Pages

Friday 27 October 2023

ఇంకా బ్లాగ్స్ చదువుతున్న వారు ఎవరైనా ఉన్నారా?

నిన్న ఒకాయన, 'మీ బ్లాగ్ చూశానండి. ఒక్కొక్క పోస్టూ చదువుతూ వెళుతున్నాను. రాయడం మనేయకుండా కొనసాగిస్తుంటే బాగుండేది,' అని చెప్పారు. 

నా దృష్టి బ్లాగ్ వైపు తిరిగింది. ఎందుకు రాయడంలేదో అని ఆలోచిస్తే కొన్ని కారణాలు కనిపించాయి. 

1. ఒక బ్లాగ్ పోస్ట్ రాసిన తరువాత సంవత్సరానికి కూడా వెయ్యి వ్యూస్ రావు. అదే యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాముల్లో ఏ వీడియోకైనా లక్షల వ్యూస్ ఉంటాయి. జనాల్లో చదవడం అలవాటు పోయి, చూడడం అలవాటు ఎక్కువయ్యింది.

2. పెర్సనల్ బ్లాగ్  మనం రాసుకొన్న నోట్‌బుక్ లాంటిదయితే, ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు జనసమ్మర్ధం ఉన్న రోడ్డులో స్వీట్ షాపుల్లాంటివి. అందుకే కొంతమంది బ్లాగ్‌లు మానేసి నేరుగా వాళ్ళ ఫేస్‌బుక్ వాల్ మీద రాసుకొంటున్నారు. స్పందన బాగుంటుంది. నిజమైన రచ్చబండలోలాగ వాదప్రతివాదాలు, చమత్కారాలు, రుసరుసలూ, మెచ్చుకోళ్ళూ జోరుగా జరుగుతున్నాయి. 

3. ఎందుకో బ్లాగ్‌లోకి వస్తే లోన్లీగా అనిపిస్తుంది. అంతరించిపోతున్న తెగలో  చివరకు మిగిలిన వాళ్ళకు ఇలాంటి ఫీలింగే ఉంటుందేమో! జనాలకి చేరువచేసే బ్లాగర్ ఆగ్రిగేటర్‌లు కనుమరుగైపోయాయి. ప్రత్యేకంగా బ్లాగ్‌లోకి వచ్చి చూస్తేనే గానీ మనం రాసింది ఎవరికీ కనపడదు. అందుకే ఇప్పటికీ బ్లాగ్‌లో రాసే వాళ్ళు పాఠకుల కోసం కాదు, తమకోసమే రాసుకొంటున్నారేమో అనుకొంటున్నాను. ఈ పరిస్థితి మారి బ్లాగింగ్‌కి పూర్వ వైభవం రావాలటే బ్లాగర్ ఇంటర్‌ఫేస్ మారాలి. మన బ్లాగ్ ఎకౌంట్ నుంచి నచ్చిన బ్లాగ్స్‌ని లైక్ చేసుకొంటే మన టైంలైన్‌లోకి వాళ్ళు రాసింది వచ్చేసేలా ఉండాలి. మనం రాస్తూ పోవడమే కాదు, మన బ్లాగర్ ఫ్రెండ్స్ రాసింది చదవగలిగి కూడా ఉండాలి. అప్పుడు ఇది కూడా ఫేస్‌బుక్కే ఐపోతుంది కదా అని మీరు అనవచ్చు. కానీ యూట్యూబ్‌ని చూసి ఫేస్‌బుక్ వాడు షార్ట్ వీడియో అప్లోడ్ చెయ్యడానికి ఏనేబుల్‌చేస్తే - ఇప్పుడది యూట్యూబ్‌కి గట్టి పోటీ ఇస్తుంది.

4. బ్లాగ్ రాయకపోవడానికి పై మూడూ కాకుండా ఇంకొక కారణం ఉంది. అది.. అశ్రద్ధ!

ఈ టపాకి ట్యాగ్‌లైన్ ఏమిటంటే...

నేను రాయగలను అనే నమ్మకాన్ని ఇచ్చిన బ్లాగ్ అంటే ఇష్టం ఎక్కువ.  ఎప్పుడైనా  నా బ్లాగ్ చదివి ఎవరైనా ఒక మాట చెపితే, బ్లాగ్‌లు మంచిగా నడచిన బంగారు రోజులు గుర్తుకువచ్చి 'అయ్యో' అనిపిస్తుంది.

చూద్దాం ఇంకా బ్లాగ్స్ చదువుతున్న వారు ఎవరైనా ఉన్నారా? అని.

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!