Pages

Showing posts with label గోదావరి గలగలలు. Show all posts
Showing posts with label గోదావరి గలగలలు. Show all posts

Sunday, 28 June 2020

Tuesday, 3 December 2019

కోతల సమయం

జిల్లాలో వరి పండించే రైతులకు ప్రస్తుతం తొలకరి పంట చేతికివచ్చే కాలం. కోతలు పూర్తైపోయాయి. కొన్ని చోట్ల చేలు పనలమీద ఉన్నాయి - అంటే కోసిన వరిమొక్కలని కంకులతోపాటూ చెమ్మ లాగడానికి మడి లోనే మూడు నాలుగు రోజులు ఆరబెడతారు. పనమీద ఉన్న సమయంలో దురదృష్టవశాత్తూ వర్షం కానీ వస్తే రైతు సీజన్ అంతా పడిన కష్టం నీటి పాలైనట్టే.     
వ్యవసాయ పనులకి రోజు కూలి ఈ సంవత్సరం వెయ్యి దాటిందట. దాంతో రైతులు 'వ్యవసాయం ఏమీ కిట్టుబాటు అవడం లేదు' అని గగ్గోలు పెడుతున్నారు. కోతల యంత్రాలు వచ్చిన తరువాత పనిలో వేగం పెరిగింది. ఒకటి రెండు గంటల్లోనే ఒక ఎకరం కోత పూర్తయిపోతుంది. పైగా కూలీలతో చేయించు కొన్న దాని కన్నా తక్కువ ఖర్చు. కాబట్టి పెద్ద కమతాల వాళ్ళు యంత్రాలతో పని కానిచ్చేస్తున్నారు. ఒకటి రెండు ఎకరాలు ఉన్న సన్నకారు రైతులు మాత్రం పాత పద్ధతులే కొనసాగిస్తున్నారు.  
పనలు ఆరిన తరువాత కళ్ళం దగ్గరకి చేరవేసి, నూర్పుళ్ళు చేస్తారు.  కొన్నిచోట్ల ఏటవాలు బల్ల మీద మోది దాన్యపు గింజల్ని వేరు చేసే పద్ధతి ఉంది. కానీ - గోదావరి జిల్లాల్లో మాత్రం కుప్పనూర్పుళ్ళే.  పనలని కళ్ళంలో పరచి రెండెడ్ల బండితో కానీ, ట్రాక్టరుతో కానీ తొక్కిస్తారు. దీనికంటే సులువైన ఏర్పాటు ఇంకొకటి ఉంది - పనల్ని ట్రాఫిక్ బాగా ఉన్న తారురోడ్డు మీదో, సిమెంటురోడ్డు మీదో పారెయ్యడమే. పైసా ఆయిల్ ఖర్చు కానీ, ట్రాక్టరు కిరాయి కానీ లేకుండా పని కానిచ్చేయొచ్చు. వాహనదారులు ఎంత ఇబ్బంది పడినా నష్టం ఏమీ లేదు! 

ఈ పని పూర్తయిన తరువాత దాన్యం - దూగర, పొట్టుతో ఉంటుంది. వాటిని వేరు చెయ్యడానికి ఎగరబోస్తారు. దాన్యాన్ని చేటలలోకి ఎత్తి, గాలి వాలు చూసుకొని, ఎత్తునుంచి చేట ప్రక్కఅంచు మీదుగా జాలువారుస్తారు. ఇలా చెయ్యడం వల్ల గాలికి పొట్టూ, దూగరా దూరంగా ఎగిరిపోయి, దాన్యం నేరుగా క్రింద గుట్ట పడుతుంది.  

తరువాత దాన్యాన్ని కొన్నిరోజులు ఆరబెట్టుకొని, కొలిచి గోనె సంచుల్లోకి నింపి, ట్రాక్టరు మీదో, బండి మీదో ఇంటికి లేదా మిల్లుకి పంపేస్తారు. నూర్చిన తరువాత మిగిలిన వరి గడ్డిని మేటు వేసి, సంవత్సరం పొడవునా పసువులకి గ్రాసంగా వాడతారు. 





వ్యవసాయం ప్రధాన వ్యాపకంగా ఉండే కుటుంబాలలో పుట్టి, పెరిగిన కారణంగా నలభై సంవత్సరాల వయసు దాటిన చాలామందికి ఈ విషయాలు అన్నీ బాగా తెలిసినవే. కానీ తరువాత క్రమంగా చదువులకోసం, ఉద్యోగాలకోసం పట్టణాలకీ, విదేశాలకీ వెళ్ళిపోయిన కుటుంబాలలో పిల్లలకి ఇల్లూ, బడీ తప్ప మరోప్రపంచం లేకుండా పోయింది. 'మనం తినే బియ్యం ఏ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు?' అని అడుగుతున్న తరం తయారయింది. వాళ్ళు కుతూహలం కొద్దీ తెలుసుకోవాలి అనుకొంటే ఏమైనా ఉపయోగ పడుతుందేమో అని ఈ టపా వ్రాస్తున్నాను.   


