Monday, 26 March 2018

శ్రీరామ జననం


గంగానదికి ఉత్తర దిక్కున, సరయూ నదీ తీరాన కోసలదేశమనే గొప్ప రాజ్యం ఉండేది. కోసలదేశపు రాజధాని అయోధ్య. అయోధ్య అంటే యుద్ధము ద్వారా జయింప వీలుకానిది  అని  అర్థం. పేరుకు తగినట్టుగా పన్నేండు యోజనాల వెడల్పు, మూడు యోజనాల పొడవు కలిగిన అయోధ్యా నగరం సుందరమైన రాజ భవనాలు, విశాలమైన రహదారులు, ఎత్తైన కోటగోడలు, వాటికి వెలుపల లోతైన కందకాలతో శత్రుదుర్భేద్యమైనది. మనువు అనే సూర్యవంశపు చక్రవర్తి దీనిని నిర్మించాడు. 

మనువు వంశంలోని ఇక్ష్వాకుడు అనే మరొక చక్రవర్తి పేరు మీద వీరి వంశం ఇక్ష్వాకువంశంగా ప్రశిద్ధి పొందింది. దశరథుడు ఇక్ష్వాకుల రాజులలో అగ్రగణ్యుడు. ఈయన దేవతల పక్షాన యుద్ధం చేసి ఎంతో ఖ్యాతిని గడించాడు.

ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనే ఎనిమిదిమంది సమర్థులైన మంత్రులు, రాజక్షేమాన్ని కోరే వసిష్ఠుడు, వామదేవుడు, కాశ్యపుడు, గౌతముడు, జాబాలి, సుయజ్ఞుడు అనే ఋషిపుంగవులు, ధార్మిక కార్యక్రమాలని నిబద్దతతో నిర్వర్తించే బ్రాహ్మణోత్తములు, యుద్ధతంత్రంలో ఆరితేరిన సేనా నాయకులు, లెక్కకు మిక్కిలిగా అప్రమత్తత కలిగిన గూడచారులు, అసంఖ్యాకమైన గొప్ప సైన్యంతో దశరథుడు ధర్మపరాయణుడై, సత్యవాక్పాలనాపరుడై ఐశ్వర్యంలో కుబేరుడేమో, రాజ్యపాలనలో ఇంద్రుడేమో అనిపించేవాడు. ప్రజలకు భారం కాని విధంగా పన్నులు ఉండేవి. నేరాల సంఖ్య తక్కువ. నేరస్తులకు తగిన శిక్షలు ఉండేవి. దశరధుడి పాలనలో ప్రజలు ధర్మబద్ధులై ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో, సుఖసంతోషాలతో జీవించేవారు.

ఋతుధర్మాలను అనుసరించి ఎండలు మెండుగా కాస్తున్నాయి. వర్షాలు చక్కగా కురుస్తున్నాయి. పాడిపంటలు సమృద్ధిగా ఉన్నాయి.

కానీ...

దశరధుడికి చాలా కాలం వరకూ సంతానం కలుగలేదు.

ఒకనాడు మహారాజు ముఖ్యులనందరినీ సమావేశపరిచాడు. వారిని ఉద్దేశించి ఆయన ఇలా అంటున్నాడు... 'సంతాన సాఫల్యత కోసం అశ్వమేధయాగాన్ని చేయాలని సంకల్పించాం. కాబట్టి ఋత్విక్కులను సంప్రదించి యాగాన్ని చేసే విధానాన్ని కూలంకుషంగా తెలుసుకోండి. పురోహితులకు ముహూర్తాలను నిర్ణయించమని మా మాటగా చెప్పండి. సరయూ నదీ తీరాన యాగ శాలలు నిర్మించడానికి ఏర్పాట్లు చెయ్యండి. ఆహ్వానితుల జాబితాలను తయారు చెయ్యండి. యాగానికి తరలి వచ్చే అతిదులకు వసతి, భోజన ఏర్పాట్లు ఘనంగా ఉండేలా ప్రణాళికలను సిద్ధం చెయ్యండి.     వారిని అలరించడానికి నృత్య, గాన కార్యక్రమాలను ఏర్పాటు చెయ్యండి. యాగశాలను సర్వాంగసుందరంగా నిర్మించడానికి రాజ్యంలో ఉన్న గొప్పశిల్పులని నియమించండి. కళాకారులకు సత్కారాలు, బ్రాహ్మణులకు దాన ధర్మాలు, ప్రజలకు అన్ని సౌకర్యాలు... జరిగేలా పర్యవేక్షణ బాధ్యతలు సమర్ధులకు అప్పగించండి.'  

సమావేశం ముగిసింది. సభాసదులందరూ నిష్క్రమించారు. సుమంత్రుడు మాత్రం ఉండిపోయాడు. మహారాజుకి ఒక ముఖ్యవిషయం చెప్పవలసి ఉంది. చాలా కాలం క్రితం సుమంత్రుడు - సనత్కుమారుడనే ఒక మహర్షి తన శిష్యులతో చెప్పిన మాటలు విన్నాడు. దశరధుడనే మహారాజు పుత్రుల కోసం అశ్వమేధయాగం చేస్తాడని... ఆయనకి పుత్రులు జన్మిస్తారనీ... అయితే ఆ యాగంతోపాటు పుత్రకామేష్టి యాగం కూడా జరుగవలసి ఉన్నదనీ, యాగాలకు ఆధ్వర్యుడిగా ఋష్యశృంగుడు తప్పనిసరిగా ఉండాలని ఆయన చెపుతుండగా సుమంత్రుడు విన్నాడు.

దశరధుడికి చాలా సంతోషం కలిగింది. ఋష్యశృంగుడి గొప్పతనమేమిటో, ఆయన ఎవరో తనకు చెప్పమని సుమంత్రుడిని అడిగాడు.

