Pages

Showing posts with label అడుగడుగునా గుడి ఉంది. Show all posts
Showing posts with label అడుగడుగునా గుడి ఉంది. Show all posts

Thursday, 16 November 2017

భీమేశ్వరాలయం స్టాంప్

ద్రాక్షారామం -

1. పంచారామాలలో ఒకటి
2. త్రిలింగాలలో ఒకటి (శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం)
3. నూట ఎనిమిది అతిగొప్ప శైవక్షేత్రాలలో ఒకటి
4. దక్షిణకాశీ
5. అంతే కాకుండా ఆదిశంకరాచార్యులవారిచే ప్రతిష్టించబడిన మాణిక్యాంబ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో(18) ఒకటి అని చెపుతారు. 

ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కనుకే ఈ క్షేత్రాన్ని గొప్పగా ప్రస్తుతించడం జరిగింది.

ఈ సంవత్సరం నవంబర్ ఒకటవ తారీఖున భారత తపాలా శాఖ ద్రాక్షారామంలో ఆలయంయొక్క కమెమొరేటివ్ స్టాంప్‌ని విడుదల చేసింది. అందుగురించే ఈ టపా. 
ఆలయ విశేషాల గురించి ఇదివరలో వేసిన మరో రెండు టపాలను ఇక్కడ చదవవచ్చు.   

© Dantuluri Kishore Varma

Saturday, 1 August 2015

అందర్నీ చల్లగా చూడు తల్లీ!


పెద్దాపురం మరిడమ్మ తల్లి ఆ ఊరి గ్రామదేవత. ప్రతీ సంవత్సరం జ్యేష్ట బహుళ అమావాస్య నుంచి ఆషాడమాసం చివరి వరకూ పెద్దాపురంలో మరిడమ్మ సంబరం చాలా కోలాహలంగా జరుగుతుంది. ప్రతీరోజూ తీర్థం ఉంటుంది. వీధి సంబరాలు, గరగ నృత్యాలు, డప్పుల దరువులు, అమ్మవారి ఊరేగింపులు, జానపద కళారూపాల ప్రదర్శనలతో ఊరంతా మారుమ్రోగిపోతుంది. ఇక గురువారాలు, ఆదివారాలు అయితే జనసముద్రమే వీధుల్లో కదులుతున్నట్టు ఉంటుంది. జనాలు ఎక్కడెక్కడినుంచో ముందురోజు రాత్రే వచ్చేస్తారు. జాగరాలు చేసి, సంబరాలు చూసి మరిడమ్మ తల్లి గుడిముందు దర్శనం క్యూలో నుంచుండిపోతారు. తీర్థంలో కొట్లు, హోటళ్ళు ఇరవైనాలుగు గంటలూ తెరిచే ఉంచుతారు.  
`మీరు చెప్పేది బాగానే ఉంది. కానీ, ఫోటోల్లో ఎక్కడా ఆ సందడే కనిపించడం లేదేమిటి?` అనే కదా మీ సందేహం? నేను గుడికి వెళ్ళింది బుధవారం రోజు. గుడికి చేరుకొనేసరికి మధ్యాహ్నం ఐపోయింది. ముప్పైరూపాయల ప్రత్యేకదర్శనం టిక్కెట్టు తీసుకొని సరాసరి అమ్మవారి పాదాలను తాకి నమస్కారం చేసుకొని, బైటకు వస్తూ అక్కడే ఉన్న ఆలయ ధర్మకర్త(అనుకొంటా) అనుమతితో అమ్మవారి ఫోటో తీసాను. `ఈ గుడి ఎప్పుడు కట్టారు?` అని అడిగితే ఆయన తనకు ఖచ్చితమైన సంవత్సరం తెలియదని, గుడి కట్టినతరువాత తనది తొమ్మిదో తరం అని అన్నారు. 1949లోనే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోనికి వెళ్ళిందని చెప్పారు. 
`జనం తక్కువగా ఉండడానికి కారణం ఏమిటి?` అని అంగళ్ళ దగ్గర ఆరాతీస్తే.. ఈ ఏడాది అధిక ఆషాడమాసం. ఏ ఆషాడంలో సంబరాలు చేస్తారో తెలియక ముందరి నెలలోనే చాలా మంది వచ్చేశారట. పైపెచ్చు మొన్నే పుష్కరాలు అయ్యాయేమో పనిలోపని జనాలు మరిడమ్మతల్లి దర్శనాలు కూడా కానిచ్చేసేరట. ఇప్పుడు నిజ ఆషాడమాసం వచ్చినా సందడి తగ్గిందని తీర్థంలో పుస్తకాల కొట్టు యజమాని `గొల్లు` మన్నాడు.      
కలర్ సోడాలు, ఖర్జూరాలు, జీళ్ళు.. కొనేవాళ్ళ కోసం ఎదురుచూస్తున్నాయి. 
`రేపు గురువారం కదా, జనాలు కుమ్మేత్తారండి,`  అంటున్నాడు సామాన్లకొట్టులో వ్యక్తి. 

