Friday, 30 May 2014

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు

ఒక్కో ఫోటోని క్లిక్ చేస్తే తిరుమలకి సంబంధించిన ఒక్కో పోస్ట్ వస్తుంది. 

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కుమ్మర దాసుడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి
ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు
మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు
కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించినవాడు

శోభారాజు ఆలపించిన అద్భుతమైన అన్నమయ్యకీర్తన ఇదిగో..
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు

© Dantuluri Kishore Varma 

Sunday, 25 May 2014

ఎవరైనా పనిచెయ్యక తప్పదు!

కథానాయకుడి ధీరోదాత్తత, కథానాయిక సౌశీల్యం, కథలో చూపించిన ఆప్యాయతలు, మానవసంబంధాలు, త్యాగం, లక్ష్యాన్ని చేరుకోవడానికి పోరాటం... మొదలైన పాజిటివ్ ఎలిమెంట్స్ మనకు బాగా నచ్చుతాయి. అవి ఉన్న కథలని మళ్ళీ, మళ్ళీ చదువుతాం; సినిమాలని చూస్తాం. 

వాటిని మనలో పెంపొందించుకోవడానికి ఏమీ చెయ్యం!  

`పలానా వ్యక్తి ప్రధానమంత్రి అయిపోయాడు,` అని అనుకొంటాం. ప్రత్యర్థులని ఎదుర్కోవడానికి ప్రణాళికలు రచించాలి, వాటిని పగడ్బందీగా అమలుపరచాలి, రాత్రనకా పగలనకా దేశం ఆమూలనుంచి, ఈ మూలకు ప్రయాణాలు చెయ్యాలి, సభలలో జనరంజకంగా మాట్లాడాలి, మిత్రుల సంఖ్యను పెంచుకోవాలి. వీటన్నింటినీ ప్రభావవంతంగా చెయ్యడానికి ఆరోగ్యాన్ని చక్కగా ఉండేలా చూసుకోవాలి. విజయం సులభంగా లభించదు. బద్ధకాన్ని దరిచేరనివ్వకుండా కష్టించి పనిచెయ్యాలి. అలాగే ఒక ఆఫీసులో మేనేజరైనా, ప్రోజెక్ట్ లీడరయినా, గుమస్తా అయినా, నౌకరైనా, వ్యాపారస్తుడైనా, గృహిణైనా, రోజుకూలీ చేసుకొనే సామాన్యుడైనా, విద్యార్థిఐనా, ఆఖరికి సన్యాసిఐనా తన కర్తవ్యాన్ని నిర్వహించవలసిందే.

పైన ఉదహరించిన కర్తవ్యనిర్వాహణ విలువలని అతిక్రమించకుండా చేస్తే మనమే ధీరోదాత్తులమౌతాం. స్వామీవివేకానంద ఒక కథ చెపుతాడు. యువసన్యాసి గురించి  ఇంకా ఒక పక్షుల జంట గురించి. సన్యాసి మహా అందగాడు. ఒకరాజకుమారి అతనిని వివాహం చేసుకోవలసిందని కోరుతుంది. మహారాజు అలా చేసిన పక్షంలో అర్థరాజ్యం ఇస్తానంటాడు. కానీ, సన్యాసి వాటిని తిరస్కరించి అడవిలోనికి వెళ్ళిపోతాడు. తపస్సుచేసుకొని మోక్షం పొందాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందుకు సాగాడు. ప్రలోభాలకి లొంగలేదు.  అతను సర్వసంఘ పరిత్యాగం అనే విలువకు కట్టుబడి గొప్పవాడయ్యాడు. రాజకుమారీ, మరికొందరూ అతనిని అనుసరిస్తూ వెంటబడి వెళతారు. అడవిలో ప్రవేశించేసరికి చీకటిపడుతుంది. ఒకచెట్టుక్రింద ఆరాత్రికి బసచేస్తారు. చలినుంచి, క్రూరమృగాలనుంచి కాపాడుకోవడంకోసం చిన్నమంట వేసుకొని కూర్చుంటారు. నడచి వచ్చారేమో ఆకలి అవుతూ ఉంటుంది. చెట్టుమీద ఉన్న పక్షుల జంటకి ఆవిషయం తెలుస్తుంది. అతిదులకి ఆకలితీర్చే మార్గం కనిపించదు. తామే వాళ్ళకి ఆహరం అవడంకోసం  మంటలో పడి ఆత్మత్యాగం చేస్తాయి. గృహస్తు ధర్మాన్ని నిర్వర్తించాయి కనుక అవీ గొప్పవే. సన్యాసి నిష్కపటమైన నిబద్ధత, పక్షుల త్యాగం అనేవి విలువలు. చేసినపనులలో విలువలు కలిసి ఉన్నాయి కనుక అవి మనకు తప్పనిసరిగా నచ్చుతాయి. 

మనలో ప్రతీ ఒక్కరికీ మన ధర్మాలు ఏమిటో తెలుసు.  విలువలకు కట్టుబడి వాటిని ఆచరించడమే కర్మయోగం!  

