Pages

Showing posts with label అరకులోయ. Show all posts
Showing posts with label అరకులోయ. Show all posts

Thursday, 8 May 2014

Wednesday, 12 February 2014

క్వీన్‌ బీ

తేనెలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయని చెపుతారు. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. తాగితే మధురంగా ఉంటుంది. ఉదయాన్నే తేనెని నిమ్మరసంతో కలుపుకొని తాగితే వొళ్ళుతగ్గుతుంది. తులసి ఆకుల రసంతో కలిపి తీసుకొంటే జలుబు, దగ్గు తగ్గుతాయి. పాలతో కలిపి సేవిస్తే బరువు పెరుగుతుంది. దెబ్బలు తగిలిన మచ్చలమీద తేనెని రాస్తే మచ్చలు క్రమంగా చర్మపు రంగులో కలిసి పోతాయి... ఇటువంటి ఎన్నో రకాల చిట్కాలు పెద్దలు చెపుతూ ఉంటారు, ఆయుర్వేద పత్రికల్లో లేదా టీవీల్లో కనిపిస్తాయి. కాబట్టే అందరం దీనిని కొని వాడుతుంటాం. కానీ శ్వచ్చమైన తేనెలో ఎన్ని సుగుణాలు ఉన్నాయో, కల్తీ తేనెలో అన్ని అనారోగ్యాన్ని కలిగించే పదార్థాలు ఉంటాయి. మా చిన్నప్పుడు కోయవాళ్ళు చెట్టునుంచి కొట్టిన తేనెపట్టుల్ని స్టీలు కేరేజీల్లో పెట్టి, సరాసరి తీసుకొని వచ్చేవారు. తేనె లభ్యత ప్రధానంగా అలానే ఉండేది. క్రమంగా వినియోగం పెరిగింది, ఉత్పత్తి తగ్గింది. తేనె తెచ్చేవాళ్ళకి తెలివి తేటలు పెరగడంతో పంచదార పానకాన్ని తేనెలో కలిపి తేనెపట్టులకి పట్టించి ఊళ్ళమీద అమ్మడం మొదలు పెట్టారు. ఒకసారి వాళ్ళదగ్గర కొని మోసపోయాం. కొన్న కొన్నిరోజులకే పంచదార పెచ్చులు పైన పొరలాగ ఏర్పడ్డాయి. పూర్తి సీసాడు తేనెని(?) బయట పారవెయ్యవలసి వచ్చింది. అప్పటినుంచీ బ్రాండెడ్ తేనెని వాడడం మొదలు పెట్టాం. దానిలో కూడా కొంత కల్తీ ఉండవచ్చునేమో చెప్పలేం! 
అరకులోయలో తేనె ఉత్పత్తి చేసే ప్రదేశాన్ని చూశాను. కొంచెం స్టడీ చేస్తే ఎపీకల్చర్ గురించి ఎన్నో విషయాలు తెలిశాయి. తేనెటీగలు తేనెని సేకరించే, నిలువచేసే విధానం చాలా ఆసక్తి కలిగించేలా ఉంటుంది. ప్రతీ పట్టుకీ ఒకటే రాణీ ఈగ ఉంటుందట. రెండవది ఉండడానికి అవకాశంలేదు. ఎందుకంటే అలా ఉన్నసందర్భంలో ఒకటి రెండవదానిని చంపేస్తుంది. ఒకటో, రెండో మగ ఈగలు ఉంటాయి. వాటితో పాటూ కొన్ని వేలల్లో శ్రామిక ఈగలు ఉంటాయి. ఈ శ్రామిక ఈగలు అన్నీ ఆడవే. రాణీ ఈగ గుడ్లని పెట్టడానికి మైనంతో గదులను నిర్మించడం, పువ్వులనుంచి తేనెని సేకరించి తెచ్చి వాటికి తినిపించడం, తేనెపట్టుకి కాపలా కాయడం మొదలైన పనులన్నీ శ్రామిక ఈగలే చేస్తాయి. మగఈగలని డ్రోన్‌లు అంటారు. వాటి పని కేవలం రాణీ ఈగతో కలియడం మాత్రమే. కానీ కర్తవ్య నిర్వాహణ చేసిన మరుక్షణమే అవి మరణిస్తాయి. రాణీ ఈగ గుడ్లుపెడుతుంది. రాణీ ఈగ విడుదలచేసే ఒకరకమైన ఎంజైమువల్ల శ్రామికి ఈగల్లో ఏవీకూడా సంతానోత్పత్తికి పనికి రాకుండా అవుతాయి. క్వీన్‌బీ మహా నిరంకుశురాలు, కదూ?     

