Pages

Showing posts with label బయోగ్రఫీస్. Show all posts
Showing posts with label బయోగ్రఫీస్. Show all posts

Sunday, 24 January 2016

Abhay`s Story

"Srila Bhaktisiddhanta`s explanation of the independence movement as a temporary, incomplete cause had made a deep IMPACT on Abhay. "

On seeing the excerpt above many curious doubts such as who Srila Bhaktisiddhanta and Abhay are, why the former branded the independence movement as being temporary and incomplete cause pop up in the minds of inquisitive observers. If you are really one of such people, I don't mind telling the inspiring story of Abhay to subside your curiosity. 

When Abhay was born in Calcutta in 1896 the family astrologer predicted that he would start 108 temples across the countries. The father of the boy Gour Mohan De, who was a staunch Vaishnavite was very delighted on hearing the  prediction. 

Gour Mohan used to offer prayers to Radha - Govinda and would tell Abhay how Lord Chaitanya had sung and danced in the procession of Rath Yatra in Jagannath Puri some four hundred years before. In fact Gour Mohan wanted his son to become a preacher of Bhagavatam. He got playing of the mrudamgam drum taught to his son so that he could sing beautiful songs of Lord Sri Krishna and play the musical instrument along.  

Abhay was one year junior to Subhas Chandra Bose in college. As in the case of everyone else of his age he was also influenced both by Bose and Gandhi. He used to wear khadi. One day a friend of his took him to a sadhu by name Srila Bhaktisiddhanta who at once asked Abhay and his friend to preach Lord Chaitanya`s message to the whole world since they were educated and ware capable of doing it. He was delighted with the proposal but he had some doubts as to why that was so important when the country was struggling under the British Rule.  When he expressed his doubts the sadhu explained that the real self was the soul and the eternal reality was Krishna consciousness.    

Though he was very much influenced by the words of the spiritual man, he could not be fully devoted to spreading Krishna consciousness. He had family and  a business. For thirty years or more since then he encountered many hardships. Great famine hit Bengal. Thousands died. People starved. Children craved for food and fought with dogs near dust bins for a morsel. All these left a powerful impression on Abhay. He wanted people in India and the west to become god conscious. This was his goal in life. With little savings he had from his work, he started a magazine `Back to Godhead`. In a dramatic twist of fate he lost his business and forsook  his family. He literally became mendicant. He got through winters without a coat and got sunstroke during summers. However, he continued publishing his magazine with meagre donations he managed to get and sold the copies at railway stations and public places. At fifty five years of age it would be difficult for anyone to bear such troubles. 

He took sanyasa and became Bhaktivedanta Swamy. To fulfil his life`s goal he wanted to translate Srimad-Bhagavatam into English. Srimad-Bhagavatam had eighteen thousand verses in it. Bhaktivedanta calculated that he would have to write around sixty volumes to fully translate the Bhagavatam. At his age one would think of retiring from active work. But this man began his life`s mission. Isn`t it something wonderful? 

By sixty nine he managed to get three volumes of his work published and got favourable responses. But his main aim of going west and preaching Krishna Consciousness there remained unfulfilled. With great difficulty he could get a sponsor in the USA. He got all the mandatory sanctions from the government and set out for the west by a ship - the Jaladoota.  He finally reached America. He lived for 12 years after that. During this time he did very commendable work. He founded ISKCON - International Society for Krishna Consciousness in New York, authored eighty books, went round the globe for fourteen times to preach his message. As the astrologer predicted ISKCON grew into a confederation of 108 temples during his life time. 

Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare
Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare 

This is the inspiring story of Abhay who is popularly known as Prabhupada or Bhaktivedanta Swamy. A father`s wish and the impact of a  guru`s words made a man a mission. 

This blog post is inspired by the blogging marathon hosted on IndiBlogger for the launch of the #Fantastico Zica from Tata Motors. You can  apply for a test drive of the hatchback Zica today.

© Dantuluri Kishore Varma

Wednesday, 23 April 2014

హ్యాట్స్ ఆఫ్ టు ద బార్డ్!

ఇంగ్లీష్ భాషతో కొంత పరిచయం ఉన్నవాళ్ళు ఓ పదిమాటలు ఆ భాషలో మాట్లాడితే అందులో మూడో, నాలుగో జాతీయాలుగా స్థిరపడిపోయిన షేక్‌స్పియర్ మాటలే ఉంటాయి. చిత్రమేమిటంటే అవి మాట్లాడిన వాడికే ఆ విషయం తెలియదు. మాయాబజారు సినిమాలో ఎస్.వీ.రంగారావుతో `ఎవరూ పుట్టించకపోతే కొత్తమాటలు ఎలా పుడతాయి,` అని చెప్పించినట్టు; ఆగ్లంలో ఉన్న మాటల్ని అటుతిప్పి ఇటుతిప్పి మొత్తమ్మీద 1700 కొత్త పదాల్ని షేక్‌స్పియరే సృష్టించాడట. ఒక భాషకి అంత సేవ చేసిన మరొక వ్యక్తి ఆ మహారచయితకి ముందూ, ఆ తరువాత ఇప్పటివరకూ కూడా ఎవరూ లేరు! బార్డ్(షేక్‌స్పియర్ని అలా పిలుస్తారు) పుట్టి నాలుగువందల యాభై సంవత్సరాలు గడిచిపోయినా ఆశ్చర్యపోతూ, అబ్బురపడుతూ, పాత్రల్లో మమేకమైపోయి దుఖ:పడుతూ, నవ్వుకొంటూ, ఊహాలోకాల్లో విహరిస్తూ... ఇప్పటికీ ఆయన రాసిన నాటకాలని చదువుకొంటున్నామంటే - కాలం ఒక మనిషి ముందు చిన్నబోయినట్టే కదూ! బార్డ్ రాసిన 37 నాటకాల్లో రెండో, మూడో తప్పించి మిగిలినవన్నీ అంతకు ముందు జనాలకి తెలిసున్న కథలే - కానీ కథనం, పాత్రల నడత(క్యారెక్టరైజేషన్), భావ వ్యక్తీకరణ, శైలి చాలా గొప్పవి.  ప్రేమనో, విరహాన్నీ, కష్టాన్నో ఎంతబాగా వ్యక్తీకరిస్తాడో! ఆ వాఖ్యాలని నమిలి మింగేసి పూర్తిగా సొంతం చేసుకోవాలనిపిస్తుంది. కానీ, అది ఎరికైనా సాధ్యమా? చారిత్రక నవలలు, సుఖాంతాలు, దుఖాంతాలు, జానపదకథలు, ఫెయిరీటేల్స్... ఇన్ని రకాలుగా రచనా వైశిష్ఠ్యాన్ని ప్రదర్శించాడు కనుకే  ప్రపంచం మెచ్చిన మహాకవి అయ్యాడు. ఏప్రిల్ 23 ఆయన జయంతి అని అంటారు (ఖచ్చితంగా నిర్ధారింపబడలేదు). వర్దంతి కూడా ఏప్రిల్ ఇరవైమూడే.

© Dantuluri Kishore Varma

Friday, 15 November 2013

కామన్ మేన్

ఆర్.కే.లక్ష్మణ్ మరొక్కసారి వార్తల్లోకి వచ్చారు. 
*     *     *
ఒకవేళ ఎవరికైనా ఆయన ఎవరో తెలియకపోతే, కామన్ మేన్ పేరు చెపితే గుర్తు పట్టవచ్చు. టైంస్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్లో 1951 నుంచి లక్ష్మణ్ గీస్తున్న కార్టూన్ స్ట్రిప్‌లో కేరక్టర్ అది. బట్టతల, గుండ్రటి కళ్ళజోడు, పెద్దముక్కు, టూత్‌బ్రష్ కుచ్చులాంటి మీసం, గళ్ళకోటూ, పంచ, సాక్సులు లేని బూట్లు, నిశ్చేష్టుడైనట్టు ముఖకవళికలు ఉండే సాధారణమైన మనిషి. కామన్‌మేన్ నోరు తెరిచి ఎప్పుడూ మాట్లాడింది లేదు. ధరలు పెరిగినా, రాజకీయకుంభకోణం జరిగినా, కొత్తగా ప్రభుత్వవిధానాలు ఏమైనా ప్రకటించినా, ప్రజలు సివిక్‌సెన్స్ లేకుండా ప్రవర్తించినా.. ఆయా సంఘటనలలో ప్రత్యక్షసాక్షిగా ఉంటాడు. అర్ధశతాబ్ధం పైనుంచి `యూ సెడ్ ఇట్` పేరుమీద ఈ కార్టూన్ వస్తున్నా ఎప్పుడూ జనాలకి విసుగు పుట్టలేదు. పూనాలో, ముంబాయ్‌లో  కామన్ మేన్‌కి విగ్రహాలు కట్టారు. ఇది ఒక అరుదైన విషయం.

ఆర్.కే.లక్ష్మణ్ నిజజీవితంలో చాలా సీరియస్‌గా ఉంటాడట. ఆయనని నవ్వించడం చాలా కష్టం అని చెపుతుంటారు. కానీ చాలా సున్నితమైన స్వభావం ఉన్నవాడట. ఒకసారి ముంబాయ్ యూనివర్సిటీలో గౌరవడాక్టరేట్ ప్రధానం జరుగుతున్నప్పుడు, అప్పటి రాష్ట్రపతి అబ్ధుల్ కలాం గారు లక్ష్మణ్‌ని హృదయానికి హత్తుకొన్నారట. వెంటనే, లక్ష్మణ్ కళ్ళవెంట బొటబొటా నీళ్ళు కారాయి. `మీ కార్టూన్లతో మమ్మల్ని అందరినీ నవ్విస్తారు, మీరు కన్నీళ్ళు పెట్టుకొంటున్నారే,` అని కలాం చమత్కారమాడారట.

చిన్నప్పుడు పుస్తకాలమీద, చిత్తుకాగితాలమీద, గోడలమీద ఎక్కడపడితే అక్కడ బొమ్మలు వేసేవాడట. గది కిటికీలోనుంచి బయటకి చూస్తు, కనిపించే కాకులని గియ్యడం అలవాటయ్యింది. లక్ష్మణ్ కాకుల్ని చాలా అందంగా గీస్తాడు. ఒక ఇంటర్వ్యూలో లక్ష్మన్ భార్య కమల వాళ్ళదగ్గర ఒక మర్డర్ ఆఫ్ క్రోస్ వున్నాయని చెప్పారు. ఇంగ్లీష్‌లో కాకుల సమూహాన్ని తెలిపే కలెక్టివ్ నౌన్ ని మర్డర్ అంటారని అప్పుడే తెలిసింది.

ముంబాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో జేరడానికి లక్ష్మణ్ చిన్నప్పుడు ధరకాస్తు చేసుకొంటే, `నువ్వు పనికిరావు పో!` అన్నారట. ఏం చేస్తాడు? తనంతట తనే నేర్చుకొన్నాడు. అన్నగారు ఆర్.కే.నారాయణ్ గొప్ప కథా, నవలా రచయిత. లక్ష్మణ్‌కి 12సంవత్సరాలు ఉన్నప్పుడు హిందూ న్యూస్‌పేపర్లో నారాయణ్ రాసే కథలు అప్పుడప్పుడే అచ్చవుతూ ఉండేవి. వాటికి లక్ష్మణ్ బొమ్మలు గీస్తే ఒక్కోదానికి రెండురూపాయల ఎనిమిది అణాలు పారితోషికం ఇచ్చేవారట.

ఎక్కువకాలం ఒకే న్యూస్‌పేపర్లో పనిచెయ్యడం చాలా అరుదు. ఆవిషయం గురించి ద హిందూ పేపర్‌వాళ్ళు ఒక చక్కనిమాట అన్నారు. `Rasipuram Krishnaswamy Laxman has been synonymous with the Times of India ever since your grandfather was a child`  అని. 
*     *     *
ఇంతకీ ఆయన మళ్ళీ ఎందుకు వార్తల్లోకి వచ్చాడూ అంటే.. టైంస్ ఆఫ్ ఇండియా ప్రారంభించి నూటడెబ్బయ్ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా భారత తపాలా శాఖ ఒక కమెమొరేటివ్ స్టాంప్‌ని విడుదల చేసింది. అది ఆర్.కే.లక్ష్మణ్  గీసిన కామన్‌మేన్. 
 

© Dantuluri Kishore Varma

Wednesday, 13 November 2013

మలాలా

చాలా సార్లు అవకాశం కష్టం అనే ముసుగు ధరించి వస్తుందట. కష్టాలు, బాధలు, ఆటంకాలు రాకూడదని కోరుకొంటే వాటితో పాటు వచ్చే అవకాశాలు కూడా రావడం మానేస్తాయి. అలాగని మన జీవితాల్లోకి ఇబ్బందులు రావాలని కోరుకోమని కాదు. ఒకవేళ కష్టనష్టాలను భరించవలసి వచ్చినప్పుడు, వాటిని సహనంతో ఓర్చుకొంటే తరువాత అంతా మంచే జరుగుతుంది అనే ఆశావహదృక్పదం అలవరచుకోవాలని అలా చెపుతారు. 

పాకిస్తాన్‌లో తాలిబన్ ప్రభావిత ప్రాంతాల్లో మహిళలమీద చాలా ఆంక్షలు ఉంటాయి. వాళ్ళకి బడికి వెళ్ళి చదువుకొనే స్వాతంత్ర్యంకూడా ఉండదు. బ్రతుకు దుర్భరంగా ఉంటుంది. స్కూల్‌కి వెళ్ళే అమ్మాయిలు ఏవిధమైన వ్యతిరేకతని ఎదుర్కొంటున్నారో ఒక అమ్మాయిచేతే బ్లాగ్ రాయిస్తే బాగుంటుందని బిబిసి వాళ్ళు భావించి మలాలా యూసఫ్‌జాయ్  అనే ఒక ఏడవతరగతి అమ్మాయిని ఎన్నుకొన్నారు. అదికూడా ఆమె తండ్రి స్కూళ్ళు నిర్వహిస్తున్న వ్యక్తికనుక సాధ్యమైంది. బడికివెళ్ళడమే జీవన్మరణ సమస్య అయినప్పుడు, తాలిబన్లకి వ్యతిరేకంగా రాయడమా?

స్కూల్‌బస్‌లో ఇంటికివెళుతుండగా, తాలిబన్లు బస్‌ని ఆపి, మలాలాని తలమీదకాల్చారు. అదృష్టవశాత్తూ ఆమె మరణించలేదు. ఈ సంఘటన జరిగి సుమారు ఒక సంవత్సరం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అరవైకోట్ల అమ్మాయిలు ఎదోఒకకారణంగా చదువుకి దూరంగా ఉంచబడుతున్నారు. వాళ్ళతరపున మాట్లాడగలిగిన ఒక ప్రతినిధిగా ఇప్పుడు మలాలా గుర్తించబడుతుంది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఐయాంమలాలా అనే పుస్తకం రాసింది. మలాలా ఫండ్‌ని నిర్వహిస్తుంది. 

నిన్న న్యూయార్క్‌లో గ్లామర్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అనే వార్షిక కార్యక్రమం ఒకటి జరిగినప్పుడు, ఎంతో మంది నటీమణులు, పాప్ సింగర్లు, యంగ్‌పొలిటీషియన్లు.. వాళ్ళందరితో పాటూ మలాలా కూడా హాజరయితే - జనాలనుంచి మలాలాకి మాత్రమే హృదయపూర్వకమైన, ఉత్సాహవంతమైన ప్రతిస్పందన వచ్చిందట. `వి లవ్ యూ, మలాలా` అని హర్షధ్వానాలు చేశారట.
సంవత్సరంక్రితం కేవలం కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఒక ధైర్యంకల టీనేజర్, ఇప్పుడు ఒక అంతర్జాతీయ సెలబ్రిటీ. మరచిపోకూడని విషయం ఏమిటంటే ఆమె ఈ స్థాయికి రావడానికి మొదటి అడుగు మరణం అంచు వరకూ ఆమెని తీసుకువెళ్ళిన కష్టం - తాలిబన్ల దుశ్చర్య.
 © Dantuluri Kishore Varma

Tuesday, 12 November 2013

శ్రీ శంకరభగవత్పాదులు

ఆదిశంకరాచార్యులని సాక్షాత్తూ పరమశివుని అవతారంగా భావిస్తారు. క్రీస్తుశకం 788వ సంవత్సరంలో కేరళలో కలాడి అనే ఊరిలో నంబూద్రి బ్రాహ్మణుల ఇంటిలో ఆర్యాంభ, శివగురు అనే దంపతులకి  బిడ్డగా జన్మించాడు. పుట్టిన కొన్నిరోజులకే తండ్రి చనిపోవడంతో, ఈతనిని తల్లే పెంచుతుంది. ఉపనయనం అయినతరువాత బ్రహ్మచారిగా సనాతన ధర్మాన్ని అనుసరించి ఇంటింటికీ తిరిగి బిక్ష గ్రహించాలి. బాలుడిగా ఉన్న ఆదిశంకరాచార్య ఒక పేదమహిళ ఇంటి దగ్గర ఆగుతాడు. కానీ, పాపం ఇవ్వడానికి ఆమెకి ఇంటిలో ఏమీలేదు ఒక ఎండిపోయిన ఉసిరికాయ తప్ప. దానినే బిక్షగా ఇస్తుంది. అప్పుడు, ఆమె దయకి, కరుణకి ముచ్చటపడి కనకధారాస్తోత్రం చదివి లక్ష్మీదేవిని ప్రసన్నంచేసుకొని, ఆ పేదరాలికి సంపదని ఒనగుర్చమని కోరతాడు. లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయల వర్షం ఆ యింటిలో కురిపిస్తుంది. ఆ కుర్రవాడియొక్క గొప్పతనం అది. ఆదిశంకరాచార్యులు అత్యంత తెలివితేటలు కలిగిన బాల మేధావి.  శంకరాచార్యుని విధ్వత్తు ఎంతగొప్పది అంటే, ఒకసారి తల్లి నదిదగ్గరనుంచి నీరు తీసుకొనివస్తూ అవస్థలు పడడం గమనించి, ఆనదినే ప్రవాహమార్గం కొంచెం మార్చుకొని తమ ఇంటిప్రక్కగా వెళ్ళవలసిందని అడుగుతాడు. అలాగే జరుగుతుంది!
At Kotipalli Temple
సన్యాసం స్వీకరించి గురువుకోసం అన్వేషణ మొదలుపెడతాడు. ఎన్నో వేలకిలోమీటర్లు కాలినడకన తిరుగుతూ చివరికి నర్మదానది ఒడ్డున శ్రీ గోవింద భగవత్పాదుల వారిని చేరతాడు. గురువుకి సేవలు చేస్తూ అన్ని విద్యలూ నేర్చుకొంటాడు. తరువాత గురువుగారి ఆజ్ఞమేరకు వారణాసి వెళతాడు. అక్కడ ఎంతో మంది ఆదిశంకరాచార్యునికి శిష్యులుగా మారతారు. ఒకరోజు శిష్యులతో కలసి వెళూతున్నప్పుడు ఒక చంఢాలుడు ఎదురు వస్తాడు. శంకరాచార్యులు వాడిని ప్రక్కకి తొలగమని అడిగినప్పుడు, వాడు తొలగవలసినది ఈ శరీరమా, లేక ఆత్మా? అని ప్రశ్నిస్తాడు. ఆకాశం యొక్క ప్రతిబింబం గంగానదిలోనూ, కల్లుకుండలోనూ కనిపిస్తుంది. రెండింటిలోనూ కనిపించే ఆకాశం ఒకటేనా, లేక వేరు వేరా? అని అడుగుతాడు. ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని తెలియజేసిన చంఢాలునికి ఆదిశంకరాచార్యుడు ప్రణమిల్లుతాడు. అప్పుడు చంఢాలుని రూపంలో ఉన్న పరమశివుడు నిజరూపంలో ప్రత్యక్షమై వ్యాసుడు కూర్చిన బ్రహ్మసూత్రాలకి వాఖ్యానం రాయవలసినదిగా ఆదేశిస్తాడు.  పరమశివుడు ఆదేశాలను నిర్వర్తించడానికి బదరీకి వెళతాడు. ప్రస్థానత్రయం అని పిలువబడే బగవద్గీత, ఉపనిషత్తులు,బ్రహ్మసుత్రాలమీద భాష్యం రాస్తాడు. తిరిగి కాశికి వస్తాడు. అప్పటికి ఆయన వయసు 16 సంవత్సరాలు.

శంకరాచార్యులవారి ప్రియశిష్యుడు సనందనుడు. ప్రియశిష్యుడికి కావలసిన అన్ని అర్హతలూ అతనికి ఉన్నా, అందరికీ ఆతనిమీద అసూయగా ఉంటుంది. దానిని తొలగించడానికి ఒకరోజు ఆదిశంకరాచార్యుడు ఒక చిన్న తమాషా చేస్తాడు. నదికి ఇవతలి ఒడ్డున గురువు, అవతల ఒడ్డున శిష్యుడు ఉండగా తక్షణమే ఇటు రావలసిందని పిలుస్తాడు. వెంటనే సనందనుడు నదిలోని నీటిమీద పాదాన్ని వేసి అవతలి ఒడ్డుకు ప్రయాణం మొదలుపెడతాడు. పాదం నీటిలో మునగకుండా ఒక కలువపువ్వు పైకి లేస్తుంది. అడుగడుగుకీ ఒక్కో పువ్వుచొప్పున పువ్వులదారి ఏర్పడి ఆ పరమశిష్యుడికి నదిని దాటడానికి సహాయం చేస్తుంది.

