Wednesday, 30 October 2013

హాలోవీన్ - జాక్ ఓ` లాంటర్న్ కథ

ప్రతీసంవత్సరం హాలోవీన్ అక్టోబర్ 31న జరుపుకుంటారు. అమెరికాలో హలోవీన్ హడావుడి ఎక్కువగా ఉంటుంది. గుమ్మడికాయలని మనిషిముఖం ఆకారంలో చెక్కి, లోపల దీపంపెడతారు. కళ్ళు, ముక్కు, నోరూ ఉండే ప్రాంతంలో అయా ఆకారాల్లో రంద్రాలు చేసి ఉంటాయి కనుక వాటిలోనుంచి దీపం వెలుగు బయటికి వస్తుంటుంది. కిటికీలలో, గుమ్మాలదగ్గర వీటిని ఉంచుతారు. దీనిని జాక్ ఓ`లాంటర్న్ అంటారు. పిల్లలు, పెద్దవాళ్ళూ భయంకరమైన విచిత్ర వేషాలు వేసుకొంటారు. హాలీవుడ్ హారర్ సినిమాల్లో చూపించే క్షుద్ర ఆత్మల్లాంటివీ, మంత్రగత్తెల వేషాలూ కూడా ఉంటాయి. రాత్రిపూట మంటలు వేస్తారు, స్వీట్స్ పంచుతారు, అందరితో కలిసి ఆటపాటల్లో పాల్గొంటారు, భయంగొలిపే సినిమాలు, ప్రదర్శనలు చూస్తారు, కథలు మిగిలినవారికి చదివి వినిపిస్తారు. ఇది ఒక వినోదం, ఒక నమ్మకం, ఒక సంస్కృతి.
నిజానికి ఇది అమెరికా వేడుక కాదట. ఐర్లాండ్‌ది అట. చాలాకాలం క్రితం ఐర్లాండ్ దేశంలో పెద్ద కరువు రావడంతో చాలా మంది ఉత్తర అమెరికాకి వలస వచ్చారుట. వాళ్ళతో పాటూ వాళ్ళ సంస్కృతికూడా వచ్చింది. అక్టోబరు 31 అనేది ఆకురాలేకాలాపు చివరిరోజు, శీతాకాలానికి మొదటిరోజు. సరిగ్గా ఈ రోజు మనుష్యులకీ, ఆత్మలకీ మధ్యనున్న గీత చెరిగిపోతుందని నమ్ముతారు. అందువల్ల ఆత్మలు వచ్చి మనుష్యులకి హానిచేస్తాయని నమ్మిక. వాటిని దూరంగా ఉంచడానికి ఇలాంటి వేడుకలు చేస్తారు. 

ఐర్లాండ్లో జాక్ అనే ఒక పిసినారి తాగుబోతు వుండేవాడు. వాడిని స్టింజీజాక్ అని పిలిచేవారు. ఒకరోజు తనతో పాటూ త్రాగడానికి ఒక దెయ్యన్ని ఆహ్వానిస్తాడు. మందుకొట్టులో ఇద్దరూ తాగుతారు. డబ్బులు చెల్లించడానికి దెయ్యాన్ని నాణెంగా మారమని అడుగుతాడు. అలాచేస్తే డబ్బుచెల్లించిన తరువాత తిరిగి తన స్వంత రూపంలోకి మారిపోవచ్చని నమ్మబలుకుతాడు. కానీ, డబ్బుగా మారిన దెయ్యాన్ని కొట్టువాడికి చెల్లించకుండా తనజేబులో వేసుకొంటాడు. అప్పటికే జేబులో ఉంచుకొన్న వాడి మతచిహ్నం వల్ల దెయ్యం తిరిగి అసలు రూపులోకి మారలేకపోతుంది. 

కొంతకాలం తరువాత దెయ్యం అభ్యర్ధనలమీదట దాన్ని వదిలి పెడతాడు. మళ్ళీ తరువాతి సంవత్సరంకూడా దానికి మాయమాటలు చెప్పి ఇంటికి పిలిచి, పళ్ళుకోసి పెట్టమని  చెట్టు ఎక్కిస్తాడు. ఎక్కిన తరువాత, చెట్టుమొదలు మీద మతచిహ్నాన్ని చెక్కుతాడు. తనను పోనివ్వమని దెయ్యం ప్రాధేయపడుతుంది. తాను మరణించిన తరువాత నరకానికి లాక్కొని పోవద్దని మాటతీసుకొని దాన్ని వదిలి పెడతాడు. 

స్టింజీజాక్ ఒకరోజు చనిపోయాడు. వాడి ఆత్మకి స్వర్గంలో చోటులేదని బయటికి గెంటేస్తారు. ఇచ్చినమాటకు కట్టుబడి దెయ్యం వాడిని నరకానికి తీసుకొని వెళ్ళదు. అందుకే వాడు ఒకదుంపలో చిన్న దీపం పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ దీపానికే జాక్స్ లాంటర్న్ అని పేరు. అదే కాలక్రమేణా జాక్ ఓ` లాంటర్న్ అయ్యింది. ఈ కథ ఐర్లాండ్లోది కనుక అక్కడివాళ్ళు ప్రతీ హాలోవీన్ సమయంలోనూ దుంపల్ని దీపాల్లా చెక్కేవారట. కానీ, ఆ సంస్కృతి గుమ్మడికాయలు విరివిగా దొరికే అమెరికా రావడంతో, వాటితో చెయ్యడం మొదలైంది.  


© Dantuluri Kishore Varma 

Sunday, 27 October 2013

నెమలీ, ఇంక్రెడిబుల్ ఇండియా

ఒక అమ్మాయి చక్కగా డ్యాన్స్ చేస్తుంటే, `నెమలికి నేర్పిన నడకలివీ..` అని పాడతారుకానీ, నిజానికి అందంగా నడిచి, పురివిప్పి నాట్యంచేసేది ఆడనెమలి కాదు. మగ నెమలి. నెమలి నాట్యంచేస్తుంటే చూడటానికి రెండుకళ్ళూ చాలవు. అలాగే ముఖంచుట్టూ జూలుతో హుందాగా నడచి వచ్చే మృగరాజు రాజసంముందు అన్నీ దిగదుడుపే. `అడవిలో మగ పక్షులకీ, మగ జంతువులకీ అంత అందాన్ని ఇచ్చి, జనారణ్యంలో మాత్రం దానికి వ్యతిరేకంగా చేశాడేమిటీ ఆ సృష్ఠికర్త!` అని చాలా మంది వాపోతుంటారు.
@ NFCL Mini Zoo, Kakinada (Click here to see the details)
నెమలంటే జ్ఞాపకానికి వచ్చింది - చదువులతల్లి సరస్వతీదేవి పాదాల దగ్గర ఎల్లప్పుడూ నెమలి ఉంటుంది. కుమారస్వామి వాహనం నెమలి. కురుక్షేత్ర యుద్దంలో అభిమన్యుడి రధానికిఉన్న జెండాపై నెమలే ఉంటుందట.  మొగల్‌సుల్తాన్ షాజహాన్ ముచ్చటపడి నెమలి సింహాసనాన్ని చేయించుకొంటే పెర్షియా నుంచి దండయాత్రకి వచ్చిన నాదిర్షా ఆ సింహాసనాన్నీ, కోహినూర్ వజ్రాన్ని చక్కా దోచుకుపోయాడు.  నెమలి అందానికి ఫిదా అయిపోయి ఎప్పటినుంచో దానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చేశాం. మనజాతీయపక్షిగా చేసుకొన్నాం. 

చిన్నప్పుడు నన్నెవరైనా బొమ్మగియ్యమని అడిగితే కొండలమధ్య సూర్యుడు, ఓ ఇల్లు, కొబ్బరిచెట్లు, పడవ.. వాటితోపాటూ ఓ నెమలీ గీసేవాడిని(నా చిత్రకళాసాధన అక్కడితో ఆగిపోయింది). నెమలిని గియ్యడం సులభం. అందుకో లేక దాని అందానికి మురిసిపోయో తెలియదుకానీ మనవాళ్ళూకూడా దేవాలయాలమీద, ఇళ్ళగడపలమీద, మంచాల సైడ్‌పేనల్స్ మీద, చీరలమీద, తివాచీలమీద, ఎగ్జిబిషన్ల ఎంట్రన్స్‌ల దగ్గర నెమళ్ళఅలంకారం చేస్తుంటారు. కావాలంటే చూడండి -  ఈ మధ్యన ఒక ఎగ్జిబిషన్ ప్రవేశద్వారం దగ్గర నెమలిని ఇలా పెట్టి, లైటింగ్ అమర్చారు. 
జైపూర్లో సిటీప్యాలెస్ ప్రధానద్వారంచుట్టూ అద్భుతమైన నెమళ్ళు చెక్కి ఉంటాయి. వాటిముందు ఇలాంటివి సూర్యుడి ముందు దివిటీల్లా ఉండడం మాట వాస్తవమేకానీ, ఇంక్రెడిబుల్ ఇండియాని జ్ఞాపకం చెయ్యడానికి ఒక స్పార్క్‌లాగ ఇవి ఉపయోగపడడం వాస్తవమే కదా? ఈ వీడియో చూడండి.
© Dantuluri Kishore Varma 

Saturday, 26 October 2013

ఒకేఒక్క డ్రింక్!