మనకు ఒక అనుమానం రావచ్చు క్వీన్‌బీ ఎలా తయారవుతుంది అని. ఇంతకు ముందు రాణీ ఈగ గుడ్లు పెడుతుందని అనుకొన్నాంకదా? అవి అన్నీ మకరందాన్ని తాగి శ్రామిక ఈగలుగా ఎదుగుతాయి. కానీ ఎప్పుడైనా పట్టులోని క్వీన్‌బీ ముసలిది అయినా, మరణించినా శ్రామిక ఈగలు ఒకటి రెండు రాణీ ఈగల్ని తయారు చేస్తాయి. పువ్వులనుంచి సేకరించిన మకరందాన్ని కాకుండా అవి స్రవించే రాయల్ జెల్లీ అనే ఒకరకమైన ఎంజైముని ఒకటి రెండు గదుల్లో ఉన్న లార్వాకి అందించడం వల్ల, ఆ లార్వే రాణీ ఈగలుగా ఎదుగుతాయి. 

ఈ విధానం అంతా చూస్తుంటే మన ప్రజాస్వామ్యం గుర్తుకువస్తుంది. ప్రజలందరూ రాత్రనక, పగలనక బ్రతకడానికి కష్టపడి పనిచేసుకొంటూ..రూపాయి, రూపాయి కూడబెట్టుకొని ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తూ.. తమని పరిపాలించడానికి ఒకదొరగారినో, దొరసానినో ఓట్లేసి అందలం ఎక్కిస్తే.. ఏమవుతుంది? మంచితేనె కోసం ఆశపడితే, కల్తీతేనే దొరుకుతుంది. ప్రజాస్వామ్యఫలాలు స్వార్థపరుల చేతుల్లో పడి విషతుల్యంగా మారుతున్నాయి.

మనదేశం ఒక పెద్ద తేనెపట్టులా తయారయ్యింది!
© Dantuluri Kishore Varma

Friday, 7 February 2014

గుండె ఝల్లుమంది...

