Pages

Friday 31 October 2014

దక్షయజ్ఞం - కుడ్యచిత్రాలు

మురమళ్ళలో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి దేవాలయం(ఈ లింక్ క్లిక్ చేసి టపా చదవండి) లో కుడ్యచిత్రాలు
శివపార్వతుల పరిణయం
దక్షయజ్ఞం
అవమానభారంతో సతీదేవి ఆత్మాహుతి
వీరభద్ర సంభవం
దక్షసంహారం
వీరభద్రుడిని శాంతింపచేసే ఉపాయానికి దేవతలు పరాశక్తిని ప్రార్థించడం
భద్రకాళీ వీరభద్రుల వివాహం
© Dantuluri Kishore Varma

మురమళ్ళలో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి దేవాలయం

తూర్పుగోదావరి జిల్లా మురమళ్ళలో ప్రముఖమైన భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి దేవాలయం ఉంది. 


వీరేశ్వరస్వామి, భద్రకాళి ఎవరో తెలుసుకోవాలంటే దక్షయజ్ఞం గురించి తెలుసుకోవాలి. `మనకాకినాడలో..` బ్లాగులో ఇదివరలో పాదగయ టపాలోనూ, ద్రాక్షారామం టపాలోనూ దక్షయజ్ఞం గురించి ప్రస్తావించడం జరిగింది. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి పరమేశ్వరుడిని పరిణయమాడింది. తరువాత కొంతకాలానికి దక్షుడు యజ్ఞం చెయ్యతలపెట్టాడు. అందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి - కూతురికీ, అల్లుడికీ తప్ప. అయినప్పటికీ సతీదేవి వెళ్ళింది. పిలువని పేరంటం కనుక తండ్రిగారి ఇంట ఆమెకి అవమానం జరిగింది. అగ్నిని సృష్టించుకొని, దానిలోనికి ప్రవేశించి ఆత్మాహుతి చేసుకొంది. శివుడు మహోగ్రుడయ్యాడు. తన జటాజూటంనుంచి వీరభద్రుడిని సృష్టించాడు. వీరభద్రుడు దక్షుడిని సమ్హరించాడు. కానీ యజ్ఞభంగం మంచిది కాదు.  అందువలన దేవతల కోరికమీద దక్షుని మొండానికి మేకతలను తగిలించి యజ్ఞ పరిసమాప్తి చేయిస్తాడు. మహోగ్రానికి నిలువెత్తురూపమైన వీరభద్రుడి కోపం అప్పటికీ తగ్గలేదు.  దక్షయజ్ఞ కథకు సంబందించిన సన్నివేశ చిత్రాలు ఈ దేవాలయంలో ముఖమండప గోడలమీద అందంగా చిత్రీకరించారు. వాటిని తరువాతి టపాలో ఇస్తాను. 

వీరభద్రుడిని శాంతింప చెయ్యవలసిన అవసరం ఉంది. అందుకోసం ఆదిపరాశక్తి తన పదహారుకళలలో ఒకకళని భద్రకాళిగా పంపుతుంది. ఆమెను చూసి వీరభద్రుడు కొంత శాంతిస్తాడు. ఇప్పటి మురమళ్ళ అప్పటిలో మునిమండలం అనే పేరుతో ఉండేది. ఇది ఒక మునివాటిక - వృద్దగౌతమీ నదీతీరం, ప్రశాంతమైన ప్రదేశం. అదిగో సరిగ్గా ఆ ప్రదేశంలోనే భద్రకాళి వ్యక్తమయ్యింది. మునుల సమక్షంలో వీరభద్రుడు, భద్రకాళీల వివాహం గాంధర్వ శైలిలో జరిగింది. వీరభద్రుడు పూర్తిగా శాంతించాడు.  ఇది ఈ దేవాలయం యొక్క స్థలపురాణం.