ఈ ఆలయం కాకినాడనుంచి పెద్దాపురం మీదుగా రాజమండ్రీ వెళ్ళే దారిలో.. రహదారి ప్రక్కనే ఉంటుంది. రోడ్డుకి ఒకవైపు గుడి ఉంటే, అవతలివైపు మానోజీ చెరువు ఉంటుంది. ఎప్పుడైనా ఈ దారిలో వెళుతుంటే `అందర్నీ చల్లగా చూడు తల్లీ!` అని మరిడమ్మకి ఒక నమస్కారం చేసుకోవడం మరచిపోకండేం! 

© Dantuluri Kishore Varma

Wednesday, 14 January 2015

భోగి వినాయకుడు

`జంక్షన్‌లో భోగిమంట వేస్తున్నాం, చందా ఇవ్వండి,` అని వచ్చారు నలుగురు మనుష్యులు నిన్న సాయంత్రం. వీధి మొదటిలో ప్రతీసంవత్సరం భోగినాడు చిన్న మంట వేస్తారు వాళ్ళు. వాళ్ళు అంటే రిక్షావాళ్ళు, సైకిల్ మెకానిక్, ఇంకా ఆ కూడలిలో ఉన్న కొంతమంది చిన్నచిన్న షాపులవాళ్ళు. `చందాల డబ్బులు తీసుకెళ్ళి ఒక్కో పెగ్గేస్తారు. రేపు ఒక దుంగముక్కా, మునిసిపాలిటీ చెత్తా పోగేసి మండిస్తారు. డ్రెయిన్‌లోనుంచి తీసిన మురికి ప్రక్కనే ఉంటుంది. కనీసం శుభ్రంకూడా చెయ్యరు, ముగ్గు అసలే వెయ్యరు. దానికి మనం భక్తితో దణ్ణం పెట్టుకోవాలి,` అని విసుక్కొన్నాడు మా ఎదురింటాయన. చిన్నప్పుడు పల్లెటూరి ఇళ్ళల్లో పెరళ్ళు ఆవుపేడతో అలికించి, చక్కగా రంగులతో ముగ్గులు పెట్టి, అడవిపొలంనుంచి ప్రత్యేకంగా రప్పించిన ఎండు మానుల్ని నిలబెట్టించి, మంచు కురుస్తున్నప్పుడు తెల్లవారుజామున మంటపెడితే... ఇంటిలో ఒక్కొక్కళ్ళు స్నానంచేసి, కొత్తబట్టలు కట్టుకొని, మనిషంత పొడవు ఉన్న భోగిపిడకల దండలు మంటలో వేసి చలికాగుతూ సూర్యకిరణాలు చుర్రుమనిపించే వరకూ మంట చుట్టూ కూర్చున్నప్పటి నులివెచ్చని జ్ఞాపకాలు, జ్ఞాపకాలుగానే ఉండిపోయాయి. పండుగ సంబరాలకోసమో, పెగ్గుల కోసమో ఎవరో వేసిన మునిసిపాలిటీ మంట భోగిమంటగా ప్రతీ వీధి మొదటిలోనూ చెలామణీ అయిపోతుంది ఇప్పుడు.
భోగిగణపతి
ఉదయం తీసిన ఈ ఫోటోలో కూడా వినాయకుడు కనిపిస్తున్నాడు చూడండి.
కానీ, ప్రతీచోటా అలానే ఉంటుందని చెప్పలేం. ఈ రోజు ఉదయం నూకాలమ్మ గుడిదగ్గర మెయిన్‌రోడ్డుకి సమాంతరంగా చిన్న వీధిలో ఉన్న భోగిగణపతి ఆలయానికి వెళ్ళాం. గుడి ఉన్న ప్రాంతాన్ని సుర్యారావు పేట అంటారు. వీధి పేరు దూసర్లపూడి వారి వీధి. అన్నట్టు భోగి గణపతి పేరు ఎప్పుడైనా విన్నారా? 2008వ సంవత్సరంలో రావిమాను దుంగతో వేసిన భోగియజ్ఞం నుంచి వక్రతుండ మహాఖాయంతో, పాదాల చెంత మూషికంతో విఘ్ననాయకుని దారు విగ్రహం ఆవిర్భవించిందట. గుడిని కట్టి ఆరాధిస్తున్నారు. సంక్రాంతి రోజుల్లో సందడిసందడిగా ఉంటుంది ఇక్కడ. ఇంతకీ, ఉదయం ఈ గుడికి వెళ్ళాం అని చెప్పాను కదా? అప్పుడు సమీపంలో గుడి నిర్వాహకులో, వీధిలో వాళ్ళో వేసిన భోగి మంట బాగుంది. ఆ ప్రాంతాన్ని శుబ్రం చేసి, సంక్రాంతి శుభాకాంక్షలు అన్ని వైపులా వ్రాసీ, చక్కగా వేశారు.   ఇదిగో సరిగ్గా ఇక్కడ మంటలో నాలుగు భోగిపిడకలు వేసి, ఓ పిసరు కచ్చిక బూడిదని చెవితమ్మి వెనుక రాసుకోవడంతోనే పండుగ ఫీలింగ్ మొదలైంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.  