*     *     *

పూర్వం విభాండకమహర్షి అనే గొప్ప తపస్వి  ఉండేవాడు. ఒకనాడు ఆయన సరోవరంలో స్నానం చేస్తూ ఉండగా వీర్యపు చుక్క ఒకటి జారిపడింది. దానిని ఒక జింక సేవించడంతో, దాని గర్భంనుంచి శిరస్సు పైన  కొమ్ముతో ఒక బాలుడు జన్మించాడు. ఆయనే ఋష్యశృంగుడు.

విభాండకమహర్షి కుమారుడిని ఆశ్రమం, అడవి తప్ప మరో ప్రపంచం తెలియకుండా పెంచాడు. అతనికి వేదాధ్యయనం చెయ్యడం, యజ్ఞయాగాదులలో పాల్గొనడం, కందమూలాలు భుజించడం తప్ప మరేమీ తెలియదు. స్త్రీలను ఎప్పుడూ చూడలేదు కనుక స్త్రీ, పురుష భేదం తెలియదు.

ఇది ఇలా ఉండగా అక్కడికి సమీపంలో ఉన్న అంగరాజ్యంలో చాలాకాలంగా వర్షాలు కురియక మహాక్షామం సంభవించింది. 'ఋష్యశృంగుడిని రాజ్యానికి తీసుకొనివస్తే వర్షాలు కురుస్తాయి' అని మహారాజు రోమపాదుడికి  విజ్ఞులు చెప్పారు.  కానీ, విషయసుఖాలు ఏమీ తెలియని ఋష్యశృంగుడిని రాజ్యానికి రప్పించడం ఎలా? ముఖ్యమైన వాళ్ళందరూ సమావేశమయ్యారు. రాజ్యంలో ఉన్న అపార సౌందర్యవంతులైన వేశ్యలను నియమించి ఈ కార్యాన్ని నిర్వర్తించాలని నిశ్చయించారు.

విభాండకమహర్షి ఆశ్రమంలో లేని సమయం చూసి, రోమపాదుడిచే పంపబడిన వేశ్యలు అందంగా అలంకారాలు చేసుకొని, ఆశ్రమ సమీపంలో నృత్యగానాలు చేస్తూ, తమ హొయలతో ఋష్యశృంగుడిని ఆకర్షించారు. అతని అహ్వానం మీద ఆశ్రమానికి వెళ్ళి, కందమూలాలతో ఇచ్చిన ఆతిధ్యం స్వీకరించారు. తరువాత రోజు ఆయన కూడా తమ ఆశ్రమానికి రావాలని ఆహ్వానించారు. ఆశ్రమానికి అనే నెపంతో ఋష్యశృంగుడిని సరాసరి అంగరాజ్యానికి తీసుకొని వచ్చారు. ఆ మహానుభావుడు రాజ్యంలో అడుగు పెట్టగానే కుంభవృష్ఠి కురిసింది.  రోమపాదుడు ఎంతో సంతోషించి, తన కుమార్తె శాంతను ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేసి, వాళ్ళని అంగరాజ్యంలోనే ఉంచుకొన్నాడు.

*     *     *

దశరధుడు అంగరాజ్యం వెళ్ళాడు. రోమపాదుని అతిధిగా కొన్నిరోజులు ఉన్న తరవాత, ఆతని కుమార్తె శాంతను, జామాత ఋష్యశృంగునీ తనతో పాటు అయోధ్యకు పంపమని కోరాడు. రోమపాదుని అంగీకారంతో వారు అయోధ్యా నగరం చేరిన పిదప దశరధుడు విషయాన్ని ఋష్యశృంగునికి వివరించి, ఆతనిని అశ్వమేధయాగానికీ, పుత్రకామేష్టికి ఋత్విక్కుగా ఉండమని అభ్యర్థించాడు. ఋష్యశృంగుడు సంతోషంగా అంగీకరించాడు. శాస్త్రాలలో నిర్ణయించిన ప్రకారం యాగ క్రతువులు నభూతో...నభవిష్యతీ అన్న చందంగా జరుగుతూ ఉన్నాయి. యాగం అంటే ఒక్కరోజులో పూర్తి అయ్యేది కాదు - చైత్రమాసంతో మొదలై, ఆరు ఋతువులూ చూసి, మరుసటి చైత్రం వరకూ కొనసాగింది. వచ్చిన వాళ్ళందరికీ షడ్రుచులతో కూడిన భోజన ఏర్పాట్లు చేశారు, సత్కారాలు చేశారు, నూతన వస్త్రాలను బహూకరించారు. సంతుష్టులై.. అందరూ దశరధుని అభీష్టం నెరవేరాలని దీవించారు.

*     *     *       

ఒకవైపు యాగం జరుగుతూ ఉండగా దేవతలందరూ బ్రహ్మదేవుని దగ్గర సమావేశం అయ్యారు. బ్రహ్మనుంచి - రావణాసురుడు తనకు దేవ, దానవ, యక్ష, గాంధర్వ... తదితరులచే మరణం కలుగకుండా ఉండాలని వరం పొందాడు. కానీ, మానవులమీద ఉన్న చులకన భావం వల్ల వారిని చేర్చలేదు. బ్రహ్మ ద్వారా వరాలు పొందిన రావణాసురుడి ఆగడాలు శృతిమించి పోతున్నాయి.ఆతనిని నిలువరించే ఉపాయం చెప్పమని వారు బ్రహ్మని వేడుకొన్నారు. `విష్ణుభగవానుడే రావణుని సంహరించగల సమర్ధుడు` అని బ్రహ్మ సూచించిన పిమ్మట, దేవతలందరూ విష్ణువుని `ఈ ఆపదనుంచి కాపాడు` అని ప్రార్థించారు. విష్ణుభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. `రావణాసురుడిని నిర్మూలించే కారణం కోసం, పుత్రకామేష్టి యాగం చేస్తున్న దశరధుని ఇంట నలుగురు కుమారులుగా జన్మిస్తాను` అని వారికి మాట ఇచ్చాడు.         

