Showing posts with label నౌ ఎ డేస్. Show all posts
Showing posts with label నౌ ఎ డేస్. Show all posts
Friday, 2 December 2016
Saturday, 26 November 2016
చూద్దాం ఏమి జరుగుతుందో.....
పెద్దాయన ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకొని పెద్దనొట్లు రద్దు చేసిపారేయ్యడంతో... ఆర్థికవ్యవస్థ ముందుకుపోతుందో, వెనక్కి పోతుందో తెలియని అయోమయ స్థితిలో పడిపోయాం.
`ఈ రోజుల్లో వందనోటుకి విలువెక్కడుంది..` అనుకొనేవాళ్ళని ఈ చిన్నినోటే తెల్లవారే సరికి తనకోసం క్యూల్లో నిలబెట్టించుకొంది.
కాలం చెల్లిన నోట్లు నిశ్సబ్ధంగా నిష్క్రమిస్తుంటే, కొత్తగా వచ్చిన రెండువేల నోట్లు `దమ్ముంటే మమ్మల్ని మార్చుకో చూద్దాం!` అంటున్నాయి. ఆచి తూచి ఖర్చుపెట్టడం అలవాటు తప్పిపోయిన వాళ్ళకి తప్పనిసరి పొదుపు తీరని తలనొప్పిలా తయారయ్యింది.
క్యూలో నుంచున్నా `ఈ కష్టానిదేముంది.. పరవాలేదులే` అనేవాళ్ళచేత `ఇదే పెద్ద కష్టం` అని నమ్మించాలని ప్రయత్నిస్తూ.. `ఇక్కడ డబ్బున్న వాడు ఒక్కడూ లేడు చూడు. వాళ్ళు ఎప్పుడో మార్చేసుకొన్నారు.` అంటున్నారు. మార్చుకొంటున్న వాడిది కష్టం... మార్చుకోలేకపోతున్న వాడిది మరీ పెద్ద కష్టం!
విపక్షం ఉక్రోషపడిపోతుంది. `చెత్తకుండీల్లో దొర్లుతున్న డబ్బు, అగ్నికి ఆహుతి అవుతున్న డబ్బు, నదుల్లో, డ్రయినేజీల్లో మునుగుతున్న డబ్బు, తనికీల్లో దొరుకుతున్న డబ్బు... ఓ లెక్కలోది కాదు. అసలు మొత్తాలన్నీ బంగారంలోకి, భూముల్లోకి, కంపెనీ పెట్టుబడుల్లోకి ఎప్పుడో వెళ్ళిపోయినియ్యి` అనికూడా అంటుంది.
బ్లాక్ మనీ, అనెకౌంటెడ్ మనీ, లీగల్ మనీ, ఇల్లీగల్ మనీ... డబ్బుల్లో ఎన్నిరకాలో! కొత్త డబ్బుది ఏ రంగైనా, ఏ రూపామైనా.. ఇక ముందు చలామణీలో ఉండబోయేది తక్కువే. ప్రజల కొనుగోలు శక్తి సన్నిగిల్లుతుంది. వ్యాపారాలు నష్టాల్లో పడతాయి, రియల్ ఎస్టేట్ ధరలు నేలకి దిగి వస్తాయి, ఉద్యోగాలు ఊడిపోతాయి, జీడీపి తగ్గుతుంది, ఆర్థికమాధ్యం రావచ్చు,... ఇంకా ఇలాంటి చిట్టా చాలా ఉంది.
నాణానికి రెండోవైపు చూస్తే, డిమోనిటైజేషన్ వల్ల ఖజానాకు రాజమార్గంలో తిరిగి వస్తుందని భావిస్తున్న లక్షల కోట్ల రూపాయలతో దేశాన్ని రామరాజ్యంగా మార్చవచ్చట!
నాణానికి రెండోవైపు చూస్తే, డిమోనిటైజేషన్ వల్ల ఖజానాకు రాజమార్గంలో తిరిగి వస్తుందని భావిస్తున్న లక్షల కోట్ల రూపాయలతో దేశాన్ని రామరాజ్యంగా మార్చవచ్చట!
ఏదేమయినప్పటికీ...ఆట మంచి రసపట్టులో ఉంది. ప్రపంచం అంతా ఆసక్తిగా మనవైపే చూస్తుంది.గెలుస్తామో, ఓడిపోతామో... చూద్దాం ఏమి జరుగుతుందో.....
© Dantuluri Kishore Varma
Thursday, 29 September 2016
సమయం ఎంచుకొని కొట్టాలి!
కమర్షియల్ సినిమాలో క్లైమాక్స్ సీన్ జరుగుతూ ఉంటుంది...నేల ఈనినట్టు గూండాలు కథానాయకుడి మీద తెగబడుతూ ఉంటారు.
`ఒరేయ్, నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను. ఎంతమందిని పంపుతావో పంపు. కానీ, నన్ను మాత్రం బ్రతకనివ్వకు. నీకు ఇచ్చిన టైం పూర్తైన తరువాత నేను ప్రాణాలతో ఉంటే, నీ పని పులుసులోకి ముక్కల్లేకుండా అయిపోతుంది,` అంటాడు విలన్‌తో.
కుర్చీ చివరకు జరిగిపోయి, ఊపిరి బిగబట్టి చూస్తున్న ప్రేక్షకుడికి మాత్రం సొల్లు కబుర్లు చెప్పి, సవాల్ విసురుతున్న హీరోని చూసి వొళ్ళు మండిపోతుంది. `చెయ్యగలిగిన పని చేసి చూపించడం మానేసి, ఎదుటివాడితో తన్నులు తినే వరకూ ఆగడం ఎందుకు?` అని విసుక్కొంటాడు. గూండాలు ఎగిరెగిరి తన్నుతుంటే... తన్నుతన్నుకీ రక్తం కక్కుకొంటున్న హీరోని ఉత్సాహపరచడానికి ప్రేక్షకుడు పిడికిలి బిగించి `తిరిగి కొట్టు...కొట్టు` అని మౌనంగానే ఆక్రోశిస్తాడు.
ఇచ్చిన ఐదు నిమిషాల గడువూ పూర్తయిన తరువాత పోతున్న ప్రాణాలని బలవంతంగా వెనక్కి తెచ్చుకొని, పిడికిళ్ళని ఉక్కు గదల్లా మార్చుకొని వొక్కొక్కడినీ కొడుతుంటే... ప్రేక్షకుడు రోమాంచితమైపోయి, విజిల్స్ వేస్తాడు. అది సినిమా.
అణుగుతుంది కదా అని ఇనుప స్ప్రింగు మీద కాలేసి తొక్కుతూ ఉంటే... అణిగి... అణిగి... అణిగి... ఒక్కసారే విస్పోటనం లాంటి శక్తితో తొక్కినవాడిని విసిరి కొట్టేస్తుంది. అగామంటే తిరిగి కొట్టలేక కాదు. సమయం ఎంచుకొని కొట్టాలి.ఇక్కడ స్ప్రింగ్ వ్యక్తి అయినా సరే, దేశమైనా సరే .... రిజల్ట్ సేం టు సేం!
కావాలంటే భారత్ సర్జికల్ స్ట్రైక్ చూడండి. దానికి ప్రజలనుంచి వస్తున్న స్పందనని చూడండి.
© Dantuluri Kishore Varma
Saturday, 25 July 2015
ఓ మహా సందడి సద్దుమణిగింది!
`పుష్కరాలు అయిపోతున్నాయి అంటే బెంగగా ఉంది. రేపటినుంచి ఈ సందడి అంతా ఉండదు కదా?` అంటున్నాడు ఒకాయన. ఆయన నోరు తెరిచి మనసులో మాట బైట పెట్టాడు కానీ, టీవీలో గోదావరి హారతి కార్యక్రమం లైవ్‌లో ప్రసారమౌతుండగా చూస్తున్న చాలా మందికి కలిగిన అభిప్రాయం కూడా అదే. నదీ స్నానాలు, పుణ్యక్షేత్రాల సందర్శనం ఈ దఫా జరిగినంత కోలాహలంగా ముందు ఎప్పుడూ జరగలేదని చెప్పుకొంటున్నారు. (మొదటిరోజు రాజమండ్రీ తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగి ఉండకపోతే ఎంత బాగుండును!) జనాలు దూరభారాల్ని లెక్కపెట్టకుండా రాజమండ్రీకో, కొవ్వూరుకో, కోటిపల్లికో, మరో రేవుకో వచ్చి గోదావరిలో మునకలు వేశారు. సామాన్యుల దగ్గరనుంచి సెలబ్రిటీల వరకూ పుష్కరాల యూఫోరియా ఊపి, ఊపి వదిలిపెట్టింది. `గతంలో ఏదో ఒకసారి ములిగితే సంతృప్తిగా అనిపించేది. ఇప్పుడయితే ఎన్నిరేవుల్లో మునిగినా తనివితీరటంలేదు,` అని రచ్చబండ దగ్గర ఒక పెద్దాయన చెపుతుంటే చుట్టూ కూర్చొన్న వాళ్ళు `అవునని` తలలూపుతున్నారు. టీవీల ద్వారా ప్రచారం బాగా జరిగడంవల్లో, ప్రజల్లో అధ్యాత్మికత ఎక్కువయ్యిందో తెలియదు కానీ ప్రతీ రేవులో మునిగిన వాళ్ళ లెక్కలు లక్షల్లో తేలడం, ఒక్కోచోట అయితే కోట్లలో కూడా హాజరు ఉండడం ఈ మహా పుష్కరాల ప్రత్యేకత.
కార్లలో, టూరిస్టు బస్సుల్లో, ఆర్టీసీలో, బైకులమీద ఎక్కడేక్కడి నుంచో జనాలు వచ్చారు. రోడ్డుప్రక్కన భోజనాలు వండుకోవడం, స్మార్ట్‌ఫోన్లతో సెల్ఫీలు తీసుకోవడం బాగా కనిపించాయి. మైళ్ళకొద్దీ ట్రాఫిక్ జాంలు, అక్కడక్కడా రోడ్డుప్రమాదాలు జరిగాయి. దానాలు ఇవ్వడంకోసం యాత్రికులు డబ్బులు ఇబ్బిడిముబ్బిడిగా ఖర్చుపెట్టారు. చాలా షాపుల్లో వ్యాపారం పెరిగింది. ఈ పన్నెండు రోజులూ పురోహితులు ఫుల్లు బిజీ. పుణ్యక్షేత్రాల ఆదాయాలు బాగా పెరిగాయి.
`గోదావరి నదీ జలాల్ని తాకి పునీతులవుదామని దూరతీరాల్నుంచి వస్తే అథిది దేవో భవ అన్న మాటకి అర్థం తెలిసింది. దాహమంటే గోదావరి వాసులు మజ్జిగతో గొంతుతడిపారు. ఆకలి అనకపోయినా అమ్మకంటే ఎక్కువగా కొసరి కొసరి తినిపించారు. నీ బిడ్డలకు అదంతా నువ్వునేర్పిన సంస్కారమే అయివుంటుందా?` అని ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఒకాయన స్టేటస్ అప్డేట్ పెట్టాడు. యాత్రికులకి మంచినీళ్ళూ, మందులూ సరఫరా చెయ్యడం, అవకాశం ఉన్నవాళ్ళు అన్నసంతర్పణలు చెయ్యడం, సేవా దళాలుగా ఏర్పడి వృద్దులకీ, పిల్లలకీ, వికలాంగులకీ గోదావరి రేవులదగ్గర చేయూత నివ్వడం... హృద్యమైన చిత్రాన్ని ఇంద్రదనుస్సులాగ ఆవిష్కరించిన సందర్భం ఇది. ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు `మనుష్యుల్లో మంచితనం ఇంత ఉందా!` అని ముచ్చటపడతాం.
