Pages

Showing posts with label కథలు @ మనకాకినాడలో.... Show all posts
Showing posts with label కథలు @ మనకాకినాడలో.... Show all posts

Wednesday, 11 February 2015

ఆయుర్‌వేదం డాక్టర్‌గారి కాంపౌండర్

`తలంతా పట్టేసింది. వొళ్ళు నొప్పులూ, జొరం. ఇక్కడ నిలబడలేకపోతుంటే లోనకి ఎల్లినోళ్ళు ఓ పట్టాన రారూ, ఖర్మ!` అన్నాడు బోసు జనాంతికంగా. అంగుళం పొడవుండేటట్టు సమానంగా కత్తిరించిన వొట్టిగడ్డిని కపాలం మీద అంటించినట్టు ఉంది వాడి తెల్లజుట్టు.  దానిని విసుగ్గా చేతితో నిమురుకొన్నాడు.

`మందు మింగావా?` ఆయుర్వేదం డాక్టరు రంగారావుగారి గదిలోకి వెళ్ళడానికి తనవంతుకోసం ఎదురుచూస్తున్న ఓ పేషంట్ అడిగాడు బోసుని.  

`ఆ....` 

`మీ డాక్టర్ గారిదేనా?`

`ఇంగ్లీసు మందు,` అన్నాడు తన చెయ్యిని ఆర్.ఎం.పీ డాక్టరు గారి క్లీనిక్ ఉన్న దిక్కుకి చూపిస్తూ. అలా అంటూ అతిశయంతో కనుబొమ్మలు ఎగరేశాడు.

కన్సల్టింగ్ రూంలా వాడుతున్న వసారాకి జేర్చిఉన్న కటకటాల చావిట్లో ఆరు పాత ప్లాస్టిక్ కుర్చీలున్నాయి. వాటిలో కూర్చొన్న పేషంట్లూ, కటకటాల బయట చప్టాల మీద చతికిల బడ్డ సుమారు పది పదిహేను మందీ, ఇంకొంచం దూరంలో ప్రహారీగోడకి చేతులూ, కాళ్ళూ దాపెట్టి నిల్చొన్న ఇంకొక పది మందీ వాడి మాటలు విన్నారు.  విని అదేదో జోకయినట్టు  ముసిముసిగా నవ్వుకొన్నారు. ఒకళ్ళిద్దరయితే గట్టిగానే నవ్వేశారు. ఏలూరునుంచి వచ్చిన నాయుడికి గుండె గతుక్కుమంది. నడుం నొప్పి వస్తుందని ఇంగ్లీషు డాక్టర్ దగ్గరకి వెళితే నెలరోజులపాటు అవీ, ఇవీ అడ్డమైన మందులూ వాడించాడు. ఫలితం కనిపించలేదు. పదిరకాల టెస్టులు, ఎం.ఆర్.ఐ. స్కాన్‌లు అని చాంతాడంత లిస్టు ఇచ్చి వాటికే పదివేలు వదిలించాడు. చివరికి `రెండు పూసలు అరిగాయి, డిస్కు పక్కకి తప్పుకొంది, ఆపరేషన్ పడొచ్చు, చేయించుకొన్నా నయం అవుతుందన్న గ్యారంటీ లేదు,` అని చావు కబురు లాగ చల్లగా చెప్పాడు. ఇంగ్లీష్ డాక్టర్లు చేతులెత్తేసిన ఇలాంటి రోగాలకి రంగారావుగారు మందు ఇస్తే తిరుగుండదని ఎవరో చెపితే తూగోజిల్లా వరకూ ఓ.. ఎగేసుకొంటూ వచ్చేశాడు. ఇక్కడ చూస్తే డాక్టరుగారి ముసలి అసిస్టెంటుకే ఆయన మీద గురి ఉన్నట్టు కనిపించడం లేదు!  తాను కూడా నవ్వుతున్నట్టు ముఖంపెట్టి `ఏమయ్యా మీ డాక్టరు గారి మందు జ్వరానికి కూడా పనిచెయ్యదా?` అని పక్కనున్న ఆయన్ని  అడిగాడు నాయుడు.

 `బోసుగాడియ్యి అన్నీ ఎకసెక్కాలండీ బాబూ,` అన్నాడు ఆ ఆసామి

ఇంతలో లోపలికి వెళ్ళినవాళ్ళు మందుపొట్లాలతో బయటకి వచ్చారు. టిప్పుకోసం బోసు చెయ్యిచాచాడు. ఓ పదిరూపాయలు తీసి వాడి చేతిలో పెట్టారు వాళ్ళు. `ఇరవై!` అన్నాడు. `డాక్టరు గారి చీటీకి పది రూపాయలయితే నీకు ఇరవయ్యా?` అని విసుక్కొంటూ ఇంకో పది కుక్కారు.

అట్టముక్కల వెనుక పెన్నుతో ఒకటి, రెండు మూడు... అని అంకెలువేసి ఉన్న చీటీలని వైద్యంకోసం వచ్చిన రోగులకి ప్రతీరోజు ఉదయం పదిగంటల వరకూ ఇస్తాడు బోసు. అవి ఆయుర్వేదం డాక్టరు రంగారావుగారిని కలవడానికి అపాయింట్‌మెంట్లు లాంటివి. రోగులో, వాళ్ళ వెంటవచ్చే సహాయకులో వాటిని స్వయంగా తీసుకోవలసిందే. ఫోన్‌లో అపాయింట్‌మెంట్లు ఇవ్వరు. డాక్టరుగారి కన్సల్టేషన్ ఫీజు పదిరూపాయలు చీటీ తీసుకొంటున్నప్పుడే కట్టాలి.

`డబ్బు బాగా మరిగేశాడు తిక్క సచ్చినోడు. పెదరాజుగారి గరువుమీద కొత్తిల్లు కట్టాడు సాలదు గావాల్న,` అని అమ్మాజీ తిట్టుకొంటుంది. చాలా సేపటి నుంచి ఎదురు చూస్తుంది ఇక్కడ. సీటీ ఇవ్వటం లేదు బోసు. `పది దాటితే ఇవ్వనని తెలుసు కదా? మళ్ళీ అడుగుతావే కొత్తోళ్ళలాగా. పోయి, రేపు రా!` అని చిరాకు పడిపోతున్నాడు. ఇరవైరూపాయలు వాడి చేతిలో పెడితే పనిజరుగుతుంది. కానీ ఎక్కడి నుంచి తీసుకొని వస్తుంది? అరగంట క్రితం కారులో  ఏలూరు నుంచి వచ్చిన నాయుడు దగ్గర అందరూ చూస్తుండగానే వంద రూపాయలు తీసుకొని కూర్చోబెట్టాడు. 

రంగారావు గారి తాతగారు కన్సల్టేషన్ ఫీజుగా నాలుగు అణాలు తీసుకొనేవారట. తరువాత రంగారావు గారి తండ్రిగారి కాలానికి అది ఒక రూపాయి అయ్యింది. ఇప్పుడు పది రూపాయలు. అసలు వంశపారంపర్యంగా  వైద్యం చేస్తున్న ఈ కుటుంబానికి ఫీజు తీసుకోవలసిన అవసరం లేదు. వాళ్ళకున్న వందల ఎకరాలని సరిగా పండించుకొంటే చాలు. మరి ఎందుకు చేస్తున్నారూ అంటే ఇదొక సేవ అంతే.  ఆపరేషన్ చేసినా నమ్మకంగా తగ్గుతుందని చెప్పలేం అని ఇంగ్లీషు డాక్టర్లు నిర్ధారించేసిన జబ్బులకి కూడా పొడాలతో, లేహ్యాలతో, చూర్నాలతో నయం చేసేసిన చరిత్ర ఉంది వీళ్ళకి. `దీన్ని అరటిపండులో పెట్టి మింగెయ్యి; ఈ పొడాన్ని తేనెలో కలిపి నాకు; ఇది బంగారంతో చేసినమందు. క్రమంతప్పకుండా వాడితే ఫలితం ఉంటుంది. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. నువ్వు అంతా పెట్టుకోలేకపోతే సగం కట్టు మిగిలినది నేనే భరిస్తాను,` అని రోగులకి రకరకాల మందులు ఇస్తారు. డాక్టరుగారు చెప్పింది చెప్పినట్టూ వాడితే ఖచ్చితంగా గుణం కనిపిస్తుంది. కానీ ఆయుర్వేదం ఆసుపత్రి అని ఒక బోర్డు కూడా ఎక్కడా ఉండదు. ఎక్కడెక్కడినుంచో పిఠాపురం వరకూ వచ్చేసి, అక్కడి నుంచి  ఈ ఊరికి వచ్చిన తరువాత `పలానా రంగారావు గారి ఇంటికి దారేది?` అని అడిగితే మాటలు అప్పుడప్పుడే వస్తున్న కుర్రోడి దగ్గరనుంచి, పండు ముసిలోడి వరకూ `అల్లదిగో, అదే!` అని చూపించేస్తారు.  

ఒక్కొక్కళ్ళూ లోపలికి వెళుతున్నారు, వస్తున్నారు. సమయం గడుస్తుంది కానీ, నాయుడు వంతు మాత్రం రావడం లేదు. రెండుమూడు సార్లు బోసుదగ్గరకి వెళ్ళి లోపలికి పంపించమని అడిగాడు. అభయ బాబా దీవించినట్టు చెయ్యి చూపించి `నేనున్నాను కదా, నీకెందుకు,` అన్నట్టు చిద్విలాసంగా నవ్వుతున్నాడు కానీ పనిజరగడం లేదు. కూర్చొని, కూర్చొని విసుగు పుడుతుంది..  వందరూపాయలు తీసుకొని ఇలా నిరీక్షింప చేస్తున్నందుకు ఉక్రోషం వచ్చేస్తుంది.  ఇంకొక అరగంట గడిచింది. నాయుడు ఒక్క ఉదుటున కుర్చీలోనుంచి లేచాడు. రెండంగల్లో బోసు దగ్గరకి వెళ్ళి, `పంపించవా నన్ను?` అని విసురుగా అడిగాడు. 

`తాపీగా పదకొండు గంటలకి వచ్చి గదమాయిస్తున్నావు. అందరూ అయ్యాకా పంపిస్తాను. నచ్చితే ఉండు. లేకపోతే వెళ్ళు,` బోసు కూడా గొంతుపెంచి నాయుడు మీద `కయ్యి` మన్నాడు. 

నాయుడికి పెద్ద అవమానం జరిగినట్టు అయిపోయింది. చుట్టూ ఉన్న అందరికేసీ చూశాడు. వాళ్ళందరూ తమాషా చూస్తున్నారు. `మరి వందరూపాయలు ఎందుకు తీసుకొన్నావు?` అని అడగాలని ఉంది. కానీ ఆ విషయాన్ని గట్టిగా అడిగితే `లంచం ఇచ్చి లైన్ జంప్ చేద్దామనుకొన్నావా?` అని ఎవరైనా గొడవపెడతారని భయపడ్డాడు. అవమానాన్ని దిగమింగి నిశ్సబ్ధంగా వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు.   

`వొరేయ్! పేషంట్లని భయపెట్టకూడదురా. వారిని పంపించు,` అని రంగారావుగారు లోపలినుంచి బోసుని కేకలేశారు. 

ఎట్టకేలకు నాయుడి వంతు వచ్చింది. రంగారావు గారితో మాట్లాడాకా తనరోగం తగ్గచ్చు అనే నమ్మకం కుదిరింది. మందు తీసుకొన్న తరువాత ఆయనతో మెల్లగా అన్నాడు, `మీకున్న మంచి పేరు బోసు వల్ల చెడిపోతుంది. . ` అని. 

`రోగలక్షణాలను పరిశీలించి మందు ఏమిటో నిర్ణయించేది నేనే అయినా దానిని తయారు చేసేది వాడే. ఆకులు, బెరడులు, మూలికలు సరిగ్గా గుర్తించి బోసే తీసుకొని వస్తాడు`.

`కానీ మీ సేవని వాడు వ్యాపారంగా మార్చుకొంటున్నాడు.`

`కార్పొరేట్ వైద్యానికి వేలల్లో ఖర్చుపెట్టే వాళ్ళకు ఓ వంద రూపాయలు లంచం ఇవ్వడం సునాయాసమైన విషయం. పని తొందరగా ముగించుకోవడానికి  వాడికి టిప్పులు అలవాటు చేశారు. వాడిప్పుడు ఇవ్వలేని వాళ్ళని కూడా పీడించి మరీ తీసుకొంటున్నాడు.  తీసుకోవడం తన హక్కుగా భావిస్తున్నాడు. సేవని వ్యాపారంగా మార్చింది వాడు కాదు. ఇక్కడికి వచ్చే కొంతమంది పేషంట్లు మాత్రమే.`

రంగారావు గారి మాట సూటిగా నాయుడి మనసుని తాకింది. న్యూనత భావం కలిగింది. దానిని ముఖం మీద కనిపించకుండా ఉండేలా కష్టపడి ప్రయత్నించాడు. `అటువంటి పేషంట్లలో నేను లేను సుమా,` అనే భావం వచ్చేటట్టు  ఒక శుష్క మందహాసం చేసి, `మందు వాడిన తరువాత పదిహేను రోజులకి మళ్ళీ వస్తానండి,` అని చెప్పి, డాక్టరు గారికి నమస్కారం చేసి బయటకు నడిచాడు.        

© Dantuluri Kishore Varma

Monday, 5 May 2014

ధర్మయ్యగాడి కోటు

నూనెరాసి నున్నగా దువ్విన పలుచని జుట్టు, నల్లగా నిగనిగ మని మెరుస్తున్న మెలిపెట్టిన మీసం, దరిదాపు మోకాళ్ళ వరకూ వచ్చేసిన కోటు, దానిమీద ఉత్తరీయం, కోటుఅడుగునుంచి మొకాళ్ళ దిగువవరకూ తెల్లపంచతో, కిర్రుచెప్పులు చప్పుడు చేసుకొంటూ మిగిలినవాళ్ళకంటే ఒక అడుగు ముందే చేరుకొన్నాడు పెళ్ళివాళ్ళ ఇంటికి ధర్మయ్య.  అసలుదివాణాలు వెనకాల బండిలో వస్తున్నారని ఏమితెలుసు పాపం అక్కడ ఉన్నవాళ్ళకి? ధర్మయ్యనే దివాణం అనుకొని, నడచి వచ్చినందుకు కొంచెం ఆశ్చర్యపోతూనే,`రండి, రండి దయచెయ్యండి,` అనేశారు. భుజమ్మీద ఉన్న కండువాతీసి చప్టామీదఉన్న దుమ్ముని దులుపుకొని చతికిలబడ్డాడు. కుర్చీలు ఉండగా అక్కడ ఎందుకు కూర్చున్నాడో తెలియక మళ్ళీ ఆశ్చర్యపోయారు! జట్కాబండి వచ్చి ఆగాకా, దానిలోనుంచి దిగిన దివాణం `వాడు మా చుట్టల ధర్మయ్య` అన్న విషయం చెప్పినతరువాత కానీ పెళ్ళివాళ్ళకి అసలు సంగతి అవగతమవ్వలేదు. అప్పటివరకూ ఎవరు ఎన్ని విధాల పలకరించడానికి ప్రయత్నించినా మీసం మెలేసుకొంటూ ఉండిపోయాడు కానీ నోరు విప్పలేదు, నేను పలానా అని చెప్పలేదు.     

ఎవరైనా వొదులుగా ఉన్న చొక్కానిగానీ, పొడవుగా ఉన్న కోటుకానీ వేసుకొన్నప్పుడు `ధర్మయ్యగాడి కోటులా ఉంది,` అనడం ఒక జాతీయంలా మా కుటుంబాలలో స్థిరపడిపోయింది. నేనుగానీ, నాకంటే ఓ పదిహేను, ఇరవై సంవత్సరాల పెద్దవాళ్ళలో ఎవరూగానీ ధర్మయ్యని చూడలేదు. కానీ - నాన్నగారు, పెదనాన్నలు, చిన్నాన్నలు.. ఇంకా మేనత్తల ద్వారా ధర్మయ్య కథలు చాలా విన్నాం.  

ఒకరోజు మిట్టమిడసరం సమయంలో వీధిచప్టామీద పొర్లుతూ, కడుపునొప్పని పెడబొబ్బలు పెడుతున్నాడట. నాలుగు ఇళ్ళనుంచీ జనాలు పరిగెత్తుకొని వచ్చారు. బాన కడుపు మీద చేతులతో రాసుకొంటూ తెగ అవస్థ పడుతుంటే, ఎవరో వామ్ము తెచ్చి నోటిలో పోశారు. ఓ అరగంటకి మనిషి స్థిమిత పడ్డాడు. అసలు జరిగిన విషయం ఏమిటంటే తాతయ్యగారి అయిదుగురి కొడుకులవీ ఇళ్ళన్నీ ఒకే వీధిలో ఉంటాయి. ఉదయం లేచిన వెంటనే ధర్మయ్య చేసే పని ఇంటింటికీ వెళ్ళి ఎవరింట్లో ఏమి కూరో బోగట్టా తెలుసుకోవడం. ఎక్కడ మంచి కూర ఉంటే ఆపూట అక్కడే వాడి భోజనం. సత్తింరాజుగారింటిలోనో, జగ్గరాజుగారింటిలోనో, వెంకటేసులురాజుగారింటిలోనో ఎవరికీ సరిగా జ్ఞాపకం లేదు కానీ, ఆరోజు చుట్టాలొస్తారని కబురందడంతో కోడిగుడ్లు కూర వండడం మొదలుపెట్టారు. పెద్దచావిట్లో పందిరికింద చుట్టలు చుడుతూ ఉండాల్సినవాడు ఆ పూట కమ్మటి కోడిగుడ్లకూర వాసన ఆస్వాదిస్తూ వాళ్ళ అరుగు మీద కూర్చొండిపోయాడు. రావలసిన చుట్టాలు రాలేదు. `వొండినియ్యి పడేసుకొంటారేంటండి, ఇలాగేసేయ్యండి,` అని ఒక్కొటీ వేయించుకొని అరడజను గుడ్లూ తినేసే సరికి, అవి అరక్క వీధి అరుగు మీద పొర్లుగింతలు పెట్టాల్సి వచ్చింది. `పొట్టకెంత పడుతుందో తెలుసుకోకుండా తినేశావంటే చచ్చి ఊరుకొంటావ్ వెధవకానా,` అని ఎవరో తిడితే, `చచ్చిపోతామని భయపడి తినడం మానేస్తే, ఇంక బ్రతకడం ఎందుకండీ,` అన్నాడట.  