© Dantuluri Kishore Varma 

Sunday, 18 May 2014

యండమూరులో మీసాల వెంకన్న

కాకినాడనుంచి గొల్లపాలెం మీదుగా కోటిపల్లి వెళ్ళే మార్గంలో యండమూరు జంక్షన్ తగులుతుంది. జంక్షన్ నుంచి  ఊరు లోనికి ఉంటుంది. కరప మండలంలోని చిన్న గ్రామం ఇది. ఈ వూరిలో శ్రీసామ్రాజ్యలక్ష్మీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయం ఉంది. చాలా పురాతనమైనదని చెపుతారు. ప్రస్తుతం ఉన్న గుడి కొత్తగా పునర్నిర్మించిందే కానీ, మొట్టమొదట శ్రీరామచంద్రమూర్తి కాలంలో నిర్మించి ఉంటారని చెపుతారు. దానికి కారణం ఏమిటంటే ఈ దేవాలయపు పునర్నిర్మాణ సమయంలో ములవిరాట్టు క్రింద శ్రీరాముని ముద్రలతో ఉన్న నాణాలు లభించాయట. యండమూరులో ఉన్న వేంకటేశ్వరుణ్ణి మీసాల వెంకన్న అనికూడా పిలుస్తారు. కోరిన కోరికలు నెరవేరుస్తాడని ప్రసిద్ది. ఈ ఫోటోలు మీకోసం. దర్శనం చేసుకొని ధన్యులు కండి.  © Dantuluri Kishore Varma 

Friday, 16 May 2014

ఎన్నికల ముచ్చట్లు

ఏప్రిల్ ఏడున ప్రారంభమైన వోటింగ్ ప్రక్రియ సుమారు నెలరోజుల పాటు కొనసాగింది. 
మనదేశంలో ఈ దఫా 814 మిలియన్ ప్రజలు,  
అంటే యూరోప్ ఖండపు జనాభా కంటే ఎక్కువమంది వోటు హక్కు కలిగిన వాళ్ళు ఉన్నారు.
18-19 సంవత్సరాల వయసున్న 23 మిలియన్ల యువత ఈ సారి వోటుహక్కును పొందారు. 
ఈ సంఖ్య మొత్తం వోటర్లలో మూడు శాతం. 
దేశవ్యాప్తంగా 9,30,000 వోటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 
పోటీ చేసిన అభ్యర్థులను అందరినీ తిరస్కరించే వోటు - 
నోటా(నన్ ఆఫ్ ద ఎబౌ) ని ఈసారి చేర్చారు.
వోటరు చూపుడు వేలిమీద వేసే గుర్తుకు వాడే ఇంకుని -
మైసూర్ ఇంక్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేసింది.
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు చాలా ఉత్కంఠ కలుగజేశాయి.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల దృష్టీ భారతదేశం మీదే  ఉంది. 
మే పదహారున అంటే ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు -
కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ప్రజలు టీవీలకి, 
లెక్కింపు కేంద్రాలకీ అతుక్కొని పోయారు. 
ఏనోట విన్నా ఎన్నికల మాటే!
కేంద్రంలో నరేంద్ర మోడీ నేత్రుత్వంలో బీజేపీ 
అత్యధిక మెజారిటీ సాధించి, ప్రభుత్వాన్నీ ఏర్పాటు చెయ్యబోతుంది. 
తెలంగాణా మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్,
ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు
ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారు. 

పైన పేర్కొన్న కొన్ని విషయాలకు సోర్స్: డెక్కన్ క్రోనికల్   
Dantuluri Kishore Varma

Monday, 12 May 2014

పరుగులు తియ్యాలి గిత్తలు ఉరకలు వేయాలి

మైసూరులో సారవంతమైన భూములు విస్తారంగా ఉన్నాయి. కానీ, సాగుచెయ్యడానికి జనాలే తక్కువ. అందువల్ల ఆ భూములన్నీ పచ్చికమైదానాల కింద మిగిలిపోయాయి. ఇది ఎప్పటిమాటో. ఉత్తరాదినుంచి పశువులను తోలుకొని చాలా మంది ఈ పచ్చిక మైదానాల వైపు వచ్చేశారు. క్రమంగా బాగా బలసిన మేలుజాతి గిత్తలు, ఆవులకి మైసూరు ప్రసిద్ది చెందింది. ఒకజత మైసురు ఎడ్లు ఉంటే గొప్ప స్టేటస్ సింబల్‌గా భావించేవారు. వాటికోసం సుదూర ప్రాంతాలనుంచి కూడా ప్రజలు మైసూరు పశువుల సంతకు వెళ్ళేవారు. నలభై, యాభై ఏళ్ళ క్రితం మావూరునుంచి అప్పల్రాజుగారూ మరో నలుగురూ కలిసి మైసూరు వెళ్ళడానికి రైలు బండి ఎక్కారు. వెళ్ళడానికి, కొనడానికి ఎన్నిరోజులు పట్టిందో తెలియదు కానీ ఓ అరడజను జతల ఎడ్లను కొని గూడ్స్ వేగన్లో ఎక్కించి, వాటితో పాటూ వెళ్ళినవాళ్ళు కూడా ఎక్కేసి, రాజమండ్రీలో దిగారు. అక్కడనుంచి జగ్గంపేటవరకూ తోలించారు. అక్కడ ఒక మజిలీ. తరువాత జగ్గంపేటనుంచి ప్రత్తిపాడు దగ్గర ఉన్న మా వూరు రాచపల్లి వరకూ తోలుకొని రప్పించారు.   మా జత మైసూరు ఎడ్లను వదిలేసి మిగిలినవి ఎవరివి వాళ్ళు తీసుకొని పోయారు. 

వీధిచావిట్లో పందిరి గుంజ ప్రక్కనున్న గుబురు పుల్లమావిడిచెట్టు క్రింద  మైసూరు ఎడ్లను కట్టేస్తే, పచ్చగడ్డిని తాపీగా నెమరువేస్తూ రాజసంగా కూర్చొన్న వాటిని చూడడానికి ఊరిజనాలు తండోపతండాలుగా వచ్చారు. సూదిగా మెలితిరిగి ఉన్న కొమ్ముల దగ్గరనుంచి, కాలి గిట్టలవరకూ అణువణువునూ పరిశీలిస్తూ `మేలుజాతి ఎడ్లు` అని కితాబునిచ్చారు. చూసే వాళ్ళకి ఆనందం, వినేవాళ్ళకి పరమానందం!

