Pages

Sunday, 18 September 2016

ఆకాశంలో మామిడిచెట్టు

స్కూల్ గార్డెన్ కోసం మొక్కలు కొందామని చీడిగ వెళ్ళాం. చిన్ని చిన్న గార్డెన్‌లకి మొక్కలు కావాలంటే కాకినాడవాళ్ళు కడియపులంక వరకూ పోవలసిన అవసరం లేకుండా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చీడిగలో రెండు పెద్ద నర్సరీలు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. ఒకటి వినాయకా నర్సరీ, రెండవది విగ్నేశ్వరా నర్సరీ! ఏ నర్సరీకి వెళదాం అని ఒక నిమిషం సందిగ్ధంలో చూస్తుంటే... అశోకచెట్లని ప్రవేశద్వారంలా పెంచిన నర్సరీ మా చూపులని ఆకర్షించింది. 

అశోకచెట్లు సైప్రస్ చెట్లలాగ నిటారుగా పెరుగుతాయి. కానీ ఒక్కొక్కసారి కొమ్మలు రావచ్చు. ఈ నర్సరీలో ప్రవేశానికి అటూ ఇటూ వేసిన అశోక మొక్కల్లో ఒకదానికి ఓ కొమ్మ అడ్డంగా పెరిగి రెండవ చెట్టుకు తగిలే వరకూ వచ్చింది. చెట్టు అందం చెడకుండా ఉండడానికి సాధారణంగా అడ్డంగా పెరిగిన కొమ్మల్ని నరికేస్తుంటారు. కానీ ఇక్కడ కొమ్మని వదిలి, చెట్టుకి పైభాగాన్ని నరికేశారు. రెండవ చెట్టుని కూడా ప్రక్క చెట్టు కొమ్మ తగిలిన ప్రదేశం వరకూ ఉంచి, ఆ పై భాగాన్ని తొలగించారు. వాళ్ళ ఈ ఐడియా ఎక్కువమంది ఖాతాదారుల్ని ఆకర్షించడానికి ఉపయోగ పడుతుంది!   

   *          *          *
నర్సరీలో ఈ చివరినుంచి ఆ చివరివరకూ నాలుగైదుసార్లు తిరిగి, కావలసిన మొక్కల్ని ఎంచుకొని, వాటికి సరిపోయే కుండీలు కూడా తెప్పించి, మొక్కల్ని కుండీలలో వేసే పనిని నర్సరీ వాళ్ళకి అప్పగించాం. మాకోసం రెండు కుర్చీలు తెప్పించి అక్కడ వేసి, వాళ్ళు పనిలో పడ్డారు. సాయంత్రపు చల్లగాలి హాయిగా వీస్తుంది. అస్తమించడానికి పశ్చిమానికి ప్రయాణిస్తున్న సూర్యుడు చెట్ల కొమ్మల సందుల్లోనుంచి ఏటవాలు కిరణాలని భూమిమీద చల్లుతున్నాడు. ఆకాశంలో నీలంరంగు చిక్కబడుతుంది. తెల్లని మేఘాలు నీళ్ళు తాగడానికి కొండవాగు దగ్గరకి వెళుతున్న ఏనుగుల గుంపుల్లాగ మెల్లగా కదిలిపోతున్నాయి. మేఘమాలికలకి, అనంతమైన నీలానికి మధ్య ఉండే లోతైన(!) దూరం సాయంత్రపు ఆకాశానికి అనిర్వచనీయమైన అందాన్నిస్తుంది. మీరెప్పుడైనా గమనించారా? 
 
`ఈ మావిడి చెట్టు చూడండి ఎంత పొడవుందో!` అంది ఆమె. నిటారుగా సుమారు ముప్పై అడుగులు పెరిగిన మానుకి చివర గొడుగులాగ విచ్చుకొన్న మావిడాకుల గుత్తులు! `ఇదేంటి ఇలా ఉంది?` అని అడిగాను నర్సరీ యజమానిని. చిన్నప్పుడు ఈ చెట్టు కొమ్మలు వేస్తుంటే విరిచేసే వాళ్ళమండి. దానితో టేకు చెట్టులాగ పెరిగిపోయింది. దీని కాయలేమీ బాగోకపోయినా, చెట్టు అందంగా ఉందని అలా ఉంచేశాం,` అన్నాడు. `పొడవుగా పెరగాల్సిన ఆశోకచెట్టు, గుబురుగా పెరగవలసిన మావిడిచెట్టూ అది-ఇది, ఇది-అదీ అయ్యాయి!   

`కొన్నింటికి లాజిక్కులుండవు` అంది ఆమె.

`ఉంటాయి - ఎందుకంటే లాజిక్కుని నిర్ణయించేది సందర్భమే కానీ, జనరలైజేషన్ కాదు,` అన్నాను. నిజానికి అలాగ ఎందుకన్నానో నాకు తెలియదు. `ఎలాగ,` అని వివరణకోసం ఆమె అడగలేదు. కానీ అడిగుంటే....!?
*          *          *
ఒక కథ....

