufff....to eat it fast.  

We lived in a small village. We did not have tar roads. When the route bus went  along the village dusty road a cloud of fine dust mixed with diesel smoke would rise behind it.  I liked the smell of this smoke. If I happened to be going to school at the time of a bus` going I used to run behind it as far as I could just to get as much of this smell as I was able to . In one such occasion my father caught hold of me and told me that it was not good.

Sometimes, at nights a camp fire would be lit with dry Palmyra leaves and twigs  in the open space in front of our village house. Cousins, uncles, friends and womenfolk from the house... all used to gather around it. It was not a camp fire alone. There might be ground nuts, cashew nuts, palmyra tubers under the flames giving out sweet smell as they were getting done. Those were such sweet days!

Talking about this, I can recall a hundred more memories of smell of fresh pages of a new book,  of wet sand during first showers, of coffee and jasmine flowers ............ ohhhhhhhhhhhh stop me! Or else you have to read it on and on until the week end.
© Dantuluri Kishore Varma

Tuesday, 16 July 2013

చిన్నప్పటి కథలు

చిన్నప్పుడు విన్న, చదివిన కథలు జ్ఞాపకం ఉన్నాయా?

16వ శతాబ్ధంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన విజయనగర సామ్రాజ్యపు అధినేత శ్రీకృష్ణదేవరాయలు పండితుడు, కవి. ఈయన ఆస్థానంలో ఎనిమిదిమంది మహా కవులు ఉండేవారు. వీరిని అష్టధిగ్గజాలు అనేవారు. ఈ కవుల సభకి భువనవిజయం అని పేరు. తెనాలి రామకృష్ణుడు అష్టధిగ్గజకవులలో ఒకడు. ఇతనికి వికటకవి అని మరొక పేరు కూడా ఉంది. వికటకవి అంటే నవ్వుపుట్టించేకవి అని అర్థం. శ్రీకృష్ణదేవరాయలు, తెనాలిరామకృష్ణుడు మధ్య ఎన్నో సన్నివేశాలు, చమత్కారమైన విషయాలు, చిక్కుముడుల పరిష్కారాలు, చతుర సంభాషణలు మొదలైనవి కథలుగా ప్రాచుర్యంలో ఉన్నాయి. తెనాలిరామలింగడి హాస్యం, (You Tube link) చమత్కరాలు ఎంతగా చక్కిలిగింతలు పెట్టేవో జ్ఞాపకం ఉందా?

అలాగే పంచతంత్రం కథలు -

పూర్వం మహిలారోప్యం అనే దేశంలో అమర్ శక్తి అనే రాజు ఉండేవాడు. ఇతను చాలా పరాక్రమవంతుడు, సకలశాస్త్ర పారంగతుడు. ఇతనికి వాసు శక్తి, ఊగ్ర శక్తి, అనేక శక్తి అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. పండిత పుత్రులు పరమశుంఠలు అన్నట్టు, వీళ్ళు బుద్ధి హీనులు. అమరశక్తి తరువాత రాజ్యం పరిపాలించడానికి కావలసిన తెలివి ఏమాత్రంలేని కుమారులని చూసి రాజు చాలా దిగులు పడ్డాడు. మన పురాతనమైన శాస్త్రాలు చదివిస్తే ఉపయోగం ఉండవచ్చు, కానీ అలా చెయ్యడానికి చాలా సంవత్సరాల సమయం కావాలి. మంత్రులు విష్ణుశర్మ అనే ఒక వృద్ద పండితుని పేరుని రాజుకి సూచిస్తారు. అతను రాజకుమారులకి విజ్ఞానాన్ని అందిచ గలడని చెపుతారు. రాజు ఆ బాధ్యతని విష్ణుశర్మకి ఆనందంగా అప్పగిస్తాడు. విష్ణుశర్మ, విజ్ఞానాన్ని కథలరూపంలో రాజకుమారులకి అందించడానికి ఐదు భాగాల  పంచతంత్రంగా కూర్చి, కేవలం ఆరు నెలల సమయంలో రాజకుమారులను విజ్ఞానవంతులని చేస్తాడు. జంతువులు, పక్షులు, మనుషులు ప్రధాన పాత్రలుగా ఉండే ఆ కథలు చాలా బాగుంటాయి. 

ఇక చందమామ మాసపత్రిక -

పురాణాల కథలు,  బేతాళుడు - విక్రమార్కుడు, మంచి దెయ్యాల కథలు, చిలిపి దెయ్యాల అల్లరి, రామయ్యా - సోమయ్యలు; జానపద కథల్లో రాజులు, మాంత్రికులు, రాజకుమార్తెలు, పేదరాసిపెద్దమ్మ... ఇంకా ఎన్నో చందమామల్లో చదివి పెరిగి పెద్దయిన మనం  ఆ చిన్న మాసపత్రికని, అందులో కథలకు వేసిన బొమ్మల్ని మరచిపోలేం.




© Dantuluri Kishore Varma

Saturday, 30 March 2013

మనసు రాజమందిరం ఐపోతుంది

రిఫ్రిజిరేటర్ అనే మాట ఎవ్వరికీ తెలియని రోజులవి. పల్లపు వీధివాళ్ళు నలుగురైదుగురు కలిసి ఐస్ ఫేక్టరీ పెట్టారు. ఫేక్టరీ అంటే అదేదో చాలా పెద్దదేమీ కాదు. గోలీ సోడాలూ, డ్రింకులూ చల్లబరచడానికి ఐసు దిమ్మలూ; ఊరూరూ సైకిలుమీద తిరిగి అమ్ముకొనే  పుల్లైసు బండివాళ్ళకి సరఫరా కోసం పాలైసు, ఆరెంజ్ ఐసు, కోలా ఐసు, మేంగో ఐసు లాంటివి తయారు చేసే ఒక చిన్న గదిలాంటి షాపు. ఈ ఫేక్టరీ పెట్టడంతో ఊరికి చాలా అభివృద్ది వచ్చినట్టైపోయింది. `మా వూళ్ళో ఐసు ఫేక్టరీ పెట్టారు తెలుసా!` లాంటి గర్వంతో కూడిన మాటలు కూడా కొంతమంది చెప్పుకొనేవారు.  చుట్టుప్రక్కల నాలుగైదు గ్రామాలకి ఇదొక్కటే మరి. ఎండలు మండిపోతున్న సమయంలో ఇది అందుబాటులో ఉండడం ఒక రకంగా అదృష్టమే! మిట్టమిడసరం పెద్దవాళ్ళు అందరూ పడుకొన్న తరువాత పదిపైసలు చేతిలో పట్టుకొని ఒక్క పరుగు తీస్తే, ఎండ నెత్తిమీద `సుర్రు`మనిపించే లోగా ఐసు ఫేక్టరీ దగ్గరకు చేరిపోయే వాళ్ళం. పుల్ల ఐసు చల్లదనం, రుచీ మధురం.

మావిడిపళ్ళు సమృద్దిగా ఉండేవేమో, `చక్కగా నాలుగు పళ్ళు తీసుకొని తినండిరా,` అని పెద్దవాళ్ళు మొత్తుకొనేవారు. తిని,తిని మొహంమొత్తి ఉన్న పిల్లలకి అవి అప్రియమైన మాటల్లా ఉండేవి. బాగా ముగ్గిన పాపారాజు గోవా పళ్ళ నుంచి రసం పిండి పెద్ద పెద్ద గాజు సీసాలలోకి నింపి, ఐసు ఫేక్టరీకి ఉదయాన్నే పంపేవారు. మద్యాహ్నం ఐసులుకోసం వెళ్ళినప్పుడు వాటిని జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకొని ఇంటిల్లపాదీ లోటా గ్లాసుల్లో నింపుకొని, ఒక్కో గుటకా మ్రింగుతుంటే........ ఆహా! 