© Dantuluri Kishore Varma

Friday, 31 October 2014

దక్షయజ్ఞం - కుడ్యచిత్రాలు

మురమళ్ళలో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి దేవాలయం(ఈ లింక్ క్లిక్ చేసి టపా చదవండి) లో కుడ్యచిత్రాలు
శివపార్వతుల పరిణయం
దక్షయజ్ఞం
అవమానభారంతో సతీదేవి ఆత్మాహుతి
వీరభద్ర సంభవం
దక్షసంహారం
వీరభద్రుడిని శాంతింపచేసే ఉపాయానికి దేవతలు పరాశక్తిని ప్రార్థించడం
భద్రకాళీ వీరభద్రుల వివాహం
© Dantuluri Kishore Varma

మురమళ్ళలో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి దేవాలయం

తూర్పుగోదావరి జిల్లా మురమళ్ళలో ప్రముఖమైన భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి దేవాలయం ఉంది. 


వీరేశ్వరస్వామి, భద్రకాళి ఎవరో తెలుసుకోవాలంటే దక్షయజ్ఞం గురించి తెలుసుకోవాలి. `మనకాకినాడలో..` బ్లాగులో ఇదివరలో పాదగయ టపాలోనూ, ద్రాక్షారామం టపాలోనూ దక్షయజ్ఞం గురించి ప్రస్తావించడం జరిగింది. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి పరమేశ్వరుడిని పరిణయమాడింది. తరువాత కొంతకాలానికి దక్షుడు యజ్ఞం చెయ్యతలపెట్టాడు. అందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి - కూతురికీ, అల్లుడికీ తప్ప. అయినప్పటికీ సతీదేవి వెళ్ళింది. పిలువని పేరంటం కనుక తండ్రిగారి ఇంట ఆమెకి అవమానం జరిగింది. అగ్నిని సృష్టించుకొని, దానిలోనికి ప్రవేశించి ఆత్మాహుతి చేసుకొంది. శివుడు మహోగ్రుడయ్యాడు. తన జటాజూటంనుంచి వీరభద్రుడిని సృష్టించాడు. వీరభద్రుడు దక్షుడిని సమ్హరించాడు. కానీ యజ్ఞభంగం మంచిది కాదు.  అందువలన దేవతల కోరికమీద దక్షుని మొండానికి మేకతలను తగిలించి యజ్ఞ పరిసమాప్తి చేయిస్తాడు. మహోగ్రానికి నిలువెత్తురూపమైన వీరభద్రుడి కోపం అప్పటికీ తగ్గలేదు.  దక్షయజ్ఞ కథకు సంబందించిన సన్నివేశ చిత్రాలు ఈ దేవాలయంలో ముఖమండప గోడలమీద అందంగా చిత్రీకరించారు. వాటిని తరువాతి టపాలో ఇస్తాను. 

