Pages

Showing posts with label రామాయణం. Show all posts
Showing posts with label రామాయణం. Show all posts

Monday, 26 March 2018

శ్రీరామ జననం


గంగానదికి ఉత్తర దిక్కున, సరయూ నదీ తీరాన కోసలదేశమనే గొప్ప రాజ్యం ఉండేది. కోసలదేశపు రాజధాని అయోధ్య. అయోధ్య అంటే యుద్ధము ద్వారా జయింప వీలుకానిది  అని  అర్థం. పేరుకు తగినట్టుగా పన్నేండు యోజనాల వెడల్పు, మూడు యోజనాల పొడవు కలిగిన అయోధ్యా నగరం సుందరమైన రాజ భవనాలు, విశాలమైన రహదారులు, ఎత్తైన కోటగోడలు, వాటికి వెలుపల లోతైన కందకాలతో శత్రుదుర్భేద్యమైనది. మనువు అనే సూర్యవంశపు చక్రవర్తి దీనిని నిర్మించాడు. 

మనువు వంశంలోని ఇక్ష్వాకుడు అనే మరొక చక్రవర్తి పేరు మీద వీరి వంశం ఇక్ష్వాకువంశంగా ప్రశిద్ధి పొందింది. దశరథుడు ఇక్ష్వాకుల రాజులలో అగ్రగణ్యుడు. ఈయన దేవతల పక్షాన యుద్ధం చేసి ఎంతో ఖ్యాతిని గడించాడు.

ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనే ఎనిమిదిమంది సమర్థులైన మంత్రులు, రాజక్షేమాన్ని కోరే వసిష్ఠుడు, వామదేవుడు, కాశ్యపుడు, గౌతముడు, జాబాలి, సుయజ్ఞుడు అనే ఋషిపుంగవులు, ధార్మిక కార్యక్రమాలని నిబద్దతతో నిర్వర్తించే బ్రాహ్మణోత్తములు, యుద్ధతంత్రంలో ఆరితేరిన సేనా నాయకులు, లెక్కకు మిక్కిలిగా అప్రమత్తత కలిగిన గూడచారులు, అసంఖ్యాకమైన గొప్ప సైన్యంతో దశరథుడు ధర్మపరాయణుడై, సత్యవాక్పాలనాపరుడై ఐశ్వర్యంలో కుబేరుడేమో, రాజ్యపాలనలో ఇంద్రుడేమో అనిపించేవాడు. ప్రజలకు భారం కాని విధంగా పన్నులు ఉండేవి. నేరాల సంఖ్య తక్కువ. నేరస్తులకు తగిన శిక్షలు ఉండేవి. దశరధుడి పాలనలో ప్రజలు ధర్మబద్ధులై ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో, సుఖసంతోషాలతో జీవించేవారు.

ఋతుధర్మాలను అనుసరించి ఎండలు మెండుగా కాస్తున్నాయి. వర్షాలు చక్కగా కురుస్తున్నాయి. పాడిపంటలు సమృద్ధిగా ఉన్నాయి.

కానీ...

దశరధుడికి చాలా కాలం వరకూ సంతానం కలుగలేదు.

ఒకనాడు మహారాజు ముఖ్యులనందరినీ సమావేశపరిచాడు. వారిని ఉద్దేశించి ఆయన ఇలా అంటున్నాడు... 'సంతాన సాఫల్యత కోసం అశ్వమేధయాగాన్ని చేయాలని సంకల్పించాం. కాబట్టి ఋత్విక్కులను సంప్రదించి యాగాన్ని చేసే విధానాన్ని కూలంకుషంగా తెలుసుకోండి. పురోహితులకు ముహూర్తాలను నిర్ణయించమని మా మాటగా చెప్పండి. సరయూ నదీ తీరాన యాగ శాలలు నిర్మించడానికి ఏర్పాట్లు చెయ్యండి. ఆహ్వానితుల జాబితాలను తయారు చెయ్యండి. యాగానికి తరలి వచ్చే అతిదులకు వసతి, భోజన ఏర్పాట్లు ఘనంగా ఉండేలా ప్రణాళికలను సిద్ధం చెయ్యండి.     వారిని అలరించడానికి నృత్య, గాన కార్యక్రమాలను ఏర్పాటు చెయ్యండి. యాగశాలను సర్వాంగసుందరంగా నిర్మించడానికి రాజ్యంలో ఉన్న గొప్పశిల్పులని నియమించండి. కళాకారులకు సత్కారాలు, బ్రాహ్మణులకు దాన ధర్మాలు, ప్రజలకు అన్ని సౌకర్యాలు... జరిగేలా పర్యవేక్షణ బాధ్యతలు సమర్ధులకు అప్పగించండి.'  

