Pages

Showing posts with label స్వామీ వివేకానంద. Show all posts
Showing posts with label స్వామీ వివేకానంద. Show all posts

Monday, 11 January 2016

స్పూర్తి

స్వామీ వివేకానంద జన్మదినం జనవరి 12.

1985 నుంచీ మన దేశంలో ప్రతీసంవత్సరం ఈ తారీఖును జాతీయ యువజన దినోత్సవం (నేషనల్ యూత్ డే)గా అధికారికంగా జరుపుకొంటున్నాం. స్వామీ వివేకానంద ఉపన్యాసాలు, గీతోపాఖ్యానం, రచనలు, లేఖలు... వాటిలో స్పూర్తిని నింపే మాటలు యువతని వెన్నుతట్టి ముందుకు నడిపిస్తాయి. 


1. రోజుకి ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు. 
2. మిమ్మల్ని బలవంతుల్ని చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనుల్ని చేసే ప్రతి ఆలోచననీ తిరస్కరించండి.
3. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దాన్నే మీ జీవిత లక్ష్యం చేసుకోండి. దాన్నే ధ్యానించండి. దాన్నే కలగనండి. దాన్నే శ్వాసించండి. అదే విజయానికి మార్గం. 
4. లక్ష్యంలో ఉన్నంత శ్రద్దాసక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించాలి, విజయ రహస్యం అంతా అదే.
5. నిరంతరం వెలిగే సూర్యుడ్ని చూసి చీకటి భయపెడుతుంది. అలాగే నిరంతరం శ్రమించే వాడిని చూసి ఓటమి భయపడుతుంది.
6. పరాజయాల్ని పట్టించుకోకండి. అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటమిలేని జీవితం ఉంటుందా?
7. ప్రేమా, నిజాయితీ, పవిత్రతా కలిగి ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తీ ఓడించలేదు.
8. చావు బ్రతుకులు ఎక్కడో లేవు, మన ఆలోచనల్లోనే ఉన్నాయి. ధైర్యంలోనే బ్రతుకు ఉంది. భయంలోనే చావు ఉంది.
9. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు. కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే.
10. విజయాన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే విజేతకు ఎదురయ్యే నిజమైన సవాల్.

వివేకానంద గురించి మనకాకికాడలో బ్లాగ్‌లో ఇంతకు ముందు రాసిన విషయాలని ఇక్కడ చదవండి.  
  1. స్వామీ వివేకానంద
  2. హిందూమతం గురించి చదివిన పత్రం
  3. సమాన(వ)త్వం
  4. ఉత్సాహం లేని చదువు, ఏకాగ్రత లేని పని, లక్ష్యం లేని ప్రయాణం ఏ ఫలితాన్నీ ఇవ్వవు.
  5. వివేకానందా రాక్ మెమోరియల్
  6. స్వామీ వివేకానంద స్వార్ధం

© Dantuluri Kishore Varma

Monday, 25 November 2013

స్వామీ వివేకానంద సమాధానం

Statue @ Yanam beach road
స్వామీ వివేకానంద ఒకసన్యాసి. సన్యాసులకి తామున్న ప్రదేశం మీద మమాకారం ఉండకూడదు. అమెరికా సర్వమత సభల్లో ఉపన్యసించినతరువాత వివేకానంద అక్కడ చాలా పేరుప్రఖ్యాతులు గడించారు. ఎక్కువకాలం అక్కడ ఉండి హిందూ మతం గురించి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. 

ఒక అమెరికన్ అడిగాడట `ఇక్కడి సౌకర్యాలు, జీవన ప్రమాణాలు, సౌఖ్యాలు చూసిన తరువాత మీదేశానికీ, మాదేశానికి గల వ్యత్యాసం తెలిసిందా?` అని. 

`అవును బాగా తెలిసింది. ఇప్పుడు నాదేశపు ప్రతీ ఇసుకరేణువూ పవిత్రంగా అనిపిస్తుంది,` అని సమాదానం చెపుతారు. 

అప్పుడు మరొక ప్రశ్న `ఇది స్వార్ధం కాదా?`  

`దేశం అంటే తల్లి లాంటిది. తల్లిని నాది అని భావించలేనివాడు, మరి ఏ తల్లినీ ప్రేమించలేడు. భారతదేశం నా తల్లి. నాకు దేశభక్తి ఉన్నప్పుడు మాత్రమే, ప్రపంచాన్ని ప్రేమించగలను అని చెపుతారు. 

