Saturday, 31 August 2013

ఆనందానికి నాలుగు మెట్లు

ఈ పోస్ట్ టైటిల్ ఒక పాపులర్ సెల్ఫ్‌హల్ప్ బుక్‌ని పోలి వుండవచ్చు. కానీ, దానికీ దీనికీ ఏ సంబంధం లేదు. చాలా కాలం క్రితం నేను ఒకసంస్థలో పనిచేస్తున్నప్పుడు, నాతో పాటూ ఒక బుద్ధిస్ట్ పనిచేసేవారు. బౌద్ధమతాన్ని అవలంభించే వాళ్ళని కలవడం అదే మొట్టమొదటిసారి నాకు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఆయన తండ్రిగారు బుద్ధుని బోధనలను గురించి రెండుపుస్తకాలని ఇచ్చారు. `లెట్ నోబుల్ థాట్స్ కం ఫ్రం ఆల్ డైరెక్షన్స్` అని ఋగ్వేదంలో చెప్పినట్టు, మంచి అనేది ఎక్కడున్నా గ్రహించవలసిందే. చిన్న బుక్‌లెట్స్‌లాగ ఉన్న వాటిని చదివినప్పుడు బౌద్ధంలో ఆచరణాత్మకమైన విధానం ఉందనిపించింది. నాలుగంటే నాలుగే సత్యాలని అవగాహన చేసుకొంటే ఆనందంగా ఉండగలిగే స్థాయికి చేరుకోవచ్చు.
1. మొదటి అంశం కొంచెం నిరాశా వాదంతో మొదలైనట్టు ఉంటుంది. కానీ, అది వాస్తవం అనే పునాది. భగవద్గీత చూడండి! అర్జున విషాదయోగంతో మొదలౌతుంది. అలాగే బౌద్ధం కూడా జీవితంలో కస్టాలూ బాధలూ అనేవి సర్వసాధారణం అని చెపుతుంది. ఇవి శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు. అలసట, అనారోగ్యం, గాయపడడం, మరణం లాంటివి శారీరకమైన కష్టాలు అయితే; ప్రేమరాహిత్యం, ఒంటరితనం, భయం, భవిష్యత్తుగురించి ఆందోళన, ఆశాభంగం మొదలైనవి మానసికమైన కష్టాలు. ఇవి ఉన్నాయని అవగాహన పెంచుకోవడమే ప్రారంభం.

2. అవసరం, కోరిక అనే మాటల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి. అవసరం అనేది తీరుతుంది, కోరిక తీరదు. బాధలకి కారణం కోరికే. ఆకాశానికి నిచ్చెనలు వేయకుండా అవసరాలని మాత్రం తీర్చుకొంటే మానసికమైన కష్టాలని దూరంగా ఉంచవచ్చు. అయితే ఏది అవసరం అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఒక సాధారణ ఉద్యోగి భవిష్యత్తుకోసం కొంతపొదుపు, వైద్య అవసరాలకోసం మెడికల్ ఇన్స్యూరెన్స్, అద్దెఇంటి కష్టాలు తప్పించుకోవడానికి ఒక సొంతగూడు, తిరగడానికి ఒకవాహనం లాంటివి కనిస అవసరాలు అనుకొంటే; రోజుకూలీ చేసుకొనే వాడికి వీటిలో కొన్ని అందుకోలేని విలాసాలు కావచ్చు. 

కష్టం అందనిదాన్ని కోరుకోవడంతో మొదలౌతుంది. సెల్‌ఫోన్ అవసరం. ఒక మూడువేలతో సాధారణమైన ఫీచర్స్ ఉన్న ఫోన్ కొనుక్కొని వాడుకొంటూ ఉంటాం. మనకన్నా కొంచెం డబ్బున్నవాడు స్మార్ట్ ఫోన్ వాడుతుంటాడు. మనం వాడేది విసుగు పుడుతుంది, వాడు ఉపయోగించేదానిమీద ఆశ కలుగుతుంది. కొనుక్కోవాలని ప్రయత్నిస్తాం. ఓపిక సరిపోదు. నిరుత్సాహ పడతాం. ఒకవేళ దాన్ని సాధించుకోగలిగినా, ఆ మరునాడు ఇంకొక పెద్ద వస్తువుమీదకి మనసులాగకుండా ఉండదు. అలాగే ఒకఫ్రెండ్ అప్పిస్తాడని, ఒక అందమైన అమ్మాయి ప్రేమిస్తుందని, షేర్‌మార్కెట్లో లక్షలు సంపాదించవచ్చని స్థాయినిమించి ఆశిస్తే ఏడుపే మిగులుతుంది. 

కోరికలేకపోతే అభివృద్ది ఎక్కడ ఉంటుంది అని మీరు అడగవచ్చు. అందుకే మన సామర్ధ్యం తెలుసుకొని లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలని ముందే చెప్పడం జరిగింది. ఒక మెరిట్ స్టూడెంట్ ఐఏఎస్ కావాలని కోరుకోవడం, మరొక అత్తెసరు మార్కులతో పాసయిన విద్యార్థికూడా అదే లక్ష్యంగా పెట్టుకోవడం మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుంది?  

3.  ఆనందాన్ని సొంతంచేసుకోవడం సులభమే అంటాడు బుద్ధుడు. అనవసరమైన కోరికలని దూరంగా ఉంచడం. అలసట, అనారోగ్యం, గాయపడడం లాంటి శారీరక కష్టాలు కలిగినప్పుడు సహనంగా ఉండడం, జీవితం మనకిచ్చిన మంచివిషయాలని మనస్పూర్తిగా ఆస్వాదించడం, మన అవసరాలు తీరినతరువాత మిగిలినవారికి సహాయపడం, జీవితాన్ని ఏరోజుకారోజు జీవించడం - ఇవి చేస్తే ఆనందం మనసొంతం అంటాడు.

4. మొదటి మూడూ థియరీ పార్ట్ అయితే నాలుగవది వాటిని ఎలా చెయ్యాలో చెప్పే ప్రాక్టికల్ పార్ట్. కష్టాలని, దు:ఖాన్ని అధిగమించడానికి అనుసరించవలసిన మార్గాన్ని చెప్పేది. దీనినే అష్టాంగ మార్గం అంటారు. దీనిగురించి ఇంకొకసారి చెప్పుకొందాం!  (ఈ లింక్‌ని నొక్కండి)

ఏ వ్యక్తిత్వవికాస పుస్తకంలోనూ లేని సరళత దీనిలో ఉంది.సరిగ్గా అర్ధం చేసుకొని ఆచరించడానికి ప్రయత్నిస్తే ఫలితాన్ని పొందవచ్చు. మీరేమంటారు?
© Dantuluri Kishore Varma

Friday, 30 August 2013

మీరెప్పుడైనా లాంచీ మీద గోదావరి దాటారా?

కోనసీమ ప్రాంతం మూడువైపుల గోదావరితో, ఒకవైపు సముద్రంతో ఉంటుంది. తూర్పుగోదావరిజిల్లాలో మిగిలిన ప్రాంతంతో రోడ్డుద్వారా అనుసంధానం కావడానికి గోదావరి నదిమీద వంతెనలు ఉండాలి. ఒకటి రావుల పాలెం దగ్గర ఉంది. రెండవది యానం నుంచి, ఎదుర్లంకకి గోదావరిమీద 1.80కిలోమీటర్ల పొడవైన వంతెన. ఈ వంతెన  జిల్లాకేంద్రమైన కాకినాడనుంచి, కోనసీమలో అమలాపురానికి 70 కిలోమీటర్ల వరకూ దూరాన్ని తగ్గించింది.