సమావేశం ముగిసింది. సభాసదులందరూ నిష్క్రమించారు. సుమంత్రుడు మాత్రం ఉండిపోయాడు. మహారాజుకి ఒక ముఖ్యవిషయం చెప్పవలసి ఉంది. చాలా కాలం క్రితం సుమంత్రుడు - సనత్కుమారుడనే ఒక మహర్షి తన శిష్యులతో చెప్పిన మాటలు విన్నాడు. దశరధుడనే మహారాజు పుత్రుల కోసం అశ్వమేధయాగం చేస్తాడని... ఆయనకి పుత్రులు జన్మిస్తారనీ... అయితే ఆ యాగంతోపాటు పుత్రకామేష్టి యాగం కూడా జరుగవలసి ఉన్నదనీ, యాగాలకు ఆధ్వర్యుడిగా ఋష్యశృంగుడు తప్పనిసరిగా ఉండాలని ఆయన చెపుతుండగా సుమంత్రుడు విన్నాడు.

దశరధుడికి చాలా సంతోషం కలిగింది. ఋష్యశృంగుడి గొప్పతనమేమిటో, ఆయన ఎవరో తనకు చెప్పమని సుమంత్రుడిని అడిగాడు.

*     *     *

పూర్వం విభాండకమహర్షి అనే గొప్ప తపస్వి  ఉండేవాడు. ఒకనాడు ఆయన సరోవరంలో స్నానం చేస్తూ ఉండగా వీర్యపు చుక్క ఒకటి జారిపడింది. దానిని ఒక జింక సేవించడంతో, దాని గర్భంనుంచి శిరస్సు పైన  కొమ్ముతో ఒక బాలుడు జన్మించాడు. ఆయనే ఋష్యశృంగుడు.

విభాండకమహర్షి కుమారుడిని ఆశ్రమం, అడవి తప్ప మరో ప్రపంచం తెలియకుండా పెంచాడు. అతనికి వేదాధ్యయనం చెయ్యడం, యజ్ఞయాగాదులలో పాల్గొనడం, కందమూలాలు భుజించడం తప్ప మరేమీ తెలియదు. స్త్రీలను ఎప్పుడూ చూడలేదు కనుక స్త్రీ, పురుష భేదం తెలియదు.

ఇది ఇలా ఉండగా అక్కడికి సమీపంలో ఉన్న అంగరాజ్యంలో చాలాకాలంగా వర్షాలు కురియక మహాక్షామం సంభవించింది. 'ఋష్యశృంగుడిని రాజ్యానికి తీసుకొనివస్తే వర్షాలు కురుస్తాయి' అని మహారాజు రోమపాదుడికి  విజ్ఞులు చెప్పారు.  కానీ, విషయసుఖాలు ఏమీ తెలియని ఋష్యశృంగుడిని రాజ్యానికి రప్పించడం ఎలా? ముఖ్యమైన వాళ్ళందరూ సమావేశమయ్యారు. రాజ్యంలో ఉన్న అపార సౌందర్యవంతులైన వేశ్యలను నియమించి ఈ కార్యాన్ని నిర్వర్తించాలని నిశ్చయించారు.

విభాండకమహర్షి ఆశ్రమంలో లేని సమయం చూసి, రోమపాదుడిచే పంపబడిన వేశ్యలు అందంగా అలంకారాలు చేసుకొని, ఆశ్రమ సమీపంలో నృత్యగానాలు చేస్తూ, తమ హొయలతో ఋష్యశృంగుడిని ఆకర్షించారు. అతని అహ్వానం మీద ఆశ్రమానికి వెళ్ళి, కందమూలాలతో ఇచ్చిన ఆతిధ్యం స్వీకరించారు. తరువాత రోజు ఆయన కూడా తమ ఆశ్రమానికి రావాలని ఆహ్వానించారు. ఆశ్రమానికి అనే నెపంతో ఋష్యశృంగుడిని సరాసరి అంగరాజ్యానికి తీసుకొని వచ్చారు. ఆ మహానుభావుడు రాజ్యంలో అడుగు పెట్టగానే కుంభవృష్ఠి కురిసింది.  రోమపాదుడు ఎంతో సంతోషించి, తన కుమార్తె శాంతను ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేసి, వాళ్ళని అంగరాజ్యంలోనే ఉంచుకొన్నాడు.