అందుకే మహాత్మా గాంధీ ఒకసారి స్వామీ వివేకానంద గురించి చెపుతూ, `దేశభక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలంటే వివేకానందుడి గురించి తెలుసుకోవాలి,` అని అంటారు. 
© Dantuluri Kishore Varma 

Sunday, 23 June 2013

వివేకానందా హౌస్

చికాగోలో సర్వమత మహాసభలలో ప్రసంగించి భారతదేశ కీర్తిపతాకను ఎగురవేయడానికి ముందు స్వామీ వివేకానంద ఒక సాధారణ సన్యాసిగా కాశీ నుంచి కన్యాకుమారివరకూ కాలినడకన పర్యటించడం జరిగింది. ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ, ప్రజల స్థితిగతులను గమనిస్తూ, భోజనం దొరికినప్పుడు భుజిస్తూ, లేనప్పుడు రోజులతరబడి పస్తులుంటూ మైసూరూ, మద్రాసులు మీదుగా ప్రయాణించి చిట్టచివరికి కన్యాకుమారివద్ద సముద్రంలో ఉన్న శిలమీద మూడురోజులు ద్యానం చేసుకొని భావి కార్యాచరణని నిర్ణయించుకొన్నాడు. 

తన వాక్పటిమతో, విధ్వత్తుతో, అద్యాత్మికతకు సంబంధించి లోతైన అవగాహనతో అమెరికన్ల మనసుగెలుచుకొని, దేశవ్యాప్తంగా ఎన్నో ఉపన్యాసాలు చేసి, ఇంగ్లండ్‌లో కూడా భారతవాణిని వినిపిస్తూ పర్యటించి నాలుగు సంవత్సరాలతరువాత మళ్ళీ స్వదేశం తిరిగి వచ్చాడు.

1897లో కొలంబో మీదుగా భారతదేశానికి విచ్చేశాడు. ఇప్పుడు వివేకానందుడు ప్రజల గుండె చప్పుడు. భారతజాతి యావత్తునూ సునామీ కెరటంలాంటి సమ్మోహన శక్తితో ప్రభావితం చేసిన మహానీయుడు. మద్రాసు రైలుభవన్ వద్ద ఆయనకి స్వాగతం పలకడానికి జన సముద్రం కదలి వెళ్ళిందట. రధమ్మీద కూర్చుండబెట్టి ప్రజలే దానిని లాగుతూ నగరవీధులవెంట ఊరేగింపుగా తీసుకొని వెళ్ళారట. మెరీనా బీచ్‌కి ఎదురుగా ఉన్న ఐస్ హౌస్ అనబడే భవంతిలో విడిది ఏర్పాటు చేశారు. ఈ భవనంలో వివేకానందుడు తొమ్మిది రోజులు(ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 15 వరకూ) బసచేసి ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నడు. ఆ తరువాత ఈ భవంతిని వివేకానందా హౌస్ అని నామకరణం చేసి, రామకృష్ణా మఠానికి అనుసంధానం చేశారు. పదిసంవత్సరాలపాటు రామకృష్ణ మఠం ఇక్కడ నిర్వహించ బడింది. ప్రస్తుతం ఇది వివేకానందుని జీవిత విశేషాలు, బోధనలు, భారతీయ సంస్కృతిని తెలియజేసే ఎగ్జిబిషన్‌గా ఉంది.
గూగుల్ ఇమేజస్
2000వ సంవత్సరంలో తీసినది.
ఏ విజయమూ సులభంగా లభించదు. లక్ష్యంవైపు ప్రయాణిస్తున్న వాడిని అడ్డగించడానికి వ్యతిరేకశక్తులు నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. విజయవంతమయ్యాక అవే శక్తులు `మా సహాయ, సహకారలవల్లే ఇదంతా సాధ్యమైంది` అని ప్రగల్భాలు పలుకవచ్చు. వివేకానందుని విషయంలో అదే జరిగింది. మద్రాసులోని విక్టోరియా హాలులో ఇచ్చిన ప్రసంగంలో వాటిని ప్రజలకి వివరించి చెప్పాడు స్వామీ వివేకానంద. ఈ ఉపన్యాసం స్పూర్తినింపేదిగా ఉంటుంది. లక్ష్యసాధనలో ఎదురయ్యే కష్టాలను అధిగమించడానికి కావలసిన మనోధైర్యాన్ని ఇస్తుంది. ఈ లింకులో చదవండి.