ఆదిశంకరుడు బోధించిన మతం అద్వైతం. దేశం ఆ చివరినుంచి ఈ చివరివరకూ ప్రయాణంచేసి ఎందరో విద్వాంసులని తర్కంలో, మీమాసంలో ఓడించి నాలుగు దిక్కుల్లోనూ నాలుగు మఠాలను స్థాపిస్తాడు. తూర్పున పూరీలో, పశ్చిమాన ద్వారకలో, ఉత్తరాన బద్రీనాథ్లో, ధక్షిణాన శృంగేరీలో. సనాతనధర్మాన్ని దేశంలో మూలమూలలా వ్యాపింపచేయడానికి, వేదవిజ్ఞానాన్ని ప్రజలకి అందించడానికి ఒక్కో వేదాన్ని ఒక్కో పీఠానికి అప్పగిస్తాడు. ఋగ్వేదాన్ని పూరీకి, యజుర్వేదాన్ని శృంగేరీకి, సామవేదాన్ని ద్వారకాకి, అదర్వణవేదాన్ని బదరీనాథ్‌కీ అప్పగిస్తాడు.

శివనందలహరి, సౌందర్యలహరి, విష్ణుశహస్రం లాంటి ఎన్నో స్త్రోత్రాలు రచించాడు. కైలాసగిరినుంచి పంచలింగాల్ని తీసుకొనివచ్చి అయిదుచోట్ల - కేదార్‌లో ముక్తిలింగాన్ని, నేపాల్ నీలకంటదేవాలయంలో పరలింగాన్ని, చిదంబరంలో మోక్షలింగాన్ని, శ్రంగేరీలో భోగలింగాన్ని, కంచిలో యోగలింగాన్ని ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించారు.

ముప్పైరెండవఏట శివసాన్నిధ్యాన్ని చేరారు.

© Dantuluri Kishore Varma

Tuesday, 15 October 2013

శ్రీ గురుభ్యోనమ:

ఆయన మాట్లాడితే వృద్ధులు, మధ్యవయస్కులు, యువతీయువకులు మైమరచిపోయి వొళ్ళంతా చెవులు చేసుకొని వింటారు. ఆయన పద్యంచదివితే శ్రవణాలలో అమృతధార కురిసినట్టు ఉంటుంది. సనాతనధర్మం గురించి అలవోకగా చెబుతుంటే, ఆయన మాట తడబడగా విన్నవాళ్ళు లేరు. గుడిలోనో, బడిలోనో, సభలోనో మాట్లాడితే ప్రాంగణంఅంతా కిక్కిరిసిపోతుంది. టీవీలో మాట్లాడితే ఆచానల్ టీఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగిపోతుంది. జనాలకి బయట ఎన్నిపనులున్నా ముగించుకొని టీవీలో ప్రవచనం వచ్చేసమయానికి ఆఘమేఘాలమీద ఇంటికిచేరిపోయి, మనసునిండా ఆర్యధర్మాన్ని నింపుకొనేలా చెయ్యగల మహిమ ఆయన మాటలకే ఉంది. `కేవలం మాటకి మనుషులు మారతారా?` అంటే - `ఆయన చెపితే మారతారు` అంటారు. రామాయణం, భారతం, భాగవతం, అష్టాదశపురాణాలు, గురుచరిత్రలు, స్తోత్రాలు... ఆయనకి కొట్టినపిండి. సముద్రంలోకి దూకి అడుగున ఎక్కడో దాక్కొనిఉన్న రత్నాలని వెలికితీసే సీడైవర్ లాగ ఋషులచే చెప్పబడిన వాంజ్మయంలో విలువలని లలతమైన తెలుగుభాషలో వివరించి చెప్పడం ఆయన పని. ఇప్పటికే ఆయనేవరో ఊహించిఉంటారు. మీఊహ నిజమే. ఆయనే శారదాజ్ఞానపుత్ర, ఉపన్యాసచక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావుగారు.
ధర్మం అంటే చెప్పడం కాదు, ఆచరించడం అంటారు ఆయన. దానికి ఉదాహరణగా రాముడినీ, రావణుడిని చూపిస్తారు. ఇద్దరికీ ధర్మంతెలుసు. రాముడు ఆచరించి ఆదర్శప్రాయుడయితే, రావణుడు ఆచరించక అదోగతిపాలయ్యాడు. వ్యక్తిత్వవికాస క్లాసుల్లో చెప్పేదికూడా అదే. మనుష్యులతో మంచి సంబంధబాంధవ్యాలు నెరిపితే మంచి విజయం సొంతమవుతుంది అని. మంచిబిడ్డగా, మంచిశిష్యుడు/రాలుగా, మంచిజీవితభాగస్వామిగా, మంచితల్లి/తండ్రిగా, సమాజంలో ఆదర్శప్రాయుడైన మంచిపౌరుడిగా ఉండాలని. శ్రీరాముడు ఆచరించి చూపింది అదేకదా? ఇంగ్లీష్ చదువుల్లో పడి మనకి ఇలియడ్ తెలిసినంతగా రామాయణం తెలియడంలేదు. `ఈ ఇతిహాసపు గొప్పతనం ఇదీ,` అని చాగంటి వారు చెప్పినట్టు చెపితే ఇప్పటితరం దాన్ని మక్కువతో అక్కున చేర్చుకోకుండా ఉంటుందా?  గజేంద్రమోక్షంగురించో, గంగావతరణంగురించో, శివతాండవంగురించో వర్ణించి చెపుతుంటే శ్రోతలకి వొళ్ళుగగ్గుర్పాటు చెంది, పురాణాలు పాతచింతకాయ పచ్చడి కాదనే అవగాహన పెరగదూ? 

అరిషడ్వర్గాలనీ ఉత్తేజింపచెయ్యగల సాహిత్యం, సినిమాలు, అంతర్జాలంలో వీడియోలు అందుబాటులో ఉన్నంతగా మంచిని చెప్పగల గురువులు అందుబాటులో లేరు అంటారు ఆయన. అందుకే గురువుల అవసరం నేటికాలంలో చాలా ఉంది, అప్పుడే ప్రజలలో నేరప్రవృత్తి తగ్గుతుంది  అని నొక్కి వొక్కాణిస్తారు. అందుకే తనవంతుగా విస్తృతంగా ధర్మప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఆయన చేసిన ఉపన్యాసాలనన్నింటినీ పుస్తకరూపంలో చేరిస్తే 2,400 పేజీలవుతుందట. వింటే 1,200 గంటలపాటు వినాలి. ఉపన్యాసంచెప్పినందుకు ప్రతిఫలంగా ఒక్కరూపాయికూడా తీసుకోరట! 

చాగంటివారిది కాకినాడ. ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం. తల్లితండ్రులు సుశీలమ్మ, సుందర శివరావులు. కోటేశ్వరరావుగారి ధర్మపత్ని శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరిగారు. వీరికి ఇద్దరు పిల్లలు - షణ్ముఖశరణ్, నాగశ్రీవల్లి. ఇతిహాశాలను, పురాణాలను బాగాచదివారు. ఒకసారి సూర్యకళామందిరంలో జరిగిన ఒక కార్యక్రమం చూసిన తరువాత తనదృష్టి ఆద్యాత్మికతవైపు మరలిందని ఈ మధ్య ఏదో పేపర్లో చెప్పారు. పెద్దాపురంలో ఒక అద్యాత్మికసభలో మాతా చిన్మయదేవి ఒకరోజు ఉపన్యసించి, తరువాత ఎవరినైనా భాగవతంగురించి మాట్లాడమని కోరినప్పుడు చాగంటివారు మాట్లాడారట. అదే మొట్టమొదటి ఉపన్యాసం. తరువాత గురువుగారైన అమరేశ్వరప్రసాద్ గారి ప్రోత్సాహంతో ప్రవచనాలు చెయ్యడం కొనసాగించారట.

చాగంటి కోటేశ్వర రావుగారంటే చెప్పలేమత భక్తీ, అభిమానం గుండెలనిండా నింపుకొన్న వాళ్ళు దేశవిదేశాలలో లక్షలకొద్ది ఉన్నారు. ఫేస్‌బుక్‌లో ఎన్నో గ్రూపులు, పేజీలు వారిపేరుమీద నడుస్తూ ఉన్నాయి. అభిమానులు నడుపుతున్న చాగంటి.నెట్ అనే సైట్‌లో ఉపన్యాసాలు వినడానికి, చూడటానికి, డౌన్‌లోడ్ చెసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. 

ఈ ఆర్టికల్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. చాగంటివారిగురించి చెప్పాలనుకొనే విషయాలు ఏమయినా ఉంటే ఈ క్రింద కామెంట్ల రూపంలో చెప్పగలరని కోరుతున్నాను.
 © Dantuluri Kishore Varma 

Tuesday, 24 September 2013

ఆ విప్లవజ్యోతి ఇంకా స్ఫూర్తిని నింపుతూనే ఉంది.

04.07.1897 - 07.05.1924
ఇరవై ఏడేళ్ళంటే ముక్కుపచ్చలారని వయసు. చదువు పూర్తిచేసుకొని, అప్పుడప్పుడే వ్యాపారమో, ఉద్యోగమో మరేదైనా సంపాదనామార్గమో ఎంచుకొని విజయాల బాటన నడక మొదలుపెట్టే వయసు. అల్లూరి సీతారామరాజు ఆ సరికే ఒక మహాసామ్రాజ్యాన్ని గడగడలాడించగల ఉద్యమాన్ని నడిపి, దేశవ్యాప్తంగా ఒక స్వాతంత్ర్య స్పూర్తిని నింపి, నిష్క్రమించాడు. 

