బ్లాగ్‌లో వ్రాయడం బాగా తగ్గించేశాను. కనుక గూగుల్ సెర్చ్‌లో దొరికితే తప్పించి, నేరుగా బ్లాగ్‌కి వచ్చి చదివేసే పాఠకులు ఎవరూ ఉండరు. పేజ్‌వ్యూస్ రోజుకి మహా ఉంటే పదుల సంఖ్యలో ఉండాలి. కానీ గత కొన్ని రోజులుగా కొంచం అటూ ఇటూగా రోజుకి వెయ్యి ఉంటున్నాయి. సింగపూర్ నుంచి, యూఎస్ నుంచి, యూకేనుంచి వందలకొద్దీ వచ్చేసి చదువేటంత సెన్సేషన్ ఏముంది కనుక ఇక్కడ? ఐ థింక్ దేర్ మస్ట్ బి సంథింగ్ అన్‌కామన్ బీయింగ్ కుక్డ్ అప్ హియర్! ఎవరో సరిగా గుర్తులేదు కానీ ఓ బ్లాగర్ మిత్రుడు ఇటువంటి విషయాన్నే ప్రస్తావించారు. ఎవరైనా ఏమిజరుగుతూ ఉండవచ్చో చెప్పగలరా?
Showing posts with label బ్లాగింగ్. Show all posts
Showing posts with label బ్లాగింగ్. Show all posts
Friday, 22 November 2019
Thursday, 31 December 2015
అందరూ ఎలా ఉన్నారు?
మరికొన్ని గంటల్లో పాత సంవత్సరం కాలగర్భంలో కలిసిపోతుంది
గతంలో జరిగిన మంచి సంఘటనలు మధుర జ్ఞాపకాలు అవుతాయి.
అపజయాలు భవిష్యత్తులో నిర్మించబోయే విజయసౌధాలకి పునాదులౌతాయి.
కొత్త ప్రణాళికలు వ్రాసుకోవడానికి ఆలోచననలకి పదునుపెట్టుకోండి
విజయాలబాటలో తరువాత మజిలీని చేరడానికి శక్తిని సమాయత్తం చేసుకోండి
`రేపటిమనం`, `ఈరోజుమనం` కంటే మరింత బాగుండాలని కోరుకోండి
అదిగదిగో 2016 వస్తున్న అడుగుల చప్పుడు వినిపిస్తుంది...
తలుపు తీసే ముందు ఆత్మీయ పలకరింపుల దరహాసాల్ని ముఖానికి పులుముకోండి
చేయిసాచి శుభాకాంక్షల్ని అందిస్తే పోయిందేముంది డూడ్స్?
మహా అయితే మరింతమందికి మిత్రులమౌతాం!
అందరికీ నూతనసంవత్సర శుభాకాంక్షలు
© Dantuluri Kishore Varma
Monday, 24 November 2014
గిఫ్ట్‌వోచరు కథ
గిఫ్ట్ వోచర్లు కావలసినన్ని కష్టాలు పెట్టగలవని నాకు మొన్నటిదాకా తెలియలేదు.
సంవత్సరం క్రితం ఇండిబ్లాగర్ వాడు పెట్టిన బ్లాగింగ్ పోటీలో నేను రాసిన ఓ టపాకి వెయ్యిరూపాయల గిఫ్ట్ వోచరు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆ డబ్బులతో కావలసినవన్నీ కొనుక్కొని పండగ చేసుకొమ్మని సెలవిచ్చాడు. కొనుక్కోవడానికి వాడిచ్చిన కోడ్, పిన్ నెంబరూ ఇన్‌బాక్స్‌లోనే ఉన్నాయి కనుక `ఇప్పుడే తొందరేముందిలే ఇంకా ఏడాది సమయం ఉంది కదా?` అనుకొన్నాను. తీరా చూస్తే వోచరు ఎక్స్‌పయరీ డేటు అయిపోతుంది అనగా అకస్మాత్తుగా ఈ విషయం జ్ఞాపక వచ్చింది. పిల్లలు ఇద్దరికీ ఓ గేమూ, ఇల్లాలికి ఓ క్రోకరీ ఐటమూ ఎంచుకొని `బై నౌ` ని నొక్కితే, `యూ కెనాట్ బై ఫ్రం మల్టిపుల్ సెల్లర్స్` అనే మెసేజ్ ముఖంమీద కొట్టింది. `ఫ్లిప్‌కార్ట్ అంటే రకరకాల సెల్లర్లు వస్తువులు అమ్మే ఎక్జిబిషన్ లాంటిది అని జ్ఞానోదయం కలిగించుకొని మరో దండయాత్ర మొదలు పెట్టాను.
ఈసారి డెలివరీ చార్జెస్‌తో కలిపి వెయ్యిదాటని ఒకే ఒక వస్తువుని ఎంచుకొని `బై నౌ` అన్నాను. `డబల్యుఎస్ రిటైల్ వాడు అమ్మే వస్తువులు తప్ప ఈ వోచరుతో మరేమీ కొనుక్కో లేవు,` అని మెసేజ్ కొట్టాడు. పట్టువదలని విక్రమార్కుడిలా చెట్టెక్కిన బేతాళుడిని దించడానికి మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టా. `మనదేముంది ఇంకా మూడవ సారే కదా? గజనీ పదిహేడు సార్లు దండెత్తలేదా మనదేశం మీద?` అని నన్ను నేనే వోదార్చుకొని డబల్యూఎస్ రిటైల్‌వాడు అమ్మే వస్తువులు ఏమున్నాయో వెతకడం మొదలు పెట్టాను. వచ్చిన ఫలితాలు చూసి మతిపోయింది. అవి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఒక్కొక్కటీ ఏడు నుంచి తొమ్మిది వందలు ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్ కవర్లు! వాటి క్రింద `ఇవి తప్ప ఇంకేమీ లేవు. నచ్చితే కొనుక్కో, లేదంటే నీ దిక్కున్న చోట చెప్పుకో,` అని కొట్టినట్టు చెప్పే `నో మోర్ రిజల్ట్స్ టు షో,` కనిపించింది. `గుర్రం లేనోడికి, నాడాతో పనేమిటిరా పింజారీ వెధవా!` అని తిట్టుకొని; `ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే తెలిస్తే ఈ కవర్లకి సరిపోయే స్మార్ట్‌ఫోను కొనుక్కొని తయారుగా ఉందును కదా!` అని ఆక్రోశించాను.
`ఈ కష్టం నాకేనా? లేదంటే ఇంకొందరు బాధితులు ఉన్నారా?` అని ఇండిబ్లాగర్‌లో చుస్తే నావి రెండు వోచర్లు పోయాయని ఒకరు, నావి పదిహేనువందలు హుష్‌కాకి అని ఇంకొకరు...కుయ్యో మొర్రో మంటూ చాలా మంది తగిలారు. `కొంచెం తుత్తిగా ఉంది,` అనుకొని ఆరోజుకి ప్రయత్నం విరమించాను.
తరువాత కొంచెం ఖాళీ చూసుకొని ఫ్లిప్‌కార్ట్‌లో ఒక్కో వస్తువూ వెతుకుతూ పోతుంటే, డబల్యూఎస్ రిటైల్ వాడు పెన్‌డ్రైవ్‌లు కూడా అమ్ముతాడని తెలిసింది. `ఫోన్‌కవర్ల కంటే ఇవే కొంచెం నయం,` అనుకొని అవసరం ఉన్నా, లేకపోయినా గిఫ్ట్‌వోచర్‌ని నిరుపయోగం చెయ్యడం ఇష్టం లేక ఓ రెండు 16జిబీ పెన్‌డ్రైవ్‌లు పంపమని ఆర్డరేశా. ఇంకొంచెం సేపు వెతికితే డబల్యూఎస్ రిటైల్ వాడు అమ్మే చేతన్‌భగత్ రాసిన హాఫ్‌గాల్‌ఫ్రెండ్, ప్రీతీ షెనాయ్ రాసిన లైఫ్ ఈస్ వాట్ యూ మేక్ ఇట్ పుస్తకాలు కూడా దొరికాయి. ఇచ్చింది కండీషనల్ వోచర్ అన్న సంగతి తెలియదు. వెతుక్కోవడం కొంచెం ఇబ్బందే కానీ, వస్తువులన్నీ బాగానే ఉన్నాయి. కొన్న వస్తువులని కూడా జాగ్రత్తగానే పంపించాడు. గిఫ్ట్‌వోచరు కథ అలా ముగిసింది.
వెతుక్కొనే ఓపికలేక వోచరు డబ్బుపోగొట్టుకొన్న వాళ్ళు ఇంకా ఇండిబ్లాగర్‌లో, గూగుల్‌లో గొంతుచించుకొంటూనే ఉన్నారు.