వీరభద్రుడిని శాంతింప చెయ్యవలసిన అవసరం ఉంది. అందుకోసం ఆదిపరాశక్తి తన పదహారుకళలలో ఒకకళని భద్రకాళిగా పంపుతుంది. ఆమెను చూసి వీరభద్రుడు కొంత శాంతిస్తాడు. ఇప్పటి మురమళ్ళ అప్పటిలో మునిమండలం అనే పేరుతో ఉండేది. ఇది ఒక మునివాటిక - వృద్దగౌతమీ నదీతీరం, ప్రశాంతమైన ప్రదేశం. అదిగో సరిగ్గా ఆ ప్రదేశంలోనే భద్రకాళి వ్యక్తమయ్యింది. మునుల సమక్షంలో వీరభద్రుడు, భద్రకాళీల వివాహం గాంధర్వ శైలిలో జరిగింది. వీరభద్రుడు పూర్తిగా శాంతించాడు.  ఇది ఈ దేవాలయం యొక్క స్థలపురాణం.

 ఇక దేవాలయం యొక్క ప్రత్యేకత విషయానికి వస్తే స్వామివారికి, అమ్మవారికి ప్రతిరోజూ కళ్యాణం జరిపిస్తారు. పల్లకీలో లేదా నందివాహనం మీద గ్రామోత్సవం నిర్వహిస్తారు. మేళతాళాలతో, యక్షగానాలతో, వేదమంత్రాల నడుమ మండపంలో కళ్యాణం జరిపిస్తారు. తల్లితండ్రులు పెళ్ళికాని యుక్తవయసు పిల్లల పేరుమీద కళ్యాణం జరిపిస్తే తొందరగా వివాహం జరుగుతుందని నమ్ముతారు. వైశాఖ శుద్ధ పంచమినాడు వీరేశ్వరస్వామి, భద్రకాళీఅమ్మవార్ల వివాహం జరిగిందట. కాబట్టి ప్రతీసంవత్సరం ఈ సమయానికి ఐదురోజులపాటు - వైశాఖ శుద్ధ చవితినుంచి అష్టమి వరకు -  బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 
ఈ దేవాలయానికి వెనుక లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. శివకేశవులని ఒకేసారి దర్శించుకోవచ్చు.
కాకినాడనుంచి యానం మీదుగా అమలాపురం వెళుతుంటే కాకినాడకు 38 కిలోమీటర్ల దూరంలో మురమళ్ళ గ్రామం ఉంది. అమలాపురం నుంచి అయితే ముమ్మిడివరం మీదుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాజమండ్రీ నుంచి సుమారు వందకిలోమీటర్లు ఉంటుంది. కాకినాడ, అమలాపురం, రాజమండ్రీల నుంచి మురమళ్ళకు ఆర్టీసీ బస్సుసౌకర్యం ఉంది. అన్నో బస్సులు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి.    

© Dantuluri Kishore Varma 

Friday, 26 September 2014

తెలుసా?

1. పర్వతరాజు మేరువుకి ఇద్దరు కుమారులు. ఇద్దరూ బంగారు`కొండలే`. పెద్దవాడు బద్రగిరి రాముడిని మెప్పించి తనమీదే నివాసం ఏర్పరచుకొనేలా చేశాడు. మీకు తెలుసు కదా, ఈ బద్రగిరి బద్రాచలంలోనిదని? ఇక మేరువుయొక్క రెండవ కొడుకు రత్నగిరి తనమీదకూడా ఒకదేవుడిని నిలుపుకొన్నడు - ఆ దేవుడు ఎవరో తెలుసా?