కొన్ని జ్ఞాపకాలు ఎన్నేళ్ళయినా అలా నిలిచిపోతాయి. 

సాయంత్రం పూట పొలానికి వెళ్ళిపోతే పాలికాపుని అప్పటికప్పుడు చెట్టెక్కించి ముంజికాయలు దింపించేవారు. ఒక్కో గెలనుంచీ కాయలు నరికి, ముంజులు కనిపించే వరకూ ముచ్చిక కోసి ఇస్తే - బొటన వేలు గుచ్చి తియ్యని రసాన్నీ, ముంజునీ అస్వాదిస్తూ తింటుంటే....

రోడ్డు ప్రక్కన బండిమీద జాడీలో పెరుగు, పంచదార, ఐసు వేసి కవ్వంతో చిలికి, గ్లాసులో వేసి, పైన స్పూనుతో కొంచం మీగడ వేసి అందించిన లస్సీ గొంతుక దిగుతుంటే....

పుచ్చకాయ ముక్కలు, బొప్పాయి చీరికలు, కొబ్బరి బొండంలో చల్లని నీళ్ళు........
వేపచెట్ల చల్లని నీడ, గోదావరి మీదనుంచి వచ్చే గాలి తెమ్మెర, ఆరుబయట వెన్నెట్లో మడతమంచం మీద వెల్లకిలా పడుకొన్నప్పుడు కనిపించే చలువబంతి లాంటి చందమామ....

అన్నింటి కంటే ముఖ్యంగా శెలవులు, కజిన్స్‌తో ఆటలు, బోది కాలువల్లో, పంపుషేడ్డుల దగ్గర స్నానాలు....

వేసవి అంటే ఉక్కబోత, కరెంట్ కట్, కణకణ మండే ఎండలే కాదు. వాటితో పాటూ పైవన్నీ తీసుకొని వచ్చే అమృతకాలం. ఇవన్నీ గుర్తుకు వస్తే ఎప్పుడైనా సరే మనసు రాజమందిరం అయిపోదూ?

© Dantuluri Kishore Varma 

Tuesday, 19 March 2013

ఇల్లాజికల్ లాజిక్

పెంపుడు జంతువుల మీద చాలా ప్రేమ పెంచుకొంటాం. మనల్ని గుర్తుపడతాయని, మన సూచనల్ని పాటిస్తాయని, మనం కనిపించినపుడు చెప్పలేనంత సంతోషాన్ని వాటికి చేతనైనంత మేర వ్యక్తీకరిస్తాయని.  మనుష్యులని ప్రభావితం చెయ్యగల లక్షణాన్ని కుక్కలనుంచి నేర్చుచుకోవాలని డేల్ కార్నగీ అంటాడు. యజమాని బయటకు వెళ్ళి, తిరిగి వస్తున్నప్పుడు ఎదురెళ్ళి తోకఊపుతూ, గెంతుతూ, వీలయితే ముందరి రెండు కాళ్ళనీ పైన వేసి ఆనందంగా స్వాగతం చెప్పే టామీ మీద ప్రేమలేని వ్యక్తి ఎవరుంటారు? నా చిన్నప్పుడు మా యింటిలో ఒక గిత్త ఉండేది. దానికి మా పెదనాన్నగారు త్యాగరాజు అని పేరు పెట్టారు. ఉదయం, మధ్యాహ్నం టీ తాగుతున్నప్పుడు, `త్యాగరాజూ...`అని పిలిచి ఒక పాత్రలో దానికి కూడా టీ వేసి ఇచ్చేవారు. టీ అంటే దానికి ప్రాణం. పరుగులు పెట్టి వచ్చేసేది. 

ఈ రోజే ఈనాడు పేపర్లో న్యూస్ ఐటం ఒకటి చూశాను. గుడిలోనికి వెళ్ళబోతున్న త్రాచుపాముని చూసి అక్కడి పెంపుడుకుక్క అడ్డుకొందట. వాటి మధ్య కొంతసేపు భీకర పోరాటం జరిగింది. చివరికి కుక్క పాముని చంపి విజయం సాధించిందట. కానీ ఏమి లాభం? పాము కాట్లకి అది కూడా కొన్ని క్షణాలలో ప్రాణాలు విడిచింది. విశ్వాస పాత్రతకి పెట్టింది పేరయిన పెంపుడు జంతువులమీద మమకారం ఉండడం తార్కికమైన విషయమే. కానీ, ఉపయోగిస్తున్న వాహనాల మీద ఎటాచ్‌మెంటు ఎందుకుండాలండీ అసలు!?   

1994లో ఒక బజాజ్ కబ్ స్కూటర్ కొనుక్కొన్నాను. కాకినాడలో, అమలాపురంలో, రాజమండ్రీలో, విశాఖపట్టణంలో  ఉద్యోగరీత్యా తిరుగుతున్నప్పుడు చాలా దూరప్రాంతాలు వెళ్ళవలసి వచ్చేది. సాయంత్రం ఐదు, ఆరు గంటలకి వైజాగ్‌లో బయలుదేరితే సగం రాత్రికి కాకినాడ చేరుకొనేవాడిని. ఒక్కో సారి మార్గమధ్యంలో ప్యాచీలు పడడం, చెడిపోవడం జరిగేది. కానీ, మెకానిక్ షెడ్ చాలా దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే! రిజర్వులోకి వచ్చిందని తెలుసుకోకుండా పెట్రోలు కొట్టించడం అశ్రద్ద చేసినప్పుడు, ఆగిపోవడం కూడా బంకుకి నాలుగడుగుల దూరంలోనే జరిగేది. నా కబ్ నన్నెప్పుడు పట్టుమని పది అడుగులు నడిపించలేదు.  ఒకసారి డిసెంబర్ 31 రాత్రి ఫ్యామిలీ నలుగురం బండిమీద వస్తున్నాం. బైకుమీద త్రిబుల్స్‌గా వెనుకనుంచి వేగంగా వచ్చి మమ్మల్ని డీకొట్టారు. కుడిచేతివైపు నేలకి గుద్దుకొన్నాం. కాళ్ళూ, చేతులూ విరగడమో, గాయాలవడమో కావాలి. కానీ, అదృష్ఠవశాత్తూ అందరం క్షేమంగా ఉన్నాం.

ఇప్పటికీ అదే బండిని వాడుతున్నాను. కండీషన్లో ఉంది, మంచి మైలేజ్ ఇస్తుంది. చూసిన పరిచయస్తులు అడుగుతుంటారు, `ఇంకా ఇదే వాడుతున్నారా! బండి మార్చేయవచ్చు కదా?` అని. దాన్ని అమ్మితే బాధ కలుగుతుంది. మరి అలాంటప్పుడు ఎందుకు మార్చాలి.  ఆ మధ్యన తెలిసున్నాయన తనకారు అమ్మేస్తున్నారని తెలిసి, కొన్నాను. నాకు కారుని అప్పజెపుతున్నప్పుడు, ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. `సర్వీసింగ్ చేయించండి, ఇంజనాయిల్, బ్రేకాయిల్, కూలెంట్లు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి, కారుని ఎండలో వదిలేయవద్దు, రాత్రుళ్ళు కవర్ కప్పండి...,` అని అప్పగింతలు పెట్టారు. చాలా కాలం వాడిన కారుని ఇంకొకరికి ఇచ్చెయ్యడం ఎంత బాధాకరమో ఆయన్ని చూస్తే తెలిసింది. `ప్రాణం లేని వస్తువులకి కూడా సెంటిమెంట్లు ఆపాదిస్తారా? అవేమయినా మనల్ని అర్ధం చేసుకొంటాయా, ఏమిటి? నాన్సెన్స్!` అంటారా? మీ ఇష్టం అలాగే అనుకోండి. ఇది ఇల్లాజికల్ లాజిక్!