© Dantuluri Kishore Varma
Sunday, 9 November 2014
యాదృచ్ఛికమా!?
ఆంధ్రభూమిలో `ఈ వారం కథ` అనే శీర్షికతో ప్రతీవారం ఒక్కో కథ వేస్తారు. ఈ రోజు వాటి ఆర్కైవ్స్ చూస్తూవుండగా `ముష్టివాడి నవ్వు` అనే పేరుతో ఉన్న కథ నాలో ఏవో జ్ఞాపకాలు కదిలించింది. జ్ఞాపకాలు అన్నాను కదా అని ఏవో సీరియస్ ఫ్లాష్‌బ్యాక్‌లు చెప్పి తల బొప్పిక కట్టిస్తానేమో అని భయపడకండి. ఒక విషయాన్ని మీతో క్లుప్తంగా చెబుదామని ఇది రాస్తున్నాను. ఈ కథ టైటిల్ నన్ను ఆకర్షించడానికి కారణం `అదే నవ్వు` అనే పేరుతో ఈ బ్లాగ్‌లో నేను ఒక కథ రాసి ఉండడమే! `ఈ రెండు పేర్లలో సారూప్యం ఉన్నట్టే, కథల్లో కూడా పోలికలు ఉండివుంటాయా?` అనే కుతూహలంతో దాన్ని చదివాను.
`ముష్టివాడి నవ్వు` అనే కథని ఇక్కడ చదవండి. ప్రచురించిన తేదీ 27.09.2014.
`అదే నవ్వు` కథ - పై తేదీకి సుమారు 17 నెలల ముందు నేను రాసింది.
చిత్రంగా రెండింటిలోనూ స్టోరీ లైన్ ఒక్కటే! - ఒక ముసలివాడి/ముష్టివాడి నవ్వుని చూసి చీదరించుకొనే వ్యక్తిని ఒక ప్రాణాపాయం నుంచి వాడే రక్షించడం.
యాదృచ్ఛికమా!?
Dantuluri Kishore Varma
వ్యాఖ్యల్లో లింక్
బ్లాగర్‌లో టపాలు రాసేటప్పుడు మధ్యమధ్యలో పదాలనుంచి, ఫోటోలనుంచి వేరే వెబ్‌సైట్లకి, వీడియోలకి హైపర్‌లింక్‌లు కలపడం సులభం. కానీ కామెంట్లలో ఆవిధంగా లింక్ ఇవ్వడం ఎలానో తెలిసేది కాదు. చాలా సార్లు రెఫరెన్స్ ఇవ్వడంకోసం కొంతమంది సంబంధిత విషయం యొక్క యూ.ఆర్.ఎల్ ని కామెంట్లలో యధాతదంగా ఇస్తుంటారు. దాని నుంచి బ్యాక్‌లింక్ వెళ్ళదు. కాబట్టి కాపీ చేసుకొని క్రొత్త ట్యాబ్‌లో పేస్ట్‌చేసి వివరం చూడవలసిందే. సహజంగానే ఇది కొంత చికాకు కలిగించే విషయం. ఈ తలనొప్పి లేకుండా టపాల్లో ఇచ్చినట్టు, వ్యాఖ్యల దగ్గర కూడా బ్లాగర్‌వాడు పదాలకు లింక్ కలపగలిగిన తేలికపాటి ఇంటర్‌ఫేస్‌ని ఏర్పాటు చేసుంటే బాగుండునని అనిపించేది. మనతెలుగు బ్లాగర్లలో కొంతమంది కామెంట్లలో హైపెర్‌లింకులు ఇవ్వడం చూసినప్పుడు `ఎలా చేశారా?` అనుకొన్నాను. వాళ్ళు ఉపయోగించిన హెచ్‌టి్ఎంఎల్ కోడ్ ఏమిటో తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. వాళ్ళనే అడుగుదామనుకొన్నాను - అప్పుడు సందర్భం రాలేదు. కానీ, ఈ రోజు తెలుసుకోవలసిన అవసరం వచ్చింది.
`అడుగడుగునా గుడివుంది` అనే శీర్షికతో చాలా టపాలు రాసి, అన్నింటినీ చేర్చి మనకాకినాడలో బ్లాగ్‌లో ఒక పేజీగా ఏర్పాటు చేశాను. బ్లాగ్ పాఠకుల్లో ఒకరిద్దరు మురమళ్ళ వీరేశ్వరస్వామి దేవాలయం గురించి కూడా రాయమని, అవసరం అయితే ఫోటోగ్రాఫులు అవీ పంపుతామని కామెంట్‌ల ద్వారా తెలియజేశారు. అదెప్పుడో ఓ సంవత్సరం క్రితం జరిగింది. ఈ మధ్య మురమళ్ళ మీదుగా అమలాపురం వెళుతూ వీరేశ్వరస్వామి దర్శనం చేసుకొని, తిరిగి వచ్చిన తరువాత ఈ దేవాలయం గురించి టపా రాశాను. రాశానని వాళ్ళకు తెలియజేస్తూ కామెంట్‌లో టపాకి బ్యాక్‌లింక్ ఇవ్వాలి. అదీ అవసరం! దీనికోసం గూగుల్లో వెతికితే పరిష్కారం దొరికింది. మీకు కూడా ఏమైనా ఉపయోగ పడుతుందేమో అని ఇక్కడ ఇస్తున్నాను.
<a href="http://manakakinadalo.blogspot.in/2014/10/mummidivaram.html">Here</a>
పైన వీరేశ్వరస్వామి టపా యొక్క యూఆర్ఎల్ లింక్ ని Here అనే మాటకి కలపాలి. ఈ కోడ్ చక్కగా పనిచేసింది. కావాలసినప్పుడు మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. చేయవలసిందల్లా ఎరుపు రంగులో ఉన్నయూఆర్ఎల్‌నీ, Here అనే మాటనీ మీకు కావలసిన వాటితో రీప్లేస్ చేసుకోవడమే.
మీలో చాలామందికి ఎప్పటినుంచో ఈ విషయం తెలిసి ఉండవచ్చు. నాలా ఇప్పటివరకూ తెలియని వాళ్ళు ఉండవచ్చు కదా! అందుకే....
మీలో చాలామందికి ఎప్పటినుంచో ఈ విషయం తెలిసి ఉండవచ్చు. నాలా ఇప్పటివరకూ తెలియని వాళ్ళు ఉండవచ్చు కదా! అందుకే....
* * *
బ్లాగ్‌వ్యూస్‌ని ఎప్పటికప్పుడు తెలియజేసే డిజిటల్ స్టాట్ కౌంటర్లో అప్పుడప్పుడూ కనిపించే ఫ్యాన్సీ నెంబర్లు బాగుంటాయి. ఈ రోజు నా బ్లాగ్ మంచి నెంబర్‌ని చూపించింది :) ఇదిగో ఇలా... 202020
హ్యాపీ బ్లాగింగ్!
© Dantuluri Kishore Varma
Sunday, 27 April 2014
పద్నాలుగున్నర లక్షల వ్యూస్!
దిమ్మతిరిగిపోయింది లాంటి టైటిల్ పెట్టొచ్చో లేదో తెలియదు కానీ, నిజంగా జరిగింది అదే! చాలామందికి ఉన్నట్టే నాకు కూడా ఒక గూగుల్‌ప్లస్ ప్రొఫైల్ (link) ఉంది. బ్లాగ్‌లో రాసిన ప్రతీ పోస్ట్‌ని అక్కడ షేర్ చెయ్యడం మినహా ఈ సోషల్ నెట్‌వర్క్‌ని నేను ఉపయోగించడం తక్కువ. అహా.. అయిష్టం కాదండి, ఎలా ఉపయోగించాలో పూర్తిగా అవగాహన లేదు. ఇప్పుడే ఒక అశ్చర్యకరమైన విషయం నా కంటపడింది. ఒకరి గూగుల్ ప్లస్ ప్రొఫైల్ చూస్తుంటే - వారికి ఉన్న ఫాలోవర్స్, ప్రొఫైల్ వ్యూస్ మీద నా దృష్టి పడింది. ఇప్పటి వరకూ వాటిని నేను పెద్దగా గమనించలేదు. అది చూశాకా, `నాకు ఎన్ని ప్రొఫైల్ వ్యూస్ ఉండి ఉంటాయ్?` అనిపించి, ఓ లుక్కేసేసరికి నిజంగానే దిమ్మతిరిగిపోయింది - 14,39,200! ఏదో పొరపాటు జరిగి ఉంటుందనిపించింది. మార్క్ జుకెంబెర్గ్‌కి ఎన్ని వ్యూస్ ఉన్నాయో పరిశీలిస్తే 16,39,500 ఉన్నాయి. ఆయన ఫాలోవర్సేమో ఆరున్నర లక్షలమంది. నా ఫాలోవర్స్ మాత్రం 29 మంది. లక్షల్లో, ఆ మాటకొస్తే కోట్లలో కూడా వ్యూస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉండవచ్చు... కానీ, కొంచెం ఎక్జైటింగ్‌గా ఉంది! `తూచ్! అన్నిలేవు,` అని గూగుల్‌వాడు రేపెప్పుడైనా వాటిని వెనక్కి తీసేసుకొంటాడేమో అని భయంగా కూడా ఉంది!