12వ, 13వ లోక్‌సభ స్పీకర్‌గా సేవలు అందించిన జి.ఎం.సీ బాలయోగి ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి చాలా పాటుపడ్డారు. కానీ, నిర్మాణం పూర్తికాకుండానే హెలీకాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. నూటపదికోట్లవ్యయంతో, కేవలం 33 నెలల సమయంలో నవయుగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళచే 2002లో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తిచెయ్యబడింది. బాలయోగి కృషికి గుర్తింపుగా దీనికి జి.ఎం.సీ బాలయోగి వారధి అని నామకరణం చేశారు.

బాలయోగి వారధి నిర్మించడానికి ముందు కాకినాడనుంచి, అమలాపురం వెళ్ళాలంటే రెండు మార్గాలుండేవి. ఒకటి రోడ్డుమార్గం ద్వారా రావులపాలెం వంతెన మీదనుంచి. రెండవది యానంవరకూ రోడ్డుద్వారా వెళ్ళి, అక్కడినుంచి గోదావరి అవతల ఉన్న ఎదుర్లంకకి లాంచీ లేదా పంటు మీది ప్రయాణం చేసి, ఎదుర్లంక నుంచి మళ్ళి రోడ్డు మార్గం ద్వారా అమలాపురం వెళ్ళడం. ఈ రెండవ ప్రయాణ మార్గంలో కేవలం బైకులు, కార్లూ వరకే లాంచీ ద్వారా నదిదాటగలవు కానీ లారీలు, బస్సులవంటి పెద్దవాహనాలకి ఆ అవకాశం లేదు.

(P.S: "కాకినాడనుంచి, అమలాపురం వెళ్ళాలంటే రెండు మార్గాలుండేవి."  ఇంకో మార్గం కూడా ఉండేది. కాకినాడనుండి దక్షారామం మీదుగా కోటిపల్లి, అక్కడ గోదావరి పడవలోనూ లేక వరదల టైములో లాంచీ లమీదా దాటి, ముక్తేశ్వరమూ, అక్కడనుంచి అమలాపురం -ఫణిబాబుగారూ మీ సవరణకి ధన్యవాదాలు.) 
యానం రేవు 
గోదావరికి వరదనీరు వచ్చిన సమయంలో నది దాటడం చాలా కష్టం అయ్యేది. కోనసీమనుంచి కొబ్బరి, అరటి, వరిలాంటి వ్యవసాయ ఉత్పత్తులు; చెరువుల్లో పండించే రొయ్యలు, చేపలు లాంటి మత్యసంపద; పారిశ్రామిక ఉత్పత్తులు, భవన నిర్మాణానికి కావలసిన మెటీరియల్ మొదలైనవి కేంద్రపాలిత ప్రాంతమైన యానానికి కానీ, జిల్లా కేంద్రమైన కాకినాడకి కానీ; లేదా ఇటునుంచి కోనసీమకి కానీ తరలించాలంటే లారీలమీద చుట్టూతిరిగి వెళ్ళవలసిన పరిస్థితి.
ఎదుర్లంక గోదావరి గట్టు. కొబ్బరి మొక్కలమధ్య కనిపిస్తున్నది దుర్గా దేవి గుడి.
కాకపోతే, లాంచీ మీద ప్రయాణం మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉండేది. బైకులు, కార్లు, మనుషులతో కిక్కిరిసిపోయి; ఒక్కొక్కసారి మేకలు, గేదెలు, కోళ్ళు లాంటి సహప్రయాణీకులతో; అందరూచేసే రణగొణధ్వనితో, లాంచి ఇంజను శబ్ధం కలసిపోయి డు..డు..డు..మని వెళుతుంటే, వీటన్నింటినీ మరచిపోయేలా చేసే చల్లని గోదావరి గాలి. అభివృద్ది, సౌకర్యం లాంటివి ఎన్ని కల్పించినా ఈ బ్రిడ్జి లాంచీ అనే వాస్తవాన్ని మింగేసి, జ్ఞాపకాన్ని మాత్రం మిగిల్చింది.
 బై ద వే, మీరెప్పుడైనా లాంచీ మీద గోదావరి దాటారా?    
© Dantuluri Kishore Varma 

Thursday, 29 August 2013

గజేంద్రమోక్షం

గజేంద్రమోక్షం పోతన రచించిన భాగవతంలో ఒక చిన్న ఘట్టం. ఒకరోజు అడవిలో గజరాజు ఆహారం భుజించి, మంచినీటికోసం కొలనులో దిగుతాడు. నీరు తాగి, అక్కడే జలకాలాడుతుండగా, ఆ కొలనులో ఉన్న ఒక మొసలి గజరాజు కాలిని పట్టుకొంటుంది. నీటిలో ఉన్నంతసేపూ మొసలి బలంముందు ఏదీ సాటిరాదు. ఏనుగు అత్యంత బలం ఉన్నది అయినా, నీటిలో ఉన్న మొసలితో పోరాడడం చాలా కష్టం. గజరాజు చాలా సమయం పోరాడి, నీరసించి, ఇక ఎటువంటి శక్తీ లేక, చివరగా శ్రీమహావిష్ణువుని తనను కాపాడవలసిందిగా కోరుకొంటుంది. ఇదిగో ఇలా -

లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్
ఠావుల్ దప్పెన మూర్ఛవచ్చె తనువున్ డస్సెన్ శ్రమం బయ్యెడిన్
నీవే తప్ప నితః పరం బెఱుగ మన్నింపం దగున్ దీనునిన్
రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!  

గజేంద్రుడి అసహాయత, నీరసించిపోయాను నువ్వే వచ్చి కాపాడాలనే విన్నపము, నువ్వుతప్ప నన్ను రక్షించగలవారు ఎవ్వరూ లేదు అనే సంపూర్ణ విశ్వాసమూ ఈ పద్యంలో చక్కగా చెప్పబడ్డాయి.  భక్తుడి బాధ సరే! మరి ఆ సమయంలో హరి ఏమిచేస్తున్నట్టు!?

అలవైకుంఠపురంబులో నగరిలో నామూలసౌధంబు దా
పల మందారవనాంతరామృతసరఃప్రాంతేందుకాంతోపలో
త్పలపర్యంక రమావినోదియగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహియన గుయ్యాలించి సంరంభియై 

ఆ సమయంలో మహావిష్ణువు లక్ష్మీ దేవితో కలసి ఉంటాడు. గజేంద్రుడు ఆతని భక్తుడు. కష్టంలో ఉన్నాడు. వెంటనే వెళ్ళి కాపాడవలసిని బాధ్యత ఉంది. అందుకే, ఉన్నపళంగా బయలుదేరి ఆఘమేఘాలమీద వెళ్ళాడు. ఎలాగయ్యా అంటే - భార్య అయిన లక్ష్మీదేవితో ఒక్కముక్కైనా చెప్పలేదు. శంఖు, చక్రాలని తీసుకోలేదు. చేతిలోఉన్న లక్ష్మీదేవి చీరచెంగుని వొదలాలనే ద్యాస కూడా లేకుండా - భక్తుడిని ఆపదనుంచి గట్టెంకించడానికి ఒక్క పరుగున బయలుదేరాడు. 