ధర్మయ్య మా వూరికి ఎప్పుడు వచ్చాడో, ఎవరు తీసుకొని వచ్చారో తెలియదు. ఎక్కడో జగ్గంపేటలో ఓ కూతురు ఉండేదట. అప్పుడప్పుడు చూసి రావడం, మిగిలిన రోజులన్నీ మా లోగిళ్ళలోనే ఉండడం. వాడి ప్రధానమైన వ్యాపకం మేలురకం పుగాకుని ఎంచుకొని, ఈనెలుతీసి, కొడవలిలా వొంపుతిరిగి ఉన్న కత్తి వెనుక అంచుతో పొగాకుని కోసి, నీటుగా చుట్టలు చుట్టడం; తుపాకీలో వేసుకొనే పొడవు బుల్లెట్లతో పాటు వచ్చే మిలట్రీ పెట్టెలు అని ఉండేవి. కాళీ అయిన ఆ పెట్టెల్లో చుట్టిన చుట్టలన్నీ చక్కాగా సర్దేయడం; సాయంత్రం పెరుమాళ్ళ స్తంభం దగ్గర సంత ఉంటే వెళ్ళి ఎవరికి ఏది కావలిస్తే అది పట్టుకు రావడం. ఎవరైనా చేప తెమ్మన్నారంటే ఎగిరి గంతేసేవాడట. చేపల పులుసంటే పంచప్రాణాలు. `బేగా వొండండి, అంత ఆలిసం ఏమిటి,`అని కాలు కాలిన పిల్లిలా పదిసార్లు అటూ ఇటూ తిరిగేవాడట.  ధర్మయ్యకి దెయ్యం అంటే భయంలేదు. దొంగోళ్ళన్నా భయంలేదు. కానీ, పాము మాట చెపితే పై ప్రాణాలు పైనే ఎగిరి పోయేవి. చీకట్లో నడవాలంటే కిర్రుచెప్పులు లేకుండా అడుగు ముందుకు వేసేవాడుకాదు.  

ఎవరో పై కండువాగా వేసుకొనే తెల్ల తువ్వాలు చుట్టబెట్టి ధర్మయ్యకోసం బహుమానం తెచ్చారు. `ఇదిగోరా ధర్మయ్యా వొండించుకో, మంచి చేపలు,` అని మూటని వాడి చేతిలో పెట్టారు. ఏరకం చేపలో తెలుసుకోక పోతే వాడికి మనసు మనసులో ఉండదు. వెంటనే మూట ముడి విప్పాడు. లోపలినుంచి `బుస్` మంది. ఇంకేముంది, దాన్ని అక్కడే పారేసి పరుగో, పరుగు! మూటలో చుట్టబెట్టి తెచ్చిన బుడతపాము బెదిరిపోయి వాడి వెనకాలే పరిగెట్టడంతో  భరతనాట్యం అయిపోయింది అక్కడ.    

చుట్టల ధర్మయ్య ఎప్పుడుపుట్టాడో తెలియనట్టే, ఎప్పుడు పోయాడో కూడా ఎవరికి తెలియదు. వాడికథలు మాత్రం ఉన్నాయి.  ఆ  కబుర్లు ఎవరైనా చెపుతుంటే సన్నివేశాలన్నీ సినిమాలోలా కళ్ళముందు కదులుతాయి. 

© Dantuluri Kishore Varma

Monday, 17 March 2014

విజేత డైరీలో చిరిగిపోయిన పేజీ

ఆదివారం సాయంత్రం బాలరాజు బీచ్ వొడ్డున కూర్చొని ఉన్నాడు. కెరటాలు వచ్చి వొడ్డును తాకుతున్నాయి. విషాదపు అలలు మనసును తాకుతున్నట్టు! బాలరాజు విషాదానికి పెద్దకారణాలు ఏమీలేవు. చేతిలో ఉన్న పొట్లంలో మిగిలిన నాలుగు పల్లీలూ తినేసి ఇంటికి వెళ్ళడమే. కాకపోతే ఆ మరునాడు సోమవారం - అదే బాలరాజు విషాదకారణం. చిన్నప్పటినుంచీ అంతే. ఆ ఒక్కరోజూ కేలెండర్లో లేకపోతే ఎంత బాగుండును అనుకొనేవాడు. ఇప్పటికి కూడా వాడిలో మార్పు రాలేదు. 

పల్లీలు తినడం మీద దృష్టిలేదు. ఒక్కొక్కటి వొలుచుకొని గింజలని అన్యమనస్కంగా నోటిలో వేసుకొంటున్నాడు. చివరి పల్లీని కూడా తినేసినతరువాత చేతిలో ఉన్న పొట్లం కాగితాన్ని విసిరేస్తూ చూశాడు -  దానిలో రాసివున్న మాటల్లో ఒకదాన్ని..... వారానికి ఒక్కసారి వచ్చే ఆదివారాన్ని కూడా నాశనం చేసుకొంటున్నాను... కాగితం మడతలు విప్పి తొందర, తొందరగా చదవడం మొదలు పెట్టాడు. అది ఎవరిదో జ్ఞాపకాల డైరీలో చిరిగిపోయిన పేజీ
  
*     *     *

టార్గెట్లతో, డెడ్‌లైన్లతో ప్రాణాలు తోడేస్తున్నారు. ఉద్యోగం చేసుకొంటున్నాం అన్న సంతోషంలేదు. పని అంటే భయం. ఆదివారం వచ్చిందంటే ఆ శెలవు గడచిపోయి సోమవారం మళ్ళీ ఆఫీసుకి పోవాలనే ఆలోచనతో వారానికి ఒక్కసారి వచ్చే ఆదివారాన్ని కూడా నాశనం చేసుకొంటున్నాను.  

సైకోసోమేటిక్ అంటారట ఈ రోజు జరిగిన విషయంలాంటిదాన్ని. ఎలాగయినా ఆఫీస్‌కి ఎగనామం పెట్టాలంటే ఏం జరగితే బాగుంటుందో తెగ ఆలోచించాను! దారిలో బైక్ స్లిప్ అయ్యింది. చెయ్యివిరిగింది. కావాలనే పడ్డానేమో అని నాకు అనుమానం. అనుమానం అనేకంటే నమ్మకం అనవచ్చనుకొంటాను.

హాస్పిటల్ ఖర్చు, జీతం నష్టం, కట్టు విప్పించుకొని తిరిగి ఆఫీసుకి వెళ్ళినతరువాత రెట్టింపు అవబోయే పని. ప్చ్! పూతిక పుల్ల ముగ్గురిని చంపిందన్నట్టు, సైకోసోమాటిజం నా దుంప తెంపింది. మానసిక వొత్తడిని తగ్గించుకోవడానికి(Stress Control) ఆరోజే కొంచెం సేపు ద్యానం చేసుకొంటే సరిపోయేది.  

ఎడమ చేతికి కట్టుతో ఇంటిదగ్గర కూర్చొని తెగ ఆలోచించాను - టార్గెట్లు ఎలా పూర్తి చెయ్యవచ్చో అని. కొత్త, కొత్త ఆలోచనలు మెదడులోనికి వరదాలా వచ్చేస్తున్నాయి. మరచిపోతానేమో అని పాత డైరీలో ఎప్పటి కప్పుడు రాశాను(Planning). 

ఎప్పుడు మామూలు అవుతానా(Health)? ఎప్పుడు పనిలో పడదామా? అని మనసు ఆరాటపడుతుంది. మళ్ళీరోడ్డు ఎక్కినప్పుడే కదా నేను అనుకొన్న ఆలోచనలని అమలు పరచగలను? 

ఆకలితో కడుపు నకనకలాడిన వాడు వొడ్డించిన విస్తరాకుమీద పడినట్టు పనిలోకి ఉరికాను(Implementation of the plan). ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇంటూ ప్లేస్ అన్నట్టు నా ప్లాన్ తరువాత ప్లాన్ విజయవంతం అవడం మొదలయ్యింది. మా కంపెనీ సేల్స్ టీంలో మిగిలినవాళ్ళు అందరూ నాకంటే మైళ్ళు వెనుకబడిపోయారు. పని రాక్షసుడిలా తయారయ్యాను. సోమవారం అంటే మనసు ఉత్సాహంతో ఉరకలేస్తుంది. 

కంపెనీ యాన్యువల్ మీటింగ్‌లో నా విజయ రహస్యం గురించి చెప్పమని అడిగారు. 

`జీవితం సముద్రం లాంటిది. విజయం అవతలి గట్టుమీద ఉంటుంది. దాన్ని చేరుకోవాలంటే షిప్ కావాలి. షిప్(SHIP) అనే మాటలో ఒక్కో అక్షరం ఒక్కో విజయసూత్రాన్ని తెలియజేస్తుంది,` అని చెపుతూ షిప్‌ని నిర్వచించాను.  

S - Stress Control
H - Health
I - Implementation
P - Planning

పైన చెప్పిన విజయసూత్రాలలో నిజానికి ప్లానింగ్ తరువాత ఇంప్లిమెంటేషన్ వస్తుంది. కానీ, గుర్తుపెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అలా ఏర్పాటు చేశానని వివరిస్తూ నా కథ వినిపించాను.

హాలు చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ఇది ఒక షిప్పు కథ. ఒక విజేత కథ.

*     *     *

ఇది చదివిన తరువాత బాలరాజు మారాడో, లేదో నాకు తెలియదు. ఒకవేళ మీరే బాలరాజు అయివుంటే మారేవారా?

© Dantuluri Kishore Varma 

Saturday, 21 December 2013

నాతో పందెం కాయకు!

ఈ రోజు నా పుట్టినరోజు. ఫ్రెండ్స్‌తో కలిసి చిన్న పార్టీ. ఫ్రెండ్స్ అంటే ఎదో పదిమందిమి కాదు. కేవలం ముగ్గురమే -సాయి, వీరేంద్రా, నేనూ. ఆనంద్ థియేటర్ ప్రక్కన ఉన్న పేస్ట్రీ షాపులో ఉన్నాం. తినేసి, తరువాత సినిమాకి పోవడం ప్రోగ్రాం.  

`చాలా కాలానికి కాకినాడ వచ్చావు. అదీ నీ పుట్టిన రోజు నాడు. మాకు చాలా ఆనందంగా ఉంది. నీ పుట్టినరోజు అని కాదురోయ్. నువ్వు ఇలా పార్టీ ఇవ్వడం బాగుందని,` అన్నాడు సాయి.

`నాన్నగారికి మళ్ళీ ఇక్కడికే ట్రాన్స్‌ఫర్ అయ్యింది. నిఖిల్ కాలేజీలో జాయినవుతున్నాను. రేపే,` అన్నాను. 

`అదంతా ఫేస్‌బుక్‌లో స్టేటస్ అప్డేట్ చేశావు కదరా? మళ్ళీ సోది ఎందుకు? మాకు తెలియంది ఏదయినా చెప్పు. లేదంటే, నీకు తెలియంది నేను చెపుతాను విను. నేనూ అదే కాలేజ్! మళ్ళీ మనిద్దరం క్లాస్‌మేట్స్ అవుతున్నాం. అహోయ్!` అన్నాడు వీరేంద్ర. 

`ఒరేయ్, ప్రాంక్స్(Pranks) ప్లేచేసి చాలా కాలం అయ్యింది. ఈ రోజు సరదాగా ఎవరినైనా ఆటపట్టించి, మాకు మంచి బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలి,` అన్నాడు వీరేంద్ర. అప్పటికే స్ప్రింగ్‌రోల్స్ తినేసి షాప్‌బయటికి వచ్చేశాం. వాడి దృష్టి థియేటర్‌కి ఎదురుగా పార్కింగ్ ప్లేస్‌లో స్విఫ్ట్‌ని పార్క్ చేసి క్రిందకి దిగుతున్న ఓ నలభై ఏళ్ళ వ్యక్తిమీద నిలిచి ఉండడం గమనించాను. 

`నేనే మీకు ఇవ్వాలా? అదేం కుదరదు. కావాలంటే పందెం కాయి,` అన్నాను. 

`వంద! అదిగో ఇప్పుడే ఆ కారు దిగిన అంకుల్‌ని ఆటపట్టించాలి నువ్వు,` అన్నాడు వీరేంద్ర.. సాయి నవ్వుతూ తమాషా చుస్తున్నాడు. ఇలాంటి పందాలు మాకు మామూలే. కాబట్టి వెంటనే అంగీకరించి ముందుకు నడిచాను.  

ఆయన దగ్గరకి వెళ్ళి `ఎక్స్యూజ్‌మీ, సర్,` అన్నాను. ఏమిటన్నట్టు చూశాడు. `నూకాలమ్మగుడికి ఎలా వెళ్ళాలో చెపుతారా?` అన్నాను. 

`ఈ వోవర్ బ్రిడ్జ్ దాటిన వెంటనే కుడిచేతి వైపుకి తిరిగి కొంచం ముందుకి వెళితే ట్రాఫిక్ ఐలెండ్ వస్తుంది. అది దాటిన వెంటనే కుడిచేతి వైపునే ఉంటుంది గుడి ,` అన్నాడు. అని ముందుకు నడిచాడు.

కొంచెం తటపటాయించినట్టు నటించాను. అతని వెనుకే రెండడుగులు వేసి, `సర్, మరోలా అనుకోకండి. మీరు చెప్పిన ఎడ్రస్ కరెక్టే కదా?` అన్నాను.

`వాట్ డు యూ మీన్?` అన్నాడు.

`అది కాదు సర్, ఇప్పుడే ఇంకొకాయనని అడిగాను. ఆయన మీరు చెప్పిన దానికి ఆపోజిట్ డైరెక్షన్ చూపించాడు.` 

`అతనికి ఊరు కొత్త అయి ఉంటుంది,` అన్నాడు.

`ఆయన తెలివైన వాడిలా కనిపించాడు. కాబట్టే నమ్మాలనిపిస్తుంది.`

`నమ్మాలనిపిస్తే నమ్మి వెళ్ళలేక పోయావా? నన్నెందుకు మళ్ళీ అడగడం? ఇప్పుడు నేను అతనంత తెలివిగా కనిపించడం లేదా?` అన్నాడు కోపంగా, `కానీ, ఇది తెలివితేటల సమస్యకాదు. నూకాలమ్మ గుడికి అలాగే వెళ్ళాలి.` 

`నూకాలమ్మ గుడికి దారి ఎవరు అడిగారు మిమ్మల్ని? మీరు కన్‌ఫ్యూస్ అయినట్టున్నారు. నేను అడిగింది భానుగుడికి దారెటని,` అన్నాను. నాకు నవ్వు ఆగటంలేదు. నా పెదవులమీద అణిచిపెట్టుకొంటున్న కొంటెనవ్వుని అతను గమనించాడు. `ఈడియట్,` అని వడివడిగా వెళ్ళిపోయాడు.   

దూరంగా నుంచుని తమాషా చూస్తున్న నా ఫ్రెండ్స్ దగ్గరకి విజయగర్వంతో వెళ్ళాను. వీరేంద్ర వోటమి ఒప్పుకొన్నట్టు నాచేతిలో వందరూపాయలు పెట్టాడు. 

`నాతో ఎప్పుడూ పందెం కాయకు,` అన్నాను.

`నాతో కూడా కాయకు. ఎందుకంటే, నువ్వు రేపు జాయినవ్వబోతున్న నిఖిల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆయన. అంటే, మన ప్రిన్సీ!` అన్నాడు వీరేంద్ర . 
© Dantuluri Kishore Varma 

Tuesday, 10 December 2013

అబద్దాలకోరు!

వాడి పేరు జానో, పీటరో ఏదో ఉంది. నాకు సరిగ్గా గుర్తులేదు. చిన్నప్పుడు వాడి బామ్మ అనేది `ఒరేయ్, సైనికుడివి అవ్వరా బాగుంటుంది. వాళ్ళు కావలసినంత పెడతారు. నీ తిండిపోతు వ్యవహారానికి సరిపోతుంది` అని. వాళ్ళ తాత అనేవాడు, `ఒరేయ్ సైనికుడివి అవ్వరా భలేగా ఉంటుంది. మందు చవకగా దొరుకుతుందట,` అని. వాడు బామ్మ మాట విన్నాడు, తాతమాట విన్నాడు. కానీ వాడి తెలివితేటలకి సైన్యంలో ఏ ఉద్యోగమూ సరిపోలేదు. కాబట్టి వంటవాడిగానే జేరవలసి వచ్చింది.

ఒకసారి పెద్ద యుద్దం వచ్చింది. అటువాళ్ళు, ఇటువాళ్ళనీ; ఇటువాళ్ళు, అటువాళ్ళనీ కాల్చుకొంటున్నారు. బుల్లెట్లు తగిలి చనిపోయిన వాళ్ళు పోతున్నారు. కాళ్ళూ చేతులూ పోగొట్టుకొన్నవాళ్ళు క్రిందపడి కొట్టుకొంటున్నారు. వంటవాడు గుళ్ళు తగలని చాటు ప్రదేశంలో ఉన్నాడు. తుపాకీ గుళ్ళు దూసుకొని పోతున్నాయి. పిరంగి గుళ్ళు పెద్దగా చప్పుళ్ళు చేస్తూ విద్వంసం సృష్ఠిస్తున్నాయి. వంటవాడికి దగ్గరలో పోరాడుతున్న ఒక సైనికుడికి ఎదుటి పక్షం నుంచి ఒక గుండు వచ్చి కాలిపిక్కలో దిగబడిపోయింది. ఒక ఆర్తనాదం చేశాడు. 

వంటవాడు ప్రాణాలకు తెగించి వాడిదగ్గరకి పరిగెత్తుకొని వచ్చాడు. `ఏమయ్యింది?` అన్నాడు.క్షతగాత్రుడు బాధగా మూలుగుతూ, `ఓరేయ్, నాకాలు పోయిందిరా! నన్ను ఆచాటుకు తీసుకొని వెళ్ళు,` అన్నాడు. వంటవాడు, సైనికుడిని భుజమ్మీద ఎక్కించుకొని సుమారు వందగజాల దూరంలో ఉన్న బంకర్ దగ్గరకి మోసుకొని పోతున్నాడు. బాధని వోర్చుకోలేక మూలుగుతున్న సైనికుడు ఆ బాధని మరచిపోవడానికి వంటవాడు వంకాయ మసాలా పెట్టిన కూరని ఎలా వొండాలో చెపుతున్నాడు. 