రామ రావణ సంగ్రామంలో రాముడికి సహాయం చెయ్యడానికి దేవతలు అందరూ తమతమ అంశలచే - అప్సర, గంధర్వ స్త్రీలద్వారా వానర సేనను సృజించమని బ్రహ్మ ఆదేశించాడు. బ్రహ్మ ఆవులించినప్పుడు ఆయన ముఖం నుంచి జాంబవంతుడు జన్మించాడు. ఆతను వానర సేనలకు అండగా ఉంటాడని తెలియజేశాడు. ఇంద్రుడి అంశచే వాలి, సూర్యుడి వలన సుగ్రీవుడు, వాయుదేవుని వలన హనుమంతుడు... తదితర వీరులు జన్మించారు.  బ్రహ్మ ఆదేశానుసారమే - విష్ణుభగవానుడు రాముడిగా అవతరించడానికి ముందే వానరులంతా జన్మించి ఆయన సేవకై ఈ భూమండలం మీద వేచి ఉన్నారు.   

*     *     *   
పుత్రకామేష్ఠి యాగం పూర్తి అవుతూ ఉండగా, యజ్ఞకుండం నుంచి తేజోవంతమైన ఓ మహా పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో ఓ బంగారు కలశం ఉంది. దాని పైన వెండి మూత కప్పి ఉంది. దశరదుడి ఆ మహా పురుషునికి భక్తిపూర్వకంగా ప్రణామాలు అర్పించాడు. `దశరధా నీ యాగం ఫలించింది. ఈ పాత్రలో దేవతలచే చేయబడిన పాయసం ఉంది. దీనిని నీ రాణుల చేత సేవింపచెయ్యి. నీకు పుత్ర సంతానం కలుగుతుంది.` అని చెప్పి ఆయన పాయస కలశాన్ని మహారాజుకి అందజేశాడు.

దశరధుడు పాయసంలో సగభాగాన్ని (1/2) కౌశల్యకు ఇచ్చాడు. మిగిలిన దానిలో సగాన్ని (1/4) సుమిత్రకి ఇచ్చాడు, చివరకు మిగిలిన పావు వంతులో సగభాగాన్ని(1/8) కైకకు, మిగిలిన మరో భాగాన్ని(1/8) మళ్ళీ సుమిత్రకు ఇచ్చాడు. అనతికాలంలోనే ముగ్గురూ గర్భవతులు అయ్యారు.

చైత్రమాసంలో నవమిరోజు కర్కాటక లగ్నం పునర్వసు నక్షత్రంలో కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. దశమిరోజు పుష్యమీ నక్షత్రంలో కైకేయికి భరతుడు; ఆశ్లేష నక్షత్రంలో సుమిత్రకి కవలలు - లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు.   

దశరధుని కుమారులకి నామకరణం వశిష్టుని చేతులమీదుగా జరిగింది. కౌశల్యా తనయునికి - అందరినీ ఆనందింపచేసే సుగుణములు కలవాడు కనుక రాముడు అని; కైకేయి తనయునికి రాజ్యభారాన్ని భరిస్తాడు కనుక భరతుడని; సుమిత్రా తనయులలో సర్వ శుభలక్షణాలూ ఉన్న వాడికి లక్ష్మణుడని, శత్రువులని సంహరించే వాడికి శత్రుఘ్నుడని పేర్లు పెట్టారు.   

శ్రీరామ నవమినాడు సర్వకాలాల్లోనూ మానవులందరికీ ఆదర్శప్రాయమైన శ్రీరాముని కథకి అంకురార్పణ జరిగింది. 

© Dantuluri Kishore Varma

Saturday, 3 March 2018

బంగారుశిఖరాల బహుబ్రహ్మమయము...

భావములోనా - బాహ్యమునందును
గోవింద గోవిందయని - కొలవవో మనసా...
హరి యవతారములే - అఖిలదేవతలు
హరిలోనివే బ్రహ్మాండంబులు...
హరి నామములే - అన్ని మంత్రములు
హరి హరి హరి హరి యనవో మనసా...
విష్ణువు మహిమలే - విహిత కర్మములు
విష్ణుని పొగడెడి - వేదంబులు...
విష్ణుడొక్కడే - విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని - వెదకవో మనసా...
అచ్యుతుడితడే - ఆదియునంతయము
అచ్యుతుడే - యసురాంతకుడు... 
అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీదనిదే 
అచ్యుత యచ్యుత శరణనవో మనసా...
అదివో అల్లదివో హరివాసము
పదివేలుశేషుల పదగలమయము...
అదె వేంకటాచల మఖిలవున్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము...
అదివో నిత్యనివాస మఖిలమునులకు
న దె చూడు డ దె మొక్కు డానందమయము...
చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము...
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారుశిఖరాల బహుబ్రహ్మమయము...
కైవల్యపదము వేంకటనగ మదివో
శ్రీవేంకటపతికి సిరులైనది...
భావింప సకల సంపదరూప మదివో
పావనములకెల్ల పావనమయము.
(Photos taken in Tirupati and Tirumala. Text: Annamayya Keerthanas) 

                                    © Dantuluri Kishore Varma

Sunday, 25 February 2018

శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమల కొండపైకి...

శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండపైకి నడకదారిలో వెళ్ళాలనుకొనే భక్తులకు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది ఎప్పటినుంచో భక్తులు ఉపయోగిస్తున్న అలిపిరిమెట్టు మార్గం. రెండవది ఈ మధ్యకాలంలో క్రమంగా ప్రాచుర్యాన్ని పొందుతున్న దగ్గర దారి -  శ్రీవారిమెట్టు.  

మొన్న, 2018 జనవరి నెలలో మేము శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కొండపైకి వెళ్ళాం. `ఏ దారిలో కొండపైకి వెళ్ళాలి? శ్రీవారి మెట్టు మార్గం సౌకర్యంగా ఉంటుందా? `వంటి సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఈ మార్గానికి సంబంధించి పూర్తి సమాచారం కూడా అందుబాటులో లేదు. అందుకే, నేను తెలుసుకొన్నంత వరకూ సమాచారాన్ని ఫోటోలతో కలిపి ఇస్తే ఎవరికైనా ఉపయోగపడుతుందని ఇది వ్రాస్తున్నాను.

తిరుపతి నుంచి (రైల్వే స్టేషన్/బస్‌స్టాండ్) శ్రీవారిమెట్టుకు సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. దేవస్థానం వారి ఉచిత బస్సులు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. కానీ, అవి సాధారణంగా రద్దీగా ఉండడం వల్ల లగేజీతో వాటిలో ప్రయాణం కొంచెం కష్టం. ఆర్టీసీ వాళ్ళ లైను బస్సుల్లో కానీ, అద్దె  వాహనాల్లో కానీ వెళ్ళవచ్చు. తిరుపతి ట్రాఫిక్ పోలీసు వారు ఏర్పాటు చేసిన టేక్సీ కౌంటర్ రైల్వే స్టేషన్ దగ్గరే ఉంది. మా బృందంలో ఏడుగురి సభ్యులకీ సరిపోయే విధంగా ఒక జీపుని 750 రూపాయలకి మాట్లాడుకొన్నం. దారిలో శ్రీనివాస మంగాపురం చూపించి, శ్రీవారి మెట్టు దగ్గర దించే ఏర్పాటు చేసుకొన్నాం.  ఇదే మార్గంలో తిరుపతి జూపార్క్ కూడా తగులుతుంది. సమయాభావం వల్ల మేము అక్కడ ఆగలేదు. 
ప్రయివేట్ వాహనాలని పై ఫోటోలో కనిపిస్తున్న స్టాప్ బోర్డ్ వరకే అనుమతిస్తారు. నేరుగా లగేజ్ కౌంటర్ వరకూ అనుమతించరు. కాబట్టి ఇక్కడి నుంచి కొంతదూరంలో ఉన్న కౌంటర్‌కి మన సామాన్లని మనమే మోసుకొని వెళ్ళాలి.  నడకదారి ద్వారా తిరుమలకి వెళ్ళే భక్తుల కోసం దేవస్థానం వాళ్ళు కొన్ని సౌలభ్యాలని కలుగజేశారు. అవి - ఉచిత బస్సు, సామాన్లని ఉచితంగా కొండపైకి చేరవెయ్యడం, శ్రీవారి దివ్య దర్శనం, ఉచితంగా లడ్డూప్రసాదం మొదలైనవి. శ్రీవారిమెట్టు మార్గం స్వయంగా వేంకటేశ్వరుడు తిరుమలకు నడచి వెళ్ళిన దారి అట. అందువల్లనే పాదరక్షలతో వెళ్ళవద్దని ప్రారంభంలోనే బోర్డులు పెట్టారు.  చెప్పుల్ని కూడా ఓ సంచిలో పెట్టుకొని లగేజీతో పాటూ పైకి పంపే ఏర్పాటు చేసుకోవాలి. తాళాలు వేసిన బ్యాగ్లని, సూట్కేసులని మాత్రమే తీసుకొంటారు. వాటిని స్కాన్ చేస్తారు. ఏవైనా విలువైన వస్తువులూ, డబ్బూ, శ్రీవారి ముడుపులూ వగైరా ఉంటే తీసివేయమని సూచిస్తారు.  

అలిపిరిమెట్టు దారికంటే శ్రీవారిమెట్టు మార్గంలో నడక తేలికగా ఉంటుంది. ఎందుకంటే, అలిపిరి మార్గం క్రిందనుంచి కొండపైకి తొమ్మిది కిలోమీటర్ల దూరం, 3550 మెట్లు ఎక్కాలి. కానీ శ్రీవారి మెట్టు మార్గం కేవలం 3 కిలోమీటర్ల దూరం, 2388 మెట్లు. 