రాంగోపాల్‌వర్మ రాత్రి సినిమాలో నిర్మానుష్యమైన ఊరిలో రేవతినీ దించేసినట్టు నన్ను ఒక్కడిని దించేసి బస్సువెళ్ళిపోయింది. ఐస్క్రీం బండివాడు ఒక్కడే ఉన్నాడు. `బాబూ, ఇదేనా దారి?` అన్నాను.`ఆ.... వెళ్ళండి,` అన్నాడు.
ఎర్రమట్టి దిబ్బలు ఎన్నివేల లేదా లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయో తెలియదుకానీ, వాటి ఏర్పాటు ఒక భౌగోళిక అద్భుతం. పూర్వం సముద్రమట్టం ఇంకా పైకి ఉండేదని, ఎగసిపడే కెరటాలవల్ల మట్టి కొట్టుకొని పోయి నెర్రల్లాగ అయివుండవచ్చని కొందరు అంటారు. మరొక అభిప్రాయం ప్రకారం బొర్రాగుహల్లో పుట్టిన గోస్తనీ నది ప్రవాహమార్గం ఇదేనని అంటారు. విశాఖపట్నం నుంచి, భీమిలి వెళ్ళేదారిలో సముద్రంలో కలిసేది. తరువాత ఈ నది తన ప్రవాహ మార్గం మార్చుకొని ఉండవచ్చునట. ఏది ఏమయినా ఇంత విస్తీర్ణంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు లాంటి ప్రదేశం భారతదేశపు తూర్పుతీరంలో మరొకటి లేదని జియాలజిస్టులు చెపుతారు.
నేను ఉద్యోగరీత్యా వైజాగ్‌లో ఒకసంవత్సరం ఉన్నప్పుడు, ప్రతీనెలా భీమిలి వెళ్ళవలసి ఉన్నప్పుడూ కూడా ఒక్కసారీ ఎర్రమట్టిదిబ్బలని చూడకపోవడం క్షమించరాని విషయం! ఆ ఫీలింగుని పోగొట్టుకోవడానికి మొన్న అరకు ట్రిప్ వేసిన సందర్బంలో ఒక్కపూట సమయం దొరకడంతో బస్‌కాంప్లెక్స్ దగ్గర భీమిలీ బస్ పట్టుకొని, ఓ గంట ప్రయాణం చేసి, ఎర్రమట్టిదిబ్బలదగ్గర దిగాను. అప్పటికి సాయంత్రం నాలుగు అవుతుంది. సముద్రానికి అభిముఖంగా రోడ్డుకి అవతల ఇసుక పుంతలాంటి మార్గం ఉంది.
అడుగువేస్తే కాళ్ళు ఇసుకలో కూరుకొనిపోతున్నాయి. కొంచెం దూరం వెళ్ళినతరువాత పుంతమార్గానికి అటూ, ఇటూ ఎత్తైన దిబ్బలు, వాటిమీద గుబురుగా అడవిలా పెరిగిన చెట్లు. మార్గం రెండుగా విడిపోయింది. `ఎడమవైపుకా, కుడివైపుకా?` అనుకొని ఓ వైపుకి వెళ్ళాను. మరికొంతదూరం నడక. దారులోనుంచి, దారి. రెండు, రెండుగా చీలిపోతున్న మార్గం. నేను తప్ప మరొక నరమానవుడు కనిపించడంలేదు. పిట్టల అరుపులు కూడా లేవు. దూరంనుంచి వినిపిస్తున్న ట్రాఫిక్ హోరుకూడా వినిపించడం మానేసింది. ఇంకా వెళితే సెల్‌సిగ్నల్ కూడా పోతుంది, లాబిరింత్‌లో ప్రవేశించినట్టు, దారితప్పిపోతే డైరెక్షన్ చెప్పడానికి కూడా ఎవరూ ఉండని ప్రదేశం. శీతాకాలమేమో ఐదు గంటలకే చీకట్లు ముసురుకొంటున్నాయి. ఇంకాస్తముందుకు వెళ్ళినా కనిపించే దృశ్యం అదే. కాబట్టి వెనక్కితిరిగాను. నిజంచెప్పొద్దూ, గుండెఝల్లుమంది...

నేను నడచి వచ్చిన మార్గంలో, అంతకు రెండునిమిషాలముందు లేరు - కానీ, ఇప్పుడు ఉన్నారు - ఇద్దరు వ్యక్తులు  ఇసుకలో కూర్చొని కబుర్లుచెప్పుకొంటూ, నడచి వచ్చినందుకు ఆయాసపడుతూ, అలసట తీర్చుకొంటూ.... వాళ్ళని అక్కడ ఊహించలేదు. అందుకే,  రిలీఫ్‌గా ఫీలవ్వడానికి బదులు షాకయ్యాను. నేను ఒక్కడినే కాదన్నమాట, ఇంకా కొంతమంది టూరిస్టులు కూడా ఈ ప్రదేశానికి వస్తూ ఉంటారు! వాళ్ళను దాటుకొని, రోడ్డు చేరుకొని, బస్సుపట్టుకొని, ఇంటికి చేరాను.
© Dantuluri Kishore Varma

Monday, 20 January 2014

రా రమ్మని పిలిచిన కోన పిలుపు

కొండల బండల దారులలో తిరిగేటి సెలయేటి గుండెలలో 
రా రా రా రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే
ఓ కొత్త వలపు వికసించగనే ఎన్నెన్నీ హొయలో ఎన్నెన్నీ లయలో 
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో
పదము కదిపితే ఎన్నెన్ని లయలో
ఎన్నెన్నీ హొయలో, ఎన్నెన్నీ లయలో.... 