ఒక స్వామీజీ తన భక్తులనందరినీ ఒక మావిడి చెట్టుక్రింద కూర్చో బెట్టుకొని ఉపన్యాసం చెపుతూ ఉన్నారు. అందరూ మంచి భక్తి పారవశ్యంలో ఉండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద రాయి వచ్చి స్వామీజీ నడి నెత్తిమీద పడింది. భక్తులు హడావుడిగా నాలుగు వైపులకీ పరిగెత్తుకు వెళ్ళి, రాయి విసిరిన వాడిని పట్టుకొని స్వామీజీ ముందు నిలబెట్టారు. 

నెత్తిమీద కట్టిన బొప్పి నొప్పిని కలిగిస్తున్నా, మొహమ్మీద చిరునవ్వును పోనివ్వకుండా ప్రయత్నిస్తూ, `రాయి ఎందుకు విసిరావు నాయనా?` అని స్వామీజీ సహనంతో అడిగారు వాడిని. 

`రెండు రోజుల నుంచి ఎక్కడా పని దొరకలేదండి. తిండి లేక ఆకలితో ఉన్నాను. దారి ప్రక్కన మావిడి చెట్టుకి కాసిన పళ్ళను చూసి వాటితో కడుపు నింపుకొందామని చెట్టుపైకి రాయి విసిరాను. మీరు ఇటువైపు ఉన్నారని నేను చూసుకోలేదు. నాకు రెండు పళ్ళు దొరికాయి. కానీ మీకే దెబ్బ తగిలింది. నన్ను క్షమించండి,` అన్నాడు.

భక్తులంతా కోపంతో ఊగిపోతున్నారు. `వీడిని ఏమి చెయ్యమంటారో చెప్పండి స్వామీజీ?` నరికి పోగులు పెట్టమంటారా, లేకపోతే కాలూ, చెయ్యి విరిచెయ్యమంటారా?` అని ఉద్రేకపడిపోతున్నారు. 

`వద్దు నాయనలారా. వాడి తిండికి లోటులేకుండా ఉండేలాంటి సంపాదనని ఇచ్చే పని ఇప్పించండి` అన్నారు స్వామీజీ. 

*          *          *
రెండవ కథ...

దక్షప్రజాపతి కుమార్తె సతీదేవి పరమేశ్వరుని భార్య. ఒకసారి దక్షుడు యజ్ఞం చేస్తూ  ఈశ్వరుడికి ఆహ్వానం పంపడు. సతీదేవి తండ్రి చేస్తున్న యాగమే కనుక ఆహ్వానం లేకపోయినా వాత్సల్యంతో అక్కడికి వెళ్ళి అవమానింప బడుతుంది. అవమానభారంతో ఆమె అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. శివుడు తపస్సుకోసం హిమాలయాలకు వెళ్ళిపోతాడు.  సంవత్సరాలు గడచిపోతాయి... సతిదేవి తిరిగి పార్వతిగా జన్మిస్తుంది. తారకేశ్వరుడనే రాక్షసుడిని సంహరించే లోక కళ్యాణ కారణం శివపార్వతుల వివాహంతో ముడిపడి ఉంది. వాళ్ళకి జన్మించే పుత్రుడే ఆ కార్యాన్ని పూర్తిచెయ్యగలడు. ధ్యానంతో సమాధిస్థితికి చేరుకొని ఉన్న శివుడిని మేల్కొలిపి పార్వతితో సమాగమం చేయ్యగల చమత్కారం మన్మధుని బాణాలకే ఉంది. అందుకే, దేవతలందరూ అతనికి ఈ బాధ్యత అప్పగిస్తారు. ధ్యానముద్రలో ఉన్న పరమేశ్వరుని ముందు పార్వతి నాట్యం చేస్తుంటుంది, కామదేవుడు తన పుష్ప బాణాలు సంధిస్తాడు. శివుడికి తపోభంగం అవుతుంది. అతని ఆగ్రహజ్వాలలకి మన్మదుడు దహింపబడతాడు. కానీ మన్మద బాణాల ప్రభావంతో శివపార్వతులు ఏకమౌతారు.
*          *          *
మొదటి కథలో... కొట్టినవాడిని తిరిగి కొట్టడమో, లేకపోతే క్షమించి విడిచి పెట్టడమో చెయ్యాలి కానీ.. పని ఇప్పించడం ఏమిటి? రెండవ కథలో... మన్మథుడికి గొప్ప ఉపకారం జరగాలి.  నిజానికి జరిగిందేమిటి?