కాలినడక భక్తులకు ప్రతిరోజూ 20వేల దివ్యదర్శనం టిక్కెట్లు జారీ చేస్తారు. వీటిలో 14వేల టిక్కెట్లు అలిపిరి మార్గంద్వారా వెళ్ళేవారికీ, మిగిలిన ఆరువేల టిక్కెట్లూ శ్రీవారిమెట్లు మార్గంలో వెళ్ళేవాళ్ళకీ ఇస్తారు. భద్రతా కారణాల రీత్యా శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5.30 నిమిషాల వరకూ మాత్రమే అనుమతిస్తారు. ఉదయం ఆరు గంటల నుంచి టిక్కెట్లు జారీచెయ్యడం మొదలుపెట్టి, ఆరువేల వరకూ ఇస్తారు. ఈ కోటా పూర్తయిన తరువాత నడిచి వెళ్ళిన వారు కూడా సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలి. 
సుమారు 1250వ మెట్టు దగ్గర దివ్యదర్శనం టిక్కెట్లు ఇచ్చే కౌంటర్ ఉంది.
దివ్యదర్శనం టిక్కెటు
ఈ టిక్కెట్టు ఉన్న భక్తులకి శ్రీవారి దర్శనంకోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తారు. దర్శనం తొందరగా అవుతుంది. ఒక లడ్డూని ఉచితంగా ఇస్తారు. అధనంగా కావాలంటే మరో రెండింటిని ఒక్కొక్కటీ పది రూపాయలకు తీసుకోవచ్చు. ఇంకొక రెండు కూడా కావాలంటే వాటిలో ఒక్కొక్కటికీ 25 రూపాయలకు పొందవచ్చు. అంటే ఉచిత లడ్డూ కాకుండా అధనంగా నాలుగింటిని 70 రూపాయలకు తీసుకోగలం.
ఇచ్చిన టిక్కెట్ పైన మళ్ళి 2050వ మెట్టు దగ్గర ఉన్న మరొక కౌంటర్‌లో స్టేంప్ వేస్తారు. 
ఎనిమిది వందల మెట్ల వరకూ పెద్దగా అలసట తెలియకుండా వెళ్ళిపోవచ్చు. అక్కడినుంచి కొండపైకి ఏటవాలుగా ఎత్తు పెరుగుతుంది. దర్శనం టిక్కెట్లు చేతికి వచ్చేంత వరకూ వేగంగా వెళ్ళినా... ఆ తరువాత విశ్రాంతి తీసుకొంటూ, తీరుబడిగా నడచి వెళ్ళవచ్చు. వెంట చిన్న తేలిక బ్యాగ్‌లో మంచి నీళ్ళు, టీ, స్నాక్స్, అత్యవసరమైన మందులు లాంటివి తీసుకొని వెళితే మంచిది. 

ఎండనుంచి, వర్షాన్నుంచి రక్షణ ఇవ్వడం కోసం దారంతా తొంభై శాతం వరకూ షేల్టర్లు నిర్మించారు. ప్రతీ యాభై మెట్లకూ ఒక్కో మంచినీటి ట్యాప్ ఉంది. మరుగుదొడ్ల సౌకర్యం ఉంది. చిరువ్యాపారులు ఏర్పాటు చేసిన చిన్న చిన్న తాత్కాలిక అంగళ్ళు ఉన్నాయి. నిమ్మసోడాలు, మజ్జిగ, కూల్‌డ్రింకులు, బిస్కెట్లు లాంటివి... పిడతకింద పప్పూ, ఉడికించిన పల్లీలూ అమ్ముతున్నారు.   


మంచి వాతావరణంలో, ఉదయాన్నే బయలుదేరితే ఆహ్లాదకరమైన పరిసరాలనీ, ప్రకృతినీ ఆస్వాదిస్తూ, గోవింద నామ స్మరణ చేసుకొంటూ, ఫోటోలు తీసుకొంటూ, సత్కాలక్షేపంతో తిరుమల చేరవచ్చు. ఈ ప్రయాణం చక్కని అనుభూతిని ఇస్తుంది. 


కాకపోతే అలిపిరి మార్గం ద్వారా వెళ్ళినప్పుడు కనిపించే జింకల పార్కు, ఆంజనేయస్వామి విగ్రహం, గాలిగోపురం, దశావతారాల విగ్రహాలు, ఏడుకొండలను తెలియజేసే బోర్డులూ, రోడ్డు మార్గంలో(అలిపిరి మార్గంలో కొంతదూరం రోడ్డుపైన నడాలి) జలపాత దారలు (వర్షాకాలంలో మాత్రమే)... శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళేటప్పుడు మిస్సవుతాం.
చివరి మెట్టు మీద ఒక వ్యక్తి కర్పూరం బిళ్లల్ని పెద్ద బస్తాలో వేసుకొని అమ్ముతూ కనిపిస్తాడు. ఒక్కొక్కటీ పదేసి చొప్పున కొనుక్కొని, వెలిగించి వేంకటేశ్వర స్వామిని మనసులో ధ్యానించుకొని ముందుకు కదలడమే.
పైకి వెళ్ళిన తరువాత లగేజీ కౌంటర్‌లో మన బ్యాగేజ్ తీసుకొని తిన్నగా మనం ఏర్పాటు చేసుకొన్న  కాటేజీకో, రూంకో వెళ్ళిపోవడమే.

గోవిందా...గోవింద!
© Dantuluri Kishore Varma

Sunday, 11 February 2018

నవ్యాంధ్ర పుస్తక సంబరాలు

కాకినాడ ఆనందభారతి గ్రౌండ్స్‌లో నిన్నటి(10.02.2018) నుంచి నవ్యాంధ్ర పుస్తక సంబరాలు (బుక్ ఫెస్టివల్) మొదలయ్యాయి. ఈ నెల 18వ తేదీ వరకూ కొనసాగుతాయి. మద్యాహ్నం 2నుంచి రాత్రి 9 వరకూ సందర్శించవచ్చు. స్టాల్స్ చాలా ఉన్నాయి. మంచి మంచి పుస్తకాలూ ఉన్నాయి. సరైన ప్రచారం లేకో ఏమిటో తెలియదు కానీ సందర్శకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ తరహా  ఫెస్టివల్ కాకినాడలో నిర్వహించడం ఇది 3వ సారి.   ఇటువంటి వాటిని ఆదరిస్తే, ప్రతీ సంవత్సరం విజయవాడలోలాగ మనకి కూడా బుక్‌ఫెస్టివల్ వస్తుంది. అలా జరిగితే బుక్‌లవర్స్‌కి నిజంగా పండగే.