సిరికిం జెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధింప డే
పరివారంబును జీరడభ్రగపతిం మన్నింపడాకర్ణికాం
తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై 

శ్రీహరివెంట లక్ష్మీదేవి బయలుదేరింది, ఆమెవెంటే పరివారం, గరుత్మంతుడు, ఆ తరువాత విష్ణుమూర్తియొక్క సకల ఆయుధాలూ వెళ్ళాయి. ఈ పద్యంలో చెప్పినట్టు -

తన వెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధవ్రాతమున్ వాని వె
న్కను పక్షీంద్రుడు వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్ర నికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు రావచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్

విషయమేమిటని విభుడిని అడగాలా లేదా అనే సంశయాన్ని లక్ష్మీదేవి పరంగా ఎంత చక్కని పద్యంలో చెప్పాడో చూడండి పోతనా మాత్యుడు.

అడిగెదనని కడువడి జను 
నడిగిన దను మగుడ నుడవడని యుడుగన్
వడివడి జిడిముడి తడబడ 
నడుగిడునడుగిడదు జడిమ నడుగిడునెడలన్ 

భక్తుని ఆర్తనాదం విని భగవంతుడు పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చీ, సుదర్శన చక్రంతో మొసలిని సంహరించి, గజరాజుని రక్షిస్తాడు.

ఈ కథలో విశేషమేమిటంటే భక్తుడు తనప్రయత్నం అంతాచేసి, అసహాయుడై, కష్టంలోఉన్నప్పుడు, అతనిని రక్షించడానికి భగవంతుడు దిగివస్తాడు అని. 
Wall Painting in Kotipalli Temple
గజేంద్రమోక్షంలో అద్భుతమైన పద్యాలను ఇక్కడ చూడండి.          ఇక్కడ వినండి. 

© Dantuluri Kishore Varma

మీవూళ్ళో గుడి వుంటే

పెనుమళ్ళలో అష్టసోమేశ్వర దేవాలయం
కాకినాడకి సుమారు 20 కిలోమీటర్లదూరంలో కోటిపల్లి మార్గంలో ఉండూరు వంతెన అవతల పెనుమళ్ళ అనే చిన్న ఊరిలో ఉన్న ప్రశాంతమైన శివాలయం. దక్షిన కాశీ గా ప్రశిద్దిగాంచిన ద్రాక్షారామ క్షేత్రం చుట్టూ ఎనిమిది దిక్కులలో చంద్రుడు అష్టసోమేశ్వరాలయాలను ప్రతిస్ఠించాడు. వాటిలో ఒకటే ఈ దేవాలయం. ద్రాక్షారానికి ఈశాన్య దిక్కున ఉంటుంది ఇది.
తాతగారి(మాతా మహులు) ఊరు. చిన్నప్పుడు శెలవులకి అక్కడికి వెళ్ళినప్పుడల్లా గుడికి వెళ్ళిరావడం తప్పనిసరి. ఇంటిదగ్గరనుంచి కనిపించేటంత దూరంలోనే ఉంటుంది. పెద్ద ప్రాంగణం. లోపలికి వెళ్ళిన వెంటనే కొబ్బరి చెట్లమధ్యనుంచి కనిపించే గుడి, మండపం, ద్వజస్థంబాలు. 

పూజారిగారు ఉన్నారో లేదో చూడాలి ముందు. లేకపోతే, ఒకరు వెళ్ళి పిలుచుకొని వస్తే మిగిలిన వాళ్ళు అందరూ గుడివెనుక ఉన్న బోదికాలువలో కాళ్ళు కడుక్కొని, గుడిచుట్టూ ప్రదక్షిణ చేసి, మండపంలో కూర్చొని ఆ కబురూ, ఈ కబురూ చెప్పుకొనే లోపు పూజారిగారు వచ్చి గుడి తలుపులు తీస్తారు.  

`ఏం బాబూ బాగున్నారా?` అని ఆప్యాయంగా పలకరించి, తీర్థం, తులసిదళం, ప్రసాదం ఇస్తారు. ఇలాంటి పలకరింపులు విన్నప్పుడే పాలగుమ్మి పద్మరాజు రాసిన `ఒక్కసారి మావూరు పోయిరావాలి..` అనే పాట గుర్తుకు వస్తుంది.  
సోమేశ్వరుడినీ, పార్వతీదేవినీ కొలుచుకొని ఇంటిదారి పట్టాలి. ఈ వూరనే కాదు, మీవూళ్ళో కూడా ఇలాంటి గుడి వుంటే, మీరూ వెళ్ళే ఉంటారు. ఇలాంటి జ్ఞాపకాలు మీకూ ఉండే ఉంటాయి. కదా?
© Dantuluri Kishore Varma

Wednesday, 28 August 2013

బుద్ధం, శరణం గచ్చామి..యానం బుద్ధా పార్క్.

బుద్ధుడు అంటే జ్ఞాని, తెలుసుకొన్నవాడు అని అర్థం. 29 సంవత్సరాల వయసున్నప్పుడు భార్యని, కుమారుణ్ణి, రాజ్యాన్ని విడిచిపెట్టి మనుష్యులు అనుభవిస్తున్న కష్టాలకి కారణాన్ని అన్వేషిస్తూ బయలుదేరిన సిద్ధార్థుడు ఆరు సంవత్సరాలు కఠిన నియమాలతో తపస్సుచేస్తాడు. కానీ, తన ప్రశ్నలకు సమాధానం దొరకదు. ఆహార, పానీయాలు కూడా తీసుకోకుండా ధ్యానం కొనసాగిస్తాడు. ఫలితం ఉండదు. అప్పుడు ఒక బాలిక అతనికి కొంత ఆహారాన్ని ఇస్తుంది. స్వీకరిస్తాడు. ఒక గొప్ప సత్యం అవగతమౌతుంది. శారీరకమైన కష్ఠాలు కలిగించుకోవడం ద్వారా అద్యాత్మికమైన సమాదానాలు పొందలేమని. ఈ సంఘటన తరువాత అహారాన్ని భుజిస్తూ, నీటిని సేవిస్తూ, స్నానపానాదులు చేస్తూ తన ధ్యానాన్ని కొనసాగిస్తాడు. ఇది కఠిన నియమాల సాధన కాకుండా, అలాగని భౌతికమైన సుఖాల్లో మునిగి తేలకుండా మధ్యేమార్గంగా ఉండే విధానం.
ఈ క్రమంలో ప్రస్తుతం బీహార్లో ఉన్న బోధ్‌గయా అనే ప్రాంతంలో భోది వృక్షం క్రింద సిద్దార్థుడికి జ్ఞానోదయమై బుద్దుడు అవుతాడు. తను తెలుసుకొన్న సత్యాన్ని తన శిష్యులకి ఉత్తర్‌ప్రదేశ్‌లో వారణాసికి దగ్గర సారానాథ్లో మొట్టమొదటిసారి భోదిస్తాడు. బుద్దుని బోదనలనే దమ్మపదం అంటారు. బుద్దుని బోధనలని అనుసరించే శిష్యుల సంఘం ప్రారంభమౌతుంది.
ఎనభై సంవత్సరాల వయసులో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న కుశీనగర్‌లో బుద్ధుడు మహాపరినిర్యాణం చెందాడు.
కాకినాడకి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేంద్రపాలితప్రాంతం పుదుచ్చేరీలో భాగమయిన యానంలో సుందరమైన బుద్ధాపార్క్ ఉంది. లోపలికి వెళ్ళడానికి ఉన్న మూడు ద్వారాలకీ బౌద్ధ సాహిత్యంలో కనిపించే పాళిభాషలోని పదాలు కలిసి వచ్చేలా బుద్ధద్వారా, సంఘద్వారా, దమ్మద్వారా అని పేర్లు పెట్టారు. 
ద్వారాలకి ఇరువైపులా టెర్రకోట కుఢ్య చిత్రాలు, పార్క్ లోపల అందమైన లాన్, పెద్ద తటాకం మధ్యలో పీఠమ్మీద ధ్యానముద్రలో గౌతమబుద్దుడు. ఆ పీఠందగ్గరకి వెళ్ళడానికి అందమైన వంతెన. తటాకం చుట్టూ వాకింగ్‌ట్రేక్, ట్రేక్ వెంబడి ప్రక్కనే చెట్టుమొదళ్ళతో చేసినట్టు కనిపిస్తున్న సిమ్మెంటు బెంచీలు, లైట్లు, అక్కడక్కడా మండపాలు, సుందరమైన రాతి విగ్రహాలు, పచ్చని చెట్లు, ఒకవైపు స్టేడియంలో లాగ అర్ధచంద్రాకారపు మెట్లు, పిల్లలు ఆడుకోవడానికి చిన్న సాండ్‌పిట్ ఉన్నాయి. బుద్ధా పార్క్ అని నామకరణం చేసినందుకు, ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు అనేటంత ప్రశాంతంగా ఉంది. 