                   

Monday, 16 May 2016

మావిడి రసాల తీపి కబుర్లు

కాకినాడనుంచి పిఠాపురం వెళ్ళేదారిలో తిమ్మాపురం దాటిన తరువాత కుడిచేతివైపు రోడ్డుప్రక్కగా పే..ద్ద చెరువు ఉంటుంది. దానిని పండూరు చెరువు అంటారు. ఆ వెంటనే పండూరు ఊరిలోకి దారి. అలా లోపలికి వెళ్ళిపోతే ఊరి మొదటిలో రోడ్డుకి రెండువైపులా మావిడితాండ్ర తయారీ కేంద్రాలు కనిపిస్తాయి. విశాలమైన మైదానం లాంటి చోటుల్లో నేలకి రెండు మూడు అడుగుల ఎత్తులో సిమ్మెంటు స్థంబాల మీద మంచెల్లా కట్టి ఉంటాయి. వాటిమీద మావిడితాండ్ర చాపలు పరచి ఉంటాయి.  తీపి మావిడి పండ్ల వాసన ఆ ప్రాంతం అంతా వ్యాపించి ఉంటుంది. ఎండ నిప్పులు చెరుగుతూ ఉంటుంది. మావిడి తాండ్ర చాపల పైన పనివాళ్ళు మావిడి గుజ్జుని పొరలుగా పూస్తూ ఉంటారు.      
మావిడి తాండ్రని తయారీ విధానం ఏమిటో తెలుసుకోవాలని ఉందా?

ఇక్కడ తాండ్ర తయారీకి కలెక్టర్ రకం మావిడి కాయలను ఉపయోగిస్తున్నారు. పళ్ళని శుబ్రంగా కడిగి, గుజ్జు తీసే యంత్రంలో వేస్తారు. టెంకా, తొక్కా బయటకు పడిపోయి, గుజ్జు ఒక పెద్ద పాత్రలోనికి వచ్చేస్తుంది. ఈ మావిడి గుజ్జుకి చక్కెరా, బెల్లం తగినంత మోతాదులో కలుపుతారు. తీపి సరిపోయిందని నిర్ణయించుకొన్నాకా, మావిడి పళ్ళ గుజ్జుని తాటి చాపలమీద పరచి మంచెల మీద ఎండబెడతారు. ఒకరోజు పూర్తిగా ఎండలో ఉండేసరికి మావిడి గుజ్జు ఉల్లిపొర మందమైన పొరలా తయారవుతుంది. వరుసగా నెలరోజులపాటు పొరమీద పొర వేసుకొంటూ వెళతారు. 

తాండ్ర తయారీకి కణకణ మండే ఎండల కాలమే అనుకూలమైనది. నెలరోజులపాటు తాండ్రని పొరలు పొరలుగా పోసి ఎండబెట్టిన తరువాత, చాపల మీదనుంచి వేరుచేసి కేజీ, అరకేజీ ముక్కలుగా కోసి, ప్యాక్ ఛేసి సుమారు కేజీ తొంభై రూపాయల రిటెయిల్ ధర(హోల్‌సేల్‌గా అయితే ఇంకా తక్కువ ఉంటుంది) చొప్పున వర్తకులకి అమ్మేస్తారు. కొంత తాండ్ర వేరే దూర ప్రాంతాలకి ఎగుమతి ఐతే, మరికొంత లోకల్ మార్కెట్‌లో అమ్ముడుపోతుంది.  

మావిడి తాండ్ర గురించి చిన్న మాటా, మంతీ ఇక్కడ చూడండి.
మూడు నెలల విరామం తరువాత మళ్ళీ ఈ రోజే బ్లాగ్ ముఖం చూస్తున్నాను. ఇలా మావిడి రసాల తీపి కబుర్లు మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. 

© Dantuluri Kishore Varma

Sunday, 4 October 2015

చెక్కల వంతెన

కాకినాడకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరింగ అభయారణ్యంలో చెక్కల వంతెన ఫోటోలు. ఈ మడ అడవుల గురించి మరిన్ని వివరాలు కావాలంటే ఈ క్రింది పోస్టులు చదవండి. 