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అన్ని కూల్‌డ్రింకుల కంటే ముందే  తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో తయారీ మొదలైన ఆర్టోస్ ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి కూల్‌డ్రింక్. తొంభై సంవత్సరాలకి పూర్వం భారతదేశంలో ఏడు సంస్థలు మాత్రమే సాఫ్ట్‌డ్రింకులని ఉత్పత్తి చేసేవట. వాటిలో ఆర్టోస్ ఒకటి. ప్రస్తుతం మిగిలినవన్నీ ఉత్పత్తి ఆపేసినా, నిరంతరాయంగా జనాదరణతో కొనసాగుతున్న ఒకేఒక్క డ్రింకు ఆర్టోస్. మార్కెట్‌లో ఉన్నవాటిల్లో భారతదేశం మొత్తంమీద అత్యంత ప్రాచీనమైనది కూడా ఇదే. సరిగ్గా గుర్తింపు రాలేదుకాని చారిత్రకంగా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది.
1912లో అడ్డూరి రామచంద్రరాజు అనే ఆయన కార్బొనేటేడ్ వాటర్ని సరఫరా చేస్తూ ఉండేవారట. అప్పట్లో సోడాలు త్రాగడానికి జనాలు చాలా భయపడే వారు. ఒక్కసారి రుచిచూడండి అని అడిగినా ఆరోగ్యానికి ఎక్కడ హానిచేస్తుందో అని సందేహించేవారు. సరిగ్గా అప్పుడే 1914లో మొదటిప్రపంచ యుద్దం రామచంద్రపురం సోడాలకి బాగా కలసి వచ్చింది. కొంతమంది సైనికులు ఈ ఊరికి వచ్చి ఉండడం జరిగింది. వాళ్ళు సోడాలు త్రాగడం గమనించిన ప్రజలు కూడా మెల్ల మెల్లగా వాటికి అలవాటు పడ్డారట. 1919  వచ్చేసరకి రామచంద్రరాజుగారు తమ్ముడు జగన్నాథరాజుని కూడా చేర్చుకొని లండన్ నుంచి సాఫ్ట్‌డ్రింకుల ఉత్పత్తి, సరఫరాకి కావలసిన సరంజామా దిగుమతి చేసుకొని ఆర్టోస్‌ని ప్రారంభించారు. ఆర్టోస్ గురించి ఇంకొక విషయం చెపుతారు. ఉభయగోదావరి జిల్లాలని రైస్‌బౌల్‌గా మార్చిన సర్ఆర్థర్ కాటన్ దవళేశ్వరం నుంచి లండన్‌కు వెళ్ళిపోతూ తనదగ్గర ఉన్న సోడా మెషీన్‌ని వదిలేసి వెళ్ళాడట. దానితోనే ప్రాధమికంగా ఆర్టోస్ ప్రస్థానం మొదలయ్యిందని అంటారు.
ఈ సాఫ్ట్‌డ్రింక్ రుచి చాలా బాగుంటుంది. బహుశా అందుకే ఇప్పటికీ భహుళజాతి కంపెనీల పోటీని తట్టుకొని నిలబడి ఉంది. మీరు ఆర్టోస్‌ని తాగాలంటే అన్నిచోట్లా దొరకక పోవచ్చు. ఎందుకంటే, దీని డిస్ట్రిబ్యూషన్ ఉభయగోదావరిజిల్లాల్లోనీ, విశాఖపట్నంలోనీ మాత్రమే ఉంది. 
© Dantuluri Kishore Varma 

Friday, 25 October 2013

బ్రిడ్జ్‌పైనుంచి...

నాలుగయిదు రోజులనుంచి రికార్డ్‌స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి 
చెరువులు దొరువులు అన్నీ నిండాయి
కాలువలు వరదనీటితో పొంగిపొర్లుతున్నాయి
ఇంకా ముసురు విడిచిపెట్టలేదు
ఆకాశం నల్లని మేఘాలతో నిండి ఉంది
సూర్యుడు రోజులో ఎప్పుడయినా ఒక్కోసారి తొంగిచూసి మళ్ళీ మాయమైపోతున్నాడు
చల్లని వర్షంగాలి మధ్యలో ఎప్పుడయినా వచ్చే వెచ్చని సూర్య కిరణాలు హాయిగా ఉంటున్నాయి
జగన్నాధపురం వంతెన దగ్గర కాలువలో లాంచీలు లంగరువేసి ఉన్నాయి
పాతవంతెన పైనుంచి తీసిన ఆ ఫోటోలు మీకోసం..
 
*     *     *
1934లో ఒక పత్రికలో ప్రచురించిన జగన్నాదపురం వంతెన చిత్రం. శోభనాచల బ్లాగ్ రమణగారి సేకరణ. వారి అనుమతితో ఇక్కడ ఇస్తున్నాను చూడండి.   

© Dantuluri Kishore Varma

Wednesday, 23 October 2013

వర్షం కురుస్తుంది!
ఇక్కడి ఇమేజ్‌లు సేకరించినవి.
వర్షం పోస్టులు ఇక్కడ, ఇక్కడ చదవండి.

© Dantuluri Kishore Varma 

అష్టాంగమార్గం

ఆగస్టు చివరిలో ఆనందానికి నాలుగు మెట్లు అనే పోస్టు రాయడం జరిగింది . జీవితంలో కష్టాలూ బాధలూ అనేవి సర్వసాధారణం, బాధలకి కారణం కోరికే, జీవితాన్ని ఏరోజుకారోజు జీవించడం, దు:ఖాన్ని అధిగమించడానికి అష్టాంగ మార్గాన్ని అనుసరించడం అనే ఈ నాలుగు విషయాలూ బుద్దుడు బోధించినవి. వాటిని గురించే ఆ పోస్టు (ఈ లింక్‌ని నొక్కండి).  అయితే ఆ టపాలో అష్టాంగ మార్గం గురించి వివరంగా రాయకుండా, మరోసారి రాస్తానని చెప్పాను. ఆటపానే ఇది.

బుద్దిజం చెప్పిన అష్టాంగమార్గం మతసంబంధ విషయంగా కంటే, వ్యక్తిత్వవికాస పాటంలా అనిపించింది. చెప్పాలనుకొన్నది సులభంగా అర్ధమయ్యేలా పాయింట్లగా విభజించి ఇవ్వడం బాగుంది. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి నేర్చుకోవలసిన, పాటించవలసిన అంశాలు ఎన్నో ఉంటాయి. నిరంతరం మాటని, నడవడికని, దృక్పదాన్నీ, ఆలోచనలనీ మెరుగుపరచుకొంటూ ఉండాలి. మనంజీవించే విధానం మిగిలినవారికంటే కూడా మనకే బాగుండాలి. ఫీల్‌గుడ్‌గా ఉండాలి. అలా ఉండడానికి ఏమి చెయ్యాలో ఎనిమిది అంశాలుగా(అష్టాంగమార్గంగా) వర్గీకరించి బుద్దుడు వివరించాడు.  అవి-

అష్టాంగమార్గం:

1. మాట(Word)
2. పని(Action)
3. సంపాదనామార్గం(Livelihood)
4. ప్రయత్నం(Effort)
5. స్పృహ(Attentiveness)
6. ఏకాగ్రత(Concentration)
7. ఆలోచన(Thought)
8. అవగాహన(Understanding)

ఇవి ఎనిమిదీ సవ్యంగా(దీనికి సమ్యక్ అనే మాటని ఉపయోగిస్తారు) ఉండాలి అని చెప్పాడు.