బుద్ధం, శరణం గచ్చామి..
© Dantuluri Kishore Varma 

Monday, 26 August 2013

ఇంకొక్క పెసరట్టు!

కాకినాడ మెయిన్‌రోడ్ నుంచి జగన్నాధపురం వంతెనవైపుగా వస్తున్నప్పుడు, గోల్డ్‌మార్కెట్ సెంటర్ దగ్గర కుడిచేతివైపు మంత్రిప్రగడవారి వీధిలోనికి తిరిగి ముందుకు వెళ్ళండి. బాగా ముందుకి వెళితే దేవాలయం వీధికి వెళ్ళిపోతారు. వద్దు! అంతవరకూ వెళ్ళడం అనవసరం. కొంచెం నె...మ్మ...దిగా కదలండి. ఆ))) చూశారా, రోడ్డుకి రెండువైపులా వరుసగా బజ్జీ బళ్ళు, పిడతకింద పప్పు, రాజస్థానీవాళ్ళ పానీపూరీ, పావుబాజీ, చపాతీ బళ్ళు....వాటి దగ్గర బైకులమీద, స్కూటర్లమీద, సైకిళ్ళమీద, కార్లలో, నడిచీ వచ్చిన ఫాస్ట్‌ఫుడ్ ప్రియులు ఎంతోమంది ఆవురావురుమని మిరపకాయ బజ్జీలనీ, కళాత్మకంగా పానీపూరీల్నీ తినడం కనిపిస్తుందికదా?  నోరు ఊరుతుంది, అవునా? ఆగండాగండి. తొందరపడి ఎదో ఒకటి కొనేసుకోకండి. ఒక్క నాలుగడుగులు....

ఎడమచేతివైపు మసక వెలుతురులో కణకణమని మండుతున్న గ్యాస్‌స్టవ్ మీద పెద్ద పెనం. దానిమీద అరచేతి అంత చిన్ని చిన్ని అట్లు. అట్లకాడతో చిన్న డబ్బాలోనుంచి నూనెతోడి, వాటిమీద చిలకరిస్తున్న వ్యక్తిని చూశారా? అతని చేతులు మెషీన్‌లలా కదులుతున్నాయి. మెత్తగా రుబ్బిన పొట్టుపెసర పప్పు పెనం మీద వేసి, దానిమీద ఉల్లితరుగు, మొరుంగా ఉన్న ఎండుమిరపకాయ పొడుం, వడపప్పు, జీలకర్రా అలా అలా పరచి; మధ్య మధ్యలో వాటిని తిరగేస్తూ, నూనె వేస్తూ చకచకమని వేయిస్తున్నాడు. ఆగితే కుదరదు, రెస్టు అన్న మాటే చెప్పకూడదు. `ఇదిగో, ఇక్కడ ఇంకొకరెండు,` `ఏం బాబు, ఇంతసేపా? మేం ముందే వచ్చాం. ఇంకా కట్టలేదు,` అనే రకరకాల మాటలు వింటూ, ఈ పెసరట్లు ఎంత ఫేమసో అని ఆశ్చర్యపోతూ మన వంతుకోసం ఆగుదాం. 
అయిదునిమిషాలు వెయిట్‌చేసి ప్లేటులో వేయించుకొన్న రెండు పెసరట్లలో ఒక్కోదాన్నీ రెండంటే రెండే ముక్కలుగా తుంచుకొని, కరాచీనూక ఉప్మా, కారంచట్నీల్లో లడాయించి ఊ...ఫ్ అని లోపలకి లాగేసుకొంటున్న పెద్దమనిషి; మళ్ళీ వెంటనే ప్లేటుని ముందుకు చూపిస్తున్నాడు - మరో రెండట్లకోసం. ఆయన వంతు ఎప్పుడవుతుందో, మన పేకెట్ చేతికి ఎప్పుడు వస్తుందో!    

అమ్మయ్యా! అదిగోనండీ, మనకోసం న్యూస్‌పేపర్‌లో విస్తరాకు ముక్క వేసి, వేడివేడి అట్లు వేస్తున్నాడు. వాటిమీద మళ్ళీ ఇంకొక ఆకు. దానిలో ఉప్మా. ఒక ప్రక్కన కారంచట్నీ, దానికి చేర్చి తీపిచట్నీ. కలిపి చుట్టబెట్టు దారంతో కట్టేశాడు. `ఎంత?` అంటారా? పెసరట్టు ఒక్కటే అయితే అయిదు రూపాయలు. ఉప్మాకూడా కలిపితే పది. 

మాస్టారూ... ఆహా.. అదిరిందండి. అయినా, రుచి ఒక్కటే కాదండీ... అసలు అయిదురూపాయలకీ, పదిరూపాయలకీ ఏమొస్తుందని ఈ రోజుల్లో! ఈ అట్లు కొట్టాయన పేరు సుబ్బారావు - ఆయన ప్రొడక్ట్ సుబ్బారావుగారి పెసరట్లు. ఇంకొకటి ఉంది ఇలాంటిదే. ఆపేరు బహుశా మీరు వినే ఉంటారు - మహాలక్ష్మీ పెసరట్లు. ఉదయం ఆరుగంటలనుంచి పదిగంటలవరకూ, మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి పదిగంటల వరకూ వేసిన చెయ్యి వేస్తూ ఉంటే, తినే నోళ్ళు తింటూ ఉంటాయి. ఒట్టూ, కావాలంటే మీరే చూడండి. 
*     *     *
వేడి వేడి పెసరట్టులాగ ఇది నా రెండువందలో పోస్టు.   

ఇంకొక్కటి....!?
© Dantuluri Kishore Varma 

Tuesday, 20 August 2013

కర్మయోగా!