అని సీతారామశాస్త్రిగారు అన్నట్టు అరకులోయలో దారిలో అందాల హొయలు వర్ణించతరం కాదు. అందుకే ఈ ఫోటోలు చూపిద్దామని... చిన్ని ఆశ. 

ఈ రిసార్ట్ కిటికీలోనుంచి చూస్తే లోయ అందం కనిపిస్తుంది. ప్రొద్దున్న మంచులో, మధ్యాహ్నం ఎండలో, సాయంత్రం ఏటవాలు సూర్యకిరణాలలో కొండదారుల్లో నడుస్తూ వెళ్ళి ఎక్కడినుంచో ప్రవహిస్తున్న సెలయేటిని చూడాలనిపిస్తుంది. గొంతెత్తి పాడుతున్న ఏదో పక్షి కూతకి బదులివ్వాలనిపిస్తుంది. కానీ, రాత్రయితే!? దూరంగా ఉన్న పూరిగుడిసెలో ఎప్పుడూ కాపురముండే కోనవాసులు ఎలా ఉంటారో? 

ఆకాశం దాకా నిటారుగా పెరిగినట్టున్న చెట్లు, వాటి మొదళ్ళనుంచి `మేము కూడా మేఘాలని అందుకొంటాం,` అన్నట్టు  పైకి ఎగబ్రాకుతున్న కాఫీతోటల్లో పాదులు, పొద పొదకీ మధ్య వాలునుంచి పైకి ఎక్కడానికి కాఫీ తోటల యజమానులు కట్టిన మెట్లు, మెట్లక్రింద ఘాట్‌రోడ్డుని చేర్చి మంచెల్లా కట్టిన బడ్డీలమీద కాఫీ పొడిని, మసాలా దినుసుల్నీ, తేనెనీ అమ్ముతున్న మనుషులు. ఒక కప్పు వెచ్చని కాఫీనీ సిప్ చేస్తూ, చిరుచలిని ఆస్వాదిస్తూ, చెట్ల వెనుకనుంచి అస్తమిస్తున్న సుర్యుడిని చూడడం బాగుంటుంది. ఇది అనంతగిరి కాఫీతోటల దగ్గర దృశ్యం. 


దూరంగా కనిపిస్తున్నది సూయిసైడ్ పాయింటట. ఫెన్సింగ్ పైనుంచి అఖాతంలోకి చూస్తే కళ్ళుతిరుగుతాయి.  
`నువ్వు వస్తానంటే నేనొద్దంటానా,` సినిమా చూశారా? షూటింగ్ చేసింది ఇక్కడేనట. శ్రీహరి ఇల్లు, పొలం అన్ని ఈ లోయలోనివే. 

అక్టోబర్, నవంబర్ నెలల్లో అరకులోయలో కొండవాలులు పసుపు వర్ణంతో కళకళ లాడతాయి. ఎక్కడచూసినా వలిసేపువ్వులు విరబూసి కనువిందుచేస్తాయి. మేము సీజన్ కొంచెం దాటిన తరువాత వెళ్ళడంవల్ల అప్పటికే చాలా చోట్ల పంటకోతలు అయిపోయి, ఖాళీ మడులు ఉన్నాయి. కానీ, అదృష్టంకొద్దీ ఒక్కచోటమాత్రం కొన్ని మడుల్లో ఇంకా వలిసెలు వుండడంతో ఇలా కెమేరా కళ్ళల్లో చిక్కుకొన్నాయి. 