© Dantuluri Kishore Varma
Thursday, 16 January 2014
ఇలాంటి బ్లాగ్ఎక్స్‌ప్రెస్ మనవాళ్ళు కూడా పెడితే బాగుంటుంది కదా?
కేరళా టూరిజం డెవలప్‌మెంట్ వాళ్ళ దగ్గరనుంచి మనవాళ్ళు నేర్చుకోవలసింది చాలా ఉంది. వాళ్ళు తమ రాష్ట్రంలో చూడచక్కని బీచ్‌లని, దేవాలయాలని, ప్రకృతి అందాలని, సంస్కృతీ సంప్రదాయాలని, వైద్యవిధానాలనీ చక్కగా ప్రమోట్ చేసుకొంటారు. రాష్ట్రాన్ని `గాడ్స్ ఓన్ కంట్రీ` అని పిలుచుకొంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులని ఆకర్షిస్తున్నారు. ఈ మధ్యనే కేరళాబ్లాగ్ఎక్స్‌ప్రెస్(బ్లాగ్ఎక్స్‌ప్రెస్ గురించి, కేరళా గురించి సమాచారం ఈ లింక్‌లో దొరుకుతుంది) అనే విన్నూత్న ప్రోగ్రాంని డిజైన్ చేశారు. అంతర్జాతీయంగా పాతికమంది ట్రావెల్ బ్లాగర్స్‌ని ఎంపికచేసి పదిహేనురోజులపాటు రాష్ట్రమంతా తిప్పుతారు. వాళ్ళని రోడ్డు మార్గం ద్వారా లగ్జరీ బస్సులో మంచి మంచి ప్రదేశాలన్నీ తిప్పి, బస, భోజన ఏర్పాట్లు చేసి, వాళ్ళు తమ తమ సోషల్ మీడియా ఎకౌంట్లద్వారా, బ్లాగులద్వారా ఎప్పటికప్పుడు స్టేటస్ అప్డేట్‌లు చేసుకోవడానికి, బ్లాగ్‌పోస్టులు ఫొటోలతో సహా రాయడానికి వైఫై సౌకర్యం కలుగజేస్తారు. ఇలా చెయ్యడం ద్వారా కేరళా టూరిజం వాళ్ళకి అయ్యే ఖర్చు, దాని ద్వారా వాళ్ళకి వచ్చే ప్రచారం తత్ఫలితంగా పెరిగే పర్యాటకుల సంఖ్య, వారినుంచి వచ్చే ఆదాయం లెక్కవేసుకొంటే ఎంత విజ్ఞతతో ప్రచారం చేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది.
మనరాష్ట్రంలో కేరళాకి ఏమాత్రం తగ్గని అందాలు ఉన్నాయి. కోనసీమలో పచ్చనిపొలాల మధ్య ఫోటోలు తీస్తే అవి కేరళాలో తీసినవో, మనరాష్ట్రంలో తీసినవో తెలుసుకోవడం కష్టం. అలాగే మనపురాతన దేవాలయాలు, కోటలు, సముద్రతీరప్రాంతాలు, ఏజన్సీ, చారిత్రక కట్టడాలు, మన సంస్కృతి అన్నీ గర్వంగా ప్రపంచానికి చూపించవలసినవే. కానీ ప్రచారం జరగడం లేదు. టూరిజం ఆఫీసులో ఓ పేకేజ్ టూర్‌గురించి వాకబు చేస్తే కళ్ళుతిరిగే రేట్లు చెప్పారు. `ఇంతఎక్కువా?` అనకుండా ఉండలేకపోయాను. నాతోపాటూ రిసెప్షన్ డెస్క్ దగ్గర ఉన్న ఒకాయన అన్నమాటలు, `మనవాళ్ళు టూరిజాన్ని మునిసిపాలిటీ ఆవులా చూస్తారు. ఖర్చు లేకుండా రోజంతా అది రోడ్లమీద దొరికే చెత్తా చెదారం తింటే, సాయంత్రం పాలు పితుక్కోవచ్చు.`
పన్నెండు సంవత్సరాలక్రితం అరకు దగ్గర ఉన్న చాపురాయి అనే ప్రాంతం చూశాను. చాలా అందంగా ఉంది. కొన్నిరోజుల క్రితం మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు సంరక్షణలేక పాడు పడిపోయినట్టు ఉన్న కట్టడాలు, ఎండిపోయిన మొక్కలు, చెత్త పేరుకొని పోయిన పరిసరాలు చూసి అనవసరంగా ఈ ప్రదేశానికి వచ్చాం అనిపించింది. ఎంట్రన్స్ దగ్గరమాత్రం టిక్కెట్లు యదాతదంగా అమ్మేస్తున్నారు!
© Dantuluri Kishore Varma
Monday, 13 January 2014
కాపీ క్యాట్స్
మీకు అనుభవంలోకి వచ్చిందో లేదో తెలియదు కానీ కాపీ క్యాట్స్ సమస్య ఎక్కువైపోయింది. ఫేస్‌బుక్కులో, బ్లాగుల్లో వీళ్ళు పెద్ద మనుషుల్లా చలామణీ అయిపోతూ ఎడాపెడా కాపీ చేసేస్తూ ఉంటారు. షేర్ అనే ఆప్షన్ ఉన్నా ఈ మట్టిబుర్రల మహాశయులకి ఇంగితజ్ఞానం ఉండదు. ఏదయినా నచ్చితే చక్కగా షేర్ చేసి ఆనందించవచ్చు. కానీ అలా చెయ్యరు. సాగరసంబరాలు మొదలయ్యాయని ఒక ఫోటోని నా వాటర్‌మార్క్‌తో సహా అప్‌లోడ్ చేస్తే, ఓ మావూరిమొనగాడు చక్కగా నాపేరు చెరిపేసి చేతివాటం ప్రదర్శించాడు. `ఏమయ్యా, ఇలాచేశావు?` అని మెసేజ్ పెడితే, అమాయకంగా `నా ఉద్దేశ్యం కాకినాడ అందాలని నలుగురికీ పంచుదామనే!` అని చిలకలా పలికాడు. `మరి వాటర్ మార్క్‌ని చెరిపెయ్యడం ఎందుకు?` అంటే, సమాధానం లేదు.
![]() |
| Google image |
మనరాష్ట్రం అంతా తెలిసిన ఒక మహానుభావుడి పేరుమీద ఒక ఫేస్‌బుక్ గ్రూప్ నడుపుతున్న పెద్దాయన మనకాకినాడలో బ్లాగ్‌నుంచి దేవాలయాల సమాచారం అక్షరానికి అక్షరం కాపీ చేసి గ్రూప్‌లో తనపేరుమీద పోస్టుచేసుకొన్నాడు. చూసి మతిపోయింది. సంవత్సరం పాటు ఒక్కో టపా రాస్తే, అయిదు నిమిషాలలో కాపీ-పేస్ట్ చేసి పాడేశాడు. `ఏ పేరు మీదయితే గ్రూప్ నడుపుతున్నావో, ఆయన దొంగతనం చెయ్యద్దు, అబద్దం ఆడద్దు అని చెప్పిన కొటేషన్లు చక్కగా అందరికీ పంచుతావు కదా? మరి ఇదేం పని?` అని నిలిదీస్తే అదే సమాధానం `మంచిని నలుగురికీ పంచుతున్నాను,` అని. పాటలపల్లకిలో అనే శీర్షికతో కొన్నిటపాలు రాస్తే ఓ అరవై్ఏళ్ళ గౌరవనీయుడు ఇలానే చేశారు.
ఫేసుబుక్కుల్లోంచి ఈ దొంగతనాలు బ్లాగ్‌స్పియర్ లోకి ప్రవేశించాయి ఇప్పుడు. మావూరి పేరుమీద తియ్యని పేరుపెట్టుకొన్న ఒక బ్లాగర్ వరుసగా పోస్టులు పెడుతున్నరు. ఇక్కడ గంగిరెద్దుల పోస్టు ఉందనుకోండి - తరువాత రోజు అక్కడ ఉంటుంది; హరిదాసు ఉంటే - అదీ ఉంటుంది; సాగర సంబరాలుంటే - డిటో. ఎవరయినా వీటిగురించి రాయవచ్చు. కానీ, ఇక్కడ పోస్ట్ చేసిన వెంటనే అక్కడ వస్తుందంటే ఏమనుకోవాలి?