 ఇక దేవాలయం యొక్క ప్రత్యేకత విషయానికి వస్తే స్వామివారికి, అమ్మవారికి ప్రతిరోజూ కళ్యాణం జరిపిస్తారు. పల్లకీలో లేదా నందివాహనం మీద గ్రామోత్సవం నిర్వహిస్తారు. మేళతాళాలతో, యక్షగానాలతో, వేదమంత్రాల నడుమ మండపంలో కళ్యాణం జరిపిస్తారు. తల్లితండ్రులు పెళ్ళికాని యుక్తవయసు పిల్లల పేరుమీద కళ్యాణం జరిపిస్తే తొందరగా వివాహం జరుగుతుందని నమ్ముతారు. వైశాఖ శుద్ధ పంచమినాడు వీరేశ్వరస్వామి, భద్రకాళీఅమ్మవార్ల వివాహం జరిగిందట. కాబట్టి ప్రతీసంవత్సరం ఈ సమయానికి ఐదురోజులపాటు - వైశాఖ శుద్ధ చవితినుంచి అష్టమి వరకు -  బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 
ఈ దేవాలయానికి వెనుక లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. శివకేశవులని ఒకేసారి దర్శించుకోవచ్చు.
కాకినాడనుంచి యానం మీదుగా అమలాపురం వెళుతుంటే కాకినాడకు 38 కిలోమీటర్ల దూరంలో మురమళ్ళ గ్రామం ఉంది. అమలాపురం నుంచి అయితే ముమ్మిడివరం మీదుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాజమండ్రీ నుంచి సుమారు వందకిలోమీటర్లు ఉంటుంది. కాకినాడ, అమలాపురం, రాజమండ్రీల నుంచి మురమళ్ళకు ఆర్టీసీ బస్సుసౌకర్యం ఉంది. అన్నో బస్సులు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి.    

© Dantuluri Kishore Varma 

Saturday 25 October 2014

ఇటువంటి బడి..

వీరేంద్ర హెగ్గడే అనే ఆయన గురించి తెలుసుకొంటే ఆనందం వేస్తుంది. కర్నాటకలోని ధర్మశాలలో ఉన్న పురాతనమైన మంజునాథుని దేవాలయం గురించి చాలామంది వినే ఉంటారు. ఆ దేవాలయానికి వంశపారంపర్య ధర్మకర్త ఈయన. కేవలం దేవాలయానికి సంబంధించే కాకుండా సామాజిక సేవకు సంబంధించిన విషయాలలో వీరేంద్ర హెగ్గడే చూపించిన మార్గం ఎంతో విలక్షణంగా ఉంటుంది. 

ప్రస్తుత కాలంలో చదువు అంటే ఏమిటని ఎవరినైనా అడిగితే - పాఠాలని గుర్తుపెట్టుకోవడం, పరీక్షల్లో వేలో లక్షలో సంఖ్యలో ఉండే పోటీదారులతో తలపడి ర్యాంకులు సంపాదించడం, తరువాతి తరగతికి వెళ్ళడం.. అని సమాధానం చెపుతారు. ఇంగ్లీష్‌లో కౌచ్‌పొటేటో అనే పదం ఉంది. బడికి వెళ్ళివచ్చిన తరువాత కాళీ సమయం అంతా సోఫాలో కూర్చొని ఏ చిప్సో తింటూ టీవీ చూడడమో, కంప్యూటర్ గేంలు ఆడుకోవడమో చేసేవాళ్ళని కౌచ్‌పొటేటోలని పిలుస్తారు. ప్రస్తుతం చాలామంది పిల్లల్ని చూస్తుంటే కౌచ్‌పొటేటోల్లాగే అనిపిస్తున్నారు. శారీరకశ్రమ చెయ్యలేరు. ఇంటిలో తమ్ముడో, చెల్లెలో కూడా ఉండని పరిస్థితి కనుక మరొకరి పొడగిట్టడంలేదు. ఖర్మకాలి చదువుకొన్న చదువుకి తగిన ఉద్యోగం రాకపోతే వీళ్ళు ఎందుకూ కొరగాని వాళ్ళలా తయారయ్యే ప్రమాదం ఉంది.    