వంటవాడు చెపుతున్నాడు, సైనికుడు వింటున్నాడు, ఎదుటి పక్షంనుంచి తుపాకీ గుళ్ళు వాళ్ళ తలల ప్రక్కగా దూసుకొని పోతున్నాయి. సైనికుడు వింటున్నాడు, వంటవాడు చెపుతున్నాడు. అప్పుడు జరిగింది ఒక జరగ కూడని విషయం. ఓ పిరంగి గుండు సైనికుడి తలని తీసుకొని పోయింది. అది జరిగిన విషయం వంకాయ మసాలా కూరలో ములిగిపోయిన వంటవాడికి తెలియనేలేదు. సైనికుడి మొండాన్ని మోసుకుపోతున్నాడు. 

వాళ్ళ కమాండర్ చూశాడు. `ఒరేయ్ బుర్ర తక్కువ వెధవా, ఆ తలలేని మొండాన్ని ఎక్కడికి తీసుకొని పోతున్నావు?` అన్నాడు.  `తలకాదు సార్, వీడికి కాలు పోయింది,` అన్నాడు. `నీమొహం, వాడికి పోయింది తలే. కావాలంటే చూడు,` అన్నాడు కమాండర్. అప్పుడు చూశాడు వంటవాడు, తనభుజమ్మీద ఉన్న మొండాన్ని. కోపంగా నేలమీద పడేశాడు. `నాకు వీడు స్వయంగా చెప్పాడు సర్, కాలే పోయిందని. అబద్దాలకోరు,` అన్నాడు.

(ఒకజోక్ ఆధారంగా రాసినది) 
© Dantuluri Kishore Varma 

Thursday, 14 November 2013

భయపడ్డారా!

`ఈ ఊరికి కొత్తగా వాచ్చాం. ఒక ఇల్లు కొనుక్కొని స్థిరపడదామని అనుకొంటున్నాం. మీ తాతగారి ఇల్లు మెయిన్‌రోడ్డుకి ఆనుకొని మూడవ వీధిలో ఉందట. ఎంతో చెపితే, మిగిలిన వ్యవహారాలు మాట్లాడుకొందాం,` అన్నాడు అతను మురళీమోహనరావుతో.

చాలాకాలంనుంచి ఖాళీగా ఉన్న ఆయింటిలోనుంచి ప్రతీరాత్రీ ఏవో శబ్దాలు వస్తూ ఉంటాయని, మంచి మంచి వాసనలు కూడా వస్తాయని, ఎవరో మాట్లాడుకొంటున్నట్టు వినిపిస్తుంటుందనీ... ఇవేమీ చెప్పకుండా వచ్చినతనికి ఇల్లు అమ్మేశాడు.

చవకగా దొరికిన ఇంటిలోకి పెళ్ళాం పిల్లలతో దిగిపోయాడు ఇల్లు కొనుక్కొన్న దొరబాబు. మొదటి రాత్రినుంచీ చీకటిగదుల్లో లైట్ల కాంతి, వంటగదిలోనుంచి తియ్యని వాసనలు, గుసగుసలు.. వెన్నులోనుంచి వణుకు వచ్చేలా ఉంది. ఇల్లు ఖాళీ చేసి, లాడ్జీలో గది తీసుకొని పడుకొన్నారు. 
మోసంచేసి ఇల్లు అమ్మేశారని తెలిసినా ఏమీ చెయ్యలేని పరిస్థితి. మురళీమోహనరావుని అడిగితే - `నేనేమన్నా అమ్ముతానన్నానా? మీరేకదా కోరి కోరి వచ్చి అడిగారు?` అని తప్పించుకొన్నాడు. విషయం తెలిసినవాళ్ళకీ, తెలియని వాళ్ళకీ చెపుతూనే ఉన్నాడు దొరబాబు. ఏమయినా ఫలితం ఉంటుందేమో అని ఒక వెర్రి ఆశ. 

శివాజీరావు చెవిలో పడింది విషయం. `పద వెళ్ళి చూద్దాం అన్నాడు`.

చీకటి పడుతుండగా వెళ్ళారు. మార్పేమీలేకుండా అలాగే ఉంది సందడి అంతా. ఎవరూ ఏమీ వండకుండానే నోరూరించే వాసనలు. `దెయ్యాలు పార్టీ చేసుకొంటున్నట్టున్నాయి. పద అలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుందాం,` అన్నాడు శివాజీరావు. దొరబాబుకి చాలా భయం వేస్తుంది. కానీ, విషయం ఏమిటో తెలియాలి కదా?

`ఏమైనా కబుర్లు చెప్పు అన్నాడు. కొత్తగా చూసిన సినిమాలో బ్రహ్మానందం గురించో, ఆలీ గురించో చెప్పు,` అన్నాడు శివాజీ రావు. మెల్లగా సంభాషణ జరుగుతుంది. ఇద్దరూ సినిమా జోకులు, మామూలు జోకులు, అవీ, ఇవీ అన్నీ చెప్పేసుకొంటున్నారు. నిమిషాలు గంటలుగా మారుతున్నాయి. 

ఇళ్ళదగ్గర వాళ్ళ పెళ్ళాలకి భయం మొదలైంది. ఆరు గంటలకి వెళ్ళినవాళ్ళు ఎనిమిదయినా తిరిగిరాలేదు. జరగకూడనిది ఏమైనా జరగలేదుకదా అని. 

వాళ్ళనీ, వీళ్ళనీ బ్రతిమాలి పోగేశారు. అందరూ వెళ్ళి చూసేసరికి శివాజీరావూ, దొరబాబు కూర్చొని జోకులమీద జోకులు చెప్పేసుకొని, నవ్వేసుకొంటున్నారు. ముఖ్యంగా దొరబాబు జోకులు అదిరిపోయేలా ఉన్నాయి. వచ్చినవాళ్ళూకూడా నవ్వడం మొదలుపెట్టారు. 

`మీరు భలే చెప్తున్నారండీ కబుర్లు,` అన్నాడు, ఆడవాళ్ళకి తోడువచ్చినవాళ్ళలో ఒకడు. 

`నిజమే, దొరబాబుదగ్గర మంచి నవ్వించే కళ ఉంది. రేపుసాయంత్రం కూడా కొంచంసేపు కూర్చుందాం రండి,` అని ఆహ్వానించాడు శివాజీరావు. ఒక కాలక్షేపం మొదలైంది. ఆ మరునాడు వాళ్ళు వస్తూ కూడా మరికొంతమందిని వెంటబెట్టుకొని వచ్చారు. అలా, అలా రోజువారీ కాలక్షేప కేంద్రంగా మారిపోయింది దొరబాబు ఇల్లు. 

చిత్రం ఏమిటంటే అప్పటినుంచీ మళ్ళీ దెయ్యల హడావుడి ఏమీలేకుండా అయిపోయింది ఆ ఇంటిలో. `మనుషులు వచ్చేశారుకదా, మనమెందుకు ఇక్కడ  అనుకొన్నాయేమే!`

నోట్: ఈ కథలో లాజిక్ వెతక్కండి. ఉత్కంఠత కలిగించడానికి సరదాగా రాసింది.  హారిస్ టోబియస్ అనే ఆయన రాసిన హాంటెడ్ అనే కథ ఆధారం.
© Dantuluri Kishore Varma

Wednesday, 9 October 2013

గ్రహాంతరవాసులతో అతను

రోడ్ జంక్షన్‌లో వెలుగులు చిమ్ముతున్న స్ట్రీట్‌లైట్ దగ్గరనుంచి చీకటిగా ఉన్న కాలేజ్‌రోడ్ వైపుకి వేగంగా దూసుకొని వచ్చింది హీరో్‌హోండా బైక్. గవర్నమెంట్ కాలేజ్ పిట్టగోడ ప్రక్కన ఆగింది. ఇగ్నీషన్ ఆపకుండానే, సైడ్ స్టేండ్ వేసి పాతికేళ్ళ కుర్రాడు బైకు దిగాడు. `ఇక్కడ మూత్ర విసర్జన చెయ్యరాదు` అని గోడమీద నోటిసు రాసిఉన్న వైపుకి పేంట్ జిప్ తీస్తూ నడిచాడు. సెకండ్ షో విడిచిపెట్టి గంటన్నర అయ్యింది. ఫ్రెండ్స్‌తో బాతాకానీ వేసి, చాయ్ తాగి బయలుదేరేసరకి ఆ సమయం అయ్యింది. ఇంటికి వెళ్ళే ముందు ప్రతీసారిలాగే ఇదిగో ఇక్కడ ఆగాడు. రోడ్లన్ని నిర్మానుష్యంగా ఉన్నాయి. వీస్తున్న గాలితో అతను వేస్తున్న విజిల్ కలసిపోతుంది. చంద్రుడు లేని ఆకాశం. చుక్కలు మాత్రం తళుకులీనుతున్నాయి. సరుగ్గా అప్పుడు గమనించాడు... ఒక చుక్క క్రమంగా పెద్దదవ్వడం! చూస్తుండగానే భోజనం ప్లేటంత పెద్దదయ్యింది. పదిచంద్రుళ్ళంత ప్రకాశం!  
విశాలంగా ఉన్న కాలేజ్ ప్లేగ్రౌండ్ వైపు వేగంగా ప్రయాణిస్తూ వచ్చింది. చిన్నప్పుడెప్పుడో స్టీవెన్ స్పీల్‌బర్గ్ తీసిన ఈటీ సినిమాలో చూశాడు - యు.ఎఫ్.ఓ! అన్ఐడింటిఫైడ్ ఫ్లయ్యింగ్ ఆబ్జెక్ట్. మన భాషలో చెప్పాలంటే గ్రహాంతరవాసుల వాహనం - ఎగిరే పళ్ళెం. రెండు తాడిచెట్ల ఎత్తులో అలాగే నిలిచిపోయింది. శక్తివంతమైన బ్యాటరీ లైట్ ఫోకస్ చేసినట్టు ఒక కాంతి కిరణం అతని మీద ప్రసరింపబడింది. ఏంట్ఈటర్ అనే జంతువు పొడవైన నాలుకను చాపి చీమల్ని నోటిలోకి లాగేసుకొన్నట్టు, ఆ కాంతి కిరణం అతన్ని యూఎఫ్ఓలోకి లాగేసింది. నేషనల్ జియోగ్రఫిక్ చానెల్లో చూపించే అరుదైన జంతువుల్ని ఫోటోషాప్ చేసి కొత్తజంతువుని సృష్టించినట్టు ఉన్నారు నలుగురు గ్రహాంతరవాసులు.  

`నన్నెందుకు తీసుకు వచ్చారు?` అన్నాడు అసంకల్పితంగా.

`మీగ్రహం గురించి కొంత సమాచారం కావాలి,` అన్నాడు ఒకడు.

`మీరు...మీరు... తెలుగు మాట్లాడు తున్నారు. తెలుగు వాళ్ళా!`

`ఆశ్చర్యపోవద్దు. మా కర్ణభేరికి ముందు ఫిల్టర్లు ఉంటాయి. ఎదుటివాళ్ళు మాట్లాడే భాష ఏదయినా డీకోడ్ చేసి మాకు అర్థమయ్యే విధంగా మారుస్తాయి. అలాగే మా పళ్ళ సందుల్లో ఉండే ఫిల్టర్లు మేం మాట్లాడే దాన్ని మీ భాషలోకి తర్జమా చెస్తాయి.`  

`సినిమా చూసి ఇంటికి వెళుతున్న నన్ను ఇలా కిడ్నాప్ చెయ్యడం అన్యాయం.` 

అతని ఆందోళనని వాళ్ళేమీ పట్టించుకోలేదు. `సినిమా అంటే ఏమిటి?` అన్నాడు అందులో ఒకడు.

గ్రహాంతరవాసులకి మన భూమిమీద విషయాలేమీ తెలియవని అర్ధమైపోతుంది. అయినా, ఇంత టెక్నాలజీ ఉన్న వీళ్ళకి గూగుల్‌లో వెతికితే ఈ విషయాలు తెలియవా! అనుమానాలని ప్రక్కనపెట్టి అన్నాడు, `చెపితే వదిలేస్తారా?` అని.

`చెప్పకపోతే ల్యాబరేటరీలో పెట్టి కోస్తాం. చెప్పు త్వరగా ,` అన్నారు.  

`సినిమా అంటే కలల్ని అమ్మే పెద్ద వ్యాపారం. అమ్మాయిలు, ఫైటింగులు, సెంటిమెంట్లు, పంచ్‌డైలాగులు కలిపి కొడితే వారంరోజుల్లో మూడురెట్లు లాభం వస్తుంది. జనం ఎగబడి చూస్తారు. దీనికంటే పెద్దవినోదం మరొకటిలేదు, రాజకీయంతప్ప `

`రాజకీయమా!` అన్నాడు మరొక ఈటీ. 

మన భూలోక వాసికి ఒకటి అర్థమైయ్యింది -  వ్యవస్థలకి లేదా వ్యాపకాలకి సంబంధించిన నామవాచకాలను వాళ్ళు అవగాహన చేసుకోలేకపోతున్నారు. కొంచెంవివరంగానే చెప్పాలి. ఇలా కొనసాగించాడు.  

మాకు నాలుగు రకాలైన ప్రజలు ఉన్నారు. అతి సామాన్యమైన నిరక్షరాస్యులు, తెలివైనవాళ్ళమని భావించే వాళ్ళు, నిజంగా తెలివైన వాళ్ళు, బలముండి సిగ్గులేనివాళ్ళు. వీళ్ళల్లో ఎవరైనా నాయకుడిగా పోటీలో నిలబడవచ్చు. మిగిలిన వాళ్ళు వోట్లు వేసి వాళ్ళని గెలిపించి, తమ సమస్యల గురించి చర్చించి నిర్ణయాలు చెయ్యమని అధికారం ఇస్తారు. దీన్ని ప్రజాస్వామ్యం అని పిలుస్తాం. ఇది ప్రజల చేతిలో ఉండే గొప్ప ఆయుధం. కానీ, ఒక్కసారి నాయకుడిగా ఎన్నికైన తరువాత చాలా మంది ప్రజలమాట మరచిపోయి, తాము చెప్పినట్టు ప్రజలు వినాలని కోరుకొంటారు....` కొంచెం సేపు ఆగి కొనసాగించాడు.... `బలవంతుడైన స్వార్ధపరుడు నాయకుడైతే ప్రజా సంక్షేమంకోసం వెచ్చించాల్సిన డబ్బుని తన స్వంతం చేసుకొంటాడు. ఓడిన వాడు కడుపుమంటతో వాడిని తిడతాడు. టెలివిజన్‌లో చూస్తున్న జనాలకి నాయకుల నిజస్వరూపాలు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళని అసహ్యించుకొంటూ చూస్తారు. అదే వినోదం.` 

`మరి ప్రజలు వాళ్ళను దించెయ్యవచ్చుకదా?`

ఇందాక చెప్పిన నాలుగు రకాల్లో బాగా తెలివైనవాళ్ళు నాయకుల చేతుల్లో కీలుబొమ్మల్లా ఉండి, వాళ్ళ అధికారానికి పరోక్షంగా సహకరిస్తుంటారు. తెలివైన వాళ్ళమనుకొనే వాళ్ళు ఉపన్యాసాలు ఇవ్వడానికి తప్ప దేనికీ పనికి రారు. కనీసం ఓటుకూడా వెయ్యరు. సామాన్యులు  జరుగుతున్న తతంగాన్ని నిశ్సబ్ధంగా గమనిస్తారు. అయిదేళ్ళతరువాత తమదగ్గర ఉన్న ఓటనే బ్రహ్మాస్త్రంతో  తలరాతలు మార్చడానికి. కానీ, దురదృష్టవశాత్తూ మళ్ళీ జరిగిందే జరుగుతూ ఉంటుంది. ఒక స్వార్ధపరుడు పోతే, మరొకడు తగులుతాడు. మా కర్మ!`

`మీదగ్గర నేర్చుకోవలసిన గొప్పవిషయాలేమీ లేవు. నిన్ను పంపిస్తున్నాం,` అన్నారు అంతరిక్షవాసులు. 

భూలోక వాసికి చాలా సంతోషం అయ్యింది. కానీ ఒక సందేహం ఉంది - తననే ఎందుకు తీసుకొని వచ్చారని. ఆమాటే వాళ్ళని అడిగాడు. 

`దేశ రహస్యాలని, ప్రాణాలు పోయినా ప్రక్కదేశాలకే తెలియనివ్వం. అలాంటిది వేరే గ్రహాల వాళ్ళకి ఇవ్వాలంటే `ఇక్కడ మూత్రవిసర్జన చెయ్యరాదు` అని బోర్డు పెట్టినచోటే ఆపని చేసే నీలాంటి సూడో ఇంటెలెక్చువల్సే ఇవ్వగలరు. మంచీ, చెడుగురించి ఉపన్యాసాలు ఇస్తారు. మీదాకా వచ్చేసరికి చిన్న నిబంధనని కూడా పాటించరు. నువ్వు చెప్పిన స్వార్ధ రాజకీయనాయకుల కంటే మీరే పెద్ద స్వార్ధపరులు. కేవలం అవకాశం లేక నిజాయితీగా మిగిలిపోతారు తప్ప, విలువలమీద నమ్మకం ఉండికాదు.  అందుకే నిన్ను పట్టుకొచ్చాం,`   వాళ్ళు చివరి మాట చెబుతూ ఉండగా, లైట్‌బీం వాడిని తీసుకువెళ్ళి బైకు ముందు నిలబెట్టింది.
 © Dantuluri Kishore Varma 

Friday, 13 September 2013

హాంటెడ్ స్ట్రీట్! దెయ్యాలకథ Part II

మొదటి భాగం ఇక్కడ చదవండి

1. హాంటెడ్ స్ట్రీట్! దెయ్యాలకథ Part I

తేజా చెప్పిన కథ

`ప్రమీలా నగర్ మూడవవీధికి వెళ్ళాలి,` అన్నాను.
`దెయ్యాల కొంపలుండే వీధా?` అన్నాడు ఆటో డ్రైవర్.
`దెయ్యాల...కొంపలా...!? ఏమో తెలియదు. ఇదిగో ఎడ్రస్,` అని ఆఫీస్ చిరునామా ఉన్న కాగితం చూపించాను.

ఆటో ప్రమీలానగర్ వీధిలోకి తిరుగుతూ ఉండగా పాడుపడిన ఇల్లు కనబడింది. అది దాటిన వెంటనే నిర్మానుష్యంగా ఉన్న పెద్ద డాబా, గేటుకి తుప్పుపట్టిన తాళంకప్ప వేసి ఉంది. `చీకటి పడ్డాకా ఈ వీధిలో తిరగ బాకండి,` అన్నాడు ఆటో డ్రైవర్. వీధిలో ఉన్న మూడవ ఇంటిముందు ఆటో ఆగింది. ఓర్ అండ్ మాస్ట్(Oar and Mast) షిప్పింగ్ కంపెనీ అని రాసి ఉన్న బోర్డ్ చూస్తూ క్రిందకి దిగాను. ఆఫీస్ ఉన్న బిల్డింగ్ తరువాత ఇంకొక ఇల్లు మాత్రమే ఉంది. వీధిఅంతా నిర్మానుష్యంగా ఉంది.

