Monday, 26 August 2013

ఇంకొక్క పెసరట్టు!

కాకినాడ మెయిన్‌రోడ్ నుంచి జగన్నాధపురం వంతెనవైపుగా వస్తున్నప్పుడు, గోల్డ్‌మార్కెట్ సెంటర్ దగ్గర కుడిచేతివైపు మంత్రిప్రగడవారి వీధిలోనికి తిరిగి ముందుకు వెళ్ళండి. బాగా ముందుకి వెళితే దేవాలయం వీధికి వెళ్ళిపోతారు. వద్దు! అంతవరకూ వెళ్ళడం అనవసరం. కొంచెం నె...మ్మ...దిగా కదలండి. ఆ))) చూశారా, రోడ్డుకి రెండువైపులా వరుసగా బజ్జీ బళ్ళు, పిడతకింద పప్పు, రాజస్థానీవాళ్ళ పానీపూరీ, పావుబాజీ, చపాతీ బళ్ళు....వాటి దగ్గర బైకులమీద, స్కూటర్లమీద, సైకిళ్ళమీద, కార్లలో, నడిచీ వచ్చిన ఫాస్ట్‌ఫుడ్ ప్రియులు ఎంతోమంది ఆవురావురుమని మిరపకాయ బజ్జీలనీ, కళాత్మకంగా పానీపూరీల్నీ తినడం కనిపిస్తుందికదా?  నోరు ఊరుతుంది, అవునా? ఆగండాగండి. తొందరపడి ఎదో ఒకటి కొనేసుకోకండి. ఒక్క నాలుగడుగులు....

ఎడమచేతివైపు మసక వెలుతురులో కణకణమని మండుతున్న గ్యాస్‌స్టవ్ మీద పెద్ద పెనం. దానిమీద అరచేతి అంత చిన్ని చిన్ని అట్లు. అట్లకాడతో చిన్న డబ్బాలోనుంచి నూనెతోడి, వాటిమీద చిలకరిస్తున్న వ్యక్తిని చూశారా? అతని చేతులు మెషీన్‌లలా కదులుతున్నాయి. మెత్తగా రుబ్బిన పొట్టుపెసర పప్పు పెనం మీద వేసి, దానిమీద ఉల్లితరుగు, మొరుంగా ఉన్న ఎండుమిరపకాయ పొడుం, వడపప్పు, జీలకర్రా అలా అలా పరచి; మధ్య మధ్యలో వాటిని తిరగేస్తూ, నూనె వేస్తూ చకచకమని వేయిస్తున్నాడు. ఆగితే కుదరదు, రెస్టు అన్న మాటే చెప్పకూడదు. `ఇదిగో, ఇక్కడ ఇంకొకరెండు,` `ఏం బాబు, ఇంతసేపా? మేం ముందే వచ్చాం. ఇంకా కట్టలేదు,` అనే రకరకాల మాటలు వింటూ, ఈ పెసరట్లు ఎంత ఫేమసో అని ఆశ్చర్యపోతూ మన వంతుకోసం ఆగుదాం. 
అయిదునిమిషాలు వెయిట్‌చేసి ప్లేటులో వేయించుకొన్న రెండు పెసరట్లలో ఒక్కోదాన్నీ రెండంటే రెండే ముక్కలుగా తుంచుకొని, కరాచీనూక ఉప్మా, కారంచట్నీల్లో లడాయించి ఊ...ఫ్ అని లోపలకి లాగేసుకొంటున్న పెద్దమనిషి; మళ్ళీ వెంటనే ప్లేటుని ముందుకు చూపిస్తున్నాడు - మరో రెండట్లకోసం. ఆయన వంతు ఎప్పుడవుతుందో, మన పేకెట్ చేతికి ఎప్పుడు వస్తుందో!    