ఈ నేల మనదిరా, ఈ గాలి మనదిరా అని స్వేశ్చగా అటవీసంపదను వాడుకొంటూ, చెట్లునరికి పోడువ్యవసాయం చేసుకొంటూ, వనసంపదని సంతల్లో బియ్యానికీ, వంటసరుకులకీ వస్తుమార్పిడి చేసుకొంటూ, పండుగలకీ పబ్బాలకీ ఇంకోలా చెప్పుకొంటే అసలు ఏ ప్రత్యేక సందర్భం లేకపోయినా ఈతకల్లునీ, తాటికల్లునీ సేవిస్తూ ఆనందంగా గడిపేస్తున్న మన్యం జనాలు బ్రిటీషువాళ్ళ అటవీ రిజర్వు చట్టాలు, అబ్కారీ చట్టాల వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. చేతులూ కాళ్ళూ కట్టేసినట్టయ్యాయి. అప్పుడు సీతారామరాజు వాళ్ళ జీవితాల్లో వెలుగునింపే మెరుపులా, తెల్లవాళ్ళ పాలిట పిడుగులా వచ్చాడు. 

1907లో, అంటే అప్పటికి సీతారామరాజుకి పదేళ్ళు ఉంటాయేమో - బిపిన్ చంద్రపాల్ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాడు. ఎందరో వాటికి ఉత్తేజితులయ్యారు. వారిలో మనహీరో ఒకడు. తరువాత ఒక పుష్కరకాలానికి గాంధీజీ సహాయనిరాకరణోధ్యమం వల్ల కొత్త ఆలోచనలకి త్వరగా స్పందించే వయసులో ఉన్న యువకుడు సీతారామరాజు తెల్లవాళ్ళను ఎదిరించాలని నిర్ణయించుకొన్నాడు. గాంధీజీలా అహింసామార్గంలో కాదు. హింసామార్గంలో.

మన్యప్రాంతానికివెళ్ళి అక్కడివాళ్ళకి స్వాతత్ర్యంయొక్క ప్రాముఖ్యతని నూరిపోసి, దళాన్ని కూడగట్టుకొన్నాడు. కాకపోతే పాతకాలపు విల్లంబులులాంటి ఆయుదాలు తెల్లవాళ్ళ తుపాకీ గుళ్ళముందు దిగదుడుపే! కాబట్టి, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి అక్కడ ఉన్న తుపాకీలనీ, మందుగుండు సామాగ్రినీ స్వాధీనం చేసుకోవడానికి చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి మొదలైన పోలీస్‌స్టేషన్ల మీద మెరుపుదాడి చేసి సఫలమయ్యాడు. ప్రభుత్వానికి వెన్నులో ఒణుకుపుట్టించాడు. ఈ చిచ్చరపిడుగుని ఎదుర్కోవడానికి ఆధునిక పరికరాలనీ, ఆయుదాలనీ, ప్రక్కరాష్ట్రాలనుంచి ప్రత్యేక పోలీసు బలగాలనీ రప్పించ వలసి వచ్చింది. 

1922 నుంచి 1924 వరకూ కేవలం రెండు సంవత్సరాలే అయినా, ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా చేశాడు.  

రాజుని నమ్ముకొన్న మన్యంప్రజలకి వేదింపులు మొదలయ్యాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అల్లూరి సీతారామరాజు లొంగేవాడుకాదు. కానీ, ఆశ్రితజన పీడన ఆతనికి వేదన అయ్యింది. అందుకే, తనకు తానుగా లొంగిపోయాడు. ఈ నిప్పుని వొడిలో పెట్టుకొంటే సామ్రాజ్యాన్నే కాల్చి మసిచేస్తుందని భావించారేమో! లొంగిపోయిన వీరుడ్ని అదుపులోకి తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. 

కానీ ఆ విప్లవజ్యోతి ఇంకా స్పూర్తిని నింపుతూనే ఉంది.
© Dantuluri Kishore Varma 

Saturday, 14 September 2013

సుభాష్ చంద్రబోస్

యానం ఫెర్రీ రోడ్డులో సుభాష్ చంద్రబోస్ విగ్రహం
సుభాష్ చంద్రబోస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్(ICS) పాసయినా ఉద్యోగంలో చేరకుండా కాంగ్రెస్‌లో చేరాడు. రెండుసార్లు కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. కానీ, గాంధీజీతో విభేదాలవల్ల పార్టీని విడిచిపెట్టి తన స్వంతంగా స్వాతంత్ర్యం కోసం పోరాడవలసి వచ్చింది. 

రెండవ ప్రపంచ యుద్దం మొదలైనప్పుడు బ్రిటీష్ ప్రభుత్వం మీద స్వాతంత్ర్యంకోసం ఒత్తిడి చెయ్యడానికి అదే సరయిన సమయంగా భావించాడు. ఆ సమయంలోనే, 1940లో, ఆయనని జైల్లో పెట్టారు. నాలుగు నెలలు జైలు శిక్ష అనుభవించిన తరువాత అక్కడినుంచి తప్పించుకొనే ఉద్దేశ్యంతో ఆమరణ నిరాహార ధీక్ష మొదలుపెట్టాడు.  

ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది. ఆయన జైల్లో మరణించడం జరిగితే దేశం అగ్నిగుండంగా మారడం తద్యం. కాబట్టి, ఆయనని అక్కడినుంచి విడుదలచేసి గృహనిర్బందంలో ఉంచారు.

ఇంటి చుట్టూ కాపలాగా ఉన్న పోలీసుల కన్నుగప్పి తప్పించుకొని జర్మనీకి పారిపోయాడు. అక్కడినుంచి జపాన్‌కి. ఇండియన్ నేషనల్ ఆర్మీని(INA) స్థాపించి `నేతాజీ` అయ్యాడు. కానీ, భారతదేశానికి స్వాతంత్ర్యం రాకమునుపే ఒక విమాన ప్రమాదంలో మరణించాడు. (దీనికి సంబంధించి కొంత వివాదం ఉంది. కొంతమంది ఈ మరణం పూర్తిగా నమ్మదగింది కాదని అంటారు.)

A couple of quotes from Subhash Chandra Bose:

"The individual must die so that the nation may live. Today I must die so that India may live and may win freedom and glory."

"Give me blood and I promise you freedom."
© Dantuluri Kishore Varma 

Monday, 15 July 2013

నవ్వుల వెనుక ఎంత విషాదం!

బిగుతుగా ఉండే కోటు, వదులుగా ఉండే పేంట్, పెద్ద బూట్లు, నెత్తిన డెర్బీ హ్యాట్, చేతిలో కర్రా - వీటన్నింటితో చూడగానే నవ్వు వచ్చేలా ఉంటాడు చార్లీ చాప్లిన్. ఇతని నడక కూడా విచిత్రంగా ఉంటుంది. భూమికి కొంచం ఎత్తులో కట్టిన తాడుమీద నడచినట్టు, బ్యాలన్స్ చేసుకొంటూ అడుగులు వేస్తాడు. మోడ్రన్ టైంస్, సిటీ లైట్స్ లాంటి ఎన్నో సినిమాలు తీసి, వాటిల్లో నటించాడు. కథ, సంగీతం, దర్శకత్వం అన్నీ అతనే. ఈ సినిమాలలో ప్రత్యేకత ఏమిటంటే చాలా నవ్విస్తాయి కానీ, `అయ్యో పాపం,` అనిపించేలా విషాదం ఉంటుంది. 
చార్లీ చాప్లిన్ చిన్నప్పుడు కటిక దరిద్రంలో బ్రతుకుతాడు. కట్టుకోవడానికి సరయిన బట్టలు, తినడానికి తిండీ ఉండవు. వాళ్ళ ఇంటిదగ్గర ఒక గొర్రె మాంసం అమ్మే దుకాణం ఉంటుంది. ఒకరోజు అక్కడినుంచి ఒక గొర్రెపిల్ల తప్పించుకొని రోడ్డు మీదకి వచ్చేస్తుంది. దానిని పట్టుకోవడానికి కసాయి వీధంతా పరుగులు పెడతాడు. గొర్రెపిల్ల వాడిని నానా తిప్పలూ పెడుతుంది. చూసిన అందరూ పడీ, పడీ నవ్వుతారు. కానీ, పాపం చివరికి అది వాడికి దొరికి పోతుంది. అప్పటి వరకూ నవ్వించిన గొర్రెపిల్ల మరికొంత సేపటిలో చంపబడుతుందని తెలిసి చాప్లిన్ చాలా ఏడుస్తాడు. 

ఈ సంఘటనే అతని సినిమాలకి స్పూర్తి ఇచ్చిందట. నవ్వించిన పాత్రల వెనుక విషాదాన్ని చొప్పించి వాటిని ప్రపంచ ప్రఖ్యాతి చేశాడు.

చాలా చార్లీచాప్లిన్ సినిమాలను ఈ లింక్‌లోకి వెళ్ళి చూడవచ్చు
© Dantuluri Kishore Varma 

Wednesday, 15 May 2013

కాటన్

మేం వచ్చాం,
మేం చూశాం,
మేం గెలుచుకొన్నాం.....

జూలియస్ సీజర్ మాటల్ని తెల్ల వాళ్ళు తమకి ఆపాదించుకొని తిరిగి చెప్పవచ్చు. యావత్తు జాతినీ శృంకలాల్లో బంధించి పరిపాలించారుకనుక ఒకవిధంగా ఈ మాటలకి అర్థం ఉంటుంది.  కానీ ఇక్కడ ఉపయోగించిన `గెలుచుకొన్నాం` అన్న మాట హృదయాలకు సంబంధించినదైతే, అది కేవలం కొంతమంది వ్యక్తులకి మాత్రమే సరిగ్గా  సరిపోతుంది. అటువంటి కొద్ది మందిలో అపరభగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ ముఖ్యమైన వాడు. గోదావరి జిల్లాల్లో కాటన్ విగ్రహాలు నాలుగువేలదాకా ఉన్నాయంటే జనం గుండెల్లో ఈ ఆంగ్లేయుడు ఏవిధంగా గూడుకట్టుకొని ఉండిపోయాడో అర్థమౌతుంది. కొన్ని గ్రామాల్లో అయితే కాటన్ ప్రతీ జయంతి రోజునా(మే 15) ఆయన విగ్రహాలకి అభిషేకాలు చేసి ఉత్సవాలు జరుపుతారు. 
దవళేశ్వరంలో ఆనకట్ట నిర్మించి ఉండకపోతే ఉభయగోదావరి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్షయపాత్రగా మారిఉండటానికి బదులుగా,  లక్షల ఎకరాలు నేల బీడువారిపోయి, ప్రజలు కరువుకాటకాల బారినపడి నశించి ఉండేవారు. 

