బాల కృష్ణుడు నివశిస్తున్న బృందావనానికి సమీపంలో కాళింది అనే ప్రదేశం ఉంది. అది చాలా సుందరమైన వనం. అక్కడ ఒక మడుగు కూడా ఉంది. పైకి ఎంతో నిర్మలంగా ఉండే ఈ మడుగులో జలం అంతా విషపూరితం. దానికి కారణం కాళీయుడు అనే ఐదు తలల మహా సర్పం అందులో నివశిస్తూ ఉండడమే.
ఒకసారి చిన్ని కృష్ణుడు తన మిత్రబృందంతో కలసి కాళింది వనానికి విహారానికి వెళతాడు. అందరూ ఎంతోసేపు ఉత్సాహంగా పరుగులు పెట్టి ఆడుకొంటారు, శ్రీకృష్ణుని వేణుగానామృతంలో తడిసి ముద్దవుతారు. ఆటపాటల్లో అలసిపోయిన బాలకులు కొందరు దప్పిక తీర్చుకోవడానికి కాళింది మడుగు దగ్గరకి వెళ్ళి, నీరు తాగుతారు. ఇంకేముంది, కాలకూట విషంలాంటి ఆ నీరు గొంతు దిగడమే ఆలశ్యం వాళ్ళందరూ అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తారు.
శ్రీకృష్ణుని తక్షణ కర్తవ్యం మరణించిన స్నేహితులని బ్రతికించడం, మరి ఇంకెవరికీ ఇలాంటి మరణం లేకుండా నివారించడం. భగవంతుడైన అతనికి ఇవి అసాధ్యమైన పనులు కాదు. ఆతని ఒక చల్లని చూపుతో బాలకలందరూ ఘాడనిద్రలోనుంచి మేల్కొన్నట్టు లేచి కూర్చున్నారు. ఇక రెండవది కాళీయుని తుదముట్టించడం!
మడుగులోకి లంఘించి దూకాడు. నీటిని అల్లకల్లోలం చేశాడు. కాళీయుని వెతికి పట్టుకొన్నాడు. తోకని గుప్పిటలో బిగించి, కోపంతో బుసకొడుతున్న మహా సర్పం పడగలమీదకి ఎక్కి బలమైన తాపులతో మర్దనం చేశాడు. పిడుగు పాటుల్లాగ ఐదు తలలమీదా పడుతున్న దెబ్బలని భరించలేక, శ్రీకృష్ణుని శరణువేడి, మడుగు విడిచి పోతానని మాట ఇచ్చి, దయనీయంగా వేడుకొని, ప్రాణాలు దక్కించుకొని కాళీయుడు అక్కడినుంచి పారిపోతాడు.
భాగవతంలో కాళీయమర్దనం అనేది ఒక వీరోచిత ఘట్టం.
© Dantuluri Kishore Varma