ఆలోచించడం రాకపోతే మత్తుగా పడుకోవాలి కానీ దొంగతనాలకి బయలుదేరతారా ఎవరయినా?
ఇలాంటి కంప్లైంట్స్‌తో కూడుకొన్న పోస్ట్ నా బ్లాగ్ మిత్రులకి విసుగ్గా అనిపిస్తుందని తెలుసు. కానీ, కాపీరాయుళ్ళకోసం మిగిలిన అందరినీ ఇబ్బంది పెట్టక తప్పడంలేదు. వాళ్ళు ఖచ్చితంగా ఈ టపా చదువుతారని తెలుసు. చదివయినా మారకపోతారా అని ఆశ.
© Dantuluri Kishore Varma
Thursday, 21 November 2013
అదిగో...ఉంది!
ఇండిబ్లాగర్ అనే బ్లాగర్ఆగ్రిగేటర్ ఉంది తెలుసు కదా?
వాళ్ళు తరుచూ బ్లాగ్‌టపాల పోటీ పెడుతుంటారు.
ఆ మధ్యన ఆంబీపురా అనే పెర్‌ఫ్యూముల కంపెనీ వాళ్ళది స్మెల్లీ టూ స్మైలీ అనే పోటీ ప్రకటించారు.
వాసనలకి సంబంధించో, పరిమళాలకి సంబంధించో మన జ్ఞాపకాలని వాళ్ళతో పంచుకోవాలి.
నేను కూడా ఒక టపా రాశాను -
మూడువందల వాటిల్లో నాదొకటి.
బహుమతులు ఎప్పుడు ప్రకటించారో తెలియలేదు. కానీ, ఈ రోజు అనుకోకుండా వాటిని చూశాను.
మొదటి ప్రైజు, రెండవ ప్రైజుల్లో నా పేరులేదు(ఆశకి అంతుండాలి! వచ్చేస్తుందనే!)
`అరవై వెయ్యిరూపాయల ప్రైజులు. ఇక్కడ క్లిక్కండి,` అని ఉంది.
ఆశ చావదు కదా!
క్లిక్కి చూశాను, స్క్రోల్ డౌన్ చేశాను.
అదిగో...ఉంది!
బ్లాగులు రాయడం బొత్తిగా కాలక్షేపం ఒక్కటే కాదండోయ్. అప్పుడప్పుడూ డబ్బులు కూడా వస్తాయన్న మాట!
మనకి బహుమతి వచ్చిందో, లేదో తెలియకపోవడానికి కారణం ఏమిటంటే - వాళ్ళేమీ మనకి మెయిలు అదీ పంపరట. మనకి జ్ఞాపకం ఉండి, వెనక్కి వెళ్ళి చూసుకొంటూ ఉంటే ఇలా సడన్ సర్పైజులు తగిలే అవకాశం ఉంటుంది. ఏమంటారు?
© Dantuluri Kishore Varma
Tuesday, 5 November 2013
ఒక్క మాట చాలదూ!
ఊరు వదిలి పట్నాలకి, అక్కడినుంచి ఇతరరాష్ట్రాలకి, దేశాలకి, ఖండాంతరాలకి వెళతాం. వృక్షం శాఖలతో విస్తరించినట్టు ఎన్నో విజయసోపానాలు. కానీ చెట్టువేళ్ళు మనం పుట్టినచోటే ఉంటాయి. `మన వూరు` అనే మాట ఎంత తియ్యగా ఉంటుంది!
ఈ మధ్య ఒక స్నేహితుడు (స్నేహితుడు అనే మాట వాడవచ్చో, లేదో తెలియదు. ఎందుకంటే ఆయన నాకంటే పెద్దవారు) ముంబాయి నుంచి ఫోన్‌లో మాట్లాడారు. తరువాత ఈ రోజు కలిశాం. ఇద్దరం కలిసి చదువుకోలేదు. ఎందుకంటే ఆయన కాలేజి విడిచిపెట్టే సరికి, నేనింకా స్కూల్లో జాయినవ్వలేదు. బందువులం కాదు, ఇరుగుపొరుగువాళ్ళం కాదు. కానీ ఆయనతో పరిచయం అయ్యేలా చేసింది - మనకాకినాడలో బ్లాగు.
కాకినాడలోనే పుట్టి, విద్యాభ్యాసం పూర్తిచేసుకొని, 1980లో ఉద్యోగరీత్యా విదేశాలకి వెళ్ళారు. చాలాకాలం వివిధ దేశాల్లో ఉద్యోగబాద్యతలు నిర్వహించి, ఇండియాకి తిరిగి వచ్చి, ప్రస్తుతం రిలయన్స్ సంస్థలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు. ఆయన పేరు బొగ్గవరపు హనుమంత రాం గారు.
కాకినాడలోనే పుట్టి, విద్యాభ్యాసం పూర్తిచేసుకొని, 1980లో ఉద్యోగరీత్యా విదేశాలకి వెళ్ళారు. చాలాకాలం వివిధ దేశాల్లో ఉద్యోగబాద్యతలు నిర్వహించి, ఇండియాకి తిరిగి వచ్చి, ప్రస్తుతం రిలయన్స్ సంస్థలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు. ఆయన పేరు బొగ్గవరపు హనుమంత రాం గారు.
`నన్నెలా పట్టుకొన్నారు?` అని అడిగాను.
`బ్లాగులో మీరు వేసిన పెసరట్ల వాసన ముంబాయ్‌కి వచ్చింది,` అన్నారు. `అదేకాదు చాలా సంవత్సరాలుగా ఆర్టోస్ మాట వినలేదు. బ్లాగ్‌లో చూసినతరువాత ఎప్పుడో మరుగునపడిపోయిన ఇష్టం జ్ఞాపకాలపొరలు చీల్చుకొని పైకొచ్చింది. పార్లేలు, కోకోకోలాలు రాకముందు దాన్ని ఎంత అపురూపంగా తాగేవాళ్ళమో గుర్తుకొచ్చింది ` అన్నారు.
`తాజ్‌మహల్‌ని ఆగ్రాలో ఉన్నవాళ్ళు రోజూ చూడాలని కోరుకోరు. అలాగే ఇక్కడే ఉన్నవాళ్ళకి పుట్టినవూరుతో ఉండే ఆత్మీయత అర్ధంకాదు. మాలాగ దూరంగా ఉండేవాళ్ళకి బ్లాగులో ఒక్కొక్క ఆర్టికల్ ఎంత నాస్టాల్జియా కలిగిస్తుందో తెలుసా?` అన్నారు.
`తాజ్‌మహల్‌ని ఆగ్రాలో ఉన్నవాళ్ళు రోజూ చూడాలని కోరుకోరు. అలాగే ఇక్కడే ఉన్నవాళ్ళకి పుట్టినవూరుతో ఉండే ఆత్మీయత అర్ధంకాదు. మాలాగ దూరంగా ఉండేవాళ్ళకి బ్లాగులో ఒక్కొక్క ఆర్టికల్ ఎంత నాస్టాల్జియా కలిగిస్తుందో తెలుసా?` అన్నారు.
రాకరాక కాకినాడ వచ్చారు. వందపనులు. ఉన్న కొంచం సమయంలో ఒక గంట నాకు కేటాయించారు. ఎన్ని జ్ఞాపకాలు! ఎన్ని అనుభూతులు!! ఇంటిలోవాళ్ళు అర్ధరూపాయి ఇస్తే అక్కా, తనూ గ్లాస్‌హౌస్ సెంటర్‌నుంచి రెడ్‌కాన్వెంటుకి వెళ్ళడానికి రిక్షా కిరాయి ఓ వైపు ఇరవైపైసలు, తిరిగి వచ్చేటప్పుడు మరో ఇరవై. మిగిలినది చెరొక సగం పోకెట్‌మనీ. ఐదుపైసలకి ఎన్నివోస్తాయో తెలుసునా? ఒక్కసారి ఆలోచించండి. పుల్లైసులరోజులు, ఒక్కోపైసాకి ఒక్కో పిప్పరమెంటుబిళ్ళ వచ్చేరోజులు.