నైతికత:

కోపాన్ని, ద్వేషాన్ని, బాధని కలిగించే మాటలు, అబద్దాలు, చాడీలు, నిందలు, అర్థంపర్థం లేని వాగుడు, తిట్లు, అగౌరవప్రదమైన భాష మాట్లాడ వద్దని బుద్దుడు చెపుతాడు. స్నేహపూరితమైన, గౌరవప్రదమైన, సందర్భానుసారమైన మాటలు మాట్లాడాలి. నిజం చెప్పాలి అంటాడు. అదే సవ్యమైన మాట.

నీతిని, గౌరవాన్ని, శాంతిని కలిగించే పనులు చెయ్యాలి. దొంగతనం, మోసం, అక్రమసంబంధం, మద్యపానం, దూమపానం, చెడువ్యసనాలు వంటి అనైతికమైన పనులు వద్దు.

పరులను పీడించే, హింసించే సంపాదన వద్దు అంటాడు బుద్దుడు. ఉద్యోగమో, వ్యాపారమో, వృత్తో ఇతరులకి హానికలిగించనిదై ఉండాలి.

పైన చెప్పిన మాట, పని, సంపాదనా మార్గాలు నైతికతకి లేదా శీలానికి సంబంధించినవి.

మనసు/బుద్ది:

తరువాత వచ్చే ప్రయత్నం, స్పృహ, ఏకాగ్రత మనసుకి/బుద్దికి సంబంధించినవి. ఏదయినా మాట్లాడినప్పుడు, పనిచేసినప్పుడు, ఆలోచించినప్పుడు అది తప్పో, ఒప్పో అలోచించుకొనే స్పృహ ఉండాలి. తప్పునుంచి తప్పుకొని ఒప్పువైపుకి మరల్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అలా చెయ్యాలంటే ఏకాగ్రత అవసరం. ఏకాగ్రతని ద్యానం ద్వారా అభివృద్ది చేసుకోవచ్చు.

విజ్ఞానం:

అష్టాంగమార్గంలో చివరి రెండూ విజ్ఞానానికి సంబంధించినవి. సవ్యమైన ఆలోచన అంటే ఏమిటి? అంతా మనదే, అందరూ మనవాళ్ళే, ఇదంతా శాశ్వతం అనే బ్రమనుండి బయటపడడం; తోటి మనుస్యులతో, జంతువులతో, ప్రకృతితో ప్రేమతో ఉండే దృష్టిని అలవరచుకోవడం. చిట్ట చివరిది అవగాహన. పైన ఉపోద్ఘాతంలో చెప్పిన(ముదరి టపాలో రాసిన) బుద్దుడు బోధించిన నాలుగు విషయాలనీ సరిగా అవగాహన చేసుకొని, అవలంభించడం.

ఇదే అష్టాంగమార్గం!
`అలా చెయ్యడం సాధ్యమా!` అనే సందేహం వస్తుంది. కానీ, మనంచేసే అభిలషణీయంకాని పనులనే కొనసాగించమని ఏ మతమూ, ఏ సెఫ్ఫ్‌హెల్ప్‌బుక్కూ చెప్పవు. ఇంకొంచెం  మెరుగ్గా ఉండాలంటే, ఇంకొంచెం మెరుగయిన పనులు చెయ్యమని చెపుతాయి. అవి మనకంటే ఒక అడుగు పైనుండవచ్చు, పది అడుగులు పైనుండవచ్చు. కృషిచేసి అవలంభిస్తే అనుకొన్న లక్ష్యం క్రమంగా చేరుకోవచ్చు. అలా ప్రయత్నించే దృక్పదం ఉన్నవాళ్ళ కోసమే అవి.
© Dantuluri Kishore Varma 

Monday, 21 October 2013

ప్రతీఒక్కడికీ ఏదో స్కీము ఉంటుంది

నారదుడు భూలోక సంచారం చేసి వచ్చాడు. రకరకాల వృత్తుల్లో జనాలు సంతోషంగా సేవ చేస్తూ బ్రతుకుతున్నారు. డాక్టర్లు, యాక్టర్లు, నాయకులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు... అందరూ మొహమ్మీద చిరునవ్వు చెరగకుండా పనులు కానిస్తున్నారు. విద్యార్ధుల శ్రద్ధ అమోఘం. తల్లితండ్రులకు వాళ్ళపిల్లల్ని చదివించడమే ప్రధానలక్ష్యం! భూలోకం నిజంగా స్వర్గదామం కదూ? అని మురిసిపోతున్నాడు. అదే విషయాన్ని ఆనందంగా విష్ణుమూర్తికి విన్నవించాడు. 

`నీ బొందేం కాదూ!` అని విసుక్కొని, తనచూపుడువేలు పైకెత్తి శున్యంలో నలుచదరంగా టీవీ తెర ఆకారంలో గీశాడు విష్ణుమూర్తి. తెర ప్రత్యక్షమయ్యింది. దానివైపు చూపించి, `చూడు,` అన్నాడు. విష్ణుమాయ కారణంగా అంతకుముందు నారదుడు చూసి మురిసిపోయిన సన్నివేశాల్లో నవ్వుతూ సేవచేస్తున్న  జనాలయొక్క బొమ్మలు, వాళ్ళ మనసుల్లో అసలు మాటలు వినిపించాయి. 
Photo: Bapu`s Pelli Pustakam
*     *     *

(సన్నివేశాల్లో ఎవరు, ఎవరో చెప్పడంలేదు. సంభాషణని బట్టి సులభంగానే గ్రహించవచ్చు అని)

ఎల్.కే.జీ కి లక్ష రూపాయల ఫీజా?
ఏమనుకొన్నారు మా స్కూలంటే? మీవాడ్ని బొచ్చు చేపని తోమినట్టు గంటలకి, గంటలు తోముతాం. ప్పది సబ్జెక్ట్లు, ఇరవై లైఫ్ స్కిల్స్, ఎప్పుడో పుష్కరం తరువాత రాయబోయే ఇంజనీరింగో, డాక్టరో కోర్సుకి ఇప్పటినుంచే ఇన్‌టెన్సివ్ కోచింగ్!

చక్కగా చదువుకొని వృద్దిలోకి రా నాయనా.
ఆ విషయం మీరు చెప్పాలా? చదువుతా, మంచి ఉద్యోగం సంపాదిస్తా, లక్షలూ, కోట్లూ గడిస్తా.. మిమ్మల్ని వృద్దాశ్రమానికి అంకితంచేస్తా.

చక్కని పరిపాలన అందించాలనే నిన్ను ఎన్నుకొన్నాం.
అబ్బా.. చక్కని పాలన కావాలేం! కోట్లు ఖర్చుపెట్టి రాజకీయాల్లోకి రావడం పనికి మాలిన ప్రజాసేవ చెయ్యడానికి కాదు. `నీకెంత, నాకెంత?` అనేదే తారకమంత్రం ఇక్కడ.

భలే రుచిగా ఉంది, ఈ కూర ఎలా వొండారు నాయనా?
ఫుడ్డు కలరు, టేస్టింగ్ సాల్టు, కల్తీనూనె, చెత్తా చెదారాం... బాగుందని రోజూ మాదగ్గర తిన్నావంటే కేన్సరు వచ్చి చస్తావ్!

వైద్యో, నారాయణో హరి!
కాలునొప్పా? ఐదొందలు ఫీజుకొట్టు ముందు. పోయి ఈ వంద టెస్టులూ చేయించుకొని రా. తరువాత వెయ్యిరూపాయల మందులురాస్తాను. లేబొరేటరీవాళ్ళు, మందులకంపెనీ వాళ్ళు బ్రతకాలి కదా? వాళ్ళ సంగతి అలా ఉంచు మాకు నాలుగువేళ్ళూ నోట్లోకి పోవాలా, వద్దా?

డైరెక్టర్ గారూ, విడుదలవ్వబోతున్న మీ సినిమాని చక్కటి సందేశంతో, కుటుంబకథా చిత్రంగా మలచారట?
విజయవంతమైన ఫార్ములాని యాక్టర్లని మార్చి మళ్ళీ వొండాం. బొంబాయి నుంచి హాట్ హీరోయిన్‌ని పట్టుకొస్తే, మాతో సహకరించలేదు. వాళ్ళ అమ్మా, నాన్నలని వెంటబెట్టుకొని వచ్చింది షూటింగుకి. 

వోటరుగారు, మీవోటు ఎవరికండీ ఈ సారి?
అందరికీ స్కీములున్నట్టే మాకూ ఉన్నాయి. మంచి చదువు, మంచి కొలువు, మంచి వైద్యసదుపాయాలు, మంచి అభివృద్ధి ఇవ్వగల సచ్చీలుడికే మా వోటు. 