కర్మ అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదటిది పని. మనంచేసే ప్రతీపనీ కర్మే. రెండవది, మనం చెసే పనులవల్ల సంప్రాప్తించే ఫలితం. ఏదయినా అనుకోనిది జరిగినపుడు, చెడు సంభవించినప్పుడు నుదుటిమీద బొటనవేలితో అడ్డంగా గీసుకొని, `అంతా మనకర్మ!` అనుకోవడం చూస్తూ ఉంటాం. ఇదివరలో మనం చేసిన పనుల యొక్క ఫలితంగా అలా జరిగిందని దీని అర్థం.

ఏదయినా ఒక సంఘటనో, చర్యో జరిగినప్పుడు దానికి ప్రతిస్పందిస్తూ మనం నవ్వడమో, ఏడవడమో, ఆ చర్యకి కారణం అయినవాళ్ళని తిట్టడమో, ప్రశంసించడమో చేస్తాం. ఈ ప్రతిస్పందనలన్ని మనవ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చూపిస్తాయి. అప్పుడెప్పుడో ఒకహీరో, ఒకకమేడియన్ బోటులో షికారుకి వెళ్ళారు. నది మధ్యలోకి వెళ్ళాక మెరక వేసిన ఇసుకకి గుద్దుకొని, బోటుకి అడుగు భాగంలో ఒక పగులు ఏర్పడింది. విపరీతంగా నీళ్ళు బోటులోనికి రావడం ప్రారంభించాయి. ఇక కొన్ని క్షణాల్లో బోటు మునిగిపోబోతుండగా వీరోచితమైన పాత్రలుచేసే హీరో బోరుమని ఏడిస్తే, కమేడియన్ మాత్రం నిబ్బరంగా ఉన్నాడట. వేరే బోటువాళ్ళు పరిస్థితిని గమనించి వాళ్ళిద్దరినీ రక్షించారు. కానీ, హీరోగారి ధీరత్వం మాత్రం బట్టబయలయ్యింది. 

ఉదాత్తమైన వ్యక్తిత్వం నిర్మించుకోవడం మనచేతుల్లోనే ఉంది. ఒక్కోసారి ఏవో చర్యలకి ప్రతిచర్యలుగా కాకుండా మనకు మనమే కర్మలు చేస్తుంటాం. ధనంకోసమో, కీర్తికోసమో, అధికారంకోసమో, ముక్తికోసమో, ఇదివరలో మనం చేసిన తప్పుని సరిద్దికొనే ఉద్దేశ్యంతో ప్రాయశ్చిత్తంగానో ఈ పనులు చేస్తాం. ఇవన్నీ ఫలితాలని ఆశించి చేసే పనులు. ఏ ఫలితం ఆశించకుండా కర్మలను ఆచరించడం ఉత్తమమైన పద్దతి కానీ అలా చెయ్యడం చాలా కష్టమని విజ్ఞులు అంటారు. వీటికి పూర్తి వ్యతిరేకంగా అధమమైన చర్యలు కొన్ని ఉంటాయి. కొంతమంది రాజకీయనాయకులని, ప్రభుత్యోద్యోగులని, వ్యాపారస్తులని చుస్తూ ఉంటే అధమమైన కర్మలు అంటే ఏమిటో తెలుస్తుంది. ప్రజాధన్నాన్ని వాళ్ళ తాతగారిసొమ్ములా వేల కోట్లలో మింగేస్తూ, నిర్లజ్జగా తిరిగేస్తూ ఉంటారు కొందరు నాయకులు. ప్రజలు చెల్లించిన పన్నులని పెద్ద, పెద్ద పే పేకెట్లగా జీతాలు అందుకొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఏపనీచేయ్యితడవకుండా చెయ్యరు. ప్రతీ చిన్నదానికీ లంచం కావలసిందే. ఇక మోసపూరిత వ్యాపారులు ఎక్కువలాభాలకోసం ప్రతీదీ కల్తీ చెయ్యగలరు. రోగులు వాడే మందులు, పసిపిల్లలకు పట్టే పాలపొడి, వంటల్లో వాడే నూనె... అదీ, ఇదీ లేదు.

తత్వశాస్త్రం గురించి మాట్లాడుకొంటున్నప్పుడు కొన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఉదాహరణకి ఇటువంటి కర్మల గురించిన చర్చలో `ఆత్మ శాశ్వతమైనది, కర్మల యొక్క ఫలితాలను తనతో తీసుకొని వెళుతుంది` అనే విషయాల మీద నమ్మకం ఉంచాలి. స్వామీ వివేకానంద అంటాడు, `ముందుజన్మల కర్మల ఫలితంగా మనకు కలిగిన అర్హత వల్లే మనం ఏదయినా పొందగలం,` అని. దీనికి ఒక చక్కని ఉదాహరణకూడా చెపుతాడు. మూర్ఖుడు ఒక లైబ్రరిలో ఉన్న పుస్తకాలన్నింటినీ ఇంటికి తెచ్చుకోవచ్చు కానీ, `ఎన్ని చదువుతాడు?` అనేది అతని మునుపటి కర్మలద్వారా పొందిన అర్హతపైన ఆధారపడి ఉంటుంది అని. అలాగే ధనం కూడా. కొన్ని వేల కోట్లు అక్రమంగా గడించినవాళ్ళు అనుభవించగలిగేది ఎంత?
మునుపటి కర్మలవల్ల పొందిన అర్హత కారణంగా ఇప్పుడు ఇలా ఉన్నాం. కాబట్టి, ఇప్పటి పనుల ఫలితంగా భవిష్యత్తులో మనకి మంచిఅర్హత లభించాలంటే ఏమిచెయ్యాలి? దీనికి సమాదానం నిష్కామ కర్మ అని చెపుతారు. పైన చెప్పుకొన్నట్టు పలితం ఆశించకుండా చేసే పని ఉత్తమమైనది, దుర్లభమైనది. జీతం తీసుకొకుండా, ప్రమోషన్ ఆశించకుండా ఉద్యోగం చేస్తాను; లాభం లేకుండా వ్యాపారం చేస్తాను అంటే ఎవరికీ కుదరదు.  కాబట్టి మధ్యేమార్గంగా కనీసం ఎవరినీ మోసం చెయ్యకుండా వ్యాపారం, లంచాలు తీసుకోకుండా ఉద్యోగం, ప్రక్కవాడికి గోతులుతియ్యకుండా పని, ప్రజాదనాన్ని కబళించకుండా పరిపాలనా చేస్తే కర్మల ఫలితంగా వచ్చే అర్హతలని పెంచుకోవచ్చు!