*     *     *

దశరధుడు అంగరాజ్యం వెళ్ళాడు. రోమపాదుని అతిధిగా కొన్నిరోజులు ఉన్న తరవాత, ఆతని కుమార్తె శాంతను, జామాత ఋష్యశృంగునీ తనతో పాటు అయోధ్యకు పంపమని కోరాడు. రోమపాదుని అంగీకారంతో వారు అయోధ్యా నగరం చేరిన పిదప దశరధుడు విషయాన్ని ఋష్యశృంగునికి వివరించి, ఆతనిని అశ్వమేధయాగానికీ, పుత్రకామేష్టికి ఋత్విక్కుగా ఉండమని అభ్యర్థించాడు. ఋష్యశృంగుడు సంతోషంగా అంగీకరించాడు. శాస్త్రాలలో నిర్ణయించిన ప్రకారం యాగ క్రతువులు నభూతో...నభవిష్యతీ అన్న చందంగా జరుగుతూ ఉన్నాయి. యాగం అంటే ఒక్కరోజులో పూర్తి అయ్యేది కాదు - చైత్రమాసంతో మొదలై, ఆరు ఋతువులూ చూసి, మరుసటి చైత్రం వరకూ కొనసాగింది. వచ్చిన వాళ్ళందరికీ షడ్రుచులతో కూడిన భోజన ఏర్పాట్లు చేశారు, సత్కారాలు చేశారు, నూతన వస్త్రాలను బహూకరించారు. సంతుష్టులై.. అందరూ దశరధుని అభీష్టం నెరవేరాలని దీవించారు.

*     *     *       

ఒకవైపు యాగం జరుగుతూ ఉండగా దేవతలందరూ బ్రహ్మదేవుని దగ్గర సమావేశం అయ్యారు. బ్రహ్మనుంచి - రావణాసురుడు తనకు దేవ, దానవ, యక్ష, గాంధర్వ... తదితరులచే మరణం కలుగకుండా ఉండాలని వరం పొందాడు. కానీ, మానవులమీద ఉన్న చులకన భావం వల్ల వారిని చేర్చలేదు. బ్రహ్మ ద్వారా వరాలు పొందిన రావణాసురుడి ఆగడాలు శృతిమించి పోతున్నాయి.ఆతనిని నిలువరించే ఉపాయం చెప్పమని వారు బ్రహ్మని వేడుకొన్నారు. `విష్ణుభగవానుడే రావణుని సంహరించగల సమర్ధుడు` అని బ్రహ్మ సూచించిన పిమ్మట, దేవతలందరూ విష్ణువుని `ఈ ఆపదనుంచి కాపాడు` అని ప్రార్థించారు. విష్ణుభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. `రావణాసురుడిని నిర్మూలించే కారణం కోసం, పుత్రకామేష్టి యాగం చేస్తున్న దశరధుని ఇంట నలుగురు కుమారులుగా జన్మిస్తాను` అని వారికి మాట ఇచ్చాడు.         

రామ రావణ సంగ్రామంలో రాముడికి సహాయం చెయ్యడానికి దేవతలు అందరూ తమతమ అంశలచే - అప్సర, గంధర్వ స్త్రీలద్వారా వానర సేనను సృజించమని బ్రహ్మ ఆదేశించాడు. బ్రహ్మ ఆవులించినప్పుడు ఆయన ముఖం నుంచి జాంబవంతుడు జన్మించాడు. ఆతను వానర సేనలకు అండగా ఉంటాడని తెలియజేశాడు. ఇంద్రుడి అంశచే వాలి, సూర్యుడి వలన సుగ్రీవుడు, వాయుదేవుని వలన హనుమంతుడు... తదితర వీరులు జన్మించారు.  బ్రహ్మ ఆదేశానుసారమే - విష్ణుభగవానుడు రాముడిగా అవతరించడానికి ముందే వానరులంతా జన్మించి ఆయన సేవకై ఈ భూమండలం మీద వేచి ఉన్నారు.   