ఇంకా కొంతసేపు ఆయనతో గడిపితే బాగుండునని అనిపించేటంత స్నేహశీలి, నిగర్వి. కానీ సరిగ్గా ఒంటిగంటకి ఆయనకి చిన్నప్పుడు చదువు చెప్పిన టీచర్‌గారిని కలిసే అపాయింట్‌మెంట్. ఆయనకి పనిష్మెంట్ ఇచ్చిన ఒకే ఒక్క టీచరు! యడాగమసంధికో, ఆమ్రేడితసంధికో సూత్రం సరిగా చెప్పకపోతే ఏ తెలుగు టీచరుకైనా కోపంవస్తుందికదా? మామూలు విద్యార్థులైతే ఏదోఅనుకోవచ్చు, క్లాసులో ఎప్పుడూ ప్రధముడిగా వచ్చే బుద్ధిమంతుడైన కుర్రాడు అలా చెయ్యవచ్చా? బెంచీమీద ఎక్కించి, `నీకు తప్పుచేసే హక్కులేదు. అందరూ నీలా ఉండాలనుకొంటే, వాళ్ళకి తప్పుడు సంకేతాలు ఇస్తే నేను ఒప్పుకోను,` అనికూడా ఘాట్టిగా వార్నింగ్ ఇచ్చారట. ఆ మాట మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. ఒక్క మాట చాలదూ, విజయాలవైపు వేలుపట్టి నడిపించడానికి. అందుకే, ఆవిడని అభిమానంతో చూడటానికి వెళుతున్నారు. నేను మరికొంచం సేపు ఉండమని కోరగలనా?
ఇంకా కొంతసేపు ఆయనతో గడిపితే బాగుండునని అనిపించేటంత స్నేహశీలి, నిగర్వి. కానీ సరిగ్గా ఒంటిగంటకి ఆయనకి చిన్నప్పుడు చదువు చెప్పిన టీచర్‌గారిని కలిసే అపాయింట్‌మెంట్. ఆయనకి పనిష్మెంట్ ఇచ్చిన ఒకే ఒక్క టీచరు! యడాగమసంధికో, ఆమ్రేడితసంధికో సూత్రం సరిగా చెప్పకపోతే ఏ తెలుగు టీచరుకైనా కోపంవస్తుందికదా? మామూలు విద్యార్థులైతే ఏదోఅనుకోవచ్చు, క్లాసులో ఎప్పుడూ ప్రధముడిగా వచ్చే బుద్ధిమంతుడైన కుర్రాడు అలా చెయ్యవచ్చా? బెంచీమీద ఎక్కించి, `నీకు తప్పుచేసే హక్కులేదు. అందరూ నీలా ఉండాలనుకొంటే, వాళ్ళకి తప్పుడు సంకేతాలు ఇస్తే నేను ఒప్పుకోను,` అనికూడా ఘాట్టిగా వార్నింగ్ ఇచ్చారట. ఆ మాట మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. ఒక్క మాట చాలదూ, విజయాలవైపు వేలుపట్టి నడిపించడానికి. అందుకే, ఆవిడని అభిమానంతో చూడటానికి వెళుతున్నారు. నేను మరికొంచం సేపు ఉండమని కోరగలనా?
వెళ్ళేటప్పుడు నా బ్లాగుని మెచ్చుకొని, ఒక హెచ్చరిక చేసి వెళ్ళారు. `పలానా కథలో, ఆ చివర రాసిన వాక్యం నాకు అస్సలు నచ్చలేదు. మీరు రాసినట్టు లేదు. ఎందుకు అలా రాయడం?` అని. ఎంత బాధ్యతతో రాయాలో తెలిసింది. ఒక్క మాట చాలదూ!
© Dantuluri Kishore Varma
Sunday, 22 September 2013
పూదండ ఇంటర్వ్యూ
పూదండ తెలుగు బ్లాగుల ఆగ్రిగేటర్లో నా ఇంటర్వ్యూ ప్రచురించిన పూదండ నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
![]() |
| మీకోసం ఈ ఫోటో |
ఇదే:
1. తెలుగు బ్లాగు ప్రపంచం లోకి ఎప్పుడు అడుగు పెట్టారు?దానికి గల ప్రేరణలు ఏమిటి..?
గతసంవత్సరం(2012) జూలైలో `మనకాకినాడలో...` బ్లాగ్ రాయడం మొదలుపెట్టాను. నిజానికి అంతకుముందు నేనొక కంప్యూటల్ ఇల్లిటరేట్‌ని. రెండు సంవత్సరాల క్రితం సిస్టం తీసుకొన్నతరువాత క్రమంగా వాడడంలో మెళుకువలు అలవాటు అయ్యాయి. ఇక బ్లాగ్ విషయానికి వస్తే, చిన్నప్పటినుంచీ రాయాలని నాకున్న ఇష్టమే ప్రారంభించడానికి పెద్ద ప్రేరణ. ఒక టపా ప్రచురించిన తరువాత వచ్చే ప్రతిస్పందన ఇంకా, ఇంకా రాయాలనే కోరికను పెంచుతుంది.
2.బ్లాగు టపాలు రాయడం లో మీ అనుభవాలు వివరించండి.
బ్లాగ్ రాయడం నేర్చుకోవడం అనే ప్రోసెస్‌లో ది బెస్ట్ పార్ట్ అనుకొంటాను. చాలా తక్కువమందికి తెలిసిన అద్భుతమైన విషయం గురించి రాస్తే ఎవరికీ నచ్చకపోవచ్చు. అతిసాధారణమైన రోజువారీ విషయాలగురించి రాస్తే ఎంతో మంది చదవవచ్చు. అలాగే ఎంతో ఆలోచించి రాసినదానికంటే, ఎ మొమెంట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ తో రాసింది గొప్ప టపా అవుతుంది. మనకి ఏది నచ్చుతుంది అనేదానికంటే పాఠకులకు నచ్చేది ఏమిటనేది ప్రధానం.
`నెమోనిక్స్ సిన్స్ టైం ఇమ్మెమోరియల్` అనే టపాని నా ఇంగ్లీష్ బ్లాగ్‌లో చదివి `ఫణిబాబు మ్యూజింగ్స్` బ్లాగర్ ఫణిబాబుగారు పూనా నుంచి ఫోన్లో ప్రశంసించడం జరిగింది. అలాగే ఇంకొన్ని సందర్భాలలో విదేశాల్లో ఉన్న మనతెలుగువాళ్ళు కూడా ఫోన్‌చేసి బ్లాగ్‌ని మెచ్చుకోవడం ఆనందం కలిగించింది. బ్లాగ్ చదివి ఫేస్‌బుక్‌లో మిత్రులు అయినవారు ఉన్నారు. బ్లాగర్ గా మారి ఉండకపోతే, కాకినాడలాంటి చిన్న పట్టణంలో ఉండే నాలాంటి వాడిని పట్టించుకోవలసిన అవసరం ఎవరికి ఉంటుంది?
రిటైరయ్యి లండన్లో కొడుకుదగ్గర ఉంటున్న మా మాష్టారు ఒకసారి కలిసినప్పుడు, "నీ బ్లాగ్ ప్రతీరోజూ చదువుతాను. చాలా బాగుంది," అని చెప్పడం నాకు గొప్ప ఎచీవ్‌మెంట్ లాంటిది.3.మీ టపాల లో సృజనాత్మకత,విషయ పరిశీలన బాగా ఉంటాయి.దానికి మీరు చేసే కృషి ఎలాంటిది..?
చదవడం పాసివ్ ఆక్టివిటీ. చదువుతూ ఉండగా మన ఆలోచనలు ఎక్కడెక్కడో విహరిస్తూ ఉండవచ్చు. మనం ఉన్న పరిసరాల్లోనుంచి మాయమైపోయి, రచయిత సృష్టించిన ప్రపంచంలో సంచరిస్తాం. రాయడం అలాకాదు. రాయబోయే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని దానిని పాఠకులు మెచ్చగల టపాగా మలచాలి. దానికోసం విస్తృతంగా చదవాలి. వివేకానంద గురించి రాసిన టపాలకోసం ఆయన పుస్తకాల్లో ఆయా భాగాల్ని ఎన్నేసి సార్లు చదివానో లెక్కలేదు.
టపాని వ్యాసంలా రాస్తే తక్కువమంది చదువుతారు. ఉదాహరణకి గౌతమీ ఎక్స్‌ప్రెస్‌ని ప్రారంభించి 25 సంవత్సరాలు అయిన సందర్భంలో దానిగురించి `ఓ అందమైన అమ్మాయి ఆత్మకథ` అని పేరు పెట్టి, నిజంగానే అమ్మాయికథ అనిపించేలా రాయడంతో అత్యధికంగా చదివారు.