*     *     *

`చూశావా నారదా? వాళ్ళ నవ్వుల వెనుక నిజస్వరూపాలు అవి. పైకి కనిపించేది ఎలా ఉన్నా, ప్రతీ ఒక్కడికీ ఏదో స్కీము ఉంటుంది. అందరి స్కీములూ పారతాయి కానీ పాపం వోటరుదే...` అన్నాడు విష్ణుమూర్తి.

ఘాడంగా నిట్టూర్చి, చిడతలు వాయించుకొంటూ మరో లోకంవైపు సాగిపోయాడు నారదుడు.

© Dantuluri Kishore Varma 

Saturday, 19 October 2013

నాలుగురోజులాగితే బంగారమో, బండారమో బయట పడుతుంది కదా?

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నవ్‌జిల్లా దౌండియాఖేరా అనే ఊరిలో ప్రాచీనమైన శివాలయం ఫోటోలు చూడచక్కగా ఉన్నాయి. కొంచం వొరిగినట్టు ఉండి, ఇండియన్ పీసా టవర్‌లా కనిపిస్తుంది. చూడగానే ఆకట్టుకొనేలా ఉంది.  నాలుగైదు రోజులుగా  ఏ పేపర్‌లో చూసినా ఈ శివాలయం ఫోటోలే కనిపిస్తున్నాయి. ఈ గుడికి సమీపంలో ఒక పురాతనమైన కోట ఉందట. అక్కడ వెయ్యిటన్నుల బంగారం పాతిపెట్టబడి ఉందని ఒక సాధువు కలగన్నాడట. ఆ వార్త ఆచెవినీ, ఈ చెవినీ పడి భారత పురావస్తు శాఖని చేరింది. నిధిని తవ్వి తియ్యమని పైనుంచి ఆదేశాలు అందాయి. పనిమొదలు పెట్టారు. నిజంగా నిధి బయటపడితే కలగన్న సాధువు గొప్పవాడైపోతాడు. ఇంకొకసారి ప్రపంచదేశాల దృష్టి భారత్‌మీద పడుతుంది. మిరాక్యులస్ ఇండియా మెరిసిపోతుంది. నిధి దొరకకపోతే శాస్త్రీయమైన ఆధారాలేమీ లేకుండా తవ్విపోసినందుకు పురావస్తు శాఖని దుమ్మెత్తిపోస్తారు. 

ఫ్రెండ్స్ అందరం కూర్చున్నప్పుడు ఈ అంశంమీదకి సంభాషణ వెళ్ళింది. `ఈ తవ్వకాలవీ సుద్ద దండగ,` అన్నాడు ఒకాయన.`విలువైన సమయాన్ని వృధా చేస్తున్నార`న్నాడు.

ఎవరైనా ఒకవిషయం ప్రస్తావిస్తే వెంటనే వ్యతిరేకంగా వాదించేవాడు ఒక్కడైనా ఉంటాడు. `వాళ్ళేమీ అడవుల్లో తవ్వడంలేదు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశంలో చేస్తున్నారు. అయినా ఒక శాఖంటూ ఉండగా ఏదో పనిచెయ్యాలికదా? సాధువు కల ఫలితంగానైనా పని జరుగుతున్నందుకు సంతోషించు,` అన్నాడు వ్యతిరేకించే ఆయన.

వాదప్రతివాదాలు జరిగాయి. ప్రతీ డిబేటులాగే దీనికీ అందరికీ ఆమోదయోగ్యమైన ముగింపు రాలేదు. `సరే, నాలుగురోజులాగితే, బంగారమో, బండారమో బయట పడుతుంది కదా?` అనుకొని ఇళ్ళదారి పట్టాం.

© Dantuluri Kishore Varma

Tuesday, 15 October 2013

శ్రీ గురుభ్యోనమ:

ఆయన మాట్లాడితే వృద్ధులు, మధ్యవయస్కులు, యువతీయువకులు మైమరచిపోయి వొళ్ళంతా చెవులు చేసుకొని వింటారు. ఆయన పద్యంచదివితే శ్రవణాలలో అమృతధార కురిసినట్టు ఉంటుంది. సనాతనధర్మం గురించి అలవోకగా చెబుతుంటే, ఆయన మాట తడబడగా విన్నవాళ్ళు లేరు. గుడిలోనో, బడిలోనో, సభలోనో మాట్లాడితే ప్రాంగణంఅంతా కిక్కిరిసిపోతుంది. టీవీలో మాట్లాడితే ఆచానల్ టీఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగిపోతుంది. జనాలకి బయట ఎన్నిపనులున్నా ముగించుకొని టీవీలో ప్రవచనం వచ్చేసమయానికి ఆఘమేఘాలమీద ఇంటికిచేరిపోయి, మనసునిండా ఆర్యధర్మాన్ని నింపుకొనేలా చెయ్యగల మహిమ ఆయన మాటలకే ఉంది. `కేవలం మాటకి మనుషులు మారతారా?` అంటే - `ఆయన చెపితే మారతారు` అంటారు. రామాయణం, భారతం, భాగవతం, అష్టాదశపురాణాలు, గురుచరిత్రలు, స్తోత్రాలు... ఆయనకి కొట్టినపిండి. సముద్రంలోకి దూకి అడుగున ఎక్కడో దాక్కొనిఉన్న రత్నాలని వెలికితీసే సీడైవర్ లాగ ఋషులచే చెప్పబడిన వాంజ్మయంలో విలువలని లలతమైన తెలుగుభాషలో వివరించి చెప్పడం ఆయన పని. ఇప్పటికే ఆయనేవరో ఊహించిఉంటారు. మీఊహ నిజమే. ఆయనే శారదాజ్ఞానపుత్ర, ఉపన్యాసచక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావుగారు.
ధర్మం అంటే చెప్పడం కాదు, ఆచరించడం అంటారు ఆయన. దానికి ఉదాహరణగా రాముడినీ, రావణుడిని చూపిస్తారు. ఇద్దరికీ ధర్మంతెలుసు. రాముడు ఆచరించి ఆదర్శప్రాయుడయితే, రావణుడు ఆచరించక అదోగతిపాలయ్యాడు. వ్యక్తిత్వవికాస క్లాసుల్లో చెప్పేదికూడా అదే. మనుష్యులతో మంచి సంబంధబాంధవ్యాలు నెరిపితే మంచి విజయం సొంతమవుతుంది అని. మంచిబిడ్డగా, మంచిశిష్యుడు/రాలుగా, మంచిజీవితభాగస్వామిగా, మంచితల్లి/తండ్రిగా, సమాజంలో ఆదర్శప్రాయుడైన మంచిపౌరుడిగా ఉండాలని. శ్రీరాముడు ఆచరించి చూపింది అదేకదా? ఇంగ్లీష్ చదువుల్లో పడి మనకి ఇలియడ్ తెలిసినంతగా రామాయణం తెలియడంలేదు. `ఈ ఇతిహాసపు గొప్పతనం ఇదీ,` అని చాగంటి వారు చెప్పినట్టు చెపితే ఇప్పటితరం దాన్ని మక్కువతో అక్కున చేర్చుకోకుండా ఉంటుందా?  గజేంద్రమోక్షంగురించో, గంగావతరణంగురించో, శివతాండవంగురించో వర్ణించి చెపుతుంటే శ్రోతలకి వొళ్ళుగగ్గుర్పాటు చెంది, పురాణాలు పాతచింతకాయ పచ్చడి కాదనే అవగాహన పెరగదూ? 

అరిషడ్వర్గాలనీ ఉత్తేజింపచెయ్యగల సాహిత్యం, సినిమాలు, అంతర్జాలంలో వీడియోలు అందుబాటులో ఉన్నంతగా మంచిని చెప్పగల గురువులు అందుబాటులో లేరు అంటారు ఆయన. అందుకే గురువుల అవసరం నేటికాలంలో చాలా ఉంది, అప్పుడే ప్రజలలో నేరప్రవృత్తి తగ్గుతుంది  అని నొక్కి వొక్కాణిస్తారు. అందుకే తనవంతుగా విస్తృతంగా ధర్మప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఆయన చేసిన ఉపన్యాసాలనన్నింటినీ పుస్తకరూపంలో చేరిస్తే 2,400 పేజీలవుతుందట. వింటే 1,200 గంటలపాటు వినాలి. ఉపన్యాసంచెప్పినందుకు ప్రతిఫలంగా ఒక్కరూపాయికూడా తీసుకోరట! 