కానీ దక్షిన కర్నాటకలో వుజైర్ అనే ఊళ్ళో హెగ్గడే స్థాపించిన రత్నమానస అనే పాఠశాలలో చరిత్ర, విజ్ఞానశాస్త్రం, గణితం, రెండో మూడో భాషలతో పాటు జీవితానికి ఉపయోగపడే ఎన్నో నైపుణ్యాలని నేర్పుతారు. ఇక్కడి విద్యయొక్క ప్రత్యేకత ఏమిటంటే విద్యార్థులే తాముండే హాస్టల్‌ను నిర్వహించుకోవాలి. పంటలు పండించుకోవాలి, పశువుల దగ్గర పాలు పిండుకోవాలి, వ్యవసాయ ఉత్పత్తుల్నీ పాలనీ అమ్ముకోవాలి, వచ్చిన సొమ్ముని సహకారసంస్థల్లో, బ్యాంకుల్లో మదుపుచెయ్యాలి, వండుకోవాలి... ఇంకా హాస్టల్లో చెయ్యవలసిన అన్నిపనులనీ విద్యార్థులే స్వయంగా చెయ్యాలి. ఒకపూట చదువు, మరొకపూట ఈ పనులు. మన పనుల్ని ఇతరులమీద ఆధారపడకుండా మనమే చేసుకోవడం, పండించుకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం, డబ్బుని నిర్వహించుకోవడం, అవసరం అయినచోట మిగిలిన వారి సహకారం తీసుకోవడం... ఇదే జీవితాన్ని విజయవంతంగా జీవించడానికి కావలసిని నిజమైన చదువు! అలాంటి చదువునే నేర్పిస్తుండడంతో ఇక్కడి విద్యార్థులు విజయాలబాటన నడుస్తున్నారట! 
రత్నమానసలో చేరడానికి రాష్ట్రం నలుమూలలనుంచీ ఎంతో మంది పోటీపడతారు. అయితే ఇక్కడ ప్రవేశ పరిక్షకూడా వినూత్నంగా ఉంటుంది. ప్రవేశం కోరుకొనే విద్యార్థుల్ని హాస్టల్లో మూడురోజులు ఉంచుకొని వాళ్ళ దృక్పదాలని గమనించిన తరువాత ఎంపిక చేస్తారుట. ఎంపికకి తమపనుల్ని చేసుకోగలగడం, మిగిలినవారితో వ్యవహరించడం అనే విషయాలు ముఖ్యమైనవి. అప్పటికే హాస్టల్‌లో ఉండి చదువుకొంటున్న పైతరగతి విద్యార్థుల్లో ఒక్కొక్కరికి కొత్తగా చేరిన వాళ్ళల్లో ఒక్కొక్కరిని అప్పగిస్తారట. అప్పటినుంచి వాళ్ళూ సొంత తమ్ముడికి నేర్పించినట్టు పనులన్నీ నేర్పించాలి.  

రోజువారీ కార్యక్రమాలతో పాటూ ప్రతీవిద్యార్థీ రోజుకొక మంచి విలువలతో కూడిన కథనో,  ఓ మహానీయుడి జీవితచరిత్రనో చదివి తనకు అర్థమైనంత మటుకు దానిగురించి రాయాలి. దీనివల్ల వాళ్ళందరూ ఎంతో స్పూర్తిని పొందుతారు. సాయంత్రం సమయాల్లో ఆటలాడతారు. స్టడీ ట్రిప్పుల్లో భాగంగా పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి, పరిశ్రమలకి, బ్యాంకులకి వెళతారు. అక్కడ జరిగే పనులని గమనిస్తారు. 

రత్నమానసల్లాంటి పాఠశాలలు మనకి కూడా ఉంటే బాగుండుననిపిస్తుంది కదూ? అటువంటివి వచ్చేవరకూ మామూలు బడుల్లో చదువుకొంటున్న పిల్లల్ని ఇంటిదగ్గర తల్లితండ్రులైనా కౌచ్‌పొటేటోల్లా మార్చకుండా రోజువారీ పనులూ, లోకజ్ఞానం నేర్పించడం, చక్కని పుస్తకాలు చదివించడం లాంటివి చేయిస్తే బాగుంటుంది కదా? 