Image : From the Internet
2. గయాసురుడనే రాక్షసుడు విష్ణువు గురించి తపస్సు చేసి పవిత్రమైన దేహాన్ని పొందుతాడు. తరువాత కొన్ని సంఘటనల నేపద్యంలో త్రిమూర్తులు గయాసురుడి దేహాన్ని యజ్ఞపీఠంగా కావాలని కోరతారు. అప్పుడు గయాసురుడు తన శరీరాన్ని బీహార్లో గయ దగ్గర నుంచి ఒరిస్సా మీదుగా కాకినాడకు సమీపంవరకూ పెంచుతాడు. మనకు సమీపంలో ఉన్న ఆ ప్రాంతం ఏమిటో మీకు తెలుసా?

3. ఈ గుడిలో ప్రతీ సంవత్సరం చైత్ర, వైశాఖమాసాల్లో సూర్యకిరణాలు ఉదయం పూట భీమేశ్వరస్వామి పాదాలను, సాయంత్రంపూట బాలా త్రిపుర సుందరి అమ్మవారి పాదాలను తాకుతాయి. అది ఏ గుడో తెలుసా?

4. భీమేశాత్ ఉత్తమం దైవం న మహీతలే! అంటే భీమేశ్వరుని కంటే ఉత్తమమైన దైవం ఈ భూమిమీద లేదు అని. స్కాందపురాణంలోని గోదావరి ఖండంలో వ్యాసమహర్షి స్వయంగా చెప్పిన మాట ఇది. ఇంతకీ ఈ భీమేశ్వరుడు ఏ ఊరిలో ఉన్నట్టూ? 

5. రామాయణంలో అహల్య కథ తెలుసు కదా? ఇంద్రుడు చేసిన పనికి అహల్యని, ఇంద్రుడిని గౌతముడు శపిస్తాడు. అలాగే తారా చంద్రుల కథలో బృహస్పతి చందృడిని చాయను కోల్పోవలసిందని శపిస్తాడు. శాప విమోచనం కోసం ఇంద్రుడూ, చంద్రుడూ చెరొక శివలింగాన్నీ ఈ ఊరిలో ప్రతిష్టించారట. అది ఏ ఊరో తెలుసా? 

6. నారదకుండం అని పిలువబడే కొలను ఒకటి కాకినాడకి దగ్గరలో ఉంది. పురాణాల ప్రకారం నారదుడికి సంబంధించిన కథ ఒకటి ఆ కొలనుతో ముడిపడి ఉంది. దాని గురించి మీకు తెలుసా? 

ఓ సరదా క్విజ్. మీకు సమాదానాలు తెలిసే ఉంటాయి. తెలిస్తే కామెంటండి. లేకపోతే ప్రశ్నలకు చివర ఉన్న లింక్‌లు పట్టుకొని ఆయా టపాల్లోకి వెళ్ళి వివరాలు తెలుసుకోండి. 


