పెర్ల్‌బక్ రాసిన ది బిగ్ వేవ్ కథకి 17.04.2015 నాటి గోతెలుగు వారపత్రికలో పరిచయం రాశాను. (కథా పరిచయాన్ని ఇక్కడ చదవండి.) ప్రకృతి వైపరీత్యాల నేపద్యంగా జననమరణాల రహస్యాలనీ, తాత్వికతని రంగరించి చిన్నపిల్లలకి కూడా అర్థమయ్యే విధంగా పెర్ల్‌బక్ చెప్పిన కథ ఇది.
కథలో...
ఒకరోజు ఆకాశం మేఘావృతమైంది, కొండ వెనుక దూరంగా అగ్నిపర్వతంలోనుంచి నిప్పురవ్వలు ఎగసి పడ్డాయి, భూమి కంపించింది. భూమీ, సముద్రం కలసి భూమిలోపలి అగ్నితో పోరాడుతున్నాయి. ఏ నిమిషాన్నయినా అగ్నిపర్వతం బ్రద్దలవ్వొచ్చు, భూకంపం సంభవించ వచ్చు, సునామీ రావచ్చు....
ఇంటి మిద్దెమీద నుంచొని వాళ్ళు చూస్తూ ఉండగానే ప్రమాదం ముంచుకొచ్చింది. సముద్రపు అడుగున ఎక్కడో భూమి రెండుగా చీలింది. చల్లని నీరు అఘాతంలోనికి, మరుగుతున్న రాళ్ళమీదకి దూకింది. ఫలితంగా పెల్లుబికిన ఆవిరి సముద్ర జలాలని అల్లకల్లోలం చేసింది. ఆకాశం అంత ఎత్తున పెద్ద కెరటం లేచి వొడ్డుమీద విరిగి పడింది. తిరిగి వెళ్ళే టప్పుడు గ్రామంలో ఉన్న ఇళ్ళన్నింటిని తనలో కలిపేసుకొంది...
`... మనిషన్నాకా వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. ప్రమాదాలవల్లో, ముసలితనంవల్లో, వ్యాదులవల్లో మరణం తప్పదు అనే నిజాన్ని అంగీకరించాలి. జీవితాన్ని ఆనందంగా జీవించు. మృత్యువుకి భయపడకు...` సముద్రపు ఒడ్డున నిటారుగా ఉన్న కొండవాలులో వ్యవసాయం చేసుకొని, పండించిన కాయగూరల్ని మత్యకారులకి అమ్ముకొని జీవించే ఒక రైతు తన కొడుకు కీనోకి చెప్పిన సత్యాలు ఇవి.
* * *
నేపాల్‌లో ఖాట్మండూ నిన్నటి(25.04.2015) భూకంపానికి అతాకుతలమయ్యింది. కథలో సునామీ గ్రామంలోవాళ్ళనందరినీ సముద్ర గర్భంలో కలిపేసుకొనప్పుడు జియా అనే కుర్రవాడు పడిన వేదన నేపాల్లో బ్రతికి బయటపడిన పౌరుల్లో కనిపించింది. ప్రకృతిముందు మనిషి ఎంత చిన్నవాడు!
© Dantuluri Kishore Varma