© Dantuluri Kishore Varma 

Monday, 11 March 2013

రాజమండ్రీ

రాజమండ్రీలో కోటిపల్లి బస్టాండు దాటిన తరువాత రైల్వేస్టేషన్‌కి వెళ్ళే దారిలో ఎడమవైపు సందులో పాత ఇల్లు ఒకటి ఉండేది. ఆ ఇంటి డాబామీద  ఒక చిన్నగది. ఏ ఫైవ్‌స్టార్ హోటల్ రూంకీ లేని ప్రత్యేకత దానికి ఉండేది. సాయంత్రం అయ్యేసరికి చల్లగా వీచే గోదావరి గాలి, రాత్రి అయ్యేసరికి చంద్రుడు ఉండే రోజుల్లో అయితే పుచ్చపువ్వులాంటి వెన్నెల, లేని రోజుల్లో అయితే చిరుగులు పడిన నల్ల దుప్పటిలా ఆకాశమంతా నక్షత్రాల గుంపులు. ఆ గది ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, దానిలో కొంతకాలం నేను ఉన్నాను. మీరు అడగవచ్చు, `నువ్వు గాంధీవా? ఐన్‌స్టీనువా?? నువ్వుంటే ప్రత్యేకమైనది అయిపోవడానికి?` అని. మీగురించి కాదండీ, నాకు స్పెషల్ అని. 

నా రూమ్మేట్, మా కంపెనీలోనే పనిచేసే నా వయసు కుర్రోడే. అతనికి ఒక టేప్‌రికార్డర్ ఉండేది.  సోనీ సిక్స్‌టీ కేసెట్‌లో పన్నెండు నుంచి పద్నాలుగు పాటలు పట్టేవి. ఓ శెలవురోజు కేసెట్ రికార్డింగ్ సెంటరు దగ్గర ఓపికగా కూర్చుని అక్కడ ఉన్న లిస్టుల్లో వెతికి, వెతికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాత పాటలు అన్నీ ఒక కేసెట్లో చేయించాను. ఏ దివిలో విరిసిన పారిజాతమో, అభినవతారవో, మల్లెపువ్వు వాడిపోగ, నేనొక ప్రేమ పిపాసిని, మధుమాసవేళలో, అలివేణీ ఆణిముత్యమా, కలువకు చంద్రుడు ఎంతో దూరం, మామా చందమామ, మందారం ముద్దమందారం, పూచే పూలలోన, ఇదేపాట ప్రతీచోట... లాంటి పాటలన్నీ ఒకచోట చేర్చి నేను చెప్పిన డాబామీద కూర్చుని వింటే ఎలా ఉంటుందో ఊహించండి. బాలు గళానికి ఫిదా అయిపోయాం.
 సాయంత్రం ఆఫీసునుంచి వచ్చిన తరువాత పాటలు వింటూ కూర్చుంటే సమయం తెలిసేది కాదు. కడుపులో నకనకలాడుతుండగా కంగారుగా శ్రీనివాసు మెస్‌కి పరుగు పెట్టేవాళ్ళం. చామదుంపల పులుసుపెట్టి వండిన కూర అద్భుతంగా ఉండేది. నచ్చని కూర ఉంటే ఆమ్లెట్  వేసేవాడు. ఒక్కోసారి మేం వెళ్ళేసరికి అంతా అయిపోయేది. ఈసురో మంటూ శ్యామలా థియేటర్ వరకూ నడక - జెకే టిఫిన్ సెంటర్లో సాంబార్ ఇడ్లీ కోసం.
పలచబడిపోతున్న ట్రాఫిక్ చూసుకొంటూ కొన్నిసార్లు కోటగుమ్మంవరకూ పోయేవాళ్ళం. వేరే ఊళ్ళనుంచి షాపింగ్‌కి వచ్చినవాళ్ళు, రాజమండ్రీ వాస్తవ్యులు, రోడ్డుమీద సరుకులు పెట్టి అమ్మే వర్తకులు.. ఇరుకురోడ్లు ఎప్పుడో కానీ ఖాళీగా కనిపించవు. మణికంఠా పుస్తకాల షాపులో ఇంగ్లీష్ నావల్స్ దొరికేవి. ఆర్కే నారాయణ్ రాసిన పుస్తకాలు అరవై రూపాయలకి ఒకటి లభించేది. అదృష్ఠం బాగుండి షాపు తెరిచి ఉంటే ఓ వారానికి సరిపడే నావల్ దొరికినట్టే. అక్కడి నుంచి ఇంకొంచం ముందుకి వెళితే రాజమండ్రీకే ప్రత్యేకం సేమియా, రోజ్‌మిల్క్, కోవా అమ్మే షాపు ఉండేది. గ్లాసులో ఐసువేసి, పలుచగా ఉన్న కోవా నింపి పైన పొడవైన గ్లాస్ బాటిల్లోనుంచి కలర్ సిరప్ వొంపి, ఒక ప్లాస్టిక్ స్పూన్ గుచ్చి ఇస్తే - గుంపులు, గుంపులుగా నుంచుని జనాలు ఆరుచిని ఆస్వాదిస్తుంటే చూసే ఎవరికైనా నోరూరడం తద్యం. 
ఒక్కో రోజు గోదావరి గట్టుమీద కూర్చుని బ్రిడ్జ్‌మీదనుంచి పోతున్న రైళ్ళని, వెలుగుతున్న విద్యుత్ లైట్లని, లంగరువేసి ఉన్న పడవల్నీ, ఊగుతున్న మర్రి చెట్టు ఆకుల్నీ, ఒడ్డుని తాకుతున్న అలల్నీ చూస్తూ నిమిషాలు గంటలు అయ్యేవి.
మంచుకురుస్తున్నప్పుడు రోడ్డు వెంబడి నడవడం, ఎండ మండిపోతున్నప్పుడు చెట్టునీడల్లో సైకిలు మీద పెట్టి చీరికలుగా కోసి అమ్ముతున్న పుచ్చకాయ ముక్కలో, బొప్పాయి ముక్కలో తినడం, స్కూటర్‌మీద కొవ్వూరు వెళుతున్నప్పుడు గోదావరి బ్రిడ్జ్ దాటడం, పేపరుమిల్లు వైపు వెళ్ళే దారిలో పాతపుస్తకాల షాపు, దామెర్ల రామారావు ఆర్టు గేలరీ, లాలా చెరువు దగ్గర దాబాలో రోటి, దాల్ కాంబినేషన్.... రాజమండ్రీ అంటే పంచేద్రియాలూ ప్లస్ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతాయి.

© Dantuluri Kishore Varma 

Thursday, 31 January 2013

కాలం కమ్మగా సాగే పాట.

ఇరవై సంవత్సరాల క్రితం-

డిగ్రీ చివరి సంవత్సరం, చిట్టచివరి రోజు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది.