అమ్మయ్యా! అదిగోనండీ, మనకోసం న్యూస్‌పేపర్‌లో విస్తరాకు ముక్క వేసి, వేడివేడి అట్లు వేస్తున్నాడు. వాటిమీద మళ్ళీ ఇంకొక ఆకు. దానిలో ఉప్మా. ఒక ప్రక్కన కారంచట్నీ, దానికి చేర్చి తీపిచట్నీ. కలిపి చుట్టబెట్టు దారంతో కట్టేశాడు. `ఎంత?` అంటారా? పెసరట్టు ఒక్కటే అయితే అయిదు రూపాయలు. ఉప్మాకూడా కలిపితే పది. 

మాస్టారూ... ఆహా.. అదిరిందండి. అయినా, రుచి ఒక్కటే కాదండీ... అసలు అయిదురూపాయలకీ, పదిరూపాయలకీ ఏమొస్తుందని ఈ రోజుల్లో! ఈ అట్లు కొట్టాయన పేరు సుబ్బారావు - ఆయన ప్రొడక్ట్ సుబ్బారావుగారి పెసరట్లు. ఇంకొకటి ఉంది ఇలాంటిదే. ఆపేరు బహుశా మీరు వినే ఉంటారు - మహాలక్ష్మీ పెసరట్లు. ఉదయం ఆరుగంటలనుంచి పదిగంటలవరకూ, మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి పదిగంటల వరకూ వేసిన చెయ్యి వేస్తూ ఉంటే, తినే నోళ్ళు తింటూ ఉంటాయి. ఒట్టూ, కావాలంటే మీరే చూడండి. 
*     *     *
వేడి వేడి పెసరట్టులాగ ఇది నా రెండువందలో పోస్టు.   

ఇంకొక్కటి....!?
© Dantuluri Kishore Varma 

36 comments:

 1. కాకినాడ మా అమ్మమ్మగారింటి దగ్గర 'పెసరట్ల మాలక్ష్మి'దగ్గర పెసరట్లు చాలా గొప్ప టేస్ట్ తో వుండేవి ..మహత్తరంగా చేసేది ..35 ఏళ్ళక్రితం నేనూ అక్కడికి వెళ్లాను,, నేటికీ ఎప్పుడు మావాళ్ళు వెళ్ళినా ఆ పెసరట్లు తెప్పించుకుని తిన్టూటాం..

  ReplyDelete
  Replies
  1. మహాలక్ష్మి పెసరట్ల రుచి అమోఘం మూర్తిగారు. మీ కామెంటుకి ధన్యవాదాలు.

   Delete
  2. నేను చదువు కున్నది కాకినాడ లో.. చాల బాగుంటుది కాకినాడ పట్టణం. నా జీవితం లో మరిచి పోలేని ప్రదేశం. ఎప్పటికైనా నేను ఒక స్తలం కొన్నుక్కుని అక్కడ ఇల్లు కట్టుకోవాలని నా కోరిక

   Delete
  3. ప్రశాంతమైన ప్రదేశం కనుక చాలామంది అలానే కోరుకోంటారు Sarma Rani గారు. అందుకే కాకినాడని పెన్షనర్ల పేరడైజ్ అంటారు. మీ కామెంటుకి ధన్యవాదాలు.

   Delete
 2. గోజిలకి పెసరట్లకి అవినాభావ సంబంధం ఉందండీ! మీరు చెప్పిన జైన దేవాలయం సందు చివర దేవాలయం వీధిలో పదేళ్ళున్నా. ౧౯౭౦లో. కొత్తగా వచ్చినట్లున్నాడు. ఈ సారి వచ్చినపుడు తప్పక అప్పారావుని.....మరి కమ్మటి పెసరట్లతో రెండు వందలవటపా అందించినందుకు ...మీకు....అభినందనలు..మరిన్ని టపాలు రాయాలనీ ఆంగ్లం మీ బ్లాగులో తగ్గాలనీ, తెనుగు విరివిగా వాడాలనీ కోరుకుంటూ...

  ReplyDelete
  Replies
  1. :) ధన్యవాదాలు శర్మగారు!

   Delete
 3. pesarattu mana andhra de(anduke andhra pesarattu ane pelustaru) andullo mana kakinada pesarattu adarahoo...