ఆత్మమీద, కర్మఫలితాలమీదా ఏమాత్రం నమ్మకం లేకపోయినా కూడా, ఇలా చెయ్యడంవల్ల ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవచ్చు. తలయెత్తుకొని జీవించవచ్చు.
© Dantuluri Kishore Varma 

Friday, 16 August 2013

లవ్ స్టోరీ

1970లో ఎరిక్ సేగల్ రాసిన లవ్‌స్టోరీ అనే నూటపదిహేను పేజీల చిన్ని ఇంగ్లీష్ నవల 21 మిలియన్ కాపీలు అమ్ముడయ్యింది. రాయల్టీగా రచయితకి  ఎంత వస్తుందో తెలియదు కానీ, పుస్తకానికి డాలర్ చొప్పున వచ్చినా ఇలాంటి ఒక్క పుస్తకంతో కోటీశ్వరుడు ఐపోవచ్చు. రచయితలకి గొప్ప ఇన్స్పిరేషన్ కలిగించే పాయింట్ ఇది. డబ్బున్న అబ్బాయీ పేద అమ్మాయి మధ్య ప్రేమ, పెద్దలని ఎదిరించి పెళ్ళిచేసుకోవడం, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు లాంటి ఇతివృత్తంఉన్న కథలు కొన్ని వందలు వచ్చి ఉంటాయి. చాలా వాటిని సినిమాలుగా కూడా చూశాం. అలాంటి సాధారణమైన కథే ఇది కూడా. కానీ ఎందుకు అంత ఎక్కువగా అమ్ముడుపోయింది? నేను అనుకోవడం ఏమిటంటే నవల చివరిలో గుండెల్ని పిండేసే విషాదాన్ని చొప్పించాడు రచయిత. జాలీ గా సాగిపోయే సాధారణమైన కాలేజ్ కథ ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని హృదయాన్ని బరువెక్కిస్తుంది. ఇలా కాకుండా `ఆ తరువాత వాళ్ళిద్దరూ కలకాలం ఆనందంగా ఉన్నారు,` అని ముగింపు ఇస్తే అట్టర్ ఫ్లాప్ అయివుండేది.
*     *     *
తెలివిగా, చమత్కారంగా మాట్లాడే హీరోయిన్ జెన్నీఫర్ కేవిల్లరీ మ్యూజిక్ స్టుడెంట్. ఒక రొట్టెలు చేసుకొనే వాడి కూతురు. హీరో ఒలివర్ బ్యారెట్, సంపన్న బ్యారెట్ వంశానికి వారసుడు, హార్వార్డ్ కాలేజ్ విద్యార్థి , హాకీ ప్లేయర్.

మొట్టమొదటిసారి వాళ్ళిద్దరూ లైబ్రరీలో కలుసుకొన్నప్పుడు `నువ్వోక డబ్బున్న స్టుపిడ్‌వి` అంటుంది.
`కాదు, నేను తెలివైన పేదవాడ్ని,` అంటాడు. 
`అది నువ్వుకాదు, నేను,` అని సమాధానం చెపుతుంది. 
`ఎందుకు తెలివైనదాన్ననుకొంటున్నావ్?` అని ప్రశ్నిస్తాడు.
`ఎందుకంటే, నేను నీతో కాఫీకి రావడం లేదు కనుక.`
`అసలు, నిన్ను పిలిస్తే కదా?` 
`అందుకే కదా నిన్ను స్టుపిడ్ అన్నాను,` అంటుంది.   

బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా, సిద్ధర్థ్‌ల్లా అనిపిస్తాయి ఈ క్యారెక్టర్లు రెండూ. ఒలివర్ తండ్రిది ప్రకాష్‌రాజ్ లాంటి మనస్థత్వమే! తండ్రి అంటే అతనికి అసహ్యం, కోపం. తండ్రి మాటకాదని కేవిల్లరీని పెళ్ళిచేసుకొంటాడు. ఒలివర్ని లా చదవించడానికి, కేవిల్లరీ టీచర్ ఉద్యోగం చేస్తుంది.

ఒక సందర్భంలో మొగుడూ పెళ్ళాల మధ్య ఓ చిన్న గొడవతో ఒలివర్ టెలీఫోన్ విసిరి కొడతాడు. ఆమె ఇంటిలోనుంచి బయటకు వెళ్ళిపోతుంది. నిజానికి ఒక్కక్షణం ఆమెని వదిలి ఉండలేడు. ఊరంతా ఆమెకోసం వెతికి, నిస్పృహతో రాత్రికి ఇంటికి చేరితే, మెట్లమీద కూర్చొని అతనికోసం ఎదురుచూస్తూ ఉంటుంది. `సారీ` అంటాడు. `Love means not ever having to say you`re sorry,` అంటుంది  ఈ ఒక్క సన్నివేశంతో వాళ్ళ ఇంటర్ డిపెండెన్సీని రచయిత మనకి చెపుతాడు. అలాంటిది, అకస్మాత్తుగా హీరోయిన్ ల్యుకేమియతో మరణించబోతుందని తెలిస్తే హీరో పరిస్థితి ఏమవుతుంది? లా పూర్తి చేస్తాడు మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయాయి, ఇక పిల్లల్ని కనవచ్చు అనుకొనే సమయంలో ఇలాంటి పిడుగులాంటి వార్త!   

ఈ సంగతి ఆమెకి తెలిసినరోజు ఆమె కళ్ళల్లో విషాదాన్ని చూస్తాడు. అది తనగురించి కాదు, అతని గురించి విషాదం. ఆ సన్నివేశం గుండెలు పిండేస్తుంది.  

కథ ఆమె చివరి రోజులకి, హాస్పిటల్‌కి చేరుతుంది. విషయం తెలుసుకొని ఒలివర్ తండ్రి హడావుడిగా వస్తాడు. కోడలి ఆరోగ్య పరిస్థితి గురించి కొడుకుని అడుగుతాడు. కానీ, ఆమె అప్పటికి కొన్ని క్షణాల ముందే చనిపోయిందని తెలుసుకొని, `ఐయాం సారీ,` అంటాడు బాధగా. అప్పుడు ఒలివర్ అప్రయత్నంగా,  `Love means not ever having to say you`re sorry,`  అంటాడు. తను మరణించినా నిజమైన ప్రేమ యొక్క స్పిరిట్‌ని అతనిలో నింపిందా!?
*     *     *
అసలు ఈ కథని సినిమాకోసం స్క్రిప్ట్‌గా రాశాడట ఎరిక్ సేగల్. అయితే, సినిమాకి హైప్ క్రియేట్ చేసే ఉద్దేశ్యంతో నవలగా రాయించి సినిమా రిలీజ్‌కి ముందు ఫిబ్రవరి 14 తారీకున, వాలంటైన్స్ డే  స్పెషల్ గా మార్కెట్‌లోకి వదిలారట. రాబోయే సినిమా తాలుక నవలగా దీనికి, నవల సృష్టించిన సెన్సేషన్‌తొ సినిమాకీ మేలుజరిగి రెండూ బంపర్ హిట్ అయిపోయాయి.   

బై ఫర్ నౌ!        
© Dantuluri Kishore Varma

రైల్‌బస్ దారిలో ఏమిచూడచ్చో చెపుతానన్నవి ఇవే!

ట్రేక్‌ని మింగుతూ ట్రెయిన్ పోతుంటే, డ్రైవర్ ప్రక్కన కూర్చొని చూడచ్చు.

బస్ మీద పోతుంటే జనావాసాల ముంగిళ్ళు కనిపిస్తే, ట్రైయిన్ లో పోతున్నప్పుడు పెరటివైపు కనిపిస్తుంది. ఎందుకంటే తొంభై శాతం మంది రోడ్‌ని ఫేస్ చేసుకొని ఇళ్ళుకట్టుకొంటారుకానీ, పట్టాలకి అభిముఖంగా కట్టుకోరు.

రేపూరులో కట్టిన 116 అడుగుల ఎత్తయిన సాయిబాబా, కొవ్వాడ స్టేషన్ దాటిన తరువాత ఓ రెండు నిమిషాలపాటు మనకు దర్శనమిస్తాడు. తాడిచెట్ల తలలకు పైన, ఇంకొక అంత ఎత్తులో అభయహస్తం చూపిస్తూ కనిపిస్తాడు. 
   
పెరటివైపు పాపలకి గోరుముద్దలు తినిపిస్తున్న తల్లులు వాళ్ళచేత టాటా చెప్పిస్తారు.