Thursday, 1 February 2018

చంద్రగిరి కోట

తిరుపతి పట్టణానికి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగ్రిగి వెళ్ళేసరికి సాయంత్రం ఐదున్నర అయిపోయింది. రాతితో కట్టిన కోటగోడలు, ప్రవేశద్వార మండపాలు, రహదారికి కొంచెం ఎడంగా ఉన్న పురాతన దేవాలయాల గోపురాలు చూసుకొంటు రాజమహల్ దగ్గరకి చేరుకొన్నాం.  అప్పటికే సందర్శకులని అనుమతించే సమయం దాటిపోవడంతో గేట్లు మూసేస్తున్నారు. `చాలాదూరంనుంచి వచ్చామని, అనుమతించమని కోరడంతో,` ఏమనుకొన్నారో, `తొందరగా చూసి వచ్చేయండి` అని గేట్లు తెరిచారు. కృతజ్ఞతలు చెప్పి లోనికి వెళ్ళాం.ఎప్పుడో పదకొండవ శతాబ్ధంలో నిర్మించిన కోట. శత్రుదుర్భేద్యంగా ఉండడం కోసం కొండవాలులో కట్టారు. అర్థచంద్రాకారపు కొండ కోటకు మూడువైపులా పెట్టని గోడలా ఉంది. రాజమహల్, రాణీమహల్, వాటి నడుమ ఉద్యానవనం, చిన్న నీటి కొలను, రాణీమహల్‌కి సమీపంలో దిగుడు మెట్లున్న మంచినీటి బావి... కొండమీదనుంచు వస్తున్న చల్లని సాయంత్రపు గాలి ఆహ్లాదంగా ఉంది. 

రాజమహలులో కవితాగోష్టులు, యుద్దతంత్రాలు, రహస్యమంతనాలు, మంత్రిమండలి సమావేశాలు జరిగేవేమో. రాణీమహల్ గవాక్షాలనుంచి యువరాణులు బయటకు చూస్తూ ఏమి పాటలు పాడుకొనేవారో, చెలికత్తెలతో కలిసి మహలులో చప్టాలమీద ఏమి ఆటలు ఆడుకొనేవారో, వేటకు వెళ్ళిన రాజుగారు చీకట్లు ముసురుకొంటున్న సాయంత్రం - రాత్రిగా మారుతున్నా రాకపోతే మహారాణులు దిగుళ్ళను ఎవరితో పంచుకొనేవారో!  

సాళువ నరసింహరాయలు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడట. శ్రీకృష్ణదేవరాయలు కొంతకాలం ఈ కోటలో ఉన్నాడని చెపుతారు. తన ఇద్దరు భార్యలలో ఒకరైన చిన్నమదేవిని చంద్రగిరిలోనే కలిశాడట. విజయనగర రాజులు పెనుగొండను రాజదానిగా చేసుకొని పరిపాలిస్తున్న కాలంలో, గోల్కొండ నవాబుల దండయాత్ర కారణంగా విజయనగర రాజదానిని పెనుగొండ నుంచి చంద్రగిరికి మార్చారట. తరువాత చంద్రగిరి మైసూర్ పాలకుల ఆధీనంలో కూడా ఉంది.   

ప్రస్తుతం రాజమహల్‌లో ఆర్క్యలాజికల్ మ్యూజియం ఉంది. మేము వెళ్ళినరోజు శుక్రవారం కావడంతో మ్యూజియంకు శలవు. కానీ సాయంత్రం ఆరున్నర గంటలనుంచి, ఏడుగంటల పదిహేను నిమిషాల వరకూ - ముప్పావుగంట సేపు ప్రదర్శించే మ్యూజిక్ అండ్ లైట్ షో ఉంది. ఈ షో చూడడానికి పెద్దలకు టిక్కెట్టు అరవై రూపాయలు. పిల్లలకు నలభై ఐదు.  `నేను చంద్రగిరి కోట అంతరాత్మను...` అని మొదలు పెట్టిన గంభీరమైన స్వరం చంద్రగిరి చరిత్రను చక్కటి రూపకంలా వివరించి చెపుతుంది. ఈ షో చూసినవాళ్ళకి నిస్సందేహంగా  మంచి అనుభూతికి కలిగిస్తుంది.  

ఎవరైనా తిరుపతి వెళ్ళినప్పుడు ఒకపూట కేటాయించగలిగితే చంద్రగిరి కోటను చూడవచ్చు.

 © Dantuluri Kishore Varma   

Thursday, 4 January 2018

వాల్మీకి

ఆదికావ్యం రామాయణాన్ని రచించిన వాల్మీకిమహర్షి  అసలు పేరు అగ్నిశర్మ. అతని తండ్రి సుమతి, తల్లి కౌశికి.  కుటుంబ పోషణ కోసం వేదపఠనాన్ని, పౌరోహిత్యాన్ని కాకుండా దారిదోపిడీని వృత్తిగా ఎంచుకొన్నాడు అగ్నిశర్మ. అడవిలో ఆశ్రమం నిర్మించుకొని కుటుంబంతో సహా జీవిస్తున్నాడు. 

ఒకరోజు సప్త ఋషులయిన వశిస్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, అత్రి, జమదగ్ని, భరద్వాజుడు, కశ్యపుడూ తీర్థయాత్రలకు వెళుతూ అగ్నిశర్మ ఆశ్రమ సమీపంలో ఉన్న అడవిదారిగుండా ప్రయాణం చేస్తున్నారు. అగ్నిశర్మ వారిని అటకాయించాడు. వారివద్ద ఉన్న వస్తువులు, ఆహారపదార్థాలు ఇవ్వమని బెదిరించాడు. అప్పుడు అత్రి మహాముని, `నాయనా మనుష్యులని హింసించి, చంపి ఆర్జించే సంపదవల్ల పాపం కలుగుతుంది. ఇదంతా ఎవరికోసం చేస్తున్నావు?` అని ప్రశ్నించాడు. `తల్లితండ్రుల కోసం, భార్యాపిల్లల కోసం,` అని సమాధానం చెప్పాడు అగ్నిశర్మ.   `అలా అయితే, నీ సంపాదనలో భాగం పంచుకొంటున్న వాళ్ళు- నీ పాపాలలో కూడా భాగం పంచుకొంటారేమో తెలుసుకొని రా,` అన్నాడు అత్రి.