ఇది తిరుగు ప్రయాణపు దారి.
 
© Dantuluri Kishore Varma

Tuesday, 14 January 2014

బొర్రాగుహలు


బొర్రాగుహలు విశాఖపట్టణం నుంచి 90 కిలోమీటర్ల దూరంలో, అరకు వెళ్ళే మార్గంలో ఉన్నాయి. బొర్రాగుహలు నుంచి అరకు 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గుహల దగ్గరకి వెళుతున్నపుడు మనకు నది ప్రవాహపు శబ్దం వినిపిస్తుంది. గుహల బయట ఏర్పాటుచేసిన వ్యూపాయింట్ దగ్గరనుంచి చూస్తే కొండలమధ్యనుంచి ప్రవహిస్తున్న గోస్తనీ నది కనిపిస్తుంది. ఈ నది బొర్రా గుహలలోనే పుట్టింది. కొన్ని లక్షల సంవత్సరాలక్రితం ప్రస్తుతం గుహ ఉన్న కొండప్రాంతం పైనుంచి గోస్తనీ నది ఉరుకులెత్తుకొంటూ ప్రవహించేదట. దానివల్ల కొండల్లో ఉన్న సున్నపురాయి నిక్షేపాలు కరిగిపోయి, నీటితోపాటు కొట్టుకొని పోగా బొరియలు మిగిలాయి. అవే ఇప్పటి బొర్రాగుహలు. బొర్ర అంటే బొరియ అనే అర్థం.  గోస్తనీ అంటే గోవుయొక్క పొదుగు అని అర్థం. సున్నపురాతి నిక్షేపాలతో ప్రవహిస్తున్న నీరు తెల్లగా ఉండి, గోవు పొదుగునుంచి వచ్చే పాలలా ఉంటుంది కనుక ఈ నదిని గోస్తనీ నది అనిపిలవడం మొదలుపెట్టారట. 


విలియం కింగ్ జార్జ్ అనే జియాలజిస్టు 1807వ సంవత్సరంలో ఈ గుహలని కనుక్కొన్నాడని ఇక్కడ పెట్టిన బొర్డ్‌లో రాసి ఉంది. అనంతగిరి కొండలమీద మేస్తున్న ఆవు ఒకటి ప్రమాదవశాత్తూ బొరియలోనుంచి గుహల్లోకి పడిపోవడంతో, ఇక్కడ గుహలు ఉన్న సంగతి జనాలకి తెలిసిందని చెపుతారు. తెలియడం అంటే ఇప్పుడు తెలిసింది కానీ 30,000 నుంచి 50,000 సంవత్సరాలకి పూర్వమే ఈ గుహల్లో ఆదిమానవులు నివశించేవారని పరిశోధనలు చేసిన ఆంత్రొపాలజిస్టులు కనుగొన్నారు. 



గుహపైనుంచి చుక్కా, చుక్కా కారే సున్నపురాయి క్రమంగా పేరుకొని, గట్టిపడి బొర్రాగుహల్లో రకరకాల ఆకారాలని పొందాయి - కొన్ని గుహసీలింగ్ నుంచి క్రిందకి, కొన్ని నేలమీదనుంచి పైకి. కేవ్ అంతా తిప్పి చూపించడానికి ఇక్కడ గైడ్లు ఉంటారు. కావాలంటే వాళ్ళని ఫీజ్ చెల్లించి ఎంగేజ్ చేసుకోవచ్చు. కానీ అది అనవసరం. ఒకవేళ మీరు అలా కనుక చేస్తే, వాళ్ళు మీకు చూపించేది ఈ ఆకారాలనే. మహర్షి గెడ్డం అని, ఆవు పొదుగు అని, తల్లీబిడ్డా అని, ఇంకా చాలా చాలా చెపుతారు. శివలింగం లాంటి ఆకారాలు కూడా ఉన్నాయి. ఒక శివలింగానికి గుహ అంతర్భాగంలో చిన్న మందిరం కట్టారు. శివరాత్రి రోజు ఈ చుట్టుప్రక్కల గ్రామాలనుంచి ప్రజలు తొండోపతండాలుగా వస్తారట ఇక్కడ పూజలు చెయ్యడానికి. 