`ఆనకట్ట నిర్మించడం లాంటి పనిని ప్రభుత్వం అప్పజెపితే ఏ ఇంజనీరయినా పుర్తిచేస్తాడుకదా, దానిలో కాటన్ యొక్క గొప్పతనం ఏముంది?` అని ఎవరికయినా అనిపించవచ్చు. కానీ, వ్యవసాయ అవసరాలకి ఉపయోగపడే కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు నిరుపయోగంగా సముద్రం పాలు అయిపోతుందని, దానిని అడ్డుకొని భూములని సస్యశ్యామలం చెయ్యవచ్చని ప్రభుత్వానికి నివేదికలు సమర్పించి, పని ప్రారంభింప చేసిన ఘనత కాటన్‌కే దక్కుతుంది.  `గోదావరి నది మీద ఆనకట్ట ఎందుకు కట్టాలి?` అనే ప్రశ్నకి `వరదలు వచ్చిన సమయంలో గోదావరి నదిలో ఒక్కరోజు ప్రవహించే నీరు లండన్‌లో థేంస్ నది గుండా  ఒక సంవత్సరంపాటు ప్రవహించే నీటికి సమానం,` అని ఒక్క వాఖ్యంతో సమాదానం చెప్పి సందేహ నివృత్తి చేశాడట. 

కాటన్ జన్మించి 210 సంవత్సరాలయ్యింది. దవళేశ్వరం బ్యరేజ్ నిర్మించి నూట అరవై ఏళ్ళయ్యింది. కానీ కాటన్‌ జనాల మనసుల్లోఇప్పటికీ  నిలిచిపోయి ఉండడానికి కారణం  ఆయన మానవతావాదం.

© Dantuluri Kishore Varma

Saturday, 15 December 2012

ఆ ఐదు లక్షణాలూ... దుర్గాబాయి

ఉన్న దారిలో నడిచేవాళ్ళు బాటసారులౌతారు, దారిని ఏర్పాటుచేసుకొంటూ ముందుకు సాగేవాళ్ళు మార్గదర్శులౌతారు. వందసంవత్సరాలక్రితం మన సమాజంలో మహిళలకి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. బాల్యవివాహాలు, అవిద్య, వివక్షలు అధిగమించి జాతీయస్థాయిలో స్వాతంత్ర్య సమరయోధురాలిగా, సంఘసేవకురాలిగా, సంస్కర్తగా, విద్యావేత్తగా, పార్లమెంటేరియన్‌గా కీలక భూమికను పోషించడం దుర్గాబాయి(1909-1981) లాంటి  ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే సాధ్యమౌతుంది. ఈ ప్రత్యేకత ఆమెకు కలగడానికి కారణం ఆమె వ్యక్తిత్వం.  లక్ష్య నిర్ధేశం, పట్టుదల, నాయకత్వ ప్రతిభ, సృజనాత్మకత, సేవానిరతి అనే ఐదు లక్షణాలూ దుర్గాబాయిలో కనిపిస్తాయి.  అవే ఆమెకి భారతదేశ చరిత్ర పుటల్లొ ఒక శాశ్వత స్థానాన్ని సమకూర్చి పెట్టాయి.
దుర్గాబాయి రాజమండ్రీలో జన్మించింది. తండ్రి బెన్నూరి రామారావు, తల్లి కృష్ణవేణి. రాజమండ్రీ అమ్మమ్మగారి ఊరు. తండ్రిది కాకినాడ కోర్టులో ఉద్యోగం. విక్టోరియా టైప్ ఇన్స్టిట్యూట్‌కూడా నిర్వహించేవారు. దుర్గా బాయికి వెంకట దుర్గా నారాయణరావు అనే ఒక సోదరుడు ఉన్నాడు. ఎనిమిదేళ్ళ వయసులోనే అమలాపురానికి చెందిన గుమ్మడిదల సుబ్బారావు అనే ఆయనతో ఆమె వివాహం జరిగింది. కుటుంభ జీవితం కంటే సంఘసేవకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చే దుర్గాబాయితో, సుబ్బారావుగారికి సరిపడక ఇరవైరెండేళ్ళ వైవాహిక జీవతం తరువాత వాళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది. తరువాత చాలా కాలానికి స్వాతంత్ర్యానంతరం ఆమె జాతీయ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషిస్తుండగా జవహర్లాల్ నెహ్రూ మంత్రిమండలిలో ఆర్ధికశాఖ నిర్వహిస్తున్న చింతామణి దేశ్‌ముఖ్ తో 1953లో మనసులుకలిసిన వివాహం జరిగింది. అప్పటినుంచే ఆమె దుర్గాబాయిదేశ్‌ముఖ్‌గా వ్యవహరించబడ్డారు. ఇది క్లుప్తంగా ఆమె వ్యక్తిగత జీవితం.  

ధైర్యం, నిజాయితీ, సంఘసేవ బీజాలు తండ్రి నుంచి సంక్రమిస్తే, గాంధీగారి ప్రభావం దుర్గాబాయిమీద చిన్నప్పటినుంచీ ఉంది. ఆయనని దగ్గరనుంచి చూడాలని, మాట్లాడాలనీ ఎంతో మంది భారతీయులల్లాగే ఆమే కోరుకొన్నారు. 1921వ సంవత్సరంలో రాజమండ్రీలో గాంధీగారి సభ జరిగింది. అప్పుడు పన్నెండెళ్ళ దుర్గాబాయి అక్కడ ప్రజలనుంచి కాంగ్రెస్ నిధిని వసూలు చేసి, తనచేతిగాజులని కూడా కలిపి గాంధీగారికి అప్పగించడం జరిగింది.  1923లో కాంగ్రెస్ మహాసభలు కాకినాడలో జరిగినప్పుడు ఎంతో మంది మహిళా కార్యకర్తలకి హిందీ మాట్లాడడంలో తర్పీదునిచ్చి తానుకూడా పాల్గొనడానికి తయారయితే, ఆమె అప్పటికి మేజరు కాని కారణంగా కేవలం వేరొకరికి సహాయకురాలిగా సభలకు హాజరయింది. కానీ ఆశ నిరాశ అయ్యేలా గాంధీగారు ఆ సభలకు హాజరు కాలేదు. ఈ సభల సమయంలోనే ఒక తమాషా సంఘటన జరిగింది. సభలతో పాటూ ఖాదీ ప్రదర్శన ఏర్పాటుచేశారు. ప్రవేశ ద్వారం దగ్గర టిక్కెట్లు చించి, సందర్శకులని లోనికి అనుమతించే బాధ్యత దుర్గా బాయికి అప్పగించారు. జవహర్లాల్ నెహ్రూ లోనికి వస్తున్నప్పుడు టిక్కెట్టు లేనిదే అనుమతించేది లేదని ఆయనను అడ్డగించిందట. అప్పుడు వెనుకనున్న కొండావెంకటప్పయ్య గారు, నెహ్రూ గారికి టిక్కెట్టు కొనిపెట్టారట. ఈ సందర్భంలో దుర్గాబాయి కర్తవ్య నిర్వాహణను నెహ్రూ చాలా మెచ్చుకొన్నారట.

సమాజంలో దేవదాసీల జీవితం చాలా దుర్భరంగా ఉండేది. కాకినాడలో గాంధీగారి సభను వాళ్ళకోసం ఏర్పాటుచేసి, వాళ్ళ జీవితంలో కొంత మార్పు తీసుకురావాలని దుర్గాబాయి భావించారు. అప్పుడు(1929) కాంగ్రెస్ విరాళాల సేకరణకోసం గాంధీగారు  ఆంధ్రదేశంలో పర్యటిస్తున్నారు. దుర్గాబాయి సూచనను పాటించి, సభను ఏర్పాటు చెయ్యాలంటే 5000 రూపాయలు విరాళం సేకరించాలని స్థానిక నాయకులు ఒక చిక్కుముడిని వేస్తారు. ఆ రోజుల్లో ఐదువేలంటే తక్కువ మొత్తం కాదు. కానీ ఎన్నో వ్యయ ప్రయాశలకోర్చి, నిధిని కూడబెట్టి సమావేశం ఏర్పాటు చేసుకొన్నారు. స్వాగతోపన్యాసం చక్కని హిందీలో చేసిన దుర్గాబాయి భాషా కౌశలం గమనించి గాంధీగారు తన ప్రసంగాన్ని తెలుగులో అనువదించే అవకాశం కొండా వెంకటప్పయ్య స్థానంలో, దుర్గాబాయికి కలుగజేసారు. అక్కడి నుంచి ఆమెని తన కారులోనే కాకినాడ టౌన్‌హాలుకి తీసుకొని వెళ్ళి అక్కడి ఉపన్యాసానికి కూడా అనువాధకురాలిగా చేసారు. తరువాత ఆంధ్రదేశమంతా ఆమే, ఆయన ఉపన్యాసాలని తెలుగులోనికి అనువదించారు.

1930లో ఉప్పుసత్యాగ్రహం జరిగినప్పుడు తన భర్త సుబ్బారావు అనారోగ్యకారణంగా మద్రాసులో ఉన్న దుర్గాబాయి, ఊరుకాని ఊరులో కార్యకర్తలని పోగుచేసి సత్యాగ్రహ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. అప్పుడు మొదటిసారి అరెస్టయ్యారు. తరువాత రెండుసంవత్సరాలకి మళ్ళీ అరెస్టవడం జరిగింది. ఈ దఫా అనారోగ్యం కారణంగా విశ్రాంతి అవసర పడటంతో తన దృష్టిని చదువుమీదకి మళ్ళించారు.  బెనారస్‌లో మెట్రిక్యులేషన్ చేసి, బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఇంటర్‌మీడియట్, విశాఖపట్నం ఆంధ్రాయూనివర్సిటి నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ, మద్రాసులో లా ఏకబిగిన పూర్తిచేశారు.

1938లో మహిళలకు స్వయంఉపాది కల్పించే ఉద్దేశ్యంతో మద్రాసులో ఆంద్రమహిళాసభను ప్రారంభించారు. విరాళాలతో, ప్రభుత్వ సహకారంతో అది దినదిన ప్రవర్ధమానమైంది. 1958లో హైదరాబాదులో కూడా ఆంద్రమహిళాసభను మొదలుపెట్టారు. వయోజనవిద్య అందించే ఉద్దేశ్యంతో 1971లొ హైదరాబాదులో సాక్షరతా మిషన్‌ను ఆంధ్రమహిళా సభకు అనుబంధంగా ప్రారంభించారు. మహిళలకు, విధ్యా, ఉపాది, వైద్యం, వయోజనులకు విద్య మొదలైన విషయాలలో గొప్ప సేవచేసారు. స్వాతంత్ర్యం వచ్చినతరువాత రాజ్యాంగ నిర్మాణ కమిటీలో, ప్లానింగ్ కమిటీలో సభ్యురాలిగా విశేషమైన సేవలు అందించారు. విదేశాలలో భారతదేశ ప్రతినిధిగా ప్రసంగించారు. నెహ్రూ లిటరసీ అవార్డు, పద్మవిభూషణ్ వంటి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు పొందారు.