చాగంటివారిది కాకినాడ. ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం. తల్లితండ్రులు సుశీలమ్మ, సుందర శివరావులు. కోటేశ్వరరావుగారి ధర్మపత్ని శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరిగారు. వీరికి ఇద్దరు పిల్లలు - షణ్ముఖశరణ్, నాగశ్రీవల్లి. ఇతిహాశాలను, పురాణాలను బాగాచదివారు. ఒకసారి సూర్యకళామందిరంలో జరిగిన ఒక కార్యక్రమం చూసిన తరువాత తనదృష్టి ఆద్యాత్మికతవైపు మరలిందని ఈ మధ్య ఏదో పేపర్లో చెప్పారు. పెద్దాపురంలో ఒక అద్యాత్మికసభలో మాతా చిన్మయదేవి ఒకరోజు ఉపన్యసించి, తరువాత ఎవరినైనా భాగవతంగురించి మాట్లాడమని కోరినప్పుడు చాగంటివారు మాట్లాడారట. అదే మొట్టమొదటి ఉపన్యాసం. తరువాత గురువుగారైన అమరేశ్వరప్రసాద్ గారి ప్రోత్సాహంతో ప్రవచనాలు చెయ్యడం కొనసాగించారట.

చాగంటి కోటేశ్వర రావుగారంటే చెప్పలేమత భక్తీ, అభిమానం గుండెలనిండా నింపుకొన్న వాళ్ళు దేశవిదేశాలలో లక్షలకొద్ది ఉన్నారు. ఫేస్‌బుక్‌లో ఎన్నో గ్రూపులు, పేజీలు వారిపేరుమీద నడుస్తూ ఉన్నాయి. అభిమానులు నడుపుతున్న చాగంటి.నెట్ అనే సైట్‌లో ఉపన్యాసాలు వినడానికి, చూడటానికి, డౌన్‌లోడ్ చెసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. 

ఈ ఆర్టికల్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. చాగంటివారిగురించి చెప్పాలనుకొనే విషయాలు ఏమయినా ఉంటే ఈ క్రింద కామెంట్ల రూపంలో చెప్పగలరని కోరుతున్నాను.
 © Dantuluri Kishore Varma 

Monday, 14 October 2013

యానం గోదావరి గట్టున...

కాకినాడకి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేంద్రపాలితప్రాంతం పుదుచ్చేరీలో భాగమయిన యానం రేవులో, గోదావరి గట్టున విశేషాలు..
అతిఎత్తయిన భారతమాత విగ్రహం

ఒకచేతితో అభయహస్తం చూపిస్తూ, మరొక చేతిలో భారతదేశజెండాతో, వెనుక సింహం నిలుచుని ఉండగా బంగారువర్ణంతో మెరిసిపోతున్న భారతమాత విగ్రహం యానం బీచ్‌లో ఉంది. రాగి, తగరము, సీసము లాటి 11 టన్నుల బరువైన లోహాలు ఉపయోగించి దీన్ని తయారు చేశారు. భారతమాత  36 అడుగులు ఉంటుంది. వెనుక ఉన్న సింహం 15 అడుగులు. తయారు చెయ్యడానికి సుమారు అరవైలక్షల రూపాయలు ఖర్చు అయ్యిందట. కృష్ణాజిల్లాలో హనుమాన్ జంక్షన్ దగ్గర ఉన్న బొమ్ములూరు అనే ఊళ్ళో తయారు చేశారని హిందూ పేపర్లో రాశారు. 2010లో యానం ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ప్రతిస్ఠించారు. 

*     *     *
పెద్ద శివలింగానికి అభిషేకం చేస్తున్న ఏనుగులు


*     *     *
ముస్లింల ప్రార్ధనా మందిరం

ప్రార్థనకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. రోజులో ఐదుసార్లు చెయ్యాలి అంటారు - తెల్లవారుజామున, మధ్యాహ్నం, ఆతరువాత, సాయంత్రం, రాత్రి. నిద్ర, భోజనం, పని, అలసట, సౌఖ్యం అన్నింటికన్న ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయడమే. అరేబియా తీరంలో లంగరువేసి ఉన్నట్టున్న ఈ ఓడని యానం బీచ్ దగ్గర కట్టారు. ఇది ముస్లింల ప్రార్ధనా మందిరం - Nagoor Mera Saheb Jhanda Prayer Hall. 
*     *     *
బ్రెజిల్ వర్సెస్ యానం

బ్రెజిల్‌లో రియో డి జెనీరో లో ఒక కొండమీద నిర్మించిన 98మీటర్ల ఎత్తైన క్రైస్ట్ ద రిడీమర్ విగ్రహం మొత్తం బ్రెజిల్‌కి ఒక నేషనల్ సింబల్‌గా ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. సరిగ్గా అలాగే తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న యానంలో గోదావరి ఒడ్డున, బాలయోగి వారదికి సమీపంలో మౌంట్ ఆఫ్ మెర్సీని కట్టారు. చూడండి అవి రెండింటికీ ఎంత పోలికలు ఉంటాయో.
యానం
బ్రెజిల్
© Dantuluri Kishore Varma 

Sunday, 13 October 2013

సినిమా వీధి

హంస పాలనీ, నీళ్ళనీ విడగొట్టగలిగినట్టు వీళ్ళు భక్తినీ, రక్తినీ విడగొట్టారు. ఎలాగా అంటారా? టౌన్‌లో మెయిన్ రోడ్‌కి సమాంతరంగా అటుఒకటి, ఇటుఒకటీ రోడ్లు ఉంటాయి. ఒకదానిలో ఈచివరినుంచి, ఆచివరివరకూ ఎన్నో దేవాలయాలు ఉంటాయి. అందుకే దాన్ని దేవాలయం వీధి అంటాం. ఇక రక్తి విషయానికి వస్తే - దానికి కూడా ఒక ప్రత్యేకమైన రోడ్డు వుంది. ఇంతకు ముందు చెప్పాను కదా రెండుసమాంతరమైన రోడ్ల గురించి? ఆ రెండవదే జనాలకి వినోదం కలిగించేది. పేరు సినిమా వీధి. ఒకటి, రెండు సినిమా హాళ్ళు మినహా మిగిలినవన్నీ ఇదే వీధిలో ఉండేవి. అప్పటికప్పుడు అనుకొని సినిమాకి బయలుదేరినా, వరసగా థియేటర్లన్నీ ఒక్కొక్కటీ చూసుకొంటూ వెళితే, ఎక్కడో ఒకచోట టిక్కెట్లు దొరికేవి. 

జగన్నాధపురం వంతెన దాటి కుడివైపుకి తిరిగి కొంచెం ముందుకి వెళితే ఎడమచేతివైపు వచ్చే పెద్దరోడ్డు సినిమా వీధి. విశాలమైన స్థలంలో కట్టిన పెద్ద హాలు స్వప్నా థియేటర్. ఇప్పుడు దాన్ని మూసేశారు కానీ, ముప్పై ఏళ్ళక్రితం టౌన్‌లో ఉండే రెండు, మూడు మంచివాటిల్లో ఇదొకటి. 1983లో సాగరసంగమం విడుదలయ్యింది. స్వప్నా థియేటర్‌లోనే చూశాను. బాల్కనీ టిక్కెట్టు నాలుగు రూపాయల యాభై పైసలు. ఇంటర్‌వెల్లో అమ్మే సాఫ్టీ ఐస్‌క్రీం చాలా బాగుండేది. ఎప్పుడు వెళ్ళినా తప్పనిసరిగా కొనుక్కోవలసిందే.   

సినిమా పేరు చెపితే ఎవరికైనా ఎన్నెన్నో జ్ఞాపకాలు ఉంటాయి. సత్యగౌరీ హాలులోకి ఎప్పుడూ ఇంగ్లీష్ సినిమాలు వచ్చేవి. చూడటానికి పాతరైస్‌మిల్లుని రీమోడల్ చేసినట్టు ఉంటుందికానీ సౌండ్ సిస్టం మాత్రం మరెక్కడాలేని లేటెస్ట్‌ది వీళ్ళు పెట్టేవారు. ఏ.సీ. హాలు కాకపోయినా సౌండ్‌క్వాలిటీ గురించే ఇక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ బ్లాక్‌లో టిక్కెట్లు దొరికే ప్రసక్తే లేదు. కౌంటర్ దగ్గర `మనిషికి ఒక్క టిక్కెట్టు మాత్రమే` అని బోర్డ్ పెట్టేవారు. చాలా కాలం నుంచి ఇక్కడికి వెళ్ళలేదు కానీ, ఇప్పటికి కూడా పరిస్తితి అలాగే ఉన్నట్టుంది. బ్రేక్‌లో అమ్మే పూరీ కూర చాలా బాగుంటుందని చెపుతారు(నేను తినలేదండి, ఎప్పుడూ...ప్చ్!). చార్లీ చాప్లిన్ సినిమాలు సిటీ లైట్స్, మోడ్రన్ టైంస్, ది కిడ్ లాంటివి వరుసగా వచ్చేవి. లారెల్ అండ్ హార్డీ, జేంస్‌బాండ్, జపనీస్ షావోలిన్ తరహా మార్షల్ ఆర్ట్స్ సినిమాలు చాలా ఇక్కడ చూసాను. 