*     *     *   
పుత్రకామేష్ఠి యాగం పూర్తి అవుతూ ఉండగా, యజ్ఞకుండం నుంచి తేజోవంతమైన ఓ మహా పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో ఓ బంగారు కలశం ఉంది. దాని పైన వెండి మూత కప్పి ఉంది. దశరదుడి ఆ మహా పురుషునికి భక్తిపూర్వకంగా ప్రణామాలు అర్పించాడు. `దశరధా నీ యాగం ఫలించింది. ఈ పాత్రలో దేవతలచే చేయబడిన పాయసం ఉంది. దీనిని నీ రాణుల చేత సేవింపచెయ్యి. నీకు పుత్ర సంతానం కలుగుతుంది.` అని చెప్పి ఆయన పాయస కలశాన్ని మహారాజుకి అందజేశాడు.

దశరధుడు పాయసంలో సగభాగాన్ని (1/2) కౌశల్యకు ఇచ్చాడు. మిగిలిన దానిలో సగాన్ని (1/4) సుమిత్రకి ఇచ్చాడు, చివరకు మిగిలిన పావు వంతులో సగభాగాన్ని(1/8) కైకకు, మిగిలిన మరో భాగాన్ని(1/8) మళ్ళీ సుమిత్రకు ఇచ్చాడు. అనతికాలంలోనే ముగ్గురూ గర్భవతులు అయ్యారు.

చైత్రమాసంలో నవమిరోజు కర్కాటక లగ్నం పునర్వసు నక్షత్రంలో కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. దశమిరోజు పుష్యమీ నక్షత్రంలో కైకేయికి భరతుడు; ఆశ్లేష నక్షత్రంలో సుమిత్రకి కవలలు - లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు.   

దశరధుని కుమారులకి నామకరణం వశిష్టుని చేతులమీదుగా జరిగింది. కౌశల్యా తనయునికి - అందరినీ ఆనందింపచేసే సుగుణములు కలవాడు కనుక రాముడు అని; కైకేయి తనయునికి రాజ్యభారాన్ని భరిస్తాడు కనుక భరతుడని; సుమిత్రా తనయులలో సర్వ శుభలక్షణాలూ ఉన్న వాడికి లక్ష్మణుడని, శత్రువులని సంహరించే వాడికి శత్రుఘ్నుడని పేర్లు పెట్టారు.   

శ్రీరామ నవమినాడు సర్వకాలాల్లోనూ మానవులందరికీ ఆదర్శప్రాయమైన శ్రీరాముని కథకి అంకురార్పణ జరిగింది. 

© Dantuluri Kishore Varma

Thursday, 4 January 2018

వాల్మీకి

ఆదికావ్యం రామాయణాన్ని రచించిన వాల్మీకిమహర్షి  అసలు పేరు అగ్నిశర్మ. అతని తండ్రి సుమతి, తల్లి కౌశికి.  కుటుంబ పోషణ కోసం వేదపఠనాన్ని, పౌరోహిత్యాన్ని కాకుండా దారిదోపిడీని వృత్తిగా ఎంచుకొన్నాడు అగ్నిశర్మ. అడవిలో ఆశ్రమం నిర్మించుకొని కుటుంబంతో సహా జీవిస్తున్నాడు. 

ఒకరోజు సప్త ఋషులయిన వశిస్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, అత్రి, జమదగ్ని, భరద్వాజుడు, కశ్యపుడూ తీర్థయాత్రలకు వెళుతూ అగ్నిశర్మ ఆశ్రమ సమీపంలో ఉన్న అడవిదారిగుండా ప్రయాణం చేస్తున్నారు. అగ్నిశర్మ వారిని అటకాయించాడు. వారివద్ద ఉన్న వస్తువులు, ఆహారపదార్థాలు ఇవ్వమని బెదిరించాడు. అప్పుడు అత్రి మహాముని, `నాయనా మనుష్యులని హింసించి, చంపి ఆర్జించే సంపదవల్ల పాపం కలుగుతుంది. ఇదంతా ఎవరికోసం చేస్తున్నావు?` అని ప్రశ్నించాడు. `తల్లితండ్రుల కోసం, భార్యాపిల్లల కోసం,` అని సమాధానం చెప్పాడు అగ్నిశర్మ.   `అలా అయితే, నీ సంపాదనలో భాగం పంచుకొంటున్న వాళ్ళు- నీ పాపాలలో కూడా భాగం పంచుకొంటారేమో తెలుసుకొని రా,` అన్నాడు అత్రి.