బట్టల బ్యాగ్, బెడ్డింగ్, టేబుల్ ఫ్యాన్లు క్రిందికి దించుకొని; ఫేర్ చెల్లించిన తరువాత ఆటో వెళ్ళిపోయింది. చప్పుడువిని ఓ ఇరవై ఏళ్ళ కుర్రాడు - అటెండర్ అనుకొంటాను-  బయటికి వచ్చాడు. నా లగేజ్‌ని చేతుల్లోకి తీసుకొంటూ, `మా తేజా సారు, కొత్తగా వచ్చారు,` అన్నాడు. పక్క ఇంటి గేటు దగ్గర గుబురుగా పెరిగిన బోగన్‌విల్లా నీడలో నుంచొని ఉన్న మనిషిని అప్పుడు చూశాను. ముప్పైఅయిదేళ్ళు ఉంటాయేమో! `చాలా` ఆకర్షణీయంగా ఉంది. మాకుర్రాళ్ళ భాషలో చెప్పాలంటే  కత్తిలా ఉంది.

`పక్కింటి రేఖా ఆంటీ సార్. వాళ్ళాయన దుబాయిలో ఉంటాడట. వాళ్ళ అమ్మా, నాన్న, ఇద్దరు పిల్లలతో ఉంటుంది. చాలా మంచావిడ. మీలాంటి స్మార్ట్‌గా ఉన్నవాళ్ళయితే ఏ `హెల్ప్` కావాలన్నా చేస్తుందట.` అన్నాడు ఆఫీసులోకి దారితీస్తూ. హెల్ప్‌ని వొత్తిపలికాడు. కొంటెగా కన్నుకూడా గీటాడు.

*     *     *   

ఆఫీసులో మామూలు రోజుల్లో పెద్దగా పని ఉండదు. ఎప్పుడైనా వెసల్(షిప్) వచ్చినప్పుడు మూడు, నాలుగు రోజులు రాత్రీ పగలూ తేడా లేకుండా పనిచెయ్యాలి. మళ్ళీ ఏ పదిహేనురోజులకోకానీ ఇంకొక వెసల్ రాదు. ఉండేది ముగ్గురమే నేనూ, ఎకౌంటెంట్, అటెండర్.

ప్రయివేటు కంపెనీ కనుక పెద్దగా జీతాలు ఉండవు. ఏదయినా హోటల్లో ఉండి రూం వెతుక్కోవాలంటే, జేబుకి చిల్లుపడుతుంది. కాబట్టి, తక్షణ కర్తవ్యం ఇళ్ళవేట. అ(దుర)దృష్టవశాత్తూ ఆఫీసు పక్కపోర్షన్ ఖాళీగాఉంది. అకౌంటెంట్ దగ్గర ఇళ్ళబ్రోకర్ షణ్ముగం నెంబరు తీసుకొని కాల్ చేశాను.

సింగిల్ బెడ్రూం పోర్షన్ విత్ అటాచ్డ్ బాత్రూం. అద్దెతక్కువ. `తన్నితే బూరెలబుట్టలో పడటం అంటే ఇదేనండి. ప్రక్కనే మంచి హెల్పింగ్ నేచరున్న ఆంటీగారు కూడా ఉన్నారు,` అన్నాడు షణ్ముగం అడ్వాన్స్ తీసుకొంటూ.

సామాన్లు ఇంటిలో పెట్టించాను. సాయంత్రం ఆరు అవుతుండగా, ఆఫీసు మూసెయ్యడానికి తయారవుతున్నాం. అప్పుడువచ్చింది రేఖా ఆంటీ సరాసరి నా టేబుల్ దగ్గరకి. ఆమె నడచి వస్తుంటే కదులుతున్న నడుము ఒంపుల్లో చిక్కుకొన్న నా చూపులు, గతుకులరోడ్డులో ప్రయాణించినట్టు ఎగిరెగిరి పడ్డాయి.

`కొత్తగా వచ్చారట? మా పక్కింటిలోనే దిగడం సంతోషం. ఏదయినా కావాలంటే మొహమాటపడకుండా అడగండి. సాయంత్రం భోజనం పంపిస్తాను,` అంది. మాటల్లో శ్లేష కావాలని పలికించినట్టే ఉంది.

`లేదండి. ఓ మూడురోజులు పనిమీద బయటి ఊరు వెళ్ళాలి. ఇప్పుడే బయలుదేరుతున్నాను. చాలా థాంక్స్!` అన్నాను.

`ఇప్పుడే జేరారు, అప్పుడే క్యాంపా?` అని మతులుపోయేలా ఓ చిరునవ్వు నవ్వి, వెళ్ళిపోయింది.
 *     *     *

అనుకొన్నపని ఒకరోజు ముందే పూర్తయిపోయింది. ఊరిలో ట్రెయిన్ దిగేసరికి రాత్రి పది అవుతుంది. రన్నింగ్ ఆటోలో ప్రమీలా నగర్ జంక్షన్‌ దగ్గర దిగి, ఇంటివైపు నడవడం మొదలుపెట్టాను. చిన్నగా గాలి వీస్తుంది. `చీకటి పడ్డాకా ఈ వీధిలో తిరగ బాకండి,` అన్న ఆటో డ్రైవర్ మాటలు సడన్‌గా జ్ఞాపకం వచ్చాయి. వెన్నులోనుంచి వొణుకు వొళ్ళంతా పాకింది. నుదుటిమీద చెమట్లు పడుతున్నాయి. గాలివేగం పెరిగింది. మావీధిలోకి మలుపు తిరుగుతుండగా పాడుబడిన ఇంటిలో కిటికీల్లోనుంచి గుబురుగా పెరిగి బయటకి వచ్చిన మొక్కలు గాలికి కదులుతుంటే ప్రేతాత్మలు చేతులుచాచి ఆహ్వానిస్తున్నట్టు ఉన్నాయి. సరిగ్గా అప్పుడే `టప్`మని కరెంట్ పోయింది. వీధిలైటు ఆరిపోయింది. గేటు తీసుకొని లోపలికి వెళ్ళాను.  

అంతరాత్మ ఘోషించడం గురించి పుస్తకాల్లో చదవడమే గానీ ఎప్పుడూ స్వయంగా నాకు అనుభవమవ్వలేదు. కానీ, తాళాల గుత్తి తీసి నా పోర్షన్‌వైపు వెళుతుండగా, `వద్దు, వద్దు` అని బలంగా అనిపిస్తుంది. ఇంటిలో కటిక చీకటి. ఎక్కడ ఏముందో తెలియదు. నిజంగా ఇది దెయ్యాలవీధి అయివుంటే! తాళాలు తియ్యడం విరమించుకొన్నాను. లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోవడం కంటే కరెంటు వచ్చేవరకూ డాబా మీద గడపడం మచిది.   

అసలు నేను అక్కడినుంచి పారిపోయి ఉండవలసింది. స్టుపిడ్‌లాగ డాబామీదకి వెళ్ళాను. నల్లగా నాచుపట్టిన మెట్లు, పడుకొన్న మృగంలాగ ఉన్న ఓవర్‌హెడ్ టేంక్. వాటర్‌టేంక్ నీళ్ళల్లో చెత్త పడకుండా రేకుతో చేసిన ఫ్రేం ఒకవైపు మేకులు ఊడిపోయి గాలికి పెద్దగా శబ్దం చేస్తూ కొట్టుకొంటుంది. ఎవరైనా మనుష్యులు కనిపిస్తే బాగుండును. రేఖా ఆంటీ ఇంటివైపు నడిచాను. వెనక్కి, కుమారస్వామి ఇంటివైపు తిరగాలంటే భయం వేస్తుంది. పెళ్ళయిన సంవత్సరంలోనే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన అతని కూతురూ, అల్లుడూ గురించి తెలుసు. ఆ సంగతి ఇంతకుముందే అటెండర్ చెప్పాడు. రేఖా ఆంటీ ఇంటిలో ఎలాంటి అలికిడీ లేదు. అప్పుడే, పెద్దగా ఈదురుగాలి వచ్చింది. రెండు పెద్ద పెద్ద వర్షపు చినుకులు మీద పడ్డాయి. గాలితో పాటూ ఎవరో గుసగుసగా మాట్లాడుతున్న చప్పుడు. మెడమీద వెంట్రుకలు నిక్కబొడుచుకొంటుండగా గిరుక్కుమని వెనుకకి తిరిగాను....
నేను చూసిన దృశ్యాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. కుమారస్వామి డాబామీద రెండు ఆకారాలు గాలిలో తేలుతున్నాట్టు వేగంగా మెట్లవైపు వెళ్ళడం నా కళ్ళతో చూశాను.....

*     *     *
శేషగిరి చెప్పిన కథ

దెయ్యాలకొంపట! అసలు నాలాంటివాడికి కావలసింది అదే. నా నలభై అయిదేళ్ళ జీవితంలో దెయ్యాల్లాంటి మనుష్యులని చాలా మందిని చూశాను. మనం భయపడితే అలాంటివాళ్ళకి కానీ, అసలు ఉన్నాయో లేవో తెలియని ఆత్మలకి కాదు. పైపెచ్చు నేను చేసే వ్యాపారానికి షణ్ముగం చెప్పిన ఇల్లు లాంటిదే కరెక్ట్. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలో బోలెడు హడావుడి ఉంటుంది.  చాలా మంది ఫ్రెండ్స్ వస్తారు. డబ్బుకట్టలు చేతులుమారతాయి. ఈ వ్యవహారాలన్ని పబ్లిక్‌లో పెట్టుకోగలమా? అందుకే, వెంటనే ఇళ్ళబ్రోకర్ షణ్ముగం చూపించిన కుమారస్వామి ఇంటిలో దిగిపోయాను. సాయంత్రం నాలుగు పెగ్గులేసి, హోటల్నుంచి తెచ్చుకొన్న చికెన్ బిర్యానీ తిని పడుకొంటే హాయిగా నిద్రపట్టింది. నిజంచెప్పద్దూ, ఈ మధ్యకాలంలో నేను అంత ప్రశాంతంగా నిద్రపోయిందిలేదు.

ఉదయం పేపరు చదువుకొంటుంటే ఆవిడ వచ్చింది. కోరికలు కూరిన మిఠాయి పొట్లంలా ఉంది. పేరు రేఖ అట. 

`ఈ ఇంటిలో ఒంటరిగా ఉండటానికి భయం వెయ్యదా?` అంది. 

`మీరు తోడువస్తారా?` అన్నాను. ఒక్కక్కళ్ళని చుస్తే వెంటనే ప్రొసీడయిపోవాలనిపిస్తుంది. 

`ఇరుగుపొరుగు వాళ్ళం, ఆమాత్రం సాయం చేసుకోలేమా?` అంటూ పక్కుమని నవ్వింది. అలా నవ్వడం కావాలని పైటకొంగు జార్చడానికి ఒక అవకాశం అని నాకు తెలుసు. చప్పున ముందుకు వొంగి ఆమె చెయ్యి పట్టుకొన్నాను. 

`ఆ..ఆ.. ఖంగారు పడకండి. సాయం కావలసింది సాయంత్రానికి కదా? కేరేజీ తీసుకొని వస్తాను,` అని వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయింది. 
*     *     *  
మబ్బుపట్టింది. వర్షం వచ్చేలా ఉంది. చిన్న ఈదురుగాలి మొదలైంది. రాత్రి తొమ్మిది ఐనా రేఖ రాలేదు. చాలా అసహనంగా ఉంది. అసలు వస్తుందా?    

క్షణాలు గంటల్లా అనిపిస్తుండగా మెల్లగా తెరుచుకొన్న తలుపులోనుంచి ముందు మల్లెపూల పరిమళం ముక్కును తాకింది. తరువాత వంగపువ్వురంగు జార్జెట్ చీరలో అప్సరసలా ఆమె నడిచి వచ్చింది.

నా కళ్ళల్లో మెరుపు చూసిందేమో! `ముందు భోజనం తరువాతే ఏమైనా,` అంది. 

రాత్రి పది అవుతుందేమో! బయట ఈదురుగాలి వీస్తున్న చప్పుడు వినిపిస్తుంది. `టప్` మని కరెంట్ పోయింది. ఇల్లాంతా చీకటిమయం అయిపోయింది.`ఇప్పుడెలా? క్యాండిల్స్ కానీ, టార్చ్ కానీ లేవు,` అన్నాను. 

`డాబా మీదకి వెళదాం,` అంది.

`వర్షం!`

`పరవాలేదు, వర్షంలో చాలా బాగుంటుంది.`

`ఆరుబయట.. ఎవరూ చూడరా?`

`ఎవరున్నారు చూడడానికి? పక్కింటిలో మొన్న దిగిన తేజా రావడంతోనే క్యాంపుకి వెళ్ళాడు. ఇంకా రాలేదు. వచ్చేటప్పుడే చూశాను. తలుపు తాళం వేసి ఉంది.  

`అయితే పద,` అన్నాను. మనంచేసే పని గుట్టుచప్పుడు కాకుండా ఉండాలనేది నా పోలసీ. మాంసం తింటున్నామని దుమ్ములు మెడలో వేసుకోం కదా?   

మబ్బులు పట్టి చాలా మసకగా ఉంది ఆకాశం. ఎప్పుడైనా వర్షం రావచ్చు. గాలి ఉదృతంగా వీస్తుంది. పక్క ఇంటి డాబా మీద వాటర్‌ట్యాంకుది అనుకొంటాను రేకు పెద్ద చప్పుడుతో `టక టక` మని కొట్టుకొంటుంది. 

పైమెట్టుమీద వుండగా చూశాను, ప్రక్క డాబామీద కట్రాయిలా నిలుచున్నా ఆకారాన్ని. మొహం అటుతిప్పి ఉందో, ఇటుతిప్పి ఉందో తెలియడం లేదు. గుండెఝల్లు మంది. ఎప్పుడూ లేనిది వొంటినిండా రోమాలు నిక్కబొడుచుకొన్నాయి. 

`ఎవరు?` అన్నాను ఆమెతో గుసగుసగా. అప్పటికే ఆమెముఖం తెల్లగా పాలిపోయి ఉంది. ఏమో తెలియదు అన్నట్టు రేఖ చేతితో సౌ్oజ్ఞ చేస్తుండగా ఆ ఆకారం గిర్రుమని వెనక్కి తిరిగింది. ఒక్కక్షణం కూడా ఆలశ్యం చెయ్యలేదు. చెయ్యీచెయ్యీ పట్టుకొని మూడేసిమెట్లు ఒక్కో అంగలో దిగుతూ పరుగెట్టాం. నిజ్జం! నా కళ్ళతో దెయ్యాన్ని చూడడం అదే మొదటిసారి! 
*     *     *

అయ్యా అదండీ సంగతి. ఇంతకీ నేనెవరో గుర్తుపట్టారా? ఈ కథ మొదలు పెట్టిన ఇంటిబ్రోకర్ షణ్ముగాన్నండయ్యా! తేజా చెప్పిన కథ విన్న తరువాత నాకు నోటమాట రాలేదు. కానీ, శేషగిరి వచ్చి తనకథని చెప్పిన తరువాత జరిగిన విషయం క్లియర్‌గా అర్దమయ్యింది. డాబా మీద వాళ్ళు చూసింది తేజానేనని చెప్పాను. కానీ, తేజాకి మాత్రం అతను చూసింది ఎవరినో నేను చెప్పలేదు.  తన సీక్రెట్ ఎవరికీ చెప్పడానికి వీల్లేదని శేషగిరీ వార్నింగ్ ఇచ్చాడు. తేజా ఆ రోజే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. 

The End
© Dantuluri Kishore Varma 

Thursday, 12 September 2013

హాంటెడ్ స్ట్రీట్! దెయ్యాలకథ Part I

దెయ్యాలు ఉన్నాయా!?

ఉన్నాయో, లేదో చెప్పాడానికి ముందు, మీకొక రెండు కథలు చెప్పాలి - ఇద్దరు చెప్పిన కథలు. కథలు అంటే కథలు కాదు. వాళ్ళు కళ్ళారా చూసిన నిజాలు. 

ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ? నా పేరు షణ్ముగం. నా చిన్నప్పుడే తమిళనాడునుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాం. మా నాన్నకి బేకరీ ఉండేది. మూతబడిపోయింది. ఎందుకంటే - ప్రతీ వ్యాపారంలోలాగే పోటీ. రొట్టెలు చెయ్యడంలో, కౌంటర్లో కూర్చొని డబ్బులు లెక్కబెట్టడంలో మా నాన్నకి సహాయంచేస్తూ గడిపేశాను. బడికి వెళ్ళడానికి అవకాశం దొరకలేదు. మా బేకరీ మూతబడడంతో, ఉద్యోగం వెతుక్కోవలసిన అవసరం పడింది. కానీ, పొట్టకోస్తే అక్షరం ముక్కరాని నాలాంటి వాడికి ఎవరు పనిస్తారు? 