ఆగండాగండి! అంతా మంచే కాదు పుష్కరాల సందర్భంగా చెడునూ చూశాం! ముసలి తల్లితండ్రుల్ని వెంటబెట్టుకొని వచ్చి, జనసందోహం మధ్యలో వదిలించుకొని, చడీచప్పుడూ లేకుండా ఊరిబస్సు ఎక్కేసిన స్వార్థపరుల కథలుకూడా న్యూస్‌పేపర్లలో చదివి నివ్వెరపడ్డాం, కదూ?
వేతనాల పెంపు కోసం సమ్మెబాట పట్టిన పారిశుద్ద కార్మికులతో ప్రభుత్వ మంతనాలు సఫలీకృతం అయ్యాయట. వాళ్ళు రేపటినుంచి యాత్రికులు వదిలిపెట్టిన చెత్తను తొలగిస్తారు. జనసామాన్యం మునిగి, మునిగి వదిలించుకొన్న వంటిమురికిని గోదావరి మాత కూడా సాగరుడిలో కలిపేస్తుంది. కానీ పుష్కరుడి మాట ఏమిటి? మనసుల్లో మురికిని కడిగే సామర్ధ్యం పుష్కరుడికి ఉండి ఉంటుందా? అదే జరిగితే ఎంత బాగుండును!
ఏదేమైనా గోదావరి పుష్కరాలు నేటితో ముగిసాయి. ఓ మహా సందడి సద్దుమణిగింది.
© Dantuluri Kishore Varma
Monday, 13 July 2015
గోదావరి మహాపుష్కరం 2015
మహారాష్ట్రాలోని నాసిక్‌కి సమీపంలో త్రయంబకేశ్వరం నుంచి ప్రయాణం మొదలు పెట్టిన గోదావరి 1465 కిలోమీటర్లదూరం ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దారిలో భూముల్ని సస్యశ్యామలం చేస్తుంది, మనసుల్ని పులకరింపజేస్తుంది, ప్రజల్లో భక్తి భావనలని నింపి అధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతుంది. మహారాష్ట్రాలో, తెలంగాణాలో, ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి ప్రవహించే మార్గంలో ఎన్నో అందమైన పల్లెటూళ్ళు ఉన్నాయి, పట్టణాలూ, నగరాలూ ఉన్నాయి, ప్రశిద్ద దేవాలయాలు ఉన్నాయి. కొండకోనల నడుమ ప్రవహిస్తూ గోదావరి నది ఎన్నెన్నో ఒయ్యారాలు పోతుంది. ప్రకృతి శోయగాలతో పరిసరాలను మనోజ్ఞంగా మారుస్తుంది. అందుకే అడవి బాపిరాజుగారు...
ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి
కొండల్లో ఉరికింది
కోనల్లో నిండింది
ఆకాశ గంగతో
హస్తాలు కలిపింది
ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి
అడవి చెట్లని
జడలోన తురిమింది
ఊళ్ళ దండలు గుచ్చి
మెళ్ళోన దాల్చింది
ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి
వడులలో గర్వాన
నడలలో సుడులలో
పరవళ్ళు తొక్కుతూ
ప్రవహించి వచ్చింది
ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి
శంఖాలు పూరించి
కిన్నెర్లు మీటించి
శంకరాభరణ రా
గాలాప కంఠియై
ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి
నరమానవుని పనులు
శిరమొగ్గి వణీకాయి
కరమెత్తి దీవించి
కడలికే నడిచింది
ఉప్పొంగి పోయింది గోదావరి - తాను
తెప్పున్న ఎగసింది గోదావరి
... అంటారు
గోదావరి ప్రాంతంలో నివశించే ప్రజలకి ఈ నదీమతల్లితో ఎంత ఆత్మీయత ఉంటుందంటే... అంటే.. దాని గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే, పన్నెండేళ్ళకు ఒక్కసారి వచ్చే గోదావరి మహా పుష్కరాలు రేపటి నుంచి మొదలవుతున్నాయి.
ఎక్కడ చూసినా సందడే సందడి. పుష్కర స్నానం యొక్క ఫలితం గురించి, ఈ సమయంలో చెయ్యవలసిన దానాల గురించి పత్రికల్లో, టీవీ చానళ్ళలో విరివిగా ప్రచారం జరిగిందేమో షాపుల దగ్గర దానాలుగా ఇవ్వడానికి కావలసిన వస్తువులు కొనడం కోసం జనాలు ఎగబడుతున్నారు. `గోదానం చెయ్యడం చాలా మంచిదట. మా అమ్మాయి చేస్తానంటే ఆవును కొనడానికి సంతకి వెళ్ళాను. ఒక్కటంటే ఒక్క ఆవు అమ్మకానికి రాలేదు,` అంటున్నాడు ఒకాయన. ఆవుల్ని సంతవరకూ రానివ్వకుండా దొరికిన దగ్గర దొరికినట్టుగా సరాసరి కొనేస్తున్నారట!
రాజమండ్రీలో పుష్కరఘాట్‌లు నిర్మించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. గోదావరి వొడ్డున ఉన్న పట్టణాలలో, పల్లెటూర్లలో కూడా నదీ స్నానాలకు ఏర్పాట్లు చేశారు. యానంలో చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పుష్కరుడికి స్వాగతం పలికారు. రాష్ట్రాలు, జిల్లాలు దాటి ఎక్కడెక్కడి నుంచో జనాలు పుష్కర స్నానం కోసం గోదావరి వైపుకు ప్రయాణం మొదలు పెట్టారు. పవిత్ర స్నానాలు చేసి, వెళ్తూ వెళ్తూ కూడా గోదావరి జలాల్ని తీసుకొని వెళ్ళి తమ ప్రాంతంలో కాలువల్లో, చెరువుల్లో కలుపుతారట. అలా చేస్తే పంటలు బాగా పండుతాయని విశ్వాసం. స్వయంగా వెళ్ళి గోదావరి నదిలో స్నానం చెయ్యలేని వాళ్ళకోసం తపాలా శాఖవారు గాడ్‌జల్ పేరుతో ఇరవై రూపాయలకే పుష్కర గోదావరి జలాల్ని అందుబాటులోనికి తెస్తున్నారు. పుష్కరాలు జరిగే 12 రోజులూ విద్యాసంస్థలకి శెలవులు ఇవ్వాలని విద్యాశాఖామాత్యులు ఉత్తర్వులు ఇచ్చారని ఇప్పుడే ఎవరో అంటున్నారు. కానీ, ఎవ్వరూ ఇంకా శెలవులు ప్రకటించినట్టుగా సమాచారం లేదు.
శెలవులు ఉన్నా లేకపోయినా పుష్కరస్నానానికి చలో!
© Dantuluri Kishore Varma
Monday, 16 February 2015
వర్షించే కళ్ళు
మహాశివరాత్రి సందర్భంగా భారతదేశంనుంచి ఇరవైఒక్క మంది హిందూ భక్తులు పాకిస్థాన్‌లోని కటాస్‌రాజ్ దేవాలయాన్ని దర్శించడానికి వెళ్ళారని నిన్నటి వార్త. పాకిస్తాన్‌లో మైనార్టీ వర్గాల దేవాలయాలని పరిరక్షించే ఎవాక్యుఈ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్(ఈటీపీబీ) అధికారులు ఈ హిందూ భక్తులకి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేశారని పేపర్లలో రాశారు. ఈ వార్త చూసిన తరువాత కటాస్‌రాజ్ దేవాలయం గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. గూగుల్‌లో వెతికితే చాలా సమాచారం లభ్యమయ్యింది. ఆ విశేషాలు మీకు కూడా నచ్చవచ్చని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.
![]() |
| Photo from the net |
లాహోర్ నుంచి 270 కిలోమీటర్ల దూరంలో, పంజాబ్‌లో చక్వాల్ జిల్లాలో సుమారు 900 సంవత్సరాల పురాతనమైన కటాస్‌రాజ్ దేవాలయం ఉంది. కటాస్ అనే కోనేరుకి చుట్టూ ప్రధానంగా ఏడు దేవాలయాలు ఉంటాయి. ఇవికాక ఇంకా కొన్ని చిన్న చిన్న మందిరాలు కూడా ఉంటాయి. శివాలయం, రామాలయం, హనుమంతుని మందిరాలు ఉన్నాయి. కటాస్ కోనేరులో జలం చాలా మహిమాన్వితమైనదని భక్తుల నమ్మకం. ఈ కోనేరులో తప్పక స్నానాలు చేస్తారు. స్థల పురాణం ప్రకారం సతీదేవి మరణం తరువాత శివుడు ఎంతో ధు:ఖించాడట. అతని కన్నీరే ఈ కోనేటిలో నీరుగా మారిందని అంటారు. సంస్కృతంలో కేటాక్ష అంటే వర్షించే కళ్ళు అని అర్థమట. పాండవుల వనవాస సమయంలో నాలుగు సంవత్సరాలు ఇక్కడే గడిపారట. ఈ కోనేటి దగ్గరే యక్ష ప్రశ్నలకి సమాధానాలు చెప్పి ధర్మరాజు తన సోదరులని రక్షించుకొన్నాడని చెపుతారు.
కటాస్‌రాజ్ దేవాలయాల సముదాయాన్ని ప్రపంచ వారసత్వ సంపద(వాల్డ్ హెరిటేజ్ సైట్) గా గుర్తించాలని యునెస్కో్‌కి పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతిపాధనలు పంపిందట. కటాస్‌రాజ్ దేవాలయం పేరుమీద పాకిస్థానీయులు నిర్వహిస్తున్న రెండు ఫేస్‌బుక్ పేజీలు కూడా చూశాను. వాటిలో చాలా చక్కని ఫోటోలను అప్‌లోడ్ చేస్తున్నారు.
కటాస్‌రాజ్ విశేషాలు ఈ డాక్యుమెంటరీలో చూడండి.
కటాస్‌రాజ్ దేవాలయాల సముదాయాన్ని ప్రపంచ వారసత్వ సంపద(వాల్డ్ హెరిటేజ్ సైట్) గా గుర్తించాలని యునెస్కో్‌కి పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతిపాధనలు పంపిందట. కటాస్‌రాజ్ దేవాలయం పేరుమీద పాకిస్థానీయులు నిర్వహిస్తున్న రెండు ఫేస్‌బుక్ పేజీలు కూడా చూశాను. వాటిలో చాలా చక్కని ఫోటోలను అప్‌లోడ్ చేస్తున్నారు.
కటాస్‌రాజ్ విశేషాలు ఈ డాక్యుమెంటరీలో చూడండి.
అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
© Dantuluri Kishore Varma
Saturday, 25 October 2014
ఇటువంటి బడి..
వీరేంద్ర హెగ్గడే అనే ఆయన గురించి తెలుసుకొంటే ఆనందం వేస్తుంది. కర్నాటకలోని ధర్మశాలలో ఉన్న పురాతనమైన మంజునాథుని దేవాలయం గురించి చాలామంది వినే ఉంటారు. ఆ దేవాలయానికి వంశపారంపర్య ధర్మకర్త ఈయన. కేవలం దేవాలయానికి సంబంధించే కాకుండా సామాజిక సేవకు సంబంధించిన విషయాలలో వీరేంద్ర హెగ్గడే చూపించిన మార్గం ఎంతో విలక్షణంగా ఉంటుంది.