ప్రయాణ బడలిక తీరిన తరువాత అలంకార పర్వం మొదలయ్యింది. గిత్తలకి కొత్తనాడాలు వేయించారు, కొమ్ముల్ని చెక్కించారు. కొమ్ముల్ని చెక్కడానికి నిపుణులు ఉండేవాళ్ళు. చెక్కకి చిత్రీ పట్టినట్టు చిన్న ఉలి తీసుకొని కొమ్ములమీద పై పొరని తొలగించేవారు. తరువాత ఎలిబూడిదని (అంటే కాలిన పిడకల నుంచి వచ్చినది) తీసుకొని వాటికి రుద్దే వారు. కొమ్ముల్ని రుద్దగా, రుద్దగా అవి ఏనుగు దంతాల్లా మెరిసేవి. అప్పుడు పాలిష్ పెట్టాలి. ఈ పనులన్ని చకచకా జరిగాయి. తళ తళా మెరుస్తున్న కొమ్ముల చివర ప్రత్యేకంగా తయారుచేయించిన ఇత్తడి తొడుగులు బిగింపించారు, వాటి కుదుళ్ళకి మువ్వలు కట్టారు. గిత్తలకి ముకుతాళ్ళు వేశారు, మెడలో గంటలు కట్టారు.     

ఈ పనులు ఓ వైపు జరుగుతుండగానే మోటబండి చక్రాలను, కాడినీ విప్పేశారు. చక్రాల చూట్టూ ఉన్న అరిగిపోయిన ఇనుప రింగుల్ని(ఇప్పుడు మన కార్లకి ఉండే టైర్లు ఎలాంటివో, అప్పటి బళ్లకు అవి అలాగ) తొలగించి కొత్తవి వేశారు. బండికి క్రింద తారు పూయించారు, పైన రంగులు వేయించారు. ఇరుసుకి క్రీజు పట్టించి, జనపనార చుట్టబెట్టి చక్రాలు బిగించారు, శీలలు తగిలించారు. కాడికూడా వేసేసరికి మరామత్తులు ముగిసి బండి తయారయ్యింది.

అలంకరించడం, బండికి కట్టితోలడం మాట అటుంచి వాటి తిండీ, సంరక్షణ ఖర్చుతో కూడుకొన్న పని.  ఉలవలు ఉడికించి, దానిలో తవుడు కలిపి దానా తయారు చెయ్యాలి. పచ్చగడ్డి, జనుమూ కోసుకొని వచ్చి ముక్కలుగా కత్తిరించి వాటికి వెయ్యాలి. బండి కట్టి సవారీకి రడీ చెయ్యాలి. తిరిగి వచ్చిన తరువాత బండివిప్పి, ఎడ్లను శుబ్రంగా తోమి మాలిష్ చెయ్యాలి. వాటిని కడిగి స్నానం చెయ్యించాలి. ఈ పనులన్నీ చెయ్యడానికి ఒక మనిషి నిరంతరం వాటిని కనిపెట్టుకొని వుండేవాడు.

కొత్త బండికి మైసూరు గిత్తల్ని కట్టి వాటి నుదుళ్ళకీ, బండికీ పసుపురాసి, కుంకుమ బొట్లు పెట్టి, కొబ్బరికాయ కొడితే ప్రయాణం మొదలయ్యింది. గేటు దాటి బండి పొలం వైపు పరుగులు పెట్టింది. ప్రతీరోజూ పొలానికి, అప్పుడప్పుడూ పట్నానికి.... అక్కడి నుంచి ఇంటికి.....  దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మల్లీశ్వరి సినిమాకి రాసినట్టు...

ఓ ఓ ఓ.. హేయ్... 
పరుగులు తియ్యాలి 
గిత్తలు ఉరకలు వేయాలి
హేయ్... బిరబిర చరచర పరుగున పరుగున
ఊరు చేరాలి మన ఊరు చేరాలి... ఓ...
హోరుగాలి కారుమబ్బులు
ముసిరేలోగా మూగేలోగా
ఊరు చేరాలి మన ఊరు చేరాలి
గలగల గలగల కొమ్ముల గజ్జెలు
ఘణఘణ ఘణఘణ మెళ్లో గంటలు
ఆ... గలగల గలగల 
కొమ్ముల గజ్జెలు
ఘణఘణ ఘణఘణ 
మెళ్లో గంటలు
వాగులు దాటి 
వంకలు దాటి
ఊరు చేరాలి 
మన ఊరు చేరాలి...

తరువాత కొంతకాలానికి దూపాడ ఎడ్లని మరొక జతని కొన్నారు. అవి పొట్టిగా ఉండేవి. వాటికోసం ఒక గుర్రబ్బండిని కొని, మరామత్తులు చేయ్యించారు. కాడిని వేయించి, బండిలోపల కుషన్లు కుట్టింపించారు. చక్రాల చుట్టూ ఇనుప రింగుకి బదులుగా రబ్బరు టైరు వేయించారు.  సవారీ బండి తయారయ్యింది. సినిమాలకి, పిక్‌నిక్‌లకి ఈ బండిమీదే ప్రయాణం.    
.... పరుగులు తియ్యాలి 
గిత్తలు ఉరకలు వేయాలి

ఆ... అవిగో అవిగో...
నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు
అవిగో అవిగో... అవిగో అవిగో

ఆ... పచ్చని తోటల విచ్చిన పూవులు
ఊగే గాలుల తూగే తీగలు... అవిగో...
కొమ్మల మోగే కోయిల జంటలు
ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు
అవిగో అవిగో... అవిగో అవిగో...