రియల్ ఎస్టేట్ వ్యాపారం నా దృష్టిని ఆకర్షించింది. మధ్యవర్తిగా ఉండి సైట్లు అమ్మిపెడితే కమీషన్ వస్తుంది. కానీ, దీనిలో ఉన్న చిక్కేమిటంటే చాలాకాలానికి గానీ ఒకసైటు  అమ్మలేం. అందుకే దీనికి అనుబంధంగా అద్దెఇళ్ళ బ్రోకర్‌గా కూడా ఉండడం మొదలు పెట్టాను. ఇళ్ళ యజమాని దగ్గరనుంచీ, అద్దెకి వచ్చేవాళ్ళ దగ్గరనుంఛీ ఒక్కోనెల అద్దెని కమీషన్‌గా లాగొచ్చు - చాలా లాభసాటి వ్యవహారం. ఏమైనా లొసుగులున్న ఇళ్ళు అద్దెకు ఇప్పిస్తే ఓనర్నుంచి రెండు, మూడు నెలల అద్దె కమీషన్‌గా వస్తుంది. అలాంటీ డీల్ ఒక్కటి చేస్తే చాలు, జేబులు నిండిపోతాయి.  
ప్రమీలానగర్ మూడవ వీధిలో నాలుగంటే నాలుగే ఇళ్ళు ఉంటాయి. మెయిన్‌రోడ్‌నుంచి ప్రమీలానగర్లోనికి తిరిగి రెండువందలమీటర్లు ముందుకు వెళితే రోడ్డు చివరికి వస్తాం. అక్కడినుంచి ఎడమవైపుకి మలుపుతిరిగితే మూడవవీధి. జనాలుపెద్దగా తిరిగే వీధికాదు. నేను చెప్పిన ఇళ్ళు ఇక్కడే ఉన్నాయి. వాటికి ఎదురుగా పోరంబోకు స్థలం ఉంటుంది. దానికి చేర్చి కెమికల్ ఫేక్టరీగోడ. తలుపులూ, ద్వారబందాలు తీసేసిన కప్పులేని పాడుపడిన ఇల్లు మొదటిది. దానితరువాత స్టీలు బార్జీల వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించిన కుమారస్వామి మేడ. ముగ్గురికొడుకులకి పెద్ద పెద్ద బంగళాలు కట్టి ఇచ్చేసి, కూతురి కోసం ఈ ఇల్లు కట్టాడు. మేనల్లుడికి ఇచ్చిపెళ్ళిచేసి అందులో కాపరానికి ఉంచాడు. దురదృష్టవశాత్తూ పెళ్ళయిన సంవత్సరంలోనే కుమారస్వామి కూతురూ, అల్లుడూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆతరువాత ఆ ఇల్లు ఖాళీగా ఉండిపోయింది. మీకుతెలియంది ఏముంది? ఇలాంటి ఇళ్ళగురించి చాలా కథలు వింటుంటాం కదా? కానీ నేను అలాంటివి పట్టించుకొనే రకంకాదు. పైపెచ్చు, దీనిని అద్దెకు ఇప్పిస్తే పెద్ద ఎత్తున కమీషన్ ముడుతుంది నాకు.  కుమారస్వామి ఇంటి ప్రక్కన బ్యాంకులో పనిచేసే సాంబయ్యగారి రెండుపోర్షన్ల ఇల్లు. ఒకపోర్షన్లో ఓర్ అండ్ మాస్ట్  షిప్పింగ్ కంపెనీవాళ్ళ ఆఫీసు ఉంటుంది. ఇంకొకభాగం ఈమధ్యనే ఖాళీ అయ్యింది.  
ఆ రోజు పొద్దున్న అద్దెఇళ్ళ కోసం నాకు రెండు కాల్స్ వచ్చాయి. చేసినవాళ్ళలో ఒకడు శేషగిరి, రెండవవాడు తేజ. ప్రమీలా వీధిలో ఉన్న రెండు ఖాళీ ఇళ్ళనీ వాళ్ళిద్దరికీ ఇప్పించాను. కొన్నిరోజులతరువాత వాళ్ళిద్దరూ విడివిడిగా నాకు చెప్పిన కథలు, వాళ్ళమాటల్లోనే మీకు తిరిగి చెపుతాను.

తరువాతి భాగం లింకు ఈ క్రింద ఉంది చూడండి:

Monday, 15 July 2013

యుద్దం

"ఇంటర్‌స్కూల్ వ్యాసరచన పోటీలు జరగబోతున్నాయి. మన పాఠశాల నుంచి తరగతికి ఒకరిని చొప్పున ఎంపికచేసి పంపించవలసిందని వర్తమానం వచ్చింది. ఈ క్లాసునుంచి సుధీర్ని పంపుతున్నాం," అని క్లాస్ టీచర్ విద్యార్థులకి చెప్పారు. 

"నేను వెళతాను సార్," అన్నాడు చందూ.

"కానీ, నీకు వ్యాసరచనలో అనుభవంలేదు. డ్రాయింగ్ పోటీలు నిర్వహించినప్పుడు నిన్ను పంపిస్తాం," అన్నారు టీచర్.

"పోటీలకు పంపినప్పుడే కదా సార్ అనుభవం వచ్చేది," అన్నాడు.

"మనకి కంపోజిషన్ క్లాసులు జరుగుతున్నాయి. వాటిలో నువ్వు ఆసక్తితో నేర్చుకో. రాయడంలో మెళుకువలు అలవాటు అయ్యాయని అనిపించినప్పుడు నిన్ను తప్పనిసరిగా ఎంపిక చేస్తాను. అప్పటివరకూ నువ్వు ఏమిచెప్పినా  యుద్దం చెయ్యగలనని గొప్పలు చెప్పిన రంగన్నలా అవుతుంది నీ పరిస్థితి."

"వాడు ఎవరో చెప్పండి సర్," అన్నారు పిల్లలందరూ ముక్తకంఠంతో.  

అప్పుడు పంచతంత్రం నుంచి టీచర్ ఈ కథ చెప్పారు.
ఒక ఊరిలో రంగన్న అనే కుండలుచేసేవాడు ఉన్నాడు. ఒకరోజు సాయంత్రం వరకూ కుండలు చేసి, వాటిని బజారులో అమ్ముకొని, ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో కల్లు దుకాణం దగ్గర పీకలవరకూ తాగాడు.  ఇంటికివెళ్ళడంతోనే పెరటిలో ఆరబెట్టిన కుండల్ని తన్నుకొని పడిపోవడంతో, అవన్నీ పగిలిపోయీ, వాడి వళ్ళంతా గుచ్చుకొని గాయాలయ్యాయి. ఒక పెంకు నుదుటిమీద పెద్ద గాయం చేసింది.    

చిన్నగాయాలన్నీ మానిపోయినా, నుదుటిపైది మాత్రం చాలా కాలం అలాగే ఉండిపోయింది. క్రమంగా  అదికూడా నయమయినా, పెద్దమచ్చ మిగిల్చి వెళ్ళింది.  

కొంతకాలానికి ఆ రాజ్యంలో భయంకరమైన కరువు రావడంతో, ప్రజలందరూ పొరుగున ఉన్న ఇతర రాజ్యాలకి వలస పోతారు. రంగన్న కూడా ఒకరాజ్యానికి వెళతాడు. అదృష్ఠవశాత్తూ, వాడికి రాజుగారి ఆస్థానంలో కొలువు దొరుకుతుంది. వాడి బలమైన భుజాలూ, నుదుటిమీద పెద్ద మచ్చా చూసిన రాజుగారికి వాడు బహుశా పొరుగు దేశంలో గొప్ప యోదుడై ఉండవచ్చునని అనిపిస్తుంది. వాడు కూడా అంతకు పూర్వం `ఆయుద్దంలో, ఈ యుద్దంలో పాల్గొన్నా` నని నోటికొచ్చిన ప్రగల్బాలన్ని పలికి గొప్ప ప్రాముఖ్యత సంపాదించుకొన్నాడు. 

రోజులు హాయిగా గడచిపోతున్నాయి. రాజుగారు రంగన్నని ఎంతో అభిమానంతో చూసుకొంటున్నారు. అంతలో హఠాత్తుగా ఆ రాజ్యమ్మీద శత్రుసేనలు దండెత్తి వచ్చాయి. ఈ ఆపదను ఎదుర్కోవడానికి, యుద్ద ప్రణాళికలను రచించుకోవడానికి మంత్రులను, సైనికాధికారులను, యోధులను సమావేశపరిచారు. వాళ్ళతో పాటు రంగన్నకి కూడా కబురు వెళ్ళింది. ముఖ్యమైన వీరులందరికీ వివిధ బాధ్యతలను అప్పగించిన తరువాత, రాజుగారు ప్రత్యేకంగా రంగన్నని కూడా ఒక దళానికి నాయకత్వం వహించి యుద్దభూమిలోనికి వెళ్ళ వలసిందిగా ఆదేశించారు. 

రాజుగారి మాటకు ఎదురు చెపితే తలతెగుతుంది, నిజం బయటపెడితే పరువు పోతుంది. రంగన్న పరిస్థితి ముందు నుయ్యి, వెనుకగొయ్యిలా తయారయ్యింది. ఏదయితే అయ్యిందని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ సేనలతో పాటూ యుద్దరంగంలోనికి ఉరికాడు.

ఇంకేముందీ..........

అక్కడ కనిపించిన భీకరమైన వాతావరణం, నెత్తురూ చూసి ఠపీ మని కళ్ళుతిరిగి పడ్డాడు. 

యుద్దంచెయ్యాలంటే ముందు శిక్షణ తీసుకోవాలికదా? జీవితంలో ప్రతీపోటీ యుద్దంలాంటిదే. తగిన అనుభవం లేకుండా అత్యుత్సాహంతో ముందుకు పోతే, మొదలుపెట్టకుండానే పరాభవం ఎదురవుతుంది. 

ప్రతీ క్షణాన్ని, అవకాశాన్నీ సద్వినియోగం చేసుకొంటూ, నైపుణ్యాలను మెరుగు పరచుకొనేవాడే విజేత అవగలడు.

© Dantuluri Kishore Varma

Monday, 1 July 2013

చీమ!

కొత్త కోలనీ దగ్గర కిరాణా షాపు తెరిచాడు సూరిబాబు. కోలనీ టౌనుకి చాలా దూరం. ప్రతీ వస్తువుకోసం టౌనుకి పోలేక రూపాయెక్కువైనా  సూరిబాబు కొట్టుకే వచ్చేవారు జనాలు. చూస్తుండగానే నిమషం కూడా ఖాళీ లేనంతగా అమ్మకాలు పెరిగాయి.

రోజులెప్పుడూ ఒక్కలాగ ఉండవు...

కిరాణా కొట్టుమీద కోట్లు గడించిన సూరిబాబు వాళ్ళ చినబాబాయి ఓ రోజు వచ్చాడు. గళ్ళాపెట్టిదగ్గర కూర్చుని నూనిమరకలు అంటుకొన్న అట్టముక్కతో గాలి విసురుకొంటున్న సూరిబాబుని, వాడి మాసిపోయిన గెడ్డాన్ని చూడగానే విషయం అర్ధమైపోయింది.

ఏమిటన్నాడు. 

కాంపిటీషను - నాలుగిళ్ళవతల వేరే కొట్టు పెట్టేడు ఎవడో. అప్పటినుంచీ జనాలు ఇక్కడ మానేసి అక్కడకి ఎగబడతన్నారు. అవతలి కొట్టువాడేదో జనాకర్షణ యంత్రం చేయించి కొట్టులో పెట్టేడట.

ఎదుటివాళ్ళ మనస్తత్వాన్నీ, లోపాల్నీ, బలహీనతల్నీ అరక్షణంలో అంచనా వెయ్యగలడు చినబాబాయి. జనాల్ని తిరిగి ఆకర్షించుకొనే పని చెయ్యకుండా వాస్తూ, యంత్రం లాంటి కారణాలు వెతుక్కొని కాలాన్ని వృదాచేస్తున్నాడు సూరిబాబు. ఏదయినా మనసుకి హత్తుకొనేలాగ చెప్పి వాడి ఆలోచనా విధానం మార్చాలి.

ఇలా మొదలు పెట్టాడు-

`రాజుగారి ఏడుగురి కొడుకులు ఏడుచేపల్ని తెచ్చీ, వాటిని ఎండబెట్టేవరకూ పని సవ్యంగా జరిగింది. ఒక చేప ఎండకపోవడం సమస్య. దానిని ఎండ సరిగా తగిలేచోటపెట్టడం మానేసి గడ్డిమోపునీ, పాలికాపునీ, వాడి తమ్ముడ్నీ ప్రశ్నలు అడుగుతూ పోయారు. ఎండని చేపని కుళ్ళబెట్టారు. నీ పనీ అలాగే అవుతుందిప్పుడు` అన్నాడు.

`నేనేమి చెయ్యాలి?` అన్నాడు సూరిబాబు.

`కథలో చీమ ఏమిచేసిందో అదే చెయ్యాలి. పుట్టలో కుర్రోడు వేలుపెట్టాడని - స్కూలుకి వెళ్ళకుండా నువ్విక్కడ ఏమిచేస్తున్నావు? వేలుఎందుకు పెట్టావు? అని కాలయాపన చెయ్యకుండా వాడిని కుట్టి సమస్య పరిష్కరించుకొంది.`

`అంటే మనుషుల్ని పెట్టి పక్క షాపోడ్ని వేయించేనా?` అన్నాడు.

`ఏడిశావులే, నోరుముయ్యి! మర్డర్లు చేయించడం మన బిజినెస్సు కాదు. వ్యాపారం మళ్ళీ పెంఛడానికి చూడు. రేటు తగ్గించు, సరుకు నాణ్యత పెంచు. నాలుగు రోజులు ఓపిక పడితే జనాలు విషయం తెలిసి మళ్ళీ తిరిగి వస్తారు. రోజంతా కూర్చొని నాలుగు వస్తువులు అమ్మి పాతిక రూపాయలు లాభం చేసుకోవడం కాదు. వంద సరుకులు అమ్మి రెండువందలు గడించు. అదే  వ్యాపారం.

ఇది నీ కొట్టుకే కాదు, ఏ పనికైనా వర్తిస్తుంది. కారణాలు వెతుకుతూ, మన అపజయాలకి ఎవరిమీదో నెపం వేస్తూ పోయినంతకాలం ఎక్కడవాళ్ళం అక్కడే ఉంటాం. మంచి ప్రణాళికతో మన పని మనం చేస్తూ పోతే విజయం దానంతట అదే వస్తుంది.`
© Dantuluri Kishore Varma 

Wednesday, 19 June 2013

వీ కాంట్ హెల్ప్!

`బీచ్ ఫెస్టివల్‌లో బొమ్మల ముసుగులు తొడుక్కొని జనాలమధ్య తిరగాలి. పొద్దున్నే ఎనిమిది గంటలనుంచి రాత్రి పదిగంటల వరకూ. రోజుకి  ఆరొందలు ఇచ్చి భోజనాలు, టిఫిన్లు పెడతారు. మూడు రోజులు పని ఉంటుంది. ఎవరయినా వస్తారా?` లేబర్ కాంట్రాక్టరు నాలుగురోడ్ల జంక్షన్లో పోగయిన డైలీ లేబరుతో అంటున్నాడు.

అప్పుడప్పుడే వెలుగు వస్తుంది. మునిసిపల్ వర్కర్లు పొడుగు చీపుర్లతో రోడ్లు ఊడుస్తున్నారు. పూరీలు, పుల్లట్లు, మైసూరు బోండాలు, ఇడ్లీలు అమ్మే రోడ్డు ప్రక్క బండినుంచి కమ్మని వాసనలు అన్ని వైపులకీ పోతున్నాయి. ఇద్దరు, ముగ్గురు రిక్షావాళ్ళు గాజుగ్లాసుల్లో పొగలుకక్కుతున్న టీని ఊదుకొంటూ తాగుతున్నారు. 

షాపింగ్ కాంప్లెక్స్ మూసిఉన్న షట్టర్లముందు ముణగదీసుకొని పడుకొని వున్న సురేషుకి అప్పుడే మెలుకువవచ్చింది. ముందురోజంతా ఏమీ తినలేదేమో కడుపులో నకనకలాడుతుంది. టిఫిను బండి దగ్గరనుంచి వస్తున్న నోరూరించే వాసన సహనాన్ని పరీక్షిస్తున్నట్టు వుంది. సరిగ్గా అప్పుడే లేబరు కాంట్రాక్టరు మాటలు అతని చెవిలో పడ్డాయి. ఒక్క ఉదుటున లేచి, మెట్లు దిగి వెళ్ళి, `నేను వస్తాను,` అన్నాడు.   ఆకలి తీరడం, అజ్ఞాతవాసం - ఒకే దెబ్బకి రెండు పిట్టలు లాగ మంచి అవకాశం వెతుక్కొంటూ వచ్చింది.  బోనస్‌గా డబ్బు కూడా వస్తుంది. బహుశా పోలీసులు ఇప్పటికే తనకోసం వెతుకుతూ ఉండిఉంటారు. సంఘటన జరిగిన వెంటనే సరాసరి పారిపోయి వచ్చేశాడు. జేబులో నయాపైసా లేదు. సెల్‌ఫోన్ కావాలనే ఆఫీసులో వదిలిపెట్టేశాడు.
*  *  *
బైకుల్లో, కారుల్లో, ఆటోల్లో వచ్చిన ప్రజలు వాకలపూడి లైట్ హౌస్‌కు దగ్గరలో వాహనాలని పార్క్ చేసుకొని ఫెస్టివల్ దగ్గరకి నడచి వెళుతున్నారు. స్వాగత ద్వారం దాటిన వెంటనే ఇరువైపులా కలర్‌ఫుల్‌ నర్సరీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. అన్నవరం సత్యదేవుని నమూనా దేవాలయం, దానికి సమీపంలోనే జిల్లాలోని ప్రముఖ దేవాలయాల స్టాల్ ఏర్పాటుచేసి ప్రసాదాలు అమ్ముతున్నారు. ఉత్తరంవైపు పెద్ద సభాస్థలిని నిర్మించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.సంబరాలు జరుగుతున్న బీచ్ ఏరియా అంతా విద్యుత్ లైట్లు ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఇసుకలో సైకత శిల్పాలు చేశారు. ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి. చాట్, బిర్యానీ, బొంగులో చికెన్, స్వగృహా ఫుడ్స్ మొదలన స్టాల్స్ ధక్షిణం వైపు వరుసగా ఏర్పాటు చేశారు. గంగిరెద్దులవాళ్ళు,  జానపద కళాకారులు, రకరకాల వేషదారులు కార్టూన్‌మనుషుల్లాగ బీచ్ ప్రాంతం అంతా తిరుగుతూ సందడి చేస్తున్నారు. వాళ్ళల్లో హాలీవుడ్ హాస్యజంట లారెల్ అండ్ హార్డీలలో, బొద్దుగా ఉండే హార్డీ లాంటి వేషధారణలో సురేష్ కూడా ఉన్నాడు.
* * *
పార్కింగ్ ప్లేస్‌లో ఇన్నోవా ఆగింది. ఈజీ చిట్స్ అధినేత కుమారస్వామి కుతుంభసమేతంగా దిగి ఫెస్టివల్ ప్రాంతానికి చేరుకొన్నాడు. ఫ్లడ్ లైట్ల కాంతిలో ఆ ప్రదేశమంతా చాలా సందడిగా ఉంది. ఒక్కొక్క స్టాలూ చూసుకొంటూ, తెలిసినవాళ్ళు కనిపించినప్పుడు హుందాగా విష్ చేస్తూ ముందుకు వెళూతున్నారు. కాయగూరలని అందంగా చెక్కి ప్రదర్శించిన ముకిమోనో అనే కళాకృతుల స్టాల్ ముందు నిలబడిపోయారు.