© Dantuluri Kishore Varma

Friday, 19 April 2013

ఉత్సాహం లేని చదువు, ఏకాగ్రత లేని పని, లక్ష్యం లేని ప్రయాణం ఏ ఫలితాన్నీ ఇవ్వవు.

ఒకసారి ముప్పై అయిదు భాగాలుగా ఉన్న ఎన్సైక్లోపీడియా బ్రిటానికాని తెప్పించుకొని వివేకానంద చదువుకొంటున్నాడట. ఆ బరువైన పుస్తకాలని చూసి ఒకాయన, `వీటిని చదివి అర్థంచేసుకోవాలంటే ఒక జీవితకాలం సరిపోదేమో!` అని వ్యాఖ్యానించాడట. కొత్తపుస్తకాలు చదివితే కొత్త ఆలోచనా ద్వారాలు తెరుచుకొంటాయనే అవగాహన లేని వాళ్ళకి, చదవడం మీద ఆసక్తి ఉండదు. అప్పుడు, ఆ వ్యక్తి అన్నట్టు ఒక జీవితకాలం దేనికీ సరిపోదు. కానీ, వివేకానంద ఇలా అంటాడు, `నేను ఇప్పటికే పది పుస్తకాలు పూర్తిగా చదివేశాను, కావాలంటే పరీక్షించుకో,` అని. ఆ పది పుస్తకాలనుంచీ అక్కడక్కడా కొన్ని ప్రశ్నలు అడిగితే ఎటువంటి తడబాటూ లేకుండా జవాబులు చెపుతాడు. అంత తక్కువసమయంలో చదివి, చక్కగా గుర్తుపెట్టుకోవడానికి కారణం కొత్తవిషయాలు నేర్చుకోవాలన్న అతని ఉత్సాహమే. 

సరాసరి భూమిమీద ప్రసరించే సూర్యకిరణాలు ఒకస్థాయిలో వేడిని కలిగిస్తాయి. కానీ వాటినే ఒక భూతద్దం ద్వారా ప్రసరింపచేస్తే, ఎండుటాకుల్ని, కాగితాల్ని కాల్చగలుగుతాయి. ఇది కేంద్రీకృతం చెయ్యడంద్వారా ఎన్నో రెట్లు పెరిగిన శక్తి. ఇది చదువుకి, మనం చేసే అన్నిపనులకి కూడా  వర్తిస్తుంది. ఏదయినా ఏకాగ్రతతో చేస్తే ఫలిస్తుంది. వివేకానంద అమెరికాలో ఉన్నప్పుడు ఒకరోజు ఓ కొలను ఒడ్డున వ్యాహ్యాళికి వెళుతుంటే కొందరు వ్యక్తులు షూటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. కొన్ని గుడ్డు పెంకుల్ని తాడుతో కట్టి ప్రవాహం మధ్యలో వదులుతారు. చిన్ని చిన్ని కెరటాల మీద అవి తేలుతూ ఉంటాయి. వాటిని తమదగ్గర ఉన్న ఎయిర్‌గన్‌లతో కాలుస్తూ ఉంటారు. కానీ, ఒక్కరికీ సరిగా గురి కుదరదు. అప్పుడు వివేకానంద తాను ప్రయత్నిస్తానని వాళ్ళ దగ్గర గన్ తీసుకొని ఏకాగ్రతతో పన్నెండుసార్లు కాలుస్తాడు. ప్రతీసారీ ఒక్కొక్క పెంకుచొప్పున పన్నెండు పెంకులూ పగులుతాయి. అతను తుపాకీ పట్టుకోవడం జీవితంలో మొట్టమొదటిసారి అని తెలుసుకొని వాళ్ళు ఆశ్చర్య పోతారు.  ఇది ఏకాగ్రతవల్ల వచ్చిన మంచి ఫలితమే.
  
డెడ్‌లైన్స్ అంటే అందరికీ విసుగే. కానీ, ఎంతవరకూ పరిగెట్టాల్లో తెలియకపోతే ఒక ఎథ్లెట్, ఏ తేదీ వరకూ చదవాలో తెలియకపోతే ఓ విద్యార్థి, ఏ ప్రాంతం వరకూ వెళ్ళాలో తెలియకపోతే ఓ ప్రయాణీకుడు ఎంత అయోమయ పడతారు! ఒకసారి ఫ్రాన్స్‌లో ప్రసంగించమని హిందూ సన్యాసిని ఆహ్వానిస్తారు. ఆహ్వానం అందిన దగ్గరనుంచీ, ప్రసంగ తేదీ మధ్యలో లభించిన పదిహేనురోజుల సమయంలో ఫ్రెంచ్‌భాషని నిఘంటువు నుంచి నేర్చుకొని ఆ భాషలోనే ఉపన్యసిస్తాడు. పక్షం రోజుల సమయాన్ని ఒక డెడ్ లైన్‌గా ఏర్పాటుచేసుకొని, తనకి తాను చేసుకొన్న సవాల్‌ని అధిగమించడం స్పూర్తిదాయకమైన సందర్భం.

 ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే......

ఉత్సాహం లేని చదువు
ఏకాగ్రత లేని పని
లక్ష్యం లేని ప్రయాణం
ఏ ఫలితాన్నీ ఇవ్వవు.
© Dantuluri Kishore Varma 

Sunday, 14 April 2013

వివేకానందా రాక్ మెమోరియల్‌

వివేకానందుడు కాశీ నుంచి కన్యాకుమారి వరకూ దేశాటన చేశాడు. ప్రజల స్థితిగతులు అభిలషణీయంగా లేవు. పేదరికం, అవిద్య, మూఢవిశ్వాసాలు, అనారోగ్యం వాళ్ళని పట్టి పీడిస్తున్నాయి. అన్నింటికీ మించి పరాయి పాలకుల క్రింద వెయ్యిసంవత్సరాలుగా బానిసత్వం. నాగరికతలో, శాస్త్రవిజ్ఞానంలో, వైద్యంలో, గణితంలో, విద్యలో ప్రపంచ ప్రజలకు ఒకప్పుడు మార్గనిర్దేశం చేసిన భరతఖండానికా ఈ దుస్థితి! నీచంగా చూడబడుతున్న ప్రజలకి ఆత్మగౌరవం ఇవ్వగల మార్గం ఏది? వాళ్ళలో ఉన్న శక్తిని జాగృతం  కావించడానికి ఏమిచెయ్యాలి?

భారతదేశపు ధక్షిణపు కొన నుంచి సముద్రంలోకి ఏభై మీటర్ల దూరంలో హిందూమహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతాలు కలిసే చోట ఒక చిన్న ద్వీపంలాంటి శిల ఉంది. వేగంగా వచ్చి కొడుతున్న అలల ధాటికి నిబ్బరంగా నిలబడి ఉంది. వివేకానందుని మస్తిష్కంలో కూడా ఆలోచనలు ఉవ్వెత్తున విరిగి పడుతున్నాయి.

ద్యానంలో వాటికి సమాదానాలు కనుగొనాలనుకొన్నాడేమో! సముద్రం మధ్యలో నిశ్చలమైన శిల దగ్గరకి చేరుకోవాలనుకొన్నాడు. పడవకోసం ఆగలేదు. కల్లోల సముద్రంలో ఈదుకొంటు వెళ్ళి, అక్కడే మూడురోజులపాటు నిద్రాహారాలు లేకుండా తపస్సు చేసుకొన్నాడట.

ఈ సంఘటన తరువాతే, చికాగో సర్వమత సభల్లో భారతీయ ఆద్యాత్మిక వాణిని వినిపించి మనదేశ కీర్తి పతాకను ఎగురవేశాడు. బుద్దుడికి భోది వృక్షం ఎలాగో, వివేకానందునికి కన్యాకుమారి వద్ద ఈ శిల అలాగ.

తరువాత చాలా కాలానికి 1970లలో దీనిని వివేకానందా రాక్ మెమోరియల్‌గా అభివృద్దిచేశారు. ఇక్కడ రెండు నిర్మాణాలు ఉన్నాయి ఒకటి వివేకానంద మండపం, రెండవది దేవత కన్యాకుమారి యొక్క శ్రీపాద మండపం.
ఈ రెండు నిముషాల వీడియో చూడండి.  


© Dantuluri Kishore Varma 

Sunday, 10 March 2013

సమాన(వ)త్వం

వివేకానందుని గురించి, భారతదేశం గురించి తెలుగులో చక్కని  ఉపన్యాసం.

*   *   *
ప్రతీ మతమూ గొప్పదే. సాగరగర్భంలో రత్నాల్లా గొప్పవిషయాలు ప్రతీ మతంలోనూ ఉన్నాయి. ఒక విత్తనాన్ని నాటినప్పుడు భూసారాన్నీ, నీటిని, గాలినీ, సూర్యరశ్మిని గ్రహించి మొక్కగా ఎలా ఎదుగుతుందో - అదే విధంగా ఒక వ్యక్తి కూడా విజ్ఞానాన్ని అన్ని తావులనుంచీ సముపార్జించి వ్యక్తిత్వ నిర్మాణం చేసుకోవాలని స్వామీ వివేకానంద చెపుతాడు.  మతం విషయంలో ఈ విధమైన దృక్పదాన్ని అలవాటు చేసుకొంటే వైషమ్యాలకి తావే ఉండదు.