అర్థ శతాబ్ధం క్రితంవరకూ జీవనవిధానం మెల్లగా సాగే నదిలా ఉండేది. పెరిగిన సాంకేతికత, అభివృద్ది సాక్షిగ ఉప్పెనలా మార్పులు ఒక్కసారిగా ముంచెత్తుకొని  వచ్చాయి.  చదువులు, వుద్యోగాలు, పట్నవాసాలు, విదేశాలకు వలసలు..... కొన్ని విషయాలను జ్ఞాపకాలుగా మిగిల్చేశాయి. 
© Dantuluri Kishore Varma

Tuesday, 6 May 2014

బేడి ఆంజనేయ స్వామి ఆలయం

తిరుమలలో వేంకటేశ్వరస్వామి ఆలయంలోనికి తీసుకొని వెళ్ళేది మహాద్వార గోపురం. దానికి అభిముఖంగా ఉన్న వీధిని సన్నిదివీధి అంటారు. భక్తులని స్వామి సన్నిదిలోనికి తీసుకొని వెళుతుంది కనుక దానికి ఆ పేరు. సన్నిది వీధికి ఆ చివర బేడి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. మహాద్వారం వైపు తిరిగి ముకుళించిన హస్తాలతో ఉన్న ఆంజనేయుని ముర్తి ఉంటుంది ఈ ఆలయంలో. ఆంజనేయుని తల్లి అంజనీదేవి కుమారుడి ఆగడాలను ఆపడానికి బేడీలు వేసి స్వామికి ఎదురుగా నిలబెట్టిందని, అందుకే ఆయనకి బేడి ఆంజనేయుడని పేరు వచ్చిందని కొందరు అంటారు. ఇంకొక కథను అనుసరించి `బేడు` అనేది కన్నడ మాట అని; మన తెలుగులో దేవుడిని కొలవమనడానికి `వేడు(కో)` అనే మాటను ఎలా ఉపయోగిస్తామో కన్నడంలో `బేడు` ను అలా ఉపయోగిస్తారని; ఆంజనేయుడు తన ముకుళించిన హస్తాలను భక్తులకు ఉదాహరణగా చూపిస్తూ అట్లానే స్వామిని వేడుకో మంటున్నాడని; అందుకే ఆయనకి బేడి ఆంజనేయుడని పేరు వచ్చిందని అంటారు. కథమాట ఎలా ఉన్నా శివుని ఆలయానికి అభిముఖంగా నంది ఉన్నట్టే, విష్ణుమూర్తి ఆలయానికి అభిముఖంగా గరుడుడు కానీ, ఆంజనేయుడు కానీ ఉండాలి. అందుకే ఇక్కడ బేడి ఆంజనేయుడు ఉన్నాడు. కొండపైకి వచ్చిన భక్తులు హనుమంతునికి హారతులు ఇచ్చి, కొబ్బరి కాయలు కొడతారు. 
బేడి ఆంజనేయ స్వామి ఆలయం

హారతులు ఇచ్చి, కొబ్బరి కాయలు కొడతారు. 
ఎదురుగా కనపడే మహాద్వారం

దూరం నుంచి
షాపింగ్ సెంటర్ గుడికి చేర్చి ఉంది
© Dantuluri Kishore Varma

ఎన్నికలు

రాజకీయ సందడి పెద్ద ఎత్తున మొదలైపోయింది. జనాల్లోకి వెళ్ళడం, సభలు ఏర్పాటుచేసుకోవడం, జనాలని సమీకరించుకోవడం, మేం ఇది చేశాం అది చేశాం అని చెవుల్లో ఇల్లు కట్టుకొని చెప్పడం, వాగ్ధానాలు గుప్పించడం, కరపత్రాలు పంచడం, పేపర్ పబ్లిసిటీ, మీడియా ప్రోపగాండా... రాజకీయపార్టీలు ఓట్లకోసం ఎన్ని చెయ్యాలి! ఏ విధానం అవలంభించినా వోటరుని మనం చెప్పింది వినేటంత వరకూ ఓపికగా కూర్చో బెట్టాలి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జనరేషన్ వోటర్లు 50శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. మన రాష్ట్రంలో సుమారు ఆరుకోట్ల ముప్పై లక్షల మంది ఓటర్లు ఉంటే వాళ్ళల్లో మూడున్నర కోట్ల మంది యువతే నట.  వీళ్ళని ఆకర్షించాలంటే పాత పద్దతుల అవలంభన ఒక్కటే సరిపోదు. వాళ్ళు ఏ మాధ్యమంలో అందుబాటులో ఉంటారో అక్కడే వాళ్ళకు చెప్పాలి. పాతపద్ధతులనే పట్టుకొని వ్రేలాడకుండా అలా మార్పు చెందగలిగిన స్మార్ట్ అభ్యర్థులకే విజయావకాశాలు ఉంటాయని విజ్ఞులు చెపుతున్నారు. లక్షలకోట్ల రూపాయలు వెచ్చించినా జరగనంత ప్రచారాన్ని ఇప్పటికే సొంతంచేసుకొన్న మోడి గారిని చూడండి! యువత పల్స్‌ని  ఎప్పుడో అవగాహన చేసుకొని ఫేస్‌బుక్, ట్విట్టర్లు లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఒక హవాని సృస్టించుకొన్నారు. 

ఇక్కడ ఇలా ఉదహరించడం ఆయన రాజకీయ విధానాలు మంచివా, చెడ్డవా అని తర్కించడానికి కాదు. చురుకుగా ఆలోచించి కాలానికి అనుగుణంగా మారగలిగిన వాళ్ళకి విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పడానికి మాత్రమే. రాజకీయాల్లోనే కాదు, ఎక్కడైనా సరే మార్పు ఒక్కటే శాశ్వతం. కాబట్టి మంచివైపు, అభివృద్దివైపు ప్రస్థానంకోసం మారగలిగిన వాడే విజేత.

*     *     *
ఓ వైపు వోటరు గెలుపు అవకాశాలున్న అభ్యర్థులవైపు మొగ్గుచూపుతున్నాడు.