సందర్భం వచ్చింది కనుక ఇంటర్‌వెల్‌లో మేతగురించి ఇంకొక్కవిషయం చెప్పాలి. అన్ని సినిమా హాళ్ళలోనూ తప్పనిసరిగా ఉల్లిపొకోడీ, ఉల్లిసమోసాలు అమ్మేవారు. వాటి వాసన అమోఘం. చేతినిండా ఆయిల్ అంటుకొన్నా, పెద్ద వాళ్ళు తినొద్దని తిట్టినా- కొనమని అడగకుండా, తినకుండా ఉండలేకపోయేవాళ్ళం.  

విజయా, పేలెస్, క్రౌన్, మెజస్టిక్, వేంకటేశ్వరా, కల్పనా లాంటి సినిమాహాళ్ళు మూతపడ్డాయి. అయినప్పటికీ ఒకటిరెండు జంక్షన్లని మాత్రం మెజస్టిక్ వీధి అనీ, కల్పనా సెంటర్ అనీ ఇప్పటికీ పిలుచుకొంటున్నాం. పేలెస్, పద్మనాభా వాళ్ళు చాలా మటుకు పెద్దలకు మాత్రమే తరహా సినిమాలు ఆడించేవారు. కాలేజిలో చదువుకొన్నప్పుడు మా క్లాస్ మేట్ ఒకడు, హాస్టల్‌లో ఉండేవాడు. కాకినాడలో ఏ ప్రాంతమూ సరిగ్గా తెలీదు వాడికి ఒక్క దారి తప్ప - పేలెస్ థియేటర్‌నుంచి హాస్టల్‌కి వెళ్ళేది. అందరం ఆటపట్టించేవాళ్ళం వాడిని `ఎప్పుడైనా దారి తప్పిపోతే, పేలెస్‌కి ఎలా వెళ్ళాలో అడుగు, అక్కడినుంచి నీకు ఎలాగూ తెలుసు కదా,` అని.
  
దేవీ శ్రీదేవి, చాణుక్య చంద్రగుప్తా మాత్రమే ట్విన్‌థియేటర్లు. కొత్తసినిమాలు వచ్చేవి. సినిమా వీధిలో చాణుక్య చంద్రగుప్త దాటిన తరువాత మరేమీ లేవు. ఓవర్ బ్రిడ్జ్ దాటిన తరువాత ఆనంద్, పద్మప్రియా ఉండేవి. వాటికి వెళ్ళాలంటే ఊరిచివరకు వెళ్ళినట్టే. 

ఆనంద్‌కి ఎదురుగా ఖాళీ స్థలం ఉండేది. అక్కడ ఎవరో సైకిల్ స్టాండ్ పెట్టారు. సినిమాకి వచ్చిన వాళ్ళు థియేటర్‌లో పార్క్ చెయ్యడం మానేసి, బయటివాళ్ళు ఎవరో నిర్వహిస్తున్న ఈ స్టాండ్లో  చేసేవారు. దానితో, ఆనంద్‌స్టాండ్‌లో పార్క్ చేస్తే కౌంటర్ దగ్గరకి వెళ్ళక్కర్లేకుండానే టిక్కేట్లు ఇచ్చేవారు. కొత్తసినిమా వచ్చినప్పుడు బండి ఇక్కడ పార్క్ చెయ్యగలిగితే టిక్కెట్ రిజర్వ్‌చేసుకొన్నట్టే. ఒక్కోసారి సైకిళ్ళు లేనివాళ్ళు అద్దె సైకిల్ షాపునుంచి తీసుకొని స్టాండ్‌లో పార్క్‌చేసి టిక్కేట్లు సంపాదించేవారు. 

ఆనంద్‌కి ప్రక్కనే వాళ్ళదే గీత్‌సంగీత్, అంజనీ, కరణంగారి జంక్షన్ దగ్గర వీర్‌కమల్, తూరంగిలో సూర్యామహల్, వంతెనదగ్గర చంద్రికా, మెయిన్‌రోడ్లో తిరుమలా, మెజస్టిక్ దగ్గర మయూరీ, పద్మప్రియాకి చేర్చి శ్రీప్రియా లాంటి హాళ్ళు క్రమంగా వెలిశాయి. కొన్ని మల్టీప్లెక్స్‌లు గా రూపాంతరం చెందాయి.

ఈ బ్లాగ్ చదువుతున్నవాళ్ళలో ఎంతోమంది సొంతవూరికి చాలా దూరంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. నాస్టాల్జిక్‌గా దీనికి కనెక్ట్ అవడానికి, మధురస్మృతులని మళ్ళీ జ్ఞాపకం చేసుకోడనికీ ఈ టపా! చదువుతున్న మీరు కాకినాడ వాళ్ళు కాకపోయినా థియేటర్ల, ప్రాంతాల పేర్లు తప్పించి మీవూరి సినిమాహాళ్ళ చరిత్రకూడా ఇలాగే ఉండవచ్చు! 

మీ సినిమా కబుర్లని, జ్ఞాపకాలనీ కామెంట్లుగా పంచుకొంటే సంతోషిస్తాను.
© Dantuluri Kishore Varma 

Saturday, 12 October 2013

ఆరోగ్యానికి ఆ ఐదూ..

టాక్సిన్స్ అనే మాట తరచూ వింటూ వుంటాం. మరి, టాక్సిన్ అంటే ఏమిటీ?  

అది ఒక రసాయనిక పదార్థం అనుకోండి. పంటలు పండించడానికి వాడే రసాయనిక ఎరువులు, కలుషితమైన మంచినీరు, వాతావరణ కాలుష్యంవల్ల గాలిలో కలిసిన మలినాలు  కారణంగా టాక్సిన్లు శరీరంలోనికి పంపిస్తున్నాం. మన శరీరంలో ఉన్న లివర్, కిడ్నీలు, ఊపిరితిత్తులు లాంటి అవయవాలు ఈ విషపూరిత వ్యర్ధాలను చెమటద్వారా, మూత్రంద్వారా బయటకు పంపిస్తాయి. కానీ ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ కారణంగా ఈ అవయవాల సామర్ధ్యాన్ని మించి టాక్సిన్లని తీసుకోవడం, అవి శరీరంలో పేరుకొనిపోయి అనారోగ్యాన్ని కలిగించడం జరుగుతుంది. కాబట్టి వీటిని వదిలించుకోవడానికి ప్రయత్నించాలి.  

మన జీవిత విధానాన్ని కొద్దిగా మార్చుకొని, క్రమం తప్పకుండా ఐదు నియమాలని పాటిస్తే చక్కటి ఆరోగ్యంతో జీవించవచ్చు. 
మొదటిది ద్రవపదార్ధాలని ఎక్కువగా తీసుకోవడం. శరీర అవసరాలకి సరిపోయేలా మంచినీళ్ళు త్రాగడం చాలా ముఖ్యం. వీలునిబట్టి కొబ్బరినీళ్ళు, తాజా పళ్ళరసాలు కూడా తీసుకోవచ్చు. దీనివల్ల స్వేదం, మూత్రం ద్వారా టాక్సిన్లు ఎక్కువగా  విసర్జించబడతాయి.

రెండవది వ్యాయామం చెయ్యడం. శ్వాస ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ కారణంగా విడుదలయ్యే చెమట డీ-టాక్సిఫికేషన్ చేస్తుంది.
మూడవది వొంటికి మర్ధనా(మసాజ్). దీనికోసం మసాజ్ సెంటర్లకి వెళ్ళక్కర్లెద్దు. నలుగుపిండి(సున్నిపిండి)తో నలుగుపెట్టుకొని స్నానం చెయ్యడంవల్ల, చెమటద్వారా బయటకు వచ్చిన వ్యర్ధాలు శుభ్రంగా తొలిగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. రక్తప్రసరణకూడా పెరుగుతుంది. 