ప్రస్తుత కాలంలో చదువు అంటే ఏమిటని ఎవరినైనా అడిగితే - పాఠాలని గుర్తుపెట్టుకోవడం, పరీక్షల్లో వేలో లక్షలో సంఖ్యలో ఉండే పోటీదారులతో తలపడి ర్యాంకులు సంపాదించడం, తరువాతి తరగతికి వెళ్ళడం.. అని సమాధానం చెపుతారు. ఇంగ్లీష్‌లో కౌచ్‌పొటేటో అనే పదం ఉంది. బడికి వెళ్ళివచ్చిన తరువాత కాళీ సమయం అంతా సోఫాలో కూర్చొని ఏ చిప్సో తింటూ టీవీ చూడడమో, కంప్యూటర్ గేంలు ఆడుకోవడమో చేసేవాళ్ళని కౌచ్‌పొటేటోలని పిలుస్తారు. ప్రస్తుతం చాలామంది పిల్లల్ని చూస్తుంటే కౌచ్‌పొటేటోల్లాగే అనిపిస్తున్నారు. శారీరకశ్రమ చెయ్యలేరు. ఇంటిలో తమ్ముడో, చెల్లెలో కూడా ఉండని పరిస్థితి కనుక మరొకరి పొడగిట్టడంలేదు. ఖర్మకాలి చదువుకొన్న చదువుకి తగిన ఉద్యోగం రాకపోతే వీళ్ళు ఎందుకూ కొరగాని వాళ్ళలా తయారయ్యే ప్రమాదం ఉంది.
కానీ దక్షిన కర్నాటకలో వుజైర్ అనే ఊళ్ళో హెగ్గడే స్థాపించిన రత్నమానస అనే పాఠశాలలో చరిత్ర, విజ్ఞానశాస్త్రం, గణితం, రెండో మూడో భాషలతో పాటు జీవితానికి ఉపయోగపడే ఎన్నో నైపుణ్యాలని నేర్పుతారు. ఇక్కడి విద్యయొక్క ప్రత్యేకత ఏమిటంటే విద్యార్థులే తాముండే హాస్టల్‌ను నిర్వహించుకోవాలి. పంటలు పండించుకోవాలి, పశువుల దగ్గర పాలు పిండుకోవాలి, వ్యవసాయ ఉత్పత్తుల్నీ పాలనీ అమ్ముకోవాలి, వచ్చిన సొమ్ముని సహకారసంస్థల్లో, బ్యాంకుల్లో మదుపుచెయ్యాలి, వండుకోవాలి... ఇంకా హాస్టల్లో చెయ్యవలసిన అన్నిపనులనీ విద్యార్థులే స్వయంగా చెయ్యాలి. ఒకపూట చదువు, మరొకపూట ఈ పనులు. మన పనుల్ని ఇతరులమీద ఆధారపడకుండా మనమే చేసుకోవడం, పండించుకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం, డబ్బుని నిర్వహించుకోవడం, అవసరం అయినచోట మిగిలిన వారి సహకారం తీసుకోవడం... ఇదే జీవితాన్ని విజయవంతంగా జీవించడానికి కావలసిని నిజమైన చదువు! అలాంటి చదువునే నేర్పిస్తుండడంతో ఇక్కడి విద్యార్థులు విజయాలబాటన నడుస్తున్నారట!
రత్నమానసలో చేరడానికి రాష్ట్రం నలుమూలలనుంచీ ఎంతో మంది పోటీపడతారు. అయితే ఇక్కడ ప్రవేశ పరిక్షకూడా వినూత్నంగా ఉంటుంది. ప్రవేశం కోరుకొనే విద్యార్థుల్ని హాస్టల్లో మూడురోజులు ఉంచుకొని వాళ్ళ దృక్పదాలని గమనించిన తరువాత ఎంపిక చేస్తారుట. ఎంపికకి తమపనుల్ని చేసుకోగలగడం, మిగిలినవారితో వ్యవహరించడం అనే విషయాలు ముఖ్యమైనవి. అప్పటికే హాస్టల్‌లో ఉండి చదువుకొంటున్న పైతరగతి విద్యార్థుల్లో ఒక్కొక్కరికి కొత్తగా చేరిన వాళ్ళల్లో ఒక్కొక్కరిని అప్పగిస్తారట. అప్పటినుంచి వాళ్ళూ సొంత తమ్ముడికి నేర్పించినట్టు పనులన్నీ నేర్పించాలి.
రోజువారీ కార్యక్రమాలతో పాటూ ప్రతీవిద్యార్థీ రోజుకొక మంచి విలువలతో కూడిన కథనో, ఓ మహానీయుడి జీవితచరిత్రనో చదివి తనకు అర్థమైనంత మటుకు దానిగురించి రాయాలి. దీనివల్ల వాళ్ళందరూ ఎంతో స్పూర్తిని పొందుతారు. సాయంత్రం సమయాల్లో ఆటలాడతారు. స్టడీ ట్రిప్పుల్లో భాగంగా పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి, పరిశ్రమలకి, బ్యాంకులకి వెళతారు. అక్కడ జరిగే పనులని గమనిస్తారు.
రత్నమానసల్లాంటి పాఠశాలలు మనకి కూడా ఉంటే బాగుండుననిపిస్తుంది కదూ? అటువంటివి వచ్చేవరకూ మామూలు బడుల్లో చదువుకొంటున్న పిల్లల్ని ఇంటిదగ్గర తల్లితండ్రులైనా కౌచ్‌పొటేటోల్లా మార్చకుండా రోజువారీ పనులూ, లోకజ్ఞానం నేర్పించడం, చక్కని పుస్తకాలు చదివించడం లాంటివి చేయిస్తే బాగుంటుంది కదా?
కావాలంటే వాళ్ళకి ఈ వీడియో చూపించండి. ఇది కన్నడ భాషలో ఉన్నప్పటికీ, ఈ టపాలో ఉన్న విషయం చదివి, వీడియో చూస్తే విషయం చక్కగా అర్థమౌతుంది.
© Dantuluri Kishore Varma
Sunday, 20 July 2014
ఇళ్ళు ఇలా కూడా కట్టుకోవచ్చు!
ప్యూరిఫైడ్ వాటరో, కూల్‌డ్రింకో తాగేసి ఖాళీ ప్లాస్టిక్ సీసాల్ని పారేస్తాం. రైలు పట్టాలకి ఇరువైపులా, రోడ్లమీద, చెత్తకుండీల దగ్గర, డ్రెయిన్లలో, పిక్నిక్ స్పాట్ల దగ్గర కుప్పలు తెప్పలుగా పెట్ బాటిల్స్ అని పిలవబడే పాలిథిన్ టెరెప్తలేట్ సీసాలు పోగుపడిపోతున్నాయి. వీటిని అలాగే వదిలేస్తే పర్యావరణానికి చాలా నష్టం అని చెపుతారు. ఒక్కొక్క సీసా క్రమంగా భూమిలో కప్పడిపోయి, మట్టిలో కలిసిపోవడానికి వెయ్యి సంవత్సరాల కాలం పడుతుందట. అలా కాకుండా వాటిని రీ సైకిల్ చేస్తే మరొక రకమైన ప్లాస్టిక్ వస్తువులుగా తయారు చేసుకోవచ్చు. రీసైక్లింగ్ వల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి - మొదటిది చెత్తను వదిలించుకోవడం, రెండవది కొత్తగా ప్లాస్టిక్ తయారు చెయ్యడానికి కావలసిన సహజ వనరులని వినియోగించనక్కర్లేక పోవడం. కానీ, ఈ ప్లాస్టిక్ బాటిల్స్ విషయంలో వందశాతం రీసైక్లింగ్ జరగడంలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇరవై నుంచి ముప్పై శాతం సీసాలు మాత్రమే రీసైక్లింగ్‌ద్వారా తిరిగి వినియోగింపబడుతున్నాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. వాడేసిన ప్లాస్టిక్ సీసాల్ని ఎక్కువ సంఖ్యలో ఉపయోగించుకొనే గొప్ప ఆలోచనని మీతో పంచుకొందామని ఈ టపా.
ఈ రోజు ఒక వీడియో చూశాను. ఓ ఇంజనీరింగ్ కాలేజీవాళ్ళూ విద్యార్థులచేత ఒక షెడ్ కట్టించారు. షెడ్లు నిర్మించడం కొత్తవిషయం కాదు. కానీ నిర్మాణానికి అవసరమైన ఇటుకలకు బదులుగా పెట్ బాటిల్స్‌ని వినియోగించడం ఇక్కడ గమనించ వలసిన విషయం. ఖాళీ సీసాల్లో మట్టిని కూరి, మూతలు పెట్టేసి వాటిని ఇటుకలుగా ఉపయోగించారు. గోడలు కట్టేసిన తరువాత సిమ్మెంటుతో ప్లాస్టరింగ్ చెయ్యడమో, పాతకాలం పల్లెటూరి గుడిసెలకి మెత్తినట్టు ఎర్రమట్టిని మెత్తడమో చేస్తే గోడల లోపల ఉన్నవి ఇటికలో, పెట్ బాటిల్సో తెలియనే తెలియదు. నిర్మాణాన్ని వివరంగా చూపించిన ఓ వీడియోని ఇక్కడ చూడండి.
పెద్ద నిర్మాణాలని చెయ్యడానికి ఈ విధానం ఎంతవరకూ ఉపయోగపడుతుందో తెలియదు కానీ షెడ్లు, ప్రహారీ గోడలు, మరుగుదొడ్లు, వాటర్‌టేంకులు లాంటివాటిని చక్కగా కట్టుకోవచ్చు. పల్లెటూరిలో ఉన్న ఒక పేద రైతుకూలీ తన ఇంటికి చేర్చి ఓ మరుగుదొడ్డిని కట్టుకోవాలనుకొంటే ప్రతీరోజు తనకున్న ఖాళీ సమయాల్లో సేకరించి పెట్టుకొన్న ప్లాస్టిక్ బాటిల్స్‌లో మట్టిని నింపుకోవచ్చు. కుటుంబ సభ్యులందరూ తలో చెయ్యీ వేస్తే కొద్దిరోజుల్లోనే కట్టుబడికి అవసరమైన సీసా ఇటికలు తయారు చేసుకోవచ్చు, సీసాల్ని సేకరించడం పెద్ద సమస్యకాదు. అవి ఉచితంగా లభించక పోతే పాత పేపర్లు, చెత్త సామాన్ల వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర చాలా తక్కువ ధరకి దొరుకుతాయి.
ప్లాస్టిక్ సీసాలతో నిర్మించిన ఇళ్ళు భూకంపాలకి నిలబడతాయా? అగ్ని ప్రమాదాల్లాంటివి సంభవిస్తే నిప్పు తొందరగా అంటుకోవడం, విషతుల్యమైన పొగలని వెలువరించడం జరగుతుందా? అనే విషయాలు తెలియవు.
వీడియో చూసిన తరువాత ఆసక్తికరంగా అనిపించడంతో కొంత గూగుల్ సెర్చ్ చేసి వివరాలు తెలుసుకొన్నాను. ఈ నిర్మాణ విధానం కొత్తదేమీ కాదు. చాలా కాలంనుంచి వివిధ దేశాల్లో అవలంభిస్తున్నారు. మనరాష్ట్రంలో మాత్రం ఎక్కడా ఇలా నిర్మాణాలు చేస్తున్నట్టు లేదు. కాబట్టి మనవరకూ ఇది కొత్త విషయమే!
© Dantuluri Kishore Varma
Wednesday, 4 June 2014
వాహ్వా, ఏమి ఐడియా!
మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా కురియన్‌తో ఇందిరాగాంధీ ఒక మాట అన్నారట. `మా ఫాంలో ఆవు పాలు అమ్మితే చాలా తక్కువ ధర, అవే ఢిల్లీలో కొందామంటే మూడురెట్లు ఎక్కువ. ఎందుకు?` అని. ఇప్పటికీ పరిస్థితి మారలేదు. పైపెచ్చు మరింత అధ్వాన్నంగా తయారయ్యింది. పాలే కాదు, వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా అలానే ఉన్నాయి. ధరలలో ఈ తేడా ఎవరి జేబుల్లోనికి వెళుతుంది? పండించిన వ్యవసాయదారుడు అమ్ముదామంటే అడివి, మధ్యతరగతి వాడు కాయగూరల కొందామని మార్కెట్టుకి వెళితే కొరివి. రైతు దగ్గర కొని మార్కెట్‌లో అమ్మే మధ్యదళారీలు బాగుపడుతున్నారు.
వినియోగదారులు తోటల దగ్గరకి వెళ్ళి నేరుగా రైతుల దగ్గరనుంచి కావలసిన కాయగూరలు కొనుక్కోవాలి. లేదంటే రైతులే వాళ్ళ పంటని వినియోగదారుల దగ్గరకి తీసుకొని రావాలి. అప్పుడు ఈ రెండువర్గాల వాళ్ళూ లాభపడతారు. కానీ అలా జరిగే అవకాశం ఉందా?
కాకినాడ నుంచి పిఠాపురం మీదుగా కత్తిపూడి వెళ్ళే దారిలో గొల్లప్రోలు దాటిన తరువాత ఎడమచేతి వైపు తాటిపర్తి వెళ్ళే రోడ్డు తగులుతుంది. అది ధర్మవరం దగ్గర ఐదవనంబరు జాతీయ రహదారిని కలుస్తుంది. ఈ మార్గంలో రోడ్డుకి ఇరువైపులా సారవంతమైన భూముల్లో చాలా మంది రకరకాల కాయగూరలని పండిస్తున్నారు. కాకినాడ నుంచి మా స్వంత ఊరు రాచపల్లికి ఈ మార్గంలోనే వెళుతుంటాం అప్పుడప్పుడూ. ఊరినుంచి తిరిగి వచ్చేటప్పుడు రోడ్డుకి ప్రక్కన గోనెపట్టాలు పరిచి వాటిపైన తాజా కాయగూరలని పేర్చి అమ్ముతూ కనిపిస్తూ ఉంటారు రైతులు. టొమాటాలు, బెండకాయలు, గోంగూర లాంటివి నవనవలాడుతూ ఉంటాయి. ధరలు భహు తక్కువ. రైతు బజారులో పాతికరూపాయలు అమ్మే బీరకాయలు ఇక్కడ పదిరూపాయలకే దొరుకుతూ ఉంటే ఆశ్చర్యపోతాం. పల్లెలకి దూరంగా ఉండి ఎంత నష్టపోతున్నామో తెలిసి వస్తుంది. కానీ ఏం చేస్తాం? ప్రతీరోజూ ఇంత దూరం వచ్చి కొనుక్కోలేం కదా?
ఈ రోజు న్యూస్‌పేపర్లలో అంతగా ప్రాముఖ్యత లేని మూలలో ఒక చిన్న వార్త ప్రచురితమైంది. పై ఊళ్ళల్లో కాయగూరల రైతులు హార్టీకల్చర్ డిపార్ట్‌మెంటు నుంచి కొంత సబ్సిడీ తీసుకొని ఓ ఐదు లక్షల విలువైన వేన్ కొనుగోలు చేసుకొన్నారు. దానికి గ్రీన్‌వేన్ అని నామకరణం చేశారు. వాళ్ళ పొలాల్లో పండిన కాయగూరలని వేన్‌లో వేసుకొని దగ్గరలో ఉన్న పిఠాపురానికీ, గొల్లప్రోలుకీ తీసుకొని పోతున్నారు. క్రమంగా కొంచం పెద్ద పట్టణాలకి కూడా విస్తరిస్తారు. మార్కెట్ ధరల కంటే తక్కువకి తాజా కాయగూరలు గ్రీన్ వేన్‌లో వచ్చి ఇంటి ముందు నిలబడితే కొనుక్కోకుండా ఉంటామా? మనకి లాభమే కదా? అమ్మే రైతులకీ లాభమే.
వాహ్వా, ఏమి ఐడియా!
![]() |
| Photo: The Hindu |
© Dantuluri Kishore Varma
Friday, 16 May 2014
ఎన్నికల ముచ్చట్లు
ఏప్రిల్ ఏడున ప్రారంభమైన వోటింగ్ ప్రక్రియ సుమారు నెలరోజుల పాటు కొనసాగింది.
మనదేశంలో ఈ దఫా 814 మిలియన్ ప్రజలు,
అంటే యూరోప్ ఖండపు జనాభా కంటే ఎక్కువమంది వోటు హక్కు కలిగిన వాళ్ళు ఉన్నారు.
18-19 సంవత్సరాల వయసున్న 23 మిలియన్ల యువత ఈ సారి వోటుహక్కును పొందారు.
ఈ సంఖ్య మొత్తం వోటర్లలో మూడు శాతం.
దేశవ్యాప్తంగా 9,30,000 వోటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పోటీ చేసిన అభ్యర్థులను అందరినీ తిరస్కరించే వోటు -
నోటా(నన్ ఆఫ్ ద ఎబౌ) ని ఈసారి చేర్చారు.
వోటరు చూపుడు వేలిమీద వేసే గుర్తుకు వాడే ఇంకుని -
మైసూర్ ఇంక్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేసింది.
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు చాలా ఉత్కంఠ కలుగజేశాయి.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల దృష్టీ భారతదేశం మీదే ఉంది.
మే పదహారున అంటే ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు -
కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ప్రజలు టీవీలకి,
లెక్కింపు కేంద్రాలకీ అతుక్కొని పోయారు.
ఏనోట విన్నా ఎన్నికల మాటే!
కేంద్రంలో నరేంద్ర మోడీ నేత్రుత్వంలో బీజేపీ
అత్యధిక మెజారిటీ సాధించి, ప్రభుత్వాన్నీ ఏర్పాటు చెయ్యబోతుంది.
తెలంగాణా మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్,
ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు
ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారు.
పైన పేర్కొన్న కొన్ని విషయాలకు సోర్స్: డెక్కన్ క్రోనికల్
Dantuluri Kishore Varma
Tuesday, 6 May 2014
ఎన్నికలు
రాజకీయ సందడి పెద్ద ఎత్తున మొదలైపోయింది. జనాల్లోకి వెళ్ళడం, సభలు ఏర్పాటుచేసుకోవడం, జనాలని సమీకరించుకోవడం, మేం ఇది చేశాం అది చేశాం అని చెవుల్లో ఇల్లు కట్టుకొని చెప్పడం, వాగ్ధానాలు గుప్పించడం, కరపత్రాలు పంచడం, పేపర్ పబ్లిసిటీ, మీడియా ప్రోపగాండా... రాజకీయపార్టీలు ఓట్లకోసం ఎన్ని చెయ్యాలి! ఏ విధానం అవలంభించినా వోటరుని మనం చెప్పింది వినేటంత వరకూ ఓపికగా కూర్చో బెట్టాలి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జనరేషన్ వోటర్లు 50శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. మన రాష్ట్రంలో సుమారు ఆరుకోట్ల ముప్పై లక్షల మంది ఓటర్లు ఉంటే వాళ్ళల్లో మూడున్నర కోట్ల మంది యువతే నట. వీళ్ళని ఆకర్షించాలంటే పాత పద్దతుల అవలంభన ఒక్కటే సరిపోదు. వాళ్ళు ఏ మాధ్యమంలో అందుబాటులో ఉంటారో అక్కడే వాళ్ళకు చెప్పాలి. పాతపద్ధతులనే పట్టుకొని వ్రేలాడకుండా అలా మార్పు చెందగలిగిన స్మార్ట్ అభ్యర్థులకే విజయావకాశాలు ఉంటాయని విజ్ఞులు చెపుతున్నారు. లక్షలకోట్ల రూపాయలు వెచ్చించినా జరగనంత ప్రచారాన్ని ఇప్పటికే సొంతంచేసుకొన్న మోడి గారిని చూడండి! యువత పల్స్‌ని ఎప్పుడో అవగాహన చేసుకొని ఫేస్‌బుక్, ట్విట్టర్లు లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఒక హవాని సృస్టించుకొన్నారు.
ఇక్కడ ఇలా ఉదహరించడం ఆయన రాజకీయ విధానాలు మంచివా, చెడ్డవా అని తర్కించడానికి కాదు. చురుకుగా ఆలోచించి కాలానికి అనుగుణంగా మారగలిగిన వాళ్ళకి విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పడానికి మాత్రమే. రాజకీయాల్లోనే కాదు, ఎక్కడైనా సరే మార్పు ఒక్కటే శాశ్వతం. కాబట్టి మంచివైపు, అభివృద్దివైపు ప్రస్థానంకోసం మారగలిగిన వాడే విజేత.
ఇలాంటి పరిస్థితుల్లో గెలుపుని నిర్ణయించేది వేసిన వోట్లు కాదు, వెయ్యని వోట్లే!
* * *
ఓ వైపు వోటరు గెలుపు అవకాశాలున్న అభ్యర్థులవైపు మొగ్గుచూపుతున్నాడు.
అడవిలో అందాల కథానాయిక కోసం పట్టణం నుంచి వెళ్ళిన కథానాయకుడు టార్జాన్‌లా ఉండే అడవిమనిషితో పోటీకి దిగవలసి వస్తుంది. వాడిని ఓడిస్తేనే పిల్ల దక్కుతుంది. ఎలా ఓడించాడు అనేది ముఖ్యంకాదు - కాలులాగో, కన్నుపొడిచో విజయాన్ని దక్కించుకోవలసిందే! కథానాయకుడు ఖచ్చితంగా గెలవాలని ప్రేక్షకులు కోరుకొంటారు. దానికోసం టార్జాన్ కళ్ళల్లో హీరో కారం కొడితే ఈలలు వేసి సమర్ధిస్తారు. ఎందుకంటే హీరోలో తమనితాము ఐడింటిఫై చేసుకొంటారు కనుక. ఎలాగోలా హీరోయిన్ గెలిచినవాడికి దక్కితే మనకీ దక్కినట్టే అన్నంత ఆనందపడిపోతాడు. ఆమెని గెలుచుకోవడానికి ఏమిచేసినా పరవాలేదనే దృక్పదం!
రాజకీయం కూడా అలాగే తయారయినట్లుంది. సీట్లకేటాయింపుకోసం కోట్లరూపాయలు చేతులు మారుతున్నాయని, వేలకోట్లలో అవినీతికి పాల్పడ్డారని ప్రత్యర్థులు ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకోంటున్నారు. వేలల్లో మాత్రమే సంపాదన ఉన్న సామన్యుడు అన్ని వేలకోట్లలో ఎన్ని వేలు ఉంటాయో అని ఆశ్చర్యపోవడం మానేసి, అదేదో సామాన్యమైన విషయంలా భావిస్తున్నాడు. గెలుపు అంచనాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. విజయావకాశాలు ఎటువైపు ఉంటే అటువైపుకు వలసలు జరుగుతున్నాయి. కార్యకర్తలుకూడా పోలోమని తమ నాయకులవెంటే పార్టీపిరాయింపులు చేస్తున్నారు. రోడ్డునపోయే దానయ్యని ఆపి `మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎందుకు అలా అనుకొంటున్నావు?` అని అడిగితే `పాలానా వాడు. ఎండుకంటే బాగా ఖర్చుపెట్టే దమ్ముంది,` అని చెపుతున్నాడు. మనిషి దృక్పదంలో ఎంత మార్పు వచ్చింది! అవినీతి అనే మాటకి చలించడం మానేశాడు. పైపెచ్చు పరుగుపందెం లాంటి ఆటని ఆస్వాదిస్తున్నాడు. గెలుపే ప్రధానం. అది ఎలా దక్కినా సరే! గెలిచినవాడే హీరో! వాడి ప్రక్కన మనం ఉంటే, మనమూ విజేతలమే.