అడవిలో అందాల కథానాయిక కోసం పట్టణం నుంచి వెళ్ళిన కథానాయకుడు టార్జాన్‌లా ఉండే అడవిమనిషితో పోటీకి దిగవలసి వస్తుంది. వాడిని ఓడిస్తేనే పిల్ల దక్కుతుంది. ఎలా ఓడించాడు అనేది ముఖ్యంకాదు - కాలులాగో, కన్నుపొడిచో విజయాన్ని దక్కించుకోవలసిందే! కథానాయకుడు ఖచ్చితంగా గెలవాలని ప్రేక్షకులు కోరుకొంటారు. దానికోసం టార్జాన్ కళ్ళల్లో హీరో కారం కొడితే ఈలలు వేసి సమర్ధిస్తారు. ఎందుకంటే హీరోలో తమనితాము ఐడింటిఫై చేసుకొంటారు కనుక.  ఎలాగోలా హీరోయిన్ గెలిచినవాడికి దక్కితే మనకీ దక్కినట్టే అన్నంత ఆనందపడిపోతాడు. ఆమెని గెలుచుకోవడానికి  ఏమిచేసినా పరవాలేదనే దృక్పదం!

రాజకీయం కూడా అలాగే తయారయినట్లుంది. సీట్లకేటాయింపుకోసం కోట్లరూపాయలు చేతులు మారుతున్నాయని, వేలకోట్లలో అవినీతికి పాల్పడ్డారని ప్రత్యర్థులు ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకోంటున్నారు. వేలల్లో మాత్రమే సంపాదన ఉన్న సామన్యుడు అన్ని వేలకోట్లలో ఎన్ని వేలు ఉంటాయో అని ఆశ్చర్యపోవడం మానేసి, అదేదో సామాన్యమైన విషయంలా భావిస్తున్నాడు. గెలుపు అంచనాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. విజయావకాశాలు ఎటువైపు ఉంటే అటువైపుకు వలసలు జరుగుతున్నాయి. కార్యకర్తలుకూడా పోలోమని తమ నాయకులవెంటే పార్టీపిరాయింపులు చేస్తున్నారు. రోడ్డునపోయే దానయ్యని ఆపి `మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎందుకు అలా అనుకొంటున్నావు?` అని అడిగితే `పాలానా వాడు. ఎండుకంటే బాగా ఖర్చుపెట్టే దమ్ముంది,` అని చెపుతున్నాడు. మనిషి దృక్పదంలో ఎంత మార్పు వచ్చింది! అవినీతి అనే మాటకి చలించడం మానేశాడు. పైపెచ్చు పరుగుపందెం లాంటి ఆటని ఆస్వాదిస్తున్నాడు. గెలుపే ప్రధానం. అది ఎలా దక్కినా సరే! గెలిచినవాడే హీరో!  వాడి ప్రక్కన మనం ఉంటే, మనమూ విజేతలమే.

*     *     *
ఇలాంటి పరిస్థితుల్లో గెలుపుని నిర్ణయించేది వేసిన వోట్లు కాదు, వెయ్యని వోట్లే!

ఎన్నికల సమయంలో ప్రత్యర్థిమీద బురద జల్లడం తప్పించి గెలిచి తాను చెయ్యబోయే ప్రజా సంక్షేమ పనులు ఏమీటో చెప్పే ప్రబుద్దుడు ఎక్కడా కనిపించడంలేదు. అలాగని వాగ్ధానాలేవీ చెయ్యడం లేదని కాదు. చేసే ప్రతీ వాగ్ధానం వెనుకా ఓటుబ్యాంక్ రాజకీయమే ఉంటుంది. అధికారం అంతిమ లక్ష్యం. దానికోసం ఎన్ని పన్నాగాలయినా పన్నవచ్చు. చూసి, చూసి సామాన్యుడికి ఒక్కోసారి ఎన్నికలలో పోటీచేసే ఏ అభ్యర్ధీ సరయిన వాడిలా తోచడం లేదు. నిరాసక్తత వాళ్ళని ఓటింగ్‌కి దూరంచేస్తుంది. చాలా చోట్ల ఓటింగ్ శాతం తక్కువగా ఉండడానికి కారణం ఇదే. కానీ, ఓటువెయ్యకపోతే  రాను, రానూ ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే ఓటుహక్కు కలిగిఉన్న ప్రతీ ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే వోటరుగా నమోదయిన యువత తాము వేసే ఓటుతో రాజకీయాల్లో అభిలషణీయమైన మార్పు తీసుకొని రావడానికి వోటింగ్ కేంద్రాలవైపు అడుగులు వెయ్యాలి.

ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టులాంటి ఓటుహక్కుని వినియోగించుకోవాలని అప్పుడే ప్రశ్నించే హక్కు ఉంటుందని అధికారులు ప్రకటనలు ఇచ్చి ఓటర్లను ఉత్సాహపరుస్తున్నారు. వీటికితోడు సెలబ్రిటీలు, ప్రయివేట్ సంస్థలు, ఎన్జీవోలు ప్రజలకి ఓటింగ్ మీద సదావగాహన కల్పించడానికి ప్లెడ్జ్ టు వోట్ కేంపయిన్‌లు చేస్తూ తమవంతు సామాజిక బాధ్యతని నిర్వర్తిస్తున్నారు. ఇందులో భాగంగా గూగుల్ ఇండియా వాళ్ళు చేసిన ఒక వీడియో చాలా ఇన్స్పయరింగా ఉంది. శ్యాం శరణ్ నెగీ అనే ఒక 97 సంవత్సరాల వృద్దుడి గురించి ఆ వీడియో. ఈయన స్వాతంత్ర్యభారతదేశపు మొట్టమొదటి ఓటరట. 1951లో తన ముప్పైనాలుగవ ఏట ఓటువేసింది మొదలు ఇప్పటివరకూ ఏ ఎన్నికలలోనూ తన హక్కును వినియోగించుకోకుండా లేడట! చలైనా, వానయినా, అడుగు బయటపెట్టలేని మంచయినా తన ధర్మాన్ని నిర్వర్తించాడట.