చికాగో సర్వమత మహాసభల్లో చేసిన చివరి రెండు ఉపన్యాసాలలో, మెచ్చుతునకల్లాంటి ఎన్నో విషయాలని వివేకానందుడు ప్రస్తావిస్తాడు. వాటిని చదువుతున్నప్పుడు మతం అనేది తక్షణ అవసరం కాదనిపిస్తుంది. దానికన్నా అత్యంత ఆవశ్యకమైన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఆకలి, పేదరికం, నిరుద్యోగం, నిరాదరణ మొదలైనవి.

అమెరికాలో సర్వ సౌఖ్యాలతో బ్రతుకుతున్న ప్రజలని చూసి, మనదేశవాసుల  జీవనవిధానాన్ని వారితో పోల్చుకొని,  అన్నార్తుల దైన్యమైన దుస్థితిని తలచుకొని ఒకరాత్రంతా విలపిస్తూ గడుపుతాడట స్వామీ వివేకానంద. అందుకేనేమో, మాదేశంలో మతం కావలసినంత ఉంది. ఆకలితో అలమటిస్తున్నవాడికి కావలసింది ఆహారం కానీ, మతం ఎంతమాత్రం కాదంటాడు. మతాలకతీతంగా అన్నిచోట్లా ప్రజలు అనుభవిస్తున్న బాధలే ఇవి. కానీ వీటిమిద పోరాటాలకి జనసమీకరణ జరగదు. మతం రెచ్చగొట్టినంతగా జనాల్ని మరేదీ రెచ్చగొట్టలేదనుకొంటాను.

మణిరత్నం తీసిన సినిమా బొంబాయి, కుష్వంత్‌సింగ్ రాసిన పుస్తకం ట్రైన్ టు పాకిస్థాన్ జ్ఞాపకానికి వచ్చాయి.

కుష్వంత్‌సింగ్ పుస్తకంలో దేశవిభజన సమయంలో మతకలహాల గురించి రాస్తాడు. భూబాగాన్ని మతం ప్రాతిపధికగా `అదిమీది, ఇదిమాది,` అని వేరుచేసుకొని ట్రైన్‌లలో ప్రక్కదేశపు మతంవాళ్ళు సరిహద్దు దాటుతున్నప్పుడు నరమేదం చేసి శవాల కుప్పల్లాగ పంపిస్తారు. అటునుంచి ఇటు, ఇటు నుంచి అటూ వెళుతూ ఎన్ని వేలమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారో డాక్యుమెంట్ చేసి చూపిస్తాడు.  చరిత్రను త్రవ్వితే ఇటువంటి సంఘటనలు అన్నో కనిపిస్తాయి.

మణిరత్నం `బొంబాయి` సినిమాలో - ఇరుమతాలవాళ్ళూ ఆస్తినష్ఠం, ప్రాణనష్టం కలుగజేసుకొంటున్నప్పుడు, విచక్షణా రహితంగా చంపుకొంటున్నప్పుడు; కుటుంబంనుంచి  తప్పిపోయి, కర్ఫ్యూ విధించిన వీధుల్లో దిక్కుతోచక తిరుగుతున్న ఒకకుర్రాడు, ఒక హిజ్రా పంచన చేరతాడు. `హిందువా, ముస్లిమా అని అడుగుతున్నారు. హిందువంటే ఏమిటీ, ముస్లిమంటే ఏమిటి?` అంటాడు. అప్పుడు హిజ్రా చెప్పిన సమాధానం గొప్పగా ఉంటుంది - `మతం అంటే దేవుడ్ని చేరడానికి ఒకదారి. హిందువు ఒకదారి, ముస్లిం ఒకదారి. రెండూ దేవుడి కాడికే పోతాయి,` అని.