బై ద వే! వంతెనల గురించి మంచి కొటేషన్లు ఉన్నాయి, మీకు తెలుసా?
The darkest night is often the bridge to the brightest tomorrow.
గాడాందకారపు రాత్రి వెలుగులు చిమ్మే ఉదయానికి వంతెన లాంటిది
Love is the bridge between you and everything.
ప్రేమ అంటే నీకు మిగతా ప్రపంచానికీ మధ్య ఉన్న వంతెన.
We build too many walls and not enough bridges.
 అవసరానికి మించి అడ్డుగోడలు పెట్టుకొంటున్నాం, దూరాన్ని తగ్గించే వారథులు నిర్మించుకోవడం లేదు. 
Discipline is the bridge between goals and accomplishments.
క్రమశిక్షణ అంటే ఏర్పరచుకొన్న లక్ష్యాలకి, వాటిని నెరవేర్చుకోవడానికి మధ్య వంతెన. 
The wisdom of bridges comes from the fact that they know the both sides.
 ఇరువైపులా ఆలోచించి నిజానిజాలు గ్రహించడం విజ్ఞత. 
Our minds have become impenetrable jungle of thoughts and 
sometimes we need to clear a path in order to see.
ఆలోచనలతో అడవిలా చిక్కబడిపోయిన మెదడులో కొంచెం దారి ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉంది. 
అప్పుడే సరిగా చూడగలం. 
 Don`t fall in love. Fall off the bridge. It hurts less.
కావాలంటే వంతెన పైనుంచి క్రిందపడు అంతే కానీ ప్రేమలో మాత్రం పడకు. ఎందుకంటే, మొదటిదే తక్కువ బాధపెడుతుంది. 
Until you cross the bridge of insecurities you can`t begin to explore your possibilities 
భయాల వంతెనలు దాటక పోతే అవకాశాలు అందిపుచ్చుకోలేవు. 
Life is a bridge.Cross over it, but, build no house on it.
జీవితం ఒక వంతెన దానిని దాటాలి కానీ దానిమీదే ఇల్లుకట్టుకొని ఉండిపోవాలని ఆశపడకూడదు. 
ఈ బ్లాగ్ పోస్ట్ కూడా ఒక వంతెనే!
© Dantuluri Kishore Varma

Saturday, 3 October 2015

కోరింగ అడవి అందాలు

దేశంలో ఉన్న మూడవ అతిపెద్ద మడ అడవి మనకాకినాడకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్రతీరపు చిత్తడి నేలల్లో పెరిగే మడ అడవుల లోనికి వెళ్ళి చూడడం చాలా కష్టం. కానీ కోరింగలో ముఖద్వారాన్ని ఏర్పాటు చేసి, అప్రోచ్ రోడ్డు వేసి, అడవి మధ్యనుంచి ఒక కిలోమీటరు దూరం చెక్కలవంతెన నిర్మించి కష్టాన్ని ఇష్టంగా మార్చారు. వాచ్‌టవర్ పైనుంచి అడవి అందాలు వీక్షించవచ్చు. బ్యాక్ వాటర్స్‌లో సముద్రం కలిసే చోటువరకూ బోటు షికార్ చెయ్యవచ్చు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిర్మించిన పురాతన లైట్‌హౌస్ చూసి రావడానికి ప్యాకేజ్ టూర్   ఉంది. 

నల్లమడ, తెల్లమడ, విల్వమడ, ఉప్పుపొన్న, ఊరుడు, కళింగ, గుగ్గిలం, గంగరావి లాంటి ఎన్నో రకాల చెట్లు మడ అడవుల్లో పెరుగుతాయి. కానీ విచిత్రం ఏమిటంటే ఉప్పునీటిలో పెరిగే వీటికి నిజానికి ఉప్పు అవసరం ఏమాత్రం లేదు. మంచినీటిలో ఈ రకాల చెట్లు నిక్షేపంగా పెరుగుతాయట. సముద్రానికి, తీరానికి మధ్యలో ఉండే చిత్తడిలో పెరుగుతూ లవణ జలాల్లో తక్కువగా లభ్యమయ్యే ఆక్సిజన్‌ని పొందడానికి మడ వృక్షాలు రకరకాల విధానాలు అవలంభిస్తాయి. ఈ చెట్లవేళ్ళు భూమిలోనుంచి బయటకి పొడుచుకొని వస్తాయి. వాటిద్వారా గాలిలో ఉండే ప్రాణవాయువుని తీసుకొంటాయి. సముద్రపునీటిలో ఉండే ఉప్పుని శోషించకుండా ఉండడానికి ఈ చెట్లవేళ్ళల్లో చిక్కాల వంటి అమరిక ఉంటుందట. ప్రకృతిసిద్దంగా ఎన్నీ జాగ్రత్తలు తీసుకొన్నా కొంత ఉప్పు లోపలికి పోతుంది. దానిని బయటకు పంపించే ఏర్పాట్లు ఆకులు చేస్తాయి. కొన్ని చెట్ల ఆకులమీద పేరుకొన్న ఉప్పురాళ్ళను కూడా చూడవచ్చు. 


మడ వృక్షాల వేళ్ళ జిగిబిగి అల్లికల మధ్యలో చిన్న చిన్న చేపలు, సముద్ర ప్రాణులూ నిశ్చింతగా ఉంటాయి. వేటాడి తినే పెద్ద ప్రాణుల బెడద వాటికి ఉండదు. రాలే ఆకులు, బెరడు వాటికి సరిపడినంత ఆహారాన్ని సమకూర్చి పెడతాయి.  