మూడేళ్ళు కలిసి తిరిగిన స్నేహితుల్ని ఆ తరువాతి రోజు నుంచి కలవలేం అనే బాధ గుండెల్లో గుచ్చేస్తుండగా ఆటోగ్రాఫ్ బుక్కులు పట్టుకొని కాలేజీకి వెళ్ళాం. పార్కింగ్ దగ్గర పెద్ద చప్టా, కాలేజ్ వెనుక నేలబారుగా కొమ్మలున్న మావిడి చెట్టు,  కేంటీన్, మిగిలిన ఫేవరెట్ హేంగౌట్స్, మనతో కలిసి క్లాసుకి బంక్ కొట్టి కేరింతలు కొట్టిన స్నేహితులు -  అన్నీ అలాగే ఉన్నాయి. మనసులోనే ఉత్సాహం లేదు.  

`మావా, ఆటోగ్రాఫ్ రా,` అంటే; `ఏడిశావులే, కాలేజీ వదిలేసినా ఊళ్ళోనే ఉంటాం కదరా?` అన్న బక్క దాసు తరువాత రైల్వేలో ఉద్యోగంవచ్చి, ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా ఎడ్రస్ తెలియకుండా పోయాడు.

`ఏరా అమ్మాయికి మేటరు చెప్పావా?` అంటే; మేం సత్తిబాబు అని పిలిచే సతీష్ మొహం చిన్నబుచ్చుకొన్నాడు. `పెళ్ళి కుదిరిందట. ఎగ్జాంస్ అన్నా రాస్తుందో, లేదో అనుమానమే! చీ ఎదవ జీవితం, టైమంతా మన మొహమాటంతోనే గడిచిపోయింది,` అని బోరుమని ఏడ్చేసిన సత్తిబాబుకి ఆతరువాత మేనమామ కూతురితో పెళ్ళయ్యి, ఇద్దరు పిల్లలు. ఇప్పుడు కాలేజీలో చదువుతున్నారు. 

`జీవితమంటే మెట్ల వరస. వాటిని జారుడు మెట్లుగా కాకుండా, విజయ సోపానాలుగా మార్చుకోవాలని కోరుకొంటున్నా`నని రాసిన లెక్చరర్ పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వీడియో సీను, ఇంకా కొంతమంది కష్టపడి అందరి ఫోన్ నెంబర్లూ సంపాదించి గెట్ టుగేదర్ ఏర్పాటు చేస్తే మళ్ళీ ఈ మధ్యనే కలిశాం. టైం మెషీన్‌లో వెనక్కి వెళ్ళిపోయినట్టు వెనక బెంచీలవాళ్ళు వెనక్కి చేరిపోయి గోల. బుద్ది మంతులు అప్పటిలాగానే ముందువరసలో కూర్చుని ఉపన్యాసాలన్నీ వినేశారు.  `ఆయమ్మాయి వొచ్చిందేమో!` అని ఆశగా వెతుక్కొన్నాడు పాపం సత్తిబాబు.

`మీ బ్యాచ్ మాకు బాగా గుర్తుండి పోయిందయ్యా,` అని అప్పటి మా లెక్చరర్లు అంటే చెట్టెక్కినంత ఆనందపడిపోయాం. అసలు గుర్తుండిపోవడానికి అల్లరి తప్పించి ఇంకేమి చేశామని! గురువులు అన్ని బ్యాచ్‌లతోనూ అలాగే అంటారేమో!

`ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇక్కడే కలిశాము` అని స్టూడెంట్ నెంబర్ వన్ లో పాటేస్తే చూసిన జనాలకి ఎప్పటివో జ్ఞాపకాలన్నీ మనసులో దూరేసి గుండెల్ని బరువెక్కించేశాయి. `హ్యాపీడేస్` అని శేఖర్ కమ్ముల సినిమాలో మెలోడీ మనసుని మెలిపెట్టేస్తే ఇప్పటి ఇంజనీరింగ్ జనరేషన్ అదే స్థాయిలో జ్ఞాపకాల్లో మునిగి మత్తెక్కి పోయింది. జనరేషన్ ఏదయినా స్నేహబంధంలో మార్పురాలేదు.

మొన్నఇంజనీరింగ్ కాలేజీలో E.C.E(B) నాలుగవసంవత్సరం చదువుతున్న వెంకటేష్ `ఫేర్‌వెల్ టైం వచ్చేసింది సార్. మా బ్యాచ్ వాళ్ళం ఎప్పటికీ మరచిపోలేని విధంగా ఏమయినా చెయ్యాలి,` అన్నాడు.

`ఆటోగ్రాఫ్‌లు రాసుకొని జాగ్రత్త  చేసుకొంటారా?` అన్నాను.

`అవీ, టీ షర్ట్‌ల మీద సంతకాలు, చేతిముద్రలు జాగ్రత్త పెట్టుకోవడం, ఫోటోలు అలాగే ఉన్నాయి. ఫేర్వెల్ వీడియో తీసుకొని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసుకొంటున్నారు ఇప్పుడంతా. నేను చాలా వీడియోలు చూశాను. కానీ అన్నీ  ఒక్కలాగే అనిపిస్తున్నాయి. మేం ప్రత్యేకంగా ఉండేలా స్పెషల్ ఎఫెక్ట్స్ కలిపి ప్లాన్ చేసుకొంటున్నాం,` అన్నాడు.

`స్పెషల్ ఎఫెక్ట్స్ వల్ల గుర్తుండిపోతుందా?` అంటే అతను చక్కటి వివరణ ఇచ్చాడు. `కొత్తదనం మీద ఆసక్తితో ఈ వీడియోని డౌన్‌లోడ్ చేసుకొని అట్టేపెట్టుకొంటారుకదా!  జ్ఞాపకం యొక్క విలువ తెలిసేసరికి, పుస్తకంలో దాచుకొన్న నెమలిపించంలా వీడియో బద్రంగా ఉంటుంది.`

ఫోన్లు, ఫేస్ బుక్కులు లేని రోజుల్లో ఎడ్రస్ లేకుండా మాయమై పోయిన దాసులాంటి ఫ్రెండ్స్‌ని మళ్ళీ కలవాలంటే సాధ్యం అవ్వచ్చు, కాకపోవచ్చు. సాంకేతికత పెరిగింది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకొంటున్నాం. మారుతున్న కాలంతో పాటూ, అభిరుచులు మారుతున్నాయి. కాలం మారినా స్నేహబంధం మారలేదు. జ్ఞాపకాలు దాచుకొనే మాధ్యమాలు వేరయినా ఆప్యాయతల పరిమళాలు ఆగిపోలేదు.

కాలం కమ్మగా సాగే పాట.
© Dantuluri Kishore Varma 

Wednesday, 23 January 2013

షకలక బేబీ

మా అమ్మాయిలిద్దరికీ ఆక్వేరియంలో చేపలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. కొనుక్కొందామని అడగటంతో, ఆక్వేరిస్ట్ దగ్గరకు వెళ్ళి ఒక ఫిష్ బౌల్, రెండు రకాల చేపలు, బౌల్‌కి అడుగున వెయ్యడానికి రంగురంగుల రాళ్ళు, అక్వాటిక్ ప్లాంట్స్ లా కనిపించే కృత్రిమ మొక్కలు, నీటిని సర్క్యులేట్ చేస్తూ బుడగలు రావడానికి గాలిని పంపేచిన్న మోటర్, దానికి ఒక సన్నటి గొట్టం,  చేపలకి వెయ్యడానికి గుళికల్లా ఉండే ఆహారం.. అన్నీ కొని ఇంటికి తీసుకొని వెళ్ళి ఆక్వేరియం ఏర్పాటు చేసుకొన్నాం. 