`అందరూ సాధారణంగా చేసే పనే మనం కూడా చెయ్యడం లాజిక్ అనుకొంటాం. కానీ సందర్భానికి అనుగుణంగా చేసేదే నిజమైన లాజికల్ పని, రాయిదెబ్బ తిన్న మావిడి చెట్టు ఆలోచన లేనిదైనా, కొట్టిన వాడికి రెండు పళ్ళు ఇచ్చింది. ఆలోచన ఉన్న మనం చెట్టు ఇచ్చిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఇవ్వడమే అసలైన లాజిక్ కదా?` 

ఇక ఒక గొప్ప అవసరం కోసం పూలబాణంతో కొట్టి శివ తపోభంగం చేసిన మన్మథుడికి కాలి బూడిదవ్వడం మనలాజిక్కులకి అందని లాజిక్.  దానిలో ఆంతర్యం ఎవరికైనా తెలిస్తే చెప్పండి.

© Dantuluri Kishore Varma 

10 comments:



  1. ఆకాశంలో మామిడి
    నీకాశంబు కథ జెప్పె నియతియు తెలిపెన్ !
    యేకోశానగు లాజిక్ ?
    మాకే మైనా తెలుపుడు మంచిగ మీరూ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. సహేతుకమైన కారణం ఏదో ఉండే ఉంటుంది లెండి. అయితే నాకు మాత్రం తెలియదు.

      Delete
  2. chaala rojula nundi kanipinchadam ledu .....malli ennalaku mee post chusa ...santosham

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ప్రతాప్ రెడ్డి గారూ...

      Delete
  3. manmadhudini bhasam chesina ghatana venuka logic given in my G+

    ReplyDelete
  4. వర్మ గారు మరీ క్వార్టర్లీ పరీక్షల్లాగా మూడు నాలుగు నెలలకో టపా వ్రాస్తున్నారు 🙂. బిజీగా ఉన్నట్లున్నారు. మీ టపాలు మిస్ అవుతున్నాం.
    మన్మధుడు కాలి బూడిదవడానికి కారణం శివుడికి ధ్యానభంగం కలిగించడమే కానీ వేరొకటి కాదు కదా. మరి సీరియస్‌గా ఓ దాంట్లో నిమగ్నమయ్యున్న వ్యక్తికి చిరాకు రావడం సహజమే. తపస్సు చేసుకుంటున్న, మౌనవ్రతంలో ఉన్న ఓ ఋషి గారు తన ప్రశ్నకి జవాబివ్వలేదని వేటకొచ్చిన పరీక్షిత్తు మహారాజు ఆ పక్కనే చచ్చిపడున్న ఓ పాముని తన విల్లు కొనతో తీసి ఆ ఋషి మెడలో వెయ్యలేదా, అది తెలిసి - ఋషి గారి ద్వారా డైరెక్ట్ గా కాకపోయినా - ఆయన గారి కొడుకిచ్చిన శాపానికి గురవలేదా (తక్షకుడి కాటుకి బలవడం). అలాగే మన్మధుడి విషయంలో - అతను చేసిన పని లోకకల్యాణం కోసమా అన్నది తర్వాత సంగతి (లోకకల్యాణం కోసం అయినప్పుడు అతనికి హాని కలగకుండా తగిన ఉపకారం చెయ్యవలసినది అతన్ని ఆ పనికి ప్రేరేపించిన వారే కదా), ముందు కళ్ళు తెరిచి చూడగానే ఆ క్షణానికి అవతల వ్యక్తికి (దేవుడయినా సరే) ఉవ్వెత్తున వచ్చిన కోపాన్ని అదుపు చేసుకోలేని బలహీనతే కారణం అని నాకు తోస్తున్నది, దేవుళ్ళకి, దేవతలకి కూడా కోపాలెక్కువ వచ్చేయడం, ముందు శాపాలిచ్చేయడం మామూలే కదా 🙂. అయితే ఇక్కడ నీతి ఏమిటంటే ఏకాగ్రతలో ఉన్న వారిని డిస్టర్బ్ చెయ్యకూడదు, చేస్తే ఫలితం అనుభవించాల్సుంటుంది అనుకోవాలి. దీంట్లో అంతకు మించి నిగూఢార్ధం ఉందని నాకనిపించడంలేదు. మరి astojoyd గారు ఏమంటున్నారో నాకూ తెలుసుకోవాలనుంది.

    ReplyDelete
    Replies
    1. `దీంట్లో అంతకు మించి నిగూఢార్ధం ఉందని నాకనిపించడంలేదు,` అని మీరన్న మాట నిజమే కావచ్చు. మీ వివరణ చక్కగా ఉంది నరసింహా రావు గారూ... ధన్యవాదాలు. ఇప్పటినుంచి మళ్ళీ తరచుగా రాస్తాను సర్ :)

      Delete
  5. ఆలోచన ఉన్న మనం చెట్టు ఇచ్చిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఇవ్వడమే అసలైన లాజిక్ కదా?

    బావుందండీ మీ లాజిక్ :)

    ~ లలిత

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు లలిత గారు :)

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!