© Dantuluri Kishore Varma

Wednesday, 27 August 2014

కనకదుర్గ గుడి జమ్మిచెట్టు సెంటర్

కాకినాడ నుంచి యానం వెళ్ళేదారిలో మునసబుగారి జంక్షన్ దాటిన తరువాత నూకలమ్మ గుడి ఆ తరువాత జమ్మిచెట్టు సెంటరు ఉంటాయి. కనకదుర్గ గుడిని జమ్మిచెట్టు దగ్గరే కట్టారు. ప్రతీ శుక్రవారం ఈ అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొనేవాళ్ళు వందలకొద్దీ ఉంటారు. ఇక దసరా వచ్చిందంటే సందడే సందడి. పందిళ్ళు వేసి, లైటింగు ఏర్పాటు చేసి, మైకులో పాటలతో అదరగొడతారు. నవరాత్రుల్లో ప్రతీసాయంత్రం ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. గుడి వెనుక ముసిపల్ పార్కు, వాటర్‌ట్యాంకు వున్నాయి. వంద సంవత్సరాలకు పూర్వం ప్రారంభించిన మల్లాడి సత్యలింగ నాయకర్  చారిటీస్‌కి వెళ్ళాలన్నా, ఆంధ్రా పాలిటెక్నిక్‌కి వెళ్ళాలన్నా జమ్మిచెట్టు సెంటరు మీదుగానే వెళ్ళాలి. తెలుగు సినిమాల్లో అగ్రశ్రేణి హాస్యనటుల్లో ఒకరైన రేలంగి స్వస్థలం కాకినాడ అనే సంగతి తెలిసిందే కదా? ఆయన ఇల్లు ఈ సమీపంలోనే ఉండేదట.  జగన్నాథపురంలో నివశించిన చాలామందికి జమ్మిచెట్టు సెంటరూ, కనకదుర్గ గుడితో చాలా పరిచయం, జ్ఞాపకాలు ఉంటాయి. వారందరికోసం ఈ ఫోటో.
© Dantuluri Kishore Varma

Saturday, 28 June 2014

చిల్లంగి

తొలి తిరుపతి అని పిలిచే వేంకటేశ్వరస్వామి గుడికి ఎలా వెళ్ళాలో దారి తెలియదు. `పలానా కిర్లంపూడి దాటిన తరువాత దివిలికి దగ్గరగా ఉంటుంది. చాలా పురాతనమైన గుడి. ఎవరిని అడిగినా దారి చూపిస్తారు,` అని చెప్పారు ఎవరో.  కిర్లంపూడి ఊరు తగిలిన దగ్గరనుంచి అక్కడక్కడా జనాలని `వెంకన్నబాబు గుడికి దారెటు?` అని అడుగుతూ, వాళ్ళు చూపించిన వైపుకి పోయాం. కొంతసేపటికి రంగులు వెయ్యని పాతగా కనిపిస్తున్న ఓ గుడిని చేరుకొన్నాం. నిజానికి అది మేం వెతుకుతున్న తొలితిరుపతి కాదని తెలియదు. తూర్పుగోదావరిజిల్లా కిర్లంపూడి మండలంలో చిల్లంగి అనే ఊరు.  దేవాలయం ప్రశాంతంగా ఉంది. గుడిమీద బొమ్మలు కళాత్మకంగా, నాజూకుగా ఉన్నాయి. గుడిప్రక్కనే ఉన్న ఇంటిలోనుంచి పూజారిగారు వచ్చి, గర్భగుడి తలుపులు తీశారు. మంచి దర్శనం అయ్యింది. ఇక్కడి నుంచి వివరం తెలుసుకొని తొలి తిరుపతికి కూడా వెళ్ళామనుకోండి(ఆ పోస్టు ఇదిగో ఇక్కడ చదవండి). 

చిల్లంగి గుడి ఫోటోలు చూడండి.




© Dantuluri Kishore Varma 

Sunday, 18 May 2014

యండమూరులో మీసాల వెంకన్న

కాకినాడనుంచి గొల్లపాలెం మీదుగా కోటిపల్లి వెళ్ళే మార్గంలో యండమూరు జంక్షన్ తగులుతుంది. జంక్షన్ నుంచి  ఊరు లోనికి ఉంటుంది. కరప మండలంలోని చిన్న గ్రామం ఇది. ఈ వూరిలో శ్రీసామ్రాజ్యలక్ష్మీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయం ఉంది. చాలా పురాతనమైనదని చెపుతారు. ప్రస్తుతం ఉన్న గుడి కొత్తగా పునర్నిర్మించిందే కానీ, మొట్టమొదట శ్రీరామచంద్రమూర్తి కాలంలో నిర్మించి ఉంటారని చెపుతారు. దానికి కారణం ఏమిటంటే ఈ దేవాలయపు పునర్నిర్మాణ సమయంలో ములవిరాట్టు క్రింద శ్రీరాముని ముద్రలతో ఉన్న నాణాలు లభించాయట. యండమూరులో ఉన్న వేంకటేశ్వరుణ్ణి మీసాల వెంకన్న అనికూడా పిలుస్తారు. కోరిన కోరికలు నెరవేరుస్తాడని ప్రసిద్ది. ఈ ఫోటోలు మీకోసం. దర్శనం చేసుకొని ధన్యులు కండి.  