ఆక్వేరియం స్వచ్చమైన నీటితో చాలా అందంగా ఉంటుందికానీ, చేపలకి మేత వేస్తుంటే నీరు మడ్డిగా అయి, తరచూ మార్చకపోతే అసహ్యంగా తయారవుతుంది. కనీసం ప్రతీ వారం శుబ్రం చేస్తూ, చేపలు బౌల్‌లో ఆనందంగా తిరగడం అస్వాదిస్తూ ఉండగా ఒకరోజు ఉదయానికి గోల్డ్ ఫిష్ రెండూ చనిపోయి, పైకి తేలిపోయి కనిపించాయి. తరువాత ఇంకొకటి కూడా చచ్చిపోయింది. మిగిలిన ఒక్క గప్పీ రకం చేపనీ స్కూలుకి వెళ్ళేటప్పుడు, వచ్చినతరువాత `హాయ్, హెలో, ఓయ్ నిన్నే,` అని పలకరించుకొంటూ ఆనందపడిపోతున్నారు పిల్లలు. 

ఒక ఆదివారం రోజు ఈ చేపకి ఏదయినా పేరుంటే బాగుంటుందని, `బావజ్జీ(అంటే నాన్న, డాడి అని) పేరుచెప్పండి,` అన్నారు. అప్పుడే టీవీలో `షకలక బేబీ...` పాట వస్తుంది. `మన గప్పీ ఫిష్ పేరు షకలక బేబీ,` అన్నాను. 

షకలక బేబీ చాలా రోజులు గుడ్ మాణీంగులు, హాయ్‌లు, గుడ్‌నైట్‌లు చెప్పించుకొంది. తరువాత ఏమైందో తెలియదు ఓ రోజు ప్రొద్దున్నే ఆక్వేరియం లోనుంచి బయటకు జంప్‌చేసి ఫ్లోర్ మీద పడి కొట్టుకొంటుంది. చూసిన వెంటనే దాన్ని జాగ్రత్తగా తీసి బౌల్ లో వేసాం. సాయంత్రం వరకూ బాగుంది. తరువాత చనిపోయి, పైకి తేలిపోయింది.   

పేరుకూడా పెట్టి చాలా అటాచ్‌మెంటు పెంచుకొన్నారేమో, పిల్లలు చాలా బాధపడ్డారు. నిజానికి పెద్దవాళ్ళం కూడా అప్సెట్ అయ్యాం. జంతువులని పెంచుకోవడం మనందరికీ అలవాటే, కానీ ఇలాంటి సందర్భాలలో మనసు చాలా బాధపడుతుంది. ఇంకెప్పుడూ ఆక్వేరియం జోలికి వెళ్ళలేదు. చాలా రోజులు ఖాళీ బౌల్ అటకమీద ఉండేది, తరువాత ఎవరికో ఇచ్చేసాం.
© Dantuluri Kishore Varma 

Friday, 4 January 2013

కుప్ప నూర్పుళ్ళు

పెద్దపండుగ ముందు కొన్నిరోజులు నాన్నగారు పొలంలోనే ఉండిపోవలసి వచ్చేది. ఉదయం, సాయంత్రం పాలికాపు ఇంటికి వచ్చి భోజనం క్యారేజీ తీసుకొని వెళ్ళేవాడు. ఎప్పుడయినా ఉదయంపూట క్యారేజీ కోసం వచ్చిన పాలికాపుతో పొలం వెళ్ళేవాళ్ళం.  వరిపొలం మధ్యలో మకాం ఉండేది. మకాం అంటే ఒక ఎకరం పొలంలొ మట్టినింపి, మెరకచేసిన ప్రదేశం. ఒక పెద్ద నుయ్యి,   మావిడి చెట్లు,  ఆవులు, ఎడ్లు, గేదెలని కట్టడానికి కట్టురాటలు,  ఎడ్లబళ్ళు, నాగళ్ళు లాంటి పనిముట్లు పెట్టుకోవడానికి కొంతజాగా, ఒక పాక, ప్రక్కవాళ్ళ పొలం సరిహద్దుని తెలియజేడానికి కట్టవ ఉండేవి.  నేనువాడిన కొన్నిమాటలకి కొంతమందికి అర్థం తెలియకపోవచ్చు, అందుకే వాటి గురించి కొంచెం చెబుతాను. కట్టు రాటలు అంటే పశువులని కట్టడానికి భూమిలోకి దిగగొట్టిన లావుపాటి కర్రముక్కలు - ఇప్పటి క్రికెట్ ఆటలో వికెట్ల లాంటివి.  కట్టవ అంటే మట్టితో ఒక అడుగు ఎత్తు గట్టు ఏర్పాటుచేసి దానిమీద బ్రహ్మజెముడు లాంటి ముళ్ళ మొక్కలని వేస్తారు.  సరిహద్దు అవతలినుంచి మనుషులు, పశువులు రాకుండా చేసే అడ్డుకట్టు ఇది. 

పండుగ నెలలో కుప్పనూర్పుళ్ళ హడావుడి ఉండేది. కోసిన వరిచేనుని ఆరిన తరువాత, మకాంలోకి చేరవేసి, ఎడ్లబళ్ళతో తొక్కించేవారు. దీనిని కుప్పనూర్పు అంటారు. వరికుప్పమీద మూడు, నాలుగు బళ్ళని వొకదానివెనుక మరొకటిగా గుండ్రంగా తిప్పేవారు. వరికంకుల్ని తొక్కించడం వల్ల పూర్తిగా రాలిపోయి క్రిందకి చేరిన వరిని, వరిగడ్డినీ వేరుచేసేవారు. తరువాత చేటలతో ధాన్యాన్ని ఎగరబోసి, దుమ్ము, దూళీ వేరుచేసేవారు.  ఈ కార్యక్రమం పూర్తికావడానికి వారంరోజులో, పదిరోజులో పట్టేది. అందుకే యజమాని ఈ సమయంలో తప్పనిసరిగా మకాంలో ఉండిపోవలసి వచ్చేది.  అందుకోసం మంచె వేసేవారు. మంచె అంటే పాతకాలపు పందిరి మంచంలా ఉండేది. పట్టెడకు బదులుగా తాటి పట్టెలు, పరుపుకి బదులుగా వరిగడ్డీ, దానిమీద గోనెసంచులు కలిపి కుట్టిన బరకం. పైనుంచి మంచు పడకుండా తాటాకు గుడారంలాంటి ఏర్పాటు.