గట్టిపడి వివిధ ఆకారాలను పొందిన వీటిని స్టాలక్‌టైట్, స్టాలగ్‌మైట్ అని పిలుస్తారు. గుహపైనుంచి తోరణాల్లా వ్రేలాడ బడినట్టు ఏర్పడినవి స్టాలక్‌టైట్స్, క్రిందనుంచి పైకి ఏర్పడినవి స్టాలగ్‌మైట్స్. ఈ రెండు పేర్లూ చాలా సారూప్యత కలిగి ఉండి గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటాయి. జియాలజిస్టులే ఒక్కో సారి ఏది, ఏదో తెలియక తికమక పడతారట. అందుకే జ్ఞాపకం పెట్టుకోవడానికి ఒక చిన్న చిట్కా ఉపయోగిస్తారు. సీలింగ్ నుంచి వ్రేలాడేవి స్టాలక్‌టైట్స్ - సీలింగ్‌లో ఇంగ్లీష్ అక్షరం `సి`, స్టాలక్‌టైట్‌లో `సీ`. గ్రౌండ్‌నుంచి పైకి ఏర్పడినవి స్టాలగ్‌మైట్స్ - గ్రౌండ్‌లో `జి`, స్టాలగ్‌మైట్‌లో `జి`. ఈ నెమోనిక్ బాగుంది కదా? 

గుహకి లైటింగ్ ఏర్పాటు చెయ్యడంతో చూడడానికి బాగుంది. మెడడును పోలిన ఆకారం ప్రత్యేక ఆకర్షణ. గుహ సీలింగ్ మీద రెండు కొండలు కలిసిన అతుకు ఆశ్చర్యాన్ని కలుగ జేస్తుంది. లోపల మెట్లు, ఎత్తుపల్లాలు, ఒకటిరెండు చోట్ల చిన్న సొరంగ మార్గాలు ద్వారా నడక మూడువందల నుంచి నాలుగువందల మీటర్ల వరకూ ఉంటుంది. ఈ గుహలు మొత్తం ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయట. విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే రైలు మార్గం ఈ గుహల మీదనుంచే వెళుతుంది!    
ఉదయం పదినుంచి సాయంత్రం ఐదు వరకు తెరిచే ఉంటాయి. మధ్యాన్నం ఒంటిగంట నుంచి రెండు వరకూ లంచ్‌బ్రేక్. ఎంట్రన్స్ టిక్కెట్ల ధర మాత్రం పేలగొట్టేస్తున్నారు. పెద్దవాళ్ళకి అరవై, పిల్లలకి నలభైఐదు, కెమేరాకి వంద! 

గుహల్లోకి వెళ్ళే ముందే బయట ఉన్న చిన్న రెస్టారెంట్లలో ఏదో ఒకదాని దగ్గర లంచ్ ఆర్డర్ చేసి వెళితే, మీరు తిరిగి వచ్చేసరికి రెడీ చేస్తారు. 
 
© Dantuluri Kishore Varma

Monday, 13 January 2014

అరకు ఘాట్‌రోడ్‌లో...