కావాలంటే వాళ్ళకి ఈ వీడియో చూపించండి. ఇది కన్నడ భాషలో ఉన్నప్పటికీ, ఈ టపాలో ఉన్న విషయం చదివి, వీడియో చూస్తే విషయం చక్కగా అర్థమౌతుంది.

© Dantuluri Kishore Varma

Saturday 18 October 2014

బ్లాక్‌బ్యూటీ

అన్నా సూవుల్ (Anna Sewell) 1877లో రాసిన బ్లాక్ బ్యూటీ నవల ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయిన నవలల్లో ఒకటి. ప్రస్తుతం బ్లాక్ బ్యూటీని చిల్డ్రన్స్ క్లాసిక్స్ విభాగంలో చేరుస్తున్నప్పటికీ ఈ నవల రాయబడింది మాత్రం పిల్లలకోసం కాదు. పంతొమ్మిదో శతాబ్ధంలో ప్రయాణాలకి, సరుకుల రవాణాకి గుర్రపుబళ్ళమీద ఎక్కువగా అధారపడే వారు. ఇప్పుడు ధనవంతుల సొంత కార్లలాగ అప్పుడు రకరకాల గుర్రపుబళ్ళు ఉండేవి.  ఎక్కడికైనా వెళుతున్నప్పుడు గుర్రాన్ని బండికి కట్టి తయారు చెయ్యడానికి, బండిని తోలడానికి సేవకులు ఉండేవారు. అలాగే ప్రయాణంనుంచి తిరిగి వచ్చిన తరువాత గుర్రాలకు మాలిష్ చెయ్యడానికి, దానా తయారు చేసి తినిపించడానికి, వాటి సంరక్షణ చూడడానికి కుర్రాళ్ళు ఉండేవారు. వీళ్ళు కాక అద్దె గుర్రబగ్గీల వాళ్ళు, వాళ్ళకి గుర్రాలనీ బగ్గీలనీ సరఫరా చేసేవాళ్ళు, సరుకుల రవాణా చేసే బండి వాళ్ళు... ఇలా సమాజంలో చాలామంది యొక్క ప్రపంచం గుర్రాల చుట్టూ తిరుగుతూ ఉండేది. వీరిలో కొంతమంది తమ గుర్రాలని కుటుంబసభ్యుల్లా ప్రేమగా చూసుకొంటే, చాలామంది స్వలాభంకోసమో, అవివేకంతోనో వాటిని క్రూరంగా హింసించేవాళ్ళు. రచయిత్రే ఎక్కడో వ్యక్తీకరించినట్టు ఈ మూగ జీవాలు నోళ్ళు తెరిచి `మా బాధ ఇదీ,` అని చెప్పనంత మాత్రాన వాటికేమీ బాధలేదని భావించకూడదు. అలా భావిస్తూ ఉండే వ్యక్తుల్లో మార్పు తీసుకురావడానికే అన్నా సూవుల్ ప్రధానంగా ఈ నవలని రచించింది.

అన్నా సూవుల్‌కి పద్నాలుగేళ్ళ వయసున్నప్పుడు స్కూల్ నుంచి తిరిగి వస్తూ జారిపడి కాలు విరగ్గొట్టుకొంటుంది. చేయించిన వైద్యం వికటించి జీవితాంతం అవిటిగానే ఉండిపోతుంది. ఇల్లు కదిలి వెళ్ళాలంటే గుర్రపుబండే శరణ్యం . తనకీ, ప్రపంచానికీ మధ్య వారది గుర్రాలే. అవి లేకపోతే ఆమెకి ప్రపంచం మూసుకొని పోయినట్టే. అందుకే గుర్రాలంటే పిచ్చ ప్రేమ అన్నాకి. వాటి ఋణం బ్లాక్‌బ్యూటి నవల రాయడం ద్వారా తీర్చుకొంది. అది ఎలాగ అంటే.. జంతు ప్రేమికులు బ్లాక్‌బ్యూటి నవలల్ని ఎక్కువ సంఖ్యలో కొని, గుర్రపుశాలల్లో పనిచేసే వాళ్ళకి, అద్దె బళ్ళవాళ్ళకి ఉచితంగా పంచిపెట్టేవారట. గుర్రాలమెడలు ఠీవీగా నిలబడి ఉండడానికి కళ్ళాన్ని గట్టిగా బిగించి కట్టడం అప్పట్లో ఒక ఫ్యాషన్‌గా ఉండేది. దీనిని బేరింగ్ రెయిన్ అంటారు. బండిని లాగేటప్పుడు, ఎత్తులు ఎక్కుతున్నప్పుడు మెడను ముందుకు వంచి బరువు లాగే అవకాశం గుర్రాలకు లేక వాటికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. జింజర్ అనే గుర్రం బ్లాక్ బ్యూటీకి తనకు బేరింగ్ రెయిన్ తగిలించడం వల్ల అనుభవించిన బాధని చెపుతుంది. కథలో తరువాత బ్లాక్‌బ్యూటీకి కూడా ఆ అవస్థ కలుగుతుంది. నవల విడుదలైన తరువాత గుర్రాలకు  బేరింగ్ రెయిన్‌ను కట్టే పద్ధతిని ఇంగ్లాండ్‌లో నిషేదించారట.

