Tuesday, 3 December 2019

కోతల సమయం

జిల్లాలో వరి పండించే రైతులకు ప్రస్తుతం తొలకరి పంట చేతికివచ్చే కాలం. కోతలు పూర్తైపోయాయి. కొన్ని చోట్ల చేలు పనలమీద ఉన్నాయి - అంటే కోసిన వరిమొక్కలని కంకులతోపాటూ చెమ్మ లాగడానికి మడి లోనే మూడు నాలుగు రోజులు ఆరబెడతారు. పనమీద ఉన్న సమయంలో దురదృష్టవశాత్తూ వర్షం కానీ వస్తే రైతు సీజన్ అంతా పడిన కష్టం నీటి పాలైనట్టే.     
వ్యవసాయ పనులకి రోజు కూలి ఈ సంవత్సరం వెయ్యి దాటిందట. దాంతో రైతులు 'వ్యవసాయం ఏమీ కిట్టుబాటు అవడం లేదు' అని గగ్గోలు పెడుతున్నారు. కోతల యంత్రాలు వచ్చిన తరువాత పనిలో వేగం పెరిగింది. ఒకటి రెండు గంటల్లోనే ఒక ఎకరం కోత పూర్తయిపోతుంది. పైగా కూలీలతో చేయించు కొన్న దాని కన్నా తక్కువ ఖర్చు. కాబట్టి పెద్ద కమతాల వాళ్ళు యంత్రాలతో పని కానిచ్చేస్తున్నారు. ఒకటి రెండు ఎకరాలు ఉన్న సన్నకారు రైతులు మాత్రం పాత పద్ధతులే కొనసాగిస్తున్నారు.  
పనలు ఆరిన తరువాత కళ్ళం దగ్గరకి చేరవేసి, నూర్పుళ్ళు చేస్తారు.  కొన్నిచోట్ల ఏటవాలు బల్ల మీద మోది దాన్యపు గింజల్ని వేరు చేసే పద్ధతి ఉంది. కానీ - గోదావరి జిల్లాల్లో మాత్రం కుప్పనూర్పుళ్ళే.  పనలని కళ్ళంలో పరచి రెండెడ్ల బండితో కానీ, ట్రాక్టరుతో కానీ తొక్కిస్తారు. దీనికంటే సులువైన ఏర్పాటు ఇంకొకటి ఉంది - పనల్ని ట్రాఫిక్ బాగా ఉన్న తారురోడ్డు మీదో, సిమెంటురోడ్డు మీదో పారెయ్యడమే. పైసా ఆయిల్ ఖర్చు కానీ, ట్రాక్టరు కిరాయి కానీ లేకుండా పని కానిచ్చేయొచ్చు. వాహనదారులు ఎంత ఇబ్బంది పడినా నష్టం ఏమీ లేదు! 

ఈ పని పూర్తయిన తరువాత దాన్యం - దూగర, పొట్టుతో ఉంటుంది. వాటిని వేరు చెయ్యడానికి ఎగరబోస్తారు. దాన్యాన్ని చేటలలోకి ఎత్తి, గాలి వాలు చూసుకొని, ఎత్తునుంచి చేట ప్రక్కఅంచు మీదుగా జాలువారుస్తారు. ఇలా చెయ్యడం వల్ల గాలికి పొట్టూ, దూగరా దూరంగా ఎగిరిపోయి, దాన్యం నేరుగా క్రింద గుట్ట పడుతుంది.  

తరువాత దాన్యాన్ని కొన్నిరోజులు ఆరబెట్టుకొని, కొలిచి గోనె సంచుల్లోకి నింపి, ట్రాక్టరు మీదో, బండి మీదో ఇంటికి లేదా మిల్లుకి పంపేస్తారు. నూర్చిన తరువాత మిగిలిన వరి గడ్డిని మేటు వేసి, సంవత్సరం పొడవునా పసువులకి గ్రాసంగా వాడతారు. 

వ్యవసాయం ప్రధాన వ్యాపకంగా ఉండే కుటుంబాలలో పుట్టి, పెరిగిన కారణంగా నలభై సంవత్సరాల వయసు దాటిన చాలామందికి ఈ విషయాలు అన్నీ బాగా తెలిసినవే. కానీ తరువాత క్రమంగా చదువులకోసం, ఉద్యోగాలకోసం పట్టణాలకీ, విదేశాలకీ వెళ్ళిపోయిన కుటుంబాలలో పిల్లలకి ఇల్లూ, బడీ తప్ప మరోప్రపంచం లేకుండా పోయింది. 'మనం తినే బియ్యం ఏ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు?' అని అడుగుతున్న తరం తయారయింది. వాళ్ళు కుతూహలం కొద్దీ తెలుసుకోవాలి అనుకొంటే ఏమైనా ఉపయోగ పడుతుందేమో అని ఈ టపా వ్రాస్తున్నాను.   


                   

Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!