చాలా మంది పొలాల్లో పనిచేసుకొంటుంటే, కొంతమంది జల్సా రాయుళ్ళు మాత్రం రైలు పట్టాలకి చేర్చి ఉన్న పొలంగట్లమీద, చెట్టునీడలో కూర్చుని ముక్క తిప్పుతారు. పేకాట బోర్డులు ఈ నలభై అయిదు కిలోమీటర్ల దారిలో కనీసం మూడు నాలుగు కనిపిస్తాయి.

నడుములు వంచి చేలల్లో పనిచేసుకొంటున్న కూలీలు రైలు వెళుతున్నప్పుడు పని ఆపి, నిటారుగా నుంచుని అది వెళ్ళేవరకూ చూస్తారు. అలా వాళ్ళకి కొన్నిక్షణాలు విరామం.

తెల్లకొంగలు, నల్లకొంగలు, తెలుపూ నలుపుల కాంబినేషన్లో ఉన్న కొంగలు, ఇంకా నాలుగైదు రకాల రంగురంగు పిట్టలు పట్టాలమీద ఇనుప చక్రాల చప్పుడికి బెదిరి ఒక్కసారిగా పైకి ఎగురుతాయి.

పాడుపడినట్టు ఉన్న స్టేషన్లు, రంగుపోయి నాచుపట్టిన రైల్వే గేట్లూ కనిపిస్తాయి.

కనుచూపుదూరంవరకూ విస్తరించిన ఆకుపచ్చని చేలు, గట్ల వెంబడి కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, కట్టవల మీద గుబురుగా పెరిగిన రకరకాల వృక్షాలు, అరటిచెట్ల మధ్య ఉన్నాయో, లేవో తెలియకుండా ఉన్న పూరిగుడిసెలు అడుగడుగునా కనిపిస్తాయి.

గొర్రెలకాపర్లు, పసువులకాపర్లు, రైలు గేట్ల దగ్గర అసహనంగా ఆగిన వాహన దారులు, బోదెల్లో ఈతకొడుతున్న బుడతలు, బట్టలు ఉతుకుతూ బిజీగా ఉన్న ఆడవాళ్ళు... ఎందర్నో ఈ ప్రయాణంలో గమనించవచ్చు. 

ప్రవహిస్తున్న కాలువలు, వాటిమీద వంతెనలు, కాలువలకు సమాంతరంగా పోతున్న రోడ్లు ఎన్నో!

మరీ ఎండలో ప్రయాణం బాగోక పోవచ్చు.

మంచుకురిసే చలిలో అయితే చాలా బాగుంటుంది.

వర్షం కురుస్తూ ఉండగా అయితే ఇంకా బాగుంతుంది.


© Dantuluri Kishore Varma 

Thursday, 15 August 2013

ఓయ్, ఎంకన్నా!

ఓయ్, ఎంకన్నా! ఓపాలి ఇటురావో! 
ఓ సెయ్యెయ్, సానా బరువుంది మోపు. ఆ )))  అద్గదీ
ఏదో అనుకోడంగానీ నువ్వు నాకు, నేన్నీకూ సాయం సేసుకోపోతే ఎట్టా కుదురుద్దీ అని!
ఏదో మాటవరసకి అన్నాన్రా బాబూ, నన్ను రాజకీయాల్లోకి లాగకు.
సానా పనుంది. ఆనాక ఒత్తాను, బై!

© Dantuluri Kishore Varma 

కాకినాడ - కోటిపల్లి రైల్‌బస్

కాకినాడ నుంచి కోటిపల్లి వెళ్ళడానికి చాలా ఆర్‌టీసీ బస్సులు ఉన్నాయి. కానీ ట్రైన్‌లో వెళ్ళాలంటే ఒకేఒక్క ఆప్షన్ ఉంది. అదే రైల్‌బస్.  రెండు స్టేషన్ల మధ్య చిన్న ట్రేక్‌లమీద నడిచే రైల్‌బస్‌లు దేశంలో చాలా తక్కువగా, విదేశాలలో కొన్నిచోట్లా ఉన్నాయి. అలా అరుదుగా కనిపించే రైల్‌బల్ మనజిల్లాలో కూడా ఉండడమే దీని ప్రత్యేకత. దీనిలో నలభై మంది కూర్చోవడానికి సరిపడే ఒకే ఒక బోగీ ఉంటుంది. నలభై కిలోమీటర్ల వేగం దాటి వెళ్ళదు. ఇంజన్‌డైవర్ కంట్రోల్స్‌ని ఎలా ఆపరేట్‌చేస్తున్నాడో అతని వెనుకే కూర్చుని గమనించవచ్చు. బస్సులోలాగా టికెట్లని ఇవ్వడానికి కండక్టర్‌కూడా ఉంటాడు. 
లెవెల్ క్రాసింగుల దగ్గర గేటు వెయ్యడానికీ, తియ్యడానికీ ఈ లైన్‌లో ప్రతీచోటా ఉద్యోగి ఎవరూ ఉండరు. అందువల్ల, ఆ పనికోసం ఒకవ్యక్తి  రైల్‌బస్‌లోనే ప్రయాణిస్తాడు. క్రాసింగ్‌కి ఇవతల బస్ ఆపితే దిగివెళ్ళి గేటు వేస్తాడు. బస్ క్రాసింగ్ దాటిన తరువాత మళ్ళీ ఆగుతుంది. అప్పుడు అతను గేటు తీసి వచ్చి, బస్ ఎక్కి, విజిల్ వేసిన వెంటనే బండి కదులుతుంది. ప్రతీగేటు దగ్గరా ఆగుతుంది కనుక ప్రయాణీకులు చాలామంది అక్కడే ఎదురుచూస్తూ ఉంటారు. వరదబాదితుల పునరావాస కేంద్రాల్లా కనిపించే పురాతనమైన రైల్వే స్టేషన్లలోకూడా కొంతమంది ఎక్కుతారు. విచిత్రమైన విషయం ఏమిటంటే ఒక్కోసారి ట్రేక్‌మీద బండికి ఎదురుగా నడుచుకొంటూ వచ్చి బస్సుని ఆపినట్టు ఆపే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఆపాలనే రూలేమీ లేకపోయినా, సాధారణంగా బండి ఆగుతుంది. 