సముద్రతీర ప్రాంతాలకి మడ అడవుల ఉపయోగం చాలా ఉంది. తీవ్రమైన తుఫాను గాలుల నుంచి ఇవి రక్షణ కల్పిస్తాయి. సునామీలు వచ్చినప్పుడు బఫర్ జోన్‌గా ఉపయోగ పడతాయి. ఇసుక కొట్టుకొని పోకుండా కాపాడతాయి. పక్షులకి, సముద్ర జంతువులకి ఉత్పత్తి కేంద్రాలుగా ఉంటాయి. పడవలు తయారు చేసుకోవడానికి మడ వృక్షాల కలప బాగా పనికి వస్తుంది. 
సందర్శించిన వాళ్ళ అదృష్టం బాగుంటే వలస పక్షుల్ని, రకరకాల జంతువుల్నీ చూడవచ్చు. బాగుండకపోతే కోతులూ, కొంగలు లాంటి సాధారణమైన ప్రాణుల్నే చూసి ఆనందించాలి. జీవవైవిధ్యం మాట అటుంచితే సమీపంలో ఉండే కాలేజీలనుంచి వలస వచ్చే ప్రేమ పక్షుల బెడద మాత్రం ఈ చెక్కల వంతెనకి చాలా ఉంది.  వద్దనుకొన్నా మీరు వాటిని చూడవచ్చు!
చెక్కల వంతెన అందమైన ఫోటోలు ఇంకొన్ని ఉన్నాయి. చూడాలనుకొంటే మళ్ళీ రేపు  ఇటు ఒక లుక్కెయ్యండి.
*     *     *
మూడు సంవత్సరాలక్రితం మడ అడవుల గురించి ఒక టపా రాస్తే ఓ ఆసామి నాకు చెప్పా పెట్టకుండా ఎత్తుకెళ్ళిపోయి చక్కగా పేపర్లో వేసేసుకొన్నాడు. `ఇదెక్కడి గొడవయ్యా మహానుభావా?` అంటే - `ఆన్లైన్ ఎడిషన్లో మీదేనని వేస్తాంలెండి` అని కంటితుడుపు కబుర్లు చెప్పాడు. బ్లాగ్ టపాలు రాసుకోవడం ఒక ఎత్తయితే - వాటిని ఎవరు లేపేసి సొంతపేరుతో ప్రచురించేసుకొంటున్నారో చూసుకోవడం ఇంకొక ఎత్తై పోయింది! 

© Dantuluri Kishore Varma

Thursday, 6 November 2014

రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం - రాజమండ్రీ

శ్రీ రాళ్ళబండి సుబ్బారావుగారు ఎక్కడెక్కడినుంచో సేకరించిన పురాతన శిల్పాలు, నాణాలు, శాసనాలు, మధ్యయుగంలో ప్రజలు వాడిన పనిముట్లు మొదలైన వాటితో 1967వ సంవత్సరంలో ఆయనపేరు మీదే రాజమండ్రీలో మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంను సందర్శించే ఉద్దేశ్యంతో రాజమండ్రీలో ఉన్న కొంతమంది స్నేహితులని వివరాలకోసం అడిగాను. ఆశ్చర్యకరంగా అది ఎక్కడ ఉందో చెప్పగలిగారు తప్పించి ఎవ్వరూ అంతకుమించి సరైన సమాచారాన్ని ఇవ్వలేకపోయారు. ఇంటర్‌నెట్‌లో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వీకీపీడియాలో రాళ్ళబండి సుబ్బారావుగారి పేరుమీది పేజీయే లేదు!   

ప్రతీ శుక్రవారం మ్యూజియంకి శెలవు అనే సంగతి తెలియదు. దురదృష్టవశాత్తు మేము(నేనూ, నా భార్య శుభా, పిల్లలు శ్రావ్యా, వర్షిత)  రాజమండ్రీ వెళ్ళిన రోజు శుక్రవారం అయ్యింది. అయినాసరే కనీసం బయటినుంచయినా చూద్దామని వెళ్ళాము. రాజమండ్రీ గోదావరి వొడ్డున రాళ్ళబండి సుబ్బారావు గవర్నమెంట్ మ్యూజియం ఉంది. గేటు తెరిచే ఉంది. వాచ్‌మేనో, పనివాడో సరిగా తెలియదుకానీ ఒకవ్యక్తి మాత్రం లోపల ఉన్నాడు. `ఈ రోజు శెలవు బాబూ, రేపురండి,` అన్నాడు. దూరంనుంచి వచ్చామని, బయటినుంచి చూసి వెళ్ళిపోతాం అనీ అన్నాం. కొంచెం తటపటాయించి, `సరే!` అన్నాడు. గేటుమూసేయ్యాలని, తొందరగా చూసి వచ్చేయ్యమని కూడా చెప్పాడు.    