ఈ రచయిత్రి తనజీవితకాలంలో రాసింది ఒకే ఒక్క నవల. అదీ తాను మరణానికి దగ్గరలో ఉండగా. వ్యాదిగ్రస్తురాలై మంచంమీద ఉండి బ్లాక్‌బ్యూటీని రాసి, ప్రచురణకు ఇచ్చింది.  పుస్తకం విడుదలైన వెంటనే విజయవంతంగా అమ్ముడుపోయింది. ఆ తరువాత అయిదు నెలలకే అన్నా కన్ను మూసింది.

ఇక కథ విషయానికి వస్తే -

బ్లాక్‌బ్యూటీ అనే గుర్రం చిన్నప్పుడు తల్లి దగ్గర చింతలేకుండా గడిపిన రోజుల దగ్గరనుంచి జీవితపు చివరి అంకం వరకూ తన ఆత్మకథని చెపుతుంది. మధ్యలో ఎందరో యజమానులు. వాళ్ళలో మంచివాళ్ళు, క్రూరులు, తాగుబోతులు, అజ్ఞానులు, స్వార్థపరులు ఉంటారు. వాళ్ళతో తన అనుభవాలనీ, తనతో పాటూ గుర్రపుశాలల్లో ఉండే మిగిలిన గుర్రాల యొక్క వెతల్ని, రోడ్లమీద తాను గమనించిన విషయాలనీ బ్లాక్‌బ్యూటీ తనకోణంలో ఆవిష్కరిస్తుంది. సాంకేతిక పదాలు ఎక్కువగా ఉపయోగించకుండా, సులభమైన పద్దతిలో రచయిత్రి రాసిన విధానం పుస్తకాన్ని క్రిందపెట్టకుండా చదివిస్తుంది.

ఫార్మర్ గ్రే అనే వ్యక్తి పొలంలో తల్లి డచెస్‌తో కలిసి  తన బాల్యాన్ని ఆనందంగా గడుపుతుంది బ్లాక్‌బ్యూటీ. గోర్డన్ అనే ఆయనకి బ్లాక్‌బ్యూటీని అప్పగిస్తాడు ఫార్మర్ గ్రే. ఇక్కడే మెర్రీ్‌లెగ్స్ అనే చిన్న గుర్రం, జింజర్ అనే మరొక గుర్రం స్నేహితులౌతాయి.  చాలాకాలం యజమానులకి విశ్వాసపాత్రంగా సేవలు చేసిన తరువాత బ్లాక్‌బ్యూటీ, జింజర్‌లు మిష్టర్ డబల్యూ దగ్గరకి వెళతాయి.  ఒక ప్రమాదంలో  బ్లాక్‌బ్యూటి మోకాళ్ళు దెబ్బతింటాయి. దానితో అద్దెబళ్ళ వాడికి అమ్ముతారు. అక్కడినుంచి చేతులుమారుతూ జెర్రీ అనే గుర్రపు బండి వాడి దగ్గరకు వస్తుంది. జెర్రీ దగ్గర బ్లాక్‌బ్యూటీకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి. కానీ ఎంతో కాలం కాదు. తరువాత బరువులు లాగే బండికి కట్టబడి, విపరీతంగా బాదింపబడుతుంది. జింజర్ నిర్బాగ్యస్తితిలో మరణించడం చూస్తుంది. దానాని దొంగిలించి గుర్రాలని అర్థాకలితో మాడ్చేవాళ్ళు, రెండుసార్లు అటూ ఇటూ తిరగవలసిన అవసరం లేకుండా ఒకేసారి గుర్రాలమీద రెట్టింపు బరువు వేసేవాళ్ళూ, వారానికి ఏడురోజులూ - రాత్రీ పగళ్ళూ బండినడిపి తాము అద్దెకుతెచ్చిన బళ్ళ యజమానికి అద్దె చెల్లించేవాళ్ళూ.. ఎంతో మంది తారస పడతారు. కథ చివరకు వచ్చే సరికి థరోగుడ్ అనే ఆయన బ్లాక్‌బ్యూటీని కొని, సంరక్షించి ముగ్గురు సోదరీమణులకి అమ్ముతాడు. చివరిరోజులు ప్రశాంతంగా గడుస్తాయి అనే హ్యాపీనోట్‌తో తనకథను చెప్పడం ముగిస్తుంది బ్లాక్‌బ్యూటీ.