సప్తఋషులని అక్కడే వేచి ఉండమని చెప్పి, ఇంటికి వెళ్ళాడు అగ్నిశర్మ. తల్లిని, తండ్రిని, భార్యని `నా పాపంలో భాగం పంచుకొంటారా?` అని అడిగాడు. `సక్రమంగానో, అక్రమంగానో సంపాదించి కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత ఒక గృహస్తుగా  నీకు ఉంది. ఆ కర్తవ్య నిర్వాహణలో సంభవించే పాపపుణ్యాలు పూర్తిగా నీవే తప్ప, మావి కాదు` అని వాళ్ళు చెప్పారు.  

ఈ సమాదానంతో  అగ్నిశర్మ ఎంతో దిగులు చెందాడు. సప్తఋషుల దగ్గరకు తిరిగివెళ్ళి జరిగిన విషయం చెప్పాడు. తనకు మార్గనిర్దేశం చెయ్యమని వేడుకొన్నాడు. అప్పుడు అత్రి మహర్షి అగ్నిశర్మకి శివ పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి,  ధ్యానం చెయ్యమని చెప్పాడు. 

అగ్నిశర్మ ధ్యానం చేస్తూ ప్రపంచాన్ని మరచిపోయాడు. ఆకలి, దప్పికలు లేవు. బాహ్యస్మృతిలేదు. రోజులు, మాసాలు, ఏళ్ళు గడిచాయి. అగ్నిశర్మ శరీరం చుట్టూ పుట్టలు మొలిచాయి. పదమూడు సంవత్సరాల తరువాత తీర్థయాత్రల నుంచి తిరిగి ఆదే మార్గంలో వస్తున్న మహర్షులు పుట్టలో ఉండి ధ్యానం చేస్తున్న అతనిని గమనించి, బయటకు పిలిచారు. పుట్టను సంస్కృతంలో వాల్మీకం అంటారు. వాల్మీకం నుంచి బయటకు వచ్చాడు కనుక అగ్నిశర్మ అప్పటినుంచీ వాల్మీకి అయ్యాడు. 

*     *     * 

ఆ తరువాత వాల్మీకి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్ళాడు. ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేసుకొని, పరమేశ్వరుడ్ని ఆరాదించాడు. చిత్రకూట పర్వతం మీద కొన్నిరోజులు ఉండి, అటుపిమ్మట తమసానది తీరంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని, శిష్యులతో సహా అక్కడ నివశిస్తున్నాడు. 

ఆ సమయంలోనే ఆయనకు ఒక సందేహం వచ్చింది. `ఇదీ లోపం అని వేలుపెట్టి చూపించడానికి అవకాశం లేని, సకల సద్గుణాలూ కలిగిన మహాపురుషుడు ఎవరైనా ఈ భూమండలం మీద ఉండి ఉంటారా?` అని. అటువంటి వ్యక్తి ప్రియమైన రూపం కలిగినవాడై ఉండాలి. ముఖంలో మంచి తేజస్సు వుండాలి. బలం, ధైర్యం, పరాక్రమం కలిగి ఉండాలి. సకలవిద్యలలోనూ పారంగతుడై ఉండాలి. సమర్దుడై ఉండాలి, దృడసంకల్పం కలిగినవాడై ఉండాలి. ధర్మాధర్మాలు తెలిసి ఉండాలి. సకలప్రాణుల హితం కోరుకోవాలి. ఎవరైనా తనకు చేసిన మేలు మరచిపోకూడదు - అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా అసత్యం పలుకని వాడై ఉండాలి. మంచి చరిత్ర కలిగిన వాడై ఉండాలి... ఉండవలసిన సుగుణాలు ఇవి. మరి అతనికి ఉండకూడని దుర్గుణాలు ఏమిటి? అసూయ ఉండకూడదు. క్రోదాన్ని జయించిన వాడై ఉండాలి - అలాగని అసలు కోపమే ఉండకూడదని కాదు. ఏదైనా సహేతుకమైన కారణం చేత అతనికి కోపం కనుక వస్తే దేవతలు కూడా భయపడే విధంగా ఉండాలి.  

ఏవైనా ఒకటి రెండు మంచి గుణాలు ఉన్న వ్యక్తి తారసపడితేనే ప్రశంసాపూర్వకమైన ఆనందంతో తబ్బిబ్బైపోతాం. ఆలాంటిది, వాల్మీకి యోచించిన పదహారు సుగుణాలూ రాసిపోసుకొన్న పురుషోత్తముడు గురించి తెలుసుకొంటే ఆశ్చర్యం, ఆనందం, గౌరవం, భక్తి... అన్నీ కలగలిసి పారవశ్యం కలూగకుండా ఉంటుందా !? 

ఒకరోజు నారదమహర్షి, వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన సందర్భంలో, వాల్మీకి తన సందేహాన్ని ఆయన వద్ద వ్యక్తం చేశాడు. వాల్మీకి అడిగిన ప్రశ్న ఇదే...

"కో న్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ 
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత: 
చారిత్రేణ చ కో యుక్త: సర్వభూతేషు కో హిత: 
విద్వాన్ క: కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన: 
ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో..అనసూయక: 
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సమ్యుగే 

అప్పుడు నారద మహర్షి - ఇక్ష్వాకు వంశంలో జన్మించిన శ్రీరాముడికి ఆ పదహారు సుగుణాలూ ఉన్నాయని చెపుతూ, రాముడి కథని వందశ్లోకాలలో సంక్షేప రామాయణంగా వినిపించాడు. 