పొలంలోకి వెళ్ళిన తరువాత మాకు రైతు ఆట మొదలయ్యేది. ఒక టవల్ తీసుకొని తలపాగా చుట్టేసి, మంచె ఎక్కేసేవాళ్ళం. కరకజ్జం అనే స్వీట్ మాకోసం తయారుగా ఉండేది అక్కడ. శనగపిండితో చేసిన లావు కారప్పూసని లేత బెల్లంపాకంపట్టి, మకాంల దగ్గరకి తెచ్చి, కొత్త ధాన్యానికి మార్పిడిగా అమ్మేవారు. మాకు చాలా ఇష్టమైన కరకజ్జాన్ని మా నాన్నగారు ఖాళీ భోజనం క్యారేజీల్లో నిలువచేసి ఉంచేవారు.  దాన్ని తింటూ కొంతసేపు పనివాళ్ళ మీద అజమాయిషీ చెయ్యడం. వాళ్ళు ఏదయినా ఆట పట్టిస్తే ఉడుక్కోవడం.    కుప్ప నూర్పుళ్ళ బళ్ళు అన్నింటినీ ఎవరో ఒకరు నడపనవసరం లేదు. మొదటి బండిమీద ఒక వ్యక్తి ఉంటే, వెనుకవి ముందున్న బండిని అనుసరిస్తూ తిరుగుతాయి. మా ఎడ్లబండి సవారీ సరదా ఇక్కడ బాగా తీరేది. రెండవ బండిలోనో, మూడవదానిలోనో ఎక్కి, ఒక చేత్తో కళ్ళెం, ఇంకొక చేతితో అదిలింపు కర్రా పట్టుకొని `హొ్‌య్, హో్‌య్` అంటుంటే, విమానం నడుపుతున్నంత సరదాగా ఉండేది.
నూర్పుళ్ళు, ఎగరబోతలు అయిపోయినతరువాత పాలేర్లకి జీతాలు కొలిచేవారు. పెద్దపాలేరుకి పదిహేను కాటాలు, చిన్నపాలేరుకి పదో ఎన్నో కాటాలూ కొలిచేవారు. కాటాలంటే ధాన్యం బస్తాలు. కమతంలో ఉండే వాళ్ళతో పాటూ మిగిలిన సేవలు అందించేవారికి కూడా ఇటువంటి జీతబత్యాలే ఉండేవి. వాళ్ళందరూ కూడా వార్షిక జీతాలు కొలిపించుకొని వెళ్ళేవారు. మిగిలిన ఫలసాయాన్నీ పెద్ద త్రాసు(దీనినే కాటా అనేవారు) లో తూచి, బస్తాలు దబ్బనం, పురుకోసలతో మూతులు కుట్టి, బళ్ళమీద ఎక్కించేవారు. `బండెనుక బండికట్టి, పదహారుబళ్ళు కట్టి...` అన్నట్టు బళ్ళన్నీ ధాన్యలక్ష్మితో ఇంటిదారి పట్టేవి. వాటితో పాటూ మేమూనూ. 

పొలంలో పనులన్నా, వ్యవసాయదారులన్నా జ్ఞాపకాల గుబాళింపుతో కూడిన ఇష్టం,  ప్రత్యక్షంగా వ్యవసాయం చెయ్యకపోయినా కూడా..

© Dantuluri Kishore Varma 

సంక్రాంతి

పెద్దపండగొస్తుంది 
సంబరాలు తెస్తుంది
రధం ముగ్గులేద్దాం 
రంగవల్లులద్దుదాం

చుట్టాలంతా వస్తారు
సరదా సందడి చేస్తారు
చక్కని ఆటలు ఆడుదాం
నచ్చిన పాటలు పాడుదాం

కొత బట్టలు కడదాం
పిండివంటలు తిందాం
రధం ముగ్గులేద్దాం
రంగవల్లులద్దుదాం

బుడబుక్కలొస్తాడు
కొమ్మదాసరొస్తాడు
కొంత కొంత పంచుదాం
హాయిగా పంపుదాం

చిడతల శబ్ధం బాగుంది
తంబుర నాదం బాగుంది
అరిగరిగరిగో హరిదాసుగారు
ఎన్నో పాటలు పాడేస్తారు
చారెడుబియ్యం ఇచ్చేస్తేమరి
అంటారు వారు, "హరిలో రంగ హరి"

భం భం భం భం శంఖానాధం
గణ గణ గణ గణ గంటల శబ్ధం
వింటున్నావా "శంభో శంకర!"
అతనే అతనే జంగం దేవర

డూ డూ డూ డూ బసవన్న
చెప్పినవన్నీ చేస్తావా?
అమ్మగారికి దన్నంపెట్టి
అయ్యగారికి దన్నంపెట్టి
తోచినదేదో ఇచ్చేస్తే
చక్కా తీసుకుపోతావా?

పెద్దపండగొస్తుంది
సంబరాలు తెస్తుంది
భోగి మంటలేద్దాం
'గొబ్బియల్లో' పాడుదాం


© Dantuluri Kishore Varma

Friday, 16 November 2012

కెమేరా జ్ఞాపకాలు

పాత కెమేరాలని డబ్బా కెమేరాలని వెటకారం ఆడతాంకానీ, అసలు ఒకప్పుడు సొంత కెమేరాని కలిగిఉండడమే ఒక వింత. పోకెట్లో పట్టే చిన్న డిజిటల్ కెమేరాల శకం వచ్చిన తరువాత ఫొటోగ్రఫీ ప్రతీఒక్కరికీ అందుబాటులోకి వచ్చిందికానీ, 1963లో మా నాన్నగారు ఒక డబ్బా కెమేరాని కొనడంతో మావూరికి అది రెండవ కెమేరా అయ్యింది. మొదటిది  స్టుడియో వాడి దగ్గర ఉండేది. యాభైఅయిదు రూపాయలు కెమేరా కోసం ఖర్చుచేయ్యడం ఎవ్వరికీ నచ్చలేదట. ఎనిమిది ఫోటొలు వచ్చే రీలు మూడురూపాయలు, రీలు డెవలప్ చెయ్యడానికి అర్ధరూపాయి, ఎనిమిది ఫోటోలనీ ప్రింట్ చెయ్యడానికి రెండురూపాయలు. ధాన్యంబస్తా ఖరీదు పాతిక రూపాయలు ఉండే రోజులలో ఈ ఖర్చు ఒక లగ్జరీ.

మాన్యువల్ ఫిలింరోలింగ్ ఉండే ఈ కెమేరా ఉపయోగించినప్పుడు, స్నాప్ తరువాత రీలుని తిప్పుకోవాలి, లేకపోతే రెండవబొమ్మకుడా అదే చోట ఎక్స్పోజయి ఫోటో పనికిరాకుండా పోతుంది. ఈ ప్రతికూలతని ఒక కొత్త టెక్నిక్ కోసం ఉపయోగించుకొన్నారు. ఫోటో తీసే ముందు లెన్స్ వెనుకా, రీలుకి ముందూ సరిగ్గా అర్ధచంద్రాకారంగా కప్పేలా ఒక అట్టముక్కని పెట్టి ఒక స్నేప్ తీసిన తరువాత, రీలు తిప్పకుండా ఆ అట్టని రెండవ సగం కప్పేలా పెట్టి ఇంకొకసారి క్లిక్‌చేస్తే ఒకే ఫోటోలో రెండు సీనరీలని, లేదా ఒకేవ్యక్తిని డబుల్ ఫోటోలా తియ్యవచ్చు. ఫోటోషాప్ ఉపయోగించి ఇప్పుడు మనం చెయ్యగలిగిన చమత్కారాలని అప్పుడు ఒక డబ్బ కెమేరాతో చేశారు. ఈ ఫోటో అలా తీసిందే. ఇందులో ఉన్నది మాపెద్దన్నయ్య పృథ్వీరాజు.