మంగళవారం తప్పించి వారంలో ప్రతీరోజూ ఇది నడుస్తుంది. కాకపోతే రోజుకి ఒకటే ట్రిప్. ఉదయం తొమ్మిదిన్నరకి కాకినాడలో బయలుదేరితే పది స్టేషన్లు దాటుకొని 45 కిలోమీటర్లదూరంలో ఉన్న కోటిపల్లికి పదకొండున్నరకి చేరుతుంది. మళ్ళీ పన్నెండు గంటలకి అక్కడ బయలుదేరి కాకినాడకి మద్యాహ్నం  రెండుగంటలకి వచ్చేస్తుంది. రైల్‌బస్‌లో వెళ్ళి అష్టసోమేశ్వర ఆలయాలలో ఒకటైన కోటిపల్లి దేవాలయం(ఈ లింక్ క్లిక్ చెయ్యండి) దర్శించుకొని మళ్ళీ అదే ట్రైన్ అందుకోవాలంటే కుదరదు. తిరుగు ప్రయాణానికి  ఆర్టీసీ బస్సో, మరొకటో చూసుకోవాలి. 
ఇంకొక ముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఒకవైపు రెండుగంటల ప్రయాణంలో చుక్క మంచినీళ్ళుకానీ, టీకానీ, సమోసా పల్లీలు లాంటి చిరుతిళ్ళు కానీ అస్సలు దొరకవు. స్టేషన్లన్నీ ఊళ్ళకి చివర, పొలాలకి దగ్గరగా ఉంటాయి. ప్రయాణంలో మేత అలవాటు ఉన్నవాళ్ళు ఎవరిపాట్లు వాళ్ళు పడవలసిందే!
*     *     *
గోదావరి డెల్టాకి రవాణా సదుపాయం కోసం 1928లో ఈ లైన్‌ని బ్రిటిష్‌వాళ్ళు వేశారట. 1940లో రెండవ ప్రపంచ యుద్దం రావడంతో స్టీలుకి ఎక్కడలేని కొరతా వచ్చింది. దానివల్ల కోటిపల్లి లైన్‌లో పట్టాలని తొలగించి వేరే చోటకి తరలించారు. అప్పుడు తీసిపారేసిన పట్టాలని తిరిగి వెయ్యడానికి 64 సంవత్సరాలు పట్టింది. సుమారు డెబ్బై కోట్లు ఖర్చయ్యింది. 2004లో అప్పటి రైల్‌వే మంత్రిగారి చేతులమీదుగా కొత్తగా నిర్మించిన కాకినాడ స్టేషను, కోటిపల్లి రైల్వే లైను ప్రారంభించబడ్డాయి. 
కాకినాడ-కోటిపల్లి రైల్వే లైన్‌ని బ్రాంచ్ లైన్ అంటారు. ఇది కోటిపల్లి దాకా వెళ్ళి ఆగిపోతుందికానీ అసలు పెద్ద ప్రోజెక్ట్‌లో ఒక భాగం, కోనసీమవాసుల దశాబ్ధాల కల. ఈ లైన్‌ని అమలాపురం మీదుగా నరసాపూర్‌కి కలపాలి. అయితే మధ్యలో గోదావరినదియొక్క మూడుపాయలు - వశిష్ట, వైనతేయ, గౌతమీ ప్రవహిస్తున్నాయి. మూడు బ్రిడ్జీలు కట్టాలి(కోటిపల్లి నుంచి ముక్తేశ్వరానికి, బోడసకుర్రు నుంచి పాసర్లపూడికి,  సఖినేటిపల్లి నుంచి నరసాపూర్కి). ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ లైన్ నిర్మాణానికి 700 కోట్ల పైనే ఖర్చవుతుంది. ఖర్చు మోపెడు, బడ్జెట్ కేటాయింపులు పిడికెడు. అందుకే ఎంతోమంది విశ్వప్రయత్నాలు చేస్తున్నా, కల కల గానే ఉండిపోతుంది. 

అంతవరకూ ఎదురుచూస్తూ......
© Dantuluri Kishore Varma 

Monday, 5 August 2013

Walk through nature and be a part of it.

Expanding meadows and misty mountains

Wild animals and lovely birds

Flowing rivers and fluent streams

Old forts and timeless temples

Sprawling buildings and spreading skies

Walk through nature and be a part of it.

 (photo created)

© Dantuluri Kishore Varma

Sunday, 4 August 2013

Mnemonics since time immemorial

You must have heard about mnemonics.  It deals with remembering things better. For example there are seven colours in a rainbow. To keep them in mind in order we use a mnemonic `VIBGYOR`.  The other day someone found it difficult to recall the names of the nine planets. But when a memory trick in the form of a sentence was supplied to him, he felt overjoyed on realizing how easy it was to get the facts fixed in the mind using mnemonics.   I know you are interested in knowing the trick which made him feel so thrilled. It was this – My Very Easy Method; Just Set Up Nine Planets. Each word in the sentence is capitalized to indicate that they are the first letters of nine planets respectively. Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, Neptune, Pluto. Nice, isn`t it?

Once a school boy got vexed up with mathematics. He could not get `arithmetic` spelling right. The teacher had tried a lot but ultimately tired of  teaching him.  The boy`s uncle felt sympathetic for him and wanted to make things clear. He took the boy out and bought him an ice cream. While coming back home, he asks the boy, “Dear fellow,  you know there is a rat in your house and it causes a lot of troubles to all of you. If you left this ice cream at home, what would happen to it?” The boy immediately responded by saying, “The rat in the house might eat the ice cream.” “That`s it,” exclaimed the uncle, “you have found the solution to your problem! You can now remember the spelling of arithmetic.” The bewildered boy asked, “How?” “Simple,” said uncle ” just pick out all the first letters of the words from your sentence – A Rat In The House Might Eat The Ice Cream. Say this sentence a number times. You will never forget the spelling.”

The boy was very happy. But, he had something else to get clarified. He was sure the uncle can show a smarter way to get through the difficulty. He started to say, “I hate mathematics. I strongly feel all mathematics books should commit suicide. They have all problems from cover to cover. I do not know how to solve them all. Please tell me a shorter sentence than the one you have just told for arithmetic to enable me to perform well.”  The uncle knew that the boy had just got some inquisitive interest towards the subject. He wanted to go on with a bit of sermonizing. ” I will proceed to tell you a mantra- a charm to make any thing possible for you. If you remind yourself of this everyday, and follow as it says, there won`t be any retreating for you.” The boy became extremely curious. Smiling, the uncle revealed the secret – “The charm is this boy – practice makes a man perfect.”  It is true. Practice and practice then failure is scared to come near you and success approaches you with stretched hands to take you into its folds.

Let us now go a little into distant past. I think mnemonics is not a latest science. It must have been used by our ancestors as well. Otherwise how could they have remembered thousands  of Sanskrit slokas and passed them on to the next generation orally?  They depended on mental power until the script was invented for languages. I suppose, they would have used different kinds of mnemonics – some for the learned and some others for the illiterates.

Folk songs, art forms were all memory tricks. We are surprised to notice absolute illiterate villagers  quote words of wisdom from our scriptures like The Ramayana and The Mahabharata. It would have been possible through folk songs, dramas, cinemas based on these legends. Some times Gods` statutes/pictures are used to convey a clear message. For example Goddess Sarasvati, who is revered to be the goddess of education. 

Let us now come to the symbolism represented by the form of the Goddess.  Four things are important for a knowledge seeker who wants to become successful.

1. Knowledge is bliss; ignorance is misery. Saraswathi is always clad in a white saree. White is the symbol of knowledge and black- ignorance.

2. After understanding that knowledge is all powerful, we should not proceed to learn things blindly.  We must know the objective of learning. The process should not be tedious. To convey these, the goddess has four arms. She plays veena(pleasantness)  with two of them and holds a book(learning) and a rosary(ethics) respectively in the remaining hands.

3. We should always be focused but never be lured by attractions.   She has two vehicles – one a peacock and the other a swan. The peacock represents attractiveness(plumage), swan shows wisdom(capacity to separate milk from water).  We should never go astray, led by various attractions like T.V. , cinemas, social networking, bad friends and a plethora of them.

4. She is said to be the goddess of speech. All learning is futile unless you have proper communication skills.

On looking at the picture of Goddess Saraswathi, or simply contemplating on her these four important thing should come to our mind. Hence, this is the strongest pictorial representation of dos and don`ts of a true knowledge seeker.

(This article was originally written for my English blog)


© Dantuluri Kishore Varma
Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!