సప్తఋషులని అక్కడే వేచి ఉండమని చెప్పి, ఇంటికి వెళ్ళాడు అగ్నిశర్మ. తల్లిని, తండ్రిని, భార్యని `నా పాపంలో భాగం పంచుకొంటారా?` అని అడిగాడు. `సక్రమంగానో, అక్రమంగానో సంపాదించి కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత ఒక గృహస్తుగా  నీకు ఉంది. ఆ కర్తవ్య నిర్వాహణలో సంభవించే పాపపుణ్యాలు పూర్తిగా నీవే తప్ప, మావి కాదు` అని వాళ్ళు చెప్పారు.  

ఈ సమాదానంతో  అగ్నిశర్మ ఎంతో దిగులు చెందాడు. సప్తఋషుల దగ్గరకు తిరిగివెళ్ళి జరిగిన విషయం చెప్పాడు. తనకు మార్గనిర్దేశం చెయ్యమని వేడుకొన్నాడు. అప్పుడు అత్రి మహర్షి అగ్నిశర్మకి శివ పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి,  ధ్యానం చెయ్యమని చెప్పాడు. 

అగ్నిశర్మ ధ్యానం చేస్తూ ప్రపంచాన్ని మరచిపోయాడు. ఆకలి, దప్పికలు లేవు. బాహ్యస్మృతిలేదు. రోజులు, మాసాలు, ఏళ్ళు గడిచాయి. అగ్నిశర్మ శరీరం చుట్టూ పుట్టలు మొలిచాయి. పదమూడు సంవత్సరాల తరువాత తీర్థయాత్రల నుంచి తిరిగి ఆదే మార్గంలో వస్తున్న మహర్షులు పుట్టలో ఉండి ధ్యానం చేస్తున్న అతనిని గమనించి, బయటకు పిలిచారు. పుట్టను సంస్కృతంలో వాల్మీకం అంటారు. వాల్మీకం నుంచి బయటకు వచ్చాడు కనుక అగ్నిశర్మ అప్పటినుంచీ వాల్మీకి అయ్యాడు. 

*     *     * 

ఆ తరువాత వాల్మీకి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్ళాడు. ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేసుకొని, పరమేశ్వరుడ్ని ఆరాదించాడు. చిత్రకూట పర్వతం మీద కొన్నిరోజులు ఉండి, అటుపిమ్మట తమసానది తీరంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని, శిష్యులతో సహా అక్కడ నివశిస్తున్నాడు. 

ఆ సమయంలోనే ఆయనకు ఒక సందేహం వచ్చింది. `ఇదీ లోపం అని వేలుపెట్టి చూపించడానికి అవకాశం లేని, సకల సద్గుణాలూ కలిగిన మహాపురుషుడు ఎవరైనా ఈ భూమండలం మీద ఉండి ఉంటారా?` అని. అటువంటి వ్యక్తి ప్రియమైన రూపం కలిగినవాడై ఉండాలి. ముఖంలో మంచి తేజస్సు వుండాలి. బలం, ధైర్యం, పరాక్రమం కలిగి ఉండాలి. సకలవిద్యలలోనూ పారంగతుడై ఉండాలి. సమర్దుడై ఉండాలి, దృడసంకల్పం కలిగినవాడై ఉండాలి. ధర్మాధర్మాలు తెలిసి ఉండాలి. సకలప్రాణుల హితం కోరుకోవాలి. ఎవరైనా తనకు చేసిన మేలు మరచిపోకూడదు - అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా అసత్యం పలుకని వాడై ఉండాలి. మంచి చరిత్ర కలిగిన వాడై ఉండాలి... ఉండవలసిన సుగుణాలు ఇవి. మరి అతనికి ఉండకూడని దుర్గుణాలు ఏమిటి? అసూయ ఉండకూడదు. క్రోదాన్ని జయించిన వాడై ఉండాలి - అలాగని అసలు కోపమే ఉండకూడదని కాదు. ఏదైనా సహేతుకమైన కారణం చేత అతనికి కోపం కనుక వస్తే దేవతలు కూడా భయపడే విధంగా ఉండాలి.  