ప్రాధమిక విద్యకూడా సరిగా లేని ఒక సాధారణ అమ్మాయి, ఎన్నో సాంఘిక అవరోదాలని దాటి పట్టుదలతో ఈ స్థాయిని చేరడం గర్వకారణం. విచ్చిన్నమైన వైవాహిక జీవితం, దుర్భరమైన కారాగారవాసం, జైలు నుంచి విడుదలైన తరువాత అనారోగ్యం, 1948 ఎన్నికలలో రాజమండ్రీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి అపజయం వంటి అవరోదాలకి కృంగిపోకుండా దేశం గర్వించదగ్గ మహిళామణిగా, ఐరన్‌లేడీగా స్పూర్తివంతమైన జీవితం గడిపి 1981లో పరమపదించారు.

ఆమె వ్యక్తిత్వంలో లక్ష్య నిర్ధేశం, పట్టుదల, నాయకత్వ ప్రతిభ, సృజనాత్మకత, సేవానిరతి అనే ఐదు లక్షణాలూ గుర్తించి మనలో పెంపొందించుకొనే ప్రయత్నం చేస్తే ఈ టపా యొక్క ఉద్దేశ్యం నెరవేరినట్టే.

© Dantuluri Kishore Varma 

Saturday, 8 December 2012

నేను నేనే - బ్నిం

బ్నింగారితో నా పరిచయం విచిత్రంగా జరిగింది. బహు గ్రంధకర్త అయిన ఆయన మాతామహులు  శ్రీజటావల్లభుల పురుషోత్తం గారు, స్వయంగా పద్యాలు రాసి, బ్నింగారికి పద్య చందస్సు నేర్పిన అమ్మమ్మ బాలాత్రిపురసుందరి గార్ల ఫోటోని నేను ఎడ్మిన్‌గా ఉన్న మనకాకినాడ అనే ఫేస్ బుక్ గ్రూపులో ఉంచారు. బ్నిం అనే పేరులోనే ఒక ప్రత్యేకత ఉంది. ఇది భమిడిపల్లి నరశింహ మూర్తి అనే పేరుకి సంక్షిప్త రూపం. చిన్నప్పుడు పత్రికల్లో వచ్చే వారి  కార్టూన్లని చూసేవాడ్ని. కార్టూనిస్ట్‌గా ఆయన బాగా తెలుసు. గ్రూపులో చూసిన మూర్తిగారు ఆయనేనా, కాదా అనే సందేహనివృత్తికోసం  సరాసరి వారినే అడిగేశా `ప్రముఖ రచయితా, కార్టూనిస్టు మీరేనా?` అని.  ఆయన చిరునవ్వుతో, "అవునండీ, నేను నేనే," అన్నారు. ఆయన స్నేహశీలుడు, ప్రజ్ఞావంతుడు, నిగర్వి, హాస్యచతురుడు అన్నింటికీ మించి స్పూర్తి ప్రదాత.  సునిశితమైన పరిశీలనా శక్తి ఆయన సొంతం. ఈ విషయాలలో ఆయనకి ఆయనే సాటి. అందుకే, `నేను నేనే` అన్న మాట బ్నింగారికి ఖచ్చితంగా సరిపోతుంది. 

అచ్చమైన స్నేహితులంటే ముందుగా మనకి జ్ఞాపకం వచ్చేది బాపూ, రమణలు. రమణగారు లేని లోటుని చెప్తూ ఒకసారి బాపూగారు మెచ్చుతునకలాంటి ఒక మాట అన్నారు. "రమణ లేని నేను గోడలేని చిత్రపటంలా ఉన్నాను," అని. స్నేహబంధానికి నిర్వచనం లాంటి వాఖ్యం ఇది. అటువంటి మిత్రద్వయం అంటే బ్నింగారికి వల్లమాలిన అభిమానం, భక్తీ. "నా హృదయం బాపూ ఆలయం," అంటారు. ముళ్ళపూడి వారినుంచి చమత్కార రచనా సంవిధానం, బాపూ నుంచి రేఖా విన్యాసం పుణికి పుచ్చుకొన్న ఆయన భావ చిత్రాలు `మరపురాని మాణిక్యాలు`. వివిధ రంగాల్లో 132 తెలుగు ప్రముఖులని లలితమైన రేఖల్లో, క్లుప్తమైన రాతల్లో పరిచయం చేశారు. బహుశా తెలుగులో ఇటువంటి ప్రయోగం మొట్టమొదటిది అనుకొంటాను. ఈ పుస్తకానికి కవర్‌పేజీ గీసింది స్వయంగా బాపూగారే.   `బాపూ అంటే  బ్నింకి ఎంత భక్తో, బ్నిం అంటే బాపూకి అంత వాత్సల్యం`ట. బాపూగారికి హైదరాబాదులో ఎంతమంది మిత్రులున్నా, ఆ వూరికి వచ్చినప్పుడు కినీసం అరగంట సమయం దొరికినా బ్నింగారితో గడుపుతారట. బాపూ ఒరిజినల్ పెయింటింగ్స్ ఎన్నో  మూర్తిగారి దగ్గర ఉన్నాయి.



మొన్న అక్టోబర్ 28న బ్నింగారి జన్మదినోత్సవసందర్భంగా `హాస్యానందం` వారిగురించి ప్రత్యేక సంచిక వేశారు. టీ.వీ, సినిమా, కళ, సాహిత్య రంగాలలో ప్రముఖులు ఎందరో బ్నింగారి స్వీట్ నేచర్ గురించి, దృక్పదం గురించి, ఆత్మస్థైర్యం గురించి రాసినవి చదివితే ఎవరికైనా `వాహ్, బ్నిం!` అనిపించక మానదు.

కాకినాడ జన్మస్థలం అయినా, రావులపాలెం దగ్గర ఆత్రేయపురంలో పెరిగారు. అనారోగ్యం వల్ల స్కూలుకి వెళ్ళలేక పోయినా, అమ్మ ఒడే బడి అయ్యింది. అదే తనకి గొప్ప అదృష్టం అంటారు. తెలుగు, సంస్కృతాల్లో గొప్పప్రవేశం ఉన్న సాక్షాత్తు సరస్వతీ సమానురాలయిన తల్లి శ్రీమతి విజయలక్ష్మి గారి సమక్షంలో కాళిదాసు రాసిన మేఘసందేశం, కుమార సంభవం లాంటి ప్రబంధాలు, ఇతిహాసాలు చదవగలిగే అదృష్టం బడిలో చదివే సాధారణ కుర్రవాడికి ఉండదుకదా!ఈయన తండ్రి భమిడిపల్లి సూర్యనారాయణ మూర్తిగారు ఆయుర్వేద వైద్యులు.

ఊరిలో డ్రాయింగ్ మాష్టారు శేషాచలం గారిదగ్గర చిత్రలేఖనం నేర్చుకొన్నారు. ఇక రాయడంలో ప్రవేశం, తన సోదరి కోసం రచించిన బుర్రకథ వల్ల జరిగిందని చెప్పారు. చేతితో రాసే ప్రత్రికని కొన్నిరోజులు నడిపారట.

తన 24వ ఏట భాగ్యనగరం వచ్చి, కొంతకాలం పత్రికలలో పనిచేసిన తరువాత, వాటినుంచి బయటకు వచ్చి  సాహిత్య వ్యవసాయం చేస్తున్నారు.   తెలుగులో 208 నృత్య రూపకాలు రాసి ప్రపంచంలో ఏఒక్క రచయితా చెయ్యని ఫీట్‌ని సాధించారు. నూటయాభై కథలు నాలుగు సంపుటాలుగా విడుదలయ్యాయి. మిసెస్ అండర్స్టాండింగ్ అనే కథల పుస్తకం ఆలూమగల మధ్య ఉండవలసిన సరైన కమ్యూనికేషన్ గురించి హస్యస్పోరకంగా చెబుతుంది. పత్రికల  కవర్ పేజీలు, శుభలేఖలు, లోగోలు డిజైన్ చేస్తారు. టీవీ సీరియళ్ళ కథలు, టైటిల్ సాంగ్‌లు రాస్తారు. సవ్యసాచిలాగ ఇవ్వన్నీ చేస్తూనే అడిగిన వారికి కాదనకుండా సహాయం చేస్తారు.

బ్నింగారి కృషికి గుర్తింపుగా ఎన్నో సాంస్కృతిక సంస్థలు అవార్డులతో సత్కరించాయి. ముఖ్యంగా నాలుగు నందులు, కళారత్న(హంస) బహుమతులు వారి ప్రతిభకి పురస్కారాలు. నిండుకుండ తొణకదు అన్నట్టు ఎవరినైనా ఆత్మీయంగా పలకరించే నిగర్వి మూర్తిగారు. కష్టాలు, నష్టాలు ఎన్ని ఎదురైనా ఆత్మవిశ్వాసం సడలకుండా ముదుకు సాగిపోయే వాడే నిజమైన స్పూర్తి ప్రధాత. అటు వంటి మనీషి శ్రీ బ్నిం.  బెంగగా ఉన్నప్పుడు బ్నింని తలచుకొంటే ధైర్యం వస్తుందని తనికెళ్ళభరణి గారు చెప్పడం, బ్నింగారి స్థైర్యానికి ఒక గొప్ప కితాబు.

భమిడిపల్లి నరశింహ మూర్తి (బ్నిం) గారి గురించి రాసేటంత సామర్ధ్యం నాకు లేకపోయినా, స్పూర్తిని రగిలించగల విజయగాధని నా సహచరులకి పంచుదామన్న స్వార్ధంతో ఈ చిన్ని పరిచయాన్ని రాశాను. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.
© Dantuluri Kishore Varma

Wednesday, 28 November 2012

డేల్ కార్నగీ

పెద్దవాళ్ళకి సాయంత్రం క్లాసులు చెప్పినందుకు, రోజుకి రెండు డాలర్ల వేతనాన్ని నిరాకరించిన యూనివర్సిటీ, రోజుకి 30 డాలర్లు ఎందుకు చెల్లించింది? ఆత్మన్యూనతతో, నిరుత్సాహంతో, ఓడిపోతానేమో అనే భయంతో ఆత్మహత్య చేసుకొందామనుకొన్న వ్యక్తి, ఒక విజేతగా ఎలా ఎదిగాడు?

డిగ్రీ పూర్తిచేసిన కొత్త. మాఫ్రెండ్స్ అందరం కలసి నిర్వహించుకొంటున్న ఇండివిడ్యువల్ డెవలప్మెంట్ క్లబ్ (IDC) లో నాతోపాటు సహ మెంబర్ ప్రసాద్ నాయుడు. మాకు ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. అప్పట్లో ఒకసంవత్సరం నాపుట్టినరోజుకి అతను ఇచ్చిన గిఫ్ట్ - ఓ పుస్తకం నేను తీసుకొన్న వాటిల్లో అమూల్యమైంది.