కథలురాసే విషయంలో కూడా ఈ జాగ్రత్త తీసుకొంటాను. సాధారణంగా ట్విస్ట్‌ని చివర ఉండేలా ప్రయత్నిస్తాను. పాఠకులు ఏఏ అంశాల్ని ఇష్టంగా చదువుతారు అనే అంశాన్ని నిరంతరం పరిశీలిస్తూ ఉంటాను.4.మీకు బాగా నచ్చిన కొన్ని బ్లాగుల గురించి చెప్పగలరా..?
కాపీ - పేస్ట్ తరహా బ్లాగులు మినహాయించి నాదృష్టికి వచ్చిన మంచి బ్లాగులన్నీ చదువుతాను. ప్రత్యేకించి పేర్లు చెప్పను కానీ తెలుగులో నా అభిమాన బ్లాగర్లు చాలా మంది ఉన్నారు.
5.ఇంకా మీ ఇతర హాబీలు ఏమిటి?
పుస్తకాలు చదువుతాను. ఎప్పుడైనా చక్కటిప్రదేశాలకి వెళ్ళి చూసి వస్తాను. ఫేస్‌బుక్లో దగ్గరదగ్గరగా పదివేలమంది ఉన్న `మనకాకినాడ` అనే గ్రూపుని నిర్వహిస్తాను.
6.మీ జీవితం లో మరిచిపోలేని సంఘటనలు గురించి మాతో ఏమైనా పంచుకోగలరా..?
చాలా మంచి సంఘటనలు, కొన్ని చెడ్డవీ ఉన్నాయి. మీరు అడిగిన వెంటనే చప్పున ఏవి గుర్తుకు రాలేదు. కాబట్టి, మరచిపోలేని సంఘటనలంటే ప్రత్యేకించి వేటిగురించీ చెప్పలేను.7.బ్లాగరులకు మీ రిచ్చే సందేశం లేదా సలహా ఏమైనా ఉన్నదా..?
సందేశాలిచ్చేటంత పెద్దవాడ్ని కాలేదు. నన్ను ఇలా పరిచయం చెయ్యాలనుకొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ హ్యాపీ బ్లాగింగి!
© Dantuluri Kishore Varma
Wednesday, 24 July 2013
ఒక సంవత్సరం అయ్యింది!
ప్రతీరోజూ ప్రత్యేకమైనదే. కానీ, జూలై 25 కొంచెం ఎక్కువ ప్రత్యేకమైంది! మనకాకినాడలో... బ్లాగ్ ప్రారంభమై సరిగ్గా సంవత్సరం అయ్యింది. జూలై 25, 2012న సండే మార్కెట్ అనేది మొదటి టపా. వ్యూస్ చాలా వరకూ ఫేస్‌బుక్ నుంచే వచ్చేవి. తరువాత కొంతకాలానికి కూడలి, హారం, బ్లాగ్‌లోకం మొదలైన ఆగ్రిగేటర్లలో చేరినందువల్ల వ్యూస్ బాగా పెరిగాయి. టాప్ ట్రాఫిక్ జెనరేటర్లు అవే. రెగ్యులర్‌గా రాయడం ఒక హాబీగా మారింది. రాసింది ప్రతీదీ అందరికీ నచ్చాలని లేదు. కానీ, నచ్చేలా ఉండాలంటే ఏవిషయాలగురించి రాయాలి, ఎలా రాయాలి? ఈ చిక్కు ప్రశ్నకి సమాదానం తెలిసీ, తెలియనట్టుగా ఉంటుంది. ఈ సంవత్సరంలో పద్దెనిమిది లేబిల్స్‌తో 186 టపాలు, అంటే సరాసరి ప్రతీ రెండురోజులకీ ఒక్కొక్కటి రాశాను. 53,000 పేజ్‌వ్యూస్ ఉన్నాయి. 84మంది బ్లాగ్ మిత్రులు ఉన్నారు. కామెంట్స్‌తో ప్రోత్సహించిన హితులు ఉన్నారు. ఇవన్ని చూసి పొంగిపోవడంకాదు. నడచివచ్చినదూరాన్ని వెనక్కి తిరిగి చూసుకొని, ఈ దారంతా నిజంగా మనమేనడిచామా అని ఆశ్ఛర్యపోవడం - అదో తుత్తి! నడిపించిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు!
© Dantuluri Kishore Varma
Friday, 17 May 2013
కథ అంటే?
కథలు రాయాలనే ఆసక్తి నాకు చిన్నప్పటినుంచీ ఉండేది. అయితే, రచయితగా మారలేక పోవడానికి కారణం కథరాసి, పత్రికలకి పంపి, నెలకో ఆరునెలలకో ప్రచురింపబడుతుందో, త్రిప్పి పంపబడుతుందో తెలియకుండా ఎదురుచూస్తూ ఉండేటంత సహనం లేకపోవడం ఒక కారణం అయితే; వ్రాయడంలో మెళుకువలను తెలుసుకోవడానికి, సందేహాలుంటే నివృత్తి చేసుకోవడానికి వాటిగురించి తెలిసిన పెద్దవాళ్ళెవరితోను పరిచయాలు లేకపోవడం రెండవ కారణం. సంగీతం, నాట్యం, చిత్రలేఖనం లాంటివి నేర్చుకొన్నట్టు కథలు రాయడం నేర్చుకోవడానికి రైటర్స్ వర్క్‌షాప్‌లు అందరికీ అందుబాటులో ఉండవు. చాసో, సత్యం శంకరమంచి, వంశీ, పాలగుమ్మి పద్మరాజు, ముళ్ళపూడివెంకటరమణ... లాంటి రచయితల రచనలు చదివి కొంతవరకూ స్టోరీ క్రాఫ్ట్‌ని నేర్చుకొంటే; సంఘటనలని, మనుష్యులని పరిశీలించడంద్వారా మరికొంత నేర్చుకోవచ్చు అనుకొంటాను.
సుమారు ఒక సంవత్సరం క్రిందట బ్లాగ్‌లోకంలోకి వచ్చినతరువాత ఎప్పటిదో ఆసక్తి మళ్ళీ తెరమీదకి వచ్చింది. మిగిలిన విషయాలతో పాటూ అడపాదడపా ఓ పది కథలు రాశాను. నిజానికి వాటిని కథలు అనవచ్చో, లేదో కూడా సరిగ్గా తెలియదు నాకు. ఎందుకంటే, ఈ కథల్లో కొన్నింటి నిడివి చాలా తక్కువ. ఇంత చిన్న కథలని చాలా కాలం క్రితం ఈసప్ అనే ఆయన రాశాడు. తరువాత ఒకటి రెండు తెలుగు పత్రికల్లో కాలం దాటని కథలు అని వచ్చేవి. ఇంగ్లీష్ రచయిత ఓ హెన్రీ రాసిన కథల్లోలాగ చివ్వరి వాఖ్యంలో ఊహించని ముగింపు ఉంటే ఇటువంటి చిన్న కథలు రక్తి కడతాయి.
నా బ్లాగ్‌లో కథలు అనే లేబుల్‌తో ఉన్న వీటి లింకుని, `కథ` అనే ఫేస్‌బుక్ గ్రూపులో ఇచ్చి, ఆ గ్రూపుసభ్యులని విశ్లేషించమని కోరడం జరిగింది. కొంతమంది సభ్యులు తమ విలువైన సమయం కేటాయించి వీటిని చదివి అభిప్రాయాలు తెలియజేశారు. రాసే విధానం బాగుందని.. పాత్రల స్వభావాన్ని పూర్తిగా వ్యక్తీకరించడానికి కథ నిడివి పెంచాలని సూచించారు.
సందర్భం వచ్చింది కనుక, కథగురించి అవగాహన పెంచుకోవడానికి ప్రేంచంద్ సాహిత్యవ్యాసాలు, బుచ్చిబాబు సాహిత్యవ్యాసాలు, మల్లాది వెంకట కృష్ణమూర్తి, యండమూరి వీరేంద్రనాథ్‌లు రాసిన `కథలు ఎలా రాస్తారు?` అనే పుస్తకాలు, ఇంకా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని కొంత చదివాను.
కథలకి వివిధ నిర్వచనాలు కనిపించాయి. వాటిల్లో ఒకటి మాత్రం చదివిన వెంటనే బాగా ఇంప్రెసివ్‌గా అనిపించింది.
కథ చెప్పడం అంటే కొంతమందిని సినిమాకి తీసుకొని వెళ్ళడం లాంటిది. దర్శకుడు తనుతీసిన సినిమాని ఎలా తెరమీద చూపిస్తాడో రచయితకూడా మనసులో ఊహించుకొన్న విషయాన్ని అలానే పాఠకుల మనసులమీదకి ప్రొజెక్ట్ చెయ్యడమే కథచెప్పడం.
నిర్వచనం బాగుంది కదా?