గుర్రపుబళ్ళ కాలం ఎప్పుడో గడిచిపోయినప్పటికీ ఈ నవల ఇంకా పాఠకాధరణ పొందుతూనే ఉంది. దానికి నేననుకొనే కారణం ఏమిటంటే యజమానులు తమక్రింద పనిచేసే ఉద్యోగుల విషయంలో, భర్తలు భార్యల విషయంలో, బలవంతులు బలహీనుల విషయంలో అకృత్యాలకు పాల్పడడం చుస్తూనే ఉన్నాం. ఎన్ని చట్టాలున్నా మనిషి మనస్తత్వంలో మార్పురానంత వరకూ పరపీడన పరాయణత్వం జరుగుతూనే ఉంటుంది. బ్లాక్‌బ్యూటీ నవల చదువుతున్నంత సేపూ పీడనకు గురవుతున్న ఒక వ్యక్తి ఆత్మ కథ చదువుతున్నట్టే ఉంటుంది. కథాగమనంలో ఎన్నో సార్లు పీడించేవాళ్ళగానో, పీడింపబడేవాళ్ళగానో మనల్ని మనం పరిశీలించుకొంటాం.  ముఖ్యంగా చిన్నపిల్లలు బ్లాక్‌బ్యూటీని తమస్వంతం చేసుకొన్నారు. ఈ కథ ఆధారంగా కార్టూన్ సినిమాలు వచ్చాయి. ఫీచర్ ఫిల్మ్ కూడా తీశారు.

గుర్రాలు మాత్రమే కాదు, మరి ఏ జంతువులైనా కరుణకు పాత్రమైనవే. బ్లాక్‌బ్యూటీ పిడీఎఫ్ రూపంలో ఉచితంగా లభిస్తుంది. బుక్స్ షుడ్ బి ఫ్రీ అనే సైట్‌లో ఆడియో ఫైల్స్ రూపంలో ఉంది. విని ఆనందించవచ్చు. 