రామాయణం ప్రతీ సన్నివేశంలో రాముడి శౌశీల్యం ఉదాత్తంగా అభివ్యక్తమౌతుంటుంది. దానిని వాల్మీకి చెప్పిన సుగుణాల కోణంలో పరిశీలిస్తే రాముడు ఎంత గొప్ప కథానాయకుడో తెలుస్తుంది. నిజానికి వాల్మీకి అడిగిన ప్రశ్నని పటంకట్టించి ప్రతీ పాఠశాలలో, ప్రతీ కార్యాలయంలో, మనుష్యులు తిరిగే ప్రతీ చోటా తగిలిస్తే... దాని అర్థాన్ని వివరిస్తే ప్రపంచంలో ఏ వ్యక్తిత్వవికాస పుస్తకమూ చేయలేని మంచి, అది మనకు చేస్తుంది. 
*     *     *

రామాయణం - రాముడి కథ, ఆయన నడచిన దారి, నారద మహర్షి నుంచి విన్న రామాయణంలో సన్నివేశాలు వాల్మీకి మనసులో నిరంతరాయంగా మెదులుతున్నాయి. సంధ్యావందనం చేయడానికి శిష్యునితో కలసి తమసానది వైపుకి వాల్మీకి మహర్షి వెళుతూ ఉండగా ఒక చెట్టుకొమ్మమీద జతకట్టి ఉన్న రెండు క్రౌంచపక్షులు ఆయన కంట పడ్డాయి. అంతలో ఎక్కడినుంచో ఒక బోయవాడు గురిచూసి కొట్టిన బాణం సూటిగా వచ్చి మగపక్షి గుండెల్లో దిగబడింది. అది విలవిలలాడుతూ నేలకూలిన వైనం, ఆడపక్షి ఆక్రోశం వాల్మీకి మనసుని కలిచివేశాయి. వెంటనే ఆయన కోపంగా `కామమోహంతో పరవశించి ఉన్న క్రౌంచ పక్షులలో ఒకదానిని సంహరించావు కనుక నీవుకూడా త్వరలోనే మరణిస్తావు` అని ఒక శ్లోక రూపాన బోయవాడిని శపించాడు. ఆవిధంగా శపించినందుకు ప్రశ్చాత్తాప పడినా, శ్లోకంలోని చందస్సు, లయ వాల్మీకికి సంబ్రమాశ్చర్యాలను కలిగించాయి. ఆ శ్లోకాన్నే మననం చేసుకొంటూ ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.

రామాయణ మహాకావ్యం ఆవిష్కృతమవ్వడానికి సమయం ఆసన్నమయ్యింది. వాల్మీకి ఎదుట బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆజ్ఞ మేరకే తనకి సరస్వతీ కటాక్షం కలిగి, శాపం స్లోకం రూపంలో అభివ్యక్తమైందని వాల్మీకికి తెలుస్తుంది. బ్రహ్మ అనుగ్రహం వల్ల వాల్మీకికి జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది తెలుసుకొనే దివ్యదృష్టీ, రామాయణ పాత్రల మనసుల్లో మెదిలే ఆలోచనలు కూడా చదవగలిగే శక్తి వచ్చాయి. ఈ భూమండలంమీద పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణం నిలిచి ఉంటుందని చెప్పి, బ్రహ్మ అంతర్దానం అయ్యడు.

బోయవాడిని శపించిన శ్లోకం యొక్క చందస్సులోనే వాల్మీకి రామాయణాన్ని రచించాడు. నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణాన్ని విస్తరించి బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్దకాండ అనే ఆరు కాండలుగా, ఇరవై నాలుగు వేల శ్లోకాలతో  ఆదికావ్యంగా వాల్మీకి మహర్షి రచించాడు. తరువాత జరిగిన కథని ఉత్తరకాండగా ఆ ఆరుకాండలకీ జతచేశాడు. పరమ పవిత్రమైన గాయత్రీమంత్రంలోని ఇరవైనాలుగు అక్షరాలలో ఒక్కొక్కదానినీ వెయ్యి శ్లోకాలుగా విస్తరించి రామయణ కావ్యాన్నీ రచించడం జరిగిందని చెపుతారు. ఆవిధంగా గ్రంధస్థం చేసిన రామాయణ మహాకావ్యాన్ని గానంచేసే పద్ధతిని అప్పటికే వాల్మీకి ఆశ్రమంలో పెరుగుతున్న సీతారాముల కుమారులు కుశలవులకు నేర్పించాడు.

శివుడిని ధ్యానించి అగ్నిశర్మ వాల్మీకి అయ్యాడు. బ్రహ్మ అనుగ్రహంతో సరస్వతీ కటాక్షాన్ని పొంది శ్రీమహావిష్ణువు యొక్క అవతారమైన రాముడి కథని శ్రీమద్రామాయణంగా రచించాడు. త్రిమూర్తుల అనుగ్రహం వల్ల రామాయణం అజరామర కావ్యంగా ఈ భూమండలంమీద నిలచిపోయింది.   విలువలు పతనం ఐపోతున్న ఈ రోజుల్లో, ప్రతీ ఒక్కరూ రామాయణాన్ని చదవడం అత్యంత ఆవశ్యకం. ఆదర్శవంతమైన రాముడి వ్యక్తిత్వం - మంచీచెడూ, ధర్మాధర్మ విచక్షణని ప్రతీఒక్కరిలోనూ కలిగించగలదు.
Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!