  ReplyDelete
  Replies
  1. మీరు కాకినాడ పెసరట్టుకి ఇచ్చిన కితాబు భహు ముచ్చటగా ఉంది. ధన్యవాదాలు శ్రీరాం సునీల్ వర్మ గారు.

   Delete
 4. Thanks for sharing the information. Next time when we visit Kakinada ( may be during Sankranthi) we will eat...

  ReplyDelete
  Replies
  1. ఈ పోస్ట్‌మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు ప్రసాద్ గారు.

   Delete
 5. నిజమేనండీ!పెసరట్టు మీద పూర్తి పట్టున్నది ,నాకు తెలిసినంతవరకూ ఉభయగోదావరి వారికే.బావుంది మీ టపా.డబుల్ సెంచరీకి శుభాకాంక్షలు .అన్నట్లు రేపు పెసరట్టు తినెయ్యాల్సిందే!

  ReplyDelete
  Replies
  1. చాలా థాంక్స్ మీకు నాగరాణిగారు. మీ శుభాకాంక్షలు అందుకోవడం ఆనందంగా ఉంది.

   Delete
 6. not just 'one-more'
  we want to see/read 2-3-4-5 hundreds more from you :-)

  ReplyDelete
  Replies
  1. మీరన్న మాట గొప్ప కాంప్లిమెంట్. ధన్యవాదాలు కృష్ణగారు.

   Delete
 7. very mouth watering write up. it reminds me of "KoTayya" pesaraTTU dukaanaM in Machilipatnam. he serves "ginger chutney"' with pesarattu and upma… thanks for making us to travel to the memory lane… and recollect all the memories...

  ReplyDelete
  Replies
  1. ప్రతీఊరికీ ఇలాంటి ప్రత్యేకతలు ఉంటాయి. ఏదో మనఊరని అభిమానంతో చెప్పుకొంటాం. నిజానికి పైపోస్టులో కాకినాడ పేరు తీసేసి మరియేపేరు రాసినా అతికినట్టు సరిపోతుంది. నోరు ఊరించగలిగిందంటే ఈ పోస్టు ధన్యమైనట్టే ఇందిరగారు, కదా? ధన్యవాదాలు మీకు.

   Delete
 8. భలే వర్ణించారు. :)

  అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ శిశిరగారు.

   Delete
 9. కిశోరే గారు, మీరు ఈ పోస్ట్ ని కేవలం కాకినాడలో వాళ్లకు మాత్రమే కనిపించేలా set చేయండి, మీ పోస్ట్ చదివినందుకు నాకు ఇప్పుడే కాకినాడ వొచ్చేసి పెసరట్టు తినాలని ఉండండి, ప్చ్ రాలేను కదా... :((

  ReplyDelete
  Replies
  1. అలాగే సెట్ చేశానండి. కానీ, చిన్న టెక్నికల్ ప్రోబ్లం వల్ల కాకినాడకి దూరంగా ఉన్నా, మనసంతా ఇక్కడే ఉన్నవాళ్ళకి కూడా ఈ పోస్టులు కనిపించేస్తున్నాయి. కాబట్టి, చదివేసి ఆనందించండి. ధన్యవాదాలు. :)

   Delete
 10. baagaa nOroorinchErandee kishore varma gaaroo ! nEnu kaakinaaDalOnE chaduvukunnaanu . kaanee inTlOnE thappa bayati pesaraTtu tinalaa :) kaanee maa naanna gaaru chaduvukunnadee kaakinaaDE !! aayana kaalam lO koodaa kakinaDa vanTalaki inthE famous Ta !

  ReplyDelete
  Replies
  1. ఎప్పుడైనా అవకాశం ఉంటే ఇలాంటివి తప్పనిసరిగా రుచి చూడడానికి ప్రయత్నించండి జయప్రభగారు. బ్లాగ్‌ని చదివి విలువైన కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు.

   Delete
 11. nEnu comment peTTaanE mee pesaraTTu kadha chadivi . kanipinchadEmi chepmaa ?