`హల్లో, కుమారస్వామీ! ఎలా ఉన్నావ్?` అనే పలకరింపుకి, వెనక్కి తిరిగి, అలా పిలిచిన పెద్దమనిషికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వాళ్ళిద్దరూ మాటల్లో పడ్డారు 

`ఈ మధ్య ఎదో ఎమౌంట్ గల్లంతయ్యిందటకదా? మీ క్యాషియర్ కొట్టేశాడంటున్నారు, నిజమేనా?` అన్నాడు ఆ పెద్దమనిషి. 

కార్టూన్‌కేరెక్టర్ల వేషాలు వేసుకొని, ఆ ప్రాంతం అంతా సందడి చేస్తున్న వాళ్ళతో ఫోటోలు దిగుతున్నారు కుమారస్వామి కూతుళ్ళు. వాళ్ళ వెనుక కదలకుండా శిల్పంలా నిలబడిపోయిన హార్డీని ఎవరూ పట్టించుకోలేదు.   

`లెడ్జర్‌లో ఒక లక్ష రూపాయలు తేడా వచ్చింది. మా క్యాషియర్ సురేషు తీసిఉంటాడని, పోలీసు కేసు పెడతామని బెదిరించేసరికి. ఆఫీసు నుంచే ఎక్కడికో పారిపోయాడు. వాడి పెళ్ళాం తొమ్మిది నెలల ప్రెగ్నెంట్ అని కూడా చూడలేదు పిరికి సన్నాసి. ఆ పిచ్చిది వీడు ఎక్కడికి పోయాడో తెలియక మూడురోజులుగా ఒకే దారగా ఏడుస్తుంది,` అన్నాడు కుమారస్వామి. 

వెనుకనుంచి వింటున్న హార్డీకి మనసులో కలుక్కుమంది. నవ్వుతున్న ముసుగు ముఖం వెనుక కన్నీళ్ళు చెంపలని తడిపేస్తున్నాయి. 

`మరి లక్షరూపాయలు పోయినట్టేనా?`

`అసలు పోలేదండి. కౌంటర్ ఎంట్రీ ఒకటి పొరపాటున మిస్అయ్యి, తేడా కనిపించింది. ఆ విషయం ఇన్‌టర్నల్ ఆడిట్లో తెలిసింది`.

`పాపం మీ క్యాషియర్ని బాగా భయపెట్టినట్టున్నారు`.

`పూర్ ఫెలో! వీ కాంట్ హెల్ప్. తిరిగి వస్తే ఉద్యోగంలోకి తీసుకొంటాం. లేకపోతే వాడి కర్మా, వాడి పెళ్ళాం దౌర్భాగ్యం` అన్నాడు కుమారస్వామి. ఇద్దరూ గొల్లుమని నవ్వుకున్నారు.

కుమారస్వామి ముఖం మీద నవ్వు విశాలంగా పరచుకొని ఉండగానే ఒక బలమైన తాపు అతని వీపుమీద పడింది. ఎగిరి వెళ్ళి సొరకాయలతో చేసిన హంసల బొమ్మలమీద పడ్డాడు. కాయగూరలు ముక్కలుగా విరిగిపోయి చెల్లా చెదురు అయ్యాయి. ఈ హఠాత్ సంఘటనకి అందరూ నిశ్చేష్ఠులైయ్యారు. కుమారస్వామిని ఎవరు తన్నారో తెలియలేదు. అతన్ని లేవదీసి, వెనక్కి తిరిగిచూస్తే, అటూఇటూ పోతున్న జనాలూ, డ్యాన్స్ చేస్తూ వాళ్ళకి చేతులు ఊపుతున్న కార్టూన్ మనుషులూ తప్పించి ఇంకేమీ కనిపించలేదు.
© Dantuluri Kishore Varma 

Thursday, 13 June 2013

మెసేజ్ ఫ్రం వెంకటేష్

ఒకటవ నెంబర్ ప్లాట్‌ఫాం మీద ట్రెయిన్ బయలుదేరడానికి సిద్దంగా ఉంది. 

"మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ షాపులో గజ్జలని దొంగతనం చేసిన వాడిని నిన్నే చూశానురా," అన్నాడు ట్రెయిన్లో కూర్చున్న నందకుమార్. 

నందకుమార్‌కి సెండాఫ్ ఇవ్వడానికి వచ్చిన వెంకటేష్ కిటికీకి ప్రక్కన ప్లాట్‌ఫాం మీద నుంచొని ఉన్నాడు. స్నేహితుడి మాటలకి ఇబ్బందిగా నవ్వాడు.

ఇరవై సంవత్సరాలక్రితం విడిపోయిన వాళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకోవడం ఆ రోజే! అదికూడా కావాలని కాదు. నాటకీయంగా జరిగింది.  ఆఫీస్ పనిమీద కాకినాడ వచ్చిన నందకుమార్, జగన్నాధపురం వంతెన డౌన్‌లో యానం బస్టాండుకి ఎదురుగా ఉన్న కోకిలా రెస్టారెంటులో చపాతీ తిని బయటకి వస్తుండగా, పక్కనే ఉన్న వాద్యపరికరాలమ్మే  షాపులోనుంచి గలాటా వినిపిస్తుంటే అటు తొంగి చూశాడు.

చక్కగా డ్రెస్ చేసుకొని, మర్యాదస్తుడిలా ఉన్న ఒక వ్యక్తిని షాపువాళ్ళు కొట్టబోతున్నారు. ఆ వ్యక్తిని ఎక్కడో చూసినట్టు ఉంది. మొహమాటపడుతున్నట్టు ఇబ్బందిగా నవ్వే నవ్వు - అవును అదే - చప్పున గుర్తుకువచ్చింది - డిగ్రీ క్లాస్‌మేట్ వెంకటేష్‌గాడు! ఒక్క పరుగున వెళ్ళి పడబోతున్న దెబ్బల్ని ఆపుచేశాడు. షాపువాళ్ళకి నచ్చజెప్పి, స్నేహితుడిని బయటకి తీసుకువచ్చిన తరువాత అతనికి ఉన్న సైకలాజికల్ డిజార్డర్ గురించి తెలిసింది. 

అన్నీ ఇచ్చినా దేవుడు ఎందుకో మనుష్యులకి కొన్ని అవకరాలు కూడా ఇస్తాడు. ఏదయినా వస్తువు కంటికి ఇంపుగా కనిపిస్తే చాలు స్వంతం చేసుకోవాలనిపిస్తుంది. అది వెంకటేష్ బలహీనత. 
"అవసరంలేకపోయినా దొంగతనం చెయ్యాలనిపించే క్లెప్టోమేనియా గురించి నిన్ను చూశాకే తెలిసింది. దిగులు పడకు, మంచి సైకియాటిస్ట్‌ని కలిస్తే నీ సమస్య పరిష్కారం అవుతుంది. నేను హైదరాబాద్ వెళ్ళాక అక్కడ వివరాలు తెలుసుకొని నీకు ఫోన్ చేస్తాను," అన్నాడు నందకుమార్.  

ఆకుపచ్చ సిగ్నల్ పడింది. ట్రెయిన్ మెల్లగా కదిలింది. ఇబ్బందికరమైన సన్నివేశంలో ఉండగా స్నేహితుడి కంటిలో   పడినా; నందకుమార్ విషయాన్ని అర్థంచేసుకొని సానుభూతిగా ప్రతిస్పందించడంతో అతడి పట్ల కృతజ్ఞతతో కంటిమీద నీటిపొర కమ్ముకొంటుంది. వీడ్కోలుగా చెయ్యి ఊపాడు. క్రమంగా ట్రెయిన్ కనుమరుగయ్యింది. 

నందకుమార్‌కి కనీసం థాంక్స్ కూడా చెప్పలేదన్న విషయం అప్పుడు గుర్తుకు వచ్చింది. జేబులోనుంచి సెల్‌ఫోన్ తీసి `థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్` అని టైప్ చేసి, అంతకుముందే సేవ్ చేసుకొన్న స్నేహితుడి నెంబరుకి పంపాడు.  

`టింగ్ టింగ్` మని చప్పుడు వచ్చింది. వెంకటేష్ చెయ్యి అసంకల్పితంగా ట్రౌజర్ రెండవ జేబులోకి వెళ్ళి ఒక స్మార్ట్ ఫోన్‌ని బయటకి తీసింది. దానితెరమీద `మెసేజ్ ఫ్రం వెంకటేష్` అనే అక్షరాలు మెరుస్తున్నాయి. ఓపెన్ చేస్తే `థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్` అనే మెసేజ్ కనిపించింది.

© Dantuluri Kishore Varma 

Saturday, 11 May 2013

బెల్లం సున్నుండలు

కిటికీలోంచి ఉండుండి ఒక్కో పిల్లతెమ్మెర వస్తుంది. ఏదీకాని చోటులో ట్రెయిన్ ఆగిపోకుండా వెళుతూ ఉండుంటే బాగుండేది. బండి ఎందుకాగిందో, మళ్ళీ ఎప్పుడు కదులుతుందో తెలియదు. కౌశిక్ ఊచల్లోనుంచి ఆకాశంలోకి చూసున్నాడు. చందమామ అమ్మచేతిలోనుంచి జారి నేలమీద పడిన సున్నుండలా ఉంది. మరొకసారి ఎప్పుడయినా అయితే ఇంకోపోలిక ఏదో తోచివుండేది.
*     *     * 
ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి అమ్మదగ్గరకి వెళ్ళాడు. మద్యహ్నం సీరియస్‌గా చర్చ జరుగుతుంటే, `బెల్లం సున్నుండలు నీకు ఇష్టమని చేశాను. తిను` అంది. 

`అక్కర్లెద్దు!`అంటూ కోపంగా చెయ్యివిసిరాడు. ప్లేటుజారి నేలమీద పడింది. సున్నుండలు చెల్లాచెదురుగా నేల మీద దొర్లిపోయాయి. 

`సున్నండలు, అరిసలు, బొబ్బట్లు వీటికి మాత్రం లోటులేదు. నీకోడలు అడిగింది ఏమిటే అమ్మా? ఒక చిన్న బూటీక్ ప్రారంభించుకోడానికి నీ బంగారు గాజులో, గొలుసో ఇమ్మనే కదా? ఏం నీతో పాటూ తీసుకొని పోతావా?` అన్నాడు.  

`నీకు లక్షసార్లు చెప్పాను. నా వంటిమీద మిగిలినవి అవే ఇంక. అన్నీ నీకే దోచిపెడితే, తమ్ముడు ఏమయిపోవాలి? నాకు తోచినప్పుడు వాడిపిల్లలకీ, నీ పిల్లలకీ సమానంగా ఏవో వస్తువులు చేయించి పెడతాను. అంతవరకూ ఎవరు అరిచి గీపెట్టినా చిల్లిగవ్వ ఇచ్చేది లేదు,` అంది అంతే విసురుగా. 

`సమానం, సమానం, సమానం...` ఒళ్ళుమండిపోతుంది. అమ్మమీద కోపంతో ఏమీ తినకుండా తిరిగి బయలుదేరిపోయాడు. వచ్చేటప్పుడు నేలపాలు కాగా మిగిలిన రెండో, మూడో ఉండలు పొట్లం కట్టి బలవంతంగా బ్యాగ్‌లో పెట్టింది. కడుపులో నకనకలాడుతుంది. బ్యాగ్ జిప్ తీసి పొట్లం బయటకి తీసాడు.  రెండువుండలు ఉన్నాయి. నానమ్మ చేసిన స్వీట్లంటే కౌశిక్ పిల్లలు ఇద్దరికీ చాలా ఇష్టం. ఇంటికి వెళ్ళగానే `మాకేమిచ్చింది?` అని మీదపడతారు. రెండింటిలో ఒకటి తినేస్తే మిగిలిన ఒక్కటీ వాళ్ళకేమి  పంచుతాడు సమానంగా! సమానంగా, సమానంగా....

వాటిని మళ్ళీ లోపల పెట్టేసి, మినరల్ వాటర్ బాటిల్లో మిగిలిన నాలుగు చుక్కల నీళ్ళూ గొంతులో పోసుకొని కళ్ళు మూసుకొన్నాడు. ట్రెయిన్ కదిలింది.

సెల్‌ఫోన్ తీసి డయల్ చేశాడు. సగం రాత్రి అయ్యిందేమో! అయినా పరవాలేదు. అవతలినుంచి `హలో` అని వినిపించిన వెంటనే,`అమ్మా, భోజనం చేశావా?` అన్నాడు.
*     *     *  
అందరికీ హ్యాపీ మదర్స్ డే!
© Dantuluri Kishore Varma

Wednesday, 8 May 2013

నాకు ఎందుకు అలా కనిపించడం లేదు!

ఒక వృద్దుడు - అరవై ఏళ్ళు ఉంటాయి-  రోడ్డు వారగా నడచి వెళుతున్నాడు. చేతిలో వాకింగ్ స్టిక్ ఉంది. మోటార్‌బైక్ ఒకటి అతనిని వొరుసుకొంటూ వేగంగా ముందుకు వెళ్ళింది. బైక్ నడుపుతున్న పాతికేళ్ళ కుర్రాడు వెనక్కితిరిగి పళ్ళన్నీ కనిపించేలా నవ్వాడు. `ముసలోడా..వాకింగ్ పార్క్‌లో చేసుకోవచ్చుకదా?` అన్నాడు. రోడ్డు వెంబడి కనిపించిన జనాలనందరినీ ఏదో ఒకటి అని ఆనందం పొందడం వాడికి అలవాటులా ఉంది. ఎదురుగా ఉన్న నాలుగు రోడ్ల కూడలినీ, అడ్డంగా రోడ్డు దాటుకొంటూ వెళుతున్న మామిడిపళ్ళతో ఉన్న తోపుడు బండినీ చూసుకోలేదు. ఒక్క క్షణంలో బైక్ ఆ బండిని గుద్దుకోవడం, బైక్ నడుపుతున్న కుర్రాడు ఎగిరి నేలమీద పడడం జరిగిపోయాయి. వాకింగ్ స్టిక్ తో నడుస్తున్న వృద్దుడు నాలుగు అంగల్లో అక్కడికి చేరుకొని కుర్రాడు పైకి లేవడానికి చెయ్యి అందించాడు. 
కొట్టుకుపోయి మండుతున్న మోచేతులూ, మోకాళ్ళను తడుముకొంటూ ఆ కుర్రాడు అడిగాడు, `వెటకారం చేసిన నేనంటే కోపం లేదా?` అని. 

పెద్దాయన అన్నాడు, `నా కొడుకు నీలానే తప్పుచేసి, తరువాత వాడికి ఇలా జరిగితే చూస్తూ ఊరుకోగలనా? నీ వయసు కుర్రాళ్ళలో నా కొడుకే కనిపిస్తాడు.`

`మీవయసు పెద్దవాళ్ళలో నాకు నా తండ్రి ఎందుకు కనిపించడం లేదు! నేను మారాలి` అనుకొన్నాడు ఆ కుర్రాడు.

© Dantuluri Kishore Varma 

Tuesday, 30 April 2013

అదే నవ్వు!

సందుమొదటిలో షేర్ ఆటో ఆగింది. కుమార్ దిగేడు. ఎండ సిమ్మెంట్‌రోడ్డుమీదపడి క్రిందనుంచికూడా వేడి వచ్చేస్తుంది. అక్కడికి ఇరవైమీటర్లదూరంలో ఆ వీధి అంతటికీ ఒకే ఒక గానుగచెట్టు, దానికి ఆనుకొని కుమార్ ఇల్లు. గానుగచెట్టు ఎడారిలో ఒయాసిస్సులా ఉంది.  దానినీడ విశాలంగా పరచుకొని ఉంది. చెట్టుమీద పక్షులు కునుకుతీస్తున్నట్టు చప్పుడు చెయ్యకుండా కూర్చున్నాయి. ఒకే ఒక కాకి మాత్రం అరుస్తుంది. ఓ కొబ్బరికాయల సైకిల్ చెట్టు మొదలుకి జారవేసి ఉంది. చెట్టుక్రింద నీడపట్టున నలుగురైదుగురు చేరారు. కుమార్ ఇంటి గేటునుంచి రోడ్డుకి కలిసే ఏటవాలు చప్టా పూర్తిగా నీడలో ఉండడంతో ఓ ముసలోడు తలక్రింద తుండుగుడ్డ పెట్టుకొని పడుకొని ఉన్నాడు. ప్రతిమధ్యాహ్నం వాడు అక్కడే సేదతీరుతుంటాడు.

కుమార్ ఆటో దిగడం చూసిన కొబ్బరికాయల సైకిలు వాడు ఒక్క ఉదుటున లేచాడు. `ఒరేయ్,ఓనర్రా!. చెట్టునీడేమయినా ఈడి తాతగారి సొత్తా? సైకిలు ఇక్కడ పెడితే, రోజుకి రెండు బొండాలు ఇయ్యాలట. ఈడెంకమ్మా...` అంటూ సైకిల్ తీసాడు, `....ఆడేం తిట్టినా నీకు చీమకుట్టినట్టుండదురా ముసలి నాయాలా. నువ్వు ఇక్కడే పడేడు. నేంపోతున్నా,` అనేసి - ముచ్చిక గిల్లి అంటించిన సిసింద్రీలా సర్ర్..మని అక్కడినుంచి పారిపోయాడు. మిగిలిన వాళ్ళు కూడా దాగుడు మూతలాటలో కుర్రాళ్ళలా `ఎక్కడి దొంగలక్కడే గప్ చిప్,` అన్నట్టు మాయమైపోయారు. ముసలోడు మిగిలి పోయాడు.  

తనరాక కలిగించిన అలజడిని కుమార్ స్పష్టంగా చూశాడు. `ఆ మాత్రం భయం ఉండాలి,` అనుకొన్నాడు. సెల్ఫ్ ఇంపార్టెన్స్‌తో చాతీ పొంగింది. కానీ చొక్కా బొత్తాల్ని తెంపేసేలా తన్నుకు వస్తున బొజ్జ ముందు, పొంగిన చాతీ ఏమీ కనిపించలేదు. బ్యాగ్ బరువుకేమో ఎడమభుజం లాగుతుంటే దాన్ని కుడివైపుకి మార్చుకొని ఇంటివైపు పెద్ద పెద్ద అంగలతో నడిచాడు.  

ముసలోడు అటెన్‌షన్‌లోకి వచ్చేశాడు. తలక్రింద పెట్టుకొన్న తుండుగుడ్డ చంకలోకి వెళ్ళిపోయింది. గేటు మూలలోకి నక్కిపోయి కూర్చున్నాడు. 