© Dantuluri Kishore Varma 

Wednesday, 12 March 2014

కోలంక శివాలయం - అష్టసోమేశ్వరాలయాలలో ఇది ఒకటి

తారా, చంద్రుల కథ విన్నారా ఎప్పుడైనా? చంద్రుడు మహా అందగాడు. విద్యను నేర్చుకోదలచి బృహస్పతి దగ్గర చేరాడు. బృహస్పతి భార్య తార. ఆమె యవ్వనవతి. తారా, చంద్రుల మధ్య అభిలషణీయం కాని బంధం ఏర్పడింది. చేసిన తప్పుకి చంద్రుడిని తన కళలు అన్నీ కోల్పోవలసిందిగా గురువుగారు శపించాడు. ప్రతీ శాపానికీ విమోచన మార్గం ఉన్నట్టుగానే దీనికీ ఉంది. దాని ప్రకారం దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామానికి ఎనిమిది దిక్కులా శివలింగాలను ప్రతిష్టించాడు చంద్రుడు. చంద్రుడిని సోముడు అని పిలుస్తారని మీకు తెలుసుకదా? అందుకే అతను ప్రతిష్టించిన శివాలయాలను అష్టసోమేశ్వరాలయాలు అంటారు. అవి ఏఏ ఊళ్ళల్లో ఉన్నాయో ద్రాక్షారామం ఆలయంలో గోడమీద రాసి ఉంచారు. 

ఈ టపాలో కోలంక శివాలయం ఫోటోలు ఇస్తున్నాను. కేంద్రపాలిత ప్రాంతం యానం నుంచి ద్రాక్షారామం వెళ్ళేదారిలో ఇంజరం దాటిన తరువాత కోలంక అనే ఊరు వస్తుంది. అక్కడే ఉంది పైన చెప్పిన ఎనిమిది వాటిలో ఒక సోమేశ్వరాలయం.


ఇంతకు ముందు ఈ బ్లాగులో రాసిన కొన్ని సోమేశ్వరాలయాల గురించి, ద్రాక్షారామం గురించి ఈ క్రింద చదవండి.

© Dantuluri Kishore Varma 

Saturday, 18 January 2014

ఈ గుడి ద్వాపరయుగం నాటిదా!?

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట నుంచి కిర్లంపూడి వెళ్ళేదారిలో దివిలికి ఒక కిలోమీటరు దూరంలో తొలి తిరుపతి అనే ఊరు ఉంది. సామర్లకోటనుంచి ఇక్కడికి 12 కిలోమీటర్లు. గుడికి బయట ఒక ఫ్లెక్సీ బోర్డ్‌మీద తొమ్మిదివేల సంవత్సరాల పురాతనమైన దేవాలయం ఇది అని రాసి ఉంటుంది. దేవాలయం పురాతనంగానే కనిపిస్తుంది కానీ మరీ అంత పాతది కాదేమో అనే సందేహంకూడా కలుగుతుంది. కొతమంది అభిప్రాయం ప్రకారం కలియుగం మొదలై సుమారు 5000 సంవత్సరాలు అయ్యిందని. అంటే ఈ దేవాలయం ద్వాపరయుగం నాటిదన్నమాట! 