క్రీస్తుశకం పదవ శతాబ్ధం నుంచి పంతొమ్మిదో శతాబ్ధం వరకూ వివిధకాలాకు చెందిన కుమారస్వామి, వినాయకుడు, ఆంజనేయుడు, శ్రీరామపట్టాభిషేకం, భద్రకాళి, పార్వతి, జైన మహావీరుడు, నందులు మొదలైన శిల్పాలు వరండాలో, ఆరుబయటా ఉన్నాయి. పన్నెండవ శతాబ్ధానికి చెందిన నాజూకుగా చెక్కబడిన వేణుగోపాల స్వామి విగ్రహం చాలా బాగుంది. క్యూరేటర్‌కానీ, గైడ్‌కానీ అందుబాటులో ఉంటే సమాచారం వివరంగా తెలుసుకోవడానికి బాగుండుననిపించింది.  
క్రీ.శ. 3వ శతాబ్ధం నాటి బుద్దుడి విగ్రహం ఉంది. బయట ఉంచిన వాటిలో ఇదే అత్యంత పురాతనకాలం నాటిది. లోపల ఇంకా ప్రాచీనమైనవి ఉన్నాయేమో తెలియదు.


మ్యూజియం లోపల పురాతనమైన తాళపత్ర గ్రంధాలు; శాతవాహనులు, కుషాణులు, విజయనగర రాజులు, మొఘలాయిల కాలాల్లో చలామణీలో ఉన్న నాణాలు; ముఖ్యంగా తెలుగు లిపిలో క్రమాణుగతంగా వచ్చిన మార్పులు తెలియజేసే డిస్‌ప్లేబోర్డ్ ఉందట. వాటిని ప్రస్తుతానికి చూడలేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది.   

ఈ మ్యూజియంను కొంచెం అభివృద్ది చేసి, ప్రచారం కల్పిస్తే మన సంస్కృతి, చరిత్ర గురించి తెలుసుకోవాలనుకొనే వాళ్ళకి బాగుంటుంది.  చక్కని టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుంది.   

ఎప్పుడైనా రాజమండ్రీ వెళ్ళినప్పుడు రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం సందర్శించండి. శుక్రవారం, పబ్లిక్ హాలిడెస్ తప్పించి మిగిలిన రోజుల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలవరకూ మ్యూజియం తెరిచి ఉంటుంది.
© Dantuluri Kishore Varma

Tuesday, 12 August 2014

కేప్ కోరి గురించి మీకు తెలుసా?

పద్దెనిమిదవ శతాబ్దంలో దేశంలో ప్రధానమైన రేవు పట్టణాలలో కేప్‌కోరి ఒకటి. 1759లో బ్రిటిష్‌వాళ్ళు దీనిని నిర్మించారట. ఒక లైట్ హౌస్ కూడా కట్టారు. గత కాలపు వైభవానికి శిధిలావస్థలో ఉన్న అప్పటి లైట్‌హౌస్ ఒక గుర్తు. ప్రస్తుతం దేశంలో ఉన్న అతి పురాతనమైన లైట్‌హౌసుల్లో ఇది ఒకటి. అసలు కేప్‌కోరీ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారా? కాకినాడకి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరంగే అప్పటి కేప్‌కోరీ. ఇక్కడి నౌకా నిర్మాణ పరిశ్రమ ప్రపంచ ప్రఖ్యాతి చెందిందట. 1500 టన్నుల సామర్ధ్యం గల నౌకలను కూడా ఇక్కడ తయారు చేసేవారు. విదేశాలనుంచి వచ్చిన నౌకలను ఎంతో నైపుణ్యంతో బాగుచేసేవారు. అప్పట్లో కలకత్తాకి, మద్రాసుకీ మధ్య ఉన్న ప్రధానమైన రేవుపట్టణం కనుక నిరంతరం ఎగుమతి దిగుమతులు జరుగుతూ ఉండేవి. ధాన్యం, పప్పులు, హోమియోపతీ మందులు, కాటన్ వస్త్రాలు, పీచు మొదలైనవి కేప్‌కోరీ నుంచి ఎగుమతి అవుతుంటే - సైకిళ్ళూ, మోటారు సైకిళ్ళూ, యంత్రసామాగ్రి, ఇనుము, పంచదార, కిరోసిను మొదలైనవి దిగుమతి అయ్యేవి. 1870-80ల్లో ఆ తరువాత కొంతకాలం వరకూ కూడా ఒక వెలుగు వెలిగిన ఈ పోర్టు 1905 నాటికి పూర్తిగా మూతపడిందట. దానికి కారణం ఇసుకమేటలు వెయ్యడం అంటారు. నౌకా నిర్మాణం కూడా నిలచిపోయింది. హిందూ న్యూస్ పేపర్లో చాలా కాలం క్రిందట ఈ విశేషాలని అందించారు.  
The Hindu Photo
© Dantuluri Kishore Varma