వాఖ్యం వాఖ్యానికీ కథని ముగింపువైపు తీసుకొనివెళుతూ, అవసరమైన చోట వర్ణనల్ని, సంభాషణల్ని ఉపయోగిస్తూ రాస్తే చిన్న కథయినా, పెద్ద కథయినా అందగిస్తుందనుకొంటాను.
వాఖ్యం వాఖ్యానికీ కథని ముగింపువైపు తీసుకొనివెళుతూ, అవసరమైన చోట వర్ణనల్ని, సంభాషణల్ని ఉపయోగిస్తూ రాస్తే చిన్న కథయినా, పెద్ద కథయినా అందగిస్తుందనుకొంటాను.
© Dantuluri Kishore Varma
Tuesday, 14 May 2013
ధన్యవాదాలు మూర్తిగారూ!
రివర్‌సైడ్‌మ్యాన్ కె.వి.వి.ఎస్.మూర్తిగారు అభిమానంతో గౌతమీన్యూస్ సైట్‌లో రాసిన పరిచయం. హృదయపూర్వక ధన్యవాదాలు మూర్తిగారూ!
© Dantuluri Kishore Varma
Sunday, 3 March 2013
పాలు నలుపా
బావా, కొత్త టపాకి `పాలు నలుపా` అని పేరు పెట్టావా? అంటే నల్లని పాల గురించి రాయబోతున్నావా?
కాదు, నా బ్లాగుని ఇప్పటివరకూ చూసినవాళ్ళ సంఖ్య ఇరవై ఎనిమిదివేల రెండువందల ఎనభై రెండు మంది. దాని గురించి రాస్తున్నాను.
దానికీ, దీనికీ ఏమయినా సంబంధం ఉందా? నువ్వు చెప్పేది ఏమీ అర్థం కావడం లేదు. మళయాళంలా ఉంది.
మళయాళం లాగ ఉండాలనే కదా ఈ టపా మొదలు పెట్టి రాస్తున్నది?
వికటకవిలా తికమక చేసేస్తున్నావు. మీ వూరు తెనాలా? రామలింగడు మీకేమయినా బంధువా?
లేదు అమ్మడూ, ఆయన సమకాలీనుడు నంది తిమ్మన గారు రాసిన ఓ పద్యం గురించి ఒక మహానుభావుడు చెప్పారు. దానితో జ్ఞాన కిటికి తెరుచుకొని ఇలా... అయ్యింది. అసలు ఇలాంటి ఒకటపా ఈ సంవత్సరం జనవరి ముప్పై ఒకటిన రాద్దామనుకొన్నాను. కానీ, అప్పుడేదో మీ అదృష్ఠం బాగుండిపోయి తప్పిపోయింది. మళ్ళీ ఇదిగో ఇన్నిరోజులకి సమయం, సందర్భం కలసి వచ్చాయి.
మా అదృష్ఠం గురించి మాట్లాడుతున్నావంటే నీ పైత్యంతో మా బుర్రలు తినబోతున్నావా?
ఈడెన్ గార్డెన్లో ఈవ్‌కి హయ్ చెప్పే ఉద్దేశ్యంతో ఆడం ఒక పలుకు పలికి నప్పుడు, `నసపెడుతున్నాడని,` ఈవ్ నీకులానే భావించి ఉంటే కథ మనవరకూ వచ్చి ఉండేది కాదు. ఏమంటావ్?
అసలు ఏమన్నాడో చెప్పకుండా, నన్ను `ఏమంటావు?` అంటే, నేనేమంటాను?
`Madam, I`m Adam,` అన్నాడు.
కృష్ణ కృష్ణా!
`నందనందనం,` అనుకో బాగుంటుంది.
ఏం!?
అది అంతేలే. ఇంతకీ, నీకు ఈ టపా టైటిలు ఏమిటో అర్థమైందా?
`నల్లని వన్నీ నీళ్ళు, తెల్లని వన్నీ పాలు,` అంటారు. నీది కొంచం తిక్క వ్యవహారం కనుక తిరగేసి చెప్పినట్టున్నావు!
నిజమే సుమీ ఎలా కనిపెట్టావు?
కనిపెట్టానా! వెటకారం చేస్తున్నావా?
కావాలంటే తిరగేసి చదువుకో.
దేన్నీ!?
ముందు టైటిల్‌ని, తరువాత మిగిలిన వాటిని.
టైటిల్!? పా-లు-న-లు-పా ~ పా-లు-న-లు-పా. హే, నిజమే, ఎటు చదివినా ఒకేలా ఉంది. అయితే పాలిండ్రోం గురించి రాస్తున్నావన్న మాట! Malayalam, వికటకవి, కిటికి, Madam, I`m Adam, నందనందనం... భలే! భలే!! మరి ఈ నంది తిమ్మన గారు ఎందుకు వచ్చారు ఇందులోకి?
ఆయన అనులోమవిలోమ ఖండం అని ఒకటి రాశారట. అందులో కొన్ని పద్యాలు ముందునుంచి చదివినా, వెనుకనుంచి చదివినా ఒకేలా ఉంటాయట.
`సమయం, సందర్భం కలిసి వచ్చి ఇప్పుడు రాస్తున్నాను,` అన్నావు? ఏమి కలిసి వచ్చింది?
31.1.13 న రాద్దామను కొన్నాను. ఎందుకంటే అదీ ఎటునుంచి ఎటు చదివినా ఒకేలా వచ్చే నంబరు కనుక. నువ్వు తరువాత అడిగే సందేహం కూడా ఏమిటో తెలుసు కనుక, నీకు అడిగే శ్రమలేకుండా నేనే సమాధానం చెపుతున్నాను. ఇదిగో ఈ ఫోటో చూడు.
© Dantuluri Kishore Varma
Wednesday, 13 February 2013
న్యూస్ పేపర్లో మనకాకినాడలో బ్లాగ్ నుంచి ఆర్టికల్
My article about Koringa forest appeared in Surya News Paper. The original article was written in this blog.
Dantuluri Kishore Varma
Tuesday, 1 January 2013
న్యూస్ పేపర్లో `మనకాకినాడలో..` బ్లాగ్ గురించి పరిచయ వ్యాసం
నూతన సంవత్సరపు బహుమతిలా సూర్యా న్యూస్ పేపర్లో `మనకాకినాడలో..` బ్లాగ్ గురించి పరిచయ వ్యాసం వచ్చింది. ఆనందాన్ని మీతో పంచుకోవడానికి ఇక్కడ ఇస్తున్నాను.
వ్యాసంలో సందర్శకులకి బదులు అభిమానులని వచ్చింది. అలాగే - కూడలి, సమూహము, హారం, బ్లాగిల్లులతో పోటిపడుతున్నట్టు... అని వచ్చింది. `సభ్యత్వం కలిగి ఉంది` అని రాసి ఉండవలసింది. ఈ రోజు వరకూ ఉన్న 14,000 వేల పేజ్‌రివ్యూలలో ఎక్కువశాతం ఈ బ్లాగ్ ఆగ్రిగేటర్ల ద్వారా వచ్చిందే. రాస్తున్న టపాలని పాఠకుల ముంగిట్లోకి తీసుకు వెళుతున్న కూడలి, సమూహము, హారం, బ్లాగిల్లు మొదలైన ఆగ్రిగేటర్ల పాత్ర అమూల్యమైంది. ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇండిబ్లాగర్ వల్ల దేశవ్యాప్త బ్లాగర్ల నెట్‌వర్క్‌లో మన బ్లాగుల్ని ప్రమోట్ చేసి, ఇంగ్లీష్లో బ్లాగులు రాస్తున్న తెలుగు వారికి కూడా అందుబాటులోనికి తీసుకువెళ్ళగలగడం ఒక మంచి అవకాశం.
* * *
My article about Koringa forest appeared in Surya News Paper. The original article was written in this blog.
సహబ్లాగర్లకి, పాఠకులకి, మిత్రులకి, ఆగ్రిగేటర్లకి... సర్వులకీ కొత్తసంవత్సరం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ధనకనకవస్తువాహనాలూ, కీర్తిప్రతిష్ఠలూ కలుగజేయాలని; నా బ్లాగ్‌కి మీ అందరి సహకారం, ఆశీస్సులు ఎప్పటిలాగే ఉండాలని కోరుకొటూ .....