Dantuluri Kishore Varma

Thursday 2 October 2014

బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం

దసరా నవరాత్రులు సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ రోజుకో అవతారంతో భక్తులకు దర్శనం ఇస్తుంది. ఊరంతా సందడిగా ఉంది. ముందరి టపాలో పనిమీద విజయవాడ వెళ్ళానని చెప్పాను కదా? ఓ రోజు పని తొందరగా ముగించుకొని సాయంత్రం ఏడుగంటలకి గుడికి వెళ్ళాం. ప్రభుత్వ వాహనాలు మినహా మరి ఏ విధమైన వాహనాలు కొండపైకి వెళ్ళే అవకాశం లేకపోవడంతో కాళేశ్వరరావు మార్కెట్ దగ్గర మమ్మల్ని దించేసి ఆటో వెళ్ళిపోయింది. దేవస్థానం ఉచిత బస్సులు కూడా భక్తులని కొండ దిగువనే దించేస్తున్నాయి. ఎవరైనా అక్కడినుంచి కొండవైపుకి నడచి వెళ్ళాలి. కొండ దిగువన వినాయకుడి గుడిదగ్గరనుంచి పై వరకూ దర్శనం క్యూ ఉంది. పోలీసులు, వాలంటీర్లు మంచి సర్వీస్ చేస్తున్నారు. క్యూలైన్‌లో భక్తులకి వాటర్‌ప్యాకెట్‌లు సరఫరా చేస్తున్నారు. అవసరమైన వాళ్ళకి ఇంగ్లీష్ మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ మరునాడు మూలా నక్షత్రమైన కారణంగా అమ్మవారిని సరస్వతీ అవతారంలో అలంకరించడానికి కావలసిన ఏర్పాట్ల దృష్ట్యా పదిన్నరకే దర్శనం నిలిపి వేస్తామని, కాబట్టి క్యూలైన్లో ఉన్నవాళ్ళు తొందరగా నడవాలని మైకులో ఎనౌన్స్‌మెంట్ ఇస్తున్నారు. పరుగు లాంటి నడక. ఎంతసమయం పడుతుందో అనుకొంటుండగానే ముప్పావుగంటలో చక్కని దర్శనం అయ్యింది.
దసరా సంబరాల స్వాగతద్వారం
ఇంద్రకీలాద్రి మీద దసరా లైటింగ్
సాంస్కృతిక కార్యక్రమాల్లో చక్కని పాటకి నృత్యాభినయంచేస్తున్న ఓ చిన్నారి
తీర్థం లేకపోతే సందడి అంతగా ఉండదేమో!
కనకదుర్గలు
మనకాకినాడలో బ్లాగ్ పాఠకులందరికీ దసరా శుభాకాంక్షలు.
© Dantuluri Kishore Varma

Wednesday 1 October 2014

వర్షమేఘం

కాలంకాని కాలంలో మండుటెండలు! విజయవాడకి ప్రయాణం. చివరినిమిషంలో రిజర్వేషన్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? సర్కార్ ఎక్స్‌ప్రెస్ కాకినాడలోనే బయలుదేరుతుంది కనుక పోర్టు ష్టేషన్‌కి అరగంట ముందే చేరుకొని జనరల్ కంపార్ట్‌మెంట్‌లో చోటు సంపాదించాం. కోరి కోరి వోవెన్‌లోకి ప్రవేశించినట్టు ఉంది. క్రమంగా సీట్లన్నీ నిండిపోయాయి. నుంచొనే జాగా కూడా జనాలతో కిక్కిరిసిపోయింది. రాజకీయాలు, కుటుంబ కలహాలు, కాలేజీ కబుర్లు, రియల్ఎస్టేట్ ఎస్టిమేషన్లు, సినిమాలు, వ్యాపకాలు... ఎవరి ధోరణి వాళ్లది. ఇవన్నీ కాక అరడజనుమంది కుర్రాళ్ళు కలిసి ఆడుకొంటున్న హౌసీగేం. రేడియోలో స్టేషన్లన్నీ కలిసిపోయి వస్తున్నట్టు ఉంది గోల. చిన్నగా తలనొప్పి మొదలవుతున్న సమయానికి కనిపించింది రైలు కిటికీలోనుంచి అల్లంత దూరంలో  నల్లని మేఘం ఒకటి. కలిసి మాతో పాటు కొంతదూరం ప్రయాణించిన వర్షమేఘం  ఒక్కసారి చిరుజల్లులు కురిపించింది. చల్లగాలి రైలుపెట్టెలో ఉక్కిపోతున్న జనాలకు సేదతీర్చింది. కురిసినది ఐదు నిమిషాలయినా, అడుగంటుకు పోయిన వోపికని ప్రోగుచేసి మిగిలిన ప్రయాణాన్ని కొనసాగించగలిగే ఉత్సాహాన్ని ఇచ్చింది.   వర్షానికి ముందు, కురుస్తూ ఉండగా, ఆ తరువాత తీసిన ఫోటోలు కొన్ని మీ కోసం..




© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!