ఏవైనా ఒకటి రెండు మంచి గుణాలు ఉన్న వ్యక్తి తారసపడితేనే ప్రశంసాపూర్వకమైన ఆనందంతో తబ్బిబ్బైపోతాం. ఆలాంటిది, వాల్మీకి యోచించిన పదహారు సుగుణాలూ రాసిపోసుకొన్న పురుషోత్తముడు గురించి తెలుసుకొంటే ఆశ్చర్యం, ఆనందం, గౌరవం, భక్తి... అన్నీ కలగలిసి పారవశ్యం కలూగకుండా ఉంటుందా !? 

ఒకరోజు నారదమహర్షి, వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన సందర్భంలో, వాల్మీకి తన సందేహాన్ని ఆయన వద్ద వ్యక్తం చేశాడు. వాల్మీకి అడిగిన ప్రశ్న ఇదే...

"కో న్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ 
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత: 
చారిత్రేణ చ కో యుక్త: సర్వభూతేషు కో హిత: 
విద్వాన్ క: కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన: 
ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో..అనసూయక: 
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సమ్యుగే 

అప్పుడు నారద మహర్షి - ఇక్ష్వాకు వంశంలో జన్మించిన శ్రీరాముడికి ఆ పదహారు సుగుణాలూ ఉన్నాయని చెపుతూ, రాముడి కథని వందశ్లోకాలలో సంక్షేప రామాయణంగా వినిపించాడు. 

రామాయణం ప్రతీ సన్నివేశంలో రాముడి శౌశీల్యం ఉదాత్తంగా అభివ్యక్తమౌతుంటుంది. దానిని వాల్మీకి చెప్పిన సుగుణాల కోణంలో పరిశీలిస్తే రాముడు ఎంత గొప్ప కథానాయకుడో తెలుస్తుంది. నిజానికి వాల్మీకి అడిగిన ప్రశ్నని పటంకట్టించి ప్రతీ పాఠశాలలో, ప్రతీ కార్యాలయంలో, మనుష్యులు తిరిగే ప్రతీ చోటా తగిలిస్తే... దాని అర్థాన్ని వివరిస్తే ప్రపంచంలో ఏ వ్యక్తిత్వవికాస పుస్తకమూ చేయలేని మంచి, అది మనకు చేస్తుంది. 
*     *     *

రామాయణం - రాముడి కథ, ఆయన నడచిన దారి, నారద మహర్షి నుంచి విన్న రామాయణంలో సన్నివేశాలు వాల్మీకి మనసులో నిరంతరాయంగా మెదులుతున్నాయి. సంధ్యావందనం చేయడానికి శిష్యునితో కలసి తమసానది వైపుకి వాల్మీకి మహర్షి వెళుతూ ఉండగా ఒక చెట్టుకొమ్మమీద జతకట్టి ఉన్న రెండు క్రౌంచపక్షులు ఆయన కంట పడ్డాయి. అంతలో ఎక్కడినుంచో ఒక బోయవాడు గురిచూసి కొట్టిన బాణం సూటిగా వచ్చి మగపక్షి గుండెల్లో దిగబడింది. అది విలవిలలాడుతూ నేలకూలిన వైనం, ఆడపక్షి ఆక్రోశం వాల్మీకి మనసుని కలిచివేశాయి. వెంటనే ఆయన కోపంగా `కామమోహంతో పరవశించి ఉన్న క్రౌంచ పక్షులలో ఒకదానిని సంహరించావు కనుక నీవుకూడా త్వరలోనే మరణిస్తావు` అని ఒక శ్లోక రూపాన బోయవాడిని శపించాడు. ఆవిధంగా శపించినందుకు ప్రశ్చాత్తాప పడినా, శ్లోకంలోని చందస్సు, లయ వాల్మీకికి సంబ్రమాశ్చర్యాలను కలిగించాయి. ఆ శ్లోకాన్నే మననం చేసుకొంటూ ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.