* * *
ఎన్నికల సమయంలో ప్రత్యర్థిమీద బురద జల్లడం తప్పించి గెలిచి తాను చెయ్యబోయే ప్రజా సంక్షేమ పనులు ఏమీటో చెప్పే ప్రబుద్దుడు ఎక్కడా కనిపించడంలేదు. అలాగని వాగ్ధానాలేవీ చెయ్యడం లేదని కాదు. చేసే ప్రతీ వాగ్ధానం వెనుకా ఓటుబ్యాంక్ రాజకీయమే ఉంటుంది. అధికారం అంతిమ లక్ష్యం. దానికోసం ఎన్ని పన్నాగాలయినా పన్నవచ్చు. చూసి, చూసి సామాన్యుడికి ఒక్కోసారి ఎన్నికలలో పోటీచేసే ఏ అభ్యర్ధీ సరయిన వాడిలా తోచడం లేదు. నిరాసక్తత వాళ్ళని ఓటింగ్‌కి దూరంచేస్తుంది. చాలా చోట్ల ఓటింగ్ శాతం తక్కువగా ఉండడానికి కారణం ఇదే. కానీ, ఓటువెయ్యకపోతే రాను, రానూ ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే ఓటుహక్కు కలిగిఉన్న ప్రతీ ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే వోటరుగా నమోదయిన యువత తాము వేసే ఓటుతో రాజకీయాల్లో అభిలషణీయమైన మార్పు తీసుకొని రావడానికి వోటింగ్ కేంద్రాలవైపు అడుగులు వెయ్యాలి.
ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టులాంటి ఓటుహక్కుని వినియోగించుకోవాలని అప్పుడే ప్రశ్నించే హక్కు ఉంటుందని అధికారులు ప్రకటనలు ఇచ్చి ఓటర్లను ఉత్సాహపరుస్తున్నారు. వీటికితోడు సెలబ్రిటీలు, ప్రయివేట్ సంస్థలు, ఎన్జీవోలు ప్రజలకి ఓటింగ్ మీద సదావగాహన కల్పించడానికి ప్లెడ్జ్ టు వోట్ కేంపయిన్‌లు చేస్తూ తమవంతు సామాజిక బాధ్యతని నిర్వర్తిస్తున్నారు. ఇందులో భాగంగా గూగుల్ ఇండియా వాళ్ళు చేసిన ఒక వీడియో చాలా ఇన్స్పయరింగా ఉంది. శ్యాం శరణ్ నెగీ అనే ఒక 97 సంవత్సరాల వృద్దుడి గురించి ఆ వీడియో. ఈయన స్వాతంత్ర్యభారతదేశపు మొట్టమొదటి ఓటరట. 1951లో తన ముప్పైనాలుగవ ఏట ఓటువేసింది మొదలు ఇప్పటివరకూ ఏ ఎన్నికలలోనూ తన హక్కును వినియోగించుకోకుండా లేడట! చలైనా, వానయినా, అడుగు బయటపెట్టలేని మంచయినా తన ధర్మాన్ని నిర్వర్తించాడట.
వీడియో మీరుకూడా చూడండి.
* * *
ఎక్కడిదాకానో ఎందుకు మనకు దగ్గరలోఉన్న ఈ ఉదాహరణ చూడండి.
హోప్ ఐలాండ్ కాకినాడ సముద్రతీరానికి తుర్పువైపు 15 కిలోమీటర్లదూరంలో ఉంది. ఎప్పుడో రెండువేల సంవత్సరాల క్రితం గోదావరినది బంగాళాఖాతంలోనికి తీసుకొని వెళ్ళిన ఇసుక మేటల వల్ల హోప్ ఐలాండ్ ఏర్పడిందని చెపుతారు. సుమారు పదహారు కిలోమీటర్ల పొడవు, ఒక కిలోమీటరు వెడల్పుతో ఒక చిన్న ద్వీపంలా ఉంటుంది ఇది. కాకినాడ సముద్రతీరం నుంచి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. హోప్ ఐలాండ్ కాకినాడకి ఒక వరంలాంటిదని చెప్పుకోవచ్చు. సముద్రంవైపునుంచి వచ్చే తుఫానులు, ఉప్పెనలు, సునామీలనుంచి పట్టణాన్ని రక్షణగోడలా ఉండి రక్షిస్తుంది.
కొన్ని దశాబ్దాలక్రితం నుంచీ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని కొన్ని మత్యకార కుటుంబాలు ఇక్కడ నివశిస్తున్నాయి. వాళ్ళకు కరెంట్ ఉండదు. పిల్లలకి పాఠశాలలు ఉండవు. వైద్యానికి ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు ఉండవు. సూపర్‌బజార్లు, షాపింగ్ మాల్సు ఉండవు. రవాణాకి నాటుపడవలు తప్ప మరేమీ ఉండవు. కానీ ఓ రెండువందల యాభై నుంచి మూడువందల యాభై మందికి వోటుహక్కు ఉంది. వోటుహక్కు వినియోగించుకోవడానికి హోప్ ఐలాండ్ వాసులు తాళ్ళరేవు దగ్గర ఉన్న చిన్నబొడ్డు వెంకటాయపాలెం అనే ఊరికి వెళ్ళాలి. ఇది ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనికి వస్తుంది. వోటర్లు హోప్ఐలాండ్ నుంచి నాటుపడవలు ఎక్కి రెండుగంటలు ప్రయాణం చేసి కాకినాడ తీరం చేరాలి. అక్కడినుంచి ఆటోలో, ప్రయివేటు బస్సులో పట్టుకొని వాళ్ళ పోలింగ్ స్టేషన్‌కి వెళ్ళాలి. ఆడ, మగ, ముసలి, ముతక అందరూ ఈ అవస్థలు అన్నీ పడితే కానీ వోటు వెయ్యడం సాధ్యం కాదు. ఇన్ని సమస్యలున్నా వాళ్ళు వోటు వెయ్యడానికి వస్తారు.
పైన శ్యాం శరణ్ నెగీ గురించి, ఆయన వోటు హక్కుని వినియోగించుకొనే నిబద్ధత గురించి చదివాం. హోప్ఐలాండ్ వాసుల గురించీ చదివాం. మనకీ ఓటు ఉంటుంది, నడిచి వెళ్ళేటంత దగ్గరలో పోలింగ్ కేంద్రం ఉంటుంది. కానీ, ఏవో కారణాలవల్ల అత్యంత ప్రధానమైన ఈ హక్కుని వినియోగించుకోం! కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో ఇప్పటివరకూ 1,73,980 మంది ఓటర్లు ఉన్నారు. మొన్న నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమంలో కాకినాడనగర నియోజకవర్గంలో ఉన్న 213 పోలింగ్‌బూత్‌లలో నేరుగా అయితేనేమీ, ఆన్‌లైన్‌లో అయితేనేమి కొత్తగా ధరకాస్తు చేసుకొని వోటుహక్కును పొందిన వాళ్ళతో కలిపి ఈ సంఖ్య రెండులక్షలకి చేరిందట. వీరిలో యువకులే ఎక్కువ. కనుక ఈ సారి అభ్యర్థుల ఎంపికలో విప్లవాత్మకమైన వొరవడి ఉంటుందని భావించవచ్చు.
ఎవరో చెప్పినట్టు రాజ్యాధికారాన్ని నిర్ణయించేది వేసిన వోట్లు కాదు, వెయ్యని వోట్లే! రేపు సీమాంధ్రలో జరగబోతున్న ఎన్నికల్లో మన వోటు వేద్దాం!
© Dantuluri Kishore Varma
Thursday, 24 April 2014
పనసకాయలే దిక్కు మహాప్రభో!
ప్రపంచ జనాభా రోజు రోజుకీ పెరుగుతుంది. ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి పంటలు పండించే భూమి విస్తీర్ణం మాత్రం పెరిగే అవకాశంలేదు. కాబట్టి క్రమేపీ ఆహార కొరత ఏర్పడడం తప్పనిసరి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు మారుతున్న వాతావరణ పరిస్థితులవల్ల వేడిగాలుల తీవ్రత పెరిగి, వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, కరువు కాటకాలు సంభవించవచ్చునట. ఇప్పటికే ప్రజల ప్రధాన ఆహారంగా ఉన్న గోదుమలు, జొన్నలు, వరి లాంటివాటి ఉత్పత్తి తగ్గిందని, రాబోయే దశాబ్ధంలో ఆహారంకోసం దేశాలమధ్య యుద్దాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ది గార్డియన్ పత్రిక దీనిగురించి నిన్న ఒక వార్తను ప్రచురించింది.
ఒక సమస్య ఉంది అంటే దానికి పరిష్కారంకోసం ఆలోచిస్తారుకదా? ప్రత్యామ్నాయ పంటలు, ఆహార వనరుల గురించి ప్రపంచబ్యాంక్ వాళ్ళు చెపుతూ మన పనసచెట్లని చూపించారు.
ఒక సమస్య ఉంది అంటే దానికి పరిష్కారంకోసం ఆలోచిస్తారుకదా? ప్రత్యామ్నాయ పంటలు, ఆహార వనరుల గురించి ప్రపంచబ్యాంక్ వాళ్ళు చెపుతూ మన పనసచెట్లని చూపించారు.
కష్టపడకుండా పనసతోటల్ని పెంచవచ్చు. చీడపీడల గొడవ ఉండదు. నీరుకూడా ఎక్కువగా అవసరంలేదు. పనసచెట్టు గుత్తులు గుత్తులుగా ఎన్నో కాయలని కాస్తుంది. చిన్న కాయ కనీసం ఐదారుకేజీలు బరువు తూగుతుంది. పెద్దకాయలయితే సునాయాసంగా ముప్పై, నలభై కేజీలవరకూ తూగుతాయి. పనసకాయలో పీచుని, తొనలని, గింజలని ఆహారంగా ఉపయోగించుకోవచ్చు.
పెళ్ళిళ్ళకీ, ఫంక్షన్లకీ పనసపొట్టుకూర, పనసకాయముక్కల బిర్యానీ చేసుకొంటాం. పనసతొనలు తింటాం, ఎప్పుడైనా పనసపిక్కల కూర వొండుకొంటాం; కాల్చుకొని తిన్నా చాలా బాగుంటాయి. ఈ అవసరాలన్నింటికీ ఉపయోగిస్తున్నా పనసకి మనదేశంలో పెద్దగా మార్కెట్ లేదు. కానీ, రాను రానూ పనసపంటకి విశేషమైన ప్రాధాన్యత వస్తుందని అంటున్నారు. శ్రీలంక, వియత్నం లాంటి దేశాలలో నూడుల్స్, ఐస్క్రీం మొదలైన ఉత్పత్తులు పనసకాయలతో తయారవుతాయి. చపాతీలు చేసుకోవడానికి పనసపిండిని కూడా తయారు చేస్తారు. మనదేశం కూడా ఈ విధానాలని అవలంభించాలని అంటున్నారు.
గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా రొయ్యల చెరువులు కనిపిస్తున్నట్టు, భవిష్యత్తులో `పనసకాయలే దిక్కు మహాప్రభో!` అనిపించేలా పనస తోటలు కూడా విరివిగా కనిపిస్తాయేమో!
పెళ్ళిళ్ళకీ, ఫంక్షన్లకీ పనసపొట్టుకూర, పనసకాయముక్కల బిర్యానీ చేసుకొంటాం. పనసతొనలు తింటాం, ఎప్పుడైనా పనసపిక్కల కూర వొండుకొంటాం; కాల్చుకొని తిన్నా చాలా బాగుంటాయి. ఈ అవసరాలన్నింటికీ ఉపయోగిస్తున్నా పనసకి మనదేశంలో పెద్దగా మార్కెట్ లేదు. కానీ, రాను రానూ పనసపంటకి విశేషమైన ప్రాధాన్యత వస్తుందని అంటున్నారు. శ్రీలంక, వియత్నం లాంటి దేశాలలో నూడుల్స్, ఐస్క్రీం మొదలైన ఉత్పత్తులు పనసకాయలతో తయారవుతాయి. చపాతీలు చేసుకోవడానికి పనసపిండిని కూడా తయారు చేస్తారు. మనదేశం కూడా ఈ విధానాలని అవలంభించాలని అంటున్నారు.
![]() |
| Google images |
© Dantuluri Kishore Varma
Monday, 21 April 2014
పులివేట
`ది హిందూ పేపర్ వాళ్ళు ప్రతీరోజూ అర్థశతాబ్ధం క్రితం నాటి వాళ్ళ పేపర్లనుంచి ఫ్రం ద ఆర్కైవ్స్ అనే శీర్షికతో విశేషాలని ఇస్తూ ఉంటారు. దానిలో ఈ రోజు ఒక నమ్మలేని నిజం లాంటి విషయం చదివాను,` చమన్ అన్నాడు.
`ఏమిటని అడక్కపోయినా చెపుతావు కదా? చెప్పేయి,` అన్నాడు దీపక్.
ఇంటి డాబామీద కూర్చొని ఉన్నారు ఇద్దరూ. కరెంటు లేదేమో అంతా కటిక చీకటిగా ఉంది. ఆకాశంలో చందమామ కాదుకదా, కనీసం నక్షత్రాలు కూడా కనిపించడంలేదు.
చమన్ మొదలు పెట్టాడు, `గుజరాత్‌లో ఒక చిన్న పల్లెటూరు. దానికి దగ్గరలో అడవి ఉంది. ఒక పశువుల కాపరి మేతకోసం ఆవుల్ని అక్కడికి తీసుకొని వెళ్ళాడట. పులి వచ్చింది. దానినుంచి పశువుల్నీ, తననీ కూడా రక్షించుకోవాలి. చేతిలో ఉన్న కర్రతో పులిని అదిలించడానికి ప్రయత్నించాడు. అప్పటికే ఆవులు దూరంగా పరిగెత్తాయి. పులి కొంచెం బెదిరింది కానీ, ఆ చిన్న కర్ర తనని ఏమీ చెయ్యలేదని తెలిసిన తరువాత దాడి మొదలు పెట్టింది.`
`వెర్రివాడిలా ఉన్నాడు. తనసంగతి చూసుకొని ఏ చెట్టో ఎక్కేసి ఉంటే, పులి ఓ ఆవుని చంపి ఉండేది. తాను బ్రతికి పోయేవాడు,` దీపక్ అన్నాడు.
`అలాచేస్తే నమ్మకానికి ద్రోహం చేసినట్టే!`
`ఏడిశావులే... నమ్మకమట, నమ్మకం! మన రాజకీయ నాయకుల్ని చూడు ఒక పార్టీ మానిఫెస్టోతో ఓట్లు అడుక్కొని, గెలిచి, తరువాత పార్టీ పిరాయించడంలేదూ? అది నమ్మక ద్రోహంకాదా? ప్రాణం కంటే గొప్పదా నమ్మకం? పాపం తమ యజమాని పులికి బలయిపోతున్నాడని ఆవులేమన్న ఫీలయిపోయి కన్నీళ్ళు కారుస్తాయా? `
`నిజంగా అలాగే జరిగిందిరా దీపక్! కన్నీళ్ళు పెట్టుకోలేదు కానీ, దూరంగా పారిపోయినవి అన్నీ ఒకజట్టుగా కలిసివచ్చి పులిమీద ఎదురుదాడి చేసి, దానిని చంపేశాయి. తమ కాపరిని కాపాడుకొన్నాయి.`
`భలేగా ఉందిరా చమన్ నీ కథలాంటి నిజం. ఈ మధ్య ఏ విషయం విన్నా దానిమీద రాజకీయాలు ఓవర్‌లేప్ అయిపోతున్నాయి. ఆవులు ప్రజలు, పులి ప్రజాస్వామ్యాన్ని కబళించడానికి వచ్చే స్వార్థరాజకీయం, పశువులకాపరి ప్రజాస్వామ్యం అన్నమాట. ప్రజలసహకారం లేకపోతే ప్రజాస్వామ్యం బ్రతికి బట్టకడుతుందా? ఓటుతో అరా(జ)చకీయుల్ని మట్టి కరిపించవచ్చు కదా?`
చప్పున కరెంట్ వచ్చింది. దానితో పాటు వెలుగూనూ. పద క్రిందకి పోదాం అనుకొని ఇద్దరూ మెట్లవైపు నడిచారు.
`భలేగా ఉందిరా చమన్ నీ కథలాంటి నిజం. ఈ మధ్య ఏ విషయం విన్నా దానిమీద రాజకీయాలు ఓవర్‌లేప్ అయిపోతున్నాయి. ఆవులు ప్రజలు, పులి ప్రజాస్వామ్యాన్ని కబళించడానికి వచ్చే స్వార్థరాజకీయం, పశువులకాపరి ప్రజాస్వామ్యం అన్నమాట. ప్రజలసహకారం లేకపోతే ప్రజాస్వామ్యం బ్రతికి బట్టకడుతుందా? ఓటుతో అరా(జ)చకీయుల్ని మట్టి కరిపించవచ్చు కదా?`
చప్పున కరెంట్ వచ్చింది. దానితో పాటు వెలుగూనూ. పద క్రిందకి పోదాం అనుకొని ఇద్దరూ మెట్లవైపు నడిచారు.
© Dantuluri Kishore Varma
Friday, 14 March 2014
సైమాటిక్స్
సైమాటిక్స్(Cymatics) అనే ఒక శాస్త్రం గురించి మీకు తెలుసా? శబ్ధతరంగాలు ఏ రకమైన ఆకారాలు సృష్టంచగలవో తెలియజేసే సైన్స్ ఇది. హేన్స్ జెన్నీ(Hans Jenny) అనే స్విడ్జర్‌లాండ్ దేశస్తుడు ఈ శాస్త్రానికికి ఆద్యుడు. 1967వ సంవత్సరంలో సైమాటిక్స్ - ద స్టడీ ఆఫ్ వేవ్ ఫినామినా అనే గ్రంధాన్ని విడుదల చేశాడు. టోనోస్కోప్(Tonoscope) అనే ఒక పరికరాన్నీ తయారుచేశాడు. దీనినుంచి శబ్దాన్ని నిర్దుష్టమైన పౌన:పున్యంలో పంపవచ్చు. దానిపైన మనం ఇళ్ళల్లో వాడే జల్లెడ చట్రం లాంటి పరికరాన్ని అమర్చేవాడు. ఈ చట్రంమీద మెత్తని పొడిని జల్లి, టోనో మీటర్ నుంచి శబ్దాన్ని పంపితే చక్కని డిజైన్లు ఏర్పడేవి. వీడియో ఇక్కడ చూడండి.
ఒకనీటి బిందువుని తీసుకొని దానికి దగ్గరగా ఓం అనే శబ్ధాన్ని వెలువరిస్తే, ఆ పౌన:పున్యానికి నీటిబిందువులోని కణాలు సంచలించి శ్రీచక్రపు ఆకారాన్ని ఏర్పరుస్తాయని ఎక్కడో చదివాను. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దీని గురించి మరింత వివరణకోసం ప్రయత్నిస్తే అది కేవలం అపోహ అని, ధ్వని వల్ల పదార్దాలలో ఏర్పడే తరంగాలు కోణాలను ఏర్పరచలేవని, శ్రీచక్రంలో కోణాలు ఉంటాయి కనుక ఇది నిజంకాదని మరోచోట చదివాను. నిజానిజాలు ప్రక్కన పెడితే ఇది ఒక ఆసక్తికరమైన అంశమే!
పైన ఇచ్చిన వీడియో లింక్ గమనిస్తే ధ్వని పదార్థాలయొక్క కణాలలో మార్పును తీసుకొని వస్తుందనేది నిజమే అని తెలుస్తుంది కదా? మనవేదాలలో చెప్పినట్టు ఓం అనే శబ్ధం నుంచి విశ్వం పుట్టింది అనే దానిలో నిజం ఉండి ఉండవచ్చు అని అనిపిస్తుంది. సినిమాలలో చూపిస్తూ ఉంటారు ఒక్కోసారి, పక్షవాతం వచ్చిన వాళ్ళదగ్గర పాటపాడితే వాళ్ళు లేచి నిలబడడం లాంటివి. శ్లోకాలు చదివితే వర్షం కురవడం గురించి విన్నాం. అలాగే వైద్యశాస్త్రంలో ధ్వనితరంగాలను ఉపయోగించి శరీరంలో కణజాలాల కదలికలలో మార్పులు చేస్తూ కొన్ని చికిత్సలు చేస్తున్నారు. వీటన్నింటికీ కారణం సైమేటిక్సే! హేన్స్ జెన్నీ చెప్పడానికి కొన్ని వేల సంవత్సరాలకు ముందే మనవాళ్ళకు దీనిగురించి తెలుసు! హౌ మార్వలెస్!
© Dantuluri Kishore Varma
Monday, 3 March 2014
దీని సోయగం చూడండి!
రాజవీధుల్లోనుంచి అంబారీ కట్టిన ఏనుగు నడచిపోతూ ఉంటే దాని ఠీవీ చూసితీరవలసిందే. పాదచారులు ప్రక్కకి తొలగిపోయి దారి వదులుతారు. ఒక్కోసారి అది మోర పైకెత్తి, తొండం లేపి ఘీంకారం చేసిందంటే దగ్గరలో ఉన్నవాళ్ళకి వెన్నులో వొణుకు పుడుతుంది. దేవుడి సేవలో ఉన్న ఏనుగులకైనా అదే రాజసం. సర్కస్‌లో మావటి చెప్పినట్టు నడుచుకొంటున్నా, ఏనుగుచేసే విన్యాసాలలో లావణ్యం తొణికిసలాడుతుంది. నేషనల్ జియోగ్రాఫిక్ చానల్లో అడివిలో తిరిగే ఏనుగుల గుంపుని చూపిస్తూ ఉంటారు. వాటి స్థిమితమైన లయాత్మక నడక బహు సొగసుగా ఉంటుంది. పరుగెత్తే అశ్వంలో ఒకరకమైన అందముంటే, నడిచివెళ్ళే గజరాజులో మరొక రకమైన అందం ఉంటుంది. ఏది ఏమైనా మనకు తెలుసున్న అందమైన జంతువులలో ఏనుగు మొదటివరసలో ఉంటుంది.