ఆ పుస్తకం రచయిత తన జీవితకథని క్లుప్తంగా అరడజను పేజీలలో రాస్తాడు. తండ్రిది వ్యవసాయం. సిటీకి మూడుమైళ్ళ దూరంలో ఉన్న ఫాం హౌస్‌లో గినీ పిగ్ అనే తోకల్లేని చిన్ని ఎలుకల్లాంటి జంతువులని, ఆవుల్ని పెట్టుకొని ఉంటారు.  అమెరికా మిస్సౌరి (Missouri) రాస్ట్రంలో టీచర్స్ కాలేజీలో చదువుతూ ఫాం హౌస్‌ని కూడా చూసుకోవలసిన బాధ్యత  ఉంటుంది రచయితకి. రాత్రి పన్నెండు గంటల వరకూ చమురుదీపం దగ్గర చదువుకోవడం, తెల్లవారుజామున మూడు గంటలకి లేచి గినీ పిగ్ పిల్లల సంరక్షణ చూడడం.  అందరి విద్యార్థుల్లాగా సిటీ హాస్టల్‌లో ఉండి చదువుకోవడానికి రోజుకి ఒక డాలర్ కట్టలేని ఆర్థిక పరిస్థితి, కురచయిపోయిన ప్యాంట్, బిగుతైన కోటు, మూడుమైళ్ళు ప్రయాణించి కాలేజ్‌కి వెళ్ళడానికి గుర్రం - సాధారణమైన విద్యార్థి చదువు మానెయ్యడాని చెప్పగలిగిన అన్ని సాకులూ ఉన్నాయి. మానకుండా కొనసాగించడానికి అతని దగ్గర పట్టుదల ఉంది. 1936వ సంవత్సరంలో `హౌ టూ విన్ ఫ్రెండ్స్ అండ్ ఇంఫ్లూయన్స్ పీపుల్` అనే అత్యంత ప్రజాధరణ పొందిన పుస్తకం రాసిన `డేల్ కార్నగీ` నే ఆవ్యక్తి.

భారత దేశంలో 1950, 60, 70 లలో(కొoదరికి ఇప్పటికి కూడా)  చదువుకొని  వృద్దిలోకి వచ్చినచాలామంది ఇటువంటి పరిస్థితులు అధిగమించి విజయం సాధించిన వాళ్ళే కనుక, ఈ కథ కొత్తగా అనిపించదు. కానీ, ప్రస్తుతం తాము ఎన్ని కష్టాలు పడయినా పిల్లల్ని చదివించడానికి అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్న తల్లితండ్రులు, పిల్లల్లో నిబద్ధత కనిపించక ఆందోళన చెందడం చాలాచోట్ల చూస్తూనే ఉన్నాం. అలాంటి విద్యార్థులకి కార్నగీ జీవితకథ మార్గనిర్దేశం చెయ్యగలదు.

మాక్లబ్బులో ప్రతీ ఆదివారం వర్తమాన అంశాలమీద డిబేట్ ఉండేది. ఒకవారం ముందుగానే టాపిక్ నిర్ణయించేవారు కనుక,  విషయసేకరణ, విశ్లేషణ చేసుకొని డిబేట్‌లో పాల్గొనే వాళ్ళం. మొదలుపెట్టే సమయంలో ప్రతీసారీ కాళ్ళు వణికినా, క్రమంగా ఆత్మవిశ్వాశం పెరిగి, స్టేజ్ వదలాలంటే మనసు వొప్పుకొనేదికాదు. అప్పటికి ఒక అర్ధశతాబ్ధం ముందే పబ్లిక్ స్పీకింగ్ వల్ల కాన్‌ఫిడెన్స్ పెరిగి, విజయావకాశాలు మెరుగవుతాయని గ్రహించి నిర్మాణాత్మకంగా తన అభివృద్దికి ఉపయోగించుకొన్న ఒక దార్శినికుడు డేల్ కార్నగీ. అతను కాలేజీలో చేరినప్పుడు బాస్కెట్‌బాల్, బేస్‌బాల్‌లు ఆడే క్రీడాకారులకీ; ఎలక్యూషన్, డిబేట్‌లలో గెలిచేవాళ్ళకీ తోటి విద్యార్థులలో మంచి హీరో వర్షిప్ ఉండేది. కార్నగీకి ఆటలో పాల్గొనేటంత శారీరక ధారుడ్యం ఉండేదికాదు. అందుకే ఎలక్యూషన్‌ని ఎంచుకొని అందులో కృషి చెయ్యడం మొదలుపెడతాడు. పోటీ తరువాత పోటీలో వరుసగా అపజయాలు ఎదురవుతుంటే, ఎంతో నిరుత్సాహ పడతాడు. క్రమంగా మొదటి ఏడాది గడిచే సరికి పోటీలలో బహుమతులు గెలుచుకొంటూ, తన జూనియర్లకి పబ్లిక్ స్పీకింగ్ గురించి సలహాలు ఇవ్వగలిగిన సాధికారత సంపాదిస్తాడు.

`ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్` అనే వాఖ్యంయొక్క ఉదాహరణలు మనకి కార్నగీ జీవితంలో కనిపిస్తాయి. జీవితపు ప్రతీ స్టేజిలోనూ పోరాటం ఉంటుంది. చదువు ముగించిన వెంటనే కరస్పాండెన్స్ కోర్సులు అమ్మే ఉద్యోగంలో చేరతాడు. ఏడు సంవత్సరాలు సేల్స్ డిపార్ట్‌మెంట్లో పనిచేసిన నాకుకూడా టార్గెట్స్  పూర్తిచెయ్యకపోతే ఉండే వొత్తడి ఎంతో తెలుసు. `నువ్వు జింకవైతే ప్రాణం కోసం, పులివైతే ఆహారంకోసం పరుగు తియ్యాలి. నువ్వు ఎవరైయినా కూడా పరుగు పెట్టడం తప్పనిసరి అవసరం,` అని ఎక్కడో చదివిన విషయం జ్ఞాపకం వొస్తుంది. నిరంతరం డెడ్‌లైన్స్ గురించి ఆలోచిస్తూ, అందుకోవడానికి పరుగుతీస్తూ...ఎందరో ఈ జనారణ్యంలో!  అనుకొన్న స్థాయిలో అమ్మకాలు జరపలేక, నిస్పృహతో ఆత్మహత్య చేసుకొందామనుకొంటాడు డేల్ కార్నగీ. ఆ ఉద్యోగం నుంచి మాంసం అమ్మే మరొక ఉద్యోగంలో చేరి పట్టుదలతో 25 ప్రాంతాలలో చిట్ట చివర ఉన్న తన టెరిటొరీని అమ్మకాలలో మొదటిస్థానంలో నిలబెడతాడు. దానికి కారణం అతని వాక్చాతుర్యం, మనుష్యులతో నెరపే మంచి సంబంద బాంధవ్యాలు. కంపెనీ సంతోషించి ప్రమోషన్ ఇవ్వజూపుతుంది. కాని, కార్నగీ ఆ ఉద్యోగాన్ని వదిలేస్తాడు. గెలిచి విరమించడం మనం అశోకుడిలో చూస్తాం... అలాగే కార్నగీలోకూడా!

కొంతకాలం నటుడిగా నాటకాలలో నటించి, కొనసాగే అవకాశంలేక న్యూయార్క్ తిరిగి వస్తాడు. ఆర్ధికంగా పూర్తిగా చితికిపోయిన స్థితిలో, వై.యం.సి.ఏ. యూనివర్సిటీలో వ్యాపారస్తులకి, ఉద్యోగులకి, గృహిణులకి... పబ్లిక్ స్పీకింగ్ నేర్పితే ఎలా ఉంటుందనే ఆలోచనతో యాజమాన్యాన్ని సంప్రదిస్తాడు. రోజుకి రెండు డాలర్ల వేతనాన్ని నిరాకరించిన యూనివర్సిటీ, కమీషన్ పద్దతిలో నేర్పే విధానానికి ఆమోదిస్తుంది. ఎవరయినా కోర్సులో చేరి, అది లాభదాయకంగా ఉంటే కార్నగీకి కొంత కమీషన్ చెల్లించ వచ్చు. లేదంటే, యూనివర్సిటీ నష్టపోయేది ఏమీలేదు. అప్పటివరకూ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ ఎక్కడా లేదు. అటువంటప్పుడు కోర్స్ మెటిరియల్ ఎక్కడ దొరుకుతుంది? తన అనుభవాలని రంగరించి, మనుష్యుల మెప్పుపొందే సులువులని తనే ఒక పుస్తకంగా రాస్తాడు. అదే క్రమంగా `హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లూయన్స్ పీపుల్` అయ్యింది. ఈ కోర్సు విపరీతమైన ప్రజాధరణ పొంది, కమీషన్‌గా కార్నగీకి యూనివర్సిటి రోజుకి ముప్పై డాలర్లు చెల్లించవలసి వస్తుంది. అది మొదటిలో అడిగినదానికంటే పదిహేను రెట్లు ఎక్కువ!

ఎన్నో వేలమంది ఈ కోర్స్‌చేసి విజయావకాశాలు మెరుగు పరచుకొన్నారు, ఆ పుస్తకం కొన్ని మిలియన్ కాపీలు అమ్ముడుపోయింది.  డేల్ కార్నగీ రాసిన పుస్తకాల్లాగానే, అతని జీవితంకూడా ఎందరికో మార్గదర్శకమైంది. చేసే పనిలో ఉత్సాహం లేకపోతే గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పిన కార్నగీ పుట్టిందీ, చనిపోయిందీ నవంబర్ నెలలోనే (November 24, 1888 - November 1, 1955).  అందుకే నన్ను బాగా ఇన్స్పయర్ చేసిన మహానీయుల్లో ఒకరైన కార్నగీ గురించి ఈ టపా ఈ నెలలో.

© Dantuluri Kishore Varma 

Monday, 3 September 2012

సేవే మార్గం - సంకురాత్రి చంద్రశేఖర్

ఒకసారి ఒక మహిళ దు:ఖిస్తూ గౌతమ బుధ్ధుడి దగ్గరకి వచ్చి, మరణించిన తన కొడుకుని బ్రతికించమని వేడుకొందట.అప్పుడు బుద్దుడు ఆమెని ఆవూరిలో మరణం సంభవించని ఏదైనా ఇంటినుంచి ఒక గుప్పెడు నువ్వులు తీసుకొనివస్తే ఆ కుర్రవాడిని బ్రతికిస్తానని వాగ్దానం చేస్తాడు. ఆమె రోజంతా ఇంటింటికీ తిరిగి సాయంత్రానికి ఒట్టి చేతులతో తిరిగివస్తుంది. మరణంలేని ఇల్లులేదు. పునరపి జననం, పునరపి మరణం అంటారు- పుట్టినవారు గిట్టక తప్పదు; ఆప్తులకి విషాదమూ తప్పదు.  