మతం ఒక జీవనవిధానం. ఏ మతమూ చెడ్డది కాదు. సాంప్రదాయాల్లో, ఆచారవ్యవహారాల్లో, అలవాట్లలో, నమ్మకాలలో వ్యత్యాసముండవచ్చు. కానీ, ఆకలితో ఉన్నవాడికి అన్నంపెట్టమని, బాధలలో ఉన్నవాడ్ని ఓదార్చమని, ఎవరికీ హానిచెయ్యవద్దని ప్రతీ మతమూ చెపుతుంది. అదే మానవత్వం. దీనిని మరచిపోయినవాడు ఏ మతానికీ చెందనట్టే!
© Dantuluri Kishore Varma 

హిందూ మతంగురించి చదివిన పత్రం

హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకి పరిచయం చెయ్యగల సువర్ణ అవకాశాన్ని వివేకానందుడు సాధించుకొన్నాడు. ఇంకొకవిధంగా చెప్పాలంటే, వివేకానందుని వల్ల విశిష్టమైన వైధిక మతంగురించి ప్రపంచానికి పరిచయం ఏర్పడగల అవకాశం చికాగోలో విశ్వమత మహాసభలవల్ల ఏర్పడింది. ప్రపంచం నలుమూలల నుంచీ సుమారు ఆరువేల మంది వివిధ మతాల ప్రతినిధులు హాజరయిన సందర్భంలో ఆరు ప్రసంగాలు చేసాడు. అందులో హిందూ మతంగురించి చదివిన పత్రం అత్యంత ప్రధానమైంది.
వేదాల సారంగా ఉద్భవించిన హిందూ మతం సముద్రమంత పెద్దది. ఇందులో ముఖ్యమైన భావనలని క్లుప్తీకరించి, అతి తక్కువ సమయంలో మనమతం గురించి అస్సలు ఏమీ తెలియని విదేశీయులకి తార్కికంగా విశదీకరించాలి. ఇది ఒకరకంగా కత్తిమీద సాములాంటిది. ఈ ప్రక్రియను వివేకానందుడు అవిలీలగా సాధించాడు.  వేదాలు, సృష్ఠి, భగవంతుడు, ఆత్మ, పునర్జన్మ, కర్మ, భక్తి, మోక్షం, విగ్రహారాధన లాంటి విషయాలను  వివరిస్తాడు.

వేదాల గురించి ప్రస్తావన తరుచూ వింటూనే ఉంటాం. వీటిని ఎవరు రాసారు? ఎప్పుడు? వివేకానందుడు ఏమంటాడంటే, వేదాలకు ఆది, అంతమూ లేవని. ఆది, అంతమూ లేని గ్రంధాలుంటాయా? నిస్సందేహంగా ఉండవు. అసలు వేదాలు గ్రంధాలు కాదు. వివిధ వ్యక్తులచే (వీరినే ఋషులు అనవచ్చు) అప్పుడప్పుడూ కనుగొనబడిన ఆద్యాత్మిక విషయాల సమాహారమే ఈ వేదాలు. వీటికి అంతం లేక పోవచ్చు, ప్రారంభం లేకపోవడం ఏమిటి అనే అనుమానం మనకు వస్తుంది. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు మొదలుపెట్టి ఉండవచ్చుకదా? గురుత్వాకర్షణ శక్తి అనేది ఉందని మనకు తెలియక ముందు కూడా ఉన్నట్లే, ఈ ఆధ్యాత్మిక సత్యాలు కూడా ఎల్లప్పుడూ ఉన్నాయి. అయితే, అవి ఉన్నాయన్న స్పృహ మనకి ఉండకపోవచ్చు.

 సైన్స్‌కి, ఆద్యాత్మికతకీ సమ్యమనం కుదరదు. కానీ, వివేకానందుని తార్కిక వాదన సైన్స్‌ని వేదాలలో తెలియజేసిన విషయాలని ప్రభావవంతంగా వ్యక్తీకరించడానికి ఉపయోగపడే మాధ్యమంగా తెలియజేస్తుంది. ఉదాహరణకి సృష్టికి ఆది, అంతమూ లేవు అంటారు. సైన్స్ పరంగా దీనిని చెప్పాలంటే - విశ్వంలో ఉన్న మొత్తం శక్తి పరిమాణంలో ఎప్పుడూ మార్పు ఉండదు. ఒకవేళ సృష్టి ఎప్పుడో ఒకప్పుడు మొదలై ఉండి ఉంటుంది అనుకొంటే, అంతకు ముందు ఈ విశ్వ శక్తి అంతా ఎక్కడ ఉండి ఉంటుంది? పరమాత్మలోనా? అప్పుడు, సృష్టి మొదలై ఈ శక్తి పరమాత్మనుంచి విశ్వం లోనికి ప్రవహించి ఉంటుంది కదా? అంటే రూపం మారింది అన్న మాట. మార్పు చెందేది ఏదయినా నశించక తప్పదు అని సైన్స్ చెపుతుంది. అప్పుడు, పరమాత్మకి కూడా నాశనం ఉంటుందా? నాశనం అయ్యేదాన్ని పరమాత్మ అని ఎలా అంటాం!?  కాబట్టి, సృష్టికి ఆది, అంతం లేవనే విషయం సైన్స్ పరంగా ఋజువైనట్టే కదా?