తొలితిరుపతి దేవాలయం యొక్క స్థలపురాణం ప్రకారం ఈ ప్రదేశం ఒకప్పుడు కీకారణ్యంగా ఉండేదని, దృవుడు ఇక్కడ విష్ణుమూర్తికోసం తపస్సుచేశాడని చెపుతారు. ఇక్కడొక చిన్న లింక్ మిస్సయ్యింది. దృవుడు తపస్సుచేసిన మధూవనం యమునా నది సమీపంలో ఉంటుందని పురాణంలో చెప్పబడి ఉంది. కానీ ఇక్కడ యమునా నది లేకపోవడమే మిస్సయిన లింకు. దృవుడికథ విష్ణుపురాణంలోను, బగవత్‌పురాణంలోనూ ఉంటుంది. ఉత్తానపాదుడనే రాజుగారికి సురుచి, సునీతి అనే ఇద్దరు భార్యలు ఉంటారు. ఆయనకి సునీతి ద్వారా దృవుడు, సురుచి ద్వారా ఉత్తముడు అనే కుమారులు కలుగుతారు. రాజుగారికి సురుచి అంటే ప్రేమ మెండు. అమెకీ, ఆమె కుమారుడికీ ముద్దుమురిపాలన్నీ దక్కేవి. ఒకరోజు ఉత్తముడు తండ్రి ఒడిలో కూర్చొని ఉండగా చూసిన దృవుడు తానుకూడా తండ్రి ప్రేమను అదేవిధంగా పొందాలని భావించి ఒడిలోని ఎక్కబోతుండగా అతని సవతి తల్లి సురుచి అతడిని నిందిస్తుంది. బాధపడుతున్న దృవుడిని చూసి తల్లి  సునీతి విష్ణువుని గూర్చి తపస్సు చేసి తండ్రిప్రేమని పొందే వరంకోరుకోమంటుంది. అప్పుడు దృవుడు యమునా నది తీరంలో ఉన్న మధూవనం అనే ప్రదేశానికి వెళ్ళి తపస్సుచేసి విష్ణువుని ప్రసన్నం చేసుకొంటాడు. 
పిల్లవాడైన దృవుడు దేవుడి తేజస్సుచూసి భయపడ్డాడని, అప్పుడు విష్ణువు దృవుడి అంత పొడవుతో కనిపించి, చిరునవ్వుతో అతని చెంపలు నిమిరాడని, ఆకారణంగానే ఇక్కడిస్వామి చిరునవ్వులు చిందిస్తూ శృంగార వల్లభ స్వామిగా పిలవ బడుతున్నాడని, ఎవరుఎంత పొడవు వుంటే అంత పొడవుగానే కనిపిస్తాడని చెపుతారు. శృంగార వల్లభ స్వామి అంటే వేంకటేశ్వరుడే. అన్నిచోట్లా ఆయన కుడిచేతిలో శంఖం, ఎడమచేతిలో చక్రం ఉంటాయి. కానీ, ఈ దేవాలయంలో అవి అది ఇటు, ఇది అటు మారి ఉంటాయి. మరొక ప్రత్యేకత ఇది. స్వామివారి దేవేరులైన శ్రీదేవిని నారదమహర్షి, భూదేవిని శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్టించారట. స్వామివారికి వెండితొడుగు విక్టోరియా మహారాణి భహూకరించినదట. 


దేవాలయానికి వెనుకవైపు ఉన్న నూతిలో నీటిని తలపై జల్లుకొని, స్వామివారిని కోరుకొంటే, ఆయా కోరికలన్నీ నెరవేరుతాయట. శృంగార వల్లభ స్వామికి పటికబెల్లం అంటే ఇష్టంకాబట్టి కోరికలు నెరవేరిన భక్తులు పటికబెల్లాన్ని స్వామివారికి సమర్పిస్తారు. 


ఇంకా ప్రచారంలేక భక్తుల రద్దీ కనిపించడంలేదు. సాయంత్రం మూడున్నర సమయంలో ఆలయానికి వెళితే గర్బగుడి తలుపులు మూసి ఉన్నాయి. పూజారిగారి ఇల్లు గుడికి చేర్చి ఉన్నా, ఒకగంటసేపు ఆయన కోసం నిరీక్షించి నాలుగున్నర ప్రాంతంలో దర్శనం చేసుకొని, విశేషాలు తెలుసుకొని, పటికబెల్లం ప్రసాదం తిని వచ్చాం. గుడితెరిచే సమయానికి ఇంకొక ఇద్దరు ముగ్గురు భక్తులు వచ్చారు అంతే. నిరీక్షించిన గంటా గాలిగోపురాన్నీ, ధ్వజస్థంభపు శిఖరాన్నీ, ఆవరణలో చెట్టుకొమ్మలపైనుంచి పరుగులు పెడుతున్న ఉడుతలనీ, ఎగిరే పక్షులనీ చూస్తూ సమయం గడిపేశాం.   
  
© Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!