వీడియో మీరుకూడా చూడండి.

*     *     * 

ఎక్కడిదాకానో ఎందుకు మనకు దగ్గరలోఉన్న ఈ ఉదాహరణ చూడండి.

హోప్ ఐలాండ్ కాకినాడ సముద్రతీరానికి తుర్పువైపు 15 కిలోమీటర్లదూరంలో ఉంది. ఎప్పుడో రెండువేల సంవత్సరాల క్రితం గోదావరినది బంగాళాఖాతంలోనికి తీసుకొని వెళ్ళిన ఇసుక మేటల వల్ల హోప్ ఐలాండ్ ఏర్పడిందని చెపుతారు. సుమారు పదహారు కిలోమీటర్ల పొడవు, ఒక కిలోమీటరు వెడల్పుతో ఒక చిన్న ద్వీపంలా ఉంటుంది ఇది. కాకినాడ సముద్రతీరం నుంచి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. హోప్ ఐలాండ్ కాకినాడకి ఒక వరంలాంటిదని చెప్పుకోవచ్చు. సముద్రంవైపునుంచి వచ్చే తుఫానులు, ఉప్పెనలు, సునామీలనుంచి పట్టణాన్ని రక్షణగోడలా ఉండి రక్షిస్తుంది. 

కొన్ని దశాబ్దాలక్రితం నుంచీ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని కొన్ని మత్యకార కుటుంబాలు ఇక్కడ నివశిస్తున్నాయి. వాళ్ళకు కరెంట్ ఉండదు. పిల్లలకి పాఠశాలలు ఉండవు. వైద్యానికి ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు ఉండవు. సూపర్‌బజార్లు, షాపింగ్ మాల్సు ఉండవు. రవాణాకి నాటుపడవలు తప్ప మరేమీ ఉండవు. కానీ ఓ రెండువందల యాభై నుంచి మూడువందల యాభై  మందికి  వోటుహక్కు ఉంది. వోటుహక్కు వినియోగించుకోవడానికి  హోప్ ఐలాండ్ వాసులు తాళ్ళరేవు దగ్గర ఉన్న చిన్నబొడ్డు వెంకటాయపాలెం అనే ఊరికి వెళ్ళాలి. ఇది ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనికి వస్తుంది. వోటర్లు హోప్ఐలాండ్ నుంచి నాటుపడవలు ఎక్కి రెండుగంటలు ప్రయాణం చేసి కాకినాడ తీరం చేరాలి. అక్కడినుంచి ఆటోలో, ప్రయివేటు బస్సులో పట్టుకొని వాళ్ళ పోలింగ్ స్టేషన్‌కి వెళ్ళాలి. ఆడ, మగ, ముసలి, ముతక అందరూ ఈ అవస్థలు అన్నీ పడితే కానీ వోటు వెయ్యడం సాధ్యం కాదు. ఇన్ని సమస్యలున్నా వాళ్ళు వోటు వెయ్యడానికి వస్తారు. 

పైన శ్యాం శరణ్ నెగీ గురించి, ఆయన వోటు హక్కుని వినియోగించుకొనే నిబద్ధత గురించి చదివాం. హోప్ఐలాండ్ వాసుల గురించీ చదివాం. మనకీ ఓటు ఉంటుంది, నడిచి వెళ్ళేటంత దగ్గరలో పోలింగ్ కేంద్రం ఉంటుంది. కానీ, ఏవో కారణాలవల్ల అత్యంత ప్రధానమైన ఈ హక్కుని వినియోగించుకోం! కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో ఇప్పటివరకూ 1,73,980 మంది ఓటర్లు ఉన్నారు. మొన్న నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమంలో కాకినాడనగర నియోజకవర్గంలో ఉన్న 213 పోలింగ్‌బూత్‌లలో నేరుగా అయితేనేమీ, ఆన్‌లైన్‌లో అయితేనేమి కొత్తగా ధరకాస్తు చేసుకొని వోటుహక్కును పొందిన వాళ్ళతో కలిపి ఈ సంఖ్య రెండులక్షలకి చేరిందట. వీరిలో యువకులే ఎక్కువ. కనుక ఈ సారి అభ్యర్థుల ఎంపికలో విప్లవాత్మకమైన వొరవడి ఉంటుందని భావించవచ్చు.

ఎవరో చెప్పినట్టు రాజ్యాధికారాన్ని నిర్ణయించేది వేసిన వోట్లు కాదు, వెయ్యని వోట్లే! రేపు సీమాంధ్రలో జరగబోతున్న ఎన్నికల్లో మన వోటు వేద్దాం!

© Dantuluri Kishore Varma

Monday, 5 May 2014

ధర్మయ్యగాడి కోటు

నూనెరాసి నున్నగా దువ్విన పలుచని జుట్టు, నల్లగా నిగనిగ మని మెరుస్తున్న మెలిపెట్టిన మీసం, దరిదాపు మోకాళ్ళ వరకూ వచ్చేసిన కోటు, దానిమీద ఉత్తరీయం, కోటుఅడుగునుంచి మొకాళ్ళ దిగువవరకూ తెల్లపంచతో, కిర్రుచెప్పులు చప్పుడు చేసుకొంటూ మిగిలినవాళ్ళకంటే ఒక అడుగు ముందే చేరుకొన్నాడు పెళ్ళివాళ్ళ ఇంటికి ధర్మయ్య.  అసలుదివాణాలు వెనకాల బండిలో వస్తున్నారని ఏమితెలుసు పాపం అక్కడ ఉన్నవాళ్ళకి? ధర్మయ్యనే దివాణం అనుకొని, నడచి వచ్చినందుకు కొంచెం ఆశ్చర్యపోతూనే,`రండి, రండి దయచెయ్యండి,` అనేశారు. భుజమ్మీద ఉన్న కండువాతీసి చప్టామీదఉన్న దుమ్ముని దులుపుకొని చతికిలబడ్డాడు. కుర్చీలు ఉండగా అక్కడ ఎందుకు కూర్చున్నాడో తెలియక మళ్ళీ ఆశ్చర్యపోయారు! జట్కాబండి వచ్చి ఆగాకా, దానిలోనుంచి దిగిన దివాణం `వాడు మా చుట్టల ధర్మయ్య` అన్న విషయం చెప్పినతరువాత కానీ పెళ్ళివాళ్ళకి అసలు సంగతి అవగతమవ్వలేదు. అప్పటివరకూ ఎవరు ఎన్ని విధాల పలకరించడానికి ప్రయత్నించినా మీసం మెలేసుకొంటూ ఉండిపోయాడు కానీ నోరు విప్పలేదు, నేను పలానా అని చెప్పలేదు.     