Thursday, 17 April 2014

ఉప్పాడ జందాని చీరలు

కాకినాడ నుంచి ఉప్పాడకి బీచ్‌రోడ్ ద్వారా వెళితే వాకలపూడి లైట్ హౌస్‌కి పది కిలోమీటర్లదూరంలో ఉంటుంది. పిఠాపురం మీదుగా కూడా వెళ్ళవచ్చు. పిఠాపురం నుంచి  పది కిలోమీటర్లే ఉంటుంది.  జందానీ చీరలకి ఈ ఊరు ప్రశిద్ది చెందింది. వీటికి భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్ -  జి.ఐ)  కూడా ఉంది. ఒక ప్రాంతం పేరుతో ప్రఖ్యాతి పొందిన ఉత్పత్తులకి జి.ఐ ఇస్తారు. అప్పుడు వాటిని మరొక ప్రాంతంలో ఉత్పత్తి చెయ్యకూడదు.

జందానీ అనే మాట పారశీక భాషనుంచి వచ్చిందట. జాం అంటే పువ్వులనీ, దానీ అంటే వాటిని ఉంచే గుత్తి అని అర్థం. పువ్వులు, లతలతో కంటికి ఇంపుగా, మనసుకి హాయి కలిగించేలాఉండే నేతపనికి ఈ పేరు పెట్టారు. బెంగాల్‌లో ఈ నేత ఒక వెలుగు వెలిగిందట. తరువాత బ్రిటీష్ పాలనలో, విదేశీ బట్టల వెల్లువలో కొట్టుకు పోయింది. ఇప్పుడు అది ఉప్పాడ పేరుమీదుగా దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది.   

చీరలో పట్టునేతతో పాటూ కూర్చే బుటా - పైన ఎలా ఉంటుందో, వెనుకకు తిప్పినా అలానే ఉంటుంది. జందానీ నేత ప్రత్యేకత అదే.  ఇతర పట్టుచీరల నేతలో ఈ నైపుణ్యం కనిపించదు కనుకే ఈ చీరలకి అంత డిమాండ్ ఉంటుందని నేతకార్మికులు వివరించి చెప్పారు. ఒక్కొక్క మగ్గం దగ్గర ఇద్దరు చొప్పున పనిచేస్తూ ఎంతో సహనంతో, నేర్పుతో ఒక్కో దారపు పోగునూ కూర్చుతున్నారు. వాళ్ళకి అభిముఖంగా గోడమీద తగిలించుకొన్న నమూనా డిజైన్‌ను చూస్తూ మగ్గం మీద చీరను నేస్తున్నారు. ఓ పోగు తప్పుగా వెళ్ళినా చీర మొత్తం నాశనం అయినట్టే. ఒక్కచీర తయారు చెయ్యడానికి ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేస్తే నెలరోజులు పడుతుందట.


మరి అంత కష్టపడితే వాళ్ళకి వచ్చే ప్రతిఫలం? తక్కువలో తక్కువ ఆరు వేల నుంచి, యాభై వేల వరకూ ఒక్కో చీరకూ లభిస్తుంది. ప్రత్యేక ఆర్డర్లు ఉంటే లక్షా యాభైవేల చీరవరకూ కూడా తయారు చేస్తారట. రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు, సినిమా ప్రరిశ్రమలో ప్రముఖులు.. ఇంకా బాగా డబ్బున్నవాళ్ళు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి జందానీ చీరలు ధరించడం స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. అందుకే వీటికి ఈ మధ్యకాలలో మరింత గిరాకీ పెరిగింది.  
నేతపని వాళ్ళకి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడిందని ఒకాయన చెప్పాడు. పిల్లలకి కూడా ఈ నైపుణ్యాన్ని నేర్పి, కొంతమంది పనివాళ్ళను పెట్టుకొని ఒక మగ్గం ఉండే వాళ్ళు క్రమంగా రెండు, మూడు మగ్గాలను ఏర్పాటు చేసుకొంటున్నారు. మార్కెటింగ్ చెయ్యగలిగిన వాళ్ళు సొంత షాపులు పెట్టుకోవడం, లేదంటే నేసిన చీరలని షాపులకి వెయ్యడం జరుగుతుంది. ఉప్పాడకు ప్రక్కన ఉన్న యు.కొత్తపల్లిలో రెండు చిన్న వీధుల్లో కనీసం ముప్పై షాపులు ఉన్నాయి.  
పట్టుని కర్ణాటక నుంచి తెచ్చుకొంటారట. ఇది ముడి పట్టు. ఒక్కో పట్టుపోగూ గుర్రపు వెంట్రుక మందంలో ఉంటుందట. దానిని ప్రోసెసింగ్‌కి గొల్లప్రోలో, పిఠాపురమో పంపిస్తారు. అక్కడే పట్టుకి కావలసిన రంగులు వేయిస్తారు. రంగు దారాలని తిరిగి తెచ్చుకొని మగ్గంపైకి ఎక్కిస్తారు. ఒక్కో డిజైన్‌కి ఒకటి రెండు చీరల కంటే ఎక్కువ తయారు కావు. తయారయిన చీర వెంటనే షాపుకి వెళ్ళిపోతుంది. తొందరగానే అమ్ముడు పోతుంది.  