`ఎన్నిసార్లు చెప్పినా బుద్దిరాదురా నీకు? ఎండదెబ్బకి నువ్వు గేటు ముందు చస్తే నాకు అదొక తలనెప్పి. పోరా ఇక్కడి నుంచి. మళ్ళీ కనిపించావంటే కాళ్ళు విరగ్గొడతాను,` అన్నాడు. ముసలోడు ఏమీ సమాదానం చెప్పలేదు. పళ్ళ చిగుళ్ళు  కనిపించేలా నవ్వాడంతే! సరిగ్గా ఆ సమయంలో కుమార్ బీ.పీ ఎవరైనా కొలవడానికి ప్రయత్నిస్తే - పైలెవెల్ బద్దల గొట్టుకొని పాదరసం ఫౌంటెన్లా చిమ్మేసి ఉండేది! ఉగ్రంగా పళ్ళుకొరుక్కొన్ని, విసురుగా గేటు తీశాడు. గుండెల్లో కలుక్కు మంది.  

ఆ సమయంలో ఇంటిలో ఎవరూ ఉండరు. కుమార్ పెళ్ళం అక్కడికి ఒక కిలో మీటరు దూరంలో ఉన్న మీ-సేవ ఆఫీసులో కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తుంది. పిల్లలు స్కూలు, స్టడీ అవర్లు పూర్తిచేసుకొని సాయంత్రం ఎప్పుడో ఇల్లు చేరతారు. గేటు మూసి, మెయిన్‌డోర్ తాళంతీసుకొని లోపలికి వెళ్ళి, తలుపు మూశాడు. నుదురు చెమటతో తడిసిపోయింది. నోరు పిడచ కట్టుకు పోతుంది. మంచినీళ్ళు తాగితే సుఖంగా ఉంటుందేమో! అడుగులో అడుగు వేసుకొంటూ ఫ్రిడ్జ్ వైపు నడిచాడు. డోర్ తీస్తుండగా ఉప్పెనలా గుండెల్లోకి నొప్పి తన్నుకు వచ్చింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. చెయ్యిజారి బాటిల్స్ నేలమీద పడి `బళ్ళు` మని బ్రద్దలయ్యాయి. కుమార్ కుప్ప కూలిపోయాడు.

*  *  *

ఇరవై రోజుల తరువాత ఆ ఇంటిముందు ఓ టాక్సీ ఆగింది. వెనుక డోర్‌లోంచి పెళ్ళాం సహాయంతో కుమార్ దిగేడు. లుంగీలో ఉన్నాడు. చేతికి సెలైన్లు ఎక్కించిన చోట ఇంకా ప్లాస్టర్లు అలాగే ఉన్నాయి. కొబ్బరికాయలు వాడు ఎక్కడికీ పారిపోలేదు,  నుంచుని చూస్తున్నాడు. ముసలోడు ఎప్పటిలాగే  కూర్చుని ఉన్నాడు. కుమార్ కారులోంచి దిగడం చూసి పళ్ళ చిగుళ్ళు కనిపించేలా నవ్వాడు. హార్టాపరేషన్ చేయించుకొని అప్పుడే హాస్పిటల్‌నుంచి డిస్చార్జ్ అయిఉన్నాడుకనుక సరిపోయింది కానీ, లేకపోతే వచ్చిన కోపానికి ముసలోడిని అక్కడే గొంతుపిసికి చంపేసును. తలుపుమూసేముందు కసిగా  `పోరా ముసలిపీనుగా,` అన్నాడు.

నవ్వుతున్న ముసలోడిని చూసి ఒళ్ళుమండిపోయింది కొబ్బరికాయల వాడికి. `ఇసయం ఇంకా ఆ బాబుకి తెలిసుండదు. చప్పుడువిని నువ్వెల్లి సూడకపోతే ఆ పొట్టోడి పని ఏటయ్యేది ఆయాల?`  అన్నాడు. ` చల్లగా పడుకొన్న ఒక్కడంటే ఒక్కడు బయటకి రాలేదు. ఎండలో చెప్పుల్లేకుండా పరుగెత్తుకెల్లి ఆళ్ళావిడ్ని తోలుకు రాకపోతే ఆడూ, నిన్ను తిట్టడానికి ఆడినోరూ ఉండేయి కాదు. ఆయమ్మ చెపితే నిన్ను పిలిచి బువ్వెడతాడేమోరా!` అన్నాడు.  

ముసిలోడు పళ్ళ చిగుళ్ళు కనిపించేలా నవ్వాడు.
© Dantuluri Kishore Varma

Monday, 29 April 2013

ఇప్పటికైనా ఉద్యోగం వెత్తుక్కోరా బాబూ!

చీర్స్!

సిక్సర్ బార్ కార్నర్ టేబుల్ దగ్గర డిం లైటింగ్‌లో మూడు లిక్కర్ గ్లాసులు `టింగ్` మని చప్పుడు చేశాయి. 

`సంవత్సరం అయ్యిందిరా మనం ముగ్గురం కలిసి,` అన్నాడు వరుణ్, `ఈ రోజు బిల్లు మాత్రం నాదే. కాదంటే ఒప్పుకొనేది లేదు. మీరిద్దరూ నా గెస్టులు ఈ రోజు.` 

`ఫ్రీడం దొబ్బింది ఈ ఏడాదిగా. ఫైనల్ ఇయర్ అయ్యిందో లేదో కొంపలుమునిగినట్టు ప్లేస్‌మెంట్ వచ్చిపడింది మా ఇద్దరికీ. నువ్వు అదృష్టవంతుడివిరా బాబూ. ఫ్రీ బర్డ్‌లాగ తిరుగుతున్నావు,` అన్నాడు వరుణ్‌ని ఉద్దేశించి ప్రిన్స్‌రాంబాబు . ఫేస్‌బుక్‌లో వాడి పేరు అదే. అందరూ అలాగే పిలవడానికి అలవాటు పడ్డారు.

`వీడి అన్నను మెచ్చుకోవాలిరా అసలు. చిన్న ఉద్యోగం చేస్తూ వీడిని బీటెక్  చదివించడమే కాకుండా, ఇప్పటికి కూడా పోకెట్ మనీ ఇస్తున్నాడు చూడు అందుకు,` డార్లింగ్ ప్రసాదు అన్నాడు.

గ్లాసులో ఎర్రగా మెరుస్తున్న ద్రవంకేసి రెప్పవెయ్యకుండా చూస్తున్నాడు వరుణ్. గిల్టీ ఫీలింగ్ లాంటిది కలుగుతుంది డార్లింగ్ ప్రసాద్ మాటలకి. `ఇంకేంటిరా సంగతులు,` అన్నాడు. టాపిక్ డైవర్ట్ అయ్యింది. కాలేజీ రోజుల్లోకి దొర్లుకొంటూ వెళ్ళిపోయారు. చికెన్ మంచూరియా నంజుకొంటూ తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకొన్నారు. పుర్తయ్యే సరికి రాత్రి పదకొండు అయ్యింది. 

విడిపోయే ముందు ప్రసాదూ, రాంబాబు మరీ మరీ చెప్పారు వరుణ్‌కి చెన్నై వచ్చేస్తే వాళ్ళ రూంలోనే ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చెయ్య వచ్చని. `అలాగే,` నని ఇంటిదారి పట్టాడు. వీధిలైటు వెలుగులో ఏడు పోర్షన్ల ఇంటిలో వాళ్ళుండే మధ్య పోర్షన్ నాచుపట్టిన పురాతన సమాధిలా ఉంది. పేంట్ జేబులోనుంచి జండుబాం డబ్బా తీసీ, కొంత బాంని నుదుటికి, మెడ వెనుకా రాసుకొన్నాడు. అలా చేస్తే, మందు వాసన వదినకి తెలియకుండా ఉంటుంది. వెళ్ళి తలుపు కొట్టాడు.  

వదిన తలుపు తీసింది. `మళ్ళీ తలనొప్పా? భోజనం చేస్తావా?` అంది. ఆమె కళ్ళు ఏడ్చి నట్టు ఎర్రబడి ఉన్నాయి. `ఆకలి లేదు వదినా. పడుకొంటాను,` అన్నాడు. `రేపు ఉదయం నేనూ, మీ అన్నయ్యా చిన్నూ స్కూలుకి వెళ్ళాలి. టెర్మ్ ఫీజు కట్టడానికి చివరిరోజు. మేము తిరిగి వచ్చేలోగా నువ్వు బయటకు వెళితే ఇంటి తాళం పక్క పోర్షన్‌లో ఇచ్చి వెళ్ళు,` అంది. అలాగే అని తల ఊపాడు. సాయంత్రం బార్‌కి వెళ్ళే ముందు హేంగర్‌కి తగిలించిన అన్నయ్య షర్ట్ జేబులో ఐదొందల కాగితాలు కనిపించాయి. స్కూల్ ఫీజు కట్టడంకోసం వదిన వంటిమీద ఉన్న చిట్ట చివరి బంగారం పిసరు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు. `నేను ఒక నోటు తీసిన సంగతి వీళ్ళకు తెలిసి ఉంటుందా!?` అనుకొంటూ ఉండగా నిద్ర పట్టేసింది.  

డార్లింగ్ ప్రసాదునీ, ప్రిన్స్‌రాంబాబునీ సర్కార్కి ఎక్కించి వచ్చే సరికి సాయంత్రం అవుతుంది. ఆఫీసుకి శెలవు పెట్టినట్టున్నాడు, అన్నయ్య ఇంటిలోనే ఉన్నాడు. వరుణ్ ఇంటికి వచ్చిన విషయం గమనించలేదు. లోపలి గదిలోనుంచి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. అన్నయ్య అంటున్నాడు, `అప్పుడప్పుడూ ఆపదలో ఉన్నవాళ్ళకి బ్లడ్  డొనేట్ చెయ్యడమే కానీ, ఎప్పుడూ డబ్బు తీసుకొన్నది లేదు. ఈ రోజు అడిగి మరీ అయిదు వందలు తీసుకోవలసి వచ్చింది,` అని.
© Dantuluri Kishore Varma

Thursday, 28 February 2013

సాంప్రదాయాలని గౌరవించాలి కదా?

ఓ ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. అన్నదమ్ములకంటే కూడా స్నేహితులుగా కలిసిమెలిసి ఉండే రకం వాళ్ళు. చదువులు పూర్తయిన తరువాత వేరే, వేరే రాష్ట్రాలలో ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఒకరిని ఒకరు బాగా మిస్సవుతున్నారు. ఈ ఊళ్ళో ఉన్న ఆయనకి కొంచం మందు సరదా ఉంది. రోజూ సాయంత్రం బారుకెళ్ళి మూడు పెగ్గులు ఒకేసారి ఆర్డరిచ్చి, చక్కగా చీర్స్ చెప్పేసుకొని మూడూ గొంతులో పోసేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. `ఏమండీ, మూడు ఒకేసారి ఏమిటి?` అని ఎవరయినా కుతూహలం కొద్దీ అడిగితే, `దూరంగా ఉన్న ఇద్దరు సోదరులతో కలసి పుచ్చుకోవడం కుదరదు కనుక, వాళ్ళ బదులు కూడా నేనే లాగించేస్తున్నా. ఇదిగో ఈ పెగ్గు మా అన్నయ్యది, ఇది మా తమ్ముడిది, ఈ మూడోది నాది,` అని చెప్పేవాడు. రోజూ చూసేవాళ్ళకి అది అలవాటయిపోయింది. కొన్నిరోజులు అలా గడిచిన తరువాత ఒకసారి ఆ పెద్దమనిషి పది రోజులు పాటు బారుకి రావడం మానేసాడు.

తిరిగి వస్తూనే కొంచం నీరసంగా కనిపించాడు. గెడ్డం మాసిపోయి ఉంది. రెండు పెగ్గులకే ఆర్డరిచ్చాడు. చూస్తున్నవాళ్ళకి గుండె పట్టేసినట్టు అయ్యింది. ఉత్సాహంగా చీర్స్ చెప్పుకొనే ఆయన కళ్ళల్లో ఆరోజు ఎందుకో విషాదం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏమయ్యి ఉంటుందో సులభంగానే ఊహించగలిగారు. నెమ్మదిగా లేచి అతని దగ్గరకి వెళ్ళారు. భుజం మీద ఓదార్పుగా చేతులు వేసి, `బాధపడకండి, మీ సోదరుడికి అకస్మాత్తుగా అలా అవ్వడం చాలా విచారించవలసిన విషయం,` అని ముక్త కంఠంతో సంతాపాన్ని తెలియజేసారు.

వింటున్నాయన ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు, `భలే మనుషులండీ మీరు. మావాళ్ళ కేమీ అవ్వలేదు. కష్టమంతా నాదే! ఇప్పుడే ఫోనులో మాట్లాడి వస్తున్నాను. ప్రొద్దుట, మద్యాహ్నం, సాయంత్రం సుబ్బరంగా లాగించారట. నేనే ఉపవాసం ఈ రోజు. సాంప్రదాయాలని గౌరవించాలి కదా? అందుకే నాది మానేసి, వాళ్ళ మటుకే రెండు తెప్పించుకొన్నాను,` అన్నాడు తాపీగా.  

(ఎవరో చెప్పారు దీనిని. కొంచం కథనం జోడించి సరదాకి ఇలా...)

 © Dantuluri Kishore Varma 

Tuesday, 5 February 2013

పర్ణశాల

బ్రతుకు పరుగు పందెం అయిపోయింది. సంతోషం ఎండమావిలా అనిపిస్తుంది. జీవన విధానం సాంకేతికత, సౌఖ్యాల సాక్షిగా రోజురోజుకీ మారిపోతుంది. ఫ్యాన్‌కి బదులుగా ఏసీ కావాలిప్పుడు. సైకిళ్ళ స్థానే బైకులు; వాటిని తోసిరాజని కార్లూ. బజ్జీల  స్థానాన్ని బర్గర్లు ఆక్రమించి చాలా రోజులయ్యింది. మల్టీ ఫ్లెక్స్‌లు, మల్టీ క్వీజీన్ రెస్టారెంట్లు రాజ్యమేలుతున్నాయి. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు ప్రతీ ఒక్కరికీ కావలసిందే. వీటన్నింటికీ తోడు ఖరీదైన విద్యా, వైద్యం, రోజు రోజుకీ పెరుగుతున్న ధరలు. సంపాదనకీ, ఖర్చుకీ పొంతన ఉండటం లేదు. ఎంత సంపాదించినా ఇంకా, ఇంకా కావాలి. సోమవారం వస్తుందంటే మళ్ళీ పనిలోకి వెళ్ళాలన్న బెంగ, ఒకటవ తారీకు వస్తుందంటే కొరత బడ్జెట్ చూడాలని ఆందోళన. పులి మీద స్వారీలా కొనసాగించవలసిందే. అలుపు తీర్చుకోవడానికి ఆగామా, ఆ పులే మనల్ని కబళించేస్తుంది. అందుకే ఆపలేని పరుగు, పరుగు, పరుగు..........ఛీ! వీటన్నింటినీ వదిలేసి ఏ అడవిలోనో పర్ణశాలలాంటి ఇంటిలో, ప్రకృతికి దగ్గరగా ప్రశాంతం గా జీవిస్తే ఎంత బాగుంటుంది. ఈ చింతలు, వంతలు, దిగుళ్ళు, తెగుళ్ళు...అన్నింటికీ దూ...రంగా నిశ్చింతగా బ్రతకితే! నిద్ర ముంచుకొని వస్తుంది. ఆలోచనలు చేతన కోల్పోయి, సుషుప్తిలోకి జారిపోతున్నాయి.  
*  *  *
నులివెచ్చని సూర్యకిరణాలు ముఖాన్ని తాకుతున్నాయి, పక్షుల కూజితాలు సుప్రబాతం పాడినట్టు వినిపిస్తున్నాయి. బయటనుంచి ఎవరో కట్టెలు కొడుతున్న శభ్ధం వినిపిస్తుంది. ఓరగా వేసిన తలుపు తెరుచుకొని బయటకి వచ్చి చూశాడు. అప్పుడు తెలిసింది తానున్నది ఒక పూరి గుడిసెలో అని. గుడిసె చుట్టూ కొంతమేర పొదలు నరికి శుభ్రం చేసి ఉంది. అది దాటిన తరువాత  అన్ని వైపులా ఏపుగా పెరిగిన కంచెలు, పచ్చ గడ్డి, అకాశం వరకూ ఎదిగిన రకరకాల వృక్షాలు, వాటి వెనుక నుంచి పైకి వస్తున్న సూర్యుడు. మంచు పరదాల్లోంచి మచ్చల జీబ్రా చర్మంలా నేలంతా పరచుకొన్న సూర్య రస్మి. దూరంగా మైదానం మలుపు తిరిగి కొండ ఎక్కుతున్నట్టున్న ప్రాంతంలో ఒక కోయ పిల్ల కట్టెలు కొడుతుంది. 

అరికాళ్ళక్రింద ఎండిన ఆకులూ, పుల్లలూ నలుగుతూ ఉండగా ఆ పిల్ల దగ్గరకి నడచి వెళ్ళాడు. పలకరింపుగా నవ్వింది. `కాఫీ, టీలుండవు ఇక్కడ. అడవిలోకి పోయి ఏమైనా తెస్తే వండి పెడతాను,` అంది. ఆమె అందించిన గొడ్డలి, తవ్వుగొల అందుకొని అడవిలోకి నడిచాడు.  

కాలకృత్యాలు తీర్చుకోవాలి ముందు. ఎక్కడినుంచో నీరు పారుతున్న చప్పుడు వినిపిస్తుంది. చాలా దూరం నడిచాడు. చివరికి ఒకచోట కొండవాగు కనిపించింది. స్నానం చేసి తిరిగి వస్తుంటే ఒకచోట గతరాత్రి అడవి పందులు నేల తవ్వి తిరగేసిన ప్రదేశం కనిపించింది. అక్కడక్కడా సగం కొరికి వదిలేసిన దుంపలు కనిపిస్తున్నాయి. అక్కడ ఇంకా చాలా ఉండవచ్చు. తరువాత ముదర వెదురు గడల కణుపులు నరికి వెదురు బియ్యం సేకరించాలి. ఇద్దరికి సరిపడా దుంపలు, బియ్యం, కొన్ని చింతకాయలూ పోగుచేసే సరికి  సూర్యుడు నడినెత్తిమీదకి వచ్చాడు.