కానీ, జ్ఞాపకాల స్పూర్తినుంచి సామ్రాజ్యాలు నిర్మించగలగడం కేవలం డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ లాంటి అరుదైన స్థిత ప్రజ్ఞులకిమాత్రమే సాధ్యం అవుతుంది. 



ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఎస్.సి. జుయాలజీ పూర్తిచేసి, కెనడాలో పి.హెచ్.డి.చేసి, అక్కడే శాస్త్రవేత్తగా పనిచేస్తున్న చంద్రశేఖర్ గారు కాకినాడ అమ్మాయి  మంజరిని వివాహం చేసుకొన్నారు. వారికి ఇద్దరు సంతానం - శ్రీకిరణ్, శారద. జీవితం కమ్మగా సాగే పాటే కానీ...


1985లో కెనడా నుంచి ఇండియా వస్తున్న ఎయిర్ ఇండియా విమానం కనిష్క ఖలిస్తాన్ తీవ్రవాదుల విద్రోహచర్య కారణంగా అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయింది. దానిలో ప్రయాణిస్తున్న 329 మంది ప్రయాణికుల్లో దురదృష్టవశాత్తూ శ్రీమతి మంజరీ, శ్రీకిరణ్ మరియూ శారదా కూడాఉన్నారు. అఖాతంలాంటి విషాదం. విధి కుట్రచేసి తనని ఈ ప్రపంచంలో ఒంటరిని చేసిందేమో! 
'పేదరికంలేని, ఆరోగ్యవంతమైన విద్యావంతుల సమాజం ఉంటే ఎంతబాగుంటుంది!' అనే శ్రీమతి మంజరి కల నిజంచేయడానికి మంజరి సంకురాత్రి మెమోరియల్ ఫౌండేషన్ స్థాపించి ఒక నిస్వార్ధ సేవా సామ్రాజ్యాన్ని కాకినాడకి దగ్గరలో అచ్చంపేటలో నిర్వహిస్తున్నారు డాక్టర్ చంద్రశేఖర్. కుమారుడు శ్రీకిరణ్ జనావళి కంటి కిరణంకావాలి; కుమార్తె శారద చిట్టి చెళ్ళెళ్ళ, చిన్ని తమ్ముళ్ళ నాలుకల మీద బీజాక్షరం కావాలి. అందుకే - అత్యాధునికమైన శ్రీకిరణ్ కంటి ఆసుపత్రీ, నిబద్దత అడుగడుగునా కనిపించే చదువులమ్మ బడి శారదావిద్యాలయమూ.  
శ్రీ కిరణ్ కంటి హాస్పిటల్ ద్వారా 1,53,000 కంటి ఆపరేషన్లు చేశారు. వీటిలో సుమారు తొంబై శాతం ఉచితం. గ్రామీణప్రాంతాలలో, పట్టణాలలో తమవద్దకు రాలేని అభాగ్యులకు `ఔట్ రీచ్` కార్యక్రమం ద్వారా కంటి వైద్య శిబిరాలు నిర్వహించి, శస్త్రచికిత్స అవసరం అయినవారిని గుర్తించి, ఫౌండేషన్ బస్సులలో హాస్పిటల్కి తరలించి, ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నరు. మందులు, కళ్ళజోళ్ళు కూడా ఉచితం. అత్యుత్తమమైన డాక్టర్లు, ఆధునికమైన పరికరాలు, పరిశుబ్రమైన చక్కటి గదులు, సేవాభావం అణువణువునా నింపుకొన్న సిబ్బంది.
 తూర్పుగోదావరిలో ఇప్పటివరకు నిర్వహించిన ఐ క్యాంపులు
ఇక శారదా విద్యాలయం విషయానికి వస్తే; దీనిని 1992లో ప్రారంభించారు. చదువు`కొన`లేని నిరుపేదలకి ఉచితవిద్య అందించడమే లక్ష్యం. యూనీఫాం, బుక్స్, ట్రాన్సుపోర్ట్ సౌకర్యాలు కలుగజేసి ఆశ్రమంలాంటి పరిసరాలలో విద్యాబుద్దులు నేర్పిస్తున్నారు.
సాయంత్రం నాలుగు గంటలసమయంలో కూడా పరిశుబ్రమైన స్కూల్ డ్రేస్సులో మెడిటేషన్ చేస్తూనో, డ్రిల్ చేస్తూనో, క్రాఫ్ట్ క్లాసులో చక్కనిబొమ్మ తయారుచేస్తూనో, ముత్యాల్లాంటి చేతివ్రాతతో నోట్ బుక్కులో ఏదో వ్రాస్తూనో విద్యార్దులు చక్కటి క్రమశిక్షణకి మారుపేరుగా కనిపిస్తారు.క్లాసురూంకి పది నుంచి పదిహేనుకి మించని విద్యార్ధులు. లైబ్రరీ, సైన్సు లేబ్, కంప్యూటర్ లేబ్, క్రాఫ్ట్ రూం, ఫైన్ ఆర్ట్ రూం, ప్లే గ్రౌండ్. ఇక్కడి చదువు ఒక యోగం.శారదా విద్యాలయంలో పదవతరగతి పూర్తిచేసుకొన్న తరువాత విద్యార్ధులు ఒకేషనల్ ట్రయినింగ్ కూడా పొందవచ్చు.
"సార్ (డాక్టర్ చంద్ర) ప్రతిరోజూ ఒకక్లాస్ చెబుతారు. హేండ్ రైటింగ్ నేర్పించేటప్పుడు తనే స్వయంగా విద్యార్ధుల పుస్తకాలలో గీతలు గీస్తారు. మేము చేస్తామన్నా ఆయన ఒప్పుకోరు," అని ఒక టీచర ఆయన గురించి చెబుతున్నప్పుడు లీడర్ అంటే ఏమిటో మనకి అర్ధం అవుతుంది.  

ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆపన్నులను ఆదుకోవడానికి స్పందన అనే సేవాకార్యక్రమం కూడా సంకురాత్రీ ఫౌండేషన్ నిర్వహిస్తుంది.విశ్వవ్యాప్తమైన ప్రేమ, నిస్వార్దమైన సేవలకు మారుపేరు డాక్టర్ చంద్రశేఖర్. రిలయన్స్ రియల్ హీరోస్ ఆఫ్ ఇండియా లాంటి అవార్డులెన్నో ఆయనని వెతుక్కోంటూ వచ్చాయి.
సంకురాత్రీ ఫౌండేషన్ ద్వారా అన్నో మంచి పనులు జరుగుతున్నాయి. వాలంటిరుగా మనమూ వాటిలో పాలుపంచుకోవచ్చు; డొనేషన్ల రుపంలో `నేనుసైతం` అని ఆపన్నులకు అభయహస్తం అందించవచ్చు. లేదా సేవే శాశ్వత సత్యం అని మార్గనిర్దేశం చేస్తున్న మహానీయులనుంచి స్పూర్తి పొందవచ్చు. 
 డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ గారితో నేను. 
 © Dantuluri Kishore Varma

Friday, 10 August 2012

`మహర్షి` బులుసు సాంబమూర్తి

స్వాతంత్ర్య సమర యోధుడు బులుసు సాంబమూర్తిని `మహర్షి` అని వ్యవహరించడంలోనే ఆయన వ్యక్తిత్వం వ్యక్తమౌతుంది. 1923లో కాకినాడలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభలు జరిగినప్పుడు వాటి నిర్వాహణా బాధ్యతని సాంబమూర్తి గారికి అప్పగించారు. అంతకు కొన్నిరోజుల ముందు ఆయన ఏకైక కుమారుడు మరణించినా చలించకుండా తన కర్తవ్య నిర్వాహణ చేశారు. ఈ సందర్భంలో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ "తన కన్నిటిని ముత్యాలుగా మార్చి ఈ సభలకు విచ్చేసిన నాయకులను ఆహ్వానించారని" చెప్పారట.

మనకి పూర్ణ స్వరాజ్యం కావాలని 1923 సభలలోనే సాంబమూర్తిగారు ప్రతిపాదించినా, అప్పటి నాయకులు దానికి అంగీకరించలేదని చెబుతారు. ఎట్టకేలకు 1929లో లాహోర్ కాంగ్రెస్ సభల సమయంలో పూర్ణస్వరాజ్య ప్రతిపాదన జరిగింది. 1930 ఉప్పుసత్యాగ్రహ సమయంలో తన సహచరులతో చొల్లంగి సముద్రతీరానికి వెళ్ళి ఉప్పును తయారుచేశారు. కోస్తాతీరం ప్రజలు ఈ సంఘటనవల్ల చాలా ప్రభావితులయ్యారు. అప్పటిలో సాంబమూర్తిగారిని అరెస్టుచేసి వెల్లూరు జైలుకి తరలించారు. 1935లో మద్రాసు ప్రోవిన్షియల్ ఎస్సెంబ్లీకి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంసాదించినప్పుడు, సీ.రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా ప్రభుత్యాన్ని ఏర్పాటుచేశారు. సాంబమూర్తిగారు 1937 నుంచి 1942 వరకూ స్పీకరుగా ఉన్నారు. 
 స్పీకరుగా
మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చినతరువాతకూడా ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం జరిగిన పొరాటంలో ముఖ్యపాత్ర పోషించారు. ఇంతటి విశేష వ్యక్తిత్వం గల ఈయన తూర్పుగోదావరి జిల్లాలో దుళ్ళ గ్రామంలో బ్రాహ్మణ వేదపండితుల ఇంటిలో జన్మించారు(1886).విజయనగరంలో మహారాజా కాలేజీలో పట్టబద్రులై, అక్కడే కొంతకాలం అధ్యాపకుడిగా ఉన్నారు. తరువాత కాకినాడలో క్రిమినల్ లాయరుగా మంచిపేరు గడించారు. ఇక్కడే స్థిరపడ్డారు.

విచారించవలసిన విషయం ఏమిటంటే, తనచివరిరోజులు పేదరికంలో, అనారోగ్యంతో గడిపి, ప్రభుత్వం చేత నిర్లక్ష్యం చేయబడి 1958వ సంవత్సరంలో మరణించారు.
            2008లో పోస్టల్ డిపార్టుమెంట్ విడుదల చేసిన మహర్షి బులుసు సాంబమూర్తి పోస్టల్ స్టాంపు

© Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!