రామాయణ మహాకావ్యం ఆవిష్కృతమవ్వడానికి సమయం ఆసన్నమయ్యింది. వాల్మీకి ఎదుట బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆజ్ఞ మేరకే తనకి సరస్వతీ కటాక్షం కలిగి, శాపం స్లోకం రూపంలో అభివ్యక్తమైందని వాల్మీకికి తెలుస్తుంది. బ్రహ్మ అనుగ్రహం వల్ల వాల్మీకికి జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది తెలుసుకొనే దివ్యదృష్టీ, రామాయణ పాత్రల మనసుల్లో మెదిలే ఆలోచనలు కూడా చదవగలిగే శక్తి వచ్చాయి. ఈ భూమండలంమీద పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణం నిలిచి ఉంటుందని చెప్పి, బ్రహ్మ అంతర్దానం అయ్యడు.

బోయవాడిని శపించిన శ్లోకం యొక్క చందస్సులోనే వాల్మీకి రామాయణాన్ని రచించాడు. నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణాన్ని విస్తరించి బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్దకాండ అనే ఆరు కాండలుగా, ఇరవై నాలుగు వేల శ్లోకాలతో  ఆదికావ్యంగా వాల్మీకి మహర్షి రచించాడు. తరువాత జరిగిన కథని ఉత్తరకాండగా ఆ ఆరుకాండలకీ జతచేశాడు. పరమ పవిత్రమైన గాయత్రీమంత్రంలోని ఇరవైనాలుగు అక్షరాలలో ఒక్కొక్కదానినీ వెయ్యి శ్లోకాలుగా విస్తరించి రామయణ కావ్యాన్నీ రచించడం జరిగిందని చెపుతారు. ఆవిధంగా గ్రంధస్థం చేసిన రామాయణ మహాకావ్యాన్ని గానంచేసే పద్ధతిని అప్పటికే వాల్మీకి ఆశ్రమంలో పెరుగుతున్న సీతారాముల కుమారులు కుశలవులకు నేర్పించాడు.

శివుడిని ధ్యానించి అగ్నిశర్మ వాల్మీకి అయ్యాడు. బ్రహ్మ అనుగ్రహంతో సరస్వతీ కటాక్షాన్ని పొంది శ్రీమహావిష్ణువు యొక్క అవతారమైన రాముడి కథని శ్రీమద్రామాయణంగా రచించాడు. త్రిమూర్తుల అనుగ్రహం వల్ల రామాయణం అజరామర కావ్యంగా ఈ భూమండలంమీద నిలచిపోయింది.   విలువలు పతనం ఐపోతున్న ఈ రోజుల్లో, ప్రతీ ఒక్కరూ రామాయణాన్ని చదవడం అత్యంత ఆవశ్యకం. ఆదర్శవంతమైన రాముడి వ్యక్తిత్వం - మంచీచెడూ, ధర్మాధర్మ విచక్షణని ప్రతీఒక్కరిలోనూ కలిగించగలదు.

Monday, 7 April 2014

సీతారామకళ్యాణం

విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణా బాధ్యతని స్వీకరించి రామలక్ష్మణులు మహర్షివెంట అడవులకు వెళ్ళారు. తాటకిని, మారీచ సుభాహుల్ని వదించి కర్తవ్య నిర్వాహణని పూర్తిచేశారు. అటుపిమ్మట మిథిలా నగరానికి పయనం. మిథిల జనకుని రాజధాని. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మయోగి గురించి చెపుతూ జనకుడిని ఉదహరిస్తాడు. అటువంటి జనకుడు ఒకసారి యాగం నిర్వహించ తలపెట్టి భూమిని త్రవ్వుచూ ఉండగా అయోనిజ సీత లభిస్తుంది. రామలక్ష్మణులు మిథిలా నగరానికి వచ్చే సమయానికి ఆమె యవ్వనవతి. ఆమెకు భర్తగా రాగల వ్యక్తి సామాన్యుడు అయి ఉండడానికి వీలులేదు. అందుకే ఎప్పుడో దక్షయజ్ఞం తరువాత శివుడు జనకుని పూర్వీకులకు అప్పజెప్పిన శివధనస్సుని ఎక్కుపెట్టగలిగిన ధీరుడే ఆమె చేయి అందుకోగలిగిన అర్హత గలిగిన వాడు అని జనకుడు భావించి ఉన్నాడు.    