ఎవరైనా వొదులుగా ఉన్న చొక్కానిగానీ, పొడవుగా ఉన్న కోటుకానీ వేసుకొన్నప్పుడు `ధర్మయ్యగాడి కోటులా ఉంది,` అనడం ఒక జాతీయంలా మా కుటుంబాలలో స్థిరపడిపోయింది. నేనుగానీ, నాకంటే ఓ పదిహేను, ఇరవై సంవత్సరాల పెద్దవాళ్ళలో ఎవరూగానీ ధర్మయ్యని చూడలేదు. కానీ - నాన్నగారు, పెదనాన్నలు, చిన్నాన్నలు.. ఇంకా మేనత్తల ద్వారా ధర్మయ్య కథలు చాలా విన్నాం.  

ఒకరోజు మిట్టమిడసరం సమయంలో వీధిచప్టామీద పొర్లుతూ, కడుపునొప్పని పెడబొబ్బలు పెడుతున్నాడట. నాలుగు ఇళ్ళనుంచీ జనాలు పరిగెత్తుకొని వచ్చారు. బాన కడుపు మీద చేతులతో రాసుకొంటూ తెగ అవస్థ పడుతుంటే, ఎవరో వామ్ము తెచ్చి నోటిలో పోశారు. ఓ అరగంటకి మనిషి స్థిమిత పడ్డాడు. అసలు జరిగిన విషయం ఏమిటంటే తాతయ్యగారి అయిదుగురి కొడుకులవీ ఇళ్ళన్నీ ఒకే వీధిలో ఉంటాయి. ఉదయం లేచిన వెంటనే ధర్మయ్య చేసే పని ఇంటింటికీ వెళ్ళి ఎవరింట్లో ఏమి కూరో బోగట్టా తెలుసుకోవడం. ఎక్కడ మంచి కూర ఉంటే ఆపూట అక్కడే వాడి భోజనం. సత్తింరాజుగారింటిలోనో, జగ్గరాజుగారింటిలోనో, వెంకటేసులురాజుగారింటిలోనో ఎవరికీ సరిగా జ్ఞాపకం లేదు కానీ, ఆరోజు చుట్టాలొస్తారని కబురందడంతో కోడిగుడ్లు కూర వండడం మొదలుపెట్టారు. పెద్దచావిట్లో పందిరికింద చుట్టలు చుడుతూ ఉండాల్సినవాడు ఆ పూట కమ్మటి కోడిగుడ్లకూర వాసన ఆస్వాదిస్తూ వాళ్ళ అరుగు మీద కూర్చొండిపోయాడు. రావలసిన చుట్టాలు రాలేదు. `వొండినియ్యి పడేసుకొంటారేంటండి, ఇలాగేసేయ్యండి,` అని ఒక్కొటీ వేయించుకొని అరడజను గుడ్లూ తినేసే సరికి, అవి అరక్క వీధి అరుగు మీద పొర్లుగింతలు పెట్టాల్సి వచ్చింది. `పొట్టకెంత పడుతుందో తెలుసుకోకుండా తినేశావంటే చచ్చి ఊరుకొంటావ్ వెధవకానా,` అని ఎవరో తిడితే, `చచ్చిపోతామని భయపడి తినడం మానేస్తే, ఇంక బ్రతకడం ఎందుకండీ,` అన్నాడట.  

ధర్మయ్య మా వూరికి ఎప్పుడు వచ్చాడో, ఎవరు తీసుకొని వచ్చారో తెలియదు. ఎక్కడో జగ్గంపేటలో ఓ కూతురు ఉండేదట. అప్పుడప్పుడు చూసి రావడం, మిగిలిన రోజులన్నీ మా లోగిళ్ళలోనే ఉండడం. వాడి ప్రధానమైన వ్యాపకం మేలురకం పుగాకుని ఎంచుకొని, ఈనెలుతీసి, కొడవలిలా వొంపుతిరిగి ఉన్న కత్తి వెనుక అంచుతో పొగాకుని కోసి, నీటుగా చుట్టలు చుట్టడం; తుపాకీలో వేసుకొనే పొడవు బుల్లెట్లతో పాటు వచ్చే మిలట్రీ పెట్టెలు అని ఉండేవి. కాళీ అయిన ఆ పెట్టెల్లో చుట్టిన చుట్టలన్నీ చక్కాగా సర్దేయడం; సాయంత్రం పెరుమాళ్ళ స్తంభం దగ్గర సంత ఉంటే వెళ్ళి ఎవరికి ఏది కావలిస్తే అది పట్టుకు రావడం. ఎవరైనా చేప తెమ్మన్నారంటే ఎగిరి గంతేసేవాడట. చేపల పులుసంటే పంచప్రాణాలు. `బేగా వొండండి, అంత ఆలిసం ఏమిటి,`అని కాలు కాలిన పిల్లిలా పదిసార్లు అటూ ఇటూ తిరిగేవాడట.  ధర్మయ్యకి దెయ్యం అంటే భయంలేదు. దొంగోళ్ళన్నా భయంలేదు. కానీ, పాము మాట చెపితే పై ప్రాణాలు పైనే ఎగిరి పోయేవి. చీకట్లో నడవాలంటే కిర్రుచెప్పులు లేకుండా అడుగు ముందుకు వేసేవాడుకాదు.  