`తరచుగా చెయ్యడం వల్ల అలవాట్లు ఏర్పడతాయి అని నిరూపించబడిన విషయం. అప్పుడే పుట్టిన బిడ్డ సహజంగా స్పందిచి చేసే కొన్ని పనులు ఏ అలవాటు వల్ల సంక్రమించి ఉంటాయి?,` అని వివేకానందుడు అడుగుతాడు. జన్యుపరంగా తల్లితండ్రులపోలికలు బిడ్డలకు వచ్చినట్లే, గతజన్మ అలవాట్లు జన్మతహా సంప్రాప్తిస్తాయని అంటాడు. ధ్యానంవలన ముందుజన్మల వివరాలను తెలుసుకోగలమని అంటాడు.

ఆరోగ్యం, రూపం, సంపద, గుణగణాలు మొదలైన వాటిల్లో వ్యత్యాసాలతో మనుష్యులు ఎందుకు జన్మిస్తున్నారూ అంటే, వారి వారి ముందు జన్మల కర్మల వల్ల ఏర్పడిన దృక్పదం (టెండెన్సీ)వల్ల, దాన్ని వ్యక్తీకరించడానికి అనుకూలమైన రూపంలో జన్మ సంప్రాప్తిస్తుందట.

ఆధ్యాత్మికమూ శాస్త్రమే. ఫిజిక్స్, కెమిస్ట్రీల్లాగ దీనికి కూడా విశ్వసనీయత ఉంది. దీని యొక్క లక్ష్యం పరమాత్మని తెలుసుకోవడం. మూలకాలకన్నింటికీ ములమైన పదార్ద్థాన్ని కనుగొంటే రసాయనశాస్త్రం, శక్తులకన్నింటికీ మూలమైన ఏకశక్తిని కనుగొంటే భౌతికశాస్తం ఏరకంగా వాటి వాటి లక్ష్యలు పూర్తవుతాయో, ఆత్మలన్ని చేరగల పరమాత్మని కనుగొన్నప్పుడు ఈ శాస్త్రం యొక్క లక్ష్యసాధన పూర్తవుతుంది.

ఏ మతం వల్ల ఇది సాధ్యమౌతుంది? అసలు, మతాలు అంటే, వివిధ రంగులు గల అద్దాలనుంచి వెలువడే ఒకే కాంతి. ఇవి అన్ని రకరకాల మార్గాలు మాత్రమే. భగవంతుని తెలుసుకొనే విధానాలు కూడా రకరకాలుగా ఉంటాయి. విగ్రహారాధన మొదలు ధ్యానం, తపస్సు, మొదలైనవి. ఒక స్థాయి దాటి వచ్చిన తరువాత దానిని హీనంగా చూడకూడదు అంటాడు. వృద్దాప్యంలోకి వచ్చినతరువాత బాల్యాన్ని, యవ్వనాన్ని ఎలా తప్పిదాలు అని భావించకూడదో విగ్రహారాధనని పై స్థాయికి వెళ్ళిన తరువాత తక్కువగా భావించవలదు అంటాడు.

వివేకానందుడు చదివిన ఈ పాఠంలో కోట్‌చేసి చెప్పవలసిన ఆణిముత్యాలు అన్నో ఉన్నాయి.

ఈ టపా రాయడానికి ఓ పదిహేను, ఇరవై పేజీల ఆయన ఉపన్యాసాన్ని చాలా సార్లు చదవ వలసి వచ్చింది. చదివిన ప్రతీసారీ కొత్త విషయాలు అవగతమౌతున్నాయి. ఆయన ఉపన్యాసాలకి సమీక్ష రాయాలనుకోవడమే ఒక పెద్ద సాహసం. పొరపాట్లు ఉంటే మన్నించాలని విజ్ఞులైన పాఠకులకి మరొక్కసారి తెలియజేసుకొంటూ....