ఆ దనుస్సుని సోదరులు చూడగోరారు. జనకుని ఆజ్ఞని అందుకొన్న సేవకులు ఎనిమిది చక్రాలు కలిగిన శివదనుస్సును ఉంచిన పేటికని తీసుకొని వచ్చారు. అప్పుడు ఒక గొప్ప ఘట్టానికి తెరలేచింది. రఘురాముడు శివధనుర్భంగం చేశాడు. అది ఒక అపురూప సన్నివేశం.  ముళ్ళపూడి వెంకటరమణ గారు సీతా కళ్యాణం అనే కథలో నీలిమేఘశ్యాముడ్ని లక్మణుడి దృష్టికోణంలోనుంచి ఆవిష్కరించారు.

విల్లును చేపట్టబోవడంలో సొగసు
నిలబెట్టి..
దక్షిణ పాదంగుష్ఠానికి దన్నుపెట్టి వంచి..
తృటిలో అల్లెతాడు ఎక్కించడంలో వొడుపు, సౌలభ్యం
బాణం ఆరోపించడంలో మెలుకువ
నారిని ఆకర్ణాంతం లాగబోవడంలో చూపిన అంగవిన్యాసం 
సమ్మోహనకరంగా తోచాయి. 
అవలీలామానుష విగ్రహుడుగా గోచరించాడు.
Raja Ravi Varma`s Painting
దశరదమహారాజుకి వర్తమానం పంపారు. వార్తాహరులు వెళ్ళడానికి మూడురోజులు, అటునుంచి ఆయన బందుమిత్ర, సపరివార సమేతంగా కానుకలతో, మందీ మార్బలంతో తరలిరావడానికి మరో మూడురోజులు, మధ్యలో ఏర్పాట్లు చూసుకోవడానికి ఒక రోజు. రాముడు విల్లు విరిచిన తరువాత ఏడురోజుల నిరీక్షణ సీతకి.. రాముడుకికూడా! ఆ సుదీర్గమైన సమయంలో ఆమె ఏమిచేసిందో మళ్ళీ ముళ్ళపూడి రమణగారి మాటల్లో..

చెలులూ, చెల్లెళ్ళూ కూడా జానకికి ముప్పొద్దులా రామకథలే చెప్పారు. 
చెప్పిన కొద్దీ ఊరేవి; ఊరిన కొద్దీ ఊరించేవి!

సీతాదేవి చెల్లెలు ఊర్మిళ ఆమెని లక్ష్మణుడికి ఇచ్చి పరిణయంచేస్తే బాగుంటుందని భావించారు. అలాగే జనకుని సోదరుడు కుశధ్వజునికి ఇద్దరు కుమార్తెలు - మాండవి, శ్రుతకీర్తి. వాళ్ళిద్దరినీ భరత శతృగ్నులకి ఖాయం చేశారు. నాలుగు జంటలూ ఒకే ముహూర్తానికి ఒక్కటయ్యాయి.  

ఆవిధంగా ఉత్తరఫల్గుణీ నక్షత్రంలో  సీతారామకళ్యాణం అంగరంగ వైభోగంగా జరిగింది.   

రేపు శ్రీరామనవమి. రామాలయాల్లో సీతారాముల కళ్యాణం జరుపుతారు. చూసి తరించండి. 

© Dantuluri Kishore Varma

Thursday, 18 April 2013

ఏ యూనివర్సిటీలోనూ నేర్పనివి

తండ్రి మాటకు ఎదురు చెప్పని వినయం

రాక్షసులని దునుమాడిన శౌర్యం

కష్టాలు ఎదురైనప్పుదు మొక్కవోని ధైర్యం

సైన్యాన్ని నడిపినప్పుడు ప్రదర్శించిన

నాయకత్వలక్షణాలు

మాటతప్పని నైజం...

ఏ యూనివర్సిటీలోనూ ఈ సాఫ్ట్ స్కిల్స్ నేర్పరు, 

కానీ.... 

ప్రతీ వ్యక్తికీ కావలసిన విలువలు ఇవే!

శ్రీరామనవమి శుభాకాంక్షలు.


 © Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!