  ReplyDelete
  Replies
  1. కామెంట్ మోడరేషన్ ఉందండి. బ్లాగ్ రైటర్ మీ కామెంట్ని చూసి, ప్రచురించేదాకా కనిపించదు.

   Delete
 12. Kakinada lo maa maaamaya intlo untoo (1958-63) engineering chadukune rojulu- maa mamayya -maa vadina ni pilichi ( maaa maamayya - maa amma gari tammudu --aayana bharya rajeswari maa menattha gaari ammaayi ...andukani alaa varasa tappindi !) -"rajeswari ! subbu (naa muddu peru !!) ki penam meeda appatikappudu ilaa vesi alaaa vaadi plate lo pettu..paapam-vedi vedi gaaa tintaadu " ane vaadu - ullipaaya pesarattu- anduloki kobbari pacchaadi-allappachhadi - ) pesarapappu kante - pesalu naanesi rubbi pottuto aa pindito attu veyinchukunte baaguntundita pesarattu !--meeru antha raaste -varma gaaru -nenoo intha raasi meetho potee padutunnaanu -abhinandanalu

  ReplyDelete
  Replies
  1. మీ జ్ఞాపకాలని పంచుకొన్నందుకు ధన్యవాదాలండి.

   Delete
 13. Hello sir, where is మీసాలరాజు కోడి పలావు ?

  ReplyDelete
  Replies
  1. బ్లాగ్ చూస్తూ ఉండండి తప్పనిసరిగా తొందర్లోనే వస్తుంది :)

   Delete
 14. kishore garu ...thanks..
  nenu kakinada 4 to 5 times vellanu... ee sari thappakunda taste chesthanu... inka raaju gaari biryani ani kuda vinnanu... adi ekkado theliledu..daani gurinch cheptharaa ..subbaiah hotle kooda visheshame kada..?

  ReplyDelete
  Replies
  1. శ్రీకాంత్ గారూ, సుబ్బయ్య భోజనం స్పెషలే. ఇక రాజుగారి బిర్యానీ అంటే కాకినాడ మసీద్ జంక్షన్‌కి దగ్గరలో ఉన్న అశోకా హోటల్ వాళ్ళది.

   Delete
 15. నేను కాకినాడ మంత్రిప్రగడ వారి వీధి లొ వీవెర్స్ హోస్టల్ లో ఉండే వాడిని. సంత చెరువు పక్క సందులొ, సాయి బాబా గుడి రోడ్ లొ, ఒక పెద్దావిడ పెసరట్లు వేస్తుంది. రుచి అద్భుతహ. నేను ఇంజినీరింగ్ కాకినాడ JNTU లో చేసా. 2009 వరకు అక్కడే ఉండే వాడిని. ఇదే కాదు. ఇంకా పిండాల చెరువు దగ్గర మైసురు బజ్జిలు, బాబాయి హొటెల్ (గొల్డ్ మార్కెట్ సెంటెర్) లొ భోజనం, ముఖ్యం గా కొసరి కొసరి వడ్డిస్తారు ఆ హోటెల్ లో. స్తూదెంట్స్ కి తక్కువ రేట్ అక్కడ. సంత చెరువు నాగెంద్ర స్వామి గుడి ముందు ఒక చిన్న హోటెల్ లో, అట్లు వేస్తారు. అచ్చంగా మన ఇంట్లో చేసినట్టే ఉంటాయి.

  ReplyDelete
  Replies
  1. మీ జ్ఞాపకాలను షేర్ చేసినందుకు ధన్యవాదాలు వెంకటేష్ గారు. :)

   Delete
  2. NICE INFORMATION VENKATESH GARU,,NEXT TIME KKD VISIT I WILL COVER ALL..THANKS KISHORE GARU YOU ARE DOING COMMENDABLE JOB...ALL D BEST SIR

   Delete
 16. ఆహా ! ఏమి రుచి తినరా మైమరచి
  అల్లం జీలకర్ర ఆ పైన పెసరపప్పు దట్టించి
  ఆకారమే మారని ఆకుపచ్చని పెసరట్టు
  చాలు అనటం మరఛి తినరా మైమరచి

  ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!