దూర దూరంగా ఎక్కడెక్కడినుంచో పొగ సుడులు తిరుగుతూ ఆకాశం వైపు వెళుతుంది. ఈ అడవిలో ఇంకా ఇళ్ళు ఉన్నాయన్న మాట! కడుపులో ఆకలి నకనలాడుతుంది. నిన్న రాత్రి ఫేస్ బుక్కులో పెట్టిన స్టేటస్ అప్డేట్ కి ఏమయినా లైకులూ, కామెంట్లూ వచ్చాయో, లేదో!

వెదురు బియ్యం అన్నం, ఉడకబెట్టిన దుంపలు, నంజుకి చింతకాయలు. ఆవురావురు మంటూ తిన్నాడు. ఆకలి రుచి ఎరగదంటే ఇదేనేమో!

`మీ గూడెంలో జనాలు కలుసుకోరా?` అన్నాడు. `సంత రోజుల్లో, ఏదయినా జాతర అయినప్పుడు,` అంది కోయ పిల్ల.

`మరి కాలక్షేపం?`

`పని ఉంటది కదా? అదే పొద్దు పోయేదాకా,` అంది.

చెట్ల క్రింద ఉడతలు పరుగులు పెడుతున్నాయ్. సుర్యుడు పశ్చిమంవైపు కొండల వెనక్కి జారుకొంటున్నాడు. పక్షులు గుంపులుగా ఎక్కడినుంచో, ఎక్కడికో ఎగిరిపోతున్నాయి. పొదల్లోంచి కప్పలు, కీచురాళ్ళు చప్పుళ్ళు మొదలయ్యాయి. చెట్ల బెరడు నుంచి తీసిన మైనంలో ముంచిన ఒక గుడ్డని కర్రకి చుట్ట బెట్టి, కాగడా వెలిగించింది. చుట్టూ కొండలు  చీకటిలో పెద్ద పెద్ద గొరిల్లాల్లాగ ఉన్నాయి.

`ఇక్కడ ఏదీ బాగా లేదు. అనవసరంగా ఈ అడవిలోకి వచ్చి పడ్డాను,` అనుకొన్నాడు.
 
`ఇక్కడే పడుకోవాల,` అంది గుడిసలో కటిక నేలను చూపించి. లోనికి అడుగు పెడుతూ ఉండగా కాలిమీద మంట పుట్టింది. ఏదో  పాకిన చప్పుడు. `అబ్బా!` అన్నాడు బాధతో.

కాగడా వెలుతురులో కాలిమీద సూదితో పొడిచినట్టు రెండు రక్తపు గుర్తులు కనిపిస్తున్నాయి. కోయపిల్లకి అవి ఏమిటో బాగా తెలిసినట్టే ఉంది.`నాగుపాము,` అంది.

భయం జరజరమని వెన్నుపూసలోనుంచి మెదడువరకూ పాకింది. `ఇప్పుడెలా?` అన్నాడు ఆందోళనగా. తొందరగా గుడిస బయటకి పరుగుపెట్టి, ఏవో ఆకులు తెచ్చి, పాము కరిచిన చోట రసం పిండింది.

`ఇది పాము విషానికి విరుగుడా?` అన్నాడు. ఆందోళనతో గొంతు పిడచకట్టుకు పోతుంది.

`తెలియదు దొరా. ఇది ఏస్తే బతకొచ్చు అంటారు. పాములు కరిచి, జొరాలొచ్చి పాణాలమీదకి వస్తే ఏవేవో పసర్లు ఏస్తాం. బతికితే గొప్ప, లేదంటే రాత,` నుదిటిమీద బొటన వేలితో అడ్డంగా రాసుకొంటూ చెప్పింది. 

`మరి వైద్యుడు!?`

`వైద్యుడెవరూ ఉండరు దొరా ఇక్కడ. కానీ, ఆ పై కొండమీద గుహలో ఒక సాములోరు ఉంటారు. మంత్రాలేస్తారు,` అంది.

పాముకాటు ఎంత ప్రమాదమో అతనికి తెలుసు. బ్రతకాలంటే ఉన్న ఏ అవకాశాన్ని వదులు కోకూడదు. కాగడా అందుకొని, `పద, దారి చూపించు,` అన్నాడు.

పరుగు, పరుగు, పరుగు.... ఆయాసం వస్తుంది, గొంతు ఎండిపోతుంది. ప్రాణంకోసం పరుగు ప్రపంచం చివరిదాకా పరుగెత్తినట్టు ఉంది. కొండగుహ కాంతి పుంజాలతో వెలిగిపోతూ ఉంది. తెల్లని గడ్డం, పండు ముసలి శరీరం, తలవెనుక కాంతి చక్రం - మునీశ్వరుడు తపోముద్రలో కూర్చుని ఉన్నాడు. వొగుర్పుల శభ్ధానికి కళ్ళుతెరిచి `వచ్చావా?` అన్నాడు. 

సమయం మించి పోతుంది. ఒక్క క్షణం కూడా వృదా పరచడానికి లేదని అతనికి తెలుసు. `నన్ను బ్రతికించండి,` అన్నాడు ముకుళించిన హస్తాలతో.

`ఎందుకూ?` స్వామి నుంచి సూటి ప్రశ్న. అతను నివ్వెర పోయాడు. `స్వామీ బ్రతడం ఎందుకా? సర్వజ్ఞానులు మీరా ఇలా అడిగేది!?` అన్నాడు.  

మునీశ్వరుడి కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. `ఇంకాస్త సౌకర్యంగా బ్రతకడానికి అడవులనుంచి గ్రామాల్లోకి, అక్కడినుంచి పట్టణాల్లోకీ వెళుతున్నాం. సాంఘిక జీవనంకోసం కోలనీల్లో, అపార్ట్‌మెంట్లలో నివశిస్తున్నాం, ఎక్కువ సుఖం కావాలంటే ఎక్కువసంపాదన కావాలి. అందుకే రోజుకి ఎనిమిది గంటలకి బదులుగా పద్నాలుగు గంటలు పని చేస్తున్నాం. విద్య, వైద్యం లేకుండా మనకి రోజు గడవదు. జీవన ప్రమాణం, ఆరోగ్యం, సాంఘికజీవనం, విజ్ఞానం, సౌకర్య వంతమైన జీవితం.. వీటికొసమే పట్ణవాశం. కానీ, ఏ రోజూ మనం బ్రతుకుతున్న జీవితం గురించి తృప్తిలేదు. దూరపుకొండలు నునుపు అన్నట్టు మన ఆలోచనలు ఎప్పుడూ పర్ణశాలల చుట్టూ తిరుగుతుంటాయి. పనిలో, బాధ్యతల్లో ఆనందం ఉందని తెలుసుకోలేనివాడు ఎక్కడా ఆనందంగా ఉండలేడు. పో, ఇక్కడినుంచి,` అని అతని గుండెలమీద తన్నాడు.    

ఆ కుదుపుకి మెలుకువ వచ్చింది. నోరు పిడచ కట్టుకుపోయి ఉంది. నుదిటి మీద పట్టిన చెమట చంపలమీదుగా కారి, తలగడను తడిపేస్తుంది. చీకటిలో వాల్ క్లాక్ చేస్తున్న చప్పుడు భయంకరంగా వినిపిస్తుంది. లేచి వెళ్ళి మంచినీళ్ళు తాగి వచ్చి పడుకొన్నాడు. మళ్ళీ ప్రొద్దున్నే తొందరగా లేవాలి. ఆఫీసులో చాలా పని ఉంది.

 © Dantuluri Kishore Varma 

Thursday, 6 December 2012

అరకులోయలో...

(పిల్లలు చదవడానికి ఉద్దేశించిన కథ కాదు) 

"హలో," శృతిచేసిన వీణతీగ మీటినట్టు సుప్రియ కంఠం రిసీవర్‌ద్వారా అతని చెవిలోంచి గుండెల్లోకి ప్రవేశించి, అక్కడ ప్రతిధ్వనించింది.  
"కి...కిరణ్ దిస్ సైడ్," తడబడ్డాడు.
"మీ పేరులో రెండు `కీ` లున్నాయా?" నవ్వింది.
"ఒకటి నాపేరులోది. రెండవది నా గుండెల్లోది."
"అంటే!?"
"లవ్ ఈజే మాస్టర్ కీ దట్ ఓపెన్స్ ఎవ్విరీ వార్డ్ ఆఫ్ ద హార్ట్ అంటారు. రెండవది ఆ మాస్టర్ కీ." వివరించాడు. వాళ్ళిదరికీ పెళ్ళి నిశ్చయమై వారంరోజులైంది. మొడటిసారి మిగిలిన వాళ్ళ డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడుకోవడం. పెళ్ళి జరగడానికి ఇంకా నెలరోజులు టైం ఉంది. 
*     *     *
డియర్ సుప్రియ,
బయట వెన్నెల ఎంతో బాగుంది. నువ్వు పక్కనుంటే ఇంకా బాగుండేది. నీ భుజాల చుట్టు నా చేతినివేసి ఎన్నో రొమాంటిక్ విషయాలు చెప్పాలని ఉంది. 
- నీ కిరణ్
కిరణ్ నుంచి వచ్చిన ఎస్సెమెస్స్‌లో `రొమాంటిక్` అనే మాట సుప్రియకి మరీ, మరీ జ్ఞాపకమొచ్చి గుండేల్లో తరoగిత మౌతుంది. ఆమాట ఆమెకి ముందు తెలిసినదే అయినా ఎందుకో గమ్మత్తుగా ఉంది. 
*     *     *
మొదటి రాత్రి-

అతను గదిలో ఎదురు చూస్తున్నాడు. ఆమె మల్లెపూల దండలా కదిలి వచ్చింది. మునివేళ్ళ మీద ముద్దిచ్చి, తనప్రక్కన చోటిచ్చాడు. పెదవులతో చెక్కిలి మీద స్పృశించి, చెవిదాకా వెళ్ళి గుసగుసగా `ఐలవ్యూ` చెప్పి, "ఎదైనా మాట్లాడు," అన్నాడు.

చెక్కిలి మీదనుంచి శంఖంలాంటి మెడమీదకి జారుతున్న అతని చేతిని మెత్తగా హత్తుకొని, కళ్ళల్లోకి చూస్తూ, "రొమాన్స్ అంటే ఏమిటి?" అని అడిగింది.

అతను తడబడ్డాడు. "రొమాన్స్ అంటే...," ఆతరువాత ఏమి చెప్పాలో తెలియలేదు. పూర్తిగా లవ్ కాదని తెలుసు. సెక్స్ కూడా కాదు. కానీ ఎలా వివరించడం? కొంచం ఆలోచించి తరువాత చెప్పాడు, " మల్లెపూల వాసన ఎలా ఉంటుంది అంటే ఏమి చెబుతావు? అదొక అనుభూతి, దాన్ని స్వయంగా అనుభవించి తెలుసుకోవాలి తప్ప వివరంచలేం. రొమాన్స్ కూడా అంతే."

తన గుప్పిటలో ఉన్న అతని చేతిని పెదవులవరకూ తెచ్చుకొని, ముద్దిస్తూ... "ఆ అనుభూతిని నాకూ తెలియజేయండి," అంది. నిశ్చేష్టుడయ్యాడు. అతని భావుకత్వానికి, ఆమె చిలిపితనం విసిరిన సవాల్. రొమాన్స్ అంటే ఏమిటో మాటల్లో నిర్వచించడంకాదు, చేతల్లో ఆమెకి అనుభవైకవేధ్యం చెయ్యడం. దానికి ఆ మరునాడే ముహూర్తంగా నిర్ణయించాడు.
*     *     *
కిరుండుల్ పాసింజర్ విశాఖపట్నం నుంచి అరకు వైపుగా సాగిపోతుంది. విండోకి అవతల వెనక్కి పరిగెడుతున్న ప్రకృతి అందాలను చూస్తుంది సుప్రియ. ఆమెకి ఆనుకొని కూర్చుని కనురెప్పల కదలికల్లో కవిత్వాన్నీ, ఎగురుతున్న ముంగురుల్లో సంగీతాన్నీ అస్వాదిస్తున్నాడు కిరణ్. ఒక ఏటవాలు సూర్యకిరణం ఆమె బుగ్గలమీద పడి మెరుస్తుంది. ట్రెయిన్ టన్నెల్ లోనికి ప్రవేశించింది. ఒక్కసారిగా వెలుగు మాయమయ్యి, చీకటి ఆవరించింది. కళ్ళల్లోనుంచి మనసులోకి దారి ఉన్నట్టు, వెలుతురులోనుంచి మొదలైన టన్నెల్ ఓ చీకటిని దాటి అటువైపు మిరుమిట్లు గొలుపుతున్న మరో వెలుతురు ద్వారాన్ని చేరుకొంది. కోరికంటూ ఉంటే టన్నెల్‌కి మధ్యలో, కటిక చీకటిలో ఒక వార్మ్ షేక్ హేండ్, ఒక టెండర్ కిస్ ఏదయినా ఇవ్వొచ్చు. విరహాన్ని ఓపలేని సూర్యకిరణం ఆమె చెక్కిలిమీద మళ్ళీ వచ్చి వాలింది. అంతకుముందు అక్కడలేని గులాబీ వర్ణం ఎలా వచ్చిందో దానికేమీ అర్థమైనట్టులేదు! 
*     *     *
అక్టోబర్ నెల. చలి చక్కిలిగింతలు పెడుతుంది. పకృతి పరవశించి పక్కుమని నవ్వినట్టు, అరకులోయలో సౌందర్యం వాళ్ళిద్దరి గుండెల్లో అలజడి పుట్టిస్తుంది.

కొండవాలులో పసుపుదుప్పట్టి ఆరబెట్టినట్టు ఉన్న చేల అందాలని చూస్తుంది సుప్రియ. "ఈ పసుపు పువ్వుల తోట - వలిసెలు అనే నూనెగింజల పంట" పువ్వులు కోస్తూ అన్నాడు కిరణ్. "దోసిలి పట్టు," అంటూ ఆమె చేతుల్లో గుప్పెడు పువ్వులు ఉంచాడు. వాటిని అపురూపంగా అందుకొంది.

"నేను మొదటిసారి ఇచ్చిన పువ్వులు. క్రింద పెట్టకు. సెంటిమెంట్," అన్నాడు. అతని కళ్ళు కొంటెగా నవ్వుతున్నాయి. ముఖం చూస్తుంటే ఏదో తుంటరి పనికి తయారవుతున్నట్టే ఉంది. ముసిముసిగా నవ్వుతూ  సరేనంది. దూరంగా ఓ ముసలి కాపరి  గొర్రెల్ని తోలుకొంటూ వెళుతున్నాడు. చాపురాయి జలపాతం దగ్గరనుంచి పిక్నిక్‌కి వచ్చిన కాలేజ్ స్టూడెంట్స్ చేస్తున్న అల్లరి లీలగా వినిపిస్తుంది. వలిసెల చేలల్లో వాళ్ళిద్దరే ఉన్నారు. అప్పటికే ఆమె వెనుకకు చేరిన అతని ఊపిరి చెవి ప్రక్కన గిలిగింతలు పెడుతుంటే, హత్తుకొన్న సుతిమెత్తని కౌగలి పులకింతలు రేపుతుంది. చెవికమ్మ మీద పెదాలను తాకిస్తూ అన్నాడు, " కొండప్రాంతాలకి విహారయాత్రలికి వెళ్ళినప్పుడు సరదాకి కాలినడకన చిన్న చిన్న కొండలు ఎక్కి దిగడాన్ని  ట్రెక్కింగ్ అంటారు. నా పని అలాగే అవుతుందేమో!" చేతుల్లో పువ్వులని ఉంచి, గుండెల్లో పరిమళాలను నింపుతున్న అతని చమత్కారం ఆమెని ముగ్ధురాల్ని చేస్తుంది.  
*     *     *
పద్మావతీ గార్డెన్స్. ఏకాంతంగా వాళ్ళిద్దరే. ఆమె పచ్చికమీద కూర్చొని ఉంది. ఒడిలో తల పెట్టుకొని చీర చెంగులోనుంచి ఆమె ముఖాన్ని చూస్తూ అడిగాడు, "కాకెంగిలి ఎప్పుడయినా తిన్నావా?" అని. సమాదానం చెప్పకుండా నవ్వుతూ చూసింది. ఫోనులో అతనితో కొన్నిరోజుల సంభాషణ, పెళ్ళిజరిగిన తరువాత ఈ మూడురోజుల సాహచర్యం అతని తుంటరి తనాన్ని పూర్తిగా తెలియజేసాయి. ఏం సమాదానం చెప్పినా టాపిక్‌ని శృంగారం వైపు మలుపుతిప్పడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. "మాట్లాడవేం, రొమాన్స్ అంటే ఏమిటో అని ఆలోచిస్తున్నావా?" అన్నాడు. అతని పెదవులను చూస్తూ అవుననో, కాదనో చెప్పడానికి సిద్దమౌతుండగా, చటుక్కునలేచి తెరుచుకొంటున్న పెదాలను తన పెదాలతో మూసాడు. మధ్యలో నలిగిపోతున్న చీర చెంగు "కాకెంగిలి," అని గోలపెట్టింది.
*     *     *

జగడపు జనవుల జాజర |
సగివల మంచపు జాజర ||

మొల్లలు దురుముల ముడిచిన బరువున |
మొల్లపు సరసపు మురిపెమున |
జల్లన బుప్పొడి జాగర బతిపై |
చల్లే రతివలు జాజర ||

భారపు కుచముల పైపైగడు సిం- |
గారము నెరపెటి గంధవొడి |
చేరువ పతిపై చిందగ బడతులు |
సారెకు జల్లేరు జాజర ||

బింకపు గూటమి పెనగేటి చమటల |
పంకపు పూతలపరిమళము |
వేంకటపతిపై వెలదులు నించేరు |
సంకుమదంబుల జాజర ||

అన్నమాచార్య కీర్తన రూంలో మ్యూజిక్ సిస్టంలోనుంచి వినిపిస్తుంది. కిరణ్ గుండెల మీద సుప్రియ తల ఆనించి పడుకొని ఉంది. అతను అన్నాడు, "రొమాన్స్ అంటే ప్రేమతో మొదలై శృంగారంతో ముగియని ఒక కోరిక, పరుగుతీసే పడుచు ఊహ, సాహచర్యంలో ప్రతీక్షణాన్ని ఎగ్జయిటింగ్‌గా మలచుకోవడం, మనసుపొరల్లో శాశ్వతత్వాన్ని ఆపాదించుకొనే ఓ అనుభూతి..." అతని పెదాల్ని ఆమె తన పెదాలతో మూసింది. ఆమెకి అర్థమైందని అతనికి అర్థమైంది.
© Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!