నాలుగవది ఆహారం. టేస్టింగ్ సాల్ట్‌లు, ఫుడ్‌కలర్, అనారోగ్యకారకమైనా నూనెలతో తయారు చేసే బయటి ఆహారం తీసుకోవడం వీలయినంత వరకూ తగ్గించాలి.  పీచుపదార్ధాలు(ఫైబర్) ఎక్కువగా ఉండే కాయగూరలు, పళ్ళు తీసుకోవాలి. వీటిలోని ఫైబర్ ఒక బ్రష్‌లాగా పనిచేసి పేగులని శుభ్రం చేస్తుంది. 

చిట్టచివరిది ఉపవాసం. నిరంతరం పనిచేస్తూ ఉండే జీర్ణవ్యవస్థకి; కిడ్నీ, లివర్ లాంటి అవయవాలకి వారానికి ఒకరోజు విశ్రాంతిని ఇవ్వడం చాలా మంచిది. కొత్తగా అరుగుదలచేసే బాధ్యత ఉండదు కనుక నిలువయిపోయిన వ్యర్ధాలని బయటకు పంపించే పనిని అవి నిర్వర్తిస్తాయి.

ఇవి నేను కొత్తగా చెప్పే విషయాలు కాదని మీకూ తెలుసు. మనతాతల కాలంనుంచీ ఉన్నవే. అప్పటిలో `ఎందుకూ?` అనే వివరం తెలియకుండా చేసేవారు. ఇప్పుడు ఎందుకో తెలిసినా క్రమశిక్షణతో పాటించలేకపోతున్నాం. 

`ఎస్, ఐ కెన్` అనుకొంటే చెయ్యలేమా? ఆరోగ్యమే మహాభాగ్యం! ఎంతకాదన్నా, దానికన్నా ముఖ్యమైనది ఏముంటుంది?
© Dantuluri Kishore Varma

Thursday, 10 October 2013

బెలూన్ బోయ్

బెలూన్లు చూడగానే చిన్నపిల్లల కళ్ళల్లో సంతోషం
చదువుకోవలసిన వయసులో పనిచేసుకొంటున్నాడని కవి గుండెల్లో జాలి
`అమ్మా బుడగలమ్మి డబ్బుతెచ్చా,` అంటే తల్లి చూపుల్లో తృప్తి
`విచారమా, కష్టమా, అసంతృప్తా..నీ బాధేమిటి?` అంటే...
`బుడగ ఐదురూపాయలు. కావాలా, వద్దా?` అంటాడు వాడు

త్రిపురసుందరి గుడి బయట దసరా రోజుల్లో గ్యాస్ బెలూన్లు అమ్ముతున్న అబ్బాయి.

© Dantuluri Kishore Varma 

Wednesday, 9 October 2013

గ్రహాంతరవాసులతో అతను

రోడ్ జంక్షన్‌లో వెలుగులు చిమ్ముతున్న స్ట్రీట్‌లైట్ దగ్గరనుంచి చీకటిగా ఉన్న కాలేజ్‌రోడ్ వైపుకి వేగంగా దూసుకొని వచ్చింది హీరో్‌హోండా బైక్. గవర్నమెంట్ కాలేజ్ పిట్టగోడ ప్రక్కన ఆగింది. ఇగ్నీషన్ ఆపకుండానే, సైడ్ స్టేండ్ వేసి పాతికేళ్ళ కుర్రాడు బైకు దిగాడు. `ఇక్కడ మూత్ర విసర్జన చెయ్యరాదు` అని గోడమీద నోటిసు రాసిఉన్న వైపుకి పేంట్ జిప్ తీస్తూ నడిచాడు. సెకండ్ షో విడిచిపెట్టి గంటన్నర అయ్యింది. ఫ్రెండ్స్‌తో బాతాకానీ వేసి, చాయ్ తాగి బయలుదేరేసరకి ఆ సమయం అయ్యింది. ఇంటికి వెళ్ళే ముందు ప్రతీసారిలాగే ఇదిగో ఇక్కడ ఆగాడు. రోడ్లన్ని నిర్మానుష్యంగా ఉన్నాయి. వీస్తున్న గాలితో అతను వేస్తున్న విజిల్ కలసిపోతుంది. చంద్రుడు లేని ఆకాశం. చుక్కలు మాత్రం తళుకులీనుతున్నాయి. సరుగ్గా అప్పుడు గమనించాడు... ఒక చుక్క క్రమంగా పెద్దదవ్వడం! చూస్తుండగానే భోజనం ప్లేటంత పెద్దదయ్యింది. పదిచంద్రుళ్ళంత ప్రకాశం!  
విశాలంగా ఉన్న కాలేజ్ ప్లేగ్రౌండ్ వైపు వేగంగా ప్రయాణిస్తూ వచ్చింది. చిన్నప్పుడెప్పుడో స్టీవెన్ స్పీల్‌బర్గ్ తీసిన ఈటీ సినిమాలో చూశాడు - యు.ఎఫ్.ఓ! అన్ఐడింటిఫైడ్ ఫ్లయ్యింగ్ ఆబ్జెక్ట్. మన భాషలో చెప్పాలంటే గ్రహాంతరవాసుల వాహనం - ఎగిరే పళ్ళెం. రెండు తాడిచెట్ల ఎత్తులో అలాగే నిలిచిపోయింది. శక్తివంతమైన బ్యాటరీ లైట్ ఫోకస్ చేసినట్టు ఒక కాంతి కిరణం అతని మీద ప్రసరింపబడింది. ఏంట్ఈటర్ అనే జంతువు పొడవైన నాలుకను చాపి చీమల్ని నోటిలోకి లాగేసుకొన్నట్టు, ఆ కాంతి కిరణం అతన్ని యూఎఫ్ఓలోకి లాగేసింది. నేషనల్ జియోగ్రఫిక్ చానెల్లో చూపించే అరుదైన జంతువుల్ని ఫోటోషాప్ చేసి కొత్తజంతువుని సృష్టించినట్టు ఉన్నారు నలుగురు గ్రహాంతరవాసులు.  

`నన్నెందుకు తీసుకు వచ్చారు?` అన్నాడు అసంకల్పితంగా.

`మీగ్రహం గురించి కొంత సమాచారం కావాలి,` అన్నాడు ఒకడు.

`మీరు...మీరు... తెలుగు మాట్లాడు తున్నారు. తెలుగు వాళ్ళా!`

`ఆశ్చర్యపోవద్దు. మా కర్ణభేరికి ముందు ఫిల్టర్లు ఉంటాయి. ఎదుటివాళ్ళు మాట్లాడే భాష ఏదయినా డీకోడ్ చేసి మాకు అర్థమయ్యే విధంగా మారుస్తాయి. అలాగే మా పళ్ళ సందుల్లో ఉండే ఫిల్టర్లు మేం మాట్లాడే దాన్ని మీ భాషలోకి తర్జమా చెస్తాయి.`  

`సినిమా చూసి ఇంటికి వెళుతున్న నన్ను ఇలా కిడ్నాప్ చెయ్యడం అన్యాయం.` 

అతని ఆందోళనని వాళ్ళేమీ పట్టించుకోలేదు. `సినిమా అంటే ఏమిటి?` అన్నాడు అందులో ఒకడు.

గ్రహాంతరవాసులకి మన భూమిమీద విషయాలేమీ తెలియవని అర్ధమైపోతుంది. అయినా, ఇంత టెక్నాలజీ ఉన్న వీళ్ళకి గూగుల్‌లో వెతికితే ఈ విషయాలు తెలియవా! అనుమానాలని ప్రక్కనపెట్టి అన్నాడు, `చెపితే వదిలేస్తారా?` అని.

`చెప్పకపోతే ల్యాబరేటరీలో పెట్టి కోస్తాం. చెప్పు త్వరగా ,` అన్నారు.  

`సినిమా అంటే కలల్ని అమ్మే పెద్ద వ్యాపారం. అమ్మాయిలు, ఫైటింగులు, సెంటిమెంట్లు, పంచ్‌డైలాగులు కలిపి కొడితే వారంరోజుల్లో మూడురెట్లు లాభం వస్తుంది. జనం ఎగబడి చూస్తారు. దీనికంటే పెద్దవినోదం మరొకటిలేదు, రాజకీయంతప్ప `

`రాజకీయమా!` అన్నాడు మరొక ఈటీ. 

మన భూలోక వాసికి ఒకటి అర్థమైయ్యింది -  వ్యవస్థలకి లేదా వ్యాపకాలకి సంబంధించిన నామవాచకాలను వాళ్ళు అవగాహన చేసుకోలేకపోతున్నారు. కొంచెంవివరంగానే చెప్పాలి. ఇలా కొనసాగించాడు.  