ఏనుగులని చూడాలంటే ఆఫ్రికా ఖండానికో, శ్రీలంకా, ఇండోనేషియా లాంటి దేశాలకో, అదీ కాకపోతే మనకేరళాకో వెళ్ళాలి. లేదంటే పనికిరాని ఇనుపసామాన్లు, కలప లాంటివి పోగేసి ఒక ఏనుగుని తయారుచెయ్యాలి. అది కదలడానికి మోటర్లు, మెషిన్లు తగిలించి, తొండం పైకి ఎత్తడానికి హైడ్రాలిక్స్ ఉపయోగించి, నిజం ఏనుగులాగే కాళ్ళను కదిలించి ముందుకు వెళ్ళడానికి రోబోటిక్స్ సహాయం తీసుకోవాలి. అప్పుడు కేరళ లాంటి ప్రాంతాలనుంచి కూడా ఈ మహా ఏనుగుని చూడటానికి అది ఉన్న ప్రాంతానికి వెళతారు!
ఇదంతా ఎందుకు చెపుతున్నాననే సందేహం వస్తుంది కదా? కొంచెం పాతవిషయమే కానీ, మీకు ఒకవేళ తెలిసి ఉండకపోతే ఆసక్తి కరంగా ఉంటుందని చెపుతున్నాను. ఫ్రాన్స్‌లో నాంటెస్ అనే పట్టణంలో అటువంటి ఏనుగుని తయారు చేశారు. ఓ నలభై తొమ్మిది మంది సందర్శకులని ఎక్కించుకొని, ఘీంకరిస్తూ, తొండంలోనుంచి పొగలు వదులుతూ మందగమనంతో ముందుకుపోతున్న యాంత్రిక గజాన్ని తయారు చెయ్యడానికి చాలా ఖర్చయ్యిఉంటుంది. కానీ, ప్రపంచం దృష్ఠిని తమవైపు ఆకర్షించుకోవడానికి, తమ సృజనాత్మక కళని ప్రదర్శించడానికి అది ఒక గొప్ప ఆలోచన. ఆ వూళ్ళో పాత షిప్‌యార్డ్ గొడౌన్లలో పేరుకుపోయిన పాత ఇనుము, యంత్ర సామాగ్రిని గ్రేట్ ఎలీఫెంట్‌ని తయారు చెయ్యడానికి వాడుకొన్నారు. ఫ్రాంకోయిస్ డెలరోజైర్, పియరి ఆరిఫైస్ అనే ఇద్దరు కళాకారుల సృజన ఇందులో ఉంది. పీసా టవరో, ఈఫిల్ టవరో, కొల్లోసియమో, క్లాక్ టవరో, లండన్‌బ్రిడ్జీనో లేకపోయినా తమకంటూ ఒక ప్రత్యేకతను చూపించుకోవడానికి `మెషీన్స్ ఆఫ్ ఐల్ ఆఫ్ నాంటెస్` ఆలోచన ఫలించింది. ఇప్పుడు యూరోప్ సందర్శించే జనాలు తమ ఐటినరీలో నాంటేస్‌ను కూడా చేర్చుకొంటున్నారట.
© Dantuluri Kishore Varma
Friday, 21 February 2014
పలుకరించక ఎంతకోల్పోతున్నామో!
ఆగ్రాలో తాజ్‌మహల్ని, హైదరాబాద్‌లో బిర్లామందిర్‌ని, బెంగులూరులో లాల్‌బాగ్‌ని చూసి ఆనందపడతాం. టూరుకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ముఖ్యమైన ప్రదేశాల వివరాలను తెలుసుకొని, తిరిగివచ్చి, అంతా చూశామని సంతృప్తిచెందుతాం. నిజానికి మనంచూసేది అంతాకాదు - కొంతమాత్రమే! మిగిలినది కూడా చూడాలంటే అక్కడ ఉన్న జనాలని చూడాలి, వాళ్ళరోజువారీ కార్యక్రమాలని గమనించాలి, వాళ్ళతో మాట కలపాలి. బస్టాపుల్లో, ఆటోల్లో, టీదుకాణందగ్గర, మార్కెట్‌లో... స్థానికులు ఊరిగురించి సమాచారం ఇవ్వడానికి నిజంగా ఉత్సాహం చూపిస్తారు. `బాబూ, ఇక్కడ మంచి భోజనం హోటల్ ఏది?` అని అడిగితే ట్రావెల్ బ్రోషర్లలో కనిపించే రెస్టారెంట్లకంటే మెరుగైనవాటిని చూపిస్తారు. కొంతకాలంగా లండన్లో, బోస్టన్లో, ఇంకా మరికొన్ని ప్రదేశాలలో సిటీవాక్స్ అనే టూర్లు నిర్వహిస్తున్నారు. సందర్శకులవెంట గైడ్లు వస్తారు. కెమేరాలు తీసుకొని వెళ్ళి, నడుస్తూ, ఆగుతూ, జనాలతో మాట్లాడుతూ, హిస్టరీ పుస్తకాలలో దొరకని విశేషాలని అర్థం చేసుకొంటూ, ఫొటోలుతీసుకొంటూ ముందుకు సాగడమే. వీటికి వస్తున్న ఆదరణని గమనించి బెంగులూరు లాంటి చోట్లలోకూడా నడుస్తూ నగరాన్ని చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
ఊరికెళ్ళినప్పుడు జనాలతో మాట్లాడడం మాట అలావుంచితే, మన సొంతవూరిలోనే అటువంటి పని చెయ్యడం మానేసి చాలాకాలం అయ్యింది. చింతపండుకోసమో, సగ్గుబియ్యంకోసమో కిరాణాకొట్టుకి వెళ్ళం. కాయగూరలకోసం మార్కెట్‌కో, రైతుబజారుకో కూడా వెళ్ళం. మనల్ని చూడగానే ముఖమంతా నవ్వుపులుముకొని పలకరించే కొట్టువాడినీ, కాయగూరలమ్మినీ కోల్పోయాం. మాల్స్‌కి వెళ్ళి ట్రాలీల్లో సరుకులు వేసుకొని, లైన్లో నుంచొని, బిల్లు చెల్లించి వచ్చేస్తాం. ఇక ఆటోవాడినో, రిక్షావాడినో(link) మాట్లాడించడానికి మనఊళ్ళో మనబండి దిగి వాడి బండి ఎక్కే అవసరమే రాదుకదా! బయట మల్టీప్లెక్స్‌లు, ఇంటిలోకి టీవీలు, చేతిలోకి సోషల్‌నెట్‌వర్క్‌లు వచ్చిన తరువాత వర్చువల్ ప్రపంచం విశాలమైపోయి, వాస్తవప్రపంచం కుంచించుకుపోయింది.
అప్పుడెప్పుడో కష్టేఫలే శర్మగారు(link) ఈ విషయంగురించి ఒక చక్కని మాట అన్నారు `మనకి పక్కవారిని పలకరించడానికే సమయం లేదండి, పోగేతతో,(link)` అని. నిజమేకదా, పలుకరించక ఎంతకోల్పోతున్నామో!
© Dantuluri Kishore Varma
Monday, 9 December 2013
ఎల్లుండి ఎంత మంచిదో, ఈ రోజూ అంతే మంచిది.
ఏమండోయ్, ఎల్లుండి మహత్తరమైన రోజట మీకు తెలుసా? ఎందుకంటారేమిటండీ బాబూ.. రైజింగ్ నెంబరు 11.12.13. పైపెచ్చు టోటలు తొమ్మిది! వ్యాపారం మొదలు పెడితే దిన దిన ప్రవర్ధమానం అవుతుందట. పెళ్ళిచేసుకొంటే పదకొండులో రెండు ఒకట్లు ఉన్నాయి కనుక కవల పిల్లలు పుట్టడం ఖాయమట.
క్రీస్తుశకం ప్రారంభమై ఎల్లుండికి 7,35,214 రోజులు. జనవరి ఒకటి 0001 సంవత్సరాలు నుంచి డిసెంబర్ పదకొండు, రెండువేల పదమూడు వరకూ టైం అండ్ డేట్ డాట్ కాం అనే వెబ్‌సైటులో డేట్ టు డేట్ కాలిక్యులేటర్ ఉపయోగించి లెక్కిస్తే వచ్చిన సంఖ్య అది.
కాలాన్ని లెక్కించడానికి మనిషి ఏర్పాటు చేసుకొన్నది క్యాలండర్. క్రీస్తు పుట్టినదిగా భావించిన సంవత్సరం నుంచి మొదలవుతుంది. మన అందరికి తెలుసు కదా, క్రీస్తు పుట్టినరోజు క్రిస్‌మస్ డిసెంబర్ 25 అని? అంటే క్రీస్తుశకం జీసస్ పుట్టినరోజునుంచీ మొదలవలేదు. ఆ సంవత్సరంలో అంతకుముందే జనవరి ఒకటినుంచి మొదలయ్యింది. అలా ఎందుకు మొదలు పెట్టారో నాకు తెలియదు. ఎవరు మొదలు పెట్టారో అంతకన్నా తెలియదు.
కానీ...
సరదాకి చిన్న చిక్కు ప్రశ్న. 01.01.0001 శనివారం అయ్యింది. ఒకవేళ ఈ కేలెండర్ని సృష్ఠించిన వాళ్ళు ఏదో ఒక కారణం చేత అంతకు రెండురోజుల ముందు అంటే గురువారాన్ని ఈ శకం యొక్క మొదటిరోజుగా తీసుకొంటే. ఈ రోజు, ఏ తారీఖు అయ్యి ఉండేది?
ఆ.. మీరు కనిపెట్టేశారు. మీరనుకొన్నది నిజమే. క్రీస్తుశకం మొదలయ్యి ఈ రోజుకే 7,35,214 రోజులు అయి వుండేది. ఈ రోజు 11.12.13 అయ్యివుండేది!
అప్పుడు, ఎల్లుండి మహామంచి రోజనీ, అన్ని పనులూ ఆరోజే మొదలు పెట్టమనీ చెప్పే వాళ్ళంతా, వాటిని ఈ రోజే మొదలు పెట్టమని ఉండేవారు కదా?
కనుక నేను చెప్పొచ్చేది ఏమిటంటే మీరు ప్రారంభించాలనుకొనే మంచి పనుల్ని ఎల్లుండి వరకూ వాయిదా వెయ్యకుండా, ఈ రోజే దివ్యంగా మొదలు పెట్టవచ్చు. ఎల్లుండి ఎంత మంచిదో, ఈ రోజూ అంతే మంచిది. ఏమంటారు?
© Dantuluri Kishore Varma
Sunday, 27 October 2013
నెమలి
ఒక అమ్మాయి చక్కగా డ్యాన్స్ చేస్తుంటే, `నెమలికి నేర్పిన నడకలివీ..` అని పాడతారుకానీ, నిజానికి అందంగా నడిచి, పురివిప్పి నాట్యంచేసేది ఆడనెమలి కాదు. మగ నెమలి. నెమలి నాట్యంచేస్తుంటే చూడటానికి రెండుకళ్ళూ చాలవు. అలాగే ముఖంచుట్టూ జూలుతో హుందాగా నడచి వచ్చే మృగరాజు రాజసంముందు అన్నీ దిగదుడుపే. `అడవిలో మగ పక్షులకీ, మగ జంతువులకీ అంత అందాన్ని ఇచ్చి, జనారణ్యంలో మాత్రం దానికి వ్యతిరేకంగా చేశాడేమిటీ ఆ సృష్ఠికర్త!` అని చాలా మంది వాపోతుంటారు.