© Dantuluri Kishore Varma 

Thursday, 20 February 2014

బాల్‌పెన్నులతో ఏ దేవుడికి పూజ చేస్తారో తెలుసా?

కోనసీమలోని అయినవిల్లి వరసిద్ది వినాయకుడి గుడిలో నిన్న స్వామికి లక్ష కలాల అభిషేకం జరిగింది. ప్రతీ సంవత్సరం మాఘబహుళచవితి నాడు బాల్‌పాయింట్ పెన్నులతో పూజచెయ్యడం ఆనవాయితీ అట. తరువాత వాటిని భక్తులకి పంచిపెడతారు. చుట్టుప్రక్కల అన్నిగ్రామాలనుంచీ విద్యార్థులు వచ్చి వాటిని అపురూపంగా తీసుకొని వెళతారు. దూరప్రాంతాలనుంచి కూడా ప్రయివేట్ స్కూళ్ళు బస్సుల్లో విద్యార్థులని అయినవిల్లికి పంపడం జరుగుతుంది. పరీక్షల సమయమేమో విఘ్ననాయకుడికి పూజచేసిన కలాలు అందుకొంటే పరీక్షలు చకచకా రాసేసి ర్యాంకులు కొట్టేయవచ్చు అని జనాల ప్రగాఢ నమ్మకం.
© Dantuluri Kishore Varma

Saturday, 4 January 2014

మధురమీ పానకం

అప్పుడైనా రొట్టెని పానకంలో ముంచుకొని తిన్నారా? తినిఉంటే ఆ రుచిని మీరు తప్పనిసరిగా `అమోఘం!` అని అనాల్సిందే. `ఇంతకీ, ఏ రొట్టి?` అని అడిగితే, `ఏ రొట్టయినా..` అని సమాధానం చెప్తాను. `ఏ పానకం?` అని అడిగితే మాత్రం `చెరుకుపానకం,` అనే చెప్తాను. చెరుకు పండే ప్రాంతాల్లో బెల్లం తయారీ కోసం క్రషర్స్‌ని ఏర్పాటు చేస్తారు. పల్లెప్రజల నోళ్ళల్లోనాని రూపుమారిపోయిన మాటల్లో క్రషర్ ఒకటి. వాళ్ళు దానిని కస్సర్ అని పలుకుతారు. మనం రోడ్డువార, జ్యూస్ సెంటర్లలో చెరుకురసం తీసే మెషీన్లని చూస్తాం కదా? అటువంటివే క్రషర్లంటే. ఈ క్రషర్స్ దగ్గర బెల్లంతో పాటూ, రొట్టెల్లో నంజుకోవడానికి ఉపయోగపడే పానకం కూడా లభ్యమౌతుంది.  ఓ పదిరోజుల క్రితం కాకినాడకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి వెళ్ళాను. సామర్లకోటకి నేషనల్ హైవే ఐదు మీద ఉన్న ప్రత్తిపాడుకి మధ్యలోచెరుకు విస్తారంగా పండే భూములు, వాటిని చేర్చి  బెల్లం తయారీ కేంద్రాలు ఉన్నాయి.
చెరుకు తోటల్లోనుంచి చెరుకుని కోసుకొని వచ్చిన తరువాత, క్రషర్ ద్వారా రసం తీస్తారు. దానిని బెల్లం వండడానికి ఉపయోగించే ఇనుప పెనంలోకి పంపి, క్రింద మంట పెడుతూ, పెద్ద చట్రం గరిటతో కోవా కలిపినట్టు కలుపుతారు. ఇక్కడ పొయ్యిలో మంటపెట్టడానికి ఉపయోగించే వంటచెరుకు రసం తీసేసిన చెరుకుపిప్పే! బాగా ఎండబెట్టి వంటచెరకుగా వాడతారు. రసం మరుగుతూ, చిక్కబడుతున్నప్పుడు తియ్యటి వాసన భలేగా ఉంటుంది. నోరూరిపోతుంది. రసంలోని వ్యర్థపదార్థాలు, పిప్పి మొదలైనవి తెట్టిలా తేలిపోతాయి. (అలా వ్యర్థాలు వేరుచేయడానికి కొన్ని రసాయనాలని కలుపుతారు). వాటిని గరిటతోతీసి వేరుచేసేస్తారు. క్రమంగా పానకం బంగారు రంగులోనికి మారుతుంది. పాకం తీగలుగా సాగుతుందనిపించే సమయానికి మౌల్డ్‌లోకి వొంపి, ఆరబెడతారు. బెల్లం ఆరి, గట్టి బడుతుంది. అప్పుడు మౌల్డ్‌లలోనుంచి బయటకు తీసి ప్యాక్‌చేసి, అట్టపెట్టెల్లో సర్ధి, మార్కెట్‌కి పంపుతారు.