ఎవరో పై కండువాగా వేసుకొనే తెల్ల తువ్వాలు చుట్టబెట్టి ధర్మయ్యకోసం బహుమానం తెచ్చారు. `ఇదిగోరా ధర్మయ్యా వొండించుకో, మంచి చేపలు,` అని మూటని వాడి చేతిలో పెట్టారు. ఏరకం చేపలో తెలుసుకోక పోతే వాడికి మనసు మనసులో ఉండదు. వెంటనే మూట ముడి విప్పాడు. లోపలినుంచి `బుస్` మంది. ఇంకేముంది, దాన్ని అక్కడే పారేసి పరుగో, పరుగు! మూటలో చుట్టబెట్టి తెచ్చిన బుడతపాము బెదిరిపోయి వాడి వెనకాలే పరిగెట్టడంతో  భరతనాట్యం అయిపోయింది అక్కడ.    

చుట్టల ధర్మయ్య ఎప్పుడుపుట్టాడో తెలియనట్టే, ఎప్పుడు పోయాడో కూడా ఎవరికి తెలియదు. వాడికథలు మాత్రం ఉన్నాయి.  ఆ  కబుర్లు ఎవరైనా చెపుతుంటే సన్నివేశాలన్నీ సినిమాలోలా కళ్ళముందు కదులుతాయి. 

© Dantuluri Kishore Varma

Thursday, 1 May 2014

చేసిన పని మైనస్ పబ్లిక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఈజ్ ఈక్వల్‌టు ఆనందం

ఒక కుర్రాడికి పరీక్షల్లో తొంభైశాతం మార్కులు వచ్చాయి. తొంభై రెండుశాతం వచ్చిన వాడితో పోల్చుకొని, స్నేహితులు తనని తెలివితక్కువవాడు అనుకొంటారని ఊహించుకొంటూ కుమిలిపోతాడు. విజయం అంటే మనం సాధించిన దానిగురించి ఎంత ఆనందించ గలుగుతున్నాం అనేదే కానీ, చుట్టూ ఉన్నవాళ్ళు దాన్ని ఎలా స్వీకరిస్తారు అనేది కాదు.  ఎంతచిన్నదయినా సరే - మనం చేసిన పని మైనస్ పబ్లిక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఈజ్ ఈక్వల్‌టు ఆనందం అనేది గుర్తుపెట్టుకోండి. అత్తెసరు మార్కులు వచ్చినా సంతృప్తితో ఆనందించమనికాదు. కష్టించి పనిచెయ్యడం, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం తప్పనిసరిగా చెయ్యవలసిందే. కానీ, మంచి ఫలితాలు వచ్చినప్పుడు కూడా ఇతరుల అంచనాలను అందుకోలేకపోయామనే న్యూనతతో బాధపడకూడదు.
ఒక గృహిణో, కుటుంబ పెద్దో ఇతరుల అంచనాలు అందుకోవడానికి, వాళ్ళ అవసరాలు తీర్చడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటే, తమకోసం తాము జీవించే సందర్భాలు అరుదైపోతాయి. జీవితం అంతులేని కథ సినిమాలో జయప్రదలా అయిపోతుంది. బంధాలు, బంధుత్వాలు, ప్రధానమైనవే. కానీ, వాటన్నింటికన్నా మన మనసుతో మనం కలిగివుండే సంబధమే చాలా ప్రధానమైనది. దీనిని స్వార్ధం అని కొంతమంది అనవచ్చు కానీ, పట్టించుకోకండి. మనవాళ్ళకోసం వాళ్ళకు నచ్చిన ముసుగు ధరించి నటిస్తున్నాం. వాళ్ళ అంచనాలు అందుకోవడానికి పరుగులు పెడుతున్నాం. జీవితపు ర్యాట్‌రేస్‌లోనుంచి కాస్త ప్రక్కకి తప్పుకొని మీ మనసుకు నచ్చిన పనులకి సమయం కేటాయించుకోండి.  

`ఇలా చేస్తే నా స్నేహితుడికి నచ్చదేమో, ఈ విషయం చెపితే పలానా ఆయన నొచ్చుకొంటాడేమో,` అనే సంశయాలతో జీవితాన్ని సగమే జీవిస్తున్నామని డేల్ కార్నగీ దగ్గరనుంచి, రాబిన్ శర్మ వరకూ చెపుతూనే ఉన్నారు. పరిచయస్తులో, స్నేహితులో, బందువులో, కుటుంబసభ్యులో.. ఎవరైనా కానీయండి వాళ్ళు ఏమిచెప్పినా, ఏది అడిగినా కాదనలేకపోతుంటాం! శక్తికి మించినపనులు మొహమాటానికి భుజాలకెత్తుకోవద్దు.

ఇతరులమీద  అభిమానం మన బలహీనత కాకూడదు 
మొహమాటం చేతకానితనం కాకూడదు
మన వినయం,  సంస్కారం పిరికితనంలా కనిపించకూడదు

ఇంకొక్క విషయం....

నీకోసం జీవించమంటే  బాధ్యతలు విడిచిపెట్టమనికాదు. 
`నీకు ఆనందం కలిగేలా జీవించు,` అన్నారని...  
సమాజమ్మీద తిరుగుబాటు దారుడిలా ప్రవర్తించమని కాదు. 
ఆత్మవిశ్వాసం పొగరుగా రూపాంతరం చెందకూడదు. 
ధైర్యాన్నీ, బలాన్నీ,  అధికారాన్నీ బలహీనులని బెదిరించడానికి వినియోగించకూడదు.  

© Dantuluri Kishore Varma
Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!