మావూళ్ళో శరబయ్య అనే ఒక సన్యాసి ఉండేవాడు. పొడవైన తెల్లగడ్డం, మెడ దగ్గరనుంచి పాదాలవరకూ కాషాయరంగు బురకా, చిరునవ్వు మొహం, ఎప్పుడయినా మాట్లాడే ఒకటి రెండు మాటలు. రోజుకి ఒకరి ఇంటిలో వారాల భోజనాలు చేసే వాడు. ఎవరికైనా దుకాణాలనుంచి ఏమైనా కావాలంటే తెచ్చిపెట్టేవాడు. కొన్నిరోజులు ఊళ్ళో ఉంటే, కొన్నిరోజులు మాపొలాలు దాటిన తరువాత ఎత్తుగా, నిటారుగా ఉండే దొండరాయి కొండమీద, చిన్న గుహలో ధ్యానం చేసుకొనేవాడు.  ఈ కొండమీద వెంకన్న పాదాలూ, అన్నికాలాల్లోనీ మంచినీరు ఊరే ఒక గుంట(లోతుగా ఉండే ప్రదేశం) ఉండేవట. నీరు గుంటలో నిండి, అంచులుదాటి, దిగువకి ప్రవహించి ఒక కాలువలా మా పొలాలని తడిపేది. దీనిని కొండకాలువ అని పిలిచేవారు.

దంతులూరి చలమరాజు - మా నాన్నగారు 

రాత్రివేళల్లో అడవి పందులు, కొండగొర్రెలు, కణుజులనే జంతువులు కొండదిగివచ్చి కందిచేలు, వేరుశనగచేలు వంటివి ఉంటే కొంతవరకూ తిని పాడుచేసేవి. కొండపైనుంచి కనిపించే సుందర దృశ్యాలు, ఆహ్లాదకరమైన చల్లనిగాలి, ఏవయినా జంతువులు ఎదురుపడతాయేమో అనే భయంతో కూడిన కుతూహలం అనుభవించాలంటే సాహసం చేసి కొండపైకి వెళ్ళాలి.  కొండ నిటారుగా ఉండడంవల్ల గొర్రెల కాపర్లు తప్ప మిగిలిన వాళ్ళెవ్వరూ పైకి ఎక్కేవారు కాదట. వాళ్ళ దగ్గర ఒక చివర డొంకినీలు(వంకరగా ఉండే కత్తి లేదా కర్ర) కట్టిన పొడవైన కర్రలు ఉండేవి. డొంకినీలని చెట్టుకొమ్మలకి తగిలించి వాటి సహాయంతో పైకి వెళ్ళేవాళ్ళు.  ప్రతిఫలం లేకుండా సాహసాలు ఎవరుచేస్తారు? కానీ, అలా చెయ్యడానికి మా నాన్నగారికి దొరికే ప్రతిఫలం కొండపైన తీసే ఫోటోలు. ఒకరో ఇద్దరో కలిసి దొడరాయికొండ  ఎక్కి అద్బుతమైన ఫోటోలు తీసుకొన్న ఆనందం ఇప్పటికీ తాజాగా ఫీలవుతారు. 

తాతయ్యకి గంపెడు సంతానం - పిల్లలు, మనుమలు, మనవరాళ్ళుతో ఎప్పుడూ ఇల్లంతా కళకళ లాడుతూండేదట. అల్లరిపిడుగులు, బుద్దిమంతులు, దబ్బపళ్ళలాంటివాళ్ళు, రొయ్యపిల్లల లాంటివాళ్ళు, పేచీకోర్లు... రకరకాల పిల్లలు. `నువ్వు చిన్నప్పుడు దబ్బపండులా ఉండేవాడివి తెలుసా?` అని చెబితే; ఎలా ఉండేవాళ్ళమో చూసుకోవడానికి మనదగ్గర ఒక్కఫోటో అయినా లేక పోతే ఎంత నిరుత్సాహంగా ఉంటుంది? 
  తాతగారి కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు 

మాచిన్నప్పుడు తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఒక ఆల్బం నిండా ఉన్నాయి. అప్పటి మనుషులు, పరిసరాలు, సంఘటనలు ఈ రోజు చూడగలుగుతున్నామంటే కొన్నప్పుడు లగ్జరీ అని భావించిన ఆ డబ్బా కెమేరా పుణ్యమే! నాన్నగారు చెప్పిన విశేషాలని ఈ టపా చూపించి, ఆయనకే చదివి వినిపిస్తే అమ్మా, బావజ్జీ(నాన్న) భలే ఆనందపడతారు. ఊండండి ఒక్కసారి, నేను ఇప్పుడే వెళ్ళి ఆపని చేసి వస్తాను. వచ్చాకా చెబుతానే వాళ్ళ రెస్పాన్సుని! 
ఇక్కడ ముగ్గురిలో చిన్నవాడు - నేనే!
© Dantuluri Kishore Varma

Monday, 12 November 2012

దీపావళి

కటిక చీకటిలో కాంతిపుంజాలని, నిశ్సబ్ధంలో శబ్ధాన్ని, నీరవంలో ఉత్సాహాన్ని నింపే తెలుగువారి ఆత్మీయ పండుగ దీపావళి. వెలుగుతున్న ముత్యాల కాకరపువొత్తునుంచి విరజిమ్మే రంగురంగుల నక్షత్రాల్లాగ చిన్నప్పటి దీపావళి జ్ఞాపకాలు మనసులో ముప్పొరిగొంటాయి.

పండుగ సమీపిస్తున్నకొద్దీ ఎప్పుడెప్పుడు మందుగుండు సామాగ్రి కొనేసుకొందామా అనే ఆత్రుత గుండెల్లో చుచ్చుబుడ్లులాగ ఎగజిమ్మేస్తూ ఉంటే  , భూచక్రాల్లాగ పిల్లలమందరం ఇల్లంతా కలియతిరిగేవాళ్ళం. నాన్నగారికి మతాబులు, చుచ్చుబుడ్లు అంటే చాలా ఇష్టం. చుచ్చుబుడ్లు కాల్చకపోతే పండుగకళే ఉండదనేవారు. తయారుచేసి అమ్మే సామాన్లు కొంటే సరిగావెలగవు, నాణ్యత తక్కువ, మందుకంటే వాటిలో ఉండే ఇసుకా, మట్టీ, కల్తీ ఎక్కువ. ముందరి సంవత్సరపు సరుకు అంటగడితే పుణ్యకాలమంతా వాటిని వెలిగించే ప్రయత్నంలోనే గడచిపోతుంది. అందుకే ప్రత్యేకంగా మతాబులు, చుచ్చుబుడ్లూ తయారుచేసుకొనేవాళ్ళం. సూరేమారం, గంధకం, బీడు, మెరుపులూ, తెచ్చి; విడివిడిగా ఎండబెట్టి, తరువాత ఆముదంతో కలిపి మతాబుల మందు తయారుచేసుకొనేవాళ్ళం. కొంచెం సాంపిల్ పెరట్లోకి తీసుకొనివెళ్ళి, వెలిగించి, బాగా మండుతుందని నిర్ధారించుకొన్న తరువాత కనీసం వంద  గ్రాములు మందుపట్టే చుచ్చుబుడ్డి కుండల్లో మందు  దట్టించి, దళసరి కాగితమ్ముక్క పెట్టి చివరగా తడి జిగురుమట్టితో సీల్‌చేసేవాళ్ళం. మతాబులకి, చుచ్చుబుడ్లకీ ఒకటే మందు. కావలసినన్ని బుడ్లు కూరిన తరువాత మతాబుల గుల్లలోకి ముందు పొడి ఇసుక వేసి, తరువాత వదులుగా మందు  పోసి గొట్టం మడతపెట్టి మూసేవాళ్ళం.