మనం చెరుకు పానకం గురించి మొదలుపెట్టి బెల్లం తయారీ దాకా వచ్చేశాం. కొంచెం వెనక్కు వెళ్ళి పానకం తెచ్చుకొందాం! తెట్టు తీసేసిన తరువాత, తీగపాకం రావడానికి ముందు పాకాన్ని డబ్బాల్లోకి తీసి చల్లారనిస్తారు. తరువాత సీసాల్లో నింపి అమ్ముతారు. ఇలా తయారుచేసిన బెల్లం పాకానికి ఇంచుమించు తేనెకు ఉన్నన్ని పోషక విలువలు ఉంటాయని చెపుతారు.

హైవేల్లో ప్రయాణిస్తున్నప్పుడు, చెరుకుతోటలు కనిపించిన ప్రదేశాల్లో  కొంచెం జాగ్రత్తగా గమనిస్తే బెల్లం తయారీ కేంద్రాలు కనిపిస్తాయి. అటువంటప్పుడు తప్పనిసరిగా వెళ్ళిచూడండి. తయారుచేసే విధానం బాగుంటుంది. ముఖ్యంగా తీపి వాసన!
© Dantuluri Kishore Varma 

Saturday, 26 October 2013

ఒకేఒక్క డ్రింక్!

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అన్ని కూల్‌డ్రింకుల కంటే ముందే  తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో తయారీ మొదలైన ఆర్టోస్ ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి కూల్‌డ్రింక్. తొంభై సంవత్సరాలకి పూర్వం భారతదేశంలో ఏడు సంస్థలు మాత్రమే సాఫ్ట్‌డ్రింకులని ఉత్పత్తి చేసేవట. వాటిలో ఆర్టోస్ ఒకటి. ప్రస్తుతం మిగిలినవన్నీ ఉత్పత్తి ఆపేసినా, నిరంతరాయంగా జనాదరణతో కొనసాగుతున్న ఒకేఒక్క డ్రింకు ఆర్టోస్. మార్కెట్‌లో ఉన్నవాటిల్లో భారతదేశం మొత్తంమీద అత్యంత ప్రాచీనమైనది కూడా ఇదే. సరిగ్గా గుర్తింపు రాలేదుకాని చారిత్రకంగా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది.
1912లో అడ్డూరి రామచంద్రరాజు అనే ఆయన కార్బొనేటేడ్ వాటర్ని సరఫరా చేస్తూ ఉండేవారట. అప్పట్లో సోడాలు త్రాగడానికి జనాలు చాలా భయపడే వారు. ఒక్కసారి రుచిచూడండి అని అడిగినా ఆరోగ్యానికి ఎక్కడ హానిచేస్తుందో అని సందేహించేవారు. సరిగ్గా అప్పుడే 1914లో మొదటిప్రపంచ యుద్దం రామచంద్రపురం సోడాలకి బాగా కలసి వచ్చింది. కొంతమంది సైనికులు ఈ ఊరికి వచ్చి ఉండడం జరిగింది. వాళ్ళు సోడాలు త్రాగడం గమనించిన ప్రజలు కూడా మెల్ల మెల్లగా వాటికి అలవాటు పడ్డారట. 1919  వచ్చేసరకి రామచంద్రరాజుగారు తమ్ముడు జగన్నాథరాజుని కూడా చేర్చుకొని లండన్ నుంచి సాఫ్ట్‌డ్రింకుల ఉత్పత్తి, సరఫరాకి కావలసిన సరంజామా దిగుమతి చేసుకొని ఆర్టోస్‌ని ప్రారంభించారు. ఆర్టోస్ గురించి ఇంకొక విషయం చెపుతారు. ఉభయగోదావరి జిల్లాలని రైస్‌బౌల్‌గా మార్చిన సర్ఆర్థర్ కాటన్ దవళేశ్వరం నుంచి లండన్‌కు వెళ్ళిపోతూ తనదగ్గర ఉన్న సోడా మెషీన్‌ని వదిలేసి వెళ్ళాడట. దానితోనే ప్రాధమికంగా ఆర్టోస్ ప్రస్థానం మొదలయ్యిందని అంటారు.
ఈ సాఫ్ట్‌డ్రింక్ రుచి చాలా బాగుంటుంది. బహుశా అందుకే ఇప్పటికీ భహుళజాతి కంపెనీల పోటీని తట్టుకొని నిలబడి ఉంది. మీరు ఆర్టోస్‌ని తాగాలంటే అన్నిచోట్లా దొరకక పోవచ్చు. ఎందుకంటే, దీని డిస్ట్రిబ్యూషన్ ఉభయగోదావరిజిల్లాల్లోనీ, విశాఖపట్నంలోనీ మాత్రమే ఉంది. 
© Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!