© Dantuluri Kishore Varma
Saturday, 13 October 2012
రాతల్లో రకాలు
"నాకొక కొత్తవ్యక్తిని పరిచయం చెయ్యండి, అతనిగురించి ఒక ఆసక్తికరమైన కథ రాస్తాను," అనేవాడట స్టివెన్ లీకాక్. ఇంచుమించు అలాగే "అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, కాదేదోయ్ కవితకనర్హం," అని శ్రీశ్రీ గారు అంటారు. తొంభై ఏళ్ళు పైన బ్రతికిన తాళ్ళపాక అన్నమాచార్య 36,000 సంకీర్తనలు రాసి `ఔరా!` అనిపించాడు. రోజుకి ఒకటి చొప్పున రాసినా అన్ని కీర్తనలు పూర్తిచెయ్యడానికి 97 సంవత్సరాలు పడుతుంది! ఏమి రాయాలో ఆలోచించుకోవలసిన అవసరం లేకుండా, ఏమైనా రాయగల సృజనాత్మకత వాళ్ళ సొంతం.
చాలా ఏళ్ళక్రితం నా స్నేహితుడు ఒకరు స్వాతిలో కథల పోటికి ఒక కథ పంపిస్తే, `రాసే విధానం బాగుంది, కానీ కథగా ప్రచురించగలిగినంత పెద్దగా లేదు. బాగా నిడివి పెంచి రాయండి సీరియల్ గా వేస్తాం,` అని ఒక నోట్ పెట్టి త్రిప్పి పంపించారు. అది చూసి మొదట నిరుత్సాహపడినా, తరువాత నిజంగానే సీరియల్ రచయిత అయిపోయినంత ఆనంద పడిపోయాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆకథని నవలగా పెంచి రాయడంగానీ, ప్రచురించబడడంగానీ జరగలేదనేది వేరే విషయం. "చ! ఎడిటర్ల లాంటి చెక్ పోస్ట్లు లేకుండా ఉంటే మన రాతలు మనమే వేసేసుకోవచ్చు," అనేవాడు. మావాడు ఆశపడిన అవకాశం ఇప్పుడువచ్చింది. కొంతకాలం క్రితం వరకూ రచయితలు వేరుగా, పాఠకులు వేరుగా ఉండేవారు. కానీ, అంతర్జాలంలో బ్లాగులు మొదలయ్యాకా ఎవరయినా రచయితలు అవ్వొచ్చు. నా ఫ్రెండుకి బ్లాగు లేదు కానీ, ఒకవేళ ఉంటే ఏమిరాసి ఉండేవాడా అని నాకు సందేహం కలుగుతుంటుంది అప్పుడప్పుడూ. అవకాశం అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది. లేనిదల్లా ఏమిరాయాలనే అవగాహన మాత్రమే.
నేను ఈ మధ్యనే ఇండీబ్లాగర్ అనే ఇండియన్ బ్లాగర్ కమ్యూనిటీలో చేరడం జరిగింది. వాళ్ళు చెప్పే ఒక వాఖ్యం బాగా నచ్చింది నాకు - "ఎవ్విరీ వన్ హేజ్ సంతింగ్ టు బ్లాగ్ అబౌట్," అని. మరి ఆ `సంతింగ్` అంటే ఏమిటీ అనేది బేతాళ ప్రశ్న. ప్రతీరోజూ కొన్ని వేల మంది బ్లాగర్లు లక్షలకొద్దీ పేజీలు రాసిపడేస్తున్నారు. వాళ్ళంతా రాసే సంతింగ్, సంతింగ్ ఏమిటి? ఆ మేజిక్ ఏదో మనకి కూడా తెలిస్తే చంద్రుడికో నూలు పోగులా ఓ నాలుగు పేజీల మనమూ బరికి పారేయవచ్చుకదా! ఇదే ఆలోచనతో కొన్నిరోజులుగా కనిపించిన బ్లాగునల్లా చదివితే కొన్నివిషయాలు తెలిశాయి. అవి అందరితో పంచుకొoటే బాగుంటుందని ఈ టపా రాస్తున్నాను.
రాతలు 6 రకాలు (Kinds):
1. నెరేటివ్ - సంఘటనలు జరిగిన క్రమంలో కథలాగ చెప్పుకొని పోవడం: `నాచిన్నప్పుడు ఏమి జరిగిందంటే,` అని మొదలుపెట్టి జ్ఞాపకాలు అన్ని రాసేసుకోవడం. జీవితచరిత్రలు, సంఘటనలు, ఏదయినా తయారుచేసే విధానం...లాంటివాటిని ఈ కోవలోకి తీసుకొని రావచ్చు.
2. డిస్క్రిప్టివ్ - వర్ణన: ఒక ప్రదేశాన్ని గురించి వర్ణించి రాసే టపాలు. ట్రేవలాగ్ పోస్టులు ఈ కోవలోకి వస్తాయి.
3. రిఫ్లెక్టివ్ - అద్దంలో ప్రతిబింబం లాంటి రాతలు అన్నమాట: బుక్ రివ్యూస్, ఫిల్మ్ రివ్యూస్ మొదలైనవి.
4. క్రిటికల్ - పరిశీలనాత్మకమైన టపాలు: మనుషులని, నడవడికలని, పనులని, విధానాలని... పరిశీలించి, విశ్లేషించి వ్రాయడం.
5..క్రియేటివ్ - సృజనాత్మక రాతలు: కథలు, కవితలు మొదలైనవి.
6. పిక్ అండ్ పోస్ట్ -ఏదో ఒకటి ఏరుకొని వచ్చి మన మొహాన కొట్టడం: దీనికి వివరణ అనవసరం.
ఇంకా చాలా రకాలు ఉండవచ్చు. విషయాన్ని క్లుప్తంగా చెప్పే టపా కనుక వివరంగా రాయడం లేదు (= నాకు అంతకంటే ఎక్కువ తెలియదు :-p)
రాసే విధానాలు (Moods) :
కొంతమంది చమత్కారంగా హాస్యం ఉట్టిపడేలా చెబుతారు(హ్యుమరస్). ఇది ఒకకళ. వాళ్ళు రాసింది చదువుతున్నంత సేపూ పొట్ట చెక్కలయిపోయెలా నవ్వలేక చస్తాం. రెండవ విధానం సీరియస్. జాగ్రఫీ పాఠంలాగ చెప్పేయడం అన్నమాట. మూడవది సర్కాస్టిక్ అంటే వెటకారం. ఒకవైపు నుంచి నవ్వువస్తూనే ఉంటుంది; ఇంకో వైపు కారం రాసినట్టు ఉంటుంది. అయినా ఈ పోస్టు మనమీద కాకపోతే భలే ఉంటుంది ; )
కొంతమంది చమత్కారంగా హాస్యం ఉట్టిపడేలా చెబుతారు(హ్యుమరస్). ఇది ఒకకళ. వాళ్ళు రాసింది చదువుతున్నంత సేపూ పొట్ట చెక్కలయిపోయెలా నవ్వలేక చస్తాం. రెండవ విధానం సీరియస్. జాగ్రఫీ పాఠంలాగ చెప్పేయడం అన్నమాట. మూడవది సర్కాస్టిక్ అంటే వెటకారం. ఒకవైపు నుంచి నవ్వువస్తూనే ఉంటుంది; ఇంకో వైపు కారం రాసినట్టు ఉంటుంది. అయినా ఈ పోస్టు మనమీద కాకపోతే భలే ఉంటుంది ; )
ఉద్దేశ్యాలు (Purposes):
1. వినోదం కలిగించడానికి 2. ఎడ్యుకేట్ చెయ్యడానికి 3. సుత్తేసి బొరుకోట్టడానికి.
1. వినోదం కలిగించడానికి 2. ఎడ్యుకేట్ చెయ్యడానికి 3. సుత్తేసి బొరుకోట్టడానికి.
ఈ ఆరు రకాలని, మూడు విధానాలని, మూడు ఉద్దేశ్యాలని రకరకాలుగా కలిపి చాలా కాంబినేషన్లని తయారుచెయ్యవచ్చు.
స్టివెన్ లీకాక్ భావించినట్టు మన అందరిలో కూడా ఆసక్తి కరమైన సంగతులు ఉంటాయేమో! వాటిగురించి వ్రాయడం మొదలుపెట్టవచ్చు. ఎవ్విరీ వన్ హేజ్ సంతింగ్ టు బ్లాగ్ అబౌట్. So, start blogging right now.
(నా పరిశీలనలోకి వచ్చిన వాటిని `ఇంకా ఎవరికైనా కూడా ఉపయోగపడుతుందేమో!` అనే ఆశతో ఈ టపాలో రాయడం జరిగింది. నేను ప్రస్తావించిన కేటగిరీల్లోకి కొందరి పోస్టులు వచ్చే అవకాశం ఉంది కనుక, ఎవ్వరూ విమర్శతో రాశానేమో అని భావించవద్దని మనవి.)
© Dantuluri Kishore Varma
Subscribe to:
Posts (Atom)