అరకు ఘాట్ రోడ్లో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. గతంలో ఒకసారి అరకు వెళ్ళినప్పుడు విశాఖపట్నం నుంచి ట్రెయిన్‌లో వెళ్ళి వచ్చాం. అప్పటినుంచీ రోడ్డుమార్గంలో వెళ్ళలేకపోయామన్న వెలితి అలా ఉండిపోయింది. ఘాట్‌రోడ్‌లో స్వంతకారులో వెళ్ళాలంటే అలవాటులేని కొండదారులు కనుక కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి బస్‌లో కానీ, ప్రయివేట్ వెహికల్‌లో కానీ వెళ్ళాలని నిర్ణయించుకొన్నాం. వైజాగ్ బస్‌స్టేషన్ నుంచి అరకు వెళ్ళడానికి ప్రతీ అరగంటకీ ఒక్కో బస్సు ఉంది. దారిలో కొండలు, లోయలు, జలపాతాలు, సుందరమైన ప్రదేశాలు చాలా ఉంటాయి. బస్సుని కావలసిన ప్రదేశంలో నిలుపుకొని ప్రకృతిని ఆస్వాదించడానికి కుదరదు కనుక టవేరాని హయర్ చేసుకొన్నాం. డ్రైవర్ చాలా కోపరేటివ్. ఓపికగా అన్ని ప్రదేశాలూ చూపించుకొంటూ, గైడ్‌లాగా తనకు తెలిసున్న విశేషాలు వివరిస్తూ తీసుకొని వెళ్ళాడు.


ఉదయం ఆరున్నరకే వైజాగ్లో బయలుదేరాం. సన్‌లైట్ ఉన్నంతవరకూ చూసుకొని సాయంత్రం అరకులో తిరుగు ప్రయాణం అవ్వడానికి మాట్లాడాం. సాధారణంగా ఈ సీజన్లో సాయంత్రం నాలుగు, నాలుగున్నరకల్లా అరకులోయలో చీకట్లు ముసురుకొంటాయట. కానీ అదృష్టంకొద్దీ ఆరువరకూ వెలుతురు ఉంది. వాతావరణంకూడా భరించలేనంత చలి కాకుండా చిరుచలితో, నులివెచ్చని సూర్యకిరణాలతో ఆహ్లాదకరంగా ఉంది.  

డ్రైవర్ పేరు విశాఖ. `ఇలాంటి పేరు ఎప్పుడైనా విన్నారా సర్ మీరు?` అని అడిగాడు. తనది విశాఖా నక్షత్రమట, విశాఖపట్నంలో పుట్టాడుకనుక ఆ పేరు పెట్టారట. అలా ఊరిగురించో, దారిగురించో, రాజకీయాలగురించో, తనగురించో ఏదో చెపుతూనే ఉన్నాడు.  డ్రైవర్ రాముడు దగ్గర నుంచి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వరకూ వేలీలో ఏఏ ప్రదేశాలలో ఏ సినిమాలు నిర్మించారో, సన్నివేశాలతో సహా చెప్పాడు. శృంగవరపుకోట దగ్గర ఘాట్‌రోడ్‌లో ప్రవేశించడానికి ముందు తలతిరగకుండా, వొమిటింగ్స్ కాకుండా ఉండడానికి ఏమయినా టేబ్‌లెట్స్ కావాలంటే అక్కడే కొనుక్కొని వేసుకోమని సలహా ఇచ్చాడు. దారి అంతా మెలికలు తిరుగుతూ హెయిర్‌పిన్ బెండ్స్‌తో ఉంటుంది కనుక చాలా మందికి ఈ సమస్య వస్తుందని చెప్పాడు.  

మంచులో తూర్పుకనుమల అందం సమ్మోహనకరం. దూరంగా కొండవాలుల్లో అగ్గిపెట్టెలతో కట్టినట్టు కనిపిస్తున్న ఇళ్ళు, గడ్డిమోపులు, పొలంమడులు, ఎవరో వంటచేసుకొంటున్న పొయ్యిలోనుంచి పైకి వెళుతున్న పొగ, రోడ్డుప్రక్కన చిన్న చిన్న గ్రామాల్లో సంతలు, సంతకు తట్టల్లో, కావిడుల్లో సరుకులు మోసుకొని పోతున్న గిరిజనులు, అంగడుల్లో అమ్మకానికి పెట్టిన తేనెసీసాలు... ప్రతీ చోటా అగి ఫొటోలు తీయాలనే కోరికని ఆపుకోలేం.