మాకు నాలుగు రకాలైన ప్రజలు ఉన్నారు. అతి సామాన్యమైన నిరక్షరాస్యులు, తెలివైనవాళ్ళమని భావించే వాళ్ళు, నిజంగా తెలివైన వాళ్ళు, బలముండి సిగ్గులేనివాళ్ళు. వీళ్ళల్లో ఎవరైనా నాయకుడిగా పోటీలో నిలబడవచ్చు. మిగిలిన వాళ్ళు వోట్లు వేసి వాళ్ళని గెలిపించి, తమ సమస్యల గురించి చర్చించి నిర్ణయాలు చెయ్యమని అధికారం ఇస్తారు. దీన్ని ప్రజాస్వామ్యం అని పిలుస్తాం. ఇది ప్రజల చేతిలో ఉండే గొప్ప ఆయుధం. కానీ, ఒక్కసారి నాయకుడిగా ఎన్నికైన తరువాత చాలా మంది ప్రజలమాట మరచిపోయి, తాము చెప్పినట్టు ప్రజలు వినాలని కోరుకొంటారు....` కొంచెం సేపు ఆగి కొనసాగించాడు.... `బలవంతుడైన స్వార్ధపరుడు నాయకుడైతే ప్రజా సంక్షేమంకోసం వెచ్చించాల్సిన డబ్బుని తన స్వంతం చేసుకొంటాడు. ఓడిన వాడు కడుపుమంటతో వాడిని తిడతాడు. టెలివిజన్‌లో చూస్తున్న జనాలకి నాయకుల నిజస్వరూపాలు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళని అసహ్యించుకొంటూ చూస్తారు. అదే వినోదం.` 

`మరి ప్రజలు వాళ్ళను దించెయ్యవచ్చుకదా?`

ఇందాక చెప్పిన నాలుగు రకాల్లో బాగా తెలివైనవాళ్ళు నాయకుల చేతుల్లో కీలుబొమ్మల్లా ఉండి, వాళ్ళ అధికారానికి పరోక్షంగా సహకరిస్తుంటారు. తెలివైన వాళ్ళమనుకొనే వాళ్ళు ఉపన్యాసాలు ఇవ్వడానికి తప్ప దేనికీ పనికి రారు. కనీసం ఓటుకూడా వెయ్యరు. సామాన్యులు  జరుగుతున్న తతంగాన్ని నిశ్సబ్ధంగా గమనిస్తారు. అయిదేళ్ళతరువాత తమదగ్గర ఉన్న ఓటనే బ్రహ్మాస్త్రంతో  తలరాతలు మార్చడానికి. కానీ, దురదృష్టవశాత్తూ మళ్ళీ జరిగిందే జరుగుతూ ఉంటుంది. ఒక స్వార్ధపరుడు పోతే, మరొకడు తగులుతాడు. మా కర్మ!`

`మీదగ్గర నేర్చుకోవలసిన గొప్పవిషయాలేమీ లేవు. నిన్ను పంపిస్తున్నాం,` అన్నారు అంతరిక్షవాసులు. 

భూలోక వాసికి చాలా సంతోషం అయ్యింది. కానీ ఒక సందేహం ఉంది - తననే ఎందుకు తీసుకొని వచ్చారని. ఆమాటే వాళ్ళని అడిగాడు. 

`దేశ రహస్యాలని, ప్రాణాలు పోయినా ప్రక్కదేశాలకే తెలియనివ్వం. అలాంటిది వేరే గ్రహాల వాళ్ళకి ఇవ్వాలంటే `ఇక్కడ మూత్రవిసర్జన చెయ్యరాదు` అని బోర్డు పెట్టినచోటే ఆపని చేసే నీలాంటి సూడో ఇంటెలెక్చువల్సే ఇవ్వగలరు. మంచీ, చెడుగురించి ఉపన్యాసాలు ఇస్తారు. మీదాకా వచ్చేసరికి చిన్న నిబంధనని కూడా పాటించరు. నువ్వు చెప్పిన స్వార్ధ రాజకీయనాయకుల కంటే మీరే పెద్ద స్వార్ధపరులు. కేవలం అవకాశం లేక నిజాయితీగా మిగిలిపోతారు తప్ప, విలువలమీద నమ్మకం ఉండికాదు.  అందుకే నిన్ను పట్టుకొచ్చాం,`   వాళ్ళు చివరి మాట చెబుతూ ఉండగా, లైట్‌బీం వాడిని తీసుకువెళ్ళి బైకు ముందు నిలబెట్టింది.
 © Dantuluri Kishore Varma 

Tuesday, 8 October 2013

పిండాల చెరువు దగ్గర త్రిపురసుందరి గుడి

గుర్రపుడెక్కతో, తామరాకులతో అసలు నీరుందని కూడా తెలియనంతగా నిండిపోయి ఉండేది పిండాల చెరువు. అప్పుడప్పుడూ గుర్రపుడెక్క అంతా తొలగించి శుభ్రం చేసేవారు. కానీ, మధ్యలో ధ్యానముద్రలో ఉన్న శివుడి విగ్రహాన్ని కట్టి, చెరువు చుట్టూ గోడకట్టి, లోపల పార్క్ అభివృద్ది చేసిన తరువాత మొత్తం ఆ రోడ్డుకే అందం వచ్చింది. ప్రతీ శివరాత్రికీ తెప్పోత్సవం జరుగుతుంది ఇక్కడ. ఈ చెరువుకి వెనుక బాలాత్రిపురసుందరీ సమేత రామలింగేశ్వరస్వామి వారి దేవాలయం ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే,  చాలా పురాతనమైనది - 1884లో నిర్మించారు. 

ఎల్లప్పుడూ త్రిపురసుందరీ అమ్మవారికి అత్యంత సుందరమైన పూల అలంకరణ చేస్తారు. గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. లోపలికి వెళితే బయటి ప్రపంచపు రణగొణ ధ్వనులేవీ వినిపించవు. ప్రశాంతంగా వుంటుంది. ముఖ్యంగా, దసరా పదిరోజులూ సందడిగా ఉంటుంది. త్రిపురసుందరీదేవి రకరకాల అలంకరణలతో దర్శనమిస్తుంది. చివరిరోజు బంగారు చీరలో ధగద్ధాయమానంగా వెలిగిపోతుంది. భక్తులు దర్శనానికి బారులు తీరతారు. 

గుడిచుట్టూ ప్రదక్షిణ మార్గం వెంబడి ఇతరదేవుళ్ళ మందిరాలు విద్యుత్ దీపాల కాంతితో మెరిసిపోతూ ఉంటాయి., కళ్యాణమండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు, జనాలమధ్య పరుగులుపెట్టి ఆడుకొంటున్న పిల్లకాయలు, రుచికరమైన ప్రసాదం - హడావుడి అంతా ఇక్కడే ఉంటుంది. 

© Dantuluri Kishore Varma 

Friday, 4 October 2013

వ్యాపకం ఎక్కువ... జ్ఞాపకం తక్కువ...

పాలు కోసం
ఊలు కోసం
మాంసం కోసం, గొర్రెపిల్లల కోసం
మాత్రమే... పెంచుతారు గొర్రెల్ని

షెడ్డుకడితే నీడకోసమనీ
ఫుడ్డు పెడితే ప్రేమతోనేమోఅని
బుజ్జిగొర్రెల్ని మెడమీద ఎక్కించుకొని మోస్తే
తమ పిల్లలకి మహారాజయోగమనీ
నమ్మే, పిచ్చిగొర్రెలు. 

వీటికి వ్యాపకం ఎక్కువ
జ్ఞాపకం తక్కువ
కళ్ళముందు ఎన్ని తలలు తెగిపడినా
మంద మాత్రం కాపరి వెనుకే పోతుంది 

మీరు ఎన్ని చెప్పండి.. 
అట్లాంటి మందను నిర్వహించడమంత 
తెలివైన మంచివ్యాపకం
ప్రపంచంలో మరొకటి లేదు. 

*     *     *

ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్‌గారి కార్టూన్ - నాయకుడంటే అలా ఉండాలి. చూడండి గొర్రెలపెంపకపు మెళుకువలన్నీ ఉగ్గుపాలతో ఒంటబట్టించేసుకొన్న నాయకుడు ఎంత ఆనంద పరుస్తున్నడో! ఓటరయితే పాపం గొర్రెలాగే ఎంత ఆనంద పడిపోతున్నాడో!
 

© Dantuluri Kishore Varma 
Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!