సిసింద్రీలు కూడా వందలకొద్దీ ఒక్కోసారి వెయ్యికిపైగానే కూరుకొని తయారుచేసుకోవడం ఒక తప్పనిసరి విషయం. గుల్ల దగ్గరనుంచి బొగ్గు కాల్చుకొని పొడితయారు చేసుకోవడం, మందు కలుపుకోవడం వరకూ ఎవరికి వాళ్ళు విడివిడిగా తయారుచేసుకోవలసిందే. పండుగకి ఎవరిదగ్గర ఎన్ని ఎక్కువ సిసింద్రీలు ఉంటే వాడే గొప్ప. ఇవికాక బయటకొని తెచ్చుకొన్న కాకరపువ్వొత్తులు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, వెన్నముద్దలు, తాళ్ళు, పెన్‌సిళ్ళు, పాంబిళ్ళలు, దీపావళి అగ్గిపెట్లు... అన్ని సమానంగా పంచేసుకొని, ఎండలో ఎండబెట్టేసుకొని, ఒకటికి పదిసార్లు లెక్కపెట్టుకొని సాయంత్రం అయ్యేసరికి ఎందుకో తెలియదుగానీ బాగా నెమ్మదిగా తిరిగే టైముని తిట్టుకొంటూ అసహనంగా ఎదురుచూడడం - ఎంత విరహం!

గోగికర్రలకి నూనెలో ముంచిన వత్తులు కట్టి, వెలిగించి, ఆకాశానికి చూపించి, "దివ్వీ, దివ్వీ దీపావళి; మళ్ళీ వచ్చే నాగులచవితి," అని దివిటీలు కొట్టేసి, రెండుటపాకాయలు వేసేసరికి ఓపెనింగ్ సెరిమనీ అయిపోయినట్లే. లక్ష్మీ దేవికి నమస్కారం చేసుకొని, ఇంటిలో అన్నిచోట్లా గుగ్గిలం పొగ వెయ్యాలి. ముoదురోజే పొడవైన మైనపు వత్తులు తెచ్చి ఉంచేవారు. ఒక పలుచని గుడ్డకి మైనం పూసి, వెదురు పుల్లకి చుట్టి తయారు చేస్తారు వీటిల్ని. ఈ వత్తుల్ని వెలిగించి గదిగదికీ తిప్పుతూ గుగ్గిలపు పొడిని వెలిగి మండుతున్న మైనపు వత్తి క్రిందనుంచి మంటలోనికి వెళ్ళేలా వెయ్యాలి. ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు 'అగ్గిమీద గుగ్గిలం' అవ్వడం అంటే ఏమిటో తెలుస్తుంది. గుగ్గిలపు పొడి తగలగానే మంట ఒక్కసారి భగ్గు మని పెద్దదవుతుంది. అందుకే పైనుంచి వేస్తే చెయ్యి కాలకుండా, నేర్పుగా క్రిందనుంచి వెయ్యాలి.

దివిటీలు కొట్టినప్పుడు పాడే పాట ఎంతచిన్నగా ఉంటుందో, బాణాసంచా కాల్చే సమయం కూడా అంతే. ఎన్ని కొనుకొన్నా, ఎన్ని కాల్చుకొన్నా 'అప్పుడే అయిపోయాయా!' అని నిట్టూర్చని కుర్రాడు ఒక్కడయినా ఉండడని లక్ష్మీ బాంబు పేల్చి చెప్పచ్చు. ఇక తారాజువ్వాలు, సీమటపాకాయలు కాల్చేటప్పుడు ఉండే భయంతో కూడిన ఆనందం, ఉద్వేగభరితంగా ఉండేది. ఆతరువాత కాల్చి కాల్చి చేతులు నొప్పెట్టే వరకూ మనకు కాలక్షేపం ఇచ్చేవి మనం తయారు చేసుకొన్న సిసింద్రీలే.

సూరేకారం, గంధకంతో చేసే బొగ్గు సిసింద్రీలు వెనుక వరసలోకి పోయి, చురుకు ఎక్కువైన బాలీవుడ్ హీరోయిన్ల లాంటి పటాసు సిసింద్రీలు తెరమీదకి వచ్చాయి. తెల్లగా ఉండే పటాసుకి, అంతే మోతాదులో చక్కెరపొడికలపాలి. మండే గుణం ఎక్కువగా ఉండే ఈ మిశ్రమం బాగా పవర్‌ఫుల్. నాస్నేహితుడు ఒకరు ఒకసారి ఇలా కలిపి ఎండబెట్టిన మందుకి చీమలు పట్టేయడంతో, వాటిని వదిలించడానికి దాన్ని మూకుట్లో వేసి పొయ్యిమీద పెట్టాడు. ఒకటి రెండు నిమిషాలలో పటాసు వేడెక్కి ఒక్కసారిగా పేలిపోయింది. చాతీ, ముఖంలో కొంతబాగం కాలినా, అదృష్టవశాత్తూ  ప్రాణాపాయం నుంచి తప్పించుకొన్నాడు.

చిన్న అన్నయ్య(శ్రీను) వరుసగా రెండు సంవత్సరాలు, తన స్నేహితులతో కలిసి దీపావళి సామాన్ల కొట్టు పెట్టాడు. పండుగ ముందురోజు వరకూ అంతంత మాత్రంగా ఉన్న అమ్మకాలు, దీపావళి రోజు మాత్రం పదింతలై కజిన్స్, ఫ్రెండ్స్ అందరూ కలిసి అమ్మినా సరుకు అందించలేనంత ఉక్కిరిబిక్కిరై, లాభాలుపంచుకోగా మిగిలిన సామానులు పెట్టెలకొద్దీ ఇంటికి వచ్చాయి. ఆ రెండు సంవత్సరాలలో, 'దివ్వీ దివ్వీ దీపావళి...' వంటి క్లుప్తమైన పాటలా కాకుండా, ఎప్పటికో పూర్తయ్యే గాత్రకచేరీలా కాల్చాం.
*     *     *

లక్ష్మీదేవి సంపదలకు దేవత.
సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు-
పాడిపంటలు, విద్య, అధికారం, సంతానం,
ధైర్యం, విజయాల వలన కలిగే
ఆనందమే అసలైన సంపద.
ఈ సంపదకి అధినేత్రి అయిన
ఆదిలక్ష్మికి ప్రియమైనవి
పరిశుభ్రత, నిర్మలమైనకాంతి.
ఎక్కడయితే ఇవిరెండు ఉంటాయో, అక్కడికి
దీపావళిరోజు లక్ష్మీ దేవి వస్తుంది,
సకల ఐశ్వర్యాలనూ ఇస్తుంది.

పాలకడలినుంచి లక్ష్మీదేవి ఉద్భవించి,
విష్ణుసన్నిధిని చేరుకొన్నప్పుడు
దేవతలందరూ ఆమెని ఈ విధంగా స్థుతించారట -
"నమస్యే సర్వలోకానాం జననీమబ్జసంభవాం
శ్రియమున్నిద పద్మాక్షీం విష్ణువక్ష:స్థల స్థితాం"
సంతోషకరమైన సందర్భంలో చేసిన స్థుతి కనుక
ఆ విధంగా ఎవరైతే చెపుతారో
వారికి లక్ష్మీదేవి సకలసంపదలూ ఇస్తుంది.

ప్రమిదల్లో నూనెవేసి వెలిగించే దీపాలు అప్పుడూ, ఇప్పుడూ కూడా నాకు చాలా ఇష్ఠం. కిరణాలుగా సాగే వెలుగులో ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. 

ఇంటినిండా దివ్యమైన దీపపు వెలుగులతో జరుపుకొనే దీపావళి శాంతిని, సౌఖ్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, విజయాన్నీ, సంపదనీ... అందరికీ పంచాలని కోరుకొంటూ సర్వులకూ దీపావళి శుభాకాంక్షలు.


Happy Diwali!

© Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!