ఉడికించిన వేరుశనగ కాయలు, మొక్కజొన్నపొత్తులు, చికెన్‌ముక్కలని పుల్లకు గుచ్చి బొగ్గులమీద కాల్చే గ్రిల్డ్‌చికెన్, బొంగులో చికెన్లని ఎక్కడపడితే అక్కడ అమ్ముతున్నారు. కానీ వేరుశనక్కాయలు తప్పించి మరేమీ తినలేదు. బొర్రాగుహల దగ్గర లంచ్ చేశాం. 

టైడా అనే ఊరిలో రోడ్డుపాయింట్‌కి దగ్గరలో రైల్వే టన్నెల్ ఉంటుంది. రైలు మార్గంలో అరకు వెళ్ళేటప్పుడు ఇలాంటి టన్నెల్స్ 44 దాటాలి. పట్టాలమీదుగా చీకటి టన్నెల్‌లోనికి నడిచి వెళ్ళవచ్చు. ఒకవేళ అదే సమయానికి రైలు వచ్చినా ప్రక్కకు జరిగి నుంచోవడానికి టన్నెల్ గోడకి, పట్టాలకీ మధ్యలో చాలా జాగా ఉంది. అక్కడ పనిచేసుకొంటున్న ఒక రైల్వే ఉద్యోగిని `లోనికి వెళ్ళవచ్చా?` అని అడిగితే, `ఏమీ పరవాలేదు వెళ్ళండి,` అన్నాడు. టైడాలోనే జంగిల్‌బెల్స్ అనే రిసార్ట్ ఉంది. ట్రెక్కింగ్, క్యాంఫయర్, ధింసాడ్యాన్స్ లాంటి ఆక్టివిటీస్‌ని నిర్వహిస్తారు ఇక్కడ.


బొర్రాగుహలు, గాలికొండ, సూయిసైడ్‌పాయింట్, అనంతగిరి ఏపిటీడీసీ హెస్ట్‌హౌస్, కాఫీతోటలు, పసుపుపూలతో ఉండే వలెసెల తోటలు చూసుకొంటూ అరకువేలీకి వెళ్ళి ట్రైబల్ మ్యూజియం చూసి, పాడేరు రోడ్డులో అరకులోయకు సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న చాపురాయి జలపాతాన్ని, తిరిగి వస్తూ మళ్ళీ అరకులో పద్మాపురం గార్డెన్స్ చూసి సాయంత్రం ఆరయ్యేసరికి వైజాగ్ వైపు బయలుదేరాం.  కానీ సరిగ్గా అప్పుడు మొదలయ్యింది సమస్య. చలి, చీకటిలో ప్రయాణం. `ఈ సమయానికి మనం ఘాట్ దిగిపోవాలి సర్,` అన్నాడు విశాఖ. నావైఫ్‌కి, వదినగారికి, అన్నయ్యకొడుకు ప్రణిత్‌కి తలతిరుగుడు, వొమిటింగ్స్ ప్రారంభమయ్యాయి. ఘాట్‌రోడ్ జర్నీ ఎఫెక్ట్. మాటి, మాటికీ ఘాట్‌లో బండి ఆపుకోవడం. చుట్టూ చీకటి, కీచురాళ్ళ అరుపులు, ఉండుండి వేగంగా మమ్మల్ని దాటుకొని వెళ్ళిపోతున్న వాహనాలు. ఎప్పుడు ఘాట్ దిగుతామా అని ఎదురు చూశాం - డ్రైవర్తో సహా అందరం! 


ఈ చిన్న సమస్య కొంచెం ఇబ్బంది పెట్టినా మిగిలిన ప్రయాణం అంతా సజావుగా సాగింది. అందమైన జ్ఞాపకాలు మనసులో దాచుకోవచ్చు!   
© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!