![]() |
| @ NFCL Mini Zoo, Kakinada (Click here to see the details) |
నెమలంటే జ్ఞాపకానికి వచ్చింది - చదువులతల్లి సరస్వతీదేవి పాదాల దగ్గర ఎల్లప్పుడూ నెమలి ఉంటుంది. కుమారస్వామి వాహనం నెమలి. కురుక్షేత్ర యుద్దంలో అభిమన్యుడి రధానికిఉన్న జెండాపై నెమలే ఉంటుందట. మొగల్‌సుల్తాన్ షాజహాన్ ముచ్చటపడి నెమలి సింహాసనాన్ని చేయించుకొంటే పెర్షియా నుంచి దండయాత్రకి వచ్చిన నాదిర్షా ఆ సింహాసనాన్నీ, కోహినూర్ వజ్రాన్ని చక్కా దోచుకుపోయాడు. నెమలి అందానికి ఫిదా అయిపోయి ఎప్పటినుంచో దానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చేశాం. మనజాతీయపక్షిగా చేసుకొన్నాం.
చిన్నప్పుడు నన్నెవరైనా బొమ్మగియ్యమని అడిగితే కొండలమధ్య సూర్యుడు, ఓ ఇల్లు, కొబ్బరిచెట్లు, పడవ.. వాటితోపాటూ ఓ నెమలీ గీసేవాడిని(నా చిత్రకళాసాధన అక్కడితో ఆగిపోయింది). నెమలిని గియ్యడం సులభం. అందుకో లేక దాని అందానికి మురిసిపోయో తెలియదుకానీ మనవాళ్ళూకూడా దేవాలయాలమీద, ఇళ్ళగడపలమీద, మంచాల సైడ్‌పేనల్స్ మీద, చీరలమీద, తివాచీలమీద, ఎగ్జిబిషన్ల ఎంట్రన్స్‌ల దగ్గర నెమళ్ళఅలంకారం చేస్తుంటారు. కావాలంటే చూడండి - ఈ మధ్యన ఒక ఎగ్జిబిషన్ ప్రవేశద్వారం దగ్గర నెమలిని ఇలా పెట్టి, లైటింగ్ అమర్చారు.
జైపూర్లో సిటీప్యాలెస్ ప్రధానద్వారంచుట్టూ అద్భుతమైన నెమళ్ళు చెక్కి ఉంటాయి. వాటిముందు ఇలాంటివి సూర్యుడి ముందు దివిటీల్లా ఉండడం మాట వాస్తవమేకానీ, ఇంక్రెడిబుల్ ఇండియాని జ్ఞాపకం చెయ్యడానికి ఒక స్పార్క్‌లాగ ఇవి ఉపయోగపడడం వాస్తవమే కదా? ఈ వీడియో చూడండి.
© Dantuluri Kishore Varma
Monday, 21 October 2013
ప్రతీఒక్కడికీ ఏదో స్కీము ఉంటుంది
నారదుడు భూలోక సంచారం చేసి వచ్చాడు. రకరకాల వృత్తుల్లో జనాలు సంతోషంగా సేవ చేస్తూ బ్రతుకుతున్నారు. డాక్టర్లు, యాక్టర్లు, నాయకులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు... అందరూ మొహమ్మీద చిరునవ్వు చెరగకుండా పనులు కానిస్తున్నారు. విద్యార్ధుల శ్రద్ధ అమోఘం. తల్లితండ్రులకు వాళ్ళపిల్లల్ని చదివించడమే ప్రధానలక్ష్యం! భూలోకం నిజంగా స్వర్గదామం కదూ? అని మురిసిపోతున్నాడు. అదే విషయాన్ని ఆనందంగా విష్ణుమూర్తికి విన్నవించాడు.
`నీ బొందేం కాదూ!` అని విసుక్కొని, తనచూపుడువేలు పైకెత్తి శున్యంలో నలుచదరంగా టీవీ తెర ఆకారంలో గీశాడు విష్ణుమూర్తి. తెర ప్రత్యక్షమయ్యింది. దానివైపు చూపించి, `చూడు,` అన్నాడు. విష్ణుమాయ కారణంగా అంతకుముందు నారదుడు చూసి మురిసిపోయిన సన్నివేశాల్లో నవ్వుతూ సేవచేస్తున్న జనాలయొక్క బొమ్మలు, వాళ్ళ మనసుల్లో అసలు మాటలు వినిపించాయి.
![]() |
| Photo: Bapu`s Pelli Pustakam |
* * *
(సన్నివేశాల్లో ఎవరు, ఎవరో చెప్పడంలేదు. సంభాషణని బట్టి సులభంగానే గ్రహించవచ్చు అని)
ఎల్.కే.జీ కి లక్ష రూపాయల ఫీజా?
ఏమనుకొన్నారు మా స్కూలంటే? మీవాడ్ని బొచ్చు చేపని తోమినట్టు గంటలకి, గంటలు తోముతాం. ప్పది సబ్జెక్ట్లు, ఇరవై లైఫ్ స్కిల్స్, ఎప్పుడో పుష్కరం తరువాత రాయబోయే ఇంజనీరింగో, డాక్టరో కోర్సుకి ఇప్పటినుంచే ఇన్‌టెన్సివ్ కోచింగ్!
చక్కగా చదువుకొని వృద్దిలోకి రా నాయనా.
ఆ విషయం మీరు చెప్పాలా? చదువుతా, మంచి ఉద్యోగం సంపాదిస్తా, లక్షలూ, కోట్లూ గడిస్తా.. మిమ్మల్ని వృద్దాశ్రమానికి అంకితంచేస్తా.
చక్కని పరిపాలన అందించాలనే నిన్ను ఎన్నుకొన్నాం.
అబ్బా.. చక్కని పాలన కావాలేం! కోట్లు ఖర్చుపెట్టి రాజకీయాల్లోకి రావడం పనికి మాలిన ప్రజాసేవ చెయ్యడానికి కాదు. `నీకెంత, నాకెంత?` అనేదే తారకమంత్రం ఇక్కడ.
భలే రుచిగా ఉంది, ఈ కూర ఎలా వొండారు నాయనా?
ఫుడ్డు కలరు, టేస్టింగ్ సాల్టు, కల్తీనూనె, చెత్తా చెదారాం... బాగుందని రోజూ మాదగ్గర తిన్నావంటే కేన్సరు వచ్చి చస్తావ్!
వైద్యో, నారాయణో హరి!
కాలునొప్పా? ఐదొందలు ఫీజుకొట్టు ముందు. పోయి ఈ వంద టెస్టులూ చేయించుకొని రా. తరువాత వెయ్యిరూపాయల మందులురాస్తాను. లేబొరేటరీవాళ్ళు, మందులకంపెనీ వాళ్ళు బ్రతకాలి కదా? వాళ్ళ సంగతి అలా ఉంచు మాకు నాలుగువేళ్ళూ నోట్లోకి పోవాలా, వద్దా?
డైరెక్టర్ గారూ, విడుదలవ్వబోతున్న మీ సినిమాని చక్కటి సందేశంతో, కుటుంబకథా చిత్రంగా మలచారట?
విజయవంతమైన ఫార్ములాని యాక్టర్లని మార్చి మళ్ళీ వొండాం. బొంబాయి నుంచి హాట్ హీరోయిన్‌ని పట్టుకొస్తే, మాతో సహకరించలేదు. వాళ్ళ అమ్మా, నాన్నలని వెంటబెట్టుకొని వచ్చింది షూటింగుకి.
వోటరుగారు, మీవోటు ఎవరికండీ ఈ సారి?
అందరికీ స్కీములున్నట్టే మాకూ ఉన్నాయి. మంచి చదువు, మంచి కొలువు, మంచి వైద్యసదుపాయాలు, మంచి అభివృద్ధి ఇవ్వగల సచ్చీలుడికే మా వోటు.
* * *
`చూశావా నారదా? వాళ్ళ నవ్వుల వెనుక నిజస్వరూపాలు అవి. పైకి కనిపించేది ఎలా ఉన్నా, ప్రతీ ఒక్కడికీ ఏదో స్కీము ఉంటుంది. అందరి స్కీములూ పారతాయి కానీ పాపం వోటరుదే...` అన్నాడు విష్ణుమూర్తి.
ఘాడంగా నిట్టూర్చి, చిడతలు వాయించుకొంటూ మరో లోకంవైపు సాగిపోయాడు నారదుడు.
© Dantuluri Kishore Varma
Saturday, 19 October 2013
నాలుగురోజులాగితే బంగారమో, బండారమో బయట పడుతుంది కదా?
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నవ్‌జిల్లా దౌండియాఖేరా అనే ఊరిలో ప్రాచీనమైన శివాలయం ఫోటోలు చూడచక్కగా ఉన్నాయి. కొంచం వొరిగినట్టు ఉండి, ఇండియన్ పీసా టవర్‌లా కనిపిస్తుంది. చూడగానే ఆకట్టుకొనేలా ఉంది. నాలుగైదు రోజులుగా ఏ పేపర్‌లో చూసినా ఈ శివాలయం ఫోటోలే కనిపిస్తున్నాయి. ఈ గుడికి సమీపంలో ఒక పురాతనమైన కోట ఉందట. అక్కడ వెయ్యిటన్నుల బంగారం పాతిపెట్టబడి ఉందని ఒక సాధువు కలగన్నాడట. ఆ వార్త ఆచెవినీ, ఈ చెవినీ పడి భారత పురావస్తు శాఖని చేరింది. నిధిని తవ్వి తియ్యమని పైనుంచి ఆదేశాలు అందాయి. పనిమొదలు పెట్టారు. నిజంగా నిధి బయటపడితే కలగన్న సాధువు గొప్పవాడైపోతాడు. ఇంకొకసారి ప్రపంచదేశాల దృష్టి భారత్‌మీద పడుతుంది. మిరాక్యులస్ ఇండియా మెరిసిపోతుంది. నిధి దొరకకపోతే శాస్త్రీయమైన ఆధారాలేమీ లేకుండా తవ్విపోసినందుకు పురావస్తు శాఖని దుమ్మెత్తిపోస్తారు.
ఫ్రెండ్స్ అందరం కూర్చున్నప్పుడు ఈ అంశంమీదకి సంభాషణ వెళ్ళింది. `ఈ తవ్వకాలవీ సుద్ద దండగ,` అన్నాడు ఒకాయన.`విలువైన సమయాన్ని వృధా చేస్తున్నార`న్నాడు.
ఎవరైనా ఒకవిషయం ప్రస్తావిస్తే వెంటనే వ్యతిరేకంగా వాదించేవాడు ఒక్కడైనా ఉంటాడు. `వాళ్ళేమీ అడవుల్లో తవ్వడంలేదు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశంలో చేస్తున్నారు. అయినా ఒక శాఖంటూ ఉండగా ఏదో పనిచెయ్యాలికదా? సాధువు కల ఫలితంగానైనా పని జరుగుతున్నందుకు సంతోషించు,` అన్నాడు వ్యతిరేకించే ఆయన.
వాదప్రతివాదాలు జరిగాయి. ప్రతీ డిబేటులాగే దీనికీ అందరికీ ఆమోదయోగ్యమైన ముగింపు రాలేదు. `సరే, నాలుగురోజులాగితే, బంగారమో, బండారమో బయట పడుతుంది కదా?` అనుకొని ఇళ్ళదారి పట్టాం.
© Dantuluri Kishore Varma
Subscribe to:
Posts (Atom)



