పిడిఎఫ్ రూపంలో ఆయన  చికాగో ఉపన్యాసాలన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
*   *   *
1893 వ సంవత్సరంలో చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత మహాసభలలో స్వామీ వివేకానంద పాల్గొన్నప్పటి ఫోటో. ఎడమనుండి కుడికి వరుసగా నరసింహాచార్య, లక్ష్మీనారాయన్, స్వామీ వివేకానంద, ధర్మపాల, వి.ఏ.గాంధీ. 
అరుదైన స్వామీ వివేకానంద ఫోటో

© Dantuluri Kishore Varma 

Thursday, 7 February 2013

స్వామీ వివేకానంద

`ఎక్కడెక్కడో పుట్టిన నదులన్నీ అంతిమంగా సముద్రాన్ని చేరినట్టు, రకరకాల మార్గాలని అనుసరించే మానవులందరూ నన్నేచేరతారు.  ఉద్దేశ్యాలు  ఏమయినా దారులన్నీ నాలో కలుస్తాయి,` అని భగవధ్గీతలో శ్లోకాలని ఉదహరిస్తూ సెప్టెంబర్ 11, 1893లో చికాగోలో వాల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో స్వామీ వివేకానంద చేసిన ఉపన్యాసం ఆలోచనలని రేకెత్తించేదిగా ఉంటుంది.   

ప్రపంచానికి సహనం, సౌభ్రాతృత్వం  గురించి చెప్పిన దేశం మనదని సోదాహరణంగా చెప్పినప్పుడు గర్వంగా అనిపిస్తుంది. మనుషులు పరస్పర వైరుద్యాలతో, మత మౌడ్యంతో రక్తపాతాన్ని సృష్టించుకోకుండా ఉండి ఉంటే మానవ నాగరికత ఇంకా ముందుకు వెళ్ళిఉండేదని చారిత్రక తప్పిదాలని ఎత్తి చూపిస్తాడు.   

దారులు వేరైనా ఒకే గమ్యం కోసం ప్రయాణిస్తున్న మనుష్యుల మధ్య వైరుధ్య భావనలకి అప్పటి సభలు చరమగీతం కావాలని అభిలషిస్తాడు. 

విశాల దృక్పదంతో చూస్తే వివేకానందుని మాటల్లో సత్యం, విచక్షణ అవగతమౌతాయి. 
1995లో ఒక స్నేహితుడు రాజమండ్రీ వెళుతుంటే అతని చేతికి నూటడబ్బై అయిదు రూపాయలు ఇచ్చి రామకృష్ణా మఠం నుంచి `ది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామీ వివేకానంద` అనే ఎనిమిది వాల్యూముల సెట్‌ని తెప్పించుకొన్నాను. అప్పుడప్పుడూ ఒక్కో పుస్తకం తీసుకొని ఒకటో, రెండో చాప్టర్లు చదవడం, ఆ పుస్తకాన్ని ప్రక్కన పెట్టడం అనే ప్రక్రియ జరుగుతూ ఉంది. అక్కడక్కడా కొంచెం, కొంచెంగా చదవడం తప్పించి పూర్తి చెయ్యలేక పోయాను.  

ఆన్ లైన్‌లో ఉన్న స్వామీ వివేకానంద కంప్లీట్ వర్క్స్ యొక్క లింక్ ఇదిగో.

ఎప్పటినుంచో నాకు అర్థమైన స్వామీవివేకానంద భోదనల గురించి వ్రాయాలని అనుకొంటూ ఉన్నాను. నెలకి ఒకటో రెండో పోస్టులు ఆరకంగా రాయాలని ఒక ప్రణాళిక చేసుకొంటే చదవాలనే నిబద్ధత కలుగుతుంది. అది ఒక ఉపయోగం. చదవడం కోసం చదవడం కాదు కనుక, దాని గురించి రాయాలనే బాధ్యత ఉంటుంది కాబట్టి ఒక అధ్యాయనంలాగ జరుగుతుంది. దీనివల్ల నాకున్న చాలా సందేహాలలో కొన్నింటికి సమాదానం దొరకవచ్చు. నేను చెయ్యాలనుకొనేది ఆయన రచనలకి, గీతమీద వ్యాఖ్యానాలకీ అనువాదాలు కాదు. ఒక రివ్యూ లాంటి నా స్పందన మాత్రమే. 

నా బ్లాగ్‌ని చదివేవారిలో పెద్దవారు, విజ్ఞులు ఉన్నారు. ఎప్పుడయినా వారి విజ్ఞాన సంపద నాకు ఉపయోగ పడుతుందని వారు భావిస్తే, వ్యాఖ్యల రూపంలో అందిస్తారని అనుకొంటున్నాను. 
© Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!